తర్వాత రెండో సెషనుకు పిలుపొచ్చింది. అందులో ఆయన పేపరే మొదటిది. మెదడు,
దాని పనితీరు గురించి ఆయుర్వేదంలో చెప్పబడిన వివరాలు క్లుప్తంగ
చర్చించాలి. ఆధునికంగ వచ్చే కొన్నిరకాల ఆర్గానిక్ బ్రెయిన్ డామేజెస్ గురించి
ఆయుర్వేదంలో సూచించ బడిన నిదానాలు విపులంగ చర్చించాలి.
విభావరి ఆయన మైకు ముందుకు వెళ్ళిన దగ్గరి నుంచి టెంషనుగ కూర్చుంది.
వేదాంగ్ సభకు నమస్కారం చెప్పి, తన ప్రెజెంటేషను మొదలు
పెట్టాడు. ప్రొజెక్టరు స్క్రీను మీద తను డిజైను చేసిన మొదటి స్లైడు వచ్చింది.
అంతే.. వేదాంగ్ స్టేజి మీది నుంచి ఆమె వంక ఠక్కున చూశాడు. ఆ కళ్ళలో చిరుకోపం.
విభావరి నవ్వు ఆపుకుంటూ పక్కకు చూసింది.
ఆయనకు రంగులు రంగులతో, స్పెషలు ఎఫెక్టులతో
ప్రెజెంటేషను అస్సలు నచ్చదు. టైం వేస్టు ఎందుకు అంటాడు. అన్నీ బ్లాక్ ఎండ్ వైట్‌లో
కావాలంటాడు. విభావరి ఇదివరకు సెమినార్ల కోసం చాలా ప్రయత్నించింది కానీ డిజైను
మార్చే అవకాశం దొరకలేదు. ఈసారి ఆయన పని ఉండిపోయిందని పెన్‌డ్రైవ్ తనకే ఇచ్చేసరికి
ఎంచక్కా అందరికీ ఆకర్షణీయంగ అనిపించే విధంగ మార్చి దాన్ని సేవ్ చేసి పెట్టేసింది.
ఆయనకు అనుమానం వచ్చే అవకాశం కూడ లేదు. అక్కడ ఒక్కొక్క స్లైడు మారుతుంటే వివరించటం
మర్చిపోయినవాడిలా ఆయన వాటి వంక చూశాడు కొన్ని క్షణాలపాటు.
ఆయన కళ్ళలో ఆశ్చర్యం ఎంతో అందంగ ఉందనిపించింది విభావరికి ఆ క్షణం. లోలోపలే
నవ్వుకుంది. ఆయన చెప్పేది వినకపోయినా ఇప్పుడు వచ్చిన నష్టం లేదు. ఆయన వ్యాసం
టైపుచేసి పెట్టింది తనే కాబట్టి అందులో ప్రతి అంశం తెలిసిందే. అందుకే అటూఇటూ
చూస్తూ అక్కడున్న వాళ్ళంతా వేదాంగ్ వ్యాసానికి ఎట్ల స్పందిస్తున్నారో గమనించింది.
అమ్మో, కళ్ళార్పి తెరిచే వ్యవధిలో ఏదైనా అర్థం కాకుండ
పోతుందేమో అన్నంత జాగ్రత్తతో ఒక్క పదం కూడ మిస్సు కాకుండ, శ్రద్ధగ
వింటున్నారంతా. నిన్న రాత్రి చాలాసేపు ఆ వ్యాసంతోనే గడిపింది. ఇల్లు చేరేసరికి
ఒంటిగంటైందని మామయ్య తిట్టాడు కూడ. ఎంత తిట్టినా తను ఈ కాన్‌ఫరెంసు సంగతి ఎక్కడా
నోరు జారలేదు. చెప్తే ఎక్కడ వెళ్ళనీయడో అని. విభావరికి వాళ్ళ మామయ్య జీవీ గుర్తుకు
వచ్చాడు. ఇందాకటి డాక్టరుగారి తిట్లు గుర్తుకు వచ్చాయి. సెల్ తీసి కాసేపు
ఆలోచించి 'ప్లీస్, ఇంటికొచ్చాక నన్ను
కోపంచేయద్దని అత్తతో చెప్పవా మామా' అని ఎస్సెమ్మెసు
కొట్టింది.
'నువ్వింటికైతే రా.. అత్త కాదు.., నీ పెళ్ళి నేను
చేస్తా..' అని ఆయన సమాధానం పంపాడు.
