Saturday, 12 November 2016

4. సరైన అభ్యర్థి - (సంపూర్ణం)




          "ఎక్స్ క్యూజ్ మీ.. టైం ఎంతైంది..?"
          చదువుతున్న పుస్తకంలో నుంచి విసుకుగా తల ఎత్తి ఆ ప్రశ్న తనను అడిగిన వారి వంక చూశాడతను. అందమైన అమ్మాయి.. ఇరవై ఇరవై రెండు మధ్య ఉంటుంది వయసు. ఆమె వేసుకున్న లేత నీలి రంగు చుడీదార్ కు ఆమె వల్ల ఏదో కొత్త అందం వచ్చింది. చిన్న గుండ్రటి జుట్టు, కాటుక కళ్ళు, వదులు జడ, చెవులకు రింగులు, మెడలో చిన్న లాకెట్ గొలుసు, కాళ్ళకు కొద్దిగ హై హీల్ సాండల్స్, చిన్న మువ్వలున్న సన్నటి వెండి పట్టీలు..
          అయితే అతను అవేమీ పట్టించుకోకుండ ఆమె ఛాతికి హత్తుకున్న ఫైల్ వంక చూశాడు. ఆ ఫైల్ ని హత్తుకున్న చేతికి చిన్న గుండ్రటి డైల్ ఉన్న బంగారు రంగు చైన్ వాచ్ ఉంది. దాని వంక ఓ రెండు నిముషాలు చూసి, తిరిగి ఆమెను చూసి, నిర్లక్షంగ తన పుస్తకంలోకి దూరాడు.
          "హలో, మిమ్మల్నే..! టైం ఎంతైంది..?" ఇసుమంత చిరాకుతో మళ్ళీ అడిగిందామె. అతని పద్ధతి ఆమెకేం నచ్చలేదు.
          "ఆ మాట మీ చేతికి ఉన్న వాచ్ ని కూడా అడగవచ్చు." అన్నాడతను తలెత్తకుండానే.
          ఆమె తన చేతిని అతని వైపు సారించింది. అతను పుస్తకం పక్కకు జరిపి, దాని డైల్ వంక చూశాడు. గంట ఆలస్యంగ నడుస్తోందది.
          "అందుకే మిమ్మల్ని టైం అడిగాను. పనిలేక కాదు.." అందామె
          అతను విసుకుగా నిట్టూర్చి, సరేనని తన చేతి వాచ్ ఆమె వంకకు సారించాడు. అది చూసి, "థాంక్స్.." అందామె. అతను తిరిగి తన పుస్తకంలోకి దూరాడు.
          "మీరు ఏం చదివారు..?" అడిగింది మళ్ళీ కాసేపాగి.
          అతను తలెత్తలేదు.
          "అంత చెప్పుకోలేని చదువైతే వదిలేయండి పోనీ.." అందామె నవ్వి.
          "మాస్టరాఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్.., పీజీడీసీయే.." చెప్పాడతను ఠకీమని.
          "ఓహ్.. ఈ ఉద్యోగానికి సరిగ్గ సరిపోయే చదువే..! మంచి అర్హత.." అందామె.
          "అప్లై చేసే ముందు నేనది సరి చూసుకున్నాను లేండి.." అన్నాడతను ఆమె వంక చూడకుండానే.
          "ఇప్పుడు చదువుతున్నది ఏం పుస్తకం..?"
          "ఇంటర్వ్యూ ఇచ్చేది లోపల అనుకుంటా.." అన్నాడు అయిష్టంగ.
          "ఏం చదువుతున్నారో చెప్పకూడదా..? అంత దాచుకుని చదివేదా?"
          ఈసారి అతను పుస్తకం చూపించలేదు. ఆమె వెంటనే ఆ పుస్తకం తన వైపు లాక్కోని చూసింది. ఆశ్చర్యంగ, "ఏంటి..? కాళిదాసు మేఘదూతమా..? ఇప్పుడు ఇక్కడ ఆ పుస్తకం ఎందుకు చదువుతున్నారు..?" అని అడిగింది.
          "ఏఁ..? ఇప్పుడు ఇక్కడ ఆ పుస్తకం చదవకూడదనే నియమం ఏమైనా ఉందా..?"
          "అని కాదు. అది ఇంటర్వ్యూకు ఏ విధంగ పనికివస్తుందా అని.."
          "ఇంటర్వ్యూకు చదివేది ఇంటర్వ్యూ గదిలో ఎదురుచూస్తూ కాదు కదా.."
          "మీకు ఇంటర్వ్యూ అంటే భయం లేదా..?"
          "ఎందుకు లేదు? అది పోవటానికే చదువుతున్నా."
          "అట్లగా..! మీకు చాలా అనుభవం ఉన్నట్టుందే.."
          "ఊఁ. ఇరవై అనుభవాలు.. అలవాటైపోయింది."
