"అయితే ఏం
నిర్ణయించుకున్నావు..?"
"నిర్ణయం చెప్పవలసింది నువ్వు.
నేను కాదు." ప్రణవి స్థిరంగ అంది.
సుమన్ చిరాకుగా, "అంటే నేను ఇంత
విడమరచి చెప్పినా నీకు అర్థం కావటం లేదన్నమాట. నీ జీవితం నాశనం చేసుకోవటానికే
నిశ్చయించుకున్నావన్నమాట." అన్నాడు.
ప్రణవి నిశ్చలంగ చూస్తూ, "ఒకరికి
జీవితాన్ని ఇవ్వాలి అనుకోవటం జీవితం నాశనం చేసుకోవటం కాదు కదా.." అంది.
"అంటే నేను దూరమైపోయినా నీకేం
ఫరవాలేదనేగా..?"
ప్రణవి ఏ మాట్లాడకుండ దూరంగ ఆకాశం వంక
చూస్తూ కూర్చుంది. మనసు పడినవాడు, జీవితభాగస్వామిగా కోరుకున్నవాడు దూరమైతే ఎవరికి
మాత్రం బాధ వేయదు..? ఇది బాధ కాదు, గుండెకోత.
"ఏఁ..? ఏం మాట్లాడవు.?"
"నువ్వు నాకు దూరం కావాలన్నది నా
అభిమతం కాదు. అది నీ సంకల్పం."
"మా అమ్మా-నాన్నా అనుకున్నట్టు
నువ్వు మీ అక్కను వదిలేస్తే మనం ఎవరికి ఎవరం దూరం కానవసరం లేదు కదా..?"
"దానికి సమాధానం నేను అత్తయ్యవాళ్ళకూ
చెప్పాను, నీకూ చెప్పాను. కావాలంటే మళ్ళీ చెప్తున్నాను విను. నీకోసం అక్కను
వదులుకోవటం అంటే నా బాధ్యత నుంచి నేను పారిపోవటం. అది అమానుషం బావా.."
సుమన్ కోపంతో ఎర్రబడిన ముఖం వేసుకుని, దానికి
ప్రతిబింబంలా ఉన్న ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు. ప్రణవి లోలోపల ఎంతో వేదనను
భరిస్తోందని అతని మనసుకు సందేశం చేరుతోంది. ఆమె మౌనంలో వేయి భూగోళాల బరువు ఉంది.
"అయితే మనం శాశ్వతంగ దూరమైపోవలసిందేనా..?"
సుమన్ నిస్తేజంగ చూసి అడిగాడు.
"అక్కర్లేదు. నువ్వు కావాలనుకుంటే
ఆ అవసరం రాదు.."
సుమన్ ఆశగ చూశాడు. "ఎట్ల..?"
"ఎట్ల ఏం ఉంది..? ఒకసారి ఆలోచించి
చూడు.. మన పెళ్ళికి అడ్డం మా అక్క కాదేమో.. మీ నాన్నా అమ్మేలేనేమో."
"అంటే..?" సుమన్ నుదురు
చిట్లించాడు. "...అంటే మా అమ్మా నాన్నా మన పెళ్ళిని చెడగొడుతున్నారనా నీ
ఉద్దేశం..?"
"కాక? నేను పెట్టానా ఆ
షరతు..?"
"అంటే వాళ్ళ షరతుతోపాటు వాళ్ళనూ
పక్కన పెడితే మన పెళ్ళవుతుంది. అంటే నేను కుపుత్రుడిని కావాలన్నమాట..."
"తప్పదు. నేను చెడ్డ చెల్లెలినైనా
కావాలి, నువ్వు చెడ్డ కొడుకువైనా కావాలి. నేను కాలేకపోతున్నాను. నువ్వు
అవ్వగలిగితే ఆటంకం తొలగిపోతుంది."
"నీకు ఈ మాట చెప్పటానికి సిగ్గుగా
లేదా..? నేను లేకుండ వాళ్ళు ఇద్దరూ ఎక్కడికి పోతారు..? ఒక్కగానొక్క కొడుకును.
గాలికి వదిలేయనా వాళ్ళను..? ఆడపిల్లగా ఆ మాట చెప్పటానికి నీకు మనసెట్ల
వచ్చింది..?"
ప్రణవి పేలవంగ నవ్వి, "ఆడపిల్లగా
ఆలోచించాను కాబట్టే అక్క గురించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు మీ అమ్మా నాన్నా
ఎంతో నాకు మా అక్క అంతే కాదా..?" అంది.
"కానీ తల్లితండ్రులను చూసుకోవటం
కొడుకుగా నా బాధ్యత. అక్కను చూసుకోవటం నీ బాధ్యతేం కాదే..! ఐ మీన్ నీకు
నిర్వర్తింపబడిన విధి ఏం కాదే.."
