Sunday, 4 December 2016

5. మార్గదర్శిని - 1


          మాకు ఇరవై ఏళ్ళ తర్వాత హైదరాబాదు తిరిగి వెళ్ళే సౌభాగ్యం కలిగిందని విని నేను చాలా ఆనందించాను. బంధువులందరికీ దూరంగ ఒంటరిగ మా కుటుంబం ఇక్కడ ఇట్ల పడి ఉండటం నాకేం నచ్చదు. మా చుట్టాలందరితో కలిసి దగ్గరగా ఉండవచ్చు అనే తలంపు నాకు చాలా హాయినిచ్చింది. నిజానికి ఇది నా కోసమే జరిగింది. నాకు వాళ్ళందరంటే చాలా ఇష్టం. మరి వాళ్ళకు నేనంటే ఇష్టమో లేదో నాకు తెలియదు. తెలుసుకునే అవకాశం దొరకలేదు. ఇప్పుడు దొరుకుతుందనే నా సంతోషం.

          ఈ వార్త తెలిసిన దగ్గరి నుంచీ నేనెంత ఉత్సాహంగ ఉన్నానో అమ్మానాన్నా అంత దిగాలుగా ఉన్నారు. నాకు మాత్రం హాయిగ అక్కడ తెలుగు వినిపిస్తుంది, మన వాళ్ళ మధ్య మనకు సహజంగ అనిపిస్తుంది అని తెగ ఆనందంగ ఉంది. ఈ మూతివంకర కోల్కాతా బోంగ్లో (బెంగాలీ) వినీ వినీ విసుగెత్తిపోయాను. వీళ్ళతో ఎంత దగ్గరైనా మనలను దూరమే ఉంచుతారు. పరాయి ప్రాంతం వారు ఎవరైనా అంతే. వాళ్ళు వాళ్ళు కలిసినంత బాగా మనలతో చచ్చినా కలవరు. నేనెంత బాగా బెంగాలీ మాట్లాడినా సరే. ఇప్పుడు మరి బెంగాలీ-హిందీ ప్రభావంతో తెలుగు మాట్లాడితే తెలుగువారు నన్నెంత దగ్గర తీస్తారో నాకు అంచనా లేదు. నా మీద నాకు నమ్మకం లేకపోయినా అమ్మ నేర్పిన భాష మీద చాలా విశ్వాసం ఉంది. తనకు తెలిసిన కొద్ది తెలుగు పాండిత్యంతోనైనా నాకు సాధ్యమైనంత మంచి తెలుగు నేర్పించిందామె. అందుకే ఉత్సాహంగ ఉంది. కనీసం మన గాలి పీల్చుకోవటానికి దొరుకుతుంది. మన వంటకాలు, మన పండగలు, మన పట్టుచీరలు, పేరంటాలు, మన ముగ్గులు, మన గుళ్ళు, మన దేవుళ్ళు, మన పద్ధతులు.. గూగుల్ ద్వారా ఇంటర్నెట్ లో వీటి గురించి చదవటమే కానీ ఊహ తెలిసిన తర్వాత వాటిని అనుభూతి చెందింది లేదు. ఇవన్నీ ఇప్పుడు సాక్షాత్తు అనుభవించటానికి దొరుకుతాయి.

          ఇంక రెండేళ్ళ సర్వీసు తర్వాత నాన్నగారు రిటైరైపోతారు. అందుకే ఉంచమన్నా ఇంక బ్యాంకువారు ఆయనను ఈ ఊళ్ళో ఉంచరు. ఈరోజు కోసమే ఎదురు చూస్తున్నాను ఇన్నేళ్ళ నుంచి.

          బదిలీ అయిన నెలనాళ్ళకల్లా మేము మా ఊరు చేరాం. ఫ్లైట్ దిగుతూ, "నా జన్మభూమి ఎంత అందమైన దేశము.." అంటూ పాట పాడుకున్నాను. ఇల్లు సర్దుకుంటూ, "నా ఇల్లు అందులోనా కమ్మని ప్రదేశమూ.." అని పాడుకున్నాను. పలకరించటానికి వచ్చిన నాన్నగారి పాత స్నేహితులు, అమ్మ స్నేహితురాళ్ళు "నా సామిరంగా హొయ్ హొయ్, నా సామి రంగా.." అని వంత పాడారు. కానీ చుట్టాలు, బంధువులు మాత్రం మమ్మల్ని చూడటానికి ఎవ్వరూ రాలేదు. అమ్మ నాన్నలే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారందరినీ కలిసి వచ్చారు. నన్ను తీసుకుపోలేదు. దానికి తగిన సమయం వస్తుందని, అప్పుడే తీసుకుపోతామని అమ్మ ముందే చెప్పింది. నన్ను అతిగా ఉత్సాహ పడద్దని కూడా చెప్పింది. ఏది వచ్చినా అంగీకరించాలని, బాధ పడద్దని ముందే హెచ్చరించింది. నేను సంసిద్ధంగనే ఉన్నాను.

