నెమ్మదిగ లేచాను. ఇంకా తెల్లారలేదు.
స్నానం చేశాను. నాకు సంబంధించినవేవీ లేవక్కడ సర్దుకోవటానికి. ఏ చీరలో అతను నన్ను
ఎత్తుకొచ్చాడో అదే చీర ఒంటి మీద ఉందిప్పుడు. మిగిలిన కొద్దో గొప్పో వస్తుసామగ్రి
అతనివే. నావేమీ లేవు. అందుకే ఎటూ చూడలేదు. కేవలం భగవంతుడికి దండం పెట్టుకున్నాను. నా
భగవద్గీత పుస్తకం తీసుకున్నాను. నేరుగ గది తలుపు తెరుచుకుని అడుగు బయటకు పెట్టాను.
కళ్ళకు అన్నీ దిక్కులే కనిపించాయి. ఎవరన్నారు.. ఏ దిక్కూ లేదని..? ఇన్ని
దిక్కులున్నాయి. అన్నీ నావే ప్రస్తుతం..! ఏ దిక్కైనా ఒకటే.
గేట్ తెరుచుకున్నాను. గార్డు చటుక్కున
చూశాడు. "తెల్లారాక పోకూడదా అమ్మడూ..?" రాజన్న నన్ను అమ్మడూ అంటాడు.
అందుకే అంతా నన్నదే అంటారు.
"ఎప్పడైతే ఏం రంగన్నా..? వెళ్ళక
తప్పదుగా.."
రంగన్న కళ్ళు నిండాయి. "నా
ఇంటిదానితో చెప్పాను.. మన ఇంటికే తెమ్మంది నిన్ను. మా ఊరు రారాదా..?"
అడిగాడు.
అది నాలిక చివరి మాట కాదు.. నిండుమాటే.
అందుకే నా కళ్ళూ నిండి వచ్చాయి. నాకు ఆ ఆఫర్ ఇవ్వటానికి ఇక్కడ పని చేసే ప్రతీ
మనసున్నవాడు సిద్ధంగ ఉన్నాడని నాకు తెలుసు.
"వద్దు రంగన్నా.. ఈ దరిదాపుల్లో ఈ
ఊరుకు చుట్టుపక్కల ఎక్కడా నాకు ఉండాలని లేదింక." అన్నాను.
"మీ అన్నయినా కొంచెం ఆస్తి నీ పేర
రాసి ఇచ్చాడు కాదు. అంతా కొడుక్కే రాసుకున్నాడు. దిక్కు లేనిదాన్ని చేశాడు.."
అన్నయ్య అట్ల ఎందుకు చేశాడో నాకు తప్ప
ఎవ్వరికీ తెలియదు. బహుశ అతనికి ఒక్కడికి అర్థమైందేమో. అంతకన్నా ఇంకెవ్వరికి
చెప్పినా అర్థం కాదు.
"దారి ఖర్చులకు ఉంచమ్మడూ.."
అని జేబు లోనుంచి ఎంత కొంత తీసి ఇవ్వబోయాడు.
నేను కళ్ళు తుడుచుకుని, తల అడ్డంగ ఊపి,
వేగంగ అడుగులు వేశాను అక్కడి నుంచి. అది భిక్ష కాకపోయినా నేను తీసుకోలేను. ఇవ్వటం
తప్ప తీసుకోవటం నేర్చుకున్నదాన్ని కాను. వెనక
నుంచి రంగన్నమాటవినపించింది- "ఎంత దొడ్డ కట్టం వచ్చినా నవ్వు చెరగదు
అమ్మడుకు.."
నాకు అప్పుడు సువ్వొదిన నవ్వు గుర్తుకు
వచ్చింది. ఆమెను అన్నయ్య గొడ్ల చావిట్లో ఉంచాడు. అతను నన్ను కాస్త మంచి గదిలోనే,
అదీ సురక్షితంగ తన గదికి పక్కనే ఉంచాడు. ఆమెకు తిండి సౌఖ్యం లేదు. నాకు బాగనే
గడిచింది. తిన్నంత పెట్టారు. అతనికి అన్నయ్యకూ తేడా ఏంటంటే- చెయ్యి చేసుకోడు..
