Thursday, 8 December 2016

10. తెలిసిన రాయి - 1



నిద్ర పట్టట్లేదు. పాలు తాగాను గోరు వెచ్చగ. లాభం లేదు. ఉండదని తెలుసు. చల్లగాలికి కాసేపు ఆరుబయట కూర్చున్నాను.
          అర్ధరాత్రి.. పండు వెన్నెల.. నిండు పున్నమి అయినా నాకు హాయినివ్వలేదు.. ఇవ్వదని తెలుసు.
          అతను వచ్చి వెళ్ళాడు రెండు రోజుల క్రితం. అప్పటి నుంచీ ఇదే పరిస్థితి. ఊహించనిది కాదు. ఊహించినది కూడా కాదు. రెండు రాత్రుల నుంచి పిచ్చిగ అనిపిస్తోంది. రేపు కూడా శెలవు పెట్టక తప్పదు. పెట్టకపోతే వెళ్ళాల్సి వస్తుంది. అతన్ని చూడాల్సి వస్తుంది. అడగడు. కానీ నేనే చెప్పాల్సి వస్తుంది. అతను అడగాల్సింది చెప్పాల్సింది అంతా అయిపోయింది. ఈసారి నాది వంతు.
          మొన్న ఇల్లు దులిపి సర్దుతున్నాను. సరిగ్గ పని మధ్యలో ఉన్నాను. తలుపు చప్పుడైంది. కూరలామె వచ్చేవేళ అది. ఆమేనేమో అనుకుని చీరయినా సవిరించుకోకుండ తలుపు తీశాను.
          ఎదురుంగ అతను..!! కంగారు పడ్డాను. కొంచెం తడబడ్డాను. కానీ ఆశ్చర్యపోలేదు.
          "లోపల రావద్దా..?" అడిగాడు నేనేమీ మాట్లాడకుండ నిశ్శబ్దంగ నిలబడేసరికి.
          "ఆ మాట అనగలిగితే బాగుండేది.." అనుకున్నాను.
          నా కళ్ళలో స్థిరమైన మౌనాన్ని చదువుతూ అతను అక్కడే నిలబడ్డాడు. ఆ చూపుల నైశిత్యం నాకెప్పుడూ కంటకంలా గుచ్చుకుంటూనే ఉంటుంది. ఈసారి మరింత గుచ్చుకుంటోంది. దీనికి అర్థం వేరే అని తెలిసింది కనక. పని ధ్యాసలో పైకి దోపుకున్న చీరకుచ్చుళ్ళు కనీసం కిందకు అనుకోవాలన్న స్పృహ కూడా లేదు. అది అసహనమో ఇంకేంటో నాకు తెలియదు. ఈ సన్నివేశానికి నేను సిద్ధంగ లేను. అంతే.
          "దీవానా.. కియా హై తేరీ యాదోం నే.. తూ ఆకే జరా దేఖలే.. ఆజా.." కాసెట్టులో వస్తున్న సోనూ నిగమ్ పాట వింటూ, "నీకు మంచి అభిరుచి ఉంది.." మెచ్చుకోలుగ అన్నాడు.
          "కానీ మీకు మాత్రం అస్సలు మంచి అభిరుచి లేదు.." అనేశాను పక్కకు చూస్తూ.
          "అదేం లేదు. నువ్వు ఈ క్షణం కూడా అద్భుతంగనే ఉన్నావు.." అతను ఎన్నడూ ఏమాటా మాట్లాడటానికి జంకడు. ఏమో, నిజమే చెప్పాడేమో తెలియదు. నేనెప్పుడూ నిజంగ ఆ వైపు ఆలోచించలేదు. చేతిలో చీపిరి కట్టను చూస్తూ నిలబడిపోయాను. "అద్భుతంగ కనిపించే ప్రతీదీ అద్భుతంగ ఉండాలని లేదు కదా.." అన్నాను.
          "అద్భుతంగ ఉన్న ప్రతీదీ మాత్రం అద్భుతంగనే కనిపిస్తుంది. సర్లే.. నాన్నగారు ఉన్నారా..?" అడిగాడతను.
          "బయటకెళ్ళారు."
          "అంశూ కూడా లేడా..?"
          "కాలేజికెళ్ళాడు."
          "ఒక్కదానివే ఉన్నావా? అయితే నేను బయటే కూర్చుంటాను. నువ్వు నీ పని కానించుకో. నేను అడ్డం వచ్చాను."
          "పనికే కాదు.. జీవితానికి కూడా అడ్డం వస్తున్నారనే నా బాధ.."
          "దానికి కారణం నేను కాదు. మొదలు పెట్టింది నువ్వే. అయినా అదంతా మీ నాన్నగారితో తేల్చుకుంటాను."
          "అది పద్ధతి కాదు.."
