Wednesday, 7 December 2016

7. చిద్విలాసం - 5



5
          ఆరోజు దశరా. ఆరోజు విమర్శ్ ఇరవై ఐదవ పుట్టినరోజు కూడా. ఇంట్లో అందరూ సంతోషంగ ఉన్నారు. ఆరోజు గుడిలో ఉదయం నుంచి అమ్మవారి విశేష పూజలు జరుగుతున్నాయి. కళ్యాణి అక్కడే పూజల్లో ఉండిపోయింది. పండగకని సీను ఊరు వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేరు. దశరా నాడు ఏం పని చేసినా శుభం జరుగుతుంది కనక విమర్శ్ ని పెళ్ళి గురించి కదపాలని భార్గవ నిర్ణయించుకున్నాడు.
          "ఏంరా.. ఎట్లగూ ప్రయాణం వాయిదా పడింది. వచ్చే సెమిస్టరుకు కనీసం ఇంకా ఆరునెలలు వ్యవధి ఉంది కదా, మళ్ళీ వెళ్ళి తిరిగి వచ్చేసరికి రెండేళ్ళు గడుస్తాయి. మరి.."
          "చెప్పండి నాన్నా.."
          "యూ.ఎస్ వెళ్ళేలోపు పెళ్ళి అయినా చేసేద్దాం అని మీ అమ్మ అనుకుంటోందిరా.. బ్యూరోవారితో మాట్లాడింది. ఫారమ్ నింపి, ఫోటోలవీ తేవాలన్నారట." అడిగాడాయన.
          విమర్శ్ అకస్మాత్తుగ తండ్రి పెట్టిన ప్రస్తావనకు ఆశ్చర్యపోయి, ఏం చెప్పాలో తెలియక, "కానీ.. నేను.. నేను అసలు అమెరికా వెళ్ళదలచుకోలేదు." అన్నాడు.
          "అదేంటి..?" నిర్ఘాంతపోయాడు భార్గవ.
          "ఔను నాన్నా.. మనసులో ఎప్పుడో ఆ కోరికను పూర్తిగ చంపేశాను. క్షమించండి. ఇంక వెళ్ళట్లేదు. పెళ్ళికి తొందరేం లేదు."
          "అదేంట్రా.. సన్నాహాలన్నీ పూర్తి అయ్యి, ఇంక టికెట్ తీసుకుని బయల్దేరటమే అనంగ ఈ వెర్రి మాటలేంటి..? ఏం జరిగింది..? చెప్పు.."
          "ఏం లేదు నాన్నా.. ఇంతవరకు చదువుకున్నది చాలనిపిస్తోంది. మీతో పాటు ఉండిపోయి విద్యాలయాన్ని అభివృద్ధి చేయాలన్న తపన పట్టుకున్నది. మీ దగ్గరే ఉండాలని, ఒక మంచి ఆశయం కోసం పని చేయాలనిపిస్తోంది. ఏమో- రేపు ఎవరు చూడొచ్చారు..?"
          "ఏమైందిరా నీకు..? ఎందుకు వెర్రి వెర్రిగ మాట్లాడుతున్నావు..? కారణమేంటి..?"
          విమర్శ్ చాలా అసహనంగ అయిపోయాడు. "నన్నేమీ అడగద్దు. మీరు నా ప్రస్తావనను ఒప్పుకోకపోతే నేను ఇక్కడ మీతో ఉండటం మీకు ఇష్టంలేదేమో అనుకుంటాను."
          "ఇదెక్కడి వింత ప్రవర్తన..? ఉన్న ఒక్కగానొక్క కొడుకువు..! నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఇష్టం కాకపోవటమేంటి..? అదెప్పటికీ ఉండదు. కానీ- అక్కడకు వెళ్ళాలనేది నీ కోరిక. ఎన్నో కలలు కన్నావు, తీరా ఇప్పుడు అంతా సిద్ధం చేశాక కాదంటావేంటి..? పైగా ఏమీ అడగద్దు అనటం ఏంటి..?"
          "ఏంలేదు నాన్నా.. డా.చిద్విలాస్ మాటలు నన్ను ఆలోచింపచేశాయి. అందరూ యువకులు మన దేశానికి కాక విదేశాలకు సేవలు చేయటం వల్ల ఎంతో మేధస్సు వ్యర్థమైపోతోంది అని, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, ఇక్కడి వనరులతో శరీరం పోషించుకుని, చదువుకుని మంచీ చెడూ తెలుసుకుని తీరా సేవలందించే అవసరం వచ్చినప్పుడు లేని డబ్బుకోసం ఉన్నవి తెగనమ్మి విదేశాలు పట్టుకు పోవటం తప్పు కాదా అని ఆయన ఒకరోజు తీవ్రంగ వాదించాడు."
          "అదేంటి, ఆ వాదనలు నీతో కాక వాళ్ళ పిల్లలతో చేస్తే బాగుండేదేమో..!! నిన్ను రెచ్చగొట్టటం ఎందుకు..?"
          "ఆయన పిల్లలు ఆయన మాట వినరట. చాలా బాధపడ్డాడు. నేనైనా మారితే తన పిల్లలు తిరిగి వచ్చినంత ఆనందిస్తానన్నాడు. మన ధరిత్రికి బాగు చేసినందుకు ఆయన రూపాయి ఫీజు కూడ తీసుకోలేదు. ఎందుకు అని అడిగితే మన కుటుంబం, పద్ధతులు ఆయనకు చాలా నచ్చాయట. అందుకని ఇంత మంచి ఇల్లు, తల్లిదండ్రులను విడిచి వెళితే తనలాగ మీరూ బాధపడతారు. అని నచ్చ చెప్పాడు. ఆయన ధరిత్రికి చేసిన ఉపకారానికి బదులుగా ఆయన అడిగింది ఇదొక్కటే. అమెరికా మానుకోవటం, విద్యాలయం చూసుకోవటం.."
          "నువ్వు ఆ పని చేస్తే అందరికన్నా సంతోషించేవాణ్ణ నేనే. కానీ అది కాదు, నువ్వేదో దాస్తున్నావు..! చెప్పు. ఏంటి సంగతి..? నన్ను కాదని, మీ అమ్మను కాదని, అక్కడ అమెరికాలో మీ మామయ్యలను, బాబాయిని ఇబ్బంది పెట్టి, ఇంత ప్రయాసలు పడి ప్రయాణానికి సంసిద్ధమైనాక చివరి క్షణంలో ఎవరో డాక్టరు కోసం ఇదంతా వద్దంటే ఎట్ల..? కారణం అయినా తెలియాలి కదా.."
