ముందుగదిలో కథానాయకుల వారి దర్శనం
అయింది. నాకు చిర్రెత్తింది. ఇతని కోసమా, సంతోషంగ చందనతో గడుపుతుంటే అమ్మ ఫోన్
చేసి మరీ రప్పించింది..?? ఛఛ..
"అదిగో, హార్దీ వచ్చేసింది.."
అని అమ్మ నన్ను చూస్తూనే నా చేతికి ఉన్న గాయం చూసి, "అయ్యో,
చేతికేమైందే..?" అంది కంగారుగ లేచి వస్తూ.
చందనవాళ్ళ అమ్మ గాయాన్ని కడిగి, మందు
రాచి, కట్టిన కట్టు చూసి అడిగింది అమ్మ.
"చందన వాళ్ళ ఇంటికి వెళ్తుంటే
దారిలో.." అని చెప్తూ, అతని వంక కనుసన్నలలోంచి చూస్తూ, "చిన్న ప్రమాదం
జరిగింది.." అన్నాను.
"అందుకే బండి వద్దని
చెప్పింది.." అని అమ్మ ఏదో అనబోతుంటే, "ఎప్పుడూ నాదే తప్పన్నట్టు
మాట్లాడకు.. అవతలివారు రాంగ్ సైడ్ లో వస్తే నేనేం చేసేది..?" అన్నాను.
అమ్మ ఏదో వాదించబోయి, "సరే, అదంతా
వదిలేయి. నెప్పి ఏమైనా ఉందా..? ఏం పెట్టారు..?" అంది. నేను మందు వివరాలు
చెప్పి సీసా చూపించాను- "ఆంటీ డాక్టరే కదా.. ఆమెకు తెలుసులే.." అన్నాను.
"సరే, వీడికి ఏదో పుస్తకం కావాలని
వచ్చాడు.. ఆ సంగతి చూడు.." అంది అమ్మ లోపల వంటగదిలోకి వెళ్ళింది సాయింత్రం
వంట ఏర్పాట్ల కోసం.
నాకు భలే తుకతుకగా ఉంది. ఇతని వల్ల నాకు
దెబ్బలు తగిలాయి. కనీసం సారీ కూడా చెప్పటంలేదు. నాకు ఎవరైనా సరే, తప్పు చేసి సారీ
చెప్పకపోతే తెగ కోపం వస్తుంది. ఈ విషయానికే ‘ఇంకా పరిణతి లేద’ని మా మఠంలో తిట్టారు
కూడా. నేను ‘ఏం పుస్తకం?’ అన్నట్టు చూశాను, నిర్లక్ష్యంగ.
"ఉదయం సంగతి ఎవరితో
చెప్పకు.." అన్నాడు కరకుగా.
"ఎవరా అమ్మాయి..?" అన్నాను
నేను అంతకన్నా పొగరుగా.
"అది నీకనవసరం..! చెప్పింది
చెయ్యి.." ఆజ్ఞాపిస్తున్నట్టు అనేసరికి నాకు మండింది.
"హలో, మర్యాదగ మాట్లాడు. నేను
రీనాని కాను.." అన్నాను.
నేను కసిగా అన్న ఆ మాటకు ఊహించినట్టే
అతను ఎంత నివ్వెరపోయాడో. "నీకు ర్..రీనా ఎట్ల తెలుసు..?" అన్నాడు
ఆశ్చర్యంగ.
నాకు భలే మజా వచ్చింది- "నీకేం
పుస్తకం కావాలి..?" అని అడిగాను ఎటో చూస్తూ.
"ఏదీ వద్దు. ముందు అడిగింది
చెప్పు.. పొగరుబోతు.." అన్నాడు.
నాకు మండింది. "పొగరుబోతునైతే
కావచ్చు కానీ నీలాగ తిరుగుబోతును కాను." అన్నాను.
"అందుకే అక్కతో అనాథలను తెచ్చి
పెంచుకోకని ముందే చెప్పారందరూ. వినలేదు. ఇది దాని ఫలితం.."
