1
"మిస్టర్ ప్రార్థిత్.. మళ్ళీ
ఆలస్యం.. పదినిముషాలు.." ఆఫీస్ కి వెళ్తూనే అధికారిణి రమ్మంది అనే మాట
వింటూనే, ఇదే మాట వినాల్సి ఉంటుందని ప్రార్థిత్ కి తెలుసు.
"అది.. పెండింగ్ పార్టీ కాల్.. ఉండింది..
ఆలస్యమైంది. క్షమించండి.."
"నువ్వు రోజూ ఆలస్యంగ రావటం, క్షమార్పణ
కోరటం, నేను సరేననటం సాధారణమే కదా..! అలవాటైపోయింది. ఇంతకూ ఏం పార్టీ..? సైడ్
బిజినెస్సా..?"
"అయ్యయ్యో కాదు
మేడమ్.. నిన్న సాయింత్రం భారతి ఫౌండేషన్ వారు రిమైండర్ పంపితే దాని పని చూడటానికి వెళ్ళి
రమన్నారు.." అని ప్రార్థిత్ ఆమెకు బిల్ రిసీట్ తీసి చూపించాడు.
ఆమె అది అందుకుని చూసి, "అదా..?
అయితే.. సరే. వెళ్ళి పని చూసుకో." అనేసి తల మానీటర్ వంక తిప్పి తన పనిలోకి
పడింది.
అధికారిణి వయసు ఒక నలభైఐదు, యాభై మద్య
ఉంటుంది. చామనఛాయ. బాగా కష్టపడి పనిచేసి పైకొచ్చేయాలని తహతహ. దానికి కింది
ఉద్యోగులను అవసరానికన్నా అతిగా కాల్చుకు తింటుంటుంది. కంపెనీ తన సొంతంగ పెట్టుకుని
నడుపుకుంటోంది. ఎవ్వరినీ కేర్ చేసే రకం కాదు. చూడటానికి సంప్రదాయంగ చీర కట్టుకుని
చక్కగ, ఒద్దికగ ఉన్నా, లోపల మాత్రం భయంకరమైన ఆధునికత. పెళ్ళైనా ఇంకా కానిదానిలాగే
ఉంటుంది ఆమె ప్రవర్తన. బహుశ అత్తగారింట్లో సపోర్ట్ ఎక్కువ కాబోలు.
కాసేపు ఆమెను చూస్తూ ఊరుకుని, "నిన్న
ఏదో పార్టీ వచ్చిందన్నారు.." ప్రార్థిత్ కొంచెం సంకోచంగనే అడిగాడు.
అధికారిణి కొంచెం ఆలోచిస్తూ, అప్పుడే గుర్తు
వచ్చినదానిలా, "ఓ అదా..? నిషితాకి ఇచ్చాను. సారీ.." అంది.
"వ్వాట్ట్..???!!!" ప్రార్థిత్
కాస్త అపనమ్మకంతో అన్నాడు.
"వాట్ అంటే..?" ఆమె భృకుటి
ముడి పడింది.
ప్రార్థిత్ కాస్త తగ్గి, "అంటే అది..
నా టార్గెట్ అని చెప్పారు.." అన్నాడు.
"ఆఁ..ఆఁ.. నువ్వు ఇట్లగే రోజూ ఆలస్యంగ
రా. నీకోసం పార్టీ ఆపి పెడతారు. నిషితా ఉంది కాబట్టి సరిపోయింది. అయినా ఇంక నుంచి
అదే జరుగుతుంది. నువ్వు ఒక్క క్షణం ఆలస్యంగ వచ్చినా నీ కమిట్ మెంట్లన్నీ నిషీకి
వెళిపోతాయి." బెదిరించింది ఆమె తీవ్రంగనే.
ప్రార్థిత్ అనుకున్నాడు- 'ఎంత అన్యాయం!!
ఆమె నాకు పోటీయా..?'
"నిజంగ నిషీ వచ్చాక మనకు పేరు
పెరిగింది. వ్యవధి అయిపోయేలోపే పని పూర్తి చేయటమే కాదు. డిజైన్స్ కోసం వచ్చేవారిని
ఒప్పించి మెప్పించి వాళ్ళు అన్న మొత్తం కన్నా రెట్టింపు ఇచ్చేటట్టు చూస్తుంది...