అంతే. అన్నయ్య సువ్వొదినను చెంప పగలగొట్టిన సందర్భాలున్నాయి. ఆ అద్దులు ఆమె చెంపల
మీద కొన్ని రోజులు ఉండిపోయేవి. కానీ అంతకన్నా శక్తి ఇతని మాటలకున్నది. ఆ మాటలు
ఈటెలై, శూలాలై, బల్లాలై, బాణాలై నా ఒంటిని చిత్రవధ చేసేవి. మనసును ఛిన్నాభిన్నం
చేసేవి. వదినకు వాటితోపాటు పురుటి నెప్పులూ, కాన్పూ, పసికూనతో నానా యాతనా ఉన్నాయి.
నాకవన్నీ లేవు. కన్నతండ్రి ఆ కొడుకును కనుకొసలనైనా చూడడు. మనసు పిండేసే వేదన అది. ఏ
తల్లికైనా ఆ తిరస్కారం భరించటం చాలా కష్టం. అయినా ఆమె నవ్వు చెక్కు చెదరలేదు. దాని
ముందు నేను పడినదెంత..?
మనిషి చేయనివి కూడా తనే చేశాడని అనుకుని
ఎంత మోసపోతాడో. అమ్మ అట్ల పోవాల్సి ఉంది కనక పోయింది. అందులో వదిన కావాలని, పని
కట్టుకుని చేసిందేం ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. పోనీ మందుసీసా తనే తెచ్చి
ఇచ్చిఉన్నా ఏదో పొరపాటని అన్నయ్య ఎందుకు సర్దుకోలేకపోయాడు? ఎందుకు అన్నయ్యకు వదిన
అంటే అంత కోపం ఏర్పడింది..? అదీ విధేనేమో. నిజానికి అన్నయ్యకు అసలు సువ్వొదినంటే
ఇష్టం లేదట. అమ్మ ఇష్టం కాదనలేక చేసుకున్నాడట. ఆమెకు చదువు లేదని అన్నయ్యకు చాలా
చిన్నతనంగ ఉండేదట. సరే, ఎంతో ప్రయత్నం మీద ఆమెను అంగీకరించాడు. ఆ సగం మనసు అస్వీకరణం
అంతా, అమ్మ నిష్కారణంగ పోవటంతో, ఇంత విసురుగా అన్నయ్యలో నుంచి క్రోధాగ్ని రూపంలో
బయటకు వచ్చింది. అన్నయ్య ఎప్పుడూ తనతో అనకపోయినా సువ్వొదినకు ఈ సంగతి తెలుసట.
ఒకసారెప్పుడో చెప్పింది నాతో రహస్యంగ. "మీ అన్నయ్యకు చదువంటే చాలా విలువ.
అంతేకానీ నేనంటే అయిష్టం కాదు. నాకూ చదువుంటే నేనన్నా గౌరవం ఉండి ఉండేది. అది
లేకపోవటం నా దౌర్భాగ్యం. పాపం చదువులేని నన్ను చేసకున్నందుకు అత్తయ్యగారికి
తగినశాస్తే చేశాను.." అది ఆమె భావన.
అన్నయ్య పోయే ముందు కూడా కన్నకొడుకు
స్పర్శ కోసం పాకులాడలేదు. కావాలంటే వాడిని పిలిపించుకుని అక్కున
చేర్చుకోగలిగేవాడే. కానీ చేయలేదు. అపరాధభావం..!! తన భార్య ఒక తల్లిగా తన
కొడుకుకోసం కోరిన తండ్రి ప్రేమ సౌభాగ్యాన్ని ఆమెకు అందించకుండా తానొక్కడే ఆ
సుఖాన్నిఅనుభవించటం ఆయనకు అన్యాయంగ అనిపించేది. నాకిది జరగాల్సిందే అనుకున్నాడు..!
