"నాన్నా..."
మరునాడు
ఉదయం పదకొండు గంటల ప్రాంతాలకు ఇల్లు చేరిన తండ్రిని చూస్తూనే పిల్లలిద్దరూ ఎదురు
వెళ్ళారు.
"ఏమండీ..."
అప్పటిదాకా
ఆయన కోసమే కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న లక్ష్మి,
ఆయన వస్తూనే సోఫాలో కూలబడి ముఖం దాచుకునేసరికి ఎట్లా పలకరించాలో
తెలియక మౌనంగనే ఉండిపోయింది, పక్కన నిలబడి.
సత్యం
గుడ్లలో నీరు కుక్కుకుంటూ, బొంగురు పోయిన గొంతుతో,
లక్ష్మి చేతులు పట్టుకుని, "లక్ష్మీ,
అన్యాయమైపోయాం లక్ష్మీ.." అన్నాడు.
ఆమె
ఆయన పక్కనే కూర్చుని ఆయన కళ్ళు తుడిచి, తల్లి
బిడ్డను ఓదార్చినట్టుగా "ఏం కాదు - బాధపడకండి! మనకు ఆ భగవంతుడే
ఉన్నాడు!" అంది.
పిల్లలిద్దరూ
బిక్కమొహాలేసుకుని చూస్తూండిపోయారు. తండ్రిని అంతటి పతనావస్థలో చూస్తుంటే కడుపు
తరుక్కుపోయింది. ’దీని వెనక కారణం మేమే’ నన్న పశ్చాత్తాపం వారిని దహించివేసింది.
’నాన్న మాకు ఇంత వైభవోపేతమైన జీవితమిస్తే మేము ఆయనకు ఏమి ఇచ్చాం?’ అన్న ప్రశ్న వారిని కలిచివేసింది.
అన్ని
రోజులలాగ కాక ఆ రోజు ఇంట్లో ఏ కలకలము లేదు. టీవీ, సీడిప్లేయర్ల
రణగొణ ధ్వనుల్లేవు; అన్నా చెల్లెళ్ళ కొట్లాట, లటపిట లేదు;
అంతా బరువైన నిశ్శబ్దం ఒక్కటే ఉంది.
సత్యం
స్నానం ముగించుకు వచ్చేసరికి లక్ష్మి ఉన్నవేవో కూరలు వండింది. పిల్లలిద్దరూ ఏం
చేయాలో తోచక ఈలోగా చిందర వందరగా పడున్న ఇల్లంతా సర్దారు. అంతా కలిసి ఏదో
తిన్నామనిపించి ప్రాణం లేని జీవుల్లా మూగగా పడుండిపోయారు ఎవరి గదుల్లో వాళ్ళు.
ఆ
సాయిత్రం సత్యం పిల్లలిద్దరినీ చూసి ఎంతో జాలికలిగింది. ఇద్దరినీ దగ్గర
తీసుకున్నారు. కాసేపాగి అన్నాడు.
"అయిందేదో
అయిపోయింది! కానీ నావల్ల జరిగిన తప్పుకు మనమంతా ఇప్పుడు శిక్షనుభవించాలి! నాకీ
నెలంతా ఇంట్లో కూర్చోవటమే...! వచ్చేనెల
వరకు మూర్తి ఎట్లాగో అట్లా హెడ్ ఆఫీసుకు సిఫార్సు చేసి ఏదో ఒక ఏర్పాటు
చూస్తానన్నాడు. బహుశ ఈ ఉద్యోగమే తిరిగి దొరకచ్చు. కానీ ఈ సీటు మాత్రం ఇవ్వరు.
ఇచ్చినా జీతం తగ్గుతుందిట! ఇంతకన్నా ఎవరూ ఏమీ చేయలేరుట..."
అందరూ
ముఖాలు చూసుకున్నారు.
"కానీ
మీరు మాత్రం ఎవ్వరికీ ఈ సంగతులు ఏవీ పొక్కనివ్వకండి! బయట తెలిస్తే మన యింటి పరువు
పోతుంది!" అన్నాడు సత్యం తలొంచుకుని.
పిల్లలూ,
లక్ష్మి తలలూపారు.
"కానీ
....అయిపోయింది. ఈ నెల జీతమూ రాదు! ఇక నుంచి వచ్చేదాంట్లోనే మనం గడుపు కోవాలి! అదే
ఆలోచిస్తున్నా" అన్నాడు.
"ఏం
ఫరవాలేదు లేండి! ఇదివరకు బతకలే? అట్లాగే సాగిద్దాం!
వ్యయం తగ్గించుకుంటే ఆదాయం వచ్చినంత! రెండు మూడు వేలల్లో నెల గడుపుకునే వాళ్ళు
లేరా?" అంది లక్ష్మి.
"ఉండి
ఉండచ్చు లక్ష్మీ. కానీ ఒక హోదా, పద్ధతీ అలవాటైనాక
సర్దుకుపోయి బ్రతకటమంటే కష్టమనిపిస్తుంది. మీదాకా కాదు- నాకే బాధగా ఉంటుంది-"
తండ్రి
ఆ మాటనగానే పిల్లలిద్దరూ ఆయన వంక చూసి, "ప్రయత్నిస్తే
అసాధ్యమైంది ఏదీ లేదు నాన్నా! ఆసలు ఈ పరిస్థితికి కారణం మేము. అందుకే ఇకనుంచి మా పద్ధతి
మార్చుకునేందుకు ప్రయత్నిస్తాం. మీకు సాధ్యమైనంత వరకూ సహకరిస్తాం" అన్నారు
నమ్మకంగా.
మరునాడు
ఉదయమే పనికి వచ్చిన రంగమ్మకు పని చెప్పకుండా, "రంగమ్మా,
వారం ఆగి వచ్చి నీ డబ్బులు తీసుకుపో! ఇక ఈ నెల నుంచి మాకు పనిమనిషి
వద్దు" అంటూ పంపేయబోయింది లక్ష్మి.
"అయ్యో.
ఎందుకమ్మగారు..? నావల్లేదన్నా తప్పు జరిగితే క్షమించండి అమ్మగారూ.." అంటూ
రంగమ్మ కంగారు పడిపోతే అంతలో సత్యం వచ్చి, "నీ
వల్ల ఏ తప్పు జరగలేదు కానీ నువ్వు ఈ నెల మానేసి ఒక్క నెల ఆగి కనిపించు. సరేనా?
