Tuesday, 18 July 2017

ప్రేమ కాదు.. పెళ్ళి ప్రయత్నం - 3



          మొదట్లో ఏదో నేర్చుకుంటా చేస్తా అని విభావరి వస్తే తనకంత వ్యవధి లేదనే చెప్పాడు. కానీ ఆ అమ్మాయి పట్టుబట్టి 'మీరేం కూర్చోబెట్టి క్లాసులు చెప్పద్దు. పోనీ క్లినిక్‌ వేళల్లో వచ్చి పక్కన ఉంటాను. మీకు అసిస్టెంట్‌గ కూడ చేతికింద పనిచేసి పెడతాను.' అంది. 'సర్లే, ఇదెన్నాళ్ళో.. అదీ చూద్దాంలే' అనుకుని కాషువల్‌గ సరేనన్నాడు.
          రోజూ వేళకు రావటం, ఆయన హాస్పిటల్‌ నుంచి వచ్చేలోపే క్లినిక్ అంతా శుభ్రంచేసి ఉంచటం, చెప్పిన మందు చెప్పినట్టు ఠక్కున కట్టివ్వటం, ఏవైనా విశేషంగ వేరే సంయోగాలతో ఎక్కువ మోతాదులో మందు తయారు చేయాల్సి వచ్చినప్పుడు అందులో సాయపడటం, అది చేస్తూనే ఏవో చర్చల్లోకి దింపటం, తనకు కావాల్సింది రాబట్టుకోవటం..
          ఆ చర్చలవల్ల తను ఇదివరకే కొంత లోతైన అధ్యయనం చేసిందనిపించి ఏమేం గ్రంథాలు చదివావని అడిగితే ఆమె చెప్పిన పేర్లు విని ఆశ్చర్యపోయాడు. అవన్నీ ఎంతో సీరియస్‌ విద్యార్థులు తప్ప మామూలుగా కాలేజ్‌లో కూడ ఎవ్వరూ తీసి చూడరు. ఎట్ల తెలుసు ఇవన్నీ అంటే వారూ వీరినడిగి తెలుసుకున్నది కొంత, సెల్ఫ్‌ స్టడీ కొంత అని చెప్పింది. ముఖ్యంగ స్నేహితురాలెవరో మెడిసిన్‌ సీట్‌ వచ్చి ఆయుర్వేదం కాలేజ్‌లో చేరితే ఆమె దగ్గర కొంత శుశ్రూష చేసిందిట.
          ఏదో మాట వరసకు రమ్మంటే, మామూలు రోజుల్లోనే కాక ఆదివారాలు కూడ విడవకుండ వస్తుండటంతో ఆ అమ్మాయికి వైద్యం మీద ఉన్న ఆసక్తి సామాన్యమైంది కాదని అర్థమైంది ఆయనకు. ఆసక్తి ఉండటం మాత్రమే కాదు. ఆ అమ్మాయి ధారణ, గ్రహింపు శక్తి, జ్ఞాపకశక్తీ అపారమైనవి. చరక సంహితలో శ్లోకాలన్నీ ఆమెకు ముందే కంఠస్థం ఉన్నాయి. ఇప్పుడు మాధవ నిదానం, శుశ్రుత సంహితా కూడా రాత్రింబవళ్ళు ఏకం చేసి నేర్చుకుంటోంది. ఎక్కడ అడిగితే అక్కడ అప్పచెబుతుంది. అవే పెద్ద భగవద్గీతా గ్రంథాల్లా తోస్తాయామెకు. ఈ గ్రంథాల స్వయం అవగాహన కోసం తను ఢిల్లీలో ఉండంగనే సంస్కృతం నేర్చుకుంది. దానివల్ల అనువాదాల అవసరం లేకుండ కొంత సొంతంగ చదివి చెప్పగలదు కూడా.
          ఇంత అవగాహన ఉంది కనకనే ఆలోచించే చనువు ఇచ్చాడు. కానీ ఇవాళ.. ఇట్ల మాట్లాడి.. తన అంచనా అంతా తిప్పిగొట్టింది ఈ అమ్మాయి. చాలాసేపు ఇవే ఆలోచనలతో మౌనంగ గడిచింది ప్రయాణం. సీడీలోని సంగీతం ఆయన మనస్సును బాగ శాంతపరిచాక ఇంత అవగాహన ఉన్న అమ్మాయి కనక ఈ ప్రస్తావన వెనక ఇంకా ఏదైనా అర్థం ఉందా.. అని హఠాత్తుగ అనిపించింది. ఈ తలంపు రాంగనే వేదాంగ్‌ కాస్త కుదుటపడ్డాడు. అనవసరంగ అరిచేశానే అనుకున్నాడు. విభావరిని చూశాడు.
