కూరిమి గల దినములలో నేరములెన్నడు
కలుగనేరవు..
మరియా కూరిమి విరసంబైనను నేరములే
తోచుచుండు నిక్కము సుమతీ..||
ఇప్పుడు నాకు హసితలో నేరాలే
కనిపిస్తున్నాయి కనక కూరిమి విరసంబైనట్టా..? కూరిమి ఉన్నప్పుడు కూడా ఈ విషయాలు
నాకు హసితలో ఇట్లగే కనిపించేవే మరి! మరి కూరిమి ఉన్నప్పుడు నేరాలు కనిపిస్తే
కూరిమి ఎప్పుడూ లేదని అర్థమా..? అదేం లేదే.. ఆమెను ఆ దోషాలతోపాటు అంగీకరించాకే ఆమె
స్నేహితురాలైంది. దాని గురించి ఈ శతకకర్త అభిప్రాయం ఏంటి..?
నేరాలు లేని మనుషులు ఉంటారా..? ఆ
నేరాలెంచేవారిలో నేరాలు లేవా..? అంటే తప్పులెన్నువారు అని తమ తప్పులెరగరని ఇంకో
శతకంలో వేమన్న సెలవిచ్చాడే..! అంటే ఇప్పుడు నేను నా నేరాలు పక్కన పెట్టి ఆమె
నేరాలను ఎంచుతున్నానా, అంటే మరి నా నేరాలు, అదే తప్పులు కూడా నాకు స్పష్టంగనే
తెలుసు కదా..!
అయినా నాకొకటి అర్థం కాదు- అసలు నేరాలు
ఉండటానికి, కూరిమి చేయటానికి సంబంధం ఏంటి..? అట్ల నేరాలు లేనివారే కూరిమికి
కావాలని కూర్చుంటే లోకంలో ఎవరైనా ఒంటి కట్టెరామలింగంలా బ్రతకాల్సిందే కదా. పైగా ఏ
తప్పులైనా కాలం పోను పోను, బంధం ముదిరాకనే కనిపించటం మొదలైతాయి. అంతమాత్రాన కూరిమి
తగ్గిపోతుందా..? అయినా నేరాలను దూరం చేసుకోవటానికే కదా కూరిమి కావాల్సింది..?
ప్రతీవారూ అవతలివారిలో నేరాలు చెప్పలేరు. చెప్పినా మనం ఒప్పుకోము. కూరిమి మాత్రమే
చెప్పగలుగుతుంది.
లేక నేరాలు ఆమె ఇప్పుడు ప్రత్యేకించి
ఎక్కువ చేస్తోంది కనక కనిపిస్తున్నాయేమో..! ఆ అవకాశం కూడ లేకపోలేదు కదా..! లేక నేను
ఆమెలో ఇదివరకు మంచి అనుకున్నదానిని కూడా నేరంగ చూస్తున్నానా..? అంటే ఇప్పుడు హసిత
నాకు వచ్చిన సంబంధాలను చెడగొట్టటం నేరం కాదా..? కూరిమి లేనందువల్ల అది నాకు నేరంగ
కనిపిస్తోందా..?
"ఏంటమ్మా ఆలోచిస్తున్నావు..?"
తాతగారు వచ్చి గదిలోకి తొంగి చూశారు.
"ఏం లేదు తాతగారూ.." అని నా
కూరిమి నేరాల పరిశోధన ఆయన ఎదుట ప్రస్తుతించాను.
ఆయన అదంతా విని, నవ్వి, "కూరిమి
ఎవరి మధ్య జరిగింది అనేది ముఖ్యం. సామాన్యుల మైత్రికి మహానుభావుల మైత్రికి చాలా
తేడాలుంటాయమ్మా. ఏ శతకకర్తలైనా అందరి కోసం వ్రాసేటప్పుడు సామాన్యులకు వర్తించేవే
వ్రాస్తారు. కాస్త సొంత వివేకం, ఆలోచన ఉన్నవారికి ఇవి ఒకరు చెప్తే తెలియాల్సిన పని
లేదు. వారి అవగాహనతోనే ఇవన్నీ స్వానుభవంగ తెలుసుకుంటారు. ఎవరైతే అవతలివారిలో
నేరాలు దోషాలను ఎంచకుండా కూరిమికి ఎగబడతారో వారి పరిస్థితి ఈ పద్యంలో చెప్పబడింది.
అంతే. వారి కూరిమికి ఒక ఆధారం లేనప్పుడు విరసం కావటానికి కూడా బలమైన ఆధారం ఏమీ
ఉండదు. నేరాలు తెలుసుకోకుండ కూరిమి చేస్తారు.. నేరాలు కనిపించంగనే కూరిమి
మానేస్తారు.." అన్నారు.
"కానీ కూరిమి విరసమైతేనే నేరాలు
కనిపిస్తాయని కదా శకతకర్త అభిప్రాయం..?"
"ఆ విరసం కావటానికి ఏదో నేరం అయితే
నాంది పలుకుతుంది కదా. అంటే, దీని అర్థం ఎట్ల తీసుకోవాలంటే, ముందు స్నేహం
ఉన్నప్పుడు ఏ గుణాలు నచ్చేవో, అవే తప్పులుగా కనిపిస్తాయి అని. ముందేమో బాగా
మాట్లాడుకుంటారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఒకరిళ్ళకు ఒకరు వెళ్తారు. కలిసి
కాలం గడుపుతారు. అభిప్రాయాలు, రహస్యాలు పంచుకుంటారు. ఒకరిని మించి ఒకరు
అవతలివారికి సహాయం చేసేయాలని ఉబలాటపడతారు. స్నేహంలో నేను గొప్ప అంటే నేను గొప్ప
అని పోటీ పడతారు. కానీ ఏదో కారణంగ అది విరిగితే మాత్రం ఎదురు పడితే మొహాలు
తిప్పుకుని వెళిపోతుంటారు. ఒకరినొకరు తప్పించుకుంటారు. కలిసి గడపాల్సొస్తే ముళ్ళ
మీద ఉన్నట్టు బాధపడతారు. రహస్యాలేమైనా బయటకు చెప్పేస్తే..? అని భయపడతారు.
ఒకరికొకరు ఎక్కువ అన్యాయం చేసేయాలని ఉవ్విళ్ళూరుతారు. అట్ల అన్నమాట. కనక ముందు
ఆనందం కలిగించినవే తర్వాత రోత కలిగిస్తాయి. ప్రతీదీ ఆ మనిషిలో దోషంగనే
కనిపిస్తుంది. మనిషి మర్చిపోయే నిజం ఏంటంటే ఈ లోకం భావనామయమైంది. మనం చూసే దృష్టి
కూడా మనకు లేని దృశ్యాన్ని చూపిస్తుంది. అయితే స్నేహం ఇద్దరికి చెందింది కనక ఒకరి
దృష్టి చెడినా మరొకరు మామూలుగనే ఉన్నా స్నేహం సాగజాలదు. అంటే వారిలో ఒకరు
వివేకవంతులు, ఒకరు వివేకహీనులన్నట్టే కదా. అప్పుడు ఎక్కువ దుఃఖంతో కుమిలిపోయేది
వివేకవంతులే అయినా వారి అమూల్య స్నేహాన్ని పోగొట్టుకుని నష్టపోయేది
వివేకహీనులే.."
"అర్థమైంది.." అన్నాను
సంతోషంగ.
"అది విషయం. ఇది ఒకరి వైపు నుంచి
మాత్రమే చెప్పిన మాట. నేరములు తోచినంత మాత్రాన నేరాలుండాలని లేదు. కూరిమి, అది
లేకపోవటం మాత్రమే ఆయా అభిప్రాయాలను కలగచేస్తున్నాయి. తాను ఇంతకాలం సుగుణం
అనుకున్నది నిజానికి ఇంకో సందర్భంలో నేరం కావచ్చు." అన్నారు తాతగారు.
