Sunday, 4 December 2016

5. మార్గదర్శిని -4



          అతను చెంప పట్టుకుని నమ్మలేనట్టు నా వంక చూశాడు. తిరిగి కొడదామని చేయి లేపి ఎందుచేతో ఆగిపోయాడు. అతని కళ్ళలో నీరుబికింది.
          అవి చూస్తూ అన్నాను- "నువ్వు రీనాని పెళ్ళి చేసుకుని అమ్మమ్మా, తాతయ్యా వాళ్ళమీద ఇందాక నన్ను కొట్టినట్టు ఒకటి కొడతావు. అప్పుడు వారు మారు పలకకుండా ఈ లోకంలో నుంచి వెళిపోయి, నిన్ను కొట్టే ఈ పని నేరుగ చేయకుండ పరోక్షంగ చేస్తారన్నమాట. నువ్వు, నీ భార్య వల్ల వారికి సమాజం పెట్టబోయే మాటల శూలాల దెబ్బలను తప్పించుకోవటమే కాకుండ, ‘వీడు గుణసంస్కారాలు లేని పిల్లను పెళ్ళి చేసుకోవటం వల్లే పెద్దవాళ్ళు వెళిపోయారు.’ అనే అపనింద - నేను కొట్టిన చెంపదెబ్బలాగ - నీ మీద వేసి నిశ్చింతగ వెళిపోతారు. నా బాధ ఏంటంటే, అది నిన్ను, ఈ కుటుంబాన్ని జీవితాంతం వెంటాడుతుంది. ఇప్పుడు నేను కొట్టే ముందు కొట్టాక నీకు ఎట్ల అనిపిస్తుందనేది నువ్వు గెస్ చేయలేకపోయావో, అప్పుడూ అంతే జరుగుతుంది. నీ స్థితి ఏంటంటే అప్పుడు నువ్వు వారిని తిరిగి కొట్టలేవు.. ఇందాక నన్ను లాగే. ఇప్పుడు సీన్ అర్థమైందా?"
          అతను కళ్ళలో నీరుబుకుతుంటే ముందు మామూలుగ తుడుచుకుని తర్వాత ఒక్కసారిగ ఏడ్చాడు. అతనికి ఇదంతా ముందే తెలుసునన్న సంగతి నాకర్థమైంది.
          "ఏడువు. ఆ కళ్ళ ముందు కమ్ముకున్న పొరలైనా వీడతాయేమో." అన్నాను శాంతంగనే. "తన రాకతోనే- నీకు ప్రాణం పెట్టే అమ్మానాన్నల అనుబంధాన్ని, ప్రేమ పంచే తోబుట్టువుల తోడును, నిన్ను గౌరవించి ఆదరించే అయినవాళ్ళ ఛాయను- పోగొడుతున్న ఆ ఛాయాగ్రాహిణి నీకేం సహధర్మచారిణి కాగలదు..? ఇంకా ఈ చెత్త పని చేశావంటే ఇహానికి పరానికి రెంటికి చెడ్డ రేవడివైతావు."
          అతను ఆలోచిస్తూ, లోలోపల బాధపడుతూ ఉండిపోయాడు. నేను అతనిని వదిలి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చి వంటగదిలోకి వెళ్ళాను, హాస్పిటల్ లో అందరికోసం ఏదైనా టిఫిన్, టీ పంపుదామని. టిఫిన్ చేసి, టీ పెట్టి సర్దటం కూడా అయినాక అవి తీసుకుని బయటకు వచ్చాను. ఏదో తీవ్రంగ ఆలోచిస్తూండిపోయి కనిపించాడు.
          "ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మీ అమ్మ హాస్పిటల్ లో పడితేనే ఇంత వేలాడిపోతున్నావు. వదిలి వెళిపోతే, అదీ నీ కారణంగ, వ్యథతో మథన పడి వెళిపోతే నిన్ను నువ్వు ఎన్నటికైనా క్షమించుకోగలవా..?"
          "కానీ రీనా.. ఆమెను ఏం చేయాలి మరి..?" అడిగాడు ఎంతో కష్టం మీద.
          "సినిమాలు చూడవా..? నీకు కావాల్సిన రోగం సర్టిపికెట్ తో సహా చందన వాళ్ళమ్మ పుట్టించి ఇస్తుంది. ఆమె గుర్తింపు పొందిన డాక్టరు. ఆ ఇఫెక్ట్ నీ ముఖం మీద మేకప్ గా సృష్టించి ఇస్తుంది చందన. ఆమె మంచి బ్యూటీషియన్. పెళ్ళి చేయటం కష్టం కానీ చెడగొట్టటం ఎంత సేపు..?" అన్నాను.
          అతను నవ్వాడు. ఆ నవ్వులో నాకెంతో నిర్జీవత కనిపించింది. హమ్మయ్య, మొత్తానికి మానసికంగ అయినా కనీసం ఆ అమ్మాయిని విడిపించుకోగలిగాడు. తర్వాత ఏం జరుగుతుందో దేవుడికెరుక.
          నేను టిఫిన్ డబ్బా అతనికి ఇచ్చి అందరికీ పెట్టమని ఒక సంచీలో ప్లేట్ లు, స్పూన్ లు వేసి ఇచ్చాను. కొన్ని పండ్లు కూడా కోసి ముక్కలు పెట్టాను. అతనికి ఇచ్చాను తినమని.
          "వద్దు, ఇప్పటిదాకా పెట్టింది అరగనీ. ఇంక ఇది దిగదు." అన్నాడు.
          "సరే, నీ ఇష్టం." అని ఆగి, "సారీ, నిన్ను కొట్టాను. ఏమనుకోకు. నువ్వు పెద్దవాడివి. నేను చిన్నదాన్ని. నన్ను క్షమించు." అన్నాను.
          "అదేం లేదులే. చెప్పుకోవటనాకి మాత్రమే పనికి వచ్చే పెద్దరికం..!" అని ఆగి, "సారీ..! నిన్ను అనరాని మాట అన్నాను." అన్నాడు.