కొడుకు అనే భావనకు కూడా దూరంగ ఉన్నాడు. ఆస్తి తన సొంతం కాదు. అది బాధ్యత కనక వరానికి
అందించాడు. ప్రేమ తన సొంతం. కానీ అది అందించగలిగే స్థాయిని నైతికంగ కోల్పోయాడు.
'నా తల్లిని పొట్టన పెట్టుకున్నావు' అని వాడు తనను తన మాతృహంతకుడిగా తలిస్తే..? నీ
తల్లి నా మాతృహంతకురాలని చెప్పగలడా..? లేదు. ఎందుకంటే సువ్వొదిన కావాలని ఏం
చేయలేదు. తను మాత్రం కావాలని తెలిసీ చేశాడు. అందుకే ఆ ద్వేషం కన్న కొడుకు
ప్రదర్శిస్తే దాన్ని స్వీకరించగలిగే శక్తి ఆయన మనసుకు లేదు. వాణ్ణి పొందాలన్నా సాక్షాత్తు
ఆ బావమరిదే తనను ఆ సుఖం పొందనివ్వడు. ఇక ఇప్పుడు ఉన్న ఈ తటస్థ భావన కూడా పోతుంది.
తాను ఇప్పుడు దుర్బలుడు. అశక్తడు, నిస్సహాయుడు. అట్లగే ఉండిపోతే మంచిది.
అనుకున్నాడు. అట్లగే మౌనంగ ఆవేదనను భరించి వెళిపోయాడు. ఇది అన్నయ్య భావన.
ఏదైతేనేమి..? అన్నయ్య, వదిన, అమ్మ,
నాన్న.. అంతా వెళిపోయారు. నేను ఒక్కదాన్ని ఉండిపోయాను. ఈ భూమి మొత్తం మీద..!
మనసులో ఆలోచనలు వాటి దోవన అవి
సాగిపోతున్నాయి. అడుగులు వాటికవే ఏదో దారిన పడి పోతున్నాయి. ఏది దారో ఏది కాదో
కూడా తెలియటం లేదు. బయట పరుచుకుని ఉన్న చీకటే లోపలా ఆవహించి ఉంది.. చీకటి.. దిశాహీనత..!
ఒక చోటి నుంచి అడుగు తీస్తే వేసేందుకు ఇంకో అడుగుకు చోటు వెతుక్కునే సమయం.
అతను చాలా తెలివికలవాడు. అందుకే నన్ను
పెళ్ళి చేసుకోలేదు. ఆ పగ ఎంత తీవ్రమైందంటే తను పెళ్ళి చేసుకుంటే నాకు ఆశ్రయం
ఇవ్వాలి. అప్పుడు నాకు జీవించే ఆధారం దొరుకుతుంది. అది తన ప్రణాలికకు విరుద్ధం.
అందుకే కావాలంటే పెళ్ళి చేసుకుని జీవితాంతం చిత్రవధ చేయగలిగే ప్రణాలికకన్నా గాలికి
వదిలేసే ఈ ప్రణాలికే ఎక్కువ పగ తీర్చేదిగా భావించాడు. ప్రత్యక్షంగ చేసిన ఈ మూడేళ్ళ
ఊడిగానికి లెక్క సరిపోయినా అసలు ఋణం మాత్రమే తీరింది. మరి వడ్డీ సంగతేంటి..? అదే ఈ
"ఇంక నాకు కనిపించాల్సిన అవసరం లేదు"కు అర్థం. మూడేళ్ళు ఒక మగవాడి దగ్గర
పడి ఉన్న ఆడమనిషిని ఎవరు పెళ్ళి చేసుకుంటారు..? కనక నాకు వేరే ఆశ్రయం దొరికే
అవకాశం కూడా లేదు.
"నీకెప్పుడూ అతను చేసింది నిజంగ తప్పనిపించలేదా..?"
