Thursday, 8 December 2016

10. తెలిసిన రాయి - 2



          "ఏమ్మా పడుకోలేదా..?" నా ఆలోచనలను తుంచుతూ నాన్నగారి గొంతు వినిపించింది. నాన్నగారు దాహం వేసి లేచినట్టునారు. నేను లేచి మంచం దిగి వెళ్ళి వంటగదిలో కుండలోనించి ఆయనకు మంచినీరు తీసి ఇచ్చాను.
          "నీకు ఆ అబ్బాయి అంటే ఇష్టంలేదా..?" మంచి నీరు తాగి అడిగారు.
          నేను ఒక్క క్షణం ఆగి, "విషయం అతని గురించి కాదు నాన్నగారూ.." అన్నాను.
          "ఓహ్.. అర్థమైంది. నువ్వు పెళ్ళి చేసుకుని వెళిపోతే అంశూ, నేనూ ఏమైపోతామా అని నీ బాధ. అంతేనా..?"
          అంతలో అంశూ లేచినట్టున్నాడు కళ్ళు నులుముకుంటూ వచ్చాడు, "ఏమైంది..?" అని అడుగుతూ.
          "ఏంలేదు.." అని వాడికి కూడా మంచినీళ్ళు ఇచ్చాను. వాడు తాగి వెళ్ళి పడుకున్నాడు. నాన్నగారు నాతో, "తొందరపడకు. నిదానంగ ఆలోచించు. అతను పెద్దగ ఒత్తిడి చేసే రకం కాదు. కావాల్సినంత సమయం తీసుకోమన్నాడు." అన్నారు.
          అతని గురించి నాన్నగారు నాతో చెబుతుంటే నాకు మనసులోనే నవ్వొచ్చింది.
          "మీ అమ్మ బ్రతికి ఉంటే నీ బాధ చెప్పకుండానే అర్థం చేసుకునేదేమో.." అన్నారు ఒక్కసారిగ.
          నేనామాట ఊహించలేదు. "అదేం లేదు.. మీరిప్పుడు అమ్మ అయితే తప్ప అర్థం చేసుకోలేనంత బాధలేం లేవు. పెళ్ళనేది చాలా పెద్ద నిర్ణయం కదా. అందినన్ని కోణాలు పరికిస్తున్నాను. పెదవి దాటిన మాట లాగే మెడకు పడిన ముడిని వెనక్కు తీయలేం అని మీరే చెబుతారు కదా." అన్నాను.
          నాన్నగారు ఆ మాటకు సంతుష్టులైనట్టున్నారు. "సరే, ఎక్కువ బరువనిపిస్తే చెప్పు. నీ ఆలోచనకు నేనూ సహాయం చేయమంటే చేస్తాను." అని వెళిపోయి పడుకున్నారు. ఆయన ఆరోగ్యం అంతకన్నా నాకు సహకరించే అనుమతినివ్వదు.
          నేనూ విద్యుద్దీపం ఆర్పేసి పక్క మీద వాలాను. నాన్నగారు ఊహించింది తప్పేం కాదు. ప్రతీ ఆడపిల్ల మనసులో నాన్నలతో చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. ఆ మాటకొస్తే అమ్మతో కూడ నేనవి చెప్పుకోలేకపోయేదాన్ని. అనురాగ్ నాతో చేసినవి ఏవీ వేరొకరితో చెప్పుకోగలిగేవి కావు. కొన్నయితే కనీసం సొంత మనసులో కూడా తలుచుకోగలిగేవి కాదు. అయితే అట్లని నన్ను అతను ఎన్నడూ అవమానించలేదు. ఆడపిల్లగా నేను తల ఒంచుకోవాల్సిన పనులేనీ చేయలేదు. కనీసం నన్ను వేలేసి తాకనైనా లేదు. అయినా పగ తీర్చుకున్నాడు. కాలనాగై కసితీరా కాటువేశాడు. శిక్షణ పూర్తైనాక అతని కింద అతని స్టేషన్ లోనే నన్ను వేయించుకున్నప్పుడే నాకు ఈ సంగతి తెలుసు. మానసికంగ సన్నద్ధురాలిని అవ్వటంకన్నా ఇంకేమీ చేయలేకపోయాను. దానివల్ల పెద్దగ లాభం జరగదని తెలుసు. నాకు లాభం జరిగే అవకాశాలేవీ అతను తలుపు తెరిచి ఉంచడు. పంజరంలో రామచిలుకైనా యథేష్టం వాగే స్వతంత్రం ఉంటుంది. కానీ నా రెక్కలతో పాటు నా నాలుకను కూడా కోసేసింది అతను నా పై అధికారి కావటం.
          అతను కాల్చుకుతినే విధానాలు రకరకాలు. కాల్చబడేవాళ్ళకు తప్ప కాలుతున్నారని మరెవ్వరికీ వాసన రాదు. మంటా కనిపించదు. ఒక పోలీస్ కి ఉండాల్సిన కచ్చితమైన లక్షణం అదే. డిపార్టుమెంటులో అతను వచ్చాక చాలా కేసుల ఫైళ్ళు పూర్తై అటకెక్కేశాయి. అతని చేతికి చిక్కిన నేరస్తులకు శిక్ష పడకపోవటం అంటూ ఇంతవరకూ జరగలేదట. బాగా గమనించి కొట్టాల్సిన దెబ్బ కొట్టే విధంగ, సరైన చోట కొడతాడు. తన వీక్ పాయింట్లతోపాటు అవతలివాడి వీక్ పాయింట్లు కూడా తెలుసుకునే ప్రణాలికాబద్ధంగ అటాక్ చేస్తాడు. ఆలోచనలతో టైం వేస్ట్ చేసేరకం కాదు. చకచకా పని కానిస్తాడు. ఏ వైపు నుంచి ఏ రకం దెబ్బకైనా ఎప్పుడూ సిద్ధంగ ఉంటాడు. త్వరలో అతనికి సీబీఐ నుండి కాల్ కూడా రావచ్చుట అని డిపార్టుమెంటులో ఊహాగానం. ఎట్ల చేస్తాడో ప్రణాలికలు వేస్తాడో అతనికే తెలుసు. అవతలివాడికి విరుద్ధంగ కావాల్సినన్ని సాక్షాధారాలు సిద్ధమౌతాయి. ఒకే దెబ్బ. అంతే. రెండవది అవసరం ఉండదు. మాటా, మనిషి, పని.. అన్నీ నీట్ గా ఉంటాయి. ఎట్లనా అనుకున్నా..! అతనితోపాటు నా మొదటి కేస్ లోనే విషయం తేటతెల్లమైంది.
