"అమ్మో!!
ఇది టెలిఫోను బిల్లా?! బంగారు గని కొన్న బిల్లా?
మూడున్నర వేలట!.. దేవుడో....! ఇంత ఎట్లా వచ్చింది?"
సత్యం
గుండెలు బాదుకుంటూ ఇంటిల్లిపాది వంకా చూశాడు.
‘అదేదో’
టీవీలో ఏదో దైనిక ధారావాహికంలో తన పెంపుడు కుక్కపిల్ల చచ్చిపోయినందుకు గాను హృదయ
"విధారకంగా" ఆవేదన పడుతున్న ఓ ’"టెలుగింటి"’ యువతి దీనారావలను
కళ్ళనీళ్ళ పర్యంతమై తిలకిస్తున్న ప్రేక్షకులంతా ప్రతి నెలా వచ్చి చచ్చే వెధవ
బిల్లేగా!’ అన్నట్టు నిర్లక్షంగా ఓ చూపు పారేసి, తల
తిప్పలేకుండా ఉన్న ఆ బరువైన సన్నివేశాన్ని టీవీ తెరమీద శ్రద్ధగా చూస్తుండిపోయారు.
"మూడున్నరవేలకు
గ్రాము బంగారమే రావట్లేదు.. ఇంక బంగారు గని..!! హుఁ.." అనుకున్నాడు సన్నీ.
"అబ్బ.. నాన్నా కూడా భలే వేళ చూసుకుని గోలపెడతారు.." అనుకుంది మధు.
సత్యంకు
చిరాకు వేసింది.
"ఏంటమ్మా
మధూ! ఫైనలు పరీక్షలు నెత్తిన పెట్టుకుని ఆ టివీ ముందు అతుక్కుపోవటం?"
’ఇంటర్లోనైనా బుద్ధి తెచ్చుకున్నావనుకున్నాను! డిగ్రీ కొచ్చినా
పరిస్థితి మారినట్టు లేదు.’ అనేమాట మనసులోనే మింగేసుకుంటూ మృదువుగానే కూతురిని
మందలించబోయాడాయన.
ఆ
అమ్మాయి పెదాలరంగు పాడవకుండా మూతి తిప్పుతూ తండ్రి వంక చూసి,
"అబ్బ! కాలేజ్ నుంచి ఇప్పుడే కష్టపడి వచ్చాను, కాస్త రిలాక్సన్నా అవ్వద్దా నాన్నా-" అంది గారాలు పోతూ.
"కాలేజ్
నుంచా? మ్యాట్నీ సిన్మా నుంచా?" సన్నగా గొణిగాడు
సన్నీ.
మధు
అతన్ని గుర్రుగా చూసి కళ్ళెర్ర చేసింది.
సత్యం
కొడుకు వంకకు తిరిగాడు. "ఏరా సన్నీ, మొన్న ఏవో
బ్యాంకు పరీక్షలకు ఫీజు కట్టావు! ఏది ఒక్కనాడు పుస్తకం తీసి చదివిన పాపాన పోలేదు!
మీ ఫ్రెండు ఏదో హోమ్ ట్యూషన్లు మాట్లాడాడన్నావు..? కాస్త అభ్యాసం అవుతుంది. పదో
క్లాసు లెక్కలు చెప్పమని కూడ అన్నాను. ఏమయింది?" అడిగాడు
అతన్ని.
మధు
అతన్ని చూసి, "బాగయింది! ఇప్పుడవుతుంది
పెళ్ళి.." అని నవ్వింది.
సన్నీ
నీళ్ళు నవులుతూ "అ..దీ.. అదీ..." అన్నాడు.
అంతలో
ఆ ధారావాహికం అయిపోవటంతో, ఆయన భార్య లక్ష్మి ఆ
ప్రశ్నలన్నింటికీ కలిపి సమాధానం చెప్తూ, "అబ్బబ్బా..,
ఏఁవిటండీ మీ గోల?!! టెలిఫోను బిల్లు మూడున్నర
వేలు వచ్చింది. అంతే కదా! ఫోను బిల్లుతో పాటు కరెంటు బిల్లు కూడ వచ్చింది ఓ
రెండువేలు- ఇంటి యజమాని ఠంచనుగా వచ్చి ఇంటి అద్దె కూడ అడిగి వెళ్ళాడు. సాయింత్రం
రమ్మన్నాను. ఇంక దీని పరీక్షల మాటకొస్తే...." అని కూతురి తల నిమురుతూ,
"అది పగలంతా చదువుతునే ఉంది రోజూ! చదివీ చదివీ తలనెప్పి
పుట్టదు? అందుకని నేనే టీవీ చూడమంటాను కాసేపయినా! వాడి బాంక్
పరీక్షకు వాడూ ఏదో కుస్తీ పడుతూనే ఉన్నాడు. అయినా కోచింగ్‍కి పంపమంటే మీరు వినరు!
అది వేరేమాట! ఇక హోంట్యూషను మాటకొస్తే అది నాకే నచ్చలేదు. అయినా ఇప్పుడు వాడికంత
ఖర్మేం పట్టిందీ అంటా! తండ్రి గొప్ప ఆఫీసరూ, హోదా పెట్టుకుని
అల్లాటప్పాగాళ్ళ ఇళ్ళకు వెళ్ళి గొంతు అరగదీసుకునే దుస్థితి కొడుక్కెందుకూ?"
అంటూ గంజి పెట్టిన చీర నలగకుండా సోఫాలో కదుల్తూ సాగదీసింది.
ఆ
సమాధానాల మాలిక విని సత్యం నిస్సహాయంగా అందరి వంకా చూసి తలపట్టుకుని వాలుకుర్చీలో
వాలిపోయాడు. అదేం పట్టనట్టు ఛానెళ్ళు మార్చుకుంటూ కూర్చున్న మధు అక్కడేదో
దిక్కుమాలిన ఛానెలులో తనకు ఇష్టమైన పాప్ సాంగ్ ఏదో తగిలేసరికి దయ్యం పట్టిన దానిలా
కేకవేసి, జుట్టు పీక్కుంటూ డాన్సుకు దిగింది.
అప్పుడే
తన సెల్‍ఫోన్ రింగు కావటంతో, అంత శబ్దంలో మాట్లాడటం
కుదరదని చెల్లెల్ని టీవీ శబ్దం తగ్గించమని కోరాడు సన్నీ. మధుకు అతని మాట
వినిపించలేదు. ఆ అబ్బాయి రిమోట్ తీసుకుని మ్యూట్ నొక్కి తన సెల్‍ఫొను ఆన్ చేసి
’హలో’ అన్నాడు.
