నా కలం పేరు నిరీక్షణ.
చిన్నతనంలోనే నాయనమ్మ కథలు వింటూ ఊహాలోకమొకటి
నాలో జీవం పోసుకున్న సంగతి మొదటి కథ వ్రాసే వరకు నాకే తెలియలేదు.. అప్పుడు నేను ఆరో
తరగతి చదువుతున్నాను.. ఆ కథ ఇప్పుడు నా వద్ద లేదు.. కాలప్రవాహంలో ఎటో కొట్టుకుపోయింది..
కానీ దాని సారం కాస్త గుర్తుంది.. పీనాసి సీనయ్య – దాని పేరు. అది చిన్నపిల్లల ‘అనగనగా’ తరహా కథ. కానీ అప్పట్లో కూడా ‘కథ
వ్రాయాలి, ఏదో అభివ్యక్తం చేయాల’నే తీవ్రమైన కాంక్ష పీడించటం బాగా గుర్తుంది.
ఆకాశంలో చందమామ అందంలో పోలిక లేనిదైతే తెలుగునాట
చందమామ సాహిత్యలోకంలో పోలికలేనిది. ఆ కథల పిచ్చి మాటల్లో వర్ణించలేనిది. ఆ ప్రభావం
ఎవ్వరూ కాదనలేనిది. అక్షరాలు కలిపి చదవటం వచ్చినదగ్గరి నుంచి అమ్మ ఒళ్ళో కూర్చుని ఇష్టంగా
ఆ కథలు చదవుకున్న గుర్తు. కాస్త ఊహ వచ్చాక,
ఆ ప్రేరణతో
నేనూ ఏదో వ్రాసేయాలి.. ఏదో గొప్ప కథకురాలిని కావాలి.. ఆహా ఓహో, అని నా పేరూ నలుగురు చెప్పుకోవాలి అని పీకలదాకా కోరిక రగిలింది.
ఆరో క్లాసులోనే ఓ పెద్ద చందమామ తరహా నవల ప్లాన్ చేశాను. తరువాత పెద్దయ్యాక అంటే సెకండరీ
స్కూలు చేరేసరికి వ్రాశా కూడా. కానీ ఆ కథ కూడా ఇళ్ళు మారే క్రమంలో ఎక్కడో
పోగొట్టుకున్నాను.
ప్రారంభంలో ఆంగ్లంలో, హిందీలో కూడా కదిలింది కలం. మా కజిన్ (పెద్దనాన్నగారి అబ్బాయి
-నాకన్నా ఓ నెల పెద్దవాడు అంతే) తో కలిసి ఓ నాలుగైదు ఆంగ్లం కథలు వ్రాశాము. అప్పుడు
10 తరగతిలో ఉన్నాను. తరువాత 11వ క్లాసులో మొదటిగా ఆధునిక తెలుగు చిన్నకథ వ్రాశాను..
అది చిన్న ప్రేమకథ.. కాస్త పెద్దైనాక అదంతా ఓ పద్ధతికి తెచ్చాను.. సినిమాల ప్రభావం,
ఇతర మూస కథల ప్రభావం నా మీద బాగా ఉండేది. అది వేరే విషయం. సంభాషణలు, ఘటనలు
ప్రధానంగా సాగేది కథ.
తరువాత కొంత కాలం పెద్దగా వ్రాయలేదు.. మళ్ళీ
డిగ్రీలోకి వచ్చాక ఇంక విస్తృతంగా వ్రాశాను.. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగా మొదటి
పెద్ద నవల ప్లాన్ చేశాను. అది ఓ ఎనిమిదేళ్ళకు పూర్తైంది. అంటే నేను ఎంచుకున్న కథ
అటువంటిది. అంత కాలం జరిగి, కాస్త ప్రౌఢత్వం వంటిది వచ్చాక కానీ ఆ పాత్రను నేను
అవగతం చేసుకోలేకపోయాను. అది సంగతి. తరువాత వరసగా మూడు నాలుగు నవళ్ళు ప్రారంభించాను.