          "ఓహ్.." అని ఆమె కాస్త నవ్వి, "ఏం లేదు.. నాకు కాస్త టెంషన్ గా ఉంది. నాది మొదటి ఇంటర్వ్యూ కదా. అందుకే..! ఏదో ఒకటి మాట్లాడుతుంటే అది పోతుందని, పక్కనే ఉన్నారు కదా అని మీతో మాట్లాడుతున్నాను.." అంది.
          అతను పుస్తకం కాస్త మడిచి, ఆమె వంక చూస్తూ, "మీరేం కంగారు పడకండి. ఇక్కడ డైరెక్టరు ఒక మహిళామణి. కాబట్టి మగవాళ్ళకు కాకుండ ఆడవాళ్ళకు అవకాశం ఇవచ్చు. మీరు కాస్త బాగా చేశారంటే మీకే రావచ్చు ఉద్యోగం. ఇక్కడ మీరు కాక ఇంకొక్క అమ్మాయే ఉంది. సో, మీరే విజేత కావచ్చు కూడా." అన్నాడు.
          ఆమె చాలా సంతోషంగ నవ్వుతూ, "అబ్బ, నాకే ఈ ఉద్యోగం వచ్చేసినంత ఆనందంగ ఉంది." అని ఆగి, "థాంక్స్.." అంది.
          అతను తిరిగి పుస్తకంలోకి దూరబోయాడు.   
          "మ్.. మీ పేరు తెలుసుకోవచ్చా..?"
          "ఎందుకు?"
          "నా తొలి ఇంటర్వ్యూలో నాకు భయం వేస్తుంటే దాన్ని పోగొట్టిన మంచివ్యక్తిగా మిమ్మల్ని గుర్తు పెట్టుకుందామని.."
          అతను చిరునవ్వు నవ్వి, "పేర్లు తెలియకుండా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఇంకా త్రిల్లింగ్ గా ఉంటుంది." అన్నాడు పుస్తకం తెరుస్తూ.
          ఆమె హతాశురాలై చూసింది. మళ్ళీ కాసేపాగి- "మీకు పుస్తకాలంటే అంత ఇష్టమా..?" అని అడిగింది.
          "లేదు.. కాలం వృథా చేయటమంటే అయిష్టం.." అన్నాడతను. 'ఇకనైనా ఆపితే మంచిది' అని సూచిస్తూ.
          "అ..అంటే ఎప్పుడూ చదువుతూనే ఉంటారా..?"
          "ఊఁ.. అవకాశం దొరికినప్పుడల్లా, అదృష్టం కలిసి వచ్చినప్పుడల్లా.. మీలాంటి వారెవరూ అడ్డం పడకపోతే.. చదువుతాను.." ఈసారి మరింత సూటిగ చెప్పాడతను.
          ఆమె పట్టించుకోలేదు. "మీకు సంస్కృతం వచ్చా..? లేక అనువాదం మాత్రంతో తృప్తి పడుతున్నారా?" అని అడిగింది.
          అతను తన పుస్తకం ఆమెకు చూపించాడు. అందులో అనువాదం లేదు. మూలమాత్రం ఉంది.
          "ఓహ్.. మీకు సంస్కృతం నేరుగా చదవగలిగే శక్తి ఉందా..? ఎట్ల..?"
          "డిగ్రీలో సెకెండ్ లాంగ్వేజ్.."
          "అది నాకు కూడా..! కానీ మరి నాకంతగా రాదెందుకని?"
          "తర్వాత సురభారతీ సమితి వారి సంస్కృత క్లాసులకు వెళ్ళాను. అందుకే బాగా వచ్చు.."
          "ఓహ్.. అట్లగా.. ఎప్పుడూ దాని గురించి వినలేదే..!"
          "ఎప్పుడూ పేపర్లో క్లాసులు మొదలయ్యేటప్పుడు వేస్తుంటారు. ఎవరూ పట్టించుకోరు."
          "అంటే సంస్కృతం నేర్చుకుంటే ఈ రోజుల్లో ఏం వస్తుందిలే అని నిర్లక్షం.."
          "ఏదో వస్తుందనే ఆశతోనే ప్రతీదీ చేసేవారికి ఏమీ రావని నా నమ్మకం."
          "బాగా చెప్పారు. ఆసక్తితో ఏదైనా చేయాలి కానీ, అనివార్యంగ ఏదో ఉద్దేశంతో చేస్తే అదీ నెరవేరదు, కొత్త విషయాన్ని నేర్చుకునే ఉత్సాహమూ పోతుంది.."
          అతను తిరిగి పుస్తకంలోకి మళ్ళాడు.
          "మీరింకా ఏమేం నేర్చుకున్నారు..?"
          ఈమె ఇంక చదువు కానిచ్చేటట్టు లేదు. అనుకుంటూ అతను చెప్పాడు- "హానికరం కానివి, నాకు అందుబాటులో ఉన్నవన్నీ నేర్చుకుంటుంటాను.. ఎక్కడికి వెళితే లాభం జరిగి, జ్ఞానమో, వివేకమో అలవడుతుందో అక్కడికల్లా వెళుతుంటాను.. అటువంటివారితోనే మాట్లాడతాను. డబ్బును కానీ, కాలాన్ని కానీ వృథా చేయటమంటే నాకు అసహ్యం." 'ఇప్పటికైనా ఉద్దేశం అందుకో తల్లీ' అన్నట్టు చూశాడు.