నిన్న మధ్యాహ్నం అడిగాడు రాజన్న. ఇంక వెళిపోతున్నానని తెలిసి, నాకిష్టమని బూరెలు
చేసి తెచ్చి ఇచ్చాడు. ఇష్టంగ తింటుంటే అమ్మ గుర్తుకు వచ్చి కళ్ళు నిండి వచ్చాయి.
అది చూసి తల నిమిరి అడిగాడు ఆ ప్రశ్న. సమాధానంగ తల అడ్డంగ ఊపాను. క్షణమైనా
ఆలోచించలేదు.
"ఎందుకు? నీకిట్ల కావటం బాధాకరం
కాదా..?"
"సంతోషకరం కాదు. అంతే."
"ఏమో.. అంత పెద్ద జమీందారీ
కుటుంబంలో రాచబిడ్డగ పుట్టి ఇంతటి దుస్థితి వస్తే నేనైతే ముక్కలైపోయేవాడిని.. లేదా
హంతకుణ్ణి అయ్యేవాడిని"
"ఒకవేళ నీవారి కారణంగ వాళ్ళ అక్క
పడిన క్షోభ చూస్తే నీకూ ఈ శిక్ష పెద్ద హింసగా, క్రూరకర్మగ కనిపించేది కాదేమో."
"కానీ అట్లాగని ఆత్మఘాతుకంతో
సమానమైన ఈ పరిస్థితిని స్వీకరించటం కూడా సరి కాదు కదా.." రాజన్న వాదించాడు.
"సువ్వొదినకు చాలా ధర్మాలు తెలుసు.
అయినా ఆమెకు ఈ దుస్థితి ఎదురుపడినప్పుడు దీనినే ఆనందంగ స్వీకరించింది."
"ఆమె మీ అన్నకు భార్య. ఆమెకు ఆ
ధర్మం వర్తిస్తుంది. నీకు కాదు.."
"ఏమో. నన్ను ఎంతో కష్టానికోర్చి
పెంచిన మా అక్కనెవరైనా అట్ల చేస్తే నేనూ ఇతను చేసిందే చేసేదాన్నేమో."
"నిజంగ ఒకరి మీద ప్రేమ వల్ల అంత పగ
మనసులో జనిస్తుందా..?"
"అతని సంగతి తెలియదు. ఇప్పుడు నాకు
జనించింది మాత్రం అదే. ఇది నేను కావాలనే మా అన్నయ్యకు వేసిన శిక్ష. సువ్వొదిన
నవ్వు గుర్తుకు వస్తే చాలు, ఆమె కన్నీటికి కారకుడైనవాడు సొంత తోబుట్టువైనా దీనికి
రెట్టింపు శిక్ష ఇంకా విధిస్తే బాగుండనిపిస్తుంది. నేను అతనెక్కువ బలవంతం
పెట్టకుండానే కావాలనే అతనితో వచ్చేశానని అన్నయ్యకు నా మీద చాలా కోపం వచ్చింది.
అతనికి కూడా నేను ఏమాత్రం ప్రతిఘటించకుండా ఎందుకు తన వెంట వచ్చేశానో, ఎందుకు అతను
పెట్టిన ఆంక్షలన్నింటికీ తల ఒగ్గి ఉంటున్నానో ఇప్పటికీ తెలియదు."
"నీది చాలా పిచ్చి
మనసమ్మడూ.."
"ఔను రాజన్నా. ఏ ఆడపిల్లా ఇట్ల
చేసి తనవారిని బాధపెట్టదు. ఒకరకంగ అన్నయ్యకు నేను చేసింది తప్పే. సువ్వొదిన వైపు
నుంచి చూసినా ఇది సరి కాదు. నన్ను నేను హింసించుకుంటుంటే ఆమె మాత్రం
సంతోషిస్తుందా..?"
రాజన్న ఆశ్చర్యపోయాడు- "మరి ఇదంతా
ఎవరికోసం..?"
"అతని కోసం..!!"