అదీ వాళ్ళ పూర్తి ఇష్టంతో. తను వచ్చాక మనకు ఆర్డర్లు పెరిగాయి. కస్టమర్
సాటిస్ఫాక్షన్ పెరిగింది. అందరూ ఆమె డిజైన్లనే నచ్చుతున్నారు."
'ఆమె డిజైన్లనా..? ఏముంది అందులో అసలు
నచ్చటానికి?' అతని మనసు మూలిగింది.
"సారీ ప్రార్థిత్.. నీ ముందు ఇట్ల
మాట్లాడటానికి బాధగ ఉంది. మూడేళ్ళ క్రితం నువ్వు వచ్చినప్పుడు కంపెనీ ఒక్క వెలుగు
వెలిగింది. నీ డిజైన్లకోసం జనాలు ఎంతైనా ఇవ్వటానికి సిద్ధంగ ఉండేవారు. మరి
ఇప్పుడు..? దేవుడికే తెలుసు. నీ ప్రతిభ, నీ పనితనం, నీ దీక్ష, శ్రద్ధ
ఎటుపోయాయో..!! ఏదైనా, నేనేం చేయలేను. ఇంకేదైనా వస్తే నీకోసం తీసి ఉంచుతాను." అని
క్షణం ఆగి, "ఇక వెళ్ళవచ్చు." అంది.
"సరే మేడమ్.. థాంక్యూ.." ఇంక
చేసేదేం లేక తిరిగి వచ్చేశాడు బయటకు. బయట సిద్ధాంత్ తన టేబుల్ వద్ద తనకోసమే వేచి
ఉండి కనిపించాడు. రోజూ ఉదయం వస్తూనే కాసేపు మాట్లాడుకున్నాకే ఇద్దరూ తన పనులలోకి
వెళతారు. అదే అలవాటు మొదటి నుంచి.
"ఏంటి కరుస్తోంది..?"
"ఆడదయ్యాలు నడిపే కంపెనీలో జాయిన్
అయ్యే ముందు ఉండాలి.." ప్రార్థిత్ నవ్వుతూ అన్నాడు, చేతిలో బాగ్ కుర్చీకి
తగిలిస్తూ.
సిద్ధాంత్ నవ్వుతూ, "ఏమైందిరా..
మళ్ళీ ఆ నిషితా మింగేసిందా నీ టార్గెట్..?" అని అన్నాడు.
ప్రార్థిత్ విరక్తిగ నవ్వి, "నవ్వరా..
నవ్వు..!! బ్రతుకు!! అందరికీ చులకనైపోయాను..." అన్నాడు కుర్చీలో కూర్చుని.
"ముందు కాస్త తగ్గి కులాసాగా
కూర్చో బాబూ..! ఈ రోజు ఆమెగారు వేళకు ముందే దయచేసింది. బహుశ నువ్వు వేళకే వచ్చినా
లాభం జరగకపోవు. వెంచర్ ఆమెనే కొట్టేసింది." వివరించాడు సిద్ధాంత్ తను టేబుల్
మీద కూర్చుంటూ.
ప్రార్థిత్ వెనక్కు వాలి, "ఆడవాళ్ళు
బాసులుగ ఉంటే అదే జరిగేది..!! స్వజాతి ప్రేమ. ఎంతైనా మనమంటే చులకనగనే ఉంటుంది."
అన్నాడు.
"అంతే కాదు.. మొన్ననే తెలిసింది..
మేడమ్ వాళ్ళ బెస్ట్ ప్రెండ్ కూతరట." రహస్యంలాగ చెప్పాడు సిద్ధాంత్
"ఓహో. అందుకా ఇంత ఫేవరిజమ్!!
అనుకున్నా, ఏదో ఉండే ఉంటుందని."
"ప్రస్తుతం వసతి కూడా మేడమ్ వాళ్ళ
ఇంట్లోనే అట. ఎంత లక్కీ కదా, మంచి జాబ్.. మంచి వసతి.."
"అది వాళ్ళ వాళ్ళ అదృష్టంరా. కానీ
ఇది స్కిల్ కి సంబంధించింది. ఆమెకసలు డిజైన్ చేయటం లో బేసిక్స్ కూడా రావు. ఎంత
చింపిరి చింపిరిగా చీదర చీదరగా ఉంటాయో తెలుసా, ఆమె డిజైన్లు..?"