          ఒక డాక్టరు గర్భస్రావాలు చేస్తున్నాడని తెలిసింది. దానికి ఆధారాలు కావాలి. వెంటనే ప్లాన్ సిద్ధం చేశాడు. నాతో కూడా చెప్పాడు. ఏం లేదు. ఎవరైనా ఒవరైనా గర్భిణీ స్త్రీని తీసుకుపోయి ఆ డాక్టరును గర్భస్రావానికి ఒప్పించాలి. అంతే తేలిక..!! సరే బాగుందన్నాను. "అయితే మరి పద వేషం కట్టు.." అని నా మొహాన ఒక చీరా, ఒక బురఖా తదితర సామాగ్రీ పడేశాడు. నేను నోరెళ్ళబెట్టాను. వెంటనే కట్టుకు రమ్మన్నాడు. నేనేం మాట్లాడలేదు.
          వెంటనే ఫోను ఎత్తి నెంబర్ కలిపి, "ఒరే సుభగ్.., సార్ ఉన్నారా...?.. ఏం లేదు, కిందివారి సహకారం లేకుండ నేను పని చేయలేను." అనేశాడు.
          నా గుండె అదిరింది. సుభగ్ పని చేసేది కమీషనర్ ఆఫీసులో. శిక్షణలో ఉండంగనే నా మీద చాలాసార్లు పైవారికి ఫిర్యాదులు వెళ్ళాయి. ఇది ఉద్యోగంలో చేరాక జరుగుతున్నది. వాటికీ దీనికీ చాలా తేడా ఉంటుంది. బదిలీ అయితే ఊరొదిలి వెళ్ళాలి. అతని పుణ్యమా అని అంశూ చదువు, నాన్నగారి యోగసమాజం పనులు నిరాఘాతంగ సాగుతున్నాయి. అమ్మ జ్ఞాపకాలతో నిండిన ఆ ఇల్లు వదిలిపెట్టనవసరం లేకుండ గడిచిపోతోందని నాన్నగారు చాలా ఆనందించారు కూడా.
          నేను వేరు ఆలోచించకుండ ఆ చీరా వగైరాలు తీసుకొని మహిళల గదికి వెళ్ళి మార్చుకుని వచ్చాను. అతనూ సివిల్ లోకి మారి ఉన్నాడు, నేను వచ్చేసరికి. అచ్చం ముస్లిం యువకుడిలా వేషం వేసుకున్నాడు. "పద.." అన్నాడు బైక్ కీస్ ఊపుకుంటూ.
          బైక్ కీస్ చూస్తూ, "మీరు.. అంటే..?" అని అడగాల్సింది ఎట్ల అడగాలో అర్థం కాక ఆగాను.
          "నేను రాకపోతే ఎట్ల..? నీ గర్భం తీయించాలి కదా..?" అన్నాడు.
ఆ మాటకు అక్కడికక్కడే ముప్పావు చచ్చిపోయాను. బైక్ మీద ఎందుకు కార్ లో కూడా వెళ్ళచ్చు కదా అని అడుగుదామని అడగలేక ఊరుకున్నాను. అతని వెనక కూర్చుని బురఖా పరదా మొహం నిండా కప్పుకున్నాను ఎవరికీ కనిపించకుండా. అతనికి తగలకుండా కూర్చోవటానికి నేను పెద్దగ ప్రయాసపడనవసరం రాలేదనేదాన్ని బట్టి సంస్కారవంతుడేనని నిర్ధారణై కొంత శాంతించాను. సరే ఒక చోట బండి ఆపి, కూల్ డ్రింక్ ఒకటి కొని ఇచ్చాడు తాగమని. నాకది అస్సలు పడదు. నేను తాగనన్నాను. వెంటనే సెల్ ఫోన్ తీశాడు నోరు మెదపకుండా తాగేశాను. కడుపులో తిప్పటం మొదలైంది. ఎట్లగో తట్టుకుంటుంటే సరిగ్గ హాస్పిటల్ బయట కాఫీ తాగమని బలవంతం చేశాడు. నాకర్థమైంది అతని ఆలోచన. మారుమాట్లాడకుండా తాగేశాను. దేవుడిదయ వల్ల క్లినిక్ లో ఎవ్వరూ లేరు. లోపలికి వెళ్తూనే మూలగా గోడకు ఉన్న వాష్ బేసిన్ లో భళ్ళున కక్కుకున్నాను. సర్దుకుని వచ్చి కూర్చున్నాక అవసరమైన ఉపచారాలు చేసి,
          "ఏమైంది..?" కొంచెం గమనిస్తూ అడిగాడు డాక్టరు.
          "మూడో నెల.." చెప్పాడతను. నాకు అప్పటికే చెమటలు పట్టేశాయి వాటితోపాటు ఉక్కపోయటం మొదలైంది.
          "ఈ గండం వదలటానికి ఎంతవుతుంది..?" నేరుగ అడిగాడతను.
          "ముందు పరిస్థితి చూడనిది ఏం చెప్పగలను..?"
          డాక్టర్ నా వీపు మీద స్టెత్ పెట్టి చూడబోతుంటే నేను కుచించుకుపోయాను. అతను అడ్డం వచ్చి ఆపి, వెంటనే తన దగ్గర ఉన్న కొన్ని కాగితాలు తీసి చూపించాడు. డాక్టరు వాటిని శ్రద్ధగ చదివి ఏదో నిర్ధారణకు వచ్చినవాడిలా, "అన్ని టెస్టులు చేయించారన్నమాట..! రిపోర్టులను బట్టి పరిస్థితి అర్థమైంది. ఎందుకు వద్దనుకుంటున్నారు..?" అన్నాడు.
          "మా పెళ్ళికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు." చెప్పాడతను సిగ్గుపడకుండా.
          నేను వంచిన తల ఎత్తితే ఒట్టు. ఏ జన్మలో ఏం ఖర్మ చేసుకున్నానో ఇతగాడి బిడ్డకు తల్లిని కావాల్సొస్తోంది.. అదీ పెళ్ళి కాకుండానే..!
          "నోనో..! గర్భస్రావం.. రిస్క్ కావచ్చు.. వద్దు.. కేస్ కూడా అవుతుంది.."
