Wednesday, 7 December 2016

7. చిద్విలాసం - 1



1
          "నువ్వు ఎప్పుడైనా ఎవ్వరినైనా ప్రేమించావా..?" డా.చిద్విలాస్ అడిగిన ప్రశ్నకు విమర్శ్ కొంచెం తడబడ్డాడు. ఇబ్బందిగ నవ్వాడు. ఆయనను తను కలవటానికి వచ్చిన విషయానికీ, ఆయన అడుగుతున్న ప్రశ్నకూ ఏంటి సంబంధం..? ధైర్యం చేసి అదే అడిగాడు.
          "చాలా లోతైన సంబంధం ఉన్నది బాబూ.." ఆయన సాలోచనగ విమర్శ్ ని చూసి అన్నాడు. "ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు."
          అసలు- ముందు ఆయనకూ తనకూ ఏం సంబంధం లేదు. ఉన్నా అందులో లేశమాత్రమైనా చనువు లేదు. తర్వాత ఆయన ఏకవచన సంబోధనతోనే సంభాషణ మొదలుపెట్టాడు. తను కేస్ విషయం ఇంకా మొదలు కూడ పెట్టకుండనే అప్పుడే ఈ ప్రశ్న అడుగుతున్నాడు. విమర్శ్ ఏం చెప్పాలో తోచక చూస్తూ కూర్చున్నాడు. డా.చిద్విలాస్ కాసేపు చూసి మళ్ళీ తనే అన్నాడు. "ఏం మాట్లాడవేంటోయ్..? ఇట్లయితే నీ సమస్య తీరినట్టే..! ముందు నేను అడిగిన వాటన్నింటికీ నీకు తెలిసినంతవరకు సరయిన సమాధానాలు చెప్తావని మాటిచ్చావు కదా. నేను అడిగేవి ఎంత వ్యక్తిగతమైన ప్రశ్నలైనా వాటికి సమాధానాలు చెప్పక తప్పదు."
          "ఇట్లాంటి ప్రశ్నకు నా దగ్గర ఏం సమాధానం ఉంటుంది సర్..?" విమర్శ్ తల వంచుకుని అన్నాడు.
          "ముందు ఆ తల ఎత్తి నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నువ్వు ఒక నవయువకుడివోయ్. కుర్రాళ్ళు మంచి డాషింగ్ గ ఉండాలి.. తప్పదు. చెప్పు..! ఎవరినైనా ప్రేమించావా..?"
          "అంటే మా అమ్మనూ, నాన్ననూ, దేశాన్నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానండీ.."
          విమర్శ్ సమాధానానికి ఆయన కొంచెం నిరాశ పడ్డాడు. "అమ్మాలూ బామ్మలూ కాదు నాయనా..! ఇప్పుడు.. ఒక పాతికేళ్ళ కుర్రాణ్ణి ప్రేమించటం గురించి అడగటంలో అర్థం మిస్ ఫలానా అనో కుమారి సోసో అనో సమాధానం ఆశించినట్టు. ఆ సంగతి చెప్పవోయ్."
          విమర్శ్ సిగ్గుగ తల అడ్డంగ ఊపి నవ్వాడు.
          "పాతికేళ్ళు నిండినా ప్రేమించని నువ్వేం మగాడివోయ్..? నీ వయసుకు నేను ఇద్దరు పిల్లల తండ్రినైనాను. .తెల్సా.. కవలలు.. ఒక అమ్మాయి ఒక అబ్బాయి.."
          విమర్శ్ ఆయనలో కొంటెతనానికి ఆశ్చర్యపోతూ, "సర్, నా వయసు ఇంకా ఇరవై నాలుగే సర్. ఇంకొక ఏడాది వ్యవధి ఉంది కదా. అప్పటికి నేనూ కంటానేమో.." అన్నాడు నవ్వి.
          డా.చిద్విలాస్ కూడ నవ్వి, "సరే, ఇవన్నీ వదిలేయ్. నువ్వేం చదివావోయ్..?" అని అడిగాడు.
          ఈయనతో ఒక విషయం చర్చించాలంటే ఇవన్నీ తప్పవని కేదార్ ముందే తనతో చెప్పాడు. కనీసం రెండు మూడు గంటలు ఒక్కొక్క సిటింగ్ ఇవ్వగలిగితేనే సమీపించమని సలహా కూడ ఉచితంగ ఇచ్చాడాయన. తనే ఇంకొంచెం సహనం అరువు తెచ్చుకోక తప్పదు.
          "సర్, నేను ఎమ్మెస్సీ మేథమేటిక్స్ లో స్వర్ణపతకం విజేతను. కంప్యూటర్స్ తో మంచి పరిచయం ఉంది. ఇంటీరియర్ డెకరేషన్ నా అభిరుచి. దేవుడు దయ తలిస్తే త్వరలో యూ ఎస్ వెళ్ళే ఏర్పాట్లు చేసుకోగలను." విపులంగ చెప్పాడు విమర్శ్.
          "బాగుందోయ్. వెళిపోండి.. యువకులంతా అంతా యూఎస్ లకు యూకేలకూ వెళిపోండి. ఎవ్వరూ మన దేశం సంగతి పట్టించుకోకండి.. ఇక్కడంతా చెత్తా చెదారం, సమస్యలు అని పిల్లలకు నేర్పించుకోండి. దేశమాతకు సాధ్యమైనంత దూరంగ ఉండండి. సరిపోతుంది."
          "అదేంటి సర్..? అట్ల అంటారు..? నేను ఎప్పటికీ వెళ్ళటం లేదు. రెండేళ్లు కాంగనే మళ్ళీ దిగబడతానులే. కేవలం పీ.హెచ్.డీ కోసం వెళ్తున్నాను. ఉద్యోగం అదీ అంతా ఇక్కడే మళ్ళీ. ఏదో.. మా బంధువులు ఉండి రమ్మంటే వెళ్తున్నాను. అంతే. అక్కడ చదివితే కానీ మరి నా మాతృభూమి నాకు గౌరవంగ బ్రతికే వేతనాలివ్వనని మొరాయిస్తోంది కదా..! ఏం చేసేది..?" అన్నాడు విమర్శ్.
