కానీ ఎవరెన్నింట్లో తలమునకలుగా అయినా
కర్తవ్యాలు విస్మరించలేరు కదా. అనుకున్న ప్రకారం వివాహానికి గడువు తీరబోతుండగ,
అమ్మా నాన్నా సంబంధాల వేట ప్రారంభించారు. నేను కాదూ అనలేదు, సరేననీ అనలేదు. ‘వచ్చి, కుదిరి అయినప్పుడు
చూద్దాంలే’ అన్నట్టు నా పరిశోధన పనులు చూసుకుంటూ ఉండిపోయాను. అదే సరైన పద్ధతి. ముందే ఎందుకు ఆరాటపడటం? దైవానుగ్రహం ఉంటే నా సంగీతానికి ఆదరణ లభించే కుటుంబం దొరక్కపోదులే అని ఒక ఆశ.
నా ఆశకు తగినట్టే వచ్చిన మూడు సంబంధాలూ నా
సంగీతసాధనకు ఆటంకం కానివే!
మొదటి సంబంధం ఆరునెలల క్రితం వచ్చింది.
అబ్బాయికి బిజినెస్ ఉంది. బాగా సంపన్నులు. ఇద్దరే అబ్బాయిలు. పెద్ద అతనికి పెళ్ళి
అయిపోయింది. పాప. ఇతను రెండవవాడు. బ్యూరోలో తెలిసినవారి ద్వారా వచ్చిన సంబంధం. అది
హసిత నాకు రాకుండా చేయటమే కాక వాళ్ళ పిన్ని కూతురుకు కుదిరించుకుంది. ఆ అమ్మాయి
నాకు తెలుసు. హసిత ఇంట్లోనే పరిచయం. ఆ పెళ్ళికి నెలరోజులలో ఒక ముహుర్తం కుదిరింది
అని కూడ తెలిసింది. రెండవ సంబంధం నాలుగునెలల రోజుల క్రితం బ్యూరో నుంచే వచ్చింది.
ఆ అబ్బాయి బ్యాంకు మేనేజరు. మంచి సంపాదన. స్థిరమైన మనిషి. ఇద్దరు ఆడపిల్లలకు ఒకే
ఒక తమ్ముడు. తల్లితండ్రులు పోతే అక్కలే అతని బాగోగులు చూసుకుంటున్నారు. అతనికి
నేను బాగా నచ్చాను. వాళ్ళయితే తాంబూలాలు పుచ్చుకునే వెళ్ళారు. అయినా హసిత అతనిని
నాకు చెడగొట్టి వాళ్ళ పక్కింటి అమ్మాయికి కుదుర్చుకుందని తెలిసింది. నాకు ఆశ్చర్యం
వేసింది. మూడవ సంబంధం మూడునెలల క్రితం వచ్చింది. అబ్బాయి మంచి గాయకుడు. సినిమాల్లో
కూడ పాడతాడు. సొంత మ్యూజిక్ కంపెనీ ఉంది. హసిత నిర్మొహమాటంగ అతనిని తనకే
కుదుర్చుకుంది. తన పెళ్ళి ముహుర్తం కూడ పెట్టేసుకున్నారు.
ఎంతైనా హసిత మొదటి నుంచీ
అదృష్టవంతురాలు. ఆమె ఆడింది ఆట, పాడింది పాట. ఇష్టమైన చోట పెళ్ళి చేసుకుంటోంది.
అందుకు తల్లిదండ్రులు కూడ ఒప్పుకున్నారు. కానీ హసితే నాకు రాకుండ ఈ సంబంధం
చెడగొట్టిందని ప్రత్యక్షంగ తెలిశాక ఆమెను బాగా తిట్టారు. కానీ ఏం లాభం..? ఆమె
చేసుకుంటే అతనినే చేసుకుంటానని కూర్చుంది. చేసేది లేక ఏర్పాట్లు చేశారు వాళ్ళు.
పాతికేళ్ళ స్నేహబంధం మా కుటుంబాలది. ఆ అమ్మాయి చేసిన పని వల్ల ఎక్కడ
విరిగిపోతుందోనని భయపడ్డారు. కానీ అటువంటిదేం లేదని నాన్న ఆయనకు, అమ్మ ఆమెకూ
విశ్వాసంగ చెప్పారు. ఏదో చిన్నతనం.. వదిలేయమన్నారు.
సరే, పోనీలే! తన
పెళ్ళి కుదిరింది! ఒకే వృత్తి వాళ్ళు కనక ఇద్దరికీ పరస్పర అవగాహన ఉంటుంది!’ అని
నాకు నేను చెప్పుకుని సమాధానపడ్డాను. చివరకు అనవసర ఆలోచనలు కట్టిపెట్టి మనసును
కుదుటపరుచుకున్నాను.
హసిత పిన్ని కూతురి పెళ్ళిలో
కలిసినప్పుడు అదే మాట చెప్తే హసిత ముక్తసరిగా థాంక్స్ చెప్పి ఊరుకుంది. సరే, నా సంబంధం కోసం వచ్చి వేరొకచోట పెళ్ళి చేసుకుంటున్న ఆ అబ్బాయి ఎదుటపడటం
ఇష్టంలేక ఎక్కువసేపు ఉండలేక వచ్చేశాను. నాకు కుదరాల్సిన అతన్ని ఎందుకు
చెడగొట్టావని నిలదీయాలని కూడ నాకు ఆ క్షణం అనిపించలేదు. ఏదో యోగం బాలేదని
సరిపెట్టుకున్నాను.
తర్వాత కొన్నాళ్ళకు హసిత పక్కింటి
అమ్మాయి పెళ్ళి కూడా ఘనంగా జరిగింది. పక్కవీథులే కనక పిలిచినందుకు వెళ్ళక
తప్పలేదు. అక్కడ మాత్రం అమ్మానాన్నాలకు కాస్త అవమానకర సన్నివేశాలు ఎదురైనాయి.
ఒకరిద్దరు ముఖం మీదే అడిగేశారు. ఇంకొందరు "ఋతకు వచ్చిన సంబంధాలన్నీ ఎందుకు
చెడిపోతున్నాయట?" అని చెంపలు నొక్కుకున్నారు. ఇదంతా హసితే చేస్తోందని
చెప్పుకోవటం ఇష్టం లేక మా ఇంట్లోవారంతా మౌనంగా ఉండిపోయారు. నాకు ఆమె స్నేహం పై
గౌరవం ఎటువంటిదో వారికి తెలుసు కనక ఆ విషయాన్ని అంతటితో వదిలేశారు. గ్రహచారం
బాగుంటే తమ కూతురికీ మంచి సంబంధం ఏదో ఓ రోజుకు రాకపోదు! అని ఊరుకున్నారు.
చివరకు హసిత పెళ్ళి రోజు కూడ వచ్చింది.
