Saturday, 12 November 2016

3. బంధంతో వీడే బంధం-1


            ఏసీ గదిలో అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. గాలి అందక ఉక్కిరి బిక్కిరిగా ఉంది. పోలీసు ఇంక్వైరీ ముందర తప్పు చేసిన ముద్దాయిలా.. కాదు కాదు.. నేరస్తుడిగా నిరూపించబడబోయే వాడి పరిస్థితి లా ఉంది. అగరొత్తుల వాసనలు సువాసనలు వెదజల్లుతున్నాయి. వాటి పక్కన రెండు రకాల మధురపదార్థాలు, మూడు రకాల పూలు ఉన్నాయి. అవీ సువాసనలు వస్తున్నాయి. అన్నీ అతని ముక్కు పుటాలను తాకుతూనే ఉన్నాయి. కానీ ముక్కు వాటి సమాచారం తన వంతుగా చేరవేసినా ఆ సందేశాలను మెదడు అందుకోవటం లేదు.

            ఆ అగరొత్తుల పొగ రింగుల్లో అతనికి గతం కనిపిస్తోంది..!!

***

            అది ఒక చిత్రం. ప్రొజెక్టరు తెర మీద కనిపిస్తోంది. అందులో ఒక పది పన్నెండేళ్ళ బాబు బల్ల మీద తల వాల్చి చేతులు అడ్డం పెట్టుకుని పడుకుని ఉన్నాడు. అతని ఎదురుంగ ఒక వయోలిన్, దాని మీద కమాన్ పెట్టి ఉంది.

            "అది చూసి నీకు ఏం అనిపిస్తుంది..?" ఇది వారు అడిగిన ప్రశ్న.

            దానికి తనకన్నా ముందు ఉన్న నలుగురూ అంతకు ముందే సమాధానాలు చెప్పి బయటకు వెళిపోయారు. ఇప్పుడు చివరగా తన వంతు. "గదిలోకి వెళుతూనే తెర మీద ఉన్న చిత్రం చూసి ఏం అనిపిస్తుందో వెంటనే ఆలోచించకుండా చెప్పాలి." అని బయటే షరతు చెప్పారు. కానీ.. అసలు ఆ పిల్లవాడి ముఖం కూడా కనిపించటం లేదే..! మనకు ఎట్ల తెలిసేది, వాడేం ఆలోచిస్తున్నాడో? లోలోపలే అనుకున్నాడు.

            ఇంటర్వ్యూ కమిటీ సభ్యులంతా అతని వంకే చూస్తున్నారు. ఇక్కడ తను చెప్పబోయే సమాధానాన్ని బట్టి తనకు ఈ ఉద్యోగం వస్తుందో రాదో తేలిపోతుంది. కానీ అతను ప్రస్తుతం దానిగురించి ఆలోచించటం లేదు. పిల్లవాడు.., వయోలిన్, కమాన్.., అతని భంగిమ..; అదే కనిపిస్తోంది కళ్ళకు..! అదే బుర్ర అంతా నిండిపోయింది.

            "ఆ పిల్లవాడు ఒక రాగం గురించి ఆలోచిస్తున్నాడు. అది ఇంకా తట్టలేదు." అన్నాడు క్షణం ఆగి.

            "తడుతుంది అంటారా?" నలుగురు సభ్యుల ఆ కమిటీ లోంచి అంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నాక, ఒకాయన అడిగాడు.

            "ఈ ఫోటో తీసిన మరుక్షణమే తట్టి లేచి వయోలిన్ అందుకుంటాడు."

            "అంటే ప్రస్తుతం అతగాడి ఆలోచన అంతా రాగం గురించేనా?"

            "అనే అనిపిస్తోంది."

            కమిటీవారు అంతకు ముందు వచ్చిన సమాధానాలతో దాన్ని పోల్చుకున్నారు.

            "అతను తల వాల్చి బల్ల మీద పడుకున్నది కోపమో లేక దిగులు వల్లో కూడ కావచ్చు కదా.."

            అతను ఆలోచించాడు- "కోపమో దిగులో అయి ఉన్నట్లైతే అతగాడు వయోలిన్ ని అవతలకు నెట్టి పడుకునేవాడు. అప్పుడు అతగాడి తలకు వయోలిన్ అంత దగ్గరగ ఉండేది కాదు. ఎవరైనా చిరాకులో ఉన్నప్పుడు అడ్డం వచ్చినదాన్ని పక్కకు జరిపి పడుకుంటారు."

            కమిటీ మెంబర్లంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అంతా చెరొక ప్రశ్న అడిగేశారు. మిగిలింది ఇంకొక్క భాస్వతే. అంతా భాస్వతిని ఏమైనా అడుగుతారా అన్నట్టు చూశారు. భాస్వతి ఏం మాట్లాడలేదు.

            "ఇంకా ఏమైనా విమర్శ చేయగలరా ఆ ఫోటో మీద?" మరొకరు అడిగారు.

            "ఊఁ.." అని అతను ఆలోచిస్తూ, "కళాకారులకు బాహ్య లోకంతో పనిలేని కొన్ని సంఘర్షణలు మనసులో చెలరేగుతుంటాయి. అది కళకు దాని తీరు తెన్నులకు సంబంధించినదే కానీ లోకంలో సంఘటనలకు చెందింది కాదు. నిత్యం కళ ఆలోచనలలో మునిగి ఉండేవాళ్ళు అకారణంగ కోపం సంతోషం, పొందుతూ ఉండటం చూసి మనం వారికి ఏదో లౌకికంగ లాభం, నష్టం జరిగి ఉంటుంది అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళ సంతోషం దుఃఖం చాలా మటుకు ఆంతరికం అయి ఉంటాయి." అన్నాడు.

