Wednesday, 25 January 2017

11. మళ్ళీ పరిచయం చేసుకుందామా..? (సంపూర్ణం)




            "ఏంరా, భోజనానికి వస్తున్నావా..?"
            "ఆఁ.. ఇదిగో అయిపోవచ్చింది నాన్నా.. భలే ఇంట్రెస్టింగ్‌గ ఉంది.. డాన్‌ బ్రౌన్‌ చంపేస్తున్నాడు.. నా ఊహ నిజమే.. వాడు ఆ జపానుగాడే విలన్‌.."
            "అన్నం చల్లారిపోతోంది రా.."
            "సస్పెంస్‌ ఛంపేస్తోంది నాన్నా.. మీరు తినేసేయండి.. నేను తర్వాత తింటాను..."
            "సరే, నీ ఇష్టం.."
            కాసేపాగి..
            "అదేంటి నాన్నా.. ఇంకా తినలేదా మీరు..? తినేసేయమన్నా కదా.."
            "ఉన్న ఇద్దరిలో మళ్ళీ విడివిడిగా ఎందుకు అని"
            "సారీ నాన్నా.. ఇంకోసారి అన్నం తినే వేళలో నవల పెట్టుకోను.."
            "ఏం నవలరా అది..?"
            "డిజిటల్‌ ఫోర్ట్రెస్‌ అని.. మీరూ చదవండి.. బావుంది.."
            "డ వించీ కోడ్‌ రాసినతనిదే కదా.. చదివేశానెప్పుడో.. ఏంజిల్స్‌ ఎండ్‌ డెమన్స్‌ కూడా చదివాను."
            "ఓహో చదివేశారా? మొన్ననే కొలీగ్‌  చెప్పాడు దాని గురించి. ఇప్పుడు సినిమా కూడా తీశారట దాన్ని.. మరి మన సంగ్రహంలో పెట్టలేదేఁ..?"
            "ఏదో కుర్రకారు చదువుకునే నవళ్ళు నాకెందుకురా..? కృష్ణారామా అనుకునే వయసు.. నాకు మా శంకర భగవత్పాదులు చాలు.."
            "శంకరులకు ఏదీ సాటి లేదనుకో..! ఒప్పుకుంటా. కానీ ఊరికే కాలక్షేపానికి.. నాకోసం.. సినిమాకు రాకూడదు? మా ఆఫీస్‌ కాంగనే వెళ్ళి వద్దాం రేపు.. నవలకన్నా మంచి వ్యూ వస్తుంది.."
            "వద్దులేరా.. నాకు ఆసక్తి లేదు.."
            "ఏం కాదు.. నేను మీతో మీ కార్యక్రమాలకు రాననేగా.."
            "కాదులేరా.. నిజంగ థియేటర్‌ వాతావరణం నాకు పడదు. చీకటిగా ఉంటే ఉక్కినట్టవుతుంది. ఆ డిజిటల్‌ సౌండ్లు చెవులు తూట్లు పొడుస్తాయి.. తల నెప్పి.."
            "సరే, మీ ఇష్టం.."

                *                      *                      *

            "ఇంతవరకూ మిమ్మల్ని అలరించి ఆనందడోలికల్లో ముంచెత్తిన కమ్మని గళానికి ఇక కొద్ది క్షణాల్లో మా సంస్థ తరఫున చిన్న సత్కారం.. దయచేసి ఆలస్యానికి మన్నించి శ్రోతలందరూ ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన.."
            "ఇంక బయల్దేరితే మంచిది.. ఇంట్లో మావాళ్ళు ఎదురు చూస్తుంటారు. వెళ్ళొస్తానండీ.."
            "అట్లగే. పాపం వాళ్ళేదో సన్మానాన్ని జయప్రదం చేయమన్నారు.. నేనదేదో చేసే బయల్దేరతా.."
            ఆయన నవ్వి వెళిపోయారు.. కార్యక్రమం సాగుతుండగ.. "హలో సర్‌.. నమస్కారం.."
            "నమస్కారం.. చెప్పమ్మా.."
            "సర్.. నేను కార్యక్రమం గురించి రిపోర్ట్‌ వ్రాయటానికి వస్తుంటే మధ్యలో బండి చెడిపోయి ఆలస్యం అయిపోయింది. మొత్తం మిస్‌ అయ్యాను.. కాస్త ఏం జరిగిందో పైపైన అయినా చెప్తారా..?"
            "ఎవరమ్మా నువ్వు..? ఎక్కడైనా రిపోర్టరువా..? ఏ పేపరు..?"
            "అంటే.. పేపరే కానీ.. ఎక్కడా ఇంకా పర్మనెంట్‌ కాలేదు. మొన్నే ఎమ్మే జర్మలిజమ్‌ పూర్తైంది.. ప్రస్తుతం ఖాళీగ కూర్చోవటం ఎందుకని ఫ్రీలాంసర్‌గ పనిచేస్తున్నాను.. మంచి ఆర్టికల్స్‌ రాస్తే కాస్త పేరు వచ్చి ఉద్యోగం వస్తుందని ఆశ.. కల్చరల్‌ రిపోర్టర్‌నవ్వాలని ఆశ.."
            "సరే, దానికేం భాగ్యం.. వ్రాసుకో.." అని తన పాకెట్‌ డైరీ తెరిచి వరసగా ఏమేం జరిగిందో, ఏయే వక్తలు ఏమేం మాట్లాడారో, సంగీత కచేరీలో ఏమేం కీర్తనలు ఏయే రాగాల్లో పాడారో, ఏవి వింటూ జనాలు తన్మయులయ్యారో, ఏవి పెద్దగా అంత ఆనందాన్ని కలిగించలేదో.. అన్నీ చెప్పాడాయన.
            ఆ అమ్మాయికి ఆయన పద్ధతి ఎంతో నచ్చింది. అంతా వ్రాసుకున్నాక ఆశ్చర్యంగ- "అబ్బ.. ఎంత బాగ చెప్పారు..! మీరు ఎక్కడైనా జర్నలిస్ట్‌గ పని చేశారా సర్‌...?"
            ఆయన నవ్వారు. "లేదమ్మా.. నేను సెంట్రల్‌ ఎక్సైజ్‌లో పని చేసి రిటైరయ్యాను.. ప్రస్తుతం ఖాళీ సమయాన్ని ఈ విధంగ సద్వినియోగం చేసుకుంటున్నాను.."
            "ఓహో.. ఏయే కార్యక్రమాలకు వెళతారు..?"
            "సంగీతం, సాహిత్యం, గుళ్ళు గోపురాలు, హరికథలు, నృత్యం... ఏదంటే అది. పుస్తకావిష్కరణల నుంచి తోలుబొమ్మల ఆటల దాకా అన్నింటికీ వెళతాను. కళలంటే అభిమానం. ఇన్నేళ్ళూ ఉద్యోగంతో తీరిక కాలేదు. అందుకే ఇప్పుడు ఎక్కడ ఏ సభా సమావేశం జరిగినా ఓ శ్రోతగ వెళ్తుంటాను. వేదికనెక్కిన వారికి కాస్త ఆనందం కలిగిస్తూ చప్పట్లు కొడుతుంటాను.."
            ఆమె నవ్వింది. "చాలా ఆనందంగా ఉందండీ మిమ్మల్ని కలిసి..! చాలా మంచి దారి ఎంచుకున్నారు. మీ అభిరుచి నాకు చాలా ఉపయోగకరంగ ఉండేటట్టు ఉంది. మీ పరిచయం కావాలి. నా పేరు గీతిక.. మీ పేరేంటి..?"
            "విశ్వనాథం.. చాలా సంతోషమమ్మా.."
            "మీకేం అభ్యంతరం లేదంటే మీ నెంబరు ఇస్తారా..? నాకు మీతో స్నేహం చేయాలని ఉంది.."
            ఆయన చకితుడై చూశాడు. పక్క సీట్‌లో కూర్చున్న ఒకాయన వీరి వంక అనుమానంగ చూశాడు.
            ఆమె నాలిక కరుచుకుంది. "అంటే.. అట్ల కాదండీ.. ఐ మీన్‌... స్నేహం అంటే.. వేరేగా కాదు.."
            విశ్వనాథం నవ్వాడు- "ఊరికే ఆటపట్టించానులేమ్మా. కంగారుపడకు. నాకు తెలుసు. స్నేహం అంటే ఎప్పుడూ ఒకే అర్థం ఉంటుంది. సహృదయ భావన. ఎప్పుడైనా కాల్ చేయవచ్చు.. ఇదిగో నా కార్డు.. ఆఫీస్‌ నెంబరు వద్దు. ఇంటి నెంబరు ఉంది కదా, దానికి చెయ్యి.."
            "థాంక్యూ సర్.. మిమ్మల్ని అంకుల్‌ అనచ్చా..?"
            "తాతయ్య ఐనా అనచ్చు." నవ్వాడాయన. పక్క సీట్‌లో కూర్చున్న వ్యక్తి కూడా నవ్వాడు.         
            "నాకు అంకుల్‌ చాలు. ఇది పేపర్‌లో పడితే మీకు ఫోన్‌ చేసి చెప్తాను. తప్పక చదవాలి. సరేనా?"
            "ఓ.. తప్పక.. పేరేంటన్నావ్‌..?"
            గీతిక అని చెప్పి ఆమె శెలవు తీసుకుని వెళిపోయింది.

                    *                      *                      *
            రెండురోజులు ఆగి ఫోన్‌ చేసింది.
            "అంకుల్‌.. నేను.. గీతిక.."
            "గీతికా.. నీ ఆర్టికల్‌ నేను అప్పుడే చదివేశాగా.."
            "ఓ.. అప్పుడే చదివేశారా..? అయితే మీ ఇంట్లో ఎక్స్‌ప్రెస్‌ పేపర్‌ వస్తుందా..?"
            "యస్‌.. కానీ.. ఏ పేపర్లో పడ్డా చదివేవాణ్ణే.. సండే అన్నీ తెప్పిస్తాను.."
            "ఓహో.. అదనంగ చాలా విషయాలు చదవవచ్చనా..? ఇంతకీ ఎట్ల ఉంది నా లేఖనం..?"
            "అది నేను ఫోనులో చెప్పను. చర్చ చేస్తాను. దానికి నువ్వు నన్ను కలవాలి.. నేరులో చెప్తా.."
            "సరే.. ఇవాళ సాయింత్రం రవీంద్రభారతిలో కూచిపూడి నృత్య కార్యక్రమం ఉంది.. కలుద్దామా..?"
            "తప్పక వస్తాలే.. ఆ అమ్మాయి మా పాత కొలీగ్‌ కూతురే.. అతను కూడా రమ్మన్నాడు.."
            "అంత గొప్ప డాంసర్‌ మీ పరిచయస్తులా! మై గాడ్‌! ఐతే నాకొక ఇంటర్వ్యూ ఇప్పించగలరా?"
            "ఒక్కటేంటి.. ఎన్ని కావాలన్నా తీసుకో. పెద్దది కావాలా, చిన్నదా? మీ ఇంటికి పిలిపించమన్నావా.. వాళ్ళ ఇంటికే వెళ్ళి తీసుకుంటావా?"
            గీతిక నోట మాట రాలేదు. "మీరు సామాన్యులు కారు.."..