          విభావరి మాత్రం వంచిన తల ఎత్తలేదు. మాటా పలుకూ లేదు. అతనికేదో అనుమానం వచ్చి ఆమె తల మీద చెయ్యి పెట్టి పైకి అనబోయాడు. అతని చెయ్యి తీసేసి పక్కకు పడేసింది. ఆమె చెయ్యి మొత్తం తడిగ ఉంది.
          "ఏయ్‌.. విభా..! ఏంటి.. ఏడుస్తున్నావా..?" కంగారుతో ఠక్కున కార్‌ ఓ పక్కగ ఆపి, విభావరిని కదిపాడు వేదాంగ్‌.
          విభావరి ఒక్కపెట్టున ఎక్కిళ్ళు పెడుతూ, రెండు చేతుల్లో ముఖం దాచేసుకుని భోరున ఏడ్చింది.
          వేదాంగ్‌ ఒక్కసారిగ మాన్పడిపోయాడు. ఆమెను ఓదార్చాడు. "ఏయ్‌.. విభా.. ఏంటమ్మా ఇది.. చిన్నపిల్లలాగ.."
          "ఔను.. చిన్నపిల్లననేగా నన్ను చేసుకోనన్నారు. అదే పెద్దదాన్నై ఉంటే చేసుకునేవారు కదా. అందుకే ఏడుస్తున్నా. దేవుడు నన్ను ఓ ఇరవయ్యేళ్ళు ముందుగ పుట్టించి ఉంటే ఎంత బావుండేది అని.." విభావరి ఎక్కిళ్ళు పెడుతూనే అంది.
          "విభా, ప్లీస్‌.. కంట్రోల్‌ యువర్‌సెల్ఫ్‌..! ఇది రోడ్‌. మనం కార్‌లో ఉన్నాం. అది మర్చిపోకు."
          "ఔను. మర్చిపోలేను. అది రోడ్‌. ఇది కార్‌. మీకు నలభైఏడేళ్ళు. నాకు ఇరవైరెండేళ్ళే. ఇంత ఆలస్యంగ పుట్టించిన దేవుడు కనీసం నన్ను మీ కూతురిగ అయినా పుట్టించచ్చు కదా. ఎట్ల పుట్టిస్తాడు? మీరు పెళ్ళి చేసుకుంటే కదా..! అంతా మీ తప్పే. ఎందుకు చేసుకోలేదు పెళ్ళి..?"
          అప్పటికి కాస్త తేలిక పడ్డ వేదాంగ్‌ ఆమెను కవ్విస్తూ అన్నాడు- "నీలాంటి మంచి అమ్మాయి దొరక్క..."
          "ఇప్పుడు దొరికాను కదా..! చేసుకోవచ్చు కదా..! వయసైపోయినా నాకేం అభ్యంతరం లేదని చెప్పా కదా.."
          "చూసేవాళ్ళ సంగతేంటి మరి? ఎంత చెడుగ అనుకుంటారో తెల్సా! ఛెడామడా తిడతారు. నిన్ను కాదు.. నన్ను."
          "పోనీ నన్ను దత్తత తీసుకుంటారా..? దానికైతే తిట్టరు కదా..?"
          "మీ నాన్నా అమ్మ ఒప్పుకుంటే తప్పక తీసుకుంటాను.."
          విభావరి ఆలోచిస్తున్నట్టు చూసి, "నో నో.. దత్తత వద్దు. అది అంత సరైన ఐడియా కాదు.." అంది.
          "ఎందుకు...?"
          "దత్తత తీసుకుంటే కూతుర్నౌతాను. అప్పుడు మళ్ళీ నన్నింకొకరికి ఇచ్చి పెళ్ళి చేసేయరని ఏంటి గారంటీ..?"
          "నిజమే. అది నా బాధ్యత ఔతుంది కదా..."
          "దానికోసం మీదాక ఎందుకు? మావాళ్ళు చాలు. అయినా ఏ లాయర్‌నో ఈపాటికి వెతికే ఉంటారు. కుటుంబగౌరవం గాడిదిగుడ్డూ అని కట్టిపడేస్తారు. వేగలేను. వల్లకాదు. ఈ ఆందోళన భరించలేను. ఏం చేస్తారో తెలీదు. సమస్య తీర్చండంతే."
          "కానీ.. ఎట్ల..?"
