3
"మళ్ళీ ఆలస్యం..? కనీసం నెలలో ఒకటో
తారీకు జీతాలరోజైనా వేళకు రావాలని ఉండదా?" ప్రార్థిత్ ఆఫీస్ లో అడుగు పెడుతూనే
ఫ్లోర్ లో ఎదురుపడిన అధికారిణి చిరుకోపంగ అంది, గోడకు ఉన్న గడియారం, దాని పక్కనే
ఉన్న కాలెండరు చూస్తూ.
ఆ మాటలకు ఏమాత్రం కంగారు పడకుండా, "అది..
నిన్నటి డిజైన్ పూర్తి చేసి తెచ్చేసరికి ఆలస్యమైంది. టైమంతా దీనికే సరిపోయింది.
అర్జంట్ అన్నారు కదా అని.." అంటూ తన బాగ్ లో నుంచి ప్రింటవుట్ లు తీసి
చూపించాడు ప్రార్థిత్. అతనికి రాత్రంతా నిద్ర లేక బాగా అలుపుగా ఉంది. ముఖం మీద
ప్రస్ఫుటంగ అలసట ఛాయలు కనిపిస్తున్నాయి. అధికారిణి గబగబా డిజైన్లన్నీ చూసింది. ఆమె
ముఖంలో ఏ భావనా కనిపించకపోవటం ప్రార్థిత్ కి కాస్త బాధనిపించింది. అంతలో నిషితా
వచ్చి, "సారీ ఆంటీ, డిజైన్స్ బండి లోనే మర్చిపోయాను. వెళ్ళి తెచ్చేసరికి
కాస్త లేటైంది.." అంటూ అతని ఎదురుంగనే తన డిజైన్స్ చూపించింది. అధికారిణి
వాటిని చూస్తూనే వెలిగిపోయే ముఖంతో, "అబ్బ, ఎంత బాగున్నాయో.." అంటూ
కాబిన్ లోకి నడిచింది. నిషితా ఆమె వెనకాలే వెళ్ళింది. ప్రార్థిత్ ఏం చేయాలో తోచక
అక్కడ నిలబడిపోయి, తన క్యూబికిల్ వద్ద తన కోసం చూస్తూ, ఇదంతా గమనిస్తున్న
సిద్ధాంత్ ని చూశాడు. 'వెళ్ళు.. చూస్తూ నిలబడ్డావేఁ..?' అన్నట్టు చేతితో సైగ చేసి,
తల కొట్టుకున్నాడతను. ప్రార్థిత్ తల ఊపి బుద్ధిమంతుడిలా తనూ కాబిన్ లోకి వెళ్ళాడు.
అధికారిణి యథావిధిగా నిషితాతో
కూర్చోమని, ప్రార్థిత్ కి ఏమీ చెప్పకుండ, "ప్రార్థిత్, ఈ డిజైన్స్ ఉంచు. నీవి
స్కాన్ చేసి లేవు కదా. నిషీ అంతా రెడీగా తెచ్చింది. ఈసారికి నిషీవి
పంపుదాం.." అంది.
నిషితా ముఖం వెలిగిపోయింది. ప్రార్థిత్ వంక
గర్వంగ చూసింది. ప్రార్థిత్ తల వంచుకుని, అధికారిణితో సరేనని ఆమె చేతిలో నుంచి తన
డిజైన్లు తీసేసుకున్నాడు. ‘నిషితాకి కూడా డిజైన్ చేయమని ఇచ్చినట్టు తనతో ఒక్క మాట
చెప్పినా తను రాత్రంతా హాయిగ నిద్రపోయి ఉండేవాడు. కాదన్నదని కాదు.. తను చేయదలచింది
చేసేటప్పుడు ఇటువంటి చవకబారు వేషాలెందుకు వేయాలి..? డిజైన్స్ బాలేక తీసుకోనట్టు,
పెద్ద వేషం..' అనుకుంటూ అక్కడినుంచి కదిలాడు.
అంతలోకి అధికారిణి నిషితా డిజైన్స్
స్కాన్ కాపీస్ తీసుకుని, తన పీసీ ఆన్ చేసి దానిలోకి వేస్తూ, ప్రార్థిత్ తో,
"హాఁ, ప్రార్థిత్, నీకు శుభవార్త. ఈస్తెటిక్స్ వాళ్ళది నోటీస్ పడింది. లాల్
ఎండ్ లాల్ వాళ్ళు ఈసారి స్పాన్సర్స్. తప్పకుండ విపరీతమైన పోటీ ఉంటుంది. వాళ్ళు
నీకోసం ప్రత్యేకంగ ఆహ్వానం పంపారు. క్రితం రెండుసార్ల నుంచి నువ్వే మొదటిస్థానంలో
ఉంటున్నావు కదా." అంది ఒక చేతితో అతనికి ఆహ్వానపత్రిక ఇస్తూ, మరొక చేతితో పీసీలో
ఏదో నొక్కుతూ.