మధుకు
వీరావేశం వచ్చి "అవతల గదిలోకి వెళ్ళి మాట్లాడుకోవచ్చుగా.." అంటూ
అరిచింది.
సన్నీ
కావాలని ఆమె లాక్కొంటున్నా రిమోట్ చేతిలోనే ఉంచుకుని,
ఇంకో పక్క సెల్ ఫోన్లో మాట్లాడసాగాడు.
ఆ
అన్నా చెల్లెళ్ళ కొట్లాట అట్లా సాగుతూ ఉండంగనే పని పూర్తి చేసుకుని వచ్చిన
పనిమనిషి సత్యంతో, "బాబుగారు- నెల జీతం
ఇప్పిస్తే వెళతాను. పొద్దున అమ్మగారిని అడిగితే మిమల్ని అడగమన్నారు.." అంది.
సత్యం
తెల్లబోయి లక్ష్మి వంక తిరిగి, "అదేంటి లక్ష్మీ?
క్రితం వారమే రంగమ్మ డబ్బు విడిగా ఇచ్చానుగా- ఏమయింది? ఇవ్వలేదా?" అని అడిగాడు.
"లేదు-
అవి మీ ముద్దుల కూతురు కాలేజ్ పార్టికి కొన్న సామాగ్రికి ఖర్చయ్యాయిగా.."
తాపిగా చెప్పిందామె.
"రెండువేల
రూపాయలు పెట్టి ఏం కొన్నావే మధూ?’ అన్నగారి దగ్గరి
నుంచి రిమోట్ సాధించి అప్పుడే ఆనందంగా టీవీ శబ్దం పెంచిన మధును తట్టి పిలిచి
అడిగాడాయన.
"అబ్బా!
జీన్సే తొమ్మిదొందలైంది నాన్నా! మిగితావి లిప్‍స్టిక్,
మేకప్‍కి అయిపోయాయి. అయినా ప్రతీ ఖర్చుకీ లెక్కలు అడిగితే ఎట్లా నాన్నా?!
ఇంజనీరింగ్ అన్నాక ఆ మాత్రం లెవిల్ కొట్టకపోతే మనం చీప్ అయిపోమా?"
చిరాగ్గా గుణిగింది ఆ పిల్ల.
"అది
కాదమ్మా! నీ పాకెట్‍మనీ నీకు నెలనెలా అందుతూనే ఉందిగా!" రిమోట్ తీసుకుని టీవీ
మళ్ళి మ్యూట్ చేస్తూ అడిగాడు సత్యం, కూతురి
మాడిన ముఖం చూస్తూ.
మధు
ఇక పట్టలేని ఆగ్రహంతో ఉరిమి చూసి, "మీరు ఇచ్చే
ముష్ఠి పాకెట్‍మనీ నా ఒక్క నెల మేకప్‍కే అయిపోతుంది తెల్సా? అసలు
ఇవాళ రేపు అన్నీ ఎంత ఖరీదయ్యాయో మీకు తెలీదా? మా కాలేజిలో
ఒక్కొక్కళ్ళు ఎంత పాష్‍గా వస్తారో మీకేం తెలుససలు? వేసిన
డ్రెస్సు వెయ్యరు. కొట్టిన స్టయిలు కొట్టరు-ఎప్పటికప్పుడు లేటెస్టుగా ఉంటారు. మరి
వాళ్ళందరి మధ్యా తల ఎత్తుకోవాలంటే కొంచెమయినా ఖర్చు లేకుండా ఎట్లా నాన్నా!?"
అంటూ తన గదిలోకి వెళ్ళింది విసవిసా!
సత్యం
నోటమాట పడిపోయిన వాడిలా చూస్తుండిపోయాడు.
అప్పటికి
సెల్ ఫోనులో మాట్లాడటం పూర్తయిన సన్నీ సత్యంను చూసి,
"డాడ్-
ఈ నెల సెల్ బిల్ కట్టలేదు. నా జిమ్ డబ్బులు కూడ అమ్మా మీ దగ్గరే
తీసుకోమంది.." అన్నాడు.
"ఔనండి-
అన్నట్టు చెప్పటం మరిచాను. మీ క్రెడిట్ కార్డ్ రిన్యూ చేయించుకోవాలి! మొన్న సూపర్
మార్కెట్‍లో అది చెల్లక కాస్త ఇబ్బందైంది..." అంది లక్షి.
అంతలో
వీళ్ళందరి సంభాషణ వింటూ దిక్కులు చూస్తూ నిలబడ్డ పనిమనిషిని ఇబ్బందిగ చూసి,
"రంగమ్మా- నీ డబ్బు రేపు తప్పకుండా ఇస్తాను.." అని చెప్పి
పంపేశాక కొడుకు వంక తిరిగి, "ఏంట్రా- ఏమిటి మీ వరస?
ప్రతినెలా ఎవరి ఖర్చులు వాళ్ళకు సరిపోనూ ఇస్తునే ఉన్నా కదా..?
మళ్ళీ ఇట్లా పీక్కుతింటే ఎట్లా?" అనడిగాడు
ఒకింత బాధగా.
"ఔనులే
నాన్నా! అది సినిమాలకీ షోకులకీ ఎంతైనా ఖర్చు పెట్టుకోవచ్చు కానీ శరీర వ్యాయామం,
ఆరోగ్యం కోసం ముష్టి వాడికి వేసినంత అడిగితే మీకు పీక్కోతింటం లాగా
ఉంది! అది ఒక్క డ్రెస్సు కొంటే దాని వెంట
’మాచింగ్’ అంటూ ఇంత పెద్ద పటాలం- రింగులూ, గొలుసులూ, లిప్‍స్టిక్‍లూ, బూట్లూ- దాన్ని మాత్రం ఏమీ అనరు!
ఔనులే- నేనే మిమ్మల్ని పీక్కో తింటున్నా!"
అబ్బాయి
ఉక్రోషంగ అంటుంటే ఆయన విస్తుపాటుగ వింటుండగానే, లోపల
గదిలో బట్టలు మార్చుకుని ఫ్రెష్ అవుతున్న మధు దెబ్బతిన్న పాములా తడిమెహంతోనే వచ్చి
బుసలు కొడుతూ, "ఏంటి- తప్పంతా నాదేనన్నట్టు మాట్లాడటాడు?
వాడి బండి పెట్రోల్ ఖర్చంత ఉండదు- నా మొత్తం నెల ఖర్చు! క్రితం
వారమే కదా, ఏదో బెట్ కట్టి ఓడిపోయానని చెప్పి అమ్మ దగ్గర ఐదు
వందలడిగి వాళ్ళ తొట్టి ఫ్రెండ్సు అందరికీ పార్టీ ఇచ్చాడు?! ఎక్కడో
తెల్సా? పిజ్జాకార్నర్ లో! అంతకు ముందు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‍కి
వాలెంటన్స్‍డే రోజు ఆరొందల గిఫ్టేదో కొన్నాడు! ఆ సంగతి నాకు తెలియదు
అనుకుంటున్నాడు.." అంది.