          సరే, ఇల్లు ప్రాథమికంగ సర్దుకోవటం, రెండు మూడవ సవిరింపులు, గాస్, ఫోన్ కనెక్షన్ లూ, కార్ లైసెంస్ వగైరా పనులు అయినాయి. టీవీ కి కేబుల్ కనెక్షన్ వచ్చేసింది. కంప్యూటర్ కి ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేసింది. కాస్త దగ్గరలో గుళ్ళూ గోపురాలు తిరిగి రావటం, పాత మొక్కులు తీర్చుకోవటంతో కొన్నాళ్ళు సందడిగా గడిచాయి. (నాకోసం ఎన్ని మొక్కులు మొక్కిందో మా అమ్మ పాపం). చుట్టుపక్కలవాళ్ళు కాస్త పరిచయాలైనారు. కోల్కాతా వాసనలు నెమ్మదిగ అస్తమించాయి. మేమూ క్రమంగా "పక్కా హైదరాబాదీ"లం అయిపోయాము. ఇహ అప్పుడు మొదలైంది అసలు తంటా. ఇంట్లో పనులు చేసుకుంటూ కాసేపు, టీవీ కంప్యూటర్ లతో కాసేపు, చుట్టుపక్కలవారి పిల్లలతో కాసేపు గడిచినా ఏదో వెలితి. వాళ్ళంతా కాలేజీలు, చదువులతో బిజీ అయిపోయాక ఆ అవకాశాలూ తగ్గిపోయాయి. నెలనాళ్ళలో ఈ కొత్తదనం లో నుంచే రొటీన్ అనే సుత్తి వ్యవస్థ తయారైంది.

          ఎందుకంటే నేను డిగ్రీ చదివేసరికే బోర్ కొట్టి ఇంక చదివే ఓపికా, కోరికా మందగించినదాన్నై ఒక సంవత్సరం పాటు విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించుకున్నాను. యాంత్రికమైనది, నాది కానిది అయిన ఆ నిస్సారమైన సైంసు నా విద్యాతృష్ణను ఎన్నడూ తీర్చలేదు. ఉపనిషత్తులలో వేలసంవత్సరాల క్రితం ఘోషించబడిన అద్వైత సిద్ధాంత సత్యాలనే ఆధునిక భాతికశాస్త్రం ప్రయోగాలద్వారా నిరూపిస్తూ తెలుసుకుంటోందని విని అన్ని శాస్త్రాలకూ సారమైన హిందూ ఫిలాసఫీ (అద్వైత సిద్ధాంతం) అధ్యయనంలో పడిపోయాను. అదే నిజమైన విద్య అని నాకనిపిస్తుంది. కోల్కాతాలో రామకృష్ణామఠంలో కొంత ఫిలాసఫీ చదివాను. ఇక్కడ అశోక్ నగర్ శాఖలో అడిగి వస్తే ఆ కోర్సు ప్రారంభం కావటానికి ఇంకా నెలరోజులు సమయం ఉందని చెప్పారు. ఈ లోపు ప్రారంభికులకు కాస్త ఎగువనున్న పుస్తకాలు చదువుదామని మొదలుపెట్టాను. అవి చాలా మటుకు బాగనే ఉంటాయి కానీ గురువు అవసరాన్ని ఎప్పటికీ తీర్చలేవు. మార్గదర్శనం కాకపోయినా, ఈ లౌకిక జీవనగమనంలో దిశాభ్రమణం జరగకుండ కాపాడగలిగే సమస్థాయి కలిగినవారైనా కావాలి.

          దాంతో మనోభావాలు పంచుకోవటానికి అప్పుడప్పుడైనా మనిషి కావాలనిపించేది. "అబ్బ.. చందన ఉంటే ఎంత బాగుండేదో.." ఈ ఆలోచన నాకు చాలాసార్లే కలుగుతున్నది ఈ మధ్య. ముఖ్యంగ గడియారం ముల్లు నత్త నడకలు నడిచినప్పుడు. తనతో నిత్యం జరిగే ఆ చర్చలంటే నాకు ప్రాణం. ఏ మంచి ఆలోచనలైనా అటువంటి చర్చల సందర్భాలలోనే నాలో ఉదయించేవి. ఇప్పుడు ఆ పరంపరలో కాస్త విచ్ఛిన్నత వచ్చింది. నాకు కోల్కాతాలోని నా ఏకైక తెలుగు ప్రియసఖి నాకెంత ఆప్తురాలైతే మాత్రం వాళ్ళ నాన్నగారి ఆఫీసువారు వారిని ఇక్కడకు స్థానాంతరణం చేయించరు కదా. మరి అటువంటప్పుడు "ఏం తోచని" ఈ రాక్షసిని ఏ ఆయుధంతో పరిమార్చాలో నాకు తట్టింది కాదు. చేయవలసిన పనులు చేసే ఇచ్ఛ లేక, చేయగలిగిన పనులు చేసే శక్తిలేక సతమతమవుతుండగా అంతలోకి నా సమస్య తీరుస్తూ మా పక్క ఇంటిలో కొత్తగ వచ్చిన యువజంట వాళ్ళ చిట్టిపాప రాజీ నాపాలిట దేవతలా దరి చేరింది.

