Saturday, 12 November 2016

3. బంధంతో వీడే బంధం-2

            "మౌనమేలనోయీ.. ఇక మౌనమేలనోయీ ఇది మరపు రాని రేయీ.."
            "ఈపాట ఎట్ల ఉందే.?"
            "ఊఁహూఁ.. చాలా పాత పాట.. ఇప్పుడు లేటెస్టువి పెడితే బాగుంటుందేమో.."
            "నీ తలకాయ- ఇది మనకోసం కాదు. అక్క-బావగారు కోసం. అక్కకు అసలు పాటల టేస్టే లేదు. అడిగీ వేస్ట్. కానీ పాపం బావగారి అభిరుచి ఏంటో తెలుసుకోవాలి కదా..?"
            "ఏమో- ఆయనను చూస్తే చాలా స్లోగ ఉన్నాడు. అన్నీ స్లోమోషనే. అట్లా శూన్యం లోకి చూస్తుంటాడు. పిలిస్తే కూడ మెల్లగ ఏ సప్తలోకాల తెరలనో చించుకుని మన ముందుకు వచ్చినట్టు చూస్తాడు. అందుకే ఈ పాట పెట్టాను- పాతపాటలే ఆయనకు నచ్చుతుండవచ్చు అనుకుని.."
            స్వర్జిత్ ఆ మాటలు వినపడుతున్నా ఏమీ స్పందించకుండ చూస్తూ ఊరుకున్నాడు. అతనికి నవ్వు కూడ రావట్లేదు.
            "చూశావా, ఇప్పుడు కూడ ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ అట్ల ఉన్నాడు.."
            "ఏయ్.. అల్లరి ఆపి పని చూడవే ముందు."
            "సరే- పాతపాటలు ఓకే.. ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడు..! ఇవాళ రాత్రి ఎన్ని పాటలు పెడితే మాత్రం గడుస్తుంది..?" లోతుగ నిట్టూరుస్తూ అంది ఒక అమ్మాయి. మిగిలినవారు నవ్వారు కిలకిల.
***
            వారంరోజుల తర్వాత ఆ కంపెనీ వీరి ఆర్డరు సమ్మతించినట్టు కబురు వచ్చింది.
            "పెద్దవాళ్ళకు ఎట్ల వ్యవహరించాలో తెలుసు. పొయ్యి పొయ్యి అడగకుండనే సలహాలివ్వటానికి నీకు ఈమే దొరికింది.. చూడు- ఆమె ఉత్తరమే పని చేసింది." ఆ రోజు భాస్వతి కాబిన్ లో పని పడి వెళ్ళి ఈ సంగతి తెలుసుకుని వచ్చి అన్నాడు అర్ణవ్.
            స్వర్జిత్ మౌనంగ విని ఊరుకున్నాడు.
            "వెళ్ళు - అమ్మాయిగారు పిలుస్తున్నారు నిన్ను." అర్ణవ్ చెప్పాడు.
            "నిన్నటి విషయం ఆమెకు తెలిసింది అంటావా..?"
            "ఏమో- ఆ సంగతి నాకు తెలియదు. నన్నైతే ఏమీ అడగలేదు. దాసును అడిగాను- వాణ్ణీ ఏమీ అడగలేదట. బహుశ తెలియకపోయి ఉండవచ్చు."
            ఏదేమైనా స్వర్జిత్ వెళ్ళక తప్పదనుకుని ఆమె కాబిన్ కి వెళ్ళాడు. చేతికి ఆమె ఒక కవర్ ఇచ్చి, "యూ కెన్ గో నౌ." అంది.
            అంతే- స్వర్జిత్ పైప్రాణాలు పైనే పోయాయి. "సారీ మేడమ్.."
            "దేనికి..?"
            "అది.."
            "ఏదైనా చేసేముందు ఉండాలి. గెటౌట్." అని పంపింది.
            స్వర్జిత్ అది తెరిచి చూడకపోయినా అందులో ఏం ఉందో బహుశ అతనికి తెలుసు. సీట్ వద్దకు పోయే ధైర్యం లేక రెస్ట్ రూం లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అద్దంలో చూసుకుంటూ అనుకున్నాడు- అయిపోయింది- ఈ ఉద్యోగం గోవింద. అది తప్పకుండ సస్పెంషను కాగితమే. అతనికి అది తెరవకుండనే ముచ్చెమటలు పోశాయి. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలా..?
            "మరి ఈ బుద్ధి ఎధవ పనులు చేసేటప్పుడు ఎక్కడపోయిందంటా..?" మనసు దెప్పింది.
            "ఏంటి నేను చేసిన వెధవ పనులు..?" అతను తిరిగి అడిగాడు మనసును.
