Wednesday, 7 December 2016

7. చిద్విలాసం - 2, 3



(2, 3)
2
          విమర్శ్ ఇల్లు చేరేసరికి రాత్రి పదకొండు దాటింది. ధరిత్రి ఇంకా మేల్కొనే ఉంది.
          "అత్తావాళ్ళు ఇంకా రాలేదేంటో..?" అంది మంచినీరందించి. చెప్పాడు- రారని చెప్పి ఫోను చేశారని. అన్నం తింటావా అని అడిగింది. ఆకలిగ లేదు, తిననన్నాడు. "ప్రయాణం బాగ జరిగిందా?" అని అడిగింది. అతనికి దేనికీ జవాబు చెప్పబుద్ధి కావట్లేదు. వరండా లోని గోడగడియారం టిక్కూ టిక్కూమని కొట్టుకుంటుంటే అతని రక్తప్రవాహ వేగం పెరిగింది. గుండె చప్పుడు చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది.
          "ఇంక పడుకోరాదా..?" అన్నాడు ధరిత్రితో.
          "మీకోసమే కూర్చున్నాను. సరే, అత్తావాళ్ళు రారు కదా. నువ్వేమో తినను అంటున్నావు. ఇంకేం చేసేది..? పడుకుంటున్నాలే.." అని ఆమె వెళిపోయింది. అతను త్వరత్వరగ బట్టలు మార్చుకుని ఇంట్లో తలుపులు అన్నీ చూసుకుని, తన గదిలోకి వెళ్ళి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టుకున్నాడు. తను త్వరగా పడుకుంటే ధరిత్రి కూడ పడుకుంటుంది. అలవాటు ప్రకారం పదినిముషాలు పుస్తకం చదివాక విమర్శ్ మంచం మీద వాలాడు. కన్ను అంటిన కాసేపటికి వరండాలో నుంచి గడియారం పన్నెండు గంటలు కొట్టిన శబ్దం వినిపించింది. అతని కళ్ళు వాటికవే తెరుచుకున్నాయి. శరీరం దానికదే మంచం మీద లేచి కూర్చుంది. మొదలైంది.. ధరిత్రి అటాక్..!! అరుపులు, గోల, సామాన్ల విసుర్లు...
          వరండా నుంచి ఆ భీభత్సం ప్రత్యక్షప్రసారం వినిపించటం మొదలైంది. అప్పటికే సన్నగ చినుకులు మొదలైనట్టున్నాయి. బయటి నుంచి తుంపెరలు పడుతుంటే కిటికీ మూసేశాడు.
          ధరిత్రి పెట్టే కేకలు శృతి మించుతున్నాయి క్రమంగ. విమర్శ్ జుట్టు పీక్కున్నాడు. ఛ.. ఇప్పుడే అమ్మా నాన్నా లేకుండ ఇల్లు ఉండాలి. ఇప్పుడే వాళ్ళకు పూజలకు, పునస్కారాలకు పోవటానికి కుదరాలి. మరి అమావాస్య పూజ చేయిస్తేనే కదా ధరిత్రికు నయమయ్యేది అని అమ్మ వాదిస్తుంది. కానీ ఇక్కడ తన పరిస్థితి ఒంటరిగ ఏం కావాలి అనే సోయి లేదు. ఛ..! ఎంత నమ్మకంగ చెప్పి వెళ్ళారో.., రాత్రికల్లా వచ్చేస్తాం రా అని..! ఇప్పుడే రైళ్ళప్రమాదాలు జరగాలి. ఈ సీనుగాడికి ఇప్పుడే తీరాలి ఆర్చుకుని తీర్చుకుని ఊరుపోవటానికి..! వాళ్ళ ఇంట్లో ఎవరికో బాలేకపోవటం ఇప్పుడే జరగాలి. కనీసం వాడి చెల్లెలు పున్నినైనా ఉంచి పోవచ్చు కదా. ఇంట్లో అమ్మ లేకపోతే ఎవరి ఇష్టం వారిది. తన మాటకు ఇక్కడ ఏం చెల్లుబాటు ఉంది కనక..? ఛ.. అన్నీ ఇప్పుడే జరగాలి.
          పక్క ఇంటి సుజాతను పిలిచి ఉండమని అడిగితే, "అమ్మో నాకు భయం, నావల్ల కాదన్నా.." అని ఆ పిల్ల ముందే చేతులు ఎత్తేసింది. "అంతా నా ఖర్మ." అనుకున్నాడు విమర్శ్.
          "నన్ను ముట్టుకోకు.. మసి చేస్తా.." దాదాపుగ అన్నీ అలవాటైన అరుపులే. ప్రతీ అమావాస్యకూ వింటున్నవే. కానీ ఎప్పటికప్పుడు కొత్తగనే ఉంటాయి. కాకపోతే భయం ఏం ఉండదు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండి చూసుకుంటారు. ఇవాళ తను ఒంటరిగ ఉన్నాడు.. అసలు తను ఈ పూట హైదరాబాద్ లోనే గడిపేస్తే ఎంత బాగుండేదో. కానీ ఒంటరిగ ధరిత్రి ఒక్కర్తి ఇంట్లో.. ఈ పరిస్థితుల్లో.. అసహాయంగ..!