                *                      *                      *
           
            "ఇంటర్వ్యూ తీసుకున్నావా.. అన్నీ చెప్పిందా..?"
            "ఓ.. అద్భుతంగ. అడిగిందానికన్నా బాగా చెప్పింది. మీ పేరు బాగా పని చేసింది. మీ ద్వారా వచ్చాను కాబట్టి మాట్లాడిందంటా.. లేదంటే తనకు పేపర్‌ వాళ్ళన్నా, మీడియా వాళ్ళన్నా చిరాకట.."
            "అవకాశం దొరికితే చాలు.. ప్రశ్నలతో పొడిచి, తుడిచి, నలిచి, గిల్లి, గిచ్చి ఊరికే విసిగిస్తారని.."
            "అదేంటి అంకుల్‌.. అట్ల అంటారు..?"
            "నువ్వు కాదమ్మా.. వేరే వాళ్ళు.."
            "ఇంతకీ నా లేఖ ఎట్ల ఉందో చెప్పారు కాదు.."
            "బాగా రాశావు.. నాకెంతో నచ్చింది. భావం బావుంది. కానీ అక్కడక్కడా కొంచెం భాష తప్పింది. ఇంకా కాస్త పద్ధతి కూడా మెరుగు చేసుకోవాలి. ఇట్ల విమర్శించేశానని ఏమీ అనుకోవు కదా.."
            "అయ్యో.. ఎంత మాట..! మెరుగు పడద్దని ఎవరికి ఉంటుంది చెప్పండి? ఏం చేయమంటారు?"
            "నీకు మంచి భాష రావాలంటే కొన్ని చిట్కాలు చెబుతాను.. కొన్ని పుస్తాకలున్నాయి. కొందరు రచయితలున్నారు.. తర్వాత కొన్ని టీవీ కార్యక్రమాలు చెబుతాను.. నీకు తెలిసినవే అయితే వదిలెయ్‌.." అని అవన్నీ వివరంగ రాసిన ఓ కాగితం ఆమె చేతిలో పెట్టాడు.
            ఆమె అది చదివి- "ఇవన్నీ నాకు తెలిస్తే తప్పులెందుకు వ్రాస్తాను? ఇవి నాకు కొత్తే. ఈ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి.. కొని అయినా చదువుతాను. నాకు ఈ ఊరు కొత్త కదా.." అంది.
            ఆయన వాటి వివరాలు కూడా చెప్పి, "కావాలంటే నాతో రా. నేను ఆదివారాలు అట్ల ఊరికే పుస్తకాల దుకాణాలలో తిరగటానికి వెళ్తుంటాను.. పనిలో పనిగా నీకు చూపించేస్తాను.." అని చెప్పాడు.
            ఆమె వెంటనే ఒప్పుకుంది. "మీరు ఎట్ల వెళతారు.?"
            "బస్సులోనో, నడిచో.."
            "అయితే ఒక షరతు. మిమ్మల్ని నా బండి మీద తీసుకు వెళతాను.."
            "నీకేమీ ఇబ్బంది కాదా..?"
            "ఏం ఇబ్బందవుతుంది..?"
            "ఎవరైనా అడిగితే...? ఎవరీ అబ్బాయి.. ఇతనితో నీకేం సంబంధం అని..?"
            ఆ అమ్మాయి నవ్వేసింది. "మీరంత యంగ్‌గ ఉన్నారనా, నేను అంత ఓల్డ్‌గ కనిపిస్తున్నాననా? మరేం భయం లేదు. ఎవ్వరూ అడగరు. అడిగేవారెవరూ దగ్గరలో లేరు. చాలా దూరం వెళిపోయారు."
            "అంటే..?"
            "అంటే.. చిన్నప్పుడే అమ్మా నాన్నా చనిపోతే మా అత్తా, మామయ్యా దగ్గర పెరిగాను. వాళ్ళది కాస్త చిన్న ఊరు. మామయ్యది చిన్న ఉద్యోగం.. చదువు వరకు చెప్పించి ఇంక మా వల్ల కాదన్నాడు.. ఇట్ల పెద్ద ఊర్లైతే కాస్త ఉద్యోగాలకు ప్రయత్నం చేసుకోవచ్చని వచ్చేశాను.."
            "ఓ..అట్లాగా.. అయ్యో.. అయితే ఎక్కడ ఉంటున్నావు మరి..?"
            "లేడీస్‌ హాస్టల్‌లో. కానీ ఫరవాలేదు.. ప్రస్తుతానికి మా స్నేహితురాలు తన అంకుల్‌ నడిపించే ఓ ఇంగ్లీష్‌ ఇంస్టిట్యూట్‌లో టీచర్‌గ చేర్పించింది. ఇంకేదైనా మంచి ఉద్యోగం దొరికేవరకు గడపగలను.."
            "అరెరే.. నాకు ముందే చెప్పద్దా.. ఈ మాట..?"
            "ఎందుకు..?"
            "నేనే ఓ వార్తాపత్రిక తెరిచైనా నిన్ను మెయిన్‌ ఎడిటర్‌గ అపాయింట్‌ చేసేవాణ్ణే.."
            ఆమె నవ్వింది- "ఇప్పటికైనా ఓకే.. తెరవండి.. వెంటనే చేరిపోతా.. అంతకన్నా నాకేం కావాలి..?"
            "దానికి కాస్త ఆలస్యం అవ్వచ్చు. ఈలోపు నువ్వు వీలు చూసుకుని వెళ్ళి ఈ వ్యక్తిని కలువు."
            "ఎవరాయన..?"
            "నాకంటే ముందే ఈయన పత్రిక తెరిచేశాడు. ఇదిగో ఫోన్‌ నెంబరు.. నా కార్డు. కాస్త నారికేళపాకం.. జాగ్రత్త.. ముందే నువ్వు పగలగొట్టాలి. కొట్టేటప్పుడు బలంగ కొట్టాలి. పగిలాడంటే చలవ చేసే కమ్మటి తియ్యటి నీరే... లేదంటే వాడు నిన్ను పగలగొట్టేస్తాడు.."
            "మీ పేరు చెప్పింతర్వాత కూడానా..?"
            "అంటే.. నిన్నటి దినపత్రికలో వాళ్ళకు రిపోర్టర్లూ తదితరులూ కావాలని ప్రకటన వేశారు. పని అవుతుందేమో చూడు.. కాదంటే కార్డ్‌ తియ్యి.. సరేనా..?"
            "సరే అంకుల్‌.. థాంక్యూ.. రేపే వెళతాను.."

                    *                      *                      *

            "ఈ కార్యక్రమం చాలా బావుంటుంది.. వేరే సంగీతం వాటిలా కాదు.. ఏదో కొత్త ప్రయోగం అట.. రారా.. ఐదొందల రూపాయలు టికెట్టుట.. రెండు ఎంట్రీ పాసులు సంపాదించాను.. అది కూడ ఫ్రీగ.."
            "లేదు నాన్నా.. నాకు ఆసక్తి లేదు.. మీరు వెళ్ళి రండి.."
            "ఇంట్లో ఒక్కడివి ఏం చేస్తావు..? బోర్‌ కొట్టిందంటావు మళ్ళీ.."
            "లేదులే. ఓసారి ఆంటీ వాళ్ళింటికి వెళ్ళి వస్తాను. ప్రభాత్‌ మొన్న పుస్తకప్రదర్శనలో భారతీయ భాషాశాస్త్రం మీద ఏవో పుస్తకాలు కొన్నాడట. మొన్న అంకుల్‌ పార్కులో కనిపించి ఓసారి రమ్మన్నారు."
            "కానీ ఆ ఆంటీ కూడ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. నిజానికి రమ్మని చెప్పి పాసులు ఇచ్చింది కూడా ఆమే. నీకొకటి, నాకొకటి..! ఈ గాయని ఆమె ఫేవరిట్‌ గాయని కదా.. ఎట్ల వదులుకుంటుంది..?"
            "ప్రభాత్‌ ఉంటాడులే నాన్నా.. అంకుల్‌ అయితే ఎటూ వెళ్ళరు కదా.."
            "ఒక్క కార్యక్రమానికి రావు.. నువ్వెక్కడ దొరికావురా నాకు..?"  
            "అదేంటి నాన్నా.. అట్ల మాట్లాడతారు? అప్పుడు సితార్‌ రిసైటల్‌కి రాలేదా? ఏదో సాహిత్యసభకు మిమ్మల్ని తీసుకెళ్ళి దింపి తీసుకురాలేదా..?"
            "ఎప్పుడో పాత రాతి యుగంలో.. ఏదో అరసారి.. పావుసారి.."
            "నాకు ఆసక్తి ఉండదని తెలుసు కద నాన్నా.."
            "నువ్వెక్కడ పుస్తకాల పురుగువురా! ఎంతసేపటికి ఆ చామ్స్‌కీ, సాసూర్‌ అని యావ తప్ప బొత్తిగ కళా సంస్కారమే లేదు. మీ అమ్మే నయం నీకన్నా..! కనీసం టీవీ కార్యక్రమాలకన్నా కంపెనీ ఇస్తుంది.."
            "అది ఆ కార్యక్రమం మీద అభిరుచితోనో ఆసక్తితోనో కాదు నాన్నా..! ఏదో మీరు బాధపడతారని.. కంపెనీ లేక బోరవుతారని.."
            "ఏడ్చావులే.. మొత్తానికి భలే దొరికారు.. అమ్మా కొడుకులు.."
            "అమ్మ కూడా నీకు దొరికిందేనా నాన్నా..? మీది సాంప్రదాయిక వివాహం అని చెప్పారు మరి.."
            "ఒరేయ్‌.. పని చూస్కో పోరా..! ఎట్ల చేసుకుంటే ఏంటి..? నువ్వొకడివి పుట్టేశావుగా..!"

