"బాబూ, ఇంక మీరు అమ్మాయినేమైనా అడగాలనుకుంటే
అడగచ్చు.."
సాహితి అక్కడకు వచ్చి కూర్చున్న అరగంటకు కూడ ఏ చలనం లేకపోయేసరికి ప్రత్యయ్‌ను
కదిపాడు సోమేశ్వరం.
ఏదో దీర్ఘాలోచనలోంచి తేరుకున్నవాడిలా మొదటిసారి తలెత్తాడు ప్రత్యయ్.
అప్పుడు చూసింది సాహితి, అతను ఆమె వంక మొదటిసారి
చూడటం. అతని ముఖభావాన్ని అంచనా వేసే విఫల ప్రయత్నం చేస్తుండగా "నేనామెతో
ఏకాంతంలో మాట్లాడాలి." దీర్ఘంగ ఓసారి నిట్టూర్చి అన్నాడతను స్థిరంగ.
కామాక్షమ్మ, శంకరం ఒకరి ఒనొకరు సంతోషంగ
చూసుకున్నారు. తర్వాత సోమేశ్వరాన్ని చూశారు. ఆయన తనకేమీ అభ్యంతరం లేదన్నాక సాహితి
లేచి తన గదివైపు నడుస్తుంటే ప్రత్యయ్ ఆమెను అనుసరించాడు.
'ఏం మాట్లాడతాడు? ఏదో సినిమాలోలాగ ప్రేమ, పెళ్ళి, జీవితం మొదలైన అంశాల గురించి విపులంగ
చర్చిస్తాడా? ఇంకేదో సీరియల్‌లో లాగ ఏవో ప్రశ్నలడిగి జవాబులు
రాబడుతూ తనను అంచనా వేయటానికి ప్రయత్నిస్తాడా? లేక అదేదో
కథలో లాగ తన పద్ధతులూ, ఆశలూ, ఆశయాలూ
విపులంగ తెలియచెప్పాలని ఉబలాటపడతాడా? లేక అనితా దేశాయ్
కథలోలాగ ఐ వాంట్, ఐ వాంట్.. అంటూ పెళ్ళి తర్వాత తను
బంధించుకోవాల్సిన చట్రం రూపురేఖలు వివరిస్తాడా?'
'సర్లే చూద్దాం...' ఇద్దరూ గదిలో ఎదురుబదురు
కూర్చున్నాక సాహితి ఆలోచనలు ఆగిపోయాయి.
అతను అటూ ఇటూ చూసి, లేచి వెళ్ళి ఠక్కున తలుపు
గొళ్ళెం పెట్టి వచ్చి కూర్చునేసరికి సాహితి కొంచెం అప్రమత్తురాలైంది. ఇక్కడ
ఇప్పుడు ఏం జరగబోతోంది..?
"నాకు మీ నుంచి ఓ సహాయం కావాలి.." సూటిగ విషయానికి వచ్చాడు ప్రత్యయ్
గంభీరంగ చూస్తూ.
ఆశ్చర్యంతో చెప్పమన్నట్టు చూసింది సాహితి.
"మీకీ పెళ్ళి వద్దని మీ వాళ్ళతో చెప్పేసేయండి.. ప్లీస్..."
సాహితి కొంచెం హతాశురాలౌతూ, "అదెందుకు?"
అని అడిగింది.
అన్నిటికన్నా ముందు పెళ్ళిచూపులు అనంగనే అద్దం ముందు అనవసరంగ గడిపే వృథా
సమయమే ఆమెను చిరాకు పరుస్తుంది. పైగా ఇవాళ ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంది ఈ తంతు
కోసమని. తీరా ఇది వింటానికా?
"నాకు స్వతంత్రం లేదు. మీకు ఉన్న స్వతంత్రాన్ని నేను ఉపయోగించుకోవటం ఒక్కటే
నా దగ్గర ఉన్న మార్గం.. అందుకు.." అసహనంగ అన్నాడతను, కళ్ళద్దాలు
పైకి ఎగదోసుకుంటూ కిటికీ బయటకు చూస్తూ.
"కానీ అసలు కారణమేంటి..?"
"కారణాలూ గట్రా ఇప్పుడు అనవసరం. వద్దంటే వద్దు. అంతే." అతడి అసహనం
మరింత పెరిగింది.