డిగ్రీలోనే నవలికలు కొన్ని పూర్తైనాయి. ఏదో కారణంగా చాలా కాలం సాగేవి అవి. తరువాత తరువాత
బాగా పెద్ద కథలుగా మారాయి.. చాలా కాలం పాటు అట్ల పునరావలోకనంతో నిత్యం మారుతూనే ఉండేవి.
ఇంక విసుగు వచ్చి ఓ చోట మానేశాను.
అవి నా ఒంటరితనంలో ఆలంబనలు, నా కన్నీరు తుడిచిన ఆప్తమిత్రులు, నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి ఓ మార్గం. వాటినన్నింటినీ
ఇక్కడ పొందుపరుస్తున్నాను. కవితల కథే ఇక్కడ కూడా. ఏదో సమీక్ష కావాలి.. ఎవరో ఏదో ప్రమాణపరచాలి..
నాకు సంతృప్తి అనిపించాలి.. చదివినవారు ఏవో అనుభూతి చెందాలి, మార్పులు చెప్పాలి,
విమర్శ చేయాలి.. ఏదో ఏదో లోపల బాధ.. అటు ఇటు చేసి, చివరకు వీటిని చదివినవారు ముగ్గురే ముగ్గురు. ఒకరు అమ్మ, డీఫాల్ట్ అన్ని కథలకు. ఇంకొకరు మా కజిన్ (పెద్ద మామయ్య పెద్ద
కూతురు)- పీజీ వరకు వ్రాసిన కొన్నింటికి,
మూడు, నా సంస్కృతభగిని. ఆ తరువాత వాటికి పాఠకురాలు. ఇంకెవ్వరికీ చూపలేదు.
ఒక్కసారి ఒక్కటో అరో కథ మా చిన్న మేనత్తకు చూపాను. అంతే. ఆమె స్వయంగా రచయిత్రి.
ఇక అచ్చు వేయించటానికి ప్రయత్నాలకు
వస్తే, ఓ కథను ఓసారి స్వయంగా పోయి ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయంలో ఇచ్చాను. ఓ కవితా
ఇచ్చాను. వారు కథ వేసుకోకుండా తిరిగి పంపారు. కవితా మాత్రం వేసి 50 రూపాయలు పంపారు.
ఓ మూడు కథానికలు మాత్రం రేడియోలో ప్రసారమైనాయి. వారు నన్ను చాలా ప్రోత్సహించారు.
30 లోపు వయసైనా పాపం యువవాణిలో కాక ప్రౌఢవాణిలోనే ప్రసారానికి వేసుకున్నారు. ఎంతో
సంతోషపడ్డాను కానీ ఎందుకో ఇంక ఎక్కువ పంపలేదు.. వదిలేశాను.
అజ్ఞానపు కాలంలో ఓసారి మూడు కథలు ఒకేసారి
పోటీలకు పంపాను. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికా అన్నట్టు అచ్చులో ఎక్కడా పేరు కనిపించని
వారి కథలను తరాజు తూకం వేసేవారు వేలేసి తాకరు సరికదా, అసలు పట్టించుకోరని కటువైన వాస్తవం తెలిశాక చాలా విషాదం దిగమింగుకుని
ఇక కథలను పత్రికలలో అచ్చులో చూడాలనే ఆలోచనకు క్లీన్ బౌల్డ్ చేసి టాటా చెప్పాను.
నా గురించి నా మూల్యాంకనం గొప్పగానే
ఉంటుంది. వ్రాసి మర్చిపోవటం, చాలాకాలానికి తిరిగి మళ్ళీ పాఠకురాలిలా చదవటం,
మార్పులు చేయటం, టైపింగు చేసి ఉంచుకోవటం, అందులో మరోసారి తెరిచినప్పుడు విసుగు
వచ్చేదాకా లేదా, సంతోషం కలిగేదాకా కావలసిన మార్పులు చేసుకోవటం... ఇది నా క్రమం. ఎన్నడూ
ఏ కథనూ చించలేదు. ఒకేసారి ఆవేశంలో పస లేని విషయాలు వ్రాయద్దు అనుకుని ఓ కథను
చించాను. అంతే. అది కూడా విషయంలో గాంభీర్యం లేదని కాదు. లైట్ విషయమని. తరువాత
బాధపడ్డాను- ఆ లైవ్లీ నెస్ గుర్తుకు వచ్చి..
