అటు విభావరి యథాప్రకారం ఇల్లు చేరింది. ఆమె ఇంట్లోకి వెళ్ళకుండ బయట తోటలో
గట్టు మీదే కూర్చుంది. పదకొండు దాటాక ఒక్క క్షణం కూడ మామయ్య లేచి ఉండడు. అందుకే
నిరీక్షణ.. అప్పటిదాక తోటలో పడుకున్న చెట్లను అల్లరి గాలి ఊరికే నిద్ర పాడుచేస్తుంటే
చూస్తూండిపోయింది. అబ్బ.. చీకటి ఎంత అందంగ అనిపిస్తోందో ఇవాళ..
హమ్మయ్య.. ఓ పెద్ద పని పూర్తయింది. ఎట్ల చెప్పాలా ఎట్ల చెప్పాలా, విని ఆయన ఏమంటాడో అని తెగ టెంషను పడింది. అసలు ఇదంతా ఆయనకు దూరంగ కొంతకాలం
గడపటం వల్ల తెలిసింది. పరీక్షలప్పుడు ప్రిపరేషన్ శెలవలకు అంతా కూర్చని చేసిన పని
ఇదే. ఈనాటి పరీక్షకు ప్రిపేరవ్వటం. ఎన్ని రోజులు నిద్ర పోగొట్టుకుందో..! ఎట్ల
చెప్పాలి, ఎట్ల చెప్పాలి..- ఇదే ఆలోచన..! మొత్తానికి
చెప్పేసింది..! ఆయన బహుశ నూరులో తొంభైవంతులు సరేనంటారనే అనిపిస్తోంది తనకు. పాపం,
మంచి మనిషి..! ఏది అడిగినా కాదనడు..
వేళకు ఇంట్లో గంటలగడియారం పదకొండు కొట్టింది. విభావరి నెమ్మదిగ అడుగులో
అడుగు వేసుకుంటూ వెళ్ళి డూప్లికేట్ కీతో తలుపు తీసింది. లోపల అంతా చీకటి. అయినా
అలవాటైన పరిసరాలే కదా. మెట్లవైపు నడిచింది. హఠాత్తుగ గదిలో లైట్ వెలిగింది.
విభావరి గుండె ఆగినంత పనైంది. ఎదురుంగ జీవీగారు దర్శనం ఇచ్చారు. వెంటనే చేతిలో
ఉన్న బాగు ముఖానికి అడ్డం పెట్టుకుని గబుక్కున పరిగెత్తి మెట్లెక్కి తన గదిలోకి
వెళ్ళి తలుపు వేసేసుకుంది. ఆయన ఎప్పటిలాగ కాసేపు అరిచి తన గదిలోపలికి వెళ్ళి తలుపు
బిగించుకున్నాడు.
విభావరి కాన్ఫరెంసు విషయాలన్నీ డైరీ రాసుకుని పడుకునేసరికి రాత్రి రెండు
దాటింది. అయినా పక్కమీద వాలిందన్నమాటే కానీ విభావరి మనస్సంతా వేదాంగ్ని పెళ్ళి
చేసుకుంటే జీవితం ఎంత అందంగ ఉండబోతోందో అనే ఊహలతో నిండిపోయింది. హాయిగ ఊరించుకుంటూ,
కలలు కంటూ ఉండిపోయింది ఆ రాత్రంతా. తలచుకుంటేనే మనసు పులకించిపోతోంది..!
హమ్మయ్య..! పెద్ద భారం దిగింది, గుండెల మీది నుంచి.. ఎంత
తేలిగ్గ అనిపిస్తోందో ఇప్పుడు.. ఆయన నిజంగ ఒప్పుకుంటే తనంత అదృష్టవంతురాలు వేరొకరు
ఉండరు.
మరునాడు తను ఆలస్యంగ నిద్రలేచేసరికి జీవీగారు ఆఫీసుకు వెళిపోయారు. మిహిక
కాలేజికి వెళిపోయింది. ఆ సాయింత్రం వాళ్ళు తిరిగి వచ్చేసరికి స్నేహితురాలి ఇంటికి
వెళిపోయి ఆలస్యంగ వచ్చి, ఇద్దరి చీవాట్లూ తప్పించుకుంది. ఆ
పైరోజు కూడా ఆలస్యంగ లేచింది. సాయింత్రం సినిమాకు వెళిపోయింది.
మరో రెండురోజులు నిరాఘాతంగ గడిచాయి. కానీ తేలిగ్గ మాత్రం కాదు. ఇవాళ రెండో
రోజు, ఇవాళ మూడోరోజు- అని లెక్కపెట్టుకోవటంతో సరిపోతోంది.
ముందు డాక్టరుగారు ఒప్పుకుంటాడనే నమ్మకం అనిపించినా క్రమంగ కొంచెం ఆ నమ్మకం సడలటం
మొదలైంది. ఏదో అనుమానం.. భయం. ఏ రోజుకారోజు ఒక్కసారి ఆయనకు ఈ విషయం
గుర్తుచేద్దామని అనిపించింది. అసలే మతిమరుపు మనిషి- తీరా వారం అయిపోయాక- అయ్యో
మర్చిపోయానే, అనో- నాకసలు ఆలోచించే తీరికే దొరకలేదనో
అనేస్తాడేమోనని భయం. లేదా- నువ్వంటే నాకిష్టం లేదు.. సరిగ్గ అన్నం తినవు, నేను చెప్పినట్టు వినవు- అని తను చేసిన తప్పులన్నీ ఏకరువు పెడతాడేమోనని
అనుమానం.
పోనీ వెళ్ళి ఓసారి కనిపించి వద్దామంటే ముందే చెప్పాడు - ఈ వారం ఆయన ఉండటం
లేదని. వాళ్ళ గురువుగారి దగ్గర ఏదో ఉపదేశం, దీక్ష ఉన్నాయిట.
కనక ఫోను చేసి డిస్టర్బ్ చేస్తే బాగుండదు. అందునా ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ
ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకటి రెండు సార్లు పేషెంట్ల విషయమై ఫోను చేసినా కానీ ఆ
విషయం అడగలేకపోయింది. ఏంటో- అంతా అయోమయంగ ఉంది. ఇది తీరేవరకు మనసుకు శాంతి
దొరికేటట్టు లేదు.
సరిగ్గ ఈ విషయమై ఆలోచిస్తూ- ఇవాళ నాలుగోరోజు.. ఇంకొక్క మూడురోజులు- అని
లెక్క పెట్టుకుంటూ ఉండంగ ఒక ఉత్పాతం వచ్చిపడింది అనుకోకుండ.
ఆ సాయింత్రం తను నెమ్మదిగ లైబ్రరీనుంచి ఇంటికి వచ్చేసరికి జీవీ, మిహిక టీ తాగుతున్నారు.