"సరే, చెప్తా కానీ ఏఁ..? ఎందుకు?
నేను నచ్చలేదా..?" సూటిగ అడిగింది.
అతను అంతకు ముందుకన్నా గంభీరంగ ఆమెను చూస్తూ, "కారణం
మీకు చెందింది కాదు. ఎవ్వరూ నచ్చటం నచ్చక పోవటంతో నాకు పనిలేదు.." అన్నాడు.
"ఎవరినైనా ఇదివరకే..."
"ప్లీస్... అటువంటివేం లేవు. ఏం
చెప్పాలో తెలుసు.. ఎట్ల చెప్పాలో తెలియక ఆలోచిస్తున్నాను.."
సాహితి నవ్వి, "మీకు పెళ్ళిచూపులు మొదటిసారా..?"
అనడిగింది.
అతను తల ఊపాడు, కానీ నవ్వలేదు.
"నాకేం మొదటిసారి కాదులే.. నేను అర్థం చేసుకోగలను.. చెప్పండి."
అతను ఓ ఐదు నిముషాలు గడిచినా ఏమీ మాట్లాడలేదు. సాహితి నిశ్వసిస్తూ,
"మీరు కోరింది నేను చెయ్యాలంటే నేను కోరింది మీరూ చెప్పాలి
కదా.. నా స్థానంలో మీరు ఉంటే కారణమైనా తెలుసుకోగోరేవారు కారా?" అన్నది.
ప్రత్యయ్ ఆమె వంక అదే గాంభీర్యంతో చూసి మళ్ళీ కిటికీ బయటకు
చూస్తూండిపోయాడు.
అమ్మానాన్నలకు ఒక్కరే సంతానమై, తోబుట్టువులు ఎవ్వరూ
లేని పక్షంలో, వారికి కొత్తవారితో మాట్లాడటం చాలా కష్టమే
అవుతుంది. పైనుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి డిఫెంస్‌లో పెద్ద హోదాలో ఉన్నాడు.
చదువు తప్ప వేరే లోకం తెలిసినట్టు లేదు. కష్టపడి స్వంతంగ ఏ రికమెండేషనులూ
లేకుండ పైకి వచ్చాడు మరి. వ్యక్తి మాత్రం చాలా మంచివాడని, కుటుంబం
మంచిదనీ మధ్యవర్తి చెప్పాడు. కానీ నాన్న ఎప్పుడూ ఇటువంటి విషయాలు ఏవైనా మన సొంతంగ
మనం చూసుకుని నిర్ణయించుకోవాలి అంటారు.
అతన్ని పరీక్షగ చూసింది సాహితి. పెద్ద అందగాడు కాదు. కానీ విశాలమైన నుదురు
అతనిలో ప్రధానమైన ఆకర్షణ. మెరిసే కళ్ళు అతని మేధోసంపదను తేటతెల్లం చేస్తున్నాయి.
మంచి ఆలోచనాపరుడని చూడంగనే చెప్పవచ్చు. కానీ పరిస్థితి చూస్తుంటే ఇతన్ని అంచనా
వేయాల్సిన అవసరమే లేదనిపిస్తోందే..! పెళ్ళే వద్దనేస్తున్నాడు కదా.
"అమ్మా నాన్నా బలవంతం చెయ్యకపోతే నేను వచ్చేవాణ్ణే కాదు. ఎందుకంటే నాకు
మిమ్మల్నే కాదు, ఎవ్వరినీ పెళ్ళి చేసుకోనే ఉద్దేశమే
లేదు.." ఓ ఐదు నిముషాలాగి అన్నాడు, సాహితి వంక చూసి.
"అంటే.. జీవితాంతం.. ఇట్లగే ఉండిపోదామనా..?"
తల ఊపాడు.
"ఎందుకో తెలుసుకోవచ్చా..?"
"అది నా వ్యక్తిగతమైన విషయం...."
"పెళ్ళి వద్దన్నారు. సరే.. ఫరవాలేదు. కానీ కుతూహలంతో అడుగుతున్నా.
జీవితాంతం ఒంటరిగ బోర్ కొట్టదా..?"
"బోర్ కొట్టేంత టైమ్ నా దగ్గర లేదు. వీలుంటే ఇంకో మూడు నాలుగు జీవితకాలాల
ఆయుర్దాయం ఎవరైనా అరువు ఇచ్చినా తీరనంత పని ఉంది నాకు.."