"ఆ మాటకు వస్తే నన్ను పెంచి పెద్ద
చేయటం కూడా ఆమె బాధ్యత ఏం కాదే..! కానీ మా అమ్మ పోయాక, నాన్న మతి చలించి దేశాలు
పట్టుకుని వెళిపోతే, అక్కే కదా నన్ను పోషించి, చదివించి, మనిషిని చేసింది..! అదే
కనక ఆరోజు తను నన్ను గాలికి వదిలేసి ఉంటే ఇవాల్టి రోజున ఇంత పెద్ద ఆఫీసులో మానేజర్
ని అని చెప్పుకునే చెప్పుకునే అవకాశం కలిగి ఉండేదా..?"
సుమన్ దగ్గర ఆ మాటకు సమాధానం లేదు.
ప్రణవి కోసం మైత్రేయి వదిన ఎన్ని కష్టాలకు ఓర్చిందో, ఎన్ని త్యాగాలు చేసిందో తన
కళ్ళతో చూశాడు. ఇంటికి మగదిక్కు లేకుండ, పెద్ద దిక్కు లేకుండ అంత చిన్న వయసులో అంత
పెద్ద బాధ్యత నెత్తిన వేసుకుని, తట్టుకుని కింద పడకుండ నెట్టుకు రావటం సామాన్య
విషయం కాదు. తన అంతరాత్మకు తెలుసు- మైత్రేయికి ఈ సమయంలో ఆశ్రయం ఇవ్వాలనే ప్రణవి
నిర్ణయం ఎంత సబబైనదో..!! అయినా ఏదో అసమంజసం. దాని కోసం ప్రణవి తనను దూరం
చేసేసుకుంటోంది అనేదే భరింపరాని వాస్తవం.
"చీకటి పడే వేళైంది. ఇంక నేను
వెళతాను.." ప్రణవి లేచి నిలబడింది. సుమన్ లో కొంచెం నిరాశ, కొంచెం
అసంతృప్తి..
"సో, నువ్వు నా జీవితంలో నుంచి వెళిపోతున్నట్టేనా..?"
దిగులుగా అడిగాడు.
"నువ్వు ద్వారం మూసేస్తే నేను
చేయగలిగింది ఏం లేదు.. మా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి. వివాహ బంధంతో
పనిలేని ఒక స్వచ్ఛమైన అభిమానం నీ పట్ల నా మనసులో ఎప్పుడైనా చెక్కుచెదరదు. నా
అత్యంత సన్నిహిత స్నేహితుడిగా నీ స్థానం ఎప్పుడూ నిలిచే ఉంటుంది." మనసు
దిటువు చేసుకుంటూ అంది ప్రణవి.
"స్నేహితుడిగా మాత్రమేనా..?"
"ఎందుకు అనవసరమైన మాటలతో నీ మనసు
పాడు చేసుకుంటావు..? కలలు కనే ముందే అవి విరిగినప్పుడు కావాల్సిన ధైర్యం పోగు చేసి
పెట్టుకోవాలి. అది చేయలేనప్పుడు కలలు కనద్దు."
"ఎంత నిష్ఠూరంగ
మాట్లాడుతున్నావు..?"
"వాస్తవం మాట్లాడుతున్నాను. కలలు
కనమని ఎవ్వరూ మనిషిని నిర్దేశించలేదు. కర్తవ్యం నిర్వహించమన్నారు. ధర్మం
ఆచరించమన్నారు. మనమేమో ఓపికగా చేయకూడనివి చేసి ఒంటి మీదకు తెచ్చుకుంటాము.
చేయవలసినవి విడిచి ప్రశాంతత పోగొట్టుకుంటాము."
సుమన్ అసహనంగ, "భగవంతుడు నొసట
రాయనిది ఏదీ దొరకదు. ఆయన నైష్ఠుర్యానికి మనం నిర్దోషులమై కూడా బలైపోతాము.."
"మనం చేసినదానికి భగవంతుడిని ఎందుకు
తిడుతూంటామో నాకెప్పుడూ అర్థం కాదు. ఆయన చెప్పలేదు కదా, నిన్ను నన్నూ పెళ్ళి
గురించి కలలు కనమని..? కనేటప్పుడు తెలియదా, భవిష్యత్తులో ఇది ఎటైనా మలుపు
తిరగవచ్చని..? బుద్ధి ఆ మాట నీతో చెప్పనేలేదా..? వేయి సార్లు చెప్పి ఉంటుంది. కానీ
మనం వినము. ఒక్క మాట మాత్రం నిజం. మనసు వెనక పరిగెత్తితే మార్గం కానరాదు. కనక
కర్తవ్యం ఏంటో తెలుసుకుని అది ఆచరించు. అందరికీ శ్రేయస్కరం అదే. వరమిచ్చే దేవుణ్ణి
ఊరికే తిట్టి మనశ్శాంతి మార్గం పోగొట్టుకోకు." ఆ మాట అంటూనే ఆమె లేచి
నిలబడింది.
ఆమె తత్త్వం తెలిసిన సుమన్, "సరే,
వదిలేయి. రాత్రికేనా ప్రయాణం..?" అనడిగాడు తనూ లేచి నిలబడుతూ.