నా అస్తిత్వం గురించిన చాలా పెద్ద మాట
చాలా తేలికగా అన్నాడతను. నాకు కళ్ళలో నీరుబికింది. ఇతనికి ఆ భావం ఉందని నేను
పసిగట్టాను షష్టిపూర్తి రోజే. అందరూ ఆదరించారు, కనీసం పలకరించారు, కానీ ఇతను
మాత్రం నన్ను ఒక అపరాధిలా చూస్తూ దూరంగ తిరిగాడు. ఔను. అమ్మావాళ్ళు తెచ్చుకోకముందు
నేను అనాథనే. అప్పుడు నాకు ఆరు నెలలు. నన్ను దత్తత తీసుకోవటం అటు వాళ్ళవాళ్ళకు
కానీ, ఇటు వీళ్ళవాళ్ళకు కానీ పెద్ద ఆమోదయోగ్యమైన విషయం కాలేకపోయింది. మూడేళ్ళపాటు
సొంత సంతానం కోసం ఎదురుచూశాక ఇంక అది వైద్యపరమైన అసంభవమని తేలాక, అనాథాశ్రమం తలుపు
తట్టవలసి వచ్చింది వాళ్ళు. అయినవారిలోనే తీసుకోమని అంతా సలహా ఇచ్చారు కానీ ఎవ్వరూ
పిల్లలనివ్వలేదు. ఎవరిస్తారు..? నన్ను కావాలని మా చుట్టాలందరి ప్రభావం పడకుండా
దూరంగ ఉంచటం కోసమే నాన్నగారు కోల్‌కాతా బదిలీ చేయించుకున్నారు. సరే, ఇంత కాలానికి
నన్నందరూ వారిలో ఒకర్తిగ కాకపోయినా అమ్మానాన్నల సంతానంగ ఒప్పుకున్నారు.
"జన్మ గురించి కాదు, కర్మ గురించి
మాట్లాడు. నా పుట్టుక మీద నువ్వు ప్రశ్న వేస్తే, నీ పెంపకం మీద నేను
ప్రశ్నించాల్సి వస్తుంది."
"ఏయ్.. ఎవరితో మాట్లాడుతున్నావో
తెల్సా..?"
"తెలుసు.. ఓ పిరికివాడితో.."
అతను గుర్రుగ చూశాడు నా వంక. అంతకన్నా
ఏం చేయగలడు..?
"ఇంట్లోవారికి తెలియకుండా విదేశీ
పిల్లను చర్చిలో చేసుకోవాలనుకోవటం ఏం ధైర్యవంతుల లక్షణం..?" కటువుగా అన్నాను.
అతను ఒక్కసారిగ మాన్పడిపోయాడు. ఇది
అతనికి ఊహించని అస్త్రం. "ఏంటి నువ్వనేది..?" అన్నాడు కాస్త తగ్గి.
"అది అబద్ధం అని చెప్పు.
చాలు.." అన్నాను ధీమాగ.
"నీకెట్ల తెలుసు ఇదంతా..?"
"ఇదే కాదు.. ఇంకా చాలా తెలుసు.
ఇక్కడ నాకేం తెలుసనేది ముఖ్యం కాదు. నీకేం చేస్తే వాస్తవం తెలుస్తుందనేది
ముఖ్యం." అని ఆగి, నా సెల్ తీసి ఆ రెండు వీడియోలు అతనికి చూపించి, పూర్తిగ
పాలిపోయిన అతని ముఖం చూస్తూ, "సంస్కారం అనేది జన్మతః రావటం ఒక గొప్ప వరం.
కుటుంబం, పరువు, విలువలు ఈ ఆధునిక సమాజంలో నీకు ఆట వస్తువులుగా కనిపించవచ్చు..
లోకంలో ఎప్పటికైనా నిలిచిపోయేవి యుగాల తరబడి కాచి వడబోసిన సత్యాలే. అందులో
ముఖ్యమైనది తల్లిదండ్రులను గౌరవించటం. అదొక్కటి చేయి. భయంకరమైన పాపాచరణం నుండి
బయటపడి బ్రతికిపోతావు." అన్నాను.
"----"
"హుఁ.. కావాలంటే షష్టిపూర్తి రోజు
ఇవి రెండూ అక్కడ వారందరికీ చూపించి నీ పరువు తీయటానికి నాకు చిటికెలో పనే అయ్యేది.
చాటుమాటున చెత్త పనులు చేసి ఎవ్వరికీ తెలియదని సంబర పడటం కులీనుల లక్షణం కాదు..