          "ఛ.. అసలు మీకు ధైర్యమే లేదు. నేనే అబ్బాయిగ పుట్టాల్సింది. మీరే అమ్మాయిగ పుట్టాల్సింది..! అదంతా ఇప్పుడు అనుకునీ లాభం లేని వ్యవహారం. అందుకే మనకిక గత్యంతరం లేదు... మీరు ధైర్యం చేయాల్సిందే.."
          "అది కాదు విభా.."
          విభావరి చాలా అసహనంగ, "అక్కర్లేదు. నాకేం చెప్పద్దు. నేనేం వినను. నన్ను వెంటనే పెళ్ళి చేసేసుకోండి. ప్లీస్‌... అప్పుడే నేను ఏ వైద్యమైనా నేర్చుకోగలిగేది.." అంది.
          "విభా! కొంచెం ఆగు. చెప్పేది విను. నీకు వైద్యం ఇష్టం. నేర్పనన్నానా? పెళ్ళి చేసుకుంటేనే వైద్యం నేర్పాలని నియమమేం లేదే! నువ్వెప్పుడొచ్చినా కాదన్నానా? ఇకముందు కూడ ఎప్పటికీ నిన్నేమీ అననని మాటిస్తున్నాను. నువ్వు ఇప్పుడు మాట్లాడినవేవీ నేను మనసులో పెట్టుకోను. సరేనా..? అప్పుడింక ఈ పెళ్ళితో పనేంటి చెప్పు..?"
          "ఈ పెళ్ళితో మీకు పనిలేదు సరే.., కానీ నా పెళ్ళితో నాకు పనుంది కదా..!!"
          "అంటే.. నాకర్థం కాలేదు.."
          విభావరి గట్టిగ నిట్టూర్చింది. "నాకు తెలుసు. మీకు విడమరిచి చెప్తే కానీ అది అర్థం కాదని. మీకంటే పెళ్ళీ పెళ్ళాం ఏంలేవు కాబట్టి హాయిగ ఉంటారు. నన్ను రమ్మంటారు. వస్తే చెబుతారు కూడ. కాదనను. కానీ రేప్పొద్దున నాకు వేరే అతనితో పెళ్ళైతే నన్నిట్ల ఎందుకు రానిస్తాడు? మీతో ఇంత చనువుగ ఎందుకు మాట్లాడనిస్తాడు? అతను సరేనన్నా బాధ్యతలొదిలి నేనెట్ల రాగలతాను? పెళ్ళన్నాక సంసారం, సంసారమన్నాక పిల్లలు తప్పరు కదా! పోనీ మీలాగే నేనూ పెళ్ళి చేసుకోకుండ ఉండిపోదామా అంటే మావాళ్ళు మీవాళ్ళంత గొప్పవారు కాదు.." అంది విభావరి బొంగురు గొంతుతో.
          "----"
          "అంతేకాదు. పెళ్ళీపిల్లలతో మాత్రమే ఆగిపోదు. పొద్దున లేస్తే సమస్యలు. ఇంట్లో చాకిరీ. బయట హడావుళ్ళూ.. రోగాలు, రొష్టులూ, పండగలూ, పబ్బాలూ, పూజలూ, నోములూ... గోల. ఇవీ కాక.. ఇంకా..." అని విభావరి ఆగిపోయింది.
          వేదాంగ్‌ సమస్య అర్థమైనవాడిలా జాలిగ చూశాడు- "ప్చ్‌...నిజమే కదూ.." అంటూ.
          "నిజం కాకపోతే..?? అబద్ధమా..!? నాకేమైనా వెర్రా..?! మీ భావాలు నాకు తెలియదా...? తెలిసీ మిమ్మల్నెందుకు పని కట్టుకుని నొప్పిస్తాను..? ఇంతకన్నా వేరే దారి లేకే కదా..!!"
          "నాకర్థమైందోయ్‌.. కానీ.."
          "ఆఁ.. ఆ కానీయే నా కొంప ముంచుతోంది.." అని ఆగి ఆలోచిస్తూ, "అయినా నా ఖర్మ కాకపోతే, మీకు పెళ్ళై నేను కూతురిగ పుట్టకపోతే పోయాను. కనీసం ఓ కొడుకును కన్నా ఈ పాటికి వాడికి పెళ్ళీడు వచ్చుండేది కదా! అప్పుడెంత బావుండేది!" అని నిట్టూర్చి, "అదంతా ఇప్పుడు లేదు కాబట్టి చేసుకునే ఆ పెళ్ళేదో మిమ్మల్నే చేసుకుంటే మీతోనే మీ ఇంట్లోనే ఉండి పోవచ్చు కదా. జీవితాంతం మీ అడుగుజాడల్లో అఫీషియల్‌గ నడవ్వచ్చు కదా అని ఆశ..!!" అంది.