ఇదేంటి..!? ఈ వేళలో వీళ్ళిద్దరూ ఇంట్లో ఉండటం?
అని ఆశ్చర్యపోతూ, కొంచెం కంగారుగ ముఖం చాటు
చేసుకుని లోపలకు వెళ్ళబోయింది.
"ఏమే, ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావ్..!" జీవీ
అడిగాడు.
"అత్తా, టీలో కాస్త కారం ఎక్కువైనట్టుంది.., మామయ్యకు బెల్లం వెయ్యి..!" అంది నవ్వు దాచుకుంటూ.
"నాకు టీలో కారం ఎక్కువ కావటం కాదే, నీకే కాఫీలో
ఉప్పెక్కువ కాబోతోంది.. బాగా అల్లం పచ్చిమెరపకాయలు నూరి, మిరియాల
పొడేసి మీ నాన్న నీకోసం పరవాన్నం తయారు చేయిస్తున్నాడట.!" జీవీ అన్నాడు
నవ్వుతూ.
అంటే..!? అన్నట్టు చూసింది విభావరి.
"పరవాన్నం కాదండీ.. జీడిపప్పు, కిస్మిసూ వేసిన
పప్పన్నం ..!!" అంది మిహిక.
"ఏంటి అత్తా.. అసలేంటి కథ..?" విభావరి వేసిన ఆ
ప్రశ్నకు మిహిక బదులు జీవీనే బదులిచ్చాడు-
"ఏంటా..? నీ తిక్కరోగం కుదిర్చే కథ..! నీ అల్లరంతా
అణిచి నీ పిలక కత్తిరించే కథ..! నీ తోక ముడిపించే కథ..!"
"అత్తా..! మామయ్య దేనిగురించి మాట్లాడుతున్నాడు..? మనిద్దరం
ఒక పార్టీ కదా..! చెప్పవా..?" అంది విభావరి.
"అమ్మో, ఇప్పుడు నీ కోసం మీ అమ్మానాన్నా ఓ మంచి
సంబంధం చూశారని, వాళ్ళు త్వరలో నిన్ను చూడటానికి వస్తారని
నేను చెప్పేస్తే మీ మామయ్య ఊరుకోడమ్మా..!" అంది మిహిక.
విభావరి బిక్కచచ్చిపోయింది. ఇదేంటి? ఇట్ల
జరిగింది..!? అంటే డాక్టరుగారితో తన పెళ్ళికి ఆటంకమా..??
ఎప్పటికో అప్పటికి వస్తుందని తెలుసు.. అందుకే డాక్టరుగారి దగ్గర
తొందర పడింది. కానీ ఇంత త్వరగానా..!?
ఆ రాత్రికి భోజనాలయ్యాక మిహిక పెరట్లో వాకింగ్ చేస్తుంటే వెళ్ళింది
విభావరి.
"అన్నానికి రాలేదేమే..?" అడిగింది మిహిక.
"నువ్వంటే ప్రేమించి పెళ్ళి చేసుకున్నావు..! సడన్గ పెళ్ళి సంబంధమంటే ఎంత
టెంషనో నీకేం తెలుసు..?"
"టెంషనైతే.. అన్నం మానేస్తావా..?"
"నువ్వు ఇప్పుడు నాకు ఆ అబ్బాయి వివరాలు చెప్పకపోతే రేపటి నుంచి నీళ్ళు
కూడా మానేస్తా.."
"అమ్మో, నాకేం తెలియదు తల్లో.. ఆ పిల్లాడి పేరు
అర్చిష్ అని కానీ, లా చదివి సొంత ప్రాక్టీసు ఉందని కానీ మీ
మామయ్య నాతో చెప్పలేదు. చాలా మంచివాడు, బుద్ధిమంతుడు,
పాటలు బాగా పాడతాడు- అని కూడా నాకు తెలియదు. మీ అమ్మానాన్నలకు
నచ్చేసిన సంబంధం, నిన్ను పిల్లాడు చూసుకుని ఓకే చేస్తే
ముహుర్తాలు పెట్టుకోవటమే తరువాయి అని కూడా నాకు ఎవ్వరూ చెప్పలేదు.. తల్లీ
నన్నొదిలెయ్..!"
"లాయరా..!! నచ్చాడా..? ముహుర్తాలా..!? అమ్మో..!!"
ఇప్పుడు ఈ పెళ్ళి ఆపాలి..! ఎట్ల..!? ఎట్లయినా
ఆపాలి..! ఆపకపోతే తనకు డాక్టరుగారు ఎప్పటికీ దొరకరు. తన కలలన్నీ కల్లలైపోతాయి.
అసలు పెళ్ళిళ్ళు ఎట్ల ఆపుతారు..?
ఆకాశ రామన్న ఉత్తరం..! ఊహూఁ.. - ఈ పని తనే చేసిందని అందరికీ ఉత్తగనే
తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ముందే అన్నీ తెలుసుకున్నారు. పోనీ, ఏదైనా రోగం..!? డాక్టరంకుల్ని జెర్మనీ నుంచి రప్పించి
మరీ దాని అంతు తేలుస్తారు. ప్చ్..! పోనీ, మరెవరినైనా
ప్రేమించిందని, ఆత్మహత్య అని బెదిరించటం..? తనకు అంత శ్రమ అవసరం లేకుండ వాళ్ళే గట్టిగ పీక పిసికేస్తారు. సరే, ఎవ్వరికీ చెప్పకుండ డాక్టరుగారితో లేచిపోవటం..!? అస్సలే
కుదరదు. ఆయన ప్రాక్టీసు, రిసర్చు, అంతా
బూడిదైపోతే ఇంకా ఎవరికోసం ఈ పెళ్ళి...? అయితే, తను మంచిది కాదని అబ్బాయికి నేరుగ ఫోను చేసి చెప్పటం.. ఉత్తరం కన్నా ఫోను
బాగా పని చేయచ్చు..!
మరి నెంబరెట్ల..?
అత్త...!!
"అత్తా.. ఒక్కసారి ఆ అబ్బాయితో మాట్లాడాలని ఉంది... ఫోను.."
"అమ్మో, నాకేం తెలియదు... మొన్నే మీ మామయ్య వాళ్ళతో
మాట్లాడాడని నాతో చెప్పలేదు. ఆ సెల్లులో నెంబరు కూడా నేను చూడలేదు. చివర్లో ఏదో 888 అని వచ్చినట్టు కూడ నాకు గుర్తు లేదు."