రాజన్న కళ్ళు వెడల్పైనాయి.
"అదేంటి..?"
"ఔను. నేను ప్రతిఘటిస్తే, బాధపడితే
నన్ను ఆరళ్ళు పెట్టిన పాపం అతనికి చుట్టుకుంటుంది. అక్కకోసం పగ
చల్లారుస్తున్నాననుకుంటున్నాడే కానీ ఈ వేదన వాళ్ళ అక్కకు కూడా తగులుతుందని
ఆలోచించటం లేదు. ఏమో, మనిషి పోయాక కూడా కొంతకాలం భూమితో సంబంధం కలిగి ఉంటారని
విన్నాను. అదే నిజమైతే వాళ్ళక్క నా బాధ చూసి అతనికే శాపం పెట్టే అవకాశం ఉంది. అందుకే
నేను మరింత వేదన పడి అతనిని పాపపంకిలం చేయకుండా ఈ కష్టాన్ని సంతోషంతో
భరిస్తున్నాను. ఈ హింసను మనస్పూర్తిగ అంగీకరించి, వరంలా భావించి మనోక్లేశాన్ని
తగ్గించుకుంటున్నాను. జీవితంలో అన్నీ ఏదో ఉద్దేశం కోసమే జరుగుతాయి. అన్నింటికీ లక్ష్యం
మన సుఖంగ గడపటమే కాదు కదా. జన్మకొచ్చినందుకు తీర్చుకోవలసిన ఋణాలుంటాయి.
కడుక్కోవలసిన పాపాలుంటాయి. నేర్చుకోవలసిన పాఠాలుంటాయి. నాకు నేనుగా ఆహ్వానించే
కష్టం ఓ వ్రతం లాంటిది. ఓ యజ్ఞం లాంటిది.. ఓ తపస్సు లాంటిది. ఆ తపఃఫలం అన్నయ్య
చేసిన పాపాలన్నీ కడిగేయాలి. వదిన పడిన వేదనను తీర్చాలి. అతని రగిలిన గుండెను
చల్లార్చాలి. ఇందరి మంచిని కోరి నేను ఈ బాధలను, అవమానననూ సహిస్తున్నాను. సహించినా
కొద్దీ నాలోనే ఆత్మబలం పెరుగుతోంది. నేను విరిగిపోకుండ ఉన్నది ఈ ఆత్మబలం వల్లే.
అంటే నేను ఏ తప్పూ చేయటం లేదనే కదా అర్థం..? ఇంక ఆత్మఘాతుకం, పాపం అనే ప్రశ్న
ఎక్కడ తలెత్తుతుందిట?"
రాజన్న నా కళ్ళలోకి చూస్తూండిపోయాడు.
బహుశ ఈ పాషాణహృదయురాలు ఏ మట్టితో తయారైందోనని ఆలోచిస్తుండవచ్చు.
అడుగులు సాగుతూనే ఉన్నాయి. గమ్యం
లేకపోయినా దూరాలు నడవవచ్చు అనే సత్యం మెల్లగ అవగతమైతోంది.
ఏమో.. నేను ఇట్లగే ఆలోచిస్తుంటాను. నా
గురించి అక్కడ ఎవరేం అనుకున్నారో నాకు తెలియదు. నేనెవరితో మాట్లాడేదాన్ని కాదు.
ఎందుకంటే నాతో ఎవరూ మాట్లాడేవారు కాదు. చూడంగనే 'ఎవరో పెద్దింటి బిడ్డ.. పాపం'
అనుకునేవారు. నాకు పెళ్ళయిందా, లేదా, నేను అతనికేమైనా అవుతానా, లేదా, ఇంతకాలంగా ఒంటరిగ
ఇక్కడ ఎందుకు ఉంటున్నాను..? ఎవరికీ తెలియదు. ఒకటి రెండుసార్లు అన్నయ్య నాకోసం
వచ్చినప్పుడు ఏదైనా తెలిసిందేమో, లేదా రాజన్న ద్వారా ఏమైనా తెలిసిందేమో మరి..