          "నీ అభిరుచులు- ఇంటీరియర్ డెకరేషన్ అన్నావు.. ఇంకా ఏంటేంటి..?"
          తరువాతి ప్రశ్న సంధించాడు డా.చిద్విలాస్. విమర్శ్ కి సైకియాట్రిస్టు దగ్గరకు కాక ఉద్యోగం కోసం వెళ్ళిన ఇంటర్వ్యూ లాగ అనిపించింది. చదువు అంటే ఫరవాలేదు. ఏదో సామాన్య విజ్ఞానం అనుకోవచ్చు. కానీ ఈ రుచులూ పాకాలూ ఇప్పుడు ఎందుకుట..?
          "సాధారణ ఆసక్తికోసమేనోయ్..!" ఈయన నిజంగ మనస్తత్వజ్ఞుడే. అడగకుండనే తన మనసులోవన్నీ సూటిగ చెప్పేస్తున్నాడు. అయినా విమర్శ్ వీటకి అన్నింటకీ సిద్ధపడే వచ్చాడు.
          "హాయిగ కూర్చోవోయ్. ఎందుకంత పట్టి పట్టి ఉంటావు..?"
          "అదేం లేదు సర్. బాగనే ఉన్నాను..! అభిరుచులు అంటే ప్రత్యేకించి ఏమీ లేవు. టీవీ చూడటం, పాటలు పాడటం, సంగీతం వినడం.."
          విమర్శ్ ని మధ్యలోనే తుంచుతూ అడిగాడాయన- "సంగీతం అంటే వాద్యసంగీతమా.. లేక గాత్ర సంగీతమా...?"
          నా బొంద సంగీతం..!! తిట్టుకున్నాడు విమర్శ్. ఇట్ల ఒకటికొకటి అల్లుకుపోతుంటే ఇంక సమస్య తీరినట్టే..! ధరిత్రి బాగుపడ్డట్టే..!
          "ఎక్కువ వాద్య సంగీతమే ఇష్టం సర్.."
          "ఎందుకంటావు..?"
          మళ్ళీ ఇదొకటా..?! "అదైతే లిరిక్స్ కోసం తాపత్రయపడకుండ కూడ వినచ్చు కదా అని..! అంటే ఈ సంగీతం వాళ్ళు పదాలన్నింటినీ కూనీ చేసేస్తుంటారు కదా. ముఖ్యంగ తమిళులు తెలుగు కీర్తనలు పాడేటప్పుడు, లేక సంస్కృతం పాడేటప్పుడు... ఆ శ్రుతికటుత్వం తప్పుతుందని వాద్యసంగీతమే ఎక్కువగ వింటాను."
          "ఇంక..?"
          "స్విమింగ్, కేరమ్స్, ఛెస్, ఫుట్ బాల్.. అప్పుడప్పుడు రెమీ.."
          "ఓహ్.. అయితే నువ్వు మంచి ఆటగాడివి కూడానన్నమాట. ఇంక..?"
          విమర్శ్ ఇంకా ఏం ఉన్నాయా అని ఆలోచించుకోసాగాడు. కానీ సమయానికి ఏదీ తట్టలేదు.
          "పుస్తకాలు ఇష్టంలేదా మరి..?"
          "అయ్యో..? ఎందుకు లేదు..? పడిచచ్చేంత ఇష్టం సర్."
          "ఎటువంటి పుస్తకాలు చదువుతావు..? కాలక్షేపానికి- అంటే నవళ్ళూ, కథానికలు వగైరా.. లాంటివా లేక విజ్ఞానం పుస్తకాలా, లేక ఏదైనా విషయానికి సంబంధించినవా..?"
          దుంపతెగ.. పుస్తకాలంటే చాలదా.. ఏరకంవైతే ఎందుకంట..? "నవళ్ళు కథలే అయినా కాలక్షేపానికి కాక విజ్ఞానానికి చదువుతా సర్.."
          "ఇంకేమైనా ఇష్టాలు ఉన్నాయా..?"
          "ఇంక... వాకింగ్.. షటిల్ ఆడటం.. కొంచెం తోటపని.. ఊఁ.. మా నాన్నతో ఏదైనా చర్చించటం అంటే ప్రాణం సర్.. ఇంక.. అప్పుడప్పుడు.."
          "సరే, సరే.."
          వీడి పీక నొక్క..!! గుర్తుకురానప్పుడేమో చెప్పో అంటాడు. వచ్చినప్పుడు ఠక్కున ఆపేయమంటాడు..! ఏం సైకియాట్రిస్టో ఏమో..!?
          "నీకు ఏ రంగంటే ఇష్టం..?"
          మళ్ళీ ఇదొకటా..? "తెల్లరంగు అంటే ఇష్టం సర్.."
          "ఎందుకు..?"
          "శాంతికి సంకేతం కనక. దాన్ని చూస్తున్నప్పుడు మనలో ఏ వికారం కలగదు. ఉదాహరణకు ఎరుపు రంగు చాలా సేపు చూస్తున్నట్టైతే మన రక్తపోటు పెరుగుతుందిట. అట్ల తెలుపుకు ఏమీ లేవు కదా.."
          "ఎందుకు లేవు..? తెలుపు ప్రశాంతతనిస్తుంది కదా..?"
          "ఊఁ.. నిజమే. అది మంచిదే కదా..?" విమర్శ్ మొహమాటంగ నవ్వాడు.
          "సరే.. మీ అమ్మానాన్నల గురించి ఏదైనా చెప్పు.. నీ చిన్నతనం, చదువు.."
          "మా నాన్నగారు భార్గవ. కాలేజి ప్రిన్సిపల్ గ చేసి వాలంటరీగ సేవానివృత్తులైనారు. ఇప్పుడు ఊళ్ళో చిన్నపిల్లలకు విద్యాలయం నడుపుతున్నారు. అమ్మ కల్యాణి. ఆమె కూడ టీచర్ గ చేసేది. ఊరికి మకాం మారిపోయాక ఉద్యోగం మానేసి ఆయనతో పాటు స్కూలు కోసం పనిచేస్తోంది."