          మనసు ఉంటే మార్గం లేకపోలేదన్న లోకోక్తిని నిజం చేస్తూ, ఆ పిల్లతో కూడా నేను స్నేహం చేయగలిగాను. పెద్దపిల్లలతో కన్నా చిన్నపిల్లలతోనే హాయిగ ఉంటుంది అని అర్థమైంది. వాళ్ళలో కపటం ఉండదు. కల్మషం కన్నులు తెరవదు. స్వచ్ఛమైన మల్లెపూవులలా అందంగ, ఆనందంగ నవ్వులు సిరులొలికిస్తూ అమాయకంగ ఉండే ఆ చిన్నారులు "కనిపించని ఆ దేవుడి ప్రతిరూపాలే కదా" అనే రహస్యం కాస్త నా ఫిలాసఫీ పిచ్చితో కనిపెట్టేశాను. మా క్లాసులలో చెప్పినట్టు, ‘మనసును చిన్నపిల్లలతో పోల్చవచ్చుట. దాన్ని నియత్రించాలంటే పిల్లలను గమనించి చూడాలి.. వారి లాగే చంచలంగ, అర్థం లేకుండ, దిశలేకుండ ఉన్న మనసును వారి సహాయంతోనే తెలుసుకోగలం’ అని చెప్పారు. దానికోసమైనా రాజిని చేరదీశాను. కొంతలోకే ఆ మాట చాలా సత్యమని నాకర్థం చేయించింది రాజీ. మొత్తానికి బుజ్జి రాజి నా ఏకైక స్నేహితురాలిగా, నా వేదాంతపు ప్రగతికి సోపానంగా వాసికెక్కింది. రోజూ ఆ పిల్లతో గుడికో, మార్కెట్ కో వెళ్ళిరావటం అలవాటైంది. అట్ల వెళ్ళి వస్తూ ఆ పాపతో సమయం గడుపుతూ మనసు గురించిన నేను గమనించినదంతా పుస్తకంలో ఒక పద్ధతిగా వ్రాసి పెట్టుకునేదాన్ని.

          "అక్కా, పాల్కుకు తీచుకెల్లవా..?" అని ఒక రోజు చక్కగా బుట్టబొమ్మలా తయారై వచ్చి అపురూపకంగ నావంక చూస్తూ నమ్మకంగ అడిగిన ఆ చిన్నారి మాట తీసేయలేక సరేనంటూ లేచిన నన్ను చూసి అమ్మ నవ్వింది.

          "ఏమే, చంటిపిల్లలతో పార్కులకెళ్ళే వయసా నీది..? నీ ఈడు పిల్లలు అంతంత పిల్లలను చంకనేసుకు తిరుగుతున్నారు.." అంది.

          "సరే, నేనూ ఈ పాపను చంకనేసుకునే తిరుగుతాను. సరిపోతుందా..?" అని నవ్వి, నేను రాజిని ఎత్తుకుని బయల్దేరాను, కాలనీలో ఉన్న చిన్న పార్కుకు.

          మమ్మల్ని కలవటానికి ఇంటికి వచ్చేవాళ్ళంతా నన్ను చూసి, "అబ్బో, హార్దిక పెద్ద పిల్లైందే.. సంబంధాలేమైనా చూస్తున్నారా..?" అని అడిగినప్పుడు "వీళ్ళేంటి..? లేనిపోని తిక్క ఆలోచనలన్నీ మా వాళ్ళ బుర్రలోకి చొప్పిస్తున్నార"ని కంగారు పడ్డాను. కానీ మా అమ్మ "ఇప్పుడే అవన్నీ ఏం లేవు" అని చెప్పి నా మనసు కుదుట పరచింది. కానీ పెళ్ళికి కొంతకాలం ఆగమని నాన్నగారితో చెప్పించానని అమ్మకు కాస్త కోపంగనే ఉన్నట్టుంది అని ఇప్పుడు అర్థమైంది. అడపాదడపా ఈ మాటలతో తన అసమ్మతి తెలియచేస్తునే ఉందామె.

          కానీ మానసిక సంసిద్ధత లేకుండ వైవాహిక బంధంలోకి అడుగిడటం నాకు ఇష్టం లేదు. పెళ్ళంటే ఎన్నెన్ని నేర్చుకోవాలి..? ఇల్లు-వాకిలి, పిల్లలు-పెంపకాలు, పండగలూ-పబ్బాలు, రోగాలు-నొప్పులు, బంధాలు-బాధ్యతలు, అత్తగారు-అణుకువ, పెద్దలు-గౌరవం, అతిథులు-సత్కారం, పని-పాటా, వంటా-వార్పూ, మాటా-మంచి, భర్తా-భావన... ఇవన్నీ లోతుగా తెలియకుండ నేను అడుగు కదపదలచుకోలేదు. అందుకే ఇంట్లో అమ్మ పక్కనే ఉంటూ అన్నీ చేస్తూన్నాను. ఆచరణతోనే కదా ఏ విద్యైనా రాణించేది. రేపు పొద్దున తీరా ఏదైనా వంటకం చేసి పెట్టమని మా మరిదో, మామగారో అడిగితే, ‘నాకు రాదండీ’ అంటే బాగుండదు కదా. మా ఆయన ఎవరినైనా భోజనాలకు పిలుస్తున్నానంటే ఆదరించటం రాకపోతే అసహ్యంగ ఉండదా..? ఎప్పుడైనా ఇంట్లోవారితో మాట తేడా వచ్చినా, ఏదైనా నా ప్రవర్తన వల్ల లోపం జరగకుండా సర్దుకుపోవటం రావాలి కదా..! ఇంటి కోడలిగా, ఇల్లాలిగా, తల్లిగా, ఒక కొత్త చోట నెగ్గుకు రావటమంటే మాటలా మరి..? ఎంత శిక్షణ కావాలి..?