          "పద్ధతి కాదని నాకూ తెలుసు. కానీ ఏం చేయను? ఆయన సరేనంటేనే మావాళ్ళు వచ్చి మాట్లాడతామని అన్నారు. తప్పటం లేదు. నువ్వు పని చేసుకో.." అతను బయట పార్కు చేసి ఉన్న తమ్ముడి బైకు మీద కూర్చున్నాడు ఇంటి ముందున్న ఉపవనం చూస్తూ ఆనందిస్తూ.
          నేను ఇల్లు సర్దే పని కానించుకున్నాను. దీవానా పాటల సీడీ నడుస్తూనే ఉంది. ఊడవటం పని పూర్తి కాంగనే అతనికి టీ కలిపి తీసుకువెళ్ళి ఇచ్చాను.
          "నువ్వు ఇంట్లో ఇంత సాదాగా కూడా అంతే అందంగ ఎట్ల ఉన్నావు..?"
          "మీ నోట ఈ మాటలు కొత్తగ ఉన్నాయి. నాకు నచ్చటం లేదు.."
          అతను మౌనంగ టీ కొద్దిగ తాగాడు. "టీ బాగుంది. దీన్నైనా మెచ్చుకోవచ్చా.. లేదా..?"
          "మీనోట ఏ మెచ్చుకోళ్ళైనా నాకు కొత్తే.."
          "నాకూ కొత్తే..! ఏం చేయను..?"
          "మనిషిని చిత్రవధ చేసే ఉపాయాల్లో ఇప్పుడు మీరు ఎంచుకున్నది అన్నింటికన్నా ప్రశస్తమైన పద్దతి."
          "తెలుసు. తప్పదు." అని ఆగి, గట్టిగా నిశ్విసంచి, "సారీ.." అన్నాడు ఒకసారి కళ్ళు మూసుకుని తెరిచి.
          నేను ఒక్కసారిగ బాంబు పేలిందేమో అన్నంత ఉలికిపాటుతో చూశాను. అతను నా కళ్ళలోని ఆశ్చర్యాన్ని అపనమ్మకాన్నీ చూస్తూండిపోయాడు. నేను కళ్ళు తిప్పేసుకున్నాను. అతను మన వంక చూస్తుండంగ రెండు క్షణాలకన్నా ఎక్కువ మనం అతని వంక చూడలేము.
          "చిన్నప్పుడు అన్ని మాటలూ నేర్చుకున్నాను. ఇది మాత్రం నేను అస్సలు నేర్చుకోని మాట. దీని అర్థం తెలిశాక ఎన్నడూ ప్రయోగించలేదు. మొదటిసారి నీతో చెబుతున్నాను. నా నోటి నుంచి నా చెవులకే ఈ మాట కొత్త."
          నా కళ్ళలో నీటిపొర కదిలింది. ఒక్కసారిగ ఏడుపొచ్చింది. నేను తమాయించుకుని లోపలకు వచ్చేశాను.
          అప్పుడే నాన్నగారు వచ్చారు బయటనుంచి. నేను పని పూర్తి కావటంతో స్నానానికి వెళిపోయాను. నాన్నగారికి అతను పరిచయమే. ఎందుకు వచ్చాడో కూడా బహుశ నేనేమీ చెప్పకపోయినా చూచాయగ తెలుసు. చలికాలం పొద్దున పదిన్నర అవుతున్నా ఎండ ఎక్కలేదు. ఇద్దరూ ఇంటి ముందున్న సిమెంటు అరుగు మీద కూర్చున్నారు. చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు. వినాల్సిన అవసరం కూడా లేదు. నా స్నానం పూజ మొదలైన పనులన్నీ అయ్యాక కూడా వాళ్ళ మాటలు పూర్తి కాలేదు. నేను టిఫిన్ సిద్ధం చేసి ఇద్దరినీ లోపలకు పిలిచాను. నా చేత టిఫిను అందుకుంటూ అతను నా వంక చూసిన చూపు నేను ఆ క్షణం ఎంత అందంగ ఉన్నానో తెలియచేసింది. నాకు ఆనందం ఏం కలగలేదు. నా ప్రమేయం ఏమీ లేదు అందులో. రోజూ ఎట్ల ఉంటానో అట్లగే ఉన్నాను.
          నేను లోపల వంట గదిలో వంట ప్రయత్నంలో పడ్డాను. దాదాపు అది పూర్తవ్వ వచ్చేటప్పటికి నాన్నగారు లోపలకు వచ్చారు. అతను వెళిపోయినట్టున్నాడు.
          "మరి ఏమంటావు..? నీ అభిప్రాయం ఏంటి..?" అడిగారు నాన్నగారు సూటిగ విషయంలోకి వస్తూ.
          నేను మౌనంగ సంఘర్షణ పడుతూ ఆయన వంక చూశాను. ఏ ఆలోచనకూ రాలేకపోతున్నానని ఆయనకు అర్థమైంది.
          "సరే.. కావాల్సినంత వ్యవధి తీసుకో. తొందరేం లేదు. బాగా ఆలోచించుకో." అన్నారు.