          విమర్శ్ చాలా ఆలోచించి, "లేదు నాన్నా.. నన్నేమీ అడగద్దు. నేను ఎక్కడికీ వెళ్ళటం లేదు. అది చివరి మాట." అన్నాడు.
          భార్గవ అతని పట్టుదలకు చాలా ఆశ్చర్యపోతూ, "సరే, పోకు. పోనీ, నీ ఇష్టం అయినట్టే ఉండిపో. ఈ ఊరికి మంచి విద్యాలయం వస్తుంది. నేనెన్నడూ నా కొడుకు అమెరికాలకు, ఇంగ్లండులకు పోతేనే గొప్ప అని అనుకోలేదు. నాకు అంతటి బాధ తప్పించినందుకు డాక్టరుగారికి నేనెంతో ఋణపడి ఉంటాను. దానికి నాకేం వేరే భావన లేదు. నీకు నచ్చినట్టే కానీ.." అన్నాడు.
          విమర్శ్ నవ్వి, "థాంక్స్ నాన్నా.." అన్నాడు.
          "మరి, అయితే నువ్వు నేను నీమాట విన్నాను కనక నువ్వు నా మాట ఒప్పుకోవాలి. పెళ్ళి సంబంధాలు చూడాలని అమ్మ చాలా ముచ్చట పడుతోంది. తన తోటివారికి కోడళ్ళు వచ్చేస్తున్నారు. తనకూ వస్తే బాగుండని ఆశిస్తోంది. అందుకని సంబంధాలు చూడటం మొదలు పెట్టటానికి ఒప్పుకోవాలి.." అని అడిగాడు.
          "అమ్మో.. అసలే వద్దు. నాకు ఇప్పుడే ఏమీ వద్దు. నన్ను బ్రతకనివ్వండి.. అయినా ఇప్పుడే వెళ్ళట్లేదన్నా కదా. తొందరేం ఉందింక..?"
          భార్గవ సహనం నశించింది ఇంక. "ఏంట్రా నీ తీరు..? అమ్మ ముచ్చట తీర్చమనే కదా అడుగుతున్నది..? నువ్వు అడగకుండనే ఇన్నేళ్ళూ అన్నీ ఇచ్చాము. ఇప్పుడు నీ పెళ్ళి చేయమని వచ్చి నువ్వు అడగవు కదా..! అది చేయటం మన బాధ్యత కదా- అని ఆమె అంటే, "కాదు, ఇవాళ రేపటి పిల్లలు- ఏమైనా ఆశలున్నాయేమో ఒక మాట అడిగి చూద్దామ"ని నేనే ఆమెను ఆపాను. కానీ నువ్వు.."
          "సరే, మీ ఉద్దేశం తెలిసింది కనక సంతోషం. కావాలన్నప్పుడు నిస్సంకోచంగ నేనే వచ్చి పెళ్ళి చేయండి అని అడుగుతాను. చాలా..?" విమర్శ్ వెనుదిరిగాడు.
          "ఆగు. నిజం చెప్పు. నీకు ఏమైనా వేరే ఆలోచనలు ఉన్నాయా..? ఎవరైనా వేరే అమ్మాయి మనసులో ఉందా..? ఏంటి నీ బాధ..?"
          "ఏం బాధ లేదు.." విమర్శ్ అక్కడి నుండి వెళిపోబోయాడు.
          భార్గవ అతని చేతిని పట్టుకుని ఆపి, కళ్ళలోకి చూశాడు. విమర్శ్ ఆగి తల వంచుకున్నాడు. అతని మఖంలో ఏదో తెలియని ఒత్తిడి కదలాడుతోంది. కొంచెం ఉద్విగ్నంగ ఉన్నాడు.
          "ఇక్కడ కూర్చో.. రా.. నీతో మాట్లాడాలి.."
          "పుట్టినరోజు కదా.. గుడికి రమ్మని చెప్పి అమ్మ వెళ్ళింది. అందులో దశరా పండగ. శమీపూజ ఉంటుంది కదా.. మీరూ వెళ్ళాలి కదా. తర్వాత మాట్లాడదాం."
          భార్గవ అతని వంక సూటిగ చూసి, "సరే, నువ్వు ఏం చెప్పద్దని గట్టిగ నిశ్చయించుకుంటే నేను, మీ అమ్మ చేయగలిగింది ఏమీ లేదు. నీకు వయసు వచ్చాక ఎన్నడూ నిన్ను నా కొడుకులా చూడలేదు. స్నేహితుడిలాగ చూశాను. నువ్వు ఇంకా నన్ను నమ్మటం లేదంటే నా ప్రేమలో ఏదో లోపం ఉండి ఉండాలి. నువ్వు చెప్పకపోతే నా దగ్గర తెలుసుకునే మార్గం లేక కాదు." అన్నాడు.
          "ఏం చేస్తారు..?"
          "వెళ్ళి డా.చిద్విలాస్ ను అడుగుతాను. ఆయన మాటల వల్లే కదా నీ మీద ఇటువంటి ప్రభావం పడింది..! ఆయనకు కారణం తెలియకపోయినా నీ సమస్యకు కనీసం విరుగుడు అయినా తెలుస్తుంది."
          "అంటే ఇట్ల నేను అమెరికా వెళ్ళను అనటం, పెళ్ళి వద్దు అనడం మానసిక వ్యాధి అనా మీ ఉద్దేశం..?"
          "కాదు. స్నేహితుడిలా వ్యవహరించిన తండ్రితో బయటివాడిలా ప్రవర్తించటం అసహజం అని నా ఉద్దేశం. లేదా నాలోనే ఏదైనా లోపం ఉందేమో. ఆయనకు ఈ విషయాల్లో చాలా అనుభవం ఉండి ఉంటుంది కదా. నేనే ఏదైనా థెరపీ చేయించుకుంటాను- నీ ప్రవర్తన అరిగించుకోవటానికి..! నేను మీ అమ్మకు సమాధానం చెప్పుకోవాలి కదా."