ఇంక ఒక్కక్షణం కూడ ఆగలేదు విభావరి. ఆ రాత్రి జీవీ టీవీలో నిమగ్నమై
ఉన్నప్పుడు ఆయన సెల్లులో డయల్డ్ నెంబర్లు చూసి 888 చివర
ఉన్న నెంబరు నోటు చేసుకుని పెట్టుకుంది. ఆ రాత్రంతా ఏం చెప్పాలా ఎట్ల చెప్పాలా అని
ఆలోచించుకుని ఒక ప్రణాలిక తయారు చేసుకుంది.
ఆ మరునాడు ఇల్లు ఖాళీ అయ్యాక తీరిక చేసుకుని ఫోను కలిపింది. ఎవరో ఆడవాళ్ళు
ఎత్తారు.
"హలో, అర్చిష్ ఉన్నారా..?"
"లేడమ్మా, ఎవరు మాట్లాడేది..? ఏం
పని?"
"అతనిని వెంటనే కాంటాక్ట్ చేయాలి. వేరే ఏదైనా నెంబరు ఉందా..?"
"..కానీ.. దేనికి?"
"ఒక మంచి జాబ్ ఆఫర్ ఉంది మేడమ్. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే.."
"అయ్యో, తప్పకుండ.." అని వెంటనే నెంబరు
ఇచ్చిందామె. తర్వాత అడిగింది. "నీ పేరేంటి..?"
"నాంచారీ సేన్ గుప్త.. థాంక్యూ మేడమ్." అని నవ్వి పెట్టేసింది.
వెంటనే ఆ నెంబరుకు కలిపింది. అతనే కలిశాడు.
"చూడండి, చెప్పేది జాగ్రత్తగ వినండి. మీతో ఓ పెద్ద
మోసం జరుగుతోంది. మీరు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి చరిత్ర మంచిది కాదు. ఇది ఎవరో
గిట్టనివాళ్ళు చేస్తున్న పని అనుకోకండి. మిమ్మల్ని మోసం చేయటం ఇష్టం లేక స్వయానా ఆ
అమ్మాయే చేయిస్తోంది ఫోను.."
సహజంగనే అర్చిష్ తడబడ్డాడు- "ఎవరు మీరు..? అసలు..
మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి..?" అన్నాడు.
"నమ్మకండి. అది మీ ఖర్మ. అయినా దేవుడు మీ నొసట చరిత్ర చెడిన అమ్మాయితో
బ్రతకమని వ్రాస్తే దానికి ఎవరేం చేయగలరు..?"
"ఏయ్, ఎవరసలు..? ఏంటా మాటలు..?"
"నేనెవరైనా మీ మంచి కోరి చెబుతున్నాను. అనవసరంగ ఆయాసపడకండి. చెప్పింది విని
అర్థం చేసుకుని అమలు చేసి లాభం పొందండి. నమ్మకుండ అమలు చేయకుండ నష్టం పొందండి.
కానీ మళ్ళీ పెళ్ళయ్యాక మాత్రం అమ్మాయి సిగిరెట్లు తాగిందని, సినిమాలు
మరిగిందనీ, ఇంటి పనులు రావని, మొగుడంటే
లక్షం లేదని, తాగుతుందని, తిరుగుతుందని
కంప్లైంటు చేయకండి. తను వదిలేసిందని సమాజంలో మీకే చెడ్డపేరు మిగులుతుంది."
"ఛి ఛి.. ఎవరసలు మీరు..?" ఏవగింపు అన్నాడతను.
విభావరి జాలిగ గొంతు పెట్టి, "తను చెప్పింది-
మీరు నమ్మరని.. చాలా అమాయకులని.." అంది.
"కానీ ఆ అమ్మాయి నన్ను కానీ నేను ఆమెను కానీ అసలు ఇంతవరకు చూసుకోనేలేదు.
ఎట్ల చెప్తుంది..?"
"మీకు ఆ అమ్మాయి చాలా మంచిదని, బాగా తెలివైనదని,
అందమైనదని, మీ వాళ్ళు చెప్పలేదా..
అట్లగే.."
"చెప్పారు.. కానీ ఎందుకట్ల..? అబద్ధం చెప్పాల్సిన
అవసరం వాళ్ళకేంటి..?"
"వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చేయమన్నారనే ఒక దిక్కుమాలిన కొటేషను మీరు
వినలేదా..?"
"కానీ, నావాళ్ళకు నాతో అబద్ధాలాడాల్సిన అవసరం ఏంటి..?"
"మీ వాళ్ళతో అబద్ధం ఆడాల్సిన అవసరం ఆడపిల్లవాళ్ళకు ఉంటుంది కదా.. మీవాళ్ళు
అమ్మాయిని చూశారా..?"
"లేదు- ఇంకా చూడటానికి వెళ్ళలేదు. వాళ్ళకైనా ఫోటో వరకే అయింది."
"అయితే ఇది ఇక్కడితో వదిలేయమని మీవాళ్ళతో చెప్పండి. ఉమెన్స్ ప్రొటెక్షన్
బిల్లంతా అమ్మాయి బాగా క్షుణ్ణంగ తెలుసుకుంది. తర్వాత తన మార్గానికి అడ్డంవచ్చారని
బిల్లని, సెల్లని మిమ్మల్ని, మీవాళ్ళను
ఎన్ని తిప్పలు పెట్టాలో అన్నిట్లో- ఆమె అందె వేసిన చేయి. మహిళా పోలీస్ లతో ఆమెకు
చాలా పరిచయాలున్నాయి. జాగ్రత్త."
"ఇదంతా నేను నమ్మను."
"అయితే మీవాళ్ళను ఒక మాట అడగండి. ఆ అమ్మాయి ఇంట్లోవాళ్ళు చదివించే చదువు
ఇష్టం లేక కన్నవారిని వదిలి వేరే వెళిపోయిందా లేదా? వెళ్ళిన
ఊళ్ళో కాలేజిలో చేరి విచ్చలవిడిగ తిరుగుతుందా లేదా? అంతదాకెందుకు?
వాళ్ళ కాలేజిలో అటెండెంసు కనుక్కోమనండి. ఆమె గురించి లెక్చరర్ల
రిమార్కులు ఆరా తీయించండి. అప్పుడు ఎంత మంచిదో, తెలివిగలదో,
చదువుకున్నదో మీకే తెలుస్తుంది."
"అమ్మాయికి మంచి సంబంధం దొరుకుతోందని కుళ్ళుతో గిట్టనివాళ్ళు ఈ పని చేయటం
లేదని నమ్మకం ఏంటి..?"
"ఆ అమ్మాయే వేరెవరినో పెళ్ళి చేసుకుందామనుకుని మధ్యలో వచ్చిన మీ అడ్డు
తొలగించుకోవాలని ఈ పని చేయటం లేదని నమ్మకం ఏంటి..?"
"అంటే మీరు..?"