              *                      *                      *

            "ఏంటోయ్‌ ఇంత ఆలస్యం చేశావు..? నీకోసమే చూస్తున్నా.."
            "ముందే బయల్దేరాను అంకుల్‌.. వచ్చేసేదాన్నే.. కానీ అనుకోకుండ ఆలస్యమైంది.."
            "ఎందుకు..?"
            "మీరున్నారు కదా.. ఏం జరిగిందో ఎట్లాగూ చెప్పేస్తారు.. అదే ధైర్యంతో కాస్త లేట్‌గ వచ్చాను.."
            "పోనీలే.. అసలంటూ వచ్చావు కదా... రావేమో అనుకున్నా.."
            "మిస్‌ అయ్యారా..?"
            "నేనెట్ల మిస్‌ అవుతానమ్మా..? నేను మిస్టర్‌ను కదా.. మిస్‌ నువ్వే.."
            నవ్విందామె. "నేను మిస్‌నే.. కానీ కార్యక్రమాన్ని మాత్రమే మిస్‌ అయ్యాను.. మిమ్మల్ని కాదు.."
            "నీ నవ్వులో జీవం లేదు.. నటించకు.. చెప్పు.. ఏం జరిగింది..?"
            "ఆఁ.. ఏదోలేండి.. వదిలేయండి.. అయిపోయిందిగా.."
            "లేదు. అయిపోలేదు. ఏదో చిరాగ్గ ఉన్నట్టున్నావు.. ఎవరైనా ఏదైనా అన్నారా..?"
            "అదే కానీ.. చిరాకు ఇప్పుడు తగ్గింది. అంత పెద్ద విషయం ఏం కాదు లేండి.."
            "పోనీ.. చిన్న విషయమే.. ఆ స్టేజి మీది సోదికన్నా నయంగ ఉంటుందేమో చెప్పు.."
            "మా ఇంస్టిట్యూట్‌కి ఒక ట్యూటర్‌ వస్తుంది లేండి.. ఆమె పెద్ద వాదు పెట్టుకున్నది.. చేరిన రోజు నుంచి చూస్తున్నా.. ఏ రోజూ ఏదో ఓ గొడవ పెట్టుకోనిది వదలదు.."
            "గొడవా..? ఏం గొడవ..? దేని గురించి..?"
            "ఏదో ఒకటి. నా భాష, యాస గురించే!"
            "ఏమైంది నీ భాషకు..?"
            "చెప్పా కదా.. ఊర్లో చదువుకున్నానని. అందువల్ల ఏక్సెంట్‌ అస్సలు బావుండదు. ఎమ్మే చేసింది కూడా దూరవిద్యలోనే. ఇంక ఏం వస్తుంది పెద్ద పట్టు..? ఏదో ప్రైమరీ స్థాయి విషయాలు బోధించమంటే చెబుతూ పొట్ట పోసుకుంటున్నాను.. ఈమె అదీ బతకనిచ్చేటట్టు లేదు.."
            "ఏమంటుంది..?"
            "నా ఏక్సెంట్‌ బాలేదంటా.. మాది గోదావరి జిల్లా.. ప్రభావం ఉండనే ఉంటుంది కదా.. దాన్ని ఏం చేసి మార్చుకోగలను చెప్పండి..? నాకు తెలుసు. కనక ఆమె మాట పట్టించుకోకుండ వదిలేస్తున్నాను.."
            "సరే, మంచిది. ఆ వదిలిన సంతోషంలో ఈ స్వీట్‌ తీసుకో.."
            "అబ్బ.. నాకిష్టమైన హల్వా... థాంక్యూ.. దేనికి ?"
            "నీకు ఉద్యోగం వచ్చేసింది కదా.. కంగ్రాట్స్‌.."
            "అరే.. మీకు అప్పుడే తెలిసిపోయిందా..? నేను ఈ రోజు కార్యక్రమం చూడటానికన్నా మీతో ఈ మాటే చెప్పాలని వచ్చాను. థాంక్స్‌. కానీ నేను అక్కడ మీ కార్డ్‌ తీయాల్సిన అవసరమే పడలేదు. మీరు ముందే ఏమైనా పొలం దున్ని కానీ ఉంచారా..?"
            "లేదు."
            "మరి.. విత్తెట్ల నాటుకుందబ్బా..?"
            "అసలా పొలం గురించి నాకేం తెలియదు. కానీ నీ విత్తు అక్కడ నాటుకుంటుందని తెలుసుగా."
            "అదేంటి..?"
            "ఔనమ్మా.. నిజానికి నాకు అతని గురించి నేరుగ ఏం తెలియదు. పరోక్షంగ కొంత తెలుసు. నువ్వు కార్డ్ తీయాల్సిన అవసరం రాదని మాత్రం తెలుసు."
            "మరి ఎందుకిచ్చారు?"
            "అది ఉంటే ఆత్మవిశ్వాసం పెరిగి, ఉద్యోగం రాకపోతే ఇది తియ్యచ్చులే అనే ధైర్యం ఉంటుంది"
            "నేను కార్డ్‌ ఉంది కదా అని విర్రవీగి ఉంటే..?"
            "అటువంటి దానివైతే నేను కార్డ్‌ ఇచ్చేవాణ్ణే కాదు.. అయినా చేతకాని పనుల జోలికి పోకూడదు."
            "అంటే నాకు విర్రవీగటం చేతకాదనా..?"
            "ఏఁ.. కాదంటే అవుతుందని నిరూపిస్తావా..?"
            "లేదులే.." ఆమె నవ్వింది. "మీరు చెప్పినట్టే ఆయన నిజంగనే నారికేళపాకం. నాలుగైదు విధాల తల తిన్నాకే ఉద్యోగం ఇచ్చాడు.. కల్చర్‌ రిపోర్టర్‌గనే దొరికింది. హల్వా బావుంది.. ఇంట్లో చేసిందానిలాగే ఉంది.. ఎవరు చేశారు.. మా ఆంటీయా..?"
            "లేదమ్మా.. మీ ఆంటీ నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనే రకం కాదు. జీవితాంతం కలిసి ప్రయాణం చేస్తానని అగ్నిసాక్షిగ మాట ఇచ్చి కూడ మధ్యలోనే రైలు దిగి వెళిపోయింది. ఓ పదేళ్ళయిపోయింది.."
            గీతిక బాధ పడింది. "సారీ అంకుల్‌.. అస్సలు అనుకోలేదు. నేను ఇంకా మీ ఇంటికి వచ్చి ఓసారి ఆంటీని చూడాలని మనసులో అనుకుంటున్నాను. ఐతే మరి హల్వా మీరే చేశారా..?"
            "ఊఁ.. నేనే.. నీకోసమే. నీ ఉద్యోగం కూడ ఈ హల్వా లాగే తియ్యగా సాగాలి.."
            "థాంక్స్‌ అంకుల్‌.. కానీ ఎందుకో బాస్‌ను చూస్తే అక్కడ పని చేయాలంటే కాస్త బెంగగనే ఉంది.."
            "ఏం బెంగపడద్దు.. ఎక్కడైనా ఓ బాస్‌ ఉండక తప్పదు.. వాళ్ళ కింద పని చెయ్యకా తప్పదు..
సాధారణంగ బాస్‌లుగా ఉన్నవాళ్ళంతా క్రమశిక్షణాపరులు ఉంటారు. అదే కొందరిలో ఇంకాస్త ఎక్కువ పాళ్ళు కూడా ఉండవచ్చు. అటువంటి పని రాక్షసులను మనం మెప్పించగలిగేది మంచి పని చేసే."
            "మీ ఈ సలహా తప్పక పాటిస్తాను."
            "అయితే ఇంకొకటి కూడ చెబుతాను. ఆ ఇంగ్లీషు ఇంస్టిట్యూటు మానేయి.."
            "తప్పకుండ.. ఇవాళే వెళ్ళి చెబుతాను.. నాకిక ఆ అవసరం కూడా లేదు కదా!"
           
                   *                      *                      *         

            "అరెరే.. గీతికా నువ్వా.. ఇక్కడేంటి..?"
            "ఇదే మా ఆఫీస్‌.. ఇప్పుడే లంచ్‌కు పండ్లు కొందామని కిందకు వచ్చాను. రండి.. లోపలకు.."
            "వద్దమ్మా.. వెళ్ళాలి.. ఇప్పటికే ఆలస్యమైంది."
            "ఔను.. మీరేంటి ఇక్కడ..?"
            "నేనిక్కడ. అది.." అని నవ్వేశాడు. "సరే. చెప్పేస్తున్నా.. వయోలిన్‌ నేర్చుకుంటున్నాను."
            "మీరా.. వయోలినా.. అబ్బ.. నిజమా..? ఎవరు.. ఎక్కడ..?"
            "ఇక్కడే.. దగ్గరే.. వెళ్తున్నా.. వస్తావా..?"
            "నేనా..! అంటే.. ఇప్పుడు ఇంకో అరగంట లంచే..! రావచ్చు. కానీ, దేనికి..?"
            "రా. కంపెనీకి అనుకో.." ఇద్దరూ కలిసి ఏదో మాట్లాడుకుంటూ కొంచెం దూరంలో ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు. గేటు తీసుకుని లోపలకు వెళ్తూ, "నీకు వెంటనే నీ భాష, యాస మార్చుకునే అవసరం ఉంది అనుకున్నావు కదా. నువ్వు కావాలంటే నాకు తెలిసిన ఒక ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌ ఉంది. సంయుక్త. రిటైరైయాక కూడా ఎమరిటస్‌గా పని చేస్తోంది. ఆమె దగ్గర నీ భాష మెరుగు పరుచుకో. ఏఁ..?" అడిగాడాయన.
            గీతిక కళ్ళలో ఆనందం. "అబ్బ! సంయుక్త గారా?! మా దూరవిద్య కేంద్రంలో కాంటాక్ట్‌ క్లాసుల్లో ఆమె పాఠాలు విన్నాను. అద్భుతమైన వ్యక్తి. నేను తప్పక వెళతాను. అడ్రస్సు, ఫోన్నెంబరూ ఇవ్వండి.."
            గీతిక ఉత్సాహానికి గొంతు పెరిగేసరికి పైన బాల్కనీలో ఉన్న ఒకామె వీరిద్దరి వంక చూసింది.
            "ఓహో.. అంత తొందరా..? ఎప్పుడు కలవాలనుకుంటున్నావు..?"
            "ఆఫీస్‌ కాంగనే. లేదంటే ఇప్పుడు డ్యూటీ మానుకుని అయినా సరే, వెంటనే వెళిపోతాను."
            "ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు.. ఐనా నువ్వామెను ఇప్పుడే కలవ్వచ్చు.."
            "ఔనా.. ఎట్ల..?"
            "ఇప్పుడు ఆ పైన బాల్కనీలో కూర్చుని నీ వంక చూస్తోందే.. ఆమెను ఓసారి పలకరించి చూడు.."
            గీతిక ఆమెను చూసి పోల్చుకుంది. "అరే, సంయుక్తా మేడమా! బాగున్నారా? నమస్కారం."
            సంయుక్తగారు ఆమె ఉత్సాహం చూసి నవ్వింది. "గీతిక కదూ.. గుర్తు పట్టాను. ఎట్ల ఉన్నావు..?"
            సరే, ఇంట్లోకి వెళ్ళాక కాసేపు అక్కడే మాట్లాడాక సంయుక్తగారు గీతికకు పాఠాలు చెప్పటానికి ఒప్పుకుంది. మరుసటిరోజు నుంచే రమ్మని చెప్పింది. తర్వాత వాళ్ళాయన వచ్చేసరికి శెలవు తీసుకుని లోపలకు వెళిపోయింది. ఆయనే విశ్వనాథానికి వయోలిన్‌ నేర్పే గురువని గీతికకు అర్థమైంది.
            అప్పటికి శెలవు తీసుకుని ఆఫీసుకు వెళిపోయింది గీతిక.
            వయోలిన్‌ క్లాస్‌ అయిపోయాక ఆమె ఆఫీసుకు వెళ్ళాడు విశ్వనాథం.
            గీతిక కళ్ళలో ఆనందం చెరగలేదు. "అబ్బ.. అంత మందిలో నన్ను ఎట్ల గుర్తుంచుకుంది ఈమె?"
            "క్లాసులో అల్లరైనా చేసి ఉండాలి.. ప్రశ్నలైనా వేసి ఉండాలి.."
            "అల్లరి కాదు. కానీ అది ప్రశ్న కూడ కాదు. ఒక్కటే చిన్న సవరింపు లాంటిది. రవీంద్రనాథ్‌ టాగూరు పాఠం చెబుతుంటే మా పాఠ్యపుస్తకంలో చెప్పినట్టు ఆయన కవిత్వాన్ని పాశ్చాత్య దృష్టితో కాక భారతీయ విమర్శనాదృష్టితో పరిశీలిస్తే బావుంటుంది కదా అని. అప్పుడామె నేనేమైనా అటువంటి ప్రయత్నం చేశానా అడిగితే నోట్సు చూపించా. చదివి బావుందన్నారు. అన్నారు కదా అని తీరా అదే పరీక్షలో వ్రాశాక.."
            "మార్కులు తగ్గించేశారా..?"
            "ఏకంగ ఫెయిలే చేశారు. ఏడ్చి మొత్తుకుని రివాల్యుయేషను పెట్టిస్తే సరిగ్గ బార్డరు మార్కులతో పాస్‌ చేశారు. దానివల్ల నా పర్సెంట్‌ కూడ తగ్గింది. కానీ ఈమె విశ్వవిద్యాలయం వేరు లేండి. అతిథి విషయవేత్తగా కేవలం ఆ క్లాసుల కోసం అక్కడికి వచ్చింది అంతే."
            "చూడమ్మా. ఇంకా మన దేశం కొన్ని విధివిధానాల నుంచి పద్ధతి మార్చుకోలేదు. కొందరు ఇంకా మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నామనే నమ్ముతున్నారు. అందుకే వారి మాటలకు విరుద్ధంగ వ్రాసేసరికి ఆంగ్లేయులకు అన్యాయం జరిగిపోయిందని బాధపడి మనకు శిక్ష వేస్తూంటారు. కొలిచేది మనలను మనమే అయినా కొలమానాలు వారివే కావాలని, వారికన్నా వీరికే పట్టింపు ఎక్కువ.."
            "అయితే నేనట్లా వ్రాయటం తప్పంటారా..?"
            "నువ్వు వ్రాయటమూ తప్పు కాదు.. అట్లగే వాళ్ళు నిన్ను తప్పించటమూ తప్పు కాదు. కానీ దాని గురించి నువ్వు బాధపడటం మాత్రం తప్పు. విద్యార్థిదశలో సృజనాత్మకత ఉన్నప్పుడు ఎక్కడో అక్కడ దానికి కొంత రుసుము చెల్లించుకోక తప్పదు. అదే ఆ రివాల్యుయేషను ఫీసు అనుకో.." 
            "కానీ దానివల్ల అత్తా మామయ్య చేత ఎన్ని తిట్లు తిన్నానో..! నేను బలాదూర్‌ తిరిగి చదువు నిర్లక్షం చేశాను కాబట్టే తప్పానని వాళ్ళ నమ్మకం. మిగితావన్నీ డెబ్భైపైనే వచ్చినా నమ్మలేదు. ఆ ఒక్కటి తప్పిందని ఇంట్లోంచి గెంటేసి.."
            చెబుతూ చెబుతూ ఆగిపోయి ఠక్కున చూసి తల దించుకుంది గీతిక.
            విశ్వనాథం ఆమె వంక చూసి బరువుగ నిట్టూర్చాడు. "అర్థమైందిలేమ్మా. ఫరవాలేదు. ప్రతీదానికి ఓ ప్రయోజనం ఉంటుంది. నువ్వు ఇక్కడికి రావటం వల్ల నీకు మంచి ఉద్యోగం వచ్చింది కదా..! మంచి వ్యక్తి- సంయుక్తగారు పరిచయం అయింది కదా."
            "నిజమేననుకోండి.. ఇది వెల కట్టలేని బహుమానమే.. మీ వల్లే నాకు ఈ లాభం.."
            "ఇదివరకు మా పక్క ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుని మారేసరికి, పాఠాలకు తిప్పలు. రోజూ ఇక్కడిదాక రావాలి. మీ ఆంటీ, ఆమే స్నేహితురాళ్ళు. మీ ఆంటీ కూడ బోటనీ మాష్టరు.."
            "ఓహో.. అట్లగా.. పువ్వుల టీచరన్నమాట.."
            విశ్వనాథం నవ్వాడు. "ఇప్పుడొక ఆఫర్ ఉంది.. వాళ్ళు వాళ్ళ మనవరాలికి ట్యూషను కావాలని చూస్తున్నారు. రెండో క్లాసు. మంచి తెలివికలది. ఇంటికెళ్ళి చెప్పటం నామోషి కాకపోతే.. బాగనే ఇస్తారు. అదనంగ సంపాదించుకోవచ్చు."
            "అయ్యో, దానికేంటి..? ఆఫీసుకు ఇంత దగ్గర.. నాకూ సమయం కలిసొస్తుంది. ఐదింటికల్లా ఆఫీసు అయిపోతుంది. ఇంక ఇంస్టిట్యూటుకు వెళ్ళేది ఆరున్నరకు. ఈ మధ్య ఖాళీలో.."
            "అదేంటమ్మా..? ఇంకా అది మానేయలేదా..?"
            "అంటే.. అది.. మా స్నేహితురాలు గొడవ చేసింది. వదిలి పెట్టద్దని.. అందుకే.."
            "సరే. పోనీలే. ఓపిక ఉన్నప్పుడే కదా కష్టపడేది. అన్నం పెట్టే చేతిని ఎందుకు వదులుకోవాలి..?"
            "అంకుల్‌, మీ మాటలు నాకు చాలా ధైర్యాన్నిచ్చాయి. నాకు ఇవి కొత్త కాకపోయినా కానీ మీ నోట వింటే బాగుంది. ఇక నాకే సలహాలూ సంప్రతింపులూ కావాలన్నా మిమ్మల్నడుగుతా.. నన్ను దీవించండి."
            "అరెరే.. ఇదేంటి..? కాళ్ళకు నమస్కరించావు..? ఇక్కడే ఆఫీసులోనే.."
            "ఏమో.. నాకు నమస్కరించాలనిపించింది. మనం మొదటిసారి కలిసనప్పుడే అట్ల అనిపించింది.."
            ఆ అమ్మాయి వంక వాత్సల్యం నిండిన చూపులతో అభిమానంగ చూశాడాయన.      