          విమర్శ్ కి ఆ మాటకు చాలా బాధ వేసింది. అతని కళ్ళలో నీరుబికింది. భార్గవ అది గమనించి, "చూడు నాన్నా.. పిల్లలు ఏమాటా చెప్పకుండా లోలోపల బాధపడుతూ కూర్చుంటే ఏ తల్లీ తండ్రీ చూస్తూ కూర్చోలేరు. విలవిలలాడతారు. నీ బాధ నీ ఒక్కడితే అని భ్రమపడకు. నేనో, మీ అమ్మనో నీలాగే ఏదో మనసులో పెట్టుకుని ఇట్లగే అడిగితే కారణం చెప్పకుండ దాటవేసే ప్రయత్నం చేస్తే నీకు ఎట్ల అనిపిస్తుంది..? ఒక వయసు వచ్చాక ఒట్లు గట్లు అని నిర్బంధించటం సరైన పద్ధతి అనిపించుకోదు. మేము నీ మేలు కోరేవాళ్ళమే కానీ నిన్ను బాధపట్టి ఆనందించేవాళ్ళమా? చెప్పు.."
          "అది కాదు నాన్నా.."
          "పెళ్ళి గురించి అభిప్రాయం అడిగితే పుట్టినరోజు నాడు కన్నీరు పెడుతున్నావు. నేను అడిగింది వయసు వచ్చిన ఏ మగపిల్లవాడినైనా ఏ తల్లితండ్రులైనా సహజంగ అడిగే మాటే. కానీ నీ ప్రతిక్రియ చాలా భిన్నంగ, అనూహ్యంగ ఉంది. సరే.. నీకు చెప్పాలనిపించినప్పుడే చెబుదువుగాని. వెళ్ళిరా గుడికి."
          "నిజం చెప్పే ధైర్యం లేదు నాన్నా.."
          "అది అర్థమైతూనే ఉంది. నీకు ధైర్యం వచ్చేదాక ఎదురు చూస్తాలే. అమ్మకు కూడ ఎదురు చూడమని చెప్తాను. ఆమెకు బ్యూరోలో అమ్మాయిల ఫోటోలేవో చాలా నచ్చేశాయి. రిజిస్టరు చేయించుకుంటేనే అమ్మాయి వాళ్ళతో మాట్లాడనిస్తామని వాళ్ళు షరతు పెట్టారు. నువ్వు ఎప్పుడు ఫోటోలు తీయించుకుని ఇస్తావా, ఎప్పుడు వాళ్ళతో మాట్లాడదామా అని ఆమె ఎదురుచూస్తోంది. నువ్వు ఇట్ల అంటావని ఆమెకు తెలియదు కదా."
          "అది కాదు నాన్నా.."
          "ఏది కాదురా..? మా నాన్నగారు ఒక మాట చెప్పారంటే ఎదురు చెప్పటం కాదు కదా, కనీసం ఎందుకు అని అడిగే దమ్ముండేది కాదు. పెద్దవారన్నా వారి మాటన్నా గౌరవం అట్ల ఉండేది. అప్పుట్లో వాళ్ళకు ఒదిగి అణిగి ఉన్నాము... ఇప్పుడు మీకు సలాం చేసే గులాం ల లాగ అయినాము.."
          "క్షమించండి నాన్నా.. పెద్ద నిర్ణయాల వెనక కారణాలూ పెద్దవే ఉంటాయి. మీరు ఇచ్చిన ప్రేమ అమూల్యమైనది. నేను దాన్ని అవమానించేంత సందర్భం ఎన్నటికీ రాదు. మిమ్మల్ని ఎదిరించటం నా లక్ష్యం కాదు. కారణం లేకపోయి ఉంటే ఈ క్షణమే మీ మాటకు తల వంచేవాణ్ణి. మీ మాటను కాదన్నంత మాత్రాన నేను సంస్కారహీనుణ్ణి కాను. మీ ప్రేమే నా బలం. కానీ కొన్నింటికి కొన్ని సందర్భాలు తగినవి కావు. కొంచెం వ్యవధి ఇవ్వండి చాలు.." కళ్ళు నిండి వస్తుంటే అన్నాడు. "మా నాన్నతో నేను ఒక సమస్య మాట్లాడటానికి బయటి వ్యక్తి కావాలా..? మీ ప్రేమ అడగకుండనే ఇచ్చారు. ఇప్పుడు మీ నమ్మకం కోరుతున్నాను. ఇస్తారా..?" అన్నాడు.
          అంతలో ధరిత్రి గుడి నుంచి వచ్చి, కల్యాణి వారినిద్దరినీ తీసుకురమ్మని పంపింది.., గుడిలో బాగ పూజ జరుగుతోంది.., అని హడావుడి పెడుతూ రమ్మంది.
          భార్గవ విమర్శ్ వంక ఒకసారి తీక్ష్ణంగ చూసి, సరేనన్నట్టు తల ఊపి కదలబోయాడు. విమర్శ్ ఏదో ఆలోచించుకున్నవాడిలా ధరిత్రితో, "నువ్వెళ్ళు. మేము వెనకే వస్తున్నామని అమ్మతో చెప్పు-" అన్నాడు.
          ధరిత్రి కాదు కూడదనేదో అనేసరికి, "వెళతావా, దయ్యాన్ని పిలవమన్నావా?" అన్నాడు.
          ధరిత్రి నవ్వి, "నేను అమ్మవారి పూజ చెస్తున్నా కదా..! నువ్వు పిలిచినా దయ్యం రాదు.. అదెప్పుడో వెళిపోయింది." అంది.
          విమర్శ్ తో పాటు భార్గవ కూడా నవ్వాడు. ధరిత్రి హడావుడిగ, "సరే, మీ ఇష్టం. "మగవాళ్ళకు, ఆడవాళ్ళకు కలిపి ఆడవాళ్ళే పూజలు చేస్తున్న రోజులు- కలికాలం ఏం చేస్తాం?" అని ఇప్పుడే పంతులుగారు మొత్తుకుంటున్నారు. నాకెందుకు..? నేనే అత్తయ్యతోపాటు మీ మంచికోసం ప్రార్థన చేస్తాలే.. మాట్లాడుకోండి.." అనేసి వెళిపోయింది.
          భార్గవ విమర్శ్ ని ఆశ్చర్యంగ చూశాడు. అతను కింద కూర్చుని, తండ్రిని వాలుకుర్చీలో కూర్చోబెట్టి, "సరే, నా పుట్టినరోజు నాడు కన్నా ఇటువంటి విషయాలు చెప్పటానికి వేరే మంచి రోజు ఏది ఉంటుంది..? మీరు నన్నేమీ అనరనే ధైర్యం కూడా ఉంటుంది.." అన్నాడు.