          "నీ మాట చెల్లదని నీకూ అర్థమై ఉంటుంది. ఇందరు మంచి బంధువులున్న నేను అనాథనెట్ల అవుతాను?"
          "ఔను. నువ్వు భూతపూర్వ అనాథ కావటంలో కూడా నీ తప్పు లేదు. కానీ నేను భావి అనాథను కావటంలో నాదే పూర్తి తప్పు." అని ఆగి, "రీనా సంగతి ఎక్కడా బయటకు.." అంటూ ఆగాడు తడపాటుగ.
          "..జన్మలో రానివ్వను. సరేనా..? సెల్ లో వీడియోలు నీ ఎదుటే డిలీట్ చేసేశా కదా. చాలదా?"
          నా వంక లోతుగ చూసి, "ఏం చదివావు..?" అని అడిగాడు.
          నేను నవ్వి, "జీవితానికి పనికివచ్చేది.." అన్నాను.
          నవ్వి, "మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా విశ్రాంతి తీసుకో." అని చెప్పి వెళిపోయాడు.
          కానీ అతను మళ్ళీ నన్ను కలవలేదు. అమ్మమ్మ కోలుకోని ఇంటికి తిరిగి రాంగనే అతను హాస్టల్ కి వెళిపోయాడట. తర్వాత ఎన్నోసార్లు అమ్మమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమె మళ్ళీ యథావిధిగ తన ఉపవాసాలు, పారాయణలు మొదలు పెట్టేసి మామూలుగనే పూజలు, భజనలు, భోజనాలు అని హడావుడి పడిపోయేసరికి నాకు చాలా అవకాశాలే దొరికాయి అక్కడ వాళ్ళతో గడపటానికి. ఇప్పుడు నేను వాళ్ళలో ఒక దాన్ని అయిపోయాను. పూజలలో దేవుడి పీట అలంకరణ దగ్గరి నుంచి భోజనాలలో వడ్డనల దాకా నేను అనుమతింపబడ్డాను. తాతగారికి కీర్తనలు పాడి వినిపిస్తాను. ఆయన వద్ద భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాను. అమ్మమ్మకు ఏకాదశీ భావగత పారాయణ చదివి వినిపిస్తాను. ఆమె నాకు లలితా సహస్రం నేర్పుతుంది. అత్తయ్యకు కొత్త వంటకాలు, రకరకాల కుట్లు అల్లికలు నేర్పుతాను. వాళ్ళ దగ్గర పాతపాటలు నేర్చుకుంటాను. మామయ్యతో కలిసి కారమ్, బ్రిజ్ ఆడతాను. బావ, వదినలతో కలిసి సరదాగా బయటకు వెళతాను.
          అటు నాయనమ్మవాళ్ళతో గుళ్ళకు పోతాను. బాబాయి, పెద్దనాన్నలతో విజ్ఞాన విషయాలు చర్చిస్తాను. పిన్ని పెద్దమ్మలతో ముగ్గులు, కోలాటాలు, కలాపాలు నేర్చుకుంటాను. అన్నాఅక్కలతో, తమ్ముడూ చెల్లెళ్ళతో కలిసి పిక్నిక్ లకు, షాపింగ్ లకు వెళతాను. అటు అమ్మవైపు వాళ్ళు ఇటు నాన్నవైపు వాళ్ళు.. అందరి స్నేహితుల బృందాలు అందరం కలిసి యాత్రలు ప్లాన్ చేశాం. ఒక బోగీకి సరిపడా పెద్ద పటాలం బయలుదేరాం. ఎన్నో క్షేత్రాలు దర్శించి వచ్చాం. ఉత్తర దక్షిణ తీర్థయాత్రలు అయినాయి. ఫామిలీ ఫంక్షన్ లు అయినాయి. పిల్లల పుట్టినరోజులు, పెద్దల పెళ్ళిరోజులు, ఒక గృహప్రవేశం, రెండు ఉపనయనాలు, ఒక నామకరణం ఫంక్షను, నాలుగు పండగలకు గెట్ టుగెదర్ లు.. ఓహ్.. అబ్బబ్బా.. సరదాలకు సంబరాలకు అంతే లేదనిపించింది. నేను దేని కోసం ఎదురుచూశానో అది నాకు పూర్తిగ దొరికింది. చివరకు అన్నీ సరదాలకు పరాకాష్ఠంగా కదంబకు మంచి సంబంధం వచ్చి హఠాత్తుగ పెళ్ళి కుదిరింది. నిశ్చితార్థం కూడా అయింది.
          కానీ వేటికీ అతను రాలేదు. అసలతను హాస్టల్ కి వెళిపోయాక ఇంటికే రాలేదు. చదువుకుంటున్నానని, కుదరదని చెప్పాడట. అంతే. అప్పుడప్పుడూ ఫోన్ చేస్తాడట, అదీ వాళ్ళ నాన్నతో, అమ్మతో క్లుప్తంగ మాట్లాడి పెట్టేస్తాడంతే..! అందరూ దాన్ని సహజంగ అంగీకరించారు. అతనికి అట్ల వెళ్ళి ఉండటం అలవాటేనట. నేను మాత్రం మనసులో ఒక మూల కాస్త శంక పీడిస్తుంటే మథన పడేదాన్ని. అతను ఏం చేస్తున్నాడిప్పుడు? నిజంగ చదువుకుంటున్నాడా..? అక్కడ ఇంటికి దూరంగ ఎందుకు ఉన్నాడు..? జరిగిన దుస్సంఘటన అతని మీద చెడు ప్రభావం కానీ వేసిందా..? నా భయం ఏంటంటే రీనాను పెళ్ళి చేసేసుకుని ఎక్కడైనా కాపురం పెట్టేశాడా అని. అందుకే కుటుంబం, పెద్దల ముందకు రావటానికి ముఖం చెల్లక చాటు చేస్తున్నాడా..? లేదా, రీనాను కాదన్నాడని ఆమె తరఫు వారేమైనా అతనిని ఇబ్బందులకు గురి చేశారా..? లేక ఏమైనా నేను అన్న మాట మనసులో పెట్టుకున్నాడా..? మనస్పూర్తిగనే సారీ చెప్పానే. చివరకు కదంబ పెళ్ళికి కూడా అతను రాకపోయేసరికి నేను నిజంగ బాధపడ్డాను. చందన నన్ను ఆశ్వస్తపరచింది. రాజి వాళ్ళ నాన్న ఆ కంపెనీలో ఉద్యోగం మానేసేసరికి నాకు రీనా వార్తలు లభించే అవకాశం లేకుండ అయింది.