            నాలుగురోజుల క్రితం ఉదయం స్వర్జిత్ కింద పార్కింగ్ దగ్గర వాచ్ మెన్ కి డబ్బులిస్తుంటే చూసి, భాస్వతి కాబిన్ కి పిలిచి ఛెడామడా తిట్టింది. అట్ల వాళ్ళకు డబ్బు ఇవ్వటం అలవాటు చేయటం తప్పు అని. అరే- అది నా వ్యక్తిగత విషయం. నీకెందుకు అనాలనుకున్నవాడల్లా నోరు మూసుకుని ఊరుకున్నాడు. అరే దీనికి కూడ తిట్టాలా..? అని బాధపడ్డాడు. ఏమైనా అంటే నా ఆఫీసులో వాచ్ మెన్ లను పాడు చేయటానికి నీకెవరు హక్కు ఇచ్చారనీ తిడుతుందేమోనని భయం వేసింది.
            "అది వెధవ పని కాదా..?" మనసు అడిగింది. తల ఊపాడతను.
            అంతకు క్రితం రెండురోజుల ముందు సాయింత్రం విమర్శిని వానపడుతోందని బస్ స్టాప్ వరకు లిఫ్ట్ అడిగితే సరేనని ఇవ్వబోయాడు. భాస్వతి వెళిపోయింది కదా అనే అనుకున్నాడు. కాని ఎక్కడి నుంచి చూసిందో మరి- సరిగ్గ విమర్శిని తన బైక్ ఎక్కబోతోంది- ఆమె కార్ వచ్చి పక్కన ఆగింది. విమర్శిని వెంటనే అక్కడి నుంచి పరిగెత్తబోయింది వానలో అట్లగే.
            "ఏయ్.. కారెక్కు..!" అంది భాస్వతి అధికారంతో హుంకరిస్తున్నట్టు. చేసేదేం లేక విమర్శిని కార్ ఎక్కింది. కార్ బుర్రున వెళిపోయింది.
            "కంప్లయంస్ ఇష్యూలలో ఇది చదవలేదా? అది వెధవ పని కాదా..?" తల ఊపాడు స్వర్జిత్.
            సరే, అవన్నీ చిన్నవే. కానీ క్రితం రోజు జరిగింది మాత్రం పెద్ద నేరమే.
            సంయమిని ఉరఫ్ మినీ పెళ్ళి అనుకోకుండ కుదిరి రెండురోజుల్లో వెళిపోతున్నదని ఆఫీసులో అందరికీ పార్టీ ఇవ్వాలనుకుంది. కానీ నగరంలో బంద్ లు, గొడవలతో బయట పెద్దగ ఏమీ ప్లాన్ చేసే అవకాశం లేక, కనీసం ఒక చిన్న గెట్ టుగెదర్ లాగ పెట్టుకుందామనుకుంది. వేరే వ్యవస్థ చేసే వ్యవధి లేకపోయింది. స్వర్జిత్ ఆలోచించి ఆదివారం శెలవు రోజు ఆఫీస్ లోనే అంతా కలిసి గడుపుదాం. ఉదయాన్నే అంతా ఇక్కడే కలుద్దాం అని అన్నాడు. సరే- ఆ మాట నచ్చి సంయమిని అందరినీ రమ్మని రహస్యంగ ఆహ్వానించింది. ఆదివారం పూట భాస్వతి ఆఫీసు వైపు తిరిగి కూడ చూడదు. అదే ధైర్యంతో అందరూ ఒప్పుకుని అన్నమాట ప్రకారమే అనుకున్న వేళకు వచ్చి సంతోషంగ ఆడిపాడుకుంటూ సాయింత్రం దాకా గడిపారు. తనే ఇంటి నుంచి ఏవో తినటానికి చేయించి తీసుకుని వచ్చింది సంయమిని. ఇంక పార్టీ అయ్యాక అక్కడ తామంతా ఆనందంగ గడిపిన ఏ ఛాయా మిగలకుండ చేయమని ప్యూనుకు అప్పచెప్పి, అంతా వెళిపోయారు. స్వర్జిత్ మాత్రం వాళ్ళ వెంటే ఉండి అంతా యథావిధిగ చేశాకే ఇంటికి వెళ్ళాడు.
            "ఎక్కడా ఏ గుర్తూ వదిలిపెట్టలేదు. అయినా ఎట్ల పట్టేసిందబ్బా..?"
            "ఇది మంచి పనా..?" మనసు దెప్పింది.
            "కాదు.. కానీ.." అన్నాడతను ఆలోచిస్తూ.
            సరే, తనకు తాను ధైర్యం చెప్పుకుని- "అయినా నేనే రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నాక ఇంక భయం ఎందుకు?" అనుకుని ముందు ఆ కాగితంలో ఏం ఉందో చూద్దామనుకుని కవర్ తెరిచాడు.
            అందులో రెండు నెలల జీతం బోనస్ తో పాటు ప్రమోషను వచ్చినట్టు ఆర్డరు ఉంది. ఖంగు తిన్నాడు స్వర్జిత్. ఇదెట్ల సాధ్యం..? అరే..!! నమ్మలేకపోయాడు.