                 *                      *                      *

            "హలో.. ఒక్క నిముషం.. నేను చెప్పేది ఒక్కసారి వినేయండి మరి.."
            "ఏంటి వినేది? ఎందుకు వినాలి? అక్కడ ఇంస్టిట్యూట్‌లో కుదురుగ పాఠాలు చెప్పుకోనివ్వరు. మానేస్తున్నానంటే పెద్ద గొడవ చేసి, ఇమోషనల్‌ సీన్‌ పెట్టి ఆపించారు. మేడమ్‌ దగ్గర ప్రశాంతంగ పాఠం విననివ్వకుండ అక్కడా కాల్చుకు తింటున్నారు. అది చాలనట్టు ఇప్పుడు ఇక్కడ నాకు కావాల్సిన పుస్తకాలు తీసిపక్కన పెట్టుకుని, షాప్‌ చూసి వచ్చేలోపు మీరు బిల్‌ కూడ చేయించేసుకున్నారు. ఇంక ఏంటి వినేది?"
            "అది.. అంటే.. అసలు ఇంస్టిట్యూట్‌లో మీ స్నేహితురాలు నన్ను నానా మాటలూ అని మీరు అట్ల వెళిపోవటానికి నేనే కారణం అనేసిందండీ. అందుకే ఆపాను. మేడమ్‌ వాళ్ళింట్లో ఒకే సబ్జెక్టు కదా అని మీతో పాటు నేనూ పాఠాలు వినాలనే వస్తున్నా కానీ మిమ్మల్ని కాల్చుకు తినాలని కాదండీ.."
            "ఆఁహాఁ.."
            "ఔనండి. ఒట్టు.. ఇప్పుడు ఇవన్నీ కొనేసింది కూడా నాకోసం కాదండీ.."
            "ఆఁహాఁ.. ఐతే ఎవరి కోసమట?"
            "మీకోసమే.."
            "నా కోసం నేను కొనుక్కోగలను. నాకూ ఉద్యోగం సంపాదనా ఉన్నాయి. మీరెందుకు కొనటం?"
            "అంటే.. అదేమో.. మరేమో.. మిమ్మల్ని చాలా బాధపెట్టేశాను కదండీ.. అందుకు పరిహారంగ.."
            "ఓహో.. అట్లగా..! ఆ సంగతి మీకు కూడ తెలిసిందా?"
            "ఆయ్‌.. మరేనండీ.."
            గీతిక అక్కణ్ణుంచి విసవిసా కదిలింది కోపంతో.
            "అదేంటండీ అలాగెళిపోతున్నారు..? చెప్పా పెట్టకుండ.. మాటైనా ఇనకుండానూ..!! చెట్టంత మనిషి మాట్లాడుతుంటే ఇదేం మర్యాదండీ బాబూ..? చూసేవాళ్ళేమనుకునేస్తారండీ..?"
            "బాధపెట్టింది అప్పుడు కాదు. ఇప్పుడు పెడుతున్నారు! మా ప్రాంతం యాస మాట్లాడుతూ నన్ను వెక్కిరిస్తున్నారు. ఇదేనా మీ ఇంట్లోవాళ్ళు నేర్పిన సంస్కారం? మీది గోదావరి జిల్లా కాదు కదా..!"
            "జిల్లా ఏదైతే ఏంటండీ బాబూ..? మాటకన్నా మనసు ముఖ్యం సుమండీ.."
            "నాకు మీ మాటా వద్దు. మనసూ వద్దు. నన్నొదలండి. మీకో దణ్ణం." గీతిక కదిలింది అక్కడినుంచి.
            "అయ్యో..? పోనీ పుస్తకాలు ముఖ్యం కదండీ.. అదైనా తీసుకోండి.. ఆగండి.. ఓయ్‌.. గీతూ.."
            "ఏయ్‌! గీతూ ఏంటి..? ఫస్ట్‌ మైండ్‌ యువర్‌ టంగ్‌ ఎండ్‌ దెన్‌ యువర్‌ ఓన్‌ బిజినెస్‌ మిస్టర్‌.."
            "వావ్‌! ఆక్సెంట్‌ చాలా మారింది. మేడమ్ శిక్షణ పనిచేస్తోంది. ధార కూడ అదిరింది. అబ్బో..!"
            "ఏయ్‌.. ఏంటా చప్పట్లు..? రోడ్డు మీద..! బుద్ధీ జ్ఞానం ఏం లేవా..?"
            "అట్ల ఒక్క క్షణం ఆగటానికే ఇవి. అదంతా వదిలి, ఒక్కసారి ఇదంతా ఎవరి వల్లో ఆలోచించండి.."
            "----"
            "హలో.. అంత కోపం వద్దు.. చెప్తున్నది నిజమా కాదా? నేనే వెక్కిరించకపోయి ఉంటే మీరు అసలు మీ జీవితంలో మార్పు కోసం ఆలోచించేవారా? నిజం చెప్పండి.."
            "----"
            "చూడండి, అవసరం లేనిది ఎవ్వరూ కష్టపడాలనుకోరు. నేను ఆ అవసరం మీకోసం కుత్రిమంగ తయారు చేశాను. నేను చెడ్డవాణ్ణయినా మీకు మంచి జరిగేలా చూశాను."
            "అంటే..?"
            "చేరినరోజు నుంచి చూస్తున్నా. రోజూ మీ క్లాస్‌ వేళకు వస్తారు, అయిపోంగనే తల వంచుకుని వెళిపోతారు. మీ వెనక జనాలు ఎట్ల నవ్వుకునేవారో, మిమ్మల్ని, మీ భాషను వస్తువుగా చేసుకుని ఎంత జోకులు వేసుకునేవారో మీరు విని ఉండకోపోవచ్చు. నేను మాత్రం విన్నాను.. బాధపడ్డాను కూడా.."
            "----"
            "సిటీలో వాతావరణం మీ ఊరంత స్వచ్ఛంగ ఉండదు మిస్‌. కొత్తగ వచ్చారని అర్థమైంది. సో.."
            "దానికి వెక్కిరించి రెచ్చగొట్టం ఒక్కటే మార్గం కాదు కదా.."
            "ఒక్కటే కాకపోవచ్చు. కానీ కచ్చితమైన మార్గం. ఇంతకన్నా త్వరగా అయ్యే మార్గం ఇంకొకటి ఉంటే చెప్పండి."
            "కాస్త టైం తీసుకుని నెమ్మదిగ నచ్చచెప్తే కాదా? ఏదైనా మీ పద్ధతి చాల నొప్పించే విధంగ ఉంది"
            "పద్ధతి తప్పైనా ఉద్దేశం మంచిదే కదా. నిజంగ మీరు మెరుగవ్వటానికి అడుగు వేశారా లేదా?"
            "అయితే ఇప్పుడు ఏంటంటారు..?"
            "మీరు ఇంత అదిరే యాస సంపాదించినందుకు నన్ను అభినందించాలి.. పార్టీ ఇచ్చినా ఓకే..."
            "ఎందుకు? ఇంకెవరినైనా అమాయకులను ఇట్లగే హింసించి రెచ్చగొట్టటానికి ప్రోత్సాహంగనా..?"
            "అది హింసించటమా? అయ్యో.. ప్రగతిపథంలో నడిపించటం అనుకున్నానే.."          
            "అదయినా సరే..! ఇంక చాలు! హింసామార్గంలోనే వచ్చే ప్రగతి ఎవ్వరికీ అక్కర్లేదు.."
            "ప్రామిస్‌. ఇంకెవ్వరినీ హింసించను. ఆ అవసరం కూడ లేదు. మీరు దొరికేశారు కదా.."
            "అంటే..?"
            "అంటే ప్రపంచంలోనే సాటిలేని అతి పెద్ద ప్రజాతంత్ర భారత ప్రభుత్వం ఏ పురుషుడికైనా ఒకే ఒక్క స్త్రీని హింసించటానికి అధికారం ఇస్తుంది.. జీవితాంతం కోసం..!"
            ఠకీమని చూసింది అతన్ని.
            "యస్‌.. నేను మిమ్మల్ని జీవితాంతం హింసించాలనుకుంటున్నాను.. అదే సమయంలో మీక్కూడ నన్ను హింసించగలిగే సువర్ణావకాశం ఇస్తున్నాను. మీ కసినంతా తీర్చేసుకోండి.. ఏమంటారు..?"
            'నేను ఊహించి ఉండాల్సింది.. ఛ..'
            "ఏయ్‌.. హలో.. ఏంటి.. ఏం చెప్పకుండ అట్ల వెళిపోతారు..? హలో.. గీతికా.. గీతూ.. గీత్‌.. ఛ!!"