          ఈ పిచ్చి ఆలోచనలలోనుంచి నన్ను నేను కాపాడుకోవటానికి మా ఇంటి దగ్గర చిన్న స్కూలులో ఒక టర్మ్ పాటు టీచింగ్ చేశాను. అక్కడ చందన నాతో కలిసింది. అది లెక్కలు చెప్పేది, నేను సైంసు చెప్పేదాన్ని. టీచింగులో ఆ అనుభూతులను కలిసి బాగా తృప్తిగ ఆనందించాము. అమ్మను నాన్నగారిని అడిగి తీసుకున్న ఈ సంవత్సరకాలం వ్యవధిలో నేను చాలా విలువైనవి చేశాను. చందనతో కలిసి రామకృష్ణామఠంలో విజయవంతంగ విజ్ఞానం పొందుతూ నేననుకున్న కోర్సు పూర్తి చేశాను. అక్కడ జీవితంలో ఎదురుకాబోయే సమస్యలే కాదు, వాటి సమాధానాలూ ఇప్పుడు నా అవగాహనలోకి వచ్చేశాయి. నా అంతఃపరిధి చాలా విస్తృతమైనట్టు అనిపించసాగింది. థియరీ మఠం వాళ్ళు చెప్తే ప్రాయోగికంగ ఆ సమస్యలు వాటి తీరుతకెన్నులు నాకు వివరించటంలో సహాయపడ్డారు అత్తయ్యలు, పిన్నులు అంతా. దాదాపుగా దాని అన్నిరకాల క్షేత్రాలను వాళ్ళు సింహావలోకనం చేయించారు. స్త్రీలకు వయసుతోపాటు వచ్చే మానసిక, శారీరక సమస్యలు, పిల్లలు కలిగినప్పుడు, వారిని పెంచేటప్పుడు ఎదురయ్యే పరిస్థితులు, డబ్బుఖర్చులు, ఎవరైనా ఇంటికి భోజనాలకు వస్తే వారిని ఆదరించటమెట్ల, పిల్లల పుట్టినరోజు పార్టీలు ఎట్ల ఏర్పాటు చేయాలి.... అబ్బబ్బా.. ఒకటా రెండా.. సర్వం.. అడిగిందే తడవుగా అంతా చెప్పేవారు. అవన్నీ చక్కగా చేయగలిగే మానసికశక్తి మఠం కోర్సులో దొరికింది.
          భార్యాభర్తలనే కాదు, నాకు చిన్నతనం నుంచి మనుషులను, వారి మధ్య ఉన్న అనుబంధాలను- అంటే తల్లీ పిల్లలు, అన్నాతమ్ముళ్లు, మామా-అల్లుళ్ళూ.. ఇట్ల ఏవి పడితే అవి ఏవి ఎదురుపడితే అవి అధ్యయనం చేయటం అలవాటు. పెద్దరికంలో వచ్చే సమస్యలు, చిన్నపిల్లలతో బాధ్యతలు, ఇంటి పనులు, బయటి పనులు, ఇద్దరికీ మధ్య ఉండే కామన్ ఏరియాలు, తొందరపాటు వల్ల అనర్థాలు, అత్తగారు మామగార్లతో, ఇంట్లో మరిదులు, ఆడపడుచులతో వచ్చే సమస్యలు, వాటి సమాధానాలు, ఇంకా చాలా చాలా నేర్చుకున్నాను. నా కళ్ళ ఎదురుంగ ఉన్న ప్రతీ ఉదాహరణను నేను కూలంకషంగ అధ్యయనం చేశాను. మనుషుల మధ్య పరస్పర అనుబంధాన్ని, అనురాగాన్ని, ఈ వ్యవస్థలో ఎక్కడ తప్పు జరగచ్చు, వీటికి పరిమితులు ఏంటి, వాటిని ఎట్ల గుర్తించాలి, ఎట్ల అధిగమించాలి.. అన్నీ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. అమ్మ చాలా సంతోషపడింది. నేను ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియకుండ పెరిగినదాన్ని కదా, పైగా ఒంటరి సంతానాన్ని. ఎక్కడ పొగరుబోతుగా తయారై వారికి చెడ్డ పేరు తెస్తానోనని ఆమెకు బోలెడు దిగులుగా ఉండేదిట. ఇప్పుడు అందరు బంధువుల పుణ్యమా అని ఆ సమస్య తీరింది అని ఆమె తృప్తి పడింది. నలుగురితో కలిసి తిరగటంలో వారితో ఇమడటం, ఇబ్బంది కాకుండ మసలటం నేర్చుకున్నాను. వాళ్ళు నేర్పిన పాఠాలను బాగా ఒంటబట్టించుకున్నాను. నా ఇరవైరెండవ పుట్టినరోజుకన్నా ముందే గృహస్థజీవితానికి మానసికంగ సంసిద్ధమైనాను. కోల్­కాతా నుంచి ట్రాన్స్ ఫరై ఇటు వచ్చేటప్పుడు ఆమె దేనికి భయపడిందో అది జరగనందుకు అమ్మనాన్నా సంతోషపడ్డారు.