"ఊఁ.. రేపే అక్కను పిల్లలను
తెచ్చేస్తున్నాను."
"తోడు రావాలా..?"
ప్రణవి నిర్లిప్తంగ నవ్వి, "వద్దు.
ఇంక నాది ఎటైనా ఒంటరి ప్రయాణమే. ఎంత దూరమని తోడు వస్తావు..? నా వైపు నువ్వు వేసే
ప్రతి అడుగు అంతమేర నీ తల్లిదండ్రుల నుంచి నిన్ను దూరం చేస్తుంది. నేను మా అక్క
వంక వేసే ఒక్కొక్క అడుగు నీనుంచి నన్నూ అంతే దూరం తీసుకుపోతుంది. ఉంటాను
నేస్తమా..!" అనేసి అక్కడి నుంచి కదిలింది, కళ్ళు తుడుచుకుంటూ.
సుమన్ ని దాటి వేస్తున్న మొదటి అడుగు
చాలా బరువుగా తోచింది. ఇక నుంచి ఈ ఒంటరి అడుగులలో కొరతా, వెలితీ అలవాటు చేసుకోక
తప్పదు. ఊహ తెలిసిన దగ్గరి నుంచీ కలిసి ఏడడుగులు వేయాలని కలలు కన్నారు. తీరా కలిసే
వేళకు దారులు వేరైపోయాయి. విచిత్రమేమంటే, దోషం ఎవరిదీ కాదు. విధిది..! అంతే.
ఆ రాత్రి ప్రణవి ఒంటరిగానే ప్రయాణం
కట్టింది మైత్రేయి దగ్గరకు. కదిలే రైలుతోపాటు ఆమె ఆలోచనలూ కదిలాయి.. కానీ మందుకు
కాదు, వెనకకు.
*
"ఇంకా ఎన్నాళ్ళని పెళ్ళీ పెటాకులు
లేకుండ ఇట్ల బ్రతుకు ఈడుస్తావే మైత్రీ...? ఇన్నాళ్ళు దాని చదువు కానివ్వమన్నావు.
ఇప్పుడు అది ఉద్యోగం కూడా సంపాదించేసింది. ఇదిగో.. వీడికి కూడా ఉద్యోగం ఖాయం
కాంగనే ఇద్దరికీ ముడి పెడతాను. ఆ బాధ్యత నాది. నీకోసం అన్ని విధాలా సరిపోయే
సంబంధం. మనకు బాగా తెలిసినవారేను.. ఒప్పుకోవే..."
ఈమాటే మాటిమాటికీ చెప్పి మొత్తానికి
అక్కను ఒప్పించటంలో సఫలమైంది అత్తయ్య.
కానీ తను పెళ్ళి చేసుకుని వెళిపోతే
నేనెక్కడ ఉంటానని అక్కయ్య భయపడితే నాకు కంపెనీవారే క్వార్టరిస్తారని, ఈలోపు మా
స్నేహితురాలితోపాటు ఆమె గదిలో ఉంటానని చెప్పి నచ్చచెప్పింది తను.
ఎట్లగో మొత్తానికి కష్టం మీద సమాధానపడి
అన్ని విధాలా ఈ చెల్లెలి సంతోషం చూసుకున్నాకే అక్క పెళ్ళి పీటలెక్కింది.
అత్తగారువాళ్ళు మంచివారేనని, తనను బాగా చూసుకుంటున్నారని ఎంతో సంబరపడిపోయింది.
అతను కూడా తనంటే ప్రాణం పెడతాడని గర్వంగ చెప్పింది. ఆ మాటే నిరూపిస్తూ ఏడాదిలోపే
చక్కని ఇద్దరు కవల పిల్లలకు తల్లైంది కూడా. ఇక్కడ చూసేవారెవరూ లేరని, కానుపు కూడా
అత్తగారు వాళ్ళే చూసుకున్నారు. తను మధ్య మధ్య వెళ్ళి చూసి వస్తూనే ఉంది. ఈలోపు
సుమన్ కి ఏదో ఎమ్మెన్సీ లో ఉద్యోగం దొరకటం, వారు అతనిని అమెరికా పంపటంతో తన పెళ్ళి
వాయిదా పడింది. ఈ ట్రిప్ వల్ల చాలా లాభం జరుగుతుందని, మంచి భవిష్యత్తు ఉంటుందని,
తిరిగి వచ్చాక జీతం హోదా అన్నీ పెరుగుతాయని ఆశ పడ్డాడతను. సరే, జీవితంలో ఎత్తుకు
ఎదిగే అవకాశం దొరికినప్పుడు ఎందుకు అడ్డం పడాలిలే అని తను ఇష్టం లేకపోయినా ఒప్పుకుని
అతనిని వెళ్ళనిచ్చింది. అతను తిరిగివచ్చాక ముహూర్తాలు పెట్టుకోవాలని ఆలోచన.
