Tuesday, 18 July 2017

ప్రేమ కాదు.. పెళ్ళి ప్రయత్నం - 1



          అంతా నిశ్శబ్దంగ ఉంది. తెల్లారకుండ ఎవ్వరూ నిద్రలేవరు ఆ ఇంట్లో. విభావరి చేతిలో బాగ్‌ ఛాతికి అదుముకుని నెమ్మదిగ శబ్దం చేయకుండ మెట్లు దిగింది. గడియారం అప్పుడే ఐదు గంటలు కొట్టింది.
          విభావరి మనసు ఒకవైపు ఆనందంతో మరోవైపు ఉద్వేగంతో ఊగిపోతోంది. గుండె దడదడా కొట్టుకుంటోంది. మెల్లగ చేతిలో ఉన్న కాగితం ముందుగదిలో టీపాయ్‌మీద పెట్టి, అది ఎగిరిపోకుండ ఫ్లవర్‌వాస్‌ పెట్టి, ఓసారి పెద్దబెడ్‌రూమ్‌ వంక చూసింది. మూసి ఉన్న తలుపు లోపల అలికిడి ఏంలేదు. వాళ్ళు నిద్ర లేచేటప్పటికి ఈ ఊరి పొలిమేరలు కూడ దాటిపోతుంది.
          అంతలో కిటికీమీద పెద్ద వెలుగు పడి అటు చూసింది. అప్పుడే వచ్చి గేట్‌ ముందు ఆగింది సాంట్రో..
          విభావరి తలుపు పక్కన గోడకున్న కీ హోల్డర్‌నుంచి కీ తీసుకుని, పక్కనే ఉన్న రాముడి పటానికి దండం పెట్టుకుని 'భగవంతుడా, నాకు కొండంత ధైర్యం ఇవ్వు..' అనుకుంటూ గబగబ సాండిల్స్‌ తొడుక్కుని, చిన్నగ చప్పుడు కాకుండ తలుపు తీసి, కార్‌ వైపు చూసి చెయ్యి ఊపింది. తర్వాత తాళంచెవి తో తలుపు తాళం వేసి 'బై..' అని ఇంటికి చెయ్యి ఊపి నాలుగు అడుగుల్లో కార్‌ దగ్గరకు చేరిపోయింది.
          "వావ్‌.. భలే టైం పాటిస్తావే..!" మెచ్చుకున్నాడు వేదాంగ్‌ కార్‌ తలుపు తెరస్తూ.
          "ఏం చేయను..? సహవాస దోషం..!" అని నవ్వి, కార్‌ ఎక్కి తలుపు మూసింది విభావరి.
          వేదాంగ్‌ నవ్వి కార్‌ స్టార్ట్‌ చేశాడు. తూరుపు గాలి మృదువుగ ముఖానికి తగలంగనే విభావరి పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఆనందంతో కళ్ళు మూసుకుని సీట్‌లో వెనక్కు వాలి హాయిగ కూర్చుంది.
          "ఇంట్లో చెప్పావా..?"
          చెప్పానన్నట్టు తల ఊపింది.
          "నిజంగ.. నిజం చెప్తున్నావు కదా.."
          "ఊహూఁ..! అబద్ధంగ నిజం చెప్తున్నాను.."
          "అల్లరిపిల్ల..!" నవ్వాడతను.
          విభావరి మౌనంగ ఆ నవ్వునే చూస్తూండిపోయింది.
          వేదాంగ్‌ది మంచి పసిమిఛాయ. ఉత్సాహం తరగని నవ్వు ముఖం. ఎప్పుడూ కుతూహలం తొంగిచూసే మెరుపు కళ్ళు. ఫాషన్‌గ లేకపోయినా అందంగ అనిపించే క్రాఫ్‌. చూడంగనే ఓసారి పలకరించాలి అనిపించేటట్టు ఉంటాడు. పెద్ద పొడగరి కాదు కానీ ఎత్తుకు తగ్గ లావుతో చక్కటి శరీరాకృతి. పైనుంచి మంచి మాటతీరు. దైవభక్తి ఉంది. నలుగురికీ మంచి చేసే రకమే కానీ ఎవ్వరికీ హానీ తలపెట్టడు.. బాగా సంపాదించగలిగే వృత్తిలో ఉండి కూడ సేవకే ప్రాధాన్యమిస్తాడు.
          "ఏంటివాళ ఇంత కామ్‌గ ఉన్నావు..?"
          అకస్మాత్‌గ అడిగాడు వేదాంగ్‌. విభావరి కొంచెం ఉలికి పడి చూసింది కానీ ఏం మాట్లాడలేదు.