అమ్మో.. అంత చేటు ఏం పని ఉందో..!
"నా పనులు, ప్రణాలికల గురించి చెప్పటానికిది సందర్భం
కాదు. చెప్పినా తెలుసుకునే పరిజ్ఞానం మీకుందో లేదో.."
సాహితి అతన్ని చటుక్కున చూసింది.
"సారీ, ఇది మిమ్మల్ని కించపరచటానికి అనలేదు. నాకు
ఎదటివారు అర్థం చేసుకునే విధంగ మాట్లాడటం రాదు."
"తప్పేం కాదులే. ఎవరి విషయమై వారికి పరిజ్ఞానం ఉండటమే ఎక్కువ. అందరికీ
అన్నీ తెలియాలని లేదు కదా.."
"థాంక్స్.. కానీ నేను మామూలుగానే ఎక్కువ మాట్లాడను. ఏదైనా వివరించాలని
చూస్తే అది నాకు తెలియకుండనే ఎదటివారిని నొప్పించే విధంగ ఉంటుంది. ప్రయత్నించీ
వృథాయే.. అందుకే.."
"..అందుకే మాట్లాడటం పూర్తిగ మానేశారు.. అంతేనా..?"
"మానేయలేదు కానీ తగ్గించుకున్నాను. మాట్లాడితే అందంగ మాట్లాడాలి.
ఎదటివారిని నొప్పించకుండ మాట్లాడాలి. అది చేత కానప్పుడు మౌనంగ ఐనా ఉండాలి. నాకు ఈ
పరిస్థితి చాలా ఎంబారెసింగ్‌గా ఉంది. ఐ మీన్.."
సాహితి లేచి ఫాన్ వేగం పెంచుతూ, "ఓకే. కాసేపటి
కోసం పెళ్ళిచూపులూ, ఈ తంతూ, మీరు
ఇక్కడికి వచ్చిన పనీ అన్నీ మర్చిపోండి. బహుశ అది మీ భావాన్ని నాకు తెలియచేయటానికి
తోడుపడుతుంది అనుకుంటే.." అంది.
"మీరు బాగ మాట్లాడటమే కాదు. అర్థం చేసుకుంటారు కూడ. నాలో లేని ఆ సుగుణాలు
రెండూ మీలో ఉన్నాయి."
"ఆఁహాఁ.."
"ఔను.. మీరు వచ్చిన దగ్గరి నుంచీ మా అమ్మావాళ్ళతో మాట్లాడే పద్ధతి
గమస్తున్నాను. భలే చక్కగ ఉంది మీ మాటతీరు. ఎంతైనా మాటలే కదా మీ వృత్తీ, ప్రవృత్తీ.."
సాహితి వృత్తి కౌన్సిలింగ్. ప్రవృత్తి రచనా వ్యాసంగం. వాటి మాటెట్లున్నా 'మనిషి సంఘజీవి. నలుగురితో కలిసి బ్రతకాలి. ఏ గొడవలైనా నోటి వల్లే వస్తాయని
తెలుసుకుంటే మంచి మాట దానికై అదే వస్తుంది' అని ఆమె నమ్మకం.
"నా వృత్తి నాకు నేర్పిందేంటి అనేది మీ వృత్తి మీకు నేర్పిన దానితో
కనిపెట్టారా..?"
సాహితితోపాటు ఈసారి ప్రత్యయ్ కూడ నవ్వాడు.
"లేదండీ.. నేను గమనించటంలో సున్నా..! గమనించాలన్నా ముందు నా ధ్యాస పరిసరాల
మీద ఉండదు."
"మరి.. ఇంకెక్కడ ఉంటుంది..?"
"ఏంటి కౌన్సిలింగ్ మొదలు పెట్టారా..?"
సాహితి ఆసక్తిగా, "సైంసు చదివిన మీకు కారణమనేది
ఎంత ప్రాముఖ్యత కలిగిందో తెలియనిది కాదు. దానికై ఈ అన్వేషణ. ఎదురుపడిన ప్రతీ
మనిషినీ తెలుసుకోవాలని ఉబలాటపడుతుంటాను. మీవంటి ఉత్సుకత రేకెత్తించేవారినైతే
వదిలేదే లేదు.." అంది.