విభావరి నవ్వి, "చెప్పాల్సింది చెప్పాను. విషయం
వరకు మీకెరిగించటం నా బాధ్యత. నిర్ణయం మాత్రం మీదే కదా. ఆల్ ది బెస్ట్.." అని
ఫోను పెట్టేసి, "యస్.." అని ఆనందంగ ఎగిరింది. ఇంక
పంట పండినట్టే.
* ** ** ** *
ఆ రోజు విభావరికి ఆగకుండ తలనెప్పిగ ఉండింది. కాన్ఫరెంసు ముగిసి ఆరు
రోజులైంది. ఆమెకు డాక్టరుగారి సమాధానం వినాలని చాలా కుతూహలంగ ఉండింది. పైనుంచి ఆ
డబ్బా సంబంధం అర్చిష్ నుంచి కూడా ఏ ప్రతిక్రియా రాలేదు. అతను తను ఇచ్చిన షాక్ కి
తల తిరిగి పడిపోయాడో, లేక వేరేదైనా ప్రతీకారం ప్లాన్ లో
ఉన్నాడో తెలియదు. డాక్టరు గారు సరేనని సమాధానం చెప్పంగనే తన కష్టాలన్నీ
తీరిపోతాయి. ఇంక ఆ పిల్లవాడితో ఏంటి, వాళ్ళ వాళ్ళతో కూడా
ఫుట్ బాల్ ఆడేసుకోవచ్చు. మరీ ఒత్తిడి చేస్తే అమ్మావాళ్ళతో కూడా పోట్లాట
పెట్టుకోవాల్సి వచ్చినా జంకేది లేదు. ఇష్టం లేని ఇంటర్, చెత్త
డిగ్రీ చదువు- ఇప్పుడు అన్నింటి ప్రతీకారం తను ఒక్కసారిగా కలిపి తీసుకోబోతోంది,
వాళ్ళ నుంచి.
అబ్బ, కానీ ఈ తల నెప్పి.. అస్సలు తగ్గటంలేదు.
సువర్ణసూర్యవర్తి చూర్ణం తేనెలో కలిపి తీసుకున్నా లాభం లేదు. రసనాది తలకు పట్టీ
వేసినా తగ్గటం లేదు. ఎట్ల తగ్గుతుంది.. టెంషన్ తో ఇంత ఉద్విగ్నంగ ఉంటేను..!!
ఈవారం రోజులు ఏమీ మాట్లాడవద్దని డాక్టరు గారు ముందే చెప్పారు. ఫోను కూడా
తీయనని చెప్పారు. గురువుగారి వద్ద ఉపదేశం ఉందని వెళ్ళారు. వచ్చాక తనే కాల్
చేస్తానన్నారు. ఈయనతో ఈసారి చాలా కష్టంగనే ఉంది. విభావరి కాలు కాలిన పిల్లిలా
బయటకూ లోపలకూ తిరుగుతూ ఏదో ఆలోచనలో పరాకుగా ఉండటం చూసి మిహిక కంగారు పడింది.
జీవీగారు సంగతేంటని అడిగారు. అఁహఁ ఏం లేదని చెప్పింది. సంబంధం గురించి ఇంకా ఆయన
వరకు రానట్టుంది. లేదంటే ఈ పాటికే గొడవలు లేపేసి ఉండేవాడాయన. మిహికత్త అయితే ఏకంగా
బట్టలు సర్దేసి మీ ఊరు బండెక్కమని పంపేసేది. అట్లాంటిది ఏమీ జరగలేదంటే ఇంటివరకూ
రాలేదనే కదా అర్థం.. అంటే బహుశ పెళ్ళికొడుకు ఏమీ నిర్ణయించుకోలేకపోయి కూడా
ఉండచ్చు. నిర్ణయించుకునేదేం ఉంటుంది..? అటువంటి పెళ్ళికూతురిని వదిలిపెట్టటమే
శ్రేష్ఠమని నిశ్చయానికి వచ్చేసి ఉంటాడు. 'వదిలేసేదానికి ఇంక
చెప్పేది కూడా ఏం ఉంది?' అని ఊరుకుని ఉంటాడు. కానీ మరి
పెద్దవాళ్ళు ఉన్నారు కదా.. వాళ్ళ సంగతేంటి..?
విభావరికి ఏమీ పాలుపోలేదు. డాక్టరుగారిని వెంటనే కలవనిది పని జరిగేటట్టు
లేదు. పై నుంచి ఈ తలనెప్పి..! పెళ్ళి గురించి మాట్లాడటానికి రాకూడదు, కానీ
తలనెప్పి కోసం వెళ్ళచ్చులే అనిపించింది. అక్కడ పేషెంట్లను కూడా కలిసి చాలా
రోజులైంది. ఇవాళ రాత్రికి లెక్క ప్రకారం ఆయన ఊరునుంచి తిరిగి వచ్చేసి ఉండాలి.
సాధారణంగ ఆయన కార్ లోనే ఎక్కడికైనా వెళతారు.. కాబట్టి ఆలస్యం చేయకుండ ఇల్లు
చేరిపోతుంటారు. విభావరి వెంటనే చెప్పులు తొడుక్కుని బయలుదేరింది. ఎక్కడికే అని
అడిగింది మిహిక వెంటనే చూసి, పరుగున వచ్చి.
"ఇక్కడే స్నేహితురాలి దగ్గరకు.. వాళ్ళ ఇంటికి.. ఏఁ..?" అడిగింది విభావరి చెబుతున్న అబద్ధం ఎప్పటిలాగే లోలోపల గుచ్చుతుంటే.
"సరే, తొందరగ వచ్చేసేయి. ఇంటికి ఇవాళ మీ మామయ్య
స్నేహితులు వస్తాన్ననారు. నాకు చేతి కింద సహాయం కావాల్సి ఉంటుంది.. ఆలస్యం చేయకు.
వచ్చేటప్పుడు ఇదిగో ఈ లిస్టులో ఉన్నవన్నీ సూపర్ మార్కెట్ లో కొని తీసుకురా.."
చేతికి అత్త ఇచ్చిన లిస్టు తీసుకుని ఎప్పటిలా విసుక్కోకుండ సరేనని వెంటనే
బయలుదేరుతున్న విభావరి వంక అనుమానంగ చూసింది మిహిక.
"ఏయ్. .ఆగు.. వెళ్ళేది ఏ స్నేహితురాలి ఇంటికి..? మృద్వీ
దగ్గరకేనా..?" అని అడిగింది.
విభావరి తల ఊపింది.. "ఊఁ ఊఁ" అని.
"కనీసం కాస్త తలైనా దువ్వుకోవే! అసలు ఆడపిల్లవేనా? ఆగు..
ఇట్రా.. మీ అమ్మేం నేర్పనే లేదే నీకు?" అంది.