తాతగారి విశ్లేషణ విన్నాక నాకు కాస్త
బరువు తగ్గింది. అంటే హసిత దృష్టి మారింది. నాలో ఏదో దోషం ఆమెకు కనబడింది. కూరిమి
కనిపించటం నాకు ఆగకపోయినా ఆమెకు ఆగిపోయింది. అందుకే తనకు నాలో నేరాలెక్కువ తోచి,
నాతో కూరిమి కంటగింపుగ అయింది. ఇది ఆమె వైపు నుంచి అతికే పద్యం.. నా వైపు నుంచి
కాదు. కనక నేను ఎప్పటిలాగే ఉండిపోవటానికే నిశ్చయించుకున్నాను. ఆమెకు నేనేపాటి
విలువ చేస్తానో తెలియదు. అది నేను నిశ్చయించగలిగేది కాదు. ఆమె చూసుకోవాల్సిన
విషయం. కానీ నేను మాత్రం ఆమెను ఎప్పటికీ చిన్ననాటి సఖిగానే చూస్తాను. తన తప్పు
తెలుసుకుని ఏ రోజుకైనా తిరిగి వచ్చేపక్షంలో నా తలుపులు మూసి ఉంటే, ఆమెను స్నేహంతో
ఆదరించే దిక్కు లోకంలో ఉండదు. ఇద్దరం ఒకరికొకరం ఒక్కరే స్నేహితులం మరి.
తాతగారు నా ఆలోచనలను చూసి నవ్వుతూ, తల
నిమిరి, "హసిత చేసింది తప్పు. నువ్వంటే ఈర్ష్య అని ఒప్పుకుంది కదా. దాని
పెళ్ళైపోయింది. అయ్యి కూడా నెల దాటింది. ఇంక వదిలేయ రాదా..? దానికి చేతనైంది అది
చేసింది. భగవంతుడు లేడా పైన? మీ అమ్మా నాన్నా వెర్రివాళ్ళు. ఊరికెనే కంగారు
పడుతున్నారు. మరీ బెదిరిపోతున్నారు. కానీ నాకు తెలుసు. నీకు బంగారం లాంటి సంబంధం
వస్తుంది. నువ్వేం దిగులు పడకు. ఇదిగో, పీ హెచ్ డీ అంటే మాటలు కాదు. ఊరికే
అనవసరమైన ఆలోచనలు మాని చక్కగ చదువుకోమ్మా.." అని వెళిపోయారు.
ఇహ గతంలోకి తొంగి, తరచి చూసినట్లైతే
నాకు అర్థమైనంత వరకు జరిగింది ఇది-
***
హసిత నాకు ఊహతెలిసిన దగ్గరి నుంచీ
తెలుసు. మా ఇద్దరి వయసూ ఇప్పుడు ఇరవై నాలుగు. దాదాపు వయసంతే పరిచయం.. బాగా చిన్నతనం నుండి కలిసి పెరిగాము. ఇద్దరి తండ్రులు స్నేహితులూ, పైగా ఒకే ఆఫీసులో పని కనక కుటుంబ స్నేహం కూడ ఉంది. ఒకే స్కూలు, ఒకే కాలేజీలో చదువుకున్నాము. పక్క పక్క వీథుల్లో ఇళ్ళు. నిత్యం రాకపోకలు.
కలిసి కాలక్షేపాలు- చదువు, సంగీతం, సినిమాలు, ఆటపాటలూ అన్నీ కలిసే. అరమరికలు
లేవనుకున్న తన స్నేహంలో నేను పీకలలోతు మునిగిపోయాను. వ్యక్తిగా మామధ్య తేడాలు
నేనెప్పుడూ పట్టించుకోలేదు. ఎంతసేపటికీ స్నేహమే నాకు ముఖ్యం. ఆలోచనలు, ఆశయాలు,
భావాలు పంచుకోవటం, ప్రతీది ఒకరికొకరం సంప్రతించుకుని చేసుకోవటం, చిన్న విశేషం
ఉన్నా ప్రతీ సాయింత్రం ప్రత్యేకించి ఇష్టాగోష్ఠికి కలిసినప్పుడు అది చెప్పుకోవటం,
ఎప్పుడైనా ఏదైనా ఆసక్తికరమైన కథో, నవలో తెచ్చుకుంటే మంచం మీద పడి పక్కపక్కన బోర్లా
పడుకుని ఏదో కాలక్షేపానికి తింటూ ఒకేసారి ఆ కథను చదువుతూ ఆస్వాదించటం, ఇష్టమైన
టీవీ కార్యక్రమమేదైనా ఉంటే కలిసి చూడాలని ఎవరో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి
కూర్చోవటం, ఇళ్ళలో చేసుకున్న తినుబండారాలు ఒకరికొకరం ఇచ్చుకోవటం..! బోర్ కొడితే
హసిత, సంతోషం వస్తే హసిత, బాధ వస్తే హసిత..; పండగ వస్తే, పేరంటాలకంటే,
షికారుకెళితే, పాటల కార్యక్రమానికి వెళితే, గుడికి వెళితే, సంగీతానికి వెళితే..
అన్నింటికీ హసితే కావాలి. జంటకవుల్లా ఇద్దరం..! అక్కచెల్లెళ్ళా అని అడిగేవారు
అందరూ. ఎంతో గర్వంగ అనిపించేది అట్ల ఎవరైనా అడిగితే.
అటువంటి
మనిషి ఇప్పుడు నా మనసు విరచాలని, నాకు అన్యాయం చేయాలని తపనతో తనతో తనే
పోటీ పడుతోంది. అందుకే నా సంబంధాలను నేరుగ ఫోనులు చేసి, దుష్ప్రచారాలు చేసి మరీ
చెడగొడుతోంది. నాకు అది తలచుకుని నవ్వు వచ్చింది..
పేరు చెడటం సామాన్య విషయం కాదు. జనాలకు
ఇటువంటి విషయాల్లో సత్యాసత్యాలతో పనుండదు. గాలి వార్తలకే ఎక్కువ విలువ ఉంటుంది ఈ
లోకంలో ఆధారంలేనివి బాగా ఎగురుతాయి. ఆధారం ఉన్నవి ఎదుగుతాయి. ఎగరటానికి పట్టదు
కానీ, ఎదగాలంటే కాలం పడుతుంది. మరి నామీది ఈ కళంకం ఎట్లా, ఎప్పటికి రూపుమాసేనో!
పోనీ ఇది గాలి కబురనుకుందామా..? నాకు
వచ్చిన మూడవ సంబంధం వారికి హసితే స్వయంగా
ఫోనుచేసి నా మీద లేనిపోనివి అన్ని చెప్పటం హసిత తల్లి స్వయంగా విని
నెవ్వెరపోయిందట. కూతురును చీవాట్లు పెట్టింది. కానీ హసితలో కించిత్తు కూడ
పశ్చాత్తాపం లేదు. "ఎందుకు చేస్తున్నావు ఇట్లా?" అని అడిగితే, "ఋత అంటే నాకు ఈర్ష్య" అని చెప్పిందట. అమ్మ
ఇదంతా ఆంటీ నోట విని, "అసలు ఇందులో మీ అమ్మాయి తప్పు ఏమీ లేదులే వదినా. ఋత
వాడితో తిరగబట్టే కదా హసితకు ఒక వంక దొరికింది. అంతా దీని నిర్వాకమే."
అనేసింది ఉండబట్టలేక.
చాటుగ ఇది విన్న నా మనసు చివుక్కుమన్నా ఇంతవరకు అనుమానంగా
ఉన్నమాట ఇప్పుడు నిజమైనందుకు తేలికకూడా పడింది. సాక్ష్యాధారం ఎదురుకుండా ఉన్నా అది
నాకు చాలాసేపు నమ్మబుద్ధి కాలేదు. నాకు వచ్చిన సంబంధాలు చెడకొడితే
హసితకు వచ్చిన లాభమేమిటి?