"ఆమె వేసే డిజైన్ల సంగతి నాకు
తెలియదు. కానీ ఆమె డిజైనింగ్ మాత్రం.."
"ఛి ఛి.. ఏంటా మాటలు..? మనిషి ఎట్ల
ఉంటే ఏంటి..? నిజంగ సత్తా ఉంటే ఫీల్డ్ లో చూపించమను."
"ఫీల్డ్ లో ఎందుకు సత్తా
చూపించదురా..? ఆఫీస్ లోకి వస్తూనే క్రియేట్ చేసే మాగ్నెటిక్ ఫీల్డ్ లో.. మేల్
స్టాప్ అందరిలో ఒక్క చూపుతో డెవలప్ చేసే ఇలెక్ట్రిక్ ఫీల్డ్ లో..!!" సిద్ధాంత్
నవ్వాడు.
"మా చిన్నప్పుడు పక్క ఇంటి అక్కయ్య
రాత్రిపూట ఎప్పుడైనా కరెంటు పోతే కాండిల్ చిబుకం కింద పెట్టుకుని ఆ వెలుగులో కళ్ళు
ఇంత చేసి నాలుక బయటకు పెట్టేది. భలే దడుచుకునేవాళ్ళం. అటువంటి సమయంలో నాకొక
భయానకమైన ముఖం ఊహలో కదిలేది. ఈ పిల్ల ముఖం చూస్తే ఆ ఊహే నిజమైందేమో అనిపిస్తుంది."
ఫకాల్న నవ్వాడు సిద్ధాంత్.
"లేకపోతే ఏంట్రా..? నేనేం
మాట్లాడుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావు..? ఆమెకు మిగితా వాటిలో ఏం సత్తా
ఉంటే నాకెందుకు..?" ప్రార్థిత్ అనాసక్తిగ అన్నాడు.
"అక్కడే పప్పులో కాలేస్తున్నావు. ఆడపిల్లల
సత్తా వేరే ఉంటుంది. అందరు మగవాళ్ళు నీలాగ ఆలోచించరు కదా. ఆమెకు ఏమీ రాకపోయినా
నెగ్గుకువచ్చేది ఆ సత్తాతోనే."
"అంతే కదా మరి. లేదంటే ఎవడైనా
సోఫాలు సర్కులర్ గా చేస్తారా..? ఎంత చెక్క మలిచే ఖర్చు..? ఎండ ఎక్కువ కొట్టే వైపు
లైట్ కలర్ కర్టెన్లు వేస్తారా..? త్వరగా పాడైపోవా..? టీవీ సరిగ్గ కిటికీ గ్లేర్
పడే చోటు పెడతారా..? ఆఫీస్ కాబిన్ లో చిన్నపిల్లల బొమ్మలు తగిలిస్తారా..? కనీసం
బేసిక్స్ కూడా తెలియవు. ఓ కలర్ కాంబినేషన్ తెలియదు. ఓ పాటర్న్ యూనిటీ తెలియదు. ఏవీ
పాటించదు. టైల్స్ కీ వాల్స్ కీ కర్టెన్స్ కీ ఫర్నిచర్ కీ ఎక్కడా పొంతన ఉండదు. తలా
తోకా లేని ఇంటీరియర్ లు... అంతకంటే బుద్ధి లేని ఆమె కస్టమర్ లు. అసలు ఏ యాంగిల్ లో
జనాలకు ఆ డిజైన్ లు నచ్చుతాయో నాకర్థం కాదు."
"డిజైన్లు ఎవడికి కావాల్రా..? మాట్లాడినంత
సేపు ఆ మూతి తిప్పుకుంటూ, కళ్ళు టపటపలాడిస్తూ, టిక్కు టిక్కు మనుకుంటూ, తుళ్ళి
తుళ్ళి పడుతూ నాలుగు కబుర్లు చెప్పంగనే ఎంతవారైనా బుట్టలో పడతారు. ఆమె డిజైన్లు
నచ్చటమంటే అంతే."
ప్రార్థిత్ సాలోచనగా నిట్టూర్చాడు.