          "ఏఁ ఊరు..?"
          "రామాపురం."
          "సీతాపురం వాళ్ళ ఆయనా..?" అంటూ నవ్వాడాయన.
          విమర్శ్ కూడ నవ్వి, "ముందు బెంగళూరులో ఉండేవారం. నాలుగేళ్ళ క్రితం నా బీటెక్ అయినాక అటు మారిపోయాం. అక్కడి నుంచి నేను రెండేళ్ళు బయట హాస్టల్ లో ఉంటూ ఎం. టెక్. చదువుకున్నాను. ఇప్పుడు నాన్నగారికి విద్యాలయం పనులలో సహాయంగ ఉంటున్నాను. చిన్నప్పటి నుంచీ నగరజీవితానికి అలవాటు పడ్డ నాకు ఊరు జీవతం నచ్చదు కానీ మా ఊరు చాలా అందంగ ఉంటుంది. పైగా నాన్నగారు కూడ బలవంతం చేస్తే వెళ్ళి ఉంటున్నాను. నిజంగ కూడ బాగుంటుంది సర్. ఫరవాలేదు. చిన్న ఊరే అయినా కావాల్సిన సౌకర్యాలన్నీ కొంత వరకైనా ఉన్నాయి. నేను ఉన్నది తక్కువే. నాకు నచ్చిన ప్రదేశాలు మాత్రం- నదీతీరాన ఉన్న రామాలయం, దాని వెనక కొండలు, గుట్టలు, దాని మీది నుంచి వర్షాకాలంలో జాలువారే నీళ్ళు ఆ నదిలోకి జలపాతంలా పాడుతుంటే ఎంత బాగుంటుందో! మా ఊరే చివరది. తూర్పున ఊరి పొలిమేర దాటితే ఇంక అంతా అడవి.. అక్కడి నుంచి రాత్రి పూట నక్కల ఊళలు, పులుల సింహాల అరుపులు కూడ వినిపిస్తాయి.."
          "మరి అసలు ఎందుకు మారాల్సి వచ్చింది..?"
          "రామాపురంలో మా తాతలనాటి దివాణం ఉంది. మా తాతగారు, బామ్మ అక్కడే ఉండేవారు. హఠాత్తుగ తాతగారు జబ్బునపడి పోయారు. ఇంక నాన్నగారు ఇక్కడ వచ్చి ఉండిపోవాలని ఆయన చివరి కోరిక. మిగిలింది నాయనమ్మ ఒక్కర్తే. పెద్దది అయిపోయింది. పోనీ మాతో వచ్చి ఉండమంటే రానంది. ఇంక నా చదువు కాంగనే మారాము. సరే, ఆస్తి పాస్తులన్నీ అక్కడే ఉన్నాయి. ఆ సంవత్సరమే వాటిని దగ్గర ఉండి చూసుకునే నారాయణ మామయ్య హఠాత్తుగ పోయారు. ఇంక వాటిని అమ్మటం ఇష్టం లేక తప్పని పరిస్థితులల్లో మారాల్సి వచ్చింది."
          "సరే. నారాయణ మామయ్య అంటే..?"
          "ధరిత్రి వాళ్ళ నాన్న."
          "ఓహో.. అయితే మిస్ ధరిత్రివాళ్ళు మీ చుట్టాలన్నమాట..."
          హమ్మయ్య ధరిత్రి పేరయితే వచ్చింది మొత్తానికి..! బండి పట్టాల మీదికి వచ్చిందన్నమాట.
          "లేదు సర్. చుట్టాలంటే చుట్టాలు కాదు. వాళ్ళు మా వీధిలోనే ఉంటారు. ఊళ్ళలో ఒకరినొకరు వదినా, అన్నయ్యా అని పిలుచుకుంటారు కదా. అట్ల ఊరిపద్ధతుల ప్రకారం మా పెద్దల పిలుపుల వల్ల బంధువులైనారు. ధరిత్రి వాళ్ళకు ఒక్కగానొక్క అమ్మాయి."
          "మీ ఇల్లు పెద్దదేనా..? సుమారు ఎంత పెద్దది..? మీ ఇంట్లో.. అదే దివాణంలో.. ఎన్ని గదులు ఉంటాయి..?"
          ధరిత్రి పేరు కదిలినా విషయంలోకి ఆయన రాకపోయేసరికి ఒకింత నిరాశ పడుతూ చెప్పాడు విమర్శ్. "చాలా పెద్దదే..! ఏమో.. ఎంత పెద్దది అంటే.. పెద్దదే..! రెండు అంతస్తులూ కలిపి ఓ ఇరవై గదులు ఉంటాయేమో.. అన్నీ వాడము. కొన్నే వాడతాము. ముందూ వెనకా జాగా కలిపి పదెకరాలు ఉంటుంది. అంత జాగాలో మధ్యన భవంతి ఉంటుంది. చుట్టూ చెట్లు.. వర్షాకాలం వచ్చిందంటే పచ్చగ బాగుంటుంది. నా గది కిటికీ లోంచి వ్యూ బాగుంటుంది. కిటికీలు కూడ పెద్దపెద్దవి.. ఊచలు ఉండవు తెలుసా..! వాటికి మా అమ్మ పెద్ద పెద్ద కర్టెన్లు కుట్టించింది. అవి గాలికి ఎగురుతూ ఉంటే ఎంత బాగుంటుందో..! నాకు చాలా ఇష్టం అట్ల అక్కడ కూర్చుని చెట్లను, ఆకాశాన్ని చూస్తూ కూర్చోవటం. అక్కడి నుంచి చూస్తే మా ఊరి సెలయేరు, గుడి గోపురం, పచ్చని పొలాలు కూడ కనిపిస్తాయి. మా దివాణం మొత్తం ఒక వ్యూలాగ కనిపిస్తుంటుంది. చాలా వైభవంగ ఉంటుంది.. దాదాపు రాజ్ మహల్ లా.."