అంతవరకూ కాలక్షేపంగ ఉంటుందని ఉద్యోగం
చూసుకుంటూనే, ఒక సేవాసంస్థలో తనూ స్వయంసేవికగా చేరింది. అవసరంలో ఉన్నవారికి సేవ
చేస్తూ, మంచి పుస్తకాలు చదువుతూ, సత్కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ తన జీవితాన్ని
అర్థవంతం చేసుకుంది. రెండేళ్ళు పూర్తి కావచ్చాయి.
కానీ అంతలోనే.. అక్క జీవనరాగంలో ఏదో
అపశ్రుతి పలికింది. అక్క భర్త ఏదో కేసులో ఇరుక్కున్నాడు. విచారణలో నేరం నిరూపణం
అయింది. యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అక్క జీవితం అర్థహీనమే కాక, ప్రశ్నార్థకం
అయింది. విషయం తెలుస్తూనే తను కంగారుగ తన మేనత్త దగ్గరకు వెళ్ళింది. కానీ ఆమె సహాయ
నిరాకరణోద్యమం చేపట్టటమే కాక అక్క గురించి చులకనగా మాట్లాడేసరికి ప్రణవికి గుండె
మండింది.
"సంబంధం తెచ్చింది నువ్వే కదా..
ఇప్పుడు మాట మారుస్తావేఁ..?" అంది ప్రణవి.
"సంబంధాలెవరైనా తేవచ్చు. కానీ రాసి
పెట్టి లేనిది ఎవరికీ, ఎవరితో ముడి పడదు. మీ అక్క చేసుకున్న పూజలో లోపం ఉంటే ఎవరేం
చేయగలరు..? పుణ్యం కొద్దీ పురుషుడు అన్నారు.. అందుకే.." అంటూ సాగదీసిందామె.
ప్రణవి మనసు నొచ్చుకుంది. తన కూతురే
అయితే ఆమె ఇట్ల మాట్లాడేదా..? సరే, అవసరానికి ఒకనాడు ఈమె గారు ఆదుకుంది కనకనా,
ఇప్పుడు ఆశించటానికి? అని సమాధానపడి ఇంక చేసేదేం లేక ఒక్కర్తే మైత్రేయి దగ్గరకు
వెళ్ళింది.
"మనం మంచి లాయర్ ని పెట్టి బావ
కేస్ వాదిద్దాం లే అక్కా. నువ్వు ఏం భయపడకు. హై కోర్టు కాదు.. సుప్రీకోర్టు తలుపు
తట్టాల్సి వచ్చినా జంకేది లేదు.." అంది తను ధైర్యం చెప్తూ.
"ఏ కోర్టుకెళితే ఏం లాభమే..? మన
బంగారం మంచిది కానప్పుడు..?" మైత్రేయి విరక్తిగ అంది.
"అంటే బావ నిజంగనే హత్య చేశాడా..?
ఇది పొరపాటున ఇరుక్కున్న కేస్ కాదా..?" ప్రణవి నమ్మలేనట్టు అడిగింది.
తల అడ్డంగ ఊపుతుంటే మైత్రేయికి కళ్ళు
జలజలా రాలాయి. ప్రణవి నిశ్చేష్టురాలైంది. అక్క వాళ్ళ పెళ్ళయిన మూడు నెలలకు బావ పని
చేస్తున్న కంపెనీ మూత పడింది. అప్పుడు అందులో కొలీగ్ అయిన తన స్నేహితుడు సలహా
ఇస్తే వాడితో కలిసి కంప్యూటరు ప్రొడక్టులదేదో వ్యాపారం మొదలు పెట్టాడు బావ. పగలూ
రాత్రీ కలిసి కష్టపడ్డాడు. వ్యాపారం మంచి వేగం పుంజుకుంది.. లాభాలు వెల్లువలా
వచ్చాయి. ఆ వేళ స్నేహితుడికి కన్నుకుట్టింది. వెన్నుపోటు పొడిచి సంతకాల తారుమారుతో
బావను వాడు నిండా ముంచి పోయాడు. ఏదో కళ్ళు మూసుకుని కష్టపడటం తప్ప వక్రమార్గాలేవీ
తెలియని బావ కాలి చల్లారిందాకా గుట్టు తెలుసుకోలేకపోయాడు. ఇంతవరకు తనకు విషయం
తెలుసు.
"మరి హత్య ఎట్ల జరిగింది..?"
"ఈ గొడవలన్నీ చూసుకుని
ఇంట్లోవారికి నా మీద చిన్నచూపు బయల్దేరింది. నా కాలే మంచిది కాదని, నేను ఆయన
జీవితంలోకి వచ్చాకే ఇదంతా జరిగిందని ఆయనకు నూరిపోశారు. వ్యాపారంలో లాభాలు
రావటానికి ఎవరి జాతకం మంచిదైందో, అది దెబ్బతినటానికి కూడా మరి ఆ జాతకమే కదా
కారణమయ్యేది..! మా ఇద్దరి మధ్య అశాంతి, అపనమ్మకం పెరిగాయి. ఆయనకు నేనంటే ఇష్టం.