ఆ మాటకు విభావరి తనలోతనే నవ్వుకుంది. ఇంతలో పేపర్ పూర్తైన సందర్భంలో అంతా
చప్పట్లు కొట్టారు. కొంత మంది లేచి వెళ్ళి ఆయన చేతులు ఊపేస్తూ కంగ్రాట్స్
చెప్పారు. ప్రెజెంటేషను అద్భుతంగ ఉందని మెచ్చుకుంటుంటే విభావరి వేదాంగ్ వంకే
చూస్తుండిపోయింది. తన పేపర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ముఖంలో ఇంత కూడ
అహంకారం లేదు ఆయనకు. చక్కని చిర్నవ్వుతో అందరి అభినందనలూ అందుకుని కామ్‌గ తన
స్థలంలో వెళ్ళి కూచున్నాడు.
మూల్యాంకనం పూర్తి కాంగనే భోజన విరామం ఇచ్చారు. కొందరు వేదాంగ్‌తో
చర్చల్లో పడేసరికి ఆయన వెంటనే
రాలేకపోయాడు. మాటల మధ్యలో ఓసారి నువ్వెళ్ళి తిను అని సైగ చేశాడు వేదాంగ్.
ఇంటినుంచి తెచ్చుకున్న భోజనం కార్‌లో ఉంటంతో విభావరి కారులో వెళ్ళి కూర్చుంది. ఓ
పది నిముషాలకు వచ్చాడు వేదాంగ్.
సరే, ఇద్దరికీ తెచ్చిన లంచు కారియరు తెరిచి చెరో
ప్లేటులో వడ్డించింది విభావరి.
"ఎందుకమ్మా నాకోసం ఎదురు చూస్తూ కూర్చున్నావు..? నువ్వు
తినేయకపోయావా..?"
"అబ్బ. అది వదిలేయండి.. ముందు ఆ లండన్ డాక్టర్ ఏం మాట్లాడుతున్నాడో
చెప్పండి."
"ఆయనా?! ఏంలేదు. వచ్చే నెల లండన్‌లో ఓ కాన్‌ఫరెంసు
ఉందిటా, ఇదే చెప్పటానికి అక్కడికి రమ్మంటున్నాడు"
విభావరి అది విని ఉత్సాహంగ అడిగింది. "అయితే ఎప్పుడు ప్రయాణం..?"
"ఎక్కడికీ ప్రయాణం...? నా దగ్గర పాస్‌పోర్టు లేదని
చెప్పా కదా.." నవ్వాడు వేదాంగ్.
"లేదు లేదు అనే బదులు ఒకటి చేయించుకోవచ్చు కదా..! హాయిగ ఆ దేశాలన్నీ
వెళ్ళిరావచ్చు. అన్నీ చూడచ్చు.."
"అందుకే చేయించుకోలేదు.."
"ఏఁ.. వెళ్తే చూస్తే ఏమైంది..?"
"వెళ్ళకపోతే చూడకపోతే కూడ ఏం కాలేదు కదా..! ఏమైనా ఐందా?"
ఈయనతో ఈ విషయం వాదించీ వృథా. ఇట్ల మాట్లాడితే ఈయనకు పొగరేమో అనుకుంటారు అంతా.
కానీ సప్త సముద్రాలు దాటివెళ్ళద్దని శాస్త్రం చెప్పింది. అందుకే నేను మన దేశ
సరిహద్దులు దాటి ఎక్కడికీ వెళ్ళను అంటాడాయన. అందుకే ఇటువంటివి ఎన్ని ఆఫరులొచ్చినా,
పైసా ఖర్చులేకుండ వెళ్ళి వచ్చే మార్గాలున్నా ఒప్పుకోడు.
"ఔను.. ఆ ప్రెజెంటేషనంతా అట్ల చెయ్యమని ఎవరన్నారు నిన్ను..?"
విభావరి గట్టిగ నవ్వేసింది. "బాగుందా, బాలేదా..?"
"ఊఁ.. అల్లరి మానవన్నమాట..! బాగుంటే మాత్రం నా పేపరును నాకిష్టం లేనట్టు
చెయ్యటానికి నువ్వెవరోయ్..?"
విభావరి ఏమీ మాట్లాడలేదు. నవ్వుతూ ఉండిపోయింది.
"సరే, తొందరగ తినేసెయ్. మూడో సెషనుకింకా ఐదునిముషాలే
ఉంది. బ్రెయిన్ సర్జరీ.. చాలా బావుంటుంది.
నేనిదివరకే చూశా. వీడియో అంతా మిస్సవకుండ చూడు. నేను ఈలోపు ఓ చిన్న పని మీద వెళ్ళి
రావాలి. మా గురువుగారిని కలవాలి. దీని మీద నీకింకో పుస్తకం ఇస్తానన్నారు. తెచ్చి
చూపిస్తా. ఇది చూస్తే అది సులువుగ అర్థమౌతుంది. అందులో మెదడు గురించిన మంచి అనుశీలనం
ఉందిట. ఆయనే స్వయంగా తెప్పించారు. దాని ఆధారంగ మన పురీ సెమినారుకు పరిశోధనపత్రం
అంతా నువ్వే సిద్ధం చేయాలి.."