          ఫలస్వరూపంగ అమ్మవాళ్ళు చూపించిన సంబంధాలకు పెళ్ళిచూపుల మహోత్సవాలు ఒక ఐదారు చేసుకున్నాను. కానీ ఏవీ ఫలించటం కాదు కదా, కనీసం పుష్పించలేదు.. చిగురించలేదు. చందనకు మాత్రం ఇట్ల సంబంధం వచ్చి, అట్ల కుదిరిపోయి పెళ్ళి నిశ్చయమైంది. నేను అందుకు సగం సంతోషించాను, సగం బాధపడ్డాను. ఒకవైపు స్నేహితురాలు జీవితంలో స్థిరపడబోతోంది అని సంతోషమైతే.. మరొకవైపు నాకు దూరంగ బెంగళూరు వెళిపోతుందని బాధ. ఇక ముందు తను లేకుండనే ఏ కోర్సులైనా ఏ ఉద్యోగాలైనా అనే భావంతో నాకు మనసు బరువైంది. అమ్మవాళ్ళు మాత్రం వేరొకందుకు బాధపడ్డారు. "దీని తోటివారందరికీ పెళ్ళిళ్ళైపోతున్నాయి.. దీనికి ఒక్కటీ కుదరటం లేదు.." అని. నిజమే మరి. అటు పెద్దనాన్న కొడుకుకు, బాబాయి కూతురికి దాదాపు ఒకేసారి పెళ్ళిళ్ళు నిశ్చయమైనాయి. అందరి ఆహ్వాన పత్రికలు అందినవి. నేను అన్నింటికీ కావాల్సిన బట్టలు కుట్టించుకోవటంలో, ఉపహారాలు కొనటంలో మునిగిపోయాను.
          "ఇవాళ గుడిలో బాగా దండం పెట్టుకో. ఈ సంబంధమైనా కుదరాలని.." అంది అమ్మ నా జడ దువ్వుతూ.
          "అబ్బా, కనీసం ఈ ఒక్కరోజైనా వదిలేయరాదా అమ్మా..!! నేనూ చందూ, కలిసి ఇవాళ దాని పెళ్ళి పనుల మీద బయటకు వెళదామనుకున్నాం. మూడ్ పాడు చేయకు." అన్నాను.
          "అటు కదంబకు పెళ్ళి సామాగ్రి కొంటానికి వెళ్ళావు.. ఇటు ఈ పిల్లకోసం వెళ్తున్నావు. రేపుదయం ఇంకా మిగితావారంతా నీకోసం కాసుకుని ఉన్నారు. ఎంత సెలెక్షన్ బాగా చేయగలిగితే మాత్రం, ఇహ నీకు ఇదే పనా..?"
          "అరే, బాగుందే.. నాకూ కాలక్షేపంగ ఉంటుంది.. నాలుగు విషయాలు తెలుస్తాయని.."
          "సరే, కాదన్నానా? ఇవాళ ఒక్కరోజు ఆగరాదా..? దైవం అనుకూలిస్తే రేపు వచ్చే సంబంధం కుదిరి నీ పెళ్ళి పనులు కూడా కలిపి చేసుకోవచ్చు. ఏమో.. ఈసారి మోగిన కాలింగ్ బెల్ నీ వరుణ్ణే ఇంట్లోకి తెచ్చి నిలపచ్చు.." అమ్మ రొమాంటిక్ గా అంది.
          సరిగ్గ అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. అమ్మ మాట పూర్తి కూడ కాలేదు..! ఎందుకో ఝల్లుమంది నాకు. కానీ పెళ్ళి చూపులు రేపు కదా..!! ఇప్పుడు వచ్చింది నా వరుడై ఉండే అవకాశం ఉందా..?
          కాదని నిరూపిస్తూ వినిపించింది హీరోగారి గొంతు.
          "నమస్కారం బావగారూ.. బాగున్నారా? బాగున్నావా అక్కా..? అంతా కులాసానా..?"
          అతనా..?!! ఇన్నాళ్ళకు..!! నేను కడుతున్న పూలు పక్కకు పెట్టి, మంచినీరు తీసుకుని బయటకు వెళ్ళాను.
          "హాయ్.." అని పలకరించాడు నీరు అందుకుని గటగటా తాగేస్తూ. అమ్మ చాలా ఆశ్చర్యంగ అడుగుతోంది, 'ఎప్పుడు వచ్చావేంటి కబుర్లు..?' అని. అతనేవో వివరాలు చెప్తుంటే నేను అతని వంక చూశాను. ఏడాదిలో ఆ రూపంలో ఎంత మార్పు వచ్చింది..! బాగా బక్కగ అయిపోయాడు. కానీ ముఖం తేజస్సు తగ్గలేదు. చాలా తేటగ ఉన్నాడు. ఇప్పుడు ముందరి జుట్టు ఫాలం మీద ఎగిరెగిరి పడటం లేదు. పైకి పొందికగా కూర్చుని ఉంది. మనిషి ఇదివరకటికన్నా చాలా కుదురుగ ఉన్నాడు. ఏదో కొత్త వ్యక్తిని చూసినట్టు ఉంది. సీ డబ్లూ చదువు పూర్తైందిట.. అక్కడే ఉద్యోగం కూడా వచ్చిందట. స్వీట్ తినిపించి మరీ చెప్పాడు. అమ్మా, నాన్నా చాలా ఆనందించారు. ఇంతకాలం ఆ పరీక్షలు, హడావుడిలో ఉండి ఇంటికి రాలేకపోయానని, ఎన్నో కార్యక్రమాలు పోగొట్టుకున్నానని చెప్పాడు. వింటుంటే అతని మాట కూడ చాలా మారింది అనిపించింది. నాకు విపరీతంగ ఆశ్చర్యం వేసింది. ఎంత ఆశ్చర్యమైనా అట్ల ఒకరి వంక చూడటం తప్పు కనక, నేను గ్లాస్ తిరిగి అందుకుని లోపలకు వచ్చేసి అమ్మవారి గుడికి తయారైనాను. పూలు అల్లినంత వరకు మాల తుంపేసి, మిగిలిన విడిపూలు బుట్టలో వేసుకుని, హారతి కర్పూరం, అగ్గిపెట్టి, చిన్న ప్రమిద, బుజ్జి నూనె సీసా, అగరొత్తులు, పసుపు కుంకుమ అన్నీ తీసుకుని, అమ్మకు వస్తానని చెప్పి కదిలాను.