            వెంటనే ఆ కమిటీలో ముఖ్యురాలైన భాస్వతి అతని వంక చూసి అడిగింది- "మీరు కళాకారులా?"

            "కాదు, కానీ అటువంటి ఒక వ్యక్తితో నాకు మంచి అనుభవం ఉంది."

            "ఎవరు వారు..?"

            "మా అమ్మ..! ఆమె మంచి సృజనాత్మకత ఉన్న సంగీతజ్ఞురాలు, గాయని.. వీణ కూడా వాయించగలదు."

            "మరి మీరు ఎందుకు నేర్చుకోలేదు..?"

            "ఈ సంఘర్షణలు నేను తట్టుకోలేనని ఆమే నన్ను ఆ లోకానికి దూరం ఉంచింది. నేను ఏదైనా వ్యాపారసంస్థలో ఉద్యోగంలో చేరాలని నాన్నగారి కోరిక కూడా. అందుకే నేను.." అతను ఇంక వివరించలేక ఆగాడు.

            "రాజీ పడ్డారా..?"

            "లేదు. ఉద్యోగాన్ని వృత్తిగ, సంగీతాన్ని ప్రవృత్తిగ పరివర్తన చేసుకున్నాను."

            "మీ పేరేంటి..?" ఆమె అతని కాగితాలు చూస్తూ అడిగింది.

            "స్వర్జిత్.." అతను చెప్పాడు.

            "సరే. స్వర్జిత్, నచ్చితే రేపటి నుంచి ఈ కార్యాలయంలో ఒక భాగం కావచ్చు."

            స్వర్జిత్ కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పుగ అయినాయి. ఆమే ఆ కంపెనీ జీ.ఎం. అని అతనికి వెంటనే అర్థమైంది.

            "మీరు వీరితో జీతం నిర్ణయించుకోండి." అని అతనితో చెప్పి, "ఇతన్ని వెంటనే అపాయింట్ చేయండి." అని ఆ మాట కమిటీవారితో అనేసి భాస్వతి లేచింది.

            "కానీ మేడమ్..? కేవలం బీ.కామ్ అర్హత.. పైగా ఏ అనుభవం లేదు.. మన పోస్టుకు చాలదు కద్.." కమిటీలోంచి ఒకరు ఆక్షేపించబోయారు.

            భాస్వతి తిరిగి చూడలేదు. ఆ గదిలోంచి వెళిపోయింది.

            అంతా ముఖాలు చూసుకున్నారు. "మిగిలినవారు బయట ఉంటారు- ఎంపిక అయిపోయింది అని చెప్పి వారిని పంపేయమ"ని ఒకరిని పంపారు. కాగితాలు సిద్ధమైనాయి. ఆ సాయింత్రం స్వర్జిత్ నియతిపత్రం పట్టుకునే ఇంటికి చేరాడు.

            "ఉత్తరం పని చేసి ఉండి ఉంటుంది..!" తండ్రి అన్నాడు సంతోషంగ.

            "ఉత్తరమే..! కానీ మీరు వ్రాసి ఇచ్చింది కాదు.. నేను వారి ప్రశ్నకు చెప్పినది."

            గోపాలరావు ఆశ్చర్యంగ చూశాడు, స్వర్జిత్ తల్లిఫోటోకు దండం పెట్టుకుంటూంటే.

***

            "బావగారూ.. బావగారూ.. తలుపు వేసుకున్నారెందుకు.. తీయండి.."

            బయటినుండి మరదలి వరస అయ్యే ఇద్దరు యువతులు పిలిచేసరికి తేరుకుని ప్రస్తుతంలోకి వచ్చాడు స్వర్జిత్. అతను వెళ్ళి తలుపు తీస్తుంటే వాళ్ళు ఏవేవో అల్లరిగ మాట్లాడుకుంటున్నారు.

            తలుపు తీసిన అతన్ని చూసి, "అక్క వస్తుంది లేండి.. అంత విరహం వేదన పడకండి.. వద్దు.. మంచిది కాదు.." కిలకిల నవ్వారు. స్వర్జిత్ ఏమీ మాట్లాడలేదు.

            వాళ్ళు లోపలకు వచ్చి ఏవో వస్తువులు పెట్టి, ఏవో తీసుకుని వెళ్తూ, "బావగారికి తొందరెక్కువే.." అన్నారు.

            తొందరా..? ఇక్కడ తొందర ఎవరికి? ఇప్పటికిప్పుడు లేచి ఇక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంటే.. రెండు మూడు వైపుల తల తిప్పి చూశాడు- కిటికీలు ఏవైనా ఊచలు లేకుండ ఉన్నాయేమోనని. లేదు. ఎటూ మార్గం లేదు. ఇప్పటి దాకా ఒకరకంగ కాల్చుకుతిన్నది.. ఇంక ముందు ఇట్ల కాల్చుకు తినబోతోంది..! ఛి.. తన బతుకు కొలిమిలో బొగ్గయిపోయింది.

****

            "బొగ్గు కాదు..! కొన్నాళ్ళు ఉండు. అగ్గిలో ఆజ్యమైపోతుంది." అది ఆఫీసులో చేరిన వెంటనే భాస్వతి తో పడ్డ అక్షింతలకు సమాధానంగ అర్ణవ్ చెప్పిన మాట.

            "రెండిటికీ తేడా ఏంటి..?" స్వర్జిత్ అడిగాడు.