          "ఎప్పుడూ ఏవో కబుర్లు చెప్తావుగా..! మీ సన్నజాజీ, దబ్బముక్కూ, పొట్లకాయ ఫ్రెండ్స్‌ గురించి.."
          "----"
          "నీకు నామీద కోపం పోలేదు కదూ..?"
          "అదెందుకు..?"
          "నిన్ను పరీక్షలయ్యేవరకూ మా ఇంటికి రావద్దన్నానని.."
          "ఊఁ..! అప్పుడు కోపం వచ్చినమాట వాస్తవమే. కానీ ఇప్పుడేం లేదులే.."
          "కాన్‌ఫరెంసుకు వెళ్తున్న ఆనందమా..?"
          తలూపింది నవ్వి.
          "ఏంటి.. ఇంత తెల్లారే తలంటు చేశావా..?" కురుల అంచుల్లోంచి జారుతున్న నీటి బొట్లను గమనిస్తూ అడిగాడు.
          "ఊఁ.." భుజాలమీంచి ముందుకు వేసుకున్న జుట్టు వంక చూసుకుంటూ అంది.
          "కనీసం ఆరటానికి కూడ వీల్లేకుండ అట్ల క్లిప్‌ పెట్టేస్తే తల నెప్పి రాదా..?"
          "వస్తుంది.."
          "మళ్ళీ డాక్టర్‌గారూ.. తలనెప్పో..' అంటూ మందుకోసం వస్తావ్‌..! అన్నీ తెలుసు.. ఐనా కావాలని చేస్తావెందుకు..?"
          "----"
          "ఆ వెనక సీటులో నా పెట్టెలో తువ్వాల ఉంటుంది.. తీసుకుని ముందు ఆ జుట్టంతా పొడిగా తుడుచుకో.."
          విభావరి మౌనంగ తన బాగు తెరిచి తువ్వాల తీసుకుని అంచులు తుడుచుకుంది.
          "ముందు ఆ క్లిప్‌ తీసేసి జుట్టు వదిలి పూర్తిగ పైనుంచి తుడుచుకో..!"
          విభావరి జుట్టంతా పొడిబారేదాక కాసేపు తుడిచి ఆ తువ్వాల బాగ్‌ మీద పరిచి ఆరేసి, కిటికీ బయటకు చూస్తూ వేళ్ళ కొసలతో జుట్టు కుదుళ్ళు మసాజ్‌ చేసుకుంటూ కూర్చుంది.
          "నీలో ఇవాళ ఏదో మార్పుంది విభా..! అదేంటో అర్థం కావట్లే.."
          "మార్పా..? ఏం లేదే.." విభావరి కళ్ళు దించేసుకుంది.
          "కాదు.. ఏదో ఉంది..!! నిన్నెప్పుడూ ఇట్ల చూడలే. ఏం జరిగింది..? ఊఁ. చెప్పాలి.."
          విభావరి కళ్ళు తిప్పేసుకుంది. "ఎ.. ఏమైనా ఉంటేగా చెప్పేది..!"
          "లేదు.. ఏదో ఉంది..! నువ్వింత నిశ్శబ్దంగ ఉండవు. నాకు తెలుసు. ఏంటో ఆలోచిస్తున్నావు.. ఏంటది..?"
          విభావరి ఏంలేదన్నట్టు తల అడ్డంగ ఊపింది.
          "కాదు. నువ్వబద్ధం చెప్తున్నావు. ఏదో ఉంది.. పరీక్షల గురించా..? అయి ఉండదు.. నువ్వు దాని గురించి కంగారుపడే రకానివి కావు. ఇంకేదో ఉంది.."
          విభావరి మౌనంగ తలొంచుకుంది.
          "ఏంటి..? అంత రహస్యాలా..?" నవ్వాడు వేదాంగ్‌.
          "అదేం కాదు. కానీ.. ఇప్పుడు కాదు. వచ్చేటప్పుడు చెప్తా.."
          "దొంగపిల్ల..!! ఏదో పెట్టుకుని కూడ ఏంలేదని చెప్తున్నావు.." నవ్వాడు వేదాంగ్‌.
          విభావరి అద్దం బయటకు చూపు మరల్చింది, అరవిరిసే పెదవులను అతనికి కనిపించనీయకుండ. నగరం పొలిమేరలు చేరాక కిటికీ అద్దం వేసెయ్యమన్నాడు వేదాంగ్‌. విభావరి అదే చేసింది మౌనంగ. ఇక గాలితో కబుర్లు చెప్తూ సాగింది కార్‌.
