"ఎవరు నువ్వు? నా గదిలో ఏం
చేస్తున్నావు..?" అన్నాడు ఉరిమి చూస్తూ. బాంబు పడినట్టు అదిరిపడి ఉలికిపడి
అతని వంక చూశాను.
అప్పుడే స్నానం చేసినట్టున్నాడు, తల
తుడుచుకుంటూ వచ్చాడు. నేను తల వంచుకుని, అక్కడి నుంచి కదిలాను. నాకు అతనితో మాట
కూడా మాట్లాడాలనిపించలేదు.
"నిన్నే అడిగేది..? ఎవరు
నువ్వు..??" అన్నాడు ఈసారి బాగా గుచ్చి చూస్తూ. నాకెందుకో మాటలే పెగలటం లేదు.
చాలా కొత్తగ, వింతగ అనిపించింది. గుండె వేగంగ కొట్టుకుంటోంది, అప్పుడే దానికి ఎవరో
కొట్టుకోవటం నేర్పినట్టు. రకరకాల భావాలు నన్ను ఇష్టం వచ్చినట్టు కుదిపేసి
పోసాగాయి.
అతను పక్కకు తొలిగితే వెళిపోదామని నేను
నిలబడితే అతను పక్కకు జరగకుండా తలుపుకు అడ్డంగ నిలబడ్డాడు. చెప్పేదాకా వదిలేటట్టు
లేడు. చాలా డామినేటింగ్ గా ఉన్నాడు.. ఆ గొంతూ, ఆ చూపులూ..! చాలా సీరియస్ ముఖం.
లోతైన కళ్ళు. ఒక్క క్షణం పక్కకు జరగమన్నట్టు చూసి, నేను పక్కకెటో చూస్తూ
నిలబడ్డాను.
అతను వెంటనే విసురుగా తలుపు తీసి, అటుగా
పోతున్న మామయ్య భార్య.. సుమత్తతో, "వదినా, వదినా.. నా గదిలోకి ఎవ్వరినీ
రానివ్వద్దని చెప్పా కదా.." అని అన్నాడు చిరాకుగా. అంతలోకి, ఆమె గది తలుపు
లోపలకు వచ్చి చూశారు. "ఏయ్ ఈ అమ్మాయే కదూ..! ఇదిగో ఈ పిల్ల కోసమే
వెతుకుతున్నాను.. ఇక్కడుందా..? నీ పేరేదో ఉండాలోయ్...?" అని అడిగిందామె.
బెదురుగా చూశానామెను.
"హార్దిక.." అన్నాను.
"ఊఁ.. అదే! మరి రా. అక్కడ పూజ
మొదలైంది. ఇక్కడేం చేస్తున్నావు..? మీ అమ్మ నీకోసం వెతుకుతోంది..! ఈ పిల్లాడి
గదిలో ఏం చేస్తున్నావు..?" అని అందామె అతని వంక, నావంకా చూసి.
నేను ఏం మాట్లాడాలో తోచక, "నాకు
తెలియదు కదా..! ఖాళీగ ఉంటే వచ్చాను." అన్నాను.
ఆమె నా చేయి పట్టుకుని "సర్లే
పద." అని ఆయనగారి వంక చూసి, "బాబూ.. త్వరగా కానించుకో.. అక్కడ ఆలస్యమవుతోంది..
అంతా నిన్ను అడుగుతున్నారు.." అంది.
"వస్తున్నా కానీ.." అని అతను
నా వంక చూపిస్తూ, "ఎవరొదినా ఈ అమ్మాయి?" అని అడిగాడు.
"మీ అక్క కూతురు.. హార్దిక.. ఇవాళే
వచ్చింది.. మనింటికి.." అని చెప్పింది.
"మరి నోట్లో బెల్లం పెట్టుకుని
కూర్చుంటుందేఁ..? అడిగినా చెప్పదు..? పొగరా..?" అని గుణిగాడు. అత్త అదేం
పట్టనట్టు నా చేతిని పట్టుకుని తీసుకువెళ్ళింది కిందకు.
అప్పటి దాకా ఆగిపోయిన ఊపిరి అప్పుడుకానీ
తిరిగి పీల్చుకోలేదు నేను. అమ్మో, చూస్తేనే ఎంత టెంషన్ వచ్చింది..!! ఇతనితో ఆ
విషయం మాట్లాడటమా..?!! అసంభవం. అసలు నిన్న పార్కుకు పోకపోయినా బాగుండేది.
వెయ్యోసారి మనసు మూలగటం వినిపించింది.
"ఏమోయ్.. నిన్ను వెతకాలంటే ఇట్ల
ఎవ్వరూ లేని ఏకాంతవాసాల్లో చూడాలిలాగుందే. ఏమైనా ఇబ్బందిగా ఉందా..? రా.. కదంబ వాళ్ళతో
కూర్చుందువుగాని.." అని అత్త నా నుదుట ముంగురులు సవరించింది. నాకు కాస్త
హాయిగ అనిపించింది.
కదంబ వాళ్ళంతా ఏవో పనులలో ఉన్నారు.
నన్నూ వాళ్ళతో చేర్చి వెళ్ళింది అత్త.
కదంబ నన్ను చూస్తూనే, దగ్గరకు వచ్చి,
"నీకొకటి తెలుసా..? నువ్వు చాలా బాగున్నావు. చీర అదిరింది." అంది.
ఫరవాలేదు.. టెంషన్ పోయి, కాస్త మాటలు
మొదలుపెట్టటానికి మంచి బోణీబేరమే అనుకున్నాను.
తర్వాత పూజకు పనులతోనే సరిపోయింది. కానీ
అందరితో భలే మజా వచ్చింది. చాలా కార్యక్రమాలైనాయి.
తర్వాత ఛలోక్తులు, చతురోక్తులు,
విమర్శలు, ఖండనలు, పరాచకాలతో భోజనాల బంతులన్నీ సరదాగా ముగిసేసరికి నాలుగున్నరైంది.
నాకు నిజంగ బంధువలంటే ఎవరో, వారితో ఉంటే ఎంత అద్భుతంగ ఉంటుందో తెలిసింది. కాస్త
టెంషన్ పోయింది. వాళ్ళతో నేనూ ఒకతిగా కలిసిపోయాను. నవ్వీ, నవ్వీ బుగ్గలు నెప్పి
పుట్టేశాయి. అటు తర్వాత మళ్ళీ సాయింత్రం కార్యక్రమాలట. అమ్మమ్మ, తాతయ్యలకు దండలు
మార్పించటం, పాటలు, ఆటలు.. అన్నీ ఉంటాయని చిన్నత్త చెప్పింది. అందరూ ఓ గంటన్నర
విశ్రాంతికోసం దొరికిన చోట నడుము వాల్చారు. పిల్లలంతా ఒక గదిలో చేరి గోల
పెట్టుకుంటున్నారు. యువత అంతా ఇంకో గదిలో పాటల కార్యక్రమం పెట్టుకుని
కూర్చున్నారు. నాకు ఏకాంతం ఆవశ్యకమై హాలులో ఎవ్వరూ లేకపోవటం చూసుకుని అక్కడే
కూర్చున్నాను, వెంట తెచ్చుకున్న ఒక పుస్తకం ముందేసుకుని. భోజనాల తర్వాత కదంబ
కనిపించలేదు. నాకు నిద్రా రాదు, పాటలూ రావు, అల్లరీ రాదు..! ఇంకొంత అలవాటైతే తప్ప
ఎవరి పార్టీలోనూ చేరలేను. మొదటిసారి కదా, ఏం చేస్తే ఏం అనుకుంటారోనని కాస్త
బెరుకుగానే ఉంది.