విభావరి విసుగ్గా, "అబ్బా.. నన్నొదిలేయత్తా..
నేర్పనిది నేర్పలేదు.. నేర్పింది నేర్పింది. ఇప్పుడేంటిట? నేర్పినా
పాటించాలని రూలేం లేదే. నేర్పిన వాటిల్లో నాకిష్టమైనవి నేను పాటిస్తా అనుకోరాదా?
ఇది నాకిష్టం లేదు.. నేను పాటించను. అంతే! అవతల ఆ అమ్మాయి
ఎదురుచూస్తోంది. ఇంక నన్నొదిలేయమ్మా.. వస్తా.. బై.." అనేసి కదిలింది విభావరి
మెడల మీద చున్నీ సరిచేసుకుంటూ.
మిహిక ఆమెను చూసి నవ్వి సరేనని బై చెప్పింది. తనూ చిన్నతనంలో అట్లగే
నిర్లక్షంగ ఉండేది. ఎవరేం చెప్పినా పట్టించుకునేది కాదు. అందరూ 'నీకు నెత్తిన మొట్టే మొగుడొస్తాడే అప్పుడు తెలుస్తుంది..' అనేవారు. అప్పుడు తను నవ్వి, వచ్చినప్పుడు చూద్దాంలే
అనేసేది. మిహిక నవ్వుకుంది విభావరిలో అచ్చం తన ప్రతిరూపం కనిపిస్తుంటే.
విభావరి నేరుగ డాక్టరు గారి ఇంటి ముందే బస్ రన్నింగ్‌లో దిగింది. వేగంగ
గేట్ తెరుచుకుని లోపలకు వెళ్ళింది. కానీ ఇంటి తలుపు ఎప్పటిలా తెరిచి లేదు.
"డాక్టరు గారు.. డాక్టరు గారు.." అని పిలిచింది. ఎవ్వరూ పలకలేదు.
తలుపుకు చూస్తే తాళం ఏం లేదు. అసలు తలుపులు వేసే అలవాటు లేదే ఆ ఇంట్లో.. అనుకుంటూ
బెల్ కొట్టింది. ఎవ్వరూ తీయలేదు. తర్వాత తోసి చూసింది. తలుపు ఊరికెనే వచ్చేసింది.
వెంటనే ఆనందంగ లోపలకు వెళ్ళింది. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఒకటి రెండుసార్లు
పిలిచింది. ఎవరూ పలకలేదు.
సరే, ఎటో దగ్గరలోకే వెళ్ళి ఉంటారులే అని ఆమె క్లినిక్
లోకి వెళ్ళి యష్టిమధు చూర్ణం కోసం వెతకసాగింది.
అంతలోకి, "హలో, ఎవరది..?"
అని వినిపించి వెనకకు తిరిగింది. పైన గది మెట్లు దగ్గర ఎవరో ఒకతను
నిలబడి ఉన్నాడు. వయసు దాదాపు పాతికకు దగ్గరలో ఉండవచ్చు. ఆమె అతనిని తేరిపార చూసి,
"నువ్వెవరు?" అని అడిగింది.
"నువ్వా..? నువ్వేంటి..??" అడిగాడతను ముఖమంతా చిట్లించి చూస్తూ.
"నువ్వు ఏంటి కాదు.. నువ్వు ఎవరు? అని అడిగాను. మా
ఇంటికి దూసుకువచ్చి నన్నే ఎవరని అడుగుతున్నావు.. ఎవరు నువ్వు..?" ఆమె తన మందు కోసం వెతుకుతూనే అంది.
"మీ ఇల్లా..? ఇది మీ ఇల్లెందుకైంది..? డాక్టర్ వేదాంగ్గారిల్లనుకుంటా.."
"మరి డాక్టర్ వేదాంగ్గారింట్లో నీ పనేంటి? పేషెంట్
వైతే బయట వెయిట్చేయి. లోపలకు సరాసరి దూసుకు రావటం కాదు.. ఇంక ఇది నా ఇల్లు త్వరలో
కాబోతోంది.. ఇంకా కాలేదు. అదంతా డాక్టరుగారు వచ్చాక అడిగి కనుక్కున్నాక
తెలుసుకుందువుగానిలే. ప్రస్తుతానికి అదిగో.." అని అరుగు వైపు చూపించి,
"అక్కడ వెయిట్ చేయి.." అని ఆగి, "సమస్య ఏంటి..?" అని అడిగింది అతని వంక పరీక్షగ
చూస్తూ. "కిడ్నీయా, హార్టా, లివరా..
ఎయిడ్సా..?"
"ఛి.. ఛి.. సమస్యా.. ఏం సమస్యా.. నాకే సమస్యా లేదు.." అని ఆగి,
"ఏయ్. నిన్నెక్కడో చూసినట్టనిపిస్తోంది.. కాదు కాదు.. నీ గొంతు
ఎక్కడో విన్నట్టు ఉంది.." అన్నాడతను పరికించి చూస్తూ. "మిస్ నాంచారీ
సేన్ గుప్తా.. నువ్వే కదూ..?" అన్నాడు రెండు క్షణాలలో
గుర్తు చేసుకుంటూ.
ఆమె ఆ పేరు వింటూనే ఉలికి పడి అతని వంక చూసి, "న్..నువ్వు..
మ్.. మీరు అర్చిషా..?" అని అడిగింది.
వెంటనే అతను బిగ్గరగా నవ్వి, "అమ్మ దొంగా
దొరికావు. నీకోసమే ఈ ఊరొచ్చాను. నువ్వు ఇక్కడే దొరుకుతావని కన్ ఫర్మ్ న్యూస్
దొరికింది. ఆగు.. నీ పని చెప్తా.." అని వెళ్ళి ముందు తలుపు మూసేసి కిటికీలు
మూసేసి గబగబా వచ్చాడు. విభావరి అతని చర్యకు ఆశ్చర్యపోతూ చూసింది. ఇప్పుడు ఇతను ఏం
చేస్తాడు..? ఆమెకేం అంతుపట్టలేదు. నిజంగ తనను వెతుకుతూ వస్తే
అత్త వాళ్ళ ఇంటికి కదా రావాల్సింది.. ఇక్కడ దొరుకుతుందని ఇక్కడకు రావటమేంటి..?
ఆమె ఆలోచనలలో ఆమె ఉండంగ, అతను ఆమె వంకే తదేకంగ
చూస్తున్నాడు. విభావరి కళ్ళలో కుతూహలం. బహుశ అతనికి తనే పెళ్ళికూతురని తెలుసు
కావచ్చు. అందుకే ఆత్మవిశ్వాసంతో పగిలిపోతున్నాడు. ఆ కళ్ళలో విద్యుత్తు ఆమె మనసు
చెదరకొట్టసాగింది.