దానికి పెద్ద ధైర్యాలూ అక్కర్లేదు, తెగింపులూ అవసరం లేదు. ఇప్పుడు నా ముందు నీ
పరిస్థితి ఏంటో నువ్వే తరచి చూసుకో. మిగితా వారందరి కళ్ళూ కాపీ పేస్ట్‌లో
ఊహించుకో." అనేసి సెల్ లో ఆ రెండు వీడియోలు అక్కడే, అతని ఎదురుంగనే డిలీట్
చేసి పడేసి లోపలకు వెళిపోయాను. కళ్ళు తుడుచుకుంటూ
అతను చిత్తైపోయాడు. నాకు అతనితో ఇట్ల
మాట్లాడటం అస్సలు నచ్చలేదు. మా రెండవ సమాగమమే ఇంత సొంపుగా ఏడుస్తుందనుకోలేదు. నేను
నోరు మెదపకుండ ఉండాల్సింది. అతను మాట్లాడే విధానాన్ని బట్టి అంతా తెలిసే
చేస్తున్నాడనిపించింది. ఈ విషయమై మమూలుగా కూడా ఎవరూ ఏమీ వినే స్థితిలో ఉండరు.
కామ లక్షణాలని శాస్త్రం వివరించినవన్నీ
ఇప్పుడు వీళ్ళు ప్రేమ అని వర్ణించే దానికి సరిగ్గ సరిపోలి ఉంటున్నాయి. అది మంచిది
కాదురా అంటే, ప్రేమ గొప్పదని అన్ని పుస్తకాలలో ఉంది, మహానుభావులందరూ
మాట్లాడారంటారు. పుస్తకాల వాళ్ళు మాట్లాడేది విశ్వాత్మకమైన విశవజనీనమైన ప్రేమ
గురించి, తల్లి బిడ్డల ప్రేమ గురించి, అని చెప్తే వారికి అర్థం కాదు. ముందేమో
కామానికి ప్రేమ అని పేరు పెట్టటం.. తర్వాత అదే గొప్పదని దాని వెనక పరిగెత్తటం..!
శాశ్వతమైన సత్యాలు ఎప్పుడూ సమాజంలో ఏదో రూపంలో, అంతటా ఎదురు ప్రశ్న లేకుండ చెలామణీ
అవుతుంటాయి. అవి సినిమాలలో, కథలలో తప్పుడు ప్రచారాల వల్ల మాసిపోయేవి కావు. యవతను
రెచ్చకొట్టి, వారిదే పైచేయి అని చెప్తే కానీ తీసినవారికి లాభాలు రావు. వాటిని చూసి
మనకోసం విలువైనవి గుర్తించలేక పోతున్నాం. అది మన మూర్ఖత్వం. ఇంతా చేసి చివరకు
పోగొట్టుకునేది నమ్మించినవాడా నమ్మినవాడా..? ఎంత గుడ్డితనం. కామం గుడ్డిది.
ప్రస్తుతం అతనొక గుడ్డివాడు.
"ఏడే వీడు..? వెళిపోయాడా..?"
అమ్మ అడిగింది అంతలోకి.
బహుశ అమ్మతో చెప్పకుండ వెళిపోయి ఉంటాడు.
"ఊఁ.. వెళ్ళినట్టున్నాడు.." అన్నాను.
"వాడు అడిగిన పుస్తకం
ఇచ్చావా..?"
"నా దగ్గర లేని పుస్తకం అడిగితే
ఎక్కడి నుంచి ఇచ్చేది..?"
"ఇద్దరికీ ఏమైనా గొడవైందా..?"
"ఏం లేదు.. నీకెందుకు అట్ల
అనిపించింది..?"
"ఏమైనా ఉంటే నువ్వు చెప్తేనే కదా
నాకు తెలిసేది.." అంది అమ్మ.
ఛి.. ఈ గోలంతా ఉంటుందంటే నేను ఎప్పటికీ
ఆ మూతి వంకర బెంగాలీలను వదిలి వచ్చేదాన్నే కాదు. ఈ మనసు వంకర మేళంతో
పెట్టుకునేదాన్నే కాదు. రీనా మీద మనసు విరచాల్సింది పోయి నా మీద నేనే మనసు
విరిపించుకున్నాను.
తర్వాత సరిగ్గ మూడురోజులకు - అంటే
షష్ఠిపూర్తి జరిగిన ఐదవరోజు ఫోన్ వచ్చింది- అమ్మమ్మకు గుండె పోటు వచ్చిందని.