          ఒంటరి..- చాలా చిత్రమైన పదమది. స్వతంత్రం కూడ ఒకరకమైన ఒంటరితనమే. ధరిత్రి ఈ లోకంలో ఎప్పటికీ ఒంటరిది. తను ఇవాళ ఒక్కరోజుకే ఒంటరివాడు. అందులో ఫోనులో నాన్న గట్టిగ చెప్పారు. "అమ్మాయిని ఒంటరిగ వదిలిపెట్టి నీ లాప్ టాప్ వేసుకుని కూర్చోకు. ఆమె మీద పూర్తి ధ్యాస పెట్టు." అని. బాధ్యత.. హుఁ.. తను చెడ్డవాడైనా బాగుండేది. మాట వినవలసిన అగత్యం ఉండేది కాదు. తన ఖర్మ కాకపోతే ఇటువంటి దయ్యపు పిల్లతో ఈ రాత్రి గడపాల్సి వచ్చిందే..! ఎవరైనా ఆడవాళ్ళు దగ్గర ఉంటే బాగుండేది. అయినా ధరిత్రి ఈ స్థితిలో మగవాళ్ళకే ఆగదు. చాలా ప్రమాదకరంగ ఉంటుంది. తనకు దయ్యపు బలమే వచ్చేస్తుంది కాబోలు. పక్క ఇంటి సుజాతనే కాదు, ఈ ఊళ్ళో ఏ ఆడపిల్లా ధరిత్రితో స్నేహం చేయదు. వాళ్ళ తల్లులు వారిని ఈమెకు దూరంగ ఉంచుతారు. ధరిత్రి చేసే గోల, అరుపులు, శబ్దాలు వీటన్నింటికన్నా భయంకరంగ ఉంటాయి. ఏవేవో వస్తువులు విసిరేసేస్తుంది. దయ్యాలు పట్టినవని వాళ్ళు అంతా అనటంలో ఏం అనౌచిత్యం లేదేమో.
          "దగ్గరకు రాకు.. ఛంపేస్తా.. హూఁ.. హాఁ.." ధరిత్రి అరుపులు దయ్యాలు పట్టినట్టే ఉన్నాయి. ధరిత్రికు క్రితం మూడేళ్ళ నుంచి ఈ సమస్య పట్టుకుంది. ఊళ్ళోవాళ్ళంతా వాళ్ళ నాన్న చనిపోయి దయ్యమై పట్టాడంటారు. మామయ్య పోయిన దగ్గరి నుంచే ఆమెకు ఈ రోగం పట్టుకుంది. ఏదైనా క్రితం జన్మలో పాపం చేసుకుంటేనే దయ్యపు రోగాలు వచ్చి పీడిస్తాయి.. అంటారు కొందరు. ఇది ఎవరైనా చేయించిన చేతబడి కావచ్చు అని ఇంకొందరి ఆలోచన. అందరూ అనేది నిజమేనేమో- ధరిత్రికు నిజంగ దయ్యమే పట్టిందేమో..!
          అయితే మరి భూతవైద్యుడు మరిడయ్య ఆమెను ఎందుకు బాగుచేయలేకపోయాడు..? అని తొట్టతొలిసారి అడిగినది కేదార్. మరిడెయ్య ఆ ఊర్లోనే కాదు, చుట్టుపక్కల అన్ని ఊర్లలో భూతాల మాంత్రికుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎక్కడా నయం కాని కొన్ని కేసులు అతని చేతిలో నయమైనాయి కూడా. "ఈ సైంసు యుగంలో కూడ మంత్రాలు, చింతకాయలు, ప్రయోగాలు అంటూ కూర్చుంటే ఎట్ల మాష్టారూ..? అవి లేవని నేను అనను. ఉంటే ఉండవచ్చు. కానీ ఇది అది కాదు. ఇందులో ప్రయోగాలు లేవు.. గాడ్ది గుడ్లూ లేవు. ఇదేమీ దయ్యాలు భూతాల బాపతు గోల కాదు. మీరేం భయపడకండి.." అన్నాడు కేదార్ మొదటిసారి కలిసినప్పుడు. "అయితే తగ్గించగలరా..?" అంటే, "చాలా లోతైన మానసిక వ్యాధి... తగ్గించటం కష్టం. సులభంగ తగ్గేది కాదు.. మందులతో అదుపులోకి తేగలిగినంత తెచ్చాను. కానీ పూర్తిగ తగ్గాలంటే డా.చిద్విలాస్ మాత్రమే చేయగలడు." అని చెప్పాడు.
          కేదార్ విమర్శ్ కి చిన్ననాటి స్నేహితుడు. ఎప్పుడన్నా ఊరుకు వస్తే కలిసి తిరిగేవారు. అతను తన లాగే బయట ఉంటూ మెడిసిన్ చదివి జెనరల్ డాక్టరైనాడు. ఇప్పుడు ఊళ్ళోనే వైద్యసేవలందిస్తున్నాడు. నావారికి నేను, నా చదువు ఉపయోగపడితే చాలు అనేది అతగాడి సిద్ధాంతం. బ్రతకటానికి ఆస్తి ఉంది. ప్రభుత్వోద్యోగం ఉంది. మంచి చేయాలన్న మనసు ఉంది. సమస్యను లోతుగ ఆలోచించే బుర్ర ఉంది. ధరిత్రిని ఆయాసం కోసం అతనికి చూపించారు. అప్పుడు ఈ సమస్య గురించి అతనే మాట తీసి, "ఊళ్ళో అంతా చెప్పేది నిజం కాదు. ఇది ఒక మానసిక రుగ్మత. న్యూరాసిస్ కావచ్చు." అని సూచించాడు. అదే మాట భార్గవ, కళ్యాణిలతో అంటే వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పూజలు, శాంతుల మార్గాన్నే ఎంచుకున్నారు. విమర్శ్ తో అతను మాట్లాడాకనే డా.చిద్విలాస్ గురించి తెలిసింది. కేదారే ఆయన దగ్గర అపాయింటుమెంటు తీయించి ఇచ్చాడు. తను పడుతూ లేస్తూ ఇంతా చేసి వెళ్ళి వస్తే ఆయన కనీసం కేస్ లోపలకు తొంగి కూడ చూసే ప్రయత్నం చేయకపోవటం చాలా బాధగ, నిరాశగ అనిపించింది విమర్శ్ కి. ఆయనకు తన గురించిన కూపీలు లాగటం మీద ఉన్న ఆసక్తి ధరిత్రి గురించి అడగటానికి లేకపోయింది.