సరేనంది విభావరి. తర్వాత సెషన్ చాలా తొందరగ గడిచినట్టనిపించింది. నిజంగ
వీడియో బావుంది. ఆ పేషెంటుకు ఉన్నది చాలా ప్రమాదకరమైన బ్రెయిన్ ప్రాబ్లం. ఇదెంతో
కష్టమైన సర్జరీ అట. మంచి వివరణతో వ్యాఖ్యానం కొనసాగింది. మొట్టమొదటిసారి అంత పెద్ద
స్క్రీన్ మీద సర్జరీ వీడియో చూడటం విభావరికి చాలా బాగనిపించింది. అక్కడ చాలామంది
ఎంతో ఉత్సాహంతో దాన్ని చూశారు. నిజంగ ఆ డాక్టర్‌లు పడ్డ శ్రమను అభినందించాలి అనిపించిందామెకు.
అది పూర్తయ్యాక నాలుగో సెషన్‌కల్లా వేదాంగ్ తిరిగి వచ్చేసి, అంతా పూర్తయ్యేసరికి ఆలస్యమైతుందని తొందరగ తిరుగు ప్రయాణానికి
పూనుకున్నాడు. తనొక్కడే ఉంటే అది వేరేవిషయం. కానీ వెంట విభావరి ఉంది. అందుకే
రిస్క్ తీసుకోలేడు. విభావరి మొత్తం చూసుకుని వెళదామని గొణుగుతున్నా
పట్టించుకోకుండ బయలుదేరాడు.
అసలామెను తీసుకురావద్దనే అనుకున్నాడు ముందు. కానీ పరీక్షలయ్యేవరకూ ఇంటికి
రావద్దు అన్నందుకు తనకు బానే కోపం వచ్చుంటుంది. కనీసం ఈ కాన్‌ఫరెంస్‌కైనా
తీసుకెళ్తే సంతోషపడుతుంది కదా అనిపించి తీసుకొచ్చాడు.
"ఊఁ.. ఎట్ల ఉంది కాన్‌ఫరెంస్..?" అడిగాడు
విభావరి తిరగేస్తున్న పుస్తకం వంక చూస్తూ.
విభావరి తలెత్తకుండనే "పూర్తిగ చూడనిస్తే కదా ఎట్లుందో ఏమిటో
తెలిసేది..?" అంది.
"చూసినంతవరకు చెప్పమ్మా..."
"ఏమో, నాకు ప్రతీదాని అంతు చూడటం అలవాటు.."
"ఇప్పుడది చూడనివ్వలేదని నా అంతు చూసేట్టున్నావే..!"
విభావరి నవ్వింది. "బానే ఉందిలే..! అది వదిలేయండి..! గురువుగారు
బాగున్నారా?"
"ఊఁ.. వారంకోసం నన్ను ఉండటానికి రమ్మన్నారు. ఉపదేశమేదో చేస్తారట. నాకు ఈ
వారం వీలే.. వెళదామని.."
"మరయితే ఈవారం ఉండరా... మరి పేషెంట్లు..?"
"అపాయింటుమెంట్ల వాళ్ళకు ఫోన్లు చేసి వద్దని చెబుతా కానీ ఎవరైనా అడిగితే అత్యవసరమైతే
ఫోను చేయమను."
విభావరి సరేనంది. పెద్ద ప్రతిక్రియ ఏంలేదు. చేతిలో పుస్తకం పేజీలు
తిరుగుతున్నాయి కానీ ధ్యాస దాని మీద లేదు. పరధ్యానంగ చేతివేళ్ళ కొసలు బొటనవేలుతో
నొక్కుతున్నది.
"ఏంటి, సైనసు పాయింట్లు అన్నీ పటపటా
నొక్కేస్తున్నావ్..! ఏంటి విషయం..?"
విభావరి ఆగి పుస్తకం మూసేసి పక్కన పెట్టేసి, కిటికీ
బయటకు చూసింది. వేగంగ సాగిపోతున్న కారు, అంతకన్నా వేగంగ
వెనక్కు నెట్టిపడేస్తున్న దృశ్యాలు కనిపించాయి.
"నీలో నిజంగనే ఏదో మార్పు ఉంది ఇవాళ! ఏంటో ఆలోచిస్తున్నావు.. అది కూడ చాలా
తీవ్రంగ."
విభావరి తలొంచుకుంది. రాత్రంతా చాలాసార్లు రిహార్సలు వేసుకుని వచ్చినా
ఇప్పుడు అసలు వేళకు నోట మాట రానంటోంది. ఆయన అర్థం చేసుకుంటాడో లేదో ఏమీ తెలియదు.