          "సరే.. ఇంతకీ పరీక్షలు బాగ రాశావా..?"
          "సరిగ్గ యాభై శాతం ప్రిపేరై నలభై శాతం రాసొచ్చా.. అత్తకు చెప్పా.. నెట్టేస్తార్లే అంది.."
          వేదాంగ్‌ నవ్వి, "ఇష్టంలేని చదువు చదివిస్తున్నందుకు మీ వాళ్ళకు బానే శిక్ష వేస్తున్నావే! పోనీలే.. ఈ ఏడాదితో గోల వదిలిపోతోంది... కదా.." అన్నాడు.
          "ఆ.. వదిలిపోయినట్టే..!! ఇంక పై చదువు నావల్ల కాదని ముందే చెప్పేశా.."
          "మరి చదువు కాదంటే ఇంకేం చేస్తావ్‌..?"
          "దాని గురించే మీతో మాట్లాడాలి. కానీ ఇప్పుడు కాదు.., వచ్చేటప్పుడు.."
          "ఓహో! ఇంకేం రహస్య విషయమో అనుకున్నా..! కెరీరు కౌంసిలింగా..? ఓకే..! దానికేం భాగ్యం.. అట్లగే.."
          విభావరి ఇంక మాటలు పొడిగించనీయకుండ ఎదురుంగ ఉన్న సొరుగు తెరిచి వీణా వాద్యసంగీతం సీడీ తీసి ప్లేయర్‌ లో పెట్టి బాగా సౌండు పెట్టి సీటులో చేతులు కట్టుకుని కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చుని కాసేపటికి అలిసినట్టై కళ్ళు మూసుకుంది. రాత్రి నిద్ర చాలకపోవటంతో అలవోకగ నిద్ర పట్టేసింది.
          ఇంకో అరగంటలో గమ్యం చేరతారనంగ కార్‌ ఆగిపోయేసరికి నిద్ర చెదిరి మత్తుగ కళ్ళు తెరిచి చూసింది విభావరి.
          వేదాంగ్‌ ఏదో కొనటానికి ఓ షాపు ముందు ఆపి కారు దిగాడు. తిరిగి వస్తూంటే చేతిలో అరటిపండ్లూ, జామకాయల కవరూ ఉన్నాయి. అవి వెనక సీట్‌లో పడేసి కార్‌ స్టార్ట్‌ చేసి, "బాగ్‌లో టిఫిన్‌ ఉంది. తీసుకుని తినేసెయ్‌. కాన్‌ఫరెంస్‌ తొందరగ మొదలౌతుంది. మళ్ళీ టైం దొరకదు.." అన్నాడు విభావరితో.
          "అబ్బ.. నాకొద్దు.." ఎప్పటిలాగే గొణిగింది విభావరి.
          "ఎందుకొద్దు..?"
          "ఇంత పొద్దున్నే ఆకలెట్లౌతుంది..?"
          "ఆకలేయకపోయినా తినాలి. తినకపోతే కాన్‌ఫరెంసు కాన్సిల్‌.." అన్నాడు వేదాంగ్‌ కార్‌ ఆపేస్తూ.
          విభావరి మౌనంగ బాగ్‌ తెరిచి డబ్బా ఒకటి కనిపిస్తే తీసింది. ఇంకో డబ్బాకోసం చూస్తే కనిపించలేదు.
          "ఏంటి..? వెతుకుతున్నావ్‌..?"
          "నా టిఫిను ఉంది..! మరి మీకేది..?"
          "నేనివాళ ఏకాదశి.. ఒంటిపూట భోజనం. మధ్యానం తింటా.."
          "అయితే నాకూ ఒద్దు.." అంది విభావరి డబ్బాపెట్టేసి బాగ్‌ మూసేస్తూ.
          "నీకసలు తిండి మానెయ్యటానికి ఓ వంక కావాలి. ఈమధ్య నువ్వస్సలు వేళకు సరిగ్గ అన్నం తినటంలేదని, పాలు తాగట్లేదనీ తెలిసింది. ప్రతీదానికీ తెగ మొండికేస్తున్నావట..!"
          "ఏం కాదు.. అంతా అబద్ధం. ఎవరు చెప్పారు మీకివన్నీ..?"
          "ఒకరు చెప్పాల్సిన అవసరమేంటి..? నిన్ను చూస్తే తెలియట్లే? ఎంత సన్నగైతున్నావ్‌ చూడు. ఆరోగ్యమంటే అంత చులకనగుందా? ఇదేనా నీకు మన ఆయుర్వేదం నేర్పింది? అందరికీ చెప్పేవి మనం పాటించకపోతే ఇక గౌరవం ఏం ఉంటుంది..? ఇట్లగే చేయదల్చుకుంటే ఇంకెప్పుడూ మా ఇంటికి రాకు. అస్సలు నేన్నీకింకేం నేర్పను.. ఫో!!"