            "కాలటం సాధారణ నియమమే. అయితే బొగ్గు కాలిన తర్వాత బూడిద మిగిలి ఏదైనా ఉపయోగానికి వస్తే రావచ్చు. కానీ ఆజ్యమైతే ఆవిరైపోవటమే. నో రెసిడ్యూ. ఈమె గారి చేతికింద పడటం అంటే అదే. కనక ఆమెతో పెట్టుకోకు."

            తల ఊపాడు స్వర్జిత్. "ఆమె ఎప్పుడూ ఇంతేనా..?"

            "ఊఁ.. ఆఫీసుకే తప్ప తిట్లకు శెలవలుండవు. తండ్రి పోలిక. ఏం చేస్తాం..? అయితే ఆయన ఉండంగ కాస్త నయం. బొగ్గుచేసి వదిలేవాడు. కూతురు వచ్చాక ఆజ్యం అయిపోయి ఆవిరైపోతున్నాం."

            "ఎన్నాళ్ళైంది ఆమె వచ్చి..?"

            "క్రితం సంవత్సరమే."

            "హుఁ.. అదృష్టం అంటే అది. ఏం చేస్తాం..? లలాటలిఖితం." స్వర్జిత్ బాధగ అన్నాడు.

            "నీతోపాటు అదృష్టాన్ని పంచుకునేవాళ్ళం ఇంతమందిమి ఉన్నాం. నువ్వొక్కడివేనని అంత ఆనందపడిపోతే ఎట్ల..?"

            అర్ణవ్ చాలా బాగ మాట్లాడతాడు. ఆఫీసులో అతనికి మొట్టమొదట పరిచయమైనది అర్ణవే. చూడటానికి కూడా బాగుంటాడు. ఇంకా పెళ్ళి కాలేదు. కనక ఆఫీసులో వారికి సంబంధాలు చెప్పేందుకు మంచి కాలక్షేపం బఠాణీ. మనిషికి చొరవ ఎక్కువ. త్వరలోనే స్వర్జిత్ కి అతనితో అరే ఒరే అనుకునేంత చనువు ఏర్పడింది. ఎందుకంటే సీనియారిటీ లెక్కలో నాలుగేళ్ళు పెద్దవాడే అయినా అర్ణవ్ వయసు స్వర్జిత్ వయసూ ఒకటే. బీకాం కాంగనే అర్ణవ్ ఉద్యోగం లో చేరాడు.

            "ఏంచేశావు ఈ నాలుగేళ్ళు..? ఎందుకు ఆలస్యమైంది నీకు..? వెంటనే చేరి ఉంటే ఇద్దరం ఇంకా మంచి స్నేహితులమయ్యేవారం." అర్ణవ్ అన్నాడు.

            "కొన్ని పరిస్థితుల వల్ల ఆగిపోయాను." అన్నాడు స్వర్జిత్.

            అర్ణవ్ వల్లే తనకు చాలా విశేషాలు తెలిసేవి- ఆఫీసు గురించి, ఆఫీసులోని వ్యక్తుల గురించి, వారి వ్యక్తిత్వాలు, వ్యక్తిగతాల గురించి కూడా. అతనికి అన్నింటిలో తెగ ఉత్సాహం. అందరి విషయాలలో తెగని కుతూహలం. ఆఫీసులో అందరి గురించి ఇతనికి తెలుసు. కనిపించేది కనిపించనిది కూడ చెప్పగలడు. ఎటువంటి మనుషులతో అయినా తొందరగ కలిసిపోతాడు. అతని దగ్గర ఏదో వ్యవహారకౌశలం ఉంది. కనక అందరి రహస్యాలూ వారి నోటే రాబట్టి క్షుణ్ణంగ తెలుసుకుంటాడు. అవసరమైతే వాటిని ఉపయోగించి ఎవరినైనా ఆటాడించగలిగినంత సత్తా ఉన్నవాడు.

            అతను పని చూసుకుంటూనే, చకచక అన్నీ సరి చూసుకుంటూనే మాటలూ సాగించగలడు. కానీ స్వర్జిత్ కి మొదట్లో అట్ల మాట్లాడుతూ పని చేయటం రాకపోయినా తర్వాత అలవాటైపోయింది- కావాల్సింది వినటం, మిగిలింది వదిలేయటం మొదలుపెట్టాడు కనక. దాంతో వేళకు పని పూర్తి కాలేదన్న అధికారిణి గర్జనలు తగ్గాయి. అర్ణవ్ చెప్పింది నిజమే- ఇక్కడ బొగ్గుగ మిగిలి తరించే అవకాశం కూడ లేదు.

            అయితే తన గురించి మొదట్లోనే భాస్వతి కళ్ళలో ఇటువంటి అభిప్రాయం ఏర్పడాలి అని అర్ణవ్ ఇట్ల చేశాడా అని ఒక్కొక్కసారి స్వర్జిత్ కి అనిపించేది. అర్ణవ్ తనను ప్రణాలికా బద్ధంగ ఇరికించటం వల్ల భాస్వతి కోపానికి తను అవసరానికన్నా ఎక్కువగా పాత్రుడైనాడో.., లేక అర్ణవ్ అటువంటి కాడో- ఏమో తెలియదు. ఏది ఏమైనా అతనితో కాస్త జాగ్రత్తగ ఉండటం మంచిది. అంత చొరవగ ఉండేవారితో మసలటంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. వేరేవాళ్ళ గురించి తనకు చెప్పినట్టే తన గురించి వేరేవాళ్ళకు చెప్పడని ఏంటి..? అంతే కాదు, తనతో మాత్రం అందరిలా ఆటాడడని ఏంటి..?