"నిన్న హసిత తల్లి వచ్చి స్వయంగా ఈ
సంగతులు చెప్పేదాకా నాకూ అనుమానం రాలేదు. ప్రాణ స్నేహితురాలు అని నువ్వు అనుకోంగనే
సరిపోయిందా?" అని మా అమ్మ ఆ సాయింత్రం బాధపడింది.
మా నాన్నగారు కూడ చాలా ఆవేదనగా- "పైగా మన అమ్మాయి నడవడి మంచిది
కాదని ప్రచారం చేసి కూర్చుందట. సంబంధాల వాళ్ళకు ఇదే ముక్క చెప్పి విరిచేస్తోంది.
ఇహ ఈ జన్మకు దీని పెళ్ళి అయ్యేనో?" అని వాపోయారు.
నా నడవడి మంచిది కాదని వినంగనే
నేను నవ్వాను. నా కళ్ళలో మాత్రం నీరు ఉబికింది.
విశ్రుత్ గుర్తుకు వచ్చాడు. ఇంకేదైనా కారణం చెప్పినా నేను బాధపడకపోయి ఉందును. అతని
గురించి అంతా ఎరిగి అతనితో సంబంధం అట్టగట్టినందుకు బాధ అనిపించింది. ఎందుకు
చేస్తోంది హసిత ఇట్లా? అతని
గురించి హసితకు పూర్తిగ తెలుసు. కాబట్టి ఇది కావాలని తెలిసి చేస్తున్న పనా?
ఇట్ల చేయటంలో హసిత ఉద్దేశం ఏంటి..?
నిజంగ ఓర్వలేనితనమేనా..? మా ఘనిష్ఠ స్నేహం మధ్య దానికి చోటు ఎక్కడి నుంచి వచ్చిందో
కూడ నాకర్థం కాలేదు. ఇట్లా వక్రంగా ఆలోచించటం, ఈర్ష్య
పడటం, దుష్ప్రచారాలు చేయటం హసిత పద్ధతే కాదు.
ఏదైనా ఉన్నా మొహం మీదే చెప్పేస్తుందే!! అటువంటి దాపరికాలు, అరమరికలూ ఏవీ మా స్నేహంలో లేవు- అనే ఇంతకాలం భావించాను. కానీ అన్నీ
కనిపించినట్టే ఉండవు కాబోలు!
అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను. ఆమెకు
నేరాలుగ అనిపిస్తున్న నా విషయాలను నేను ఏం చేసుకుంటే ఆమెకు అట్ల కనిపించటం మానేసి
వాస్తవంగ కనిపిస్తాయా అని ముందు ఆలోచించాను. కానీ ఆ స్థితిని ఎప్పుడో దాటిపోయింది
హసిత.
హసితలో సరిగ్గ చెప్పాలంటే ఏడేళ్ళ క్రితం
నుంచి ఈ మార్పు గమనిస్తున్నాను నేను. మార్పు రావటానికి అనువైన పరిస్థితులు అప్పుడే
ఏర్పడ్డాయి మా మధ్య. సంగీతకళాశాలలో గాత్రసంగీతంలో ఇంటరు సర్టిఫికెట్ కలిసి
పుచ్చుకున్నాక ఒకేసారి అవకాశాలు ఇద్దరి తలుపులూ తట్టాయి. సంగీతం టీచరు ఏర్పాటు
చేయించిన ఒక గాత్రకచేరి కార్యక్రమంలో మా ఇద్దరి గొంతులనూ నచ్చిన ఒక ప్రొడ్యూసరు
అవకాశాల తలుపు తెరిచాడు. నేను మా ఇంట్లోవారి ఆజ్ఞను శివసావహించి వెనక్కు
ఉండిపోయాను. ఆమె తన ఇంట్లోవారి ప్రోద్బలంతో ముందుకు వెళ్ళింది.
మా ఇంట్లో
వాళ్ళకు నేను బయటకువెళ్ళి నలుగురి కళ్ళల్లో పడటం ఇష్టం లేకపోయింది. అందుకే సంగీతం
టీచరు ఎంత ఒత్తిడి చేసినా కూడా స్టేజులు ఎక్కి షోలు చేయటానికి, ప్లేబాక్ పాడటానికి కానీ మా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. హసిత ఇంట్లో అట్లకాక
ఇందుకు ఆటంకం ఏం లేకపోగా ఇంకా ప్రోత్సాహం ఉండేసరికి మా ఇద్దరి దారులు వేరైనాయి.
ఆమె వేదికలెక్కింది, నేను దిగువన ఉండి
చప్పట్లు కొట్టాను. ఆమె పాటలు పాడింది, నలుగురి కళ్ళలో మంచి గాయని అనే పేరు
గెలుచుకుంది. నేను అభినందించాను. ఇంకా తన పాడే తీరులో
మెరుగులు దిద్దాను. పాటల్లో లోటుపాటు తెలియచెప్పి, తప్పులు సవరించి, మంచి మెళుకువలు
నేర్పించటంలో ఆసక్తి కనబరిచాను. మొదట్లో అటువంటి సందర్భాల్లో కూడా నా సలహాలను
వేరేగా భావించక మంచి మనసుతో స్వీకరించటమేకాక అవి పాటించి మరింత సమర్థవంతంగా పాటను
మలచుకుందామె. దాంతో అవకాశాలతో పాటు పేరు ప్రతిష్ఠలు పెరిగాయి. కొద్ది
రోజుల్లోనే మంచి కీర్తి, బోలెడు
ఉన్నతావకాశాలతో పాటు, కొంత పరపతి, సంపాదనా కూడ సొంతం చేసుకుంది.
తర్వాత ఆమెకు వచ్చిన ప్రతీ చిన్నా
పెద్దా అవకాశం పూర్తిగ అందుకుంది. పైకి ఎదదగటంలో బిజీ అయిపోయి క్రమక్రమంగా
అన్నింటికీ, ముఖ్యంగ నాకు దూరమైంది. ఆమెకు తీరిక దొరికేది కాదో, దొరికించుకునేది కాదో తెలియదు కానీ ఉదాసీనతకు కారణం అర్థంకాక మొదట్లో కొంత
ఘర్షణ పడ్డాను. రానురాను ఆమె మరీ కనిపించేటట్టు చేయటం మొదలుపెట్టింది. ఇంటికి వెళ్ళినా
మాట్లాడదు. ఫోను చేసినా ఎత్తదు. నేను అలవాటుప్రకారం కలవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి
కూర్చుంటే ఆమె కాలం వృథా అయితుందన్నట్టు ప్రవర్తించేది. ఒకవేళ మాట్లాడినా కొత్తగ
విడుదలైన తన ఆల్బం గురించో, లేక రాబోతున్న కొత్త అవకాశాల గురించో, తనకు తను
పెద్దలుగా భావించేవారి నుంచి వచ్చిన పొగడ్తల గురించో, తను స్టేజిల మీద అందుకున్న
ముమెంటోల గురించో చెప్పటమే సరిపోయేది. ఇక పెద్దవారి పరిచయాల వల్ల కలిగిన ఆనందపు
డబ్బాకు అంతే లేదు. ఆమెకు కూడ ఇప్పుడు ఇంక కళాకారుల లక్షణాలు వచ్చేశాయిట. కనక
ఇతరులకు కావాల్సినట్టుగ తను ఉండలేదట. ఇట్ల ఏవేవో గొప్ప మాటలు మాట్లాడేది.
నేర్చుకోవటం, తెలుసుకోవటం మీద ఆమె ధ్యాసే లేదు. ఇప్పుడు సంగీతం టీచరుగారిని కలవటం
కూడ మానేసిందిట. నేను కలవటానికి వెళ్ళినప్పుడు టీచరు ఆ మాట చెప్పి బాధపడ్డారు.
ముఖ్యంగ తను బీఏ చదువు మధ్యలోనే ఆపేసినందుకు ఆమె నొచ్చుకున్నారు.
