సరిగ్గ ఆ వారం లీవు గడిచిందో లేదో మహిళా
పోలీస్ రిక్రూట్ ల శిక్షణ కోసం పిలుపు వచ్చింది. మారు ఆలోచించకుండ అటు వెళిపోయాను.
శిక్షణ సమయం తరువాత దొరికిన ఖాళీ సమయంలో చదువుకునేందుకు పుస్తకాలు తీసుకు
వెళ్ళాను. నాకు ఇష్టమైన పాటలు విన్నాను. చిన్న చిన్న ఔటింగులు, ఉత్సాహవంతమైన కొత్త
పిల్లల హడావుళ్ళు, మేడమ్, ఇదేంటి, అదేంటి.. అంటూ వాళ్ళ జిజ్ఞాసలు.., ప్రకృతి ఒడిలో
ఓలలాటలు..! ప్రశ్నలు, సందేహాలు అడిగిన ప్రతీవారిని నా బాచ్ మేట్లు "ఈ మేడమ్
అయితే బాగా చెప్తారు.." అంటూ నా మీదకు తోసేసరికి నాకు వారి కుతూహలాలు,
ఉత్సాహాలు తీర్చటమే సరిపోయింది. అప్పట్లో నేనూ అట్లగే ఉన్నాను అని
గుర్తుకొచ్చింది. చెప్పేవాళ్ళు కనిపిస్తే వదిలేదే కాదు. లైవ్ కేసులు ఎట్ల సాల్వ్
చేస్తారు దగ్గరి నుంచి డిపార్టుమెంటు లోపలి విషయాల వరకు అన్నీ పట్టి లాగేదాన్ని.
ఎవరు దొరికితే వారితో డిస్కషన్ లు.. అందుకే ఇప్పుడు కావాల్సినంత ఇన్ సైట్ ఉంటుంది.
అదే పిల్లలకు పనికి వస్తోంది. నేను నిజంగ చేసిన నాటకాలతో సహా, నా పేరు బయటకు
రాకుండ వివరించాను. పిల్లలు చాలా ఉత్సాహ పడ్డారు అది విని. వాళ్ళకు ఆ విధానం చాలా
నచ్చింది. పేరు తెలియకపోయినా ఆ విధానం అమలు చేసే అనురాగ్ ని ఒకటే పొగిడారు. ఆహా..
ఏం ప్లానింగ్.. ఏం ఐడియా.. అంటూ. నేను నవ్వి ఊరుకున్నాను.
ఒకరిద్దరు పాతవాళ్ళు వస్తే హాయిగ
ముచ్చటించుకున్నాను. ఒక సుదీర్ఘపండగ లాగ జరిగింది. కొంత కష్టసుఖాలు పంచుకోవటమూ
అయింది. నా బాధలన్నీ చెప్పుకున్నాను ఇంకొకరి పేరు పెట్టి. నా కొలీగ్స్ నవ్వి,
"వాడెవడో చాలా మర్యాదస్తుడిలాగ ఉన్నాడు." అని మహిళా ఆపీసర్లు
ఎదుర్కొంటున్న ఎన్నో ఇతర సమస్యల గురించి విపులంగ చెప్పేసరికి నిజంగ షాకయ్యాను.
నేను నిజంగనే ఏ బాధా పడనే పడటం లేదనిపించింది. అప్పటిదాకా ఉన్న మానసిక గాయానికి
మాత్రం బాగా ఉపశమనం పొందాను.
చివరిరోజు ఇంటి నుంచి ఫోను వచ్చింది
ఇంటికి రమ్మని. నాన్నగారికి ఏమైందోనని కంగారుపడితే కాదు బాబాయి వాళ్ళు చెప్పిన ఏదో
సంబంధం వాళ్ళు వస్తున్నామని ఫోన్ చేశారని అంశూ చెప్పాడు. వెంటనే గుర్తుకొచ్చింది.
పిన్ని ముందే చెప్పింది నెల్నాళ్ళలో వాళ్ళు వస్తారని. మంచి సంబంధమే. అబ్బాయి
డాక్టరు. ఒక అక్క ఉంది. తల్లి తండ్రులు చిన్నప్పుడే పోతే అక్కే అతన్ని పెంచింది.
కాలం బాగోక ఆమె పెళ్ళైన కొన్నాళ్ళకే వితంతువైంది. అప్పటినుంచి అక్క తమ్ముణ్ణి,
తమ్ముడు అక్కను పరస్పరం చూసుకుంటూ ఉంటున్నారు. అతనికి ఏదో వైద్యశిబిరం ఉండి నెల
ఆగి వస్తామన్నారట.. ఇప్పుడు వచ్చారు. నేను ఇంటికి చేరాను.
సరే పెళ్ళిచూపులైనాయి. చూస్తూనే నచ్చి
ముహుర్తాలు పెట్టుకోమని చెప్పి వాళ్ళు వెళిపోయారు. ఇంక నా నిర్ణయమే మిగిలింది.
ఆలోచించుకుని చెప్పమన్నారు నాన్నగారు.
శనివారమే కదా, లీవ్ ఎందుకులే.. అని
ఆఫీస్ కెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి, పని కొంచెం ఉంటే చూసుకుంటూ, మనసులో ఓ పక్క
ఇదే ఆలోచిస్తూ కూర్చున్నాను. వాళ్ళు వెంటనే చెప్పినప్పుడు మనం ఆలస్యం చేస్తే
బాగుండదని పిన్ని అంది. అదీ నిజమే. నేను ఆలోచిస్తున్నది ఉద్యోగం గురించే. వాళ్ళకు
ఏం అభ్యంతరం లేదన్నారు. కానీ..
"ఒక ప్రమాదం జరిగింది. దర్యాప్తుకు
వెళ్ళాలి.. పద.." అని వినిపించి తల ఎత్తి చూశాను.
ఎదురుంగ అనురాగ్ ఉన్నాడు. చేతి వాచ్
చూస్తే పదకొండైంది. సరేనన్నాను. ఇద్దరం జిప్సీ ఎక్కాం.
దర్యాప్తంటే ఇంక టైం దొరకదు. కనక
మనసులోనే సంబంధం సరేనని నిర్ణయించుకున్నాను. ఏదైనా జరిగితే పెద్దవాళ్ళు ఇందరు
ఉన్నారు చూసుకోరా..? అనుకున్నాను. ఇంక అంశూను నాన్ననూ వదిలిపోవటమే కాస్త బాధాకరం
కానీ ఏం చేయగలం..? ఆడపిల్లలకు తప్పదు కదా. వీలైనంతవరకైతే తప్పక చూసుకుంటాను.