అప్పటికి బాగా మనసు విరిగి ఉండటంతో అమ్మావాళ్ళు ఆమె పెళ్ళికి వెళ్ళకుండ వేరే
బంధువుల ఇంట్లో అదే రోజు వివాహం ఉంటే అటు వెళ్ళిపోయారు. నేను మాత్రం మామూలుగానే
వెళ్ళాను. కాసేపటి కోసమైనా కనిపించి రాకపోతే హసిత ఇంట్లోవాళ్ళు బాధపడతారు. ఆమె
అనుకుందో లేదో తెలియదు కానీ నేను ఎప్పుడూ హసితను నా సన్నిహిత స్నేహితురాలిగానే
భావించాను. నా స్నేహాన్ని నేనే గౌరవించుకోకపోతే ఎట్ల..? మళ్ళీ బయటివారంతా
జంటకవుల్లా తిరిగిన పిల్లలు పెళ్ళిళ్ళకు పోకపోవటమేంటో అని అనుమానించే అవకాశం
ఇవ్వద్దనిపించింది. సరే, మాంగళ్యధారణ అయ్యాక
కానుక ఇచ్చేసి వచ్చేద్దామని మండపంలోకి వెళ్ళాను. అక్కడ పెళ్ళికొడుకు అమ్మానాన్న
ఉన్నారు. నేను అక్కడ ఉండటం వాళ్ళు చూడలేదు. పక్కనే సంగీతం టీచరు ఉంది. వేరెవరో
కానుక ఇవ్వటానికి వస్తే వారికి టీచరును పరిచయం చేస్తూ, "ఈ సంబంధం ఈవిడే చెప్పారు. వీరి శిష్యురాలే మా కోడలు. ఇంకో
పిల్లను చెప్పారు కానీ అదంత మంచి సంబంధం కాదని మానుకున్నాం!" అంటున్నారు.
"అంటే?ఎట్లా?"
"ఏముంది.. ప్రేమకలాపాలుట..!"
ఇంక నాకు ఆ మాట వినంగనే తల
కొట్టేసినట్టయింది. కష్టంమీద హసితకు కానుక చేతికిచ్చి గబుక్కున అక్కడి నుంచి
బయటపడ్డాను. కంటినిండా కన్నీరు నిండివచ్చింది. ఇంటికి వెళ్ళి ఒంటరిగా కూర్చుని
ఆలోచించాను. పెళ్ళిలో ఏమీ తినలేదు. ఇంట్లో కూడా తినాలనిపించలేదు. ఇంట్లో ఎవరూ
లేకపోవటంతో అట్లాగే ఆలోచిస్తూ కూర్చుండిపోయాను.
బాధ ఏంటంటే ఈ లోకంలో ఆడపిల్ల ఎంత గొప్ప
ఇంటిదైనా, చదువుకున్నా, తెలివిగలదైనా పెళ్ళి కావటం కష్టం. కట్నాలకు కొదువ
చేయకపోయినా కానీ నా జాతక దోషాల వల్ల సంబంధం కుదరటమే కష్టంగ ఉంది. నాన్న ఎంతో
ప్రయాసలు పడి ఈ మూడు సంబంధాలు తెచ్చారు. ఇప్పటికే దోషనివారణలని, ఏవేవో పూజలని,
వ్రతాలని ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన వాటిలో ఏది కుదిరనా నాకు సంతోషమే కలగేది!
"ఇద్దరం కలిసి సంగీతం
నేర్చుకున్నాం కనక కలిసి అవకాశాలు వచ్చాయి. కలిసి స్టేజుల మీద పాడదాం.." అంటే
నేను కుదరదని చెప్పాను. కనీసం తన గానసంధ్య కార్యక్రమాలకు, సన్మానాలకు రమ్మంటే ఆ
ప్రపంచం అంటే ఇష్టంలేక రానన్నాను. ఒకసారి అమ్మవారిగుడిలో శ్యామశాస్త్రి కీర్తనల
కార్యక్రమం ఏర్పాటు చేస్తే వెళ్ళి పాడుతుంటే విన్నది. "నలుగురిలో ఎక్కడా
పాడనన్నావుగా- ఇప్పుడిక్కడ ఎందుకు పాడుతున్నావు?" అనడిగింది వెక్కిరింతగ.
స్టేజిలెక్కి సినిమాపాటలు పాడటానికి, పవిత్రమైన గుడిలో అమ్మవారి సన్నిధిలో గాన
కైంకర్యం చేయటానికి తేడా లేదా? మనసులో అనుకున్నాను నేను. కానీ గొడవ పెంచటం ఇష్టం
లేక ఏమీ మాట్లాడకపోతే, "చెప్పేదొకటి చేసేదొకటి.." అనేసింది.
"దీనికి నాకేమీ పారితోషికం ఇచ్చి, సన్మానాలు చేసి, బిరుదులివ్వరులే.."
అన్నాను నేను. ఆ మాట ఆమెకు తగిలినట్టుంది. అంతే! దానికి ఇది పర్యవసానమా..?
"ఏంటమ్మా.. సంధ్యాసమయం దాటి చీకటి
పడింది. ఇంట్లో దీపమైనా లేకుండ.. ఒక్కదానివి కూర్చుని ఆలోచిస్తున్నావు..?"
బంధువుల పెళ్ళి నుంచి తిరిగి వచ్చిన తాతగారు అడిగేదాక నాకు పరిసరాల స్పృహ లేదు.
అమ్మ గబగబా ఇంట్లో లైట్లు వేస్తూ, ఏమైంది అని అడిగినా నేను ఏం చెప్పలేకపోయాను.
కళ్ళు తుడుచుకుని, నా మనసులో ‘ఏంలేదు..
పాత్రత లేని మనిషికి స్నేహం అందిస్తే వచ్చిన ఫలితం..’ అనుకుని ఊరుకున్నాను.
ఏదేమైనా, హసిత పెళ్ళిలో జరిగిన ఆ సంఘటన
నేను చెప్పకపోయినా సంగీతం టీచర్ నోట వినటంతో వారికి రూఢిగా అర్థమైపోయింది- నా పేరు
పాడైనట్టేనని. దానితో అమ్మావాళ్ళు
చాలా దిగులు చెందారు. బాగా కలత పట్టుకుంది వాళ్ళకు. "ఛీ! ఇదంతా చేసిన హసిత
హసిత కాదు అసిత! ఛి! దాని మనసంతా నలుపే!!!" అనుకున్నారు కసితీరా. కూతురి
తప్పేం లేదని వారికి ఒకపక్క ఉన్నా, జరిగిన సంఘటనల
పర్యవసానంగా చూచాయగ ఒకటిరెండు సార్లు విశ్రుత్ తో ఆమె అంత చనువుగా ఉండాల్సింది కాదేమోననే
అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను వారి భావం అర్థమై మౌనంగా ఊరుకున్నాను. అది ఒక
ప్రతిక్రియగా అంటున్న మాటే కానీ పరమార్థం కాదని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ
సమస్యకు పరిష్కారమేంటి?
"ఏమో- అది కాలానికే
తెలియాలి." అనుకుని నేను ఆ ఆలోచనలను మాని నా పరిశోధన మీద ధ్యాస పెట్టాను.
ఇదంతా జరిగి నెలరోజులైంది. ఒకవైపు పరిశోధన స్నేహం గురించి, దాని పద్ధతుల గురించి,
కూడా సాగింది. లోకంలో సంబంధ బాంధవ్యాలు, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, వాటి తీరు
తెన్నుల గురించి మనసు అన్వేషణ సాగిస్తూ ఉండిపోయింది. చాలా విషయాలు అర్థమైనాయి.
మనుషులు, వారి మాటలు భావాల మధ్య అగాధాలు, బంధాన్ని శాసించే వయసు, పరిస్థితులు,
అవసరాలు; మనిషి స్వార్థాన్ని బట్టి కలిసి విరిగే బంధాలు, ఇట్ల ఎన్నెన్నో ఆలోచనలు
తెరలు తెరలుగా కలిగి పోతుండేవి.
అప్పుడు తాతగారు చెప్పిన ఆ వాక్యాలు
నాకెంతో ఊరటనిచ్చాయి. నేరాలు తోచినంత మాత్రాన నేరాలుండాలని లేదు. అది అవతలివారు
తీసుకోవటాన్ని బట్టి కూడ ఉంటుంది. ఆ భావన చిత్తంలో స్థిరంగ నిలకడగా కలిగాక నేను
నిశ్చింతగ ఉండటం ఆరంభించాను.