వీలుంటే తప్పక మళ్ళీ పనికి పెట్టుకుంటాం!" అని జేబులోంచి నెల
జీతం తీసి రంగమ్మకు ఇచ్చి పంపేసి లక్ష్మితో అన్నాడు-
"లక్ష్మీ
నా దగ్గర ప్రస్తుతానికి కొంత మొత్తం ఉంది. మూర్తిని అడిగి తెచ్చాను. ఈ నెల ఎట్లాగో
గడిపేస్తే చాలు. అయినా నేనూ వేరే ఏదన్నా చిన్న పని చూసుకుందామనుకుంటున్నాను" అన్నాడు.
లక్ష్మి
ఆయన చేయిపట్టుకుని, మెల్లగా
"ఏమండి...పోనీ..నేనే చేయనా ఆ ఉద్యోగమేదో?" అంది.
ఆయన
చేతకానివాడని తను అడుగుతోందని ఎక్కడ మనసులో నొచ్చుకుంటాడోనని ఆమెకు భయమేసింది.
ఆయన
ఆమె భావం అర్థమైనట్టు నవ్వి చిర్నవ్వు నవ్వి, "అవసరం
పడితే నేనే అడుగుతాగా.." అన్నాడు.
ఆ
మధ్యాహ్నం కాలేజి నుంచి వచ్చిన సన్నీ హడవుడిగా అన్నం తిని మళ్ళీ ఎటో వెళ్ళబోతుంటే
ఎక్కడికని అడిగారు సత్యం.
"ఏ..ఏం
లేదు నాన్నా! రమణ చెప్పిన హోం ట్యూషన్ ఖాయం చేసుకున్నాను. ఇవాళ్టి నుంచి
రమ్మన్నారు. అటు నా చదువుకూ ఉపకరిస్తుంది.. ఇటు కాస్త ఖర్చుకూ పనికొస్తుంది".
అని ఆగి తండ్రి వంక చూసి "ఇది మిమ్మల్ని కించపరచటానికి చేయట్లేదు! మా
స్నేహితులంతా ఇట్లా టీచింగులతో కోచింగల అవసరం లేకుండా, బావుపడి బాగా
చదువుకుంటున్నారన్న సంగతి గ్రహించి, బుద్ధి తెచ్చుకుని చేస్తున్నాను!" అని
చెప్పాడు మర్యాదగా.
దానికి
సత్యం చిర్నవుతో, అన్నాడు. "కానీ, ఏదైనా నీ చదువు పాడుకాకుండా చూసుకో! టీచింగ్ అనేది విషయావగాహన
చేసుకోవటానికి పరోక్షంగా పనికొచ్చేమాట నిజమే ఐనా బ్యాంక్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి
కదా. అదీ చూసుకోమని.."
"దానిదేం
భయం లేదులే! కాలేజ్‍లో ఒక్కోసారి ఫ్రీ క్లాసులు దొరుకుతునే ఉంటాయి. ఇంట్లో కూడా
వేరే అనవసర పనులేం చేయకపోతే చాలు!" అన్నాడు తలొంచుకుంటూ.
"కానీ
సాయిత్రాలు ఎట్లయినా జిమ్ కెళ్ళి వ్యాయామం చేసుకుంటూ గంట పోతుందిగా-’ అన్నాడు
హెచ్చరిస్తున్నట్టు.
సన్నీ
తలెత్తి ఆయనతో కళ్ళు కలపలేనట్టు పక్కకు చూసి, "ఈ...
ఈరోజు నుంచి జిమ్ మానేస్తున్నా! ఇంట్లోనే ప్రాణాయామం, యోగా
మొదలుపెడదామనుకుంటున్నా! ఆ మిషన్లన్నీ ఒంటికి అంత మంచివి కావని విన్నాను.
ఇన్నాళ్ళూ తెలిసే తప్పు చేసాను. ఇప్పటికైనా సరిదిద్దుకోవాలని ఆశ.." అని వంగి
ఆయన పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు.
సత్యం
ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారు.
రెండున్నరకల్లా
ఠంచనుగా ఇంటికి వచ్చేసింది మధు. రోజులా స్నేహితురాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటూ,
అక్కడిక్కడా తచ్చాడకుండా ఇల్లు చేరిన కూతురిని అద్భుతం చూసినట్టు
చూసింది లక్ష్మి కూడా.
వస్తూనే
ముందుగా అనుకున్నట్టే అన్నం తినటం ముగించి, పుస్తకాల గూడు,
తన గది అంతా శుభ్రంగా సర్దుకుంది. బాగా చదువుకోవాలనే కోరిక రావాలంటే
ఏం చేయాలని ఓ స్నేహితురాలిని అడిగి తెల్సుకున్న సలహా అమలు చేశాక మధుకు అది
ఉత్తుత్తి మాటేం కాదని అర్థమైంది; రాత్రిదాక లేవకుండా
కూర్చుని అసలు తన దగ్గర ఏం పుస్తకాలున్నయో, వేటిలో ఎంత
సిలబస్ ఉందో అంతా టిక్ చేసుకుంటూ ఉండిపోయింది. మధుకు పదతరగతి రోజులు గుర్తొచ్చాయి.
అప్పట్లో అంతా తనను సలహా అడిగేవారు- ’ఎట్లా చదవాలి’ అని. ఇప్పుడు తను మరొకరిని అడిగే
స్థితికి దిగజారినందుకు తనకే బాధవేసింది. ఇంటర్‍కి వచ్చాకే తండ్రికి ప్రమోషన్
రావటం, ఆదాయం పెరగటం, తమ హోదా పెరగటం,
అదే మేరకు చదువు దిగజారటం అంతా అవగతమైంది మధుకు. ఇప్పటికైనా కళ్ళు
తెరుచుకున్నందుకు సంతోషపడటమే తను చేయగలిగింది! పోయిన రోజులు తిరిగి రావుగా!
నాలుగు
రోజులు గడిచాయి.
ఆ
సాయింత్రం కేబుల్ టీవీ వాడు వచ్చి కనెక్షన్ పీక్కుని పోతుంటే "అయ్యో-
అమ్మయిని అడిగావా?" అని సత్యం లక్ష్మిని అడిగాడు.
ఆమె
నవ్వి "మధూనే అతనికి ఫోన్ చేసి పిలిచింది.." అని చెప్పింది. లక్ష్మివంక
నమ్మలేనట్టు చూసాడాయన. మధు దగ్గరికెళ్ళి, అదే అడిగితే,
"లేదు నాన్నా - ఖర్చు కాకపోయినా అది పెద్ద టైం వేస్టు. ఏదో ఈ మధ్యే కాస్త
చదువుకోబుద్ధి అవుతుంటే అది అడ్డం అనిపిస్తోంది.." అంది మధు.
"మరి
సన్నీ ఏమనడా?" అనడిగారాయన.