            వెంటనే చెమటలు తుడుచుకుని ముఖం కడుక్కోని తల దువ్వుకుని భాస్వతి కాబిన్ లోకి వెళ్ళాడు. కంగారులో తలుపు తట్టటం మర్చిపోయాడు. లోపలకు వెళ్తూనే ఆమె క్రోధాగ్ని రగులుతుండగా,
            "బుద్ధి లేదా..? కాబిన్ లోకి వచ్చేటప్పుడు అట్ల దూసుకురావటమేనా..? చిన్నప్పుడు స్కూల్ లో మే అయ్ కమ్ ఇన్ అని అడిగే మానర్స్ నేర్చుకోలేదా..?!!" అని అరిచింది.
            "స్.. సారీ.. క్షమించండి.." అని అతను వెనక్కు తిరిగాడు.
            "వచ్చిన పని చెప్పకుండ వెళ్ళి మళ్ళీ వచ్చి టైం వేస్ట్ చేద్దామనా..?" మళ్ళీ అరిచింది.
            "సారీ మేడమ్.. అది.. ఈ లెటర్.. అది ఏంటని కనుక్కుందామని.."
            "అర్థం కాలేదా..? ఇంగ్లీష్ రాదా..?"
            "వచ్చు.."
            "అందుకే కదా మీరు చేసిన సవరింపు ఉత్తరంలో చేసి పంపాను. అదే మాటతో మిగిలిన క్లైంట్లకు కూడ వ్రాశాను. వాళ్ళు అందరూ మన ఆర్డర్ పాస్ చేశారు. అందుకే ఈ లెటర్.."
            "థాంక్స్.. అంటే అంతదానికే ఇంత గుర్తింపు.. అంటే.." కాస్త రిలాక్స్ అవుతూ, కాస్త కంగారు పడుతూ అన్నాడతను కొంచెం సంతోషంగ.
            "అయితే ప్రమోషన్ వద్దా..?"
            "కావాలి.. ఎందుకొద్దు..?"
            "అయితే తీసుకుని వెళ్ళండి. లెటర్ లో వ్రాశాక మళ్ళీ అంతా వివరించాలంటే నాకు టైం లేదు."
            "స్.. సారీ మేడమ్.. థాంక్యూ.." అనేసి అతను బయటకు వచ్చి, తన సీట్ దగ్గరకు వచ్చేశాడు.
            "ఏంటి? టాటా బైబైయే కదా..? సారీరా..! నీ అంత మంచి స్నేహితుణ్ణి పోగొట్టుకోవాలంటే బాధగ ఉంది. మనం కలిసి గడిపింది తక్కువ సమయమే అయినా చాలా దగ్గరైపోయాం. చెప్పిన మాట వింటే ఈ గతి పట్టేది కాదు కదా..?" అర్ణవ్ వాగాడు.
            "హలో...." అని కవర్ అందించాడతను. అర్ణవ్ అది తీసి చదివి నోరు వెళ్ళబెట్టాడు ఆశ్చర్యంతో. "ఏంటి నిజమా?" అంటూ లేచి నిలబడుతూ, "అయితే ప్రమోషన్ వచ్చిందా నీకు..? ఎనిమిది నెలల్లో ఈ కంపెనీలో ప్రమోషనా.. అసంభవం..!" అన్నాడు.
            "కనీసం కంగ్రాట్స్ చెప్పవారా..?" అంటూ నవ్వాడు స్వర్జిత్ అర్ణవ్ చేయి పట్టుకుని తనే ఊపేసుకుంటూ.
            ఆరోజు తను ఎంత సంతోషంగ ఇంటికి స్వీట్ తీసుకుని వెళ్ళాడో..! ఇప్పటికీ తండ్రి ముఖం వెలిగిపోవటం గుర్తుంది. ఆయన ఆనందానికి అంతు లేదు. నా కొడుకు ఏ రికమెండేషన్ లేకుండ ఉద్యోగం తెచ్చుకోవటమే కాక ఇప్పుడు పదోన్నతి కూడా పొంది ఆఫీసులో మంచి పేరు తెచ్చుకున్నాడు. అంటూ అందరికీ చెప్పుకుని చెప్పుకుని సంబరపడ్డారు. అమ్మ ఫోటో చూస్తూ నవ్వుతూ నిలబడిపోయారు.
            ఒక్క ఉత్తరంలో సవరింపు వల్ల స్వర్జిత్ కి ప్రమోషను వచ్చిన వార్త ఆఫీసంతా గుప్పుమంది. అతను నిజంగనే చాలా సమర్థవంతుడని, తనకు ఎంతో ప్రతిభ ఉన్నా అణిగిమణిగి ఉంటాడని, కనక ప్రమోషను రావటం సరైనదేనని కొందరు అంటే, మరి కొందరు- ఏం కాదు, లేడీ బాస్ కదా- పటాయించి ఉంటాడు. అందుకే ఈ మధ్య తెగ పిలుస్తోంది కాబిన్ కి. అని అనేశారు. స్వర్జిత్ మాత్రం మౌనంగ తన దోవన తన పని చూసుకుంటూ వెళ్ళసాగాడు.