***
సరిగ్గ ఇది జరిగిన నెలరోజులకు - ఇంక
సంబంధాలు వెతికే ప్రయత్నం చేయాలో లేక అవి ఎట్లాగూ చెడేవే కనక మానేయాలో తెలియని అయోమయంలో
అమ్మావాళ్ళు ఉండంగ ఒకరోజు అకస్మాత్తుగా, దాదాపు విడిపోయిన తర్వాత రెండేళ్ళకు, గాలి
లోంచి ఊడి పడినవాడిలా విశ్రుత్ వచ్చాడు ఇంటికి.. అతను కనిపించినందుకు ఆనందపడాలో
లేక అతనితో కలిపి పాడైన పేరు మరింత కళంకితం కాబోతోందని బాధపడాలో నాకు తెలియలేదు.
పలకరింపులయ్యాక అతను నేరుగా విషయానికి వచ్చాడు. నన్ను పెళ్ళి చేసుకోవటం తనకు
ఇష్టమని, వారికి అభ్యంతరం లేకపోతే, నాకూ ఇష్టమే అయితే ఇక
ముహుర్తాలు పెట్టుకోవచ్చని, అంతా సుముఖమే అయితే
అతని తల్లిదండ్రులు కూడా వచ్చి కలిసి మాట్లాడటానికి సిద్ధంగనే ఉన్నారని చెప్పాడు.
అది విని అంతా ఆశ్చర్యపోయారు.
ఇన్నాళ్ళకొచ్చి ఈ ప్రస్తావన పెట్టటంలో
అతని ఉద్దేశం కనుక్కోవాలనిపించింది వారికి. కనక - ’లేదు నాకు సంబంధం
కుదిరిపోయేటట్టు ఉందని చెప్పారు.
అప్పుడు విశ్రుత్ అపరాధిలా నవ్వి, తన పేరు నా పేరు కలిపి పాడైన సంగతి, అది
ఉపయోగించి హసిత సంబంధాలు చెడిపిన సంగతి, నా అయోమయ
పరిస్థితీ తనకు తెలుసునని చెప్పాడు. మళ్ళీ ఆశ్చర్యపోవటమే మిగిలింది మావాళ్ళకు.
అప్పుడే హసిత, వాళ్ళ అమ్మా నాన్నా తో కలిసి వచ్చింది అక్కడకు.
జరిగిందంతా ఆమె వివరించాక మాత్రం అంతా
తేలికగా ఊపిరి పీల్చుకున్నారు.
విశ్రుత్ ని మొదటిసారి చూసినప్పుడే హసితకు
చాలా నచ్చాడు. నా పక్కన ఈడు జోడుగా బాగున్నాడు అనుకుంది. నా ఆశయాలు కూడా అతనితో
సరిపోతున్నాయి. నేను ఒకమాట అనుకునేదాన్ని- అదేమంటే - ఏదైనా ఒక లక్ష్యం ఉండి, ఒక మహోద్దేశానికి పాటు పడేవాడి కోసం జీవితాంతం వండీ పెట్టీ, వెట్టి చాకిరి చేసినా ఒక పుణ్యం పురుషార్థం. చేరేందుకు ఏమీ గమ్యం లేని
సామాన్యుల ఖాళీ జీవితంలోని బరువును మోస్తూ బ్రతుకంతా కాల్చుకోవటం నా చేతకాదని! ఏదో
పెళ్ళనేది ఉంది కాబట్టి చేసుకోవటం ఆ తర్వాత పిల్లలు, వారి
పెంపకం తప్ప వేరే పని లేకుండా నిస్సారంగా గడపటం, జానెడు
పొట్టకోసం పాట్లు పడుతూ నెట్టుకురావటం నాకు ఇష్టంలేదని! ఒకసారెప్పుడో పొరపాట్న
హసితతో అన్నానట ఆ మాట..! నాకే గుర్తు లేదు.
కనక విశ్రుత్ అయితే నాకు సరిజోడు
అవుతాడని హసిత భావించింది. కానీ మా తల్లిదండ్రులు విశ్రుత్ ని అభిప్రాయం
తెలుసుకోబోతే అతనికి అటువంటి ఉద్దేశాలు లేకపోవటం- నా ద్వారా విని నిరాశపడింది.
ఎట్లయినా విశ్రుత్ ని నా కోసం ఒప్పించాలని అచార్యులగారి దగ్గర అతని వివరాలు
తీసుకుని మెయిల్ చేయటం ప్రారంభించింది. అతను సూటిగనే సమాధానం చెప్పాడు. వివహం తన
ఆశయాలకు అడ్డమవుతుందనే కానీ వేరే ఏమీ కాదని. ఎంత ప్రయత్నించినా అతని అభిప్రాయం
మార్చుకోలేదు. ఒకవైపు అతన్ని కదుపుతూనే ఉంది. మరొక వైపు నాకు సంబంధలు రావటం
ప్రారంభమైంది. మొదటి రెండు వచ్చింది బ్యూరో తరఫునే కనక అది ఎక్కడో ఏంటో తెల్సు కనక
సంబంధం వారికి ఫోన్లు చేసి నా మీద లేనిపోనివి కల్పించి చెప్పింది, తన అశయం అది కాకపోయినా. మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకుంటే కష్టమని తన పిన్నికూతురి
సంబంధం ఒకరికి, పక్కింటి అమ్మాయి సంబంధం ఒకరికి తనే
సూచించింది. దైవలీలగా రెండు కుదిరాయి. ఇక మూడవది సంగీతం టిచరు చెప్పింది - అతను
తనకు స్టుడియోల్లో ఎప్పుడు కలుస్తుంటాడు. కనక పరిచితుడే! హసితకు అతని మీద కాస్త
సదభిప్రాయం కూడా ఉంది. నా మీద చెడుగా చెప్పేసరికి ఆ మాత్రం చనువిచ్చినందుకే,
"పోనీ అయితే మీకు నేను నచ్చితే మనమే పెళ్ళి చేసుకోవచ్చు కదా!" అనేశాడు.
సరేనంది ఇంట్లో కూడా అడిగి. అట్ల తన పెళ్ళయింది.
"బిజినెస్ వాళ్ళ జీవితం డబ్బు
చుట్టూ తిరుగుతుంది. బ్యాంకువాళ్ళ జీవితం స్తబ్ధంగ నిస్సారంగా చేవ లేకుండా ఉంటుంది.
అందుకని మొదటి రెండూ చెడగొట్టాను. చివరి సంబంధం విషయంలో కూడ వృత్తి ఒకటే అయినా
దృక్పథాలు వేరు. అతని వంటి వారికి పేరు, గొప్పతనం, డబ్బుకు
ఉన్న ప్రాధాన్యం ఆశయానికి ఉండదు. వాళ్ళ కళ కేవలం వాటికి ఉపయోగించుకునేందుకే కానీ
ఒక గమ్యం, లక్ష్యం కాజాలదు. అటువంటి వ్యక్తి
నాకైతే ఫరవాలేదు. నీకైతే నువ్వు అ తాకిడికి తట్టుకోలేవు. పైగా అతనికి జెలసీ కూడా
ఉంది. నేనెట్లాగూ పెళ్ళాయ్యక ఈ స్టేజిలూ, పాటలూ మానేద్దమనే అనుకుంటున్నను. నాకు ఆ పెద్దగా కనిపించే వాటి వెనకున్న ఇరుకుదనం
అర్థమైంది. అందుకే ఆదారి మార్చాలని!