ప్రార్థిత్ అది అందుకుని ఒకసారి ఆప్యాయంగ
తడిమి తెరిచి చూసుకున్నాడు.
"కాకపోతే ఈసారి ఒక విశేషం
ఉంది.." అంది అధికారిణి అతని వంక చూస్తూ.
ఏంటన్నట్టు తల ఎత్తి చూశాడు ప్రార్థిత్.
"ఈసారి నిషా కూడా పాల్గొంటోంది..
నీకు చా....లా టఫ్ గ ఉండబోతోంది పోటీ.." అంది నవ్వి.
ప్రార్థిత్ నవ్వి, "చివరి తేదీ
ఎప్పుడు..?" అని కార్డ్ చూస్తూ, "ఓహ్.. ఈ నెలాఖరేనా..?" అని ఆగి,
ఆశ్చర్యంగ చదివి, "ఈసారి వాళ్ళు హార్డ్ మాడల్ కూడా అడుగుతున్నారు. అంటే,
డిజైన్ చేయటమే కాక అదంతా మీనియేచర్ స్కేల్ లో తయారు కూడా చేయాలా..? చాలా కష్టం. ఇంత
తక్కువ టైంలో.." అన్నాడు. అతనికి కాస్త కంగారేసింది.
"ఊఁ.. ప్రతీసారిలా కాదని, లాల్
ఎండ్ లాల్ వాళ్ళు నిర్వహణ హక్కులు తీసుకున్నారంటే ఏదో ఒకటి టఫ్ గ ఉంటుందని చెప్పా
కదా.." అంది ఆమె.
సరేనని ప్రార్థిత్ కార్డ్ తోపాటు ఉన్న
అప్లికేషన్ చూసుకంటూ వెళతానని చెప్పి కదిలాడు.
అప్పటి దాకా మౌనంగ ఉన్న నిషితా అంతలోకి,
"ఆంటీ, చిట్ ఫండ్ కంపెనీ సక్సేనా ఫోన్ చేశాడు ఈ రోజు ఉదయం.." అంది ఓరకంట
ప్రార్థిత్ ని గమనిస్తూ.
వెళ్తున్నవాడల్లా అప్రయత్నంగ క్షణం
ఆగాడు ప్రార్థిత్. నిషితా అది గమనించి, "అతని ఇంటీరియర్ ప్లాన్ మార్చాలట.
ఇప్పుడు ఉన్నది ఏం బాగోలేదట..! అంతా పిచ్చిగ ఉందట." అంది.
అధికారిణి పీసీ మీద స్క్రీన్ చూస్తూనే,
ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి, "చిట్ ఫండ్ సక్సేనా అంటే ప్రార్థిత్ తో క్రితం
యేడాది ఇల్లంతా డిజైన్ చేయించుకున్నాడు. ఆఫీస్ డిజైన్ కి కూడా పిలిచినట్టున్నాడు.
సాధారణంగ ప్రార్థిత్ డిజైన్ చేసిన కస్టమర్లెవరూ ఇంతవరకూ కంప్లైంట్ చేయలేదు.
మార్చాలనిపించినా మళ్ళీ అతనినే పిలుస్తారు. ఇది మొదటిసారి ఇట్ల కావటం..! ఏం సమస్య
వచ్చిందో..!" అంది.
ప్రార్థిత్ కి అదంతా సుత్తి అని తెలుసు.
ఎందుకంటే సక్సేనా చాలాసార్లు ఫోన్ చేసి తనను మెచ్చుకోవటమే కాక వేరేవాళ్ళను రెఫర్
కూడా చేశాడు.
"ఏమో, నా డిజైన్ గుప్తా వాళ్ళ
ఆఫీస్ లో చూసి నచ్చి, పిలిచాడని చెప్పాడు.. మరి ఈరోజు నేనటు వెళ్ళనా....?"
అడిగింది నిషితా. ప్రార్థిత్ తల వంచుకుని ఆలోచిస్తూ నిలబడ్డాడు.
అధికారిణి వెళ్ళమన్నట్టు చూసింది.