          అప్పటి నుంచీ అదే చేస్తున్నాను. ఆలోచన తెగటం లేదు.
          రాత్రి పన్నెండున్నర దాటింది. నవల పక్కకు పడేశాను. చదివినా నిద్ర రావటంలేదు. రాదని తెలిసీ చదువుతున్నాను. అందుకే తీసేశాను. వాస్తవం నుంచి తప్పించుకుందామని నేను చేసిన ప్రయత్నం ఎప్పుడూ సఫలమవ్వలేదు. ఇప్పుడూ కాదని తెలుసు. అందుకే దాన్ని ఎదురుకోక తప్పదు.
          ఇప్పుడు ఏంటి నా బాధ? సమాధానం చెప్పాలి..! అదీ రేపే చెప్పాలి..! ఇంకా ఎంతకని నానుస్తాను? కానీ నాకు సమాధానం తెలుసా? తెలియదు. అతన్ని చూసిన క్షణం నుంచీ ఈనాటి వరకూ నాకదే తేలటం లేదు. అప్పటి నుంచి తరచి చూసుకోవటం మొదలు పెట్టాను. వర్తమానపు గడప దాటి గతపు సౌధాలలోకి అడుగు కదిపింది మనస్సు.
*
          డిగ్రీ ఫస్టియరు.. మొదటిరోజు. టైంటేబుల్ ప్రకారం క్లాసు జరిగే రూములో కూర్చుంటే ఆ పూట క్లాసు ఇక్కడ కాదని చెప్పి ఒకడు వేరే పెద్ద లెక్చరుహాలుకు తీసుకెళ్ళాడు, నన్ను మరిద్దరు ముగ్గురు అమ్మాయిలను. మేము లోపలకు అడుగు పెడుతూనే తలుపు ఠకీమని మూసుకుంది. కొత్తగ కళాశాలలో చేరిన వారంతా అక్కడ దర్శనమిచ్చారు, పాత ముఖాలు కొన్నిటితో కలిపి. విషయం ఎవ్వరూ వివరించకుండానే అర్థమైంది, సీనియర్ల రాగింగ్ బారిన పడ్డానని. వన్ టు వన్ రాగింగ్.. దారుణం.. పైగా ఒకరికిద్దరూ ముగ్గురు కూడా ఉన్నారు. అదొక చిన్నపాటి ఆడిటోరియంలా ఉంది.. మెట్ల మెట్ల సీట్లు.. చక్కగ కూర్చోబెట్టి మర్యాదపూర్వకంగ వేపుతున్నారు. భగవంతుడా, పరువు పోకుండా కాపాడమని వేడుకున్నాను.
          ముందుగా ఏదైనా పాట పాడమన్నారు. "అదివో అల్లదివో శ్రీహరివాసమో.." అని అన్నమయ్య కీర్తన అందుకున్నాను. ఆపమన్నాడతను సీరియస్ గ చూసి.
          "నీకు సినిమా పాటలు రావా..?" అన్నాడు.
          "అది సినిమా పాటే.. అన్నమయ్య సినిమాలోది.. నాగార్జున హీరో.." అన్నాను. అది విన్నవారు అందరూ నవ్వారు.
          తర్వాత ఏదో అడగబోతుంటే తలుపు చప్పుడైంది. వెంటనే వారిలో ఒకతను నన్ను రాగింగ్ చేస్తున్నతనితో- "ఒరే చచ్చాంరా అనూ, ప్రిన్సిపాల్ సారేమోరా.." అన్నాడు బెంబేలుగ. ఇతగాడు కోపంగ- "చచ్చువెధవా.. పేరు చెప్పకు.." అని అతడి తల వెనక ఒకటిచ్చి, అందరినీ ఉద్దేశించి, "సైలెంస్..!" అని అరిచాడు. ఉన్నవారున్నట్టు బిగుసుకుపోయారు. బెంచీల మీద బుద్ధిగ క్లాస్ వినేవారిలాగ సెటిలైపోయారు. జూనియర్లనీ బుద్ధిగా కూర్చోమన్నారు.
          అతను నావంక చూసి, "ఎవరైనా సరే, ఇక్కడ క్లాస్ జరుగుతోందని పంపించి రా.." అన్నాడు.
          నేను తలుపు తెరిచి వెంటనే పారిపోదామని ప్రయత్నించాను. కానీ ఎవరో లాగినట్టైంది. అనూ నా ఓణీ వెనక నుంచి పట్టుకుని ఉన్నాడని తిరిగి చూస్తే తెలిసింది. వెధవ్వేషాలేయవద్దన్నట్టు చూసి, "చెప్పిన పని చెయ్యి." అన్నాడు నెమ్మదిగ.
          వచ్చిన ఆయాతో క్లాస్ జరుగుతోందని నమ్మకంగ చెప్పి, పంపేశాక లోపలికొచ్చి, తలుపు వేసి, నన్ను తినేసేలా చూస్తూ, "ఎక్కడికి బయలుదేరబోయావు?" అన్నాడు.