ఎటువంటి ప్రతిక్రియ చూపుతాడో, అసలు ఈ ఘట్టం తర్వాత ఏదైనా
మాట్లాడతాడో, లేక అసలుకే మాట్లాడటం మానేస్తాడో తెలియదు. ఒకటే
కాళ్ళలో వణుకుగ ఉంది.
"ఏదైనా ఆరోగ్య సమస్యా..? చెప్పటానికి సిగ్గు
పడుతున్నావా?"
"ఛ.. అదేం కాదు.. దేవుడి దయవల్ల.."
"మరదేంటో చెప్పనైనా చెప్పు. లేదా ఆలోచించటమైనా మానెయ్యి. నాకు అసందర్భపు
మౌనం అంటే చెడ్డచిరాకు."
విషయం ఎట్ల చెప్పాలో, ఎక్కడ మొదలు పెట్టాలో, ఆయనకు ఎట్ల చెబితే అర్థమౌతుందో ఏమీ తెలియటం లేదు.
"అది కాదు డాక్టర్‌గారూ.." అని ఏదో చెప్పబోయి, గట్టిగ
ఓసారి నిట్టూర్చి, కళ్ళు మూసుకుని, "..ఏంలేదు.. ఒక విషయం మాట్లాడాలనుకున్నాను.." అని ఆగింది.
వేదాంగ్ కనుబొమ్మలు ముడిచి అన్నాడు. "ఔను.. ఏదో మాట్లాడాలి..
వచ్చేటప్పుడు చెప్తాను అన్నావు.. ఏంటది..? ఏదో కెరీర్
కౌన్సిలింగ్ అన్నట్టు గుర్తు...! కానీ అదేం పెద్ద అంత తటపటాయించాల్సిన విషయం
కాదే."
"కాదు. కానీ..."
"ఊఁ.. సర్లే. అంతదానికి ఇంత నటనాసార్వభౌమత్వాలు అవసరమా? థియేటర్ ఆర్ట్స్‌లో డిప్లమా చేద్దామని నా మీద చేస్తున్న ప్రయోగం కాదు
కదా.. కొంపదీసి...?" నవ్వాడు వేదాంగ్.
విభావరి కొంచెం నవ్వి, మళ్ళీ గట్టిగ ఊపిరి
పీల్చుకుని అంది- "ముందు మీరు నన్ను అస్సలు అపార్థం చేసుకోనని మాటివ్వండి.
నేను చెప్పబోయేది పూర్తిగ విని, ఆలోచించాకే జవాబు చెప్పండి.
మిమ్మల్ని బాధ పెడితే క్షమించండి.."
"సరే.. ప్రయత్నిస్తాను.." వేదాంగ్ ఏదో అనుమానంగ ఆ అమ్మాయిని చూస్తూ
తల ఊపాడు. విభావరి కళ్ళలో ఇంత సీరియస్ భావన తను ఇదివరకెప్పుడూ చూడలేదు. హఠాత్తుగ
చాలా పెద్దపిల్లలా మాట్లాడుతోంది..
"డిగ్రీ ఉన్న విషయంలో పై చదువు చదవాలని లేదు. చదవాలనుకున్న మెడిసిన్‌లో
డిగ్రీ లేదు. అందుకే.. నేనింక చదువూ,
కెరీర్ అన్ని మానేసి.."
"మానేసి...??"
"ప్.. పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను."
వేదాంగ్ కళ్ళు నమ్మలేనట్టు పెట్టి, ఫక్కున నవ్వి
"ఏంటి... నిజమా..?! ఆర్ యూ సీరియస్?!!" అన్నాడు.
విభావరి గంభీరంగనే తలూపింది. వేదాంగ్‌కేమనాలో అర్థం కాలేదు. కాస్త సీరియస్
అవుతూ అడిగాడు.
"అ..అమ్మవాళ్ళతో సమస్యా? పీజీ చదివే తీరాలని
గోలపెడుతున్నారా? పెళ్ళి చేయమంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదా?"
"అ.. అంటే, ఇంకా వాళ్ళతో చెప్పలేదు. ముందు అ... అబ్..అబ్బాయి
ఏమంటాడో..! అతను ఒప్పుకుంటే కదా.."
"వ్వాట్...?? అబ్బాయి.. ఒప్పుకోవటమంటే... నువ్వు..
యూ మీన్.. నువ్వే ఎవరినైనా చూసుకున్నావా..?!"
"ఊఁ..."
వేదాంగ్‌కి తను వింటున్నది నమ్మటానికి కాస్త సమయం పట్టింది. "ఓ మై
గాడ్..! ఓరి భగవంతుడా..!! నువ్వు చాలా ఆలోచనా, పరిణతీ ఉన్న
అమ్మాయివి అనుకున్నాను. నువ్వు కూడా ఏంటి విభా..? మీ అమ్మా,
నాన్నా.. తాతా బామ్మా.. వాళ్ళ మనస్తత్వాలు.., పరువూ,
మర్యాదా ఎట్‌సెట్రా.. నీకు తెలుసు కదా! అన్నీ తెలిసీ... ఇప్పుడు..