తెలియదు. నేనెప్పుడూ ఒకరు నాగురించి ఏం ఆలోచిస్తున్నారనేది పట్టించుకోలేదు. అక్కడ
ఆడవారెవరూ లేకపోవటం నాకు ఒకరకంగ మంచే జరిగింది. మగవాళ్ళకు నన్ను నా ఇష్టానికి
విరుద్ధంగ సమీపించగలిగే ధైర్యం ఉండదు కదా. వారు చేసేది, నేను చేసేది ఒకే పనైనా
వ్యక్తిత్వాలు వేరు. ఆలోచనా స్థాయులు వేరు. కనక నేను వారిలో ఒకదానిగా ఎప్పుడూ
గుర్తంపు పొందలేదు. అందులో యజమానికి సంబంధించిన కాండిడేట్.. ఎవరు వేలుపెడతారు..?
ఇంతకాలంగ ఉంటోంది.. ఏమీ జరిగి ఉండదంటావా..?
ఏమో.. ఎవరికెరుక.. అయినా గొప్పోళ్ళ
విషయాలు మనకెందుకు..?
ఇటువంటి మాటలు అప్పుడప్పుడూ చెవులో
పొరపాట్న పడుతుండేవి. ఈ రకం జీవితం పర్యవసానం ఏంటా అని నన్ను ఆలోచింపచేస్తుండేవి.
అప్పుడు కాస్త కలుక్కుమంటుండేది గుండెలో. కానీ ఒకటి- తన పంచన ఉన్నన్నాళ్ళు
ఒక్కనాడైనా ఎవరికీ అనుమానం రేకెత్తించే పరిస్థితి అతను తేలేదు. చేతలలోనే కాదు.
చివరకు చూపుల్లో కూడా అంత నియంత్రణ- నేను ఎక్కడా చూడలేదు. సమాజాన్ని నేనూ ఒక
స్థాయి నుంచి చూశాను. కాలేజికెళ్ళాను.. బజార్లలో తిరిగాను... అనియంత్రితుల వర్తన
నాకు అపరిచితం కాదు. అతను మాత్రం పరమ నియంత్రితుడేనని కచ్చితంగ సర్టిఫికెట్
ఇవ్వగలను. చిన్నప్పటి నుంచీ ఇంతే. చెప్పేవాడు చేయడు, చేసేవాడు చెప్పడు.. ఖచ్చితంగ
రెండవకోవకు చెందినవాడే. అతనెటువంటివాడైనా ఇంక నాకూ అతనికీ ఏ సంబంధం లేదు. అంతే.
నేను ఆలోచించుకుంటున్నానో నడుస్తున్నానో
తెలియదు. మొత్తానికి ఆ చర్యకు ఫలితంగ ఎదురుంగ రైలు పట్టాలు కనిపించాయి. ఊరి
పొలిమేరకు వచ్చాను. తూర్పు ఇప్పుడే కొంచెం తేటపడుతోంది. చీకటి ముసుగు తొలగుతున్న
ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంకా పొద్దు పొడవలేదు. నేను అక్కడే గట్టు లాంటిది
కనిపిస్తే కూర్చున్నాను. జరిగిన సంఘటనల పూర్వాపరాలు ఆలోచిస్తే దాన్ని బట్టి భవితను
చూడటానికి ప్రయత్నించాలి. ఎక్కడ ఉన్నానో తెలిస్తే కదా ఎటుపోవాలో, ఎటు పోగలనో తెలిసేది..!!
నాకు ఈ లోకంలో ఉన్నది అన్నయ్య ఒక్కడే. ఆ
ఇల్లు ఇప్పుడు నాది కాదు, వరానిది. ఆస్తికి గార్డియన్ గ అయినా అన్నయ్య నన్ను
ఎంచుకోలేదు. ఎంచుకుని ఉంటే ఆస్తికి కాపలాదారుగా అయినా వరానికి 21 సంవత్సరాలు
వచ్చేదాకా వాడితో ఉండేదాన్ని. తర్వాత వాడికి అభ్యంతరం లేకపోతే అట్లగే ఉండిపోయేదాన్ని.