            అతనికి అర్ణవ్ మీద వచ్చిన అనుమానం ఆధారం ఉన్నదో కాదో తెలియకపోవటానికి మరొక కారణం- అధికారిణిగారి గర్జనలకు విషయం, అంశం, శీర్షిక, సందర్భం, ఔచిత్యం- ఏమీ లేకపోవటం. అది పచ్చి నిజం. భాస్వతికి తిట్టటం హాబీ కాదు. దైనందిన కార్యక్రమంలో తినటం, పడుకోవటం లాగే అనివార్యమైన భాగం. వారు-వీరు, జాతి-మతం, ఆడా-మగా, పెద్దా-చిన్నా, చిన్న తప్పు-పెద్ద తప్పు వంటి వివక్షతలు పాటించక- అట్ల భక్తిశ్రద్ధలతో, ఎడతెగని ఉత్సాహంతో, నిత్యనూతనంగ, సృజనాత్మకంగ- ఏం చేసినా, చేయకపోయినా తిడుతూనే ఉంటుంది.

            ఆఫీసుకు క్షణం ఆలస్యంగ వస్తే కోపం. సరే కదా అని కాస్త ముందు వస్తే నాతో పోటీయా అని కట్టెలు తెంచుకునే ఆవేశం. ఆమె మన సీట్ కి ఫోను చేసి మనం అది ఎత్తటంలో అరక్షణం దాటితే తిట్ల వర్షం. పనివేళ సీట్ లో లేకపోతే ప్రళయకాల రుద్రావతారం. లంచ్ వేళలో కానీ, పని వేళలు దాటి కానీ సీట్ లో ఉంటే పరుషమైన మాటల కత్తులు. అడిగిన పని చేయటంలో నిముషం అటూ ఇటూ అయితే అగ్గి మీద గుగ్గిలం. ముందుగా చేసి అక్కడ పెడితే అతిశ్రద్ధాభక్తుల ప్రదర్శన అంటూ వడ్డింపు. ఆమె చూసిన వేళల్లో పొరపాట్న ఫోనుతో కనిపిస్తే భద్రకాళి రూపం. ఆడవాళ్ళతో మగవాళ్ళు, మగవాళ్ళతో ఆడవాళ్ళు, టీంతో ప్యూనులూ, ప్యూనుతో టీమ్ వారూ ఎన్నడైనా అనవసరంగ నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తే కట్టెలు తెంచుకునే ఆగ్రహం. ఇంక రిపోర్టులో ఎక్కడైనా తేడా వస్తే జ్వాలాముఖి పొంగు ప్రత్యక్షప్రసారమే.

            స్వర్జిత్ కి అక్కడ నిలదొక్కుకోగలనన్న నమ్మకం మొదటిలోనే దెబ్బతిన్నది. రెండు నెలలలో ముప్ఫైసార్లు బెదిరింపులు, పదిసార్లు గెటౌట్ లూ.. ఒకసారి సస్పెంషను కాగితం చేతికి వస్తూ వస్తూ ఆగింది.

            స్వర్జిత్ కి బెదురు పుట్టింది. ఇదెక్కడి గోల..? మాట్లాడితే తప్పు. మౌనంగ ఉంటే తప్పు. సలహా ఇస్తే తప్పు, ఇవ్వకపోతే తప్పు. పని చేయకపోతే తప్పు. చేసిన పక్షంలో దాన్ని ఎట్ల చేసినా తప్పే. ఆమెకు క్రమశిక్షణ అంటే దూకి చచ్చేంత ఇష్టం కావచ్చు గాక. కానీ ఇంత నీచంగ ఒక మనిషిని చిత్రవధ చేయటం అమానుషం.

            "ఆమెను ఛంపేయాలన్నంత కోపం వస్తుంది కదా..?" ఆరోజు భోజనం వేళ అన్నాడు అర్ణవ్.

            "కోపమా..? ఛఛ..! తప్పు చేస్తే ఎవరైనా అంటారు."

            "చేస్తే అనమను. చేయకుండ ఎందుకు అనటం..? అందుకే ఉపవాసం అయినా సరే- లంచ్ లో ఇక్కడ కనిపించద్దు అని చెప్పానా లేదా..? బాగానే దులిపినట్టుంది.!!"

            "అహఁహఁ.. అదేం లేదు."

            "ఎవరికి చెప్తున్నావు నాయనా..? నీ మొహం ఎంత వేలాడిపోయి ఉందో తెలుసా..?"

            "నిజమే.." అన్నాడు స్వర్జిత్.

***

            "అబ్బో, పిల్లవాడి ముఖం వెలిగిపోతోందే..! కనుముక్కు తీరూ అదీ.. పిల్లకు తగినట్టే ఉన్నాడు..!"

            "కాదు కాదు, పిల్లకన్నా చక్కనివాడు.."

            ఎవరో తనను కలవటానికి వచ్చేసరికి ఉలికిపడ్డాడు స్వర్జిత్. వాళ్ళు వయసు పైబడిన దంపతులు. ఆమెకు మేనమామా, అత్త అనుకుంటా. గబుక్కున లేచి వంగి వాళ్ళ కాళ్ళకు నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వదించారు. "పెళ్ళికి రాలేకపోయారు బాబూ.. నిన్ను చూడలేదు. సరే, కలిపించి పరిచయం చేద్దామని.." చెప్పారు మామగారు.

            తల ఊపాడు స్వర్జిత్- శోభనం రోజేనా వీళ్ళకు కలవటానికి దొరికింది..? అని మనసులో అనుకుంటూ.

