"ఓ మాటడుగుతాను.. చెప్తావా..?"
"ఊఁ..."
"..సంకోచించకుండ నిజం
చెప్పాలి.."
"అబ్బా.. అడగవే.."
"నేను బాగుంటానా?"
ఠక్కున చూశాను ఆశయ వంక.
ఆశయ నా చిన్ననాటి స్నేహితురాలు.
నలుగురక్కచెల్లెళ్ళలో తను మూడోది. పెద్ద స్థితిపరులేం కాదు. దాంతో ఇద్దరక్కల
పెళ్ళిళ్ళు చేసేసరికి వాళ్ళ కుటుంబం ఆర్థికంగ బాగ చితికిపోయింది. ఆశయ మిగిలిన
వారిలా పెళ్ళి పరమార్థంగ చేసుకుని కూచోక సొంతకష్టంతో పీజీ వరకు చదివింది. ఆమె తండ్రి
రెండోకూతురి పెళ్ళకి అత్యవసరమై వాలంటరీ రిటైర్మెంట్ తీసేసుకున్నాక తన సంపాదనతో
కుటుంబాన్ని ఆదుకుంది. మంచి తెలివిగలది.
ఆశయా నేనూ డిగ్రీ వరకూ కలిసే ఉన్నాం.
పెళ్ళై నేను మా అత్తవారి ఊరొచ్చేశాక కొంతకాలం మా స్నేహం బానే కొనసాగింది. అది కూడ
నేను పుట్టింటికెళ్ళినప్పుడల్లా దానింటికి వెళ్ళొస్తూండేదాన్ని కాబట్టి. తర్వాత
కలవటం ఆగిపోయింది. వాళ్ళ అమ్మ పోయాక మా పక్కిల్లు ఖాళీ చేసి వేరే చోటికి
వెళిపోయారు వాళ్ళు. నాకోసం ఏదో అడ్రస్ ఇచ్చి వెళ్ళింది కానీ తీరా ఆరా తీసేసరికి
అక్కణ్ణించి ఇంకెక్కడికో వెళిపోయిందని తెలిసింది.
తనకు నా అడ్రస్ తెలుసు. ఫోన్నెంబర్
తెలుసు. కానీ ఎందుచేతో కాంటాక్ట్ చేయలేదు.
"ఏంటే...? జవాబు చెప్పమంటే నావంక అట్లా చూస్తూ ఆలోచిస్తున్నావు..?"
"అతనెవరా అని.."
"స్నేహంతో కూడ వ్యాపారం
చేస్తున్నావా..?" నవ్వింది ఆశయ.
"కాదు. స్నేహంకోసం
వృత్తివినియోగం.." అన్నాను. "ఎవరో మటుకు నిన్నీ ప్రశ్నవైపు ఆలోచింప
చేశారు.. అది మాత్రం కచ్చితం.. కాదని చెప్పు,
చూద్దాం..!"
"ఎవరో నన్నెందుకు ఆలోచింపచేయాలి? నాకే సందేహం కలగకూడదా?"
"కూడదు.. సాధారణంగ అది ఈ వయసులో
కలగాల్సిన సందేహం కాదు కనక.."
"అప్పుడు చదువు, కెరీర్, సమస్యలతో బిజీ. ఇప్పుడు
కాస్త ఫ్రీ అయ్యా. అందుకే కలిగిందేమో?"
"అట్ల కలిగినా అది ఒకరినడిగి
చెప్పించుకుంటే కానీ నీకు తెలియదేం కాదే. అద్దం ఈపాటికి గొంతు చించుకుని చెప్పే
ఉంటుంది. వినిపించలేదా..? లేక విన దల్చుకోలేదా..?"
"పోనీ, అది చెప్పిన జవాబు రూఢి చేసుకుంటున్నానుకో.. జస్ట్ ఫర్
కన్‌ఫర్మేషన్..! ప్లీస్.. చెప్పు.."
"నీలాంటి అమ్మాయిక్కూడ ఇటువంటి
సందేహం కలిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను.."
ఆశయ నిట్టూర్చి అంది. "అందులో
అంత నమ్మశక్యం కానిదేం ఉంది..? నేనూ
మనిషినేగా..!"
"మనిషిగ ఆలోచిస్తే, అందం సమస్యే కాదు..! నువ్వు అమ్మాయిగ ఆలోచించి
ఉంటావు.."
"మరి.. లేకపోతే..? అబ్బాయిగ ఎట్ల ఆలోచిస్తాను..? నేను అమ్మాయినేగా..!"
నేను నవ్వాను. "ఓ..!! ఆ విషయం
నీకూ తెలిసిందా..?! పోనీలే..! ఇప్పటికైనా
గ్రహించావు..."
"ఏం చేయను..? గ్రహించక తప్పింది కాదు.."
"'ఏ మనిషికైనా తనకుతను ఓ అమ్మాయినని కానీ అబ్బాయినని కానీ గుర్తుకొచ్చేది
ఆపోసిట్ సెక్స్ దృష్టితో తనని తాను చూసుకున్నప్పుడే..' అంటుండేదానివి కదా మరి..! '..అది కూడ ప్రేమా పెళ్ళీ మొదలైన విషయాలతో ముడి పడ్డప్పుడే..' అని కూడ అన్నట్టు గుర్తు.. అంటే.. దాని అర్థం..?"
"..అందమనేది ఆత్మవిశ్వాసానికి కూడ
సంబంధించిన అంశం. అది ఓ సమస్యగ ఎవరికైనా ఎదురు పడచ్చు... ఆడకైనా మగకైనా..!"
అంది.
"అట్ల చూసినా ఆత్మవిశ్వాసం కేవలం
అందానికి మాత్రమే చెందింది కాదే. సమాజపరంగ చూస్తే నీ ఆర్థిక స్థితి, పదవీ..; వ్యక్తిపరంగ చూస్తే నీ
చింతనాశక్తి, సృజనాత్మకత, ఆత్మనిర్భరత... ఇవన్నీ పాసిటివ్‌గ ఉండంగ నీ దృష్టి అందం
మీదికే ఎందుకు మళ్ళింది..?"
"అవన్నిటి పరంగ అనుకున్న ఎత్తులు
సాధించినా నేను అందరితో సమానంగ ఉండలేకపోవటానికి కారణం ఏంటా అని అన్వేషిస్తూ..
నాలో.. ఈ సందేహం కలిగింది.."
"అసలు నువ్వు అందరితో సమానంగ
ఉండాల్సిన అవసరం ఏం వచ్చింది..?"
"అవసరాలు చెప్పి రావు కదా..!
సర్లే, ఇంక ఇంటరాగేషన్ చాలు. ప్లీస్..
జవాబు సూటిగ చెప్పు.."
"అది నా వృత్తిధర్మానికే
విరుద్ధం. ప్రశ్న వెనక కారణం తెలియాల్సిందే.. చెప్తావా లేదా?"
ఇక ఆశయ కాస్త పట్టు సడలించింది.
"సర్లే, నీ ముందు దాచేదేముంది? ఉద్యోగం విషయంలో చాల చిరాగ్గ ఉంది. ఎప్పుడో రావాల్సిన ప్రమోషన్, సాలరీ క్రెడిట్,
నాకన్నా
ఎంతో జూనియర్ ఐన వేరే అమ్మాయికి తొందరగ వచ్చేస్తుంటే సందేహం అనిపించింది. నాతో
పోలిస్తే ఆ అమ్మాయి చాలా అందంగ ఉంటుంది. ఆ అమ్మాయితో సమానంగ నేనూ అందంగ ఉండుంటే,.. అని ఆలోచన కలిగింది."
నేను కాసేపు మౌనంగ తననే
చూస్తూండిపోయాను.
బహుశ అవసరంకన్నా ఎక్కువ గుచ్చి
చూశానేమో.. ఆశయ తలొంచుకుంది. కాసేపెటో చూస్తూ కూచుంది. తర్వాత మళ్ళీ నన్ను
చూసింది- "ఏంటి.. ఏమీ మాట్లాడవు?"