అంతలోకి సరిగ్గ ఫోన్ మోగింది. మామూలుగ
అయితే ఎత్తేదాన్నే కాదు. కానీ మళ్ళీ ఆ శబ్దానికి అక్కడే పడుకున్న పెద్దవాళ్ళకు
నిద్రాభంగం కలిగితే కష్టమని దూరాలోచనతో ఠకీమని రిసీవరెత్తాను- "హలో"
అనబోయి చటుక్కున ఆగాను. అననందుకు తర్వాత కోటిసార్లు మనసులో ధన్యవాదాలు
చెప్పుకున్నాను నా నోటికి. సరిగ్గ చెప్పాలంటే అది ఖంగు తినటం. బుర్ర పల్టీ
కొట్టటం. జరిగిన కాకతాలీయం ఏంటంటే ఇక్కడ నేను, అక్కడ సంయత్ మహాశయులు ఒకేసారి ఫోన్
ఎత్తాం. దీనికి వేరేచోట ఎక్స టెంషన్ ఫోన్ ఉందన్న సంగతి కూడా నాకు తెలియదు.
ఎత్తకపోతే ఇంకా బాగుండేదని నన్ను నేను చాలా సార్లే తిట్టుకున్నాను. వేరేవాళ్ళ
మాటలు వాళ్ళకు తెలియకుండ వినటం మహాపాపమని అమ్మ చెబుతుంటుంది. కానీ అట్లని ఇప్పుడు
రిసీవర్ పెట్టేస్తే అతనికి తప్పకుండా నా మీదే అనుమానం మళ్ళుతుంది. అంతకు ముందే
అటుగా పోతూ ఒక చూపు విసిరి వెళ్ళాడు. సరే, చూడకూడని దృశ్యమే చూసినప్పుడు ఇక మాటలు
వినటం ఒక లెక్కా..? విధిలేక, గతిలేక నేను విన్న సమాచారం నా తలను పదివేల సార్లు
బొంగరంలా తిప్పి వదిలింది. సంభాషణంతా ఆంగ్లంలోనే సాగింది. ఆమె అచ్చు విదేశీ
యాసలోనే మాట్లాడుతోంది.
"హా..య్ హాండ్ సమ్. నిన్న ఇచ్చిన
ఫోటో పర్సులో, తీసుకున్న మనసు గుండెలో భద్రంగా ఉన్నాయి కదా.."
"ఊఁ.. ఊఁ..! ఎందుకు లాండ్ లైన్ కి
చేశావు..? ఇవాళ బిజీ అని చెప్పా కదా.." అతని గొంతులో చిరాకు.
"సెల్ ఆఫ్ పెట్టావు.. ఏం చేసేది?
చాలా ముఖ్యం విషయం చెప్పాలి. మా ఫాదర్ తేదీ నిశ్చయించారు. వచ్చేవారం.. నువ్వు
సిద్ధంగ ఉంటావని.. ముందే చెప్తున్నాను.." ఆమె గొంతులో ఉత్సాహం.
"ఏంటీ..? అప్పుడే కుదిరిపోయిందా..?
అ..అ.. సరే, మంచిది. ఇంక పెట్టేసేయ్.. తర్వాత మాట్లాడతాను." అతని గొంతులో
భయం.
"అదేంటి..? ఇంత గొప్ప వార్త చెప్తే
సంతోషమేం లేదా..? ఇంట్లో నాన్నవాళ్ళకు వాసన కూడా తెలియకుండా ఇదంతా చేశా తెలుసా..?
వాళ్ళు ఆ సమయంలో ఇంగ్లాండ్ లోనే ఉంటారు."
అదేంటి..? వాళ్ళ ఫాదరే తేదీ
నిశ్చయించారంటుంది.. ఇంట్లో తెలియదంటుంది.. ఏంటిది..? దేని గురించి..?
"మంచిది. అభినందనలు..!! చాలా
సంతోషంగ ఉన్నాను.. చాలా..?"
"ఇంకా చాలా కొనుగోళ్ళు చేయాలి.. పెళ్ళి
గౌను కొనాలి.. నేను బ్లూ థీం అనుకుంటున్నాను.. నువ్వేమంటావ్..? నీ సూట్ కూడా నేనే
కొనేసేదా..? బ్లూ విత్ క్రీం.. ఏమంటావ్..?"
"ఊఁ.. ఊఁ.. నీ ఇష్టం అన్నా కదా.
ఇంక పెట్టేయ్.. బై.."
"ఏయ్.. హాపీ వెడింగ్..!! లక్కీ
బాయ్..!! ఫాదర్ నా సెల్ లో నీ ఫోటో చూపిస్తే నన్ను లక్కీ గర్ల్ అన్నాడు.. నేనైతే
నీతో గాలిలో తేలిపోతున్నాను. హేయ్.. మనం కూడా నీ 60వ పుట్టినరోజు మీ పద్ధతి
ప్రకారం షష్టిపూర్తి- అదే 60లో పెళ్ళి చేసుకుంటామా..?" ఆమె నవ్వింది కిలకిల.
"ముందు ఈ 20ల వ్యవహారం కానివ్వు..
60ల సంగతి తర్వాత.." అని నవ్వాడు.
ఆమె సరేనని ఫోన్ పెట్టేసింది. అతను
రిసీవర్ పెట్టేసిన శబ్దం విన్నాక నేనూ ఇక్కడ నెమ్మదిగ పెట్టేశాను.
నాకంతా అర్థమైంది. తల నెమ్మదిగ తిరగటం
మొదలు పెట్టింది. గట్టిగ కళ్ళు మూసుకున్నాను.
రీనా ఫాదర్ అన్న వ్యక్తి ఆమె తండ్రి
కాదు.. చర్చిలో ఫాదరీ. వీళ్ళిద్దరూ చర్చిలో పెళ్ళి చేసుకోబోతున్నారు..!! అది ఇక్కడ
తెలియదు, సరే, అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా తెలియదు. కళ్ళ ముందు క్రమంగ చీకటి
కమ్మింది. ఇది కలిసి తిరిగే ప్రేమ బాపతనుకున్నాను. కానీ ఏకంగా పెళ్ళి అంటున్నారు.
కులం కాదు, మతం కాదు, దేశం కూడా కాదు. అమ్మాయిది తెల్ల తోలు మాత్రమే అనుకున్నాను.
కాదు.. అసలామె ఈ దేశస్థురాలు కాదు. విదేశీ అమ్మాయి..!!
అటు చూడబోతే, మా తాతగారు.. అమ్మమ్మా..
పెద్దవారు. వయసులోనే కాదు. మంచితనంలోను, సదాచారంలోనూ, భక్తిప్రపత్తులలోనూ..