***
            "ఇప్పుడెట్ల.. అరే..!!" అందరూ ఒక్కసారిగ అనేశారు, నిరాశగ.
            స్వర్జిత్ తేరుకునేసరికి ఏమీ కనిపించలేదు. "అబ్బా..! కరెంటు పోయింది. ఈ సమస్య ఇప్పుడే రావాలా?" అని అంతా వాపోతుంటే మనసులో దేవుడికి శతసహస్ర నమస్కారాలు చేసుకున్నాడు స్వర్జిత్.
            పెద్దవాళ్ళు బాటరీలైట్ సహాయంతో వెలుతురుకోసం వ్యవస్థ చూస్తుంటే, స్వర్జిత్ ఆనందంగ ఆ పాతకాలం నాటి పట్టెమంచం ఎత్తుచెక్కకు ఆనుకుని హాయిగ కూర్చున్నాడు. ఈ ఇల్లు కరెంటు పోయినా ఎంత ఆర్టిస్టిక్ గ ఉందో..! అనిపించింది అతనికి ఎక్కడి నుంచో ప్రసరిస్తున్న డిమ్ వెలుతుట్లో చుట్టూ ఉన్న పరిసరాలు అదో రకమైన అందంతో వెలుగుతుంటే. ఎంతైనా పల్లెటూరు.. సౌకర్యాలు తక్కువే అయినా.. దీని అందమే అందం.. నైసర్గిక సంపదలకు నెలవు.. తెచ్చిన జెనరేటర్ కూడా పని చేయటం ఆపేసిందని అంతా వాపోతుంటే ఈ కరెంటు ఇప్పటప్పట్లో రాకుండ ఉంటే ఎంత బాగుండో అని ప్రార్థన చేశాడు స్వర్జిత్.
***
            అప్పుడు ఆర్ట్ ఎక్స్-పో లో కూడా ఇట్లగే డిమ్ లైట్ ఉండింది. తనకు ప్రమోషను వచ్చిన శుభసందర్భంలో ఆహ్లాదంగ తండ్రి తో గడపాలని స్వర్జిత్ ఆ ఆదివారం ఆయనకు ఇష్టమైన ఆర్ట్ ఎక్స్ పో కి తీసుకు వెళ్ళాడు. బాగా పెద్ద ప్రదర్శన అది. గొప్ప గొప్ప కళాకారులు అన్ని రకాల కళాఖండాలను అక్కడ ప్రదర్శించారు. నచ్చినవి కొనుక్కోవచ్చు కూడ. వేటి కింద వాటి మూల్యం వ్రాసి ఉంది. కొందరు అట్ల కొనుక్కున్నారు. కానీ తీసుకుపోలేదు. వాటి కింద సోల్డ్ అని బోర్డు పెట్టి అక్కడే ఉంచారు. కొన్ని మాత్రం అమూల్యం అని వ్రాసి ఉంచారు. అంటే అవి అమ్మకానికి కాదన్నమాట. అట్ల తిరిగి తిరిగి మూడున్నర గంటలు గడిపారు వారిద్దరూ. కావాలంటే ఫోటోలు కూడ తీసుకోవచ్చు అని ఇతరులను చూసి అర్థమైంది. స్వర్జిత్ తన అలవాటు ప్రకారం నచ్చినవి గబగబా ఫోటోలు తీసుకున్నాడు. కొన్ని చాలా బాగున్నాయి. కొన్ని మామూలుగ ఉన్నాయి. అంతా తిరిగే సరికి చాలా సేపు పట్టింది. అలిసిపోయి ఒక చోట టీ తాగటానికి కూర్చున్నారు. తినటానికి కూడ ఫుడ్ స్టాల్స్ ఏవో పెట్టారు. కానీ అలవాటు లేక బయట తినలేదు వాళ్ళు. అంతలో గోపాలరావు పాత సహద్యోగి ఒకతను కనిపించి పలకరించేసరికి నవ్వుతూ అటు వెళ్ళాడాయన. తండ్రికి పరిచయస్తులు కనిపిస్తే కాలపరిధులు తెలియవు. తండ్రి పూర్తిగ ఆ ఆగంతుకునితో మునిగిపోయి ప్రపంచం మర్చిపోయాక, స్వర్జిత్ కాస్త బోర్ అవుతూన్న భావన ఆవరిస్తుంటే అటూఇటూ చూస్తుండంగ ఒక అందమైన నవ్వు వినిపించింది.