                    *                      *                      *                     
            "సర్‌.. నేను సిద్ధంగ ఉన్నాను.. మీకు ఓ మాట చెప్పి పోవాలని వచ్చాను.."
            "అ.. అది.. నువ్వు ఈ రోజు డెస్క్‌ చూసుకో గీతికా.. ఇంటర్వ్యూకు సన్నిహిత్‌ వెళతాడు.."
            సన్నిహితా? "అదేంటి..? మీరు ఎంతో ముందే నన్ను దీనికి సిద్ధంగ ఉండమని చెప్పారు కదా.. సిద్ధాంత్‌ కుమార్‌ అంటే నాకు అభిమానమనీ.. నేనైతే బాగా.. అంటే.. ప్రశ్నలూ అన్నీ సిద్ధం చేసుకున్నాగా."
            "అ.. అది.. నిజమే.. కానీ ఆయన హిందీ భాషీయుడు.. నీకు సరిగ్గ హిందీ వచ్చా..?"
            "అంటే.. మాట్లాడగలను సర్.. క్‌.. కొంచెం ఇబ్బందే కానీ.. బాగా అభ్యాసం చేసి.. అంటే..."
            "అ.. అది.. అందుకే..! అతనికి అయితే కొంచెం కూడా ఇబ్బంది ఉండదు.."
            "అతను వెళతానన్నాడా, మీరు పంపించారా..?"
            "అ.. అది.. నేనే పంపించాను..! వెళతావా అంటే సరే అన్నాడు.. ఏఁ..? ఏదైనా సమస్యా..?"
            "ఏం సమస్య ఉంటే ఏంటి సర్..? నేనైతే వెళ్ళి ఆయనను కలవలేకపోయా కదా.."
            "అ.. అది... ఇప్పటికైనా మించిపోయింది లేదు.. అతనితో పాటు నువ్వూ వెళ్ళు.. ఇంకా అక్కడికి చేరి ఉండడు. ఇంకా ఇంటర్వ్యూకి చాలా వ్యవధి కూడా ఉంది.. బండి మీద నువ్వు తేలిగ్గనే చేరిపోగలవు.."
            "వెళ్ళి ఏం చేయాలి సర్? ఇంటర్వ్యూ అయితే తీసుకోలేను కదా.."
            "అ.. అది.. అయితే ఏంటి? వినగలవు కదా. సన్నిహిత్‌ ఇంటర్వ్యూ భలే జాలీగ ఉంటుంది."
            జాలీగ, మెర్రీగ ఉండటానికి ఆయనేమైనా పాప్‌ స్టారా? గొప్ప భాషావేత్త. ఛ.. ఎంత బాగ సిద్ధం చేసుకుని వచ్చిందో.. ఎన్ని పుస్తకాలు చదివి మంచి పదాలు అభ్యాసం చేసుకుని వచ్చిందో! ఎంత నిరాశ పరచాడీయన..! ఇంతకుముందు తను సంగీతం కాలేజ్‌ మీద వ్రాసుకువచ్చిన రిపోర్టు బాలేదని అతని రిపోర్టు అచ్చు వేశారు. సర్లే, భాష బాలేదేమో అని వదిలేసింది. తర్వాత ఓసారి ఓ చిన్నారి పిల్లలు చేసిన రాధాకృష్ణ నాట్య కార్యక్రమాన్ని ఫోటోలతో సహా తనే స్వయంగ ఎంతో మనసు పెట్టి సంపాదనం చేసి తెస్తే అది కాదని ఆ స్థలంలో అతను తెచ్చిన పుస్తకావిష్కరణ సభ కార్యక్రమం వేశారు. ఇది మూడవసారి..
            "మరి అతను అంత సమర్థుడైనప్పుడు నాకెందుకు పని అప్పచెప్పారు..?"
            "అ.. అది.. అంటే.. అతను ఇదివరకు మన దగ్గర కొంతకాలం చేసి లెక్చరర్‌ పోస్టు వచ్చాక మానేశాడు. ఇన్నాళ్ళకు మళ్ళీ ఫ్రీలాంసర్‌గ చేస్తానంటే సరేనని ఏదో పని ఇవ్వాలి కదా అని.."
            'అతను ఆఫ్టరాల్‌ ఫ్రీలాంసర్‌..! నేను ఇక్కడ వర్కింగ్‌ ఫుల్‌టైమ్‌ రిపోర్టర్‌. ఛ. పరువు తీశాడే'
            "అ.. అరే.. నువ్వు చాలా నొచ్చుకున్నట్టున్నావే! టైంకి కనిపించాడు. పంపాను.. ఇది పెద్ద వ్యాహంతో ఏం చేయలేదు.. కాస్త ముందుగ ఆఫీసుకు వచ్చాడంతే. పంపేశాను. నిన్ను నొప్పించాలని ఉద్దేశంతో చేసింది కాదు. నువ్వింత హతాశురాలివైతావని నేను ఊహించలేదు కూడా.. అయాం సారీ.."
            "ఛ.. ఇట్స్‌ ఓకే సర్.. ఇంత దానికి సారీలెందుకు లేండి.." ఆమె అక్కణ్ణుంచి బయటకు వచ్చేసింది.
           
                  *                      *                      *         
            "ఏంటోయ్.. ప్రదర్శన ఏమీ నచ్చినట్టు లేదు నీకు.. ఏమీ వ్రాయటం లేదు..? అప్పటికప్పుడు అనిపించిన విమర్శలు, మనసులో స్పాంటేనియస్‌గ అనిపించిన భావాలు రాసుకోవాలని చెప్పా కదా.."
            "ప్రదర్శన అద్భుతంగ ఉంది. ఊరికే చూసి వెళదామని వచ్చాను. రిపోర్టేమీ రాయటం లేదు.."
            "ఎందుకట..?"
            "ఏమో.. తెలీదు.. వదిలేయండి.. ప్రతీది రాసే దృష్టితోనే చూసి చూసి బోర్‌ కొట్టిందేమో."
            "కాదు.. మొన్న హస్తకళల ప్రదర్శనలో కూడ ఇట్లగే ఉన్నావు. ఏమైంది? సుగంధ రామన్‌ అంతటి
గొప్ప శిల్పకారిణి వస్తే ఇంటర్‌వ్యూకూ ప్రయత్నించలేదు. మా పక్కింటిపాప మేజిక్‌షో ఇస్తోందంటే కూడ ఆసక్తి చూపించలేదు. ఈ మధ్య నీ ఆర్టికల్స్ రావటం కూడ తగ్గిపోయింది.. వరసగ వెతుకుతున్నా.. ఏమీ కనిపించట్లేదు. వాళ్ళే వేయటం లేదేమో అనుకున్నా.. కానీ చూడబోతే నువ్వే మానేశావనిపిస్తోంది.."
            "అదేం లేదంకుల్‌.. భాష తక్కువ పడుతోంది. ఎంత ప్రయత్నించినా బాగ రాయలేకపోతున్నానని రెండు మూడు వ్యాసాలు తిరస్కరించి వేరే అమ్మాయివి వేసేసరికి కాస్త మనసు గాయపడింది.."
            "అరెరే..?"
            "నాకు హిందీభాష తక్కువ పడుతోంది అనేది కూడా పాయింటు.. దానికి ఏదైనా చేయగలమా..?"
            విశ్వనాథం ఆలోచించాడు. "సరే, పోనీ ట్యూషన్‌ చెప్పమన్నావా..?"
            "మీరు చెప్తారా..? సరే.. నాకేం అభ్యంతరం లేదు. అట్లగే ఉర్దూ భాష కూడ నేర్పాలి.."
            "సరే. అట్లగే. అయితే మనం రోజూ ఓ గంట కూర్చుందాం.. రవీంద్రభారతిలో కలుద్దాం..."
            "కానీ సాయింత్రాలు అసలు కుదరదు.. ఉదయం వీలవుతుందా..?"
            "ఊఁ.. సరే. ఉదయం తొమ్మిదికన్నా ముందు నేను రాలేను."
            "ఆఫీస్‌ పదిన్నరకు కనక వీలు కుదురుతుంది. కానీ రవీంద్రభారతి ఎందుకు? మీ ఇంట్లో వద్దా?"
            "మాది చిన్న అపార్టుమెంటు. పిల్లలు నిత్యం గోల గందరగోళం చేస్తూంటారు. పైగా ఈ వయసులో కూడ నాకోసం అమ్మాయిలు వస్తే మా బిల్డింగువారంతా ఎంత అపార్థం చేసుకుంటారో.."
            గీతిక నవ్వి, "సరే.. ఎక్కడో అక్కడ.. మీరు చెప్తే చాలు.. అంది."
           