ఈ
కథలు ఇంత ఉండాలి, ఇట్లా ఉండాలి, ఈ విషయం వ్రాయాలి- అని ఎప్పుడూ ప్లాన్ చేయలేదు. ఇన్ని పేజీలు
మించకుండా, ఇన్ని లైన్లు అచ్చులో – వంటి నిడివి నియమాలకు లోబడి వ్రాయలేను. అది నా బలహానత. కథను
నేను బంధించలేను. పైగా నా కథలెవరైనా ముట్టుకుంటే- అంటే మార్పులు చేర్పులు చేస్తామంటే-
నాకు మంట. ఔచిత్యం పాటించకుండా ఇష్టం వచ్చినట్టు కత్తిరించి పారేసిన- మా పీజీ కాలేజిలో
వార్షిక పత్రికలో అచ్చైన- నా తెలుగు కవిత నాకు పుట్టెడు దుఃఖాన్నే మిగిల్చింది. ఆ గతి
నా కథలకు పట్టకూడదు. నా ప్రతి వాక్యం నాకు అమూల్యం. నేను వ్రాసిన ప్రతి డైలాగు నాకు
విలువైనది. ఏ కారణంగా ఎవరు దాన్ని వేరేగా చేసినా నేను తట్టుకోలేను. నా కథ నాది. నా
పాత్ర నాది.. నేను దాన్ని తెలుసుకున్న విధంగా వేరొకరు తెలుసుకోగలరా- అనుమానమే. అసంభవమని
శాస్త్రజ్ఞులు అంటారు.
ఆ పాత్రలు పాత్రలు కావు.. నా హృదయస్పందనలు.
చాలా చోట్ల అవే నన్ను నడిపిస్తాయి. నేను వాటిని నడిపిన సందర్భాలు తక్కువే. ఆ పాత్రలు, ఆ సన్నివేశాలు నా కళ్ళలో ఎప్పటికీ ఓ రూపాలై మిగిలి ఉంటాయి. చిత్రాలు
గీయటం బాగా వస్తే నా పాత్రలను చిత్రాలు నేనే గీయగలిగే దాన్ని. కొన్ని సన్నివేశాలు ఫ్లాష్
లు.. కొన్ని జీవన ప్రేరణలు, కొన్ని మొదలు చిన్నవి, తరువాత ఉదాత్తంగా అయినవి, కొన్ని నాతో కొట్లాడి బయటకు వచ్చినవి.. ఘటనలు కొన్ని సార్లు కలలో తట్టేవి. ఎక్కడైనా
ఆగితే రోజుల తరబడి ఆగటం, లేదా క్షణాలలో తరువాత ఘట్టం
తట్టటం, మందుకు పోవటం.. కొన్ని సతాయించాయి.
కొన్ని ఆడుకున్నాయి. కొన్ని అట్లా సాగిపోయాయి. కథంతా వ్రాశాక తృప్తి కలిగటమే
నాకనుభవం. ఏదో ఉండిపోయింది అనిపించేది కాదు. ఇంకేదైనా చేసి ఉండాల్సింది అనే
అసంతృప్తి నాలో తక్కువే.
మనసులో ఆ రూపం మాసేలోపు వ్రాయాలని ఉవ్విళ్లూరటం..
ఇంట్లో అంతా పడుకునేదాకా వేచి ఉండి ఏకాంతంలో వ్రాయటం.. ఇంటి పనులు, చదువులు పరీక్షల మధ్య నలగటం, అది వ్రాయాలా, లేక చదువుకోవాలా అని కొట్టుకోవటం, మంచి సన్నివేశం స్పష్టంగా ఏర్పడ్డాక ఆగలేక, పరిస్థితుల వల్ల సాగలేక ఇరకాటంలో పడటం.. ఇవన్నీ మామూలే. కంప్యూటరు
వచ్చాక ఇంక కాగితాల వాడకం, వ్రాత తగ్గిపోయింది. అయినా
ఇదీ ఎంజాయ్ చేశాను.