          భార్గవ కుర్చీలో కూర్చుని, "అంటే నేను నిన్ను ఏమైనా అనాల్సి వచ్చే పని నువ్వేమైనా చేశావా..?" అనడిగాడు అనుమానంగ.
          "ముందు నేనటువంటిదేదైనా చేసినా ఏమీ అననని మాటివ్వండి." అనడిగాడు.
          భార్గవ ఆలోచించుకుంటూ, "ఇంతవరకూ ఎప్పుడూ అటువంటి అవసరం నువ్వు కల్పించలేదు. సరే, మాట ఇస్తున్నాను. కారణం తెలుసుకోకుండ తప్పు పట్టను. చాలా..?" అన్నాడు.
          "ఔను నాన్నా, ఆ విషయంలో నేను మీ కొడుకును. దేనికైనా కారణం ఉంటుంది. ఇప్పుడైతే అది నాకూ తెలిసింది కనక నమ్మకంగ చెప్పగలను కూడా.." అన్నాడు.
          "అంటే ముందు తెలియదా..?"
          "తెలియదు. డా.చిద్విలాస్ చెప్పాక తెలిసింది. నేను ధరిత్రిని ప్రేమిస్తున్న సంగతి ఆయన చెప్పకపోతే ఎప్పటికీ తెలిసేదే కాదు.."
          "ఏంటీ..!!?" భార్గవ షాకైనాడు.
          "ఔను నాన్నా.. నవరాత్రి రోజులు అమ్మవారి వ్రతం చేశాక కూడగట్టుకుని వచ్చిన ధైర్యంతో చెబుతున్నాను. నాకు, ధరిత్రికి పెళ్ళి చేయండి."
          "ధరిత్రా..??!!" భార్గవకు క్రోధం కలిగింది. "క్..కానీ.. ఆ అమ్మాయి మన ఇంట్లో.. ప్...పని చేసే పిల్ల..!! ఇది.. ఇది దారుణం. అరే, ఆ పిల్లకు చదువు లేదు, సంధ్య లేదు, పల్లెటూరి గబ్బిలాయిరా..!! నీ పక్కన బార్యగా, ఈ ఇంటి కోడలిగా.. ఊహించుకోవటానికే.. ఛ..!! ఏంట్రా ఈ పని?? ఆ పిల్ల మూఢనమ్మకాలు, సమస్య.. అన్నీ తెలిసి.. మన బంధువులు, ఊరివాళ్ళు, నీ తోటివాళ్ళు ఏమనుకుంటారు..? ఒక విద్యావంతుల సర్కిల్ లో తిరిగే నువ్వు అసలామెను నీ భార్య అని తోటివారికి ఎట్ల పరిచయం చేస్తావు..? ఎంత పరువు తక్కువ వ్యవహారం..! జీవితం, ప్రపంచం.. లోకం అనే మాటలు.. ఏం తమాషాగా ఉందా..?"
          "ఒప్పుకుంటాను. ఎందుకంటే మొన్నటి వరకూ నేనూ అదే అనుకున్నాను నాన్నా.. కానీ ధరిత్రిని విడిగా ఒక సాధారణ ఆడపిల్లగ ఆలోచించి చూడండి. మనం ఏమీ పని చేయించుకుని తనకు డబ్బివ్వటం లేదే..! ఆమె అమ్మకు సహాయంగ  పనులు చేస్తోంది. మనింట్లో కోడలు వస్తే ఇవే పనులు ఇంట్లో ఒక సభ్యురాలిగ చేయదా..? పనిపిల్ల అనేది పక్కన పెట్టి ఆలోచిస్తే, జీవితం పట్ల ఆమె అవగాహన, మంచితనం, మర్యాద, మన కుటుంబమంటే ఇచ్చే గౌరవం, చదువుకున్నవారికన్నా ఎక్కువ సంస్కారం, అణుకువ ఉన్నాయి. ఆడపిల్లగా ఆమెలో ఏం లోపం లేదు నాన్నా..! తనలో ఒక మంచి భార్య, మంచి కోడలు కాగలిగే అన్ని లక్షణాలు ఉన్నాయి.."
          "మంచి భార్య కాగలదేమో.. కానీ నీకు కాదు. మంచి కోడలు కాగలదేమో.. కానీ ఈ ఇంటికి కాదు. ఎందుకు నన్ను కన్విన్స్ చేయటానికి ప్రయత్నిస్తున్నావు..? నేను సరే. కానీ మీ అమ్మను ఎట్ల ఒప్పిస్తావు..? మన దగ్గర బెటర్ ఆప్షన్ ఉన్నప్పుడు వెళ్ళకుండ దీన్ని పట్టుకుని వేలాడటం ఎందుకు..? అంటే నా ఉద్దేశం ధరిత్రి చెడ్డది అని కాదు.. నీకు తగినది కాదు అని.."
          "నాకు తెలుసు.. కానీ తప్పదు.."
          "తప్పదా..? అంటే..?"
          "అంటే.. అంటే.."
          "చూడు, నువ్వు నాకు జరిగందేంటో స్పష్టంగ చెబితే నాకేదైనా ఆలోచించుకునే అవకాశం దొరుకుతుంది.. నిన్ను అపార్థం చేసుకునే విధంగ సగం సగం మాట్లాడుతున్నావు. కారణం పూర్తిగ చెప్తావా సరే, లేదా వదిలేసేయి. నమ్మితే నిజం చెప్పు. లేదంటే వేరే అమ్మాయిని చూడటానికి ఒఫ్పుకో." భార్గవ ఒత్తిడి చేశాడు.
          విమర్శ్ కి ఏం చెప్పాలో, ఎట్ల చెప్పాలో అర్థం కాలేదు. చాలా లోలోపల నలుగుతూ ఉండిపోయాడు. సన్నగ వణుకు ప్రారంభమైంది. తనను తాను సంబాళించుకోవడానికి చాలా విఫల ప్రయత్నాలు చేసి, తర్వాత అన్నాడు- "పోనీ, నేను నా పుట్టినరోజుకు అడిగే కానుక ధరిత్రే అని అంటే..?"
          "డా.చిద్విలాస్ కన్నా కన్నతండ్రిని పరాయి వాణ్ణయినానారా..?" భార్గవ అడిగాడు నిజంగా నొచ్చుకుంటూ.