            వాళ్ళు ఏదో మాట్లాడి వెళిపోయారు. స్వర్జిత్ కి జుట్టు పీక్కోని గట్టిగ అరవాలనిపిస్తున్నా వచ్చినవారి ఆరోగ్యానికి అది మంచిది కాదని తలచి విరమించుకున్నాడు. అనవసరంగ జనాలను కంగారుకు గురి చేయలేడు కదా.

***

            "కంగారు కంగారు! ఎప్పుడూ కంగారేనా? ఆఫీసులో చేరి ఆరునెలలు కావస్తోంది-ఇంకా పని అలవాటు కాకపోతే ఎట్ల?" అర్ణవ్ వెక్కిరిస్తాడో నిజంగ సానుభూతి చూపిస్తాడో అర్థమే అయ్యేది కాదు స్వర్జిత్ కి.

            "కంగారు కాదురా.. అంటే.. భయం.. అంటే.."

            "తేడా ఏంట్రా రెండిటికీ..? చూడు, తిట్టటం ఆమె స్వభావం. తప్పు చేస్తేనే తిట్టాలని నియమం లేదు. అసలు ఆమెకు మన తప్పు ఒప్పులతో పనిలేదు. అటువంటప్పుడు మనం అవన్నీ పట్టించుకోకుండ ఉంటే సరిపోతుంది. అందరినీ ఒకేరకంగ తిడుతుందామె. ఇంక నీకు ప్రత్యేకించి బాధ ఎందుకు..?"

            కానీ మనసులో ఎందుకో స్వర్జిత్ కి భాస్వతి తనను అందరికన్నా ఎక్కువ తిడుతుందేమో అనిపిస్తుంది. అంటే స్పెషల్ బోనస్ లాగ, స్పెషల్ గుర్తింపు లాగ- ఇదీ తీసుకోవాలా..?

            స్వర్జిత్ భావాలతో పని లేనట్టు అర్ణవ్ చెప్పుకుపోయాడు-"నువ్వు నిర్దోషివి కనక ధైర్యంగ ఉండు.. తప్పు చేయనప్పుడు గిల్ట్ ఎందుకు..? ఆత్మన్యూనతాభావన ఎందుకు..?"

            స్వర్జిత్ కి అదీ నిజమేననిపించింది. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ముందు అసలు తను భయం తగ్గించుకోవాలి. ఔచిత్యం లేకుండ తిట్టేవారిని మనం సీరియస్ గ తీసుకోనవసరం లేదు. తిడితే తిట్టింది..! నన్ను కాదులే అని తనే వదిలేస్తే పోలే..!? అయినా అన్ని ఆఫీసులలో బాస్ లు ఇట్లగే ఉంటారని తన స్నేహితుల మాటల వల్ల తెలిసింది. ఇక్కడ కూడ అందరినీ తాను గమనిస్తూనే ఉన్నాడు. భాస్వతి అన్నదాన్ని ఎవ్వరూ సీరియస్ గ తీసుకోరు. తనకే కాస్త ఎక్కువ పట్టింపేమో. లేక, వాళ్ళ నాన్నగారు కూడా తిట్ల మాష్టారైనందువల్ల అందరికీ అలవాటైపోయిందా..?

            "లేదు- మాధవంగారు కూడ తిట్టేవాడు కానీ, తప్పు చేస్తేనే అనేవాడు. ఇట్ల అయినదానికి కానిదానికి తిట్టేవాడు కాదు. ఈమె అర్థం పర్థం లేకుండ తిడుతుంటే అందరికీ బాధగనే ఉంది. కానీ వాళ్ళ నాన్నగారంటే అందరికీ ఇష్టం. ఆయన బాగైపోయి తిరిగి రాకపోతాడా- అప్పుడు ఈమె గోల వదులుతుంది కదా అని ఆశతో పట్టుకుని వేలాడుతున్నారు. మంచి ఉద్యోగం, మంచి జీతాలు, తక్కువ పని, ఎక్కువ రక్షణ, తక్కువ బాధ్యత.." అర్ణవ్ చెప్పాడు.

            స్వర్జిత్ కి మాధవం గురించి అర్ణవ్ చెప్పకపోయినా తెలుసు. తండ్రికి ఆయనతో పెద్ద స్నేహం కాకపోయినా మంచి పరిచయం ఉంది. ఆయన పని చేసే బ్యాంకు, మాధవం కంపెనీకి ఋణాలిస్తుంది. అందుకే ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వేళలో తండ్రి అతనికి పరిచయపత్రం వ్రాసి ఇచ్చాడు. కానీ అది వాడుకోకుండనే తనకు సొంతబలం మీద ఉద్యోగం వచ్చింది. భాస్వతికి తన తీరు బాగా నచ్చి తీసుకుందేమో అనుకున్నాడు. కానీ..

            ఒక ఉద్యోగం కోసం యాభైమంది అభ్యర్థులు వస్తే, పాతికమంది మొదటిస్థాయిలో మిగిలితే, పదిమంది రెండవ స్థాయిలో ఎంపిక కాగా, వారిలోంచి నలుగురు మూడవస్థాయికి నెగ్గినతర్వాత చివరిగ అంతమందిలో తాను ఒక్కడికి ఈ పదవి లభించింది. తన నేర్పరితనంతో కాదా భాస్వతి ప్రభావితురాలైంది..? తన సమాధానాలతో పడిపోయి కాదా ఉద్యోగంలోకి తీసుకున్నది..? ఆమె కమిటీ వద్దంటున్నా తనను ఎంచుకుని ఎందుకు తీసుకుంది మరి..? మిగితావారికి ఒక్కమాటకు కూడ తావివ్వకుండా పింగాణి కొండ బద్దలు కొట్టినంత స్పష్టంగ కరిచి మరీ అపాయింటు చేసింది ఇట్ల పిలిచి మరీ రోజూ తిట్టటానికా..??