          ఆమె అందుకోలేదు. "మీలాంటి కొడుకు ఉండటం మీ తల్లిదండ్రుల అదృష్టం." అందామె ఆరాధనగా.
          అతను ఆమె వంక చూసి, "థాంక్స్.." అని తన పని చూసుకోసాగాడు.
          "నాన్నగారేం చేస్తుంటారు..?" అడిగిందామె కాసేపాగి.
          అతను ఆమె వంక సూటిగ చూసి, "ఇంతవరకు మిమ్మల్ని మీ ఒక్క వివరమైనా నేనడిగానా? ఎందుకు మీరు నా వివరాలన్నీ అడుగుతున్నారు..?" అనడిగాడు.
          ఆమె నవ్వి, ఏం చెప్పాలో తోచక పక్కకెటో చూసింది.
          అతను మళ్ళీ, "మీ భయం పోయింది కదా. ఇంక మాటలెందుకు? ఏదైనా మంచి విషయం ఆలోచించండి. లేదా పరిసరాలు గమనించండి. లేదా వేరెవరితోనైనా మాట్లాడండి. అదీ కాదంటే శ్వాస వ్యాయామాలేవైనా చేసుకోండి. అదీ కాదంటే నా దగ్గర ఇంకొక పుస్తకం ఉంది. అది చదువుకోండి. అంతేకానీ నన్ను దయచేసి విసిగించకండి." అన్నాడు.
          ఆమె వెంటనే కాస్త నొచ్చుకున్నదానిలా తల వంచుకుంది.
          "అయ్.. అయాం సారీ. ఇందాకటి నుంచి మీకు సైగ చేస్తే అర్థమవుతుందేమోనని ఎదురు చూశాకే ఇట్ల మాట్లాడుతున్నాను. ప్లీజ్.. నాకు పరిచయం లేనివారితో మాట్లాడటం అంతగా ఇష్టం ఉండదు." అన్నాడతను.
          ఆమె ఫరవాలేదన్నట్టు తల ఊపి, మౌనంగ ఊరుకుంది. అతను తనకేం పట్టనట్టు తన పని కొనసాగించాడు. అంతలోకి గంట మోగి, మొదటి పేరు "మిస్ ప్రోన్నతి" అని పిలుపు వినిపించింది.
          అందరూ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఎవరూ లేవలేదు. మళ్ళీ పిలిచాడు ప్యూను అయోమయంగ అందరినీ చూస్తూ. ఎవరికీ ప్రోన్నతి ఎవరో తెలియలేదు. రాలేదట్టుంది అనుకుని తరువాతి పేరు పిలిచారు. ఒకతను లేచి లోపలకు వెళ్ళాడు.
          అంతవరకూ మాట్లాడుతున్న ఆ అమ్మాయి నెమ్మదిగ నుదురు మెడా తుడుచుకుని లేచి అక్కడి నుంచి మౌనంగ వెళ్ళబోయింది. అతను అది గమనించి, ఆమెను ఆపి, "హలో, ఎక్కడికి..?" అన్నాడు.
          "ఇ..ఇంటికి..!" అందామె తడపాటుగ ఫైలును ఛాతికి మరింత హత్తుకుంటూ.
          "అదేంటి? ఇంటర్వ్యూ కాకుండానే..?" అనడిగాడు.
          ఆమె అటూ ఇటూ చూసి, "నా ఇంటర్వ్యూ అయిపోయింది.. ప్.. పేరు పిలిచేశారు. న్..నేను వెళ్ళలేదు.." అంది.
          అతను ఆశ్చర్యంగ, లేచి నిలబడి, "అదేంటి..? ఎందుకట్ల..?" అన్నాడు.
          "భయం వేసింది. కదలలేకపోయాను.." అందామె కొంచెం వణుకుతూ.
          "అయ్యో.. ఎంత పని జరిగింది..! మంచి అవకాశం చేతులారా పోగొట్టుకున్నారు. ఎంత అవివేకం!!" అన్నది పక్కన అమ్మాయి అది విని.
          "హౌ ఫూలిష్.." అన్నాడు మరొక అబ్బాయి.
          "హలో, మీరు ఊరుకోండి. ఆమెను ఇంకా కంగారు పెట్టకండి." అని అతను ఆమెను కూర్చోమని చెప్పి, తను వెళ్ళి ప్యూనుతో మాట్లాడి, విషయం చెప్పి, ప్రోన్నతి పేరు మళ్ళీ కాస్తాగి పిలవమని చెప్పి ఒప్పించి వచ్చాడు. "చూడండి ప్రోన్నతిగారూ, యుద్ధంలో పోరాడటం రాకపోయినా యుద్ధం చూడటానికైనా వెళ్ళచ్చు. ఫరవాలేదు. ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తే చాలు. మీకు అఖండమైన ధైర్యం వచ్చేస్తుంది." అన్నాడు తను కూర్చుంటూ ఆమెనూ కూర్చోమని.