దగ్గరలోనే ఉన్న హాస్పిటల్ లో వేశారని. అది వింటూనే అమ్మ భోరున ఏడిచింది. నాన్న
అమ్మను ఓదార్చి, ఫోనులో వివరాలు మామయ్యను కనుక్కుని కార్ తీశారు. ముగ్గురం
బయలుదేరాం హాస్పిటల్ కి. ‘కొంపతీసి అమ్మమ్మకు ఏమైనా హీరోగారి సంగతి తెలిసిందా..?’
అని నాకు అనుమానం వచ్చింది. కానీ అక్కడికెళ్ళాక మాత్రం అటువంటిదేం లేదని అర్థమైంది.
ఉంటే మాటల్లో తెలిసేదే. వచ్చింది మాత్రం మాసివ్ హార్ట్ ఎటాకే. మొన్నటి కార్యక్రమాల
అలసటకు వచ్చి ఉంటుందని అంచనా. ఐసీయూ లో ఉంచారామెను. అద్దాలలో నుంచి తప్ప
చూడనివ్వటం లేదు. అచేతనంగ పడి ఉన్న ఆ వృద్ధురాలిని చూశాను. ఆమె నుదుట కుంకుమ,
పచ్చటి పసుపు రాసిన ముఖము, పెదవుల మీద చెరగని చిరునవ్వు.. అంతే..! ఒక్కసారిగ ఏడుపు
వచ్చింది. ఎవరూ చూడకుండా ఓ మూలకు వెళ్ళి మనసు తీరా ఏడ్చేశాను. ఈ పరిస్థితులలో ఆ
కన్నకొడుకు చేస్తున్న ఘనకార్యం ఈమెకు తెలిస్తే..?
"ఏడవకమ్మా, ఊరికే బాధపడితే
ఎట్ల..?" నన్ను దూరం నుంచి చూసి, నాన్నగారు వచ్చి ఓదార్చారు.
"డాక్టర్లతో మాట్లాడాను. వాళ్ళ ప్రయత్నం వారు చేస్తున్నారు.." అన్నారు.
అది కాదు నాన్నా నా బాధ..! వెంటనే
నాన్నతో నా బాధంతా చెప్పేయాలనిపించింది. కానీ దాని వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఇది
అనువుగాని చోటు కూడా. చెప్తే మాత్రం ఆయన ఏం చేయగలరు..? వారి కుటుంబం ‘పెద్ద’ నాన్న
కాదు కదా. మామయ్య అయితే ఏమైనా చేస్తాడేమో. కానీ ముందు నేను నోరు తెరవాలి కదా. ఈ
ఆలోచనలతో మళ్ళీ గుండె బరువెక్కింది. ఆ హాస్పిటల్ వాసన నాకు అలవాటు లేకనో, ఉదయం
నుంచి ఏం తినకపోవటం వల్లనో, ఈ ఆలోచనల బరువు పడకనో- హఠాత్తుగ తల తిరిగి కళ్ళ
ముందరంతా చీకటి కమ్మింది. ఏమీ అర్థం కాలేదు. నిలబడ్డ దాన్ని నిలబడ్డట్టే నాన్న
మీదకు వాలిపోయాను. అంతే, నాకు ఏం తెలియదింక.
తిరిగి కళ్ళు తెరిచి చూసేసరికి
హాస్పిటల్ లోనే ఒక బెంచీ మీద పడుకుని ఉన్నాను. నాన్న నాకు ఒక కొబ్బరి బోండా ఇచ్చి
తాగమన్నారు. అమ్మ నన్ను ఇంటికి వెళ్ళటం మంచిది అంది. నేను ఒప్పుకోలేదు. అందరూ
బలవంతపెట్టారు. తప్పలేదు. నాన్న దింపుతానని లేచేసరికి, "మీరెందుకు బావగారూ..
వీడున్నాడుగా.. వెళతాడులే..! మీతో నాన్నగారు ఏదో మాట్లాడాలనుకున్నారు.." అని
ఆపాడు మామయ్య. "ఒరే, వెళ్ళి అమ్మాయిని దింపి రారా.." అన్నాడు. నేను
బావేమో అనుకుని నేను అటు పక్క చూస్తే, కాదు, హీరోగారు..! అబ్బ.. ఖర్మ..!
అనుకున్నాను. ఛి, ఇతని వెంట వెళ్ళటమా..? అసంభవం. "వద్దు, నేనిక్కడే ఉంటాను,
నాకు బానే ఉంది.." అన్నా కూడా ఎవ్వరూ వినలేదు. చివరకు కాస్త కొబ్బరి నీళ్ళు
ఒంటికి పట్టంగనే అతనితో ఇంటికి బయల్దేరదీశారు.