"చూడరా, డిజైన్లు బాగుండవని నువ్వే
కాదు, వర్కర్లూ చెప్తున్నారు. ఆమె డిజైన్లు ఆర్డర్ వచ్చినప్పుడల్లా మన వర్కర్లు
మొత్తుకుంటున్నారు, సార్, ఇంతకు సగం ధరలో మేము చేయగలం సార్ డిజైన్ అంటారు. అయినా
తనకే ఆర్డర్లు వస్తున్నాయి. కారణం తన డిజైనింగ్ ప్రతిభ అయితే అయి ఉండదు. అక్కడ
ఇవాళ కాకపోతే రేపు ఆమె తీసికట్టే కదా. ఎన్నాళ్ళు అట్ల పని చేసుకుంటుంది..? తోలు
సక్కగ ఉన్నంత వరకే కదా.."
"అది నిజమేననుకో..! ప్చ్.. ఛ..
మంచి కెరీర్.. నాశనం చేసేస్తోంది.." బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు.
"ఎంతకాలంరా..? ఎంతైనా
ఆడపిల్లేగా..! ఇవాళ కాకపోతే రేపు అత్తవారింటింకి వెళ్ళాల్సిందే కదా.." సిద్ధాంత్
ధైర్యం చెప్పాడు.
"ఐతే అప్పటిదాకా నేనేం చేయాలిట..? ఆమెకు
మంచి సంబంధం కుదర్చమనో, లేక ఎవరితోనైనా ప్రేమలో పడేయమనో దేవుడిని ప్రార్థిస్తూ గోళ్ళు
గిల్లుకుంటూ కూర్చోవాలా..?" ప్రార్థిత్ నవ్వాడు అసహనంగ.
"అది కాదురా.."
ప్రార్థిత్ బాధగ చూస్తూ, "ఏది
కాదురా..? నాకు లేనిదేంటి..? వాస్తు వచ్చు. ఈస్తెటిక్స్ లో నెంబర్ వన్ పొజిషన్ లో
ఉన్నాను. ఎక్స్ క్లూసివ్ గా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు ఫుల్ ఫ్లెజ్ లో చేసేశాను. తనకేం
ఉన్నాయంట..? ఓ బోడి ఫాషన్ డిజైనింగ్ లో చేసిన ఛటాకు ఇంటీరియర్ డిజైనింగే కదా..!!
అంతకే పె...ద్ధ డిజైనర్ అయినట్టు ఫోజులు.." అన్నాడు.
"జనాలు ఆ ఫోజులు చూసి వస్తున్నారే
కానీ, డిజైన్లు చూసి కాదు. అదే నేనిందాకటి నుంచి మొత్తుకుని చెప్తున్నది. దానికే
నీకంత బాధ ఎందుకు..? నిజంగ నీకు ఫీల్డ్ లో పోటీ రాగలిగే సత్తా ఆమెకు లేదు. ఏదో
మేడమ్ ఫేవరిజమ్ వల్ల ఆమె పని నడుస్తోంది."
వాళ్ళు మాట్లాడుతూ ఉండంగనే ప్యూన్
పుల్లయ్య టీ తెచ్చి ఇచ్చాడు. ఇద్దరూ అది అందుకున్నారు.
"ఎక్కడటా ఈరోజు అమ్మాయిగారి
షికారు..?" అడిగాడు సిద్ధాంత్ ప్యూను పుల్లయ్యను.
ప్యూన్ పుల్లయ్య అతని దగ్గరకు వంగి,
చెవిలో, "బంజారా హిల్స్" అన్నాడు.
"వాళ్ళే తీసుకుపోయారా..?"
ప్యూన్ పుల్లయ్య తల ఊపి నవ్వి,
వెళిపోయాడు.
"కాలు ఎత్తితే బంజారా హిల్స్, కాలు
దిగితే రెడ్ హిల్స్.. ఇది ఆమెగారి స్థాయి.." అన్నాడు సిద్ధాంత్ నవ్వుతూ.
"ఏంటి, ఆ అమ్మాయి మీద అంత
ఆసక్తి..?" అడిగాడు ప్రార్థిత్.
"తన మీద నేనేదో ఆసక్తి చూపుతుంటే
నీకెందుకురా దురద..?"
"ఆమె స్థానంలో నీ చెల్లెలో అక్కో
ఉండి వేరే మగవాళ్ళు నీలాగ మాట్లాడుతున్నా ఇట్లగే వినగలిగేవాడివా..?"
"నా చెల్లెలైతేనా, నాలుగు తన్ని ఆ
వేషాలన్నీ మాన్పించి ఉండేవాణ్ణి. ఇంత దాకా రానిస్తానా..?"