నిషితా చాలా ఆనందంగ కదిలింది.
"సో, ఇద్దరికీ ఆల్ ది బెస్ట్..
ఈస్తెటిక్స్ కప్ మీ ఇద్దరిలో ఎవరికి వచ్చినా నాకు ఆనందమే. మీ శక్తి కొద్దీ
ప్రయత్నించండి. రెండున్నర లక్ష రూపాయలు ప్రైజ్ మనీ. పుట్ యువర్ బెస్ట్." అంది
నవ్వి.
నిషితా తెగ ఊగిపోతూ, "థాంక్స్
ఆంటీ.. ష్యూర్.." అంది. ప్రార్థిత్ కూడా సరేనని థాంక్స్ చెప్పి శెలవు
తీసుకున్నాడు.
నిషితా వెళ్తూ, ప్రార్థిత్ తో,
"మీకు ఈసారి ఆల్ ది బెస్ట్ చెప్పవచ్చో లేదో.." అంది.
ప్రార్థిత్ నవ్వి, "అది మీ ఇష్టం
మిస్." అన్నాడు బయటకు వచ్చి ఆమె కూడా వచ్చేశాక కాబిన్ తలుపు మూస్తూ.
నిషితా కళ్ళార్పుతూ నవ్వి, తన హైహీల్
బూట్లు టకటకమనిపించుకుంటూ, తన లాంగ్ స్కర్ట్ గాలికి మెల్లగ కదులుతుంటే, విలాసంగ
అడుగులు వేస్తూ వెళిపోయింది.
తన క్యూబికిల్ వద్దకు రాంగనే కనిపించిన
సిద్ధాంత్ కి చేతిలో ఆహ్వానం, అప్లికేషన్ రెండూ చూపించాడు ప్రార్థిత్.
సిద్ధాంత్ అది చూసి, సంతోషంగ,
"ఊఁ.. నాకు నిన్ననే దీని గురించి తెలిసింది. ఇంకేఁ..? నీ సృజనాత్మకతకు
రెక్కలు రానివ్వు.." అన్నాడు.
ప్రార్థిత్ తల ఊపి, "నీకొక పెద్ద
జోక్ చెప్పనా..? ఈసారి మీ అమ్మాయిగారు కూడా అప్లై చేస్తున్నారుట.. నాకు టఫ్
కాంపిటీషన్ అట.. అధికారిణిగారు ఉవాచ.." అని చెప్పాడు.
"ఎవరు..? నిషీనా..? నీకు పోటీ
రాగలిగే సత్తా ఉందా ఆమెకు..?"
"ఏమో.. మేడమ్ అప్లై చేయిస్తోంది.
ఒక కంపెనీ నుంచి ఒకరే పెట్టాలి అని చెత్త నియమాలు పెట్టకుండా నాకూ ఫారమ్
ఇచ్చినందుకు సంతోషం. కానీ నాకేదో భయంగ ఉంది."
"ఏం భయం..? ఈసారి కూడా కప్ కొట్టి
నువ్వే హాట్రిక్ చేస్తావు. నీకున్న సునిశితత, సౌకుమార్యం ఎవ్వరిలో ఉండదు.."
"అందుకు కాదురా, ఈ అధికారిణిగారు
తమ హస్తకౌశలం ప్రదర్శించి, వెనక మార్గంలో ఏమైనా ఈ పిల్లకే కప్ వచ్చే ఏర్పాటేమైనా
చేయిస్తుందేమోనని. పోటీ ఉంటే కదరా ఎవరైనా గెలిచేది..?"
"ఇది ఈస్తెటిక్స్ పోటీ నాయనా.
అందులో లాల్ ఎండ్ లాల్ వాళ్ళ నిర్వహణ. సెకెండ్ క్లాస్ వ్యవహారాలకు తావే ఉండదు. అది
ఖచ్చితం." అని ఆగి, "బయటకు రాని టాక్ ఒకటి చెప్తా విను. లాల్ ఎండ్ లాల్
వాళ్ళ డిజైనర్ కి వీళ్ళకు ఏదో డబ్బు దగ్గర గొడవ వచ్చి, వాడు వెళిపోతున్నాడట. ఈసారి
కాంపిటీషన్ గెలిచినవాడికి అక్కడ పర్మనెంట్ గ ఆఫర్ కూడా రావచ్చని అంటున్నారు.