          నిజంగ తనకు ధరిత్రి అంటే ఇష్టమా..? ఏ మూలనైనా తన మాటల వల్ల అటువంటి భావాలు ధ్వనించే అవకాశం ఉందా..? విమర్శ్ ఆలోచించాడు. ఏంటో మన మనసులో ఏం ఉందో మనకే తెలియకపోవటం.. విచిత్రం కదా..! అది అంత ఆలోచిస్తే తప్ప తట్టని విషయం ఏం కాదే..?
          "వచ్చావంటే కాల్చేస్తా.. హా..హా.. పో..పో.." ఏదేదో మొత్తుకుంటోంది. విమర్శ్ అది విని హడలిపోయాడు. పెద్దపెద్దగ అరుస్తోంది ధరిత్రి.
          ఈ అమ్మాయినా తను ఇష్టపడేది..? హుఁ..!! దొరక్క దొరక్క ఈమే దొరికిందా ఇంత పెద్ద ప్రపంచంలో తనకు ప్రేమించటానికి..? ప్రేమించటమే పెద్ద కాల వ్యయం అంటే ఇంకా ఇటువంటి పల్లెటూరి బైతు.. పొట్ట కోస్తే అక్షరం ముక్క లేని అంధవిశ్వాసాల పుట్ట. ఆత్మవిశ్వాసం అంటే ఏంటో కూడ తెలియని భయస్తురాలు. గొడ్డు లాగ చాకిరి చేయటం, తిని తొంగోవటమే జీవిత పరమావధిగా బ్రతికే ఓ అల్పురాలు.. తన ప్రియసఖా..? అసంభవం..!!
          బయట వాన బాగ వేగం పుంజుకుంది. ఉరుమల శబ్దం కూడ చెవులను అదరగొడుతోంది. కిటికీల అద్దాలలో నుంచి వచ్చే మెరుపుల కాంతికి కూడ కళ్ళు బైర్లు కమ్మేటట్టు ఉన్నాయి. ఇది కాళరాత్రి లాగ ఉంది. ఏదో తెలియని ఆరాటం. ఎప్పుడు అమావాస్య వచ్చినా ఈ భావాలతో తమ అందరి జీవితాలు స్తబ్ధంగ అయిపోతాయి. అందుకని ఆమె నయం కావాలని అడగటానికి వెళ్తే ఆమె నీ ప్రియసఖి అంటాడా ఆ వెర్రి మనిషి..? ఈ అరుపులు గోల అంతా లైవ్ రికార్డు చేసి ఆయనకు చూపించాలి, ఆ ప్రశ్న గురించి ఏమంటాడో..? ఆ ఆలోచన తట్టింది తడవుగా వెంటనే తన దగ్గర ఉన్న రికార్డర్ ఆన్ చేశాడు. అసలు ధరిత్రి ఏం అరుస్తుందో ఆయనకు వినిపిస్తే సరిపోతుంది అనుకున్నాడు.
          "నన్ను చంపకు. నన్ను తాకకు.. నీ అంతు చూస్తాను..! నా మీదకు వస్తావా..?" విమర్శ్ చెవులు మూసుకున్నాడు. "భగవంతుడా..!!" ధరిత్రి గంట నుంచి అరుస్తోంది. ఇంకొక అరగంట పడుతుంది ఈ ప్రభావం దిగటానికి. విమర్శ్ గంటలో వంద సార్లు గడియారం వంక చూశాడు. అసలు జీవితం గురించి ధరిత్రి ఏం ఆలోచిస్తుంది..? తన సమస్య గురించి ఆమె అవగాహన ఏంటి..? పాపం, ఇట్ల ఒంటి మీద సోయి లేక అరిచి అరిచి ఎంత శక్తి వృథా చేసుకుంటుంది..! ఈ అంతటి అరుపుల తర్వాత ఆమె నీరసంగ వాలిపోతుంది. మళ్ళీ కోలుకోవటానికి పదిహేనురోజులు పడుతుంది. అదీ ఆయసం అటాక్ రాకపోతే. అంతా ఆమె ప్రతిక్రియను బట్టి ఉంటుంది. ఆమె మీద తండ్రి ప్రభావం చాలా పడింది. ఆయన ప్రతీదానికి చాలా తీవ్రంగ ప్రతిస్పందించే మనిషి. అదే పోలిక ఆమెకూ వచ్చింది.
          నారాయణ మామయ్య స్వతహాగా చాలా ఆవేశం మనిషి. ఆయనకు అన్నీ ఆవేశమే. కోపం, సంతోషం, భక్తి, భయం.. ప్రతీదీ ఆవేశంలా పూనకంలా ఉంటుంది. అయితే మనిషి చాలా మంచివాడు. వాళ్ళు తమ కుటుంబానికి చాలా మంచి చేశారని అమ్మ ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంది. ఆయన తన తండ్రి బార్గవకన్నా రెండేళ్ళు పెద్ద. జన్మలోకి అడుగు పెట్టి కళ్ళు తెరిచేసరికి కటిక పేదరికంలో ఉన్నాడు. పేదరికం చిన్నతనంలోనే స్కూలు, చదువు మానిపించింది. పొలాల పనులు, ఏవేవో చూసుకున్నాడు. వేళకు పెళ్ళయింది.. పిల్లలు కలగటాలూ పోవటాలూ, ధరిత్రి మిగలటం అంతా నాటకంలా కదిలిపోయింది జీవితం. విమర్శ్ వాళ్ళ తాతగారిని బామ్మను వాళ్ళే సొంతవారిలా బాధ్యతగ చూసుకునేవారు. వైద్యం అయితేనేమి, ఇంట్లో అవసరాలకైతేనేమి, ఇంట్లో పనులకైతే నేమి.. నేనున్నానంటూ సేవలు చేసింది ఆ కుటుంబం.