అనుకోని ఇంక ఇంటికి వెళ్తూనే నాన్నగారికి చెప్పేయాలని అనేసుకుని నిశ్చింతగ
కూర్చున్నాను. అతను మౌనంగ నడుపుతున్నాడు ఎప్పటిలాగే. కనీసం ఇన్నాళ్ళైంది కదా.., ఒక
మాటా లేదు మంచి లేదు. బాగున్నావా అని అడగటం లేదు. సరే నేనూ అడగలేదు. నేరుగ
తీసుకెళ్ళి ఒక ఇంటి ముందు ఆపాడు.
"హాస్పిటల్లో కాదా..?"
అనడిగాను దిగుతూ.
"కాదు, ఈ ఇంట్లోనే.." అని
జిప్సీ పార్కు చేసి ఇంట్లోకి నడిచాడు. అతని వెనకే లోపలికి వెళ్ళాను. వెళ్ళింది
వాళ్ళ ఇంటికేనని నాకర్థమయ్యేసరికి ఒళ్ళు మండింది.
ఇంట్లోవాళ్ళ వారంతా ఉన్నారు. అమ్మా,
నాన్నా, బామ్మా, తాతా, అక్కా, బావా, అన్నా, వదినా, వాళ్ళ చిన్నపిల్లలు.. వాళ్ళందరి
పలకరింపులు అయ్యాయి. అప్పుడే సుభగ్ కూడా వచ్చాడు. మాకిద్దరికీ స్వీట్ ఇచ్చి,
"మీ ఇద్దరికీ "బెస్ట్ కాప్స్ ఆఫ్ ది ఇయర్" అవార్డు
వచ్చింది.." అని చెప్పాడు. నేను చాలా ఆశ్చర్యం, ఆనందం పొందాను. అతను ఏ భావనా
లేకుండ అదేదో తనకు అలవాటే అన్నంత సహజంగ ఆ వార్తను తీసుకున్నాడు. అతని ఇంట్లోవారికి
మాత్రం నాలాగే స్పందన కలిగింది. సుభగ్ చెప్పాడు- ఇందాకే కమిటీ ఈ మాట నిర్ణయించింది
అని అనౌపచారికంగ తనకు తెలిసిందిట. త్వరలోనే ప్రకటింపు వస్తుందిట. మొన్నటి
రాజస్థానీ అమ్మాయి కేస్ విషయమైయ్యే ఈ అవార్డు. పోనీలే, నేను మనసు, అహం చంపుకుని
చేసిన త్యాగాన్ని ప్రభుత్వమైనా గుర్తించింది అనుకున్నాను.
తర్వాత సుభగ్ వెళిపోతూ అవకాశం చూసుకుని,
ఎందుకో మరి, నాకు రహస్యంగ "జాగ్రత్త" అని చెప్పి వెళ్ళాడు. తర్వాత,
వాళ్ళ వాళ్ళంతా నన్ను ఏదేదో అడిగారు నా చదువు, ఇంటిపేరు, కుటుంబం వివరాలు,
అభిరుచులు; మర్యాదకు అన్నీ చెప్పాను. ఆక్సిడెంటు గురించి, దర్యాప్తు గురించి ఏ
ప్రస్తావనా లేకపోవటంతో అవకాశం చిక్కంగనే, అతనిని "ఇంతకీ ఆక్సిడెంట్
ఎవరికైంది..?" అని అడిగాను.
"నాకే! ఇక్కడ.." అని గుండె
మీద చెయ్యి వేసుకుని తల దించుకున్నాడు.
నేను ఒక్కసారి పిచ్చెత్తినట్టైనాను.
అప్రయత్నంగ సుభగ్ మాట గుర్తుకొచ్చింది. ఇంకా ముడుచుకుపోయాను. ఏంటీ మనిషి!! అసలు
ఇది దారుణం!! కోపం అణుచుకుని ఇంక తట్టుకోలేని స్థితిలో అరగంట గడిచాక వెళతానని
లేచాను. అతను నన్ను దింపుతానని వచ్చి జిప్సీ తీశాడు. విధిలేక ఎక్కి కూర్చున్నాను.
లోలోపల ఉడుకు వస్తుంటే ఆపుకున్నాను. కానీ ఎప్పటిలాగే అంత అభ్యాసమూ ఎందుకూ పనికి
రావట్లేదు.
అయినా కష్టం మీద నిలదొక్కుకున్నాను.
చూద్దాం ఏం చేస్తాడో..!! మాటిమాటికీ కళ్ళలో నీరుబకసాగింది. అతని కళ్ళబడకుండ నల్లటి
అద్దం మూసేసి ఉన్న కిటికీ లోనుంచి బయటకు చూస్తూండిపోయాను. నాకేం అర్థం కాలేదు
అతనేం చెప్పదలిచాడో. చెప్పనీ- చెప్పినప్పుడే విందాం.
కాసేపాగి అతనే అన్నాడు- "ఎప్పటి
నుంచో ఇంట్లో పెళ్ళి గురించి అడుగుతున్నారు. ఎవరైనా అమ్మాయి నచ్చితే చెప్పమన్నారు.
అందుకే.."
నేనేం మాట్లాడలేదు.
"నేను మా వాళ్ళకు ఏ సంగతీ వీలైనంత
త్వరలో చెప్పాలి. అక్కా బావా వచ్చే వారం వరకే ఉంటారు. ఈలోపు
నిర్ణయించుకోవాలి.."
"ఆఁహాఁ.."
"బామ్మా, తాతగారూ అక్కవాళ్ళతో
ఢిల్లీ వెళదామనుకుంటున్నారు. తిరిగి రావటానికి ఆరునెలలు పడుతుంది. ఈలోపు నా పెళ్ళి
జరగాలని కండీషన్ పెట్టారు."
నేనేమైనా మాట్లాడతానేమోనని ఎదురుచూసి,
నిరాశ చెంది, "ఏమంటావు..?" అన్నాడు.
"దేనికి?" అన్నాను.
"మావాళ్ళకు ఏదో ఒకటి చెప్పాలి
కదా.. దానికి.."
"చెప్పుకోండి మీకు ఇచ్ఛ
వచ్చింది..?"
"అయితే నీకిష్టమేనా..?"
"ఏంటి..?"
"ఇంకేంటి..? మావాళ్ళు అడిగింది
చేయటం.."
"నాటకాల పాత్రలు చాలానే
పోషించాను.. ఈ పాత్రా చేయగలనేమో. ఏదైనా చెప్పుకోండి. ఇంట్లోవాళ్ళతో కూడా
నటించేవాడికి చెప్పేదేముంది..?"
"ఇది నటన అని ఎవరు
చెప్పారు..?"
"నటన అని చెప్పలేదు.. ఆక్సిడెంటు
దర్యాప్తు అని చెప్పారు.. అక్కడ దృశ్యం వేరే ఉంది. అందుకే నటనేమో
అనుకున్నాను."
"కాదు. అదంతా నిజం.. వాళ్ళకు
నిన్ను చూపిస్తే కదా, వాళ్ళు ఆలోచించుకోగలిగేది.. కనీసం మనిషిని చూడాలి కదా..!