ఆమె కళ్ళు తిప్పేసుకుని, "ఆంటీ.. ఆంటీ..
డాక్టర్ గారూ.. డాక్టర్ గారూ.." అని గట్టిగ పిలిచింది. ఎవరూ పలకలేదు.
"వాళ్ళిద్దరూ ఇంట్లో లేరు. మీ డాక్టర్ గారికి ఇవాళ సినిమా చూడాలనిపించింది.
వాళ్ళ అక్కతో కలిసి వెళ్ళాడు."
"సినిమానా? డాక్టర్గారా?" అసంభవం. అంది విభావరి. ఆయన బతుకులో ఇంతవరకు సినిమా పోస్టరు కూడా సరిగ్గ
చూసి ఉండరు.
"సరే, సరే, వెళ్ళి పని చూసుకో.
నాకసలే నెప్పితో తల పగిలిపోతోంది.." అని విభావరి యష్టిమధు చూర్ణం కోసం
వెతకసాగింది గబగబా. "కాస్త సహాయం చేయకూడదా..?"
"జనాలందరికీ టెంషన్లు పెట్టి, తలనెప్పులు
తెచ్చేవారికి ఇట్ల జరగాల్సిందే" అన్నాడు ఆమె వద్దకు అడుగులు వేస్తూ.
విభావరి వెతకటం ఆపి, అతని వంక తదేకంగ చూస్తూ,
ఆ చూపులను అంచనా వేయటానికి ప్రయత్నించింది. అవి నిజానికి ఆమెకు
కీచకుడిని గుర్తుతేవాల్సింది. కానీ చిత్రంగ అతను ఆసక్తికరంగ ఉన్నట్టు అనిపించింది.
విభావరి పెదవుల మీద చిన్ని చిరునవ్వు విరిసింది.
అతను ఆమె కళ్ళలో బెదురు కానీ భయం కానీ కనిపించక, పైగా
చిరునవ్వు కనిపిస్తే కాస్త ఆశాభంగం చెందాడు.
"ఏంటి? ఇంట్లో ఎవ్వరూ లేరు.. నువ్వూ నేనూ తప్ప..! పై నుంచి తలుపులు
బిగదీశాను..! నీ దగ్గరకు వస్తున్నాను. నీకు భయంగ లేదా..?" నేరుగ అడిగేశాడు.
విభావరి తల అడ్డంగ ఊపి, నవ్వి, "ఊఁహూఁ.. తరువాత ఏం చేస్తారా అని కుతూహలంగ ఉంది.." అంది.
"ఛా.. మరీ అంత బాహాటంగ చెప్తే కానీ అర్థం చేసుకోలేనంత పసికూనవేం
కాదే.." అని ఆమె దగ్గరకు వచ్చి భుజం మీద కుడి చేయి వేసి నడుము చుట్టూ ఎడం
చేతిని తిప్పి ఆమె వంక చూశాడు. విభావరి నదురూ బెదురూ లేకుండ బేకులాగ అట్లగే
నిలబడింది. అడుగు వెనక్కువేయలేదు.. పైగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసేస్తోంది ఏదో
ప్రపంచ వింతను చూసినట్టు. అతనికి చాలా అసహజంగ అనిపించింది. ఆమెను బలంగ తన వైపు
లాక్కోబోయాడు.. పెదవు మీదకు వంగుతూ.
విభావరి, చివరి క్షణంలో ముఖం తిప్పేసుకుని,
"ఒక్కక్షణం.." అంది.
ఏంటన్నట్టు చూశాడు, ఆగి. ఆ అమ్మాయి గింజుకోనైనా
గింజుకోకపోవటం గమనించి లోలోపలే ఆశ్చర్యపోయాడు..
"ముట్టుకోవటం వల్ల కానీ ముద్దు పెట్టుకోవటం వల్ల కానీ ఎయిడ్స్ వస్తుందా..?"
అని అడిగింది ఆమె మెల్లగ.
"లేదు.. ఏఁ..?" అతను ఆమెను వదిలి కొద్దిగ దూరం
జరుగుతూ అడిగాడు.
విభావరి సంతోషంగ నవ్వి, "అయితే అంతవరకు సరే.
ఇంకేం భయం లేదు. ప్రొసీడ్.." అంది.
అతను ఆముదం మింగిన వాడిలా చూస్తూ, "అంటే..
అంటే.. నీకు.. ఎయిడ్..డ్స్ ఉందా..?" అని అడిగాడు భయంగ.
"ఊఁ.. చెప్పాను కదా.. అమ్మాయి అస్సలు మంచిది కాదని.. తనే మీ మేలు కోరి
స్వయంగ ఫోన్ చేస్తోందని.. కనీసం నిజం చెప్పినప్పుడైనా నమ్మాలండీ.." అంది
విభావరి బాధ నటిస్తూ. "క్..కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. మీరంటే దగ్గరకు
వచ్చారు కనక ఎక్కడ ప్రొసీడ్ అయిపోతారోనని ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. తెలిసి
తెలిసి ఒకరి జీవితం నాశనం చేయలేం కదండీ.. వేరే విధంగా దగ్గరకు రానంతవరకు భయం లేదని
టీవీలో చెప్పారు. డాక్టర్‌గారు కూడా చెప్పారు."
"అంటే.. నీ సంగతి బాబాయికి తెలుసా..? అమ్మో.. ఏం
సంబంధంరా బాబూ.. బాబాయి నన్నిట్ల ఇరికిస్తాడనుకోలేదు." అతను రెండు చేతులు
నెత్తిన పెట్టుకుని కింద కూలబడ్డాడు.
"బాబాయా..? బాబాయి ఎవరు..?" అడిగిందామె ఒక్కసారి ఉలికిపడుతూ అనుమానంగ.
"డాక్టర్ వేదాంగ్.. మా బాబాయి.. మా నాన్నకు సొంత తమ్ముడై ఉండి ఇటువంటి
సంబంధం నాకోసం తెచ్చి, ద్రోహం చేస్తాడనుకోలేదు.. ఆగు.. ఆయనను
రానీ చెప్తా.." అన్నాడు ఆవేశంగ.
విభావరికి ఏమీ అంతుపట్టలేదు. "మీరు అర్చిష్.. ఎడ్వకేట్.. అంతవరకు
తెలుసు.. కానీ మీరు డాక్టర్గారి అన్న కొడుకు కావటం.. ఇదే నాకు అరగటం లేదు.."
అంది సాలోచనగా.
"నీకేం అరిగినా అరగకపోయినా అది నీ డైజెషన్ సమస్య.. దానికి మంచి మందు
తీసుకో. కానీ ఒకటి మాత్రం తెలుసుకో. నిన్ను నేను చచ్చినా పెళ్ళి చేసుకోను.