నేను నవ్వాను. "ఏం లేదే..
నువ్వెట్లుంటావో నాకు తెలీదు. అందుకే పరికిస్తున్నాను."
ఆశయ చూపులు మరల్చుకుని విరక్తిగ
నవ్వుతూ, "అంత జంకెందుకే? నిక్కచ్చిగ చెప్పు" అంది.
"..నిజంగ నిజమే.. ఈ మధ్య
భగవద్గీత చదువుతున్నాను. కావాలనుకున్నా అబద్ధం చెప్పలేను. ఇంతవరకు నేనెప్పుడూ
మనుషుల రూపం అంతగ పట్టించుకోలేదు. నాకోసం మనిషంటే వారి వ్యక్తిత్వం, మనస్తత్వం, గుణగణాలు..! అంత
వరకే..! నువ్వూ అంతే..."
ఆశయకు నా తీరు నచ్చలేదు. లేచి
పుస్తకాల రాక్ దగ్గరకెళ్ళి ఏదో పుస్తకం చూస్తూ నిలబడి, "సోది కొట్టకే.." అంది.
"నిజమే.. నీ చేతిలో ఉన్న ఆ గీత
మీద ప్రమాణం.." కోర్ట్‌లో లాగ అని నవ్వాను.
ఆశయ రంగు బాగా ముదురు చామనచాయ. సూటిగ
అంటే కారునలుపుకన్నా కాస్త నయం. కళ్ళు మరీ పెద్దవి. కనురెప్పలు మొద్దువి.
కనుబొమ్మలు కాస్త వెడల్పు. ముక్కు లావు. పెదాలు బాగా లాగి వదిలినట్టుంటాయి. జడ మరీ
పీలగ ఉందని పోనీటెయిల్ వేసుకుంటుంది. మాడుముఖం అని చెప్పలేం కానీ, ఎప్పుడో అవసరమైతే తప్ప ఎక్కువ నవ్వదు కనక ఇన్‌ట్రావర్ట్‌తనం
వల్ల మరీ గంభీరంగ ఉండి ముభావత్వం కింద జమకట్టబడేది. ఎత్తుకు తగ్గ లావే కానీ ఇక
మిగిలిందంతా అనాకారిత్వంకన్నా జస్ట్ ఓ మెట్టెక్కువని చెప్పచ్చు. ఎందుకంటే
వేసుకునే దుస్తులు కేవలం ఒళ్ళు కప్పుకోవటానికి మాత్రమే అని నమ్మేవారిలో
మొదటిశ్రేణికి చెందిన మనిషది.
ఎప్పుడైనా కాస్త స్పెషల్‌గ
తయారవ్వాలని ప్రయత్నించినా తనకస్సలు నప్పేది కాదు. ఏంటో తెలియని ఎబ్బెట్టుతనంగ
ఉండేది. తనందుకే ఎప్పుడూ ఆ ప్రయత్నమే చేసేది కాదు.
కానీ నాకంటికెప్పుడూ తను అందంగనే
కనిపించేది. తనలో అణగారని ఉత్సాహం, కొత్తవిషయాల పట్ల ఎల్లల్లేని
కుతూహలం, అంతులేని జ్ఞానపిపాసా, చక్కని పటువైన ఆలోచనాసరళి, వాక్చాతుర్యం లేక పోయినా సామాన్యంగ ఎవరినీ నొప్పించని మాటతీరు, ముక్కుసూటిగ పోయే న?డవడిక, ఏ పరిస్థితుల్లో ఐనా చెక్కుచెదరని ధైర్యం.. తనకు బాహ్య
సౌందర్యంతో పనిలేని ఓ అందాన్ని తెచ్చి పెడతాయి. తను వ్యక్తిగతంగ నాకెప్పుడూ
స్ఫూర్తిగనే పనిచేసింది.
"చూసింది చాల్లే.. ఇకనైనా
చెప్పు.." అంది నావంక తిరక్కుండనే.
"ఎట్ల చెప్పేది? బాగుండటం అంటే ఎవరి నిర్వచనం వారిది." ఏంచెప్పాలో
తేల్చుకోలేక అన్నాను.
ఆ తేల్చుకోలేపోవటం తనేమైనా
అనుకుంటుందేమో అన్న భయంవల్ల మాత్రం కానేకాదు. ఆశయకు నిక్కచ్చిగ నిజం అంటం, వింటం రెండూ అలవాటే.
"సరే.. లోకుల నిర్వచనం ప్రకారం..
టెన్ స్కేల్ మీద చెప్పు.."
"ఓకే.." కాసేపాగి, ఆలోచించి చెప్పాను- "పది లోంచి.. ఓ
మూడంకెలివ్వచ్చు.."
"అంటే అస్సలు
బాగుండనన్నమాట.."
"అది లోకుల స్కేల్ ప్రకారం కాబట్టి..
అదే నా స్కేల్ ఐతే.."
నా మాట సగంలోనే తుంచి, "మన స్కేళ్ళెవడిక్కావాలే..?" అని నవ్విందది.
అప్పుడు గమనించాను. ఆశయ నవ్వు
ఇదివరకటికన్నా అందంగ ఉంది. తను నవ్వితే నిజంగ ఇంత బావుండేది కాదు. అదే
చెప్పాలనుకున్నా కానీ ఏదో ఆలోచిస్తూండిపోయాను.
అందం మాటెట్లున్నా ప్రతిభలో ఎవ్వరూ
తనకు సాటిరారు. క్లాస్‌లో టీచర్‌లు చెప్పిందానికన్నా, దాన్నంతటినీ తను ముందు అర్థంచేసుకుని నాకోసం దాన్ని సరళమైన
పదార్థంగ మలిచి వివరిస్తే ఆ వినికిడితో పరీక్షల్లో క్లాస్ తెచ్చుకున్నదాన్ని.
నన్ను మించి తన సామర్థ్యం గురించి చెప్పగలిగే వారుండరు.
పదేళ్ళ నిశ్శబ్దం తర్వాత కలిసింది.
అది కూడ ఓ మెడికల్ కాన్‌ఫరెంస్‌లో. అందులో మావారికి ఏదో అవార్డ్ ప్రదానం
ఉండింది. ఆయన్ను స్టేజి మీద చూసి ఆనందించాలని ఉందంటే తీసుకెళ్ళారు. తను పని చేసే
బయోలాబ్స్ తరఫున వచ్చింది ఆశయ. స్టేజిమీద ప్రెసెంటేషన్ చేస్తుంటే చూసి ఎక్కువ
కష్టం లేకుండనే పోల్చుకున్నాను. అదే ఆత్మవిశ్వాసం, అదే కమాండ్..! ఏం మార్పు లేదు.
తన ప్రెసెంటేషన్ పూర్తవుతూనే వెళ్ళి
కలిసి, మావారినక్కడే వదిలి బలవంతాన
తనను ఇంటికి తీసుకొచ్చేశాను. కలిసి భోంచేశాం. ఎంతోకాలం తర్వాత ఇద్దరికీ నిండుగ
అనిపించింది. ఏదో చాలాకాలంగ పోగొట్టుకున్నది పొందిన ఆనందం తన కళ్ళలోనే ఎక్కువ
కనిపించింది. ఆ రోజు చాలాసేపు తనివితీరా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం నేను ఉంటున్న
ఊళ్ళోనే ఉంటోందని తెలిసి చాలా సంతోషం వేసింది.
వాళ్ళ అమ్మ పోయాక ఆ జ్ఞాపకాలతో అక్కడ
గడపలేక ఆ ఇల్లు వదిలి వెళిపోయారట. అక్కడ ఓ నెల ఉన్నారో లేదో తనకు ఢిల్లీ
యూనివర్సిటీలో పార్ట్‌టైం రిసర్చ్ ఆఫర్‌తో పాటు జాబ్ వచ్చి అటు వెళి పోయారట.