ఏదైనా వాళ్ళు సరేనంటేనే.. ఇంట్లోవాళ్ళ ఇష్టం లేకుండ నేనేం చేయను."
అంటే ఇక్కడ నా ఇష్టాఇష్టాలతో ఏం పని
లేదా?
కాస్త దూరం పోంగనే ఆపుకోలేక ఏడ్చేశాను.
రోడ్డుకు ఓ పక్కగ ఆపి నా ఏడుపు ఆగేదాక వేచిచూశాడు. కష్టం మీద తమాయించుకుని కళ్ళు
తుడుచుకున్నాను. అందరి దగ్గర ఎల్లలు లేనంత ధైర్యంగ పులిలా ఉండే నేను ఇతని దగ్గర
పిల్లిలా ఎందుకు మారిపోతానో నాకిప్పుడు అర్థమైంది.
"ఎందుకేడుస్తున్నావు..?"
"మీకేనా ఇంట్లోవాళ్ళున్నది.. నాకు
లేరా..?"
"వాళ్ళతో మాట్లాడాలంటే నీ
అభిప్రాయం తెలియాలి కదా..? అదే మాట్లాడాలి. పార్కులోకి రా. తీరిగ్గ, విపులంగ
మాట్లాడుకుందాం." అన్నాడు.
ఇద్దరం యూనిఫాంలో ఉన్నాం. నేను
రానన్నాను. అప్పటికే రోడ్డు మీద వచ్చిపోయేవాళ్ళు పోలీస్ జీప్ ని చూసి భయం భయంగ
దూరం జరిగి వెళ్తున్నారు.
"ఏఁ.. సిగ్గా?" అన్నాడు.
"ముందే చెప్తే సివిల్ లో
వచ్చేదాన్ని కదా.." అన్నాను. అడ్డమైన వేషాలన్నిటికీ చీరలు, గాజులు తెచ్చి
ఇస్తాడు. వాళ్ళింటికి మాత్రం యూనిఫాంలోనే తీసుకువెళ్ళాడు. అంటే డ్రెస్ లో ఉండి
కూడా నేనేం చేయలేని చవటను అని చూపించాడు. అసలు మా ఇంట్లో చిన్నతనం నుంచీ
గౌరవమర్యాదలూ గాడిది గుడ్లూ అని నేర్పకపోతే అక్కడే వాళ్ళందరిని కలిపి దులిపి
వచ్చేదాన్ని. కానీ తప్పు వాళ్ళది కాదు కదా. దులపాల్సింది ఇతన్ని. అది నేను
చేయలేను. అందుకే ఏడుపు.
ఏమనుకున్నాడో తన వైపు కిటికీ అద్దం
ఎక్కించేశాడు. జిప్సీ రోడ్డుకు కొంచెం పక్కగ తీసుకెళ్ళి ఆపి అతను కాప్ తీసేస్తూ,
"సరే ఇక్కడే మాట్లాడుకుందాం.." అన్నాడు.
"ఇందులోనా..? ఇట్లగా..?"
అన్నాను ఇంకా కోపంగ.
"మరి పార్కు వద్దంటున్నావు
కదా..?"
"మనం డ్యూటీలో ఉన్నాం.."
"కాసేపు ఆ డ్యూటీలో ఉన్న సంగతి
మర్చిపోవటానికే పార్కుకు రమ్మన్నాను."
"అందుకే ముందే చెప్తే సివిల్ లో
వచ్చేదాన్ని అన్నాను.."
"నీకు అనుమానం రావచ్చునేమో అని మా
ఇంటికి తీసుకువెళ్తూ చీర గీర ప్రస్తావన పెట్టలేదు. నీకు నాటకాలు నచ్చవు కదా..
డ్యూటీ కోసం తప్ప వేయనన్నావు. పెళ్ళి ప్రపోజల్ లాంటి సీరియస్ విషయాన్ని నాటకంగ
చేయిస్తే జీవితాంతం బాధ పడతావని సివిల్ ప్రస్తావన పెట్టలేదు. ఒకరకంగ డ్యూటీలో
ఉంటేనే ప్రొఫెషనల్ గ ఉంటాయి ఇవన్నీ.."
"ఏదీ.. ఇట్ల అద్దాలు మూసేసి జనం
ఎక్కువగ తిరగని స్థలంలో రోడ్డు పక్కన ఆపి.."
"ఇదే పని జనాలు చేస్తే బొక్కలో
తోస్తాం.." అన్నాడు తాపీగ.
"ఛి.." అన్నాను.
"ఇందులో ఛి ఏం ఉంది..? పోలీసులు
మనుషులు కారా..? వాళ్ళకు మాత్రం అటువంటి అవసరాలుండవా.?"
ఛి.. కాదు ఛిఛిఛి.. నిజంగనే ఇతని మేల్
ఇగోతో నన్ను నా వ్యక్తిత్వాన్ని చిత్రవధ చేస్తున్నాడు. సుభగ్ చెప్పినప్పుడే నమ్మి
ఉంటే కనీసం మానసికంగ సన్నద్ధమయ్యేదాన్ని. కానీ నేనిది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.
అతను నాటకం ఆడుతున్నాడనే అనిపిస్తోంది. ఈవిధంగ నన్ను సాధిస్తున్నాడేమో..!
"నువ్వు మన ఇద్దరి అమూల్యమైన సమయం
వృథా చేస్తున్నావు."
"ఇంక మాటలనవసరం.. నాకు వేరే సంబంధం
కుదిరింది.." అన్నాను నేరుగ.
"తెలిసింది అందుకే ఈ తొందర."
తప్పకుండా ఆయమ్మ అనసూయ పనే అయి ఉంటుంది.
ఆరోజు సరిగ్గ పెళ్ళి చూపులవేళకే ఇంటికి వచ్చింది.. ఏదో పని మీద. లేకపోతే విభాగంలో
ఇంటి విషయాలు తెలిసే పనే లేదు. "చాలా ఆలస్యమైపోయింది.. సారీ.."
"ముందే అడిగితే కాదనకుండా ఒప్పుకునేదానివా..?"
"నా స్థానంలో ఉంటే మీరు
ఒప్పుకునేవారా..?"
తల అడ్డంగ ఊపాడు.
"నేనూ అంతే. చచ్చినా
ఒప్పుకోను." అన్నాను.
"చూశావా, మన భావాలు ఎంత బాగా
కలిశాయో" అన్నాడు.
"అదే నా బాధ. ఎవరి కళ్ళతో మనను మనం
చూసుకుంటే వికృతంగ కనిపిస్తామో వారు మన జీవనసహచరులు ఎప్పటికీ కాలేరు."
"అది దృష్టిదోషం మాత్రమే.
మార్చుకోలేనిది కాదు.."
నాకు చిర్రెత్తింది. "అక్కర్లేదు.
నాకోసం తమరేం మారనక్కర్లేదు."