నలుగురికీ మార్గదర్శకమైన జీవితం వారిది. సనాతన ఆచారాలు, ధార్మిక ఆదర్శాలు, సామాజిక
పట్టింపులు ఉన్నవారు. ఎవరికైనా సరే, ఏ దేవత సాధనా రహస్యాలు కావాలంటే వారు ఎంతెంతో
దూరాల నుంచి తమ సందేహాలు తీసుకుని ఈయనను వెతుక్కుంటూ వస్తారంటే ఆయన దైవారాధనం
గురించిన అవగాహన ఎంత లోతైనదో తెలుస్తుంది. అమ్మమ్మ ఉపవాసాలు, పారాయణలూ, వ్రతాలు,
నోములు.. ఆమె పట్టే దీక్షలకు అంతే లేదు. వాళ్ళిద్దరి జీవితం ఒక శాశ్వత ఉపాసన. ఒక
నిత్యపారాయణ. ఎప్పుడూ గురువులు అని, సాధువులు అని తిరుగుతుంటారు. ఇంటికి నిత్యం
ఎవరో ఒక మహానుభావుడు రావటం ఆశీస్సులనివ్వటం జరుగుతునే ఉంటుంది. నగరంలోకి ఏ
మహానుభావుడు వచ్చినా ఇంటికి పిలిచి ఆదరించటం మామూలే. శరీరాన్ని దేవాలయంగ భావించి,
ఆహార విహార నియమాలతో, చక్కటి నిష్ఠతో జన్మను సార్థకం చేసుకుంటున్నారు వాళ్ళు.
మనస్సు చేత కూడా తప్పుడు ఆలోచన చేయరు. వాళ్ళను చూస్తేనే చేతులెత్తి దండం
పెట్టాలనిపిస్తుంది. పవిత్రతకూ, ప్రశాంతతకు, వాళ్ళు ఆలవాలంగ ఉంటారు. సంప్రదాయానికి
ఆటపట్టుగా ఉంటారు. వీలైనన్ని తీర్థయాత్రలు చేశారు. దానాలు ధర్మాలు చేసుకున్నారు.
గుళ్ళలో సత్సంగాలు, హరికథలు, ప్రవచనాలు
చెప్పించటం, దేవుడి కల్యాణాలు చేయించటం, యజ్ఞయాగాలు, క్రతువులు, నగరసంకీర్తనలు,
భాగవతాది సప్తాహాలు చేయించటం, అభిషేకాలు అని, నాగప్రతిష్ఠలు, కుంకుమార్చనలనీ ఏవో
ఒకటి.. అట్ల నడుస్తూనే ఉంటాయి. ఇంట్లో ఎప్పుడూ ఒక ధార్మిక వాతావరణం ఉంటుంది.
పూజలనీ, భజనలనీ ఏవో ఒకటి చేయటం, నలుగురినీ పిలవటం, పండూ తాంబూలాలు, భోజనాలు అంటూ
హడావుడి పడటం.. వారి జీవనమే ఒక యజ్ఞం లాగ ఉంటుంది అని అంతా చెప్పుకుంటారు.
వేంకట శేషాచలంగారంటే ధర్మానికి ప్రతిరూపం.
అనుష్టానం కానిది పచ్చి మంచినీరు తాగడాయన. బయట ఏమీ తినడు, తాగడు. అసత్యం
మాట్లాడడు. మాట తూలడు. నిద్రాహారాలు అంతా మితమే. పురాణప్రవచనం విననిది నిద్రపోడు.
కోపం అంటే ఏంటో ఆయనకు తెలియదు. అరషడ్వర్గాలు ఆయనకు ఆమడ దూరంలో ఉంటాయి. తనది కాని
ధనం స్పృశించడు. తన స్వాధ్యాయం మానడు. కష్టంలో ఉన్నవారికి సహాయం చేస్తాడు. ఏదైనా
కావాలని ఇంటి ముందుకు వచ్చి చాచిన చేతిని ఖాళీగ పంపడు. అంతే. పైగా ఆయన పరువే
ప్రాణంగ, ప్రతిష్టే ఊపిరిగా బ్రతికే మనిషి. అపకీర్తికన్నా మృత్యువు మేలని
నమ్ముతాడాయన. ఆయన భార్య మంగమాంబ ఆయన ఛాయ. విశేషమేమంటే అదే అడుగుజాడల్లో కుటుంబమంతా
నడుస్తుంది. చిన్నపిల్లలు కూడా స్పష్టంగ విష్ణుసహస్రనామాలు చదవగలరు. భగవద్గీత
కంఠోపాఠంగ అర్థాలతో సహా అప్పచెప్తారు. ఎన్నో అష్టోత్తరశతాలు నోటికి పట్టారు. పండగలు
పబ్బాల ప్రాశస్త్యం తెలుసు. ఎవరూ చెప్పకుండానే పిన్నా పెద్దా అంతా నియమంగ
నడుచుకుంటారు. తెలిసి తప్పు చేయరు. చేస్తే సరిదిద్దుకుంటారు. ఇంతవరకూ కుటుంబంలో
ఎవ్వరూ ఆయనకు తల ఒంపులు తేలేదు. వాళ్ళ సాధనకు ప్రతీకగా, దైవదత్తంగ పెద్దతనంలో
కలిగిన ఇతనికి సంయత్ అని పేరు పెట్టుకున్నారు. ఇతను ఇటువంటి పని చేస్తే వారు
తట్టుకోగలరా..? దీన్ని జీర్ణించుకోగలరా..?
ఈ ప్రబుద్ధుడు ఇంత తేలికగా, ఇంత కఠిన
హృదయుడై ఇంత పెద్ద అడుగు వేస్తున్నాడు.. దాని పర్యవసానం ఆలోచించాడా..? తల్లి ముఖం
కానీ తండ్రి నమ్మకం కానీ అతనికి ఏదీ పట్టినట్టు లేదే. రేపు నలుగురూ తలా ఒక మాటంటే
ఆయన విని ఉరే పోసుకుంటారేమో. నా కళ్ళ ముందు వారిద్దరి శవాలు నట్టింట
వేలాడుతున్నట్టు కనిపించి ఝల్లున వెన్నులోంచి ఒక వణుకు పాకింది. వెంటనే అప్రయత్నంగ
చెంపలు వేసుకున్నాను. ‘భగవంతుడా, వాళ్ళని నిండు నూరేళ్ళు చల్లగ చూడు.’ అని
ప్రార్థించాను.
"ఏమైందే నీకు..? ఏదో జాగ్రత్తగ
ఉండమన్నా కదా అని మరీ బిగుసుకుపోతున్నావు..?" అమ్మ మాటతో తేరుకుని చూశాను.
"లే, లేచి బట్టలు మార్చుకుని రాపో.
అందరూ తయారైపోయారు.. నువ్వే వెర్రిదానిలా ఇంకా కూర్చున్నావు ఇక్కడ.." అంది
నెత్తిన మొట్టి.
జరగబోయే ప్రళయం స్పృహ లేదు కనక ఆమెకు
నేను వెర్రిదానిలా కనిపిస్తున్నాను. తమ వెనక ఏ మిన్నులు విరిగి మీద పడనున్నాయో
ఇంట్లోవాళ్ళకు వాసనే తగలటం లేదు. తెలియక వాళ్ళు ఎంత చేయగలుగుతున్నారో, నేను తెలిసి
అంతకన్నా ఎక్కువ ఏం చేయగలుగుతున్నాను కనక? వాళ్ళు సంతోషంగ ఉన్నది ఒక వాస్తవం
తెలియక మాత్రమే.