కథలంటే నాకోసం కాలక్షేపాలు కావు. వాటికి
ప్రయోజనం ఉండాలి. అయితే గొప్ప ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని వ్రాయాలంటే అంత మెచ్యూరిటీ
ఉండాలి. నాకు ఉండేది కాదని అనుకునేదాన్ని. ఎందులో ఉందో అదే వ్రాయచ్చు కదా అని
అనుకున్నాక కుదుటపడ్డాను కాస్త. కొన్నింటికోసం నెట్ వెతికి సమాచారం సాధించిన
సందర్భాలు కూడా ఉన్నాయి. అవి మామూలే ఎవరికైనా. అవాస్తవిక, కాల్పనిక, రోచకమైన, కుతూహలం
కలిగించే, అనూహ్యమైన అంతం కలిగేవి వంటి కథావస్తువులకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వలేదు.
సహజమైన, సరళమైన, గంభీరమైన, సత్యమైన పాత్రలకు రూపకల్పన చేశాను. దుర్మార్గులు,
దుష్టులు, సాడిస్టులు అంటే నాకు భయం. అందుకే వారిని గూర్చి వ్రాయలేదు. నా పాత్రలన్నీ
నాలాగే అన్వేషణశీలురు, పరిశీలనప్రధానంగా ఉంటారు. ఉద్యమానికి అంటే ప్రయత్నానికి పెద్దపీట.
సమస్యలకు సమాధానాలు చేసుకునేవారు, ఆగక సాగేవారు, ఆనందంగా ఉండేవారు, ధైర్యస్తులు
ఉండాలని ఆశించాను. పిరికితనం, పారిపోవటం, తప్పించుకోవటం, ఓట్రించటం, దాటవేయటం వంటి
పనులు చేయకూడదు నా పాత్రలు. పరిస్థితిని స్వస్థంగా ఎదుర్కోవాలి. పరిష్కరించాలి.
లేదా అంగీకరించాలి. పరిధి ప్రేమాపెళ్ళియే అయినా చీప్ గా ఉండకూడదు. ఓ స్థాయి దిగకూడదు.
అట్లాంటి మనుషులను నేను చూశానూ, వారితో సన్నిహింతంగా ఉన్నాను. కనుకే వ్రాయగలిగాను.
‘జారి కిందపడి లేస్తేనే మనిషి, 50-50 గా ఉంటేనే మనిషి.. సహజత్వం అంటే అనియమితంగా
ఉండటం-’ అనే ఆధునిక సిద్ధాంతాన్ని నేను నమ్మను. స్వీకరించను. లోకంలో అటువంటి
పాత్రలు లేరని కాదు- కానీ వారు నా కథలో పాత్రలు కాలేరు, కాబోరు.
ఇతరుల కథల, నవలల సమీక్షలు, విమర్శలు
చదివేదాన్ని. వాటి తూకంలో నన్నూ, నా కథలను నేనే తూచుకునేదాన్ని. బానే ఉన్నాయనిపించేది.
న్యాయం చేయాలి పాత్రకు, సన్నివేశానికి, ఘటనకు. లోకంలో సత్యతకు కథలో సత్యతకు
వైభిద్యం ఉండరాదు. ఉదాత్తతకు ఎక్కువ పెద్దపీట వేసేదాన్ని. వాస్తవం కన్నా సత్యత
నాకు ముఖ్యం. మనిషిలో బలాన్ని పెంచేవి, కొన్ని సందర్భాలలో చదివితే
ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేవిగా ఉండాలి కథ అంటే- ఇది నా ఆలోచన. కథ చదివాక
చదువరిజీవితంలో ఏదో కొత్తది పొందాననో, తెలియనిది తెలుసుకన్నాననో, మంచి అనుభూతి
అనో, ఏదో నేర్చుకున్నాననో అనిపించాలి.
ఇక ధార్మిక అంశాలలో ఇచ్ఛ వచ్చినట్టు
వ్రాయకూడదని పెద్దల వల్ల తెలిసింది. అందుకు ఆ తప్పు చేయరాదని భద్రమైన నియమం పెట్టుకున్నాను.