అప్పుడే
ట్యూషన్ చెప్పి తిరిగి వస్తున్న సన్నీ, "లేదు
నాన్నా - నాకసల్లు టీవీ చూసే టైమే లేదు. ఈ రోజు నుంచి మా ఫ్రెండ్, నేనూ, కలిసి చదువుకుందామని నిర్ణయించుకున్నాం. ఈ
రోజుకు వాడు మనింటికే వస్తానన్నాడు. రేపు నేను వాడింటికి వెళతాను." అని
చెప్పాడు.
"మంచిది!
మరి మీ ఇద్దరు సరే మీ అమ్మగారి సంగతో?" అన్నాడాయన
"ఆఁ
- నాకు పనితోనే బోలెడు కాలక్షేపంగా ఉంది. ఇంకా టీవీ చూసే టైమ్ ఎక్కడ ఏడ్చిందీ?
అయినా ఆ వెధవ సీరియళ్ళతో బుర్ర ఇప్పటికే బోలెడు నాశనం
పెట్టుకున్నాను. విసుగొచ్చిందిలే.." అన్నదామె.
"మరి
తోచనప్పుడు ఏం చేస్తావ్?"
"మొన్నే
నా ఎమ్.ఏ పుస్తకాలు అటక మీంచి దింపించుకున్నానులే! ఓసారి అవన్నీ నెమరేసుకుంటా!
ఇంకా తోచక పోతే పెయంటింగ్ వేసుకుంటా! పెళ్ళికాక ముందు బట్టల మీద బోలెడు డిజైన్లు
వేసేదాన్ని" నవ్వుతూ చెప్పింది లక్ష్మి.
"అబ్బో!
ఒక టీవీ పీక పిసికితే ఎన్ని లాభాలో! అయితే నేను నా రచనా వ్యాసంగం మొదలు
పెడతా!" అని నవ్వేశాడు సత్యం.
అంతలో
కాలింగ్ బెల్ మోగింది. బయటకు వెళ్ళి చూసి వచ్చిన లక్ష్మిని ఎవరని అడిగారు సత్యం.
"చీరల
వాణిగారు వచ్చింది. ఆమె దగ్గర క్రితం వారం తీసుకున్న చీరలు నాకు రంగులు.. న్..నచ్చలేదు.
అందుకే తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇక వాయిదాల మీద కూడా చీరలక్కర్లేదని చెప్పేశాను. చివరి
వాయిదా వంద ఇచ్చేస్తే చాలు -" అంది.
ఆయన
విస్తుపోయి చూస్తూ పర్సులోంచి రొక్కం తీసి ఇవ్వగానే బీర్వాలోంచి చీరలేవో తీసుకు వెళ్ళి
ఇచ్చేసి, బాకీ తీర్చి చేతులు దులుపుకుంది లక్ష్మి.
ఆ
రాత్రి చాలా రోజుల తర్వాత సత్యం తన పాత పెట్టె తెరిచి చూసుకున్నాడు. పాత కథలూ,
వ్యాసాలు, కాలేజీ రోజుల్లో రాసుకున్న కవితలు
అన్నీ చూసుకున్నడు. ఎవరో పాత మిత్రుడు పలకరించి వెళ్ళినంత ఆనందం కలిగింది.
ఇప్పటికి ఇప్పుడు కలం పట్టాలి అన్నంత ఆవేశమూ కలిగింది. కానీ కాగితం మీద ఒక్క
అక్షరం కూడా రాయలేక పోయినప్పుడు ఆయనకు చాలా బాధవేసింది. ప్చ్... ఎన్నేళ్ళయిందో
కదా! పాపం కలానికి కూడా కోపం వచ్చి ఉంటుంది. '’నువ్వు రమ్మనగానే నేను రావాలా?
నువ్వు కదలమనగానే నేను కదలాలా? నీ కోసం నేను
ఎంత కాలంగా ఎదురుచూస్తున్నానో - నువ్వు నన్ను కదిలిస్తావని నన్ను పలికిస్తావి..!
నువ్వు కనీసం అందులో పావులో పావు భాగం సమయమైనా తపన పడవద్దా!!’' అని తన చేతిలోని
పెన్ కన్నీరు కార్చినట్టు అనిపించింది ఆయనకు. మౌనంగా అది బల్లమీద పెట్టేసి
నిద్రలోకి జారుకున్నారాయన.
మరో
నాలుగు రోజులు గడిచాయి.
ఆ
సాయింత్రం ఆయన బయట నుంచి తిరిగివచ్చే సరికి మధు ఇల్లు ఊడుస్తోంది. ఆయన్ని చూస్తూనే
వెళ్ళి మంచి నీరు తెచ్చి ఇచ్చి తిరిగి పని కొనసాగిస్తుంటే,
"ఏమ్మా - మీ అమ్మలేదా?’ అనడిగాడు ఆయన.
మధు
నవ్వి, "ఉంది. మీకోసం ఓ విశేషవంటకం సిద్ధం
చేస్తోంది" అంది.
ఏంటా
అని లోపలికెళ్ళి చూశారు సత్యం.
"ఓహ్!
పూర్ణం వంకాయ కారమా?!! నాకిష్టం!!" అన్నాడాయన
సంబరపడిపోతూ.
చిన్నపిలాడిలా
నవ్వుతున్న ఆయనను చూసి, "మీకిష్టమనేగా చేస్తున్నదీ..." అంది లక్ష్మి
సత్యం
వెంటనే కాళ్ళు చేతులు కడిగి బట్టలు మార్చుకువచ్చి "అయితే ఈ శుభ సందర్భంలో
నేను నీ కోసం నీ ఇస్టమైన నిమ్మకాయ పప్పు చేసి పెట్టనా?"
అని తను బజార్లో కొని తెచ్చిన సంచీలోంచి నిమ్మకాయలు తీసి వంటిట్లో
స్థిరపడ్డారు.
"అయ్యో
రామా - మీరెందుకండి ఇక్కడ? మీకు చేత కాదు. నే చేస్తాలే.. మీరు వెళ్ళండి మహాప్రభో.."
అందామె కంగారుగా.
"నాకు
చేత కాకపోవటమేంటీ? నీ పరీక్షలప్పుడు నేను వంట చేయలేదా?
అయినా పెళ్ళికాక ముందు కొంతకాలం ఉద్యోగం చేస్తూ ఒంటరిగా
ఉండేవాణ్ణిగా! నాకు అన్నీ వచ్చు!" అని మాట వినకుండా నిమ్మకాయలు తరగసాగాడాయన.
"పిల్లలు
నవ్వుతారండి వద్దు!" అని వారించిందామె.