ఇటువంటి చిల్లర కంపెనీలతో ఇంక నీకు పనే ఉండదు. ఆ పిల్ల గొడవలో పడి ఆ అవకాశం
పోగొట్టుకోకు. అక్కడ బంగారం పండుతుంది.." అన్నాడు సిద్ధాంత్.
"అది సరేరా.." అని ప్రార్థిత్
ఏదో ఆలోచిస్తున్నట్టు, "నాకు భయం వేయటానికి మరొక కారణం ఉంది. నేను డిజైన్
చేసిన ప్లానులు ఏవీ ఇంతమటుకు ఫెయిల్ కాలేదు. కానీ ఈసారి ఒక విచిత్రం జరిగింది. ఏదో
చిన్న చిన్న మార్పులవరకైతే ఫరవాలేదు. కానీ మొదటిసారి పూర్తి రీప్లాన్ కోసం నా
కస్టమర్ వేరొకరికి ప్రపోసల్ పంపారు.."
"అంటే వేరే కంపెనీకా..? ఏం
కంపనీకి..?" ఆశ్చర్యంగ అడిగాడు సిద్ధాంత్.
"వేరే కంపెనీకి దేనికి పంపినా
కించిత్తైనా బాధ పడకపోదును. కానీ వాడు ఈ పిల్లకే నేరుగ కాల్ చేసి
పిలుచుకుంటున్నాడు. అదే అంతు చిక్కటం లేదు..! గుప్తా వాళ్ళ డిజైన్ చూసి తనను
పిలిచాడని మురిసిపోతోంది.."
సిద్ధాంత్ అంతా అర్థమైనట్టు నవ్వాడు.
"అందులో అంతు చిక్కకపోవటానికేం లేదు. గుప్తా వాళ్ళ ఆఫీస్ ప్లాన్ చెత్తగ ఉందని
మొన్న కూడా ఏడుస్తున్నాడని వాళ్ళ ఆఫీస్ లో టాక్ తెలిసింది. ఇప్పుడు కూడా డిజైన్
సమస్య అయి ఉంటే సక్సేనా కంపెనీకే కాల్ చేసేవాడు. అట్ల కాక నిషితాకి పర్సనల్ నెంబర్
కి చేశాడంటే... ఆ పిల్ల డేంజర్ లో ఉంది.." అన్నాడు.
"ఎందుకు..?"
"వాడికి ఆ పిల్ల చేసిన ఇంటి డిజైన్
అక్కరలేదు.. ఆ పిల్ల ఒంటి డిజైనే కావాలి.."
"...అంటే..?"
"ఒరే మరీ పాలు తాగే పిల్లాడిలా
అడగకు. నాకు ఒళ్ళు మండుతుంది. ఆ లేడిపిల్ల ఈ అడవికి కొత్త. ఇక్కడి పులుల, సింహాల
సంగతి ఇంకా తెలిసినట్టు లేదు. సక్సేనా గురించి చాలా విన్నాను. అస్సలు మంచివాడు
కాకపోవటమే కాదు.. అపరకీచకాధముడు కూడా అట..!!"
"----"
"'రోజూ ఎందుకు కనుక్కుంటావు, ఆ
పిల్ల ఎటు పోయిందో, నీకెందుకు' అని అడుగుతువు కదా.., ఇందుకే..! ఒరేయ్.. ఆ పిల్లను
వాడి కొంపకు పంపొద్దని చెప్పరా, మేడమ్ ని.."
ప్రార్థిత్ భుజాలెగరేసి, "నేనా..?
ఎట్ల చెప్పాలి..? బాగుండదు. అయినా ఆ పిల్లేమైనా పాలు తాగే పిల్లా..? ఒకసారి ఇల్లు
వదిలి బయటకు వచ్చిన తర్వాత తన సంరక్షణ తను చేసుకోగలిగే ఉంటుంది. ఆ సక్సేనా ఆమెగారి
డిజైన్ లకు పడిపోయి పిలిచాడనుకుంటోంది. పాపం.." అన్నాడు.
"అది కాదురా, ఒక్కసారి ఆపి
చూద్దాం.. రా.. కావాలంటే నేనూ తోడు వస్తా." సిద్ధాంత్ అతని చేయి
పట్టుకున్నాడు.
ప్రార్థిత్ చేతిని విడిపించుకుని,
"తనను మేడమే స్వయంగ వెళ్ళమంది. ఇప్పుడు వెళ్ళి వద్దంటే వాళ్ళిద్దరికీ నా మీదే
అనుమానం వస్తుంది. తప్పకుండ నేనేదో మాత్సర్యంతో అట్ల చెప్తున్నాననే అనుకుంటారు.