          విభావరి కొన్నిక్షణాలు మౌనంగ చూసి కారు దిగింది. ఆమెకు కోపం వచ్చిందేమో అనుకున్నాడు. కానీ సొరుగులో నీళ్ళసీసా తీసుకుని చేతులు కడుక్కుని వచ్చి కూర్చుని రెండు ఇడ్లీలు కిమ్మనకుండ తినేసి ఇంకొక్కటి ఉంచేసింది.
          "ప్లీస్‌ డాక్టర్‌గారూ, ఇంక నాకు దిగదు.."
          "పోనీలే.. అంతైనా తిన్నావ్‌. ఇడ్లీలకోసం ఇంటర్‌నేషనల్ కాన్‌ఫరెంసు వదులుకోవులే.." నవ్వాడు వేదాంగ్‌.
          విభావరి కూడ నవ్వి ఊరుకుంది. వేదాంగ్‌ రెండు పండ్లు తిన్నాక కారు స్టార్టు అయి మళ్ళీ ప్రయాణం కొనసాగింది.
          చిన్నప్పట్నుంచీ విభావరితో అన్నం దగ్గర పేచీనే. తను ఎప్పుడైనా ఏదైనా విషయమై సంతోషంగ ఉన్నరోజు కానీ, అనుకున్నది చేయగలిగినరోజు కానీ ఏ గొడవా చేయకుండ తినేది. ఆమెకు తినటానికి కూడ ఒక కారణం కావాలి. కేవలం బతకటానికి తినటం నాకు చేతకాదంటుంది. ఇప్పుడేమో లా-పరీక్షలున్నప్పుడల్లా తండ్రి మీది కోపంతో అన్నం మానేస్తోందని వాళ్ళ అత్తయ్య, వేదాంగ్‌ వాళ్ళక్క సుచరితతో ఫర్యాదు చేసింది.
          సుచరిత సంగతి చూడమని వేదాంగ్‌తో చెప్పింది. ఎందుకంటే తను వేదాంగ్‌కి తప్ప ఎవ్వరికీ వినదు. ఆయన నుంచి తనకు కావాల్సింది పొందాలంటే మరి ఆయన చెప్పిన మాట వినాలి కదా. తల ఒగ్గక తప్పదు. కాబట్టి ఈ అస్త్రం ఇంతవరకు ఫలించకుండ పోలేదు. విభావరితో ప్రతీ వివాదానికి ఈ బెదిరింపే భరతవాక్యం. ఇంక మంత్రం వేసినట్టు ఏ మాటైనా వినేస్తుంది. ఆయుర్వేదమంటే ఆమెకున్న శ్రద్ధ అటువంటిది.
          'ఇంత తక్కువ తింటుంది, అసలీ పిల్లకు శక్తెట్లొస్తుందో?' అని ఓసారి తమ ఇంట్లో భోంచేస్తుంటే సుచరిత అంది విభావరి తిండి చూసి.
          'అసలిది తినకపోయినా నేనింతే శక్తివంతంగ ఉండగలనాంటీ. నాకు ఇంత కూడ అవసరం లేదు..! ఏదో.., చూసే వాళ్ళకు అనుమానం రాకూడదని తింటా కానీ, నాకసలు డాక్టర్‌గారిచ్చే శిక్షణతోనే కడుపు నిండిపోతుంది..!' అంది.
          ఎవరు నమ్మినా నమ్మకపోయినా విభావరికది నిజం అనిపిస్తుంది. ఆ ఆనందం ఎవ్వరికీ అర్థం కాదు.
          'నువ్వు పూర్వజన్మలో తప్పక ఏ శుశ్రుతుడివో చరకుడివో అయి ఉంటావు విభా. ఆ వాసనలింకా పోలేదు నీకు. లేకపోతే లా చదువుతూ ఆ బరువే కాక ఇదింకో మోత బరువు పెట్టుకుని కూడ ఆనందంగ చేసుకుంటున్నావంటే సామాన్యం కాదు.' అని ఆమె అంటే, బాధగ ముఖం పెట్టి, 'నిజంగ అంత అదృష్టవంతురాలినే అయి ఉంటే ఇక్కడిట్ల ఏడుస్తూ ఎందుకుండేదాన్ని!వాళ్ళ అంశతో మరో సంహిత రాసిపెట్టేయకపోదునా..' అంది.