"నేను మారతానంటంలేదు. నీ దృష్టిని
మార్చమంటున్నాను.."
"మారదు. మీ కింద పని చేసినంతకాలం
అది మారదు. అయినా అసలు సబ్ ఆర్డినేట్ ని పెళ్ళి చేసుకోవటమేంటి? డిపార్టుమెంటులో
ఎంత పరువు తక్కువ.. అంతా ఏమనుకుంటారు..?"
"నువ్వు ఇంత విసురుగ ఎట్ల
మాట్లాడగలుగుతున్నావు.. పై అధికారి అన్న కనీస గౌరవం లేకుండా..?"
"మీరు పైఅధికారి మాట్లాడాల్సిన
మాటలు మాట్లాడండి. హుందాగ ప్రవర్తించండి. నేను మీ కింది ఉద్యోగిగా మర్యాద ఇచ్చి
మాట్లాడతాను. నా దగ్గర ఎవరు నా ఇష్టానికి విరుద్ధంగ పెళ్ళి ప్రస్తావన పెట్టినా
ఇట్లగే మాట్లాడేదాన్ని. అయినా మనం డ్యూటీలో లేమని మీరేగా అన్నది..?"
"మనం డ్యూటీలో లేమని మానసికంగా
అనుకోమన్నాను అంతేకానీ నన్ను అవమానించమనలేదు."
"మీరు ఇప్పుడు మీ ఇంటికి నన్ను
తీసుకువెళ్ళి చేసిందేంటి..?"
"పెళ్ళికి ప్రపోజల్ పెట్టటం అంటే
అవమానించటమని అర్థమా..? ఇంట్లోవారిది, నీది ఇష్టం ఒకేసారి తెలుసుకోవటానికి ఈ
మార్గం ఎంచుకున్నాను. ఎవరికెక్కడ నచ్చకపోయినా మళ్ళీ ఆట మొదటికొచ్చేదే కదా..! సరే,
నాకు ఇంతకన్నా వేరేగ నా అభిప్రాయం చెప్పటం రాదు. ఇదంతా వదిలేయ్. నీకెందుకు ఇష్టం
లేదో అది చెప్పు."
"దానికన్నా మందు మీకు ఎందుకు
ఇష్టమో చెప్పండి.." ఏదో కాస్తైనా వ్యవధి దొరుకుతుందని అడిగాను.
"అదా? తప్పక చెప్తాను. నీలాంటి
అమ్మాయిని నేనెక్కడా చూడలేదు. నాకు పిరికిగా ఉండే మామూలు అమ్మాయిలంటే అసహ్యం. చచ్చినా
అటువంటి అమ్మాయిని చేసుకోవద్దని గట్టిగ నిశ్చయించుకున్నాను. నువ్వు మాత్రం చాలా
ధైర్యం, కార్యదీక్ష, పట్టుదల ఉన్న మంచి ఆఫీసర్ వి. నీలో నేరం పట్ల అసహ్యం న్యాయం
పట్ల ఆరాధన చూశాను. ఇప్పుడే కాదు. మొదటి నుంచీ చూశాను. నీ కళ్ళలో సమాజంలో ఉన్న
చెడును చూసి రగిలే కసి నాకు నచ్చింది. కర్తవ్యం పేరు చెప్పానని నా పక్కన ఏ
సంబంధంతో అయినా నిలబడటానికి ఒప్పుకున్నావు. ఆ తెగింపు నచ్చింది. ఎప్పుడూ కేస్ లనీ
ఫైళ్ళనీ ఆలోచిస్తూంటావు. ఆ అంకితభావన నచ్చింది. కేస్ చేతిలోకి వస్తే అది కచ్చితంగ
పరిష్కరించాలన్న తపన నచ్చింది. నీ దగ్గర స్ట్రాటెజీ ఉంది. అప్రోచ్ ఉంది. నాకు
నచ్చింది. మన ప్లాన్లలో చాలాసార్లు ఇబ్బంది వచ్చినప్పుడు సమయస్పూర్తితో
ప్రవర్తించి ప్లాన్ చెడకుండా కాపాడావు. సలహాలిచ్చావు. సుభగ్ ఆలోచనలెన్నో అతనివి
కావు, నీవు చేసినవేనని తర్వాత తెలిసింది. ఏం చేయాలన్నా సహకరించేవారు కావాలి. నీ
వల్ల నాకు ఇవాళ విభాగంలో ఇంత గుర్తింపు వచ్చింది. నీలాంటి అమ్మాయి నాకు జీవన సహచరి
అయితే ఇంకా కృషి చేసి నేరసామ్రాజ్యాన్ని అంతం చేయగలననే ధైర్యం నాకు
వస్తుంది."
ఎంత సూటిగ చెప్పాడు..! నాకు ఏమనాలో
తోచలేదు. తల వాలిపోయింది. స్త్రీ సహజమైన సిగ్గు బిడియం అంటే ఏంటో మొదటిసారి
అనుభవానికి వచ్చాయి. నన్ను తన పోటీదారు సమఉజ్జీగ తీసుకున్నాడని భావిస్తున్న ఒక
శత్రుసముడు ఇటువంటి మాటలంటుంటే నాకు నిజంగనే క్షణకాలం భూమ్యాకాశాలు ఆనలేదు.
బయటకేమీ చూపకపోయినా మనసులోనైనా అంత గౌరవం ఉన్నందుకు నిజంగ ఆనందం వేసింది. కానీ
అంతవరకే.
కాసేపు నన్ను చూస్తూండిపోయి అన్నాడు-
"నువ్వు ప్రతీ కేస్ లో పక్కన ఉండి ఉండి అలవాటైపోయావు. నేను కర్తవ్యంలో భాగంగా
నాటకాలు వేసి వేసి నటనకు, నిజానికి తేడా చాలా కాలంగ మర్చిపోయాను. అందుకే ఈ భావన..!
ఇప్పుడు నీకెందుకు ఇష్టం లేదో చెప్పు.."
నేను కాసేపు మౌనంగ ఉండిపోయి,
చెప్పదలచుకున్నది మనసులో అనుకుని తర్వాత చెప్పాను. అతనంత సూటిగ చెప్పటం నాకు
జన్మలో రాదు. "రెండు కారణాలు- ఒకటి- మీరు పక్కన లేకపోయినా ఆ పనులు నేను
సొంతంగ చేసుకోగలను. మీ సహాయం అవసరం లేదు. రెండు- నాకు ఇంట్లో కూడ మీ సబ్ ఆర్డినేట్
గ పడుండే ఓపిక లేదు."
"నాకు నీ సహకారం అవసరమైన పక్షంలో..?"
"డ్యూటీ వరకు ఎప్పటికైనా సహకారం
ఉంటుంది. కానీ భర్త వేరు, పై ఆపీసర్ వేరు. మీకు పై ఆఫీసర్ గ తప్ప వేరేగ ఉండటం
రాదు.."