          అక్కడిక్కడ చిన్నా చితకా ఉద్యోగాలకోసం తిరగటం ఎందుకు అని ఆస్తులవీ చూసుకోమని తాతగారు ఆయనకు అప్పగించాడు. బాగా నిజాయితీ మనిషి. నెల తిరిగే సరికి పైసా పైసా లెక్క చెప్పేవాడు. ఎప్పుడూ అబద్ధం మాట్లాడేవాడు కాదు. ఎవరి మీద చెడు చెప్పేవాడు కాదు. ఉన్నంతసేపు బాగ పలకరించి కష్టం సుఖం మాట్లాడేవాడు. చేతనైన సహాయం చేసేవాడు. దేవుణ్ణి నమ్మేవాడు. ఎంతో ఆప్యాయవంతుడు. ఎంత ప్రాణం పెట్టేవాడో తమ కుటుంబం అంటే. అది ఆధారం లేని ఒక అవ్యాజమైన సహజమైన అభిమానం. అంతే. భగవంతుడు ఏర్పాటు చేసింది. ఏ జన్మబంధమో..!
          ఆ శాంతి అత్తే లేకపోతే, ఆమె వేళకు సహాయమే చేయకపోతే అసలు నువ్వు అంటూ భూమి మీద ఉండేవాడివే కాదురా అని ఎప్పుడూ చెబుతుంది అమ్మ. తన కాన్పు సమయంలో ఆమె అమ్మకు కాంప్లికేషన్లు వస్తే దగ్గర ఉండి చాలా శ్రద్ధగ, జాగ్రత్తగ చూసుకుని, డాక్టరును కూడ కాదని, ఎదిరించి ఆ గండం గట్టెక్కించి, సేవ చేసి రెండుప్రాణాలను కాపాడిందిట. అంటే పరోక్షంగ తనూ వారికి ఋణపడినట్టే కదా.
          "అమ్మో.. మంట మంట..!" కొత్త రకం అరుపులు వినిపించాయి విమర్శ్ కి. కానీ వరండాలోకి వెళ్ళీ పెద్ద ప్రయోజనం ఉండదు. ధరిత్రి ఈ సమయంలో ఎవ్వరినీ దగ్గరకు రానివ్వదు. వచ్చిన వాళ్ళకు జన్మలో మర్చిపోలేనంతగ తగిన శాస్తి చేస్తుంది. ఇప్పుడేంటి చేయటం..? విమర్శ్ అటూ ఇటూ కదిలాడు నిస్సహాయంగ. ఎందుకంటే ఇది ఎవరూ మానవమాత్రులు ఆపలేనిది. అసలు ధరిత్రి ఈ క్షణం మామూలు మనిషిగ మారిపోతే బాగుండు. తాను దానికోసం ఏమైనా చేయగలిగితే బాగుండు. ఒకవైపు ఆమె పీక పిసికేయాలన్నంత కోపం, మరోవైపు అయ్యో పాపం అనే జాలి.. విమర్శ్ కి ఎంతో అసహనంగ అనిపించింది.
          "నన్ను కాల్చకు.. వదులు.. అమ్మో.. మంటలు.."
          దేవుడో..! ఇంత బాధ పగవారికి కూడ వద్దురా భగవంతుడా- అనిపించింది అతనికి. అటు ఉరుములు మెరుపుల దడదడ..! ఇటు ఈమె చేసే భీభత్సం..! అల్లరి..!! నారాయణ మామయ్య తమకు పరిచయమే లేకపోతే బాగుండేది. ఈ బాధ్యత తమకు అప్పచెప్పకపోయి ఉంటే కొంతైనా బాగుండేది. ఎంతగానో తమను తన ఋణాన పడేసుకుని తమను నిర్బంధంలో వేసేసుకున్నాడు. కానీ తాము మాత్రం ఆమెను ఒంటరిగ ఎట్ల వదిలేవారు..? విమర్శ్ కి ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. ఆయన మరణ వార్త వింటూనే వెంటనే అమ్మానాన్నలతోపాటు తాను కూడ వచ్చాడు తోడుగ. అప్పుడు పదహారేళ్ళు ఆమెకు. ఏడుస్తూ అమాయకంగ కూర్చుని ఉంది. మామయ్య చేసిన అప్పులకు బదులుగ వాళ్ళు ఇల్లు జప్తు చేసేసుకున్నారు. వాళ్ళలో ఒకడు ధరిత్రిను చూసి అనకూడని మాట ఏదో అన్నాడు. అప్పుడు నాన్న, మిగిలినవారు వాడికి మంచిగ బుద్ధి చెప్పారు. వాడిని తన్నటంలో తనూ వారికి సహకరించాడు. ఆ సన్నివేశం చూసి అమ్మ మనసంతా వేదనతో నిండిపోయింది. ఎవరి కడుపున పుడితే ఏంటి..? అభం శుభం తెలియని పసిపిల్ల.. తమను సొంతవారికన్నా మిన్నగ చూసుకున్న నారాయణమామయ్యకు మిగిలిన ఒకే ఒక గుర్తుగా ధరిత్రి తమ ఇంట స్థానం సంపాదించింది.
          ఠపామని శబ్దం వచ్చింది అంతలోకి. ఏవో గాజు వస్తువులు విసిరేసినట్టుగ ఉంది. వంటగదిలోకి వెళ్ళిందా ఏంటి..? ఆయింత కడుపులో పొడుచుకుందంటే కష్టం..! ఇది ఎప్పుడూ లేదే..! ఏం పగలగొడుతోంది..? అరే.. అద్దాలు బద్దలు కొడుతోంది..! అమ్మో, ఆమెకు అవి గుచ్చుకుని ఏమైనా అయితే..?! విమర్శ్ వివశుడై లేచి తలుపు తెరిచి బయటకు వెళ్ళాడు. పరుగులాంటి నడకతో వంటగదిలోకి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి శిలలా స్తంభించిపోయాడు. భగవంతుడా..!! ఎంతటి పరీక్షాసమయం నాయనా..!!