హసిత తల్లిదండ్రులు ఆ విషయాన్ని కూడా
నలుగురిలో గొప్పగనే చెప్పుకుంటారు. టీచర్లంతా ఒక స్థాయి వరకేనట. పెద్ద చెట్టు కింద
నీడలో ఉన్న చిన్నచెట్టు ఎప్పటికీ ఎదగలేదట. ప్రత్యేకంగ పార్టీలిచ్చి మరీ కూతురి
విజయం గురించి దండోరాలేసేవారు. అదంతా విని నాకేమీ అనిపించకపోయినా మా ఇంట్లోవారికి
చాలా కోపం వచ్చేది.
"మనం కాదంటే, సరేననుకుని ఎదురు
చెప్పటం ఇష్టంలేక ఊరుకుంది పిల్ల. లేదంటే హసిత కన్నా తను ఒక మెట్టు ఎత్తునే
ఉండేది. ఇద్దరిలో దీని గొంతే బాగుంటుందని ఆ పిల్ల ఎదుటే సంగీతం టీచరు ఎన్నిసార్లు
దీన్ని మెచ్చుకోలేదు..?" అని కోపంగ అన్నారు నాన్నగారు. ఆ రాత్రి
భోజనాల దగ్గర అనుకున్నారు. నేను అప్పుడు అక్కడ లేను. చాటుగ విన్నాను.
"దీన్ని
చూసి ఓర్వలేనంతగా ఎప్పుడు తయారైందో? రెండేళ్ళలో ఎంత మార్పు!! స్టేజిలెక్కి
నాలుగు పాటలు పాడి పేరు పొందేసరికి గొప్ప విజేత అయిపోయిందా? చూశావా, నా కొత్త
కాసెట్టు.. అని ఇస్తోంది. అది చూడటానికేనట. కావాలి అనుకుంటే మాత్రం బజారులో
కొనుక్కోవాలిట. దానికి ఋత ఏమాత్రం చిన్నబుచ్చుకోకపోగా హసితను మామూలుగనే
అభినందించింది." అని బాధపడింది అమ్మ.
అప్పుడు తాతగారు, "అవన్నీ అనవసరపు
మాటలు. ముందు మన పిల్ల సంగతి చూడండి. ఏ పనీ లేకుండ ఇంట్లో ఉంది. అందుకే ఎట్లగూ అది
సంగీతంలోనే ఉంది కదా, కనీసం ఆచార్యగారి దగ్గర వయోలినైనా నేర్చుకుంటుంది."
అన్నారాయన.
నిజానికి ఇందులో ఇంట్లోవాళ్ళ తప్పేం
లేదు పాపం. ఎంత చదువుకోమన్నా కనీసం బీఏ పైన అక్షరం చదవటానికి కూడ నేనే ఒప్పకోలేదు.
హసిత లేకుండ బీఏ పూర్తిచేసేసరికే నా పనైపోయింది. ఇంకా పై చదువా..? అది నా
వల్లవుతుందా..? ఒంటరిగ వెళ్ళి రావాలన్న ఏదో ఇబ్బందికర భావనే నన్ను ఎమ్మేకు దూరం
ఉంచింది. దాంతో వాళ్ళు నా వివాహం తలపెట్టాలనుకున్నారు.. కానీ జాతకం చూపిస్తే ఇంకొక
నాలుగేళ్ళ దాకా కచ్చితంగ వివాహయోగం లేదన్నారు. దాంతో వీళ్ళు ఊరుకున్నారు. ఆ వేసవి
శెలవలన్నీ ఎప్పటిలా హసితతో మనసుతీరా గడపక నేను ఏదో సంగీతం పుస్తకాలు చదువుకుంటూ
కాలక్షేపం చేస్తుండిపోయాను.
ఎందువల్లో అంతకు ముందు ఏనాడు వయోలిన్
నేర్చుకోవాలని నేను అనుకోలేదు. సంగీతం పాడటమే నాకు ఎక్కువ ఇష్టము. ఒక వాయిద్యంతో
నేను అనుకున్న భావాలను పలికించగలగటానికి దానితో అనుబంధం ఏర్పరుచుకోగలననే నమ్మకం
నాకు ఎప్పుడూ లేదు. నా గొంతు నాది. కానీ వాయిద్యమంటే.. ఏమో! అట్లగే గాత్రం
కొనసాగిద్దామంటే ఇప్పుడేమో సంగీతం టీచరు పాఠాలు చెప్పటం మానేసింది. పెద్దతనం
వల్లో, అనారోగ్యం వల్లనో, ఆమె పిల్లలు పెద్దవారై ఇంట్లో చదువులకు ఇబ్బందిగ ఉందని
వద్దన్నందువల్లో- తెలియదు. అప్పుడప్పుడు కలిసి రావటం తప్ప వేరే ఏ వీలూ లేకపోయింది.
ప్రయత్నించినా ఆమె అంత బాగా చెప్పగలిగే మంచి టీచరు దొరకలేదు. అందరి వద్దా చేరటం,
వారి కుంచిత ప్రవర్తనకు బాధతో మానేయటం.. ఇదే జరిగింది. సరే, ఇప్పుడు వయోలిన్ కోసం అవకాశం
దొరికింది కదా, ఏదో విధంగ సంగీతంతో సంబంధం కలిగి ఉండటం ముఖ్యం అనిపించింది.
ఆచార్యగారైతే చాలా మంచి టీచరు. హఠాత్తుగ మారిన హసిత ప్రవర్తన కొన్ని నెలలుగా నన్ను
నన్నుగా ఉంచుకోనీయకుండ చేస్తున్న సంగతి తాతగారికి బాగా తెలుసు. అందుకే నన్ను
వెంటబెట్టుకుని ఆచార్య గారింటికి వెళ్ళి అడిగితే- "దానికేం భాగ్యం? తప్పక నేర్పుతా!" అని ఆయన మాట ఇచ్చారు. అంత గొప్ప విద్వాంసులు అంత
సునాయాసంగా ఒప్పుకొన్నారంటే అది తాతగారికున్న మంచి పేరు వల్లే!
ఆ
విధంగ నేను వయోలిన్ కి వెళ్ళటానికి హసిత కారణమైంది. ఆచార్యగారి వద్ద వయోలిన్
అభ్యాసం మొదలు పెట్టాక హసిత ఇచ్చిన షాక్ ల నుంచి కాస్తకాస్త తేరుకున్నాను. ఒకరకంగ
విశ్రుత్ తో గడపాల్సి రావటానికి హసితే కారణం. ఎంతో లోతుకు పెనవేసుకుపోయాక
అకస్మాత్తుగ ఆమె అనాసక్తి వల్ల ఏర్పడ్డ గజిబిజి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది.
నాలోపలి స్నేహభావం నిండిన నాడుల్లోకి అంతే సులువుగ స్నేహరాహిత్యాన్ని నింపటం
నావల్ల కాలేదు. ఒక మాట్లాడాలన్న కోరిక, ఒక అభివ్యక్తి ఆకాంక్ష నన్ను ఉన్మాదిగ
మారుస్తున్న వేళ అది. ఆమె మొదటిలో ఉన్నట్టే కలివిడిగ ఉండి ఉంటే బాగుండని, ఇట్ల
ఎందుకు జరుగుతుందని, ఆమె స్నేహం నన్ను నాకు కానివ్వకుండ చేసిందని ఏవేవో ఆలోచనలతో
ప్రయోజనం లేకపోయినా పగలూ రాత్రీ సమానంగ బాధపడేదాన్ని..! తన దుష్ప్రవర్తనతో
బాధపెట్టిన నా మనసు గాయం నయం చేసుకోవటానికి మార్గంగా వయలిన్ గురించి
ఆలోచించించాను. అక్కడే పరిచయమైనాడు విశ్రుత్.
అటు సంగీతంలో ఎమ్మేకి కట్టించి బలవంతాన
పంపారు ఇంట్లోవాళ్ళు. కనక రోజూ కాలేజికి వెళ్ళి రావటం అలవాటు చేసుకోక తప్పలేదు.