          "లేదు నాన్నా.. అది కాదు.." తండ్రి ముందు ఇటువంటి మాటలు మాట్లాడాల్సి రావటం చాలా అవమానకరంగ అనిపిస్తుంటే, తమాయించుకుంటూ చెప్పాడు- "సరే.. వినండి- అమావాస్యనాడు నా వల్ల ఒక పొరపాటు జరిగింది.."
          "ఏంటది..? వివరంగ చెప్పు. ప్లీజ్. నా నమ్మకం అడిగావు. ఇచ్చాను. ఇంక నన్ను టెంషన్ పెట్టకు."
          "సరే, వినండి." విమర్శ్ ఓపిక కూడదీసుకుని చెప్పటం మొదలుపెట్టాడు. "ఆ రోజు ఇంట్లో మీరు ఎవ్వరూ లేరు. నేను ఆమె అటాక్ తగ్గటానికి అసహనంగ ఎదురుచూస్తున్నాను. సడన్ గ గాజు వస్తువు పగిలిన శబ్దం వచ్చింది. మళ్ళీ గాయాలైతే ప్రమాదం.. ఏం చేసుకుంటుందో ఏమో ఈ ఉన్మాదంలో అని వెంటనే పరుగున సహాయం చేయటానికి వరండాలోకి వెళ్ళాను. అప్పుడామె.. ఆమె.. ఎటువంటి పరిస్థితిలో ఉందంటే.. అది.. అది నిజానికి నాకు సహాయం కావాల్సిన సమయం. ఆమె ఒంటి మీద నూలుపోగు లేదు. మంట మంట అని అరుస్తోంది." విమర్శ్ తన నుదుటి మీద చిరుమటలు తుడుచుకున్నాడు.
          భార్గవ నోట మాట పోయినవాడిలా వింటూండిపోయాడు.
          "ఆమె వెర్రిగ అరుస్తోంది. కళ్ళలో ధారగ నీరు కారుతోంది. భయంతో వణికిపోతోంది. ఆ వేళ చాలా వయోలెంట్ గ ఉంది. మామూలుకన్నా కూడా దిగజారిన పరిస్థితిలో ఉంది. ఏంచేయాలో తోచలేదు. ఆ దృశ్యం చూసిన వెంటనే ఆమెకు ఏ సహాయం చేయలేనని తెలిసి, కళ్ళు తిప్పేసుకుని వెనక్కు తిరిగి నా గదిలోకి రాబోయాను. క్.. కానీ.. ఆమె వెనక నుంచి అమాంతంగ వచ్చి కౌగిలించుకుంది. ఎంత గట్టిగ పట్టుకుందంటే నా శక్తి ఎందుకూ పనికిరాలేదు. ధరా వదులు, ధరా ఆగు.. అని ఎంత విదిలించినా వదల్లేదు. ‘మంట, మంట.. బావా రక్షించు.’ అంటూ నన్ను అమాంతం చుట్టుకుపోయి ఏడుస్తోంది. పదిహేను నిమిషాల పాటు ఆమెను స్పృహలోకి తేవాలని నేను చేయని ప్రయత్నం లేదు. ఏదీ ఫలించలేదు."
          "క్.. కానీ.. అసలు ధరిత్రి అటువంటి సమయంలో ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వదు కదా..."
          "ఔను, ఇది వరకు ఒకసారి సోమూ ఉన్నప్పుడు అటాక్ లో ఆమెను కంట్రోల్ చేయటానికి ప్రయత్నించినప్పుడు దగ్గరకు వెళ్ళబోతే గాజు వస్తువేదో విసిరి కొట్టిందని, అది కాస్తలో వాడి చెవు పక్కనుంచి పోయింది.. లేకపోతే వాడి నుదుటికి గాయమై ఉండేదని చెప్పారు. శీనుగాడికి కూడా అటువంటిదే అనుభవం జరిగింది. కానీ నా విషయం వేరు." అని ఆగి, తల వాలిపోతుంటే, "అది.. అది ఆమెలో రిప్రెస్డ్ లవ్ అట.. అంటే.. నా మీద ఆమెకు లోలోపలే ఆమెకు తెలియకుండానే పూర్తి నమ్మకం. ప్రేమ., విశ్వాసం. తనను రక్షించగల సూపర్ హీరోని నేను. అంతకు ముందు ఎప్పుడూ అటాక్స్ సమయంలో నేను ఆమెను నేరుగ ఎదుర్కొన్నది లేదు. మొదటిసారి ఈ ఘట్టం జరిగింది. ఈ సంగతి తెలిసింది. ఏమో- డా.చిద్విలాస్ చెప్పిన మాటైతే ఇదే..!"
          భార్గవ ఆలోచిస్తూ, "కానీ నాకు తెలిసి అంతకు మునుపెన్నడూ ధరిత్రి బట్టలు తీసేయటం జరగలేదు... మంట అని కూడా అరవలేదు.." అన్నాడు.
          "మనం ఎవ్వరం ఇంట్లో లేనప్పుడు ఆ మధ్యాహ్నమే ఆమెకు వంట చేస్తుంటే ఓణీ కాలిందిట..! సమయానికి సుజాత ఉండటం వల్ల వెంటనే అది లాగేసి ఆమెను కాపాడిందిట. కొంచెం మంట లంగాకు కూడా అంటితే గబగబా లాగేసిందిట ఆ అమ్మాయి. ఆ అనుభవం అటాక్ సమయంలో అట్ల ఆవేశించిందిట."
          "ఇవన్నీ ఎట్ల తెలిశాయి..?"
          విమర్శ్ మాటిమాటికీ గొంతు సవిరించుకుంటూ చెప్పసాగాడు- "తనే, హిప్నాసిస్ లో చెప్పింది. పక్కింటి సుజాత వల్ల తర్వాత అది నిజమేనని తేలింది. ఇంతే కాదు.. ధరిత్రి ఇంకా చాలా చెప్పింది. తన మనసులో ఉన్న భావాలన్నీ చెప్పింది. నా గురించి ఎంత ఉన్నతంగ చెప్పిందంటే ఒక అమ్మాయి నోటి నుంచి వాటిని వినటం ఏ మగవాడికైనా ఒక గర్వాన్ని కలిగిస్తాయి. ఆమె మెళుకువతో లేనప్పుడు కాబట్టి అవి చెప్పగలిగిందిట. లేదంటే చైతన్యంగ ఉన్న ధరిత్రి వాక్కుకు అంత శక్తి లేదట. ఆమె నేనంటే పడి చచ్చిపోగలదట. హిప్నాసిస్ లో ధైర్యంగ చెప్పింది ఆ మాట." విమర్శ్ అంత వరకు చెప్పి ఆగిపోయాడు.