          అతను జేబులోంచి ఒక వెయ్యి రూపాయల నోట్ల కట్ట తీశాడు.
          "అంటే.. నాకు రాజకీయ పరపతి ఏం లేదు.."
          అతను అటువంటిదే ఇంకొక కట్ట తీశాడు.
"ఎవరు మీరు..?" అడిగాడు డాక్టరు. అతగాడు అంత డబ్బు కళ్ళ జూడలేదని అర్థమౌతోంది.
"ఈమె నా ప్రియురాలు.. నేను ఈమె ప్రియుణ్ణి. అంతకన్నా పరిచయం ఇవ్వలేను. ఇంట్లో తెలిస్తే గొడవలౌతాయి. నావల్ల ఆమె జీవితం పాడవ్వటం నాకిష్టం లేదు. మీ దగ్గర ఏ సమస్యలూ ఉండవని తెలిసే వచ్చాము."
          డాక్టరు చిరాగ్గా, "చదువుకున్నవాళ్ళే కదా..! టీనేజీ కూడా కాదు.. జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు దూరం పోయారు..?" అని అడిగేసరికి నేను దిక్కులు చూశాను అరచేతులు నలుపుకుంటూ.
          "ముందు జాగ్రత్త తీసుకోవాలని ఆలోచన కలిగేలోపే జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది చూడండి."
          చివరకు కాసేపు వాదించాక డాక్టరు ఒప్పుకుని తేదీ అవీ నిర్ణయించి చెప్పాడు. జాగ్రత్తలు విధానాలు నిర్ణయమైనాయి. ఏమీ తినకుండా రావాలని ఓ నాలుగైదు గంటల పని అని అంతా వివరంగ చెప్పాడు. నా చెవుల్లో సీసం పోసినట్టైంది. ఇంకా ఆ దరిద్రులు ఎప్పుడొస్తారో..!!
          సరిగ్గ నా ఆలోచన కూడా పూర్తికాలేదు సుభగ్ వచ్చేశాడు. వెనక కానిస్టేబుళ్ళతో డాక్టరును వాడితో పాటు మమ్మల్ని అరెస్టు చేయించాడు. డాక్టర్ ఖంగు తిన్నాడు. అనురాగ్ సుభగ్ ని ఎంత "వేడుకొన్నా" వదలనన్నాడు. డబ్బు ఎర చూపినా లాభం లేకపోయింది. అందరినీ జీప్ ఎక్కమన్నారు.
          "వీళ్ళిద్దరినీ స్పెషల్ గ తీసుకురండి..! ఇట్లాంటివారికి విశిష్టమైన శిక్షలు వేయాలి.." అన్నాడు సుభగ్. మేమెవరమో డాక్టరుకు తెలియకుండా ఉండాలని ఈ ప్లాన్. ఏవో తిడుతూ అరుస్తూ క్లినిక్ జప్తు చేసుకుని మా ఇద్దరినీ వేరే జీప్ ఇచ్చి పంపేసి డాక్టరు సిబ్బందితో తను వెళిపోయాడు. తను కలగచేసుకోవటంతో ఒక కేస్ పరిష్కారమైనందుకు సుభగ్ ఆనందానికి అవధుల్లేవు. ఎగురుకుంటూ వెళిపోయాడు. మేము స్టేషన్ కు బయలుదేరాం.
          "పోనీలే, ఇవాళ నాకు చాలా జ్ఞానం లభించింది." అనురాగ్ అన్నాడు జీప్ లో దర్జాగా కూర్చుని. నేను విరక్తిగ పక్కకు చూశాను.
          "ఏం జ్ఞానం సార్..?" ఈ విషయాలేవీ తెలియని డ్రైవర్ అడిగాడు.
          "దూరంపోయే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అవి తీసుకోకపోతే ఎదురయ్యే ఇబ్బందులు...! వీటి గురించి చాలా తెలిసింది. అడిగి విపులంగ కనుక్కుంటే ఇంకా కూడా తెలిసేదే.."
          నేను కదిలే జీప్ లోంచి దుంకేయాలన్న కోరికను బలవంతంగ ఆపుకున్నాను. వెక్కి వెక్కి ఏడుపు వచ్చింది.
          ఈ మూడేళ్లలో అటువంటి ఘట్టాలెన్నో. ఏడుపు తన్నుకుని వస్తున్నా ఆపుకోవటం ఉద్యోగంలో చేరాక నేను నేర్చిన మొట్టమొదటి పాఠం. ఎక్కువసార్లు పాఠాన్ని అమలుచేస్తే పాఠం గట్టి పడుతుంది. కానీ ఉద్వేగాలను ఆపి పెడితే శరీరానికి మంచిది కాదు కనక అటువంటి ఘట్టాలు గడిచాక నా కన్నీటిధారకు ప్రత్యక్షసాక్షి స్నానాలగదిలో షవరూ, పక్కమీద దిండూ. సరే చేసుకున్న ఖర్మమని వదిలేసేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తే జీవితాంతం అదే చేయాలేమోననిపిస్తోంది.
          అతను ఎవ్వరికీ చెప్పని "సారీ" కూడా నాకు చెప్పాడు. పశ్చాత్తాపంతోనే చెబుతున్నాడని కళ్ళు చూసి అర్థమైంది. అది నా మనస్సును తాకింది కానీ నా వేదనను తీర్చలేకోపోయింది. అతనికీ వేదన ఉందన్నాడు. కానీ అతని వేదనకూ, నా వేదనకూ తేడా ఉంది. నా వేదనైనా ఈ జన్మలో తీరేనేమో కానీ అతనిది మాత్రం తీరదు. తెలుసు. అందుకే తెలిసి ఎవ్వరినీ బాధ పెట్టకూడదు. నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించాల్సివస్తుంది.
           నా దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఇంత జరిగాక నా వేదనా నేనే తీర్చుకోవాలి, అతని వేదనా నేనే తీర్చాలి. లేదంటే తన పాపానికి నిష్కృక్తి లేదని అతను అపరాధభావంతో పిచ్చెక్కిపోతాడు. అవసరానికి మించిన డబ్బులో పుట్టి పెరిగినవారికి చేతనైనది ఇదొక్కటే. అయితే పగ, కసి, ప్రతీకారాలతో లేదా అపరాధభావం, పశ్చాత్తాపం, ఆత్మనిందలతో దహించుకుపోవటం..! అన్నింటికీ అతిగా స్పందించటం. ఇప్పుడతని పరిస్థితి ఇదే.