ఇట్ల.., ఛ..." అని ఆగి, "ఎవరు..?
కాలేజి పిల్లాడా.. కలిసి చదువుకున్నారా..?" అనడిగాడు.
విభావరి ఎటో చూసి, "మీరు నేనడిగింది చేస్తానని
మాటిస్తే చెప్తాను.." అంది బింకంగ..
"సరే, అయితే చెప్పు! అడిగాక తప్పుతుందా? ఇంత పూర్వరంగం సిద్ధం చేస్తున్నప్పుడే అనుకున్నా.. ఏదో సీరియస్ విషయమే
అయ్యి ఉంటుందని.. ఇంతకీ నేనేం చేయాలంటావు...?"
"అ... అబ్బాయి మంచివాడేనని, ఈ పెళ్ళి కాదనద్దని
మావాళ్ళను ఒప్పించాలి.."
"కానీ ఇంకా ఆ అబ్బాయే ఒప్పుకోలేదన్నావ్..."
"అంటే, అబ్బాయినీ, నాన్ననూ మీరే
ఒప్పించాలి."
"నేనా.. నేనెందుకు..?! పైగా ఆ అబ్బాయి ఎవరో ఏంటో
నాకేమీ తెలియదు..?"
"మీరే ఎందుకు- అంటే ఆ పని మీరొక్కరే చేయగలరు కనక.. అబ్బాయిని నేను మీకు
పరిచయం చేస్తే తెలుస్తాడు.."
"బావుంది. చాలా అద్భుతంగ ఉంది. గ్రేట్.. నాకివన్నీ అంటే ఎలర్జీ అని తెలిసీ
నన్నే ఈ విషయం మాట్లాడటానికి ఎంచుకున్నావంటే నువ్వైనా ఫూల్‌వై అయి ఉండాలి, లేదా నేనైనా నీకు ఫూల్‌లా కనిపించి ఉండాలి.."
"రెండూ కాదు. ఈ విషయాలు ఎంతో జాగ్రత్తగ డీల్ చేయాల్సినవి. వీటికి ఎంత
ఫూల్సైనా ఫూల్స్‌ని ఎంచుకోరు."
"కానీ ఏదైనా...! ఈ విషయంలో నేను నీకు ఏ సహాయం చేయలేను. నీకా సంగతి బాగా
తెలుసు."
"మీరు బాగా ఆలోచించుకునే చెప్పండి.. ఫరవాలేదు.."
"కానీ ఇందులో ఆలోచించేది ఏం లేదు.. ఐ హేట్ లవ్. ఐ హేట్ లవ్‌స్టోరీస్.
పరమ చిరాకు. టైమ్‌వేస్టు టాపిక్లు నేను మాట్లాడను. నువ్వూ ఇట్లాంటి దానివని
నేనూహించలేదు. సారీనోయ్. నాకసలు ప్రేమాదోమల మీద నమ్మకం లేదు."
విభావరి అంతా విని కొంచెం నొచ్చుకుంటూ మెల్లగ అడిగింది. "అసలు నేను
ప్రేమించానని మీతో చెప్పానా..?"
వేదాంగ్ మరింత ఆశ్చర్యపోయాడు. "ప్రేమించకపోతే... మరి పెళ్ళి చేసుకునేదెందుకు...?"
"పెళ్ళి చేసుకోటానికే..! ఏఁ.. ప్రేమ లేనిది పెళ్ళి చేసుకోకూడదా?"
"విభా.. విభా... నువ్వివాళ నన్ను తినేస్తున్నావు..! పూర్తిగ చెప్పు..!
కాస్త స్పష్టంగ అర్థమయ్యేటట్టు."
విభావరి కాసేపు లోలోపలే ధైర్యం కూడదీసుకుని నాలుగైదు లోతు శ్వాసలు పీల్చుకుని
అప్పుడు చెప్పింది-
"ఏంలేదు డాక్టర్‌గారూ.. నేనొకతన్ని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. అతను
చాలా మంచివాడు. నాకు ఓ ఐదేళ్ళుగా తెలుసు. మా ఇంట్లోవాళ్ళకూ తెలుసు. కానీ అడిగితే
కాదంటారేమోనని భయం. ఇక్కడ ప్రేమాదోమలేం లేవు. జస్ట్ పెళ్ళి.. అంతే. ఇదే మాట మీరు
మా నాన్నతో.., లేదా కనీసం మామయ్యవాళ్ళతో చెబితే చాలు..
అంతే."