"మేమేం
నవ్వం లేమ్మా - మీరు కానివ్వండి" అని అక్కడే నిలబడి తమాషా చూస్తున్న మధు,
సన్నీ నవ్వేసి వెళ్ళిపోయారు.
అందరూ
ఆ రాత్రి సంతోషంగా నవ్వుల మధ్య భోజనాలయినాక సన్నీ చదువు కోసమని స్నేహితుడి ఇంటికి
వెళ్ళిపోయాడు. మధు, లక్ష్మికి పనిలో సహాయం
చేసింది. అంట్లు అన్నీ తోమి సర్దుతుంటే సత్యం ఆశ్చర్యపోయారు. "అమ్మో..
ఏంటిది.. మా అమ్మాయేనా..??" అని.
"బోరు
కొడుతోందనో, వేరే పనిలేకనో టీవీముందు కూర్చుంటే ఒళ్ళు వస్తుందిట
నాన్నా! అదే ఇంటిపని చేస్తే శరీరానికి వ్యాయామం కూడా, కాలక్షేపం
కూడా, దానితో పాటు అమ్మకు సహాయం కూడా!" అని చెప్పింది
మధు.
ఆమె
పని పూర్తి చేసి బయటకు వస్తుంటే సత్యం ప్రేమగా దగ్గర తీసుకుని నుదుట ముద్దు పెట్టాడు.
"అబ్బ!
నాన్న నన్నింత ప్రేమగా దగ్గర తీసుకుంటారని తెలిస్తే ఎప్పుడో రంగమ్మను మాన్పించి
ఇంటి పనంతా నేనే ఒంటి చేతిమీద చేసి ఉండేదాన్ని.." అంది మధు సిగ్గుపడుతూ.
ఆ
పది రోజుల్లో ఇంటి దృశ్యమే మారిపోయినట్టు అనిపించింది సత్యంకి. తల్లీ, పిల్లలు
ఉదయాన్నే లేస్తారు. మధు తల్లికి వెనక ఉండి ప్రతీ పనిలో సహాయం చేస్తుంది. సన్నీ
చెట్లకు నీళ్ళు పోసి, పాలు తెచ్చి పెట్టి వ్యాయామం
చేసుకుని ఇల్లంతా సర్దుతాడు. సత్యం కూడా కాసేపు వ్యాహ్యాళికి వెళ్ళి వచ్చి, స్నానం
సంధ్యావందనం కానించుకుని భోజనాలకు ఏర్పాటు చేస్తాడు. పిల్లలు కాలేజిలకు వెళ్ళిపోయాక
భార్యాభర్తలు కలిసి భోజనం చేశాక ఆయన ఏదన్నా, మిగిలిపోయిన
పనులేవో చూసుకునేందుకో, లేక ఏ పని మీదనో అట్లా బయటకు వెళ్ళి
వస్తాడు. మధ్యాహ్నం పిల్లలు తిరిగి వస్తారు. ఆ నాటి విశేషాలు చెప్పుకుంటూ కాసేపు
సాయిత్రాలు చల్లగాలికి ఇంటి డాబా మీద తిరుగుతారు. తర్వాత చదువులూ, పనీ ఎవరి లోకంలోకి వారు వెళ్ళిపోతారు. రాత్రి మాత్రం వార్తల వేళకు
భోజనాలు. ఒకే సమయనికి అంతా పక్కలు ఎక్కుతారు, రోజూ.
సత్యంకు
తమ చిన్నతనపు రోజులు గుర్తుకు వచ్చాయి. ఇది వరకెన్నడూ గుర్తు రాని చిన్నతనం ఇప్పుడే
ఎందుకు గుర్తొస్తోంది? బహుశ యాంత్రిక జీవితం, హడావుడి ఇవన్ని నెమ్మదించి బ్రతకు బండి కాస్త విశ్రాంతి పొందుతున్నందుకు
కాబోలు!! ఎంత పెద్ద ప్రయాణమైనా మధ్యలో మజిలీలు ఉంటాయి. మరి ఇంత దీర్ఘ జీవన
ప్రయాణంలో అది అక్కరలేదా? ఇదీ అట్లాంటిదేనేమో! ఆయన మనసు
కాస్త బడలిక తగ్గి తేలికపడింది. ఆ రోజు మధ్యానం ఆయన కలం కదిలింది. ఓ నాలుగు పదాలు
పడ్డాయి - చాలనిపించింది. కనీసం ఇంతైనా కనికరించింది కలం.
కదిలిన
గుండెలే కవితలు పలికితే
నను కదిపింది నీ చిరునవ్వులే
విరిసిన హృదయాలే పాటలు పాడితే
నాలో విరిసెను నీ జ్ఞాపకాల పువ్వులే’
తృప్తిగా
చదువుకుని మురిసిపోయాడు ఆయన. మనసంతా ఎంతో ఎంతెంతో అనిర్వచనీయ ఆనందానుభూతులకు
లోనైంది.
ఆయన
ఆనందంలో ఉండగానే మధు కాలేజి నుంచి వచ్చింది. బాగా అలిసిపోయినట్టుంది. రాగానే అన్నం
తిని కాసేపు పడుకుంది. ఇన్నాళ్ళు దాటినా మధు బ్యూటీ పార్లరుకు వెళ్ళకపోవటంతో బహుశ
ఇట్లా జరిగిందేమోనని, ఇక ఉండబట్టలేక ఆ అమ్మయి
నిద్రలేచి పుస్తకాల ముందు కూర్చోబోతుంటే వెళ్ళి ఆమె భుజంతట్టి, "మధూ....ఇదిగో 200. వెళ్ళి నీ ఫేషియల్, పేస్ పాక్ అన్నీ
చేయించుకురా! ఫ్రెష్ అవుతావేమో" అంటూనే జేబులోంచి డబ్బులు తీసి ఆమెకు ఇవ్వబోయాడు.
"వద్దు
నాన్నా - అదేం లేదు" అంది మధు.
ఆమెకు
సౌందర్యం పట్ల ఉన్న ఆసక్తి తెలిసినవాడు కనక ఆ సమాధానం విని నొచ్చుకుంటూ "ఏమ్మా,
కోపం వచ్చిందా?" అన్నాడు బుజ్జగిస్తూ.
"లేదు
నాన్నా! నాకు బుద్ధి వచ్చింది!" అంది మధు తలొంచుకుని.
ఆయన
ఆ అమ్మాయి పక్కనే కూర్చుని, "అంటే?" అనడిగారు. మధు నవ్వి చెప్పింది.