                    *                      *                      *         
                       
            సాయింత్రం ఐదున్నర ప్రాంతాలు. తలుపు చప్పుడై గీతిక లేచి తలుపు తీసింది.
            "నువ్వా..!! ఇక్కడా...?"
            "రెండురోజుల నుంచి జ్వరమటగా..! చూసిపోదామని వచ్చాను. అంత కోపం వద్దులే.."
            "హవ్వ.. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు..? ప్లీస్‌ వెళిపో.."
            "వెళ్ళటానికి కాదు వచ్చింది. చూసేవాళ్ళు చూసుకోనీ. నాకే భయం లేదు. నువ్వూ భయపడకు."
            "అసలు నీకీ అడ్రస్‌ ఎక్కడిది..? ఎవరిచ్చారు..? ఎవడు.. ఆ.. 'అ.. అదీ'గాడేనా..?"
            "ఎవడైతే ఏఁ..? మనసుంటే మార్గం ఉంటుంది.."
            "కనీసం ఒంట్లో బాలేదన్న కనికరం కూడ లేకుండ ఎందుకిట్ల నా వెంట పడి వేధిస్తున్నావు..?"
            "చెప్పా కదా.. జీవితాంతం వేధించే ఊహతో ఉన్నానని.."
            "ఛి.. ఇంత లోఫర్‌వనుకోలేదు. నీవల్ల నాగురించి ఆఫీసులో అంతా నోటికొచ్చింది వాగుతున్నారు."
            "అది వాళ్ళకర్థమైంది కాబట్టి.. మరి నీకెప్పుడు అర్థమవుతుంది?"
            "ఇదేనా మర్యాదస్తుల పద్ధతి..? ఇప్పటిదాక హాస్టల్లో ఒక్క మచ్చ లేదు. నీ పుణ్యమా అని ఇక.."
            "..ఇక్కడవాళ్ళు కూడ సంగతి తెలుసుకుంటారు. నువ్వు మాత్రం తెలుసుకోవు. ఏమీ ఎరగనట్టే ఉంటావు. నన్ను ఇట్లగే హింసిస్తావు.. మరి ఇది ఏ గ్రహం మీది మర్యాదస్తుల పద్ధతిటా?"
            "చూడు సన్నిహిత్‌.."
            "చూస్తాను, కానీ ముందు ఈ జూస్‌ తాగు. బాగా నీరసంగ ఉన్నావు.."
            "----"
            "నిన్నే.."
            "ఏమో.. అందులో ఏం కలుపుకుని తెచ్చావో.. నాకేం అక్ఖర్లే.."
            "నా ప్రేమేలే..! ఇంకేం కలపలే.. నిశ్చింతగ తాగచ్చు.."
            "అయితే అసలే వద్దు.."
            హఠాత్తుగ సన్నిహిత్‌ జేబులోనుంచి చిన్నపెన్‌నైఫ్‌ తీసి తన మణికట్టుకు పెట్టి కోసుకోవటం మొదలుపెట్టాడు. బొట్లు బొట్లు రక్తం కిందపడటం మొదలైంది.
            గీతిక వెంటనే అతన్ని ఆపటానికి వెళ్ళబోయింది. అతను చెయ్యి పైకి అందకుండ పెట్టేసుకుని జూస్‌ బాటిల్‌ వంక సంజ్ఞ చేశాడు. మారు మాట్లాడకుండ బాటిల్‌ మూత విప్పి గటగటా తాగేసిందామె.
            సన్నిహిత్‌ పక్కన వాష్‌లో చెయ్యి కడుక్కుని జేబులోంచి దూది తీసి తుడుచుకుని, ఒక చిన్న ఆయింట్‌మెంటు ట్యూబు తీసి రాసుకుని, బాండేజ్‌ తీసి కట్టు కట్టుకున్నాడు.        
            గీతిక చూస్తూ కూర్చుంది. కట్టుకట్టుకున్నాక- "ఊఁ.. గది చాలా బావుంది. బాగ పెట్టుకున్నావు. ఈ హాస్టల్‌ మొత్తంలో నీదే బాగా సర్దిపెట్టి ఉంచుకునే గదిట కదా.. చెప్పారు, కింద.."
            "నేను నీకు పడను. ఎందుకు టైం వేస్టు చేసుకుంటావు?"
            "నీ నిర్ణయం ఏదైనా కారణం తెలియాలి నాకు.."
            "నువ్వేంటో నాకు తెలియదు. నేనేంటో నీకు తెలియదు.."
            "నీ పేరు, ఊరు, చదువు, వయసు, బయోగ్రఫీలో ఏం చెప్పమంటావు? అత్తా మామల అడ్రసు, నీ అభిరుచులు, పట్టింపులు, స్నేహితులు, జాతకం కాగితంతో సహా సంపాదించాను. మన జాతకం కూడ చూపించాను. కలిసింది. నీ జాగ్రఫీ, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎనాటమీ, మార్ఫాలజీ, సైకాలజీ అన్నీ తెలుసు."
            "అయితే నేను మేలురకం పొగరుబోతును. అదీ తెలిసే ఉంటుంది. నేనన్నదే జరగాలని పంతం ఎక్కువ. ఇప్పుడు నువ్వే కోరి చేసుకుంటావంటే ఉన్న కొమ్ములు ఇంకా వాడి పెరుగుతాయి. వాటితో నిత్యం నిన్ను కుమ్ముతుంటాను. నీ శాంతస్వభావానికి అస్సలు సరిపడను. అది తెలుసా..?"
            "ఊఁ.. ఇప్పుడే తెలిసింది. తెలియనివి తెలుసుకుంటాను."
            "నావి చాలా పాతరకం భావాలు. ఆధునికంగ ఉండలేను. నీలా స్టైల్‌గ, స్మార్ట్‌గ ఉండే అబ్బాయి పక్కన అప్పలమ్మలా ఉంటాను. అది తెలుసా? నువ్వు కావాలంటే నాకన్నా గొప్ప ఇళ్ళ అమ్మాయిలు చదువూ, సంస్కారం, రూపం ఉన్నవాళ్ళు ఒక్క చిటికెకు వందమంది వచ్చి వాలతారు."
            "ఇది తెలుసు. తెలిసినవే చెప్పి కాలం వృథా చెయ్యకు.."
            "నేను నువ్వనుకున్నంత మంచిదాన్ని కాదు. జీవితంలో కాలి ఉన్నదాన్ని. ప్రేమ ఊహా సౌధాలతో మొదలవుతుంది, వాస్తవాలు కనిపించవు. పెళ్ళి మళ్ళీ నిన్ను ఆకాశహర్మ్యాల నుండి కిందికి తోసి పడేసే దాక నీకు కళ్ళు తెరుచుకోవు. నువ్వేం చూసి నచ్చుతున్నావో అది నేను కాదని తెలిసిన నాడు నీ దగ్గర నుదుటి వ్రాత మార్చుకునే అవకాశం మిగలదు. అందుకే ముందే చెబుతున్నా.."
            "ఆ రోజే ఎదురుపడితే నిన్ను పల్లెత్తు మాటనను. మాటిస్తున్నాను."
            "హింసించటానికి, వేధించటానికి చూస్తున్నానన్నావు మరి.."
            "అది మనం తీసుకోవటాన్ని బట్టి ఉంటుంది.."
            "నేనేది తీసుకున్నా అదే అవుతుంది.."
            "నువ్వు కూడ అదే ప్లానులో ఉన్నానంటున్నావు కాబట్టి.. ఓకే.. ఫరవాలేదు. సర్దుకుపోవచ్చేమో."
            "నేనెవరిని చేసుకున్నా అదే చేస్తాను. నువ్వు నన్నొక్కదాన్నే చేస్తావు. తేడా లేదా..?"
            "ఇద్దరి ఉద్దేశాలూ నెరవేరుతున్నప్పుడు తేడాలుంటే మాత్రం నష్టమేంటి..?"
            "నేను పళ్ళరసం తాగాలని నీ చెయ్యి కోసుకున్నావు. ఇవాళ కాబట్టి..! కొన్నాళ్ళు పోతే నీ దగ్గర కోసుకోటానికి కూడ ఏమీ మిగలదు."
            "అప్పుడు నిన్ను కోస్తానులే.."
            "అందుకే, ఆ రోజు రాకూడదనే వద్దంటున్నాను. నేను కోసేదాన్నే కానీ కోయించుకునేదాన్ని కాను. నువ్వెంత మంచి భర్తవు కాగలవో నేనంత చెడ్డ భార్యనవుతాను."
            "పెద్దవాళ్ళు అనుభవంతో ఒకమాట చెబుతుంటారు. ప్రతీవాడు తప్పక పెళ్ళి చేసుకోవాలి. భార్య మంచిదైతే సుఖంగ గడుస్తుంది. లేని పక్షంలో ఎంత చెడ్డదైతే వీడు అంత గొప్ప తత్త్వ వేత్త అవుతాడట.."
            "అది నువ్వు సొంత ప్రతిభతో కూడ కాగలవు. ప్రియురాలు చేజారినవారు కూడ తత్త్వవేత్తలైన దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. ఐనా అవి నీకున్న ప్లస్‌పాయింట్లు. దానివల్ల నాకేంటి.. అపఖ్యాతేగా..?"
            "అది నువ్వు ఎవరిని చేసుకున్నా జరిగేదే. ఈ డీల్‌ ఒప్పుకుని ఆ క్రెడిట్‌ ఏదో నాకే దక్కనీ రాదా?"
            "నేనెవ్వరినీ చేసుకోకపోతే? ఆ పక్షంలో అపఖ్యాతిపాలు కానక్కర్లేదు. ఇంకెందుకు  ఒప్పుకోటం?"
            "అంటే?"
            "నేనెవరిని చేసుకున్నా అయితే కోయాలి, లేదా కోయించుకోవాలి, లేదా తత్త్వవేత్తను చేయాలి."
            "చాలా పెద్ద బాధ్యత.."
            "ఊఁ.. నిజం. నేనంత మోయలేను. ఏ రకంగా అయినా నేను చెడ్డదాన్నవుతాను. అదే ఎవ్వరినీ చేసుకోకపోతే? అత్తలేని కోడలు ఉత్తమురాలు. కోడల్లేని అత్త గుణవంతురాలు. ఆ వికల్పం నా దగ్గర ఉంది కదా.. అదెందుకు ఉపయోగించుకోకూడదు?"
            "----"
            "అంతే కాదు. నువ్వు నన్ను చేసుకుంటే మాత్రమే హింసా, వేధింపు వగైరా. వేరే అమ్మాయిని చేసుకుంటే ఉండదు. కాబట్టి ఎటు ఆలోచించినా మనం జతకలవటం సరైంది అనిపించటం లేదు."
            "నువ్వు ప్లీడర్‌ ట్రెయినింగ్‌ ఏమైనా పొందావా..?"
            గీతిక నవ్వింది.
            "బాగా వాదించావు. కానీ ఒక్క విన్నపం. కాదని నిశ్చయించుకునే ముందు, నా వివరాలు విను ఒక్కసారి. అది వింటేనైనా నీ మనసు కరుగుతుందేమో.."
            "సరే చెప్పు."
            "పేరు సన్నిహిత్‌.. ఊరు హైదరాబాద్‌."
            "పుట్టినతేది మార్చ్‌ మూడు. చదువు ఎమ్మే లింగ్విస్టిక్స్‌. నెట్‌ కొట్టి యూనివర్సిటీ విభాగంలో ఎసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులో ఉన్నావు. వయసు ఇరవై నాలుగు. అమ్మా నాన్నకు ఒక్కడివే సంతానం. ఆస్తి ఫరవాలేదు.. నీ పెళ్ళి నిర్ణయం మీ ఇంట్లోవారు నీ మీదే వదిలేశారు."
            సన్నిహిత్‌ కళ్ళలో ఆశ్చర్యం.
            "..అభిరుచులు- పుస్తకాలు, ఫ్రీలాంసింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, మూవీస్‌.. పెద్దగ స్నేహితులు లేరు. ఉన్న ఒకళ్ళిద్దరితో దగ్గరగ ఉంటావు. పనిలో చాలా శ్రద్ధ. పుస్తకం పట్టుకుంటే లోకం మర్చిపోతావు. ఆత్మ
విశ్వాసం ఎక్కువ. అందరినీ నీకు అనుగుణంగ మార్చుకోగలనని మహా నమ్మకం. మనిషిని తొందరగా నమ్మవు. నమ్మితే ప్రాణం ఇస్తావు. ఫోటోగ్రఫీ, స్టాంప్స్‌ కాయిన్స్‌ కలెక్షన్స్‌ లాంటివి ఇష్టం. చిరునామా - ఈ మధ్యే ఇల్లు మారావు కనక ఆఫీసు రికార్డుల్లో ఇంకా పాత చిరునామానే ఉంది. అది సికిద్రాబాద్‌లో. పాత టెలీఫోన్‌ నెంబరు 27865564."
            "ఇన్ని వివరాలు నా ఆఫీస్‌ రికార్డ్స్‌లో కూడా లేవు. ఎక్కడివి..?" 
            "ఏఁ..? నీ మనసుకేనా మార్గం ఉండేది.. నా మనసుకు లేదా..?"
            "నాకు నీ మీద ఆసక్తి ఉంది కనక వివరాలు సేకరించాను. నీ ఉద్దేశం కూడా అదే అనుకోవచ్చా..?"
            "హుఁ.. నీ కారణంగ ఆఫీస్‌ అంతా నా ముందు వాగుతున్న చెత్తంతా ఇదే.. సో, నా చెవులు మూసుకోనందువల్ల ఈ వివరాలు నాకు అందటాన్ని నువ్వు ఏ విభాగం కింద వేసుకుంటావో నీ ఇష్టం."
            "ఓమై గాడ్.. ఐతే ఈ సంబంధం అందరికీ ఇష్టమేనా?"
           