          అందుకే దేనికైనా హద్దు ఉండాలి. అధికారాన్ని, బలాన్ని, వయస్సునూ అడ్డంపెట్టుకని అడ్డమైన పనులు చేయకూడదు. నేరస్తులను పట్టుకునే అతిసులభ మార్గం అనీ, నాటకంలో పాత్ర పోషణలో పాపపుణ్యాలేమిటి- అని నన్ను, నా ఆలోచనను కొట్టిపారేశాడు. నేనది తప్పంటే చాలు, ఇంకో కంప్లైంటు సంధించి ఉంచేవాడు. మొదట నేనూ తప్పు కాదు, కాదులే అని సరిపెట్టుకున్నా కానీ నాకది మొదటినుంచీ చిరాగ్గానే ఉండేది. రానురానూ ఎబ్బెట్టుగ అనిపించటం మొదలైంది. దొంగతనంగ మందులు అమ్మే కేస్ అని, చైల్డ్ లేబర్ కేస్ అని, డ్రగ్స్ కేస్ అనీ, చివరకు రేప్ కేస్ అనీ, తరువాత స్మగ్లింగ్ అని, షేర్స్ ఘోటాలా అని చాలా చోట్ల అతని సహచరిగా, ప్రేయసిగా, అసిస్టెంటుగా రకరకాలుగా వేషాలు ధరించాను. నేను నొచ్చుకున్నాను. మిగిలినవారు మంచి పని అని మెచ్చుకున్నారు. తప్పదు కనక సంతోషించాను.
          కానీ నేనూ ఓ మర్యాదస్తుల ఇంటి ఆడపిల్లనే. ఆరోజు వ్యభిచార గృహం కేస్ అనంగనే గుండె ఠారంది. ఆరోజు నా పుట్టినరోజు. అమ్మ తిథి. నాన్నగారు అమ్మ ఒకటైనరోజు వాళ్ళ పెళ్ళిరోజు.. నాకు చాలా భావాత్మకమైన రోజు.
          "మీరు ఈసారి కమీషనర్ కే నేరుగా ఫోను చేసినా నేను రాను." అన్నాను.
          అతను, "బాగా ఆలోచించుకునే మాట్లాడుతున్నావా?" అన్నాడు.
          "కావాలంటే ఇప్పుడే విరమణపత్రం వ్రాసి ఇమ్మంటారా..?" అన్నాను అసహనంగ.
          "కారణమేంటి..?"
          "వ్యక్తిగత విషయం.."
          "మీ వ్యక్తిగతాలతో మన విభాగానికి సంబంధం ఉండదని శిక్షణలో మొట్టమొదటి పాఠం.. గుర్తులేదా..?"
          "నేను ఉద్యోగికన్నా ముందు మనిషిని. విభాగానికి నా కర్తవ్యం కన్నా ఎక్కువ సేవలే అందించాను. నాకూ ఓ అస్తిత్వం ఉంది.. ఇట్ల నన్ను నిర్బంధించటం మీకు భావ్యం కాదు."
          "ఏంటి నిర్బంధించటం..? ఏది భావ్యం..? అక్కడికి నేనిక్కడ పని మానుకుని నిన్ను ఏదో ఆరళ్ళు పెడుతున్నట్టు ఫీలైతావు..? విభాగం కోసమే కదా చేయమంటున్నది..! ఒంట్లో బాలేదు ఏదైనా ఎమర్జెన్సీ అంటే వేరే మాట.."
          ఇతనికి ఎంత చెప్పినా వ్యర్థమేనని విసుగుపుట్టి, "సరే నాకు ఆరోగ్యం బాలేదు.. లీవ్ కావాలి." అన్నాను.
          "హాస్పిటల్లో పడ్డావా? ఏవైనా విరిగినయ్యా? కాన్సరా..? అల్సరా..? ట్యూమరా..?" అంటూ నేను అసహనంగ చూసేసరికి, "అవేం కాదు కదా..! అయితే మందు తీసుకుని బయల్దేరు. కావాలంటే నేనే డాక్టరు దగ్గరకు తీసుకెళ్తా.. పద." అని ఫోను పట్టి నెంబరు కలపటం మొదలుపెట్టాడు.
          "మీరు మనిషా లేక..?" అన్నాను భరించలేని అసహనంతో ఆ ఫోను ఆపమని సూచిస్తూ.
          "నేను మనిషికన్నా ముందు ఉద్యోగిని. నా కర్తవ్యం తప్ప నాకేమీ పట్టదు. దానికోసం నా వ్యక్తిగతం ఎంత ముఖ్యమైనా పక్కన పెట్టటమే నాకు తెలుసు. ఎంత చేసినా నాకు తృప్తి ఉండదు. అసలేదైనా చేశానని కూడా నాకనిపించదు."
          అతను నిజమే చెప్పాడు. నిజంగ అంత అంకితభావమూ అతనిలో ఉంది. కర్తవ్యపాలనంలో దేనినీ కేర్ చేయడతను. ఏవో కేసులు స్టడీ చేస్తూ, కనీసం ఇంటికికూడా పోకుండా స్టేషన్ లోనే తెల్లారిన రోజులు ఎన్నో. కానీ.. నేను..
          "అందరూ మీలాగ ఉండాలంటే కష్టం.. నాకు అన్ని వేళలా ఇట్లాంటివి కుదరవు. మా నాన్నగారికి తెలిస్తే.."
          "ఎవ్వరికీ తెలిసే అవకాశం లేదని చెప్తున్నా కదా..! ఇన్నాళ్ళు తెలిసిందా ఎందరో నేరస్తులను పట్టుకున్నాం. శిక్ష వేయించాం. ఒక్కసారి అక్కడ బలయ్యే ఆడపిల్లల గురించి ఆలోచించు. నువ్వూ ఓ ఆడపిల్లవేగా! మీ నాన్నగారు అడిగినా ఎవ్వరు అడిగినా అదే చెప్పు..! నీకు చేతకాకపోతే నేను చెప్తా- ఎవ్వరంటే వారికి.."
          "సర్.. మీరు ప్లీస్ అర్థం చేసుకోండి..! ఈ ఒక్కసారికి మీరు ఇంకెవరినైనా తీసుకువెళ్ళండి.."