అక్కడ పేరుకు డాక్టరేట్ తగిలించుకుని వచ్చాక స్థిరమైన ఉద్యోగం దొరికి బతుకు ఓ
కొలిక్కొ వచ్చింది. చెల్లెలిని చదివించి ఓ ఇంటిదాన్ని చేసి పంపింది. కనీసం నెలకోసారి
యూరోప్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా... ఇంకా
ఏవో దేశాలు తిరిగి వస్తుంటుంది.
దేనికీ కొదువలేని జీవితం..
ఒంటరితనానికి కూడ....!
మూడేళ్ళక్రితం వాళ్ళ నాన్న కూడా అమ్మ
దగ్గరకెళిపోయాక కొన్నాళ్ళు ఆశయ ఒంటరిగనే ఉంది ఈ ఊళ్ళో. ఈమధ్యే వాళ్ళ
పెద్దక్కకొడుకు బయోటెక్‌లో డిగ్రీ కోసం తనదగ్గర వచ్చి ఉంటున్నాడట. తను అదే విషయం
కావటంతో కాస్త గైడెంస్ ఇస్తుందని ఆశ.
'నిజానికి వాడి చదువు ఓ వంక. నేను ఒంటరిగ ఉండకుండ ఈ వ్యవస్థ..' నవ్విందది.
'నేనీ ఊళ్ళో ఉండంగ నిన్ను ఒంటరిగ ఉండనిస్తానా?' అని శపథం చేసి నేనే కౌన్సిలింగ్‌కోసం అపాయింట్మెంట్ లేమీ లేని రోజు చూసుకుని, వీలు చిక్కినప్పుడల్లా తనను కలిసి వస్తున్నాను. తను కూడ ఏ
ఖాళీ ఆదివారాలో, మావారు ఊళ్ళో లేనప్పుడో చెప్తే
తోడుగ వచ్చివెళ్తోంది.
ఈ రోజు తనే ఫోన్ చేసి, వచ్చి ఎన్నడూలేంది విచిత్రంగ ఈ ప్రశ్న అడుగుతోంది.
"సరే.. ఇప్పుడు నేనడుగుతాను..
నువ్వు సూటిగ చెప్పు.."
ఆశయ ఆలోచనలోంచి తేరుకుని ఏంటో
అడుగన్నట్టు చూసింది.
"ఇప్పుడీ ప్రశ్న అడిగి జవాబు
పొంది నీకొచ్చిన లాభం ఏంటి..?"
"నా ఆత్మవిశ్వాసం అందంతో
ముడిపెట్టుకుని నిర్వచించుకోకపోతేనే మంచిదని తేల్చుకున్నాను.."
"అది నువ్వు కొత్తగ
తేల్చుకున్నదేం కాదు. ఆడపిల్లగ ఊహ తెలిసినప్పుడెప్పుడో ఆ నిశ్చయానికి వచ్చేశావు.
లేతే నీ జీవితం ఇంతకాలం హాయిగ గడిచేదే కాదు.. టీనేజ్‌నే నిశ్చింతగ గడిపేసిన నువ్వు
ఇప్పుడు దాని గురించి వర్రీ కావటం..,"
"వర్రీ అంటే.. అదేం కాదు..
కానీ.. ప్రస్తుతానికి నా ధ్యాస పూర్తిగ తన వైపు లాగేసుకుంటున్న అంశం..! పూర్తిగ
అంటే.. అంత కూడ ఏంకాదు..! జస్ట్.. ఎ పాసింగ్ థాట్.."
"వెర్రిదానా! అందం సమస్యతో
సతమతమయ్యేది సామాన్య మేధ కలవాళ్ళు. పాసింగ్ థాట్‌గ ఐనా సరే.. నీకోసం ఏనాడూ అదో
విషయమే కాదు..! ..ఇప్పటికీ అది విషయమే కాదని నాకనిపిస్తోంది.."
ఆశయ నా వంక చూసి, మళ్ళీ చూపులు మళ్ళించుకుంది.
"ఎవరి దగ్గరైతే ఏమీ ఆలోచించనవసరం
లేకుండ మాట్లాడగల్తామో, వారే నిజమైన
స్నేహితులు.. నా దగ్గర ఇంత ఆలోచిస్తున్నావంటే.." అని ఆగాను.
"ఆంటీ.. ఆంటీ.." సరిగ్గ అది
మనసు విప్పి విషయం చెప్పే లోపే అర్జున్ గొంతు వినిపించింది.
"పిన్నిని రమ్మనండి...
వెళ్ళాలి... అర్జంట్..." అరిచాడతను గేట్ దగ్గర్నుంచే.
ఆశయ బాగ్ తీసుకుని లేస్తూ, "సరే, ఇంక నేను
వెళతాను.." అంది.
నేను ఏం మాట్లాడకుండ మౌనంగ చూశాను.
ఆశయ నవ్వింది.
నేను వెంటనే గోడకున్న అద్దం తెచ్చి తన
ముఖం చూపి, "చూడు.. ఒక్కసారి చూడు.. నీ
నవ్వెంత బావుందో.. నేను చెప్తే కాదంటావని అద్దం చూపిస్తున్నాను.. జస్ట్ ఫర్ కన్‌ఫర్మేషన్.."
అన్నాను.
ఆశయ అనాసక్తిగ ముఖం చూసుకుని అద్దం
నాకు తిరిగిచ్చేస్తూ, "వదిలెయ్యవే.."
అంది.
నేను దాని చెయ్యి పట్టుకుని, "అందం అనేది బాహ్యరూపంతో సంబంధం లేనిది. అది మన
మనసులో సంతోషం రూపంలో ఉంటుంది. మనసు ఉల్లాసంగ ఉంటే సహజంగ ఏ మనిషైనా అందంగనే
ఉంటారు. అందమే ఆనందమో కాదో నాకు తెలీదు. కానీ ఆనందం మాత్రం ఎప్పుడూ అందంగనే
ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఉంటే ఆనందం అదే వస్తుంది. అందుకే అందాన్ని పక్కన పెట్టి
ఆత్మవిశ్వాసంగ ఉంటానికి ప్రయత్నించు. అప్పుడు ఏ కొలీగ్‌లూ నీ ప్రమోషన్‌లు
కొట్టుకుపోలేరు. ఐనా ఒకరేంటి మనకు ప్రమోషన్‌లిచ్చేది.. మన ఆత్మోన్నతే మన ప్రమోషన్.
కాదా..?" అన్నాను.
"పిన్నీ.. తొందరగ రా.. లేటైతే
మళ్ళీ సర్ క్లాస్ చెప్పను పొమ్మంటాడు.." అర్జున్ అరిచాడు.
నేను ఆశయ వంక చూశాను. ఆశయ ఏం
మాట్లాడకుండ వెళిపోయింది.
* * *
ఆ రాత్రి పనయ్యాక మంచం ఎక్కి ఆశయ
విషయమే సీరియస్‌గ ఆలోచిస్తూ కూచుని శ్రీకృష్ణునికి దండం పెట్టుకుని చేతిలో ఉన్న
భగవద్గీత పుస్తకం తెరిచాను. అంతలో అందులోంచి ఓ కాగితం కింద పడింది.
తెరిచి చూశాను. అదో ఉత్తరం. సంబోధనే
ఆసక్తి రేకెత్తించింది. విషయం అర్థమైంది. సంకోచించకుండ చదివాను.
"ప్రియ నేస్తమా,
ఈ సృష్టిలో స్నేహంకన్నా అందమైనది, గొప్పది మరొకటి ఉంటుందనుకోను. స్నేహానికి పునాది స్వచ్ఛమైన
అనురాగం.. నిర్మమమైన అభిమానం.. స్వస్థమైన అవగాహన. అవి మన మధ్య ఉన్నాయని నాకు
అనిపించింది. నీకూ అనిపించే ఉంటుందని భావిస్తున్నాను. నీ కళ్ళు చెప్పాయి.
నీ స్నేహం ఈ క్షణం నా దగ్గరున్న
అమూల్యనిధి. తరువాత రాబోయే వేనవేల క్షణాలకోసం కూడ అది నా సొంతం కావాలని బలంగ ఉంది.