"సరే.. చెప్పక తప్పదంటే చెప్తాను. నాకు ఎక్కువ సమయం ఆలోచనలతోనే గడుస్తూ ఉంటుంది..
అంతశ్శోధన..."
"దేని గురించి..?"
"ఆఫ్ కోర్స్.. నా పరిశోధన గురించి.."
"ఆలోచనలు పనికి అడ్డం రావా..?"
"అంటే.. రోజువారి పనులు యాంత్రికంగ పూర్తవుతాయి. వాటి మీద ధ్యాస
పెట్టనక్ఖరలేదు. కొత్త పనైతే నేర్చుకునేంత వరకు కష్టపడతాను. తప్పదు.. ఐతే చాలాకాలం
ఇదేదో రుగ్మత ఏమో అనుకున్నాను. కానీ అది నా ప్రవృత్తి అని ఆలస్యంగ ఐనా
తెలుసుకున్నాను. తెలుసుకున్నాక నేను తీసుకున్న మొదటి నిర్ణయం పెళ్ళికి దూరంగ
ఉండటం.."
"దానికీ పెళ్ళికీ ఏంటి సంబంధం..?"
"పెళ్ళి అనేది ఓ వాస్తవిక ప్రపంచానికి సంబంధించిన విషయం. నా ఆలోచనలు ఎప్పుడూ
అవాస్తవిక, కాల్పనిక ప్రపంచంలో తిరుగుతుంటాయి. పెళ్ళి
చేసుకుంటే ఆ బంధం బాధ్యత నన్ను పరిమితుణ్ణి చేస్తాయి. భార్యకు భర్త నుంచి ఉండే
అపేక్షలు నే తీర్చలేను. అందుకే నామీద ఏ ఆశ పెట్టుకోవద్దని, ప్రయత్నాలేవీ
చెయ్యద్దని అమ్మావాళ్ళతో మొత్తుకున్నాను. తోడూ నీడా, వంశం,
దాని ఉద్ధరణా అంటూ వాళ్ళూ తగ్గలేదు. పోరు కొనసాగింది. పెద్దరికం
వాళ్ళ దగ్గర ఉంది కనక వాళ్ళే గెలిచారు. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. అటునుంచి
పనికాదని అర్థమై ఇటునుంచి నరుక్కొద్దామని పూనుకుంటున్నాను.."
సాహితి నవ్వి ఊరుకుంది.
"చూడండి, నాకింతకన్నా వివరించటం రాదు. చిన్నతనం నుండీ
ఎంత దీక్షతో చదివి ఈ స్థాయికి చేరానో! నేనొక సైంటిస్టును. రక్తం కణకణంలో, శ్వాసలో, నా నరనరాల్లో పరిశోధన దృక్పథం
కదులుతుంటుంది. పగలూ రాత్రీ తేడా లేకుండా నా సమయం అంతా ప్రయోగశాలల్లోనో
గ్రంథాలయాల్లోనో గడిచిపోతుంటుంది. ఆ ఆలోచనల అలసట తీరేందుకు గంటలు గంటలు అట్ల
పడుకుండి పోతాను. నాకు ఇతరులతో పని ఉండదు. చిన్నతనం నుంచీ సహజంగనే ఒంటరితనం అంటే
ఇష్టం."
సాహితి మౌనంగ తల ఊపింది.
"ఈ పరిస్థితుల్లో ఈ మనస్తత్వంతో నాకు నేను అలవాటు కావటమే కష్టం. ఇంక వేరొక
అమ్మాయితో నేను అలవాటు కావటం ఎంత అసంభవమో చెప్పండి. ప్రయత్నించి విఫలమవుతామని
తెలిసిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టటం అవివేకం కాదా? నేను
పెట్టుబడి పెట్టినందువల్ల వేరొకరు నష్టపోవటం నాకు తెలిసి చేసిన పాపం కాదా...?"
"కానీ ఒంటరి జీవితమంటే అంత తేలిక కాదు.."