వేదాంగ్ గట్టిగ ఊపిరి పీల్చుకుని వదిలాడు- "సరే, ఓకే. అంతా వింతగ ఉంది. అయినా సరే, నీకోసం చెప్తాను.
మామయ్యతో ఎందుకు..? నాన్నతోనే చెబుతాను. కానీ ముందు ఆ
అబ్బాయి ఎవరో, ఏంటో నాకు తెలియాలి కదా."
విభావరి తేలిగ్గ నిశ్వసించి, "హమ్మయ్య. ఇప్పుడు
రైటు పాయింటుకు వచ్చారు." అని పర్స్ ఫ్లాప్ తెరిచి, "ఇదిగో ఇందులో అతని ఫోటో ఉంది. చూడండి." అని ఇచ్చింది.
వేదాంగ్ కుతూహలం నిండిన కళ్ళతో, కారు స్టీరింగు ఓ
చేత్తో పట్టుకుని మరో చేత్తో పర్సు అందుకుని చూశాడు.
అక్కడ అతనికి అద్దం కనిపించింది.
"ఏది ఫోటో..?" అతను అటూ ఇటూ తిప్పి చూశాడు.
"అదే.. సరిగ్గ చూడండి." అని అద్దం అతనికి చూపించింది.
"కానీ.."
"మీరేమీ పొరపడటం లేదు.. నాకు నచ్చింది మీకు అందులో కనిపించేవారే.."
వేదాంగ్ హఠాత్‌గ కార్ బ్రేక్ వేసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాడు. విభావరి
కార్ బయటకు చూస్తూ కూర్చుంది.
అతనికి అంత నవ్వులోనుంచి తేరుకోవటం కష్టమైంది. కాసేపటికి ఎట్లగో తేరుకుని,
"జోక్ చాలా బావుంది. ఐ రియల్లీ ఎంజాయిడ్ ఇట్.. మొత్తానికి
భలే నవ్విస్తావ్.." అని విభావరి తల మీద చెయ్యి పెట్టి చిన్నగ నొక్కాడు.
"థాంక్స్.. కానీ..."
"ఐతే నా గెస్ కరెక్టే..! ఓకే.. గో ఆన్..!! థియేటర్‌ఆర్ట్స్‌కి నువ్వు
చాలా పనికొస్తావ్..! ఏమో అనుకున్నాను.."
"అది కాదు డాక్టర్‌గారూ...."
"నీ స్వభావం తెలుసు కాబట్టి సరిపోయింది..! లేకపోతే నేనూ నిజమేనని
నమ్మేసేవాణ్ణి. భలే జోక్ చేశావ్.."
"హలో.. ఇది జోక్ అని మీకెవరు చెప్పారు..?" చాలా
సీరియస్‌గ అడిగింది విభావరి.
"జోక్ కాకపోతే మరేంటి? నువ్వు నిజంగనే నన్ను పెళ్ళి
చేసుకుంటావా ఏఁ..?"
"అందుకే కదా.. అడుగుతున్నది..!"
వేదాంగ్ నవ్వు ఆపేశాడు. "ఇంక చాలు విభా! ఇప్పటికీ చిన్నపిల్లను అనుకుంటున్నావా
ఏఁ..?"
"నేననుకోవట్లేదు. మిమ్మల్నీ అనుకోవద్దనే చెబుతున్నాను."
వేదాంగ్ అసహనంగ స్టీరింగ్ చేతిలో నలుపుతూ కిటికీ అద్దం బయటకు చూసి,
విభావరి వంక చూసి, తర్వాత కారు తిరిగి
స్టార్టు చేసి మౌనంగ నడపసాగాడు. విభావరే కాసేపు చూసి అడిగింది.
"ఏమైంది డాక్టరుగారూ, ఏమీ చెప్పరేంటి? నన్ను చేసుకోవటం మీకిష్టం లేదా? నాలో ఏదైనా లోపం
ఉందా..?"
వేదాంగ్ అసహనంతో గట్టిగ కళ్ళు మూసుకుని తెరిచాడు.
"చెప్పండి... ఏం మాట్లాడరేఁ? నేను మీకు సరిపోనా?
మీకు తగనా?"
"విభా, నిన్నొకమాట సూటిగ అడుగుతాను. నిజం
చెప్పు."
"అడగండి. అడగటమెందుకు..? నాకు తెలుసు మీ సందేహం.. ఈ
నిర్ణయం ఎందుకు తీసుకున్నాననేగా ..? అదీ.."
"షటప్.. నేన్నీకు ఎట్ల కనిపిస్తున్నాను...?"
"ఎట్ల అంటే? సరిగ్గ.. మా మంచి డాక్టరుగారిలా.."
"నీకసలు పెళ్ళంటే ఏంటో తెలుసా..?"
"తెలుసు. ఈ ఆధునిక యుగంలో అది తెలియకుండ నా వయసుకు చేరటం అసంభవమేమో."