ఐతే మగ ఆడ మధ్య రక్తసంబంధం, మాంగల్యబంధాన్ని మించి
మరి ఏ రకమైన చనువూ సమాజం అంగీకరించదు.
మొదటిది మన మధ్య ఉండే అవకాశం ఈ జన్మకు లేదు. రెండో అనుబంధం మాటకొస్తే, కేవలం మన స్నేహాన్ని కొనసాగించేందుకు నాకు కనిపిస్తున్న ఒకే
ఒక్క మార్గం అనిపించింది. నీకూ అదేమీ అభ్యంతరం కాకపోతేనే.
నాకు నువ్వంటే అపారమైన గౌరవం ఉంది.
సద్భావన ఉంది. సహృదయత, సుహృద్భావన ఉన్నాయి.
చూడు... ప్రేమలూ దోమలూ అని సినిమా
డైలాగులు కొట్టడం నాకు రాదు. అవసరం కూడ లేదు. ఎందుకంటే ఇది అట్లాంటిదేది కాదు.
ఈమాట జీవితాంతం నీకు మంచి స్నేహితుడిగా ఉండి నిరూపించుకోగలను. నీవు అంగీకరిస్తే ఈ
వివాహమనే బంధానికే కొత్త నిర్వచనం రాయగలను. నిజంగ నీ మీద నాకు ఏ కాంక్షా లేదు. నీ
స్నేహాకాంక్ష తప్ప.
ఐతే జీవితంలో ఎవరో ఒకరిని
పెళ్ళిచేసుకోక తప్పదు కదా. నాకు భార్యకన్నా ఓ స్నేహితురాలు, సన్నిహితురాలు కావాలి. నేనూ నా భార్యకు మంచి స్నేహితుణ్ణి, సన్నిహితుణ్ణీ కాగలగాలి. మనను అర్థం చేసుకునే వారితో జీవితం
ఎక్కువ ప్రయాసలు లేకుండ సాగిపోతుంది. అంతే.
నీకు ఇష్టమైనప్పుడే, నీకు కష్టంకానిదే ఐన సమాధానం చెప్పు. ఏదైనా సమ్మతమే.
నీ
సమీర్"
సమీర్... మంచి పేరు. ప్రపోస్ చేసే
విధానం బావుంది. వ్యక్తిత్వం, భావాలు అంతా స్పష్టంగనే
ఉన్నాయి. కచ్చితంగ ఆశయకు తగిన వ్యక్తే. పర్‌ఫెక్ట్ మాచ్...
మరైతే గొడవేంటి?
దానితో పాటే ఉన్న మరో ఉత్తరంలో
సమాధానం ఉంది. ఆశయ చేవ్రాలు.
"అతన్ని యూనివర్సిటీ రిసర్చ్
ట్రెయినింగ్‌లో కలిశాను. ట్రెయినర్‌గ వచ్చాడు. ఆరునెలలు.. రోజూ క్లాస్ అయ్యాక
కలిసేవారం. సబ్జెక్ట్ తప్పించి మరేం మాట్లాడుకున్నది లేదు. నా రిసర్చ్ పని చకచక
పూర్తవ్వటానికి అతనే కారణం. మొదటి సారిగ కాస్త ఫ్రీక్వెంసీ కలసిన మనిషి ఎదురు
పడ్డాడనిపించింది, అంతేకానీ వేరే ఏ భావాలూ
నాలో కలగలేదు. తీరా వెళిపోయేటప్పుడు ఓ పుస్తకం బహుకరించాడు. ఆ కవర్‌లో ఈ కాగితం
కనిపించింది. చదివాను. స్పందనేం కలగలేదు. ఎప్పటిలాగే మెదడుతో ఆలోచించాను.
నాన్న మాత్రం మనసుతో ఆలోచించారు.
ఓసారి ఇంటికి వచ్చాడుటలే.. అప్పుడు కలిశాడట నాన్నను. నాకు తెలీనే తెలీదు. నన్ను
పెళ్ళి చేసుకోవచ్చా అని నేరుగ అడిగాడుట. నాన్న ఆ విషయం నాతోనే మాట్లాడుకోమన్నారట.
ఈ విధంగ ఉత్తరం ద్వారా అడిగాడు. నాన్న చెప్పదల్చుకుందేంటో నాకు అర్థమైంది. ఆయనకేం
అభ్యంతరం లేనప్పుడు నాకెందుకు అనుకుని, ముఖ్యంగ మంచి
స్నేహితుడు కాగలవాడు మంచి భర్త కూడా కాగలడేమో అని ఆలోచించుకోవటానికి నాకు ఓ గంట
సమయం పట్టింది. అంతే. నిశ్చయించుకున్నాక సరేనందామనుకుని అతనిచ్చిన ఫోన్ నెంబర్‌కి
చేశాను. ఏం జరిగిందో తెలియదు. ఉండి కూడ లేడనిపించాడని మాత్రం అర్థమైంది.
రెండుమూడుసార్లు ఈ మెయిల్స్‌కి
ప్రయత్నించినా ఫలితం లేదు. ఓసారి మాత్రం ఒకే ఒక్క మెయిల్ వచ్చింది. ఏవో సోది
కబుర్లు రాశాడులే.. అసలు విషయం కప్పిపుచ్చటానికి. ఇంక ఎంత మంట పుట్టిందంటే
సమాధానంగ బాగా తిడుతూ మెయిల్ రాసి పంపేశాను. తర్వాత కాస్త చల్లబడి వదిలేశాను.
అప్పుడే ఉత్తరం కూడ చించి
పారేసేదాన్నే. కానీ ఎంతైనా ఆడపిల్లగ నాకొచ్చిన తొలి, చివరి ప్రేమలేఖ కదా అని దాచాను. హాయిగ నా మానానికి నేను బతుకుతుంటే అనవసరంగ
డిస్టబ్ చేశాడు. నేను డిస్టర్బ్ కాకుండ ఉండటానికి చాలా కష్టపడ్డాను. సరే, తర్వాత థీసిస్ సబ్‌మిషన్, కాన్వకేషన్, వెంటనే జాబ్‌లో పడి అన్నీ
మరిచిపోయాను.
లేదా, మర్చిపోయానని అనుకున్నాను. కానీ కొన్ని వదలవు. పట్టి పీడిస్తాయి. మనం వదిలినా
అవి వదలవు. తిరగ బెట్టిన రోగంలా ఆఫీస్‌లో ఎదురుపడ్డాడతను. మా లాబ్స్‌వాళ్ళు అతన్ని
స్పెషల్ ఆఫీసర్‌గ అపాయింట్ చేశారు. సడన్‌గ కలవటం అతనికీ షాకే అయింది. ఇబ్బందిగ
చూపులు మళ్ళించుకున్నాడు. అంతేకానీ కళ్ళలో ఏ అపరాధ భావనా లేదు. ఐతే అతను
అపరిచితుడైనట్టే వ్యవహరించేసరికి పాత జ్ఞాపకాలు తవ్వుకోవాల్సిన అవసరం వెంటనే
రాలేదు.
ఇప్పటికి అట్ల ఓ పది పదిహేనుసార్లు
కలిసినా ఒక్కసారి కూడ పలకరించలేదు. అవకాశం దొరికినా కూడ కనీసం బావున్నావా అని
అడగలేదు. అతని గాంభీర్యం, అనాసక్తతా చూసేసరికి
నేనెందుకు అట్ల ఉండలేకపోతున్నానా అని బాధ కలుగుతోంది. అతను బయటకు కనిపించినంత
స్థిరంగనే లోపల కూడా ఉన్నాడో లేదో నాకు తెలియదు.