******
3
          పైన ఫ్యాన్ తిరుగుతున్నా విమర్శ్ చెమటతో తడిసిపోతున్నాడు. డా.చిద్విలాస్ ఎదురుంగ అతను తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు.
          "ఎందుకు అంత మనసు మీదకు తీసుకుంటావోయ్. ఏదో పెద్ద మర్డరు చేసినవాడిలా బాధ పడితే ఎట్ల..?"
          "మర్డరు చేసినా అంత బాధ పడేవాడిని కాదు సర్.." విమర్శ్ అన్నాడు కళ్ళ నిండా నీరు నిండిపోతుంటే. "ఏదైనా ఉపాయం తొందరగ చూడండి.. నా ముఖం నేను అద్దంలో చూసుకోలేకపోతున్నాను."
          విమర్శ్ ఏడ్చేశాడు. డా.చిద్విలాస్ అతన్ని ఓదార్చే ప్రయత్నమేదీ చేయలేదు. సైకియాట్రిస్టుల దగ్గర పెద్దపెద్ద వారే గుండెలు బద్దలయ్యేలా ఏడ్చి పోతారు. ఎక్కడా బయట పడని ఒకరకమైన పట్టు కల విమర్శ్ లాంటివారు కూడ వాళ్ళ ముందు బయటపడతారు. తప్పు చేసినవాళ్ళయితే ఆయన కళ్ళు అస్సలు తప్పించుకోలేరు. మనిషిలోని ఎంతో సున్నితభాగం మనసు. అక్కడ తడితే ఎంతటి వారైనా చిత్తు కావాల్సిందే. విమర్శ్ కి ఐదు నిముషాలు పట్టింది బయటకు రావటానికి. దానికోసమే ఓర్పుగ ఎదురు చూస్తున్న డా.చిద్విలాస్ అతనికి గ్లాసుడు మంచినీరు అందించాడు. అతను అవి తాగి కాస్త కుదుటపడ్డాడు.
          "ఎందుకట్ల అధైర్యపడతావు..? అన్నీ సర్దుకుంటాయి నాయనా. చిన్నపిల్లాడిలా ఏడుస్తావెందుకు..?"
          "చిన్నపిల్లాడినైతే బాగుండేది సర్. అన్నీ తెలిసీ నేను అట్ల చేయవలసింది కాదు. నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు."
          "చూడు, తప్పు చేశానని ధైర్యంగ ఒప్పుకుంటున్నావు కదా. దానికైనా చాలా ధైర్యం కావాలి. పశ్చాత్తాపం సగం ప్రాయశ్చిత్తం. నిష్కృతి లేదని నువ్వేం తేల్చిపారేయకు. మన హిందూ ధర్మంలో పాపపరిహారానికి కొన్ని విధులు చెప్పబడ్డాయి. వాటిని తర్వాత చూద్దాం. నేను చేతనైనంత త్వరగా కేస్ ని పరిష్కరిస్తానని మాటిస్తున్నాను. సరేనా..?"
          విమర్శ్ తల ఊపాడు. చాలు- ఆ ఒక్కమాట హృదయతాపాన్ని సగానికి తగ్గించి వేసింది. కళ్ళద్దాలు తుడుచుకుని సరిచేసుకుని గట్టిగ ఊపిరి పీల్చి కూర్చున్నాడు విమర్శ్.
          "మీ వాళ్ళు తిరిగి వచ్చారా..?"
          "నిన్ననే వచ్చారు.." అని ఆగి, "వీసా పని మీద వెళ్తున్నానని అబద్ధం చెప్పి ఇంక ఉండబట్టలేక మీ దగ్గరకు వచ్చేశాను. అసలు నిలవనీయటం లేదు నా ఆత్మసాక్షి. నిజాన్ని భరించలేకపోతున్నాను. నా నైతిక పతనం తట్టుకోలేకపోతున్నాను. నేను.. నేనసలు.. అట్ల ఎట్ల చేయగలిగాను..?"
          "నీకు అంత గట్టి ఆత్మసాక్షి ఉన్నందుకు నువ్వు సంతోషపడాలి. అతిగా గిల్ట్ మంచిది కాదు.. కానీ అసలు లేకపోవటం కూడ ప్రమాదమే. సరే- అది వదిలేయమన్నానా..? ఇంకేదైనా చెప్పు. నీ అమెరికా ప్రయాణం ఎంత వరకు వచ్చింది..?"
          "ఇంకో నెలలోకి వచ్చింది. పాస్ పోర్టు, వీసా, విశ్వవిద్యాలయం నుంచి ప్రవేశపత్రం అన్నీ సిద్ధంగ ఉన్నాయి. కానీ ఇంతలోనే ఇది కొత్త సమస్య వచ్చిపడింది.. వెళ్ళేలోపు ఇది తీర్చుకోవాలి.. కానీ ఎట్ల..?"
          "చూద్దాం. నెలరోజుల వ్యవధి ఉంది కదా. నేను ఆశాజీవిని. సందిగ్ధ పరిస్థితులలోనే కదా మనిషికి ధైర్యం కావాల్సింది..! అన్నీ బాగుంటే ఎవడైనా రారాజే. ఏమంటావు..? జీవితమే ఒక నిరంతర శోధన కదా..! మరి వేదన లేకుండ శోధన సాగేనా.. చెప్పు..? అయినా మనం అదంతా వదిలేసి జరగవలసింది చూడటం నేర్చుకోవాలి. నేను ఈవిషయంలో నిన్ను అభినందిస్తున్నాను. సమస్య వచ్చిన వెంటనే ఏడుస్తూ, కుమిలిపోతూ, ఆలోచిస్తూ కూర్చోక పరిష్కారానికి వచ్చావు. సరే మరి.. నువ్వు సన్నద్ధంగ ఉంటే మనం చర్చ మొదలుపెట్టాలి."