అంతే." అన్నాడతను తెగేసి చెబుతున్నట్టు.
ఆమె అతనిని కొరకొరా చూస్తూ, "థాంక్స్.. ఇక్కడ
మీకంత అవకాశం నేను ఇవ్వటమే లేదు. మీరేంటి నన్ను రిజెక్ట్ చేసేది.. నేనే మిమ్మల్ని
రిజెక్ట్ చేస్తున్నాను. అయినా మరొకరితో పెళ్ళికోసం పీకలదాకా ప్రయత్నంలో ఉన్నాను.
అందుకే అప్పుడు ఆ ఫోన్ చేసి, ఇప్పుడు ఎయిడ్స్ అని చెప్పి
నాటకం ఆడాను. అన్నీ నమ్మేశారు.. చితికిన టమాటా ముఖం వేసుకుని.." అంది చివరకు
నవ్వుతూ.
అర్చిష్ అదిరిపడి, "ఏంటి.. హాలీవుడ్ మీరో లాంటి
ఫేస్‌ను చితికిన.. టమ్..మా.. ఛిఛి.. ఇంసల్ట్.. అవమానం.. ఘోర పరాభవం..!! నిన్నూ..
ఆగు.." అని కోపంగ మీదకు రాబోతూ, ఆలోచిస్తూ,
"..అయితే ఆగు.. నిన్నేం చేస్తానో చూడు. ఎయిడ్స్ ఏం
లేదంటున్నావు కదా.. ఇప్పుడు నిన్నే పెళ్ళి చేసుకుని నీ తిక్క కుదురుస్తా.."
అన్నాడు.
"పోవయ్యా.. చెత్తడబ్బాలో పారేయటానికి తప్ప ఎందుకూ పనికిరాని ప్రొఫెషన్..
పెద్ద ఎడ్వకేటంటా.. కుళ్ళిపోయిన కాకారకాయ ఫేసేసుకుని.. ఈనగారు నన్ను
చేసుకుంటాడంటా..." అంది విభావరి ఎటో చూస్తూ.
"క్..కుళ్ళిపోయిన..క్క్..కాకరకాయా..?" అర్చిష్కి
ఏడుపొక్కటే తక్కువ. ఆమెలాగ వెంటవెంట ప్రయోగించటానికి సామెతలు కానీ సామ్యాలు కానీ
అతనికి దొరికాయి కావు.
చివరకు ఆలోచించి అనేశాడు- "ఏం కాదు.. నీదే మ్..మాడర్న్ ఆర్ట్
ఫేస్.." అని.
దానికి విభావరి పడీ పడీ నవ్వింది. "మాడర్న్ ఆర్ట్.. హహ... ఇంకేం
దొరకలేదా.. మీకు.. " అంటూ.
ఆమె నవ్వు చూస్తూ అర్ఛిష్ కూడా హఠాత్తుగ నవ్వేశాడు.
అప్పుడే తలుపు తెరుచుకుని వచ్చారు వేదాంగ్, సుచరిత.
వారి వెంట ఇంకెవరో కూడా ఉన్నారు. విభావరి వెంటనే నవ్వు ఆపి ముందు గదిలోకి
వెళ్ళింది. సుచరిత చేతిలో కూరల బాగ్ ఉంది. ఆమె ఎదురు అందుకుని పక్కకు పెట్టింది.
"అదేంటి.. నువ్వు ఇక్కడ..?" అడిగాడు వేదాంగ్
ఆశ్చర్యంగ.
లోపల నుంచి అర్ఛిష్ తల గోక్కుంటూ బయటకు వచ్చాడు. అతనికి కాస్త ఇబ్బందిగ
అనిపించింది.
విభావరి వెంటనే వెళ్ళి లోపలి నుంచి అందరికీ మంచినీరు తెచ్చి ఇచ్చింది.
వేదాంగ్ వెంట వచ్చినవాళ్ళను ఎదురు అందుకుని, "బాగా
జరిగిందా నాన్నా ప్రయాణం..? అమ్మా ఆరోగ్యం కులాసానా..?"
అని పలకరించాడు అర్చిష్.
విభావరికి హఠాత్తుగ విషయం అర్థమైంది. వేదాంగ్ వాళ్ళను తీసకురావటానికి
స్టేషనుకు వెళ్తే సుచరిత మార్కెట్ దాకా కూరలకని వెళ్ళింది. ఈరోజు తమ ఇంటికి రాబోయే
మామయ్య స్నేహితులు ఎవరో కూడా ఆమెకు అర్థమైంది. ఇదంతా వాళ్ళు అందరూ కలిసి, తన వరకు తెలియకుండా ఆడిన నాటకం అని కూడా అర్థమైంది. అయితే బహుశ అమ్మా
వాళ్ళు కూడా అక్కడ బయల్దేరి ఉంటారు. అప్రయత్నంగ అర్చిష్ వంక చూసి ఆమెకు క్షణంలో
గుండెలో వణుకు పుట్టింది.
"న్..నేను ఇప్పుడే వస్తాను.." అనేసి గబగబా బయటకు వెళిపోబోయిందామె.
వేదాంగ్ ఆమెను ఆపి, "ఆగాగు.. దేనికి వచ్చావు..
ఎక్కడికి పోతున్నావు....?" అని అడిగాడు.
విభావరి ఆగి, తల వంచుకుని, "అది అది.. అదే తలనెప్పి బాగా ఉంటేను.. మీరు.. ఏ మాటా చెప్పలేదు కదా..
అడుగుదామని వచ్చాను." అని ఆగి అంతా తననే చూస్తుండేసరికి ఏం మాట్లాడలేక తల
వంచుకుని, "చుట్టాలొచ్చారు కదా.. మళ్ళీ
కలుస్తాను.." అనేసి చెప్పులు కూడా వేసుకోవటం మర్చిపోయి, కంగారుగా ఇంటికి బయల్దేరబోయింది.
సుచరిత వెంటనే ఆమెను చేయి పట్టుకుని ఆపి, నవ్వుతూ,
"ఆగాగు.. అంతా వచ్చింది నీకోసమే అయితే నువ్వే వెళిపోతానంటావేంటి..?"
లోపలకు తీసుకు వచ్చి, వచ్చినవారికి చూపుతూ,
"ఇదిగో, ఇక్కడే మహాలక్ష్మి దర్శనం
దొరికింది. చూసేయండి.. ఎట్ల ఉంది అమ్మాయి..?" అని
అడిగింది. వచ్చినవారిద్దరూ నవ్వారు ఆత్మీయంగ.
"అక్కా.. నువ్వు మరీ.." అని వేదాంగ్ విభావరి దగ్గరకు వచ్చి, పక్కకు తీసుకు వెళ్ళి మెల్లగ ఆమెకే వినిపించేటట్టు, "సారీనోయ్.. ఏమనుకోకు. నిదానంగ చెప్పాలి అనుకున్నాను. కుదిరేటట్టు లేదు.