అసలే నాతో పోటీ పడుతుంది. నన్ను కిందకు చూపించాలని చాలా తహతహపడుతుంది. నేనేం
చేయలేను. అర్థం చేసుకో." అని ఆగి, "పోనీ నువ్వే వెళ్ళి చెప్పు.. నమ్మే
అవకాశం ఉంది." అన్నాడు.
"నేనా..? నేనెట్ల చెప్పాలి..?
నాకసలు అఫీషియల్ గ విషయమే తెలియదు కదా..! నువ్వైతే మాటలు జరిగేటప్పుడు అక్కడే
ఉన్నావు.." అని ఆగి, "పోనీ నువ్వూ రా.. అట్లగే చెప్తాను" అన్నాడు
ఆరాటంగ.
"నాకేం పట్టింది..? నేనెందుకు
చెడ్డవాణ్ణి కావాలి..? అది తన వ్యక్తిగత విషయం. తల దూరిస్తే జుట్టు
పీకుతుంది."
"అయ్యో, ఏం పట్టిందేంట్రా..? ఒంటరి
ఆడపిల్ల.. మన తోటి ఉద్యోగిని..! పాలు, నీళ్ళకు తేడా తెలియని అమాయకురాలు. ఏదైనా
జరిగితే తన జుట్టు పీక్కుని ఏడుస్తుంది." సిద్ధాంత్ కంగారుగ అన్నాడు.
"ఏడవనీ. నీకెందుకు అంత జాలి..??
మనం కాదు కదా దానికి కారణం..?"
సిద్ధాంత్ అతని వంక అసహ్యంగ చూసి,
"ఆడపిల్ల మానం విలువ తెలియక మాట్లాడుతున్నావో, లేక తెలిసి కావాలని అట్ల
జరగాలని కోరుకుని ఉదాసీనత ప్రదర్శిస్తున్నావో నాకర్థం కావట్లేదు." అన్నాడు.
ప్రార్థిత్ అతన్ని నిశితంగ చూస్తూ,
"ఏంటి.. అవసరానికంటే ఎక్కువ ధ్యాస కనిపిస్తోంది..? ఏంటి విషయం..?"
అన్నాడు అనుమానంగ ముఖం పెట్టి.
సిద్ధాంత్ అసహ్యంగ అతని వంక చూసి,
"ఛిఛి.. నీ ముందరే కదరా, మొన్న ఆ అమ్మాయిని, "నా చెల్లెలు లాగే
ఉంటావు." అన్నాను. నువ్వు ‘తోటి ఉద్యోగినుల స్థానంలో నీ చెల్లెలో అక్కో ఉంటే..’
అని మాట్లాడిన దగ్గరి నుంచే ఆమెలో నా బంగారు తల్లి చిన్నినే చూసుకుంటున్నానని
చెప్పా కదా.." అని ఆగి, తర్వాత బాధగా, "పైగా మొన్న చూసిన సంబంధం
అమ్మాయిని నచ్చేశానని, కుదిరించుకున్నానని నిన్ననే స్వీట్ తెచ్చి కూడా పెట్టా
కదా..! అయినా ఇంత అనుమానం ఎందుకురా..?" అన్నాడు.
ప్రార్థిత్ ఇబ్బందిగా చూసి,
"నిజమే.. సారీరా.." అన్నాడు.
సిద్ధాంత్ ఏదో ఆలోచించుకుని, "సరే,
పరిస్థితి చూడబోతే నువ్వేం చేసేటట్టు లేవు. నేనే ఏదో ఒకటి చేస్తాలే.. ఆ పిల్ల
డెఫినిట్ గా వాష్ రూమ్ లో మేకప్ మెత్తుకుంటూ ఉండి ఉంటుంది.. పది నిముషాలని అరగంట
చేస్తుంది.." అనేసి అక్కడి నుంచి శరవేగంతో కదిలాడు, ఏదో పథకం మదిలో
మెదులుతుంటే.
"రే, సిద్ధూ.. ఆగరా.. రేయ్.."
అని ప్రార్థిత్ చేతిలో ఫారమ్ అక్కడ పడేసి, అతని వెనకే వెళ్ళాడు.
సిద్ధాంత్ నేరుగ సెల్లార్ లోకి వెళ్ళాడు
అక్కడి నుంచి. ఏదో వెతకసాగాడు.
"ఇక్కడేం వెతుకుతున్నావురా..?