నన్నేమీ అనలేక తాగుడు మరిగారు. ఒక రోజు తాగి ఉన్న వేళ ఆ త్రాష్టుడు కనిపిస్తే
కోపంతో మాటా మాటా పెరిగి చేతిలో ఉన్న సీసాతో వాడి నెత్తిన మోదితే వాడు ఆ దెబ్బకు
అక్కడే ప్రాణాలు విడిచాడు. ఇది ఆ తాగుడు దుకాణంలో ఉన్న యావన్మందీ ఎదుట జరిగింది.
సాక్షాలకు కొదువ లేదు. కనక ఇక ఎక్కడ అపీలు పెట్టినా ఒరిగేదేమీ లేదు." అది
అక్క చెప్పిన కథ. బావ జైలు పాలైనాక ఆమెకు అత్తవారింట్లో ఏ మాత్రం రక్షణ లేకుండ
అయింది. అంతా ఆమెను పురుగును చూసినట్టు చూడటమే కాక, నానా మాటలతో హింసిస్తున్నారు. ఆమెను,
పిల్లలను పోషించటం తమకు తిండి దండగ అనుకున్నారో ఏమో, అత్తా, మామా, తోటికోడలూ,
మరిదీ, ఆడపడుచులు అంతా కలిసి ఆమెకు నరకం చూపించటం మొదలుపెట్టారు. పక్క ఇంటి ఆంటీ
ఫోన్ చేసి చెప్పేదాకా తనకు ఈ విషయం తెలియలేదు.
"మరి నాతో మాటైనా చెప్పలేదే..?
సొంత చెల్లెలినై ఉండి ఇంత పరాయి దాన్ని కావటం.." ప్రణవి అడిగింది బాధగా.
"చెప్తే ఏం చేస్తావే..? సంతోషం
అయితే ఊరికి ముందే చెప్పుకుని పండగ చేసుకుంటాం..!"
"చివరకు నీ పండగలలో తప్ప వేరే
ఎందులో చోటు సంపాదించుకోలేనంత అయోగ్యురాలినైపోయానన్నమాట.."
"సరే, పెద్ద మాటలెందుకు? ఇప్పుడు
తెలిసిందిగా..! ఈ సమస్యకు పరిష్కారం ఏంటి చెప్పు..?"
"ఇంక ఆదరణ లేనిచోట
దిక్కులేనిదానిలా పడి ఉండే గతి నీకేంటి..? పద, మనం అంతా కలిసి అక్కడే
ఉందాం.." అన్నాను.
"ఇదే మాట అంటావని నాకు తెలుసు.
అందుకే చెప్పలేదు..." అంది అక్క.
ఇంత జరిగినా తనతో రావటానికి ఆమె
ఇష్టపడటం లేదంటే తన జీవితం ఆమె వల్ల చెడుతుంది అనే భయమే. అది తనకు ఏమాత్రం
అంగీకారం కాదు.. తను ఏమైనా ఫరవాలేదు.
ప్రణవి ఆమెను అత్తవారింటికి బలి
కావటానికి వదిలేయలేక మేనత్తతో, మామయ్యతో తన నిశ్చయం చెప్పింది. వారు కుదరదన్నారు.
సుమన్ అయినా అర్థం చేసుకుంటాడేమో అనుకుంటే అతనూ నిర్దయగా తన తల్లిదండ్రుల పక్షమే
మాట్లాడాడు.
"నేనేదో పెళ్ళి చేసుకుని నా
పెళ్ళాం పిల్లలతో సుఖంగ ఉందామనుకుంటే మధ్య ఈ గొడవేంటి..? ఇంక ఈ గుంపునంతా పోషిస్తూ
కూర్చుంటే నా జీతమంతా హారతి కర్పూరమే." అన్నాడతను.
"అక్కర్లేదు. అక్క బ్రహ్మాండంగ
వంటలు చేస్తుంది. అదివరకటిలాగే కాటరింగ్ పెట్టిద్దాం. ఎవరికీ బరువు కాకుండ తనను,
తన పిల్లలను పోషించుకోగల సమర్థురాలు.. ఇంత రక్షణ మాత్రం కల్పిస్తే చాలు."
ప్రణవి నచ్చ చెప్పింది.
కానీ స్వార్థపరుల ప్రపంచం చాలా చిన్నది.
అందులో ఎంత అవసరంలో ఉన్నవారికైనా సరే, చిన్న చోటు అనేదే ఉండదు. సహజంగనే సుమన్
ఒప్పుకోలేదు. ప్రణవికి మొదటిసారి తను ఈ లోకంలో ఎంత ఒంటరిదో అర్థమైంది. అయినా ఆమె
పట్టు సడలలేదు. తనకేం తక్కువ..? సంపాదన ఉంది. ఇల్లు ఉంది. తనకంటూ సమాజంలో ఒక
అస్తిత్వం ఉంది. సుమన్ ఒక్కడు లేకపోతే వచ్చిన లోటేమిటి..?