          'నీ ఆసక్తి చూస్తుంటే భలే బాధేస్తుందమ్మా.. నువ్వే కనక డాక్టర్‌వై ఉంటే ఎంతమంది రోగులు ఆరోగ్యం పొందేవారో..'
          'ప్చ్‌.. వచ్చే జన్మకన్నా ఆ అదృష్టం కలిగితే బావుండు..' అంది కన్నీరు తుడుచుకున్నట్టు నటిస్తూ.
          'పాపం... పిచ్చిపిల్ల..!' వాత్సల్యంగ ఓసారి ఆ అమ్మాయి వంక చూసి అనుకున్నాడు వేదాంగ్‌.
          కార్‌ గమ్యం చేరేసరికి సరిగ్గ కాన్‌ఫరెంస్‌ మొదలయ్యేవేళైంది. రిజిస్ట్రేషన్‌ కానించుకుని విభావరి హాల్లో రెండో వరసలో వెళ్ళి కూచుంది. ఆమెకు ఓ ఫైల్‌, పెన్‌, నోట్‌బుక్‌ ఇచ్చి వెళ్ళాడు అటెండరు. విభావరి అంతా పరికించింది.
          ఎనిమిదిన్నరకు కాన్‌ఫరెంసు ప్రారంభం. కాన్‌ఫరెంసులో ప్రధాన చర్చాంశం మెదడు. మూడురకాల వైద్యవిధానాల్లో మెదడుకు సంబంధించిన వ్యాధులు, వాటి చికిత్సా విధానమూ మొదలైన అంశాలమీద అవగాహన సదస్సు అది.
          మొదటి భాగానికి వేదాంగే అధ్యక్షుడు. రెండో భాగంలో ఆయన పేపర్‌ ఉంటుంది. తర్వాత ఒంటిగంటకు లంచ్‌. తిరిగి రెండింటికి మూడో సెషన్‌లో బ్రెయిన్‌సర్జరీకి సంబంధించిన వీడియో చూపిస్తారట. నాలుగో సెషన్‌ మొత్తం వైద్యవిధానాన్ని మెరుగు పరిచేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి విస్తృత చర్చ. అందులో ఎవరైనా ఏవైనా సలహాలివ్వచ్చు, తమ ఎదురైన అనుభవాలు, చేసిన ప్రయోగాలు. తప్పుడు విధానాలను విమర్శించచ్చు. ఆరున్నరకు ముగింపు సమావేశం.
          సరిగ్గ చెప్పిన వేళకు మొదలైంది సదస్సు. ఆహూతులైన వక్తలు తమ పరిశోధక వ్యాసాలను చదివారు. రకరకాల అంశాలు వాటిలో ప్రస్తావనకొస్తున్నాయి. వాటి మీద చర్చ తీవ్రస్థాయిలోనే జరుగుతోంది. శ్రోతలడుగుతున్న సందేహాలకు వక్తలు ఓపిగ్గ సమాధానాలు చెప్తున్నారు. తెలియనివి బహుశ ఫలానా పుస్తకంలో లభించవచ్చు అని సూచిస్తున్నారు. ఈ సదస్సుకు అంతా బాగా దిట్టలైన నిపుణులైనవారే వస్తారని వేదాంగ్‌ చెప్పింది ఆమెకు అక్షరాలా నిజమనిపించింది.
          విభావరి అన్ని పేపర్‌లలోంచి తనకు ఉపయోగపడతాయనిపించే పాయింట్‌లు జాగ్రత్తగ నోట్‌ చేసుకుంది. ప్రతీ వక్తా మాట్లాడిన అంశాలన్నీ చాలా శ్రద్ధగ విన్నది. ఇంటికి వెళ్ళాక వేదాంగ్‌ సాధారణంగ తను విన్నది అవగాహన చేసుకుందా లేదా అని తెలుసుకోటానికి ప్రశ్నలు అడుగుతాడు. చెప్పలేకపోతే తనకే అవమానంగ అనిపిస్తుంది.