          వేదాంగ్‌ ఆ అమ్మాయి వంక చూస్తూ ఆలోచిస్తూండిపోయాడు. "ఊఁ..!! యూ డూ హావ్‌ ఎ పాయింట్‌.."
          విభావరి కాస్త కుదుటపడుతూ కళ్ళు తుడుచుకుని అంది. "అయితే మీరు నన్ను పెళ్ళి చేసుకుంటారా? మా నాన్న తో మన సంగతి మాట్లాడతారా?"
          "ఇప్పుడే కదా చెప్పావు. ఏదో ఒకటి ఆలోచించాలి కదా. కాస్త టైం కావాలి."
          విభావరి కళ్ళు తళుక్కున మెరిశాయి. అయినా అనుమానంగ అడిగింది. "నిజంగ మీరు ఈ విషయం ఆలోచిస్తారా?"
          తలూపాడు వేదాంగ్‌ కొంచెం నవ్వి. అంత బాధలోనుంచీ విభావరి మనసు ఒక్కసారిగ ఉప్పొంగింది. వెంటనే కన్నీరు తుడుచుకుంది. దాంతో ఆమె వెడల్పాటి కళ్ళు ఎప్పటిలా విప్పారాయి. పెదాల మీద గులాబీలా విరిసింది చిర్నవ్వు. వెంటనే ఆయన మెడ చుట్టూ చేతులేసి, "అబ్బ.. మీరెంత మంచివారో..!" అని బుగ్గమీద గట్టిగ ముద్దు పెట్టుకుంది.
          వేదాంగ్‌ ఆ చర్యకు ఆశ్చర్యపోతూనే అంతలోనే విభావరి చిన్నపిల్ల మనసును అర్థం చేసుకుని తనను ఏం కోప్పడకుండ వదిలి పెట్టి తల మాత్రం నిమిరి తర్వాత కార్‌ స్టార్ట్‌ చేశాడు.
          "ఎంతసేపాగి చెప్తారు..?" అడిగింది విభావరి. "అదే.. టైం కావాలన్నారుగా.."
          వేదాంగ్‌ నవ్వి, "పెళ్ళంటే మాటలా..? ఎంతసేపు కాదు. ఎన్ని రోజులు అనడుగు. కనీసం ఓ వారం.." అన్నాడు.  
          విభావరి కాసేపు ఆలోచించి, ఇక తప్పనట్టు చూసి సరేనంది. "కానీ మీరు నాకు ఒకే ఒక్క మాటివ్వాలి.."
          "ఏంటి..?"
          "మీరు మీ నిర్ణయం ఏంటో నాతో చెప్పేదాకా ఇంకెవ్వరితోనూ ఈ విషయం చెప్పకూడదు."
          వేదాంగ్‌ నవ్వి- "ఊఁ.. ఊఁ.. ఓకే.." అన్నాడు.
          దాంతో ఆమె మూడ్‌ అంతా బాగైపోయింది.
          వేదాంగ్‌ మళ్ళీ ఆ విషయం ఎత్తలేదు. ఇంక మిగిలిన ప్రయాణం కాన్ఫరెంసు చర్చలతో సరదాగ గడిచింది.
          విభావరి వాళ్ళ ఇంటి ముందు కార్‌ ఆగేసరికి రాత్రి పదిన్నరైంది. అప్పటికే ఆ ఇంట్లో అర్ధరాత్రి దాటి అరగంట అయిపోయింది. ఆయనకు బై చెప్పి విభావరి డూప్లికేట్‌ తాళంచెవితో తలుపు తెరుచుకుని ఇంట్లోకి వెళ్ళాక వేదాంగ్‌ కార్‌ తమ ఇంటి దారి పట్టించి, ఐదు నిముషాల్లో ఇల్లు చేరాడు.

                                      *       **     **     **     *
          "వాళ్ళెందుకు ఒప్పుకుంటారు..? చచ్చినా ఒప్పుకోరు. నా మనసుతో వాళ్ళకేం సంబంధం..?"
          "తెలిసీ మిమ్మల్నెందుకు పని కట్టుకుని నొప్పిస్తాను..? ఇంతకన్నా వేరే దారి లేకే కదా..!!"