          "ఇంకెవరినైనా తీసుకెళ్తే పని కావచ్చు కానీ నువ్వు ఉంటే పని సులువవుతుందని మాత్రమే నా ఆలోచన. నీకు ఉన్న శిక్షణ, అనుభవం, ధైర్యం, సమయస్ఫూర్తి వాళ్ళకు ఉండవు కదా. నువ్వు మాత్రమే అవసరమైతే డిఫెంసు చేసుకోగలవు.. దానికి తగిన ట్రైనింగ్ నీకే ఉంది.."
          నేనూ పట్టుదలకొచ్చాను. "నేను ఎన్నిసార్లు ఇట్ల రానని మీతో అన్నాను? ఈ ఒక్కసారే కదా..?"
          అతను నా విధానం చూసి ఒకింత ఆశ్చర్యపోతూనే అన్నాడు- "ఎక్కువ అనలేదు! ఒప్పుకుంటా! ఇదంతా సరే.. కానీ అసలు పోలీస్ ఉద్యోగం అంటే ఏమనుకుంటున్నావు? అదీ క్రికెట్ లాగే! ఇన్ని బాళ్ళూ సరిగ్గనే ఆడాను ఒక్కటే చూసుకోలేదు.. అందుకే ఔటయ్యాను.. ఈ ఒక్కసారికి వదిలేయండి.. అని ఎవరైనా బాట్స్ మన్ అంటే అంపైర్లు ఒప్పుకుంటారా ఇంటికి పంపిస్తారు..?"
          "అందుకే ముందే చెప్పాను పదవి విరమణ చేస్తానని.. నాకేం బాధ లేదు.."
          "నువ్వు ఎందుకు రానంటున్నావో నాకర్థమైంది. అంత ధైర్యం లేనిదానివి, డ్యూటీ వదిలి పారిపోయేదానివి, అసలు ఉద్యోగంలో ఎందుకు చేరావు? పొద్దున లేస్తే ఇందులో ఉండేవే నేరాలు, దరిద్రాలు, అక్రమాలు, అన్యాయాలు! మనిషి ఒడగట్టగలిగే అన్ని నీచాలను మనం తెలుసుకోకా తప్పదు.. వాటి నివారణకు ప్రయత్నించకా తప్పదు. నీ సున్నిత భావావేశాలకు ఇక్కడ తావు లేదు."
          ఇంక నేను ఏమీ మాట్లాడకుండ జేబులోంచి నా విరమణ పత్రం తీసి ఇచ్చాను.
          అతను అది ఏంటని తెరిచి చూసి చదవకుండానే పక్కన పెట్టి అన్నాడు- "అంత తెగింపు లేనిదానివి ఐపీఎస్ ఎందుకు వ్రాశావు..? చేతకానివాళ్ళు చేతులకు గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చోవాలి.."
          "విల్ యూ ప్లీస్ షటప్..!!!" అనేశాను ఒక్కసారి.
          అంతే!! అనురాగ్ లోపలి మనిషి దెబ్బతిన్నట్టు చూశాడు. ఠక్కున లేచాడు.
          జరిగిన పొరపాటు అర్థమై నాకు హఠాత్తుగ స్పృహ వచ్చినట్టైంది. మొదటిసారి నోరు జారాను. "అ.. అయాం సారీ..!" అన్నాను.
          కానీ అతను వినలేదు. నా వంక చూడకుండ స్టేషను బయటకు వెళిపోయాడు.
          నేను ఆ గదిలోనే కుర్చీలో చేరగిలబడ్డాను తల పట్టుకుని. ఇంకా నయం! అతను ఇటువంటి విషయాలేవైనా రహస్యంగ లోపల గదిలో మాట్లాడతాడు కాబట్టి సరిపోయింది. అదే బయట అయి ఉంటే పరువు పోయేది. అతనిది ముందు, నాది తర్వాత.
          కానీ ఆలోచించగా అతను అన్నది కూడా తప్పేం కాదు అనిపించింది. ఎప్పుడూ కర్తవ్యనిరతి ఉంటేనే వాడు నిజమైన పోలీస్. ఇక్కడ ప్రాణాలకు తెగించి, పగలు రాత్రి తేడాలు లేకుండ పని చేసేవాళ్ళే కావాలి. హాయిగ నెలకింత జీతం తీసుకుని, నీడ పట్టున బ్రతకాలనుకుంటే ఈ జోలికే రాకూడదు. రిస్క్ కి నేనెన్నడూ భయపడలేదు. కానీ అమ్మ, నాన్న అని నేను భావాలు పెట్టుకుని కర్తవ్యం మానేస్తే అది కూడా సరి కాదు కదా. ఎవరి దాకానో కాదు, ముందు వాళ్ళిద్దరే బాధ పడతారు.
          ఆడపిల్లలెందరో పాపం కల్లాకపటం ఎరుగక, వంచకులైన మొసళ్ళ బారిన పడి, ముక్కు పచ్చలారకుండనే జీవితాలు ముగించుకుంటున్నారు. భవిష్యత్తులకు తెర పడిపోతుంది. ఛి అదొక జీవితమా..?! నా అదృష్టం బాగుంది కనక పరువు, మర్యాదా, కుటుంబం అని నేను మాట్లాడుతున్నానిప్పుడు. నాకేదైనా కీడు జరిగి ఓ రక్షణ ఛాయ నాపై లేకపోయి ఉంటే..? ఏమో నేనూ అట్లగే.. ఛిఛి..!! నా ఒక్కదాని సెంటిమెంటుకన్నా ఇందరి జీవితాలు ముఖ్యం కాదా? ఏమో! వారిని రక్షించి బంధం విడిపించి ఏదైనా పునరావాసం కల్పిస్తే ఏదో కష్టపడి పని చేసుకుని గౌరవంగ బ్రతుకులు వెళ్ళదీసుకుంటారు.
          అప్పుడు అమ్మ ఆత్మ మరింత సంతృప్తి పడుతుంది. నాన్న చాలా ఆనందిస్తారు. అంత మంది ఆడపిల్లలను కాపాడగలిగినందుకు నేనూ సంతోషపడతాను.