వేదాంగ్‌కి చిరాకేసింది. "అసలు... నీకీ ఆలోచన ఎట్ల కలిగింది..?"
విభావరి అతని వంక అర్థంకానట్టు చూసింది. "ఎట్ల అంటే..?"
"నేనెప్పుడైనా నీలో ఆ ఆలోచన రేకెత్తించానా? నా
ప్రవర్తనతో కానీ, వేరేగా కానీ రాంగ్ సిగ్నల్సు ఇచ్చానా?"
"లేదు. ఇచ్చి ఉంటే నచ్చేవారు కాదు."
"లేదు విభా. ఎక్కడో నా వల్లే ఏదో పొరపాటు జరిగింది. చాలా తప్పు
చేశాను.."
విభావరి ఆయన వంక లోతుగ చూసింది.
వేదాంగ్ చాలా అసహనంగ స్టీరింగ్ చేతుల్లో నలుపుతూ, ఎటో
చూస్తూ అన్నాడు. "అసలు నీ వయసు ఆడపిల్లలంటే నాకు చాలా భయం. ఎన్నడూ
దగ్గర్రానివ్వలేదు. ఇదే కారణం. కాస్త చనువుగ ఉంటే అది ప్రేమేనని
భ్రమపడతారు.."
"ఇక్కడెవ్వరూ ఏ భ్రమల్లో లేరు. ప్రేమా దోమాల మీద నాకూ నమ్మకం లేదు. ఇందాకే
స్పష్టంగ చెప్పా కదా"
వేదాంగ్ అదేమీ విననట్టే అన్నాడు. "సబ్జెక్టు మీద నీ ఆసక్తి చూసి ఇంత
చనువిచ్చాను. దగ్గరకు రానించాను. కానీ నీ ఆసక్తి ఎక్కడో ఇప్పుడే తెలిసింది."
"ఒక్కక్షణం.." విభావరి గొంతులో విపరీతమైన అసహనం. "ఇది నాగురించి
మీరు అంటున్న చాలా పెద్ద మాట. ఆ అభాండం నా మీద వేసే ముందు ఒక్క క్షణం నా కళ్ళలోకి
చూడండి.. చూడండి.."
వేదాంగ్ ఎటో చూశాడు. విభావరి అతని తల తన వంక తిప్పుకుంది. అతను ఆమె
కళ్ళలోకి చూశాడు.
"ఇప్పుడు, ఈ క్షణం- వీటిలో మీ పట్ల ఆ తరహా ఆసక్తి
ఎక్కడైనా ఉందా..?"
వేదాంగ్ ఏం మాట్లాడలేదు.
"చెప్పండి.. కళ్ళు మనస్సులోతుల్లోకి ద్వారాలు కదా! మీరే చెబుతారు. నాకు మీ
దగ్గర ఏ సంకోచం లేదు. అందుకే ఫ్రీగ మాట్లాడుతున్నాను. ఏమీ అనుకోవద్దు. ఈ క్షణం.. మీకు
ఇంత దగ్గరగ ఉన్నాను. ఎన్నో గంటలు, రోజులు, నెలలు మీతో గడిపాను. మీకు ఎప్పుడైనా నేను ఆడపిల్లనన్న ఆలోచన కలిగిందా..?"
వేదాంగ్ కిటికీ బయటకు చూశాడు.
"అంతే.. అట్లగే నాకూ కలగలేదు. నిజంగ నిజం చెబుతున్నాను. మా నాన్న మీద
ఒట్టు.."
"----"
"మిమ్మల్ని నేను ఓ ఆడపిల్ల కళ్ళతో- ఒక పురుషుడిగా చూసి ఈ ప్రస్తావన పెట్టటం
లేదు. మీరు నాకోసం డాక్టర్ గారు. అంతే.. నేను వేదాంగ్ అనబడే డాక్టర్‌గారిని
పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. ఆ పేరు గల ఒక మగవ్యక్తిని కాదు."
"ఏదైనా విభా..! ఈ మాటతో నన్ను నొప్పించావు.. ఈ ప్రస్తావన చాలా తప్పు. నేను
తప్పు చేశాననిపిస్తోంది.."
ఇంక విభావరికి కోపం వచ్చింది. "ఔను. చేశారు. ఒక తప్పు కాదు..!
నాలుగు. చాలా పెద్ద తప్పులు చేశారు."