"ఏ భర్తైనా భార్యకు పై అధికారే
అవుతాడు."
"తాను పై అధికారి అనుకుని పెళ్ళి
చేసుకునేవాణ్ణి ఏ ఆడపిల్లా కట్టుకోవాలనుకోదు. వేదం కూడా భార్యను భర్తకు సహచరి అనే
చెప్పింది"
"నాకంత సంస్కారం లేదు. చేతా కాదు.
మేల్ ఇగో ఎక్కువ."
"అందుకే నాకిష్టం లేదు.
చాలా..?"
అతనికి నా మాట జీర్ణం కాలేదు. కాసేపు
ఊరుకుని తర్వాత -"దొంగతనం చేసి శిక్ష తప్పించుకోవాలనుకుంటున్నావా..?"
గుండెమీద రుద్దుకుంటూ అన్నాడు.
నాకు కోపం వచ్చింది. అనవసరంగ
అభాడాలేస్తే ఎవరికైనా వస్తంది. "విలువైనవి జాగ్రత్త చేసుకోలేక పోగొట్టుకుని
దొంగనెందుకు అనడం వారి అజాగ్రత్తే కదా ఒకణ్ణి దొంగను చేసేది."
"అంటే దొంగతనం చేశానని
ఒప్పుకుంటున్నట్టేగా.. దానికి శిక్ష పడి తీరుతుంది."
"దొంగతనానికి ఏ కోర్టూ జీవిత ఖైదు
శిక్ష వేయదు."
"శిక్ష దొంగిలించిన వస్తువును
బట్టి ఉండటం న్యాయం. ఒకరి జీవితాన్ని దొంగిలిస్తే జీవితఖైదు తప్పదు.."
నేను తదేకంగ చూసి అన్నాను-
"హంతకులను దొంగిలించటం తప్పేం కాదు. హంతకుడు దొంగకన్నా చాలా రెట్లు పెద్ద
నేరస్తుడు."
"ఇక్కడ హంతకుడెవరు..?"
"మీరే..! నా వ్యక్తిత్వాన్ని
దారుణంగ హత్య చేసినందుకు చేస్తున్నందుకు మీకు పడాలి ఆ శిక్ష."
"మరి అదే వెయ్యమని కదా
అడుగుతున్నది..?"
"మీతోపాటు ఆ శిక్ష నేనెందుకు
అనుభవించాలిట..? హంతకుడితోపాటు ఏ జడ్జీ జైలుకెళ్ళడు."
"నువ్వు జడ్జివెప్పుడైనావు..?
నువ్వు దొంగవు కదా..?"
"మరి దొంగను శిక్ష వేయమని ఎట్ల
అడుగుతున్నారు..?"
"హంతకుడికన్నా దొంగ కొంత నయమని
నువ్వే అన్నావు కదా.." అని ఆగి, "మొత్తానికి ఈ చర్చ ఏదో రసవత్తరంగ చాలా
బాగుందే. హంతకుడు వెడ్స్ దొంగ అని మండపం బయట వ్రాయిద్దాం." ఫక్కున నవ్వాడతను.
నాకూ ఆ దృశ్యం ఊహించుకుని నవ్వొచ్చింది.
నవ్వి, "లోకంలో దొంగకే తెలియకుండా ఏ దొంగతనం జరగదు. ఈ దొంగతనం నూటికి నూరు
శాతం దొంగ ప్రమేయం లేనిది. ఇందులో అంతా యజమానిదే తప్పు. చెప్పాకదా." అన్నాను.
"దొంగలకు ఉండే నేర్పరితనం వస్తువు
యజమానికి ఉండదు కదా.. అన్నివేళలా అంత ధ్యాస పెట్టటం కుదరదు."
"జీవితం క్రికెట్ లాంటిది. అన్ని
బాళ్ళూ సరిగ్గనే ఆడాను ఇదొక్కటి తప్పింది ప్లీస్ ఈసారి ఆడనివ్వండి అంటే అంపైర్లు
ఒప్పుకోరని ఎక్కడో విన్నట్టు గుర్తు."
అతను ఊహించలేదు నేను ఆమాట
తిప్పికొడతానని. అతను దెబ్బతినట్టు చూస్తుంటే నేనన్నాను- "ఆనాడు కళాశాలలో
మీకు జూనియర్ గ హింసపడ్డాను. ఈనాడు ఉద్యోగంలో సబార్డినేట్ గ శిక్ష
అనుభవిస్తున్నాను. రేపుదయం జీవిత భాగస్వామినిగా నరకం చవిచూస్తాను. నరకంలో
యమధర్మరాజు చేసిన తప్పుకే శిక్ష వేస్తాడు. కానీ.. మీరు అంతకన్నా గొప్పవారు.."
"ఇంత కఠినాత్ముణ్ణి శిక్షించాల్సిన
అవసరం నీకు లేదా..?"
"అందుకే కదా వేరే సంబంధం
ఒప్పుకుంటున్నాను.."
"అది నీకు నువ్వు విధించుకుంటున్న
శిక్షేమో.."
ఠకీమని చూశాను.
"ఎట్లవుతుంది..?"
"ఒకరిని ప్రేమించి ఇంకొకరిని
కట్టుకోవటం.."
"నిజమైన పోలీస్ అనిపించుకున్నారు.
చితకకొట్టి చేయని నేరాలు కూడ ఒప్పిస్తున్నారా..?"
"లేదు. నిజంగ నేరం చేశారన్న తగినంత
సాక్షాధారాలు లేకుండ నేను ఇంతవరకూ ఏ నేరస్థుణ్ణీ వేలేసి ముట్టుకోలేదు. సాక్షం ఉంది
కనకనే ఈమాట మాట్లాడుతున్నాను.."
"ఏంటా సాక్షం..?"
"నీ కళ్ళలో నాకోసం కనిపించే
భావన.."
"ఒక మేధావి, ఉద్యమశీలుడు అయిన
సీనియర్ గ, ప్రతిభావంతుడైన, కర్తవ్యనిష్ఠుడైన
మంచి ఆఫీసర్ గ తప్ప మీ పై మరే భావనా నాకు లేదు."
"అయితే ద్వేషం కూడా
లేనట్టేనా..?"
"మీకిందే ఉద్యోగం చేయాలి అంటే
మీమీదే ద్వేషం పెట్టుకుని చేయలేను కదా. రోజూ మొహాలు చూసుకోవాలి. కలిసి పనులు
చేయాలి. అయినా పై ఉద్యోగిగా అనుకుంటే ఏ భావనా లేకపోయినా ఉద్యోగం చేయవచ్చు."
"మరి పెళ్ళి చేసుకోవటానికి కూడ
అట్లగే అనుకోవ్చచ్చు కదా.."
"ఉద్యోగం వేరు. పెళ్ళి వేరు.