"ఈ
రోజు ఏం జరిగిందో తెల్సా నాన్నా? మా లెక్చరర్ క్లాస్‍లో
ఓ కష్టమైన ప్రశ్న అడిగారు. నిజానికి అది కష్టమేం కాదు. కాస్త ఆలోచిస్తే తడుతుంది.
దానికి ఎవ్వరూ సమాధనం చెప్పలేక పోయారు. ఒక్క అమ్మాయి మాత్రం లేచి చెప్పింది. సార్
ఆమెని మెచ్చుకుని ఆ ప్రశ్న, ఆ జవాబూ అంతా వివరించి చెప్పాక
మాకు తలకొట్టేసినట్టయింది. అసలా ప్రశ్నలోనే జవాబుంది! ఆ భావనకు నాకు చాలా బాధ వేసింది.
'ఈ మాత్రం తెలియకుండా ఇంజనీరింగులెందుకమ్మా మీకు? వెళ్ళి
ఇంటర్ మరోసారి చదివి రండి’' అని ఆయన వెక్కిరించారు"
"అందుకని..?
బ్యూటీ పార్లర్ కు వెళ్ళద్దనుకున్నావా? పోన్లేమ్మా
- ఏదో అంటే అన్నార్లే! ఒక్కోసారి ఇలాంటివి ఏవో అవుతుంటాయిలే! అయినా దానికి
దీనికేంటీ సంబంధం?"
"ఉంది
- సంబంధం ఎందుకు లేదు?"
"ఉంటే
అదేంటో చెప్పు - విందాం."
"సరే
- వినండి. నేను పార్లర్ కి ఎందుకు వెళతాను?"
"సౌందర్య
పోషణ కోసం, ఆరోగ్య రక్షణ కోసం".
‘వారానికి
మూడుసార్లు 3,4 గంటలు బూటీ పార్లర్ లో గడిపే
నా కూతురేనా ఈ మాటలంటున్నది?’ అని ఆయనకు ఆశ్చర్యం కలిగింది.
ఈ రోజు కూతురు తనకే కూర్చోబెట్టి పాఠాలు చెబుతోంది. స్వానుభవంతో నేర్చినపాఠాలు. మధూ భోరున ఏడుస్తూ, "ఎందుకో నాన్నా ఇవాళ
బాగా ఏడుపు వస్తోంది.. ఇదివరకెన్నడూ నాకింత బాధ కలగలేదు. గతంలో లెక్చరర్లు
ఎన్నోసార్లు ఇట్లాగే ప్రశ్నలు అడిగారు - నేను కనీసం జవాబు చెప్పాలనే చిన్న
ప్రయత్నం చేయటం కాదు కదా, ఆలోచన కూడా రానివ్వలేదు! కానీ ఈ
రోజు చాలా కొత్తగా అనిపిస్తోంది." అని ఆగి కళ్ళు తుడుచుకుంటూ, "ఇది వరకు
టీవీ అతిగా చూడటం వల్ల కళ్ళు గుంజేవి. తల నెప్పి పుట్టేది. జుట్టు విరబోసుకుని స్టైల్
గా ఉండాలనే తాపత్రయంలో సరిగా నూనె పెట్టి పెట్టక ఇబ్బంది పడేదాన్ని. ఆ సీడీల్లో
దిక్కుమాలిన పాప్ మ్యూజిక్ విని తల బొప్పి కడుతున్నా అది ఫ్యాషన్ కాబట్టి అదే
అలవాటు చేసుకోవాలని ప్రయత్నించేదాన్ని! టివీలో సీరియళ్ళు సినిమాలూ చూసి ప్రపంచమంతా
ఇట్లాగే ఉంది - అనే భ్రమలో ఉండటం వల్లనేనూ అట్లాగే ఉండాలని నానా యాతన పడేదాన్ని!
ఇప్పుడు అవన్నీ వదిలేసరికి నేనేంటో నాకు కనిపించటం మొదలైంది! జీవితం నేను ఇన్నాళ్ళ
నుంచి బ్రతుకుతున్నది కాదనీ, అదెంతో భిన్నమైందనీ తెలిసింది.
ఇప్పుడు నా గురించి నాకు తెల్సుకోవాలనిపిస్తోంది. జీవితం గురించి తెలుసుకోవాలి అనిపిస్తోంది.
కొద్ది రోజులుగా నాలో కొన్ని మార్పుల్లు కనిపిస్తున్నాయి. వాటి అర్థం
వెతుక్కోవాలనిపిస్తోంది" అంది.
సత్యం
సంతోషంగా మధు భుజం తట్టి, "నీకంటూ నువ్వు సమయం
కేటాయించుకుని, నీలోకి నువ్వు తొంగి చూస్తున్న ఫలితమిది! నిజానికి
నీకు ఈ సమయంలో మంచి పుస్తకాలు కావాలి! నీ పరీక్షలు కానివ్వు. అయినాక చెబుతాను ఏం
చేయాలో! ప్రస్తుతానికి రిలాక్స్ అవ్వు!" అని అక్కణ్ణుంచి లేస్తూ "చూశావా
- వేళకన్ని పనులు చేసుకుంటూ, మంచి అలవాట్లు, మంచి పద్ధతీ పాటిస్తూ, జీవితమే ఒక బ్యూటి పార్లర్!
మన భావాలు, మన అనుభూతులు, మన ఆలోచనలు,
మన కలలు ఇవన్నీ మన సౌందర్య పోషకాలు! వీటితోనే జీవితానికి నిండుతనమూ
అర్థమూ చేకూరుతాయి.." అన్నాడు.
మధు
కళ్ళలో ఆ క్షణాన మెరిసిన మెరుపంత కాంతివంతమైన మెరుపు సత్యం మునుపెన్నడూ ఎవరి కళ్ళలోనూ
చూసి ఉండలేదనిపించింది.
మరునాడు
ఉదయం ఫోను మోగింది.
సత్యం
ఎత్తి, "ఆఁహాఁ! అట్లగా" అని సన్నీని పిలిచి "మీ క్లాస్ అంతా వచ్చే వారం
టూర్ వేసుకున్నారటగా.. రెండు రోజుల కోసం! ఇవాళేలే డబ్బులు తేవాలట.." అని రిసీవరిచ్చారు.
సన్నీ ఫోను అందుకుని, "హలో....లేదురా.. నాకు
చలి పడదు - నేను రాను" అన్నాడు.
"అదేంట్రా?
పోనీ కొడైకెనాల్ కొద్దు - ఇంకెటైనా పోదాం.. నువ్వెటంటే అటు..."
"ఇంకెటైనా
కూడా రాను - ఒకసారి చెప్పా కదా.."
"ఒరే..