ఆమె గొంతు పెరిగి విసురుగ అయ్యేసరికి వేదాంగ్ వింతగ చూశాడు. విభావరి
చెప్పింది కోపంగ లెక్క పెడుతూన్న దానిలా- "'వైద్యో
నారాయణో హరి' అనిపించుకున్న ఉన్నత వృత్తిని ఎంచుకుని మొదటి
తప్పు చేశారు. ఇంత అంకిత భావం, పరిజ్ఞానం కలిగి ఉండి రెండో
తప్పు చేశారు. నాకు కావల్సిన సుగుణాలన్నీ పెట్టుకుని మూడో తప్పు చేశారు. నేను
పెట్టుకున్న ఆశయాలే మీవిగా మలచుకుని నాలుగో తప్పు చేశారు.. ..కాబట్టి శిక్షపడి తీరాలి.
మీ పరిశోధనల్లో, అన్వేషణల్లో జీవితాంతం నా సహాయం పొందటమే,
మీ సేవాశిబిరాల్లో, అవగాహనా
కార్యక్రమాలన్నింట్లో నేను పాలు పంచుకోవటమే శిక్ష." అంది.
"వెయ్యి. ఎవరు కాదన్నారు..? సంతోషంగ స్వీకరిస్తాను..!
ఇన్నాళ్ళ నుంచీ వేస్తూనే ఉన్నావుగా..."
"అది వేరు.. ఇది వేరు..! సామాజిక స్వీకృతి పొందితేనే శిక్షకు గుర్తింపు..!
లాయర్‌ని కదా.."
"అయితే ఆ శిక్షకు పాత్రుడు నీకు ఈడూ జోడూ ఉన్న ఏ కుర్ర డాక్టరో ఎందుకు
కాకూడదు?"
"ఇప్పుడు మీరు నాకు ఈడూ జోడూ కాదని ఎవరన్నారు..?"
వేదాంగ్ నివ్వెరపోయాడు. "నీకసలు నా వయసెంతో తెలుసా?? నలభై ఏడేళ్ళు. నీకన్నా కనీసం పాతికేళ్ళు పెద్ద!! పెళ్ళై ఉంటే నీ ఈడు
కూతురుండేది.."
"ఉండచ్చు. అయితే ఏంటి? లా విధించిన వివాహ వయో పరిమితి
ఇద్దరం దాటాం కదా. నాకది చాలు."
"కానీ నాకు చాలదు. విన్నావా?" వేదాంగ్‌కి ఇంక
అసహ్యం వేసింది. "ఇంక ఇక్కడితో ఈ ప్రేలాపన ఆపు. నాకే వింటానికి ఇంత అసహ్యంగ
అనిపిస్తోంది. అసలు ఇట్లాంటి మాటలు మన మధ్య సాగాయని తెలిస్తే మీ నాన్న నీకూ,
మా అక్క నాకు ఉరిశిక్ష విధిస్తారు..!" అని చిరాగ్గ నుదురు
రుద్దుకున్నాడు.
"ఏం కాదు. మీరు సహకరిస్తే నేను వాళ్ళను తప్పక ఒప్పిస్తాను.
కాదనకండి.."
వేదాంగ్‌కి పట్టలేనంత కోపం వచ్చింది-
"దిసీస్ రిడిక్యులస్..! ఇనఫ్ విభా..!!"
"క్..కానీ నేను మిమ్మల్ని తప్ప మరొకరిని పెళ్ళి చేసుకునే స్థితిలో లేను..!
నాకు మీరు కావాలి.."
వేదాంగ్ ముఖం తిప్పేసుకుంటూ, "ఛ.. బతుకులో ఈ
రోజు రాకూడదనుకున్నాను. అందులో నా వయసులో సగం కూడ లేని పిల్ల నోట ఈ మాట
వినాల్సొస్తుందని అస్సలనుకోలేదు. నా మూడ్ అంతా పాడుచేశావు. ఈ రోజు తర్వాత నీతో
నేను చనువుగ మాట్లాడగలతానా? నీకేదైనా నేర్పించగలతానా?
తర్వాత పారా మెడికల్ ఫీల్డ్‌లో సొంతగ క్లినిక్ చూసుకో గలిగేంత
స్థితికి నిన్ను వృద్ధి చేయాలి అనుకున్నాను. ఎంతెంతో లోతుల్లో మా నాన్నగారు నాకు
నేర్పినంత స్థాయిలో వైద్యరహస్యాలు తెలియచెప్పాలనుకున్నాను. కానీ నువ్వు ఆ ఆశయానికి
తగినదానివి కావు. నా మనసు విరిచావు. నన్ను మనిషిగ చాలా బాధపెట్టావు.."
అన్నాడు ఆవేశంగ.
విభావరి ఆ మాటలు విని తలొంచుకుంది. వేదాంగ్ తన ఆవేశాన్ని అదుపు చేసుకోవటానికి
ప్రయత్నిస్తూ, ధ్యాస మళ్ళించుకునేందుకు సంగీతం సీడీ
పెట్టుకున్నాడు. అతని మనస్సులో గతం ఆలోచనలు తుఫాన్లలా రేగాయి.
No comments:
Post a Comment