భావాలు కలిస్తేనే ఏ జంటైనా నిండునూరేళ్ళ ఆ పంటను పండించ గలుగుతుంది. లేదంటే అది ఓ
పెంటా, తంటా, మంట అవుతుంది."
"అయితే ఏ భావన ఉందని ఆ డాక్టరును
కట్టుకుంటున్నావు మరి..?"
"అది మా పెద్దవాళ్ళు చూసిన సంబంధం
కనక ఆ భావన నాకు చాలు.."
"అంటే మీ పెద్దవాళ్ళు అతని బదులు
నన్ను చూపించి ఉంటే ఏ భావనా లేకపోయినా నన్నే కట్టుకునేదానివా..?"
నేను ఠకీమని చూశాను.
అతను ఏదో సమాధానం దొరికినట్టుగా నా వంక
కాసేపు చూసి తర్వాత జిప్సీ స్టార్ట్ చేశాడు.
అంటే ఇప్పుడు ఇతను నాన్నగారిని
కలుస్తాడా..?
నేను ఊహించిన విధంగానే ఆ ప్రణాలికలో
భాగంగానే వచ్చి కలిశాడు ఆ మరునాడే. అప్పటి నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. నాన్నగారికి
డాక్టరు సంబంధం కన్నా అనురాగే నచ్చచ్చు కూడా. అందుకు ఒకే కారణం మా ఇద్దరిదీ ఒకే
కార్యక్షేత్రం కావటం. వచ్చిన డాక్టరు సంబంధం వారికి పెద్దగ మా విభాగం గురించి
పనితీరు గురించి అవగాహన లేనట్టుగ ఉంది. అసలేం షరతులే పెట్టలేదు. తర్వాత
భవిష్యత్తులో ఒత్తిడి తీసుకువచ్చే ఉద్దేశంతో ఉన్నారేమో తెలియదు. నా బాచ్మేట్స్
అమ్మాయిలు ఒకరిద్దరు పెళ్ళయ్యాక ఉద్యోగాలు మానేయవలసి వచ్చిందిట. శిక్షణ సిబిరంలో
తెలిసింది. నాదీ అట్లగే అవుతుందేమోనని నాన్నగారి భయం. నేనెంత కోరికతో, ఆరాధనతో ఈ
లైను ఎంచుకున్నానో ఆయనకు తెలుసు.
అందుకేనేమో అతను వచ్చి మాట్లాడి
వెళ్ళినా ఆయన ఒక్కమాటా నన్ను అనలేదు. ఏంటీ గోల అని విసుక్కోలేదు. కంగారు పడలేదు,
పెట్టలేదు. ముందే ఊహించారేమో తెలియదు. కానీ ఆశ్చర్యపోలేదని అర్థమైంది. నిమ్మళంగ
నిర్ణయం నాకే వదిలేశారు. నాకే నిర్ణయం వదిలినా మనస్సులో నేను ఒప్పుకుంటే
బాగుండునని ఉందేమోననిపించింది. ఎందుకంటే అనురాగ్ రూపగుణాలలో ఆడపిల్లల తండ్రుల
మనస్సులను ఇట్టే లాగేసేలా ఉంటాడు.
ఆ మాట పక్కకు పెడితే నిన్న సుభగ్
కలిశాడు. ఆరోజు యాక్సిడెంట్ పేరు చెప్పి అనురాగ్ నన్ను వాళ్ళ ఇంటికి
తీసుకుపోయినప్పుడు అతనికి అనురాగ్ మనసులో ఉద్దేశం అర్థమైందిట. నిలదీస్తే అనురాగ్
మొత్తం విషయం చెప్పేశాడట. సుభగ్ వెంటనే నన్ను కలవటానికి వచ్చాడు..; ఒక స్నేహితుడిగా తన సలహా అవసరమవుతుందనుకున్నాడట..! అతనితో మాట్లాడాక
అనురాగ్ లోని మరి కొన్ని కోణాలు నాకు పరిచయమైనాయి. తను ఇచ్చిన సలహా ఏంటంటే, అనూది
నాకు తెలిసిన బేరం. ఖచ్చితంగ ఉద్యోగం మానేయమనే రకమైతే కాదు. ప్రమోషన్లు తదితర
విషయాల్లో కూడ నాకెన్నటికీ ఇగో సమస్యలు రావు. నాలుగేళ్ళు సీనియర్ కనక..! ఏదైనా
మనిషిగా నాకతని కోణాలన్నీ తెలిసినవే. మనిషిగా, పోలీసుగా, మగాడిగా కూడా. అతని బయటి
ప్రవర్తన పక్కకు పెడితే లోపల అంత కఠినమైన మనిషి కాదు అన్నాడు సుభగ్ ఆశ్వాసనగా.
తప్పుడు మనిషైతే కచ్చితంగ కాదు. ఆరోజు జిప్సీలో ఆ విషయం మాట్లాడేటప్పుడు కూడ అతని
కళ్ళలో సన్నటి కన్నీటి పొర చూశానని గుర్తుకు వచ్చింది. ఆలోచించిన మీదట అతని భావాలు
నిజమైనవే అనిపించింది.
ప్రేమ, భావాలు పక్కకు పెట్టినా ఒకవేళ
చేసుకొన్నా కూడా విధి లేకో, అలవాటైపోయో చేసుకోవాలి. ఎందుకంటే సర్విసులో ఉన్నంతకాలం
ఆలోచనల ద్వారా అతను నాలో ఉంటూనే ఉంటాడు. ఇంటికి వచ్చాక కూడ ఆఫీసు సమస్యలే నన్ను
చిత్రవధ చేస్తూంటాయి. అతని మాటల ప్రభావం అనల్పమైంది. అప్పుడు నేను వేరొకరిని
కట్టుకున్న పక్షంలో భర్తతో పూర్తి అనుబంధాన్ని అనుభవించలేను. కనీసం అతనైనా వేరే
పెళ్ళి చేసేసుకుని ఉంటే నాకు వేరే సంబంధం అవకాశం దొరికేది. లేదా పెళ్ళనే ఆలోచనే
లేకుండ ఇట్ల పడి ఉండేదాన్ని. అట్ల కాక అతను నా ముందు ప్రస్తావన తీయనే తీశాడు. ఇంక
నాకు వేరే దారి లేకుండ అయింది. ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది..! సుభగ్ అన్న
తరువాత అదీ నిజమేననిపించి ఆలోచిస్తున్నాను.