సరే, నేను స్నానం చేసి వేరే బట్టలు
కట్టుకుని వచ్చి అన్యమనస్కంగానే పూజలో కూర్చున్నాను. పిల్లలంతా కలిసి తాతగారు
నేర్పిన భగవద్గీత సామూహిక పారాయణం చేశారు. చక్కగ అనిపించింది. నాకింకా గీతాపాఠం
నోటికి రాదని బాధనిపించింది. అత్తలు అందరూ భజనలు పాడారు. ఎంత వినసొంపుగా ఉందో.
అమ్మమ్మ పాత తత్వాలు పాడింది. నాకు ఆ వైరాగ్య భక్తి తత్త్వాలకు కళ్ళలో నీరు
తిరిగింది. పిల్లలు దేవుడి పాటలు పెట్టి నృత్యాలు చేశారు. ఏమాత్రం ఆధునిక సభ్యత
కాలుమోపని ఆ సంప్రదాయిక ఎంజాయ్ మెంట్ లో నేను మైమరచిపోయాను. అక్కడంతా పవిత్రంగ,
తేలికగ అనిపించింది. తర్వాత రాత్రి భోజనాలు. అందులో వాళ్ళే నన్ను పిలిచి ఏవో పనులు
చెప్పారు.. చేశాను. వాళ్ళంతా సంతోషించారు.. మంచి పిల్ల అని అన్నారు. దానికి అమ్మ
సంతోషించింది. ఎట్లగో అట్ల రాత్రైంది. పూజలన్నీ ముగిశాయి. మేము ఇల్లు చేరేసరికి
రాత్రి పదకొండైంది. అన్యమనస్కంగ ఉన్న నన్ను అలసట వల్లేమోనని సరిపెట్టుకుని అమ్మ
ఎక్కువ ఒత్తిడి చేయలేదు.
ఆ రాత్రి నాకు నిద్ర లేదు. భవిష్యత్తు
తలచుకుంటే అదురు. మామూలుగానే పిల్లలు ఇటువంటి మనసు విరిచే పనులు చేస్తే పెద్దలు
పడే బాధకు అంతు ఉండదు. అటువంటిది ఇంత నేపథ్యం ఉన్న వీళ్ళకు ఆ బుద్ధి లేని కొడుకు
చేయబోయే పనికి ఎంతటి వేదన కలగబోతోందో తలచుకుంటే చాలా దిగులు, కోపం, ఆవేదనా
కలుగుతున్నాయి. ఇవాళ రేపు సమాజంలో ఇటువంటివి చాలా సాధారణమైపోయాయి, ‘ఏం ఉందిలే,
కొన్నాళ్ళైతే వాళ్ళే ఒప్పుకుంటారు..!’ లాంటి ఫార్ములాలు చాలా ప్రచారంలోకి వచ్చాయి.
కానీ నిజంగ ఆ అగాధాలు ఎప్పటికైనా పూడుకునేవేనా..? అవి ఏర్పడ్డ హృదయాలకు
తెలుస్తుంది. అది కూడ వారి హ్రస్వ దృష్టి అని, చేతకానితనమని, ఎదగలేనితనమనీ,
సమాజంతో అడుగు కదిపి నడవలేని తనమనీ మళ్ళీ ఎన్నో అభాండాలు.. సంప్రదాయంగ ఉండటం పెద్ద
నేరమైనట్టు.. పిల్లలనుండి ఈ మాత్రం కోరుకోవటం ఘోరతప్పిదమైనట్టు.. ‘మా జీవితం.. మా
ఇష్టం..’ అని పెద్దపెద్ద అనుభవశూన్యమైన మాటలు..! వాళ్ళకు పెద్దల ఆశీస్సులు
అక్కరలేదు.. ఛత్రఛాయలూ అక్కరలేదు. వాళ్ళ ప్రేమే ముఖ్యం. అమ్మాయి ప్రేమే ప్రేమ.
అమ్మానాన్నల ప్రేమ దుమ్ము. ఛఛ.. ఎంత కఠినహృదయులు ఇటువంటి కొడుకులు!!
ఆ రాత్రి అనే కాదు, నాకు ఆ పెళ్ళి
స్ఫురణకు వచ్చిందా.. ఏ రాత్రీ నిద్ర పట్టదని తెలుసు. పూర్తిగ కలత ఆవహించింది. రోజు
ఇంత బరువుగా ఎప్పుడూ గడిచింది లేదు. కనీసం చెప్పుకునేందుకు ఎవరైనా ఉంటే ఇంత దిగులు
చెందేదాన్ని కాదు. ఎవరితో మాట కదపాలో, ఎట్ల కదపాలో తోచక సతమతమైనాను. మామయ్యను ఈ
పెళ్ళి చేసుకోకుండ ఆపగలిగితే బాగుండని మాత్రం ఉంది. అందుకు ఏం చేయగలనో తట్టింది
కాదు.
మరునాడు- అమ్మ ఏవో సరుకులు తెమ్మని
లిస్టు అందించి, డబ్బుల పర్సు చేతిలోకి ఇస్తే సరే కదా అని పక్క ఇంటి రాజిని తోడు
తీసుకుని సూపర్ మార్కెట్ కి బయలుదేరాను. కావలసినవన్నీ కొని బిల్ వేయించాక చూస్తే,
రాజి కళ్ళార్పకుండ ఎదురుంగ దుకాణం వంక చూస్తోంది. అక్కడ పండ్లరసం అమ్ముతున్నారు.
"ఫ్రూత్ జూచ్ కావాలా..?" అని
అడిగితే రాజి నమ్మలేనట్టు నా వంక చూసి, మర్యాదకు కష్టం మీద తల అడ్డంగ ఊపింది. ఆ
వద్దు లోని కావాలి నాకు సులువగానే బోధపడి నవ్వుతూ ఆ పసిదానితో అటు షాప్ వైపు
వెళ్ళాను. నేను ఆరెంజ్ కావాలంటే రాజి పైనాపిల్ అడిగింది. ఇద్దరం అక్కడ బల్ల మీద
కూర్చుని తాగసాగాము. రాజి వాళ్ళ స్కూల్ టీచర్ ఏ పండ్ల రసం తాగితే ఎంత బలం
వస్తుందని చెప్పిందో అంత నాకు చెప్పసాగింది.
అంతలోకి నా దృష్టి అలవోకగ ఓ అందాల భామ
మీద పడింది. అవే కళ్ళు.. అదే ముఖారవిందం. మనసు బరువెక్కింది మళ్ళీ. ఆమె పక్కన మా
హీరోగారి కోసం చూశాను. కానీ ఆ జంటపక్షి మా వాడు కాదు. అన్నాదమ్ముల బాపతులాగ లేదు.
అయితే కథానాయికకు మా కథానాయకుడు ఒక్కడే కాదన్నమాట. ఎవరైనా ఫరవాలేదు.. మగవాడైతే
చాలు అనేటంతటి ఉదార స్వభావమన్నమాట.
ఛి!! ఎంత అసహ్యంగ ఉందో ఆ అమ్మాయి వర్తన.