కానీ నేను మాత్రం పట్టు
సడలిపోతున్నాను. నా చేతకానితనం గుర్తొచ్చి మరింత విరక్తి కలుగుతోంది. అతనికింకా
పెళ్ళి కాలేదు. అదీ ఇతరుల ద్వారా తెలిసింది. ఏమీ తెలుసుకోకుండ ఉందామని అనుకున్నా
ఉండలేకపోయానని తర్వాత తిట్టుకున్నాను. కెరీర్ మీద ఇష్టం ఉన్నవారెవరూ పెళ్ళిళ్ళు
చేసుకోరేమో. అతనూ వాళ్ళమ్మా ఇద్దరే ఉంటారట వాళ్ళింట్లో.
అతన్ని చూసినప్పుడల్లా ప్రేమా, పెళ్ళీ గురించిన ఆలోచనలు నన్ను పీడిస్తున్నాయి. ఛి, ఓసారి వద్దనుకున్న తర్వాత ఓ మగాడి గురించి ఆలోచించటం నా
తప్పు! అంత బలహీనమైన మనసు కాదు నాది. నేనతన్ని గొప్పగ ప్రేమించిందీ లేదు. కేవలం
ఆలోచనాస్థాయి ఒకటే అయ్యి, అభిరుచులు కలిసి,
కామన్‌టాపిక్
ఉండేసరికి కాస్త సాన్నిహిత్యం ఏర్పడింది. అంతే. అంతవరకు కచ్చితంగ చెప్పగలను.
సబ్జెక్ట్, రిసర్చ్ దాటి ఇతర విషయాలు
మాట్లాడుకున్నదీ, కలిసి ఉన్నదీ, తిన్నదీ, తిరిగిందీ.. ఏమీ లేదు.
మనసు విప్పి గొప్పగ భావాలు పంచుకున్నదీ లేదు. మరెందుకు నాకీ విహ్వలతా, వివశత్వం కలుగుతున్నాయి? ఇవన్నీ పని లేనివాళ్ళ కాలక్షేపం పనులని నేనే ఏవగించుకుంటానే..! అంటే నేనూ
పనిలేనిదైపోతున్నానా? పనికి మాలినవాళ్ళ
జాబితాలో చేరిపోతున్నానా..? లేక.. మానవజన్మ అంటేనే
ఈ కోరికలూ, కామవాసనలూ సహజమేమో..! సహజమైతే
మాత్రం వదిలేయలేం కదా ఇది నా సమస్య. దీనికి సమాధానం ఏం
ఇవ్వగలవు?
చివర చెరిగిపోని దాని ఆత్మ విశ్వాసం
సూచిస్తూ ఇంత పొడుగు సంతకం.
అదీ ఉత్తరంలో విషయం. అదంతా మరోసారి
చదివి మడిచి పక్కన పెట్టాను.
సమీర్ ప్రనర్తనకు వెనక కారణం ఏమై
ఉంటుంది?
నాకు సమీర్ గురించి ఏమీ తెలియదు.
కానీ ఆశయ గురించి తెలుసు.
పెళ్ళివిషయంలో ఆశయ భావాలు చాలా
ఖచ్చితమైనవి. మగసంతానం లేని తమ ఇంటికి తనే మగపిల్లాడై ఆసరా ఇవ్వాలని, అక్కాచెల్లెళ్ళ పెళ్ళిళ్ళైపోయాక తనే అమ్మానాన్నలను
దగ్గరుండి చూసుకోవాలని ఎప్పుడో నిశ్చయించుకుంది. వ్యక్తిత్వానికి మనస్తత్వానికి
అనుగుణంగనే ఎవరి రూపమైనా ఏర్పడుతుంది. వయసుకు తగ్గ ధ్యాస పెట్టి, శ్రద్ధ తీసుకోవాలన్న ఆలోచనా, అభిరుచీ లేకపోవటంతో కళావిహీనంగ ఉండేది. పైపెచ్చు జీవితం మీద, పేదరికం మీదా తీరని కసి, పట్టుదల...
ఎట్లగో తనలాంటి అమ్మాయిని అబ్బాయిలు
ఇష్టపడరు. అందని పండ్ల గురించి ఆలోచించీ అనవసరం అనుకుంది. మంచి చదువరి కావటంతో
అధ్యయనం, పరిశోధనా ఈ రెంటినీ జీవితానికి
తోడుగ ఎంచుకుంది. అందరూ పెళ్ళి కోసమే పుట్టరనేది తను గట్టిగ నమ్మిన సిద్ధాంతం.
ఆడపిల్లలంతా సరదాగ గడిపే వయసంతా కేవలం జ్ఞానార్జనకోసమే వెచ్చించింది. కానీ ఎంత
సమర్థత ఉన్నా పోటీలకు దూరంగ ఉండేది- స్టేజ్ అన్నా, గుర్తింపన్నా సహజంగ ఉన్న అయిష్టత వల్ల. నాలాంటి ఒకరిద్దరితో తప్ప వేరే వాళ్ళతో
అస్సలు మాట్లాడేది కాదు. తనకు పనికి రాని టాపిక్ మాట్లాడితే నాతో కూడ
మాటలాపేసేది.
అట్లని తనలో ఆ విషయమై ఇన్‌ఫీరియారిటీ
కాంప్లెక్స్ గట్రా ఏంలేవు. మంచి ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి. తన కార్యక్షేత్రంలో
తనను మించిన వారుండరు. తనకేం కావాలో ఏం వద్దో తేడా బాగా తెలుసు. అందుకే
వద్దనుకున్న విషయానికి దూరంగ ఉండేది. అదే పంథాలో ఇంతకాలం గడిపింది. మరి
ఇప్పుడెందుకు దారి తప్పింది?
ఇప్పుడేం చేయాలి? ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలకెళ్ళాలా? సేవాకార్యక్రమాల్లో పాల్గొనాలా? మంచి స్థలాలు చూస్తూ బాగా తిరగాలా? గ్రంథాలయాలు తిరగాలా..? ఆఫీస్‌పని భారం తగ్గించుకుని మరీ ఇవన్నీ చేస్తున్నా తను సమాధాన పడటం లేదు.
ఇంకా ఏం చేస్తే ఈ పీడా తగ్గి మనస్సు శాంతిస్తుంది..? ఇది తన ప్రశ్న.
దానికి తన పరిధిలో తోచిన సమాధానం
వెతుక్కుంది. మరుసటివారం కలిసినప్పుడు చెప్పింది-
"ఈ మధ్య పెయింటింగ్ క్లాస్‌లో
చేరాను... వారానికి రెండురోజులు.. మూడుగంటలు.. శని, ఆదివారాలు.."
"మనసు మళ్ళించేందుకా..?"
తలూపింది ఆశయ. "అంటే... అతన్ని
తప్పించుకుందామని మాత్రమే కాదు.. చిన్నప్పటి హాబీతో టైం గడిపితే కాస్త మనశ్శాంతిగ
ఉంటుంది. నిరుత్సాహం కూడ తగ్గుతుంది అనిపించింది."
ఆశయలాంటి వారందరికీ ఇట్ల జరగటం
సహజమేనేమో నాకు తెలియదు. అది తన తత్త్వం కాదు కానీ రొటీన్ జీవితంలో ఏర్పడిన
అనాసక్తత వల్లో, ఉద్యోగంలో ఏర్పడిన స్తబ్ధత
చేతనో, ఎందువల్లో ఎంత వద్దన్నా మనసు
ఊరికే అదే విషయం ఆలోచించటం మొదలైంది. అన్ని విధాలా ఆలోచించాక చివరికి అద్దానికే
నచ్చని ఈ ముఖం అతనిక్కూడ నచ్చి ఉండదన్న నిర్ణయానికి వచ్చేసింది. రూఢి పరచుకోటానికి
నన్నడుగుతోంది.
"నన్నడిగే బదులు అతన్నే అడిగితే
సరిపోయేది కదా.." అన్నాను.
"ఏమడగను.. సలహా చెప్పమనా..?"
"కాదు.. సందేహం తీర్చమని.."
"ఎప్పుడైనా దొరికితే కాలర్
పట్టుకుని ఇదే మాట అడగదల్చుకున్నాను.. కానీ... ఏమో.. అనవరం అననిపిస్తోంది.."