          టీ బ్రేకు వేళకల్లా వేదాంగ్‌ మూల్యాంకన విమర్శలతో ఆ భాగం ముగిసింది. విభావరి టీ కోసం వెళ్ళలేదు. వేదాంగ్‌ టీ తాగడు. టీ-కాఫీలు ఆరోగ్యానికంత మంచివి కాదంటాడు. అవి తాగటం వల్ల కుత్రిమంగ తెచ్చుకునే ఉత్సాహం ఎక్కువ సేపు నిలవదనీ, మనిషి తన దైనందిన జీవితంలో క్రమశిక్షణగ ఉండి ఆత్మశక్తితో ఉత్సాహాన్ని మిగితావాటిలాగే ఒక అలవాటుగ పెంపొందించుకోవాలనీ అంటాడు. సమయం ప్రకారం ఆహారం, తగినంత నిద్ర, సరైన శారీరిక వ్యాయామం వంటి ఒక నిర్దిష్ట పద్ధతిగ గడిపే వారికి ఎప్పుడూ నీరసం లాంటి సమస్యలు రావని ఆయన నమ్మకం.
          ఆయన చెప్పినవేవైనా విభావరి కళ్ళు మూసుకుని ఎదురు ప్రశ్న లేకుండ పాటించేస్తుంది. మొదట్లో మానటం కొంచెం కష్టమనిపించినా వాటికి బదులుగా ఆయనే ఏవో ఓ ఉపాయాలు చెప్తాడు. ఉదాహరణకు టీ-కాఫీల బదులు పాలు కానీ పండ్ల రసాలేవైనా కానీ తాగమంటాడు. అవి కూడ ఇంట్లో తయారు చేసుకున్నవే కానీ బయటవి వద్దంటాడు. ఐస్‌ వేసుకోవద్దు, పంచదార కలుపుకోవద్దు..- ఇత్యాదివి మళ్ళీ మామూలే. తను చెప్పేవి ఎంత కఠినంగ ఉన్నా ఆ అమ్మాయి శ్రద్ధగ పాటిస్తుందని వేదాంగ్‌కి కూడ ఆ అమ్మాయంటే ముచ్చటేస్తుంది.
          "ఇదిగో.. తీసుకో.."
          విభావరి ఏదో పాంప్లెటు చదువుతున్నదల్లా తలెత్తి చూసింది, ఏంటన్నట్టు. అతని చేతుల్లో రెండు గ్లాసులున్నాయి.
          "ఏంటిది..?" తన వైపు చాచిన గ్లాసు అందుకుంటూ అడిగింది.
          వేదాంగ్‌ తన గ్లాస్‌తో ఆమె పక్క కుర్చీలో కూచుంటూ నవ్వి, "నువ్వే తాగి చూడమ్మా.." అన్నాడు.
          విభావరి కొంచెం తాగుతూనే "అబ్బ.. నిమ్మకాయ జూసా..! ఎంత బావుందో.. ఆంటీ చేశారు కదా..?" అంది.
          "ఊఁ.. నువ్వు సెషన్సు వినీ వినీ అలిసిపోతావని నేనే అక్కను ఓ సీసాలో నిండా నిమ్మరసం నీళ్ళు కలిపి ఇమ్మని అడిగాను..."
          విభావరి కృతజ్ఞతగ చూసి, "ఇందాకటి మీ విమర్శలు బావున్నాయి. ఆ ఆధునిక వైద్యం వాళ్ళకు వాళ్ళదే మహా గొప్ప పద్ధతి అని పొగరు..! బాగ బుద్ధి చెప్పారు.." అంది.
          "నేనెవ్వరికీ బుద్ధి చెప్పాలనుకోలేదు. ఎవరి పద్ధతుల మీద వారికి గురి ఉండటంలో తప్పు లేదు. కానీ వాళ్ళ వాదం విని దీని గురించి ఏమీ తెలియని జనాలంతా అదే నిజమని అపోహ పడకూడదనే అట్ల మాట్లాడాను. ఏ వైద్య విధానం ఆశయమైనా మనిషికి అతి తక్కువ బాధతో సమూలంగ రోగాన్ని నాశనం చేయాలనే కదా.."
          "కానీ వాళ్ళ చికిత్సలో మూలం చేరే పద్ధతే లేదని చెప్పారు. అంతా రోగలక్షణానికి వైద్యమేనన్నారు.."
          "ఆ మాట మనకు తెలుసు కానీ.. ఆ మందు వాడే జనాలకు కూడ తెలియాలి కదా. రోగ లక్షణాలు తగ్గించటం రోగాన్ని తగ్గించటం కాదని ఆ వైద్యులూ తెలుసుకోవాలి. చిన్న చిన్న రుగ్మతలు ఎవరైనా నయం చేయగలరు. దీర్ఘరోగాలు బాగు చేయమను.. వాళ్ళ తాతలు దిగొస్తారు. రోగాన్ని బట్టే మందిస్తారట.. పేషెంట్ శరీరతత్త్వం అసలు లెక్కలోకే రాదట.. హుఁ. అంతా కెమికల్ మయం చేసేసి లోకాన్ని మనుషుల్ని తమ ఆదాయానికి మార్గంగా మాత్రం చూస్తున్నారు. ఇంకా కార్పరేట్ వైద్యాలయాల విషయం నేను ఎత్తలేదు.. బ్రతికిపోయారు."