          వేదాంగ్‌కి తిరుగుప్రయాణంలో జరిగిన ఒక్కొక్క సంఘటనా గుర్తుకొచ్చింది. నవ్వొచ్చింది. ఆరుబయట పక్క మీద వెల్లికిలా పడుకుని ఆకాశం వంక చూస్తూ ఆలోచించసాగాడు. వెన్నెలలో కూడా నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి.
          ఆ అమ్మాయి లాజిక్‌ ఆయనకు వింతగ అనిపించింది. నిజంగ అటువంటి సమస్య ఎదుర్కొనేవారికి అంతకు మించి వేరే పరిష్కారం లభించే అవకాశం ఈ సభ్య సమాజంలో లేదా..? ఇది ఆ ఆలోచనల సారాంశం.
          విభావరి మొట్ట మొదటిసారి తన క్లినిక్‌కి వచ్చింది వాళ్ళ మామయ్య జీవీగారితోపాటు. ఆయన బీపీకోసం తన దగ్గర మందు వాడతాడు. అప్పటికి విభావరి ఆయన దగ్గరకు వచ్చి రెండు నెలలు దాటింది. బాగా చిరాగ్గ ఉంటోంది, ఊరికే తల నెప్పి అంటోంది అని విభావరిని తన దగ్గరకు తీసుకుని వచ్చాడాయన. ఆమె చిరాకు శారీరక కారణాల వల్ల కాదని, ఏదో బాగా మనసు మీదికి తీసుకుందని వెంటనే అర్థమైపోయింది ఆయనకు. అందుకని కారణం తెలుసుకోవాలని జీవీగారిని అడిగాడు.
          ఆయన అంతా వివరంగ చెప్పాడు- ఇదీ పరిస్థితి అని. తర్వాత ఆమెకు తన సమస్య వివరించబోతే ఇదివరకే వీటి గురించి చదివిందని తెలిసింది. నెమ్మదిగ వస్తూ పోతూ ఒకరోజు మీ చేతి కింద ఉంటాను, కాదనద్దు అంది. ఆ అమ్మాయి తీరు చూసి సరేనన్నాడు. తర్వాత రోజూ వస్తూపోతూ అవీ ఇవీ అడిగి తెలుసుకోవటం మొదలు పెట్టింది.
          అయితే ఆమె ఇంట్లో తెలియకుండ ఇటు వస్తోందని వేదాంగ్‌కు తెలియదు. జీవీగారికి ఈ సంగతి ఆలస్యంగ తెలిసింది. వెంటనే రంగంలోకి దిగాడు.
          "ఈ సంగతి వాళ్ళ నాన్నకు తెలిస్తే నా పీక మీదికొస్తుంది. మీరు దాన్ని కాదనండి.." అని మొర పెట్టుకున్నాడు.
          జీవీగారికి నిజానికి విభ మీద షికాయతు ఏమీ లేదు. కానీ ఇట్ల కాదనమని చెప్పింది, ఆమె తండ్రి నరసింహంగారు అడిగితే ఏం సమాధానం చెప్పాలి అనే ఆయన భయం వల్ల. నరసింహంగారికి విభ సంగతి బాగా తెలుసు. ఇప్పుడు ఇట్ల చేస్తోందని నిజం తెలిసి, కోపం వస్తే జీవీగారు చనువు ఇవ్వటం వల్లేనని కడిగి పారేస్తాడు. ఎందుకంటే బంధుత్వం కలవక ముందునుంచే వాళ్ళిద్దరూ కాలేజ్‌ స్నేహితులు. నరసింహంగారి వ్యక్తిత్వం చూసి, నచ్చి జీవీగా పిలవబడే జీ. వేణుగోపాలం గారి తండ్రి- తమ కూతురు, విభావరికి అమ్మ- అయిన సుజనగారినిచ్చి పెళ్ళి చేశారు.
          తర్వాత సుజనగారికోసం జీవీగారు అప్పుడప్పుడు ఇంటికి వచ్చిపోయేవాడు. అతని మీద మనసు పారేసుకున్న విభావరి మేనత్త మిహిక ఆయన్నే పెళ్ళి చేసుకుంటానని పట్టుబట్టింది. ఎదురుబదురు సంబంధాలు చేసుకుంటే ఇబ్బందులు వస్తాయని అంతా చెప్పినా వినలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పెళ్ళి జరిగింది. కానీ గొడవలు మాత్రం ఒక్కటీ కాలేదు.
          ఇప్పుడు జీవీగారికదే భయం. ఇన్నేళ్ళకు కూతురునడ్డం పెట్టుకుని నరసింహంగారు ఎక్కడ గొడవలు తెస్తాడో అని.