కానీ నువ్వట్లా కాదు. నీ చివరి శ్వాస
వరకు ప్రతిఫలాపేక్ష లేని ఒక గానాకాంక్ష నీలో ఉంటుంది. సంగీతానికి దూరంగా నువ్వు
జీవించలేవు. నీకొక ఆలంబన కావాలి. ఏదో ఓ అల్లాటప్పా తోడు కాదు! అది నాకు విశ్రుత్
లో పూర్తిగా కనిపించింది అందుకే ఇట్లా చేశాను. నిన్ను చాల బాధపెట్టి ఉంటాను.
మీరంతా కూడ నొచ్చుకునుంటారు. నన్ను దయ చేసి క్షమించండి." అంది హసిత.
"మరి చివరకు ఇతను ఎట్ల
ఒప్పుకున్నాడు?" అమ్మ అడిగింది.
విశ్రుత్‍కి నేను అంటే చాల ఇష్టం
ఏర్పడింది కానీ తన ఆశయానికి అడ్డమని భావించి ఆమెను పక్కకు ఉంచాడు. ఏమాత్రం సంపర్కం
పెట్టుకున్నా భావోద్రేకాలకు లోనయ్యే అవకాశం ఉందని, అప్పుడు తన
నిర్ణయం మారి తోటివారంతా తనను వెక్కిరించవచ్చని ఆలోచించుకుని నా జ్ఞాపకానికి కూడా
దూరంగా బ్రతికాడు. కనక్ హసిత మాటిమాటికి తనను ఒప్పించటనికి ప్రయత్నించటం చిరాకు
కలిగించింది. కానీ ఆమె నా మనసు లోతుల్లోని భావాలు, నా
అశయాలను బాగా వివరించి, అంతరంగ భూమిక అంతా
తేటతెల్లం చేసేసరికి ఈవిధంగ నాతో వివాహం తన ఆశయానికి ఆటంకం కాకపోగ సహాయకారి
కావచ్చనే ఆశ కలిగింది. అతనికి పైగా హసిత నా పెళ్ళి చెడగొట్టే ప్రయత్నాల గురించి
విని ఇంకా తప్పదనుకుని, తన జీవితకాల
దీక్షను విడిచి అనుకూల సహవసం చేసుకునేందుకు మంచి సహచరి లభిస్తుందనే ఆశా దృక్పథంతో
అడుగు కదిపాడు. హసిత ఏ భయం అక్కర్లేదని అభయం ఇవ్వటంతో ఈ ప్రయాణం ఇట్ల
పెట్టుకున్నాడు.
"అంత సులువుగ కూడా ఏం కాదు.
ఆచార్యులగారి దుంప తెంపి, తన గురించి నేను చెప్పిందంత నిజమా అబద్ధమా అని అరా తీసి,
సంగీతం టీచరు సలహా కూడా తీసుకున్నాకే కదిలాడులే" హసిత చెప్పింది. అతను
ఆశ్చర్యంగ నీకెట్ల తెలుసు అన్నట్టు చూస్తే "వాళ్ళు కలిసినప్పుడు
చెప్పారులే.." అంది హసిత.
నా వంక చూసి, "సో, అది కథ.."
అంది.
నేను ఆమెను గట్టిగ కౌగిలించుకుని
కన్నీరు పెట్టుకున్నాను. "నేను నిన్ను ఎంతో అపార్థం చేసుకున్నాను. నువ్వు నాకు
ఇంత మంచి తలపెట్టావు." అంది.
అప్పుడు హసిత ఏమీ మాట్లాడకపోయేసరికి ఆమె
అమ్మా నాన్నా- "ఊఁ.., మిగితాది కూడ చెప్పు." అన్నారు.
హసిత ఆమె చేతులు తీసేసి, "వద్దు,
నేను నీ ఆ ఆదరణకు తగను." అని ఆమె కళ్ళలోకి చూస్తూ, "నువ్వు మరోసారి
నాకన్నా గొప్పదానివని నిరూపించుకున్నావు." అంది.
హసిత ఆ మాట అంటుంటే కళ్ళలో నీరు
మెదిలింది. అది చూసి నాకు ఏమీ అర్థం కాలేదు. అమ్మ నాన్నా తాతగారూ ఆశ్చర్యంగ
చూశారు. విశ్రుత్ కూడ ఆశ్చర్యంగ చూశాడు.
"ఇంతమంది ముందర ఒప్పుకోవటానికి
కాస్త సిగ్గుగ అనిపిస్తున్నా చేసిన తప్పు చిన్నది కాదు కనక చెప్పేస్తున్నాను."
"చేయటానికి లేని సిగ్గు
చెప్పుకోవటానికి వచ్చిందా..?" అంది హసిత వాళ్ళమ్మ.
హసిత కన్నీరు తుడుచుకుంటూ, "నిజమే.
చేసేటప్పుడే ఉండాలి..! ఇంత మంచి స్నేహితురాలిని భగవంతుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగ
ఉండక ఆమె మనసు నొప్పించే పనులు చేసినందుకే ఉండాలి." అని ఆగి, "నేను
ఇవన్నీ నానోటితో చెప్పలేక వ్రాసి తెచ్చాను. నేను చదవలేను." అని నాకు ఇచ్చింది
చదవమని.
నేను అదేం వద్దన్నట్టు చూసి ఆ కాగితాలను
చించేయబోయాను.
వెంటనే విశ్రుత్ నన్ను వారించి, వాటిని
తీసుకుని, "నీ స్నేహితురాలిని మన్నించే హృదయం నీకు ఉందేమో..! కానీ జరిగింది
ఏంటో మాకు తెలియాలి- అనే ఆమె ఉద్దేశానికి న్యాయం చేయాలి కదా..!!" అని ఆ
కాగితాలు తెరిచి చదవటం మొదలుపెట్టాడు-
"ఋతకు తెలియనిది ఏంటంటే నాకు మొదటి
నుంచి తనను చూస్తే ఈర్ష్యనే. కలిసినట్టే ఉండేదాన్ని కానీ కలవలేకపోయేదాన్ని. తన
మంచితనం, సరళత్వం, సహజమైన చిరునవ్వు, సహాయగుణం, ఇంక కట్టుబాట్లలో కూడ సంతోషంగ
ఉండగలగటం.. ఇవన్నీ నాకు నిత్యం ఋత మీద ఒకరకమైన ఓర్వలేనితనాన్ని కలిగిస్తూనే
ఉండేవి. కానీ స్నేహితురాలు అనే ఒక్క మాట కోసం బయటపడకుండ జాగ్రత్త పడేదాన్ని. నేను
ఎంత నొప్పింపచేసినా ఋత ఎన్నడూ దాన్ని గంభీరమైన విషయంగ తీసుకోలేదు. నవ్వులో తీసేసేది.