          భార్గవ అంతా విని, కొద్దిసేపు తాను విన్నది అరిగించుకోవటానికి సమయం ఇచ్చాక- "ఇంతేనా..? ఆ అమ్మాయిని అట్ల చూడటం, ఆమె నిన్ను ప్రేమించటం- ఇవి మాత్రమేనా కారణం?" అనడిగాడు.
          విమర్శ్ తల అడ్డంగ ఊపాడు. తల వంచుకున్నాడు. మాటలకోసం వెతుక్కున్నాడు.
          "నేను ఈ మాట శాశ్వతంగ రహస్యంగ ఉంచుతానని నీకు మాటిస్తున్నాను. కనీసం మీ అమ్మతో కూడా చెప్పను. చాలా..?"
          "క్షమించండి. నేనేం కావాలని చేయలేదు. నా దగ్గర మాటల్లేవు నాన్నా.. నేను చెప్పలేను.." అన్నాడు విమర్శ్ ఎటో చూస్తూ.
          "ఇంకేమైనా జరిగిందా..?" మళ్ళీ అడిగాడు భార్గవ కాస్త గట్టిగ.
          కష్టం మీద చెప్పాడు విమర్శ్- "ఒక పెళ్ళి కాని అమ్మాయికి నాలాంటి వాడు చేయగలిగే అన్యాయం ఏం ఉంటుందో అదే జరిగింది.."
          "విమర్శ్..!!!"
          "ఆ పదిహేను నిముషాల తర్వాత మా ఇద్దరి మధ్యలోకి ప్రకృతి అడ్డం వచ్చింది. అంతే. అది కోరిక కాదు, అవకాశ దుర్వినియోగం కాదు, కావాలని చేసింది కాదు.. నన్ను మించిన ఒక శక్తి. నాకు వశం తప్పించింది. ఆ అమ్మాయి.. ఆమె స్పర్శ.. నేనేమీ చేయలేకపోయాను. అట్ల జరిగిపోయిందంతే నాన్నా. ఆ అమావాస్య నాడు నా వల్ల చాలా పెద్ద తప్పిదం జరిగింది. ఆ తప్పిదానికి సాక్ష్యంగ కనీసం చంద్రుడు కూడా లేడు." విమర్శ్ ఏడ్చేశాడు ఒక్కసారి.
          "మైగాడ్.. భగవంతుడా.. విమర్శ్..!! పనిపిల్ల మీద మనసు పారేసుకుంటావని నేనూహించలేదు..!!" భార్గవ కాస్త కఠినంగనే అన్నాడు.
          "కానీ పారేసుకున్నది మనసు మాత్రమే కాదు.., తిరిగి తెచ్చుకోవటానికి..!" విమర్శ్ ఆ కాఠిన్యానికి కొంత దెబ్బతిన్నట్టు చూసి, తనను తాను సంబాళించుకునే వృథా ప్రయత్నం చేస్తూ, అన్నాడు- "ఒక్కటే మాట చెప్పగలను- ఇది కాన్షియస్ గ నా వల్ల జరిగింది కాదు.. ఇట్ల ఎందుకు జరిగిందో నాకూ తెలియదు. ఇవి ఎవ్వరికీ తెలిసేవి కావని డా.చిద్విలాస్ చెప్పాడు. జరిగిందానిని అంగీకరించటం తప్ప మనం చేయగలిగంది ఏం లేదు.."
          "కానీ, ధరిత్రికి ఈ విషయం..?"
          "తెలియదు. అటాక్ సమయంలో జరిగినవేవీ ఆమెకు గుర్తుండవు కదా.. అంతా అయిపోయాక ఆమె తిరిగి లేచే లోపు బట్టలు తొడిగేశాను. అందుకే ఆమెకే కాదు, ఎవ్వరికీ ఈ సంగతి తెలియదు. నేను చెప్తే తప్ప.."
          భార్గవ అనుమానంగ చూస్తూ అడిగాడు- "ప్రెగ్నెంసీ గట్రా.. ఏమైనా..?"
          విమర్శ్ కష్టం మీద చెప్పాడు- "ఏంలేదు.. మొన్న హిప్నాసిస్ కి డా.చిద్విలాస్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఎవ్వరికీ తెలియకుండ ఆయనే టెస్ట్ చేయించాడామెకు."
          "అయితే ఇంకేంటి..? అదొక బయాలాజికల్ ఆక్సిడెంట్ అనుకుని ఎందుకు పక్కకు పెట్టవు..? ఆ పరిస్థితులలో ఎవరున్నా అదే జరిగేది. దానికి ప్రేమలు, విశ్వాసాలు అని అంటగట్టి కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు..? ఏదో సహానుభూతి అనుకోరాదా..?"
          విమర్శ్ కాసేపు ఊపిరి తీసుకుంటూ, కళ్ళు తుడుచుకుంటూ ఆగి, తర్వాత అన్నాడు- "నేనూ ఆమె మీద నాకున్నది సహానుభూతి మాత్రమే అనుకున్నాను. కానీ అది నేను నన్ను నమ్మించుకుంటున్న మాట మాత్రమే. నా అధిచేతనలో అది వేరే విధంగ ఉంది. లేకపోతే నాలాంటి మనస్తత్వం ఉన్నవాడు వేరే అమ్మాయితో ఆ పని కలలో కూడ చేయలేడట. ఈ సంఘటన విన్నాక డాక్టర్ చెప్పిందదే. ఏమో ఆయన చెప్పింది నిజం కావచ్చేమో. అది నిజమే అయినా కాకపోయినా ఇప్పుడు నేను చేయగలిగింది లేదు."
          "కానీ ఒక్కసారి జరిగిన తప్పిదం కోసం జీవితాంతం ఒక చదువురాని పిల్లను చేసుకోవటం.. ఎంత పెద్ద రిస్కో తెల్సా..?"