"నాకు తెలిసిన విధంగ జీవితాన్ని బతుకుతాను కనక నాకోసం ఇదే తేలిక. నాకు భయం
లేదు. ఒక చిన్న ఆలోచన వచ్చిందంటే దానికి ఆకృతినిచ్చే వరకూ నాకు నిద్రాహారాలు
పట్టవు. అవి నన్ను స్థిరంగ ఉండనివ్వవు. నాకు భావోద్వేగాలు ఆశనిరాశలు కూడ చాలా
ఎక్కువ. ఏ సైంటిస్టుదైనా ఒక రకంగ చెప్పాలంటే ఓ శాపగ్రస్త జీవితం. నాతో ఒక ఆడపిల్ల
సుఖ పడలేదు. ఒంటరితనం, ఎదురుచూపులూ తప్ప ఆమెకు నేనేమీ
ఇవ్వలేను. సవితిపోరు జీవితానికి ఏ ఆడపిల్ల సిద్ధపడుతుంది చెప్పండి..? సిద్ధపడ్డా ఒకరి జీవితం పాడుచేసే అధికారం నాకు ఉందా..?"
"నిజమే, కానీ అట్లా అని పెళ్ళి చేసుకోకుండ ఉండిపోవటమూ
మంచిది కాదు కదా. అంత మానసిక ఒత్తిడి ఉన్న మనిషికి అర్థం చేసుకోగలిగే సహజీవి ఇచ్చే
ఉపశమనం సామాన్యలకన్నా ఎక్కువ అవసరం. అది ఆలోచించారా..?"
"ఉపశమనం పొందటానికి పెళ్ళి ఒక్కటే మార్గం కాదు. నిజానికి నా పనే నాకు
కావాల్సిన ఉపశమనాన్ని ఇస్తుంది. కనీసం ఇందులో వెనక పీకుడు ఉండదు. పైగా నేను చాలా
స్వార్థపరుణ్ణి. నా జీవితమంతా నాకే కావాలని దురాశ. అందులో ఒక్కొక్క క్షణం నాకోసమే
వినియోగించుకోవాలన్న అత్యాశ.. పేరాశ. సారీ, నాకు టైం లేదు.
పెళ్ళి ప్రాముఖ్యత గురించి మీతో చర్చించే ఆసక్తి నాకు లేదు. ఇప్పుడు కూడా నిన్న
రాత్రి ఆఫీస్ లాబ్స్‌లో సగం వదిలి వచ్చిన ప్రాజెక్టు మీదే మనసు గుంజుతోంది. నా
బాధ నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఐనా నేను మీతో ముందే చెప్పాను మీకు అర్థం
కాదని.."
సాహితి నిట్టూర్చి, "సరే, మీకు పెళ్ళి ఇష్టం లేదని మీరే నాన్నతో చెప్పండి. ఆయన అర్థం
చేసుకుంటారు.." అంది.
"నేను కాదనగలిగే స్వతంత్రం నాకు ఉంటే మిమ్మల్ని అడిగే పనే లేదు. అసలీ
పరిస్థితి తలెత్తేదే కాదు. మా నాన్నా అమ్మా వాళ్ళ మీద ఒట్లు వేయించుకుని నన్ను
ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళకు మీరు ముందే చాలా నచ్చారు. నేను కాదన్నా వాళ్ళు
వినరు. అందుకే మిమ్మల్ని చెప్పమంటున్నాను. ఒకవేళ నేను మిమ్మల్ని కాదన్నా మీ
నాన్నగారు మీలో ఏదో లోపం ఉందని కాదంటున్నానని బాధపడతారు."
సాహితి తల ఊపి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది.
ప్రత్యయ్ అసహనంగ అటూ ఇటూ తిరుగుతూ సాహితి సమ్మతి కోసం ఎదురు చూశాడు.
సాహితి ఐదు నిముషాలకు తలెత్తి అతన్ని అడిగింది- "మీకు నిజంగ మీ అధ్యయన
విషయం, పరిశోధనా అంటే అంత ఇష్టమా..? దాని
కోసం ఏమైనా చేస్తారా? ఏమైనా వదులుకుంటారా?"
"కుంటారా కాదు.. కున్నాను. ఒక్కటి కాదు.. ఆటలూ, పాటలూ,
సినిమాలూ, షికార్లూ, బంధువులూ,
స్నేహితులూ పిక్‌నిక్కులూ, పార్టీలూ, హాబీలూ... ఇట్ల ఎన్నో వదులుకున్నాను."
"జీవితంలో మీకు తరువాత ఎప్పుడైనా ఈ నిర్ణయం తీసుకుని మీరు తప్పు చేశారేమో
అనిపిస్తే...?"