            స్వర్జిత్ ఎవరా నవ్వింది అని అటు చూశాడు. ఎవరో అమ్మాయి.. మంచి లేత ఆకుపచ్చ రంగు షరారా వేసుకుని ఉంది. చేతుల నిండా లేత ఆకుపచ్చ గాజులు. మెడలో చిన్న లాంగ్ చైను.. భుజాల వరకు ఉన్న నల్లని కురులను మధ్య సన్నని పాపిడితో వేరు చేసి బాగా వెనక్కు దువ్వి క్లిప్ పెట్టి వదిలేసింది. స్నేహితుల మధ్య నిలబడి ఏదో మాట్లాడుతూ నవ్వుతోంది. మధ్య మధ్య ఓరకంట ఒక వైపు చూసి అక్కడ నిలబడి ఒక శివధ్యానమూర్తి విగ్రహం ఆర్టుపీసును చూసిన వారు ఏదైనా పొగుడుతంటే ఇక్కడి నుంచి విని లోలోపలే మురుసుకుంటోంది. బహుశ ఆమె చెక్కిన శిల్పమేమో అది. దూరం నుంచి చూస్తేనే మళ్ళీ చూడాలనిపించేటట్టు ఉంది.
            స్వర్జిత్ తనలో తనే నవ్వుకుంటూ ‘పాపం- కళాకారులు’ అనుకుని జాలిపడి ముఖం తిప్పుకునే లోపు ఆమె తనకెంతో బాగా పరిచయం ఉన్న ముఖం లా అనిపించి ఠక్కున తిరిగి ఆమెను తదేకంగ చూశాడు. ఎక్కడో బాగా చూసిన ముఖమే కానీ ఎవరో గుర్తు రావట్లేదు. కాలేజిలో కానీ, స్కూలులో కానీ తన పాత క్లాస్ మేటా..? లేక బంధువులలో అమ్మాయా..? పక్క ఇళ్ళలో చూశాడా? ఏదైనా ఫంక్షన్ లోనో, పెళ్ళిళ్ళలోనో చూశాడా..? స్వర్జిత్ బుర్ర స్కానింగ్ చేయసాగింది. ఇట్ల అనిపించటం స్వర్జిత్ కి మహాచిరాకైన భావన అనిపిస్తుంది. వారు ఎవరో ఎట్ల పరిచయమో అనేది తట్టేవరకు దేని మీద దృష్టి పెట్టనివ్వదు. ఛ.. అనుకుంటూ అక్కడే నిలబడి ఇంకేదైనా క్లూ దొరికి గుర్తుకు వస్తుందేమోనని అదే ఆలోచిస్తూ ఆమెనే చూడసాగాడు. కానీ మళ్ళీ ఎవరైనా తను అట్ల ఒక ఆడపిల్లను గమననిస్తున్నాడని తెలిస్తే ఎక్కడ అసహ్యంగ అనిపిస్తుందోనని మధ్య మధ్య అటూ ఇటూ చూస్తూ ఆమెను గమనిస్తూండిపోయాడు. ఎవరో ఒకరు ఆమెను పేరు పెట్టి పిలవకపోతారా.. అప్పుడు తెలిసిపోతుందిలే అనుకున్నాడు. కానీ లాభంలేదు.
            అంతలో ఎవరో పొడుగాటి అబ్బాయి, దాదాపు పాతికేళ్ళు ఉండవచ్చు.. వచ్చి, "హాయ్ చిన్ని కన్నీ.." అన్నాడు ఆమెను ముక్కు పట్టి ఊపుతూ.
            ఆమె అతన్ని చూస్తూనే నవ్వింది. అంతలోనే ముఖం ఇదిగా పెట్టి, "పో.. ఉద్ఘాటనకు రాకుండ ఇప్పుడా రావటం..! చెల్లెలి మీద ప్రేమ ఇంతే కదా..?" అంది.
            స్వర్జిత్ వెంటనే ఆ గొంతు కూడ ఎక్కడో విని ఉన్నట్టే అనిపిస్తుంటే ఆమె మాటలను మరింత శ్రద్ధగ వింటూ గమనించసాగాడు.
            "లేదే.. ఎప్పుడో వచ్చాను. ఎక్సిబిట్స్ చూస్తున్నాను. పొద్దునే రావాలని అనుకున్నా కానీ వీలుకాలేదు. ఎంత అడిగినా మావాళ్ళు వదల్లేదు. బైదివే- ఇవాళ కంపోజ్ చేసిన పాట ట్యూన్ లో ఆర్కెస్ట్రాతో విన్నావంటే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతావు. తెల్సా..?" అన్నాడు.
            "ఆఁ.. చెప్పకు. కళ్ళు తిరగటం కాదు కానీ కడుపులో కుళ్ళుతో అల్సర్ వచ్చేంతగా మంట పుట్టి మెలికెలు తిరిగి పడిపోతాను. నువ్వేమో హాయిగ తప్పించుకున్నావు. నా నెత్తినేమో బండపడింది. నేను అది మోయలేక ఛస్తుంటే ఇంకా పుండుమీద కారం చల్లు. పో.. పెద్దవాళ్ళన్న గౌరవం లేదు.. చెల్లెలన్న కనికరం లేదు. నీ స్వార్థం తప్ప వేరే ఏ బాధ్యతా పట్టదు కదా..!"
