4
"మనసు
ఒక విచిత్రమైన అంశం.. దాన్ని అంచనా వేయటం, ఇదమిత్థంగ దాని స్వరూప స్వభావాలు
చెప్పటం దాదాపు అసంభవం. ఈ సృష్టిలో ప్రకృతి, ప్రేమ, జీవితం, నిద్ర వంటి చాలా
వాటిలాగే మనసుకూ నిర్వచనం చెప్పటం కష్టం. మనసును గురించి చాలా మంది చాలా చెప్పినా
దాని వివరణ పూర్తి కాదు. కావాలనుకుంటే దాన్ని వివరించగలిగే ఒకే ఒక్కపదం- మాయల
దయ్యం..!"
ధరిత్రిని
నాలుగైదు రోజుల పాటు ఆమె సహజ పరిసరాలలో బాగా దగ్గరగ పరిశీలించాక, హిప్నాసిస్
ద్వారా ఆమె అంతరాలలోకి ప్రయాణించి ఆమె అధిచేతనను గమనించాక డా.చిద్విలాస్ చెప్పిన
మాట ఇది.
"అయితే
ఆమె సమస్యకు కారణం ఏంటంటారు..?" విమర్శ్, కేదార్, భార్గవ, కళ్యాణి అంతా
ఉన్నారక్కడ. అందరికీ ఆత్రం సమాధానం కోసం.
"మీ
దక్షిణం వైపు చింతచెట్టు మీద ఉన్న దయ్యం." అన్నాడు డా.చిద్విలాస్.
"ఒక
సైకియాట్రిస్టు తేల్చి చెప్పాల్సిన మాటేనా ఇది..?" భార్గవ లోలోపల
అనుకోవాల్సిన మాటను బాహాటంగ అనేశాడు. సైకియాట్రిస్టులంటే కేవలం డబ్బు కోసం
కాలక్షేపం చేయించి పంపే పరాన్నభుక్కుల వంటి వ్యక్తులని విశ్వసించే భార్గవకు ఆయన
ధరిత్రిని బాగు చేయగలడని ఏ కోశానా నమ్మకం లేదు.
"ఆ
అమ్మాయి నాతో చెప్పిన మాట అదే మరి.." అన్నాడాయన.
"వాళ్ళేం
చెబితే అది మనం నమ్మటమేనా..?" అన్నాడు భార్గవ.
"మన
లోపల జరిగే విషయాలు మనకు తప్ప వేరెవ్వరికీ తెలియటం అసంభవం. అవి మనం నమ్ముతామా లేదా
అనేది ముఖ్యం కాదు. ఆమె నమ్మింది. అది నిజం. అదే సమస్యామూలం." కేదార్ అన్నాడు
సాలోచనగా.
కల్యాణి
భర్త ఏదో అనబోతుంటే ఆయన వంక చూసి, ఆగమని సైగ చేసి, "అయితే ఇప్పుడు మమ్మల్ని
ఏం చేయమంటారు.?" అని అడిగింది.
"నేను
చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేస్తారా..? చేయకపోతే సమస్య తీరే మార్గమే
లేదు. నేను చెప్పి లాభం లేదు." అన్నాడు డా.చిద్విలాస్ చేసే ధైర్యం ఉందా అన్నట్టు
చూస్తూ.
"నేను
చేస్తాను. నిస్సంకోచంగ చెప్పండి. పిల్ల బాగుపడితే చాలు." అంది కల్యాణి.
"కనీసం
రెండు నెలలపాటు ఆమెను వేరే ప్రాంతంలో ఉంచండి. వేరే ఊళ్ళో, లేదా కనీసం వేరే
ఇంట్లో.. అక్కడ కొన్ని నియమాలు పాటిస్తే.."
"ధరిత్రిని
వేరే ఉంచగలిగే చోటు మా ఇల్లు తప్ప ఈ భూమి మీద లేదు." అన్నాడు భార్గవ మధ్యలోనే
ఖండనగా.
"అయితే
నాకు దత్తత ఇచ్చేయండి. నేను పెంచుకుంటాను. మా ఇంట్లో నా కూతురిగ ఉంటుంది. నాకూ
వేరే ఎవ్వరూ లేరు.. కనీసం నా భార్య కూడా ఈ మధ్య నాతో ఉండటం లేదు. స్వర్గానికి మకాం
మార్చింది.." అన్నాడు చిద్విలాస్.
అందరితోపాటు
భార్గవ కూడా కాస్త నవ్వి, "లేదు. ఆమె మా బాధ్యత. ఆమె ఆరోగ్యం కోసమే అయినా
సరే, ఎక్కడికీ పంపి ఉంచే సవాలే లేదు. ఆడపిల్లల విషయంలో నేనెవ్వరినీ నమ్మను."
అన్నాడు.
"అయితే
కొంతకాలం ఆమెకు తగ్గేవరకు మీరే అందరూ కలిసి వేరే ఇల్లు మారండి.."
"కుదరదు..
నేను ఈ ఇల్లు విడిచి ఉండలేను.."
"అయితే
పోనీ ఈ ఇంటిని ఆమెకు అనుకూలంగ కొత్తగ మార్చేయండి.. ఇవి మీరు చేయాల్సిన
మార్పులు.." అన్నాడు డా.చిద్విలాస్ వాళ్ళ చేతిలో ఒక కాగితం పెడుతూ.
భార్గవ
అదంతా చదివాడు- చెట్లు క్లియర్ చేయించాలి. కర్టెన్లు మార్చాలి. పెద్దల ఫోటోలు
తీసేయాలి. పాత నగిషీ ఉన్న అల్మారాలన్నీ మార్చాలి. గోడల మీద ఉన్న పాతకాలం
పెయింటింగ్ లు, అవసరానికి మించిన అద్దాలు, గోడగడియారం అన్నీ కొన్నాళ్ళకోసం అయినా
ఒక గదిలో పెట్టి ఆమెకు కనిపించకుండ చేయాలి.