          విమర్శ్ తల ఊపి, "చెప్పండి.. సిద్ధంగ నే ఉన్నాను." ఆయన ప్రశ్నలకు సన్నద్ధమవుతూ, అన్నాడు.
          "మిస్ ధరిత్రి చూడటానికి ఎట్ల ఉంటుంది..?"
          "సర్.. ముందే అడిగితే ఫోటోనే తెచ్చేవాణ్ణి.. అవసరం లేదన్నారని తేలేదు."
          "ఇప్పుడు కూడ అవసరమేం లేదు. కాలక్షేపానికి అడగటం లేదు. చెప్పు. మాకు కొన్ని సమాచారాలు తీసుకనే విధానాలు కొన్ని ఉంటాయి."
          "ఏదైనా.. ఇది చాలా కష్టమైన ప్రశ్న. మళ్ళీ చెప్పిందగ్గరి నుంచీ ఏదో ఒకటి అని వెక్కిరించరు అంటే చెబుతాను."
          ఆయన నవ్వి, "అదా నీ బాధ..! సరే, చెప్పు. ఏమీ అననులే. అన్నా ఇంత జరిగాక కూడ నువ్వు ఒప్పుకోవు కదా..?" అన్నాడు.
          విమర్శ్ ఆలోచించుకుంటూ, "ఆమెను సరిగ్గ దగ్గరగ, అంత పూర్తిగ చూసింది మొన్నే సర్. అంతకు ముందు ఆమె గురించి అడిగి ఉంటే చెప్పలేకపోయేవాణ్ణి." అని ఆగి, "సరే, వినండి. నా మీదట కొంచెం తక్కువ రంగు. చామనచాయ.. నలుపుకు దగ్గరి చాయ. కళ్ళు కొంచెం నాకన్నా పెద్దవి. ముక్కు కొంచెం లావు. నాలాగ ఫ్లెషీ ముఖం కాదు. కొంచెం చెక్కేసినట్టు ఉంటుంది. మిగితా ఆకారం కూడ మరీ పీలగ కాకుండ ఉంటుంది. జడ నడుం దాకా పొడుగు, లావు కూడ. వెంట్రుక లావు. వేళ్ళు మొద్దుగ ఉంటాయి."
          "ఆమె పొడుగు ఎంత ఉండచ్చు..?"
          "ఐదూ నాలుగు ఉండవచ్చు. నాకు భుజాల వరకు వస్తుంది. పొడుగ్గ సన్నగ ఉంటుంది. మరీ పొడుగు పొట్టి కాని ముఖం. కళ్ళలో ఎప్పుడూ భయం ఛాయ ఉంటుంది. గట్టిగ అరిస్తే ఆమెకు భయం."
          "ఏం కట్టుకుంటుంది..? చీరా..?"
          "ఇదివరకు ఓణీలు వేసుకునేది. ఇప్పుడు చీరలే కట్టుకుంటుంది. ఊర్లలో అంతే కదా సర్.."
          "ఔను. తినటానికి ఉన్నా లేకపోయినా కనీసం ఒంటి నిండా బట్టలు గారంటీ.."
          విమర్శ్ నవ్వాడు కొంచెం. ఆయన ఆ నవ్వునే చూస్తూ, "నిజంగ నువ్వు నవ్వితే కత్తిలాగుంటావోయ్.." అని మెచ్చుకుని విమర్శ్ ఇబ్బందిగ కదిలేసరికి, "ఏం చేయను..? నువ్వు ఇవాళ చాలా సీరియస్ గ ఉన్నావు. నాకు మాట్లాడటం రావట్లేదు. ఎవరైనా పట్టేసినట్టు ఉంటే మనకు కూడ అదే ప్రభావం పడుతుంది కదా.." అన్నాడు.
          "ఒక్కొక్కసారి క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు మీ సహాయం పొందుతూ ఉంటారు అని విన్నాను.. వాళ్ళతో ఎట్ల వ్యవహరిస్తారు మరి..? అడగంగనే అయితే అంతా పూసగుచ్చినట్టు చెప్పరు కదా..?"
          "అక్కడి స్ట్రాటెజీ వేరే ఉంటుంది లేవోయ్. అది నీమీద అప్లై చేయలేను కదా. నువ్వు క్రిమినల్ వి కావు కదా. స్వీట్ డీసెంట్ కామ్ యంగ్ మాన్ వి.."
          "వెక్కిరిస్తున్నారా..? చేసిన పని చెప్పాక కూడ..?"
          "ఇట్ల నువ్వు మాటిమాటికీ అక్కడే అరిగిపోయిన రికార్డులా తిరుగుతుంటే మనం ఆ లూప్ లో నుంచి బయటకు రాలేం బాబూ..! చేసింది చెప్పావు కనకనే, నీ మంచితనాన్ని, తప్పు ఒప్పుకునే గుణాన్ని మెచ్చుకోకుండ ఉండలేకపోతున్నాను. తెలిసిందా..?"
          "ఇప్పుడు ఇంక ధరిత్రికు ఎప్పుడు బాగైతుందో, ఎట్ల బాగైతుందో తప్ప నేనేదీ తెలుసుకోవాలనుకోవటం లేదు సర్. అది మీరు తొందరగ ఆలోచించాలని ఆశతో ఇట్ల మాటిమాటికీ అక్కడే అరుగుతున్నాను."