          ప్రోన్నతి తల అడ్డంగ ఊపి, కూర్చోకుండానే, "లేదండి. నాకు మొదటి నుంచి ఈ పిరికితనమే ఉంది. నేను వెళిపోతాను. మళ్ళీ ఈసారి బ్.. బాగా ప్రిపేరై వస్తాను.." అంది.
          అతను ఆమె పరిస్థితి చూసి, లేచి వెళ్ళి అక్కడ మంచినీళ్ళ కూలర్ దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసుడు చల్లటి నీరు తెచ్చి ఆమెకు ఇచ్చి, "ముందు ఈ నీరు తాగండి.." అన్నాడు.
          ఆమె ఆ గ్లాసు అందుకుని గటగటా తాగేసింది. "ఇప్పుడు వెళ్ళి వాష్ రూమ్ లో కాస్త చల్లటి నీటితో ముఖం కడుక్కుని రండి.." అని దారి చెప్పాడు.
          ఆమె వెళ్ళి ఐదు నిముషాలాగి కాస్త ఫ్రెష్ అయి వచ్చింది.
          "ఎట్ల అనిపిస్తోందిప్పుడు..?"
          "ఫ్..ఫరవాలేదు..! కానీ నేను ఇంటర్వ్యూకు వెళ్ళను. నాకు ఈ జాబ్ ఎట్లగూ రాదు.." అందామె.
          "సరే, అయితే మీకు ఫలితం తెలిసిపోయింది. ఇంక టెంషన్ ఎందుకు? కచ్చితంగ మీకు జాబ్ ఎట్లగూ వచ్చే అవకాశం లేదని నిర్ధారణమైపోయింది. ఇప్పుడు మరింత ధైర్యంగ మీరు ఇంటర్వ్యూ చేయవచ్చు కదా." అన్నాడతను.
          ఆశ్చర్యంగ చూసింది ప్రోన్నతి. "అదేంటి? జాబ్ రాదన్నప్పుడు ఇంటర్వ్యూకు వెళ్ళటం దేనికి?"
          "ఇంటర్వ్యూకు జాబ్ కోసం వెళతారని మీకెవరండీ చెప్పారు..? ఇంటర్వ్యూకు వెళ్ళేది అనుభవం కోసం. మీకొక రహస్యం చెప్పనా..? ఇంటర్వ్యూకు వెళ్ళటం అంటే మన ప్రయత్నం మనం చేయటం. జాబ్ రావటం రాకపోవటం దాని ఫలితం. దానితో మనకు ఏం సంబంధం ఉండదండి. ఇంటర్వ్యూ బాగా చేయాలి. అంతే ధ్యేయం. జాబ్ రాలేదనుకోండి, 'మన వంటి యోగ్యులను పోగొట్టుకున్నందుకు కంపెనీ బాధపడాలి. మనం కాదు.' అనుకుంటాం." అన్నాడు.
          ప్రోన్నతి కాస్త నవ్వి, "వింటానికి చాలా బాగుంటాయండి.. ఈ మాటలు" అంది.
          "అయ్యో, నేను ఇన్నేళ్ళుగా ఆచరించి చెబుతున్నవండి. ఉత్త వింటానికే అయితే నేను మీకు చెప్పేవాణ్ణే కాదు.. నేనూ ఎవరైనా చెబితే విని ఊరుకునేవాణ్ణి."
          అంతలో ఎవరో పక్కన అతను అన్నాడు- "పోనీ వదిలేయి బాస్.. వెళిపోనీరాదా..! మనకే ఒక వంతు కాంపిటీషన్ తగ్గుతుంది."
          "ఇదే పరిస్థితి నీకు వస్తే కూడా మేము ఇదే అనుకుంటాం. నీకు ఓకేనా బాస్..?" అడిగాడు అతనిని సూటిగ.
          ఆ మాట అన్న అతను తల వంచుకున్నాడు. అప్పుడే ఇంటర్వ్యూ అయిపోయి వ్యక్తి బయటకు రావడంతో మరొకరి పేరు పిలిచారు. పిలిచినతను లేచి లోపలకు వెళ్ళాడు.
          ప్రోన్నతి వెంటనే, ఏదో నిర్ణయించుకున్న దానిలా, "సారీ, మీ అందరికీ కాంపిటీషన్ చాలా టఫ్ గ ఉండబోతోంది. కాచుకోండి. నేను ఎక్కడికీ వెళ్ళటం లేదు." అని అక్కడే కూర్చుంది.
          "దట్స్ ద స్పిరిట్." అన్నాడతను బొటనవేలు ఎత్తి తంమ్సప్ లా పట్టుకుని.
          ప్రోన్నతి నవ్వి, "మనుషులు ఇట్ల ఆలోచిస్తారని నాకు తెలియదు. షాకింగ్.." అంది.