*
ప్రణవి ఆలోచనలన్నీ గమ్యం చేరటంతోనే
ఆగిపోయాయి. మైత్రేయి ఆమె వెళ్ళేసరికి సిద్ధంగనే ఉంటుందేమో అంటే ఆమె ఏ రకంగ
చెప్పినా తనతో రావటానికి ఇష్టపడలేదు. "ఇంత కష్టపడి నిన్ను పెంచి పోషించింది
నాకోసం ఆహుతి కమ్మని కాదు.." అంది.
"చూడక్కా, నాకంటూ ఈలోకంలో నువ్వు
తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు ఎదిగించిన చెట్టు నీకు కూడా నీడ ఇవ్వలేకపోతే ఇంక ఆ
చెట్టుకు అర్థమేంటి..? నీకేమైనా అయితే నాకు 'నా' అని చెప్పుకునేవారు ఈ లోకంలో
ఎవ్వరూ లేకుండ పోతారు. ఒకసారి తల్లికి దూరమైనాను. ఇంకొకసారి ఆ దూరం
చేసుకోలేను." అని ప్రణవి కన్నీరు పెట్టుకుంది. అది చూసి మైత్రేయి కలవర
పడిపోయింది. చివరకు పిల్లలకోసం ఆలోచించి బలవంతంగ ఒప్పుకుంది. ఆ నరకంలో పసిపిల్లలు
నలిగిపోయి, విచ్చుకునే ముందే వాడిపోతారు. చెల్లెలు చూపించింది స్వర్గం కాకపోయినా
ఫరవాలేదు. వ్యక్తిత్వం చంపుకోకుండ వాళ్ళు పెరిగితే చాలు. గమ్మున ఆమెతో పాటు
బయలుదేరింది.
మైత్రేయికి ఆత్మాభిమానం ఎక్కువ.
"నేనేదైనా పని చేస్తానే.. ఊరికే కూర్చుని తినలేను.." అంది వస్తూనే.
"అక్కా, పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. నీ అవసరం వారికి చాలా ఉంది. పైగా నా జీతం
ఇందరికీ హాయిగ సరిపోతుంది. అంతకు అవసరమైతే పిల్లలు పెరిగిన తర్వాత తప్పక కాటరింగే చేద్దువుగాని.
నేను కాదనను." అంది ప్రణవి.
ఆ విధంగ అక్క, పిల్లలతో ప్రణవి ఇల్లు
కళకళలాడిందో, విలవిలలాడిందో, మొత్తానికి కాస్త బరువుగా, కాస్త తేలికగా రోజులు
గడిచాయి. చూస్తుండంగనే సుమన్ కి వేరొక అమ్మాయితో పెళ్ళయిపోయింది. ప్రణవి అతిథిలా
పెళ్ళికి వెళ్ళివచ్చింది. తను ఆ సంఘటనను మామూలుగానే తీసుకుంది. కానీ మైత్రేయి చాలా
బాధపడింది. తన వల్లే చెల్లెలికి దక్కాల్సిన స్థానం దక్కలేదని కుమిలిపోయింది.
కష్టపడి తనకు చేతనైన ప్రయత్నాలు చేసి ఆమెకోసం నాలుగైదు సంబంధాలు తెచ్చింది కానీ
అవీ తన కారణంగనే వెళిపోయేసరికి ఆమె బాధ రెట్టింపైంది. ప్రణవి అక్కను తన పెళ్ళి
గురించి దిగులు పడవద్దని, జీవితం అంటే అదొక్కటే కాదని చెప్పి, హాయిగ సేవాసంస్థ
కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వెళ్ళి వస్తూ, అక్కతో,
పిల్లలతో కాలక్షేపం చేస్తూ సంతోషంగ ఉంది.
సరే, ఇంకెప్పటికీ ఆమె జీవితం ఇంతేనేమో
అనుకుంటుండంగ ఒకతను వచ్చాడు- పేరు విశాల్.
అతను ఆమెను ఏ షరతులు లేకుండ పెళ్ళి
చేసుకోవడానిక సిద్ధంగ ఉన్నానని చెప్పాడు.
"సారీ, నేను అటుంటి ఆలోచనకు
స్వస్తి చెప్పి చాలా కాలమైంది. ఉద్యోగంతో, అక్క, పిల్లలతో, సేవాసంస్థతో నేనెంతో
పరిపూర్ణంగ ఉన్నాను." అంది ప్రణవి, మైత్రేయి వారించేలోపే.
"కానీ నేను మిమ్మల్ని పెళ్ళి
చేసుకోలేక పోతే నేను జీవితాంతం బాధపడటమే కాదు, ఇంక పూర్తిగ బ్రహ్మచారిగా
ఉండిపోతాను కూడా..! అందుకు మా అమ్మ మిమ్మల్ని అస్సలు క్షమించదు."