"అసలు ప్రయత్నించావా..?"
"ఎట్ల ప్రయత్నించను..? నేరులో మాట్లాడడు. ఇవి ఫోన్‌లో మాట్లాడే విషయాలు
కావు."
"ఉత్తరం రాసి అడక్కపోయావా?"
"అదీ చేశాను. రాసి ఉంచాను కూడా.
కానీ ఇవ్వబుద్ధి కాలేదు. రైటింగ్ థెరపీ అంటారుగా.. అట్ల మధన పడేదంతా
రాసేసినందుగ్గాను నా మనుసు కాస్త బరువు తగ్గింది. తేలికపడ్డాను." నవ్వింది
ఆశయ.
నేనూ నవ్వి, "పోనీ ఓసారి ఫోనే ప్రయత్నించు.. గొంతు వినైనా గెస్
చెయ్యచ్చు కదా.." అన్నాను.
"లేదు. అదీ ఫెయిలైంది. ఓసారి
ఆఫీస్ పని మీదే ఫోన్ చేశాను. వాళ్ళ అమ్మకు నా గురించి ఏం చెప్పాడో తెలియదు..
అంతే.. ఎంత పరుషంగ మాట్లాడి, కసిరి ఫోన్
పెట్టేసిందో చెప్పలేను. ఆ తర్వాత అస్సలు ధైర్యం చాలలేదు.."
నాకు వింతగ అనిపించింది.
"కసిరిందా...!? అందులో కసురుకోటానికేం
ఉంది..?"
"అదే కదా నాకూ అర్థం
కానిది.." అని ఆగి ఆశయ అంది. "పోనీలే వదిలెయ్.. చేసిన పాపం చెబితే
పోతుందంటారు. ఇప్పుడు నీతో చెప్పాక నాకు కొంత తేలిక అనిపిస్తోంది." అంది నా
చెయ్యి పట్టుకుని.
నేనేదో ఆలోచిస్తూ, "అతను మెయిల్‌లో ఏదో రాస్తే నువ్వు తిట్టేశానన్నావు..
ఏం రాశాడసలు..?" అని అడిగాను.
"సోదే..! చెప్పాగా.."
సరిగ్గ అది ఇంకేదో చెప్పేంతలో అర్జున్ వచ్చాడు. "పిన్నీ, క్లాస్‌కి లేటైతోంది.." అంటూ.
"ఏమిటే, వీడికింత సార్ పిచ్చి.? ఇంకా ఐదైనా కాలేదు. క్లాస్ ఆరింటికి కదా..!" అన్నాను.
అర్జున్ లోపలికి దూసుకొస్తూ, "లేదాంటీ,
అట్లనకండి.
అసలు మా సార్ పాఠం చెప్పేటప్పుడు ఒక్కసారి వినండి.. ఎంత అద్భుతంగ చెబుతాడో! నేనూ
మా జూనియర్స్‌కి అప్పుడప్పుడూ డౌట్స్ చెప్తా. కానీ అంత ఇంటరాక్టివ్‌గ చెప్పలేను.
నిజంగ ఆయన దొరకటం మా అదృష్టం. గంట ముందు కూర్చుని మెడిటేట్ చేస్తే కానీ ఆయన
చెప్పినవి దిగవు." అన్నాడు.
"ఓహో.. అట్లగే.. కానీ, దానికి మా ఫ్రెండును నాకు కాకుండా చేస్తావెందుకు?" అన్నాను.
"వదిలెయ్యవే.. ఇంక వెళతాలే.. నీ
ముద్దులకూతురొచ్చే టైమయింది కదా.. నువ్వు తల్లి పాత్ర పోషణలో మునిగి పోతావు కదా..
అంతేకాక వీడి ప్రాజెక్ట్ ఏదో పని పెట్టాడు. లైబ్రరీ వెళ్ళాలి." అని లేచి
కదిలింది ఆశయ.
"పిన్నీ.. తొందరగ.. లేదంటే మా
మలయమారుతం లాంటి సమీర్‌సార్ కాస్త ఝంఝామారుతం తుఫాన్‌సార్‌గా మారిపోతారు.."
అంటూ ఆశయను తొందరపెట్టాడు.
నేను ఆశయ వంక ఠకీమని చూశాను.. అది
అప్పటికే నా వంక చూస్తోంది, నాకన్నా గొప్ప సైకాలజిస్ట్
లాగ.. సమీర్..! అంటే..? నేను ఆలోచనలోంచి తేరుకునే లోపే అర్జున్ దాన్ని
తీసుకెళిపోయాడు.
* * *
తర్వాత కలిసినప్పుడు వివరాలు
చెప్పింది తను.
అతను అర్జున్ కాలేజ్‌లో గెస్ట్‌లెక్చర్స్
ఇవ్వటానికి అప్పుడప్పుడూ వస్తుంటాడట. ఉద్యోగంకన్నా లాబ్సులో ప్రాజెక్టు లకు
గైడెంస్ ఇవ్వటం కోసమే ఎక్కువగ తిరుగుతుంటాడట.
"దాంతో వదలకుండ ప్రతీ చోటికీ
అతని వెంట వీడు.. వీడు మంచి తెలివికలవాడవటంతో సహజంగనే అతనికి దగ్గరై పోయాడు.
అతనితో కలిసి వాళ్ళ లాబ్స్‌కి వెళ్ళాడుట. మైక్రో ఆర్గనిజమ్సన్నీ మైక్రోస్కోప్‌లో
చూశాడట. వాడికి కావాల్సిన అన్నీ ప్రయోగాలూ చేసుకుని చూసుకున్నాడట. రిసర్చ్
ప్రాస్పెక్ట్సు గురించి కనుక్కున్నాడుట.. వాళ్ళింటికి వెళ్ళాడుట..
మొదట్లో నాతో అతని గురించి ముచ్చట
చెప్తుంటే ఎవరోలే అనుకుని విన్నాను. కావాలంటే ఇంటికి పిలిచి చదువుకోండని సలహా కూడ
ఇచ్చాను. ఓసారి చెప్పాపెట్టకుండ నేరుగ ఇంటికే తీసుకొచ్చేశాడు. అప్పుడు తెలిసింది
ఎంత తప్పు చేశానో. ఆఫీస్ నుంచి నేను తిరిగి వచ్చేసరికి అర్జున్ రూంలో వాడికి
చదువు చెప్తూ హఠాత్‌గ అతనెదురయ్యేసరికి సర్దుకోవటానికి కాస్త సమయం పట్టింది."
"భూమి గుండ్రంగ ఉంటుందంటే ఏంటో
అనుకున్నాను. ఓహో, అయితే ఆ క్లాసుల
వేళల్లో తప్పించుకునేందుకేనా ఆ పెయింటింగు క్లాసులు.."
"మరి ఇంకేం చేయాలి..? అంతేకాదు.. అతని ప్రభావం వీడు వర్ణించి ఊరించి చంపి
ఉంటాడు.. దానికి ముగ్ధులై వీడితో పాటు క్లాస్ వింటామని మరో ఆరేడుగురు క్లాస్‌మేట్స్
కూడ పోగయ్యారు. ఎప్పుడూ అతని గురించే చెవుల్లో రొదలా చెప్తుంటాడు. విసుక్కున్నా
ఆపడు. 'అతని టీచింగ్ స్టైల్ ఎంత
బావుంటుందో..! ఎంత మంచి గొంతో.. స్పష్టమైన అభివ్యక్తి, నిదానం... ఎంత తపనపడతాడో పిల్లలకు కాన్‌సెప్ట్ సులువుగ
అర్థమవ్వాలని.. మంచి నవ్వు.. సరదాగ మాట్లాడతాడు...' ఇట్ల.."
అటు ఆఫీసులో, ఇటు అర్జున్ ద్వారా అతనికి మాటిమాటికీ ఎదురుపడాల్సి రావటం
నిజంగ ఆశయ దురదృష్టమే..