"ఈ
ఇంట్లో పూచిక పుల్ల కూడ కదలదు. ఇది మా పూర్వీకుల ఇల్లు." భార్గవ తేల్చి చెప్పాడు
కాగితం మడిచి ఇస్తూ.
"మరి
స్కూలు కోసం రెనోవేట్ చేయిస్తున్నారని విన్నాను.." కేదార్ అన్నాడు
ఆశ్చర్యపోతూ.
"అది
ఇంకా ఆలోచన రూపంలో మాత్రమే ఉన్నది. కార్యరూపం దాల్చలేదు. ఏమో- ఉన్నదున్నట్టు కూడా
స్కూల్ గ మారుస్తామేమో తెలియదు."
అప్పుడు
కల్యాణి కల్పించుకుని, "పోనీ, వేరే ఏ మార్గమైనా ఉంటే చెప్పండి.. ఆయనకు ఈ
ఇంటిని మార్చటం ఇష్టం ఉండదు." అంది.
"అయితే
ఆమె బాగుపడే మార్గాంతరం లేదు. అనుభవించండి." డా.చిద్విలాస్ కోపంగ అన్నాడు.
దానికి
భార్గవ, వెక్కిరింతగా "ఇంత పెద్ద సైకియాట్రిస్టు దగ్గర మార్గాలివేనా..?
పాపం." అన్నాడు.
డా.చిద్విలాస్
నొచ్చుకున్నవాడిలా చూస్తే, కేదార్ ఆయనతో, "ఆయన అట్ల మాట్లాడటం సమంజసమే సార్.
అసలు ఏం జరిగిందో చెప్పరు. ఏం చేయాలన్నా కారణం తెలియాలి కదా. అది చెప్పనిది మీ
పద్ధతి మాకు ఎట్ల అర్థం అవుతుంది..?" అన్నాడు.
"నా
పద్ధతి నాకూ అర్థం కాదు. కానీ నూటికి నూరుపాళ్ళు ఫలితం చూపిస్తుందనే జనాలు నా
దగ్గరకు వస్తారు. మనసు అర్థం కాని వస్తువు. కనక పరిష్కారం కూడా అర్థం కాని వస్తువే
కావటంలో ఆశ్చర్యం లేదు. ఒప్పుకుంటారా.? చెప్పిన పరిష్కారం అప్లై చేసి తగ్గకపోతే
నన్ననండి. చేయకుండనే అనేస్తే ఎట్ల..?" డా.చిద్విలాస్ విసుక్కున్నాడు.
భార్గవ
మళ్ళీ ఏదో అనబోతే, "ఒక్కసారి తనకు తగ్గనివ్వండి. అప్పుడు ఏదైనా చెప్పండి.
నేను అన్నీ వింటాను. మాటిస్తున్నాను." అన్నాడు డా.చిద్విలాస్ ఓర్పు వహిస్తూ.
దానికి
సరేనని భార్గవ ఏమీ మాట్లాడలేదు. కానీ బాగా నొచ్చుకున్నాడని ఆయన ముఖం చూస్తే
తెలిసింది. భార్గవ ఇట్ల మాట్లాడతాడని విమర్శ్ ఆయనతో ముందే చెప్పి ఉంచటం వల్ల ఆయన ఆ
మాటలను పెద్దగ పట్టించుకోలేదు. ఇంక విమర్శ్ తండ్రి మనస్తత్వం తెలిసినవాడు కావడంతో,
"సర్, కొంచెమైనా వివరించనిదే ఎవరికైనా ఎట్ల అర్థమవుతుంది..?" అన్నాడు.
కల్యాణి
మాత్రం, "సమస్య మీకర్థమైంది కదా. చాలు. చెప్పింది చేయటానికి నాకేం అభ్యంతరం
లేదు. మీరేదంటే అదే చేద్దాం." అంది.
"వీలు
లేదు. నేను ఇల్లు మార్చను. ధరిత్రిని గడప దాటనివ్వను. సత్తా ఉంటే మార్గాంతరం
చెప్పమను. మనం చేయలేనివేవో చెప్పి వదిలించుకుందామనుకుంటున్నాడేమో. దీనికోసం కాదు
కదా, సైకియాట్రిస్టులకు వందలకు వందలు పోసేది..!"
"సరే,
అయితే, ఫైనలుగ చేసేదేంటో తర్వాత ఆలోచిద్దాం. దానికన్నా ముందు మీరు చేయాల్సిన ఇంకొక
పని- పున్ని అనే అమ్మాయిని ఇక్కడ పని మాన్పించి పంపేయటం.." డా.చిద్విలాస్
అన్నాడు సాలోచనగా.
"పున్నా..
అదేం చేసింది..?"
"ఈ
దయ్యం కథంతా అల్లింది పున్నే నాన్నా.." కేదార్ చెప్పాడు.
"నేను
హిప్నాసిస్ లో ధరిత్రి ఈ మాటను చెప్పటం స్పష్టంగ విన్నాను." విమర్శ్ అన్నాడు.
హిప్నాసిస్
జరిగేటప్పుడు ధరిత్రికోరిక మీద విమర్శ్ పక్కనే ఉండాల్సి వచ్చింది. కేదార్ డా.చిద్విలాస్
కి సహాయంగ ఉన్నాడు. కనక వారికి కూడా ఈ సమస్య పూర్వాపరాల గురించి డా.చిద్విలాస్ కి
తెలిసినంతా తెలుసు.., నిష్కర్ష తప్ప.
"దానికా
అవసరం ఏంటి..?" అనడిగాడు భార్గవ ఆశ్చర్యంగ.