          "అయితే నువ్వు రాజ్ మహల్ లో ఉండే రాకుమారుడివన్నమాట.." నవ్వాడాయన.
          విమర్శ్ కొంచెం ఇబ్బందిగ చూసి, "ఇప్పుడెక్కడి రాజరికాలు సర్..? హాఁ.. అప్పట్లో అదంతా రాజరికంగనే ఉండేదిట. మా నాన్నగారి తాతగారి హయాంలో చాల వైభవంగ ఉండేదని మా ఊళ్ళో అంతా ఇప్పటికీ చెప్పుకుంటారు. వాళ్ళు చాలా స్థితిపరులని, హోదాకి తగ్గట్టు ఆ భవంతిని కట్టించారని, చాలా గొప్పగ జీవించారని చెబుతారు. ఆ కట్టడం వందేళ్ళపాతదైనా ఇప్పటి కొత్తవాటికన్నా గట్టిగ ఉంటుంది. ఆ దివాణంలో నలుగురికి చాలా మంచి చేసే పనులు ఎన్నో చేశారని అంటుంటారు. అంత పెద్ద ఇల్లు ఏం చేసుకుంటాంలే అని ఇప్పుడు మా నాన్నగారు అక్కడే పెద్ద స్కూలు తెరవాలని అనుకుంటున్నారు. అందుకే రెనోవేషన్ చేయించాలని.. కానీ నేను పీ.హెచ్.డీ చేసి తిరిగి వచ్చాక పెట్టుకుందామనుకుంటూ ప్రస్తుతానికి ఆ ప్రయత్నం ఆపేశారు." అన్నాడు.
          "అయితే మొత్తానికి ఈ వంకనైనా దేశానికి తిరిగి రాకతప్పదన్నమాట.." అన్నాడాయన. "సరే, మీ ఇంట్లో వస్తువుల గురించి చెప్పు.."
          డా.చిద్విలాస్..! సందేహం లేదు. ఈయన ఒక అతి విచిత్రమైన జాతికి చెందినవాడు. ప్రశ్నలతో చంపేస్తున్నాడు. విమర్శ్ ఆలోచిస్తూ ఆయన వంక చూస్తుండిపోయాడు. చిద్విలాస్ అంటే అర్థమేంటో? విలాసంగా అవతలవాడిని చిత్తో తుక్కో చేసేవాడనా? లేదంటే చిత్తే విలాసంగా కలవాడనా? హుఁ! ఏదైనా తప్పదు! ఇప్పుడు ధరిత్రి వ్యాధికి ఇంట్లో వస్తువులకు ఏంటి సంబంధం..? అదే అడిగితే స్టైల్ గ లోతైన సంబంధం ఉంది అంటాడు. ఏంటో చెప్పడు. అడిగి లాభం లేదు. కనక గమ్మున సమాధానాలు చెప్పక తప్పదు.
          "వస్తువులు అనంగనే ఏంటి ఆలోచిస్తున్నావు..? నువ్వు ఇట్ల ప్రతీ మాటకు ట్రాన్స్ లోకి వెళుతుంటే మాటలు సాగటం అసంభవమోయ్.."
          "నిజమే సర్. వస్తువులంటే ఏమేం చెప్పాలా అని గుర్తు చేసుకుంటున్నాను. ఏవి మీకు ఉపయోగపడేవో నాకు తెలియదు కదా. వరుస క్రమంలో వస్తాను.. ముందు గదిలో ఓ పెద్ద సోఫా సెట్ ఉంటుంది. గది మధ్యలో ఒక ఉయ్యాల బల్ల ఉంటుంది. మా తాతగారు దాని మీద కూర్చుని ఊళ్ళో వాళ్ళకు మంచి చెడు చెబుతుండేవారట. ఇప్పుడు నాన్నగారు ఆ స్థానం తీసుకున్నారు. తర్వాత మామూలే సర్.. ఇంట్లో కావాల్సినవి, ఉండాల్సినవి అన్ని వస్తువులు ఉన్నాయి.."
          "మీరు ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి అది మొత్తం ఫర్నిష్డ్ ఇల్లేనా..? అంటే.. చాలామటుకు సామాన్లు..?"
          "ఆఁ.. అంతే కదా మరి. బెంగళూరులో ఇంట్లో వాడినవి చాలా మటుకు మా వస్తువులు అన్నీ ఇంటితో సహా ఒక వృద్ధాశ్రమానికి వ్రాసి ఇచ్చేసి వచ్చాం. ఒక్క ఆధునిక యంత్రాలు- అదే ఫ్రిజ్జు, టీవీ వంటి  పరికరాలు తప్ప ఇంకేమీ తెచ్చుకోలేదు. అవసరం ఏం ఉంది..? చెక్కలవి పెద్ద పెద్ద అల్మారాలు ఉన్నాయి. డైనింగ్ టేబుల్ ఉంది. మంచాలు పాతకాలం నాటివి గట్టిగ పెయింటు కూడ పోకుండ చెక్కు చెదరకుండ ఉన్నాయి." విమర్శ్ ఇంకా గుర్తు తెచ్చుకోసాగాడు. "మంచి చెక్క పనితనంతో నగిషీలతో బోలెడు ఫర్నిచర్ ఉంది."
          "ఇంకా పాత వస్తువులు ఏమేం ఉంటాయి..? ఫోటోలు, అద్దాలు.. గడియారాలు..?"