          "ఏయ్.. ఈ రోజు ఎటైనా ప్రోగ్రామ్ ఉందా..? ఉంటే కాన్సిల్ చేసుకోవాలి." అన్నాడతను నేను చెప్పులు వేసుకుంటుంటే చూసి.
          ఎందుకన్నట్టు చూశాను.
          "కదంబావాళ్ళు పిక్నిక్ ప్లాన్ చేశారు. నీతో చెప్పి, దగ్గర ఉండి నిన్ను ఉన్నపళంగ తీసుకుని రమ్మన్నారు.." అన్నాడు.
          నేను ఠకీమని చూశాను, 'నీతోనా..?' అన్నట్టు. "కార్ తెచ్చాను.." అన్నాడు నా భావం అర్థమైనట్టు. ఓకే.. అన్నట్టు తల ఊపి, నేను అమ్మ వంక చూశాను.., అక్కడ అడగమన్నట్టు.
          "సరే, వెళ్ళు.. చందనకు నేను ఫోన్ చేసి రేపు వస్తావని చెప్తాలే.." అంది అమ్మ. అతనితో కలిసి బయలుదేరాను. కదంబ వాళ్ళను పిక్ చేసుకుని వెళతామనుకున్నాను. కానీ నేరుగ పిక్నిక్ అనుకున్న చోటికే వెళ్ళాము. వాళ్ళు వెనక వస్తున్నారని చెప్పాడు. సరే, ముందుగా చేరాం కదా, అక్కడకు దగ్గరలో కొండమీద ఉన్న అందమైన అమ్మవారి గుడికి వెళ్ళాం. ఉదయంపూటే అయ్యేసరికి రద్దీ బాగా తక్కువ ఉంది. హాయిగ దర్శనం చేసుకుని, గుడి ఎదురుంగ దీపం వెలిగించి, పూలదండ, పూలు సమర్పించి, పండ్లు నైవేద్యం పెట్టించి, పసుపు కుంకుమలు వేసి దండం పెట్టుకున్నాను. తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని కాస్త దిగువ ప్రాంతం బాగా కనిపించే చోటికి వెళ్ళి కూర్చున్నాము. అతను మౌనంగ కూర్చున్నాడు, ఏదో ఆలోచిస్తూ.
          "ఇన్నాళ్ళు నిజంగ ఏం చేశావు..? ఎక్కడున్నావు..?" నేనే అడిగాను, ఉండబట్టలేక.
          "చదువు, సంస్కారంతో బిజీగ ఉన్నాను.." చెప్పాడు మామూలుగ.
          "చదువు సీడబ్లూ.. మరి సంస్కారమేంటి..?" అర్థం కాక అడిగాను.
          "అంతిమ సంస్కారం.."
          "అంతిమ సంస్కారమా..? అదేంటి..?"
          "ఒకటి కాదు.. రెండు అంతిమసంస్కారాలు. మొదటిది నాలోని దోషాలకు..! ఇంకొకటి.." అని ఆగి అతను తన సెల్ తీసి కొన్ని ఫోటోలేవో వెతికి తీసి చూపించాడు. నేనవి చూసి షాక్ తిన్నాను. రీనావవి. కానీ ఆమె చనిపోయాక తీసినవి. ఆమె వాళ్ళ మతం నియమాలతో ఖననం చేయబడుతున్న ఫోటోలు. నేను నిర్ఘాంతపోయాను. అతని వంక చూశాను.
          "మానిక్ డిప్రెసివ్ న్యూరాసిస్ పేషెంట్. స్కీజోఫ్రీనిక్ కూడా. మానసికంగ విపరీతంగ అస్థిరంగ ఉండేది. ఓపియమ్ ఓవర్ డోస్ తీసుకుని తెలియకుండనే పరలోకానికి వెళిపోయింది." అన్నాడు అదేదో సామాన్యమైన విషయం చెప్పినట్టు.
          ఆమె మానసికరోగా..? ఎంత అపార్థం చేసుకున్నాను ఆ అమ్మాయిని..! నమ్మలేకపోయాను. కళ్ళ ముందర ఆమె ఎదురుపడిన ప్రతీ దృశ్యం కనిపించింది. ఆమె ప్రవర్తన వెనక అంతరం అర్థమైంది. అప్పుడు నా ప్రవర్తన గుర్తుకు వచ్చి తొందరపాటుకు బాధేసింది. నాకు కళ్ళలో నీరుబికింది.
          "నువ్వు అడిగావని చెప్పటం లేదు. నా విధి కనక చెప్తున్నాను. రీనాతో నా పరిచయం నా ఇష్టంతో జరగలేదు. నువ్వు పార్కులో చూసినప్పుడు కలిసింది రెండవసారి. మొదటిసారి మత్తులో రోడ్ మీద పడి పోతూ నా బండికి తగిలింది, ఆ క్రితం రోజే.. మెడలోని ఐడీ సహాయంతో ఆఫీస్ లో దింపి వచ్చాను. మరుసటి సాయింత్రం కలిసి థాంక్స్ చెప్పటానికి పార్కుకు రమ్మంది. సడన్ గ మాటల మధ్యలో అట్ల కిస్ చేసేసరికి నేనూ నీలాగే ఆ చర్యను ఆకళింపు చేసుకోలేకపోయాను. మనసూ శరీరం స్తంభించిపోయాయి. మరునాడు ఫోన్ చేసి పెళ్ళి చేసుకుంటానంది. నేను డబల్ షాక్ అయ్యాను. కుదరదని చెప్పటానికే తరువాత సారి కలిశాను.. ఆ రోజే నువ్వు చూశావు.. బండి డాష్ ఇచ్చినప్పుడు. నీకంతా తెలుసునని విని మరింత భయపడ్డాను. ఈలోపు అమ్మకు అట్ల అయ్యేసరికి తట్టుకోలేకపోయాను. అమ్మకు నయమైనాక తనకు దూరంగ పోవటానికే చదువు నెపం పెట్టుకున్నాను. ఆ ఒక్క మాటే నన్ను ఇంటిని తిరిగి చూసే అవసరం లేకుండ కాపాడేది. వెళ్ళే ముందు ఒకసారి వెళ్ళి రీనాను బాగా తిట్టాను. ఆమెకు నేను చెప్పింది పూర్తిగ అర్థమైంది. వదిలేస్తానని మాటిచ్చింది. వదిలేసింది కూడా. తర్వాత సరిగ్గ నెలకు రీనా తనకు తెలియకుండనే ఈ లోకాన్ని కూడా వదిలేసి వెళిపోయింది. చాలా బాధపడ్డాను. తర్వాత ధర్మశాస్త్రాలు చదువుకున్న నా స్నేహితుడొకడి గదిలో అతనితోపాటు ఉంటూ అతని పర్యవేక్షణలో, అతని సలహా మీద నేను చేసిన తప్పిదానికి చాంద్రాయణ వ్రతం నుంచి మౌనవ్రతాల వరకు పాటిస్తూ పూర్తి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, సంవత్సరం పాటు. ఇప్పుడు నాకు ఏ వేదనా లేదు.."