          "అందులో తప్పేం ఉందండి..? ఎవరి లాభం ప్రకారం వారు ఆలోచించటంలో తప్పు లేదు. ఒక వంతు పోటీ తగ్గినా సంతోషమే కదా. ఎవరికైనా ఆశ అట్లగే ఉంటుంది. మీరు వారికి ఆ అవకాశం ఇవ్వటమే అసలు తప్పు."
          "నిజం చెప్పారు." అని ఆగి, ప్రోన్నతి నవ్వుతూ, "హాయ్.. -ప్రోన్నతి.." అంది చేయి ఇచ్చి.
          అతను ఆ చేతి వంక చూసి, మర్యాదకు ఒక వేలు ముట్టుకుని, "హాయ్.. -విస్మయ్.." అన్నాడు.
          "ఊఁ..? విస్మయ్..? చాలా వింతగ ఉందే మీ పేరు..?" అంది ప్రోన్నతి.
          "ఊఁ. దాని అర్థం కూడా అదే. అందుకేనేమో.." అన్నాడు విస్మయ్ నవ్వి.
          "మీ పేరు మీలాగే చాలా బాగుంది. చెప్పినందుకు థాంక్స్. నా మొదటి ఇంటర్వ్యూను విజయవంతం చేసిన మీ పేరైనా తెలియకపోతే చాలా బాధపడేదాన్ని." అని ఆగి, "ఇందాక ఈ స్థితి రాకూడదనే ఏదో ఒకటి మీతో ఆగకుండ మాట్లాడుతున్నాను. బాగా విసిగించినట్టున్నాను. సారీ.."
          "ఛ.. నేనే మీకు సారీ చెప్పాలి. మీరింత టెంషన్ పడుతున్నారనుకోలేదు. మీరు మాట్లాడటానికి వేరెవరినైనా ఎంచుకుంటే బాగుండేదేమో. మీకు ఆ స్థితి వచ్చేది కాదు."
          "అందరితో మాట్లాడాలి అనిపించదు కదా.."
          "నిజమే. నాతో మాత్రం మాట్లాడాలని మీకెందుకు అనిపించింది..?"
          "మీరు అంత శ్రద్ధగ ఇక్కడ కూడా పుస్తకం చదువుతుంటే చాలా బాగనిపించింది. మీరు చాలా బ్రిలియెంట్ గా అనిపించారు. నాకేమైనా లాభం జరుగుతుందేమోనన్న ఆశతో మాట్లాడాను." అని ఆగి, "చూశారా, మీరు చెప్పింది.. నిజమే. ఏదో వస్తుందనే ఆశతోనే ప్రతీదీ చేసేవారికి ఏమీ రావు..." అంది.
          అతను నవ్వి, "ఛఛ.. ప్రతీదీ ఏదో ఆశించే చేయటం తప్పు అన్నాను కానీ కొన్ని ఆశించే చేయటం మానవ నైజం." అన్నాడు.
          ప్రోన్నతి తల ఊపి ఊరుకుంది.
          విస్మయ్ కాసేపాగి, "మా నాన్నగారు పోస్ట్ ఆఫీస్ లో సీనియర్ పోస్ట్ మాస్టర్. మా అమ్మ టీచరు. ఇందాక అడిగారు కదా.." అన్నాడు.
          "ఓహ్.. అందుకే మీకు ఇన్ని ఫిలాసఫీలు తెలుసు. మీరొక్కరేనా సంతానం..?" అని అడిగింది.
          "ఊఁహుఁ.. ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. అక్కకు పెళ్ళైపోయింది. ఒక బాబు. తమ్ముడు ఇంకా ఎమ్మెస్సీ ప్రీవియస్ చదువుతున్నాడు. నేను ఉద్యోగవేటలో పడి సంవత్సరం దాటింది."
          "మీ ఆశయం ఏంటి..?"
          "ఒక మంచి మనిషిని కావాలి. గౌరవంగ బ్రతకాలి."
          "అదేంటి..? ఏం సాధించాలని అనుకోవటంలేదా..?"
          "ఏఁ..? మంచి మనిషిని కావాలనుకోవటం సాధించటం కాదా?" అని అతను నవ్వి, "మీరన్న సాధించటాలకు ముందు ఆర్థిక స్థిరత్వం ఉండాలి కదా. తిండి కలిగితే కండ కలదోయ్.. ముందు పునాది లేకుండ ఇల్లెట్ల కట్టేది..?" అని ఆగి, "అందుకే ప్రస్తుతానికి ఇదే నా ఆశయం." అన్నాడు.
          "ఓహ్.. పునాది దొరికాక కట్టే ఇల్లు ఎటువంటిదై ఉంటుందిట?"
          "అది దొరికిన పునాదిని బట్టి ఉంటుంది. చెప్పా కదా, ఆశపడి ప్రతీదీ చేయటం తప్పని. కానివ్వండి. ఏదో ఒక రోజుకు దొరకకపోదు. ఇంతదాకా ఎట్ల గడిచిందో అంతకు దిగజారకుండ ఉన్నా దేవుడి దయేనని సంతోషపడతాను. ఎక్కువ సంపాదన, ఎక్కువ ఖర్చు, ఎక్కువ వస్తువులు.. ఇదే జీవితం కాదు కదా..! ముఖ్యంగ పుస్తకంతో బ్రతికే నాలాంటి వారికి!!"