సన్నీ
ఆ మాటలకు పరువునష్టం దావా వేస్తూ, "నాన్నా- ఇది
చాలా అన్యాయం! అన్నయ్యను, దానికన్నా పెద్దవాణ్ణి, నన్ను పట్టుకుని మీముందే ’వాడు’ అంటోంది! పెట్రోలు గురించి మాట్లాడే
ముందు- రోజూ కాలేజ్ దగ్గర దింపమని ఎవరు గోల చేసున్నారో అడగండి! బస్‍పాసు భద్రంగా
బ్యాగులో పెట్టుకుని రోజూ ఆటోలో ఇంటికి వచ్చేదెవరో కనుక్కోండి..? ఏదన్నా అంటే- ’ఎండకు నా కాంప్లెక్షను పాడవ్వదా?’ అని
ఏడుస్తుంది.." అన్నాడు, మధును చూసి ఆక్షేపణగ.
"ఓహో!
అయితే ఖర్చంతా నావల్లే అవుతోందా? నువ్వు మాత్రం ప్రతీ
నెలా డియోడెరెంట్లనీ, ఫెర్‍ఫ్యూములనీ, ఆఫ్టర్
షేవులనీ డబ్బులు తగలేయట్లేదా? అవన్నీ నేను వాడతానా?"
మధు ఒంటికాలి మీద లేచింది.
"ఔను-
అవసరానికేగా వాడేది! నేనేం నీలాగ కంప్యూటర్ కోచింగుకు పదివేలు కట్టి మధ్యలోనే
వదిలేయలేదే! అది అనవసర ఖర్చు కాదా?" సన్నీ
రెట్టించాడు.
"ఈ
లోగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ మొదలైతే నేనేం చేసేది? తర్వాత
వెంటనే క్లాసెస్ మొదలవ్వలేదా?"
"చూశావా-
ఇంజనీరింగ్ తప్ప మరొకటి చదవనని కూరుచున్నందుకేగా నాన్నాకి యాభైవేల టోపీ! నేనైతే బీ.ఎస్సీ
ఎన్నుకుని ఎంత సేవ్ చేశానో!"
"అది
నీ చేతకానితనం! దానికి నేనేం చేయను? నాకు
సీటొచ్చింది కాబట్టి చదువుతున్నాను. నీకు అదీ లేదుగా ఇంకేం చదువుతావూ?"
"ఆ-
వచ్చింది బోడి సీటు! ఉమెన్స్ కోటాలో దిక్కుమాలిన ప్రెవేట్ కాలేజ్‍లో,
అదీ కొత్తది కాబట్టి, ఇంతింత డొనేషన్ కట్టి-
అప్పడు దొరికింది! అదేం పెద్ద గొప్పా? దానికన్నా బీఎస్సీలో
నాకు వచ్చిన యణభై శాతమే ఎక్కువ గొప్ప! అయినా ఇక్కడ ఇప్పుడు మనం ఖర్చుల గురించి
మాట్లాడుతున్నాం కానీ ప్రతిభల గురించి కాదు-" సన్నీ ’నేనేం తక్కువ తినలేద’ని
నిరూపిస్తూ విజృంభించాడు.
"అయితే
ఖర్చుల గురించే మాట్లాడతాను నేనూ-! సీడీ ప్లేయర్ కొనమని గోల పెట్టి కొనించింది
ఎవరట?" మధూ అరిచింది.
"అచ్ఛా?
అయితే ఆ ఎక్సర్‍సైజు గొట్టానికి మూడు వేలు తగిలేసిందెవరట?"
"క్రికెట్
కోచింగని పెద్ద పోజు కొట్టి నాలుగు రోజులు వెళ్ళి రావటానికి ఆరొందలు కట్టిందెవరట?"
"రూమ్
డెకరేషన్ అని ఆరు వేలు పెట్టించి కర్టెన్ల తో సహా మార్పించింది ఎవరట..?"
"ఆ
సుత్తి ఆర్ట్ హాబీ కోసం నువ్వు పెట్టించిన ఏడువేలు ఏ ఖాతాలోవిట?"
"ఇంజనీరింగ్
పేరుతో స్టైల్ గ ఒక్కనాడైనా ముట్టుకోని లాప్ టాప్ కొనించి ముప్ఫై వేలు
పెట్టించింది ఎవరట..?"
ఇక
వినీవినీ విసుగొచ్చిన లక్ష్మి, "ఆపండి, ఏమిటి వెధవ గొడవ!" అని కసిరి సత్యం వంక తిరిగి, "ఏమిటండీ, ఇద్దరూ అట్లా కాట్లాడుకుంటుంటే ఏమీ అనకుండా
వింటూ కూర్చుంటారు?" అంది.
"ఏమనమంటావు
లక్ష్మీ? పిల్లల కనీస అవసరాలకు కూడ సరైన ఏర్పాటు
చేయలేకపోతున్న అసమర్థతను గురించి పళ్ళు నూరుకుంటున్నాను! ఇంకేం అనను?"
అన్నాడు సత్యం.
కాస్త
నిర్వేదం ధ్వనించిన ఆయన గొంతు పట్టించుకోలేదు లక్ష్మి. తన బంగారు జూకాలు
కదిలేటట్టు తలతిప్పి, "సర్లేండి!! మీకు ఈ
ఖర్చులు భరించటం అంత కష్టంగా ఉంటే చెప్పండి.. రేపే వెళ్ళి ఇదివరకటి స్కూల్లో
టీచరుగా చేరిపోతాను! మీకు కాస్త సహకారంగా ఉంటుందేమో!" అంది నొచ్చుకున్నట్టు.
"ఛ!
అది కాదు నా అభిప్రాయం- నీకు నా నెల సంపాదన అంచనా ఉంది కదా! ఖర్చులన్నీ నీ చేతుల
మీదుగానే వెళ్తున్నాయి. మరి ఈ మధ్య జీతం పెరిగాక కూడ ఎందుకింత తేడా పడుతోంది?
మొన్న ఎప్పుడో ఆ సరుకుల బిల్లు వర్షానికి ట్రాన్స్‍ఫార్మరులా
పేలింది! నిన్న చూడబోతే మధుకోసం వెళ్ళిన పంటిడాక్టరు వేసిన బిల్లు ఆటంబాంబులా
పేలింది... ఇవాళేమో నీ చీరల బిల్లు వరదొచ్చిన గోదారిలా పొంగింది..." అని ఇంకా
ఏదో అనబోతుంటే సత్యంను రుసరుసా చూసిన లక్ష్మి, మధ్యలోనే ఆయన
మాట తుంచి అంది-
"ఔనౌను!