          అంతా విని తలవాలిపోతుంటే అన్నాను- "అయ్యో, పొరపాట్న జరిగినదానికి అంత కఠిన ప్రాయశ్చిత్తాలెందుకు? విషయం తెలియక నిన్ను నానా మాటలూ అన్నానే..! క్షమించవా?"
          "పరిచయం ఇష్టంతో జరగలేదన్నాను కానీ ఆమెతో ఇన్వాల్వ్ కాలేదని చెప్పానా..? వారం రోజుల్లోనే అతి వేగంగ అంతచేటు తను నా లోపలకు చొచ్చుకు వచ్చేస్తుంటే తన ప్రభావం నామీద పడలేదనటం అబద్ధమవుతుంది. నిజం, నా మనసు కొంత మలినమైంది. ఒక సమయంలో ఆమె నన్నంతా ఆవహించేసి, తనను నాదాన్ని చేసుకుంటే మాత్రం తప్పేంటి అనే భావన నాలో కలిగింది. అమ్మకు అట్ల కాకపోయి ఉంటే బహుశ నేను కామానికి, ప్రేమకు తేడా తెలియక అడుగు ముందుకు వేసేవాడిని కూడా కావచ్చు. ఒప్పుకోకపోతే అది వాళ్ళ సమస్య అని కూడా అనుకున్నాను. ఆ క్షణాన నీ మాటలు నా వెర్రితనాన్ని, ఉన్మాదాన్ని కరెంట్ షాక్ ఇచ్చినట్టు ఇచ్చి విడకొట్టాయి. భగవంతుడి దయ- రీనా అనే విషవలయం నుండి బయట పడ్డాను."
          "దాని వల్ల కుటుంబం ఫంక్షన్ లు, మంచి సందర్భాలు ఎన్నో పోగొట్టుకున్నావే..!"
          "కుటుంబం ఫంక్షన్ ల కన్నా కుటుంబం పరువు ముఖ్యమనిపించింది. సందర్భాలకన్నా ముందు ఆత్మశుద్ధి లేని జన్మ వ్యర్థమనిపించింది..! తప్పు చేయటానికి క్షణం పట్టదు. దిద్దుకోవటానికి సంవత్సరం పట్టింది.."
          "కానీ చేసింది ఆమె కదా..! నువ్వేం తప్పు చేశావు..? "
          "చేసినది ఆమే అయినా పడిన ప్రభావం నా మీద కదా. బురద చల్లింది వేరేవాళ్ళే అయినా పడింది మనమీదే కనక కడుక్కోవాల్సింది మనమే. మనసుతో చేస్తే ఒకటి, శరీరంతో చేస్తే వేరొకటీనా..? భావం నుంచే శుద్ధి మొదలవుతుంది. ఏదేమైనా ఆ పవిత్రదంపతుల కొడుకుగా నా ధర్మాన్ని కాపాడుకున్నాను. నా తపస్సు ఫలించింది..." అతను తన సర్టిఫికెట్ ఒక లెటర్ నాచేతికి ఇస్తూ అన్నాడు. "ఇదిగో, నువ్వడిగిన చదువు, చదివిన ఇంస్టిట్యూట్ లోనే లెక్చరర్ ఉద్యోగం.. పర్మనెంట్..!" అన్నాడు నవ్వి.
          "హార్దిక అభినందనలు..." అన్నాను అదంతా చదివి అతనికి తిరిగి ఇస్తూ. "కానీ ఇందులో నేను అడిగినదేంటి..?"
          "చెప్తాను. మందుగా హార్దికకు హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు.." అని చేతికి ఏదో చిన్నడబ్బా ఇచ్చాడు.
          ఆశ్చర్యంగ "నీకెట్ల తెలుసు? ఎవ్వరికీ ఈ రోజు గురించి ఏమీ తెలియదే.." అన్నాను.
          "మనసుంటే మార్గం ఉంటుంది.. థాంక్స్ చెప్పవా..?" అన్నాడు.
          "థాంక్స్.." అన్నాను, మొదటిసారిగా అసలు పుట్టినరోజు-కానుకంటూ అందుకుంటూ.
          నన్ను కన్న తల్లి అవివాహిత అట. అందుకే ఆమె హాస్పిటల్ లో నన్ను కని, అట్లగే వదిలేసి చెప్పకుండ వెళిపోయిందిట. వివరాలన్నీ తప్పు ఇచ్చేసరికి ఆచూకీ తెలుసుకోలేకపోయారు హాస్పిటల్ సిబ్బంది. అట్ల పుట్టంగనే అనాథాలయం చేరాను. అక్కడి నుంచి అమ్మ ఒడిలోకి వచ్చాను. అందుకే నా పుట్టినతేదీ, స్థలం సరిగ్గ తెలుసు. కానీ ఇంట్లో తప్ప ఎవ్వరితో చెప్పలేదు ఇంతవరకు. నాకు పుట్టినరోజు జరుపుకోవటం మీద కూడా నమ్మకం లేదు. అమ్మావాళ్ళు కూడా ఈ విషయంలో నేనెట్ల ఫీలౌతానో అని నన్ను ఎప్పుడూ పండగ చేసుకోమని ఒత్తిడి చేయలేదు. ఏదో అట్ల గుడికి మాత్రం వెళ్ళి దేవుడికి నాకింత మంచి అమ్మా నాన్నలను ఇచ్చినందుకు దండం పెట్టి రావాలనిపిస్తుంది. ప్రతీ ఏడు అదే నా పుట్టినరోజు వేడుక.