          విమర్శ్ గొంతు పూడుకుపోతుంటే సర్దుకుంటూ అన్నాడు- "శీలానికి చదువుతో, తెలివితో పని లేదు నాన్నా. అది జీవితం, ప్రాణంకన్నా ముఖ్యమైనది. ఆడవారికి ఎంత ముఖ్యమో మగవారికీ అంతే ముఖ్యమని నమ్మేవారిలో ప్రథముణ్ణి. మనం శ్రీరాముని పూజించే సంస్కృతికి వారసులం. ఆయనే నాకు ఇష్టదైవమే కాదు, ఆదర్శపురుషుడు, నా రోల్ మాడల్, సూపర్ హీరో కూడా. అది మీకూ తెలుసు. కనక నేను ఆమెకు కలలో కూడ అన్యాయం చేయలేను."
          "కానీ ఆమెకు ఏమీ తెలియదు అని నువ్వే చెబుతున్నావు కదా..?" భార్గవ అన్నాడు అతణ్ణి గమనిస్తూ.
          "ఆమెకు తెలియదు.. కానీ నాకు తెలుసు కదా.." విమర్శ్ దృఢంగ అన్నాడు. "అటాక్ లో అచేతనంగ, నిస్సహాయంగ ఉన్నది ఆమే కానీ నేను కాదు కదా..! నాది వందశాతం నా పూర్తి చైతన్య స్థితిలో, అన్నీ సెన్సెస్ పని చేస్తున్నప్పుడు చేస్తున్నది తప్పని ఆ క్షణాన కూడా తెలిసీ చేసిన తప్పు. కాన్షియస్ ఆపింది. నేను ఆగలేదు. ఆత్మసాక్షిగ చెబుతున్నాను- ఆమె నన్ను తనను కాపాడగలవాడని నమ్మినందుకు, ఆ నమ్మకాన్ని గెలుచుకున్నందుకు సంతోషపడాలో, లేక ఆ విశ్వాసాన్ని నేను ఇట్ల వినియోగించుకున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను. దీనితో నేను జీవించలేను.. నా వాక్శక్తికే ఈ ఘట్టం పరీక్షగా ఉంది. ఔను నాన్నా.. నేను ఇంతకన్నా వివరించి చెప్పలేను.. నన్నేమీ అడగద్దు. ఈ పెళ్ళి ఆ తప్పిదానికి పరిహారం అనుకోండి.."
          "క్.. కానీ ఈ గిల్ట్ భావన చాలా తాత్కాలికం.. జీవితం చాలా పెద్దది.. ఇప్పుడేదో పెద్ద త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావేమో.."
          "లేదు నాన్నా.. నాకు మామూలుగానే గిల్ట్ ఎక్కువ. అది తాత్కాలికం కాదు. మనం చేసే పనులన్నింటికీ ప్రకృతి సాక్షిగ ఉంటుంది. మానవుడు ఎప్పుడూ తన ధర్మం తప్పకూడదు అని మీరే కదా చెప్తారు..! ఆ మాట ఉగ్గుపాలతో నేర్పిన మీరు ఇప్పుడు ఈ విషయంలో ఇట్ల మాట్లాడతారని నేనూహించలేదు. చేసిన తప్పు దాచుకుని జీవింతాంతం కుమిలిపోయేకంటే తప్పు చేశానని ఒప్పుకుని ధైర్యంగ ఆమెను చేపట్టటమే నాకు సులువు అనిపిస్తోంది.., అమ్మా మీరూ కాదంటే ఎదిరించైనా సరే..!! ఆమె అంటే నాకిష్టం." అన్నాడు.
          "ఇష్టం ఒక్కటే పెళ్ళికి ప్రాతిపదిక కాదురా.." భార్గవ ఇంకా ప్రయత్నించాడు.
          విమర్శ్ లోలోపల తండ్రి మాటలకు నొచ్చుకుంటూ, "సరే, ఒక అమ్మాయికి అన్యాయం చేసి ఇంకొకరిని చేపట్టటం ఇంటికి మంచిదా? మనస్సు ఆటలు మనం ఊహించగలిగినవి కావు. ధరిత్రికి ఏదో ఓ బలహీన సందర్భంలో నిజం తెలిసిననాడు ఆమె ఆక్రోశించి పెట్టిన శాపం ఈ ఇంటిని తగలబెట్టదా..?" అని ఆ క్షణాన కలిగిన ధైర్యంతో ఆయన కళ్ళలోకి సూటిగ చూస్తూ, "నా వల్ల ఒక రాత్రి సామీప్యంతో ఇట్ల జరిగింది కదా అని ధరిత్రి పట్ల ప్రేమ ఏర్పడలేదు. ఆమె పై ప్రేమ ఉంది కనకనే ఇట్ల జరిగిందని ఇప్పుడు నేను బలంగ నమ్ముతున్నాను. కావాలంటే అనుమానం వదలటానికి హిప్నాసిస్ కూడా చేయించుకున్నాను. ఆ రికార్డింగు వినిపిస్తాను." అన్నాడు.
          భార్గవ మౌనంగ చూశాడతనిని. విమర్శ్ లోతుగా ఆలోచిస్తూ-
          "నాన్నా, చిద్విలాస్ పేరు అర్థం తెలుసా? చిత్ అంటే జ్ఞానమట. జ్ఞానానికి విలాసం అయినవాడు చిద్విలాస్.. నిజంగా ఆయన అంతే. ఆయనకు మనసు గురించి చాలా తెలుసు. కేవలం సైకాలజీ కాదు.. ఆయన మనిషిని నేరుగా చదివాడు. ఆయన ఇతరులకు చెప్పే పరిష్కారాలు కూడా స్వయంగా విన్నాను- ఎంత ప్రాక్టికల్ గా చెప్తారో!!" అని ఆగి, "ధరిత్రి గురించి మాట్లాడటానికి మొదటిసారి వెళ్ళినప్పుడు మొదటి ప్రశ్న ఇదే అడిగాడు. ఆయనకు తెలుసట- నేనామెను ప్రేమిస్తున్నాని, కానీ లోలోపలే దానిని అంగీకరించలేక దాచుకుంటున్నానని. అట్లగే నేను కనక ధరిత్రి మనసులో దాగిన హీరోనైతే ఆమె సమస్య ఇట్టే పరిష్కరించవచ్చని ఆయన ఆశ. ఆడవారి మానసికోద్వేగాలు, భయాల సమస్యలు ముప్పావు వంతు మగవారి ప్రమేయం వల్ల తీరిపోతాయని ఆయన అభిప్రాయం. కానీ మగవారినామె అసలు దగ్గరకు రానివ్వదని ఆయనతో ముందే చెప్పాను. అయినా ఆయనెందుకో నా మాట నమ్మలేదు. చివరకు అదే నిజమైంది. నాకూ ఇదంతా జీర్ణించుకోవటానికి ఇంతకాలం పట్టింది. ఇప్పుడామె నా హృదయసామ్రాజ్ఞి అని నిర్భంయంగ, నిస్సంకోచంగ చెప్పగలను." అన్నాడు.