          ఈ ఆలోచన కలిగాక సరేనని లేచి యథావిధిగ తయారవ్వటానికి ఉపక్రమించాను. రాత్రికి తగిన ఏర్పాట్లు చూసుకున్నాను. నాకు ప్లాన్ తెలుసు. ప్లాన్ ఏదైనా నేను పోషించాల్సింది ఓ అందమైన ఆడపిల్ల పాత్రే!. కాకపోతే ఇవాళ మరింత అందంగ కనిపించాలి. లేదంటే బేరం కుదరదు. విడిగా కేసులలో ఎంత స్ట్రిక్టు ఆఫీసరునైనా అతని పక్కన ఈ పాత్రలలో చాలా మటుకు నోరు మెదపనక్ఖర్లేకుండా అతనే చూసుకుంటాడు. ఇష్టం లేకపోతే పరదా వేసి, బురఖా కూడా వేసుకోవచ్చు. చుట్టూ జరిగేదానికి విరుద్ధంగ స్పందించకుండా ఉంటే చాలు. మిగిలిందంతా అనురాగ్, సుభగ్ చూసుకుంటారు. ఏమైనా చేయటమే సులువు. అంతా చేయగలిగి ఉండీ ఏం చేయకుండా ఉండటానికి చాలా సత్తువ కావాలి అని అక్కడే తెలుసుకున్నాను. సరే, నాన్నగారు రేపు ఎట్లగో వారం పాటు యోగా శిబిరానికని ఊరెళతారు. అంశూ విజ్ఞానయాత్రకని విశాఖ అవేవో చోట్లకని కళాశాలతోపాటు వెళ్ళబోతున్నాడు. వాడు వచ్చేసరికి ఓ వారం పడుతుంది. ఈలోపు ఈ కేస్ ఫైలు కూడా మూసేస్తారు. ఇవాళ ఒక్క రాత్రి.. గడిస్తే చాలు.
          "ఏయ్.. ఎవరీ అమ్మాయి..? నా గదిలో ఏం చేస్తోంది..? లోపలికెవరు రానిచ్చారు..?"
          నేను ఉలికిపడి లేచి చూశాను. సాయింత్రానికి అతను తిరిగి వచ్చాడు. నన్ను గుర్తు పట్టనట్టున్నాడు. చూస్తూనే కసరటం మొదలుపెట్టాడు.
          "ఏయ్.. నీకేం కావాలి..? స్టేషనుకు ఎందుకొచ్చావ్..? సరాసరి లోపలికెట్ల వచ్చావ్..?
          నేను ఆశ్చర్యంగ ఆ గ్రామీణ రాజస్థానీ కట్టు మేలిముసుగు తీసి చూశాను.
          "రక్తి.. నువ్వా..?" నమ్మలేనట్టు చూశాడు.
          నేను ఆటపట్టిస్తున్నాడనుకుని నవ్వాను. అతను ఎప్పటిలాగే మౌనంగ టేబుల్ మీద గ్లాస్ మూత తీసి ఉన్న నీళ్ళన్ని తాగేశాడు గటగటా. పాపం అలసిపోయినట్టున్నాడు. తర్వాత తల పట్టుకుని అసహనంగ చూస్తూ తన కుర్చీలో వెళ్ళి కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ. ప్రతీ ప్లాన్ ముందర అతనికిది అలవాటే. ఇప్పుడూ ఈ ప్లాన్ ఎట్ల విజయవంతంగ నడపాలో అని ఆలోచన కావచ్చు. ఇప్పుడు నేను ఒప్పుకున్నా కాబట్టి ఇంక కంగారేం లేదు. అంతా అనుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది.
          "ఒప్పుకుంటావనుకోలేదు అస్సలు.." అన్నాడు కాస్తాగి సర్దుకుంటూ, నన్ను కూర్చోమని సైగ చేసి.
          నేను కూర్చుని, "సారీ! ఇందాక తొందరలో.. ఏదో.. నోరు జారాను." అన్నాను.
          అతను సునిశితంగ చూసి, "రెడ్ లైట్ ఏరియాలో తీసుకెళ్ళి అమ్ముతా.. సిద్ధం కమ్మంటే ఏ అమ్మాయికైనా మండుతుంది." అన్నాడు.
          నాకు ఇదే మాట నచ్చదు. అయినా నిశ్శబ్దంగ ఉండిపోయాను. సరే సుభగ్ వచ్చాక రాత్రి పదిన్నరకు బయల్దేరాము. ఆనాటి రాత్రి నేను జన్మలో మర్చిపోలేనిది.
          "కాస్త తొందరగ బయల్దేరితే బాగుండేది. ఇంతాలస్యం చేశారు." అన్నాను సుభగ్ జీప్ వేగంగ నడుపుతూంటే.
          "వెళ్ళేది గుడికి కాదు.. సూర్యోదయం అయ్యాక తీరిగ్గ శుచిగ వెళ్ళటానికి.." అన్నాడు అనురాగ్.
          "అటువంటి చోట్లకు ఇప్పుడు కాక ఎప్పుడు వెళతారోయ్..?" అన్నాడు సుభగ్ నవ్వి.
          సుభగ్ అనురాగ్ తో పాటు నాతో కూడా చనువుగా ఉంటాడు. కలిసి చేసే పని వల్ల చనువు ఏర్పడిపోయింది.
          "ఏమో, వెళ్ళేవాళ్ళకు తెలియాలి.." అన్నాను నేను.
          ఇద్దరూ ఠక్కున చూశారు.
          "కొద్దిగ ఆగి, మెల్లగ అక్కడ అలవాటైనాక నీకే తెలుస్తుందిలే.." అన్నాడు అనురాగ్.
          నాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది. మేలిముసుగు తీసిపారేసి, "జీప్ ఆపు సుభా..!!" అన్నాను.
          సుభగ్ ఠక్కున ఆపి ఏమైందన్నట్టు చూశాడు. నేను ఎటో చూస్తూ, "బండి వెనక్కు మళ్ళించు. నేను రావట్లేదు." అన్నాను.
          అతను అనురాగ్ ను చూశాడు. అనురాగ్ నన్నే చూస్తున్నాడు. నేను ఇద్దరినీ చూసి, జీప్ దిగి ఆటో కోసం చూశాను అటూ ఇటూ.
          "పదకొండవుతోంది.. అందమైన అమ్మాయిలకోసం ఇది ఒంటరిగ వెళ్ళే వేళకాదు..! ఆమెగారికి చెప్పు సుభా.."
          సుభగ్, "రక్తి కేవలం అందమైన అమ్మాయే కాదు, ఐపీఎస్ టాపర్! బెస్ట్ ట్రెయినీ అవార్డును అందుకున్న ఒక బాధ్యతగల పోలీస్ ఆఫీసర్." అన్నాడు.