హసితా హసితా అని అడుగడుగునా ఏదో సందర్భంలో గుర్తుకు వచ్చే ఆమె క్రమంగ మరుగున
పడింది. అటు ఎమ్మే క్లాసులు, ఇటు వయోలిన్ కోసం ఆచార్యగారి దగ్గర గడపటం.. నన్ను
త్వరలోనే మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. ఆచార్యగారు నా చేత ఆ కమాన్ పట్టించి
వేయించిన శబ్దగీతలు అప్పటికి క్రమంగ అలంకారాల దాకా వస్తున్నాయి. 'సరిగమ గరి సరిగరి సరిగమ.. రిగమప మగ
రిగమగ రిగమప..' అంటూ నేను ఉల్లాసంగ ధృవతాళం వాయించుకుంటున్నాను. సంగీతం
నేర్చుకోవటంలో నీరసం పోయి కాస్త ఆసక్తి వచ్చేది జంటస్వరాల దగ్గర, తర్వాత అలంకారాల
దగ్గర. నాకు అలంకారాలంటే ఎంతో ఇష్టం. అందులో మొదటిసారిగ ఆదితాళం కాక ఇతర తాళాలు
ప్రవేశిస్తాయి. కనక తాళం మీద కూడ ధ్యాస పెట్టాలి. నాకు సంగీతం ముందే వచ్చు కనక
కేవలం సరిగ్గ వయోలిన్ తీగ మీద ఆ స్థాయిని పలికించటమే మిగిలింది. నోటితో
పలికించగలిగితేనే ఒక స్వరస్థాయిని వాయిద్యం పై వేయించగలం. గాత్రానికి వాయిద్యానికి
ఉన్న సామ్యవైషమ్యాల గురించి కూడ అప్పుడప్పుడే కాస్త అవగాహన వస్తోంది. వయోలిన్
నాదాల సుమధుర ధ్వని జీవితంలో మళ్ళీ అప్పుడప్పుడే ఉత్తేజాన్ని నింపుతోంది.
సరిగ్గ అదే సమయంలో ఎక్కడో విదేశం(....)
నుండి ఆచార్యగారి దగ్గర వయోలిన్ లో పీ.హెచ్.డీ చేయటానికి వచ్చాడతను. కనక
ఆచార్యగారి దగ్గర నా సహాధ్యాయి అయినాడు. అతనికి అప్పటికే పాశ్చాత్య సంగీతంలో మంచి
పట్టు ఉంది. అక్కడ వాళ్ళ దేశంలో అతను ప్రదర్శనలు కూడ ఇచ్చేవాడు. కర్ణాటకంలో కూడా
జ్ఞానం పొంది తులనాత్మక అధ్యయనం చేయాలని అతని ఆశయం. అతనికి సంగీతమంటే ఎంత ప్రాణమో
చెప్పటానికి మాటలు సరిపోవు.
అతనికి ఆచార్యగారి ఇంట్లోనే ఒక గదిలో బస
ఏర్పాటు చేశారు. ఆయన ఎట్లాగో అమ్మగారు పోయాక ఒంటరిగానే ఉంటున్నారు. వాళ్ళకు
పిల్లలు లేరు పాపం. ఒక్కరే ఉండటం కనక స్వయంపాకం చేసుకుంటారు. విశ్రుత్ వచ్చాక అతనే
వంట కూడా చేసి పెడతాననేసరికి ముందు అతన్ని శుద్ధిచేసి, సంస్కారం జరిపాక అప్పుడు ఒప్పుకున్నారు. విశ్రుత్ జన్మతః బ్రాహ్మణుడే అయినా,
అతనికి ఉపనయనాదులు జరిగినా ఏ అవగాహనా లేకపోవటం వల్ల అవి సాగలేదు. అందువల్ల ఆయనే
అతనికి పునః ఉపనయనం లాంటిది చేసి, దాని ప్రాముఖ్యం తెలియచెప్పారు. ఆచార్యగారి
దగ్గరే అతను సంధ్య వార్చటంతో పాటు అటువంటి చాలా పద్ధతులు నేర్చుకున్నాడు. శ్రద్ధగ
పాటించాడు కూడా. విశ్రుత్ కి భారతీయత గురించి, ఇక్కడి
సంస్కారాలు, పద్ధతులు, పరంపరల గురించి అవగాహన లేకపోయినా మంచి గౌరవభావం ఉండేది, కనక అతను వేటికీ అభ్యంతరం చెప్పలేదు. తనకు తెలిసినవి చెప్పేవాడు; తెలియనివి
అడిగి తెలుసుకునేవాడు. అనవసర విమర్శలు వెటకారాలు చేసేవాడు కాదు. ఎన్నడు దేనినీ
అవహేళన కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ చేయని అతని
భక్తిభావన ఆచార్యగారికి కూడా చాలా నచ్చేది.
కొద్దిరోజులకే ఆ ఇంట్లో పిల్లాడిలా
అయిపోయాడతను. చాలా మంచివాడు కావటంతో ఆచార్యగారు కూడ ఆనందపడ్డారు. పైగా ఆచార్యగారు
ఈమధ్య కచేరీలకు పోవటం మానేసి ఇంటి పట్టునే ఉంటున్నారు. విశ్రుత్ కి కావాల్సినంత
సమయం దొరికింది ఆయనతో గడపటానికి. ఇంక పండగే పండగ. దాంతో ఎప్పుడూ ఆచార్యగారిని
వదలకుండ చర్చలు చేస్తుండేవాడు. సంగీతం, సాహిత్యం, కళలు, భారతీయత, సనాతన ధర్మం,
పండగలు, పద్ధతులు, నమ్మకాలు, ఆచారాలు.. ఎన్నెన్నో అడిగేవాడు. ఆచార్యగారికి ఓపిక
ఎక్కువే కనక విపులంగ అన్నీ వివరించి చెబుతుండేవారు.
కొన్ని ఆచార్యగారు చెప్తే కొన్నింటిని
నేను వివరించేదాన్ని. అట్లా సంగీత పాఠాలతో పాటు ఈ ఆసక్తికరమైన చర్చలతో చాలా సమయం
అర్థవంతంగా గడిచేది. నిరర్థకత అంటే నాకే కాదు, విశ్రుత్
కి కూడా ఇష్టం ఉండదు. పనికిరానిమాట అతను ఒక్కటి మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు
మాట్లాడినా అది సంగీతమో, సాహిత్యమో, కళలో, భాషనో, వంటావార్పో లేక ఏ సంప్రదాయాన్ని
గురించో ఉండేది.
విశ్రుత్ తన దేశంలో ఉండంగ కొంతకాలం
పిల్లలకు వయోలిన్ నేర్పిన అనుభవం ఉంది. అందుకని ఆచార్యగారిని అడిగి ఆయన దగ్గరకు
వచ్చే పిల్లలకు పాఠాలు చెప్తానని బాధ్యత తీసుకున్నాడు. ఆచార్యగారు అతను తమ ఇంట్లో
ఉంటున్నందుకు, తింటున్నందుకు ఏమీ తీసుకోనన్నారుట. నేర్పటం కూడ ఊరికెనే నేర్పుతామన్నారుట.
అతనికి అది చాలా గొప్ప గుణంగ అనిపించినా తను అట్ల ఊరికే ఉండి తింటూ నేర్చుకోవటం
నచ్చలేదు. కనక ఈ ఏర్పాటు చేసుకున్నాడతను. పైగా నేర్చుకున్నది నేర్చుకున్నట్టు
నేర్పిస్తుంటే పట్టు కూడ వస్తుంది కదా.
ఇక ఆ పిల్లలను అతను ఇట్టే ఆకర్షించాడు.