ప్లాన్ పాడవుతుంది.. ఈ ఏడు ఫైనలియర్ కదరా - మళ్ళీ-"
"ఫైనల్
ఇయర్ అయితే వెళ్ళాలా? ఇదివరకెళ్ళాం కదా, చాలు!"
"ఏంరా
- నీకేమన్నా కరిచిందా ఏంటి?"
"ఔను!!
నాకు మా పక్కింటి కోడి కరిచింది! ఎదిరింటి పిల్లి కరిచింది. చాలా! ఇంక మళ్ళీ ఆ
విషయమై నోరెత్తితే నేనే నిన్ను కరుస్తా జాగ్రత్తా - ఫోన్ పెట్టెయ్.." అంటూ
పెట్టేసిన సన్నీవంక పట్టలేని ఆశ్చర్యంతో చూశాడు సత్యం.
ఫోను
కనెక్షన్ వచ్చిన ఇన్నేళ్ళలో మొదటిసారిగా, అదీ
అతగాడి ఫ్రెండ్ చేస్తే రెండు నిముషాల్లో మాట్లాడి పెట్టేసిన కొడుకు ఆయనకు ఎనిమిదో
అద్భుతంలా కనిపించాడు. సన్నీకి ఆ చూపులు అర్థమై తలొంచుకున్నాడు ఇబ్బందిగా.
సత్యం
అతని భుజంమీద చేయి వేసి, "ఎందుకురా రానన్నావ్?
వెళ్ళక పోయావా? దీనికోసం అప్పుడంతా కలలు కన్నావు
- ఎదురుచూశావు?’ అన్నాడు.
"వద్దు
నాన్నా! క్రితం రెండేళ్ళూ వెళ్ళాగా, చాలు!
అయినా ట్యూషన్లు వదులుకుని ఎట్లా వెళ్ళేది?’" అంటూ
గడియారం వంక చూసి "అమ్మో - కాలేజ్ టైమయింది" అనుకుంటూ "మాఁ - ఖానా" అని పెట్టిందేందో గబగబా
తిని అల్మారా దగ్గరకెళ్ళి ఓ షర్టు ఏదో తీసి తొడుక్కుని బయల్దేరాడు. ’కనీసం ఇస్త్రీ
కూడా లేని చొక్కతో కాలేజ్ కెళ్తున్న కొడుకుని అవాక్కై చూశాడు - సత్యం - ఆయనతో పాటు
లక్ష్మి.
"ఏం
లక్ష్మీ - వీడు మనవాడే కదా - పక్కవాళ్ళ అబ్బాయి కాదుకదా?"
అని నవ్వేశారాయన, అపనమ్మకంతో
*******
ఆ
నెల సూపర్ మార్కెట్ నుంచి కాక మామూలు కిరాణా దుకాణం నుంచి వచ్చింది సామాగ్రి. ఏ
వస్తువు కొనాలన్నా అది ఎంతవరకు అవసరం, అది
లేకుండా గడుస్తుందా లేదా- అని బేరీజు వేసుకుని కొంటున్నారు. మధు సినిమాలకు వెళ్ళలేదు.
సన్నీ రెచ్చిపోయి హోటళ్ళు, పార్టీలని తిరిగలేదు. లక్ష్మి కిట్టీ పార్టీ మానేసింది.
పిండి వంటలూ, నూనె పదార్థాలూ తగ్గిన ఫలితంగా డాక్టరు బిల్లూ
తగ్గి పోయింది. వేళ ప్రకారం భోజనం చేయటం వల్ల టిఫిన్లూ, చిరుతిండ్లూ అడ్డమైనవి
కొనుక్కుని తెచ్చుకోవటం, హోటళ్ళు అన్నీ తగ్గాయి. సమయాన్ని
ఎంతో విలువను ఇచ్చి కాపాడుతూ గడుపుతున్నారంతా. ఒకరి గురించి ఒకరికి ఆలోచనా
పెరిగింది. సత్యం ఇంటిల్లిపాదికీ చెప్పకుండా ఏ నిర్ణయమూ తీసుకోవటం లేదు.
మార్చి
నెలాఖరుకల్లా సన్నీవీ, తర్వాత మధువి కూడా
పరీక్షలైపోయాయి.
ఆ
రోజు సాయింత్రం ఇంటికి వస్తూనే సత్యం
అందరికీ స్వీటు తినిపించి తనకు తిరిగి ఆ ఉద్యోగమే దొరికిన సంగతి చెప్పి అందర్నీ
ఆశ్చార్యానందాల్లో ముంచి ఎత్తారు. ఇంకో మాట కూడా చెప్పారు. "కానీ జీతం సంగతి
గుర్తుందిగా! సగమే వస్తుంది. మూర్తి ఇంతకాన్నా ఏం చేయలేకపోయాడు." అన్నాడు.
సన్నీ,
మధు ఒకరి ముఖాలొకరు చూసుకుని, "ఫరవాలేదు నాన్నా! ఇప్పుడు మనం
తక్కువలో కూడా హాయిగా గడపగలం! కానీ మీరు మాత్రం, మాకోసం
అయినా సరే, ఒక్క మెట్టు కూడా దిగకూడదు." అన్నారు.
"ఔను!
మేం శృతి మించుతున్నాము అనిపిస్తే ఆ చంపా, ఈ చెంపా వాయించి తప్పు సరిదిద్దండి కానీ,
మీ వ్యక్తిత్వం చంపుకునే ఏ అడుగూ వేయద్దు - సరేనా?" అంది మధు మాట తీసుకుంటూ.
లక్ష్మి
ఆ మాటలకి తల ఊపి "ఔనౌను - మీరూ కష్టపడవద్దు - మమల్నీ కష్టపెట్టద్దు. వాళ్ళనే
కాదు - నా పద్ధతి నచ్చని నాడు నన్నూ రెండు వాయించండి.." అంది.
సన్నీ,
మధూ కూడా సత్యంతో పాటు నవ్వేశారు.
తర్వాత
సన్నీ అన్నాడు - "అంతే కాదు నాన్నా - మాకు నీతులు చెప్పటమే కాకుండా సిగిరెట్
మానేసి, కార్ మానేసి బస్‍లో తిరిగుతూ మీరూ అన్నది
చేసి చూపారు.మీరంటే మాకూ గర్వంగా ఉంది.. మీరచనా వ్యాసంగం కూడా సాగిస్తున్నారు
మళ్ళీ..! మొన్న బల్ల మీద మీ చిన్న పేజీ కథ చదివాను.. సూపర్ గా ఉంది..’ అంటు ఆయన్ని
కౌగిలించుకున్నాడు. సత్యం అతన్ని ప్రేమగా హత్తుకుని,
"ఔన్రా
కన్నా!! నాకూ మిమ్మలిని చూస్తుంటే గొప్పగా అనిపిస్తోంది! పరిస్థితికి అనుగుణంగా
మిమ్మల్ని మీరు మలుచుకుని నాకు సహకరించి ఇంటిని నిలబెట్టారు. ఈ పరస్పర అవగాహన
కోట్లకన్నా విలువైనది. మనకు, ఆ మాటకొస్తే ఏ ఇంటికైనా
ఒకరికొకరి సహకారమే కొండంత శక్తి. అదే ఉంటే ఎంతటి కష్టమైనా తోక ముడవాల్సిందే.."