          "మీ ఉద్దేశంలో మానవ జీవితానికి ప్రయోజనం ఏంటి..?"
          "జ్ఞానార్జనం. దాని తర్వాతే మిగిలినవి.. అదీ టైం ఉంటే.."
          "కాస్త వివరించండి."
          "జీవితానికి ఏదైనా ఎప్పటికీ పూర్తి కాని ధ్యేయం ఉండాలి. నా విషయంలో అదే జ్ఞానార్జన. అదెప్పటికీ పూర్తి కాదు. ఇంక మిగిలిన విషయాలకు వస్తే, కార్యనిష్ఠతో ఎక్కడున్నా ఫలితం ఆశించకుండ మన కర్తవ్యం చేయటం, మంచితనాన్ని విడువకుండా ఉండటమే ముఖ్యం."
          ప్రోన్నతి ఆ సమాధానం విని ఏదో ఆలోచిస్తూ ఊరుకుంది.
          "అన్నీ నా గురించే అడుగుతున్నారు. అది మర్యాద కాదని తెలియదా..?" విస్మయ్ అడిగాడు అంతలో.
          ప్రోన్నతి నవ్వి, "మీరు అడిగితే చెప్పను అనలేదే. నాకు మీ గురించి కుతూహలం ఉంది కనక అడిగి తీర్చుకుంటున్నాను. మీకు నాగురించి ఉందో లేదో తెలియదు కదా.." అని ఆగి, "అడగకుండానే ఆడపిల్లనై ఉండి పేరు నేనే ముందు చెప్పానా లేదా..?" అంది.
          "నిజమే..! నాదే తప్పు. చెప్పండి. వింటాను. సారీ.. నాకేం అడగాలో కూడా తెలియదు.. మీరేం చెప్పినా వింటాను. మీ భయం అట్ల కూడా పోతుంది.."
          "సరే," అని ప్రోన్నతి నవ్వి, "పేరు తెలుసు కదా. బీకాం చదివాను. తర్వాత కంప్యూటర్స్ చేశాను. అంతే. పెద్దగ చదువంటే ఆసక్తి లేదు. ఫిజికల్ ట్రైనింగ్ లో డిప్లమా ఉంది. చిన్నపిల్లలంటే ఇష్టం. వాళ్ళకు ట్యూషన్ చెబుతుంటాను. మా నాన్నగారు ఏరనాటికల్ ఇంజనీర్.. ఏయిర్ పోర్ట్ లో పని చేస్తారు.. అమ్మ బ్యాంక్ లో ఎంప్లాయి. ఒక చెల్లి ఉంది. అంతే. అది ఇప్పుడు ఇంటర్ ఫైనల్. నాకు పాటలు వినటం ఇష్టం. ఆటలలో ఫుట్ బాల్ అంటే ప్రాణం. ఇంక బాగా మాట్లాడటం అంటే ఇష్టం. ఇంటర్వ్యూలో తప్ప..!!" అని నవ్వి, "పిల్లలంటే నాకు ప్రాణం. అందుకే టీచింగ్ సైడ్ వెళ్ళాలనిపించి ఇటు వచ్చాను. మా అమ్మమ్మ నా ఆదర్శం. ఆమెలా అన్ని వేళలా ధైర్యంగ ఉండాలనిపిస్తుంది. దేనికీ ఎవరి మీదా ఆధారపడకుండ అందరికీ చేతనైన సహాయం చేస్తూ బ్రతకాలని నా ఆశయం. మనిషి జీవించేదెందుకు..? తన జీవనం ద్వారా అవతలివాడి జీవనంలోని బరువు కాస్తైనా తగ్గించటానికి కాకపోతే..? ఇది నా ఫిలాసఫీ." అని చెప్పింది.
          విస్మయ్ చాలా ఆశ్చర్యంగ చూసి, "అమేజింగ్. మీరింత బాగా మాట్లాడుతున్నారు. ఇంతలో సగం చెప్పినా మీకు ఈ జాబ్ వచ్చేస్తుందనిపిస్తోంది. మీరు అనవసరంగ భయపడుతున్నారు. ఏదో మొదటి ఇంటర్వ్యూలో భయపడకపోతే ఎట్ల.. అన్నట్టు.." అన్నాడు.
          ప్రోన్నతి నవ్వి, అతనిని సూటిగ చూస్తూ, "లేదు. మీరే నా భయం పోగొట్టారు. థాంక్స్." అంది.