          "ఆ మాట ఈ రూపం చూసిన వాళ్ళకు తెలియదుగా..!" అని నేను కోపంగ చూడంగనే, "మద్యం, మత్తుపదార్థాల సేవనం శారీరకబలాన్ని పిచ్చిపిచ్చిగా పెంచుతుంది. అటువంటి ఒక్కడు చాలు. మన శిక్షణ ఎందుకూ పనికిరాదు." అన్నాడు.
          నేను కదలకుండా నిలబ్డడాను. "ఏయ్ ప్లాన్ పాడు చెయ్యకు. జీపెక్కు.." అన్నాడు నన్ను తీక్ష్ణంగ చూసి.
          నేను విననట్టే ఉండిపోతే సుభగ్ కి అసహనం హెచ్చింది.
          "అనూ.. అసలు తప్పు నీదేరా..! రక్తి కుటుంబనేపథ్యం వ్యక్తిత్వం ఆలోచించకుండా ఈ ప్లాన్ వేయటమే నీ తప్పు. ఎంతైనా ఆడపిల్ల.."
          "క్షణం ముందు ఐ పీ ఎస్ ఆఫీసర్..! క్షణం కాంగనే ఆడపిల్లైపోయిందా? సత్తా ఉంటే ప్రొఫెషన్ లో చూపించమను. మనను సాధించటంలో కాదు.."
          నాకు నిలవలేనంత మండి, ఆటో యత్నం ఫలించేటట్టు లేదని వెనుదిరిగి అడుగులు వేయటం ప్రారంభించాను.
          ఇంక సుభగ్ జీప్ దిగి వచ్చి, నాతో విన్నపంగ అన్నాడు- "నీకు వాడి సంగతి తెల్సు కదా! ఆ మాటలెందుకు పట్టించుకుంటావు? వాడికోసం కాదు, నాకోసం రా! హనుమాన్లు కూతురు లాంటి అమాయకులై నిర్దోషులై దుష్టుల బారి పడి మోసపోయిన వారికోసం రా.."
          హనుమాన్లు మాదగ్గరే పని చేసే ప్యూను. అతని కూతురును ఎవరో అఘాయిత్యం చేసి, అటువంటి చోట్లే వదిలేస్తే ఆమె అవమానం బ్రతుకు జీర్ణించుకోలేక మేడ దుంకి చచ్చిపోయింది. అతనికి అది తీరని బాధ..! నాకూ ఓ మనసుంది. నేను ఆ అమ్మాయిని ఒకసారి వాళ్ళ నాన్న కోసం స్టేషన్ కు వచ్చినప్పుడు చూశాను. కళ్ళలో ఆ పదహారేళ్ళ అమాయకమైన నవ్వుముఖం మెదిలింది. అంతే..! అప్రయత్నంగ అడుగులు ఆగిపోయాయి. కానీ వెనుదిరగలేదు.
          "ఓకే.. వాడి తరఫున నేను సారీ చెబుతున్నాను. రా.." సుభగ్ అన్నాడు.
          నేను తల తిప్పి అనురాగ్ వంక చూశాను. అతనెటో చూస్తున్నాడు. సుభగ్ అతన్ని "సారీ చెప్పమ"ని నా వెనక నుండి సైగతో అర్థించినట్టున్నాడు.
          "చచ్చినా చెప్పను..! బ్రతుకులో ఎవ్వరికి ఇంతవరకు చెప్పలేదు. అటువంటి పరిస్థితులే తెచ్చుకోను. అయినా ఇప్పుడు నేనేం తప్పు చేశానని చెప్పాలిట..? ఏమైనా పెద్ద ఉదారసేవ చేయమంటున్నానా? కర్తవ్యం చేయమంటున్నాను. కర్తవ్యం కోసం ప్రాణాలైనా వదుల్తామని ప్రతిజ్ఞలు చేసేది గిట్ల నఖరాలాడనీకా..?"
          నాకు చాలా బాధ వేసింది. "ప్రాణాలైనా వదుల్తానన్నది కర్తవ్యం కోసం..! నాటకాలకోసం కాదు.." అన్నాను.
          "నాటకాలేస్తోంది కర్తవ్యంలో భాగంగా నిజజీవితంలోనే కానీ కాలక్షేపం కోసం స్టేజి మీద కాదే! ఇంత సులువుగా మనకు ఆధారాలతో సహా నేరస్తులు పట్టుబడుతుంటే ఇంకేం కావాలి? సుభగ్ తీసిన హిడ్డెన్ కెమేరా క్లిప్పింగ్ లు చూసి జడ్జి గారు ఎన్నడూ కేస్ నాన్చలేదు. ప్రతీసారి కచ్చితంగ మన పక్షంలోనే తీర్పునిచ్చారు. దానివల్ల ఎంత టైం సేవ్ అవుతుందో ఆలోచించు. కమీషనర్ గారు ఒప్పుకంటేనే కదా ఈ విధానం అమలు చేస్తున్నది." అని ఆగి, "నేరస్థుల శిక్షకోసం, అమాయకుల రక్షణ కోసమే కదా మన డిపార్టుమెంటు ఉండేది. దానికోసం ఎన్ని పాత్రలు పోషిస్తే తప్పేంటి? నటనే కదా చేయమన్నది!! నిజంగ తీసుకుపోయి అమ్మినంత బాధ పడుతుందేంటి? నువ్వూ, నేనూ ఎన్ని వేషాలు కట్టలేదు? ఎర్రతోలు చూసుకుని ఎందుకంత ఎగిరి పడుతుంది..?" ఇది అనురాగ్ సమాధానం.
          నాకు నిజంగ అది విని ఏడుపొచ్చింది. కానీ తమాయించుకున్నాను. ఇతని ముందు ఎంత అభ్యాసం చేసినా ఏడుపు వచ్చిన తర్వాత ఆపుకోవటమే కానీ రాకుండ ఆపుకోవటం చేత కావట్లేదు. అన్ని చోట్ల గట్టిగ ఉండగలిగి, అవతలవారిని నోరెత్తనివ్వకుండ వాయించి పడేసే నేను, ఇక్కడ ఎందుకు డసిలిపోతానో నాకూ అర్థం కాదు. నోరే పెగలదే..!
          నా బాధ అర్థం చేసుకుని సముదాయింపుగా చూస్తూ సుభగ్, నెమ్మదిగ "వాడి తత్త్వం తెలుసు కదా..! ఎందుకు అనవసరమైన గొడవ చెప్పు?" అన్నాడు.
          "గొడవ నేను చేస్తున్నానా అతనా..?"