బట్టలు ఒళ్ళు కప్పుకోవటానికో విప్పుకోవటానికో అని అనుమానాన్ని రూఢికలిగించే విధంగ
ఎదురుంగ నిలువెత్తు సాక్ష్యం. ఎంతో జాగ్రత్తగ అవసరమైన చోట్లను వాయుదేవుడికి
వదిలేస్తూ అతిశ్రద్ధతో ధరించిన ఆ దుస్తులు అక్కడున్న వారందరికీ ఉచితంగ సినిమా
చూపిస్తుంటే నాకు నేనూ ఆడదాన్నైనందుకు మొదటిసారి సిగ్గుగా అనిపించి తల
ఎత్తుకోలేకపోయాను. చెరొక ఐస్ క్రీం కొనుక్కునే స్తోమత లేనట్టుగా ఒకే ఐస్ క్రీం
బార్ కొని ఇద్దరూ సర్దుకుంటుంటే నాకు కడుపులో తిప్పింది. ఈ దృశ్యం మా సంయత్ గారే
చూస్తే ఎంత ఆనందించేవాడో కదా. ఒకసారి అతన్ని మనోశక్తితో ఇక్కడికి రప్పించి ఈ సీన్
చూపించాలని అనిపించింది బలంగ. తన కాబోయే భార్యామణిని ఇంతమందికి ఆనందం గొలిపిస్తూ
చూసి ఎంత పొంగపోయేవాడో కదా. కానీ అట్ల జరగదెందుకు..? నేను చూసింది చూసి
తెలుసుకుంటున్నది అతను తెలుసుకోడెందుకు..?
మనసంతా మరొకసారి వికలమైంది. తాగిన జూస్
తో తృప్తి పడిన రాజిని తీసుకుని తను చెప్పే ముచ్చట ఏమాత్రం పట్టించుకోకుండ తిరిగి
ఇల్లు చేరాను. ఆ పాపను వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి, తిరిగి నా గదిలో వచ్చి ఆలోచిస్తూ
కూర్చున్నాను. నాకు ఇంకేమీ వినిపించటం లేదు. కనిపించటమూ లేదు. మనుషులంటే అసహ్యం
వేస్తోంది. మనిషి అవివేకానికి నవ్వూ, ఏడుపూ రెండూ వస్తున్నాయి. కులమతాల తాలూకు
కాకపోయినా "పోనీలే" అనుకున్నాను. కానీ మనిషికి ఉండాల్సిన కనీస గుణం,
నీతి కూడా లేదు. ఏ కోణం నుంచి అమ్మాయికి ఉండవలసిన ఒక్క సద్లక్షణం కనిపించటం లేదు.
ఇటువంటి పిల్లను కట్టుకుని పోనీ అతను తనవరకు తనైనా సుఖపడగలడా..? ఇంత అస్థిరమైన నడవడి
ఉన్న అమ్మాయి అతనితో కలిసి నాలుగు రోజులైనా కాపురం చేస్తుందా..?
తాను చేసుకోబోయే అమ్మాయి ఇంట్లోవారికి
కూడా ఏదో ఒకటి అవుతుంది కదా. మహాలక్ష్మి లాంటి అత్తయ్యల సరసన తోటికోడలిగా
చెప్పుకోగలిగే అర్హత ఈమెకు ఉందా..? కదంబ, సారికలు నోరారా పిన్నీ అని పిలవగలిగే
స్థాయి అయినా ఉందా? అమ్మమ్మ ఎవరికైనా ఈమెను పరిచయం చేస్తూ, మా కోడలు అని
చెప్పుకుంటుంటే ఊహించటానికే అసహ్యంగ ఉంది. ఆ పరిచయం విన్నవారి ముఖం ఎట్ల వంకరలు
తిరిగిపోగలదో ఊహిస్తే నాకూ అదే అవుతోంది. మామయ్యవాళ్ళు ఆమెను చూస్తే
ఏమనుకుంటారు..? అమ్మ ఎట్ల స్పందిస్తుంది? ఊరెంబడి విలాసంగ ఒళ్ళు ఎరగకుండ
తిరుగుతున్న ఈ అందాలరాణి ఓ ఇంటి కోడలిగా, ఓ ఇల్లాలిగా, ఓ తల్లిగా నెగ్గుకురాగలదనే
మా మహాశయులు ఆమెతో నూరేళ్ళ బంధానికి సిద్ధమవుతున్నారు..? విరబోసుకున్న కురులు
కళ్ళు కప్పుతున్నాయి. పెట్టుకున్న జోడు నెత్తికెక్కి కూర్చుంది. ధరించిన దుస్తులు
తమను కప్పేభాగ్యానికి నోచుకోలేదు ఆమె అందాలు. ఆమె నవ్విందంటే పరిసరాల వారందరికీ
తలఒంపులే. ఒక్క అంశం కూడా కుదురుగా సరైన విధంగ సరైన స్థలంలో లేదు. తనలాంటి వాడికి
ఆ పిల్ల ఎట్ల సరిజోడు అని అతను ఆ నిర్ణయానికి వచ్చాడు..? "ఎన్నాళ్ళు కుదిరితే
అన్నాళ్ళు" అనే సిద్ధాంతం మీద గారంటీ లేని ఇవాళరేపటి వస్తువుల లాగే
అనుబంధాలను చూస్తున్నారా..? ఎంత అందితే అంత అని అంగీకరిస్తున్నారా..? అటువంటి
నిర్ణయాల తర్వాత పర్యవసానాలు వారికి తెలుసా..? ఎట్ల తెలిసేను..? ఎప్పుడూ
పిచ్చాసుపత్రులకు వారు వెళ్ళరు కదా.
ఇంట్లో పెళ్ళికి ఎదిగిన
ఆడపిల్లలున్నారు. వారికి తాతయ్యా అమ్మమ్మల మంచి పేరు వల్ల మంచి సంబంధాలు కుదిరే
అవకాశాలు ఉన్నాయి. చూస్తున్నారు కూడా. ఇతను ఇటువంటి వేళలో ఇటువంటి పని చేస్తే వారి
భావి జీవితం మీద దుష్ప్రభావం పడే అవకాశం బాగా ఉంది. తాతయ్య సమాజంలో ఒక స్థాయి
గుర్తంపు ఉన్న పెద్దమనిషి. ఆయన పిల్లలను, కుటుంబాన్ని అంత ఆదర్శానికి ప్రతిరూపంగా
చెప్పుకుంటారు. ఒక్కమనిషి చేసే ఒక్క తప్పు వల్ల ఇంతమంది జీవితాలు ముందు
ప్రశ్నార్థక చిహ్నం మొలుస్తుంది. ఈ మాట అతను ఎందుకు ఆలోచించడు..? ఏదైనా పొరపాటు
జరిగితే తనను తాను ఎన్నటికైనా క్షమించుకోగలడా..? అందుకైనా నేను అతనిని ఈ పెళ్ళి నుంచి
తప్పించాలి. కానీ ఎట్ల..? ఇంతదూరం వచ్చినవాడు వెనక్కు పోతాడా..? అదీ నేను
చెప్పానని? అసలు నేనతనికి నోరు తెరిచి ఆ మాట చెప్పగలనా?