          రేపు ఉదయం ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నన్ను ఈ అరకొర చదువూ ఆదుకోదు, ఈ దిశాహీన సమాజమూ ఆదుకోదు. దానికి కావాల్సిన అవగాహనా, పరిణతి ఉంటేనే పెళ్ళి చేసుకోవాలి. అందరూ చేసుకోవటం లేదా అంటే, ఏమో! వాళ్ళకు ఉన్న ధైర్యం నాకు లేదనే చెప్తాను. తెలిసి దుంకటానికి తెలియకుండ దుంకటానికి చాలా తేడా ఉంటుంది. పెళ్ళి అనంగనే నాకు ఒక జోక్ గుర్తుకు వస్తుంది. ఒకసారి ఒకడెవడో, మొసళ్ళతో నిండి ఉన్న ఒక చెరువులో దుంకి, ఈది, బయటకు వచ్చినవాడికి కోరినదిస్తానని ప్రకటించాడట. వెంటనే ఒకడు అందులోకి దూకి గబగబా ఈది బయటకు వచ్చేశాడట. ఆహా! ఎంత ధైర్యం వీడికి! అని అంతా మెచ్చుకుని నీకేం కావాలో చెప్పమని అడిగారట. వాడు కోపంగ దిక్కులు చూస్తూ, వగరుస్తూ, ‘నన్ను ఇందులోకి తోసినవాడి పేరు చెప్పండి, చాలు’ అన్నాడట. అట్ల, ఎవరో తోస్తేనో, లేక తప్పక దుంకో పాపం, ఈదుతున్నారు అంతా. అదీ ఒక ధైర్యమేనా..? కానీ అమ్మకు ఇవన్నీ అర్థం కావు. ఆమె పోరు ఆమెది. నా దారి నాది.

          సరే, అమ్మపోరుకు దూరంగ పార్కులో కాసేపు తిరిగేశాక ఎవరో పిల్లలు ఆడుకుంటుంటే రాజి వాళ్ళతో బంతి ఆట మొదలుపెట్టింది. ఆరేళ్ళ ఆ పసిదానికి అప్పుడే స్నేహితులూ, సన్నిహితులూ. బహుశ వాళ్ళ అమ్మావాళ్ళతో వచ్చినప్పుడు ముందే పరిచయం అయినట్టున్నారు. నేను ఒక పక్కగా కూర్చుని ఉల్లాసభరితమైన ఆ పరిసరాలను సందర్శిస్తూ, రాజిని గమనిస్తూ ఉండిపోయాను. చల్లటిగాలి... పచ్చటి చెట్లు... మెత్తటి గడ్డిపరుపు... ఆహ్లాదకరమైన సాయింత్రం... అన్ని రకాల వయసుల వారు అక్కడ వారి వారి బాధల నుండి ఉపశమనం పొందుతూ ఉల్లాసంగ ఉన్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. పెద్దలు మాట్లాడుకుంటున్నారు. నాకు మాత్రం రెండూ చేయటానికి చందన పక్కన లేదన్న ఆలోచన కలిగి ఒంటరితనం బాధించిందనే చెప్పాలి. మా మధ్య జరిగిన ఎన్నో అందమైన చర్చలకు ఇట్లాంటి అందమైన సాయింత్రాలు సాక్ష్యాలు. అందువల్ల ఇద్దరం లాభపడేవాళ్ళం. ఆ భావస్పష్టత పొంది ఎంత హాయిగ గడిపి వచ్చేవారమో గుర్తు చేసుకుంటూ ఉండిపోయాను.

          అంతలోకి రాజి వాళ్ళ ఆట మధ్యలో బంతి దొర్లుకుంటూ నా వెనక ఉన్న గుబురు చెట్ల వంక చేరింది నిమ్మళంగ. "అక్కా, బాల్.." అని అడిగారంతా. సరేనని లేచి బాల్ వెళ్ళిన చోటికి వెళ్ళి అది తీసుకుని వారి వంక విసిరాను. విసిరి అంతే నిమ్మళంగ తిరిగిరాక అటు గుబుర్ల వైపు పొరపాటున చూశాను. కళ్ళు ఊరుకోవుగా మరి..! చలచిత్రాల భంగిమలను మరిపిస్తున్న భంగిమలో ఒక జంట నా కంటికి సాక్షాత్కరించింది. ఏమాత్రం సంకోచం, బెదురూ లేని, సిగ్గులేని జంట పరిసరాల స్పృహ మరిచి, రహస్యంగ తేలియాడ వలసిన సరసాలను బహిరంగంగ ప్రదర్శిస్తున్న ఆ ఆధునిక చుంబన సన్నివేశం నేనే కాదు, ఎవరూ చూడదగింది కాదు..! అయితే నిగ్రహానికి పరీక్ష పెట్టే ఆ దృశ్యం, నాకు సంబంధం లేనిదే. నేనూ అట్ల చూసి, ఇట్ల కళ్ళు తిప్పుకుని వచ్చేసేదాన్నే...! కానీ ఆ సన్నివేశంలో ఉన్న జంటలోని మగపక్షి ముఖం నా కర్మకాలి నాకు పరిచయం ఉన్నదని అనిపించింది...!