"మీ అమ్మా..?"
"ఊఁ.. మీ సేవాసంస్థ డైరెక్టరు..
భారతీదేవి మా అమ్మ.."
ప్రణవి సహజంగనే ఆశ్చర్యపోయింది.
"మిమ్మల్ని నేనెప్పుడూ అక్కడ చూడనేలేదే.."
అతని ఉద్యోగం ఢిల్లీలో అట. ఇక్కడకు
శెలవలలో మాత్రం వస్తుంటాడట. "అప్పుడు మీరు రారు. అందుకే నేను మీకు తెలియను..
కానీ నాకు మీరు తెలుసు. మా అమ్మ మాటల ద్వారా..!"
"ఓహ్.. అయితే ఒక్క మాట మీరు
తెలుసుకోవాలి. నా మీదో, లేక మా అక్క మీదో జాలితో ముందుకు వస్తే మాత్రం నేను
సహించలేను."
"ఈ పెళ్ళికి పునాది జాలి కాక ఇష్టం
అయినట్లైతే..?"
"ఇష్టానికి అవకాశం ఎక్కడిది మన
మధ్య..?"
"ఆ మాట చెప్పబోయే ముందు నేనొక
విషయం చెప్పాలి మీకు. బహుశ మా అమ్మ చెప్పే ఉండవచ్చు."
అతనికి ఒక చెల్లెలు ఉండేది. చాలా మంచి
పిల్ల. బుద్ధిమంతురాలు. అందరిలాగే గారాబంగ పెరిగింది. వేళకు పెళ్ళి చేసి గౌరవంగ
అత్తవారింటికి పంపారు. కానీ అక్కడ ఆధునికత ఇష్టపడే ఆమె భర్తకు ఆమె వ్యవహారం నచ్చక
చాలా సమస్యలు వచ్చాయి. ఆయన మరొక స్త్రీతో సంబంధం ఏర్పరుచుకుని ఆమెను తిరిగి పుట్టింటికి
వచ్చేయటానికి వివశురాలిని చేశాడు. అప్పుడు వాళ్ళ అమ్మా, నాన్నా ఇద్దరూ సామాజిక
అప్రతిష్ఠకు భయపడి ఆ అమాయకురాలిని ఆదరించలేకపోయారు. ఆధారం అనుకున్నవారే ఛాయను ఇవ్వకపోతే
ఆ జీవి ఏం చేయగలదు..? తిరిగి అత్తవారింటికి వెళ్ళి అక్కడి అవమానకర పరిస్థితులను
జీర్ణించుకోలేక బేలలాగ జీవితం నుంచి విడాకులు తీసేసుకుంది.
"ఇవే ఆ సేవాసంస్థ పెట్టటానికి వెనక
ఉన్న కారణాలు- అటువంటి స్త్రీలకు బాసటగా నిలవాలని.. నా చెల్లెలు లాంటి మరే
స్త్రీకి జీవితం నుంచి పారిపోవాల్సిన అవసరం రాకూడదని." అని ఆగి, "ఒకవేళ
సహాయం అవసరం పడినప్పుడు ‘నీకు నేనున్నాను’ అని ధైర్యం చెప్పి ఆమెకు సహకారం అందించి
ఉంటే చెల్లెలి నవ్వు ముఖం ప్రపంచానికి దూరమయ్యేది కాదు కదా- అని అమ్మ ఎప్పుడూ
బాధపడుతుంది." చెప్పాడతను బాధగ.
ప్రణవి అంతా విని తల ఊపి, "మనసులో
సంఘర్షణ అందరికీ కనిపించదు కదా. ఎదుర్కోగలుగుతుందేమోనని ఆశించారు మీరు. ఆమె
ఎదుర్కోలేకపోయింది. అంతే." అంది.
"కారణాలేవైనా ఒకప్పుడు నా
చెల్లెలికి ఎదురైన పరిస్థితే మీ అక్కకు ఎదురైతే మీరు ఆమె బాధను అర్థం చేసుకుని,
సమయానికి వివేకవంతంగ ఆలోచించి, మంచి నిర్ణయం తీసుకుని నిండు జీవితాలు కాపాడారని
అమ్మ సంతోషంగ చెప్పింది. అంతే కాదు, మీరు దానికోసం మీ మేనబావను కాదనుకున్న సంగతి,
తర్వాత వచ్చిన సంబంధాలన్నీ చెడుతున్న సంగతి కూడా చెప్పింది. ఆ విషయం ఆమెను చాలా
బాధించింది." చెప్పాడతను.
మైత్రేయి తల ఊపి, "ఔనండి. దాని
పాలిట శాపంలా నేను.." అని ఏదో అనబోతే, విశాల్ ఆమెను ఆపి, "మీరట్ల
మాట్లాడద్దు. శాపం ఏంటండి..? మనవారికి మనం శాపం అవుతామా..? బరువు అవుతామా..? ఎన్నో
ఇతర కారణాల వల్ల పెళ్ళి కాకుండ ఉండిపోయినవారెందరో ఉంటారు. అయినా ఒకరికొకరు అండగ
ఉండటానికి కాకపోతే ఇంక రక్తసంబంధాలెందుకు, బాంధవ్యాలెందుకు?" అన్నాడు.