          నేనేం మాట్లాడలేదు. "పేరేంటి?" అని అడిగాడు. నేను చెప్పలేదు. కొత్తా, పాతా వారంతా నన్నే చూస్తున్నారు ఆసక్తిగ. మళ్ళీ అడిగాడు, ఈసారి కాస్త గద్దించినట్టు.
          "రక్తి.." చెప్పాను చిన్నగ.
          "ఎవరిని రక్కి..?" నవ్వాడతను. అతని గొంతుతో మరి కొన్ని గొంతులు శ్రుతులు కలిశాయి.
          నిన్నే అందామనుకుని తమాయించుకున్నాను. ఆవేశం ఎక్కడ ప్రకటించాలో ఎక్కడ కూడదో నాకు తెలుసు. ఇప్పుడు ఏం మాట్లాడినా వీళ్ళు గొడవ చేసేస్తారని అర్థమైంది.
          "తలుపు తెరవంగనే ఎక్కడికి బయల్దేరావు..?"
          "ప్రిన్సిపాల్ కి కంప్లైంటు చేయాలనేమో..!" అంతకు ముందు అనూను పేరు పెట్ట పిలిచినతను అన్నాడు.
          "చేస్తావా..? అయితే వెళ్ళు..! దారి తెలుసా.. సార్ రూమ్ కి..?" అడిగాడు అనూ నన్ను.
          నేను నిష్క్రియగా చూశాను. ఆ కళాశాలభవనం పెద్ద జంతర్ మంతర్ లా ఉంటుందని కొత్తవాళ్ళను ఇబ్బంది పెట్టటానికి సీనియర్లు ఈ మాట బాగా ఉపయోగించుకుంటారని నేను ముందే విని ఉన్నాను. అయితే వాళ్ళకు తెలియని సంగతి ఏంటంటే నాకు ఆ కళాశాల భవనం కొట్టిన పిండి. ప్రిన్సిపాల్ మాకెంతో పరిచయం ఉన్నవారే. నేను అంకుల్ అని పిలుస్తాను. నాన్నగారితో ఆయనకు లాయర్ సహాయం కావాల్సి వస్తుండేది. ఆ పనులమీద కలవటానికి వచ్చినప్పుడు ఆయనతోపాటు చాలా సార్లే ఆ కాలేజికి వస్తూపోతూ ఉన్నాను. నేనూ తమ్ముడూ అక్కడ ఏవి ఎక్కడ ఉంటాయో గుర్తు పెట్టుకోవటానికి పోటీలు పెట్టుకన్నాము కూడా.
          అనూ నా భావాలు చదవటానికి ప్రయత్నిస్తూ, "పో వెళ్ళు మరి..! ఇంకా నిలబడ్డావేఁ..?" అన్నాడు.
          నేను కదిలబోయాను. వెంటనే కొన్ని ఆశ్చర్యార్థకాలైన చూపులు ఈలలు వినిపించాయి.
ఉత్తగ వెళ్ళనిస్తే మజా ఏముంది? "వెళ్ళి ఈ గులాబి పువ్వును ఆయనకు బహుకరించి రా.." అన్నాడు, పక్కన ఫ్రెషర్స్ వెల్ కమ్ కోసం ఏర్పాటు చేసిన బల్ల మీద ఉన్న బొకేలోనుంచి ఓ గులాబి తీసి ఇస్తూ.
          "ఇచ్చి ఏమైనా చెప్పాలా..?" అడిగాను అది అందుకుంటూ.
          "ఇస్తే చాలు.." అన్నాడతను, దాని కాడకు ఉన్న ముళ్ళు గుచ్చుకోకుండ దాన్ని నా చేతివేళ్ళ మధ్య ఉంచుతూ.
          అది అందుకుంటుంటే మరికొన్ని ఈలలు వినిపించాయి. వాటి అర్థం వేరు. అతను అందించింది ఎర్రగులాబి.
          ముందు మాట్లాడిన అతన్ని నా వెంట ఇచ్చి పంపాడు అనూ సాక్ష్యం కోసం. నేను కదిలాను. పక్కనే కొంచెం వెనకగా అతను. నేను వెళ్ళే దారి గమనిస్తూ క్రమంగా అది నేరుగ ప్రిన్సిపాల్ ఆఫీస్ వైపేనని అర్థంకావడంతో కొద్దిగ నిరాశ తర్వాత భయం తర్వాత కంగారు పడుతూనే అతను నావెంట వచ్చాడు. నేను సార్ గది దగ్గరకెళ్ళింది చూసి అతను తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. తలుపు కొట్టి ఆయన రమ్మన్నాక లోపలికెళ్ళిన నన్ను చూసి ఆయన ఏదో పనిలో ఉండి- "ఏమ్మా?" అన్నాడు. అతను కిటికీలోంచి చూస్తుండగా సార్ కి గులాబి పువ్వు ఇచ్చాను.