"అనిపిస్తే అలసలు నేను వైజ్ఞానికుణ్ణే కాను.."
"మీరు వైజ్ఞానికుడు కాకపోయే అవకాశం లేకపోలేదేమో..! అది మీకు ఆలస్యంగ
తెలిసిన పక్షంలో..?"
"సవాల్లేదు. లోకంలో ఎవరి గురించి తెలిసినా తెలియకపోయినా తన గురించి తనకే
తెలియనివాడు మనిషే కాదు."
"చిన్నప్పటి నుండీ మీరు ఇట్లగే ఉన్నారా..?"
"స్టాటిస్టిక్సు లేకుండ ఏ రిసర్చూ నిలవదు. దాని ఆధారంగనే ఎవరైనా ఓ
నిశ్చయానికొచ్చేది.."
"ఎప్పటికీ ఇట్లగే ఉంటారా..?"
"ఒకసారి ప్రమాణీకరించి సిద్ధాంతీకరించబడ్డ ఏ భౌతిక నియమమైనా సార్వకాలిక
సత్యమే."
"కానీ అది పరిమిత పరిస్థితుల్లో..! అదే.., 'గివెన్
కండీషన్సు'లో మాత్రమే అనుకుంటా..?"
"నింగీ-నేలా-నీరూ-నిప్పూ-గాలీ.. ఏ పరిస్థతుల్లోనైనా ఒకే గుణాలు కలిగి ఉంటాయి.
నాకు తెలిసీ ఆ పంచభూతాల సమన్వయంతోనే నేను తయారయ్యాను.. కాబట్టి వాటి గుణాలే నాకూ
ఉంటాయని నమ్ముతాను.."
సాహితి నవ్వింది.
"ఎందుకు నవ్వుతారు?"
"ఎ సమ్ ఈస్ ఆల్‌వేస్ గ్రేటర్ దాన్ ఇట్స్ కాన్‌స్టిట్యుయెంట్
పార్ట్స్.."
"ఓహ్.. జెస్టాల్ట్ థియరీయా..? ఔనౌను. కానీ ఎంత
గొప్పైనా ఘటకాలకున్న గుణాలే కదా పదార్థానికీ ఉంటాయి.."
"ఐతే పంటభూతాల్లో ఏ భూతానికి మనసుందో చెప్పండి..?"
"అంటే..?"
"వాటికి లేని మనసు వాటితో తయారైన మనిషికెక్కడి నుంచి వచ్చింది..? మనసే కాదు, వయసూ జీర్ణతా కూడా.."
ప్రత్యయ్ సాహితిని స్థిరంగ చూశాడు, సమాధానం
గురించికన్నా ఆమె ప్రశ్న వెనక ఉన్న అర్థం గురించి ఆలోచిస్తూ.
"ఇంకోమాట.. ఒకసారి ప్రమాణీకరించి సిద్ధాంతీకరించాక అన్ని నియమాలూ
సార్వకాలికసత్యాలే అయి ఉంటే నాలుగు వందల ఏళ్ళ పాటు తిరుగులేకుండ ప్రపంచాన్ని ఏలిన
న్యూటోనియన్ ఫిజిక్సును సవాల్ చేస్తూ ఐన్‌స్టీన్ ఫిజిక్స్ ఎందుకు వచ్చింది..?
అది సరిగ్గ సిద్ధాంతీకరించబడలేదనా?"
"----"
సాహితి నవ్వుతూ లేచింది.
తలుపు గొళ్ళెం తీస్తుంటే, 'ఇంతకీ ఈమె నిర్ణయం ఏంటి..?
ఏం చెప్పకుండా వెళిపోతుందేఁ?' అనుకున్నాడతను.
సాహితి నేరుగ ముందుగదిలోకి వెళ్ళింది. అక్కడ కామాక్షమ్మా, శంకరం ప్రత్యయ్ వంక చూశారు. ప్రత్యయ్ కళ్ళలో ఎప్పటిలాగే అస్థిరత. ఆ
చూపుల్లో ఏ సమాధానమూ లేదు. సోమేశ్వరం సాహితి వంక ప్రశ్నార్థకంగ చూశారు. ఆమె
సిగ్గుతో తల దించుకుని, "నాకేం అభ్యంతరం లేదు."
అనేసి లోపలికి వెళిపోయింది.