చివరికి నా చీరలే మీకు బరువయ్యాయి. మీ లాండ్రీ ఖర్చు,
మీ కొత్త సఫారీ సూటూ ఏ ఖర్చూ లేకుండానే వచ్చాయి!"
"అది
కాదు లక్ష్మీ.." సర్ది చెప్పబోయాడాయన.
"ఏది
కాదండీ? మిమ్మల్ని ఆ రెండువేలు పెట్టి బూట్లు
కొనుక్కున్నప్పుడు నేనేమైనా అన్నానా? కొత్తగా వచ్చిన ఆ
కెమెరా సెల్‍ఫోన్ కొన్నారని మాటైనా అన్నానా? పాత వాచీ బానే
ఉన్నా ఆ గోల్డ్‍ప్లేటెడ్ వాచి కొన్నారని నేను ఎత్తి చూపానా? అంతెందుకు?
మీరు రోజూ కాల్చే ఆ సిగిరెట్లకు మాత్రం ఏం తక్కువ ఖర్చవుతోందా?"
అంది ఆమె ఇంకా ఉక్రోషంగా.
సత్యం
కాలుస్తున్న సిగిరెట్ అంచుదాకా రావటం గమనించకపోవటంతో చురుక్కున కాలిందది. దాన్ని
చటుక్కున వదిలిపెట్టి పడేస్తూ నొచ్చుకుంటు చూశాడాయన లక్ష్మి వంక.
"ఎందుకంత
కోపంగా చూస్తారూ? ఉన్న మాటంటే ఉలుకెక్కువనీ-
పిల్లల కోరికలను మనం కాక ఇంకెవరు తీరుస్తారండి? ఏఁ? మనకు లేవా కోరికలు? ఈ వయసులో కాక వాళ్ళు ఎప్పుడు
సుఖపడతారు? రేపు బాధ్యతలు మీద పడినాకా?! అయినా ’ఆరునెలల క్రితం వాడు బట్టలు కొనుక్కున్నాడు. మళ్ళీ అడిగాడా?
లేదు! ఎందుకు? ఖర్చులు తట్టుకోలేమనే కదా!
’యేడాది క్రితం మనందరం సరదాగా తిరిగి రావటానికి విహారయాత్రకు వెళ్ళాం! మళ్ళీ
వెళ్ళగలిగామా? ఎందుకు? మాటిమాటికి
వెళ్లాలి అంటే ఖర్చవుతుందనే కదా!" అని పిల్లలిద్దరి వంక చూసి, "మీకు ఇబ్బంది అవుతుందనే ఎన్నో ఖర్చులు వాళ్ళూ మానుకుంటున్నారు. అయినా
వాళ్ళను నిలదీసి, లెక్కలడిగితే, పసిపిల్లలు-
పాపం ఎటు పోతారు? మనలను కాక ఎవరిని అడుగుతారు?" అంది.
సత్యం
అంతా విని గట్టిగా నిట్టూర్చి, పిల్లలను, భార్యను చూసి పేలవంగా నవ్వి, సాలోచనగా,
"ఏంటో- నేను ఇద్దరు పిల్లలకే ఇంత సుడిపడి పోతున్నా! ఆ రోజుల్లో
పాపం మరి మా నాన్న ఎంతగా ఇబ్బందులు పడుంటారో! ఆరుగురం పిల్లలం! పైనుంచి ఊర్ల నుంచి
చదువుల కోసం వచ్చి పడుండే బంధువుల పిల్లలెవరో ఒకళ్ళు! వచ్చీ పోయే అతిథులు, రోగాలూ నెప్పులు, పండగలూ, పబ్బాలు,
పేరంటాలూ పెళ్ళిళ్ళూ..! ప్చ్.. ఎట్లా తట్టుకున్నారో మరి!"
అన్నాడు.
అంతలో
"అయ్యా - సత్యంగారూ.." అని వినిపించి అటు చూశారంతా. తలుపు బయట ఇంటి
యజమాని నిలబడి ఉండటం చూసి, హాలులో సోఫాలోంచి లేచి ముందు
గదిలోకి వెళ్ళాడు సత్యం, "వస్తున్నానండీ.." అంటూ.
లక్ష్మి
గట్టిగా నిట్టుర్చి, "ఏంటో ఈయనకు ఇవాళ ఏమైందో!
ఎప్పుడూ లేంది ఖర్చులు అవుతున్నాయంటూ గోల చేస్తున్నారు! వయసు పిల్లలన్నాక ఎన్నో
రకాల ఖర్చులుంటాయి! అది సహజం! అయినా మనకేం, లేకనా?"
అంది సోఫాలోంచి లేస్తూ.
"అబ్బా-
వదిలేయ్ అమ్మా! ఇంతకీ ఇవాళ వంటెంటో"? అన్నాడు
సన్నీ, క్రికెట్‍షాట్ ఒకటేదో గాల్లో అభ్యాసం చేస్తు.
"ఆలూ
కూర్మా! పూరీ ఛోలే! అది లేకపోతే బగారా బైంగన్ అన్నా కావాలి నాకు.." అంది మధు.
"అమ్మో-
అవన్నీ ఇప్పుడు నాకు ఓపిక లేదు తల్లీ!" అంది లక్ష్మి నీరసంగా.
మధుకు
కోపం వచ్చింది. "అయితే ఫో, ఇంట్లో నేనన్నం తినను!
హోటెలుకెళదాం!"
"ఔను
అమ్మా! మా ఫ్రేండ్ సలిల్ వాళ్ళు నిన్ననే కాంటినెంటల్ కెళ్ళారట! అక్కడ భోజనం చాలా
బావుందిట! మనం కూడా వెళ్దామా?" అన్నాడు సన్నీ.
"మీ
ఫ్రెండ్సంతా కలిసి మొన్నేగా అదేదో పెద్ద రెస్టారెంటుకే వెళ్ళినట్టునారు.."
లక్ష్మి అంది.
"అది
వేరేఅమ్మా! స్నేహితులతో వేరే, అమ్మానాన్నలతో వెళ్ళటం
వేరే! ప్లీజ్ అమ్మా!" మధు కూడా వంతపాడింది.
"ఇప్పుడయితే
కుదరదు కానీ, రేపు ఆదివారం కదా. అందరం కలిసి పిక్నిక్
వెళ్ళి, అంతా తిరిగి అట్లాగే తినేసి వద్దాం! ఓకే?"
లక్ష్మి బేరం ఆడింది.
"మరి
నాన్నా?" గుణిగింది మధు.