"గంట నుంచి ఫోన్ మోగుతంటే
ఎత్తవేమే..?" అని అమ్మ విసుగుగా అరిచిన అరుపుకు ఆలోచనా సాగరంలోనుంచి లోకంలోకి
హైజంప్ చేశాను- ఆ మరునాడు ఉదయం. ఫోన్ బర్రుబర్రుమంటుంటే దాని వంక చిరాగ్గ చూశాను.
తనతో పక్క ఇంటికి పేరంటానికి రమ్మంటే రానన్నానని ఒంటరిగా తయారవుతూ కోపంతో
రుసరుసలాడిపోతోంది అమ్మ. పేరంటాలంటే నాకు ఇష్టమే అయినా అక్కడంతా నన్ను పై నుంచి
కిందిదాకా చూస్తూ, నా గురించి ఏదో మాట్లాడుకుంటుంటే ఎట్లగో అనిపిస్తుంది. ఆ
ఇబ్బంది అమ్మకు వివరించలేక నేను రానని ఒకే మాటంటాను. మొదట్లో ఏవో సంప్రదాయాల మీది
ఆశతో వెళ్ళినా తర్వాత అందులో ఈ ఇతరకోణాలు తెలిసివచ్చి ఉత్సాహం నీరుగారింది.
ఈ ఫోన్ ఒకటి నా ప్రాణానికి..!! నా
అనాసక్తతో పని లేకుండ మోగుతూనే ఉంది. పది కాల్స్ లో నుంచి తొమ్మిది రాంగ్
నెంబర్లే!! ఫోన్ ఎత్తి, అటు వాళ్ళు ఫలానా నెంబరేనా అని అడిగితే రాంగ్ నెంబర్ అని
కసితీరా తిట్టాలి, పుటుక్కున ఫోన్ ఎత్తి కొట్టాలి అనే పూర్వప్రణాలికతో ఎత్తి
"హలో" అన్నాను, నా నిర్లక్షాన్నంతా ఒలకబోస్తూ.
"నేనెవరో చెప్పుకో,
చూద్దాం.." నా అంచనా తప్పిస్తూ ఫోన్ లో అటు పక్కనుంచి వినిపించిన తీయని
చిరపరిచితమైన గొంతు ఎవరిదో గుర్తుపట్టటానికి మెదడును నియోగించాను.
"ఎవరు కావాలండీ మీకు..?"
అంత గుర్తు తెచ్చుకునే ఓపిక లేక
అడిగేశాను, విసుగుతోనే. ఏదో పేరు అడుగుతుంది.. అది కాదని చెప్పి పెట్టేయాలని
తొందరపడుతుంది నా బుర్ర.
"అనుకున్నానే.. ఇదే అంటావని..!!
నువ్వు మర్చిపోతావే..!! నాకు తెలుసు!! తిక్కలీ.. రోకలీ.. గుండ్రాయి.. బండ్రాయి..
వెర్రి.. తొర్రి.."
ఏమిటీ తిట్లు..? ఏయ్.. ఎవరది..? అని
కసరబోయిన నాకు చటుక్కున స్ఫురించింది ఆ పేరు.. అంతే, గావుకేక పెట్టేశాను ఫోనులో.
"చందన!!!!"
హమ్మయ్య.., చందన గొంతే అది. ఇవి దాని
తిట్లే. గుర్తుపట్టేశాను. అయితే మరో శుభవార్త తెలిసి ఉక్కిరిబిక్కిరైనాను. వాళ్ళకు
కూడా ఈ ఊరే బదిలీ అయి ప్రస్తుతానికి నాకు సరిగ్ఘ అర్ధగంట దూరంలో ఉందట. నాన్నగారి
ఆపీస్ డైరీ ద్వారా ఆఫీస్ కి చేసి, ఇంటి నెంబరు సాధించి ఫోన్ చేసిందిట. నేను ఎగిరి
గంతులు వేశాను. ఆ వార్త ఎనర్జీ డ్రింకులా నా నరనరాల్లో అమృతం పోసింది.
"ఏంటే.. ఆ గంతులేంటి..? పసిపిల్ల
వేషాలేంటి..? పెళ్ళి కావాల్సిన ఆడపిల్లలు వేసే వేషాలేనా..?" అని అమ్మ కోపంగ
కసిరింది.
నేను అమ్మ దగ్గరకు వెళ్ళి గట్టిగ ఆమెను
ముద్దు పెట్టేసుకుని, చందనతో ఫోనులో, "చందూ.. నేనొస్తున్నా.." అనేసి
రిసీవర్ పెట్టేసి ఇంకా కాసేపు ఎగిరాను. అమ్మకు విషయం అర్థమైంది. "వెళ్ళనా?"
అంటే "ఊఁ.." అంది నవ్వి.
నాన్నగారు ఇంట్లోనే ఉన్నారివాళ, ఏదో శెలవు అని. దాంతో బండి దొరికింది.
"అమ్మడూ.. బండి వద్దు. ట్రాఫిక్ లో
కష్టం అమ్మా.." అన్నారు నాన్నగారు.
ఏం కాదని, నేను జాగ్రత్తగానే వెళతానని
వారికి నమ్మకం కల్పించి నేను కదిలాను, బండితో వీరోత్సాహంగ. అబ్బ..!! చందన!!! నేను
ఇన్నాళ్ళకు చందనను కలవబోతున్నాను. ఆనందం, ఉత్సాహం, ఉన్మాదం.. అప్పటి మా చర్చలు,
వాదవివాదాలు, వినోదాలు, గంటల గంటల మైమరపు గుర్తుకు వచ్చాయి. తను ఈ ఊళ్ళోనే
ఉంటుందంటే నాకెంత పండగో. అదే ఆలోచిస్తూ నాన్నగారు జాగ్రత్తగ వెళ్ళమని పదే పదే
చెప్పినా నేను మాత్రం కళ్ళు బైర్లు కమ్మి మొత్తానికి ఎవరినో పెడేల్న టక్కర్
కొట్టేశాను..!!! కళ్ళముందు కమ్మిన చీకటి తొలిగి వెలుగు కనిపించేసరికి, తప్పు నాది
కాదని, వేగంగ వస్తున్న అవతలి బండిదేనని అర్థమైంది. ఎందుకంటే వాళ్ళ రాంగ్ సైడ్ లో
ఉన్నారు. తప్పెవరిదైతే ఏం..? వాళ్ళూ పడ్డారు.. నేనూ పడ్డాను. నా మోచేయి
గీరుకుపోయింది. కాలికి దెబ్బ తాకింది. అసలు ఆ బైక్ మీద నిలువుగాడిద ఎవరా అని
మోచేతికి కర్చీఫ్ అద్ది పెట్టి అదిమి లేచి నిలబడుతూ చూశాను. అంతే!! కళ్ళు
చేటలైనాయి..!! పార్కు సుందరితో మా కథానాయకులు ప్రత్యక్షమైనారు..!! మామయ్య ప్రేమతో
కొని ఇచ్చిన బైక్ ఈ విధంగ వినియోగపరుస్తున్నారన్నమాట..!!