విశ్రుత్ తల్లి ఇంటి వద్దే ఉండి క్రెచ్ నడుపుతుందిట. అందుకే అతనికి చిన్నపిల్లల
గురించి చాలా తెలుసు. తండ్రి అక్కడ ఒక కంపెనీలో పని చేస్తూ దగ్గరలో ఉన్న
కృష్ణుడిగుడిలో పూజారిగ పని
చేస్తున్నాడు. కనక ఆ దేవదేవుడి గురించి కాస్త తెలుసు ఇతనికి. పిల్లలకు కృష్ణుడి
కథలు చెప్పేవాడు అప్పుడప్పుడు. అతను అక్కడి ఇంగ్లీషు యాసలో మాట్లాడటం, వయోలిన్
పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ కూడా వాయించగలగటం వారికి నచ్చింది. మన
సంప్రదాయంగ వయోలిన్ పట్టే విధానం అంటే హాయిగ ఒకచోట కూర్చుని, ఎడమ భుజం మీద పెట్టి
కిందిగా వాల్చి, ఎడమ తొడ ఆధారం చేసుకుని, కుడి చేతితో కమాన్ పట్టి వాయిఁస్తాము.
కానీ వాళ్ళు భుజం మీద నిటారుగ పెట్టి, శరీరానికి 90 డిగ్రీల కోణంలో చిబుకం ఆధారంగ
పట్టి, నిలబడే వాయిఁస్తారు. నాకు అది వింతగ అనిపించేది. అది చూసి పిల్లలు కూడ
'ఎట్ల ఎట్ల' అంటూ అడిగి అట్ల పట్టుకోవటం నేర్చేసుకొన్నారు. అతను వాళ్ళకు వాళ్ళ
స్థాయికి దిగి వయోలిన్ మెళుకువలు భలేగా నేర్పేవాడు. అని చూచి నేను కూడా నా వయోలిన్
విద్యలో అభివృద్ధి సాధించాను.
నాదగ్గర అందుకు బదులుగా విశ్రుత్ తెలుగు
నేర్చుకునేవాడు. అతను పుట్టటం, పెరగటం అంతా విదేశాల్లోనే అయ్యేసరికి అతని తెలుగు
జ్ఞానం చాలా తక్కువ. అందుకని ఆచార్యగారిని మొదట్లోనే తెలుగు నేర్పమని కోరితే ఆయన ఆ
బాధ్యత నాకు అప్పగించారు. అట్ల అతనితో మొదటిసారి నేను మాట్లాడింది ఈ ఉద్దేశం
కోసమే. సరే, నెమ్మదిగ నేర్పాను. ఇంక నా దగ్గర ఆచారవ్యవహారాలతో పాటు గాత్రం
నేర్చుకునేవాడు. అతనికి వయోలిన్ మూలకంగా కొంత పాడటం వచ్చినా పెద్దగా పాండిత్యం
లేదు. నేనేమో అప్పటికే సంగీతంలో బి.ఏ కూడా అయిపోయి ఉండటం వల్ల అతనికి చక్కగా
త్యాగరాయ పంచరత్నకృతుల వరకు నేర్పేశాను, సంవత్సర కాలంలోనే.
"అబ్బ.. ఈ ఇంట్లో ఏదో విశేషం ఉంది.
నేనెంత మొద్దునో. అయినా ఎన్ని నేర్చుకుంటున్నానో..!" అని తెగ ఆనందపడిపోయేవాడతను.
నేర్చుకోవడమంటే అతనికి ఉన్న ఆసక్తి అది.
ఆచార్యగారిది పాతకాలం నాటి ఇల్లు. పెద్ద
అరుగులు, ఎత్తైన గడపలు, పెద్దపెద్ద చెక్కకిటికీలు, నగిషీ పని చేసిన లావు లావు
చెక్క తలుపులు.. బాగుండేది. అందులోనే ఒక సంగీత విద్యాలయం, రిసర్చి సెంటరు,
చిన్నపాటి సంగీత పుస్తకాల గ్రంథాలయం, పాటలు, వస్తువుల సంగ్రహాలయం కూడా ఇమిడి ఉన్నాయి. ఆయన దగ్గర చాలా రకాల తాళపత్రగ్రంథాలు
ఉన్నాయి. ఎవరెవరో ఇచ్చిన మంచి మంచి పాత పుస్తకాలు ఉన్నాయి. వాటి పునర్ముద్రణలు కూడ
కావు ఇప్పుడు. ఎవరు చదువుతున్నారని..? అవి ఏ పాత గ్రంథాలయాలలోనో తప్ప లభ్యములు
కావు. అమ్మగారు బ్రతికి ఉండంగ ఈ ఇంటిని ఒక సంగీతం పరిశోధన కేంద్రంగ మలచాలనే ఆశయంతో
అవన్నీ సంగ్రహించారట ఆమె. దాంతో తాను బ్రతికి ఉన్నంతకాలం అవి తనతోనే ఉండాలి ఆయన ఏ
గ్రంథాలయానికీ వాటిని దానం చేయలేదు. ఇప్పటికీ వాటిని ఒక్కొక్కటిగ అవసరాన్ని బట్టి
చదువుతూ ఉంటాడాయన. ఆయన సంగ్రహించిన వయోలిన్ లు కూడ చాలా ఉన్నాయి. ఆయనకు వయోలిన్
తప్ప మరో లోకం ఉండదు. ఎవరైనా అడిగితే చాలు, దాని పుట్టుపూర్వోత్తరాలు ఓపిగ్గా
చెప్తారు. ఆయన ప్రభుత్వ సంగీత పాఠశాలలో పని చేసేటప్పుడు ఆయన దగ్గర పరిశోధన
చేసినవారి గ్రంథాలు కూడా పొందిగ్గా సంగ్రహించి ఉంచుతారు.
ఆయన భార్య గొప్ప వైణికురాలు. ఆమె
గతించిన పదేళ్ళ తర్వాత కూడ వీణావాదనంలో ఆమె అంత మధురంగ వాయించటానికి పోటీలు పడతారు
జనాలు. ఆమె బ్రతికి ఉండంగా భార్యాభర్తలు ఇద్దరూ కలసి కచేరీలు చేసేవారు. చేతనైనంతగా
ఆ వాగ్దేవి సేవ చేతులారా చేసుకున్నారు. ఆమె పోగు చేసిన చిన్నాపెద్దా వీణలు, వారికి వచ్చిన రకరకాల అవార్డులు, వారి సన్మాన
పత్రాలు, కానుకగా వచ్చిన మొమెంటోలతో ఒక గదంతా నిండిపోయి ఉంటుంది.
విశ్రుత్ వాటి మీద తేదీలు చూసి, వివరాలు
వ్రాసి, ఒక పద్ధతి ప్రకారం వాటిని ఒక చిన్నపాటి ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాడు.
విశ్రుత్ ప్రణాలికలో లోపాలు ఉంటే సర్ది- ఇది ఇట్ల చేద్దాం అది అట్లా పెడదాం - అంటూ
తోడ్పాటు అందించాను. దాంతో ఆ ఇంటికే కొత్త అందం వచ్చింది. ఆచార్యగారి పుస్తక
సంగ్రహం అంతా పద్ధతిగా విభజించి, నెంబర్లేసి, కేటలాగ్ చేసి ఓ గ్రంథాలయంగా చేయలన్నది నా ఆలోచన. నేను అక్కడ చేరినప్పుడే ఆ పని
మొదలు పెట్టాను. దానికి అతను పూర్తి కార్యరూపాన్ని ఇచ్చాడు. అందుకు ఆచార్యగారు కూడ
సహకరించారు. అట్ల ఆయనతో కలిసి మాట్లాడుతూ పని చేస్తుంటే ఎంత బాగుండేదో. ఎన్నో మంచి
మంచి సంగతులు చెప్పేవాడాయన. అప్పటి సంగీతం సంప్రదాయం, కచేరీలు, జనాల ఆదరణ, వాళ్ళ
ఇంటి పరిస్థితులు, తాము ఎదుర్కొన్న కష్టనష్టాలు.. ఇట్ల ఎన్నో. ఒక్కొక్కసారి
విశ్రుత్ ఆచార్యగారు కలిసి నేను కాలేజ్ నుంచి వచ్చేసరికే ఏదో తాళపత్రం పెట్టుకుని
పరిష్కరిస్తూ కూర్చునేవారు. నేను వెళ్ళంగనే,
"ఋత కూడా మంచి విశ్లేషకురాలు.