"నేను
ఒప్పిస్తాలే! నా దగ్గర ఒక తిరుగులేని మంత్రం ఉందిగా?" సన్నీ అన్నాడు గర్వంగా.
"ఏంటది?"
కుతూహలంగా అడిగింది మధు.
"రేపు
అమ్మా వాళ్ళ మ్యారేజ్‍డే! మర్చిపోయావా?" గుర్తుచేశాడు
నవ్వుతూ.
"ఓహ్
గ్రేట్!" అంది మధు ఆనందంగా.
******
"ఒరే..
ఫోను రింగవుతోంది.. ఎవరో చూడు.." కాలక్షేపానికి ఏదో పత్రిక చదువుకుంటున్న
లక్ష్మి సన్నీని కేకవేసింది బాల్కనీ లోంచి.
సన్నీ
డంబుల్స్ ఎత్తి వంచుతూ కండలు చూసుకుంటున్న వాడల్లా అవి పక్కన పెట్టి,
"దాన్ని
ఎత్తమనచ్చుగా- లేజీ ఈడియట్.." అని ఫోను దగ్గరకెళ్ళే దారిలో ఉన్న సోఫాలో
ముఖానికి సౌందర్య లేపనమేదో పూసుకుని, కళ్ళమీద
దోసముక్కల చక్రాలు పెట్టుకు కూర్చున్న చెల్లెలి నెత్తి మీద మొట్టి ఆ అమ్మాయికి
కోపం ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా ఫోను ఎత్తి "హలో" అన్నాడు.
అంతే!
రెండే నిముషల్లో "ఆఁ!!! ఏంటీ???" అనే
గావుకేక విని లక్ష్మి చేతిలో పత్రిక, మధు చెవుల్లో పెర్సనల్
స్టీరియో ఇయర్‍ఫోన్లూ ఒకేసారి జారిపడ్డాయి. నొసలు చిట్లించకుండా జాగ్రత్తగా
ఆశ్చర్యపోతూ అన్నగారిని చూసింది మధు.
లక్ష్మి
బాల్కనీ లోనుంచి హాలులోకి వచ్చి సన్నీ ఫోన్ పెట్టేసి సోఫాలో కూలబడటం చూసి,
"ఏమిట్రా? ఆ పెడబొబ్బేంటీ?" అంది.
చప్పగా
చల్లరిపోయి, ఒళ్ళంతా చెమటలు పడుతుంటే ఆమె వంక సమాధానం
చెప్పకుండా మౌనంగా చూస్తున్న అన్నగారిని చూసి కసురుతూ, "ఏంటన్నయ్యా? అమ్మ అడుగుతోంది - జవాబు చెప్పవేఁ?"
అంది మధు.
సన్నీ
తల్లినీ, చెల్లెలినీ, ఏడుపు
ముఖంతో చూస్తూ, "అమ్మా.. ఎట్లా చెప్పాలో నాకర్థం
కావట్లే.." అన్నాడు.
"అబ్బబ్బా,
నోటీతో చెప్పేడవరా! ఎట్లా ఏంటీ?" ఈసారి
లక్ష్మికి కూడ కోపం వచ్చింది.
సన్నీ
గుటకలు మింగుతూ అన్నాడు- "అమ్మా నే చెప్పేది విని నీ బీపీ
పడిపోతుందేమో.."
"బీపీ
పడుతుందో, లేస్తుందో, తొంగొంటుందో
తర్వాత చూద్దాం కానీ ముందు విషయం చెప్పన్నయ్యా!" అంది మధు, గోళ్ళు కొరుక్కోబోయి, గోళ్ళరంగు చెడుతుందేమో అని ఆ
ప్రయత్నం విరమించుకుంటూ.
"అ..అదీ..
నాన్న.. నాన్న..."
"త్వరగా
చెప్పన్నయ్యా! అమ్మ బి.పి ఏమో కానీ నాకు గుండెపోటు మొదలు అయ్యేటట్టుంది.."
అసహనంగా అంది మధు.
"..నాన్న..
నాన్న ఆఫీసులో.." చెమట తుడుచుకున్నాడతను.
"ఆఁ
ఆఫీసులో ఏం జరిగిందో చెప్పరా!"
"ఆఫీసులో...ల్..లంచం
తీసుకుంటూ... ప్..పట్టుబడ్డారటమ్మా! మూర్తి అంకులు ఫోను చేశారు ..ప్..పోలిస్టేషను
నుంచి.."
"ఏంటీ!!!"
అదిరి పడింది లక్ష్మి.
"నేను
నమ్మను! మీ నాన్నకు అంత ఖర్మేం పట్టలేదు." లక్ష్మికి గొంతు ఎండినట్టయింది.
నుదురూ మెడా చెమటలు పడుతుంటే తుడుచుకుంటూ, "ఇదేదో
గాలి కబురై ఉంటుంది.." అంది ఆశగా.
"లేదమ్మా!
మూర్తి అంకుల్ గాలి వార్తలు చెప్పరు కదా! నాన్న లంచం తీసుకుంటూ నిజంగానే పట్టుబడ్డారట.
అయితే ఆ ఎస్.ఐ మూర్తిగారికి తెలిసిన వాడేనట. కేస్ కాకుండా చూడటానికి
ప్రయత్నిస్తారట."
"ఒరే.
ఏమిట్రా, ఇదంతా నిజమా?" లక్ష్మి
అంతా అయోమయంగా అయిపోతూ అంది.
"ఔను
అమ్మా. ఆయన అబద్ధం ఎందుకు చెప్తారు? అంకుల్
జరిమానా ఏదో కట్టి సమస్య తీరే దారి చూస్తాను అంటున్నారు. నాన్న దగ్గర, బ్యాంకులో ఎకౌంటులో ఎక్కడా డబ్బులు లేవట! అందుకని ఆయనే ఆ డబ్బంతా కడతారట
ప్రస్తుతానికి. ఈ సంగతులన్నీ నీతో చెప్పద్దన్నారట నాన్నా..."
"ఇప్పుడాయన
ఎక్కడున్నారట?"
"జైలులో!!
ఇవాళ రాత్రికి అక్కడే ఉంచి రేపుదయం అంకుల్ డబ్బు కట్టాక విడిచి పెడతారట! ఛఛ! నాన్న
ఎందుకిట్లా చేశాడు అమ్మా!?" సన్నీ ఏహ్యంగా అన్నాడు.
"ఒరే!
మన ఇంటా వంటా లేదురా ఈ పద్ధతి!! ఎన్నడూ లేనిది మీ నాన్నకు ఈ బుద్ధెందుకు
పుట్టిందిరా?! దేవుడా! అసలు ఆయన అటువంటి మనిషే కారు!