          నేను ఆలోచన మళ్ళించటానికి, "కదంబ వాళ్ళు ఇంకా రాలేదే.." అన్నాను.
          "వాళ్ళు రాకపోతే ఆ గిఫ్ట్ తీసి చూడకూడదా..?" అన్నాడు.
          నేను అదంతా నాకు నచ్చదని తిరిగి ఇవ్వబోతుంటే కుదరదు, తెరవాల్సిందే అంటే సరేనని తెరిచాను. అందులో ఒక చిన్న ఆడవాళ్ళు ధరించే ఉంగరం ఉంది. "అమ్మో.. బంగారపు ఉంగరం.." అన్నాను.
          "అది నీ వేలికి తొడిగేందుకు నన్ను యోగ్యుడిగా భావిస్తే నేను తొడుగుతా. లేదంటే నువ్వే పెట్టేసుకో. ఏదైనా నీ ఇష్టం." అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ.
          "అంటే..???" అన్నాను ఆశ్చర్యం, సంకోచం, ఏదో ఇబ్బంది కలుగుతుంటే.
          "పవిత్రమైన ఈ అమ్మవారి సన్నిధానంలో- మా వదినకు తోటికోడలిగా, మా అమ్మకూ నాన్నకూ ఇంటికోడలిగా, మా కదంబా వాళ్ళకు పిన్నిగా, నిన్ను నా వామభాగాన్ని అలంకరించమని, నా సహధర్మచారిణిగా రమ్మని మా ఇంటి తరఫున నీకు ఆహ్వానం అందిస్తున్నాను..! కావాలంటే అంగీకరించి నా చేత ఉంగరం తొడిగించుకోవచ్చు. లేదంటే నీవే తొడుక్కుని ప్రస్తావన నిరాకరించవచ్చు.." అన్నాడు చిరునవ్వు నవ్వుతూ.
          నేను ఖంగుతిన్నాను ఆ మాటకు. చుట్టు పక్కల చూశాను. ఎవరూ దగ్గరలో లేరు. లేకపోతేనా, క్షణంలో ఎగిరిపడి వేగంగ మారిన గుండెచప్పుడు, ఎగిసిపడే ఊపిరి విని ఏమనుకునేవారో.
          నేను వాలిన తలను పైకి ఎత్తలేక నేలచూపులు చూస్తూండిపోయాను. ఏంటిది? ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది..? నా శ్వాసలు వేడెక్కాయి.. హృదయస్పందన వేగం పుంజుకుంది.. చిరుచెమటలు పోశాయి. సన్నని వణుకు లోపల పాకింది. కదంబవాళ్ళు అప్పటిదాకా ఎందుకు రాలేదో, అర్థమైంది. ఇంక రారని కూడా అర్థమైంది.
          "అయితే అబద్ధం చెప్పి నన్ను తీసుకువచ్చావన్నమాట.." అన్నాను నన్ను నేను కుదుటపరచుకోవటానికి కష్టపడుతూ.
          "వాళ్ళు పిలిచారని చెప్పకపోతే, ఇంటికి ఇంతదూరం వచ్చేదానివా.. అదీ నాతో..?!!"
          తల వంచుకునే అడ్డంగ ఊపాను.
          "అందుకే చిన్న అబద్ధం చెప్పాను." నవ్వాడు.
          కాసేపు ఆ ఉంగరాన్ని చూస్తూ, కాసేపు అమ్మవారి గుడికి వచ్చిపోతున్న భక్తులను చూస్తూ, కాసేపు కొండదిగువన అందమైన దృశ్యం చూస్తూ కూర్చున్నాను.
          "ఏంటి, నేను అడిగినదాని గురించి ఏమీ మాట్లాడవు..? టైం కావాలంటే తీసుకో.. ఇబ్బందేం లేదు.. నేను ఒక వారం ఉంటాను..! ఈలోపు చెప్తే చాలు.."
          "అదంతా మా అమ్మనడుగు..! పెద్దవాళ్ళ వ్యవహారం.. నేనేం చెప్పగలను..? అయినా నా పుట్టుపూర్వోత్తరాలు నీకు తెలుసు కదా."
          "ఇంకొక్కసారి అక్కా బావగారు జీవించి ఉండంగ ఆ ప్రసక్తి తీస్తే వాళ్ళ మీద ఒట్టే. ఇంట్లో అందరూ నిన్ను ఇంటి సభ్యురాలిగా కోరుకుంటున్నారు..! అదే నీ సందేహమైతే..! కాకపోతే నాకోసమా, అన్నయ్య కొడుకు కోసమా అని తేల్చుకోలేకపోతున్నారు. నువ్వు నన్ను అంగీకరిస్తే మావాళ్ళు వచ్చి మీ అమ్మతో నా గురించి మాట్లాడతారులే. లేదంటే మీ పెద్దబావ గురించి మాట్లాడతారు. అసలు ముందు ఏది అడుగుదామన్నా బావగారు ఒప్పుకుంటారో లేదో, నీకు బయటి సంబంధాలు చూస్తున్నారు- మా ఇంటికి ఇవ్వటం ఇష్టం లేదేమోనని వాళ్ళు భయపడుతున్నారు.. వేరే ఉపాయం తోచక వదిన ఈ ఉంగరం ఇచ్చి నన్నే అడిగి తేల్చుకుని రమ్మంది. తనకెందుకో నీకు నేనంటేనే.. అని అనుమానంగ ఉందట..! నాకూ అది నిజమేననిపించింది." మామూలుగ అన్నాడు.