"అందరూ ఇటువంటి కూతలు కూసేవాళ్ళే.
చేసేవాళ్ళే ఉండరు కానీ..! కలిసి పని చేసే తోటి ఆడవాళ్ళ గురించి మనలాంటి మగవాళ్ళు
ఇట్ల మాట్లాడుకుంటుండబట్టే గౌరవం మర్యాద కల ఇళ్ళ నుంచి వచ్చేవాళ్ళు ఇంటి బయటకు
అడుగు పెట్టలేకపోతున్నారు. వర్క్ కల్చర్ లేదని మనలను తిడుతూ ఉంటారు."
"అబ్బబ్బా.. నీతో ఇదే గోల. ఏదో
మామూలుగ అందరిలాగ ఉండటానికి ప్రయత్నించవు. పెద్ద ఆదర్శాలు పోతావు. అందరూ
మాట్లాడతారని నేనూ మాట్లాడతాను. అంతే." అని ఆగి సిద్ధాంత్ వాచ్ చూసుకుని
"సరే, పని చూసుకో." అని చేయి కలిపాడు.
"హుఁ.. ఏమైనా ఉంటే కదా
చూసుకునేది.." అనుకుని ప్రార్థిత్ కంప్యూటర్ ఆన్ చేసుకుని డిజైనింగ్ సాఫ్ట్
వేర్ ఆన్ చేసుకున్నాడు. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి అట్ల చేస్తూ ఉంటాడతను. ఎప్పుడైనా
పార్టీ వస్తే వారికి చాలామటుకు వాటిలోంచే నచ్చేస్తూ ఉంటాయి. మనసు తేలికగా
ఉన్నప్పుడు పదునుగా పని చేస్తుంది. ఒత్తిడిలోంచి మంచి డిజైన్లు రావు. అది అతని
అనుభవం. తనకు చాలా మటుకు ఈ అలవాటు వల్లే అసలు ఒత్తిడి అంటే ఏంటో తెలియదు.
సిద్ధాంత్ విరక్తిగ అతని భుజం తట్టి తన కాబిన్ కి వెళిపోయాడు.
అతనికి ఆ పూట పనిలో మనసు కుదరలేదు.
అతనికి ప్రార్థిత్ పరిస్థితి మీద జాలి వేసింది. అతనిది మంచి ప్రతిభ. దానికి తోడు
అంతే చక్కని రూపం. మంచి రంగు, రూపు, అందమైన కనుముక్కు తీరు, ఆత్మవిశ్వాసం నిండిన
వెడల్పైన ఫాలభాగం, మంచి పొడుగు, ఎత్తుకు తగ్గ లావు, నిర్లక్ష్యంగ వేసుకున్నవే
అయినా బాగా నప్పే బట్టలు.. అతను ఆఫీస్ లో తిరగాడుతుంటే అందరి కళ్ళు అతని మీదే
ఉంటాయి. చక్కని మాటతీరు.. ఎవ్వరినీ నొప్పించని ప్రవర్తన..! అతని నవ్వు ముఖం, చలాకీ
కళ్ళు, ఎప్పుడూ వాటిలో కదలాడే సృజనాత్మకత, ఎప్పుడూ పరధ్యానంగ డిజైన్స్ గురించి
ఆలోచిస్తూ ఉండే అతని ప్రవృత్తి, సిద్ధాంత్ కి చాలా అరుదైన గుణాలనిపిస్తాయి.
ఎప్పుడూ ప్రసన్నంగ, సంతృప్తిగ ఉండే అతనంటే సిద్ధాంత్ కి చాలా ఇష్టం. ప్రార్థిత్ తో
అతనిది ఈ కంపెనీలో చేరాకే స్నేహం కలిసినా అందరూ మీరు చిన్ననాటి స్నేహితులా అని
అడుగుతుంటారు. ప్రార్థిత్ చిన్ననాటి స్నేహితుడై ఉంటే తన జీవితం ఇంకెంత అందంగ
ఉండేది గదా అని ఆలోచిస్తాడు సిద్ధాంత్.