          ఆయనకు అర్థమైంది ఇదేదో రాగింగ్ లో భాగమని. "పేరు చెప్పు చాలు.." అన్నారు.
          నిర్భయంగ చెప్పేశాను..! అంతే బయట వేచి ఉన్నవాడు పరుగులంకించుకున్నాడు ‘అసాధ్యురాలు’ అంటూ.
          ప్రిన్సిపాల్ అంకుల్ వెంటనే నా వెంట ఆ గదికి వచ్చేసరికి అక్కడ పురుగు లేదు. "సరే, వాళ్ళ టీం సంగతి నేను చూస్తాను.." అన్నారు. నేను, "అదేం వద్దు, వదిలేయమ"న్నాను. ఆయన నన్ను జాగ్రత్తగ ఉండమని చెప్పి వెళిపోయారు. ఆ ఘట్టంతో అంతా నా విషయంలో అప్రమత్తులైనారు.
          విషయం అంతటితో ఆగలేదు. ఫైనలియర్ డిగ్రీ చదివే బృహతి నాకు కాలేజికి వచ్చాక పరిచయమైంది. దూరపు చుట్టాలవుతారు. తెలిసి తనే వచ్చి కలిసింది. ఎవరి ద్వారా విన్నదో.. మరునాడే వచ్చి నా నుంచి సంఘటనంతా వివరంగ అడిగి వినిపించుకున్నది. విద్యుల్లత అని ఈ కళాశాలపత్రిక ఒకటి నడుస్తుంటుంది. ఆ అమ్మాయే దానికి సంపాదనం చేస్తుంది అని నాకు తెలియదు. జరిగింది అంతా విని అందులో అక్షరశః యథాతథంగ అచ్చు వేసేసరికి కళాశాలలో అందరికీ అనూ సంగతి తెలిసిపోయింది. కాలేజిలో రాగింగ్ కి ప్రతిబందధం విధించారు, చేస్తూ పట్టుబడితే గొడవవుతుందన్న భయంతో చాలామంది సీనియర్లు కోరిక ఉండీ ఆ పని చేయలేకపోయారు. అదే అనూ టీమ్ ఆ సాహసం చేశారు. అది మిగిలినవారికి మండింది. నేరుగానే నిరసనం ప్రదర్శించినట్టున్నారు.. ఇంక అతనికి కాలింది. పైగా బృహతి ఆ సంఘటనను అందులో వేయించింది నా మీద అభిమానంతో కాదు. నాకు తర్వాత తెలిసింది. అతని మీద ఆశపెట్టుకుని అడిగి కాదనిపించుకుందని, ఆ కచ్చాతో ఇట్ల పగ తీర్చుకుందని. విషయం తెలియక నేను చెడ్డదాన్నయ్యాను. అనూ అనబడే త్రాచుపాము తోక తెలియక తొక్కి వైరం కొని తెచ్చుకున్నాను.
          నాతో వైరం తెచ్చుకొనే విషయాలు ఇంకా కూడ ఉన్నాయి. నాకు కొంచెం ధైర్యం పాళ్ళు ఎక్కువ. అందుకని మొదటినుంచీ అన్యాయాన్ని సహించి ఊరుకునే అలవాటు లేదు. ముఖ్యంగ అమ్మాయిలను ఎవరైనా అబ్బాయిలు అల్లరి పెడుతున్నా, పిల్లలను ఏడిపిస్తున్నా, వయసు పైబడ్డవారిని, వికలాంగులను బాధిస్తున్నా నేను చూస్తూ సహించి ఊరుకోలేను. అది ఇంటి దగ్గర కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, బస్సులో కావచ్చు. చేతనైన పరిధిలో చేతులకు మట్టి అంటకుండ యుక్తిగ పని కానించే నేర్పరితనం నాకు చిన్ననాటే అలవడింది.
          పోలీస్ ఇంస్పెక్టర్ రమానాథం అంకుల్ మా ఇంటి దగ్గరే ఉండేవారు. ఆయన ఛాయ నా మీద చిన్నతనం నుంచీ పడింది. రిటైరైపోయి ఇంటి దగ్గరే ఉండేవాడు ఆయన. నేనూ, తమ్ముడూ ఆయన దగ్గరకు చదువుకోవటానికి వెళ్ళేవారం. చదువుతోపాటు ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అంటే ఎట్లా ఉండాలో దాదాపు పూర్తి మౌఖిక శిక్షణ పూర్తి చేయించాడాయన. దానికి తోడు చిన్నప్పుడే తమ్ముడు నేర్చుకుని వచ్చి నేర్పిస్తుంటే వాడి దగ్గర కరాటే నేర్చుకున్నాను. ఏ దెబ్బ ఎట్ల కొడితే అవతలివాడు మళ్ళీ లేవడో, ఎవరికీ డౌటు రాకుండ మన పని అవుతుందో- అందులో శిక్షణ మా స్కూలులో ఉండే ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ పుణ్యమా అని నాకు అలవడింది. ఆమె వుమెన్స్ లిబ్ లో చాలా ఉత్సాహంగ పాలు పంచుకునేది. కనక సాధారణంగ చిన్నచిన్నవాటికి భయపడేదాన్ని కాదు.