"తాను
ఆశ పెట్టుకున్న సోమూ ధరిత్రి మీద చూపించిన ఆసక్తి..!" విమర్శ్ చెప్పాడు
క్లుప్తంగ. సోమూ పున్నికి వరసకు బావ అవుతాడు. పున్ని అతని మీద చాలా ఆశలు
పెట్టుకుంది. కానీ తమ ఊరికి వచ్చినప్పుడల్లా తన మీద ధ్యాస పెట్టాల్సిన బావ పరాయి
అమ్మాయి మీద ఎక్కువ ఆసక్తిని కనబరచటం పున్నికి గుచ్చుకుంది. దాంతో చింతచెట్టు
దయ్యం కథ అల్లి, ఇంకా చాలా చాలా భయానకమైన విషయాలు ధరిత్రి మనసులోకి చొప్పించింది.
స్వతహాగా అమాయకురాలైన, భయస్తురాలైన ధరిత్రి అది నమ్మేయటమే కాక దాని పరిణామాన్ని
ఎదుర్కోవటం కూడా మొదలుపెట్టింది.
"ఉత్త
మాటలకు అంత ప్రభావం ఉంటుందా..? నేను నమ్మలేకపోతున్నాను.." భార్గవ అన్నాడు.
"కథ
విన్నాక మీరు తేల్చుకోండి.." అన్నాడు డా.చిద్విలాస్ విమర్శ్ వంక, మిగిలింది
నువ్వు చెప్పు అన్నట్టు చూసి.
"పున్ని
ధరిత్రిని నమ్మించిన కథ స్థూలంగ ఇది-" విమర్శ్ వివరంగ చెప్పటం మొదలుపెట్టాడు-
"లోకానికి
వెలుగు ఆధారాలు రెండు- ఒకటి సూర్యుడు. ఒకటి చంద్రుడు. పగలు సూర్యుడు ఉన్నంతసేపు
చీకటి ఉండదు. రాత్రి చంద్రుడు ఉన్నంతవరకు చేతనైనంత వెలుగునిస్తాడు. శరీరంతో ఉన్న
మనకు వెలుగు శక్తి అయినట్టే, శరీరం లేని దయ్యాలకు చీకటి శక్తి. అమావాస్య రాత్రి
అనేది అటు సూర్యుడు ఇటు చంద్రుడు ఎవ్వరి రక్షా లోకానికి లేని సమయం. అవి ప్రకృతిలో
భాగాలే కనక ప్రకృతిలో జరిగే మార్పులు వాటిని ప్రభావితం చేస్తుంటాయి. రాత్రి సమయానికి
చంద్రుడితో సంబంధం ఉంది. చంద్రుడు పెరుగుతూ తరుగుతూ ఉంటాడు. ప్రతీ అమావాస్యకు
పూర్తిగ కనిపించటం మానేస్తాడు. అప్పుడు అంతా కటిక చీకటి నెలకొంటుంది. అది దయ్యాల
శక్తిని అనంతంగ పెంచేసే రోజు. అప్పుడు సరిగ్గ పన్నెండు గంటల నుంచి ఒంటిగంటన్నర
వరకు అవి అత్యధికమైన బలం కలిగి ఉంటాయి. అట్ల ఉన్నవేళ వాటిని మానవమాత్రుడెవరూ
ఎదిరించలేరు. చీకటిలో మనిషి అసహాయుడు. అదే దయ్యాలు రాత్రి పూట శక్తి కలిగి
ఉండటానికి కారణం. శవాల మీద పూజలు చేసే అఘోరీలు వాటిని రకరకాల పనులకోసం రప్పించి
వాడుకుంటారు. పని చేయిస్తారే కాని వాటిని ఆహారం పెట్టరు. అప్పుడవి ఆహారం కోసం
వెతుక్కుంటాయి. ఎక్కువగ అవి జీవించి ఉండంగ ఆశలు తీరని అతృప్త ఆత్మలు ఉంటాయి. వాటి
ఆహారం తనలాంటి ముందూ వెనకా ఎవరూ లేని ఆడపిల్లలు కూడా కావచ్చు. చెట్లు ఎక్కువగ ఉండే
చోట్లలో, నిర్జన ప్రాంతాలలో, పాతకాలం నాటి కట్టడాల దగ్గర, పాతకాలం వస్తువులను అంటిపెట్టుకుని
అవి ఎక్కువగా నివసిస్తాయి కనక వాటికి దగ్గరలో ఉండే ప్రాణులను పట్టుకోవటానికి అవి
ప్రయత్నిస్తాయి.
దయ్యాలకు
మనుషులతో రెండు రకాల అవసరాలుంటాయి. ఒకటి తీరని కోరికలు తీర్చుకోవటం, ఒకటి ఆకలి
తీర్చుకోవటం.
కోరిక
తీర్చుకోవటం కోసం దయ్యాలు అతి సులువుగ పట్టుబడే మనుషులు కోసం చూస్తాయి. వాటికి తమ
సొంత శరీరాలు ఉండవు కనక అవి మనుషులను తమ ఆశలు తీర్చుకునే సాధనాలుగ వాడుకుంటాయి.
యౌవనం జీవితంలో అన్నింటికన్నా ఎక్కువ ఆశలు రేగే వయసు. పిల్లలు, వృద్ధులు ఇద్దరి
శరీరాలకు కోరికలు తీర్చే శక్తి ఉండదు. అదే పడుచువారి శరీరం కోరికలెగిసిపడే వయసులో
దయ్యాల అనుభవం తీరటానికి అనువుగ ఉంటుంది.
మనుషులు
రెండు రకాలు- మగ, ఆడ. అందులో మగవారి శరీరం బలంగ, దృఢంగ ఉంటుంది. వారికి శారీరక
బలంతో పాటు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే అట్ల ఉండే వారి శరీరం దయ్యాలకు అనువైంది
కాదు. అప్పుడే ప్రాయంలోకి అడుగిడిన కన్నెపిల్లలు, కోమలంగ, నాజూకుగ, పూవుల్లా
బలహీనంగ ఉంటారు. దేనికీ ప్రతిఘటించలేరు. వారు తీగలవంటివారు. ఎవరైనా మగవారి ఆలంబన
ఉంటేనే అది వారిని బలవంతులుగ చేస్తుంది. ఆ మగవాడు తండ్రి కావచ్చు, భర్త కావచ్చు..