          "ఎందుకు..?"
          "మనం మొదటిసారి నా గదిలో కలిసినప్పుడు నీ కళ్ళు, నీ చూపులు నా మనసుతో చెప్పాయి..! ఇప్పుడు నువ్వు ప్రయత్నించి దాచుకుంటున్న నీ చిరునవ్వు చెప్తోంది.."
          ఆరోజు గదిలో అతన్ని మొదటిసారి చూసినప్పుడు నిర్ద్వంద్వంగ నా మనసు పలికిన "నా నోము ఫలము వీడే" అనే మాట గుర్తుకు వచ్చింది. నేను బిడియంగ ముఖం తిప్పేసుకున్నాను.
          "చూడు హార్దీ.. నువ్వంటే నాకింత ఇష్టమని, అంత ప్రాణమని ఏదేదో చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టను కానీ ఒక్క నిజం చెప్తున్నాను. ఎదటివాడు తప్పు మార్గంలో ఉన్నాడని స్పందించి, భయపడి ఊరుకోకుండ, దాన్ని సర్దాలనే తపన నీలో ఉంది. పెద్దవాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం, అవసరాల స్పృహ ఉంది. కేవలం పెళ్ళి చేసుకోవటానికి సంవత్సరం కోర్సు చేశావంటే జీవితాన్ని సక్రమంగ జీవించాలన్న నీ తపన ఎటువంటిదో, ఎంత బాధ్యతగా మసలగలవో అర్థమైంది. ఎవరి భార్యలో అయినా ఉండాల్సిన మొదటి గుణం అదే. అవసరమైతే ఐదు వేళ్ళ అద్దు మొహం మీద దింపే సామర్థ్యం.."
          కళ్ళు గట్టిగ మూసుకున్నాను, మనసులో అలజడి తట్టుకోలేక, "సారీ.." అంటూ.
          "సారీ ఎందుకు? రీనాను చూసినప్పుడు నాలో కలిగిన ఉద్రేకమే, ఆ చలనమే ప్రేమ అని భ్రమించుకున్నాను. కానీ అది తలచుకున్నప్పుడల్లా నాలో ఒకరకమైన పరితాపం, అశాంతి, అస్థిరతకు దారితీసేది. నిన్ను చూసినప్పుడల్లా మాత్రం ఎంత అలజడైనా తగ్గిపోయి ఒక ప్రశాంతత, స్థిరత్వం అనుభూతమయ్యేవి. అసలైన ప్రేమ ఒక మౌనంలో, ఒక స్థిరమైన అనుభూతిలో ఉంటుందని తెలిసింది. సమాధానం తెలిసినవారే స్థిరంగ ఉంటారు. తనకు తను సవ్యంగ ఉంటేనే కదా ఏ స్త్రీ అయినా భర్తను సన్మార్గంలో ఉంచేది..! ముఖ్యంగ నన్ను భవిష్యత్తులో ఏ చెడుదారిలో పోకుండ ఆపగలిగే శక్తి నీలో కనిపించింది. కాదనవనే నమ్మకంతో అడుగుతున్నాను. టైం తీసుకున్నా ఫరవాలేదు. సమాధానం చెప్తే చాలు.."
          నేను రెండుచేతులలో ముఖం దాచేసుకున్నాను. అతను నవ్వేశాడు గట్టిగ. తర్వాత నా చేతిని తన చేతిలోకి తీసుకుని ఉంగరం తీసి నా వేలికి తొడిగాడు.
          "నేనింకా సమాధానం చెప్పలేదు.." అన్నాను కంగారుగ వేలికి ఉన్న రింగ్ చూసుకుంటూ.
          "మీ చందన చెప్పిందిలే.." అన్నాడు.
          నేను ఆశ్చర్యంగ, "చందనా..?" అన్నాను.
          "నీకు నాకింతమంది స్నేహితులుండటం గిట్టదుట కదా..! నీకు ఇష్టం లేదంటే మానేస్తాను. కానీ వాళ్ళవల్లే నాకు చాలా మంచి జరిగింది. నిన్న ఉదయం ఇంటికి చేరుతూనే కబురు అందరికీ పాకిపోయి, ఒక స్నేహితుడు పెళ్ళి కుదిరిందని చెప్పి, సాయింత్రం కలవమని పిలిచాడు. వెళ్ళి చూస్తే మీ స్నేహితురాలు.. నాకు తెలియదు కదా.. తనే గుర్తు పట్టి పలకరించింది. నా ఫోటో చూపించావట కదా తనకు..! తనే నమ్మకంగ చెప్పింది- కచ్చితంగ లోపలి భావాలు నాకూ తెలియవు కానీ చూస్తే అయిష్టం ఏం లేదనిపించింది అని. అందుకే ధైర్యం చేశాను..! ఎవరి గురించైనా పూర్తిగ తెలియాలంటే వారి స్నేహితులను చూడమన్నారు. ఉన్న ఒక్క స్నేహితురాలైనా ఎంతో మంచి అమ్మాయి..! నీ గురించి చాలా ఉన్నతంగ చెప్పింది..!"
          నేను ఇంకా లోపలకు కుచించుకుపోతూ చూపులు మరల్చుకున్నాను.
          "ఇప్పుడు చెప్పు..; ఏమంటావు..?"
          "ఇంకేమంటాను..? అంతా నువ్వే అనేసుకుంటుంటే..?" అన్నాను కాస్త కచ్చగా.
          "నువ్వు నన్ను కొట్టిన దెబ్బ ఎక్కడ తగలాలని కొట్టావో నీకు తెలియాలి మరి. దెబ్బ తగిలాక మందు మాత్రం అడుగుతుంటే అంతా నేనే అనేస్తున్నానని అభాండం ఒకటా..?" అన్నాడతను నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.
          నేను ఎదురు చెప్పకుండా చిరునవ్వుతో సిగ్గుగా తలవంచుకున్నాను. అయినా అతని నిండైన నగుమోము నా మనసులో ఒక్క వెలుగు వెలిగింది.
*********

No comments:

Post a Comment