ఇన్నేళ్ళుగా ఆయన జీతం తప్ప పైసా ముట్టి ఎరగరు! ఆయన తినరూ ఇంకొకరిని తిననివ్వరని
ఆఫీసంతా గొప్పగా చెప్పుకుంటారు! అందుకేగా ఆయనకింత మంచి సీటుకు మార్చి ప్రమోషను
ఇచ్చింది!! నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు! ఇదంతా కట్టు కథ!" లక్ష్మి
కన్నీరు తుడుచుకుంటూ అంది.
"ఛీ!
ఇప్పుడే వెళ్ళి అంతా తేల్చుకురావచ్చు! కానీ నాకు పోలీసులన్నా స్టేషనన్నా చచ్చేంత
భయం! అంకుల్ కూడా నన్ను రావద్దన్నాడు! ’చిన్నపిల్లాడివి నీకెందుకు?
నేనంతా చూసుకుంటానుగా!’ అన్నారు. ఆయన గొంతు చాలా సీరియస్‍గా
ఉందమ్మా! నాకిది అబద్ధం అనిపించట్లేదు!" సన్నీ బెదురుగా అన్నాడు.
"కానీ
అసలు...ఈయనకు.. ఈ నీచమైన తలంపెందుకు వచ్చిందీ, అని!!!
దర్జాగా బోలెడు జీతం వస్తుంటే ఈ అడ్డదారి ఎందుకు తొక్కినట్టు! ఇంత పరువు తక్కువ
పనెందుకు చేసినట్టు!!" వాపోయింది లక్ష్మి.
"అమ్మా,
లంచం తీసుకోవటం చాలా తప్పు కదా!" మధు అడిగింది చీదరగా.
సన్నీ
ఆ మాటకి ఉక్రోషంగా- "తప్పు కాదే, నేరం!
క్రయిమ్! నాన్న నేరం చేశారు! జస్ట్ టూ లాక్స్ ఆఫ్టరాల్ రెండు లక్షల కోసం.. డాడి
డిడ్ ఎ క్రయిమ్! ఛి షేం!!" అన్నాడు.
"టూ
డిస్గస్టింగ్!! నాన్నా ఇంత దిగజారతారని నాకు అనుమానం కూడ రాలేదు! మన గురించి,
మన భవిష్యత్తు గురించీ, ఆలోచనే రాలేదా ఆయనకు?
రేప్పొద్దున మనం మన స్నేహితుల ముందర అసలు తల ఎత్తుకోగలమా?"
అంది మధు.
"ఛీ!
నాన్నాని నాన్నా అనాలంటే సిగ్గేస్తోంది!"
సన్నీ
ఆమాటన్నాడో లేదో, లక్ష్మి అతన్ని ఛెళ్ళుమని చెంప
మీద ఒక్కటి కొట్టింది ఆవేశంగ. సన్నీ ఊహించని ఈ పరిణామానికి బెదురుకున్నట్టు చూశాడు
తల్లి వంక.
మధు
కోపంగా చూసి "ఎందుకు అమ్మా, అన్నయ్యను కోడతావు?
తను అన్నదాంట్లో తప్పేం ఉంది?" అంది.
లక్ష్మి
కూతుర్ని ఒక్క ఉరుము ఉరిమి చూపుడు వేలితో, శాసిస్తూ
ఆగ్రహంతో ఊగిపోతూ,
"నోర్ముయ్!!
ఇంకొక్క మాట మాట్లాడితే నాలిక చీరేస్తా!! ఆడపిల్లవని ఊరుకుంటున్నా! ఎక్కువ వాగితే తోలు
వలుస్తా! ఎవరి గురించే మీరు మాట్లాడుతున్నది?! మీ నాన్న
గురించా?!! అసలాయన గురించి ఒక్క మాట అనే అర్హత మీకుందా?!
ఆయనను అనేంత గొప్పవాళ్ళయ్యారే?" అంది
బెదిరిపోయి
తల్లి ఆవేశాన్ని మొదటిసారి చూస్తూ అవాక్కైనారు పిల్లలు ఇద్దరూ.
"ఇప్పుడు
పె..ద్ద ఓ..గొప్పగా ఇన్ని మాటలంటున్నారే తండ్రి అని కూడా చూసుకోకుండా- మరి
ఐదొందలిస్తావా, ఆరొందలిస్తావా, అది కొని పెడతావా, ఇది తినబెడతావా అని ఆయన ప్రాణాలు
తోడినప్పుడు ఎక్కడ పోయిందే ఈ షేమూ, దోమా?! ఎక్కడ పోయిందీ వివేకం- ఏమయిందీ అభిమానం?! ఇప్పుడు
లంచం తీసుకున్నాడని అసహ్యించుకుంటున్నారే- మరి వేలకు వేలు నీళ్ళలాగా ఖర్చు
పెడుతున్నప్పుడు ఏమయిందీ బుద్ధి?! ఎక్కడి నుంచి తెస్తాడాయన-
అని ఒక్కక్షణమైనా అలోచించారా?!!!" లక్ష్మి గొంతు బొంగురుపోయింది, బాధతో.
పిల్లలిద్దరు
నేల చూపులు చూశారు.
లక్ష్మి
ఏడుస్తూ, కొంగుతో ముఖం కప్పేసుకుని
కూర్చుండిపోయింది. మధు, సన్నీ ఒకరి మూఖాలొకరు చూసుకున్నారు.
ఇద్దరికళ్ళూ నిండివచ్చాయి.
ఆ
రాత్రి ఎవరూ అన్నాలు తినలేకపోయారు. తలొక మూలా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు.
మూర్తిగారు మళ్ళీ ఫోను చేసి, "కంగారేం లేదు-
డబ్బు ఏర్పాటైంది.." అని ధైర్యం చెప్పారు. "పాత రికార్డంతా బావుంది- ఏ
మచ్చా లేదని చూసి ఒకవేళ ఏశిక్షా పడకపోవచ్చు కూడ’, అని
ఆశ్వాసన ఇచ్చారు.
లక్ష్మి
వేయిదేవుళ్ళకు మొక్కుకుంది. పిల్లలు కూడా దేవుడిని ప్రార్థిస్తూ ఉండిపోయారు. ఈ
ఆపదలో నుంచి కాపాడితే చాలు, ఇంకెప్పుడూ ఈ స్థితి
రానివ్వమని తమలో తామే ప్రమాణం చేసుకున్నారు.
"ఛీ!!