అట్ల ఏ ఆలంబన లేని వారు- అంటే ఇంకా పెళ్ళి కాని అమ్మాయిలు, తల్లిదండ్రులు లేనివారు
ఏ బలమూ లేకుండ ఉంటారు. అన్నింటికన్నా అనువైన ఈ పెళ్ళికాని, అనాథలైన కన్నెపిల్లలను
దయ్యాలు ఇష్టంగ ఆశ్రయిస్తాయి. గట్టిగ వదలకుండ పట్టుకుంటాయి. తమకు ఇష్టమైన పనులు
వారిచేత చేయిఁస్తాయి. అది పాపమే ఉంటుంది. వాటి మాట వినకపోతే అవి వారిని
హింసిస్తాయి. కొడతాయి. తిడతాయి. పొడుస్తాయి. రక్కుతాయి. తీవ్రంగ ఒత్తిడి చేస్తాయి.
మానసికంగ చిత్రవధ చేస్తాయి. అట్ల ఆనందిస్తాయి. అదే వాటి జీవనం. అవి ఆవహించిన
సమయంలో మనిషి నిస్సహాయుడైపోతాడు. అరుస్తాడు. పిచ్చి ఎక్కిపోతాడు.
ఇంక
రెండవది ఆహారం కోసం వాటికి ఉన్న మనిషి అవసరం. దానికోసం అవి ఏ రూపంలో అయినా
రావచ్చు. ఒక్కొక్కసారి ఎదటి మనిషి రూపంలో కూడా రావచ్చు. అట్ల వచ్చి మనలను
చంపేసేయచ్చు. వాటికి మాయాశక్తులుంటాయి కనక గుర్తుపట్టటం మన తరం కాదు. అవి ఎంత
శక్తిమంతమైనవంటే చంద్రుడిని కూడా తినేయగలవు. అందుకే అమావాస్య రోజు చంద్రుడు
ఉండడు."
"హాస్యాస్పదం.."
అన్నాడు భార్గవ.
"దారుణం."
అంది కల్యాణి. ఆమె కళ్ళన్నీ వెడల్పైనాయి. ఒక అమాయకురాలైన అమ్మాయి మీద ఈ మాటల
ప్రభావం ఆమె ఊహించగలదు.
"ఇప్పుడు
ధరిత్రి ప్రతిస్పందన చూద్దాం-" విమర్శ్ చెప్పుకుపోయాడు-
మన ఇల్లు
పాతకాలం నాటిది. రెనోవేషన్ కి సిద్ధంగ ఉన్నది. ఇంక కావాల్సినన్ని పురాతన
వస్తువులు, అక్కర్లేనన్ని చెట్లూ ఉన్నాయి. అవి చీకట్లో గాలికి ఊగుతుంటే చూడాలి
వాటి భీకరరూపం. రాత్రి స్తబ్ధతను చీల్చుకుంటూ మహాభీకరమైన శబ్దంతో మన గంటల గడియారం
మోగటం, గాలికి కర్టెన్లు విచిత్రంగ ఎరగటం.. ఇవన్నీ ధరిత్రి దృష్టితో చూస్తే ఎంత అదురు
కలిగిస్తాయో తెలుస్తుంది. చీకటి పడితే నిజంగ ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా స్తబ్ధంగ
ఉంటుంది. మానవమాత్రుడు ఇటు పక్కకు రాడు. సాధారణ జీవనంలో ఉండే మనకు మనసుల్లో ఏ
భయాలూ ఉండవు. భయం కలిగే వేళల దాకా మనం మెళుకువతో లేచి ఉండం కూడా. కానీ అదేదో కథలో
ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టటం ఇష్టం లేక, మా ఆయన ఎవరో ఒకరిని పిలిచి భోజనం
నెపంతో, బలి ఇస్తాడని నమ్మించిన భార్య లాగ, పున్ని ధరిత్రిని భయాలకు అనువుగా
చేసింది. ఇంక పండ్లు కోయటానికి తెచ్చిన కత్తిని చూసి, ఆ అతిథి తనను చంపటానికి
వచ్చాడన్న అపోహతో పారిపోయినట్టే ధరిత్రి మనసు తయారైపోయింది.
మన ఇంట్లో
ప్రతీ అమావాస్యకూ మీరు తర్పణం వదలటానికి శాస్త్రులుగారిని పిలుస్తారు. ఇంక
అమావాస్య అనే అద్దు ధరిత్రి సైక్ మీ అట్ల గట్టిగ పడిపోయింది. నాకోసం రాత్రిళ్ళు
బాగా పొద్దుపోయేదాకా లేచి ఉండాల్సిరావటం, ఒక్కర్తే కింద అంతస్తులో ఉండటం, ఎక్కువ
సమయం ఒంటరిగ గడపటం, అశిక్షితమైన ఆ మెదడులో లేనిపోని భయాలు మామలుగనే ఉండేవి. పై
నుంచి చేరినవాటి బరువుతో ఆమె కూరుకుపోయి ఉంది. మాటిమాటికీ ఎవరైనా అదే పనిగ చెప్పిన
అబద్ధం కూడ మన మీద నిజమేనేమో అన్న భ్రాంతిని కలిగిస్తుంది. పగలంతా హాయిగా తను వాటి
కిందే తిరుగుతుంది. రాత్రి కాంగనే అవి సడన్ గ ఆమెకోసం దయ్యాల ఇళ్ళైపోతున్నాయి.
అట్ల క్రమంగ సబ్ కాన్షియస్ లో గూడు కట్టుకున్న ఆ భయాలు ప్రతి అమావాస్యకు అటాక్స్
రూపంలో రావటం మొదలైనాయి. ఉత్పాతం సృష్టించాయి.