          "ఊఁ.. ఎందుకు లేవు..? మీరు అన్నట్టు మాది ఒకరకమైన రాజరికమే కదా. పాతవారివి తరాల వారిగా రాజసంగ నిలబడి గీయించుకున్న పెద్ద పెద్ద చిత్రపటాలు ఉంటాయి. వాటి చుట్టూ భారీ నగిషీ ఉంటుంది. అవి కాపాడటానికే మ్యూజియం నుంచి మనుషులు వచ్చి వెళుతుంటారు. అవన్నీ తీసేయమని ఎన్నిసార్లు అడిగినా నాన్నగారు పడనీయరు. అవి తుడవలేక చచ్చిపోతున్నానని సీను గోల చేస్తాడు. అయినా సరే అవి అట్ల ఉండాల్సిందే. నా శరీరానికి శ్వాస ఎట్లనో ఈ ఇంటికి ఈ ఫోటోలు అట్ల అని వాదిస్తాడాయన. అమ్మకు ఇల్లంతా మాడర్న్ గ చేయిస్తే బాగుండని చాలా ఉంటుంది. కానీ నాన్న ఏ వస్తువు ఎక్కడ ఎట్ల ఉందో అది అట్లగే ఉండాలని పట్టుబడతారు. ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని తరాలు మారినా కొన్ని మారకూడదుట. అది మార్చినందువల్ల పెద్దల ఆత్మ ఘోష పడుతుందని, వారి శాపం తగులుతుందని అనుకుంటాడు. ఆయనకు వాళ్ళ వంశం, పరంపర అంటే చాలా గౌరవం. అద్దాలైతే లెక్క లేదు. చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు ఎక్కడంటే అక్కడ అందమైన చుట్టు డిజైన్లతో ఉంటాయి."
          "మరి అవి చాలా జాగ్రత్తగ చూసుకోవాల్సి వస్తుందేమో కదా.."
          "ఆఁ.."
          వాటిని రోజూ శుభ్రంగ తుడవటం ధరిత్రి పనే. తనకు అవంటే చాలా ఇష్టం కూడ. తుడుస్తూ మధ్యలో తనను తాను చూసుకుని మురిసిపోతుండటం చాలాసార్లు తన కళ్ళబడింది. ఆశ్చర్యంతో.. కళ్ళన్నీ వెడల్పు చేసి.. రకరకాల భంగిమలలో చూసుకంటుంది. అందరు అమ్మాయిలలాగే అందంగ ఉండాలని కోరిక. మామయ్యకు ఒక్కగానొక్క కూతురు కదా..! చాలా గారాబంగ పెరిగింది. అతను తనను చాటుగ చూస్తున్న సంగతి ఆమెకు తెలియదు. భలే ఉంటుంది ఆమె ముఖం ఆ సమయంలో.. విమర్శ్ గుర్తు చేసుకున్నాడు.
          "ఇంకేం ఉన్నాయి..?"
          "ఇంక దీపాల షాండిలియర్లు ఉంటాయి. ప్రతీ గదిలో వేరే వేరే ప్రమాణంలో పెద్దవి, చిన్నవి, రంగురంగులుగ ఉంటాయి. ఇంక... గంటల గడియారం ఒకటి ఉంది.. దాదాపు 200 ఏళ్ళ క్రితం నాటిది. విదేశం నుంచి తెప్పించారట ముత్తాతగారు. అది ఆయన తెప్పించే నాటికే పురావస్తువట. కానీ ఇప్పటికీ గంటలు ఠంచనుగ కొడుతుంది అంటే నమ్ముతారా..? దానికి ఇంతవరకు రిపేరు రాలేదు. కనీసం అంటే పైకప్పు నుంచి నేలను తాకేంత పెద్దది. దాన్ని చూస్తే ధరిత్రికి ఎంత ఇష్టమో. గంటలు కొట్టేటప్పుడు వచ్చి నిలబడి వింతగ చూస్తుంటుంది.."  నవ్వాడు విమర్శ్.
          "అంటే ఆ సమయంలో నువ్వూ ఆమెను చాటుగ చూస్తుంటావన్నమాట..! సో.. ఆమె నీ ప్రియసఖి అన్నమాట..!!" ఠక్కున డా.చిద్విలాస్ అనేశాడు.
          విమర్శ్ ఖంగుతిన్నాడు ఒక్కసారిగ. ఆమాట అతను ఊహించినది కాదు. ధరిత్రి తన ప్రియసఖి ఏంటి..? ఆయన సూదులలాంటి చూపులు తన కళ్ళలోకి వాడిగ తగులుతంటే విమర్శ్ కి ఏం చెప్పాలో తోచలేదు. "అదేం లేదే. ఆమె నాకు పరిచయం ఉన్న అమ్మాయి. అంతే. అసలు నేను మొన్నమొన్ననే కదా ఊరిలో ఉండటం మొదలుపెట్టింది. ఎప్పుడైనా శెలవలకు ఊరికి వెళ్ళినప్పుడు కలిసేది. తన గురించి నాకు తెలిసిందే చాలా తక్కువ. ఊర్లలో ఎక్కువగ ఇటువంటివి ప్రోత్సహించరు కూడా. అయినా వాళ్ళకూ మాకూ ఎట్ల చూసినా సామ్యం లేదు. వారు ఆర్థికంగ మాకన్నా చాలా కింది స్థాయివాళ్ళు. అసలు.. అసలు.. అవకాశమే లేదు సర్.."
          "మరి అయితే తన బాగు గురించి నీకెందుకు ఆరాటం..?"
          ఏమిటీ ప్రశ్నకు అర్థం..? సాటి అమ్మాయి, మంచి పిల్ల, కష్టంలో ఉంటే అది తీర్చబూనటం కూడ తప్పేనా..? విమర్శ్ తడబడ్డాడు. "ఏదో, పరిచయస్తుల అమ్మాయి కదా అని.. అంతే." అన్నాడు.
          "అంతేనని ఎట్ల చెప్పగలవు..? వాళ్ళ నాన్న పోయినదగ్గరినుంచి మీ ఇంట్లోనే ఉంటోందని కేస్ షీట్ లో వ్రాశావు కదా. ఇప్పుడు ఆమె గురించి చెప్పేటప్పుడు సాక్షాత్తు నీ కళ్ళలో ఆమె కదలాడుతున్నట్టుగ ఒక వెలుగు కనిపిస్తోంది. అందువల్ల ఏమైనా.. అంటే.. అవకాశం ఉండవచ్చు కదా అని ఊహించాను. ప్రణయభావాలేమైనా ఉన్నాయేమోనని.."