కానీ నిషితా వచ్చిన తర్వాతే ప్రార్థిత్ ముఖం
పై అసహనం చూశాడతను. అంతకు క్రితం వరకూ హాయిగా సాగిపోయేవి అన్నీ వెంచర్లూ. విభాగంలో
అతను ఒక్కడే ఉండేవాడు. కనక ఏ పార్టీ వచ్చినా అతనికే చెందేది. అటు రెసిడెంషియల్స్,
ఆఫీస్ డిజైనింగ్, ఇటు షాపింగ్ మాల్స్, అటు హాస్పిటల్స్.. అటు పెళ్ళిళ్ళు,
కాన్ఫరెంసులు, ఆఫీస్ మీటింగ్స్, సెమినార్స్, పార్టీస్.. అన్ని రకాల ఫంక్షన్లకూ
ఈవెంట్ మానేజ్ కూడా అవలీలగ చేసేయగలడు. వస్తువు నాణ్యత, మన్నికను బట్టి డిజైనింగ్
కు ఉపయోగించటం వాటి సాధకబాధకాలతో సహా తెలుసుకున్నాడు. చెక్క, లోహం, ఇనుము, ప్లాస్టిక్,
అద్దం, గాజు, రేకు, బట్ట.. ఇట్ల ఇంటీరియర్స్ లో వాడే ప్రతీ ఒక్క ముడిసరుకు గురించి
చదివి కొంత, ఆ యా క్షేత్రాలకు సంబంధించిన వ్యక్తులతో ప్రత్యక్షంగ గడిపి కొంతా
తెలుసుకున్నాడు. చెక్కపనివాడి దగ్గర ఉండి, ఎన్నో రకాల ఫర్నిచర్ ఐటెమ్స్ తయారీ
నేర్చుకున్నాడు. ఏ ఆకృతి సృష్టిస్తే ఆ వస్తువుకు రూపకల్పన చేసే పనివాడికి
సులువుగా, తక్కువ ఖర్చుతో చేసేయటం వీలవుతుందో అటువంటి డిజైన్ చేయటం అతనికి కొట్టిన
పిండి. అన్నిట్లో లేటెస్ట్ జ్ఞానం కలిగి ఉంటాడు. అత్యాధునికంగ మార్కెట్ లో ఏం
ఉన్నాయో వాటితో డిజైన్స్ కోసం వచ్చినవారిని అందరినీ ఇట్టే ఆకర్షించేస్తాడు.
సిద్ధాంత్ వాళ్ళు ఇల్లు కట్టేటప్పుడు
పూర్తిగ పునాది మొదలు పెట్టిన దగ్గరి నుంచి చివర ఇంటి తాళాలు యజమానికి ఇచ్చేవరకు పక్కనే
ఉండి సమస్త జ్ఞానం పొందాడు. అతను చేసిన ఎన్నో సూచనలు ఇంటిల్లిపాదికీ నచ్చాయి.
ఎన్నో ఆఫీసులలో ఏదో పనితో వెళ్ళి, తిరిగి వారి వారి పని తీరులను బట్టి ఏర్పాటు
చేసుకున్న డిజైన్లను గమనించేవాడు. అక్కడ ఏదో ఒక మార్పును సూచించేవాడు. అది అక్కడి
వారికి బాగా అనిపించి అతనిని అభినందించేవారు. ఎప్పుడైనా చిన్న షాప్ కి ఏదైనా
కొనటానికి వెళ్ళినా, అక్కడి అమరిక గమనించి, "మీరు ఇది ఇక్కడ ఇట్ల పెట్టండి-
వాస్తు సరిపోతుంది. సేల్స్ బాగుంటాయి.." లాంటి మాటలతో వారిని ఆనందింపచేసి తన
సలహాను పాటింపచేస్తాడు. సంతోషంతో వారు తర్వాత వెళ్ళినప్పుడు అతను సూచించిన మార్పు
తమకు అచ్చి వచ్చిందని ఎంతో కొంత ఇవ్వబోతే, ‘అది నా హాబీగా చెప్పానంతే’ అని ఏమీ
తీసుకునేవాడు కాదు. ఈ మధ్య ఆలయ నిర్మాణం, వాస్తు గురించి కూడా ఏదో కోర్సు
చేస్తున్నాడట. "అది ఆగమ శాస్త్రం రా, నీకేం అర్థమవుతుంది?" అంటే,
"ఏదో ఒకటి, అర్థమైనంతే తెలుసుకుంటాను.. కనీసం ఏరోజుకైనా ఏదైనా గుడి కట్టే
అవకాశం రాకపోతుందా.. అప్పుడు వేలిముద్రగాడిలా ఉండకుండా ఉంటాను." అంటాడు.