సంస్కారం, ధర్మం అనే గీత నా పాత్ర దాటరాదు, ఎన్నటికీ. అంతే. ఉదారమైనవి, ఇంకా
ప్రణదాయకమైనవి వ్రాయాలి. ప్రేమలు దోమలు, అమ్మాయి అబ్బాయి తరహా కథలు కాకుండా
ఉండాలి. రొటీన్ సమాజ సమస్యలు, లేటెస్ట్ పరికరాలు వాడుతూ కథావస్తువులు కాకుండా,
విశ్వజనీనమైన మూల్యం కలిగిన అంశాలు, మానవతా విలువలు, భావాత్మకత ఉండే కథలు వ్రాయాలి.
ఇది నా భవిష్యదాశయం. కథ చదివాక మానవత్వం మీద నమ్మకం పెరగాలి కానీ తరిగిపోకూడదు.
ప్రేమకథైనా సరే, విలువలతో వ్రాయాలి, పద్ధతిగా ఉండాలి- అని ఆశిస్తాను.
పాత్రల వెనక వ్యథ సహజంగా నాదే.
ఊహాజనితమో వాస్తవమో- ఏదో ఒకటి. కానీ నాదే. కొన్ని నిజమైన మనుషుల వల్ల ప్రభావితమై
వ్రాసినా కూడా ఒక్కటీ అరే.. ఎక్కువ కాదు. కొన్ని కథ పూర్తిగ వాస్తవ ఘటన మీద ఆధారపడి
మొదలు పెట్టినా, దాని మలుపున అది పోయింది. ఇవి కథలో వాస్తవాలో అన్నంత గా నాలో
పెనవేసుకు పోయేవి. ఒక్కోసారి నా నాయికలంతా చర్చలు పెట్టుకుని వారి నాయకుల గురించి,
పరిస్థితుల గురించి విశ్లేషిస్తూ సంభాషణాదులు కూడా బాగా స్ఫురించేవి. వాటిని ఆవిష్కరించే
అవకాశం లభించలేదు.
కథలలో డైలాగులు వాటికి ప్రాణం అని అనుకుంటాను.
నవలలలో చర్చలు ప్రధానంగా ఉంటాయి. ఎక్కడా బోర్ కొట్టదు అనే భావిస్తున్నాను. ఆసక్తికరంగా
ఉంటాయి అని చెప్పారు చదివినవారు. జీవంతంగా ఉంటాయి అన్నారు పాత్రలను. ముఖ్యంగా
స్త్రీపాత్రలు.. నేను స్త్రీని కనుక స్త్రీపరంగా న్యాయం చేయగలను. కానీ పురుషుల
పాత్రలలో ఊహకు అనుభవానికి అందినంతవరకు అవగాహనతోనే వ్రాశాను. నా స్వానుభవం తక్కువ
పడితే క్షంతవ్యను. ఎక్కువగా కథలలో, నవలలలో నాయికలు ప్రధానపాత్రలు ఉంటారు.
కేంద్రంలో ఉంటారు. కొన్ని ఉత్తమపురుషలో వ్రాశాను.. కొన్ని ప్రథమలో వచ్చాయి. ఇంక
చాలా కథలు చెక్కడం పూర్తి కాక నిరీక్షిస్తున్నాయి. చూడాలి వాటి దారులు ఎప్పుడు
తెరుచుకుంటాయో.
ఏమో- నాకు నేను బాగానే వ్రాస్తానని అనుకుంటాను.
కొన్ని కథలకు నాకు నేనే ఒక్కర్తినే పాఠకురాలిని ఇంతకాలం. ఇప్పుడు బ్లాగులో వేస్తే లోకంలో
ఎవరైనా రెండవవారు చదువుతారు. అంతే. క్లుప్తంగా ఇది నా కథల వెనక రొద. ఇక కథ గురించి
కథ గురించి ముగించుకుని కథలలోకి ప్రవేశించండి- శుభం భూయాత్.
No comments:
Post a Comment