          ఆలోచించగా, గ్రహాల కూటమి సక్రమంగ లేకనో, నా దౌర్భాగ్య వశాత్తో, ఆ ప్రబుద్ధుడు పరిచితుడే కాదు, దగ్గరి సంబంధీకుడేనని నా కళ్ళు నిర్ద్వంద్వంగ నా మెదడుకు ఎరిగించి కానీ ఊపిరి పీల్చుకున్నవి కావు. కనీసం కళ్ళద్దాలైనా లేవాయె -"అహఁ.. పొరపాటు పడ్డానేమోనని" అనుకుందామంటే. వాళ్ళ సంగతి సర్వేశ్వరుడెరుగు.. నాకు పోయింది ప్రపంచం తాలూకు ప్రత్యయం. తల తిరిగి కళ్ళు ఇంతలేసి చేసి, కన్యనైన నేను కలలోనైనా తలచ కూడని ఆ రోత పుట్టించే దృశ్యాన్ని చూసి, బిడియపడేకన్నా ఆశ్చర్యమే ఎక్కువ కలుగుతుంటే స్థాణువునైపోయాను. మొన్ననే నాన్నగారు, సెల్ లో బంధువుల ఫోటోలు తీసుకుని వచ్చి నాకు మా వాళ్ళను అందరినీ పేరుపేరునా అన్ని వివరాలతో సహా పరిచయం చేసిన సందర్భంలో చూపించిన మా అమ్మ తమ్ముడే కదా అతను..! ఏం చేసేది..? ఇంక తప్పక అతనిని గుర్తు పట్టేశాను నేను. నాకు విపరీతమైన చిరాకు, తెలియని భయం కలిగింది. ఆ ఉద్వేగమంతా చేతిలో ఉన్న రుమాలు మీద నుంచి పోయింది.

          రాజి వచ్చి నా కొంగు లాగేదాకా ధ్యాస మళ్ళని నా దృష్టిని కాసేపు తిట్టుకుని, "ఇంక ఇంటికి పద" అని కనీసం ఆ చిన్నారి ప్రత్యుత్తరం కోసం కూడా చూడకుండా ఇంటి దారి పట్టాను నేను. నా మనస్సంతా అల్లకల్లోలమైపోయింది. చూడకూడని దృశ్యం చూసినందుకు కన్నా, కూడని వ్యక్తిని అక్కడ చూసినందుకు ఎక్కువ కలవరం కలిగింది. అసలితను మా అమ్మమ్మ కడుపున పుట్టినవాడేనా..? మా తాతయ్య సంతానమేనా..? అని సందేహం కలిగింది.

          ఒకవేళ నేను చూసింది అబద్ధం కాకపోతే ఇంక మా అమ్మమ్మ వాళ్ళ కుటుంబ గౌరవానికి తెర దిగేవేళ ఎంతో దూరంలో లేదని మాత్రం ఖచ్చితంగ చెప్పగలను.

          "హార్దూ, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో షష్ఠిపూర్తికి ఉదయాన్నే వెళ్ళాలి.. గుర్తుందిగా..!" పార్కులో మొదలైన ఆలోచనలతో ఉద్విగ్నంగ నేను ఇల్లు చేరంగనే అమ్మ చెప్పిన మొదటి మాట అది.

          మామూలుగ అయితే ఎగిరి గంతులేసి వెళ్ళాలి నేను. ఇది నాకోసం నిర్ణయించబడిన సుముహుర్తమన్నమాట. వారందరికీ నన్ను పరిచయం చేయటానికి వారు నిశ్చయించిన ఘడియలివి. కానీ ఇప్పుడు అసలు నాకు ఎక్కడికీ వెళ్ళాలని లేదు. ముఖ్యంగ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇల్లు ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకా బాగా దూరమైతే బాగుండనిపించింది ఆ క్షణం.

          "ఏమీ మాట్లాడవేఁ..? అదోలాగున్నావు..?" అడిగింది అమ్మ.

          ఈ అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నేను ఏ ప్రతిక్రియా చూపకుండ ఆ సమాచారాన్ని అవమానించటం అసహజమే.

          "ఏం లేదు.. వెళదాం. రేపు ఆరు గంటలకు కదా.." అన్నాను ఎటో చూస్తూ. దీనిని ఏమైనా చేసి తప్పించుకోగలుగుతానా..? అని ఆలోచించాను.

          "ఏమైందే...? ఒంట్లో బాగోలేదా..?" అడిగింది అమ్మ నుదుట చేయి పెడుతూ.

          "ఏం లేదు. బాగనే ఉంది." అన్నాను, బాగోలేకపోతే బాగుండేది.. అనుకుని నా గదిలోకి కదులుతూ.

          "సరే, మరి ఆ కొత్త షిఫాన్ చీర, ఫాంసీ పట్టుచీర తీసిపెట్టుకో. సన్న నెక్లెస్, రవ్వల గాజులు వేసుకుందువుగాని. ఇంక.." అని అమ్మ ఏవేవో చెప్పింది. అన్నీ విని తల ఊపుతూ గదిలోకి వచ్చేశాను. మొదటి నుంచీ ఈ ఘట్టానికి భయపడిందేమో అమ్మ. ఎదురు చూసిందేమో నేను. ఇప్పుడు మా స్థానాలు మారినవి. వాళ్ళు ఆదరిస్తారని ఆమెకు నమ్మకం కుదురింది. నాకు హఠాత్తుగ షాక్ తగిలి భయం కిందకు పరిణమించింది.