మీకోసం కదూ, నేను ఆయని ఎదిరించింది! మీ అవసరాలు శృతి
మించుతున్నా, ఖర్చులు ఆదాయం మీరుతున్నా ’పోనీలే’ అని- నేను
కదూ, మిమ్మల్ని వెనకేసుకు వచ్చింది! మిమ్మల్ని కాదు- నన్ను
నేను అనుకోవాలి! మనం ముగ్గురం కలిసి ఆయన మనసు పాడు చేశాం! మనకు ఎంత సంపాదన ఉన్నా
తృప్తి అనేది లేదు! ఈ దాహం అటువంటిది! ఎంత అనుభవించినా ఇంకా కావాలనిపిస్తుంది! ఈ
వ్యామోహంలో ఎటు కొట్టుకుపోతున్నామో ఎవరము చూసుకోలేదు! ఇవాల్టి రోజున ఇంట్ళో అన్నీ
ఉన్నాయి- కానీ ఆయన జీవితం మీద పడ్డ మచ్చ..? అది ఎన్నటికైనా
మానేనా?" ఆవేదనగా అంది లక్ష్మి, లోపలి
నుంచి విరిగిపోతున్న గుండెను ఆపి పట్టుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ.
సన్నీ,
మధు వచ్చి తల్లి పక్కన గోడకు చేరగిలబడి కూర్చున్నారు, పొంగివస్తున్న కన్నీరు తుడుచుకుంటూ.
"పాపం..
మొన్న మనందరం ఆయనను పట్టుకోని ఎంతెంత మాటలన్నాం!! ఆయన మాత్రం ఎన్ని అంటున్నా నోరు
మెదపకుండా నిర్వేదంగా చూస్తుండిపోయారు. నాకింకా ఆచూపే గుచ్చుకుంటోంది..! ఛీ! ఎంత
గుడ్డిదాన్నైనానే..!!"
"ఏడవకమ్మా,
మాకూ ఏడుపొస్తోంది.." మధు భోరుమని ఆమె ఒళ్ళో తలపెట్టుకుని
వాలిపోయింది.
"అమ్మా,
నాన్నను ఉద్యోగం లోంచి తీసేస్తే ఇల్లెట్లా గడుస్తుందమ్మా?!"
సన్నీ అడిగాడు బరువుగా, ఆమె భూజం మీద
తలవాలుస్తూ.
"ఏమోరా,
నాకేం అర్థంకావట్లేదు! అంతా అగాధంగా ఉంది! ఛీ! పాపిష్టిదాన్ని! నా
అదృష్టాన్ని నేనే నలిపేసుకున్నాను."
"బాధపడకమ్మా.."
"ఎట్ల
ఉండగలనురా బాధపడకుండా? ఇంత చదువుంది!! పెళ్ళయ్యాక
కూడా అడ్డుపెట్టకుండా పీజీ దాకా లాక్కొచ్చారు. ’నేనెట్లగూ డిగ్రీ కన్నా ఎక్కువ
చదువుకోలేక పోయాను. నువ్వన్నా మాస్టర్స్ చేస్తే రేపు పొద్దున మన పిల్లలను
వృద్ధిలోకి తీసుకురాగలుగుతాము’ అంటూ ఎంతో ప్రోత్సహించారు! ఆయనే స్వయంగ కాలేజిలో
చేర్చి రోజూ తీసుకెళ్ళి తీసుకు వచ్చేవారు! నోట్సులు తెచ్చి పెట్టేవారు! పరీక్షలకు
నాకన్నా ఎక్కువ కష్టపడి, అటు మిమ్మల్ని చూసుకుంటూ, ఇటు వంట చేసి పెడుతూ ఎంతో సహకరించారు. అప్పట్లో ఇన్ని సౌకర్యాలు కూడ లేవు!
పనిమనిషిని పెట్టుకునే స్తోమత కూడా లేదు! అప్పుడే ఆఫీసు పని ఒత్తిడి. అయినా తన కష్టం
చూసుకోకుండా నాకు సహాయపడ్డారు! నా పీజీ అంతా ఆయన శ్రమ ఫలితమే! కానీ ఇందుకు
ప్రతిఫలంగా నేనేం చేశాను ఆయన కోసం? ఆ ఎమ్.ఎ సర్టిఫికెట్
తీసుకెళ్ళి మడత చుట్టి బీరువాలో పెట్టాను భద్రంగా! అందరు ఆడవాళ్ళలాగే నా చదువూ
నాకు ఎందుకూ ఉపయోగపడలేదు! కాదు. నేనే దాన్ని ఉపయోగించుకోలేదు! కనీసం దాని నుంచి
జనించిన వివేకాన్ని కూడా ఉపయోగించలేదు! ఇంకా కుచించుకుపోయాను! ఇంకా దిగజారిపోయాను!
ఛ! ఇక చదువురాని ఆడవాళ్ళకూ, నాకూ ఏం తేడా మిగిలింది?"
తల బాదుకుంది లక్ష్మి.
"అమ్మా,
వద్దమ్మా, బాధపడకు! ఇదివరకటిలా పోనీ స్కూల్లో
జాయినై సంపాయిద్దువుగానిలే.." మధు ఓదార్పుగా అంది.
"కానీ,
అమ్మకు ఇచ్చే మూడు, నాలుగు వేలతో ఇల్లెట్లా
గడవాలే?! అయినా ఏడాది చివర్లో ఏ స్కూల్లో దొరుకుతుంది
ఉద్యోగమైనా?" సన్నీ అన్నాడు ఆలోచిస్తూ.
"ఛీ!
ఉన్నది పోయే దాకా దాని విలువ తెలుసుకోలేకపోయాం! ఇప్పుడు చూడు,
ఆ ఆఫ్టురాల్ మూడొందలు నాలుగొందలకే ఎట్లా మొహం వాచిపోతామో!"
లక్ష్మి అంది.
"ఔనమ్మా!
చేతిలో ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోగలిగినవారే తెలివిగలవారు. మనం తెలివితక్కువ
వాళ్ళం! ఎంతో తెలివి తక్కువ వాళ్ళం.." సన్నీ అన్నాడు శూన్యంలోకి చూస్తూ.
మధు
పశ్చాత్తాపంతో కన్నీరు పెడుతూ, "ఛీ! ఈ బుద్ధి
మనకు గంటలు గంటలు ఫెవికాల్ లా అతుక్కుపోయి ఫోన్లు మాట్లాడేటప్పుడు, ఎడాపెడా ఇంటర్నెట్‍తో ఊగిపోతున్నప్పుడూ ఎందుకు రాలేదో..." అంది.
"ఔను!
నాకు మాత్రం ఈ సెల్ ఫోనెందుకు? ఒళ్ళు బలిసి
కాకపోతే.." జేబులోంచి సెల్ఫోను తీసి దాని వంక అసహ్యాతి అసహ్యంగా చూసి పక్కకి
పారేస్తూ అన్నాడు సన్నీ.