          విభావరికి మాత్రం అటు మేనమామా, ఇటు మేనత్తే కాబట్టి ఉండాల్సిన కాస్త భయం కూడ లేదు.
          ఎవరేమైనా కానీ, విభ ఆసక్తి తనదే తప్ప ఎవ్వరి మాటా లక్ష్యపెట్టదు. ఇంత మంచి అవకాశం నేను వదులుకోను గాక వదులుకోను అని పట్టు బట్టింది. బాగా ఏడ్చింది కూడ అట. ఇంక మిహికా, జీవీగారు- ఇద్దరూ ఆలోచించుకుని, విభావరి బాధ అర్థంచేసుకోవటం మేలు అని మౌనంగ ఉండిపోయారు. అందుకు ముప్పావు కారణం వాళ్ళకు పిల్లలు లేకపోవటమే. విభావరి వచ్చాకే మిహిక, ఆయనా కాస్త సంతోషంగ ఉండటం వేదాంగ్‌ కూడ గమనించాడు.
          వైద్యం నేర్చుకోవటానికి వస్తోందంటేనే అంత గొడవ చేశారు. ఇవాళ్టి రోజున నేరుగ మొహం మీద వచ్చి పెళ్ళి చేసుకోమని కూడ అడిగేసింది. ఈ సంగతి వింటే వాళ్ళంతా ఏమంటారో తలుచుకుంటుంటే వేదాంగ్‌కు భలే నవ్వొచ్చింది.
          మామూలుగ ఆయన పరమ బిజీగ ఉంటాడు. ఇంత ఆలోచనతో గడిపే సందర్భాలే ఉండవు. కాలేజి క్లాసులూ, విద్యార్థులతో ఏవో పరిశోధన చర్చలూ, ఇక హాస్పిటల్లో ఓపీ క్లినిక్‌, ఇన్‌పేషెంట్లూ.. అది చూసుకుని ఇంటికొచ్చేసరికి మళ్ళీ పేషెంట్లు..! పావుగంటలో ఫ్రెష్‌ అయి కాస్తంతేదైనా తిని వచ్చి మళ్ళీ పనిలో పడితే తేరుకునేది రాత్రికే. భోజనాలయ్యాక తన అధ్యయనమో, ఏదో కాన్‌ఫరెంస్‌కి పేపర్‌ రాసుకోటమో, వేరేదీ లేకపోతే అలసట తీరేందుకు ప్రశాంతంగ ధ్యానంతోనో సరిపోతుంది. తిరిగి ఉదయం నాలుగున్నరకల్లా మెళుకువ వచ్చేస్తుంది. అక్కణ్ణుంచి స్నానాదులు, అనుష్ఠానం, ఆసనాలూ, ప్రాణాయామాలూ, సుచరితతో కబుర్లు చెప్తూ తనకేదైనా పనిలో సాయం చేయటంతో సమయం గడిచిపోతుంది.
          కానీ దేనికీ, ఎక్కడా ఆగింది లేదు. ఇవాళ మొదటిసారి సబ్జెక్ట్‌ విషయం కాక మరేదైనా దాని గురించి.. ప్రేమ గురించి..?.. నిద్ర కాచి ఆలోచించటం.
          కానీ ఒకరకంగ ఇది సబ్జెక్ట్‌ గురించిన ఆలోచనే.. కాదు.. ప్రేమ కూడా! రెండింటి గురించి! ఇది సబ్జెక్ట్‌-ప్రేమ సమస్య!!
          "అసలు నేను ప్రేమించానని మీతో చెప్పానా..?"
          "నేను వేదాంగ్‌ అనబడే డాక్టర్‌గారిని పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను. ఆ పేరు గల ఒక మగవ్యక్తిని కాదు."
          "నన్ను వెంటనే పెళ్ళి చేసేసుకోండి. ప్లీస్‌... అప్పుడే నేను ఏ వైద్యమైనా నేర్చుకోగలిగేది.."
          నిజమే..! ఆమె నిజమే చెప్పింది. వైద్యం కోసమే పుట్టింది. అందులో సందేహం లేదు. ఆ అంకితభావం సామాన్యమైనది కాదు.
          ఆమె రావటం మొదలుపెట్టిన నెల రోజుల్లోనే అది తెలిసిపోయింది. ఒక్కపూట వేరే ఏదో పనుండి రాలేకపోయింది. అంతే..! ఆ రోజు వచ్చిన పేషెంట్లలో చాలామటుకు ఆ అమ్మాయి రాలేదా అని అడిగేసరికి వేదాంగ్‌ ఆశ్చర్యపోయాడు.