"చూడు ఆశూ, ఎక్కువగా ఏమీ చెప్పలేను. కానీ ఒక్క మాట అనుభవంతో
తెలుసుకున్నాను. జీవితం ఎట్ల ఉంటుంది అనేది మన చేతిలో ఉండదు. మనకు ఎదురుపడ్డదాన్ని
మనదిగా అంగీకరించి ముందుకుసాగటమే ఎవరమైనా చేయగలిగింది."
"అదయినా అలవాటు చేసుకోవటానికి
సమయం పడుతుంది కదా.."
ఇద్దరం మాట్లాడుతూండంగనే
సరస్వతమ్మగారు వచ్చారని ఆయా వచ్చి చెప్పింది. సరేనని లేచాను.
ఆశయ అనాసక్తిగ చూసింది.
"వచ్చేస్తా లేవే.. తొందరగనే.
అట్ల చూడకు.." అన్నాను.
"కానీ అరగంటాగి మా మాస్టర్‌మైండ్
దయచేస్తాడు.. వాడికేదో పరీక్ష ఉందంటా రేపటికి. ప్రిపేర్ చేయించాలి.."
"అదేంటి.. వాళ్ళ గ్రేట్
సోక్రెటీస్ మాష్టారు లేడా..?"
"ఊరెళతాడట.. సో, అరగంటలో నువ్వు రాకపోతే మాత్రం వెళిపోతా.." అని
నవ్వింది ఆశయ.
"సరే, నీ ఇష్టం. ఆల్ ది బెస్ట్.. వస్తా.." అని కౌన్సిలింగ్
గదికి వెళ్ళాను.
సరస్వతమ్మగారికి ఇప్పటికి యేడాది
బట్టి ఇస్తున్న ట్రీట్‌మెంట్ ఇప్పటికి ఫలించింది. ఒక సైకాలజిస్ట్‌గ ఆమెలో వచ్చిన
మార్పు ఆమెకే కాదు, నాకూ చాలా
సంతోషాన్నిచ్చింది. చాలా రకాలుగ ఆమెకు నయమైంది. ఇవాళ చివరి సెషన్. వాళ్ళ
అబ్బాయికి అన్ని జాగ్రత్తలూ చెప్పి, ఇక మీదట ఎప్పుడైనా తప్ప
ఇంక రెగులర్ సెషన్సు అవసరం లేవని చెప్పి పంపేసరికి ఆశయను వదిలి వచ్చి
గంటన్నరైంది. గబగబా గదిలోకి వచ్చాను. తను అక్కడ లేదు.
వెళిపోయి ఉంటుంది. ఇది నాకు అలవాటే.
వృత్తి ధర్మమే ముందు కదా.. డ్యూటీ ఫస్ట్..
తరువాత మా ఇంట్లో ఆఖరు మరిది పెళ్ళి
వచ్చి నేను చాలా బిజీ అయిపోయాను. ఇంటికి పెద్దకోడలిని కదా. తప్పదు. రెండువారాలు
క్లినిక్ కూడ తెరవలేదు. ఆశయ కూడ ఫోన్ చేయలేదు. ఇంక మరిదీ తోటికోడలూ యాత్రలకని
వెళిపోయాక మొట్టమొదలు ఆశయకే ఫోన్ చేద్దాం,
ఎట్ల ఉందో
ఏమిటో అనుకుంటూ ఉండంగనే కాలింగ్ బెల్ మోగింది. ఒక్క క్షణం ఆగాను.. ఎవరైనా
పేషెంట్లా.. వద్దని చెప్పానే..!
ఆయా వచ్చి, "ఆ పెద్దామె వచ్చింది.. సరస్వతమ్మగారు.." అని
చెప్పింది.
సరస్వతమ్మగారా?! "కూర్చోమను.. పది నిముషాల్లో వస్తున్నా.." అని
కాస్త ముఖం కడుక్కోవటానికి వెళ్ళాను.
సరస్వతమ్మగారు పాపం, చాలా సున్నితమైన వ్యక్తి. వయసు యాభైఐదో ఏమో ఉంటుంది.
పెళ్ళైన కొత్తల్లో ఆమె భర్తకూ, పుట్టింటివారికీ ఏదో
పెద్ద గొడవై రాకపోకలు ఆగిపోయాయి. ఆయన మహా కోపిష్టి. మూర్ఖుడు. కనీసం మంచికి
పోనివ్వకపోయినా చెడులకు కూడ పుట్టింటి ముఖం చూడనివ్వలేదు. ఎంతో నలిగిపోయింది.
ఆయనకు పైనుంచి అనుమానం రోగం. పక్క ఇళ్ళ వాళ్ళతో మాటలు ఉండవు. వెరసి ఎటూ
రిలాక్సయ్యే అవకాశం లేదు. ఇల్లూ పిల్లలే లోకంగ బతికింది.
ఆమెకు ముగ్గురు మగపిల్లలు, ఇద్దరాడపిల్లలు. ఒకమ్మాయి పదేళ్ళపాటు బతికి ఓ ప్రమాదంలో
చనిపోయింది.
తర్వాత కూడ అదే ఇంట్లో
ఉండాల్సిరావటం ఆమెకు తీరని వేదన. మిగిలిన ఆడపిల్లకు పెళ్ళిచేశాక మెట్టినింటివారితో
వీళ్ళాయనకు మాటతేడాలొచ్చి తెగతెంపులయ్యాయి. రాకపోకలు ఆగిపోయాయి.
పెద్దవాడికి మొదటినుంచే ఇల్లన్నా, తల్లిదండ్రులన్నా,
బాధ్యతలన్నా
గిట్టదు. పెళ్ళిచేశాక ఓ నాలుగేళ్ళుండి తర్వాత వేరుకాపురం పెట్టేశాడు. ఆ
నాలుగేళ్ళలో కొడుకూ కోడలూ పెట్టని తిప్పలు లేవు. తర్వాత భర్తకు గుండెపోటు వచ్చి
మంచాన పడ్డాడు. రెండో కొడుకు తనే పెళ్ళి చేసుకువచ్చాడు. కోడలు ఆధునిక భావాలు కలది.
వీరితో ఇమడలేక పోయింది. వారూ వేరెళిపోయారు. ఆ షాక్‌తో ఆరేళ్ళ క్రితం భర్త పోయాక
ఆరోగ్య సమస్యలెన్నో ఎదుర్కొంటూ చిన్న కొడుకు దగ్గర ఉంటోంది.
ఇన్ని బాధల ఫలితంగ క్రమంగ డిప్రెసివ్
న్యూరాసిస్ అటాక్ వచ్చి మెంటల్ పేషెంట్‌గ మారింది. అనవసరమైన భయాలూ, ఆందోళనలూ, నిరాశా నిస్పృహలూ...
శారీరకంగ బీపీ, షుగరూ, గుండెజబ్బూ ఆమెను పీడిస్తున్నాయి. పాపం, అన్నీ విషయాలు నాకు పూస గుచ్చినట్టు చెప్పుకుంది.. ఎవ్వరికీ
చెప్పుకోలేనివి కూడా..!
కన్నకొడుకును పెళ్ళి చేసుకోనివ్వకుండా
ఆపి పెట్టినా నాకు ఆమెపై కోపం రాలేదు. పైగా పట్ల జాలీ దయ కన్నా గౌరవం ఎక్కువ
కలిగింది. అచ్చం మా అమ్మ లాగే ఉంటుందామె. కాదు, ఎందరో వేదన పడే కన్నతల్లుల ప్రతిరూపం ఆమె.
ఫ్రెష్షైనాక బయటకు వెళ్ళాను.
కుశలప్రశ్నలన్నీ అయ్యాయి. ఆమె ఇప్పుడు ఎంతో సంతోషంగ ఉంది. "మావాడికి పెళ్ళి
చేయాలని నిశ్చయించుకున్నాను.. అమ్మాయిని చూశాను.." అందామె స్వీట్ అందిస్తూ.
"అబ్బ..!!" నిజంగ ఎంత మంచి
వార్త..! నా ట్రీట్‌మెంటు ఇంత ప్రభావవంతమైందా..?!