సరిగ్గ
పన్నెండింటికి ఆ పన్నెండు గంటలు కొట్టంగనే అది దయ్యం మేల్కొని బలం పొందే వేళ కింద
ఆమె మెదడు రెజిస్టరు చేసేసుకుంది. ఇంక ఏ మనిషి రూపంలోనైనా దయ్యం తన మీదకు రావచ్చు.
తనను ఆహారంగ చేసి తినేసేయచ్చు.. లేదా ఆవహించి తన చేత పాపాలు చేయించవచ్చు. తను
సహకరించనందువల్ల, ఒప్పుకోనందువల్ల చిత్రవధా చేయచ్చు. ఆ ట్రాంస్ లో ధరిత్రి తననెవరో
ఎత్తుకుపోవటానికరి ప్రయత్నిస్తున్నట్టూ, చంపేయాలని చూస్తున్నట్టూ, ముక్కలు
ముక్కలుగా నరుకుతున్నట్టు, కాలికింద పడేసి నలుపుతున్నట్టు ఊహించుకుని బాధ
అనుభవిస్తుంటుంది. అందుకే ఆ సమయంలో ఆమె మానవమాత్రుణ్ణి ఎవ్వరినీ దగ్గరకు
రానివ్వదు. చేతికి అందినవి విసిరి కొట్టి ఏ రూపంలోనైనా రాబోయే దయ్యాన్ని తాను
ఎదుర్కొంటుంది.
సాధారణంగ
ఇటువంటి విషయాల్లో ఏ వస్తువు లేకపోయినా మన కళ్ళకు, చెవులకు అవి ఉన్న భావన
కలుగుతుందిట. దాన్ని హాల్యుసినేషన్ అంటారు. ఎవరికీ కనిపించని ఒక అజ్ఞాత వ్యక్తి
కానీ, ఏదో ఆకారం కానీ, జంతువు కానీ తమకు హాని తలపెడుతున్నట్టు అపోహ పడేవాళ్ళు
చాలామంది ఉంటారట. కొందరు డబ్బున్నవాళ్ళు, ఆస్తికి వారసులు లేనివారు, ఒంటరి
ముసలివాళ్ళు తరుచూ ఇటువంటి అపోహలకు లోనవుతూ ఉంటారు. తన అభద్రతాభావం, భయం వల్ల
వాళ్ళు తమను చంపటానికి, తమ ఆస్తిని హరించటానికి వచ్చారని నమ్ముతారు. కొందరు దీనిని
మంచి అర్థంలో కూడా తీసుకుంటారు. అంటే ఆ కనిపించే వ్యక్తి తన స్నేహితుడని. తనకు
మంచి చేయాలని వచ్చారని తలుస్తారట. వారిలో స్నేహితులెవరూ లేరనే భావన అంత బలంగ
ఉంటుందట. ఒక్కొక్కసారి సేవానివృత్తులై ఒంటరిగ గడిపే మిలట్రీ వారికి ఈ తరహా అనుభవం
కలుగుతుంది.
అయితే
అవన్నీ ఒక నిర్దిష్టమైన దేశకాలాలలోనే వారికి కనిపించటం వినిపించటం జరుగుతుంది.
ధరిత్రికి అమావాస్య ఘడియలు దాటాక తాను చేసిన ఈ భీభత్సమంతటి గురించి ఏమీ
తెలియకపోవటానికి అదే కారణం. మిగిలిన వేళలో ఆమె అందరిలాంటి అమ్మాయే. ఆ సాధారణ
వేళల్లో ఈ భయాలన్నీ ఆమె మనసు పొరల్లో నిద్ర పోతుంటాయి. ఆక్టివేషన్ పీరియడ్ దాటితే
అవి వారికి గుర్తు కూడా ఉండవట. పైపెచ్చు తాము అట్ల ఆలోచిస్తారని ఎవరైనా చెప్పినా
నమ్మనివారు ఉంటారు. ఎందుకంటే మన అధిచేతన మనస్సు సాధారణ మనస్సుకు అందుబాటులో ఉండదు.
అది కేవలం కలల్లో అనుభూతమవుతుంది. మనం ఇష్టం లేని విషయాలను, వ్యక్తరూపంలో
ప్రకటించలేని భావాలను అధిచేతన మనసులో భద్రంగ పెట్టుకుంటుంటాం. తెలియకుండనే అవి
ఒక్కొక్కసారి పైకి తేలి కలల రూపంలో వస్తుంటాయి. అప్పుడే మనకు అనుమానం వస్తుంది-
నేను ఇట్ల ఆలోచిస్తానా అని. అటువంటివి రెగులర్ విషయాలు కావు. రిప్రెషన్ ఒకరకంగ ఎంత
వరమో, అంత శాపం కూడా. అట్లగే మన మనసుకే ఇవన్నీ ఈవిధంగ కల్పించే శక్తులన్నీ
ఉంటాయంటే నమ్మబుద్ధి కాదు. దీన్ని మనసు యొక్క చీకటి కోణం అని చెప్పచ్చు."
భార్గవ
కల్యాణి ధరిత్రి దృష్టి లోనుంచి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టారు
క్షణంకోసం. వారికి ఝల్లుమంది.
"అయితే
ఇప్పుడు మన దగ్గర ఏ పరిష్కారం లేదా..?"
డా.చిద్విలాస్
కుర్చీలో వెనక్క వాలుతూ, "ఉంది. ఎందుకు లేదు..? చింతచెట్టు మీది దయ్యాన్ని
వెళ్ళగొట్టాలి.." అన్నాడు.
"అసలే
లేని దయ్యం ఎట్ల పోతుంది..?" కళ్యాణి ఆశ్చర్యంగ అడిగింది.