నా ఆలోచన ఇట్ల కావటానికి అంశూ, నాన్న
కూడా కారణం. అతన్ని చేసుకంటే ఇద్దరినీ ఎప్పుడూ చూసుకుంటూ ఉండచ్చు. వాడి చదువైపోయి,
ఉద్యోగంలో స్థిరపడేవరకు వాడికి నా సపోర్టు అవసరం ఉంటుంది. తర్వాత వాడి పెళ్ళై, ఈ
ఇంటికి దీపం పెట్టే దిక్కు వచ్చాక నాన్న గురించి నాకే దిగులూ ఉండదు. అదే ఇతర
వృత్తులలో ఉండేవారితో పెళ్ళంటే మళ్ళీ ట్రాన్స్ ఫర్లు, ఏమో, ఎక్కడో.. అంతా ఆలోచనలో
కూడా కష్టమవుతుంది. ఇప్పుడతనికి ఉన్న పరపతికి డిపార్టుమెంటులో ఏదడిగినా పైవారు
కాదనలేని పరిస్థితి. అతని దృక్పథం మిగితా విషయాల్లో కూడా పాజిటివ్ గనే
అనిపించింది.
*
"ఏంటక్కా? రాత్రంతా
పడుకోలేదా?" అంశూ వచ్చి అడిగితే తేరుకుని చూశాను. గంట ఐదై ఉంటుంది. రోజూ వాడు
లేచే వేళ. సరే నేను ఇంక స్నానాదులు కానించేసి, పూజ చేసుకుని, వాణ్ణి కోచింగు
కెళ్తూ నన్ను గుడి దగ్గర దింపమన్నాను. అంశూ నన్ను దింపి వాడూ దండం పెట్టుకుని
వెళిపోయాక, అమ్మవారికి మనస్పూర్తిగ దండం పెట్టుకుని నా నిర్ణయం ముందుగా ఆమెకే
చెప్పుకుని ధైర్యం ఇమ్మని అడిగాను. ప్రసాదం తీసుకుని గట్టు మీద కూర్చున్నాను. కొంత
సేపటికి ఎందుకో తల తిప్పి చూస్తే అనురాగ్ ఉన్నాడు పక్కన.
ఎప్పుడొచ్చాడో ఎంత సేపటి నుంచి
గమనిస్తున్నాడో తెలియదు చూడంగనే నవ్వాడు. నేనూ చిరునవ్వు నవ్వాను. "ఎట్ల
తెలుసు, ఇక్కడ ఉన్నానని..?"
"తెలియదు. నాకు ఈ గుడి అంటే ఇష్టం.
రోజూ వస్తాను. ఇవాళ నువ్వు కనిపించావు." అని ఆగి, "థాంక్స్.."
అన్నాడు.
దేనికి అన్నట్టు చూశాను.
"నన్ను మన్నించినందుకు.. లేదంటే
నవ్వేదానివి కాదు."
నేను పరిసరాలు చూసి, "ఇది దేవాలయం.
మనం ఇంకెక్కడైనా ఈ విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది. మనం మాట్లాడుతున్న విషయం
భక్తి, ఆధ్యాత్మికాలు కాదు.. పచ్చి లౌకికం. ఇక్కడకు వచ్చినవారు అభ్యంతర
పడవచ్చు.." అన్నాను.
"ఇక్కడికి వచ్చేవారంతా పెద్ద
అలౌకికాలేం అడగరు.. చర్చించరు. అవసరాల కోసం దేవుడితో బేరాలాడతారు. వివాహంవంటి
పవిత్రమైన నిర్ణయం గురించి భగవంతుడు సన్నిధికన్నా ఉత్తమమైన స్థలం ఇంకేదీ ఉండదు.
ఇక్కడే మాట్లాడదాం.."
"ఎంత పవిత్రమైనా లోకానికి
సంబంధించిందే కదా. అయినా అంతా మనలాగే ఉంటారనుకుని ఇట్ల తేల్చిపారేయటం సరికాదు.
అంతా ఒకేరకం మనుషులు ఉండరు. అయినా ఒకరి అంతర్భావాలు మీకేం తెలుస్తాయి..? నిజంగ
భక్తిభావంతో వచ్చిన వారికి మనం ఇబ్బంది కలిగించటం పద్దతి కాదు కదా. పద్ధతే మీ
ప్రాణం అని ఢంకా బజాయిస్తారే.. మీరు ఉద్యోగి మొదలు, మనిషి తర్వాత అని అంటుంటారు
కదా.."
"ఎవరైనా తప్పు పడితే చూద్దాం
లే.."
"ఎవరూ ఇట్లాంటి విషయాలు ముఖం
పట్టుకుని చెప్పరు. కానీ అంతా దీనిని తిరస్కార భావంతో చూస్తారు. అక్కడ గోడ మీద
నిబంధనలున్నాయి. చదవండి. అయినా మన వంతు మనం కూడ నియమాలను గౌరవించి పాటించకపోతే
ఎట్ల..?"
అతను గోడ వంక చూసి, ప్రథమ నియమం చదివి,
తల ఊపి, "సరే పద.. కానీ ఎక్కడికి?" అన్నాడు.
"మా ఇంటికి.."
"మీ నాన్నగారు..?"
"ఆయనకు మన విషయం తెలియనిది కాదు
కదా.."
ఇద్దరం అతని కారులో ఇంటికి వెళ్ళాం.
అప్పటికి పూజలో ఉన్నారు నాన్నగారు. ఆయనకు అతని రాక గురించి చెప్పి, ముందుగదిలో
అతనితో కూర్చున్నాను. అతనే మొదలుపెట్టాడు.
"నా ప్రస్తావనను ఒప్పుకున్నందుకు
థాంక్స్.."
"నేను ఒప్పుకున్నానని మీతో
చెప్పానా..?"
"ఒప్పుకోకపోతే ఇట్ల నన్ను ఇంటికి
తీసుకు వచ్చి మర్యాద చేసేదానివి కాదు. అక్కడే ముఖం మీద చెప్పేసేదానివి. అయినా నా
అంతటివాడు స్వయంగ అడిగితే కాదనేంత గొప్ప అమ్మాయి ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు."
"కానీ ఒక ఒరలో రెండు కత్తులు ఉండటం
కుదరదు."
"అంత పీనాసితనం ఎందుకు? ఒర పెద్దది
చేసుకందాం.. డబల్ డక్కర్..!! లేదా కత్తుల్లా ఉండటం మానేద్దాం."
"ఎవరు మానేయాలి..? మీరా
నేనా..?"
"నేను ఆక్రామక కత్తిగ ఉండటం
మానేస్తాను.. నువ్వు సహించే కత్తిగా ఉండటం మానేయి."
"అస్తిత్వాలు అంత తొందరగ రూపు
మాయవు.."
"ప్రతీదీ మౌనంగ సహించేంత బేలగ
ఉండటం నీదే తప్పు. తప్పు చేస్తున్నాడని తెలిసినప్పుడు శిక్షించకుండా వాణ్ణి
సహించటం నేరాన్ని ప్రోత్సహించినట్టవుతుంది. అదీ శిక్షార్హమైన నేరమే."