          నాకు చాలా అసహనంగ అనిపించింది. ఎవరితో మాట్లాడాలనిపించలేదు. "ఇప్పుడేంటి చేయటం..?" అనేదే ఎక్కువగా ఆలోచనను ఆక్రమించిన ప్రశ్న. ఈ వార్త అమ్మతో చెప్పనా..? ఏమో, విని భరించగలదో లేదో. పోనీ నాన్న చెవినేద్దామా..? నా నోటితో నేను చెప్పగలనా..? లేదా నేరుగ అమ్మమ్మకో, తాతయ్యకో చేరేసేస్తే..? వెంటనే గుండెపోటుతో ఇద్దరూ పడిపోవచ్చు. ఇద్దరికీ హైపర్ టెంషన్ ఉంది. ఈ వయసులో ఆరోగ్యాలు అంతంతమాత్రంగ ఉంటాయి. పోనీ అత్తయ్యలెవరైనా అందుతారేమో చూడనా..? ఇంకా నాకు ఎవరి తత్త్వం ఏంటో, ఎట్లనో తెలియనే తెలియదే. మరి ఇంకేం చేయగలను? ఏం చేయకుండ ఊరుకుంటే? మేలే. కానీ తెలిసి విషయం దాచటం తప్పు కాదా..? లేదా వారికి ముందే ఇదంతా తెలుసో..? ఆ అవకాశం కూడా లేకపోలేదు. కానీ అటువంటిదేమైనా ఉంటే మాటమాత్రమైనా తెలిసి ఉండేదే. అమ్మమ్మవాళ్ళ ఇంట్లో అంతా బహిరంగమే. అమ్మ నోట్లో అస్సలు మాట దాగదు. నాన్నగారితో వెంటనే చెప్పేస్తుంది. అప్పుడు తప్పక నా వరకు వచ్చి తీరుతుంది ఈ మాట. కనక ఎవ్వరికీ ఏమీ తెలియదనే అర్థం.

          పోనీ నేరుగ అతనితోనే మాట్లాడితే..?

          ఫక్కున నవ్వింది నాలోని హార్దిక.

          నాకు అందరూ కొత్తే. ఏం చనువు ఉందని అతనితో మాట కదుపుతాను? ఒక్క మాట కూడా ఇంతవరకూ మాట్లాడింది లేదు. పలకరించింది లేదు. నా ముఖం కూడా అతనికి తెలియదు. నేరుగ ఎదురు పడితే ఒకరు పరిచయం చేయాల్సిన పరిస్థితి. మాట కదిపినా ఏమని కదుపుతాను..? "నిన్న నేను పార్కులో మీ ఇద్దరినీ చూశాను, ఎవరా అమ్మాయి?" అని అడగాలా..? "నీకెందుకు?" అంటాడు. లేదా "చూసిన దాన్ని బట్టి ఎవరో అర్థం కాలేదా?" అంటాడు. తర్వాత ఏం మాట్లాడాలి..? పరిచయం ఉన్నవారితో, సాన్నిహిత్యం ఉన్నవారితోనే ఇవి మాట్లాడటం కష్టం. అటువంటప్పుడు అతనితో... ఎట్ల? రేపు అతనిని మొదటిసారి చూడబోతున్నాను, లెక్కప్రకారం. అతనినే కాదు, మా వాళ్ళందరినీ. మామయ్యలు, అత్తయ్యలు, కజిన్స్, తాతగారూ, అమ్మమ్మా... అంతా నాకు కొత్తే. ముందు వాళ్ళు నన్ను ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ఒప్పుకున్నారు. అందుకు సంతోషం. ఆ అంగీకారాన్ని, స్వీకృతిని నేను ఈ అనూహ్యమైన వార్తకు వార్తాహారినై కాలదన్నుకోలేను. తాను దూర సందు లేదు మొడకొక డోలు అన్నట్టు, ముందు నాకు అక్కడ అడుగు పెట్టటానికే దిక్కు లేదు, నా నోటికి ఈ వార్త..! ఏం శోభిస్తుంది..?