అన్నాడాయన మనస్పూర్తిగా.
"మేడంటే
మేడా కాదూ, గూడంటే గూడూ కాదూ, పదిలంగా అల్లుకున్న
పొదరిల్లూ మాదీ, పొదరిల్లూ మాది...." పాడింది మధు.
సత్యం
ఆ అమ్మాయినీ దగ్గర తీసుకుని, "పదండి - ఇవాళ ఈ
శుభ సందర్భంలో మీకు ఏ హోటల్ కావాలన్నా, ఏ సినిమా కావాలన్నా
వెళదాం.." అన్నాడు.
పిల్లలిద్దరూ
తలాడ్డంగా ఊపి, "ఊఁహూఁ - అవన్నీ బోర్!
మనం ఇంకేదన్నా చేద్దాం!" అన్నాడు.
లక్ష్మి
ఏదో గుర్తు చేస్తూ నవ్వి - ’"షటిల్?" అంది.
ఎగిరి
గంతేశారు సన్నీ మధులు. మధు, షటిల్ రాకెట్స్ తీసింది. సన్నీ కాక్స్ కొని తెచ్చాడు.
ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఆ సాయింత్రం నలుగురూ షటిల్ ఆడుకుంటూ, గెంతుతూ, గోల
చేస్తుంటే వచ్చీ పోయే వాళ్ళు వింతగా చూశారు. ఒకడెవరో,
"ఈ పెద్దాయనకిదేం బుద్ధిరా?" అని పక్కవాడితో అంటే
"నోర్ముయ్యారా - అసలు స్పిరిట్ అంటే అది.." అనుకుంటూ వెళ్ళటం సత్యం
స్పష్టంగా విన్నాడు.
పిల్లల
చిన్నప్పుడు ఎప్పుడో లక్ష్మి, తనూ ఆడుకున్న గుర్తు!
ఇన్నేళ్ళకు మళ్ళీ ఇంత హాయిగా ఆడటం ఆయనకు ఒక కొత్త శక్తి నిచ్చింది.
ఆ
రాత్రి భోజనాలు పూర్తయి పిల్లలిద్దరూ వేళకు నిద్రకు ఉపక్రమించాక ఏవో కబుర్లు
చెప్పుకుంటూ కూర్చున్న సమయంలో సత్యం లక్ష్మి చేతులు పట్టుకుని,
కళ్ళకు అద్దుకుంటూ, "నన్ను క్షమించు
లక్ష్మీ!" అన్నాడు.
"దేనికండోయ్"?
ఏం తప్పు చేశారేంటి?" ఆమె అడిగింది.
"నేను
మీతో అబద్ధమాడాను. నేను ఏ లంచమూ తీసుకోలేదు - నాకు అసలు ఉద్యోగమూ పోలేదు.. సీటూ
తగ్గలేదు. నేను ఏ జైలుకూ పోలేదు. జీతం కూడా నిక్షేపంగా వస్తోంది. ఇదంతా నేను
మూర్తి సలహా మీద ఆడిన నాటకం..." అన్నాడు దోషిలా తలొంచుకుని.
లక్ష్మి
నిశ్చలంగా నవ్వుతూ చూసి "నాకు ముందే తెలుసండి.." అంది.
సత్యం
ఆమెని విస్తుపోయి చూస్తే, "ఆశ్చర్యపోకండి! నాకు ఈమాట మూర్తిగారేం చెప్పలేదు..
ఆయన అక్షరాలా మీ స్నేహితుడు." అంది.
"మరెట్లా
తెలుసు నీకు?"
"మీ
కళ్ళు చెప్పాయి!"
సత్యం
విస్మయంగా చూశాడామెను.
"ఔనండీ!
ముందు మాత్రం నేను అదంతా నిజమని నమ్మింది వాస్తవమే! ఆ రోజు రాత్రంతా ఉండి, ఉదయం
మీరు తిరిగి రాగానే ముఖం దాచుకున్నప్పుడు నాకు నిజంగా భయం వేసింది. కానీ ఆ తర్వాత
మీ కళ్ళలోకి చూడగానే మీరు అలాంటి నీచమైన పని చేయలేదని అర్థమైంది. చేస్తే నాతో మీరంత
ధైర్యంగా కళ్ళు కలిపి మాట్లాడగలిగేవారు కాదు. ఇదంతా నాలో పిల్లల్లో మార్పు రావాలని
చేశారు - అని తర్వాత అర్థమైంది.."
"ఔను
లక్ష్మీ.. నువ్వు అన్నది నిజం! నన్ను అర్థం చేసుకున్నావదే చాలు! మళ్ళీ నన్ను అపార్థం
చేసుకుని ఎక్కడ ద్వేషిస్తావోనని నిజం చెబుతున్నాను. పిల్లల దృష్టిలో నేనెంత
పడిపోయినా నష్టం లేదు కానీ నీ కళ్ళలో నా స్థానం కించిత్ దిగజారినా
తట్టుకోలేను!" అంటుంటే సత్యం కళ్ళు చెమ్మగిల్లాయి.
లక్ష్మి
ఆయన చేతులు మెత్తగా నొక్కింది.
"ఇన్నాళ్ళూ
నేను లీవు సిక్ పెట్టి ఇంట్ళో ఉన్నాను. పిల్లలనూ, నిన్నూ ఏం అనాలన్నా నన్ను నేనే
అనుకున్నంత బాధ కలుగుతుంది. ఎవరినీ తప్పు పట్టలేక, నేను
అలవాటు చేసిన ఈ సౌకర్యాలకు నేనే దోషినేమో అని ఆలోచిస్తూ, ఎవ్వరినేమీ
అనలేక- అనకుండా ఉండలేక నానా అవస్థా పడి చివరకు ఈ పద్ధతి అవలంబించాను. అంతేకానీ
మీరంతా లేమిడి అనుభవించి బాధపడాల్ని నా అభిమతం కాదు."
"వద్దు!