          "ఆశ.. గుడ్. మంచి మాట. ఏ భాషలో అయినా నాకు నచ్చేసే పదం ఆశ.. హోప్.. ఉమ్మీద్.. ఆహా.. అనిపిస్తుంది నాకు ఆ పదం తలచుకోంగనే. ఆ ఒక్క పదం భాషలోనుంచి తీసేసేయి- జీవితమంతా పేకమేడలా కూలిపోతుంది.."
          ఆయన మాటల్లో చాలా వాస్తవం ఉంది అనిపించింది విమర్శ్ కి. జీవితాన్ని మథించి శోదించి సాధించిన అమూల్యమైన అనుభవాల సముద్రం లోనుంచి ఏరిన ముత్యాల లాంటి జీవితసత్యాలు ఎన్నో చెబుతుంటాడాయన. నిజమే. ఆశ లేని జీవితం శ్వాస లేని శరీరం లాంటిది. ఆశ లేకుండ బ్రతికేవారు లేరా అంటే ఉన్నారు. కానీ వారి గమనానికి ఎటూ గతి, దిశ ఉండదు. ఆశ చచ్చిననాడు శ్వాస ఆగిపోయినంత దుర్భరంగ ఉంటుంది.
          ప్రతీ మనిషి ఏదో ఒక ఆశతో జీవిస్తుంటాడు ఈ భూమి మీద. మనిషికి మనుషులు తోడు వచ్చినా రాకపోయినా ఆశ కాగడాలా వెలుగు చూపిస్తూ ముందుకు తీసుకువెళుతుంది. వెన్నంటి రక్షిస్తుంది. విమర్శ్ కి ఆ ఆలోచన కాస్త ధైర్యాన్ని ఇచ్చింది. అదే ఆలచిస్తూండిపోయాడు.
          "ఓయ్.. చిన్నబాబూ.. నిన్నే.."
          విమర్శ్ తేరుకుంటూ అన్నాడు- "చెప్పండి.."
          "చెప్పాల్సింది నువ్వోయ్.. మిస్ ధరిత్రికి స్నేహితులు ఉన్నారా.. ఉంటే ఎంతమంది..?"
          మళ్ళీ ఇదొకటా..? పాము కూడ ఇంత తొందరగ వంకరలు తిరగదేమో. ఎప్పటికి ఈ వంకర ప్రశ్నలు పూర్తి కావాలో, ఎప్పటికి ధరిత్రి సమస్య పరిష్కారం కావాలో..!!
          "చెప్పు విమర్శ్.. మనం సమస్య గురించి మాత్రమే మాట్లాడుతున్నామని నేను నీకు ఎట్ల నమ్మకం కల్పించాలో నాకు తెలియటం లేదు. నా మీద నమ్మకం ఉంచి వచ్చావు కదా. ఇంకా సందేహిస్తావెందుకు?"
          "అయ్యో.. అది కాదు సర్.. లెక్క పెట్టుకుంటున్నాను. ధరిత్రికి సమస్య వచ్చిన దగ్గరి నుంచి ఎవ్వరూ దగ్గరకు రావటం లేదు అని చెప్పాకదా..! కానీ అప్పటికీ అందరినీ తీసేయంగ తను బాగా గడిపేది- పక్క ఇంటి సుజాతతో- ఆమె అమావాస్య దరిదాపుల్లో తప్ప ధరిత్రికి భయపడదు. ఇంక పూజారి గారి కూతురు చండీ. పున్ని మా పాలేరు చెల్లెలు.. కాస్త దగ్గరగ ఉంటారామెకు."
          "సుమారు ఎంత సమయం గడుపుతంది వీరితో..?"
          దేవుడికెరుక..!! తనకేం తెలుసు..? ఎప్పుడన్నా కూర్చుని లెక్క పెడతాడా..?
          "పోనీ ఆమె దినచర్య చెప్పు.. పైపైన అయినా సరే..?"
          ఈయన సిబిఐ లో ఉండి ఉండాల్సింది..! విమర్శ్ కష్టం మీద సహనం వహించాడు. సమస్యకు దూరంగ సంభాషణ సాగటం లేదని ఆయన స్పష్టం చేశాడు. కనక సహకరించక తప్పదు.
          "నేను ఎక్కువగ ఇంట్లో ఉండను. నాకు పెద్దగ తన గురించి ఏమీ తెలిసే అవకాశం లేదు. చూసినంతలో- ఉబ్బసం వ్యాధి ఉన్నా, ఉదయం ఐదున్నరకు లేస్తుంది. నేను ఆరింటికి లేచేసరికి స్నానం చేసి పూలు కోస్తుంటుంది. మా అమ్మకు కాఫీ పెట్టి ఇస్తుంది. నాన్నకు వ్యాయామానికి అన్ని ఏర్పాట్లు చూస్తుంది. నాకు స్నానానికి నీళ్ళు పెట్టటం లాంటి పనులు చేస్తుంది. అప్పటికి పున్ని వస్తుంది. ఇద్దరూ కలిసి ఇంట్లో ఊడవటం తుడవటం కడగటం మొదలైన పనులు చూస్తారు. నేను ఎనిమిదిన్నరకల్లా వెళిపోతానని టిఫిన్ చేసి పెడుతుంది. తర్వాత అమ్మ వంట పని చేస్తే సహాయం చేస్తుంది. అది కూడ నిన్ననే తెలిసింది. ఇంక భోజనం చేసి కాసేపు పడుకుని లేచి చెట్లకు నీరు పెట్టటం లాంటివేవో చేస్తుంది. నేను ఇంటికి చేరేసరికి రాత్రి తొమ్మిదిన్నరైనా అవుతుంది. వాళ్ళంతా తినేస్తారు కానీ నాకోసం భోజనం వేడి చేసి పెట్టి నేను తిన్నాక తను పడుకుంటుంది. నాన్న పదిన్నరకు, అమ్మ పదకొండుగంటలవరకు పడుకుంటారు. నేను పడుకునేసరికి పన్నెండు దాటుతుంది. ఒక్కొక్కసారి ఒంటిగంటైనా దాటుతుంది."