అతను సెల్లార్ లో బండి తీస్తుంటే నేను
రోడ్ మీదకు వెళ్ళి ఆటో పిలిచాను. ‘అదేంటి’ అన్నట్టు చూసి, బండి వదిలి నా వంకకు
వచ్చాడు.
"ఒక్కదానివి ఆటోలో వెళ్ళే స్థితిలో
లేవు. బండెక్కు." అన్నాడు.
"అడ్డమైనవారందరూ ఎక్కే బండి నేను
చచ్చినా ఎక్కను. ముందు ఒక గౌరవమైన ఇంటి మర్యాదస్తురాలైన పిల్ల ఎక్కే యోగ్యంగ నీ
బండిని ఉంచుకో.. తర్వాత మాట్లాడుదువుగాని." అన్నాను. నేను అతని ప్రతిక్రియ
చూడలేదు. అప్పుడే వచ్చిన ఆటో అతను ఎక్కడికి అని అడిగితే, నేను స్థలం పేరు
చెప్పాను. ఆటో వాడు మీటర్ వేశాడు. నేను ఎక్కంగనే కీస్ జేబులో వేసుకుని అతనూ ఎక్కి
కూర్చున్నాడు. నేనేమీ అనలేకపోయాను. అటు పక్కకు చూస్తూ కూర్చున్నాను. మెల్లగ
కాసేపటికి ఇల్లు వచ్చింది. నేను దిగి డబ్బులు ఇవ్వబోతే, అతను పర్సు తీశాడు. బయట
గొడవ బాగుండదని నేనేమీ మాట్లాడలేదు. ఇంటి వైపు నడిచాను. అతనూ నా వెనకే వచ్చాడు.
అంటే ఇంటికి వస్తాడా..? నేను తాళం తీసి లోపలకు వెళ్ళాను.
తనూ లోపలకు వస్తూనే, "ఎందుకు
చెప్పావు అమ్మకు ఆ విషయం..?" అన్నాడు కరకుగా.
"ఏ విషయం..?"
"రీనా విషయం.."
"నేనేం చెప్పలేదు. నీకెందుకు
అనిపించింది నేను చెప్పానని?"
"అది తెలిసింది నీకొక్కదానికే
కదా..! నువ్వు ఆ మాట చెప్పకపోతే అమ్మకు హార్టెటాక్ ఎందుకు వచ్చింది..?"
"ఆ మాట చెప్తే హార్టెటాక్ రావచ్చని
తెలిసే ఆ పని చేస్తున్నావా..? మనం చేసే పని పర్యవసానం చెడ్డదని తెలిసీ ఆ పని
చేస్తే దాన్ని ఏమంటారో తెల్సా..? మూర్ఖత్వం అంటారు."
"ఒక అనాథపిల్లతో నీతులు
చెప్పించుకునే స్థితిలో నేను లేను." అన్నాడు కచ్చాగ.
నాకు ఆ పదం వింటూనే కలిగిన విఘాతాన్ని
అధిగమిస్తూ, "ఔను. నేను భూతపూర్వ అనాథను. అది కూడా అరునెలల కోసమే. ఇప్పుడు నీ
పరిస్థితి చూస్తుంటే నువ్వు కాబోయే అనాథవనిపిస్తోంది.. శాశ్వతంగ." అన్నాను.
అతను నా దగ్గరగా వచ్చి నన్ను చాచి లాగి
ఒక్కటి కొట్టాడు, చెంప మీద. నాకు క్షణం పాటు ఏమీ కనిపించలేదు. జివ్వున నీరుబికింది
కళ్ళలో నుంచి. నన్ను నేను సంబాళించుకుంటూ, కాస్త తేరుకుని, పక్కన ఉన్న కుర్చీ ఊతగా
పట్టుకుని అందులో కూర్చున్న తర్వాత అన్నాను- "మాటకు స్పందిస్తున్నావు కానీ
నువ్వు చేసే చర్యలకు ఏర్పడుతున్న పరిణామానికి మాత్రం బాధ్యత తీసుకోవు."
అన్నాను.
"నా వ్యక్తిగత విషయాల్లో ఎందుకు
జోక్యం చేసుకుంటున్నావు..?"