            అతను నవ్వి, "ఏం చేయనే. అమ్మాయిలకు ఉన్నంత త్యాగభావన అబ్బాయిలకు ఇవ్వలేదే దేవుడు. నన్ను నా మ్యూజిక్ ట్రూప్ లోంచి బయట పడేశారని అబద్ధమైనా చెప్పు- ఇప్పటికిప్పుడు ఇక్కడ నీరు విడిచిన చేపలా కొట్టుకుని కొట్టుకుని ప్రాణాలు వదలకపోతే పేరు కాదు."
            "ఆఁ.. లోకంలో నీకొక్కడికే నీట విడిన చేపలా అయ్యేది. ఇంకెవ్వరికీ ఏ అభిరుచులూ ఉండవు కదా. ఇవే మాటలు చెప్పి తప్పించుకున్నావు హాయిగ. నేనేమో రోజూ ప్రాణం వదులుతూ పట్టుకుంటూ ఎప్పుడెప్పుడు విముక్తా అని ఎదురుచూస్తూ గడుపుతున్నాను. కనీసం అప్పుడప్పుడు కలిసి చెల్లెలిని ఓదార్చాలన్న బాధ్యత కూడ లేదు."
            "ఇప్పుడేమైందే నీ ఓదార్పుకు..? ఈ ఎక్స్ పో లో పెట్టిన నీ ప్రతీ శిల్పమూ సూపర్ హిట్ అట తెల్సా. అందరికన్నా నీవే బాగున్నాయని నా చెవులతో విన్నాను నీ ప్రశంసల వర్షం."
            "కానీ ఏం లాభం..? అవన్నీ పాతవే. కొత్తగ చేసిన పీస్ ఇదొక్కటే..!!" అని అక్కడ నిలబడి తను గమనిస్తున్న శిల్పం వంక చూపింది వేలు.
            వచ్చిన అబ్బాయి ఆ శిల్పాన్ని చూసి, "అద్భుతం.. ఇది నేను చూడనే లేదే.." అంటూ అటు నడిచాడు. అంతా గమనించసాగాడు.
            స్వర్జిత్ కి ఎంతసేపు విన్నా ఆ అమ్మాయి గొంతు ఎవరిదో తట్టలేదు. ఆ రూపం, ఆ గొంతు బాగా పరిచయం ఉన్నవారివే. వాళ్ళ సంభాషణమంతా కొద్ది దూరం నుంచి స్పష్టంగ వినిపిస్తోంది. అనుమానం రాకుండ అక్కడక్కడే తచ్చాడుతూ వినసాగాడు.
            వచ్చిన అబ్బాయి ఆ శిల్పానికి ఏవో లోపాలు చెప్పి, "మొత్తం మీద బాగుంది.." అన్నాడు.
            "ఆ లోపాలు నాకూ తెలుసు. కానీ వాటిని పూరించే వ్యవధి లేకపోయింది. ఇంక ఎట్ల ఉందో అట్లగే తెమ్మంటే పైపైన పూర్తి చేసి తెచ్చేశాను. కనీసం ఇంకొక్క రెండు రోజుల టైం దొరికినా పూర్తయ్యేది. నా కళ్ళలో ఉన్న దృశ్యానికి ఆ శిల్పానికి ఇంకా పొంతన రాలేదు."
            "అయినా ఎక్కడ విన్నా నీ పేరే తెల్సా..? భాస్వతి.. భాస్వతి..! అనే అందరి గుండెలూ కొట్టుకుంటున్నాయి.."
            స్వర్జిత్ గుండె కూడ ఒక్కసారిగ ఝల్లుమని కొట్టుకుంది. భాస్వతా..? అసంభవం..! ఇంత అందంగ ఉంటుందా ఆమె..? అంతకన్నా అందమైన శిల్పకళాకారిణా..?!!
            "పోవో పెద్ద..! ఇక్కడ నా పేరే ఎవ్వరికీ తెలియదు. ఆ శిల్పాలన్నీ నా స్యూడోనిం- అదే నీ భాషలో చెప్పాలంటే నా ఉలి పేరు- శమాత్మికా తో ఉన్నాయి. పొగిడినా అర్థవంతంగ ఉండాలి.." అంది ఆమె.
            అతను నవ్వాడు. ఆమె కూడ నవ్వింది. నిండుగ నవ్వింది.
            అబ్బ.. ఎంత ఇంపైన నవ్వది..!! స్వర్జిత్ మనసులో ఏదో వెలిగినట్టైంది.
            "సరే, పెద్దనాన్న రాలేదా..? కనీసం పెద్దమ్మైనా వస్తుందేమోనననుకున్నాను..?"
            "లేదే.. వాళ్ళిద్దరూ ఇవాళ గుట్టకు వెళ్ళి వస్తామని వెళ్ళారు."
            తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి నవ్వుకుంటూ, ఏదో మాట్లాడుకుంటూ వెళిపోయారు. ఓహో, అయితే అర్ణవ్ చెప్పిన వ్యక్తి, భాస్వతి కజిన్ అన్న ఇతనేనన్నమాట. కంపెనీలో యాభైశాతం వాళ్ళ నాన్నది. అందుకే ఇతనికి కంపెనీ చూసుకోమని బాధ్యత ఇస్తే తీసుకోకుండ తప్పించుకున్నాడు.