          "ఇంట్లో ఎవరెవరు ఉంటారు..?"
          "అమ్మా, నాన్నా, నేను, ధరిత్రి.. అంతే. సీను, పున్ని ఔట్ హౌస్ లో ఉంటారు. అది ఇంటి దక్షిణ ప్రహరీకి ఆనుకుని ఉంటుంది. రాత్రి భోజనాలు చేసి ఇద్దరూ వెళిపోతారు. సాధారణంగ ఆ తర్వాత వాళ్ళతో ఏమీ అవసరం పడదు. సోమూ అని వాళ్ళ చుట్టాలబ్బాయి మాత్రం మధ్య మధ్య పనుల మీద వచ్చిపోతుంటాడు. నాలుగైదు సంవత్సరాలుగా ఏదో చిన్న వ్యాపారం లాంటిది చేసుకుంటున్నాడట.. ఆ పనిమీద రామాపురం వస్తుంటాడు."
          "వయసు..?"
          "సుమారు నాకన్నా ఓ రెండేళ్ళు చిన్న. సీను కూడ ఓ యేడాది అటూ ఇటుగ నా వయసే."
          "మిస్ ధరిత్రి గది ఇంటి లోపలా బయటా..?"
          ఎక్కడైతే ఈయనకెందుకు..? వెధవ ప్రశ్నలతో చంపుతున్నాడు కదా..!! "ఇంటి లోపలే. అమ్మా నాన్నల గది పైన ఉంది. నాది కూడ పైనే. కింద వరండాకి రైట్ లో ఉన్న గది ధరిత్రి వాడుకుంటుంది. కానీ పడుకోవటం అదంతా వరండాలోనే."
          "ఎందుకంటా..?"
          "ఏమో.. తెలియదు. మేము ఇక్కడకు రాక ముందు నారాయణమామయ్య ధరిత్రిని పెట్టుకుని జాగ్రత్తగ కాపాడుకుంటూ ఉన్న ఇల్లు అటు వైపు నుంచి కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ ఇంట్లో ఉండాల్సి వస్తే, ఆయన, తను ఆ గదినే ఉపయోగించుకునేవారట. అందుకని.. తండ్రి జ్ఞాపకాల కోసమేమో..! వరండాలో మాత్రం ఎవ్వరు పిలిచినా పలకటానికి వీలుగ ఉంటుందని పడుకుంటుంది. తన పని పట్ల తను చాలా ధ్యాస, శ్రద్ధ కలిగి ఉంటుంది."
          డా.చిద్విలాస్ అతను తెచ్చిన రికార్డరులో అరుపులు, మాటలు వింటూ చాలాసేపు మౌనంగ ఊరుకుని ఆలోచించాడు. విమర్శ్ కి ఏం చేయాలో తోచక, "ఏమైంది సర్...?" అన్నాడు.
          "నాకు ఎటూ తోచటం లేదోయ్. నేను ఒకసారి మీ ఊరికి రాక తప్పేటట్టు లేదు. వచ్చి మిస్ ధరిత్రిని కలవాలనుకుంటున్నాను.. కుదురుతుందా..?" అన్నాడాయన.
          విమర్శ్ ఆశ్చర్యంగ చూసి, "తెమ్మంటే తననే ఇక్కడకు తెస్తాను. చెప్పండి.." అన్నాడు.
          "ఏఁ. నేను మీ రాజ్ మహల్ చూడకూడదా..?"
          "అదేం లేదు... సరే, మీ ఇష్టం. కేదార్ కూడ అన్నాడు- మీరు వచ్చి చూస్తే బాగుంటుందని. కానీ నేనే కుదరదేమో వద్దనుకున్నాను. మీరే వస్తానంటున్నారు కనక నేను ఏర్పాటు చూస్తాను."
          "ఏం వద్దు. ఏర్పాట్లేం లేవు. నా కార్ లో వెళదాం. రేపు ఉదయం బయల్దేరదాం. మూడు గంటలు పడుతుందని చెప్పావు కదా. ఇవాళ రాత్రికి బయల్దేరచ్చు కానీ అర్ధరాత్రి కార్ ప్రయాణం మంచిది కాదు. నాకు తెలిసి నువ్వు హడావుడిలో వచ్చావు కనక ఎక్కడా ఉండే వ్యవస్థ కుదిరి ఉండదు. కనక నువ్వు ఈ పూట మా ఇంట్లోనే ఉండు. సరేనా..? మా అబ్బాయి వచ్చాడని సంతోషపడతాను."
          విమర్శ్ ముందు మొహమాటపడినా తర్వాత ఆయన ఆత్మీయంగ ఉండమని అభ్యర్థించేసరికి ఆలోచించుకుని ఇంక చేసేదేం లేక సరేనన్నాడు. ఆ రాత్రి గడిపి మరునాడు రామాపురం బయల్దేరారు ఇద్దరూ. కార్ ఊరిని సమీపించబోయేటప్పుడు అన్నాడు విమర్శ్- "సర్.. నేను చెప్పిన ఆ విషయం ఇంట్లో.. ఎవరికీ తెలియదు.. మీరు.." తడపాటుగ ఆగాడు.
          డా.చిద్విలాస్ అతని చేతిని తన చేతిలోకి తీసుకుని, "మా చిన్నబ్బాయివి నువ్వు అని చెప్పాను కదా.." అన్నాడు.
          విమర్శ్ కి ఆయన అట్ల ఇచ్చిన ఆశ్వాసన చాలా ధైర్యాన్ని ఇచ్చింది.

No comments:

Post a Comment