ఇట్ల ఒకటేంటి, ఇది లేదు, అది రాదు
అనకుండ అన్నీ తెలుసుకున్నాడు. ఎంతో పరిశధన చేసి జనాల మనస్తత్వాలను బట్టి వారి
వస్తువులను ఏ విధంగ అమరిస్తే వారికి ఆనందంగ ఉంటుందో అతనికి తెలుసు. సెరమిక్
టైల్స్, మార్బుల్, వాటి తయారీ విధానం చూసి వచ్చాడు. గ్రిల్స్ డిజైన్స్, మెట్లు,
షోకేస్ లు, కిటికీలు, బాల్కనీలు.. ఏ చోటు ఏ వస్తువులతో అందం వస్తుంది, అవసరం
తీరుతుంది.. వీటిని బట్టి గ్రహింపుతో చేసుకుపోయేవాడు. కలర్ థెరపీ కోర్సు చదివాడు. ఏ
రంగు ప్రభావం ఏ రకం మనిషి మీద, ఎప్పుడు, ఏ విధంగ, ఎంత పడుతుందో అర్థం చేసుకున్నాడు.
జనాలు ఏ స్థానంలో ఏ పని కోసం ఉంటున్నారు, లేదా కలుస్తున్నారు.. ఆ పని యొక్క
ప్రాముఖ్యం ఏంటి.. అని కూలంకషంగ అధ్యయనం చేసి, వారి అభిరుచి, అవసరానికి తగినట్టు ఆ
స్థలాన్ని తన ఇంద్రజాల శక్తితో వారికి అనుకూలంగ మలిచేయగలడతను. వ్యాపారానికి సంబంధించిన
చర్చలు చేయాలా, లేదా పార్టీలో ఎంజాయ్ చేసుకోవాలా, లేక అందరూ కలిసి ఏదైనా విషయ
పరిజ్ఞానం పెంచుకోవాలా.. ఏది చేయాలంటే ఎటువంటి పరిసరాలను వారు ఇష్టపడతారు.. బాగా
ఆయా సందర్భాలలో పూర్తిగ పాల్గొని మరీ అతను అన్నీ గ్రహించాడు. మొదటి నుంచి ఎక్కడికి
వెళ్ళినా, ఏం చేస్తున్నా అతని ధ్యాసంతా ఆ స్థలం యొక్క రూపురేఖలు, అక్కడి వస్తువుల
అమరిక, అక్కడి మనుషుల ప్రవర్తన - వీటి మీదే ఉండేది. ధ్యానమందిరాలు తో సహా అన్నీ
డిజైనింగ్ చేయటంలో తను దిట్ట అనిపించుకున్నాడు.
గృహవాస్తు అయితే ఒక పండితుడి ఇంట్లో
ఉండి, శుశ్రూష చేసి మరీ నేర్చుకున్నాడు. స్థలం అంటే దానికి నాలుగు దిక్కులుంటాయి. నాలుగు
అయిమూలలుంటాయి. ప్రతీ దిక్కుకూ, మూలకూ ఒక ప్రభావం ఉంటుంది. నాలుగు వైపులా ఉండే
పరిసరాలను బట్టి కూడా ఆ చోట ఎక్కడ ఏది పెట్టటం అనేది ఆధారపడి ఉంటుంది. కిటికీలు,
తలుపులు, గూళ్ళు, కుర్చీలు, ఇతర వస్తువులు.. అన్నిటి అమరిక మీద ఆ చోటును
ఉపయోగించుకునే వ్యక్తి యొక్క మానసిక ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. ప్రతీ వస్తువు
ఆకృతికి, నిర్మాణానికి, రూపానికి, స్పర్శకూ ఒక ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావాన్ని ఆ
మనిషి మీద అనుకూలంగ పడే విధంగ అతను ఆ చోటిని మలిచేస్తాడు. అతనికి ఊహ ఎక్కువ.
గురువు చెప్పేది చెప్పంగ తన గ్రహింపుతో మరింత లోతలను ఆవిష్కరిస్తాడు.