                     *                      *                      *
           
            "నాటకం మధ్యలో సెల్‌ ఏంటమ్మా..? స్విచ్‌ ఆఫ్‌ చేయకపోయావా..?"
            "వైబ్రేషన్‌లోనే ఉంది కదా అని..! ఐదారుసార్ల నుంచి కాల్‌ వస్తోంది. ఏదైనా అర్జెంట్‌ ఏమో!? ఒక్క నిముషం.. చిన్నగనే మాట్లాడతాలే.." గీతిక ఫోను ఎత్తి నెమ్మదిగ మాట్లాడింది.
            "హలో.. ఎవరు..? ...నువ్వా..!!"
            విశ్వనాథం తిరిగి నాటకంలో నిమగ్నం అవ్వటానికి ప్రయత్నించాడు.
            "ఉఁహుఁ. నిన్ననే కొన్నా.. ..లేదు. రాలేను.. ..వద్దు.. నువ్వు రావద్దు.. బయటే ఉండు.. నేనే వస్తా."
            గీతిక గొంతులో కంగారు. విశ్వనాథం ఆమెను అనుమానంగ చూశాడు.
            "ఇప్పుడు కాదు తర్వాత! ..ఇప్పుడు కుదరదు. లేస్తే బావుండదు.. అర్థం చేస్కో.. ఛ.. బుద్ధి లేదు."
            విశ్వనాథానికి చిరాకేసింది. "హాల్లో అందరూ మననే చూస్తున్నారు.. ముందు అది కట్‌ చెయ్యి.."
            "మళ్ళీ చేస్తుంది..."
            "స్విచ్‌ ఆఫ్‌ చెయ్యి.."
            "లోపలికి వచ్చేస్తుంది...."
            "ఎవరమ్మా..?"
            "అది.. ఎవ్వరూ లేరు.. ఇన్సిట్యూట్‌ కొలీగ్‌.."
            "అయితే లోపలకు రానీ.. ఇబ్బందేంటి?"  
            "వద్దు.. వచ్చిందంటే పెద్దగ మాట్లాడుతుంది. మీరు డిస్టర్బ్‌ అవుతారు. నేను ఇప్పుడే వస్తా.."
            "ఇది చాలా బావుండే సీన్‌.. మిస్సవుతావు.."
            'కొత్తగ అయ్యేదేం ఉంది? మిస్‌ని కాబట్టే ఇన్ని సమస్యలు..' "సీన్‌ ఎంత దొరికితే అంతే చూస్తాలే"
            గీతిక ఇబ్బంది పడుతూనే లేచి వెళ్ళింది బయటకు. ఆమె అడ్డం వచ్చిందని వెనక సీట్ల వాళ్ళు కాస్త చిరాగ్గ చూపుల బాణాలు విసిరారు. కొందరు సన్నగ ఏదో గొణిగారు. గీతిక వాళ్ళ సీట్లకు దగ్గరగ ఉన్న ద్వారంలో నుంచి బయటకు వెళ్ళింది. అక్కడ సన్నిహిత్‌ నిలబడి ఉన్నాడు.
            "ఏం కావాలి..?"
            "మీ అంకుల్‌ ఎవరో ఉన్నారు.. మాట్లాడతానన్నావుగా.. గుర్తు చేద్దామని.."
            "కానీ.. ఇక్కడ..? ఇట్ల..? ఇవాళే మాట్లాడతానని చెప్పలే కదా! కాస్త సమయం సందర్భం ఏమీ ఉండవా..? సర్లే.. ఎప్పుడైనా తప్పదుగా.. కార్యక్రమం కానివ్వు. మాట్లాడతా."
            "ఐతే అంత దాక నేను బయటే ఉంటాను.."
            "బయట బావుండదు. లోపల కూర్చో. నీకు సాంస్కృతిక కార్యక్రమాలంటే ఆసక్తే కదా.. పైగా ఈ నాటకం చాలా బావుంది. ఇప్పుడే సస్పెంస్‌ అంతా తెరుచుకుంటుంది..."
            "సరే, ఒక షరతు.. ప్రతీసారిలా నువ్వూ నా పక్కన కూర్చుంటేనే.. వస్తా.." అన్నాడు.
            "కానీ ఈసారి అది కుదరదు. నేను అంకుల్‌తో ఉన్నాను.."
            "అమ్మో.. అంటే ఆయన లోపలే ఉన్నారా..? అయితే ఏం చెప్పి బయటకొచ్చావు..?"
            "ఫ్రెండ్‌.. ఓ అమ్మాయి అని.."
            "ఐతే ఫరవాలేదు. ఎవరైనా అమ్మాయితో నువ్వు లోపలకు వెళ్ళు.. నేను వేరే చోట కూర్చుంటా. కాస్తాగి నువ్వు రా.. ఓకే..?"
            'ఛ.. ఖర్మ' అనుకుని సరేనంది. ఇద్దరూ విడివిడిగా లోపలికి వచ్చారు.
            ఎవరో అమ్మాయి అప్పుడే వచ్చి లోపల సీట్లు ఖాళీ ఉన్నాయా అని అడిగితే స్నేహంగ నవ్వుతూ "రండి చూపిస్తాను." అని సన్నిహిత్‌ చెప్పినట్టే గీతిక ఆమెతో పాటు లోపలకు వెళ్ళింది. ఒకచోట రెండు సీట్లు ఖాళీ ఉన్నవి చూసుకుని సన్నిహిత్‌ కూర్చున్నాడు. గీతిక ఆ అమ్మాయికి అప్పటిదాకా జరిగిన కథ నెమ్మదిగ చెప్తూ గడిపి కాసేపటికి వెనక్కు తిరిగి విశ్వనాథం కూర్చున్న చోటకు చూసింది కొంచెం ఇబ్బందిగ. ఆయనా ఆమె వంక చూసి, ఏం ఫరవాలేదు అన్నట్టు సంజ్ఞ చేశాడు. ఆ కాసేపటిలోనే సన్నిహిత్‌ ఆమె సెల్‌ మీదకు రింగ్‌ ఇస్తూనే ఉన్నాడు, తన వద్దకు రమ్మని. ఇక తప్పక భయం భయంగనే లేచి బాగా వంగి సన్నిహిత్‌ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరూ పక్కపక్కన కూర్చున్నారు.
            నాటకం పూర్తవ్వటానికి గంట పట్టింది. చూస్తున్నంతసేపు గీతిక మధ్య మధ్య తన చిన్న పుస్తకంలో ఆ గుడ్డి వెలుగులోనే ఏవేవో రాసుకుంటూనే ఉంది. సన్నిహిత్‌కి ఆ పద్ధతి చాలా నచ్చింది.
            "అంకుల్‌ నేర్పారు.." అతను మెచ్చుకున్నప్పుడు చెప్పింది.
            "ఏది చూపించు..?"
            "వద్దులే. నీ అంత గొప్ప భాష నాకు లేదు. నీకు అంత మంచి భాష ఎక్కడిది..?"
            "నాన్నది మంచి భాష. తెలుగు, ఇంగ్లీష్‌ బాగ వచ్చు. చిన్నతనం నుంచీ సీరియస్‌గ నేర్పించారు."
            "అయితే మీ నాన్నగారికి నన్ను పరిచయం చేయవా..?"
            "పెళ్ళికి ఒప్పుకో. వెంటనే పరిచయం చేసేస్తా.. వీలైతే ఇవాళే ఇంటికి తీసుకెళతా.."
            "సర్లే.. ఇంటికి తర్వాత.. ముందు ఇక్కణ్ణించి పద.." లేచింది గీతిక.
            "జనాలందరినీ పోనీ. తొందర ఏంటి? తలుపు దగ్గర కిక్కిరిసి ఉంటుంది. నాకు తోసుకుని వెళ్ళటం నచ్చదు. ఊపిరి అందనట్టవుతుంది. పక్కన నువ్వున్నావు. ఇక అసలే వెళ్ళాలనిపించదు." కూర్చోబెట్టాడు.
            "ఏంటి..? చెయ్యి అంత చల్లగ ఉంది..? ఎందుకు అంత వణుకుతున్నావు?"
            "వణుకా..? ఏం లేదే.."
            "కాదు.. టెంషన్‌ పడుతున్నట్టున్నావు. అంకుల్‌తో మొదటిసారి మాట్లాడటానికి.. అంతేనా..?"
            "ఊఁ.. మరి ఉండదా? అసలు అమ్మాయిని అడగటానికి వస్తే వాళ్ళ సంబంధీకులు మామూలుగనే
ప్రశ్నలతో పొడిచి, చూపులతో గుచ్చి చంపేస్తారు. ఇంక పైగా నా సత్తా నిరూపించుకోవాల్సిన సందర్భం. ఏమో, భయంగనే ఉంది. యూనివర్సిటీ ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం కూడ ఇంత టెంషన్‌ పడింది లేదు.. తెలుసా?"
            "సరే. ఇంతకీ నేనిక్కడున్నానని ఎట్ల తెలుసు..?"
            "తెలుసుకోవాలనిపిస్తే ఏదైనా తెలుస్తుంది."
            "నా నెంబర్‌ ఎక్కడిది..?"
            "చెప్పా కదా.. తెలుసుకోవాలనిపించిందని.."
            "చెప్పవోయ్‌.. పెద్ద.. ఇంకా ఆఫీసులో కూడ ఎవ్వరికీ ఇవ్వనే లేదు..?"
            "ఆఫీసు దాకా ఎందుకు..? నిన్న నువ్వు కొన్న షాపులోంచే తీసుకున్నా.."
            "అంత చేటు ఎందుకు ఫాలో అవుతున్నావు? నాకు అట్ల పని లేని వాళ్ళంటే చిరాకని తెలుసుగా?"
            "నీకోసం రాలేదు. నా పని మీదే వచ్చాను. అక్కడ షాపులో కనిపించావు. సెల్‌ కొంటున్నావని అర్థమైంది. వెంటనే వచ్చి నీకు కనిపించకుండ నిలబడ్డాను. నీ స్నేహితురాలికి నెంబరు చెప్పేటప్పుడు విని నోట్‌ చేసుకున్నాను. అక్కడే నువ్వు ఇవాళ ఇటు వస్తున్నట్టు ఆమెతో చెప్పావు.."
            వెంటనే వెనక నుంచి చప్పట్లు వినిపించి ఇద్దరూ తిరిగి చూశారు. విశ్వనాథం నిలబడి ఉన్నాడు.
            "అంకుల్‌.. మీరా..? ఇంకా ఎవరో అనుకున్నా." అంది గీతిక కాస్త టెంషనూ, కాస్త తేలికా పడుతూ.
            విశ్వనాథం సన్నిహిత్‌ పరస్పరం చూసుకున్నారు. సన్నిహిత్‌ ఠక్కున లేచి నిలవబడ్డాడు. అతని నుదురు క్షణంలో చెమటతో తడిసిపోయింది.
            "అంత కంగారు పడకు.. ఈయనే మా అంకుల్‌..! మంచివారు. అంకుల్‌.., ఇతను సన్నిహిత్‌.."
            "ఇందాకటి ఫోను.. ఇతనే కదూ?" అడిగాడు ఆయన సన్నిహిత్‌ని గుచ్చి చూస్తూ.
            "ఔను. అది.. అసలు మీతో.. ఎట్ల చెప్పాలో అర్థం కాక.." గీతిక మాటలు వెతుక్కుంది.
            "ఇతనికి ఇటువంటి కళల కార్యక్రమాలంటే చాలా ఇష్టమనుకుంటా..?"
            "ఔనంకుల్‌. నాలుగైదు కార్యక్రమాలకు కలిసే వెళ్ళాం." గీతిక అంటుంటే సన్నిహిత్‌ కదిలాడు.-
            "నథింగ్‌.. అట్లాంటిది ఏం లేదు.. నేను మళ్ళీ కలుస్తాను.."
            "ఆగు. మళ్ళీ మళ్ళీ వెంటపడితే నాకు ఓపిక లేదు. ఇప్పుడే ఇక్కడే సంగతంతా తేలిపోవాలి."
            "లేదు. అర్జంటుగ వెళ్ళాలి.. పనుంది.."
            "నేను కూడ పనిలేనిదాన్ని కాను. రెండు నిముషాలు" అని విశ్వనాథాన్ని చూసి, "అంకుల్‌, ఇతనే- ఇంస్టిట్యూట్‌లో నాతో వాదు పెట్టుకున్న అమ్మాయి, ఆఫీస్‌లో ఆర్టికల్సు పడకుండా అడ్డుపడిన అమ్మాయి. ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకుంటానంటున్నది. మీ నిర్ణయం మీద నా భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్తే ఇక్కడికి వచ్చింది. ఇతనితో మాట్లాడి మీరు సర్టిఫై చేస్తే.."
            విశ్వనాథం కాసేపు ఆలోచించాడు. "నువ్వు ఇతని ఇంటికి వెళ్ళావా ఎప్పుడైనా..?"
            సన్నిహిత్‌ మెడా, నుదురూ తుడుచుకుంటూ ఎందుకు అన్నట్టు చూశాడు.
            "లేదు. మీరు సరేనంటే వెళతాను. వాళ్ళ నాన్నగారికి కూడా పరిచయం చేయాలి గదా నన్ను.."
            "అది ఇప్పుడు కుదరదు.." అతను అన్నాడు.
            "అదేంటి? నేను ఒప్పుకుంటే ఇవాళే తీసుకెళతానన్నావు? మా అంకుల్‌ని నేను పరిచయం చేశా కదా. లెక్క ప్రకారం నువ్వూ మీ నాన్నగారికి నన్ను పరిచయం చేయాలి కదా.."
            విశ్వనాథం సన్నిహిత్‌ భుజం మీద చెయ్యేస్తూ, "ఔను బాబూ. అమ్మాయి చెప్పేది నిజం. పైగా
ఎవరినైనా వాళ్ళ ఇంటి వాతావరణం చూశాకే అంచనా వేయగలం.. అందుకని.." అని వాచ్‌ చూసుకుని, సన్నిహిత్‌తో, "నీకు అమ్మాయి ఓకే ఐతే మరి మీ ఇంటికి వెళ్ళి ఓసారి మీ నాన్నగారితో మాట్లాడదామా?" అని అడిగాడాయన.
            సన్నిహిత్‌ ఏం మాట్లాడలేదు. గీతిక వంక చూసి తల దించుకున్నాడు.
            "ఔను. ఇది చాలా మంచి ఆలోచన సన్నీ. అంకుల్‌ పక్కనుంటే నాకూ ధైర్యం. ఇంక ఒక్క మీ నాన్నగారేంటి..? వాళ్ళ నాన్నగారు ఉన్నా ఇక నేను భయపడను. నా తరఫు పెద్దదిక్కు అంకుల్‌ వస్తారు. నీ తరఫు పెద్దదిక్కు మీ నాన్నగారికి ఫోను చేసి చెప్పు.. మనం వెంటనే బయల్దేరదాము.."
            "నీకేమైనా పిచ్చా..?" కసిరాడు సన్నిహిత్‌.
            "అదేంటి..? అంకుల్‌కి నువ్వు నచ్చేశావుగా. ఇంక నాకేంటి సమస్య..?"
            "ఔను. ఏంటి సమస్య..? మరి పద.." అని కదిలాడు విశ్వనాథం.
            "ఇ.. ఇప్పుడు న్‌.. నాన్నగారు ఇంట్లో లేరు.. అ.. అందుకని.."
            "ఎప్పుడు వస్తారు..? పోనీ వేచి చూద్దాం. నాకివాళ ఇంక వేరే కార్యక్రమాలేమీ లేవు.."
            గీతిక వంత పాడింది. "నాకూ ఏం లేవు.."
            సన్నిహిత్‌ కోపంగ ఉరిమి చూశాడు. "నీకు హాస్టల్‌లో ఆలస్యం కాదా..?"
            "ఒక్కరోజే కదా.. ఏం కాదులే. నీ సంగతి ఇప్పుడు వాచ్‌మెన్‌ దగ్గర నుంచి వార్డెన్‌ వరకు అందరికీ తెలుసు. పోవాల్సిన పరువు ఎట్లగో పోయింది. రాత్రి మరీ ఆలస్యమైతే నువ్వే దింపుదువుగాని. ఒక్కదాన్ని వస్తే ఎవడితో తిరిగావని అడుగుతారు కానీ నీతో చూస్తే ఎవ్వరూ ఏమీ అనరు. ఇంక వెళదామా..?"
            చేసేది ఏం లేనట్టు చూసి సన్నిహిత్‌ కదిలాడు. అతని వెంట విశ్వనాథం, గీతిక కూడా కదిలారు.
            "అంకుల్‌.. మీరు నా బండి మీదే రావాలి.. అతనితో వద్దు.." రహస్యంగ చెప్పింది గీతిక.
            "నువ్వు జరిగిన కథ అంతా నాకు వివరంగ చెప్తానంటే నీతోనే వస్తా." విశ్వనాథం చిన్నగ అన్నాడు.
            గీతిక ఒప్పుకుంది. సన్నిహిత్‌ అతని బండిమీద, గీతికా విశ్వనాథం ఆమె బండి మీద బయల్దేరారు.
            "మీ ఇల్లు ఎక్కడ బాబూ..? ఎటువైపు వస్తుంది?" సన్నిహిత్‌ని అడిగాడు విశ్వనాథం.
            సన్నిహిత్‌ నిట్టూర్చి "నా వెంటే ఫాలో అవ్వండి.." అని చెప్పి బండి స్టార్ట్‌ చేసి కదిలాడు.
             