            "ఛఛ.." అప్రయత్నంగ అసహనంలో అన్నాడు.

            "బాధపడకురా.. అలవాటైపోతుందిలే.." అర్ణవ్ అతన్ని వెక్కిరించో, బుజ్జగించో తన పనిలో పడ్డాడు.

***

            "ఒసేయ్.. పాలు పోయాల్సింది పింగాణి గిన్నెలో కాదే..; వెండి గ్లాసులో. వెర్రి మొహమా..!" కిలకిల నవ్వులు.

            "ఏమో, నాకేం తెలుసు? నాకేమైనా పదిహేను అనుభవాలున్నాయా..?"

            "ఇంతోటి సంగతి తెలుసుకోవటానికి దీనికి పదిహేను అనుభవాలు కావాలిటనే..!" మళ్ళీ నవ్వుల జల్లులు.

            "తల్లీ, అది తీసుకువెళ్ళి బావగారికి ఇవ్వాల్సింది నువ్వు కాదే..! అక్క. అంతైనా తెలుసు కదా? లేక అది తెలియటానికి కూడ అనుభవం కావాలా..?" ఈసారి మరింత గట్టిగ నవ్వులు.

            కావాలని గది ఎదురుంగ నిలబడి నవ్వుతున్నారు. ఈమె చుట్టాలలో చెల్లెళ్ళు ఎక్కువ కాబోలు. ఇంతమంది మరదళ్ళను భరించటం ఎంత కష్టమో! తన బాధ వాళ్ళకేం తెలుస్తుంది? మంచం మీద పూలు తుంపి పోస్తూ అనుకున్నాడు. పట్టు పంచె, సిల్కు లాల్చీ చిరాగ్గ ఉన్నాయి. హాయిగ కుర్తా వేసుకుని షార్ట్స్ వేసుకుంటే బాగుండు.

***

            ఒకరోజు ఇదే పని ఆఫీసులో చేశాడు. ఆరోజు మన తిథుల ప్రకారం తన పుట్టినరోజు. పైగా ఎందుకో ఆరోజు ఎండ వేడి ఎక్కువగ ఉంది. కాటన్ కుర్తా పైజామా వేసుకుని కింద కోల్హాపురీ చెప్పులు వేసుకుని గుడికి వెళ్ళి వచ్చి అట్లగే ఆఫీసుకు వెళ్ళాడు. అంతే- వెళ్తూనే లోపలకు పిలిచి డ్రెస్ సెంస్ లేదని ఛెడామడా తిట్టేసింది.

            అరే ఇదేమీ కార్పరేట్ ఆఫీస్ కల్చర్ కాదే..! ఏదో ఓ కంపెనీ. ఒక్కరోజు తనకు కావాల్సిన విధంగ వచ్చినందుకు అంత కోపమా..?

            పుట్టినరోజు నాడు కూడ ఇష్టం అయిన విధంగ ఉండటం తప్పా అని అడగాలనిపించింది అతనికి. కానీ అప్పుడు తన పుట్టినరోజు రెజిస్టరులో ఉన్న తేదీ ప్రకారం ఎందుకు చేసుకోవటంలేదు అని ఎక్కడ తిడుతుందోనని భయం వేసి ఊరుకున్నాడు.

            సరిగ్గ అతను కడుపు నిండా తిట్లు తిని వెనక్కు తిరిగి రాబోతుంటే అక్కడ స్కల్ప్టర్ పత్రిక కనిపించింది. అతని కళ్ళు ఒక్కసారి అక్కడ అతుక్కుపోయాయి.

            "ఏమైంది?" అని అడిగింది అతను వెళ్ళకుండ నిలబడేసరికి.

            "ఏంలేదు-" అని చెప్పి బయటకు వచ్చేశాడు. ఎప్పటిలాగే సీట్ లో అర్ణవ్ అప్పటికే పని మీద ఉన్నాడు.

            "బహుశ, తిట్లు తిని భరించటం ఉద్యోగ ధర్మాలలో మొదటి ధర్మంగ మనం నేర్చుకోవాలేమో..!" అన్నాడు స్వర్జిత్ బాధగ.

            అర్ణవ్ నవ్వి- "ఏం చేద్దాం..? నాలుగు మాటలు పడకుండ పొట్టకూటి వ్యవస్థ జరిగే సౌవిధ్యం ఉంటే బాగుండేది..!" అన్నాడు.

            స్వర్జిత్ పని మీదకు మళ్ళుతూ దిగాలుగ చూశాడు.

            "ఏంటి? ఇవాళ ఏదైనా విశేషమా..? ఇట్ల వచ్చావు.?"

            "ఏంలేదు.." అన్నాడు స్వర్జిత్ మామూలుగ.

            "అన్నట్టు- నీకొక శుభవార్త. మాధవంగారికి ఇప్పుడు కాస్త నయంగ ఉందటగా..! ఏమో- త్వరలో ఆఫీసుకు రావచ్చేమో అని అందరి భావన."

            వీళ్ళ పిచ్చిగానీ బ్రెయిన్ హెమరేజ్ వచ్చి చచ్చి బ్రతికిన మనిషి మళ్ళీ యథావిధిగ ఏం పనులు చేయగలడు..? కానీ ఆ మాట స్వర్జిత్ పైకి అనకుండా- "ఆయన వచ్చినా ఏం లాభం..? తిట్లు సమానమే కదా..!" అన్నాడు.