ఒకసారి ఒక బస్ స్టాప్ ను డిజైన్ చేసి
ఇస్తే దానికి అతనికి ప్రభుత్వం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. తమ ఇంటి దగ్గర ఉండే
ఒక చిన్న హోటల్ వాడు ఇతనిని అడిగి డిజైన్ చేయించుకున్నాకే అతనికి మంచి గిరాకీ పెరిగటమే
కాక జనాలలో మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పెరిగాయి. ఒక పెద్ద ప్రైవేటు గ్రంథాలయంవారు
రెనోవేషన్ కోసం తనను పిలిస్తే తన డిజైనింగ్ ప్రతిభతో పాఠకుల సంఖ్యను విపరీతంగ
పెంచేశాడు. జనాలు చివరకు పుస్తకాలు చదవటంకన్నా కూడా ఆ చోటిని ఇష్టపడి ఏదో ఒక వంకన వచ్చి
కూర్చోవటం చేస్తున్నారని సంతోషంగ ఆ గ్రంథాలయం వారు తనకు వ్రాతపూర్వక
అభినందనలిచ్చారు. అది తెలిసి, ఒక సత్సంగ సమాజ వారు కూడా చిన్న సేవాకేంద్రం
కట్టుకుంటూ తన సహాయం అడిగితే ఎక్కడ ఏం పెడితే బాగుంటుందో సూచన మాత్రం చేశాడు. ఇప్పటికీ
వారి కార్యక్రమాలకు తనకు ఆహ్వానం తప్పక పంపుతారు. తాను వెళ్ళి వస్తుంటాడు కూడా.
డిజైనింగ్ లోనే కాదు. అతనికి ఇతర
అంశాలలో కూడా మంచి డిసిప్లిన్ ఉంది. మర్యాదగ మాట్లాడతాడు. వేళలు పాటిస్తాడు. మాట
నిలబెట్టుకుంటాడు. ఎవరినీ నొప్పించడు. ఎప్పుడూ ఇచ్చిన గడువుకన్నా ముందే పని పూర్తి
చేసి ఇచ్చేస్తాడు. ఒకేసారి నాలుగు ప్రాజెక్టులు తీసుకుని కూడా ఎవ్వరికీ అసంతృప్తి
లేకుండ పని కానించేస్తాడు. ఎక్కువ డబ్బుకు ఆశపడడు. పని తీసుకుని మధ్యలో
వదిలిపెట్టడు. గొప్పవారికే కాదు, మధ్యతరగతి వారికి, లో ఇన్ కమ్ గ్రూప్స్ కి కూడా
తను చక్కగ తక్కువ ధరకు ఎక్కువ అందమైన, నాణ్యత గల డిజైన్లు తయారు చేసి ఇవ్వగలడు. అతని
పరిపక్వత, అనుభవం, కార్యదక్షత గురించి డిజైనింగ్ ప్రపంచంలో అంతా చెప్పుకుంటారు. ఇంటీరియర్స్
ని అతను ఒక వర్క్ ఏరియాలాగ జ్ఞానం సంపాదించి వదలేయటం కాక ఒక ఆరాధనలా, ఒక దీక్షలా,
ఒక అధ్యయనంలా చేశాడు. ఈ మధ్య డిజైనింగ్ ఇంస్టిట్యూట్ లో వాళ్ళు అతని ప్రతిభను
గుర్తించి తమ విద్యార్థలకు గెస్ట్ లెక్చర్స్ కోసం కూడా పిలిచే స్థాయికి వచ్చాడు.
తను స్వయంగ అతని లెక్చర్స్ విన్నాడు. ఎంత మంచి వక్తో అతను. విన్నా కొద్ది
వినాలనిపిస్తుంది. ఇంకా టైం లేదని చాలా ఆహ్వానాలను తిప్పి కొడతాడు కానీ,
లేదంటేనా..!!
అయినా కూడా ఆ అమ్మాయిదే పై చేయి
అవుతోంది. ఇదివరకు అతని చేత కావాలని అడిగి మరీ డిజైన్ చేయించుకుని వెళ్ళిన వారు
ఇప్పుడు కళ్ళ ఎదుటే ఆమె దగ్గరకు వెళ్తున్నారు. ఎందుకంటే..? ఏమో, నిజంగ అందమైన
అమ్మాయి ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదంటారు. అంతేనా..? అసలు సత్తాకు ఏ విలువా
లేదా..?
No comments:
Post a Comment