నా జీవితం వెళిపోయేది. ఇది నేను ఊహించని పరిణామం. అతను తిరిగి పంపిన రోజు అన్నయ్య
నాకోసం ఉండడని నేననుకోలేదు. అతను తీసుకువచ్చినరోజు మొదలుగా పరిణామాలు ఆలోచించటం
మానేశాను. ఇది తెగిన గాలిపటం. ఎక్కడ చిక్కినా, ఎక్కడ తగిలినా, చినిగినా అంతా
ఈశ్వరేచ్ఛ. అన్నయ్యకు నా మీద నమ్మకం లేదేమోనని రాజన్న అన్నాడు. ఏమో..! కారణం అది
కాకపోవచ్చు కూడా. ఏదైనా ఆ తలుపు నాకోసం తెరుచుకోదు.
మిగిలింది ఇతని తలుపు. అది మూడేళ్ళ
క్రితం, కేవలం మూడేళ్ళ కోసం మాత్రమే తెరుచుకుంది. దాన్ని తెరిచి నన్ను ఆ గదిలో
పడేస్తూ అతను చెప్పిందదే. మూడేళ్ళ తర్వాత నువ్వెవరో నేనెవరో. సరే, అంతవరకూ
జీవనగమనం పూర్వోహలూ, ప్రణాలికలూ లేకుండనే నిశ్చితమైంది. ఇప్పుడు ఆ గది తలుపు
తెరుచుకుంది. బయటకు తోసింది. మూసుకుపోయింది. ఇక తెరుచుకోదు. నేను కొట్టను కూడా.
అట్ల కొట్టవలసి రావటం ఈ బానిసత్వం కన్నా నీచమైన అవమానం. అంతకన్నా చావు మేలు.
ఇక నాకు మిగిలిన తలుపు ఒకరి అనుమతి
అవసరం లేకుండ తెరుచుకోగలిగేది, నేను అవమానపడకుండా కొట్టగలిగేది ఒక్కటే. ఇప్పుడది
కొట్టాలా వద్దా అనేది ప్రశ్న. కొడితే అంతటికీ శుభం కార్డు పడ్డట్టే. ఈ భూమి మీద ఒక
పాత్ర కథకు శాశ్వత ముగింపు..! శరీరం ధరించటానికి ఎక్కడినంచి వచ్చానో ఆ చోటికే
చేరతాను. ఆ తలుపు కొట్టకపోతే అంతకన్నా భయంకరమైన జీవనం నన్ను పీక్కోని తినటానికి
ఎదురుచూస్తోంది. అంతా పిచ్చిగ ఉంది. రైలు పట్టాలకు అంత దగ్గరగ ఉన్నందుకేమో ఆలోచనలు
అటు పోతున్నాయి. నాకు నవ్వొచ్చింది. రైలు పట్టాలు రైలు పోవటానికే కాదు.. ప్రాణాలు
పోవటానికి కూడా పనికి వస్తాయి. రోజూ రైలు కూత వినిపించే వేళ అది. ఇంకా నిద్రాదేవి
వడిని వదిలి ప్రాణికోటి మేల్కొనలేదు కనక ఇక్కడ ఏం జరిగినా ఆపేవారెవరూ ఉండరు.