          'ఎందుకడగరు? విధిగా రోజూ వచ్చిన పేషెంట్లను స్నేహంగ పలకరించి వారి బాధ కనుక్కుంటుంది కదా. పైగా మంచి మంచి కబుర్లు చెప్తుంది, తప్పక తగ్గుతుందని వారికి నమ్మకం కల్పిస్తుంది..!' అని సుచరిత కారణం చెప్పిందాయనకు. ఆ మాటలు వారికెంత ఉపశమనంగ ఉంటాయో వేదాంగ్‌కి వేరొకరు చెప్పనక్ఖర్లేదు.
          వీటివల్ల ఏదో మితిమీరిన ఆసక్తేమో అనుకున్నాడే కానీ వైద్యమంటే ఆమెకెంత ఉన్మాదమో నిరూపించింది ఒకసారి జరిగిన సంఘటన. అది మాత్రం ఆయన్ను భలే కదిలించింది. ఆ రోజు ఆదివారం. మామూలుగ ఏదో మందు బిళ్ళలు కడుతుండంగ ఒకరెవరో పేషెంట్‌ అర్జెంట్‌ ఉండి వచ్చారు. మామూలుగ అయితే ఆదివారం ఎవరూ రారు.
          సరే, వారితో మాట్లాడి పంపించి వచ్చేసరికి లోపల్నుంచి సుచరిత అరుపులు వినిపించాయి. ఏం జరిగిందా అని వెళ్ళి చూస్తే విభావరి మొహమంతా తడిగ ఉండి నీళ్ళు కారుతోంది. ముక్కంతా ఎర్రగుంది. అనుకోకుండ నీటిలో పడి మునగిపోబోయి ఎవరో రక్షిస్తే బయటకు వచ్చినవాళ్ళలా వగరుస్తోంది. దగ్గుతోంది.
          'చూడరా, ఈ పిల్ల.. ముక్కుకు ఈ క్లిప్‌ పెట్టుకుని ఈ టబ్‌లో నిండా నీళ్ళుంటే అందులో మొహమంతా ముంచుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తోంది..' అంది సుచరిత విభావరి ముఖం తువ్వాలతో తుడుస్తూ, చెడామడా తిడుతూనే మధ్యలో ఆయన వంక తిరిగి. కాస్త స్తిమితపడ్డాక 'ఎందుకిట్ల చేశావ్‌?' అనడిగితే 'ఆత్మహత్య కాదు డాక్టర్‌గారూ..! ఇందాక వచ్చిన అబ్బాయి ఉన్నాడు కదా.. అతను ఆయాస పడుతుంటే పాపం అనిపించి, మాట్లాడిద్దామని వెళ్ళి ముందసలు ఆయాసమంటే ఏంటని అడిగాను. అప్పుడు పక్కనున్న వాళ్ళమ్మ- నీకు స్విమ్మింగ్‌ వచ్చా అనడిగి, నేను రాదని చెప్పాక, అయితే ముక్కు మూసుకుని నీళ్ళలో మునిగి చూడు.. ఊపిరికోసం కొట్టుకుంటావ్‌ కదా.. ఆయాసమంటే ఏంటో అప్పుడు తెలుస్తుంది..' అంది కోపంగ. అదే ట్రై చేస్తున్నాను..' అని చెప్పింది.
          'ఎందుకు ట్రై చేయటం..? ఆమె ఏదో ఉక్రోషంలో అనేస్తే చేసెయ్యటమేనా..?' అంటే 'మరి చెయ్యకపోతే మంచి డాక్టర్‌ ఎట్లౌతాం? డాక్టర్‌ కావాలనుకుంటే పేషెంట్‌ బాధ ఎటువంటిదో తెలిసుండాలి.. అని మీరే కదా చెప్పింది.' అంది.
          అది ఆరాధనో, లేక పిచ్చీ-ఉన్మాదమో తెలియలేదు వేదాంగ్‌కు.
          పోనీ, అది సరే, అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలి.. వైద్యం కోసం పెళ్ళి...!!
          తనను ఏకంగ పారిపోయి పెళ్ళి చేసుకోవటానికి కూడా సిద్ధపడింది.. అదీ ఓ వారంలో నిర్ణయం చెప్పాలిట.
          "నిజంగ మీరు ఈ విషయం ఆలోచిస్తారా?"