ప్రణవి ఆ మాటకు తల ఊపి, "తను
నాకోసం చేసిన త్యాగం ముందర నేను చేసింది సున్నా. నావల్ల తను చదువుకోలేకపోయింది. తన
వయసు ఆడపిల్లలందరు పొందుతున్న సంతోషాలకు పూర్తిగ దూరమైంది. వాళ్ళు తోటివారితో
హాయిగ గడుపుతంటే, ఎంజాయ్ చేస్తుంటే, ఆమె ఇంతింత బాండీలు, గంటెలు పెట్టుకుని వంటల
ఆర్డర్లతో సతమతమయ్యేది. ఎన్నిసార్లు ఆమె చేతులు కాలేవో, ఎన్ని ప్రమాదాలు
తప్పించుకుందో అందుకు ప్రత్యక్షసాక్షిని నేను. నాకోసం కొత్త బట్టలు కొని తను
మాత్రం పాతవే కట్టుకుంది. నాకోసం కడుపునిండా తిండి పెట్టి తను అర్ధాకలితో
ఉండిపోయింది. నాకు రోగం వస్తే సేవ చేసింది. బాధ వస్తే ఓదార్చింది. ఏదైనా చేయలేక
బాధపడితే ధైర్యం చెప్పి వెన్ను తట్టింది. నేనెవ్వరిలో తక్కువ కాకుండ చూసుకుంది. నా
సంతోషమే తనదనుకున్న నిండు మనిషి మా అక్క." అంది కంట్లో తడి చేరుతుంటే.
విశాల్ ప్రణవి వంక తిరిగి,
"చూడండి, జీవితం అందరికీ ఒకతీరుగ ఉండదు. పరిస్థితులను చూసి బెదిరిపోకుండ, ఏదో
దొరకనిదానికోసం తిట్టుకోకుండ ధైర్యంగ నిలబడి, మన కర్తవ్యం మనం నిర్వర్తిస్తూ
సాగిపోవటమే మనం చేయగలిగింది. ముందు మీ అక్క చేసినదానికి కృతజ్ఞత చూపుతూ, ఆమెకు
అవసర సమయంలో ఆశ్రయం కల్పించారని విని మీ మీద చాలా గౌరవం కలిగింది. తర్వాత దానికోసం
మనసు పడినవాడిని కూడా వదులుకున్నారని తెలిసి ఆరాధన కలిగింది. అంత సహృదయం, స్థైర్యం
ఉన్న మిమ్మల్ని వదులుకోవటం అతని మూర్ఖత్వం. నేను మాత్రం మూర్ఖుడిని కాను. ఇప్పుడు
చెప్పండి, ఇది జాలి అవుతుందా..?" అన్నాడు.
మైత్రేయి నవ్వి, "ఎంత మాత్రమూ
కాదు.." అని ప్రణవి చేతిని పట్టుకుని ఆమె చిబుకం పట్టుకుని 'ఒప్పుకోవే..'
అన్నట్టు చూసింది. ప్రణవి మౌనంగ చూసింది.
విశాల్ ప్రణవిని ఆరాధనగా చూస్తూ,
"మీకు మా అమ్మ తెలుసు, ఆమె ఆశయం తెలుసు. మీరు దాన్ని ఆచరణ పూర్వకంగ చేసి
చూపించి ఆమె మనసు, అభిమానం గెలుచుకున్నారు. మాట్లాడుకోవటానికి తనే రావాలనుకుని
కూడా, ఈ కాలం పద్ధతుల ప్రకారం ఒకసారి నన్నే మాట్లాడుకుని రమ్మని పంపింది. మీకూ ఈ
సంబంధం అంగీకారమైతే తనే వచ్చి జరగవలసింది చూస్తానంది." అని చెప్పాడు.
ప్రణవి ఆలోచించి, "ఇప్పుడు
ఆదర్శాలు బాగానే మాట్లాడుతున్నారు. తర్వాత తేడాలు చేస్తే మాత్రం.." అని
ఇంకేదో అనబోయింది.
"...మన సేవాసంస్థ ఉందిగా.."
అన్నాడు విశాల్.
"చివరికి అదే నాకు శరణ్యం చేస్తారా..?"
అంది ప్రణవి.
"నన్ను పెళ్ళి చేసుకున్న ఎవరికైనా
అదే శరణ్యం. తప్పదు. అత్తవారిల్లు కదా.." అన్నాడు విశాల్.
ప్రణవి తోపాటు మైత్రేయి కూడా నవ్వేసింది
ఆ మాటకు. ఆమె అతనిని చూసి తృప్తిగ శ్వాస పీల్చుకుంది.
**********
No comments:
Post a Comment