"మీరే
కాదురా, నేనూ కళ్ళు బైర్లు కమ్మినదానిలా, ఆ జానకీ ఆంటీతో కబుర్లు చెబుతూ, ఎస్.టీ.డీలని
చూడకుండా మా వదినలతో సాంబారు పొళ్ళ తయారీలు, గాడిద గుడ్డులో
కంకరపీచు కలిపి చేసే నా శార్ధం వంటకాలు.. అన్నీ వాగుతూ కూర్చునేదాన్ని! నేనూ తప్పు
చేశాను." అని పూడుకుపోతున్న గొంతు సరిచేసుకుని "పాపం, ఆయన ఉదయమో సాయింత్రమో సరదాకు కాల్చుకునే ఒక్కటి అరా సిగిరెట్లకే ఆయన్ను
మొహం పట్టుకుని ఆనేశాను! నిన్న పొద్దున ‘అదేంటండి- సిగిరెట్ డబ్బీ చెత్తలో పడుంది?’ అంటే ’ఔను లక్ష్మీ, ఎందుకు అనవసరమైన ఖర్చు?’ అన్నారే! నాకెంత చివుక్కుమందో!" కళ్ళు ఒత్తుకుంది లక్ష్మి.
సన్నీ
మధు బాధగా మూలిగారు.
"అంతే
కాదు! మన ఇంట్లో అన్ని ఖర్చులూ ఎక్కువే! కరెంటూ, గ్యాసూ,
పాలూ, కూరలూ- వాడేది కాస్తా పడేసుకునేది
మరింతా!! సిలిండరు నెలలో సగం కూడ రావట్లేదు. బజ్జీలూ, పూరీలూ,
వేపుళ్ళకు బోలెడు కాలుతోంది! ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది..
మనం ఎంతెంత వృథా చేసున్నామో! నెలకు ఆరు నూనె పాకెట్లు.. అయినా సరిపోవటం లేదు! ఇక
కరెంటు చెప్పనే అక్కర్లేదు. గీజరు, కూలరూ, వాషింగ్‍మిషనూ, లైట్లూ, ఫ్యానులు,
సరేసరే! ఇక నీకున్న పిలక జుట్టుకు నువ్వూ, వాడి
కోడిబొచ్చుకు వాడూ రోజూ షాంపూలూ డ్రయర్లూ! ఆ హెయిర్ డ్రయర్ కి ఏం తక్కువ కాలుతుందా?
ఇక అవసరమున్నా లేకున్నా టీవీనో, సీడీ ప్లేయరో
మోగుతూనే ఉంటాయి! రెండువేల వాట్లది- ఇహ ఏసీ.. అదెంత కరెంటు తాగుతోందో."
లక్ష్మి ఏకరవు పెట్టింది.
"అసలు
ఖర్చంతా ఇస్త్రీతో వస్తుందమ్మా! నా జీన్సుల్లు- నలగవు,
చావవు! నావి చాలవన్నట్టు దానివీ చేరినయి. బైట ఇచ్చుకునేవి ఇచ్చుకోంగ
ఇంకా ఇంట్లో! అది అదనపు ఖర్చు.." సన్నీ అన్నాడు.
"మరి
నా చీరల్లేవు? ఇంట్లో కట్టుకునే వాటికి కూడా
గంజీ, ఇస్త్రీ?" గట్టిగా
నిట్టూర్చిందామె బాధగ.
"అవన్నీ
సరేనమ్మా. మరి ఈ గాజులూ, నగల సంగతేంటి? ఏంటో అంతా
ఆరిపోతున్నట్టే ఆర్భాటం చేసి నాకూ నీకూ నెక్లెసులూ, ఉంగరాలూ
చేయించావు! మళ్ళీ పైనుంచి కొత్తరకం దుద్దుల కోసం నాన్నని అడిగావు!" అంది.
సన్నీ
మధు వంక కోపంగా చూసి, "ఏమే! పెద్ద- అమ్మని
తప్పు పడుతున్నావు కానీ నువ్వూ నేనూ ఏం చేస్తున్నామో సోయి ఉందా? అమ్మను నిలదీసే ముందు నీ సంగతి చూసుకో! డిగ్రీలో- అదే- ‘బీఈ’ లో చేరాక
ఎన్నిసార్లు పుస్తకాలు తీశావే నువ్వు? ఇంటరులో చదివినంత కూడ
కనీసం లేదు! ఇంజనీరింగు సీటూ రాంగనే ఇంక ఎవరెస్ట్ ఎక్కేశామన్నంత గొప్ప
ఫీలింగొకటి!! నేనూ పెద్ద అక్కడికేదో చదివి చచ్చేవాడిలాగే, లైబ్రరీలో
దొరికే పుస్తకాలు కూడా ఎంతెంతో ఖరీదులు పెట్టి కొనుక్కుని రాక్‍లో
అలంకరించుకోవటమేకానీ అవి దుమ్ము దులిపిన పాపాన పోలేదు." అన్నాడు.
మధు
అన్నయ్య మాటలు ఆలోచిస్తూ ఉండిపోయింది కాసేపు. తర్వాత లేచి కూర్చుని నేల చూపులు
చూస్తూ, "నిజమే! నీమాట నేను తప్పుపట్టను! బీ.ఇలో
చేరాక నేను చాలా నిర్లక్షంగా తయారయ్యాను. ఇంటరులో ఉండే భయం కూడ లేకుండ
పోయింది!" అని సన్నీ వైపు చూసి "అయినా నేను అప్పటికీ ఆడపిల్లనే
అన్నయ్యా! కానీ నువ్వు మగవాడివి! రేపొద్దున నీ కుటుంబాన్ని, నువ్వే
పోషించుకోవాలి! ఆ భారం నీమీదే పడుతుంది! నిజంగా ఆలోచించి చూడు. హఠాత్తుగా డబ్బు
రావటం ఆగిపోతే ఇప్పటికిప్పుడు మన గతేంటి? కనీసం మన కనీస
ఖర్చుల కోసం సంపాదించుకునేంత తెలివి కూడా మనకు లేదు కదా!" అంది.
లక్ష్మి
ఇద్దరు పిల్లల వంకా బాధగ చూసి మధుని దగ్గర తీసుకుని, సన్నీ
తల నిమిరింది. తల్లికి చెరో పక్కా కూర్చున్న పిల్లలిద్దరు ఆమె భుజం మీదికి
వాలిపోయారు. ఆమె నిండి వచ్చిన కళ్ళతో మసకగ కనిపిస్తున్న శూన్యాన్ని
చూస్తుండిపోయింది. ’భగవంతుడా ఈ చీకటి తెర తొలగించు నాయనా!’
రాత్రంతా
కంటిమీద కునుకు లేకుండా గడిచిపోయింది.
No comments:
Post a Comment