            "నిజమే. కానీ మాధవంగారు తిడితే అందరం కిమ్మనకుండ పడేవాళ్ళం. దానికి కారణం ఉంది." అర్ణవ్ చెప్పాడు వివరంగ. "ఆయనలో రెండూ ఉండేవి. ఇప్పుడు కాదు- ఆయన తీరు మొదటి నుంచీ ఇదే. బాగ పని చేస్తే మెచ్చుకునేవాడు. కంపెనీ మేలు కోరి ఏదైనా చేస్తే గుర్తించి బహుమతి ఇచ్చేవారు. అందరి బాధలను అర్థం చేసుకున్నాడు. సహాయం అడిగినవారిని ఎప్పుడూ నిరాశ పరచలేదు. ఎప్పటికప్పుడు కంపెనీ లాభాలలో మనకూ తగినంత భాగం ఇచ్చాడు."

            "అదే పాలిసీ ఈమె కూడా పాటిస్తుంది కదా.."

            "కానీ పాలసీ వరకే. ఆయన అట్ల కాదు. కింద ఉద్యోగం చేసేవారిని అందరినీ తన సొంత పిల్లలలాగ చూసుకునేవాడు. కనక కోపం వచ్చి తిట్టినా మన నాన్నో బాబాయో తిట్టినట్టే ఉండేది. ఆ అధికారం ఆయనకు ఉంది అనిపించేది. కానీ ఉద్యోగులను అట్ల సొంత పిల్లలలాగ చూసుకోవటం భాస్వతికి రాదు కదా. అయితే కనీసం తన అన్నాదమ్ముల లాగ చూసుకోవచ్చు. కానీ ఆమెకు ఎవ్వరూ తోబుట్టువులు లేరే."

            "నిజమా..?" స్వర్జిత్ అంతా శ్రద్ధగ విన్నాడు.

            "ఊఁ.. అందుకే కదా, తండ్రి స్థానంలో బాధ్యత తను తీసుకోవలసి వచ్చింది. ఇంతటి ఆస్తికి ఒక్కర్తే వారసురాలు. వారసత్వం కావాలంటే బాధ్యత నిర్వహించక తప్పదు కదా.." అర్ణవ్ నవ్వాడు. "పైగా కొత్తగ విద్యార్థి జీవితం ముగిసీముగియంగనే నెత్తినపడిన బాధ్యత..! ఎప్పుడైనా తండ్రితో ఆఫీసుకు వచ్చినా పనుల మీద దృష్టి ఉండేది కాదు. ఆమెకసలు పని రాదు. అందుకే సరిగ్గ చేయటం అంటే ఏంటో తెలియక సరిగ్గ చేసినా మనలను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది."

            స్కల్ప్టర్ పత్రిక కళ్ళలో మెదిలి అడిగాడు- "అంతకు ముందు ఏం చేసేదామె..?"

            "ఏదో ఎం ఎఫ్ ఏ అట.. గొప్పవాళ్ళ షోకుల చదువులు.."

            "ఫైనార్ట్స్ ఎమ్మేనా..?" స్వర్జిత్ నమ్మలేనట్టు చూసి అంతలోనే సర్దుకున్నాడు. అయితే అక్కడే కిటుకు ఉంది. అనుకున్నాడు మనసులో.

            స్వర్జిత్ కి భాస్వతి సమస్య తెలిసింది. ఆడిపాడే వయసు. పనిలో ఏమాత్రం అనుభవం లేదు. అంతేననుకున్నాడు ఇన్నాళ్ళూ. కానీ ఇక్కడ సమస్య వేరే ఉంది. ఆమెకు ఇది ఇష్టంలేకపోవటమే కాదు- వేరేదో ఇష్టం భయంకరంగ, నరనరాలా ఆవహించి ఉంది. కనక ఇష్టంలేని, అనుభవం లేని, పరిణతీ లేని క్షేత్రం- కంపెనీలో అధికారిణిగా పని చేయటం- అదీ వివరాలు పూర్తిగ తెలికుండ- అకస్మాత్తుగ నెత్తిన పడటం.. అదీ ఇంకొక చోట మనసు పెట్టి ఇక్కడ శరీరం పెట్టి చేయాల్సి రావటం.. అమ్మో- స్వర్జిత్ ఒక్కసారిగ ఆమె వైపు నుంచి ఆలోచించటం మొదలుపెట్టాడు.

            వ్యాపార ప్రపంచం పద్ధతుల జ్ఞానం శూన్యం. పోనీ వేరే ఎవరికైనా అప్పచెబుదామంటే ఇంత బాధ్యత నెత్తిన పెట్టగలిగే నమ్మకస్తులు లేరు. ఆమె ఉంటే ఆమె కింద పని చేయటం వేరు- తామే అధికారం చెలాయించేది వేరు. చెప్పలేం కదా. ధనం అధికారం- ఎంత యోగ్యుల చేతిలో ఉన్నా దుర్వినియోగం కాక మానవని అంటారు. దానితో ఇష్టం లేకుండ గద్దె ఎక్కింది. తండ్రికి ఒకవైపు అనారోగ్యం. అదీ తనే చూసుకోవాలి. ఎంత నౌకర్లు ఉన్నా ఇంట్లో చక్కబెట్టుకోవాలి. బయట ఇంతమంది ఉద్యోగుల భవిత తన చేతిలో ఉంది. భాస్వతికి పని రాదు కనక ఎవరు ఎటునుంచి మోసం చేస్తారోనని ఆధారం లేని అయోమయం. అది అసలు సంగతి. అంతకు మించి వేరే ఏమీ లేదు సమస్య. అతనికి విషయం పూర్తిగ అర్థమైంది.