          అప్పటిదాకా సీరియస్ గ ఉన్న భార్గవ ఆ క్షణాన తేలిక పడుతూ నవ్వి, చప్పట్లు కొడుతూ, విమర్శ్ భుజం మీద చేయి వేసి, "హమ్మయ్య.. ఇప్పుడు నువ్వు నా పరీక్షలో పూర్తిగ నెగ్గావురా..! తప్పక మీ ఇద్దరి పెళ్ళి నేను జరిపిస్తాను." అన్నాడు.
          "నిజమా నాన్నా..? మీరు ఇవన్నీ పరమార్థంగ అంటున్నారేమోనని చాలా బెదరిపోయాను..! థాంక్స్ నాన్నా.. చాలా థాంక్స్.." విమర్శ్ కళ్ళలో మళ్ళీ నీరుబికింది.
          "పరమార్థానికి అనకపోయినా పరిహాసానికి కూడా అనటం లేదురా." భార్గవ అతగాడి కన్నీరు తుడుస్తూ అన్నాడు- "ఈ విషయాలు ఎంతో స్పష్టత కావాల్సినవి. మా నాన్న ఎప్పుడూ అనేవాడు.. బాల్యంలో తండ్రి ఆలనలో, యౌవనంలో భర్త లాలనలో, వార్ధక్యంలో కొడుకు పాలనలో స్త్రీ ఉండాలి అనేది మగవాడి బాధ్యత గుర్తుచేసే వాక్యమని, స్త్రీని బాధపెట్టిన మగవాడెన్నడూ పైకి రాలేడని..! అటువంటిది ఒక ఆడపిల్లకు అన్యాయం చేయమని ఎట్ల సలహా ఇస్తానురా..? కనక నా కొడుకు ఏది చేసినా ఆలోచించే చేస్తాడు అని నాకు ధారణ ఉంది. ఇదీ ఆలోచించే చేసి ఉంటావు. నా వైపు నుంచి ధరిత్రి విషయంలో ఏ అభ్యంతరమూ లేదు.. చాలా..?"
          విమర్శ్ లోతుగ శ్వాస పీల్చుకుని వదిలాడు. అతను తేలిక పడిన భావన భార్గవకు కూడా తెలిసింది. "చాలు నాన్నా.. చాలు.." అని అతను తండ్రికి వంగి కాళ్ళకు నమస్కరించి, "ఇన్నాళ్ళ నుంచి మానసిక నరకం అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఈ క్షణం అది తీరింది నాకు. మిమ్మల్ని అమ్మను చూసినప్పుడల్లా లోలోపల గిల్ట్. ధరిత్రిని చూస్తే జాలి. నా ముఖం అద్దంలో చూసుకుంటే జుగుప్స. అటువంటి వేళల్లో నేను విరిగిపోకుండ డా.చిద్విలాస్ నాకు ఇచ్చిన ధైర్యం, నైతికంగ నన్ను నిలబెట్టింది. అందుకే ఆయన సలహా మీద ధరిత్రిని చేపట్టటానికి నేను నిశ్చయించుకున్నాను. ఆయనకు కూతుర్లు లేరట. 'నువ్వు ఆమెను చేసుకుంటానంటే నేనే దగ్గరుండి పెళ్ళి జరిపిస్తాను. ఖర్చు నాదే..' అన్నాడు. వింత మనిషి.. కానీ అమ్మ గురించే భయం అంతా.." అన్నాడు.
          విమర్శ్ ని భార్గవ గట్టిగ ఆలింగనం చేసుకని, "మీ అమ్మకు నేను చెప్తాలే. ఆమె మనసు వెన్న. నా భార్యగా తనను శాసించగలిగే అధికారం నాకు ఉంది." అన్నాడు.
          విమర్శ్ బాధగా, "మీ జీవితంలో నావల్ల ఆ హక్కు వినియోగించుకోవలసిరావటం నాకెంతో కష్టంగ ఉంది నాన్నా.." అన్నాడు.
          "చూడరా, చేసింది మంచిపనో చెడ్డపనో తెలియదు. కానీ దానికి నువ్వు పూర్తి బాధ్యత వహించటమే నాకు నచ్చింది. పారిపోకుండ, నిజం నుంచి ముఖం తప్పించకుండా ధైర్యంగ దాన్ని ఎదుర్కొంటున్నావు. సమస్య చేసి వదిలేయకుండా పరిష్కరిస్తున్నావు. ధరిత్రికి నీకూ ఉన్న సామాజిక ఆర్థిక తేడాల దృష్ట్యా చెప్తున్నాను- ఇటువంటి సందర్భాలలో అనుబంధాన్ని విరిచే శక్తులు ఎక్కువగ ఉంటాయి. తర్వాత ఎప్పుడూ నేను తప్పు చేశానేమోనని నీకు అనిపించకూడదు. అదొక్కటి గుర్తుంచుకో." అన్నాడు.
          విమర్శ్ కళ్ళు తుడుచుకుని, సరేనన్నట్టు తల ఊపాడు- "మీ సహకారం ఉంటుంది కదా అదే నా ఆశ నాన్నా.. అయినా నాకిప్పుడు ఆమె లేనిదే బ్రతకలేనేమోనన్నంత ప్రేమ కలుగుతోంది."
          భార్గవ కొడుకు కళ్ళలోకి చూస్తూ, "ఇప్పుడు అనిపించటం కాదురా; నువ్వు ఇప్పుడు ఉన్న ఈ భావనే జీవితాంతం అనుక్షణం నిలుపుకోగలగాలి." అన్నాడు.
          విమర్శ్ తల ఊపి తండ్రిని గట్టిగ కౌగిలించుకుని, మనసులో ధరిత్రి కళ్ళను తలచుకుంటూ. ‘సర్, నేను ధరిత్రిని ప్రేమించాను.. మనసారా..’ అనుకున్నాడు మనసులో డా.చిద్విలాస్ కి కృతజ్ఞతలు చెప్పుకంటూ.
**************

No comments:

Post a Comment