            కానీ.. ఈమె భాస్వతా..??! నమ్మబుద్ధి కాలేదు.
            ఏంటి అసలు- ఆఫీసులో చూసే ఆమెకు ఇక్కడ ఉన్న ఆమెకూ పొంతనే లేదు. అక్కడ రోజూ ప్లెయిన్ శారీ కట్టుకుని, హై నెక్ బ్లౌజ్ వేసుకుని, జుట్టు మొత్తం నున్నగ దువ్వి కొప్పు పెట్టుకుని, చేతులకు ఒకదానికి వాచ్, మరొక దానికి ఒక గాజు తప్ప వేరేం అలంకరణలు లేకుండ, ప్రతీదానికి "యస్.. చెప్పండి.." అంటూ తన నల్లటి లావు ఫ్రేము కళ్ళద్దాల వెనక నుంచి సూటిగ కళ్ళలోకి కొట్టినట్టు ప్రశ్నించే గంభీరమైన భాస్వతి- ఈమే ఒకరేనా..? స్వర్జిత్ కి చాలా కొత్తగ అనిపించింది. కాదేమో..! కంపెనీలో కిందివారి ముందు పెదాలైనా కదలకుండనే ఆడపులిలా గర్జిస్తూ, తప్పు చేస్తూ పట్టుబడితే మీద పడటానికి సిద్ధంగ ఉండే ఈమేనా ఇక్కడ ఆడపిల్లకే అసూయ కలిగించే రూపంతో, మాటలతో చక్కని భావనను కలిగిస్తూ ఉన్నది..? ఆ అబ్బాయి అన్నది నిజం..! అందరి నోటా ఆమె పేరే- తనూ విన్నాడు. ఇంత అందమైన మనిషి ఈమేనా..? ఉరికే జలపాతంలా, పరుగున పరవళ్ళు తొక్కుతూ సాగే నదిలా, పచ్చని నిండు పైరులా.. నవ్వుతూ తుళ్ళుతూ..!!
            ఎట్ల సాధ్యమిది..? ఈమె భాస్వతి కాదు. ఈమె "శమాత్మిక."
            "శమాత్మిక.." చక్కని పేరు. ఆ స్యూడోనిం ఈమెదా..? స్వర్జిత్ మనఃఫలకం మీద తను ఆ పేరు తో ఇన్నాళ్ళలో ఎన్నో ఆర్ట్ ఎక్స్ పోలలో చూసిన శిల్పాలన్నీ మెదిలాయి. ఈమె చేసిన శిల్పాలన్నీ తాపం తీర్చి శమం కలిగించే విధంగనే ఉన్నాయి. వాటిలో సాధారణంగ కనిపించే రగిలే భావన లేదు.. శాంతి ఉంది. ఉద్వేగం లేదు. ఆశ్వాసనం ఉంది. ప్రశ్న లేదు. సమాధానం ఉంది. అలజడి లేదు.. ఆహ్లాదం ఉంది.
          "ఏంట్రా..? ఇక్కడ నిలబడి ఆ శిల్పాన్ని తదేకంగ చూస్తున్నావు..?" గోపాలరావు పిలుపుతో తెప్పరిల్లాడు స్వర్జిత్.
            "ఊఁ.. అది.. బాగుంది కదా.. అని.." అన్నాడు.
            గోపాలరావు అది చూసి, "నిజమేరోయ్.. భలే బాగుంది.. ఇక్కడ ఉన్నవాటన్నింటిలో ఇదే బాగున్నట్టుందే..! ఇట్రా.. దగ్గరగ చూద్దాం.. ఇంత ప్రశాంతమైన శివుడి ధ్యాన మూర్తి ముఖం ఎక్కడా చూడలేదే.. ఆ మర్రి చెట్ట చూడు, ఎంత విపులంగ చెక్కిందో..! అబ్బ, మునులు ధ్యానం చేసుకుంటున్న భంగిమలు కూడా చాలా వినూతనంగా ఉన్నాయే.." అని వెళ్ళి పరిశీలనగ చూసి, "గెస్ట్ బుక్ లో ఏమీ వ్రాయద్దనుకున్నా. ఇప్పుడు ఇదే బెస్ట్ గ ఉందని వ్రాయాలనిపిస్తోంది.." అన్నాడు.