          విమర్శ్ కి కొంచెం కోపం వచ్చింది. "ఏంటి సర్, మీరనేది..? నాకు చెందని ఒక పరాయి అమ్మాయి గురించి నేను చనువు తీసుకుంటున్నానంటే దాని అర్థం అదేనా..? ఇంకేం ఉండదా..? నాది మాత్రం ఆమెకు బాగవ్వాలనే సత్సంకల్పమే కానీ వేరే కాదు. అది ముందుగా మీరు తెలుసుకోవటం మంచిది.." అన్నాడు విసురుగ లేచి నిలబడి.
          డా.చిద్విలాస్ ఆ విసురుకు కాస్త నవ్వి, "సరే, మంచిది. కానీ ఎందుకంత కోపం..? ముందు కూర్చో.." అన్నాడు.
          విమర్శ్ కూర్చోకుండ, "మీరు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే నేను వినలేను సర్. ధరిత్రి ఒకరంకగ మా కుటుంబసభ్యురాలే. ఆమెకేమైనా అయితే మేము కాక చూసుకునే దిక్కు కూడ లేదు. ఈ వ్యాధి తగ్గితే ఎక్కడైనా మంచి పిల్లవాణ్ణి చూసి పెళ్ళిచేసి పంపాలని అమ్మ ఆరాటం. ఆ మాటకొస్తే మా పాలేరు సీను ఉన్నాడు. వాడు నన్ను అన్నా అంటాడు. మా నాన్నను బాబుగారు అంటాడు. ఎప్పుడూ మా పనులు చేసి పెడుతూ మా ఇంట్లోనే ఉంటాడు. వాడి చేత పని తీయించుకుంటున్నప్పుడు బాగోగులు మేము కాక ఎవరు చూస్తారు? వాడికే కనక ఇటువంటి సమస్య ఏదైనా ఉందని మీ దగ్గరకు వస్తే అప్పుడు కూడ ఇట్లగే అనేవారా..? ధరిత్రి ఒక అమ్మాయి అనే కదా, నా ప్రయత్నానికి ఇట్ల పెడార్థాలు తీస్తున్నారు." అన్నాడు.
          డా.చిద్విలాస్ విమర్శ్ దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి, సున్నితంగ కుర్చీలోకి తోస్తూ, "సరే. నన్ను క్షమించు. ఒక అమ్మాయిని ప్రేమించటం నేరమేం కాదే. నేను అడిగిన దాంట్లో అసలు అంత చిరాకు పడే అంశం ఏంటో నాకు అర్థమే కాలేదు. సాధారణంగ సొంతవాళ్ళ గురించే పట్టించుకునే దిక్కు లేని ఈరోజుల్లో కనీస బంధుత్వం కూడ లేని ఒక అనాథ అమ్మాయి కోసం ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చి, ఇంతింత ఫీసు కట్టి, ఇంత ప్రయాస పడుతున్నావంటే ఏదైనా ఉండి ఉండాలనే ఎవరైనా అనుకుంటాడు. నేనూ అనుకున్నాను." అన్నాడు.
          విమర్శ్ కోపంగ పక్కకు చూసి, "ఆ అమ్మాయి సమస్య తన ఒక్క దానిదే కాదు. తనకు బాగలేకపోవటం ఇంట్లో మా అందరికీ, ఊళ్ళోవాళ్ళందరికీ కూడా సమస్యే అయిపోయింది. ఆమెను అనవసరంగ అందరూ హేళన చేయటం, కించపరచటం ఎవరు చూస్తే వారికే ఆమెకు నయం చేయించాలన్న పట్టుదల వస్తుంది. నేను వారందరి తరఫున వచ్చాననుకోండి. అంతే. సాటి మనిషిగ చూస్తూ ఊరుకోలేకపోయాను. నా స్థానంలో మీరు ఉన్నా ఒక అమాయకురాలి జీవితం నాశనం అయిపోతోందే అని తప్పక సహాయం కోసం వెతికి తీరేవారు. కాస్తో కూస్తో చదువుకుని మానవత్వం ఉన్న ఏ మనిషైనా అదే చేస్తారు. ఆమె తిరిగి మంచిగ అయిపోతే ఎవరైనా అబ్బాయిని చూసి ఆమెకు పెళ్ళి చేయాల్సిన బాధ్యత మామీద ఉంది. మీరు కేవలం ఈ నేపథ్యంలో సమస్యను చూస్తే సంతోషిస్తాను." అన్నాడు.
          "సరే. ఒప్పుకుంటున్నాను. అంత కోపం మానేయి." అని డా.చిద్విలాస్ ధరిత్రి ఫైలు తీసుకుని చదువుతూ, "ఇంతకూ ఆమె వయస్సెంత. ఇరవయ్యా..? మరి చదువు..? ఏమీ చదవనేలేదా..?"
          విమర్శ్ కొంచెం చల్లబడుతూ, "లేదు. పేరు వ్రాసుకోవటం కూడ రాదు." అన్నాడు.
          "ఎందుకు..? ఎందుకట్ల..?"
          "మాది చిన్న పల్లెటూరు కదా. ఆమె చిన్నతనంలో అక్కడ స్కూలు లేదు. పక్క ఊరుకెళ్ళి చదువుకోవాల్సి వచ్చేది. అది మామయ్యకు ఇష్టం లేదు. పంపలేదు. అందునా ఆయనకు ఆడపిల్లను చదివిస్తే ఆయుక్షీణం అని ఒక మహానమ్మకం.."
          "అవునా..? అయితే తను కూడ అదే నమ్ముతుందా..?"
          "ఏమో. నమ్మినా నమ్మకపోయినా తప్పలేదు. చదువంటే ఆమెకు ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు అని నాకు అనిపిస్తుంది. అంటే తను అదేం విషయంగ తీసుకోనే లేదు. ఊరి అమ్మాయి కదా..! ఎవరు ఏం చెప్పినా ఎదురు అడగకుండ పాటిస్తుంది. ఇప్పుడు తన సమస్య తీరాలని ఎవరైనా బావిలో దూకమన్నా దూకేస్తుంది."