చివరకు నన్ను అమ్మా నాన్నా అన్ని పూజలు
చేసి కన్నది ఇందుకా..? సువ్వొదిన ఆరళ్ళన్నింటికీ నేను సమాధానపు శిక్షననుభవించి
తిరుగు ప్రయాణం కట్టమనేనా..? ఈ జీవితం ఉన్నది ఇందుకా..? నేను సాధించిందేమిటి? పైన
వెళ్ళంగనే కనిపించి వారు అడిగితే నేనేం చెప్పాలి..? ఈ జీవన పరమార్థం ఇంతేనా..? "ఎక్కడికి
పోవాలి..?" అనే నా ప్రశ్న, "ఏదైనా చోటు దొరికినా ఏంచేయాలి..?" అనే
దాని వెనువెంట తలెత్తే మరో చిక్కు ప్రశ్నకు బదులుగా ఇప్పుడు నా ఆలోచన జీవన
పరమార్థం మీదకు మళ్ళింది. ఏంటి మానవజీవన పరమార్థం..? ఎందుకు ప్రాణికోటి ఈ భూమి మీద
జన్మించి మరణించి తిరిగి జన్మిస్తూ ఉంటుంది..? దేనిని కోరి మనిషి
ప్రాకులాడుతున్నాడో అదేంటి..? ఎక్కడ ఉంటుంది..? నాకేమీ తెలియదు. నేను
తత్త్వవేత్తను కాను. కాగలిగేదాన్నేనేమో. ఈ మూడేళ్ళ స్తబ్ధత నన్ను, నా నిశితమైన
ఆలోచనను బండబార్చింది. లేకపోతే నాకు జీవితంలో మొట్టమొదలు పరిచయమైన పుస్తకాలు,
సువ్వొదిన చూపిన ఈ లోకం బయటకు తలుపులు, తాత్త్విక విషయాలవే. సువ్వొదిన మరణం నన్ను
చాలా లోతుగా ఈ దిశగా ఆలోచింపచేసింది. అది సాగి ఉంటే ఈపాటికి సమాధానాలు తట్టి
ఉండేవేమో.
పెళ్ళి కాని ఆడపిల్లగా అతని పంచన నేను
ఉండటం వల్ల నా జీవితం మొత్తం అగమ్యగోచరమైంది. అతనికి కూడా పెళ్ళి కాలేదు. కానీ
ఇట్ల నన్ను తెచ్చి పెట్టుకోవటం వల్ల అతని జీవితంలో ఏ తేడా పడలేదు. అదే ఈ సమాజంలో
ఆడకూ మగకూ ఉన్న తేడా. కానీ ఒకటి మాత్రం నిజం. అతని జీవితం ఆలోచిస్తే కూడా
జాలేస్తుంది. అమ్మా, నాన్నా, అక్కా ఎవ్వరూ మిగలలేదు. ఒంటరివాడు., అయినా అతనికి
బ్రతకటానికి ఆలంబనగా వరం ఉన్నాడు. అతని సొంత ఆస్తితోపాటు వరం పేరట వచ్చిన ఆస్తి
ఉంది. చేయటానికి చేయించటానికి బోలెడు పని ఉంది. నాకవేమీ లేవు. నన్నిట్ల చేసి అతని
పగ ఎంత చల్లారిందో నాకు తెలియదు. కానీ అన్నయ్య చితి కాలింది మాత్రం ఈ మంటల్లోనే
అని అతనికీ తెలుసు. అన్నయ్య చనిపోయినా అతని పగ చల్లారలేదా..? ఏమో.. తెలియదు. ఇంతకు
ముందు తెలియదు కానీ ఇక ముందైతే మాత్రం నా జీవితంలో గడిచే ప్రతీ రోజూ అతని పగను
చల్లార్చేదే ఉంటుందేమో. నిరాధారతకన్నా మించిన శాపం ఏ స్త్రీకి ఉండదు. ఆ
నిరాశ్రయతకు గురైన నా బ్రతుకును చూసి అన్నయ్య ఆత్మ ఇంకెక్కడైనా శరీర ధారణ చేశాక
కూడా అశాంతి వీడదేమో. నాకు సంబంధించిన ఈ ఖిన్నత, అనుతాపం ఆయనను వెంటాడుతూనే
ఉంటుందేమో.
నా ఆలోచనలకు మల్లే చూసినంత మేర అట్ల
సాగిపోతునే ఉన్న రైలు పట్టాల వంక చూస్తూ కూర్చున్నాను.
No comments:
Post a Comment