అన్నింటికన్నా స్నేహానికే ఎక్కువ విలువనిచ్చేది. ఋతలో అహం కూడ శూన్యమే. స్నేహంలో
ఉండకూడనిదే అహం అనేది ఆమె సిద్ధాంతం.. కావాలని నేను తనను నలుగురిలో అవమానింపచూసిన
సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆమెకు నలుగురిలో మసలటం రాదని ఎన్నోసార్లు తనను ఎద్దేవన
చేశాను. అందరికీ అన్నీ రావు కదా అని తను అక్కడకూడ అహం తెచ్చుకునేది కాదు. సంగీతం
టీచరు ఏమైనా ఇద్దరికీ చెప్పాల్సినవి- అంటే క్లాసు లేదని కానీ, ఫలానా చోట ఆమె కచేరీ
ఉందని, రమ్మని కానీ నాకు ఒక్కదానికే చెప్పి ఋతకు కూడ చెప్పమంటే నేను చెప్పేదాన్ని
కాదు. నేను ఒక్కర్తినే వెళ్ళి వచ్చేదాన్ని. అది కూడ ఋత తప్పు పట్టకుండ ఆటగనే
తీసుకునేది. స్కూల్లో కాలేజిలో కూడ చదువులో మొదటి నలుగురిలో ఉండేది తను. నేను
మాత్రం పదిమంది లోపల ఉండేదాన్ని. ఎంత పోటీ పెట్టుకున్నా తనను అన్ని సంవత్సరాలలో
ఒక్కసారి కూడ గెలవలేకపోయాను. అసలు ఎప్పుడూ చదివినట్టే కనిపించదు. ఎప్పుడు కూర్చుని
చదివేదో తెలియదు. చుట్టాలు వచ్చి పోయినా, పరీక్షల ముందే ఒంట్లో బాగోకపోయినా, వాళ్ళ
అమ్మ ఊరుకు పోతే ఇంటి పని అంతా చూసుకుని కూడ పరీక్ష వ్రాసి తన స్థానం తాను
సంపాదించుకునేది.
ఋతకు ఆరోగ్యం గురించి తప్పించి అందం
గురించి శ్రద్ధ ఉండేదే కాదు. అయినా అందంగ ఉండేది. చిన్నతనం నుంచి అంతే. నేను ఎన్ని
రకాల ప్రయత్నాలు చేసినా ఆమెలాంటి మెరిసే చర్మం వచ్చేది కాదు. అడిగితే నవ్వి,
"నా బొంద, అసలు పనులకే తీరిక చావదు. ఇంక సౌందర్యపోషణలేం చేసేది?" అని
నవ్వేది. "ఎన్ని చేసినా ఒకరోజుకు ఈ మట్టి ముద్ద (శరీరం) ఇక్కడ వదిలిపెట్టి
పోయేదే కదా.." అనేది. ఆమెకు ఆ అశ్రద్ధ ఇంకా అందాన్ని తెచ్చిపెట్టేది.
అబ్బాయిలూ, అమ్మాయిలూ అందరూ ఆమె వంక ఒకరకమైన ఆరాధనాభావంతో చూడటం నాకు ఎప్పుడూ
కంటకంగనే ఉండేది. టీచర్లు కూడ ఎప్పుడు ఏం పని ఉన్నా- ఏదైనా వ్రాసి పెట్టాలన్నా,
గ్రంథాలయంలో నుంచి పుస్తకాలు కావాలన్నా, చిన్నపిల్లల ప్రోగ్రెస్ కార్డులలో టోటల్సు
వేయాలన్నా ఆమెనే పిలిచి అప్పచెప్పేవారు. బాధ్యతగ చేస్తుందని వారికి నమ్మకం. ఋత నా
సహాయం కోరేది. కానీ వారే నేరుగ నన్నెందుకు పిలవరో నాకు తెలిసేది కాదు. కానీ ఆ
పనిలో బరువు తెలిశాక పిలవనందుకు సంతోషపడేదాన్ని. ఋత మాత్రం ఒంటి చేతి మీదే అయినా
ఎంత పనైనా పగలూ రాత్రి కూర్చుని పూర్తి చేసే వేళకు తిరిగి ఇచ్చేసేది. స్కూలు
ఫంక్షన్లకు డెకరేషన్ కార్యక్రమం కావచ్చు, గుడిలో భజన, పూజలకు అలంకరణలు కావచ్చు,
వారి ఇంట్లో ఏదైనా వ్రతం, నోములకు ఏర్పాట్లు కావచ్చు- ఋత చకచక కావాల్సినవి కొని తేవటం,
లిస్టులు చేసి కొని తెచ్చి వాటిని ఒక క్రమంలో అమర్చటం, పూర్తి అయ్యేవరకు
అస్తవ్యస్తత లేకుండ ముందు వెనకలు కాకుండ జాగ్రత్త పడటం.. ఇదంతా ఆమెకు వెన్నతో
పెట్టిన విద్య. ఎంత హాయిగ చేసేసేదంటే అసలు కంగారు కానీ బెరుకు కానీ, ఇది సరైనదో
కాదోనన్న భయం కానీ ఆమెను ఎన్నడూ బాధించేవి కావు. ఎవరైనా ఏమైనా పొగిడితే,
"మాది ఇదివరలో ఉమ్మడి కుటుంబం కదా. ఎన్నో ఫంక్షన్లు, పార్టీలు ఏర్పాట్లు చేసి
చేసి అలవాటైపోయింది.." అని వినయంగ అదేదో పెద్ద విషయమే కానట్టు చెప్పేది.
స్కూలు స్థాయి నుంచే ఆమెకు పోటీలకు
వెళ్ళగల సత్తా ఉన్నా ఇంట్లో వాళ్ళ తాతగారు ఒప్పకోరని ఎక్కడకూ వెళ్ళేది కాదు.
చినరకు తనకు ఇష్టమైన పాటలపోటీలకు కూడ పోయేది కాదు. పోలేనందుకు బాధ కూడ పడేది కాదు.
"నా మంచి కోసమే కదా పెద్దవాళ్ళు వద్దని చెప్పేది.." అనేసేది. సాధారణంగ పిల్లలు
పెద్దవాళ్ళు ఏది వద్దంటే అది చేయాలని ఉబలాటపడతారు. ఋతలో అది లేశమైనా ఉండేది కాదు.
నేను ఎంతో కష్టపడి పాటలల్లో మొదటి బహుమతి తెచ్చుకున్నా ఋత స్టేజి ఎక్కటానికి
ఒప్పుకుంటే ఎవ్వరికీ అవకాశమే ఉండదని అంతా చాటుగ అనుకునేవారు. పోటీలలో పాడకపోయినా
ఆమెను ఎవరైనా క్లాసు అమ్మాయిలు ఒంటరిగ ఉన్నప్పుడు అడిగితేనో, పేరంటాలలో హారతి
పాడమంటేనో, పిక్నిక్ లో సినిమా పాటలు పాడమంటేనో భేషజం లేకుండ పాడేసేది. నాకు అది
నచ్చేది కాదు. "మనం ఒక కళ ఉన్నప్పుడు అందరి ముందూ అట్ల
ప్రదర్శించకూడదు." అనేదాన్ని. "మరి పోటీలు ప్రదర్శనలు కాదా?" అని
అడిగేది తను. పాటలు, సంగీతమే కాదు, ఋత పద్యాలు కూడ బాగ పాడుతుంది. పాత సినిమాల్లో
ఉన్న మంచి తెలుగు పద్యాలు, నాటకాలలో ఉన్న పద్యాలు సంగ్రహించి ఉంచుకునేది.
ఎప్పుడైనా సంగీతం టీచరో, వేరెవరైనానో అడిగితే వాళ్ళ పిల్లలకు నేర్పేది. ఆమెకు
పోటీగ నేను చాటుగ ఎన్నో కీర్తనలు వేరే చోటి నుంచి నేర్చుకుని పాడుతుండేదాన్ని.
సంగీతం టీచరు అవి కూడ తన పిల్లలకు నేర్పించమని కోరేది. ఋత చాలా ఆశ్చర్యంగ
ఇదెప్పుడు నేర్చుకున్నావు అని అడిగితే నాకు చాలా గర్వంగ అనిపించేది. ఋతేమో ఏదైనా
దాచకుండ చేస్తుంది. నేను మాత్రం దాచే చేసేదాన్ని. అయినా ఋత బాధపడకపోవటం నన్ను
ఆశ్చర్యపరచేది. లేదా బాధపడినా చెప్పేది కాదో అనుకుంటే అది నాకు ఒక రకమైన తృప్తి.