          దానితోపాటు ఎప్పటికప్పుడు లా గురించి అవసరమైనంత తెలుసుకునేదాన్ని. దానికోసం పుస్తకాలు చదివేదాన్ని. నాన్న ఉద్యోగం నగరంలో పేరెన్నికగన్న ఒక లాయర్ దగ్గరే అసిస్టెంటు పని. ఏం సందేహం వచ్చినా లాయర్ అంకుల్ దగ్గరకు నేరుగ వెళ్ళో ఫోనులోనో అడిగేదాన్ని. ఆయన అన్ని విషయాల్లో నాకు పూర్తి మద్దతుగ ఉండేవారు. దానితో ఎప్పుడైనా పట్టు బడినప్పుడు లీగల్ పాయింటుతో కొడితే ఎంతటి వారైనా నోరుమూసుకోక తప్పేది కాదు. అందులో నాకు నాన్న, తమ్ముళ్ళ సహకారం చాలా ఉండేది. తోటి ఆడపిల్లలలాగ నేను ఉండనని మా బంధువులు కొందరికి బాధగ ఉండేది. నాన్నకు చెప్పి చూశారు కూడా. కానీ నాన్నే పట్టించుకోలేదు. కనక నేనూ పట్టించుకోలేదు. భగవంతుణ్ణి నమ్ముకున్నాను. ఎన్నడూ అపాయాలలో పడనివ్వలేదు. ఎందుకంటే అన్యాయం చూసి నోరు మూసుకునేవారంటే ఆయనకూ అసహ్యం వేసి ఉంటుంది.
          కాలేజిలో చేరాక కూడా నా ప్రవర్తన అట్లగే ఉండేది. వెళ్ళిన కొత్తల్లో నాలుగైదు సంఘటనలు జరిగాయి. ఎక్కడా రభస చేసే అవసరం లేకుండనే నా సంగతి జనాలకు అర్థమైంది. పైనుంచి ప్రిన్సిపల్ గారి మద్దతు..! ఫలితంగ కొందరి కళ్ళకు కంటగింపుగ అయినాను. కానీ నాతో పెట్టకోకూడదన్న సందేశం మాత్రం అందరికీ ఎవరూ వివరించకుండనే అర్థమైంది. నాకోసం ఎవరైనా ఒకటే! నా పని కానించుకోవటం నాకు బాగా తెలిసిన విద్య. ఒక పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఆత్మవిశ్వాసం ఎంత అవసరమో, సంయమనం కోల్పోకుండ ఉండటం కూడ అంతే అవసరమని రమానాథం అంకుల్ ఎప్పుడూ చెప్తారు. ఎంతటి అపాయం పరిస్థితిలో అయినా విచక్షణ కోల్పోకూడదు. ఎంత ప్రమాదంలో చిక్కుకున్నా భయంతో పారలైస్ కాకుండ నిరంతరం మార్గంకోసం శోధన సాగించే స్థితిలో ఉండాలి. ఇవి నాకు ఆయన ఒంటబట్టించిన మౌలిక సిద్ధాంతాలు. అందుకే అనూ నన్ను రాగింగ్ లో ఏమీ చేయలేకపోయాడు. అంతేకాదు, నా ఖర్మ కాలో ఏమో డిబేట్ పోటీలు, క్విజ్ లు, మెమరీ గేమ్ లు జరిగినప్పుడు అతని ప్రధాన ప్రతిపక్షంలో నేనే ఉండేదాన్ని.
          అనూ పూర్తి పేరు అనురాగ్. నా పేరు అనురక్తి. దానితో జనాలు ఈ వైరానికి మరో పేరు పెట్టారు. కొందరు ఇద్దరిదీ ఒకే స్థాయి కనక ఈ శత్రుత్వం – లైక్ పోల్స్ రిపెల్ అన్నారు. ఇంకొందరు ఇద్దరూ సమస్థితిలో ఉన్నా విరుధ్ధభావాలు కనక అన్ లైక్ పోల్స్ ఎట్రాక్ట్ కనక ఇది దానికి తొలిమెట్టేనని అన్నారు.
          కానీ నేనేమీ పట్టించుకోలేదు. చదువు మీద శ్రద్ధ పెట్టాను. ఫలితంగ అతను ఆ కళాశాలలో అన్ని రికార్డులూ విరగబాదేశాను. అవన్నీ అనురాగే నెలకొల్పాడట. అతన్ని పడగొట్టి అంత శాతం మార్కులు ఆ కళాశాల చరిత్రలోనే ఎవరూ సాధించలేదట..! అందునా అమ్మాయిలు.. సవాలే లేదు!!