ఎప్పటికీ మా ఇంట్లోనే ఉండిపోయే ఉపాయం చూడాలని ఉంది అన్నావు కదా.. అర్చీకి ఇక్కడే ఈ
ఊళ్ళోనే పర్మనెంట్ ఉద్యోగం వచ్చింది మొన్నే. ఎక్కడికీ పోడు మనలను వదిలి. వాడిని
చేసుకుంటే నువ్వూ ఇక్కడే ఉండిపోవచ్చు.." అని ఆగి, తలుపు
దగ్గర నిలబడిన అర్చిష్ వంక చూపిస్తూ,
"వాడు మా అన్న దగ్గర నేను దత్తత తీసుకుని ప్రేమగా పెంచుకుంటున్న కొడుకు..
నీకు చేసుకోగలిగే కొడుకునైనా కనలేదు అన్నావు కదా.. అప్పుడే ఈ ఉపాయం తట్టింది.
సంబంధం మాట్లాడి, మీ వాళ్ళతో కూడా ఖాయం చేసుకునేసరికి ఇంత
కాలం పట్టింది. అటు వాళ్ళ అమ్మా వాళ్ళు ఊరి నుంచి వచ్చారు. వీడు కాల్ లెటర్
పట్టుకుని వచ్చి ఇవాళ ఉదయమే ఆఫీస్‌లో జాయిన్ అయ్యి వచ్చేశాడు. ఇంక నీకేం భయం లేదు.
అడ్వకేటే కనక మీ వాళ్ళకు ఏ అభ్యంతరం లేదన్నారు. ఏమంటావు..? నీకు
పిల్లాడు నచ్చాడా?" అని అడిగాడు నవ్వి.
విభావరి రెండు చేతులలో ముఖం దాచేసుకుంది. అర్చిష్ దూరం నుంచి ఆమెను చూసి,
ఇంతకు ముందు నదురూ బెదురూ లేకుండ నిలబడిన అమ్మాయేనా ఈమె
అనిపిస్తుంటే ఆశ్చర్యంగ చూశాడు ఆ దృశ్యాన్ని. ఇంక ఆగలేనట్టు, వెంటనే ఆమె వద్దకు వచ్చి, "క్..కానీ ఎవరితోనే
పీకలదాకా ప్రేమలో ఉన్నానని చెప్పావు.." అన్నాడు.
ఆ ప్రశ్నకు విభావరి నివ్వెరపాటుతో వేదాంగ్ తన వంక చూస్తున్నది చూసి
కంగారుగ తల అడ్డంగ ఊపింది.
వేదాంగ్ నవ్వి, "ప్రేమ కాదు.. పెళ్ళి ప్రయత్నం
అని చెప్పి ఉంటుంది.." అన్నాడు ఆమె వంక చూస్తూ.
"అయితే మీకు తెలుసా బాబాయి అతనెవరో..?" అన్నాడు.
వేదాంగ్ ఇంకా గట్టిగ నవ్వి, "ఊఁ.. బాగా
తెలుసు.." అని ఆగి, విభావరితో, "ఏఁ.. చెప్పేసేయమన్నావా..?" అన్నాడు.
విభావరి భయంగ చూసి, "అమ్మో, ఎవ్వరికీ చెప్పనని మాటిచ్చారు.. మర్చిపోయారా?" అన్నది.
వేదాంగ్ నవ్వి, "ఔనౌను. సరే, చెప్పనులే." అని నవ్వాడు.
అప్పుడు అర్చిష్ ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి, "మరి మహిళా బిల్లు, సెల్లు, వుమెన్స్
ప్రొటెక్షన్..?" అని అడిగాడు.
"అదా.. అది విభా బీ ఎల్ లో స్పెషలైజేషన్.. ఏఁ..?" అన్నాడు వేదాంగ్.
"అమ్మో, అయితే ఈమెతో చాలా జాగ్రత్తగ
ఉండాలన్నమాట.." అన్నాడు అర్చిష్.
విభావరి చిరుకోపంగ మూతి ముడిచి తల వంచుకుంది. తర్వాత అర్చిష్ తన వంక
చూస్తున్న చూపులకు తట్టుకోలేక, "ఇంక
నేను ఇంటికి వెళతాను.." అంది.
"ఆగాగు.. బస్‌లోనే వచ్చి ఉంటావుగా. మేమూ అటే వస్తున్నాం. మాతో
వద్దుగాని.." అని అడిగాడు వేదాంగ్.
"ఔను బాబాయి. కాస్త నాకూ అఫీషియల్ రాగింగ్ చేసేందుకు ఎక్కువ అవకాశం
దొరుకుతుంది.." అన్నాడు అర్చిష్ సన్నగా విభావరికి మాత్రం వినిపించేటట్టు.
విభావరి తల అడ్డంగ ఊపింది భయంగ.
"ఏది మరి బండి..?" అడిగాడు వేదాంగ్ అటూ ఇటూ
చూస్తూ.
విభావరి తల అడ్డంగ ఊపింది. అంతలో వేదాంగ్ సెల్ మోగింది. ఎవరా అని చూస్తే,
విభావరి మామయ్య జీవీగారి ఫోన్. స్పీకర్ ఆన్ చేస్తూ మాట్లాడాడు
వేదాంగ్. విభావరి తల్లిదండ్రులు వచ్చేశారని, వాళ్ళను కూడా
త్వరగా రమ్మని.
విభావరి దిక్కులు చూసింది. అయిపోయింది.. అంతా అయిపోయింది..!
ఫోన్లో మిహిక అడిగింది, "మా విభా ఏమైనా అటు
వచ్చిందా?" అని. ఔనని చెప్పాడు వేదాంగ్.
"అది ఏ స్నేహితురాలని చెప్పి వెళ్ళిందో ఆ పిల్లే దీనికోసం ఇంటికి వచ్చింది.
అందుకు అనుమానం వచ్చింది. అది ఇంట్లో అబద్ధం చెప్పి, పారిపోయి,
వచ్చేది ఈ ఊళ్ళో ఆ ఒక్క ఇంటికే గదా.." నవ్విందామె.
ఆమె చెప్పింది విని విభావరి తల వాలిపోయింది.. ఇంక లేవనేలేదు. రెండు
చేతులలో ముఖం దాచేసుకుంది.
వేదాంగ్ కోసం ఆమె మనసులో శతకోటి నమస్కారాలు పెట్టుకుని, తన అధ్యయనానికి, శోదనకూ అడ్డం రాని ఆ పెళ్ళికి
నిశ్చింతగ ఒప్పేసుకుంది.
(సంపూర్ణం)
****************