జరిగే పనిలో ఆసక్తిగా పాలుపంచుకోవటమేకాక తన వంతు కొత్తకొత్త ఆలోచనలను పంచి ఇవ్వటం
కూడ చేతవ్వు." అని పని అప్పచెప్పేవారు. ఆయన చెప్పింది నిజమే కాబోలు. అందుకే
నాకు ఆచార్యులగారు ఇచ్చిన కొద్దిపాటి శిక్షణ తోనే పరిష్కరణ పద్ధతి కూడ బాగా వచ్చేసింది.
నేను వాటిని పరిష్కరించి వ్రాస్తుంటే విశ్రుత్ నా సహాయంతో కంప్యూటరులోకి
మాన్యుస్క్రిప్ట్ టంకణ పద్ధతి ప్రకారం ఎక్కించేవాడు. ఎవరో కంప్యూటరు కోవిదుడు
దొరికితే అతనిచేత కావాల్సిన సాఫ్టువేర్లన్నీ అడిగి వేయించుకున్నాడు.
"’మీ ఇద్దరికి నేనూహించిన దానికన్నా
మంచి విమర్శనాత్మక బుద్ధి ఉంది. ఎంతైనా కుంటుంబాన్ని బట్టి విలువలు
వస్తాయి."’ అని మెచ్చుకున్నాడు ఆచార్యగారు.
ఆయనకు మా కుటుంబమంటే చాలా అభిమానం. మాది
చాలా సంప్రదాయమైన కుటుంబం. తాతగారు నిత్యాగ్నిహోత్రుడు, ఆయుర్వేదం డాక్టరు కావటంతో
ఏవైనా శ్రోత్రియ పద్ధతలు గురించి, ఆయుర్వేదం గురించి సమాచారం కావాలంటే నేను గబగబ చెప్పేసరికి విశ్రుత్ కి కూడ
ఆశ్చర్యం వేసేది. అతనికి చిన్నప్పటినుంచీ బాగా తలనెప్పి సమస్య ఉందట. దానికోసం మా
తాతగారు బాగా మందిస్తారు అని ఆచార్యగారు చెబితే నాతోపాటు మా ఇంటికి వచ్చాడు.
తాతగారిని, నాన్నగారిని కలిసి మాట్లాడాడు. తాతగారు అతనికి మందిచ్చారు. కొద్ది
కాలంలోనే అతనికి తల నెప్పి సమస్య నిజంగనే పూర్తిగ తగ్గిపోయేసరికి ఆశ్చర్యపోయాడు.
"మీరు చాలా అదృష్టవంతులు. ఇక్కడే
పుట్టి ఇక్కడే పెరిగి, ఇంతటి మహోన్నత విజ్ఞానాన్ని, ఈ పద్ధతులను పూర్తిగ
పోతపోసుకున్నారు. ఎంతో అమూల్యమైన జ్ఞానం అవలీలగ జీర్ణించుకున్నారు. మీ జీవితమే
విజ్ఞానమయం. ఈ దేశంలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్క టాపిక్ తీసుకుని శోధన చేసి వ్రాయటం
సాగించినా జీవితాంతం ఆ అధ్యయనం పూర్తి కాదేమో." అన్నాడు.
"అది నిజం. ఇంకా పూర్వీకులైన
పెద్దలు వ్రాసి వెళ్ళిన దాన్ని చదవటమే పూర్తి కాలేదు. మనం వ్రాయటం మొదలు పెట్టే
స్టేజి ఇంకా రాలేదు." అన్నాను నేను.
మొత్తానికి అతను ఉన్న రెండు సంవత్సరాల
కాలం నాకు కూడ బాగా ఉపయోగకరంగ ఉండింది. నాకు తెలిసిన విషయాల ఉపయోగం నాకే తెలియదు
అన్నాళ్ళూ. ఇవన్నీ మామూలు విషయాలే కదా, వీటిలో ఏం ఉంది అనుకునేదాన్ని. కానీ అతని
దృష్టితో చూస్తే వీటి ప్ర్రాముఖ్యం నాకూ అర్థమైంది. భారతీయుల విజ్ఞానానికి
పాశ్చాత్య అధ్యయన విధానం కూడా కొంతవరకు తోడైతే చాలు.. ఇంకా ఎన్నో రహస్యాలను
భేదించవచ్చు. ఇదే సమన్వయం గురించి కాబోలు - స్వామీ వివేకానంద వంటి మహాపురుషులు
చెప్పారు.
ఎంతో దూరం నుంచి భారతదేశానికి
వచ్చినందుకు తీర్థయాత్రలు చేయాలని, గొప్పమహానుభావులను కలవాలని అతనికి ఉండేది.
ముఖ్యంగ సంగీతానికి సంబంధించినవారిని కలిసి మాట్లాడాలనుకునేవాడు. తెలుగు
ప్రాంతాలలో పెద్ద విద్వాంసులెవరినైనా కలుస్తుంటే భాషకోసం నన్ను తోడు
తీసుకువెళ్ళేవాడు. అక్కడ సంగీతపరంగ
కఠినమైన భాషకు సంబంధించి ఏదైనా సహాయం కావాలంటే చేసేదాన్ని. అతనికి సరిగ్గ
మాట్లాడటం రాదు కదా మరి. భాషాంతరం చేయటానికి నా సహాయం అతనికి నిత్యం పడుతుండేది.
అతను ఇక్కడ కలిసిన ప్రతీ వ్యక్తితో మాట్లాడిన మాటలన్నీ వారిని అడిగి రికార్డు
చేసుకునేవాడు. అతను కలిసిన వాళ్ళందరి ఫోటోలు తీసుకునేవాడు. చక్కగ ఒక ఆల్బం
చేసుకున్నాడు. దాన్ని అక్కడకు వెళ్ళాక జ్ఞాపకం వచ్చినప్పుడు చూసుకుంటాడట. వారి
గురించి, ఆచార్యగారు చెప్పిన ప్రతీ విషయంతోపాటు ఆయన గురించి తన అనుభవాన్ని శ్రద్ధగ
వ్రాసుకునేవాడు. అది నాకు చూపితే ఏవైనా అందులో అతనికి అర్థం కాని అంతరార్థాలు నేను
విప్పి చెప్పేదాన్ని. "ఏంటి, ఆమాటలో అంత లోతు భావం ఉందా?" అని
ఆశ్చర్యపోయేవాడు. అతనికి ఏదైనా లోకల్ సమాచారం కావాలంటే ఇవ్వటం, ఎక్కడైనా అతని పరిశోధనకు సంబంధించిన గ్రంథాలయానికి వెళ్ళాలంటే తీసుకువెళ్ళటం,
దగ్గరి ప్రాతాలలో ఎక్కడైనా కచేరీ అయితే కలిసి వెళ్ళటం.. సాగేవి.
ఒకసారి ఏదో సందర్భంలో విశ్రుత్ తో
వెళుతుంటే హసిత చూసిందిట. తర్వాత
కలిసినప్పుడు అడిగింది- 'ఎవరు, ఏంటి,' అని. నేను ఆ ప్రశ్న లోని ఇతర అంతరార్థాలు గ్రహించలేక అన్నీ ఉన్నవి ఉన్నట్టుగ
వివరించాను. అతని వ్యక్తిత్వం, ఆశాయలు అన్నీ!
చాలాకాలానికి అది నన్ను కలిసి సరిగ్గ ముఖం చూసి మాట్లాడిన మొదటి సందర్భం అది మరి.