"ఎప్పుడైతే ఈ విషయం వల్ల
పెద్దవాళ్ళ ప్రాణాలకే ముప్పు అని నీకు కూడా తెలిసిందో, అప్పుడు ఇది వ్యక్తిగత
పరిధిలోంచి దాటి కుటుంబ సమస్య అయింది. వాళ్ళకేమైనా అయితే అప్పుడు కూడా అది నీ వ్యక్తిగతం
అనేసి అంతా సర్దుకుంటారా...?"
"అందుకే వారికి నిజం చెప్పవద్దంటున్నాను."
"నువ్వు ఆ పనిని చేయటం మానేయి.
నేను చెప్పే పని ఉండదు."
"నన్ను రెచ్చకొట్టకు.."
"నిన్ను రెచ్చగొడుతున్నది నువ్వు
చేసిన తప్పు తాలూకు పరిణామం గురించిన భయం."
అతను వచ్చి నా జడ మొదట్లో
పట్టుకున్నాడు. ‘అబ్బా,’ అన్నాను నెప్పితో.
"నీ మాటలతో నన్ను సంస్కారహీనుణ్ణి
చేయకు. మా అమ్మకేమైనా అయిందో, నిన్ను వదలను.."
"మీ అమ్మకేమైనా అయితే దానికి
నువ్వు బాధ్యుడివి. నేను కాదు. వాళ్ళు నువ్వు చేసిందానికి బాధపడతారు. నేను
చెప్పిందానికి కాదు." అన్నాను ఏమాత్రం కదలకుండా.
"రాక్షసీ.. పాతకీ.."
"నీ భయం నిన్నింకా కూడా
దిగజారుస్తుంది. నీ మనసును తరచి చూసుకో. ఇంట్లోవారితో నువ్వు చేస్తున్న మోసం,
కపటం, దొంగవేషం, నీ కుతంత్రం.. అన్నీ నీకు కనిపిస్తాయి. హుఁ..!! ఒకవైపు చదువు
పూర్తి కాలేదు..! సొంత కాళ్ళ మీద నిలబడేందుకు ఉద్యోగం లేదు. ఇంట్లోవారితో
పెట్టుకుంటున్నాడు. వాళ్ళు తరిమేస్తే ఏం పెట్టి ఆ పిల్లను పోషిస్తాడట..? నేను మా
అమ్మా నాన్నలకు మంచి కూతురిని. నీకంటూ చెప్పుకోవటానికి కనీసం అదైనా లేదు. నన్ను
రాక్షసి పాతకి అనటానికి నీకేం అధికారం..? హ్రస్వబుద్ధి..!! దుష్టబుద్ధి..!! దాన్ని
సరిదిద్దుకో ముందు."
అతను నా జడ వదిలేశాడు విసురుగ. నేను
దూరం జరిగి, "ఆరోజు బండి మీద నాకు ప్రమాదం చేసిన రోజే అనుకున్నా, ఇటువంటి
అభాండమేదో నా మీద వేస్తావని. నిన్ను ఈ అనుమానం రకరకాలుగ పీడిస్తూనే ఉంటుంది,
వాస్తవం చూడనంతవరకు." అని ఆగి, "నేను ఎవ్వరితో ఏమీ చెప్పలేదు. మా అమ్మ
మీదొట్టు." అన్నాను.
కాసేపు మౌనంగ కుర్చీలో పడి
కూర్చున్నాడు. ఏదో ఆలోచించి, అడిగాడు- "రీనా గురించి నీకన్నీ ఎవరు
చెప్పారు..?"
ఆ పిల్ల ఆఫీస్ లో పై బాస్ మా పక్క ఇంటి
రాజీ వాళ్ళ నాన్న. ఒకసారి ఇక్కడే రోడ్ మీద కనిపిస్తే, ఆమె మెడలో చూసిన వారి కంపెనీ
ఐడీ చూసి అడిగితే చెప్పాడు- దాని జాతకం మొత్తం ఉంది ఆయన చేతిలో. ఆమాటే అతనితో
చెప్పి, "కావాలంటే కలిసి నువ్వే మాట్లాడి అడుగు." అన్నాను.
"అవసరం లేదు. తన గురించి నాకంతా
తెలుసు. అయినా ఆమె పై నా ప్రేమ పోదు. నేనవన్నీ పట్టించుకోను. నాది చాలా ఓపెన్
మైండ్.."
అన్నీ తెలిసే ఇతను అడుగు వేస్తున్నాడు.