          ఇట్లాంటివే పనికిమాలిన ఆలోచనలతో రాత్రిని వెలిబుచ్చి, ఉదయాన్నే గత్యంతరం లేక అన్ని పనులూ కానించుకుని, అమ్మా నాన్నలతో కలిసి, దిగాలు ముఖం వేసుకుని అమ్మమ్మవాళ్ళ ఇంటికి చేరిపోయాను. అక్కడికే నాయనమ్మవాళ్ళు కూడా వస్తారు. అందరినీ ఒక్కసారిగా చూసి పరిచయాలు చేసుకోవాల్సిన ఘట్టం. జాగ్రత్తగ ఉండమని అమ్మ దారిలో అంతా బోధిస్తూనే ఉంది. ఎవ్వరితో ఫిలాసఫీ చర్చలు తీయద్దని మాటతీసుకుంది. నేను మామూలుగా మాట్లాడేంత కూడా మాట్లాడే స్థితిలో నుంచి ఎప్పుడో బయటకు వచ్చేశానని ఆమెకు తెలియదు. ఒకప్పుడు ఎవరిని కలవాలని కలలు కనేదాన్నో, ఆ బంధుగణమంతా అక్కడే చేరి ఉన్నారు. కానీ ఏం లాభం..? నేను నేనుగా రాలేదుగా. నేనింకా ఆ పార్కులో పొదల దగ్గరే ఉన్నాను. ఆ సందుల్లో నుంచి నా దృష్టి మళ్ళటమే లేదు. ఎవరితో సరిగ్గ ఇమడలేకపోతున్నాను. ‘కొత్త కదా, సిగ్గేమో’ అని సర్దిచెప్పుకుంటున్నారు. అమ్మ వైపు వారు అందరూ "లక్ష్మి కూతురు.." అని, నాన్నవైపు వారందరూ "రామం కూతురు.." అని నన్ను ఆపేక్షగా ఎంతో ఆప్యాయంగ పలకరిస్తున్నారు. పెద్దలకు కాళ్ళకు వంగి నమస్కారాలు చెప్పాను. పిల్లలకు హాయ్ హలోలు చెప్పాను. అత్తలూ, మామలూ, పిన్నులూ, పెద్దమ్మలు నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుట ముద్దుపెట్టారు. నేను చిరునవ్వు నవ్వగలుగుతున్నాను కానీ పూర్తిగ వారిలో కలవలేకపోతున్నాను. నేనే ఇవాల్టి ఈ ఫంక్షనులో అసలువారి తర్వాత ప్రధాన ఆకర్షణను. ఎంతో ఎంజాయ్ చేయాల్సింది. అటువంటిది నాకే నిజంగా ఊపిరాడటం ఆగిపోతోంది. నాది నాకే చిరాకేస్తోంది.

          అప్పుడు మెట్లు కనిపిస్తే నిశ్శబ్దంగ ఎక్కేసి పై అంతస్తులో ఒక గది ఖాళీగ కనిపిస్తే అందులోకి జారుకుని తలుపు దగ్గరకు వేసుకుని సందడి సందడిగా ఉన్న ఆ వాతావరణానికి దూరంగ వచ్చాను. ఈ గదిలో ఎవరూ లేరు. పైన రెండవ అంతస్తులో ఏకాంతంగ ఉంది. చాలా సేపటికి ఊపిరి అందింది. ఎంత పట్టేసుకుపోయిందో మనసంతా. ఇక్కడ హాయిగ అనిపించింది. ఎవరు వాడుకుంటారో తెలియదు. ఇంకా నా పరిచయాలు ఆ సమాచారం తెలిసేదాకా రాలేదు. మనం మనలో లేనప్పుడు మనతో మనమే ఉండాలనేది నా పద్ధతి. కింది నుంచి బంధుజనాల ముచ్చట్లూ నవ్వులూ వినబడుతున్నాయి. కానీ అంత స్పష్టంగ లేదు ఆ శబ్దం. కార్యక్రమమంతా కిందే కనక ఎవ్వరూ ఇంత పైకి రారు. కాసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నాను, కంప్యూటరు ముందు ఉన్న మెత్తని కుషన్ కుర్చీలో. టేబుల్ మీద తల పెట్టుకుని రెక్కలు తెరిచి ఉన్న కిటికీ బయటకు చూశాను. పెద్ద మామిడి చెట్టు చల్లటి నీడను ఇస్తోంది ఇటు పక్క. పల్చటి గాలి ముఖానికి తగులుతూ క్రమంగ సేద తీర్చింది.

          సరే, లేచి గది అంతా కలయచూశాను. చక్కగ సర్ది ఉంది. వేటి స్థానాల్లో ఆ వస్తువులు సక్రమంగ పెట్టి ఉన్నాయి. ఆ గది యజమాని పద్ధతికి అద్దం పడుతున్నాయి, గూట్లోని పుస్తకాలు. గూట్లో పౌడర్లు, రకరకాల సెంటు సీసాలు, అన్ని కొలతల దువ్వెనలు, ఓ టేప్ రికార్డరు అమర్చి ఉన్నాయి. గోడలకు గ్రీటింగులు, మంచి ప్రకృతి అందాల పోస్టర్ లు, ఏవో చిన్నప్పటి బ్లాక్ ఎండ్ వైట్ ఫోటోలు ఉన్నాయి. ఓ బల్ల, కుర్చీ, టేబుల్ లాంపు, బోలెడు పెన్నులు, ఓ మంచం, పరుపు... కిటికీ గూట్లో చిన్న ఫ్లవర్ వాజ్.. ఎవరో కానీ భలే ఉంచుకున్నారు గదిని. నాకూ ఒక గది ఉంది కాబట్టి దాన్ని సర్దుకోవటంలో ఉన్న సాధకబాధకాలు బాగా తెలుసు కనక, "గదిని అందంగ శుభ్రంగ ఉంచుకోగలగటం ఒక కళ" అని మెచ్చుకోకుండ ఉండలేకపోయాను. పుస్తకాలు చూస్తే, ఎంకామ్, ఐసీడబ్లూవి ఉన్నాయి. అంతటిలోనూ ఎక్కడా అమ్మాయి వాడే వస్తువుల లేవు కనక అబ్బాయిల గదేనని అర్థమైంది. చూస్తుంటే నా ఆలోచనను ఖాయం చేస్తూ బల్ల మీద ఒక పర్సు కనిపించింది. అది కచ్చితంగ అబ్బాయిలదే. మామయ్య వాళ్ళ పెద్ద అబ్బాయి స్ఫురణకు వచ్చాడు. బహుశ ఇదే చదువుతున్నట్టున్నాడు. అయితే అతని గది అయి ఉండవచ్చు ఇది. పర్సు తెరిచి చూస్తే తెలిసిపోతుందేమో.. తెరుద్దామా అనుకుంటూ, బాగుండదేమో అనుకుని ఆగిపోయాను. మళ్ళీ ఎవరూ లేరు కదా, అనుకుని తీసి చూడాలని నిశ్చయానికి వచ్చాను. అబ్బాయిలు పర్సులో ఏమేం పెట్టుకుంటారోనని నాకెప్పుడూ కుతూహలంగ ఉంటుంది. చూడాలనిపించింది. విజ్ఞానం కోసం మాత్రమే.