          నాకిదేం తెలియదు. నేనెక్కడున్నా ఇట్ల చదవటమే నాకలవాటు. ఇంక ఎవరివి ఏం పగిలి బద్దలైతే నాకేంటి..? కానీ పగిలినవారికి బాధే కదా! అతను కొత్త రికార్డ్ సృష్టించే ధ్యాసలో పడ్డాడు. పీజీ ఫైనలియర్ కి చేరుతూనే సివిల్స్ కొట్టాలని పట్టుదల పట్టాడు. మరి వ్రతాలే చేశాడో, నోములే నోచాడో తెలియదు. మొదటి సారిలోనే ఐపీఎస్ ప్రథమస్థానాన్ని సంపాదించి కళాశాల చరిత్రలోనే కాదు, దేశచరిత్రలో కూడా చోటు సంపాదించుకున్నాడు. చదువు పూర్తి కాంగనే ఉద్యోగంలో చేరాడు. అభినందన సభకు వెళ్ళక తప్పలేదు. కంగ్రాట్స్ చెప్తే, నా చేతిని తన పిడికిట్లో చేతనైనంత గట్టిగ నలుపుతూ, థాంక్సైనా చెప్పకుండ, నాకు మాత్రమే వినిపించేంత గొంతుతో, "దమ్ముంటే ఇది పడగొట్టు." అని సవాల్ విసిరి వెళిపోయాడు, ఐ.పీ.ఎస్ ట్రైనింగుకు. అప్పటికి నేను ఇంకా డిగ్రీ రెండో సంవత్సరమే. సరే తప్పుతుందా..? గడప ముందుకు వచ్చిన సవాల్ ని ఎందుకు కాదనాలి..? చేతి నెప్పి తీర్చుకుంటూ, నేనూ పూజలు చేయటం మొదలు పెట్టాను.
          అయితే అతనికీ నాకూ తెలివితేటల సామ్యం పక్కన పెడితే చాలా తారతమ్యాలు ఉన్నాయి. నాకు అమ్మ లేదు. టెంతులో ఉండంగనే కాన్సరు వ్యాధితో ఆమె కన్ను మూసింది. అది కూడా వైద్యం చేయించగలిగే స్తోమత లేక. అందరం ఆ నిజాన్ని సాధ్యమైనంత త్వరగా జీర్ణించుకున్నాము. నాన్నగారే మాకు అమ్మా, నాన్నా అయినారు.
          ఆయన చాలా ప్రాక్టికల్ మనిషి. కాన్సర్ కోసం ఆమెకు చేయించే చికిత్సకు అయ్యే ఖర్చువల్ల మా ఇద్దరం పిల్లల భవిత ప్రశ్నార్థకం అవుతుంది- అని ఆలోచించాడు. అది చాలామంది బంధువులకు నచ్చలేదు. అమ్మవైపు వారంతా నాన్నగారిని వెలివేశారు. ఆయనను అమ్మ హంతకుడిగా చూశారు. కానీ నిజంగా పైసా పైసా చూసుకునేవారికి ఈ లోకంలో ఈనాడే కాదు, ఏనాడైనా ఈ పరిస్థితులు భయంకరమైన శాపాలే. ఆయన ఉక్కు మనిషి. చెక్కు చెదరలేదు. ఆయన అశక్తత నాకు తెలుసు. నేనూ, తమ్ముడూ ఆయనను తప్పు పట్టలేదు. అమ్మ స్వయంగా కూడా చికిత్స వద్దు అనే అన్నది. రోగాలకు పేదా గొప్పా భేదం తెలియదు కదా..!!
          ఇక అమ్మకు తుదివీడుకోలు పలికి, తమ్ముడికి నాన్నగారికి నాకూ నేనే అమ్మనైనాను. ఇంటి పనులూ వంటపనీ చేస్తూ చదువుకోవాలి. అతను అట్లా కాదు. అయిన ఇంటివాడు. చేసి పెట్టేందుకు మందీ మార్బలం..! గొప్ప ఇంటివారికి ఉండే తలబిరుసూ, పొగరూ, నోటిదురుసూ అన్నీ ఉన్నాయి. సామాన్యంగ వారిలో ఉండనిది, ఇతనికి ఉన్నదీ చదువు ఒక్కటే. అతనికన్నా మా కుటుంబం అన్నిటా తీసికట్టే. ఇల్లు చిన్నది. నా తమ్ముడు ఫ్రీ సీటులో వచ్చి, మేనేజిమెంటు వారు స్పాన్సరు చేసిన ఇంజనీరింగు చేస్తున్నాడు. మా నాన్నగారిది ఏ ఎదుగూ బొదుగుల్లేని చిన్న ఉద్యోగం. తన తోటివాడే అయినా తెలివితేటలతో అవకాశాలను సక్రమంగ వినియోగించుకుని బాగా పేరు తెచ్చుకున్న సహాధ్యాయి వద్దనే ఆయన కొలువు చేయక తప్పలేదు. జీతం అవసరాలు తీర్చేదే కానీ ఆడంబరాలకు వెళ్ళనిచ్చేది కాదు. మా ఇద్దరి బాధ్యతా తీరాలి కనక నేటి సుఖానికి ఖర్చుపెట్టే దానికన్నా రేపటి అవసరానికి దాచేదే ఎక్కువ. కనక నేను అతన్ని పడగొట్టే రంగం ఒకే ఒక్కటి.