ఇంకేం చెప్పగలం..? "సరే, తెలిసి చేస్తున్నావా, తెలియకనా అనేదంతా నీ వ్యక్తిగతం.
మరి అమ్మమ్మా తాతయ్యల ఆరోగ్యాలైతే మా అందరి సమస్య కూడా కదా.? వాళ్ళ సంగతేం
ఆలోచించావు..?"
"అందుకే కదా, వాళ్ళకు తెలియకుండ
చేస్తున్నాను."
"అది పరిష్కారం కాదు. తెలియకుండ
ఎన్నాళ్ళు? తెలిసిననాడు పరిస్థితి ఇదే కదా. అయినా ఫరవాలేదా?"
"ఎందుకు? వాళ్ళు రీనాని
ఒప్పుకోగలిగితే సమస్యే ఉండదు. ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. నిజంగ నా మీద ప్రేమ
ఉంటే వాళ్ళు ఒప్పుకుని తీరతారు."
"అది వాళ్ళకు నీమీద ఉన్న ప్రేమను
చూపిస్తుంది. మరి నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఏంచేస్తుంది..? ఒప్పుకోకపోతే వారిని
ఇట్ల చనిపోనిస్తుందా..?"
"ఒప్పుకోకపోతే ఒప్పిస్తాను."
"ఎప్పుడు, ఎట్ల ఒప్పుకున్నా అది
వాళ్ళకు నీమీద ఉన్న ప్రేమే అవుతుంది. నేనడిగేది నీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ
గురించి. వాళ్ళు ఒప్పుకోరనేది ఒక సహజమైన వాస్తవంగ అంగీకరించి మనం
మాట్లాడుకుందాం."
కాసేపు ఆలోచించి- "వాళ్ళు
ఒప్పుకోకపోతే నేను.. ఏం చేయలేను..! కానీ వాళ్ళు ఒప్పుకోవాలి. లేకపోతే కష్టం."
అన్నాడు.
"అంటే ఒప్పుకోలేక వీళ్ళు
చనిపోతున్నా చూస్తూ ఊరుకుంటావు. అంతేనా..? ఇప్పుడు నీకు ప్రేమ ఎవరి మీద అన్నట్టు?
చిన్నతనం నుంచి నిన్ను పెంచి పోషించిన అమ్మ నాన్నా మీదా..? నిన్నగాక మొన్న కలిసి
తిరగటానికి దొరికిన తోడు మీదా..?"
అతను చేతులు నలుపుకుంటూ అటూ ఇటూ తిరిగి
అన్నాడు- "ఆమేమీ కేవలం కలసిసి తిరిగే తోడు కాదు.. జీవితాంతపు తోడు.."
"సరే, ఓకే. నీకట్ల అనిపిస్తే అదే
కానీ. మామూలుగ అయితే రేపు నీ పెళ్ళి కదా. దానికి ఇద్దరి తరఫునా ఎవరూ రావటంలేదు.
తెలియకుండా చేసుకుంటున్నారు కనక. ఇప్పుడు ఎవ్వరూ పెద్దల ఆశీస్సుల లేకుండ పెళ్ళి
చేసుకునేవారిని ఏమంటారు?"
"----"
"అనాథలంటారు. ఔనా కాదా..?"
తల ఊపాడు.
"అదే కదా మరి నేనన్నది, నువ్వు
కాబోయే అనాథవని. మరి నన్నెందుకు కొట్టావు..?"
"----"
"నన్ను ఏ హక్కుతో
కొట్టావు..?"
"కోపం తెప్పించావు.. కొట్టాను.
హక్కేం లేదు."
"నేను వాస్తవం చెప్పాను. కోపం నీకు
వచ్చింది. అది నా తప్పు కాదే."
"----"
"ఇప్పుడు నేను నిన్ను
కొడితే?"
ఉలికిపడి చూశాడు. "నన్ను కొడతావా?
ఎందుకు..?"
"ఎందుకో అందుకు.. కొట్టానే అనుకో..
నాకూ కోపం వచ్చిందని సర్దుకుంటావా..?"
"ఏమో.. తెలియదు.."
"ట్రై చేద్దామా..?" అని ఆగి
లేచి నిలబడి, అతన్ని తాను కొట్టినదానికన్నా ఎక్కువ ఫోర్సుగ చాలా దృఢంగ ఒక్కటి
కొట్టాను గూబ మీద. నాలుగు వేళ్ళ అద్దులు తేలినవి.
No comments:
Post a Comment