          "చాలా మొండిగ ఉంటుందా..?"
          "ఛ.. అస్సలు ఉండదు. మంచి అమ్మాయి. మీరు అది తప్పు కదా అని చెప్పి చూడండి. ఆలోచించకుండ అవునని ఒప్పుకుని మానేస్తుంది. నవ్వులాట అని అనుమానం రాకపోతే చాలు."
          "ఫరవాలేదు. ఆమె చిన్నతనం గురించి ఏమైనా తెల్సా..?"
          విమర్శ్ కళ్ళలో విషాదం చోటు చేసుకుంది. "ఆమె చిన్నతనంలో చాలా కష్టాలు పడింది. తనకు తొమ్మిదేళ్ళ వయసులో అత్తయ్య క్షయవ్యాధితో చచ్చిపోయింది. మామయ్యే తల్లీతండ్రీ అయి పెంచాడు. వాళ్ళ బామ్మ ఉండేది కానీ ఆమెకు ఉబ్బసం రోగం ఉండేది. కాస్త పెరిగాక ఎప్పుడూ ఆమెకు తనే సేవ చేసేది. బాగా ఆమె దగ్గర ఉండేది. ప్రేమించేది. ఆమె తన పదవ యేట చనిపోయింది. పెద్దగ తిండిసుఖం, బట్టసుఖం ఉండేది కాదు. ఏదో తినీ తినక అట్ల బ్రతికేవారు. చిన్నప్పటి నుంచీ ధరిత్రికు ఎప్పుడూ ఒంట్లో బాగుండేది కాదు. చాలా తీవ్రమైన ఆయాసం సమస్య. ఊళ్ళోనే ఉండే అవధాని గారు ఆయుర్వేదం ముందుతో ఎప్పటికప్పుడు నయం చేసేవారు. కానీ ఆయన పోయాక ఆమెకు సమస్య బాగా రెట్టించింది. ఇప్పటికీ అప్పుడప్పుడు తట్టుకోలేనంత అవస్థ పడుతూ ఉంటుంది."
          "చాలా భావావేశపరురాలా..?"
          "చాలా ఎక్కువగా. ఏదైనా చిన్నమాట అన్నా తట్టుకోలేదు. ధైర్యం తక్కువ. అన్నింటికీ భయాలే. ఆందోళన పడుతుంది. బయటకు వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు కదా- ఇంక సమస్య బాగ పెరిగిపోతుంది. వాళ్ళ నాన్న పోయాక మరీ ఒంటరిదైపోయింది. అమ్మాయికి నాన్న అంటే సహజంగనే ప్రేమ ఎక్కువ అంటారు కదా. అసలు మా అమ్మ ఊరికి మారటానికి ఒప్పుకున్నది ఆమెను దృష్టిలో ఉంచుకునే. ఎప్పటికప్పుడు ఆమెకు అమ్మ తనకు చేతనైనంతలో ధైర్యం చెబుతూనే ఉంటుంది. కానీ..."
          "వాళ్ళ నాన్న ఎట్ల పోయారు..?"
          "లివర్ పాడైంది. అత్తయ్య పోయాక తాగుడుకు బానిసైనాడు. కూతురి గురించి కూడ ఆలోచించలేదు. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగ ఉండేవారు. అది బాగ మనసు మీదకు తీసుకున్నాడాయన. వాళ్ళ అమ్మ బ్రతికి ఉన్నన్నాళ్ళు కాస్త ఆగాడు. తర్వాత పూర్తిగ పరిస్థితి చేజారిపోయింది."
          "మిస్ ధరిత్రికి తోబుట్టువులు లేరా..?"
          "పుట్టారు కానీ పురిట్లో ఒకరు, రెండేళ్ళు పెరిగి ఒకరు చనిపోయారు. తర్వాతే ధరిత్రి పుట్టింది. ఈమె అయినా బ్రతికితే చాలనుకున్నారు. పుట్టటమే బలహీనంగ పుట్టింది. తర్వాత బలహీనంగనే పెరిగింది. అయినా ఆ రోగంతో కూడ నిలదొక్కుకుందంటే అదృష్టవంతురాలనే చెప్పాలి. పైనుంచి ఈ జటిలమైన సమస్య. ఇది ఇట్లగే కొనసాగితే ఎంతో కాలం బ్రతకలేదు అనిపిస్తుంది. అసలు ఆమెకు ఎందుకిట్ల జరిగింది సర్..? అసలు ఇది తీరుతుంది అంటారా..?"
          డా.చిద్విలాస్ ఏమీ మాట్లాడలేదు. ఆలోచిస్తూ చూసి ఊరుకున్నాడు.
          "ఇప్పటికే ఊళ్ళో చాలా చెడ్డ పేరు వచ్చింది. ఆత్మన్యూనతా భావంతో ఆమె ఏదైనా పిచ్చిపని చేసింది అంటే మా ఇంట్లోవాళ్ళం తట్టుకోలేం సర్. ఆమె వ్యక్తిగ చాలా విరిగిపోతోంది సర్. వాళ్ళ నాన్న మామీద చాలా నమ్మకంతో ఆమెను మాకు అప్పచెప్పి చనిపోయాడు. ఇప్పుడామె నైతికంగ మా బాధ్యతే కదా. లోపం జరగకూడదు."
          "----"
          "అసలు ఇటువంటి సమస్యలు ఎందుకు వస్తుంటాయి..?"
          "నాకు కొంచెం వ్యవధి ఇస్తే అన్నీ చెబుతాను. సమస్య ఎందుకు వచ్చిందో తెలిస్తే ఎట్ల తీరుతుందో తెలుస్తుంది. నేను ఏం చేయగలనో లేదో నాకే తెలియదు." అని ఆగి, "కానీ తప్పక తగ్గుతుందనే అనిపిస్తోంది నాకు." అన్నాడు.
          "థాంక్స్ సర్.."