ఆ క్షణం ప్రత్యయ్ నరనరాల్లో ఎంత కోపం ఉప్పొంగిందో కొలవటానికి ఏ పరికరమూ
ఎవ్వరూ కనిపెట్టలేదు.
కాలానికి నిలవటం, ఆగటం రాదు కాబట్టి జరగాల్సిన ఘోరం
త్వరలోనే జరిగిపోయింది.
అతని మనస్సు తుకతుక ఉడుకుతోంది. న్యూటన్ థియరీని ఐన్‌స్టీన్ పడగొడితే
తను వద్దని చెప్పమన్న పెళ్ళికి పచ్చజెండా
ఊపుతుందా..?! ఐనా భూమి పరిస్థులకు ఇప్పటికీ న్యూటన్
సిద్ధాంతమే సరైంది. భూపరిసరాలు దాటివెళితో కానీ ఐన్‌స్టీన్ థియరీ ప్రసక్తి రాదు.
ఐన్‌స్టీన్ చెప్పిందంతా అంతరిక్షానికి సంబంధించిన నియమాలు.. ఇవాల్టికి కూడ
భౌగోళికంగా న్యూటన్‌ను బీట్ చేయగల సమర్థుడు లేడు..!!
అంత మాత్రానికి తన జీవితకాల నిశ్చయాన్ని సవాలు చేస్తుందా..? తపస్సు చెడగొడుతుందా..?
పేరుకు గొప్ప సైకాలజిస్టు! ఇంత విప్పి చెప్పినా అర్థం చేసుకోలేకపోయింది..
ఛి.. ఇంకా ఎందుకు ఆ పీహెచ్‌డీ..!!?
అసలు ఈ పరిసరాలు చూస్తుంటేనే పరమ రోతగ ఉంది. ఈ అలంకరణలూ, పూలూ, మిఠాయిలూ,
అగరొత్తులూ అన్నీ ఎక్కడివక్కడ పీకి పారేయాలనిపిస్తోంది. ఆడవాళ్ళ గుసగుసలూ, మగవాళ్ళ ఇకవికలూ, ఈ సందళ్ళూ, సంబరాలూ
చూస్తుంటే సాహితీ, విధీ కలిపి తనను చేస్తున్న గేలిలా
వెక్కిరింతలా ఉంది.
ఆకాశంలో నిండుగా నవ్వుతున్న చందమామను చూస్తుంటే అలనాడు పార్వతీ దేవిలానో,
వీలైతే ఇంకా ఏదైనా భయంకరంగ శపించి పారేయాలనిపిస్తోంది. చల్లగాలి
దానితో కలిసి మరింత ఉక్రోషం కలిగిస్తోంది. ఇవాళ ఈ పంచభూతాలు భౌతిక నియమాలన్నీ
అధిగమించి ప్రవర్తిస్తున్నాయా ఏంటి..?
తను అన్న ప్రకారం ఒకసారి ప్రమాణీకరించి సిద్ధాంతీకరించబడిన నియమం
సార్వకాలిక సత్యమౌతుంది కదా..!
మరి.. ఈ పందిరి మంచం మీద, పట్టుపంచెలో, తయారై కూర్చుని తను ఏం చేస్తున్నాడు..?!!!
అయితే ఆమె అన్నదే నిజమా..? తన నిశ్చయం సార్వకాలిక
సత్యం కాదా..? మళ్ళీ ప్రయోగాలు చేసుకుని ఈ త్యాన్ని
నిరూపించుకోవాలా..? పునఃప్రతిష్ఠాపన చేయాలా?
'ఇదేంటి.. నా స్థిరాభిప్రాయాలన్నీ సవాలు చేసి పోయింది..?'
ఛి.. హాయిగ ఈపాటికి ప్రాజెక్టు రిపోర్టు రాసే పనైనా పూర్తి అయ్యి
ఉండేది...! గట్టిగ నిట్టూర్చి తన బాగ్ తెరిచి ఫిజిక్స్ రిసర్చ్ జర్నల్ తీసి
పేజీలు తిరగేశాడు. క్రమంగ అందులో లీనమై పరిసరాల స్పృహ కోల్పోయిన ఎంత సేపటికో తలుపు
దగ్గర శబ్దమై ధ్యాస చెడింది. కాసేపటికోసమైనా హాయిగ మర్చిపోయిన వాస్తవం
స్మరణకొచ్చింది ఇష్టంలేని అతిథిలా. ఆ స్మరణతోపాటే తన జీవితంలోకి తను వద్దంటున్నా
బలవంతంగ ప్రవేశించిన కఠినాత్మురాలు కూడా గదిలోకి తోయబడ్డది. వెనువెనకే తలుపు
మూసుకుంది. లోపలి నుంచి గొళ్ళెం పెట్టి హమ్మయ్య అని నిట్టూరుస్తూ వెనుదిరిగింది
సాహితి.