          "రక్తీ.. ప్లీస్.."
          నాకు బ్రతిమాలించుకోవటం నచ్చదు. సుభగ్ ఏదో ఆలోచించి, "ఇటు రా, చెప్తా" అని నన్ను కొంచెం దూరం తీసుకుపోయి, "సరే.. మగవాళ్ళ ఆంతరిక బాధలు కొన్ని ఉంటాయి. నీకవి అర్థం కావు..! అయినా నీకొక రహస్యం చెప్తా విను. నిన్నింత అందంగ ఎప్పుడూ చూడలేదు కదా..! చూసి మతి పోయింది వాడికి." అన్నాడు.
          నేను నమ్మలేనట్టు అతని వంక చూశాను. అనురాగ్ గురించి అట్ల విన్నందుకు కాదు, సుభగ్ నాతో అంత ధైర్యంగ ఆ మాట అనటం చూసి నిజంగ ఆశ్చర్యపోయాను.
          "ఒట్టు!! త్వరలో వాడు ప్రపోస్ చేయకపోతే నా పేరు తిరగరాసుకుంటా."
          "ఎవరు చెప్పారు?"
          "అటువంటివి ఎవ్వరూ చెప్పరు. అర్థం చేసుకునేవి. నాకు మీ ఇద్దరి గతం తెలుసు. మీ కాలేజిలో ఇంక్వైరీ చేయించాను. పోలీసుబుద్ది."
          "ఏంటీ..?? ఇంక్వైరీయా..?!!" నోట మాట రాలేదు నాకు.
          "వాడిని అనటం కాదు కానీ, నిజంగ నిన్ను చూస్తుంటే ఇవాళ నాకే కళ్ళు చెదురుతున్నాయి తెల్సా??"
          "ఏయ్..!! డ్యూటీపరంగ కాకుండ మన మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుని నీ మాట వింటున్నానని ఇష్టం వచ్చినట్టు.."
          "..నాకు తెలుసు." సుభగ్ నామాట మధ్యలోనే తుంచేసి అన్నాడు- "నీకు ఇవన్నీ నచ్చవు..! వాడికి కూడా. అందుకే ఇంత కోపం. నువ్వు ఇదంతా వాడిలో కలిగించావని..! యూ నో.. ప్రణయ తాపం.. మన్మథ బాణం.."
          నాకు తల తిరిగినట్టైంది. "సుభా.. షటప్.."
          "సరే, మూసుకుంటా, కానీ ఒక మాట నిజం. వాడు నీకోసం వేషాలవీ కోసం బట్టలు వగైరాలు కొనేటప్పుడు పక్కనున్నది నేను. ఎంత ఆలోచించి నీకు నచ్చాలని నప్పాలని తీసుకువస్తాడో తెలిసింది నాకు. అడిగితే ఇగో వల్ల కాదంటాడు. లేక కాదు. ..కనక మన కర్తవ్యాన్ని, వాడి మనస్తత్వాన్ని కలిపి ఒకే త్రాటికి కట్టి కన్ఫ్యూజ్ కాకు. కోపతాపాలతో ప్లాన్ పాడు చెయ్యకు."
          నిజంగ అంతగా ఎన్నడూ నిర్ఘాంతపోలేదు. కళ్ళూ, నోరూ రెండూ వెడల్పయ్యాయి. సుభగ్ చలాకీగ నవ్వాడు. నేను తేరుకునే సరికి జీప్ లో కూర్చోని ఉన్నాను. సుభగ్ స్టార్ట్ చేశాడు.
          "ఏం చెప్పి తెచ్చావ్?" అనురాగ్ తనకు తెలియని కుతంత్రాలేవో జరిగిపోతున్నాయి అన్నంత ఉక్రోషంతో అడిగాడు.
          "వాటిని విద్యుదాఘాతాలు అంటార్లే. నమ్మలేని నిజాలు విని మనుషులు ఒక్కసారిగ తెల్లబోతారు. వాళ్ళు ఆ తెల్లబాటులో ఉండంగనే మన పని అయిపోతుంది. అంతే.."
          నేను సుభగ్ ని కోపంగ చూశాను. "లైట్ తీస్కో.." అని చూసి కన్నుకొట్టి నవ్వాడు.
          "ఏం చెప్పావ్? నీ మాట వింటే పెళ్ళి చేసుకుంటానన్నావా..?" అనురాగ్ వదల్లేదు.
          "ఊఁహూఁ.. వినకపోతే నువ్వు చేసుకుంటావని చెప్పాను.. ఠక్కున వచ్చింది." సుభగ్ కూడా ఏం తక్కువ తినలేదు.
          అనురాగ్ ఇంకేం మాట్లాడలేదు. నాకింక చిరాకు ఎక్కువై సీట్ వెనక్కు వాలి పడుకున్నాను. మనసులో కేవలం ప్లాన్ మెదుల్తోంది. ఇట్ల కేవలం పని గురించి ఆలోచించటం వల్లే ప్రతీసారీ విజయం వరించేది. ఈసారి కూడ వరించింది. ఒక రాజస్థానీ అమాయకురాలిని వేశ్యాగృహంలో అమ్మబోతుంటే పోలీసులు రైడ్ చేసి నిందితులను నిర్బంధించారని అన్ని వార్తాపత్రికలలో వచ్చింది.
          కానీ ఈ సంఘటన జరిగాక ఎందుకో కాస్త లోతుగనే హర్ట్ అయినాను. మరీ పని ధ్యాస కూడ మంచిది కాదనిపించి నా శెలవలన్నీ కలిపి అప్లై చేసుకుని నాన్నగారితోపాటు యోగశిబిరం జరుగుతున్న బాబాయి వాళ్ళ ఊరికి వెళిపోయాను. కొన్నాళ్ళు పిన్ని బాబాయిలతో గడపాలి అనిపించింది. లీవ్ అప్లికేషన్ ఇచ్చేసి అతనికి మాటైనా చెప్పా పెట్టకుండా వచ్చేశాను. ఏం చేసుకుంటాడో చేసుకోనీ- అని మొదటిసారి తెగింపు వచ్చింది. ప్రజల రక్షణే ఉద్యమంగ చేయదల్చుకంటే ఈ డిపార్టుమెంటు ఒక్కటే శరణ్యం కాదు. డిటెక్టివ్ సంస్థలెన్నో ఉన్నాయి అనిపించింది.

No comments:

Post a Comment