"దయ్యం
పోవాల్సింది చింతచెట్టు మీది నుంచి కాదు.. ధరిత్రి మనసులోనుంచి.." కేదార్
అన్నాడు. "అయితే దానికి మార్గం ఏంటి..?" డా.చిద్విలాస్ వంక తిరిగి
అడిగాడు.
"ఇంట్లో
ఒక యాగం చేయించటం..! మీ బ్రాహ్మడితో ఒకసారి నన్ను కలిపించండి. అది ఏంటో ఎట్ల
చేయాలో నేను మాట్లాడతాను." అన్నాడు డా.చిద్విలాస్ కళ్యాణితో.
భార్గవ
నవ్వి, కేదార్ వంక చూసి, "చివరకు ఇది పరిష్కారం! మేము అదే చేయిస్తూంటే
వద్దని, కాదని ఇప్పుడు మళ్ళీ..." అని ఏదో అనబోయాడు.
కేదార్
దానికి నవ్వి, "లేదండి. సార్ సాధారణ పూజల గురించి చెప్పటం లేదు. మీరు పూర్తిగ
విన్నాక నిర్ణయించుకోండి.." అన్నడు.
డా.చిద్విలాస్
నవ్వి, "సర్, రోగాన్నిబట్టి మందు ఉంటుంది. మనుషులు బయటకు కనిపించినట్టే
ఉంటారనుకుంటున్నారా..? ధరిత్రి కౌన్సిలింగ్ ఇచ్చి మార్చే స్థాయి అమ్మాయి కాదు.
హిప్నాసిస్ కూడ కేవలం సమస్య డయాగ్నసిస్ కే తప్ప చికిత్సకు పనిచేయటం లేదామె మీద. అన్ని
విధాలా ప్రయత్నించాకే చెప్తున్నాను. ప్రస్తుతం ఆ భయం లోపల గూడు కట్టుకుపోయి ఉన్నది
కనక ఆమె చాలా మూఢురాలు. అందుకే ఈ మార్గం..! ఆమె మనసులో ఉన్న చింతచెట్టు దయ్యం కోసం
ఈ యాగం.." అన్నాడు.
కల్యాణి
వెంటనే, భర్తను ఉద్దేశించి- "డాక్టరు ఆయనే కనక ఏం చేస్తున్నాడో ఆయనకు
తెలిస్తే చాలు. మాకు ప్రతీదీ తెలియాల్సిన అవసరం లేదు. యాగం మా పరిధిలో ఉన్న పనే.
నేనిప్పుడే మా పురోహితుణ్ణి కలిపిస్తాను మీకు.." అంది ఫోను కలుపుతూ.
"ఔను
నాన్నా, అమ్మ అనేది నిజం. మనం ఇంతా చేసేది ధరిత్రి మంచిని కోరే కదా.
ప్రయత్నించటంలో తప్పు లేదు. మిగిలినవి మీరు ఒప్పుకోవటం లేదు కదా. కనీసం ఇదైతే మీకు
అభ్యంతరం లేనిది కూడా. పరిష్కారాలు ఇట్లగే ఉంటాయి. నేనెన్నో కేస్ స్టడీస్ చదివాను.
మీరేం ఆలోచించకండి ఇంక." అన్నాడు విమర్శ్ తండ్రితో.
దాంతో
భార్గవ కాస్త తగ్గి, కల్యాణి వద్ద ఫోను తీసుకుని తనే కలిపి పురోహితుడితో
మాట్లాడాడు. ఒకసారి వీలు చూసుకుని వచ్చిపోవలసిందని చెప్పి పెట్టేశాడు.
"కానీ,
కేవలం మాటలకింత దుష్ప్రభావం ఉంటుందంటే నమ్మలేకపోతున్నాను. ఆమె అమావాస్య
ప్రతిక్రియలు కేవలం ఆ మాటల ప్రభావాలా?" భార్గవ అన్నాడు.
కేదార్
వారి ముఖాలు చూసి విరక్తిగ నవ్వుతూ, "అయ్యా.. మాట అంటే సామాన్యం
అనుకున్నారా..? అది చచ్చేవాడిని బ్రతికిస్తుంది. బ్రతికి ఉండంగానే మనిషిని
చంపేస్తుంది. మనసులో చేరి చేయరాని ఆగడాలెన్నో చేస్తుంది. ఒక్కసారి నమ్మామంటే చాలు.
మంచి మాట విని బాగుపడ్డవారున్నారు. చెడుమాట విని నిలువునా కూలిపోయినవారున్నారు.
మాటే కదా ఈ లోకాన్ని నడిపే మాయా గుర్రపు రథం.. ఇప్పుడు వాటి ప్రభావాన ధరిత్రి ఒక
దయ్యాన్ని తన మనసులో పెంచి పోషించుకుంటోంది అంటే అందులో వింతేముంది..?"
అన్నాడు.
"అందుకే
మన పెద్దలు ఎవ్వరి మాటల్లోకి రావద్దని, ముందు అవతలివాడు మాట వినే యోగ్యుడా కాదా
చూసుకోమనేది. బయటి రూపం కన్నా వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది. చెడుపు
చేసేవారు మాటల ద్వారా మనలోనికి చొచ్చుకువచ్చి అక్కడ రొచ్చు చేస్తారు. అయితే
పెద్దలు ధ్యానాదుల ద్వారా ప్రాణాల శుద్ధి ద్వారా అధిచేతనను చేరి అక్కడి రహస్య
తాపాలను తీర్చే మార్గం ఉందని సూచిస్తుంటారు. మాటిమాటికీ పైన ఈశ్వరుడున్నాడని మనం
గుర్తు చేసుకోవటం వల్ల చాలామాటుకు ఆ భయాల నుంచి విముక్తి పొందవచ్చు." అన్నాడు
విమర్శ్.