పెళ్ళి చూపులైనరోజు తర్వాత నుంచి ఒక్కసారైనా ఏకాంతంలో దొరికితే పట్టుకుని
దులపాలని ఎదురుచూసినా ఏ అవకాశమూ లేక, చివరికి జరగాల్సిందంతా జరిగిపోయాక తీరిగ్గ
కలిసిన సాహితిని కోపంతో కొరకొరా చూశాడు ప్రత్యయ్.
ఆమె లోపలకు వస్తూనే చేతిలో పాల గ్లాసు పక్కన బల్ల మీద పెట్టి గట్టిగ ఒళ్ళు
విరుచుకుని ఆవులించింది.
'అసలు.. అసలు.. నీ ఉద్దేశమేంటి..? నా గురించి
ఏమనుకుంటున్నావు?' అని నిలదీసి ఏకిపారేయాలని ఉక్రోషంగ మంచం
మీది నుంచి లేచాడు ప్రత్యయ్. వెంటనే సాహితి చేతితో ఆగమన్నట్టు సైగ చేసింది. అతను
ఏంటన్నట్టు చూశాడు.
ఆమె గబుక్కున ఆ గదికి అటాచ్ ఉన్న స్నానాలగదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.
ఆమె ప్రవర్తనకు ప్రత్యయ్‌కి కోపం వచ్చింది. ఎంత వీరావేశం వచ్చినా ఏం చేయగలడు, ఆమె
వచ్చేవరకు ఎదురు చూడటం తప్ప?
ఓ పదినిముషాల్లో తలుపు తెరుచుకున్న చప్పుడైంది. అటు చూశాడు ప్రత్యయ్.
బయటకు వచ్చిన సాహితికి ఇందాకటి చీర బదులు సాదానీలం రంగు చుడీదార్ ఉంది. మెళ్ళో
హారాలు, చేతి గాజులు, కాళ్ళ పట్టీలు,
నగలు, అలంకరణ ఏమీ లేదు. ముఖం మీద చిన్న తిలకం,
దాని కింద సన్నటి కుంకుమ తప్ప ఏం లేదు. ముందే అన్నీ ఆ గదిలో
పెట్టుకుందా?
ప్రత్యయ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె నెమ్మదిగ వెళ్ళి చెక్క అల్మారా తెరిచి,
అందులోంచి ఏవో కాగితాలు, కలం తీసుకుని వచ్చి
రాసుకునే బల్లపలక జోడించి ఉన్న తన కుర్చీలో సర్దుకుని కూర్చున్నాక అతని వంక చూసి,
"ఇంకా అడగాల్సింది, చెప్పాల్సింది ఏమైనా ఉందా?" అని
అడిగింది.
ప్రత్యయ్ ఆమె వంక అభినందనగ చూసి "ఊఁ.." అన్నాడు.
"ఏంటి..?" అడిగిందామె.
"నన్ను నేను అద్దంలో చూసుకోవటం మొదటిసారి. అందుకే గుర్తు పట్టలేకపోయాను.. ఐ
లవ్ యూ.."
"థాంక్స్.. పని చూసుకోండి.."
ప్రత్యయ్ నవ్వి తన జర్నల్ పట్టుకుని అందులో మునిగిపోయాడు. సాహితి తన నవల
పెట్టుకుని కూర్చుంది.
ఆకాశంలోని చందమామ వీస్తున్న చల్లగాలిని చూసి, 'పద..
ఇంక మనకు ఇక్కడేం పని?' అంది. చల్లగాలి ఓ మబ్బు తునకతో
చందమామ గది తలుపు మూసి వేరే పనికొచ్చే జంటలను వెతుక్కుంటూ వెళిపోయింది.
* * ** * *
No comments:
Post a Comment