          ఎన్ని రాత్రుళ్ళు మేలుకున్నానో, ఎన్ని పగళ్ళు పని మధ్యలో తూలి పడబోయానో, ఎన్నిసార్లు లైబ్రరీ మూసేసే వేళ కసిరింపులు పడుతూ బయటకు వచ్చానో, పనులు చూసుకుంటూనే పుస్తకం విందామని నాన్నగారితో, అంశూతో సిలబస్ మెటీరియల్ చదివించుకుంటూ ఎన్ని గంటలు కంఠశోష పెట్టించానో.. చివరకు నాలుగేళ్ళకు నా కల తీరింది. అటు పీజీ పూర్తైంది. ఇటు ఐపీఎస్ టాప్ చేశాను. దేశం మొత్తం మీద టాప్ వచ్చినందుకు, అమ్మాయిని అయినందుకు నాకు రెండు మెడల్సు వచ్చాయి. నా పేరూ ఫోటోలతో సహా ఇంటర్వ్యూలు చాలా పత్రికలలో పడ్డాయి. అతను చదివే ఉంటాడు, తెలుసుకునే ఉంటాడు. అది నాకు తెలిసే అవకాశం లేదు. తర్వాత నేను అతన్ని ఎన్నడూ చూసింది, కలిసింది, మాట్లాడింది లేదు. అతనేమైనా తెలుసుకున్నాడేమో నావరకు రాలేదు. అవన్నీ ఆలోచనలు నాకు అప్పుడు లేవు. ఒకటే ఆనందం. అమ్మ కల తీర్చానని, నాన్నగారి పేరు నిలబెట్టానని. తమ్ముడు గర్వంగ వాడి కళాశాలలో మిఠాయిలు పంచాడు.
          త్వరలోనే శిక్షణ శిబిరానికి పిలుపు వచ్చింది. ఎగురుకుంటూ వెళ్ళాను. అంతే..! అక్కడికి వెళ్తూనే శిక్షకుడిగా అతన్ని చూసి నా రెక్కలు తెగిపోయాయి. నా చిరాకు దాగలేదు. అతని ఆనందమూ దాగలేదు. ఆనందం నన్ను అక్కడ చూసినందుకు. తలవెంట్రుక నుంచి కాలిగోటిదాకా చూస్తూనే ఉన్నాడు తనివితీరా. ఆ చూపులు చెప్పకనే నోళ్ళుతెరిచి అరిచి అరిచి చెబుతున్నాయి- 'ఇక కాసుకో..!!' నిజంగనే చాలాచోట్ల కాచుకోవాల్సి వచ్చింది. అతని దురాక్రమణలకు తట్టుకోలేకపోయాను. శిక్షణ పేరుతో ఎన్ని శిక్షలు వేశాడో, ఎన్ని అభాండాలు నెత్తిన వేసి తిట్లు తినిపించాడో, ఎంత జాగ్రత్తగ ఉన్నా ఆ డేగకళ్ళ నిఘాతో ఎన్ని చెరువుల నీరు తాగించాడో.. నాకూ ఆ భగవంతుడికే తెలుసు. శిక్షణ కాలమంతా సాధ్యమైనన్ని విధాల తిప్పలు పెట్టాడు. కానీ నేనూ ఏం తక్కువ తినలేదు. ఆ తిప్పలన్నింటినీ సరైన స్పిరిట్ తో తీసుకుని సానబెట్టిన వజ్రాన్నైనాను. నా తోటివారికన్నా శారీరకంగ మానసికంగ కూడా నేనెక్కువ బలవంతురాలినైనాను. అంతా అతని చలవేనని ఒకరకంగ సంతోషపడ్డాను.
          శిక్షణ పూర్తి కాంగనే చేతికి అందిన నియుక్తిపత్రాన్ని తెరిచి కూడా చూడలేదు. నన్ను ఎక్కడ వేసి ఉంటాడో నాకు తెలుసు. అతనిది నేను ఉన్న ఊళ్ళోనే పోస్టింగు..! నాకు అందుకు సంతోషపడాలో దుఃఖపడాలో కూడా తెలియలేదు. ఎందుకంటే ఇల్లు, ఊరు విడిచి, అంశూను, నాన్నను విడిచి ఎటూ పోవాల్సిన అవసరం రాలేదు. లేతే వారు ఒంటరివారైపోయేవారు.

No comments:

Post a Comment