"వీడి ఆఫీసులోనే పని
చేస్తుందమ్మా.. మంచి పిల్ల. బాగా చదువుకుంది. తనతో సర్దుకుపోగలననిపించింది. నేనే
స్వయంగ మాట్లాడి సంబంధం కుదిర్చాను. ఇదిగో నువ్వు మనస్తత్వం అదీ బాగా చెబుతావు
కదా.. నా వల్ల వారిద్దరికీ సమస్యలు రాకుండ.. అని నీ దగ్గరకు తీసుకొచ్చాను."
అందామె.
ఉన్న ఈ ఒక్క కొడుకు కూడ ఎక్కడ పెళ్ళి
చేసేసుకుని కోడలిని తెచ్చి ఇల్లు నరకం చేసేస్తాడో అని లేనిపోని భయాలతో, మానసిక ఆందోళనతో కుమిలిపోయేది. అటువంటిది ఆమే స్వయంగ ఈ
కబురు చెబుతోందంటే విశేషమే.
"ఏదీ, ఫోటో ఇవ్వండి. చూద్దాం.." ఫోటో చూసి కూడ ప్రస్ఫుటంగ
కనిపించేవి గుణగణాలు, మనస్తత్వం చెప్పవచ్చు.
"ఫోటో కాదమ్మా, అమ్మాయినే తీసుకొచ్చాం.. స్వయంగ మాట్లాడితే ఇంకా బాగా చెప్పగలవు
కదా అని.." అని అతని వంక చూసి,
"వెళ్ళి
అమ్మాయిని తీసుకురారా.." అంది.
నేను ఆసక్తి నింపుకుంటూనే మానసికంగ
సన్నద్ధమయ్యాను.
కానీ అతనితో పాటు వచ్చిన అమ్మాయిని
చూసి ఒక్కసారి ఉలికిపడ్డాను. కుర్చీలోంచి హఠాత్తుగ లేచి నిలబడ్డాను.
"ఆశయా..!!!" అసంభవం..!
ఆశయ నా కళ్ళలోకే చూస్తోంది. అది
వెక్కిరింతా, నవ్వా, సంతోషమా..? ఏమో..! ఏమీ తెలియలేదు.
సంతోషానికి దగ్గరగా అనిపించింది.
"మీకు ఈమె ముందే తెలుసా..?" సరస్వతమ్మగారూ, అతనూ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
ఏమి మాట్లాడాలో తోచక ఔనన్నట్టు తల
ఊపాను. ఇక్కడికి వస్తున్నట్టు తనకూ తెలియదని, వాళ్ళు చెప్పిన పరిశీలకురాలు తన
ప్రాణస్నేహితురాలేనని తను ఎరగదని ఆశయ నిజాయితీగా చెప్పేసింది.
వాళ్ళిద్దరూ ఈసారి ఆశయ వంక చూశారు.
నాకేమీ అర్థం కాలేదు. ఐతే ఇతనేనా సమీర్ అంటే..?!
ఆశ్చర్యాల సెషన్ అంతా అయ్యాక ఆశయే
రెండు ముక్కల్లో గతంలో జరిగిన కథంతా చెప్పింది.
అతను దీనికి ప్రపోస్ చేసిన వెంటనే
వాళ్ళ ఇంట్లో మార్పులొచ్చాయి. అంతా అస్తావ్యస్తం అయిపోయి సరస్వతమ్మ గారు న్యూరసిస్
బారిన పడింది. వీలుచిక్కిన క్షణాన్నే ఆమె పరిస్థితి అంతా అతను వివరంగ రాసి మెయిల్
పంపాడు. కనీసం ఇంకో ఆరేడు సంవత్సరాల పాటు తను పెళ్ళి ఆలోచన కూడ తల పెట్టటం కుదరదని
సారాంశం. ఇది అంతా చదివి కబుర్లు చెబుతున్నాడు అనుకుని అతన్ని నానా మాటలూ అని
తిట్టి వదిలేసింది.
ఒకసారి నా దగ్గర సరస్వతమ్మగారి కేస్‌షీట్
చదివి దానికి విషయం అర్థమైందిట. ఇంక, 'అంత పరుషంగ తిట్టాను, ఇప్పుడు ఎట్ల సారీ చెప్పాలా' అని తెలియక పశ్చాత్తాపంతో ఇటు ఇది సుడిపడిపోతోంది. విషయమంతా విపులంగ చెప్పినా
అంతగా తిట్టేసింది కదా, ఇప్పుడు సరేనంటుందో
లేదోనని లోలోపలే ఇతనూ తీవ్రంగ ఆలోచిస్తున్నాడు.
నేను కుతూహలంగ అడిగాను- "మరి
ఎవరు ముందడుగు వేశారు..?"
దానికి సమాధానంగ "నేనే!
ఇంకెవరు....?" అంటూ అర్జున్‌గాడు
ఊడిపడ్డాడు.
"నువ్వా..!!?" నేను మరింత ఆశ్చర్యపోయాను. "నీకెట్ల తెలుసు ఈ
సంగతి..?"
"తెలియదు.. తెలియాల్సిన అవసరం
కూడ లేదు. ఎందుకంటే నాదంతా సహజాలోచన కదా.. పిన్ని కనక సార్‌ని పెళ్ళి చేసుకుంటే
నాకు డబుల్ బెనిఫిట్ కదా.. అని ఆలోచించాను.."
"ఎట్ల..?"
"అన్నం తినుకుంటూ, ఇల్లూడుస్తూ, షాపింగ్‌కెళ్తూ, బట్టలు మడతలేస్తూ,
కూరలు
తరుగుతూ పిన్ని చెప్పే విశేషాలు, వాకింగ్‌కెళ్తూ, టేబుల్ ముందు కూర్చుని, బ్లాక్‌బోర్డు మీద వివరిస్తూ, లాబ్‌లో ప్రయోగం ద్వారా
నిరూపిస్తూ సార్ చెప్పే విషయాలు ఒకే సబ్జెక్టువి కదా.., రెండూ ఒకే ఫ్రీక్వెంసీలో ఆసక్తిని రేకెత్తించేవి. ఆలోచించి, ఇద్దరూ ఒకేసారి ఒకేచోట ఉండి నాకు పాఠాలు చెప్తే ఇంక
యూనివర్సిటీ ఫస్టే కాదు, హోల్ యూనివర్సే ఫస్ట్
రాగలుగుతా కదా అని కనుగొన్నాను..."
"ఊఁ.. కనుగొని.. ఏం చేశావ్..?"
"అది ట్రేడ్‌సీక్రెట్..
ఎవ్వరికీ చెప్పకూడదు.."
"సీదా సీదా చెప్తావా, తన్నమన్నావా..?"
అన్నాడు
సమీర్ బెదిరిస్తూ.
"..చిన్న అబద్ధం ఆడాను..
శంకరాభరణంలో తులసిలా! ఇద్దరికీ మీటింగ్ ఏర్పాటు చేశాను. నా అదృష్టం బావుంది..
కరెక్ట్ టైంకే కొట్టాను, గంట. అంతే.. ఠంగుమని
మోగింది, ఫట్టుమని పెళ్ళి కుదిరింది..
ఇంక నెక్స్ట్ మోగేది బాజాలే.."
"ఓరినీ పిల్లాడు
బంగారంగానూ.." అంటూ అందరం నవ్వేశాం.
"ఊఁ.. ఇప్పుడేమంటావ్..
ఆత్మవిశ్వాసం గెలిచిందా.. అందం గెలిచిందా..?"
అడిగాన్నేను
దాన్ని రహస్యంగ.
"ఆత్మవిశ్వాసం అంటేనే నిజమైన
అందం అని నువ్వే చెప్పావుగా..!" అంది అది గడుసుగ.
పక్కన అతనితో నిండుగ ఉన్న ఆశయనూ, సంతృప్తిగ సరస్వతమ్మగారినీ చూసి నా మనసు నిండిపోయింది.
** * *** * **
No comments:
Post a Comment