దానికి డా.చిద్విలాస్
అన్నాడు- "అది వేరే విషయం. అయితే ఇప్పుడు మన ఎదురుంగ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే-
లాజిక్ ఆమె మీద పని చేయదు. ధ్యానాదులకు తగిన అవగాహన లేని పిల్ల. ఈ పరిసరాలు
మారుద్దామంటే మీ సెంటిమెంట్లు అడ్డం వస్తున్నాయి. అయినా తను అట్ల మార్చటం వల్ల
ఇప్పుడు కాస్త కోలుకున్నా మళ్ళీ ఎప్పుడు ఆ సన్నివేశాలు ఎదురు పడితే అప్పుడు
ఇదేవిధంగ ప్రతిక్రియ చూపే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యాగం ఐడియా." అని ఆగి,
"ఇదివరకు ఒక వేరే కేస్ లో ఇది విజయవంతమైంది. మీ సహకారం ఉంటే తప్పక ఇప్పుడూ మనమే
గెలుస్తామని అనిపిస్తోంది నాకు.." అన్నాడు.
"తప్పకుండ."
అని ఆగి భార్గవ, "ఆ కేస్ ఏంటి? ఊరికే కుతూహలానికి అడిగాను." అని
అడిగాడు.
డా.చిద్విలాస్
నవ్వి, "అంతా పెద్దలే కాబట్టి చెబుతున్నాను. అన్యథా భావించవద్దు. ఇవన్నీ మన
జీవితంలో భాగాలుగా అంగీకరించక తప్పదు.. ఒక పాతికేళ్ళ కుర్రవాడు. మంచి ఆరోగ్యం.
చదువు, ఉద్యోగం- అన్నీ బాగున్నాయి. పెళ్ళయింది. చక్కని భార్య ఉంది. కానీ ఈ సినిమాల
ప్రభావం వల్ల అతనికి కామపిశాచి పట్టుకుంది. ఏ అమ్మాయిని చూసినా అదో రకమైన
ఉన్మాదానికి లోనయ్యేవాడు. లోలోపల అతి చిరాకైన పైకి చెప్పుకోలేని నానా రకాల వికృత
భావాలకు అతని మనసు ఆలవాలమైంది. చివరకు దేవీ దేవతల వరకు మానసిక వికారాలు కలగటం
ప్రారంభించింది. సంస్కారవంతుడు కనక అతడి భావాలు చర్య రూపం దాల్చలేదు. చాలావిధాల
వాటి విరుగుళ్ళకోసం ప్రయత్నించాడు. దేవుడు, భక్తి, సైకాలజీ అన్నీ విధాల బెడిసి
కొట్టాక ఇంక ఇది తీరే సమస్య కాదని నిర్ధారణకు వచ్చేశాడు. తనను తాను ఏదో లోపం
ఉన్నావడనుకుని, లోకమంతా హాయిగా ఉంది- నాకే ఎందుకీ బాధ అని లోలోపలే కుమిలిపోయాడు.
చిక్కి శల్యమైనాడు.
తండ్రికి
చూచాయగ సమస్య తెలుసు. అందుకే నన్ను సమీపించి విషయం చెప్పాడు. నేను ఆలోచించాను.
వాళ్ళది మంచి శ్రోత్రియ కుటుంబం. అతనికి దేవుడు పట్ల భక్తి ఉంది. అప్పుడు వాళ్ళ
పురోహితుణ్ణి అడిగి ఒక కామదేవుని మంత్రం ఊహించమన్నాను. ఇది వరకు రోజుల్లో యాగ
ఫలితాన్ని దృష్టి లో పెట్టుకుని దేవతావాహన మంత్రం ఊహించి యాగాలు చేసి ఫలితాలు
పొందేవారు అని చదివాను. అది ఇక్కడ ప్రయోగించాను. వారు కాస్త కలిగినవారే కావడంతో
పెద్ద యాగం ఏర్పాటు చేశారు. అందరినీ పిలిచారు. ఇతన్ని కూడా కూర్చోబెట్టారు. మాటి
మాటికీ కామనాశకాయ నమః, కామవికార ధ్వంసకాయ స్వాహా అంటూ యాగం అంతా సాగేసరికి అతనిలో
తనకు తను చేసుకోలేని సహాయం ఆ దేవతా శక్తి ఏదో చేస్తుందన్న నమ్మకం బలపడింది. యాగం
తర్వాత మేము ఊహించినట్టే అతని సమస్య పూర్తిగ తీరిపోయింది. చెప్పా కదా, దేవుణ్ణి
నమ్మటం అనేది జీవితంలో మనిషి చేసే అత్యుత్తమ పనులలో ఒకటి. ప్రపంచంలో అన్నింటికీ
మనకు కారణాలు తెలియవు. తెలియనివి ఈ సృష్టిలో భాగంగ తీసుకోవడానికి భగవంతుడు
ఉన్నాడనే విశ్వాసం సహాయం చేస్తుంది.
సరే,
తర్వాత తండ్రి ద్వారా విషయం తెలిసి అతను నాకు వ్యక్తిగతంగ కలిసి ధన్యవాదాలు
చెప్పాడు. అట్లని నేను ఈ యాగాలన్నీ సైకాలాజికల్ ఏర్పాట్లుగ తీసి పడేయటం లేదు. నేను
కోట్ల సంవత్సరాల మన ఋషులు మనుల పరిశోధనా ఫలితాలను కేవలం నమ్మకాలుగ తీసి పడేసేంత మూర్ఖుడిని
కాను. అవి పర్యావరణ శుద్ధికోసమని ఒకరు, వేరొకరు ప్రకృతి నియత్రణకోసం అని, ఇంకొకరు
స్వర్గం ప్రాప్తించటానికి, లోకకల్యాణానికి అని ఏవేవో చెబుతుంటారు. నాకు వాటి
గురించి ఏమీ తెలియదు. ప్రస్తుతానికి ఉన్న పరిమిమైన మానవ మేధకు అవెంతో
దూరమైపోయినాయి. ఇప్పటికీ వాటిని రక్షిస్తున్న వారున్నారనుకోండి.. వారికే ఆ యాగాల
అసలు అంతరార్థాలు తెలియాలి. అయితే మన విషయానికి వస్తే, ధరిత్రి విషయంలో మన
ప్రయత్నంతోపాటు దైవ ప్రయత్నం కూడా తోడ్పడచ్చు కదా అనేదే నా ఆశ.. ఎవ్వరూ
తీర్చలేనివి భగవంతుడు తీర్చగలడనే నమ్మకంతోనే ఈ భూమి మీద మనం నిశ్చింతగ
బ్రతుకున్నామనేది సత్యదూరం కాదు. ఈ అమ్మాయి కూడా దేవుడంటే భయభక్తులున్న పిల్ల కదా.