          అతను నవ్వి ఊరుకున్నాడు. అంతలోకి ఆమె పేరు పిలిచారు. ఠక్కున అటు చూసింది. విస్మయ్ ఆమెను చూశాడు. ప్యూను ఆమెను లోపలకు వెళ్ళమన్నట్టు సైగ చేశాడు. ఆమె ఫైలును మరికాస్త గట్టిగ హత్తుకుని లేచి సర్దుకుని నిలబడి విస్మయ్ వంక చూసింది. అతను చిరునవ్వు నవ్వి, "ఆల్ ది బెస్ట్" అన్నాడు.
          ఆమె చేయి ముందుకు చాపింది. అతను కొంచెం ఇబ్బందిగ చూసేలోపు, ప్రోన్నతినే ఆ చేతిని అందుకుని ఊపేసి థాంక్స్ అనేసి, నెమ్మదిగ అడుగులో అడుగు వేసుకుంటూ గది లోపలకు వెళ్ళింది. తలుపు తట్టి, "లోపలకు రావచ్చా?" అంది.
          "రావచ్చు. రండి.." అని వినిపించింది. ఆమె నెమ్మదిగ తలుపు తోసి లోపలకు వెళ్ళి, "నమస్తే మేడమ్." అంటూ తలుపు మూసింది. అక్కడ రివాల్వింగ్ చెయిర్ లో కూర్చున్న వ్యక్తి ఈమెను పై నుంచి కిందిదాక చూసి, "వావ్.. డ్రెస్ అదిరిందే..!" అంది.
          "'వే' ఏంటి మేడమ్..? మంచీ మర్యాదా లేకుండా..? ఇంటర్వ్యూకు వచ్చేవారితో ఇట్లగేనా మాట్లాడేది..?" అంది ప్రోన్నతి బాగ్ టేబుల్ మీదకు విసిరి, ఫైలు పక్కన పడేసి, కాలిమీద కాలు వేసుకుని వెనక్కు వాలి కూర్చుంటూ.
          ఆమె ప్రోన్నతికి స్వయానా మేనత్త కూతురు- వదిన సుధాలేఖ. ఇద్దరూ కలిసి పెరిగారు. ప్రోన్నతికన్నా ఆమె పదేళ్ళు పెద్దైనా ఇద్దరూ మంచి స్నేహితులు. ఆమె ఈ ఎయిడెడ్ గర్ల్స్ హయర్ సెకెండరీ స్కూలుకు ప్రింసిపాలుగా పని చేస్తోంది. అట్లగే హాస్టల్ వార్డెన్ కూడా. ఇప్పుడు స్కూల్ కోసం ఒక పీటీ మాస్టరు కావాలంటే ఇంటర్వ్యూలు వేశారు. ప్రోన్నతి సైకాలజీ చదివి కౌన్సిలింగ్ వృత్తిగ చేస్తోంది. సాయింత్రాలు ఖాళీ సమయంలో పిల్లలకు ట్యూషను చెబుతుంటుంది.
          "సర్లేవే.. ఇంతకూ ఏమంటున్నాడు మనవాడు..? నీ అనుభవ జ్ఞానంతో ఏం కనిపెట్టావు..?" ఆసక్తిగ అడిగిందామె.
          "కుర్రాడు బొత్తిగ రంగు రుచి వాసన లేని అర్భకుడు. నాకెందుకూ పనికిరాడు."
          "అంటే మన స్కూలుకు సరైనవాడన్నమాట. అయినా ఈ భూప్రపంచంలో నీకు ఏ మగవాడు నచ్చాడు కనక లే కానీ.., ఇంక వివరాలేంటి..?" ఆసక్తిగ అడిగింది సుధాలేఖ.
          "ఈ ఉద్యోగానికి సరిగ్గ సరిపోతాడు. స్కూలుకు తగినవాడే.. ఇంటర్వ్యూ కు ముందు కాళిదాసాదులు చదివే టైపు. పుస్తకాల పురుగు!! వీడి తాడు తెగ!! మాట్లాడితే కాల్చి బూడిద చేసేస్తాడేమో అన్నట్టు ఆ గుర్రు చూపులు, వాడు.. చంపేశాడు.. శ్వాస ఆడనివ్వలేదనుకో. అరే, ఎంత ప్రయత్నించినా రొట్టి నేతిలో పడదే. చివరకు భయం పంజా విసిరితే చిక్కాడు."
          "అదేంటి..? రెస్యూమ్ చూస్తే అట్ల అపించలేదే..! నువ్వు మాట్లాడింది విస్మయ్ తోనేనా..?"
          "అక్షరాలా ఆ ప్రబుద్ధుడితోనే తల్లీ. అబ్బ..! పెద్ద- పేరు చెప్పమంటే ఇచ్చుకున్నాడు ఫోజులు.. అరగంట!! టైం చెప్పమంటే ఏడుపు. ముఖం చూడడు..! ఏడుపుగొట్టు ముఖం అనుకో.."
          "ఏం కాదు. అతను నీ అందచందాలు చూసి పడీపడీ అందరు మగాళ్ళలా మాట్లాడలేదని నీకు బాధ. అంతే కదా..?"