          వేదాంగ్‌కు నవ్వొచ్చింది. ఏం చెప్పాలి..? ఏదో ఒకటి చెప్పాలి.. బాగా ఆలోచించి చెప్పాలి.
          ఎందుకంటే ఆ అమ్మాయికి వేరెవరితోనైనా పెళ్ళయి వెళిపోతే ఆమెకే కాదు నష్టం.. ఒకరకంగ తనకు కూడా..!
          వేదాంగ్‌కు ఆ అమ్మాయిని పోగొట్టుకోవటం ఇష్టం లేదు. తన రిసర్చ్‌ కోసం ఆ అమ్మాయి పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. పేషెంట్ల కేస్ స్టడీలు తయారు చేయటానికి తను పడే కష్టాన్ని ఆమె తన నెత్తి మీదకు తీసుకుని కొత్త కొత్త ప్రణాలికలతో దానిని సిద్ధం చేస్తోంది. తను వారితో మొట్టమొదటిసారి కలిసిన దగ్గర నుంచి మాట్లాడిన ప్రతీ వివరం తు.చ. తప్పకుండ ఓ డైరీలో ఒక విశిష్ట పద్ధతిలో నోటు చేసి పెడుతుంది. ఎవరికి ఏ మందులు రాసింది, ఏ ట్రీట్‌మెంటు ఇచ్చింది, వారికి వచ్చిన మార్పులు, తేడాలు- అన్నీ విపులంగ తను వ్రాసి పెట్టే విధానం భవిష్యత్తులో చాలా పనికి వస్తుంది. డేటా అంతా సిద్ధంగ ఉంటే స్టడీ చేయటం ఎంత సేపు..?
          పైగా విభది చాలా సృజనాత్మకమైన మేధస్సు. అది తను చాలా విషయాల్లో చూసుకున్నాడు. మంచి ముందు చూపు. ఒక్కసారి చెప్తే చాలు- ఆ వివరాలన్నీ గుర్తుపెట్టుకుని ఒక్కోసారి తను మర్చిపోతే కూడ ఠకీమని గుర్తు చేస్తుంది. పైగా బాగా ఓపికస్తురాలు. నిద్రా-తిండీ లేకుండా కూడ రెండురోజులైనా కించిత్తైనా పని క్వాలిటీ తగ్గకుండ చేయగలదు. ఓర్పు బాగా ఎక్కువ. మాట తూలదు.. నోరు జారదు.. ఎదురు చెప్పదు. కోపతాపాలు, నిరాశా-దైన్యాలూ, నీరసం-నిస్సత్తువలూ తక్కువే. ఏడవదు, ఏడిపించదు. ఆవేశపడదు. సర్దుకుపోతుంది. అన్నిటికీ మించి మంచి ధైర్యవంతురాలు. అస్సలు దేనికీ భయం లేదు, పెద్దలంటే ఉండాల్సినంత తప్ప.
          ఎన్నోసార్లు తను అస్తవ్యస్తంగ పడేసిన పుస్తకాలను ఓపికతో సర్దింది. కొత్త మందులు స్టాకు వస్తే వాటిని పద్ధతి ప్రకారం అమర్చి ఉంచింది. చాలాసార్లు తను లేనప్పుడు పేషెంట్లను చూసుకుంది. కాన్ఫరెంసులకు ఏవైనా రెఫరెంసులు కావాలంటే రాత్రింబవళ్ళు ఏకం చేసి నోట్సులు తయారు చేసి పెట్టింది. ఎక్కడెక్కడో పాత లైబ్రరీలకు వెళ్ళి తను మాటల సందర్భంలో అని వదిలేసిన పుస్తకాలు సైతం సంపాదించి తెచ్చింది. ఎవరినైనా కలిసి ఏదైనా విషయం కనుక్కుని రమ్మంటే చాలు- అదెంత దూరప్రాంతమైనా, తెలియకపోయినా తెలుసుకుని పని సాధించుకుని వస్తుంది. ఎక్కడ ఏం చదివిందో, ఎవరు ఏం చెప్పారో అక్షరం పొల్లుపోకుండ, ఠకామని గుర్తు తెచ్చుకోగలిగిన ఆ బుర్ర సామాన్యమైంది కాదు.
          తనకు ఎప్పటికైనా ఆమె ఒక ఎసెట్ అవుతుంది. ఆమె వెళిపోతే తనకూ తీరని లోటే.
          అందుకే ఈ విషయం సీరియస్‌గ ఆలోచించాల్సిందే.. 

                              *       **     **     **     *

No comments:

Post a Comment