          సరేనని మడత తెరిచాను. నిన్నటి నుంచి నన్ను వెంటాడుతున్న సుందరవదనారవిందం దర్శనమిచ్చింది. ఠక్కున గుండె వేగంగ కొట్టుకుంది. పర్సు మూసేశాను. అయితే ఈ గది అతనిదా..? మామయ్యవాళ్ళ అబ్బాయిది కాదా..? మళ్ళీ ఆ ఫోటో వంక చూశాను. చూడటానికి ఎంత చక్కగున్నాడో.., ఫోటోలో కూడా అంతే బాగున్నాడు! కానీ అసలుది చక్కగ లేనప్పుడు ఏం బాగుంటే ఏంటి..? అనుకున్నాను విరక్తిగ. అంతలోకి నన్ను ఆకర్షించింది ఆ ఫోట వెనకనే లీలగా కనిపిస్తున్న మరొక ఫోటో. ఒకసారి ఏ అలికిడీ లేని తలుపు వంక ఒకసారి చూసి, నిర్ధారణ జరిగాక, అది తీశాను. నిన్న రాత్రంతా కలలో దడిపించిన ఆ ముఖమే. ఆ పార్కులో అమ్మాయి..! మగవాళ్ళ పర్సులోకెక్కిన అమ్మాయిలు ఏ తాలూకో నాకు తెలియనిది కాదు. అయితే ఇది మామూలు మాటల్లో చెప్పుకునే నేడు రేపటి అమ్మాయి అబ్బాయి స్నేహాల బాపతు కాదు.. ఆ పరిధి దాటి, రెక్కలొచ్చి విచ్చలవిడిగా "ప్రేమ" పేరుతో ఆకాశవీథిలో ఎగిరే పైత్య ప్రకోపమేనని నాకు రూఢిగ అర్థమైపోయింది. నిన్నటి దృశ్యం చూశాక ఇంకా అనుమానం ఎందుకట..?

          ఆ ఫోటోను బయటకు తీసి పరీక్షగ చూశాను. చాలా అత్యాధునికంగ ఉంది ఆమె రూపం. తెల్లటి దేహవర్ణం, మత్తుగా ఉన్న నీలి కళ్ళు, రంగుపూసిన పెదవులు, ఎగురుతున్న జుట్టు.. అత్యాధునిక వస్త్రాలు..! ఎక్కడా సంప్రదాయికత, భారతీయత కాదు కదా, కనీసం సభ్యత కూడా కనిపించలేదు.

          ఇంటి కట్టుబాట్లను కాదని, తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ముచేసి, వాళ్ళు ఇచ్చిన ప్రేమను అవమానించి, ఇందరు బంధువుల మన్ననను, ఆదరణనూ కాలదన్నుకోవటానికి సిద్ధపడ్డాడంటే అతని జీవితంలో ఈ అందరి కొరతా తీర్చగలిగే శక్తి ఆమెలో ఉందా...? లేదు. ఏ కోశానా లేదు. మనిషిని చూస్తే, కొంత ఊహించవచ్చు. ఈమెగారి కనుముక్కు తీరు బాగానే ఉన్నా, బుద్ధి మహా వక్రంగ ఉంది. లేకపోతే ఇంత పద్ధతి గల, సంప్రదాయబద్ధంగ జీవనం సాగిస్తున్న ఇంట్లో పుట్టి పెరిగిన మనిషిని వశపరచుకునేసిందంటే ఎంత కిలాడీ అయి ఉంటుంది..? ఇది ప్రేమా..? లేక ఏ జన్మదైనా కసి తీర్చుకుంటోందా..? అనుకుంటూ ఆ ఫోటో అటూ ఇటూ తిప్పి చూశాను. వెనక "విత్ లవ్, రీనా" అని వ్రాసి ఉంది. ఓహో, అమ్మాయి గారి పేరు రీనా అన్నమాట. ఆమె రూపానికి సరిపోయింది ఆ పేరు. చూసినా కొద్ది, ఆ దృశ్యం గుర్తుకు వచ్చి రోత పుడుతుంటే, ఆ ఆలోచనల బరువు భరించలేక నాకెందుకు..? అని దాన్ని యథాస్థానంలో పెట్టేసి పర్సు మూసేసి బల్ల మీద పెట్టేశాను. అయితే ఈ గది అతనిదన్నమాట. తర్వాత ఆ గదిలో నుంచి బయటకు వెళితేనే మనశ్శాంతి కలిగే పరిస్థితి ఏర్పడింది. తలుపు వైపు అడుగులు వేశాను.

          సరిగ్గ అప్పుడే, తలుపు తెరుచుకుంది. అతనే..!! సంయత్!! మా హీరోగారు.. ఛ..!!

No comments:

Post a Comment