అయినా ఋత దాన్ని తప్పు పట్టేది కాదు. "పాడినప్పుడు విన్నా కదా" అనేది.
అంతేకానీ తనేదో అన్యాయమైపోయినట్టు బాధపడేది కాదు. తను అందుకు ప్రతిగా ఈసారి
రహస్యంగ ఏదైనా నేర్చుకుని నా ముందు ప్రదర్శించాలని ఉబలాటపడేది కాదు. ఇంకా పైగా
ఎవరైనా తెలసినవారు సామూహిక పూజా కార్యక్రమాలు పెట్టుకుని ఆమెను పాడటానికి పిలిస్తే
మర్యాదగ కాదని చెప్పి, నా పేరు చెప్పటం అలవాటు చేసుకుంది. "నా స్నేహితురాలు
నా కన్నా చక్కగ పాడుతుంది.. ఈమధ్య ప్లేబాక్ పాడతోంది. ఎన్నో సినిమాలలో ఆమె పాటలు
వచ్చాయి. ఆమె గొంతు విన్నారంటే నేనెందుకూ పనికిరానంటారు.." అని గొప్పగ
చెప్పుకుని నన్ను పాడమని అర్థించి పంపేది. అట్ల ఆమె వల్ల నాకు దొరికిన అవకాశాలు
ఎన్నో. అయినా లోలోపల ఏదో బాధ.. తీరని వేదన.. ఋత వదులుకోవటం వల్లే నాకు ఇదంతా
దొరుకుతోందని న్యూనతా భావం...!!
ఋతతో నాకు వచ్చిన పెద్ద సమస్య
ఇంట్లోవారు అనునిరతం ఆమెను మెచ్చుకోవటం, ఆమె గుణగానాలు చేయటం. "ఋతను చూడు..
ఎంత చక్కగ ఇంటిపని చేస్తుందో.. ఋతను చూడు, ఎంత బాగ తన బట్టలు తనే కుట్టుకుంటుందో..
ఋత అయితే వాళ్ళ అమ్మ తోడు లేకపోయినా పిండివంటలు చేయగలదు, నీలాగ వందలు వేలు ఖర్చు
చేయదు, నీలాగ ఋతకు ఆభరణాల షోకులే లేవు. ఎప్పుడైనా ఎంత సింపుల్ గ ఉంటుందో.."
అని మాటిమాటికీ తను ఏది కొనుక్కున్నా, ఏది మాట్లాడినా, ఏ పని చేసినా- ఆమెతో ప్రతీ
దానిలో పోల్చి చూసేవారు తల్లిదండ్రులు. ‘ఋతను ఎందులోనైనా తక్కువ చూపించగలనా’ అని
నేను నిత్యం ఎదురు చూసేదాన్ని. సరే, అందుకు అవకాశం కాలేజి చదువు పూర్తైనాక
ప్లేబాక్ పాటలు పాడే అవకాశం రూపంలో దొరికింది. ముందు స్టేజి షోలు, తర్వాత ప్లేబాక్
గ్రూప్, తర్వాత సోలో, తర్వాత కార్యక్రమాల కంపీరింగ్- ఇప్పుడైతే నన్ను కొన్ని పాటల
కార్యక్రమాలకు జడ్జిగ కూడ పిలుస్తున్నారు. ఋత ఎట్లగూ ఇక్కడ పోటీకి రాదని నాకు బాగా
తెలుసు. అందుకే అక్కడ ఆమెను సాధ్యమైనంత తక్కువ చూపాలని ప్రయత్నించి సఫలమైనాను కూడ.
ఆ వేళల్లో ఋత ముఖం మీద కదలాడే బాధ నాకు చాలా సంతృప్తినిచ్చేది. కానీ అది తన
స్నేహాన్ని కోల్పోతున్నందుకు ఆమె పడే ఆవేదన అని ఊహించుకోలేకపోయాను.
నాకు మొదటి నుంచీ జీవితంలో దొరకబోయే
సహచరుడి గురించి రహస్యంగ చాలా కలలు ఉండేవి. ఋత దాని గురించి ఏమీ మాట్లాడేది కాదు.
"భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఎవరికి తెలుసు..? మనం ముందే అన్నీ ఇట్ల ఉండాలి
అని ఊహించుకుంటే వచ్చిన వ్యక్తిని మన ఊహతో బేరీజు వేసుకుని అసంతృప్తికి లోనవుతాము.
అందుకే అటువంటి పనులజోలికి పోకూడదు." అనేది. ఇట్ల ఉంటే బాగుండు అనుకుంటాం.
అంతేగానీ ఇట్లగే ఉండాలి అని ఆశించద్దు. అది ఆమె భావన. హఠాత్తుగ ఋత పక్కన విశ్రుత్
ని చూశాక మాత్రం నా మనసు ఎప్పటికన్నా ఎక్కువ ఈర్ష్యతో రగిలిపోయింది. చదువులో.
పనితనంలో, సంగీతంలో, చాకచక్యంలో ఋతే నాకన్నా ఎక్కువని తెలుసు కానీ చివరకు
జీవితభాగస్వామి విషయంలో కూడ ఆమెనే గెలవబోతోందని నా మనసు కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.
నాకు ఇంట్లో ఇచ్చిన స్వేచ్ఛ ఋతకు దొరికినదానికన్నా ఎక్కువే కానీ సంస్కారం ఆమెకు
అడ్డుగీత గీసింది. విశ్రుత్ లాంటి మనిషి నాకు ఋతకు పరిచయం అయినంతే సహజంగ ఎందుకు
పరిచయం కాడు..? అని లోలోపలే బాధపడ్డాను.. సరే, తీరా అతనితో సంబంధం కావట్లేదని
తెలిసి కాస్త కుదుటపడింది ప్రాణం.
అట్ల నా లోపలి భావాలు ఎవ్వరికీ
చెప్పుకోలేక, ఆమెకు దూరం కాలేక, ఆమె నాకన్నా గొప్పది అనే సత్యాన్ని అంగీకరించలేక
అవస్థ పడుతున్న తరుణంలో ఒకరోజు ఏదో పిల్లల కార్యక్రమంలో స్పీచ్ కోసం నెట్ లో
సంగీతం చరిత్ర, సంగీతకారుల గురించిన జీవన వివరాలు వెతుకుతంటే విశ్రుత్ వాళ్ళ
గానవిలాసం గ్రూపు వారిది వెబ్ సైట్ కనపడింది. అందులో ఎందరో దక్షిణాది, ఉత్తరాది
సంగీత సంప్రదాయాలతో పాటు ఎందరో భారతీయ సంగీతకారుల వివరాలు కనిపించేసరికి ఆశ్చర్యంగ
చదువుతూ వెబ్ సైట్ అంతా బ్రౌజ్ చేస్తూ ఉండిపోయాను. అందులో సంగీతం బాగా పాడటానికి,
గొంతు సమస్యలు రాకుండ స్వరాన్ని కాపాడుకోవటానికి, గమకాలు, ఇతర మెళుకువలు మెరుగు
చేసుకోవటానికి, ఎన్నో చిట్కాలు వ్రాశారు. వాటిలో శారీరకమైన జాగ్రత్తలతో పాటు
మానసికమైన ప్రవృత్తులు గమనించటం కూడ అనివార్యమని వ్రాశారు. అందులో ఒకటి- ధనం,
ప్రదర్శనల దృష్టితో పాడితే ఏం జరుగుతుందో చెప్పి, ఈర్ష్య గురించి కూడా వివరంగ
ఉంది. తోటివారిని చూసి ఈర్ష్య పడేవాడు ఎంత గొప్పగ పాడినా అందులో జీవం రాదని, ఆ
ఈర్ష్యాభావన ఎప్పటికైనా గొంతును, సంగీత ప్రతిభ వినాశనానికి కారణం అవుతుందని
వ్రాశారు. మనసులో రగిలే దుష్టభావాల ప్రభావం శరీరం మీద పడినట్టే గానం మీద
పడుతుందని, గాత్రం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం వల్ల అబ్బినది కనక పుణ్యాన్ని
నశింపచేసే ఏ దుష్ప్రభావాలైనా గానాన్ని కూడ ఎప్పుడో అప్పుడు నశింపచేస్తాయని ఉంది.