"మీరు నాకన్నా వయసు, హోదా, అధికారం
అన్నిట్లోనూ పెద్దే. మిమ్మల్ని ఎదిరించే హక్కు నాకు సామాజికంగ, నైతికంగనే, కాదు
ధార్మికంగ కూడ లేదు. లేని హక్కును నేనెక్కడినుంచి వినియోగించుకోను..?"
"మరి అయితే సహించక తప్పదు..
జీవితాంతానికి శిక్ష వేస్తున్నాను.."
"మీకింద పనిచేయటం ఎట్లగో
జీవితాంతానికి శిక్షే కదా..! అది చాలదా..? అయినా శిక్ష వేసేది ఏ తప్పూ చేయని వారు.
స్వయంగ నేరస్తులైనవారికి ఇంకొకరిని విచారించే అధికారం లేదు."
"అయితే ఇద్దరం నేరమే చేశాం. కనక
ఇద్దరం శిక్ష అనుభవిద్దాం.."
"మీకింది ఉద్యోగినిగా
ఇన్నాళ్ళనుంచి అనుభవించినది అదే. నా శిక్ష ఎన్నడో పూర్తైంది. సమంగ అనుభవించటానికి
నేరాలు సమమైనవి ఉండాలి. మీది హింసించిన నేరం. నాది సహించిన నేరం. సహించి భరించటమే
ఆ నేరానికి శిక్ష."
"మరి సహించి ప్రోత్సహించిన నేరం
సంగతేంటి..?"
"సహించింది మీ పెద్దరికం కోసం..
ఇందాకే చెప్పాను."
"అయితే పెద్దవాడిగ తప్ప మాట
చెల్లుబాటు అవ్వదంటే నీ కళ్ళలో దేనికి విలువో దాన్ని ఆధారంగ చేసుకుని అడుగుతాను.
అప్పుడు ఒప్పుకుంటావా..?"
"ఈ విషయాల్లో మగవాడే పెద్దవాడై
ఉంటాడు. కనక మీ పెద్దరికం ఉద్యోగం వరకే. అది ఇక్కడ చెల్లదు."
"అయితే బలప్రయోగం విధానం
చేపట్టాల్సి వస్తుంది."
"చెప్పాను కదా! అస్తిత్వాలు అంత
తొందరగ రూపు మానవు అని.."
"అంటే నువ్వూ సహించే కత్తివి కావటం
మానవన్నమాట. అంటే ఒప్పుకున్నట్టేనన్నమాట.."
"మనం పెళ్ళి చేసుకంటే నేను ఈవిధంగ
అన్నింటికీ ఒప్పుకుంటూనే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇందాకటిలా ప్రతీ దానికి మిమ్మల్ని
చిన్నచిన్నవాటికి ఒప్పించటానికి ముప్పతిప్పలు పడాల్సి వస్తుంది అని
ఆలోచిస్తున్నాను.."
"అయితే నేనంటే నీకు ఏ కోశానా ఇష్టం
లేదు. కనక పెళ్ళి చేసుకోను అంటావా?"
"ఆ మాట నేననలేదు."
"మరి నన్ను చేసుకుంటే ఇంటా బయటా
సబ్ ఆర్డినేట్ గ పడి ఉండే ఓపిక లేదన్నావుగా..?"
"ఔను. ఇప్పుడూ అదే అంటున్నాను.
కానీ నేను వేరే చేసుకుంటే అతను మీకన్నా ఓ ఆకు ఎక్కువ నమిలినవాడనుకోండి. అప్పుడు
రెండుచోట్లా ఇద్దరు వేర్వేరు రాళ్ళతో పళ్ళు రాలకొట్టుకోలేను. అందుకే
ఒప్పుకుంటున్నాను. తెలియని రాయి కన్నా తెలిసిన రాయయితే ఎంత దెబ్బ తగులుతుందో ఊహ
ఉంటుంది. ఈ మాట నిర్ణయించుకోవటానికే నాకు ఇంత కాలం పట్టింది."
"అంటే పెళ్ళంటే పళ్ళు
రాలగొట్టుకోవటం, మొగుడంటే రాయి అనేనా నీ ఉద్దేశం..?"
"కాదని నిరూపించగలిగే ఒక్క
మగవాణ్ణి చూపించండి..!"
అతను కాసేపు ఆలోచించి, "కష్టమే.
నేనే ఆ స్థానం కోసం ప్రయత్నించాలి..! ఇదొక కాంపిటిటివ్ పరీక్ష అనుకుంటాను."
అన్నాడు.
నేను మౌనంగ చూస్తూ కూర్చున్నాను ఏమీ
అనకుండా. అంతలో నాన్నగారు వచ్చారు. నేను లేచి లోపలికి వచ్చేశాను. నాన్నగారు అతన్ని
పలకరించి నా దగ్గరకు వచ్చి అడిగారు "ఏమ్మా. ఏమైనా నిర్ణయానికి వచ్చావా
మరి..?"
నేను అతనితో పెళ్ళికి సిద్ధంగనే
ఉన్నానని చెప్పాను. నాన్నగారు, "సంతోషం." అని అతనితో వెళ్ళి ఆ మాటే
చెప్పారు. అతను ఆశ్చర్యంగ నన్ను పిలిపించాడు. నేను అమ్మవారి ప్రసాదం తీసుకు వెళ్ళి
అతనికి నాన్నగారికి ఇచ్చాను. నాన్నగారు ఆనందంగ, "ఇప్పుడే ఈ మాట మీ అమ్మకు
చెప్పి వస్తాను.." అంటూ లోపలికి వెళ్ళారు.
"అయితే నీ సహించే కత్తి పాత్ర
పోషించటానికే సన్నద్ధమవుతున్నావన్నమాట.."
"మీరు ఆక్రామక కత్తి కావటం మానేసే
రోజు కోసం ఎదురుచూస్తాను.."
"ఏం చేద్దాం..? అస్తిత్వాలు తొందరగ
రూపు మాయవు కదా." అతను అన్నాడు.
"ఇప్పుడు మీరిట్ల అడిగి నన్ను
చేసుకోవటం, నా ధారణను మార్చే ప్రయత్నం చేస్తాననటం- అస్తిత్వం రూపు మాయటం
కాదా..?"
"నిజమేలే.. ఏమో ఇప్పుడు నీ ఆశ కూడ
అసంభవం కాదేమో అనిపిస్తోంది." అతను నవ్వాడు.
నేను అతని నవ్వును చూస్తూ కూర్చున్నాను.
జీవితాంతం చూడాలని సన్నద్ధమయినాను. ఆడపిల్ల తండ్రి మనసే కాదు, ఆడపిల్ల మనసు కూడా
అతను లాగేయగలడు. ఆ నవ్వులో అంత బలం ఉండటం మొదటిసారి చూస్తున్నాను..!
మేమిద్దరం కలిసి బెస్ట్ సర్విస్ అవార్డు
తీసుకుంటున్న దృశ్యం నా కళ్ళముందు కదిలింది.
*********************
No comments:
Post a Comment