          ప్రోన్నతి నవ్వి, అంది- "ఆ లక్షణమే నిజమైతే ఏ మగవాడిలోనైనా నాకు ఇష్టమైన గుణం అదొక్కటేనే సుధీ. అదెంత అరుదో దానికోసం వెతికి వెతికి నెరుస్తున్న నా జుట్టునడుగు.. చెప్తుంది." అని ఆగి, "చాలా కష్టపడాల్సి వచ్చింది.. ఎంత నటించాల్సి వచ్చిందో..! దిగిరాడే అసలు. అందుకే మొదట పిలిచినప్పుడు రాలేకపోయాను. మొత్తానికి భలేవాడు. కార్యదీక్ష, పట్టుదల, ఉన్నతాశయం, ఆశావాదిత, సహాయగుణం, మంచి మాటతీరు.. పుష్కలంగ ఉన్నాయి. అన్నింటికీ మించి మాడెస్టీ, సంయమనం..! తననే పొగుడుతున్నా ఎటో చూస్తున్నాడు. వావ్.. అది నాకు చాలా నచ్చింది. మంచి మెచ్యూర్ మనిషి."
          "ఇంకేం? నా ఆడపిల్లల్నంతా సేఫ్ గ అతనికి అప్పచెప్పచ్చన్నమాట..! అయితే అపాయింట్ చేసేయనా..?"
          "నూటికి నూటొక్కశాతం." అని ప్రోన్నతి ఆమెకు జరిగినదంతా వివరంగ చెప్పింది. "మిగితావారంతా సోసో. అంత బరువు ఎవ్వరిలో కనిపించలేదు. నేను చూసినంతలో విస్మయ్ బయోడేటాలో అక్షరం ముక్క కూడా తప్పు కాదు. చాలా టాలెంటెడ్."
          "అయితే ప్రభుత్వ కోటా ఇచ్చేద్దామా..?"
          "ఊఁ. నిశ్చింతగ." అని ప్రోన్నతి లేచి, తన ఫైలు, బాగూ తీసుకుంది. "నా పనైంది. నేను ఉంటాను మరి.."
          "అప్పుడేనా..?"
          "టైం లేదు. ట్రైన్ కి లేట్ అవుతుంది. ఇప్పటికే రాజేష్, వెంకీ, సుబ్బూ, సత్తీ, శీనూ అంతా ఎదురు చూస్తుంటారు.. అక్క రాలేదేంటా అని. వాళ్ళకు పరీక్షలున్నాయి."
          "సరే, ప్రబుద్ధుడిని ఇంక పరికించి ఏ సంగతీ ఫోన్ చేస్తాలే. కాండిడేట్ మంచివాడో కాదో అని చూడటానికి ఇంటర్వ్యూ గది చాలా చిన్న స్థలం. గది బయటే ఆ మనిషిని బాగా తెలుసుకోగలం. అందుకే ఈ అడ్డదారిలో నీ సహాయం కోరాను."
          "చూడు, రానున్న కొన్ని బాచ్ ల తరబడి, ఇంత మంది ఆడపిల్లల భవిత ఎవరి చేతిలో పెడతామో ఆ వ్యక్తిని ఎంత జాగ్రత్తగ ఎంపిక చూసుకోవాలో కదా. మిగిలిన టీచర్లైతే క్లాసుల్లో మాత్రమే పిల్లలతో ఉంటారు. ఫిజికల్ ట్రైనర్ అట్ల కాదు కదా. అందుకోసం కారెక్టర్ చాలా ముఖ్యం. తర్వాత చెడితే మనం ఏం చేయలేం. కానీ ఉండటమే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి కావాలని ఆశించటం సబబే. నువ్వు చేసింది తప్పేం కాదు. వచ్చిన అన్ని అప్లికేషన్లలో నీకు ఒక్క రెస్యూమే నచ్చింది. అతనినే పట్టుకున్నావు. అట్ల అని మిగిలినవారిని వదిలేయటం లేదే.. వారికీ ఫెయిర్ ఛాన్స్ ఇస్తున్నావు కదా. ఎవరైనా కాస్త బాగనిపించినా వాళ్ళను కూడా కదిలిద్దునే. కానీ ఎవ్వరూ అట్ల లేనేలేరు. కనక మనం చేసిందేమీ అనాగరికం కాదు, చట్ట వ్యతిరేకం కాదు."
          "ఏం లేదు.. అతనికి తెలిస్తే ఏమనుకుంటాడో.. అని.."
          "ఇదసలు అతనికి ఎట్ల తెలుస్తుంది? మన మధ్యే ఇది సమాధైపోతుంది. భయపడటానికి నాది ఈ ఊరే కాదు. నేనతనికి బయటెక్కడా ఎదురుపడే అవకాశం కూడా లేదు. నిశ్చింతగ ఉండు." అని చెప్పి మళ్ళీ యథావిధిగ అంతా సర్దుకుని ఇంటర్వ్యూ గదిలోకి వచ్చిన బెదిరిన ముఖం అతికించుకుని, "థాంక్యూ మేడమ్" అని చెప్పి బయటకు నడిచింది ప్రోన్నతి.        
***********

No comments:

Post a Comment