సంగీతాన్ని దేవతారాధనగా, ఒక ఉన్నతమైన భావంతో సాధనగా తీసుకోవాలే కానీ అందులో ఎక్కువ
తక్కువలు బేరీజులు పనికిరావుట.
నేను ఆ మాటలు చదివి మొట్ట మొదటిసారి
ఆత్మవివేచన చేసుకున్నాను. నాలో అప్పుడే ఆలోచన జాగృతమైంది. "నేను అసలు ఏం
చేస్తున్నాను..?" అని అనుశీలనం చేసుకున్నాను. నేను ఎంతో మధురంగ దివ్యంగ
పాడానని అంతా అంటున్నా లోపల ఏదో కలుక్కుమనే భావన ఎందుకు కలుగుతుందో, ఎన్నడూ నాకు
పెద్దలు చెప్పే ఆ ఆత్మానందం ఎందుకు కలగదో అప్పుడు నాకు పూర్తిగ తెలిసి వచ్చింది.
ఒకరిద్దరు పెద్దలు, "నీ పాట అద్భుతంగ ఉంది కానీ ఏదో లోపం ఉంది."
అన్నారు. అప్పుడు వారి వినికిడిలోనే లోపం ఉందని నాకు చాలా కోపం వచ్చింది కానీ
ఇప్పుడు ఆ లోపం ఏంటో నాకు పూర్తిగ కనిపించింది. ఏ కళాకారుడికైనా సాధన భావన తప్ప కళ
పట్ల వేరే ఏ దృక్పథం ఉన్నా చివరకు హృదయం అసంతృప్తితోనే నిండిపోతుందని అర్థమైంది. ఆ
రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయాను. ఎన్నో పొరలు మనసులో తెరుచుకున్నాయి. ఆ కన్నీటితో
నాలోని దుర్గుణాలన్నీ కొట్టుకుపోయాయి. మనస్పూర్తిగ ఋత మీద నాలో గూడుకట్టుకుని ఉన్న
అసూయను గుర్తించి అంగీకరించాను. ఋతలో ఉన్నది ఏంటో, నాలో లేనిది ఏంటో- నాకు
స్పష్టంగ తెలిసి వచ్చింది. ఋత ఆనందానికి వెనక రహస్యం కూడ తేటతెల్లమైంది. అంత మంచి
స్వభావం కల ఒక వ్యక్తి మనస్సును బాధపెడుతూ నేను మనశ్శాంతిగ ఎట్ల ఉండగలను..? ఒకరిని
తక్కువ చూపించటమే ధ్యేయంగ పెట్టుకున్న నా కళ్ళలో ఋత ఎట్ల గొప్పగ నిలబడగలుగుతంది..?
ఒకరి కళను అవమానించే నాలో కళ ఎక్కడ అభివృద్ధి చెందుతుంది..?
ఋత పట్ల పేరుకుపోయిన దుర్భావన అంతా పోయి
ఈ మనఃప్రక్షాళన పూర్తైన మరుక్షణం నాలో దాని స్థానే ఒక తటస్థభావన కలిగింది. తర్వాత
క్రమంగ నా పాటలో మాధుర్యం రావటం నేనే గమనించుకున్నాను. అక్కడి నుంచి పాడిన
ప్రతీపాటలో ఒక నిండు భావన ఉదయించటం నాలో నాకే తెలిసి ఒక ఆనందాతిరేకాన్ని కలిగించటం
మొదలుపెట్టింది. స్టూడియోలో జనాలు నన్ను కూడ అదే ఆరాధనాభావంతో చూడటం తెలిసి
సంతృప్తి పడింది. అప్పట్లో ఒకసారి ఎవరో కలిసి, చిన్నప్పుడు నేర్చుకున్న ఒక పాట
గుర్తు చేసి అది వచ్చా అని అడిగితే ఆ డైరీ కోసం నా వస్తువులన్నీ వెతికాను. అప్పుడు
ఆ డైరీతో పాటు నేను చాలా కాలంగ మర్చిపోయిన ఎన్నో తీపి జ్ఞాపకాలు కనిపించాయి.
ఆ డైరీలో చాలా పాటలు ఋత చేవ్రాలులో
వ్రాసి ఉంటాయి. ఎందుకుంటే సంగీతం టీచరు అవి చెప్పేటప్పుడు నాకు బద్ధకమై
వ్రాసేదాన్ని కాదు. అప్పుడు ఋత తన డైరీలో, నా డైరీలో తనే వ్రాసిపెట్టేది. ఆమెకు వ్రాయటమంటే
ఎంత ఇష్టమో. ఆ వస్తువులతో పాటు హసితకు ఇంకొక చిన్న పుస్తకం కనిపించింది. ఎప్పుడూ
పుట్టినరోజు అనంగనే ఋత ఏదో ఒక ఉపహారం ఇస్తుంది. ఒకసారి ఈ స్నేహకవితల సంగ్రహం
ఇచ్చింది. అవన్నీ ఆమె చేవ్రాలులో ఉన్నాయి. ఓపిగ్గా కూర్చుని అప్పుడప్పుడు దొరికిన
మంచి కొటేషన్లు, తను చదివే కథలలో దొరికిన మంచి వాక్యాలన్నీ తీసి అందంగ వ్రాసి
బహుకరించింది. ఋతకు స్నేహితురాలికోసం ఏదైనా సొంతంగ వ్రాయాలని చాలా ఉంటుందిట కానీ
ఎందుకో వ్రాయలేనే అని బాధపడుతుంది. అది ఎవరిలో లోపమో నాకు ఇంతకాలానికి అర్థమైంది.
ఏమో- నేనే కనక స్వచ్ఛమైన స్నేహం చేసి ఉంటే ఋతలో ఏదైనా వ్రాయగలిగే శక్తి వచ్చేదేమో.
పోనీ, తాను చెప్పదల్చుకున్న భావాలే వేరెవరో ఇంకా ఎంతో సున్నితంగ అందంగ చెప్పారు
కనక వాటినే తన భావాలుగ ప్రస్తుతించటం కూడ ఒకరకమైన అభివ్యక్తే కదా..! "ఇవన్నీ
నీకోసం వ్రాస్తూన్నంతసేపు నిన్నే తలచుకుంటూ వ్రాశాను తెల్సా.." అని
చెప్పింది. ఆమె మాటల వెనక భావాలలోని సౌందర్యం, వాటి సౌకుమార్యం నా పాషాణ హృదయం
ఎన్నడూ గుర్తించలేక పోయింది. ఆ అందమైన ముఖం వెనక మరింత అందమైన
స్నేహభావమాధుర్యాన్ని నేను మొదటిసారి అనుభూతి చెందాను, ఆ డైరీ భావాలను ఆమూలాగ్రం
చదువుతూ. అవి వ్రాయటం వెనక ఆమె పడిన శ్రమ ఎంతటిదో మొదటిసారి గుర్తించింది నా
మనస్సు.