ఏం చేసేది..? ఇక విన్నది మొదలు కాసేపు- "’అంటే ప్రేమన్నమాట’!" అని
ఏడ్పించింది. నాకు ఆమె అట్ల మాట్లాడటం నచ్చకపోయినా స్నేహితురాలే కదా, ఏదో ఆట పట్టిస్తోందిలే అనుకుని- అదేం కాదని నవ్వి ఊరుకున్నాను. తర్వాత కలిసిన
ఒకటి రెండు సందర్భాల్లో కాలనీలో పిల్లల కచేరీ అప్పుడు, ఒకసారి ఆచార్యగారింటికి ఏదో పని మీద తను వచ్చినప్పుడు మళ్ళీ అట్లాగే అతనితో
నన్ను జోడించి ఏడ్పించింది. నాకు కొంచెం చివుక్కుమన్నా నవ్వి కాదని ఊరుకోక
తప్పలేదు.
సరే ఒకటి రెండుసార్లు ఇంటికి
తీసుకువెళ్ళే సరికి తాతగారికి నచ్చాడట అతను. అమ్మా నాన్నా కూడ వ్యవహారం చూసి,
నచ్చి, అతను వెళ్ళిపోయే ముందు భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడని, అతని
ఆశయాలేంటి అని సామాన్యంగా కనుక్కున్నారు. అతనికీ నేను ఇష్టమైతే ఇద్దరికీ వివాహం
తలపెట్టాలని వారి ఉద్దేశం. ఈ సంగతి నా వరకు రాకుండానే పోయింది. ఎందుకంటే అతను తన
ఆశయాలన్నీ విపులంగ చెప్పాడుట. అందులో ఎక్కడా వివాహం తలపే లేదని స్పష్టంగ వీరికి
అర్థమైంది.
వయోలిన్ స్కూలు పెట్టుకుని, ఒక మంచి సంగీత పరిశోధనా కేంద్రం ఏర్పాట్లు కూడా కొంత మొదలు పెట్టుకున్నాడు.
అప్పటికే, వాళ్ళ దేశంలో ఉన్న భారతీయతా ప్రియులతో
ఒక చిన్న సంగీత సంస్థ రిజిస్టర్ కూడా చేయించాడు. అది ఎంతో ఉత్సాహంగా సాగుతోందక్కడ.
తిరిగి వెళ్ళినాక తనే వాటిని చూసుకోవాలి. దానికి అతనికి పూర్తి జీవితకాలం
పడుతుంది.
అతనికి వేరే ఆశయాలు కూడ చాలా ఉన్నాయి.
అక్కడి ప్రవాస విదేశీయులకు భారతీయత విలువలు తెలియచెప్పాలని అతని ఆరాటం. వాళ్ళ
నాన్నగారు ఆ పని కొంత చేస్తూనే ఉంటాడు కానీ ఒక మిషనుగా పెట్టుకోలేదు. ఇతను దాన్నే
తన జీవిత ధ్యేయంగ చేసుకోవాలనుకున్నాడట. అందులో భాగంగ ఆ సంస్థ ప్రతిష్ఠాపన
జరిగింది. ఇప్పుడు దానికి మంచి స్పందన లభించింది. చిన్నచిన్న ఫంక్షన్లకు భారతీయుల
ఇళ్ళల్లో ఇప్పుడు ఆ ప్రదేశ సంగీత కార్యక్రమాలు కాకుండ వీరి సంస్థ నుండి పిలిచే
కచేరీలు ఏర్పాటు చేయిస్తున్నారట. ఇతను మరి ఇద్దరు ముగ్గురు వయోలిన్ విద్వాంసులు
కలిసి ఆ సంస్థను స్వచ్ఛందంగా నడుపుతున్నారట. కార్యక్రమాలకు రానుపోను చార్జీలు తప్ప
వారేమీ ఆర్థిక పారితోషికం ఆశించరట. కనీసం మన వాళ్ళ ఇళ్ళల్లోనైనా మన సంప్రదాయ
సంగీతం వినిపించాలని ఆ దేశం లోనే సంగీత విద్వాంసుల అందరి వివరాలు సేకరిస్తూ ఒక
గ్రూపు తయారు చేస్తాడట. ఇప్పటికైతే రిసర్చి కోసం ఇక్కడికి రావటం వల్ల ఆ పనులు వెనక
బడ్డాయిట. మావాళ్ళ ప్రశ్న వెనక ఆంతర్యం తెలియని విశ్రుత్ తన ఆశయాలన్నీ విపులంగ
చెప్పాడట వాళ్ళతో. ఈ సంఘటన జరిగిన చాలా కాలానికి ఏదో స్సందర్భంలో పొరపాట్న అమ్మ
నాతో చెప్పింది. నేను ఆశ్చర్యపోయాను.
తర్వాత అప్పటికి నేను నా పీజీ పూర్తి
కావడంతో ఆచార్యగారి ప్రోత్సాహంతో పీ హెచ్ డీలో చేరి అందులో బిజీ అయిపోయాను. అటు
ఆచార్యగారి దగ్గర వయోలిన్ పాఠాలు నేర్చుకోవటం, నేర్పించటంలో బిజీ. ఇటు ఇంట్లో
ఉన్నంతసేపు ఏవో ఒక పనులు హడావుడి.. మరో పక్క సంగీతకళాశాలలో జూనియర్లు ప్రైవేటు
చెప్పమని గోలలు. అటు పండగలకో పబ్బాలకో గుళ్ళలో, ఏవో ఓ త్యాగరాయ ఉత్సవాలలో కచేరీ
కార్యక్రమాలు.. డబ్బు కోసం, పేరు కోసం కాదు కనక, ఆ కార్యక్రమాలకు అడ్డు చెప్పద్దని
ఆచార్యగారు ఇంట్లోవారికి నచ్చచెబితే వాళ్ళు అంతవరకు అడ్డు చెప్పలేదు. పైనుంచి
కొత్తగ ఆచార్యగారికి వచ్చిపడిన కర్ణాటక సంగీత రికార్డింగు ప్రాజెక్టు కార్యక్రమం.
దాని ఆరంభం నుంచి అంతం వరకు నన్ను తమ వెంటే ఉండాలని ఆయన ఆదేశించారు.
వీటితో విశ్రుత్ నా మనసులో ఏమూలకో
వెళ్ళిపోయాడు. హసిత ఇప్పుడు పెద్ద గాయనిగా పేరు తెచ్చుకుంది. ఇంకా జాతీయస్థాయిలో
ఎదిగే కార్యక్రమంలో మెడలోతు వరకు పడిపోయి నాకు పూర్తిగ దూరమైపోయింది. మొదట్లో
అంతరాలు రాకుండా నా వంతు ప్రయత్నం నేనే చేసినా కానీ విశ్రుత్, వయోలిన్ పాఠాలతో నాకూ తలమునకలై పోయి ఎటో అటు పోవటం, రావటం ఎవో ఒక కార్యక్రమాలతో కాలం నిండిపోయింది. అందునా విశ్రుత్ చాలా
ఉత్సాహవంతుడు కావటంతో పిల్లల చేత కాలనీ స్టేజి మీద అవో, ఇవో కచేరీలు చేయించటం, అందుకు శిక్షణనివ్వటం, వేరే పిల్లలను, ఆ పిల్లల తల్లిదండ్రులను ఆకర్షించుకోవటం లాంటివి చేసేవాడు. ఇప్పుడు అతను వెళ్ళిపోయాక ఆ పిల్లల భారమంతా నేనే
చూసుకోవాల్సి రావటం కూడా హసిత మీద, విశ్రుత్ మీద దృష్టి పోకపోవటానికి ఒక కారణం
అయింది. పాపం, ఆచార్యగారు, ఒక్కరే అంత భారాన్ని మోయలేరు కదా. ఇప్పుడు హసిత అభిజ్ఞాతుల
లిస్టులో కూడ నేను ఉండటం మానేశాను. ఎవరి జీవితాలు వారి పనులలో బిజీ అయిపోయాయి.
No comments:
Post a Comment