          విభావరి చిరుకోపంగ ఉన్న ఆయన ముఖాన్నే చూస్తూ ఉండిపోయింది.
          అంతలో ఆ అమ్మాయి చేతిలో సెల్లు మోగింది, నిశ్శబ్దంగ లైటు వెలుగుతూ. విభావరి టక్కున అది కట్‌ చేసేసింది.
          వేదాంగ్‌ అనుమానంగ చూసి, "ఏంటి, ఫోన్‌ ఎవరిదో కూడ చూడకుండ కట్టేస్తావూ?" అని ఫోన్‌ తీసుకుని ఎవరా అని చూశాడు. విభావరి వాళ్ళ మామయ్య జీవీగారి ఫోన్‌.
          "ఏంటీ?!! పదిహేడు మిస్సడ్‌కాల్సా?! ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారు..? చేసినా నువ్వెందుకు ఎత్తట్లేదు..?"
          విభావరి ఏం మాట్లాడలేదు.
          వేదాంగ్‌కేదో అనుమానం వచ్చింది. "ఏయ్‌, నిజం చెప్పు..!! ఇటు వస్తున్నట్టు ఇంట్లోవాళ్ళతో చెప్పే వచ్చావా?"
          "----"
          "అదీ సంగతి..!! అంటే నాతో అబద్ధం చెప్పావన్నమాట.."
          "అబద్ధం చెప్తున్నానని చెప్పే చెప్పా కదా..." నవ్వింది విభావరి. కానీ వేదాంగ్‌ నవ్వలేదు.
          "ఛ! అనవసరంగ నువ్వు చెప్పే వస్తావ్‌లే అని ఊరుకున్నా చూడు.. నాది బుద్ధి తక్కువ! నేనే చెప్పాల్సింది.."
          "మీరు చెప్పినా, ఎవరు చెప్పినా ఇంత దూరమని తెలిస్తే మావాళ్ళు నన్ను గడప కదలనిచ్చేవాళ్ళే కాదు.."
          "..కానీ ఇన్నిసార్లకీ తియ్యకపోతే అవతల వాళ్ళేం కంగారు పడుతున్నారో ఏమో.." అని తనే చేయబోయాడు.
          "వద్దు డాక్టర్‌గారూ.. ఇప్పుడనవసరంగా అత్తా మామయ్యా ఇద్దరూ కలిపి తిడతారు. నాకు బోరు.."
          "ఏంటీ.. బోరా? ఎత్తి నెత్తిన కొట్టానంటే! బోర్‌ అట బోరు! నీతో ఎవరైనా అట్ల చేస్తే అప్పుడు తెలుస్తుంది.. చెప్పకుండ రావటమే కాదు, పైనుంచి కంగారేసి ఎక్కడున్నావో ఏంటో అని ఫోన్‌ చేస్తుంటే ఎత్తకుండ.."
          "ఉత్తరం చదివాక కూడా ఫోన్‌ చేస్తుంటే ఇంకేమనాలి..?"
          "ఉత్తరమా.. ఏం ఉత్తరం..?"
          "..వాళ్ళకు ఏ కంగారూ ఉండకూడదని ఓ కాగితంలో అంతా రాసి పెట్టి వచ్చాను. నిద్ర లేవంగనే చూసుకుంటారు.. నేని ఇంటికి వెళ్ళింతర్వాత దులుపుతారు.. నేనూ దులిపేసుకుంటాను.." అంటూ కిలకిల నవ్వి ఆయన చేతిలోంచి తన సెల్‌ తీసేసుకుంది.
          వేదాంగ్ కు నవ్వు రాలేదు. "నువ్వు దులుపుకోవటం కాదు.. ఇద్దరూ కలిసి నన్నూ మా అక్కయ్యనూ దులుపుతారు. అట్ల ఇంట్లో చెప్పకుండ రావద్దనీ, అబద్ధాలు చెప్పద్దనీ నీకెన్నిసార్లు చెప్పాను..! ఉండు..! ముందు మీ మామయ్యతో మాట్లాడి ఆ తర్వాత నీ సంగతి చెప్తా.." అని తన ఫోన్‌ తీసి నెంబర్‌ కలపబోయాడు.
          "ప్లీస్‌.. వదిలేయండి.." ఆపబోయింది.