మీరు ఇంకేం చెప్పద్దు. మీరు సరయిన పనే చేశారు. మాకందరికీ డబ్బు విలువ తెలిసింది.
పిల్లలకు కావాల్సిన జీవన పాఠం మనం ఇంట్లోనే నేర్పిస్తూ తల్లిదండ్రులుగా మన
కర్తవ్యమే చేశాము. రేపు పొద్దున వారికి ఏ పరిస్థితులెదురైనా జీవితంలో తలొగ్గకుండా
నెగ్గుకు రాగలిగేట్టు ఉండాలే కానీ బెదిరిపోయి చెదిరిపోకూడదు. ఈ పాఠాలు ఇప్పుడు
వారికి చాలా అవసరం. ఆ విధంగా మీరు ఆదర్శ తండ్రి అయ్యారు!" అంది లక్ష్మి.
"...లక్ష్మీ
- నిజం తెలిస్తే నన్ను తప్పు పడతావు అనుకున్నాను..! కానీ నువ్వేమీ అనటం లేదు. అయినా
కూడా నాకే గిల్టీగ ఉంది. చేసిందానికి సారీ చెప్తున్నాను."
"ఛఛ!
మన మధ్య అవన్నీ ఎందుకండి! మంచి ఉద్దేశం కోసం చెప్పిన అబద్ధం నిజం కన్నా
ఉన్నతమైందే! మీకు తోచిన మార్గంలో పెడదోవన పోతున్న మమ్మల్ని సరిదిద్దారు."
"అంతే
కాదు, నన్ను నేనూ సరిదిద్దుకున్నాను. ఇన్నేళ్ళుగా
పోగొట్టుకున్న పిల్లల ఆప్యాయతా అనురాగాలను తిరిగి పొందాను. ఎంత విలాసవంతమైన జీవితం
గడుపుతున్నామనే దానికన్నా ఎంత విలువగల అర్థవంతమైన జీవితం గడుపుతున్నామనేది ముఖ్యం,
అని తెల్సుకున్నాను. ఏ టీవీలూ, సీడీలూ,
కంప్యూటర్లయినా మనుషులను విడదీసేవే, దూరం
పెంచేవే తప్ప దగ్గర చేయలేవు. అవి ఎంత ఉపయోగకరమైనవో అంతే చెడుపు చేసేవి. వాటి కోసం
ఏకాంతం పోగుచేసుకునే ఆత్రంలో, మనిషి తన పరిసరలనూ, తనవారినీ కూడా విస్మరిస్తూ ఒక ఒంటరి తనపు అగాధంలో కూరుకుపోతున్నాడు. ఆ సంగతి,
అంతా చేజారిపోయే దాకా కూడా గ్రహించలేకపోవటం నిజంగా దయనీయం!"
అని ఆగి, "ఇప్పుడు నీ కళ్ళతో నువ్వే చూశావు కదా - పిల్లలెంత బాధ్యతగా,
అవగాహనతో మసులుకుంటున్నారో! లేకపోతే ఎవరికెవరం అన్నంతగా తలొక దిక్కూ
చెదిరిపోయే వారం కదా?"
లక్ష్మి
తల ఊపి ఔను అన్నట్టు చిర్నవ్వు నవ్వింది.
"అందుకే
- నేనొక ఏర్పాటు చేశాను. ఇకనుంచి మనం ప్రతి ఆదివారం అంతా కలిసి ఇంట్లోనే షెటిల్
కానీ, క్యారమ్స్ కానీ ఆడుకోవాలి. పాటలు
పాడుకోవాలి. కార్డ్స్ ఆడుకోవాలి. ప్రతీ సాయింత్రం డాబా మీద తిరిగి రావాలి. ఇదంతా
మనకు చక్కగా ఇచ్చిన భగవంతుడికి ప్రతీ రోజూ సాయింత్రం అందరం కలిసి పూజ చేసుకోవాలి..
ఏమంటావు?"
"తప్పకుండా!
అది మనం చేయాల్సిన ముఖ్య పని.."
"లక్ష్మీ!
అంతే కాదు. ఇక నుంచి నేను ప్రతినెలా సగం జీతం బ్యాంకులో పిల్లలిద్దరి పేర్నా
చెరింత వేద్దామని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో వాళ్ళ అవసరాలకు పనికొస్తుంది.
లేదా - మనమే ఆ సొమ్మును ఏదన్నా మంచి పనికి ఉపయోగిద్దాం.."
"మంచిది.
ఈ విషయం మనం ఎప్పటికీ పిల్లలకు చెప్పవద్దు. వాళ్ళను చక్కగా మలుచుకునే బాధ్యతలో
ఇదొక భాగం. అన్నట్టు సన్నీ ఆ పిల్లతో తిరగటం మానేశాడు. సెల్ ఫోను కూడా ఎవరికో
అమ్మేశాడు. మధు కూడా ఇప్పట్నుంచి ట్యూషన్ చెబుతుందట! నన్ను కూడా క్రెచ్ పెట్టమని
సలహా ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ దృష్టి కొద్ధి కొద్దిగా ఇంటిమీదకూ, ఇంటి అవసరాల మీదకూ
మళ్ళింది! ఎక్కడా డబ్బు వృథా కాకుండా చూస్తున్నారు! కనీసం వాళ్ళ ఖర్చుల వరకైనా
సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నారు!"
"అంతా
భగవంతుడి దయ లక్ష్మీ. కానీ ఈ విషయంలో మా అమ్మానాన్నలకు నేను సదా ఋణపడుంటాను."
"ఎందుకు?"
"నీలాంటి
అసలైన సహధర్మ చారిణిని నాకై వెతికిపెట్టి కట్టబెట్టినందుకు! నిన్ను ఎన్నుకుని వాళ్ళే
పొరపాటు చేయలేదని ఆలస్యంగానైనా తెలుసుకున్నాను."
లక్ష్మి
’సర్లెండి’ అన్నట్లు నవ్వి తలొంచుకుంది.
సత్యం
ఆమె తలెత్తి కళ్ళలోకి చూసూ, "లక్ష్మీ - నీకింకో నిజం
చెప్పనా?" అనడిగారు
కుతూహలంగా
చూసిందామె, ఏంటో చెప్పమన్నట్టు
"నువ్వు
23 ఏళ్ళ క్రితం ఎంత చక్కగా ఉన్నావో, ఇవాళా నువ్వూ,
నీ మనసు అంతే బావున్నారు! ఏం మారలేదు!" అన్నాడు నవ్వి.
లక్ష్మి
సిగ్గుగా నవ్వింది. సత్యం తృప్తిగా అమెను చూస్తుండిపోయాడు.
**********
No comments:
Post a Comment