          "నాకు సత్తా ఉన్నందువల్ల కాదు.. నువ్వు ఇంత ఇదిగా ఆమెకోసం ప్రయత్నం చేస్తున్నావు కదా.. అందుకనైనా తగ్గుతంది.."
          విమర్శ్ నవ్వాడు చాలాసేపటి తర్వాత. డా.చిద్విలాస్ అతనినే చూస్తూ, "నీకొకటి తెల్సా..? నువ్వు నవ్వితే చాలా బాగుంటావోయ్..." అన్నాడు.
          విమర్శ్ ఏమీ మాట్లాడకుండ ఆయన్ను చూశాడు.
          "నీలో చాలా లక్షణాలు మా అబ్బాయితో కలుస్తాయి. ఏమో- పూర్వజన్మలో నువ్వు నా కొడుకువేమోననిపిస్తోంది." అని ఆయన నవ్వి, "నా కొడుకు ప్రేమించి పెళ్ళి చేసుకుని కోడలితో విదేశంలో ఉంటున్నాడు. రారా అంటే రాడు. ఎప్పుడో వచ్చి చూసిపోతాడు.. నిన్ను చూస్తుంటే వాణ్ణి చూస్తున్నట్టే ఉంది. మధ్య మధ్య వచ్చి పోతూ ఉండు.. మిస్ ధరిత్రి కారణంగ రాక తప్పదనుకో.."
          విమర్శ్ తల ఊపాడు.
          "ఏమో- నువ్వూ వాడిలాగే అనిపించావు కనక.. అట్ల నీ వ్యక్తిగత వివరాలన్నీ అడగాలనిపించింది. ఏమీ అనుకోకు. నాకెందుకో బలంగ అనిపిస్తోంది.. నువ్వు కూడ ప్రేమపెళ్ళే చేసుకుంటావని."
          "సారీ సర్, నాకు అసలు ఆ ఉద్దేశాలే లేవు. నాకు నా జీవితం పాడు చేసుకోవాలని లేదు. పెళ్ళే ఒక వృథా ప్రయాస అంటుంటే ఇంకా పైగా ప్రేమించి మరీ పెళ్ళా..? సర్లేండి." అని అతను గంట ఎంత అయిందో చూసుకుని, "సరే, ఇంక ఉంటాను. మీరు మాత్రం మా ధరిత్రి విషయం కాస్త లోతుగ ఆలోచించి పరిష్కరించాలి. నాకోసం కాకపోయినా మా ఇంట్లోవాళ్ళకోసం.. మా ఊళ్ళో వాళ్ళ కోసం." అన్నాడు.
          "అంత వెనకబడి ఆమెను బాగు చేయించేది ఊళ్ళోవాళ్ళ కోసమా..?" అని ఏదో అనబోయి ఆయన విమర్శ్ ముఖం చూసి ఆగి, "సరే, సరే. తప్పక ప్రయత్నిస్తాను." అన్నాడు.
          "సర్, మా ఊళ్ళో కేదార్ డాక్టర్ మీ గురించి చాలా చెప్పాడు. చివరి ప్రయత్నంగ ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఆశ్రయించాను. ప్రేమదోమల మీద నాకు నమ్మకం లేదు సర్. ధరిత్రి ఎటువైపు నుంచీ నాకు ఏమీ కాదు. అంతమాత్రానికి మీరు, నేను ధరిత్రి గురించి సీరియస్ గ ఆలోచించకూడదనేం లేదు కదా." అన్నాడు ఆయనతో చేయి కలుపుతూ.
          తలఊపాడు డా.చిద్విలాస్ నవ్వి. విమర్శ్ సెలవు తీసుకుని బయలుదేరాడు, డా.చిద్విలాస్ ను ఆలోచనలలో వదిలి.
          గంట ఏడున్నర దాటింది. వాచ్ చూసుకుంటుంటే అతని దృష్టి డేట్ డిస్ప్లే మీద పడింది. కుదరక కుదరక ఇవాళే ఈయన దగ్గర అపాయింటుమెంటు దొరికింది. రాక తప్పలేదు. అతను పరుగులాంటి నడకతో మెట్లు దిగాడు. కార్ డ్రైవర్ కింద గేట్ వద్దనే వేచి ఉన్నాడు. అతను కార్ ఎక్కి, కూర్చున్నాడు. కార్ లో ఊరు చేరేసరికి కనీసం మూడు గంటలు పడుతుంది. ఈలోపు అమ్మావాళ్ళు కూడ ఊరు చేరిపోతారు. అతను అంతసేపూ క్లినిక్ లో డాక్టరుతో మాట్లాడుతుంటాడు కదా అని సెల్ నిశ్శబ్దంగ పెట్టుకున్నాడు. దాన్ని తీసి ఎవరైనా ఫోను చేశారా అని చూశాడు. పది మిస్ కాల్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్న చేశారు.. ఎందుకో, అనుకుంటూ అతను వెంటనే ఆయనకు కాల్ కలిపాడు. వాళ్ళిద్దరూ ఆ పూటకు రాలేకపోతున్నామని, దారిలో ఏదో రైలు ప్రమాదం జరిగి ఆ రూటులో రైళ్ళన్నీ కాన్సిలైనాయని ఆయన కంగారుగ చెప్పాడు. సరే, ఫరవాలేదు. అన్నాడతను. "ఈ రోజు అమావాస్య.. ధరిత్రి జాగ్రత్త" అంది వాళ్ళ అమ్మ. "సరే సరే" అని ఇంక ఎక్కువ మాట్లాడే మూడ్ లేక అతను పెట్టేశాడు. సిగ్నల్ దగ్గర ఆగిఉన్న కార్ కిటికీలోనుంచి అటూ ఇటూ గమనిస్తూంటే ఎవరో పిచ్చివాడు అదే పనిగ తన వంకే చూడటం అతనికి కనిపించింది. విమర్శ్ కి గుండె ఝల్లుమంది. ఈరోజు అమావాస్యా..?!!

No comments:

Post a Comment