          వేదాంగ్‌ వినకుండ, "ఇది చాలా అన్యాయం. దారుణం కూడా. నువ్వెట్లాగూ చెయ్యవు..! నన్నైనా చేసి మాట్లాడనీ.." అని ఆమె వద్దని వారిస్తున్నా నెంబరు కలిపాడు. మాట్లాడాడు.
          సంగతంతా చెప్పి, ఆయనను తాత్కాలికంగ శాంతపరిచి ఫోన్‌ పెట్టేసి అక్కణ్ణించి లేచి వెళిపోబోయాడు.
          "ఏంటి వెళిపోతున్నారు..? కోపమొచ్చిందా..?"
          "కోపమా ఇంకేమన్నానా? నెత్తిన రెండంటించబుద్ధౌతోంది. మీ మామయ్య నా ఎదురుంగ ఉండుంటే ఏం చేసేవాడో కూడ తెలీదు. అసలే మీ కుటుంబమంతా న్యాయవాదులే! నా మీద కేసు పెట్టినా పెడతారు.."
          "కేసా.. ఏమని పెడతారు..?"
          "ఏమనా..? చెప్పకుండ నిన్ను ఎటో తీసుకెళ్ళానని.."
          "హలో.. అవన్నీ చెల్లటానికి నేనేమీ మైనర్‌ని కాదు. నేనేం చేయదలచుకుంటే అది చేసే స్వతంత్రం నాకుంది. నేనూ చదివాను.. బోడి లా..! నాకూ నా హక్కులు తెలుసు. నా ఇష్టంతోనే మీతో వచ్చానని చెప్తాను. అప్పుడేమంటారు..?"
          "ఏదైనా విభా.. పెద్దవాళ్ళ ఇష్టానికి విరుద్ధంగ అట్ల చేయటం మాత్రం మంచి పద్ధతి కాదు.."
          "మరి వాళ్ళు చేసేది సరైన పద్ధతా..?"
          వేదాంగ్‌ నిరుత్తరుడయ్యాడు. విభావరి అక్కణ్ణుంచి లేచి దూరంగ వెళిపోయి ఎటో చూస్తూ నిలబడింది. 
          వేదాంగ్‌కి ఆ అమ్మాయి బాధ తెలుసు. అందుకే ఏం మాట్లాడలేదు.
          పాపం, సెంట్రల్‌ స్కూలులో ట్వెల్తు పూర్తి చేసుకుని కష్టపడి మెడిసిన్‌ ప్రిపేరై సీటు కూడ తెచ్చుకుంది. ఆమెకు చిన్నప్పట్నుంచీ డాక్టరవ్వాలని కోరిక. కానీ వాళ్ళ నాన్నకు ఆ అమ్మాయికి కుటుంబవృత్తైన లా ఇప్పించి తనంత గొప్ప లాయర్‌గ తీర్చిదిద్దాలని ఆశ. విభావరి ఆ ఘోరం జరక్కుండ ఆపటానికి బీ.ఎల్‌. ఎంట్రెంస్‌లో రాంకు తెచ్చుకోకుండ జాగ్రత్త పడింది. కానీ మెడికల్‌ ఎంట్రెంసులో ఐదొందల లోపే రాంక్‌ తెచ్చుకున్నా, పెద్దకాలేజిలో ఫ్రీ సీటు వచ్చే అవకాశం ఉన్నా తండ్రి పట్టువదలని విక్రమార్కుడిలా తన పరపతిని ఉపయోగించి బీ.ఎల్‌. చదివించే ప్రయత్నం చేసేసరికి అలిగి కోపం వచ్చి ఢిల్లీని, తల్లితండ్రులను వదిలి భాగ్యనగరంలో ఉండే అత్తామామయ్యల ఇంటికి చేరింది.
          కానీ వాళ్ళ అత్తయ్య- అన్నగారి మాట తీసేయలేక తను రీడర్‌గ పనిచేస్తున్న 'లా'కాలేజులోనే ఆ అమ్మాయిని బీఎల్‌లో చేర్పించింది. ఇంక విభావరికి వచ్చిన కోపం అంతాఇంతా కాదు. నానా గొడవా చేసింది. అయినా తండ్రి ఒప్పుకోలేదు. పైగా ఏవో బెదిరింపు ఒట్టులు పెట్టేసరికి విధిలేక తల ఒగ్గింది. పాసయ్యే మందం చదువుతూ ఎట్లగో నెట్టుకొచ్చింది.
     మొత్తానికి ఆ గోల వదలబోతోంది. ఇక ముందు ఏం చేద్దామనుకుంటోందో చూడాలి.

No comments:

Post a Comment