                        *                      *                      *

            "వావ్‌.. మీ ఇల్లు చాలా బావుంది.. అద్భుతంగ ఉంది.. కొత్త ఇల్లు కదా..? అబ్బ.."
            గీతిక సోఫాలో కూర్చుని ఇల్లంతా కలయ చూసింది. విశ్వనాథం వాలుకుర్చీలో కూర్చుని సన్నిహిత్‌ వంక దాహంగ ఉంది అన్నట్టు చూశాడు. సన్నిహిత్‌ ఇద్దరికీ మంచినీరు తెచ్చి ఇచ్చాడు.
            "నువ్వూ కూర్చో.." అన్నాడు విశ్వనాథం.
            సన్నిహిత్‌ కూర్చున్నాడు.
            "మీ నాన్నగారు రావటానికి ఇంకా టైం పడుతుందా సన్నీ..?" అడిగింది గీతిక.
            "పోనీలే.. ఈలోపు మనం నింపాదిగ మంచీ చెడూ మాట్లాడుకోవచ్చు.." అన్నాడు విశ్వనాథం.
            "ఔను.. మంచి ఆలోచన.." అని గోడకున్న ఫోటో వంక చూసి, "మీ అమ్మగారా?" అని అడిగింది.
            "ఊఁ.." అన్నాడు సన్నిహిత్‌.
            "చాలా అందంగ ఉన్నారు. సున్నితమైన మనస్కురాలనుకుంటా..? ఎంత పోలిక కలుస్తుందో నీకూ ఆమెకూ! తల్లిపోలిక ఉన్న అబ్బాయిలు అదృష్టవంతులట. అందుకే నీ మాట, వ్యక్తిత్వం అంత గొప్పగ ఉంటాయి. నీది మీ అమ్మలాగే అందమైన నవ్వు. ఐనా నువ్వు ఏ అమ్మాయికీ ఇంత వరకు పడలేదటగా.. నలుగురైదుగురు ప్రయత్నించి విఫలమయ్యారట.. నువ్వు బాగా పాడతావుట కూడ కదా.. నాకెప్పుడూ చెప్పలేదేఁ..? మన ఆఫీసులో అందరూ నీ గురించి చాలా గొప్పగ చెప్పుకుంటారు తెల్సా..?"
            "సరే. తెలుసు. ఇప్పుడవన్నీ ఎందుకు..?"
            విశ్వనాథం అన్నాడు- "చెప్పనీ.. ఫరవాలేదు. నేనూ వింటా కదా.. నాకూ తెలుస్తుంది. ఇందాక బండి మీద వస్తూ నీ గురించి చెప్తున్నది కూడా సగంలోనే ఆగిపోయింది."
            గీతిక తలపట్టుకుంది. "అయ్యో నిజమే కద. ఎక్కడి వరకు చెప్పాను? ఆరోజు చెయ్యి కోసుకున్నాడని చెప్పా కదా.. తర్వాత ఆఫీసు కాంటీనులో కాఫీకి పిలిచాడు. నేనూ నా బాగ్‌లో నుంచి చాకు తీసి మెడ దగ్గర పెట్టుకుందామనుకున్నాను. కానీ అతను నన్ను అందరి ముందు అడిగే సరికి ఆ అవకాశం లేకుండ పోయింది. ముందు అయిష్టంగనే వెళ్ళినా తర్వాత మాత్రం అతను నిజంగ నచ్చాడు. ఆ రోజే చాలాసేపు మాట్లాడుకున్నాము, కాఫీకని వచ్చినవాళ్ళము లంచ్‌ కూడ తిన్నాము. తన గురించి అన్నీ దాచుకోకుండ చెప్పాడు. నేను ఎటువంటిదాన్నైనా తనకు ఇష్టమేనని, స్వతంత్రంగ ఉండి, స్వయంశక్తిని నమ్ముకున్న అమ్మాయిలంటే తనకెంతో గౌరవమన్నాడు.."
            విశ్వనాథం ఆలోచిస్తూ, "అది సరే. నిన్నింత ఏడిపించాడు, నీకేం బాధనిపించలేదా?" అనడిగాడు.
            "అనిపించింది. ఏడ్చాను కూడ. కానీ అతను కాంటీనులో అడిగి వెళ్ళిన తర్వాత నా ఇంస్టిట్యూటు స్నేహితురాలిని సలహా అడిగితే మంచివాడే అనంది. వీళ్ళ యూనివర్సిటీలో చదివే ఓ అమ్మాయి మా హాస్టల్లోనే ఉంటుంది. ఇంక్వైరీ చేస్తే పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది."
            "ఊఁహూఁ..?"
            "ఊఁ.. నేనూ ఆలోచించాను. ఇంస్టిట్యూట్‌లో నా గురించి నవ్వేవారందరి నోళ్ళూ మూయించాడు. జ్వరంగ ఉంటే చూడటానికి వచ్చాడు. పట్టించుకుంటాడు అనిపించింది. అమ్మాయి అన్నాక పెళ్ళి చేసుకోక తప్పదు. కోరి వచ్చాడు. మంచివాడు. అనవసర పట్టుదలలెందుకు? అనిపించింది."
            "ఆఁ.. నిజమే కదా.."
            "నేనూ ఒంటరిదాన్నే. సలహా చెప్పేవారు ఎవ్వరూ లేరు. మీతో మాట్లాడి తప్పక ఓ నిర్ణయానికి రావాలని అనుకున్నాను. ఇంక ఇద్దరు మనుషులన్నాక ఏవో తేడాలు ఉండనే ఉంటాయి. నెమ్మదిగ అలవాటుపడితే అవే సర్దుకుంటాయి. అర్థంచేసుకుంటే తత్త్వమే ఎక్కుతుంది. అతను ఎక్కడా అని ధైర్యం."
            "ఊఁహూఁ.. ఇంక..?"
            "ఇంక.. చెప్పాలంటే.." గీతిక నవ్వింది- "అత్తా ఆడపడుచుల పోరు కూడా లేదు.. అడుగు వేద్దాం అనిపించింది.."
            "అంతేనా..?"
            "అంతేనా? అంటే కాదు.. ఇంకా ఉంది.." గీతిక తల వాలిపోయింది. "నిజానికి ఇతను వాళ్ళ నాన్న గారి గురించి చెప్పిన తీరు నాకు చాలా నచ్చింది. ఇతనే అంత మంచివాడైతే ఆయన ఇంకా ఎంత మంచి వారో అనిపించింది. ఊహించుకుంటే భయపడాల్సింది ఏమీ ఉండదేమో అనిపించింది. నా ఆలోచన సరైందేనా కాదా..? చెప్పండి అంకుల్‌..? ఇప్పుడు ఇల్లు కూడా చూశాం కదా.." అంది.
            "ఊఁ. బావుంది. కానీ వాళ్ళ నాన్నగారితో కూడా ఒక మాట మాట్లాడితే.." అని విశ్వనాథం వాచ్‌
చూసుకుని, "ఏంటోయ్‌.. ఇంకా ఎంతసేపు పడుతుంది మీ నాన్నగారు రావటానికి?" అన్నాడు.
            సన్నిహిత్‌ తలొంచుకుని, "ఏమో. ఆయనకే తెలియాలి.." అన్నాడు.
            "ఏం చేస్తూంటాడాయన..?"
            "ప్రస్తుతం రిటైరయ్యారు. సెంట్రల్‌ ఎక్సైస్‌లో చేశారు.."
            "అరే..! సెంట్రల్‌ ఎక్సైసా!! అంకుల్‌, మీరు కూడా అక్కడే చేశానని చెప్పారు కదా.. అయితే మీకు తప్పక తెలిసి ఉండి ఉంటారు.. ఆయన పేరేంటి సన్నీ..?"
            సన్నిహిత్‌ గట్టిగ నిట్టూర్చి "శ్రీ విశ్వనాథ్‌" అని చెప్పాడు.
            "అరే.. నా పేరే.. ఇనీషియల్‌ ఏంటి..?" అడిగాడు విశ్వనాథం వెంటనే ఆశ్చర్యంగ.
            గీతిక చాలా ఆసక్తిగ సన్నిహిత్‌ వంక చూసింది.
            సన్నిహిత్‌ చేతిలో రుమాలుతో ముఖం దాచుకుని "ఇంక చాల్లేండి నాన్నా..!! ఆపండి ఈ హింస. మీరూ మీ నటనా.. బానే వేధిస్తారు.." అన్నాడు.
            దాంతో విశ్వనాథం పెద్దగ నవ్వేశాడు.
            ఠక్కున చూసి గీతిక ఒక్కసారి లేచి నిలబడింది. అప్పటికి జరిగింది అర్థమై ఉన్నట్టుండి ఆమెకు పైనుంచి కింది దాక చెమటలు పట్టాయి. కళ్ళు తిరిగినట్టైంది. ఒళ్ళు తూలింది. గొంతంతా ఎండిపోయింది.
            "ఇదిగో నీళ్ళు తాగు.. అంతా సర్దుకుంటుంది." పరిస్థితి గ్రహించి విశ్వనాథం అందించాడు ఆమెకు.
            గీతిక చేతులు వణికాయి. అంగుళం కదల్లేదు. అట్లగే బిగుసుకు పోయింది.
            "ఏం ఫరవాలేదు. కూర్చో.." అన్నాడు సన్నిహిత్‌ ఆమె చెయ్యి పట్టి కూర్చోబెడుతూ.
            గీతిక సత్తువ లేని దానిలా కూర్చుని గటగటా మంచినీళ్ళు తాగేసింది. అయినా కంగారు తగ్గలేదు. గుండె దడదడమంటూనే ఉంది. గుటకలు మింగుతూ తలెత్తి చూసే ధైర్యం లేక తల దిమ్ముగ అయితుంటే కళ్ళు మూసుకుంది. ఆమె పెదాలు ఎండిపోయాయి. ముఖమంతా పాలిపోయింది. సన్నగ వణుకు..
            "ఊఁ. సన్నీ తండ్రి రంగంలోకి ఇప్పుడే వచ్చాడు కాబట్టి మరోసారి పరిచయాలు చేసుకుందామా?"
            గీతిక తలెత్తలేదు. అకస్మాత్తుగ చెప్పలేనంత సిగ్గు ఆమెను ఆవరించింది. గిలిగింతలు పెట్టేసింది. ముఖమంతా ఎర్రబారింది. మంచి పసిమి ఛాయగల నగుమోము అప్పుడే విరిసిన గులాబీలా మారింది.
            సన్నిహిత్‌ ఒకసారి తండ్రి వంక చూసి తర్వాత ఆమెను చూశాడు. విశ్వనాథం ఏం మాట్లాడకుండ ఆమె వంకే చూస్తూండిపోయాడు. అప్పటివరకు తను మాట్లాడిన మాటలు మాటిమాటికీ చెవుల్లో హోరు పెడుతుంటే గీతిక రెండు చేతులతో ముఖం దాచేసుకుంది.

   **  **   **           **            **   **   **      

No comments:

Post a Comment