నన్ను అక్కడ చూస్తూనే అతని ముఖం
పాలిపోయింది. నేను జుగుప్సగా ఆ అమ్మాయి వంక చూస్తుంటే అతను గబగబా కింద పడిన బైక్
లెవనెత్తుకుని, తనకు తగిలిన గాయాలను కూడా పట్టించుకోకుండ చకచకా ఎక్కి స్టార్ట్
చేసి కనీసం నాకు మానవతా దృష్ట్యా ఒక సారీ అయినా చెప్పకుండ వెళిపోయాడు. ప్రపంచాన్నే
ఓ ఫ్యాషన్ షో రాంప్ అనుకునే ఆ ప్రపంచసుందరి అతుక్కుపోయే జీన్స్, కిందా పైనా
చాలీచాలని టీషర్ట్ వేసుకుని, రింగులరింగుల జుట్టు గాలిలో ఎగురుతుంటే వెనక అతనిని
హత్తుకుపోయి కూర్చుంది. వారి బండితోపాటే తిరుగుతున్న తలను ఆపి పట్టుకుని బట్టలు
దులుపుకుని, లేవటానికి సహాయం చేసినవారిని కృతజ్ఞతగా చూసి, థాంక్స్ చెప్పి ఇంకేమీ
ఆలోచించే ఓపిక లేక స్కూటీ లేపి చందన ఇంటి వైపు బయలుదేరాను. అడ్రస్ త్వరగానే
పట్టుకున్నాను.
స్నేహశీలి, ఇష్టసఖి అయిన సఖురాలితో
మాట్లాడంగనే నా మనసులోని బరువంతా తీరిపోయింది. అవధుల్లేని ఆనందాన్ని, పిడికెడు
గుండెలో పట్టటం కష్టమే అయింది. కబుర్లు అనంతం, కాలమే సాంతంగ కనిపించింది. వాళ్ళకు
మేము అక్కడి నుంచి వచ్చేశాక ఏమీ బాగ అనిపించక ఎప్పటికైనా తిరిగి స్వస్థలం
చేరాల్సినవామే కదా అని అంకుల్ మీద ఒత్తిడి తెచ్చి మొత్తానికి సాధించారట ఈ ట్రాన్స్
ఫర్. ఆంటీ అంకుల్ తో అట్ల కాసేపు గడిపాక భోజనం చేసేసి, చందన నన్ను డాబా మీదకు
తీసుకువెళ్ళింది. అక్కడ మాకోసం ప్రత్యేకించి వేయించి ఉంచిన మంచం మీద కూర్చుని
తనివితీరా మనసు విప్పి మాట్లాడుకున్నాము ఇద్దరం. నేను ఈ ఊరు వచ్చాక జరిగిన
విశేషాలన్నీ చెప్పాను. తను తన సంగతులన్నీ చెప్పింది.
మధ్యలో చందన నావంక చూసి, "ఎప్పటి
నుంచి నటించటం నేర్చుకున్నావే?" అంది.
నేను అర్థం కానట్టు చూశాను.
"నీకూ నాకూ మధ్య ఏదో పొర వచ్చింది.
కాదని చెప్పు చూద్దాం..?"
చందనను మోసపుచ్చటం నావల్ల కాదు. అందుకే
తల వంచుకున్నాను, ఏం చెప్పాలో తోచక, "ఎట్ల చెప్పాలో తెలియటం లేదు.."
అన్నాను.
"దేవుడు నోరిచ్చింది ఏడవటానికి
కాదే..; ఆయనతో అయినా, అవి వినేవారితో అయినా మన బాధ చెప్పుకోవటానికే..!! అది
ఉపయోగించి తెలుగుభాషలో ఏడువు.." అంది చందన చిరాగ్గ.
నేను ఏం చెప్పే ఓపిక లేక నా సెల్ ఫోన్
తీసి అంతకు ముందు ఫ్రూట్ జూస్ రెస్టారెంట్ దగ్గర తీసిన రీనా వీడియో చూపించి, తర్వాత
పార్క్ సీన్ చూపించాను.
"ఎవరు వాళ్ళు?" అంది.
"ముందు చూపింది ఆ పిల్ల రియల్
కారెక్టరు.. తర్వాత చూపించింది మా కుటుంబ సమస్య. ఆ పిల్ల హీరోయిన్.. మా అమ్మ
తమ్ముడుగారు హీరో.. అది కథ.." అని విషయం అంతా చెప్పాను.
"ఏం చేస్తుంటాడతను..?"
"పీజీ అయిపోయింది.. ఎంకాం
అనుకుంటా. ఇప్పుడు సీడబ్లూ చేస్తున్నట్టున్నాడు."
"ఎటువంటివాడు..?"
"స్వతహాగా మంచివాడే. పెద్దగ
చదువంటే అభిరుచి లేదు. ఏదో నడిపిస్తున్నాడు. దుర్వ్యసనాలేం లేవు. కానీ ఈ యుగం
షోకులున్నాయి. సినిమాలు.. షికార్లు.. స్నేహితులు..! ఎక్కువగా టైం వేస్ట్ పనులే.
సిగిరెట్లూ, తాగుడూ లాంటివి హానికరమైనవేం ఉన్నట్టు లేవు కానీ ఏదో చిరాకుగ
ఉంటాడెప్పుడూ..!"
"మానసిక పరిణతి ఎట్ల
ఉంటుంది..?"
"చూడంగనే కొట్టొచ్చినట్టు
కనిపించేది బాగా ఇమేజ్ కాన్షియస్ గా ఉంటాడు. తనకు తాను చాలా ప్రాముఖ్యం
ఇచ్చుకుంటాడు. మహా డామినేటింగ్. పెద్దగ నైతిక పతనాలు అనను కానీ చెల్లపెంకులను చూసి
జాతి వజ్రాలని భ్రమపడే రకం. కాస్త యువతకు సహజంగ ఉండే జోరు ఉంటుంది. మన మఠంలో
చెప్తారే.. ప్రయత్నం లేని ఉత్సాహాలు.. ఆధారం లేని ఆత్మాభిమానాలు, నిలకడ లేని
ధైర్యాలు, ప్రశ్నను చూసి పారిపోయే ఆత్మవిశ్వాసాలు.. నాకు అంతా తెలుసుననుకునే
భ్రమప్రమాదాలు.. అంతే. దిశాహీనత.. అవగాహనా లోపం..! చెడ్డవాడు, ప్రమాదకారి కాదంతే.
చూసినంతలో పెద్ద విశేషాలేం లేవు. షష్టిపూర్తి రోజు అందరికన్నా ఆలస్యంగ కిందకు
వచ్చినా ఇంట్లోవారికి పనులలో కాస్త సహాయంగ ఉన్నాడు. అదొక్కటే కాస్త
పాజిటివ్.." అని ఆగి, చందన నన్ను అదోలాగ చూడటం గమనించి, "కొంత గమనించటం
వల్ల, కొంత కదంబవాళ్ళ వల్ల తెలిసింది. వాళ్ళంతా అతని మీద తెగ
జోకులేస్తుంటారు.." అన్నాను కదంబ చెప్పిన విషయాలు గుర్తు చేసుకుని నాలో నేనే
నవ్వుకుంటూ.
"అతను ఏ ఏజ్ గ్రూప లోకి వస్తాడు..?
అమ్మవాళ్ళతో ఉంటాడా లేక కదంబవాళ్ళతో ఉంటాడా..?"