            కొన్నాళ్ళు గడిచాక-

            "ఏం చేస్తున్నావు..? ఆ ఉత్తరం అధికారిణిగారు వ్రాసింది. అక్షరం మార్చినా అగ్నిపర్వతంలా పేలుతుంది. వద్దు. ఇదివరకు కూడ ఇట్ల మార్చినందుకే తిట్లు తిన్నావు. మర్చిపోయావా..?" అర్ణవ్ గుర్తు చేశాడు.

            "ఏది ఏమైనా ఇది తప్పు. నేను మార్చి తీరతాను. వేరే కంపెనీకి వెళ్ళాల్సిన ఉత్తరం. నా కళ్ళబడింది కనక దీనికి న్యాయం చేయక వదలను."

            "అది నీ పని కాదు. మళ్ళీ నా పీక తెగుతుంది."

            "ఆ కోసే కత్తికి నా పేరు, నా పీక అడ్రసు చెప్పు."

            "అధికారి ఆమె. నువ్వు కాదు.. నీకు ధైర్యం చెప్పింది, ఆమె మాటలను లైట్ తీసుకోమన్నది నీ మనసు విరగకుండ, డిప్రెషన్ రాకుండ ఉండటానికి. అంతేకానీ ఇట్ల రెచ్చిపోవటానికి కాదు."

            అర్ణవ్ భాస్వతి పరిస్థితి వివరించిన తర్వాత స్వర్జిత్ కి ఆమె మీద కోపం పోయింది. ఎందుకు ఊరికే భయపడాలి అనే భావన వచ్చాక కాస్త ధైర్యం వచ్చింది. భాస్వతి కోపపు మాటను మాటగ కాక ఏదో ప్రేలాపనగ తీసుకోవటం మొదలు పెట్టాక మనసులో కలత కంగారు పోయాయి. హాయిగ ఉంది. కానీ ఆ ధైర్యంతో ఇంత పని చేయబోతున్నాడు. అది సరైనదో కాదో తెలియటం లేదు. కానీ అట్ల చేసి తీరాలి అని బలంగ అనిపించింది. అదే చేశాడు.

            అర్ణవ్ చేయాల్సిన ఉత్తరమది. భాస్వతి దాన్ని చూస్తూనే అర్ణవ్ ని పిలిచింది. అతను వెళ్ళీ వెళ్ళంగనే ఆమె తెగకోయబోతుండగనే తనపై ఎత్తిన ఆ కత్తికి స్వర్జిత్ పీకను అంటించాడు. తనకు మూడింది అనుకున్నాడు స్వర్జిత్. అంతకు ముందే రిసిగ్నేషన్ లెటర్ వ్రాసి తన జేబులో పెట్టుకున్నాడు. భాస్వతి పిలిచింది అని దాసు వచ్చి చెప్పంగనే వెళ్ళాడు.

            "ఎందుకు మార్చారు ఈ పదం..?" అడిగింది కోపంతో రగిలిపోతూ.

            "యూ ఆర్ సపోస్ డ్ టు- అనే పదబంధం సరైనది కాదు. అది అవతలవారి ని కించపరిచి నొప్పిస్తుంది. మన ఉద్దేశ్.." ఏదో అనబోతుంటే ఆమె ఖయ్యిమంది.

            "ఆపండి..! మీ ఉద్దేశంతో ఇక్కడ ఎవ్వరికీ పని లేదు. మీ పని కానిదానిలో మెడలు దూర్చకండి. తలలు ఎగిరిపోతాయి."

            స్వర్జిత్ ఆమాటలకు నొచ్చుకున్నా బయటకు కనబరచలేదు.

            "అది ఎట్ల ఉందో అట్ల మార్చి తెచ్చి ఇవ్వండి." అని ఆ ఉత్తరం అర్ణవ్ కి ఇచ్చి పొమ్మన్నట్టు చూసింది భాస్వతి. సరేనని అర్ణవ్ వెళిపోయాడు.

            స్వర్జిత్ అక్కడే నిలబడి, "ప్రతీసారి మీ ఉత్తరం వెళ్తోంది. అయినా వాళ్ళు సరైన ఫలితం చూపించటం లేదు. ఇది అయిదవది." అన్నాడు.

            "అందుకే చివరిసారి రిమైండర్ పంపి ఇక్కడితో వదిలేద్దామనుకుంటున్నాను."

            "నేను రికార్డ్ చెక్ చేశాను. వాళ్ళు మనకు చాలా పాత క్లైంట్లు. మీ నాన్నగారి సమయంలో చాలాసార్లు మనకు ఆలస్యం చేయకుండ, రెండవ రిమైండర్ పంపే అవసరం లేకుండ మాట విన్నారు. ఇప్పుడు ఎందుకో మొండికేస్తున్నారు- అట్లని వాళ్ళను వదులుకోవటం అంత వివేకం కాదు. నేను మీ సలహాదారును కాకపోవచ్చు. కానీ ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు ఉంచి పంపండి." అన్నాడు ధైర్యం చేసి.

            "మీ సలహాకు థాంక్స్. నౌ గెటౌట్.." అరిచిందామె.

            చేసేదేమీ లేక కాబిన్ కి వచ్చాడు స్వర్జిత్.

            "చెప్పింది వింటే ఇట్ల పరువు పోయేది కాదు కదా.." అర్ణవ్ అన్నాడు ఓదార్పో, ఎత్తిపొడుపో అర్థం కాకుండ. స్వర్జిత్ మాత్రం అలవాటైన బేరమే కనక మౌనంగ ఉండిపోయాడు.

No comments:

Post a Comment