ఆ రోజు తర్వాత నేను హాయిగ నిద్రపోయిన
రోజు లేదు. పెళ్ళి జరిగాక మనలో ఏదో అంశం తృప్తి చెందుతుంది. అన్వేషణ పూర్తై
జీవితానికి నిర్వచనం దొరికిన భావన కలుగుతుంది. ఇక వ్యాపార ప్రయోజనాల కోసం పాటలు
మానేసి స్కూలు పిల్లలకు సంగీతం టీచరుగా చేరాలని నిశ్చయించుకున్నాక నాలో ఒక
ప్రశాంతత ఏర్పడింది. అప్పుడు మనస్సులో నుంచి గతం స్పష్టంగ బహిర్గతమైంది. ఋతకోసం
నిజమైన స్నేహం పెల్లుబికే సంస్కారం ఏర్పడింది. ఒక అపరాధభావన నాలో కలిగింది.
ఋత లాంటి అద్భుతమైన వ్యక్తి నాకు
జీవితంలో పరిచయం ఉన్నారనేదే పెద్ద ఉత్సవంగ జరుపుకోవాల్సిన విషయం అనిపించింది. నేను
ఆ ఉత్సవాన్ని పోగొట్టుకున్నాననిపించింది. ఋత ఎదురుంగ వెళ్ళి ఈ మాట ఒప్పుకోవటానికి
ముఖం చెల్లదు. ఈలోపు విశ్రుత్ తో కాకుండ ఇంకొకరితో ఆమె సంబంధం జరుగుతోందన్న మాట
మరింత బాధించింది. ఋతకోసం కన్నా ఎక్కువగా విశ్రుత్ కోసం ఏదైనా చేయాలనే ఆవేశం నన్ను
ఆవహించింది. ఎందుకంటే నా కళ్ళు తెరిపించిన ఆ వెబ్ సైట్ అతని సంగీతం గ్రూప్ వారు
నిర్వహిస్తున్నదే. అతనికి మెయిల్స్ చేయటం ప్రారంభించాను. మొదట్లో
పట్టించుకోలేదతను. తర్వాత క్రమంగ వినటం మొదలైంది. ఋత గురించి నాకు తెలిసినంతగా
ఎవ్వరికీ తెలియదు. తన వల్ల రాగానురాగాలు రెండూ అనుభవించిన వ్యక్తిని నేను. ఆమె
వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను అతనికి పరిచయం చేస్తూ నేను వ్రాస్తున్న మెయిల్స్
అతనితోపాటు నా కళ్ళను కూడ తెరిపించాయి. ఋత ఈ భూమి మీద నివసిస్తున్న నడయాడే
అద్భుతం. విశ్రుత్ ఈ విషయం కష్టం మీద ఒప్పుకున్నాడు. ఎందుకంటే అతని అనవసర పట్టుదల
సడలి వాస్తవం ఒప్పుకునే సరికి నాలాగే అతనికీ సమయం పట్టింది.
'రాళ్ళను కరిగించగల సంగీతం ఆమె సొత్తు.
(దానికి కరిగిన నా గుండెయే ప్రత్యక్ష సాక్షి). పెద్దల కోసం కోరికలను కాల్చేయగల
సంయమనం ఆమె ఆస్తి. ఏ పనిలోనైనా రిథమ్ ని పట్టుకుని క్రమం ఏర్పరచగలిగే సామర్థ్యం
ఆమె ఆభరణం. శాంతం, అణుకువ ఆమె స్వభావం. ఋతలాంటి అమ్మాయిని పొందాలంటే పూర్వజన్మ
అదృష్టం కావాలి.' అని చివ్వరగ ఒకే మాటన్నాను. అతను దిగి వచ్చాడు. ఋతకోసం నేను
చేయగలిగిన సహాయం ఇదొక్కటే. మంచి జీవితసహచరుణ్ణి బహుకరించటం.. దీంతో నేను చేసిన
తప్పులన్నీ కడుగుకుపోతాయని నమ్ముతున్నాను. ఇదంతా వ్రాయటానికే నాలుగు
రోజులుపట్టింది. ఇది చదివి నన్ను ఋత తప్పక క్షమిస్తుందని ఆశ."
ఇది ఆ లేఖలో ఉన్న విషయం. అంతా విని నా
కళ్ళు చెమ్మగిల్లాయి. హసిత... హమ్మయ్య.. ఆమె కోసం నా ప్రతీక్ష ఇప్పటికి ఫలించింది.
ఆమె నాలో చూసిన నేరాలు నాలోవి కావని విని చాలా తేలికగా అనిపించింది. అసూయపై ఆమె
పొందిన జయం ఎంతో శ్లాఘనీయం. హసిత నిజంగ నా స్నేహితురాలైన ఈ క్షణాలు నాకెంతో
నిండుగా తోచాయి. నేను తనను గట్టిగ కౌగిలించుకున్నాను. 'నన్ను క్షమించవే..' అని తను
అడగబోతుంటే నేను తన పెదవులను మూసేశాను, ఇంకేమీ మాట్లాడవద్దని. నాకు నచ్చిందేంటంటే
మా స్నేహాన్ని మాకన్నా సీరియస్ గ తీసుకున్నారు హసిత వాళ్ళ అమ్మా నాన్నా. వాళ్ళు
పోరు పెట్టి తోయకపోతే హసిత ఎన్నటికీ ఇదంతా నాతో చెప్పేది కాదేమో. ఏదేమైనా తను ఇట్ల
తనలో మార్పు తెచ్చుకుని తన అహాన్ని కాక మా స్నేహాన్ని గెలిపించటం నాకెంతో ఆనందంగ
అనిపించింది.
"తాతగారూ, మా కూరిమి అర్థం లేనిది
కాదు. నేను అందులో చేసుకున్నది కాలంవృథా కాదు. చాలు. నాకు బ్రతికి ఉన్నంతకాలం ఆ
తృప్తి చాలు." అన్నాను కళ్ళు తుడుచుకుంటూ.
అప్పుడు విశ్రుత్, "మరి నా
సంగతి?" అన్నాడు.
దానికి తాతగారు నవ్వి, "మీరిద్దరూ
కలిసి చేయాల్సిన మహోన్నత కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానివ్వండి.. త్వరగా ఆ
మూడుముళ్ళూ పడితే నా చిన్న మనవరాలు పడిన తిప్పలు అర్థవంతమవుతాయి." అన్నారు.
హసిత వెంటనే ఆయన పాదాలను తాకి,
"నన్ను క్షమించండి తాతగారు.." అంది.
తాతగారు ఎప్పటిలా ఆమెను వాత్సల్యంతో
చూసి, "నా మనవరాళ్ళిరిద్దరూ స్నేహంగా ఉండాలి ఎప్పటిలాగే.." అని
దీవించారు.
"అందులో సందేహం లేదండి. ఇంక నుంచి
మేము నలుగురం సంగీత సేవకోసం ఉన్నాము.. మావారు కూడా సంగీతం స్కూలుకు పెట్టుబడి
పెట్టటానికి ఒప్పుకున్నారు.. ఆయనా మాతో చేరుతున్నారు.." అని సంతోషంగా చెప్పింది
హసిత.
నా కళ్ళ ఎదుట ఒక సుందరమైన స్వప్నం
రెక్కలు విప్పి ఆకాశంలో ఎగురుతూ శబ్దనాదాలుగా వినిపించింది. ఇక నేరాలేమీ లేని
కూరిమికి ఇది నాంది కాక మరేంటి?
No comments:
Post a Comment