మీ సహకారం ఉంటే తన భయాలు కూడా పోగొట్టగలమేమోనని అనిపిస్తోంది.." అన్నాడు.
"అయితే
ధరిత్రికి కూడ తప్పక తగ్గిపోతుందన్నమాట.." కల్యాణి అంది.
"నేను
కూడా ఇది మొదటిసారి అవలంబిస్తున్న పద్ధతి. కనక ఫలితాలు చూశాక అంతా
వివరంచగలుగుతాను. మీరూ నిజంగా భక్తితో ఆమె కోసం యాగం చేస్తున్నామనుకునే దైవశక్తికి
వదిలేసి ఇదంతా చేయండి. మిగిలిన భారం యాగం మీద వేసి వదిలేసేయండి." అన్నాడు డా.చిద్విలాస్.
దానికి
భార్గవ తో సహా అందరూ ఒప్పుకున్నారు.
అనుకున్న
ప్రకారమే యాగానికి అన్ని సంభారాలు సిద్ధమైనాయి. ఫలానా రోజు చేయాలి అని
అనుకున్నారు. దగ్గరలోనే ముహుర్తం కుదిరింది. చింతచెట్టు కిందే యజ్ఞకుండం
ఏర్పాటైంది. దర్భలు, సమిధలు వచ్చేశాయి. పూజాసామాగ్రి సిద్ధమైంది. ఐదుగురు
పురోహితులు వచ్చారు. ఊరివారందరినీ పూజకు పిలిచారు. యజ్ఞకుండం అలంకరించారు.
మంత్రాలు చదివారు. ఆహుతులు వేశారు. ధరిత్రికి కోసం ప్రత్యేక పూజ- కనక అంతా ఆమెకోసం
ప్రార్థన చేయండని అభ్యర్థించారు. ఆమెకు అభ్యంగన స్నానాలైనాయి. పట్టుబట్టలు
కట్టారు. భార్గవ కల్యాణిలతో ఆమెను పాటు యాగంలో కూర్చోబెట్టారు. ఊరిలో అందరికీ భోజనాలు
అక్కడే ఏర్పాటు చేశారు.
"భూత
ప్రేత పిశాచ భయ విమోచకాయ నమః" అంటూ మంత్రం ఊహించారు. ఆ చెట్టును మంత్రించిన
జలంతో తడిపారు. అక్కడున్న చెట్లన్నింటికీ రక్ష కట్టారు. సంప్రోక్షణ చేశారు. కుంకుమ
పసుపులు చల్లారు. పెద్దపెద్ద మంత్రాలతో అన్ని దుష్టశక్తులను నివారించమని ప్రార్థన
చేశారు. అప్పుడు హఠాత్తుగ పున్నికి దయ్యం ఆవేశించి, అది ఈ దేవుడి శక్తికి భయపడి
శాశ్వతంగ అక్కడి నుంచి వెళిపోతున్నదని, ఇంకెప్పుడూ తిరిగి రాదని, ధరిత్రి ఎక్కడ
ఉన్నా అమ్మవారి పూజ చేస్తున్నంత కాలం సుఖంగ ఉంటుందని చెప్పి వెళిపోయింది. పున్ని
కళ్ళు తిరిగి పడిపోతే ఆమెకు ఉపచారాలు చేశారు.
కేదార్
ఇచ్చిన ఈ ఆలోచన కూడా సఫలమైంది. పున్ని తాను తెలియక చేసిన ధరిత్రి పట్ల చేసిన
తప్పుకు క్షమార్పణ చెప్పుకుని, ఆ నాటకానికి సిద్ధపడింది. తాను చేసిన హాని వల్ల
ధరిత్రి జీవితం నాశనం కావటం ఆమె కూడా ఊహించలేకపోయింది. ఉద్దేశపూర్వకంగ చేయలేదని
చెప్పి చెంపలేసుకుంది. మూటా ముల్లే సర్దుకుని తమ ఊరుకు తిరిగి వెళిపోయింది. ఆమెకు
సోమూతో వివాహం కుదిరిపోయిందిట. ఇంకెప్పుడూ ఈ ఊరి దరి దాపుల్లో కనిపించవద్దని,
ధరిత్రి లాంటి అమాయకపు ఆడపిల్లల జోలికి పోతే ఆ గతే ఒకనాడు తనకూ పడుతుందని కల్యాణి
ఆమెను బెదిరించి మరీ పంపింది.
ఏతావతా
యాగం పూర్తయ్యేసరికి ధరిత్రి కళ్ళలో తేలికదనం కనిపించింది. ఆమె ఆ సాయంత్రం నుంచే
అమ్మవారి పూజ ప్రారంభించింది. ఆ మరుసటి అమావాస్య మహాలయామావాస్య రాత్రి ఏ చర్యా
లేకుండ నిశ్చింతగ గడవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్లినిక్ లో ఇంకొక నాలుగు
హిప్నాసిస్ సెషన్ల తర్వాత ధరిత్రి పూర్తిగ నయమైపోయిందని డా.చిద్విలాస్ ప్రకటించాక
అంతా హాయిగ ఊపిరి పీల్చుకున్నారు.
No comments:
Post a Comment