            స్వర్జిత్ నవ్వుకున్నాడు మనసులో. అంతకు ముందు సుధాంశుతో కలిసి ఆ ప్రదర్శనకు వచ్చినప్పుడు, ఎవరివి బాగున్నాయి అని అడిగితే సుధాంశు చెప్పిన ప్రకారం ఈ శమాత్మిక అనే వ్యక్తివి అన్నింటికన్నా అద్భుతమైన శిల్పాలని. అతనైతే వీటిలో నిబిడీకృతమై ఉన్న కళాత్మికతను బాగా లోతులకు వెళ్ళి వివరించగలడు. అతని పరిజ్ఞానంతోనే చెప్పాడు- వాటిలో ఉన్న సునిశితత చాలా అరుదైనదట. తను ఇదివరలో కూడ వాటిని చూశాడట. శిల్పి ఎవరో కూడ తెలుసుకుని కలవాలని, వారి దగ్గర శిష్యరికం చేయాలని మేనేజర్లను అడిగి కనుక్కునే ప్రయత్నం చేశాడట. కానీ ఎక్కడా సూత్రం అందలేదట. అది అబ్బాయో అమ్మాయో కూడ తెలియలేదుట. తనైతే అబ్బాయేమో అనుకుంటున్నాడట. "ఏ-వన్ కళాకృతులు... ఐ బెట్.." అన్నాడతను. అది ఆ క్షణాన గుర్తుకు వచ్చి స్వర్జిత్ కి ఎందుకో చాలా ఆనందంగ అనిపించింది.
            ఆ రాత్రి అతను దాని గురించే ఆలోచిస్తూండిపోయాడు. మరోసారి అన్నీ తిరిగి చూడాలనిపించింది. తన కెమెరాలో బంధించుకున్న ఆ కళాఖండాలన్నింటినీ ఒకసారి తిరిగి చూడాలనిపించి తీశాడతను.. వాటిలో శమాత్మిక పేరు గలవాటిని పక్కకు పెట్టాడు. ఒక్కొక్కటిగా చూశాడు. కళా ప్రపంచంలో ఇంత మంచి కళాకారిణి.. వ్యాపార లోకంలో అంత మంచి అధికారిణి గా ఉండగలగటం.. అంటే ఎంత శ్రమతో కూడుకున్న పని కదా. రెండు భిన్నధృవాలను ఒకేసారి నియంత్రించటం అంటే మాటలు కాదు. అంత క్రమశిక్షణ.. అంత అణుకువ. ఆమెను తనదైన కళా ప్రపంచంలో చూశాడు- అక్కడ ఆమె పూర్తిగ విరిసిన సువాసనలు వెదజల్లే పువ్వు. ఆఫీసులో చూశాడు- అక్కడ ఆమె ముడుచుకున్న మొగ్గ. అయితే అట్ల అని ఆమె దక్షతకు ఏ లోటూ లేదు. ఆమెను చూసి మీటింగు నిర్వహించటం తెలుసుకోవాలని, మీటింగ్ లో చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవటం ఆమెను చూసి నేర్చుకోవాలని ఇతర సంస్థల నుంచి వచ్చిన డెలిగేట్లు అనుకోవటం అప్పుడప్పుడు చెవులబడుతూనే ఉంటుంది. ఎప్పుడైనా తమ మధ్యలోకి వచ్చి ఉద్యోగుల మధ్య ఒకర్తిగ నిలబడి నలుగురినీ సంబోధించి ఆమె మాట్లాడుతుంటే అది బిజినెస్ మీటింగులో ఉన్నట్టు ఉండదు. ఏదో క్లాసులో ప్రొఫెసరు, పిల్లలు కూర్చుని మంచి కళా చర్చ చేసుకున్నట్టు రసవంతంగ ఉంటుంది- అని అంతా అనుకుంటారు. కళాకారిణి అధికారిణిగా ఉంటే ఎన్ని లాభాలు ఉంటాయో ఉద్యోగులకు..!
            అయితే అంత కాఠిన్యం ఎందుకు..? తప్పు చేసినప్పుడు కోప్పడటం కూడ అవసరమే. "ఆమె మనను సరిచేయాలని అట్ల అరిచినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిరా.." అని అర్ణవ్ ఎన్నిసార్లు అన్నాడో. ఆమె అట్ల ఉండబట్టే అంతా ఒక తాటి మీద నడుస్తున్నారు..! లేదంటే కంపెనీ ఎప్పుడో ఒక పద్ధతీ పాడూ లేకుండ అయిపోయేది అని కొందరు అనుకోవటం తన చెవులారా విన్నాడు స్వర్జిత్. ఇతర కంపెనీల వారితో మాట్లాడేటప్పుడు, డీల్ కుదుర్చుకునేటప్పుడు, భానుమూర్తి లాంటి పెద్దవారితో మాట్లాడేటప్పుడు ఆమెను అట్ల చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఎంత గౌరవం కనబరుస్తుందో..! ఆమె సహజంగ చాలా సౌమ్యురాలు. అధికారిణిగా మారాక లేనిపోని గాంభీర్యం తెచ్చిపెట్టుకుంది. అంతే.
            భాస్వతి.. శమాత్మిక.. ఒకే నాణానికి ఇరువైపులు..!
            భాస్వతిని ఆమె నిజలోకంలో అంత నిండుగ చూశాక స్వర్జిత్ కి ఆమె మీద కోపం పోయింది. ఆ చోట జాలి మొలిచింది. తర్వాత తనను గుర్తించి ప్రమోషను ఇచ్చినందుకు కృతజ్ఞత కలిగింది.

No comments:

Post a Comment