"అదే అతని సమస్య. ఇద్దరిలోనూ లేడు.
అమ్మమ్మావాళ్ళకు మామయ్య, అమ్మ, పిన్ని వెంటవెంట కలిగారు. కానీ ఇతను చాలా ఆలస్యంగ
పుట్టాడు. కనీసం అమ్మకన్నా పదిహేడేళ్ళు చిన్నవాడు. అమ్మకు పెళ్ళయ్యేటప్పుడు అతనికి
ఏడాది నిండలేదంటా. దాదాపు మామయ్య పిల్లల వయసువాడు. కానీ అనుబంధంలోని పెద్దరికం
వల్ల వారితో కలవలేడు. ఇటు వయసు తేడా వల్ల పెద్దవారితో కలవడు. ఒంటరివాడినన్న భావన
చాలా ఉంటుంది. అందుకే స్నేహితులను ఎక్కువ ఆశ్రయించాడేమో. పనికిమాలినవారు కాదు కానీ
గొప్పగ పనికి వచ్చేవారూ కాదనిపించింది. అయి ఉంటే అతనిట్ల చేస్తున్నాడని తెలిసి ఆపేవారు
కాదా..? స్నేహితుల ప్రోత్సాహం సహాయ సహకారాలు లేకుండ ఎవరూ ఇట్లాంటి విషయాలు ఒంటరిగా
చేసుకోలేరని నాకనిపిస్తుంది."
"పోనీ.. చేసుకోనీ..!! దాని వేషాలు
తెలిసిననాడు అంతకంతకు అనుభవిస్తాడు కదా.. అప్పుడు తెలిసి వస్తుంది." అంది
చందన కచ్చాగ.
"అదే చాల బాధగ ఉంది.. తనతో పాటు మా
కుటుంబం అంతా అనుభవిస్తారు. నాకు ఏ చర్చిలో ఈ ఘనకార్యం జరగబోతోందో తెలుసు. ఆ పిల్ల
ఎవరెవరితో తిరుగుతందో, వాళ్ళ సభ్యసమాజం ఎటువంటిదో, దాని బాయ్ ఫ్రెండ్స్ అందరి
జాతకాలేంటో తెలుసు. దాని మాదకపదార్థాల ఇంజెక్షన్లు ఎక్కడెక్కడి నుంచి వస్తాయో కూడా
తెలుసు. ఇంకా ఏమేం చెప్పమంటావో చెప్పు..! ఇందరిని కాదని దాన్ని చేసుకుని అతనేం
సుఖంగ ఉండలేడు. అంతా తెలిసీ నేనేమీ చేయలేకపోతున్నాను. దీన్ని ఆపగలిగితే
బాగుండు." అని పక్కకు చూశాను, కళ్ళు తుడుచుకుంటూ. ఎందుకో ఆపుకోలేనంత ఏడుపు
వచ్చింది. ఇన్నాళ్ళ దిగులంతా అక్కడ బయటపడింది.
నాకు పది నిముషాలు పట్టింది పూర్తిగ
సర్దుకోవటానికి. చందన నేను మరి కాస్త సర్దుకునేదాక ఆగి, తర్వాత నావంక గుచ్చి
చూస్తూ అడిగింది, "విషయం అంతేనా.. లేక ఇంకేమైనా ఉందా..?"
"ఇంకేం ఉంటుంది..?" అన్నాను
అర్థం కానట్టు.
"హీరో నీ చేయిజారిపోతున్నాడని...
అంటే..?" అని నా భావాలు గమనిస్తూ ఆగింది.
నాకు దాని ఉద్దేశం అర్థమై..,
"ఛిఛి.. అదేం లేదు.. బాధపడితే ఇల్లు చేజారిపోతుందేమోనని బాధపడతానేమో..
కానీ.." అన్నాను తల వాలిపోతుంటే.
"ఓహ్.. అది సంగతి." అని చందన
నవ్వి, "నువ్వు తలచుకుంటే అతని ద్వారా నీకు ఆ ఇల్లు దొరకటం పెద్ద సమస్యేం
కాదేమో. నువ్వు చెప్పినదాన్ని బట్టి యోగ్యుడే అనిపిస్తోంది.. వరసా సరిపోతుంది..!
ఒత్తిడి తెస్తే ఇంట్లోవాళ్ళు ఒప్పుకునే అవకాశం ఉంది."
"కావాలనుకోంగనే దొరకద్దూ? అమ్మమ్మా,
తాతయ్యా నన్ను అంత సులువుగా ఒప్పుకుంటారా..? నీకు తెలుసుగా నా సమస్య..! ఎందుకు
మావాళ్ళు నన్ను ఇక్కడకు దూరంగ ఉంచి పెంచారో..!" అన్నాను.
"నిజమే. కానీ నువ్వు చెడ్డదానివి
కాకపోతే సమస్య తీరదు. ఎంత చెడ్డా ఆ నీతి-జాతి లేని దానికంటే నువ్వు వెయ్యి రెట్లు
నయం కాదా..? ఏమో, మఠంలో కోర్సు చేశాక అయినా అంకుల్ చూపించిన అతని ముందు నువ్వు
తలవంచేదే కదా. అదేదో ఇప్పుడే చేసుకో. నీకు మీ హీరో చెడ్డవాడు కాదని తెలుసు కదా..!
ఆంటీవాళ్ళకు కూడా సంబంధాలు చూసే బెడద తప్పుతుంది." అని ఆగి, "ఊఁ..
హార్దిక.. సంయత్.. బాగుంటుందే మీ జంట.." అంది.
నేను తల వంచుకుని ఆలోచించాను. నాకు
ఇప్పటిదాకా ఒక వైపే బాధ..! ఇప్పుడు తన మాటలతో నేనే ఆ సమస్యలోకి దూరిపోవాల్సి
వస్తోంది నేరుగ..! అనవసరంగ ఇరుక్కుంటున్నానేమో.
"ఏమో.. వారికే జత సరిపడక
విడిపోవచ్చు. చివరి క్షణంలో ఏదైనా జరిగి విడిపడచ్చు. లేదంటే ఒకసారి ఈ వీడియో
చూపించి మాట్లాడి చూస్తాను.." అన్నాను సాలోచనగా.
"ఇందాక ఆ పిల్ల బట్టలు ఎట్లున్నాయో
చెప్పావు కదా. అటువంటి పిల్ల ఇటువంటి తిరుగుడు తిరుగుతుందని తెలియకనే ఉంటుందంటావా
అతనికి..?"
"అంటే
ఏంటి?" అన్నాను. అంతలోకి డాబా గదిలో ఫోన్ మోగింది. చందన వెళ్ళి ఎత్తి, మా
ఇంటి నుంచే అని చెప్పింది. నాకోసం ఎవరో వచ్చారు. రమ్మని చెప్పింది అమ్మ. నాకు
అర్థం కాలేదు ఎవరొచ్చారో. ఎవరని అడిగితే అప్పటికే ఫోన్ పెట్టేసింది. నాకోసం ఎవరు
రాగలరో ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. సరేనని చందన దగ్గర శెలవు తీసుకుని అది
చెప్పిన మాటలు ఆలోచిస్తూ అరగంటలో ఇల్లు చేరాను.
No comments:
Post a Comment