ఏంకావాలి?" అడిగాడు ప్రార్థిత్.
"ఆ పిల్ల బండి రెడ్ స్పార్క్
కదూ..?" సిద్ధాంత్ బండ్లన్నీ వెతుకుతూ అన్నాడు.
"కాదు.. పింక్ విక్టర్..
అనుకుంటా.." అన్నాడు ప్రార్థిత్.
"అదేనా..?" అనుకుంటూ
సిద్ధాంత్ గబగబా ఎదురుగా ఒక మూలగ ఉన్న బండి వైపు నడిచాడు. వాళ్ళ సంభాషణ వింటూ
అక్కడికి వచ్చిన వాచ్ మాన్, "ఏం జరిగింది నిషితా మేడమ్ బండా..?" అని
అడిగితే తల ఊపారిద్దరు. అతను చూపించాడు. అది పింక్ విక్టరే.
సిద్ధాంత్ తల తిప్పి సెల్లార్ అంతా
కలయచూసి, వెంటనే జేబులో నుంచి ఒక యాభై నోటు తీసి వాచ్ మాన్ కి ఇచ్చి,
"ఇప్పుడు నీకు ఏం కనిపించటం లేదు. సరేనా..?" అన్నాడు.
వాచ్ మాన్ తల ఊపాడు, నోటు అందుకుంటూ.
సిద్ధాంత్ ఆ బండి వెనక వైపుకు వెళ్ళి
టైర్ లో నుంచి పూర్తిగ గాలి తీసేశాడు. ప్రార్థిత్ తోపాటు వాచ్ మాన్ ఆశ్చర్యంగ
చూశాడు.
సిద్ధాంత్ లేచి, చేతులు దులుపుకుంటూ,
"ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది..?" అని అడిగాడు.
"ఏమో సార్, ఎరక లేదు. చాయ్ తాగనీకి
పోయినా కదా.." అన్నాడు వాచ్ మాన్.
సిద్ధాంత్ అతని భుజం మీద చేయి వేసి,
"గుడ్.. పైకొస్తావ్.." అన్నాడు. అప్పుడు వాచ్ మాన్ ఆ యాబైరూపాయలు తీసి ప్రార్థిత్
చేతిలో పెట్టి, "సాబ్.. అంతకు ముందు ఒకసారి మీ దగ్గర ఐదొందలు తీసుకున్నాను..
దానిలో ఇది కొంత కట్టుకుంటున్నాను. లెక్క గుర్తుపెట్టుకోండి.." అన్నాడు.
ప్రార్థిత్ కనుబొమ్మలు ముడిచి,
"ఏయ్.. అదేం నీకు అప్పుగా ఇవ్వలేదు కదా..! ఉంచు.. బాబు బాగా
చదువుకుంటున్నాడా..?" అన్నాడు తిరిగి ఆ కాగితం అతని జేబులోనే పెడుతూ.
వాచ్ మాన్ తల ఊపాడు సంతోషంగ. సిద్ధాంత్
అది చూసి, అతని భుజం మీద చేయేసి, వాచ్ మాన్ తో, "ఇంకా కావాలన్నా అడుగు.
మనవాడికి చేతికి ఎముక లేదంటా..!" అన్నాడు.
ప్రార్థిత్ "ఏయ్.. పోరా..
వదిలేయ్" అన్నాడు.
"సరే, నాకెందుకు? వచ్చిన పనైంది. ఇంక పదరా, ఇంక తను
ఎక్కడికీ పోదు.." అన్నాడు సిద్ధాంత్ మెట్లవైపు వెళ్తూ.
"కానీ బండి లేకపోతే ఏఁ..? ఆటోలు
లేవా? బస్సులు లేవా..?"
"బస్సుల్లో ఆ రష్ లో తను
వెళ్ళాలంటే మేకప్ పోతుందని భయపడి వెళ్ళదు. పైగా దానికి ఏ బస్సు ఎటు పోతుందో
తెలియాలి. ఆటోలో పోవాలంటే ఇవాళ ఆటోల సమ్మె. ఇంకెట్ల పోతుంది..?"
ప్రార్థిత్ నవ్వి "తెలివికలవాడివే."
అన్నాడు.
ఇద్దరూ సరిగ్గ సిద్ధాంత్ కాబిన్ లో
కూర్చుని ప్రార్థిత్ డిజైన్ చేసిన ఆధునిక రకం కుర్చీ ఒకటి చెక్కతో తయారు చేసే
విషయమై డిస్కస్ చేసుకుంటుండగా నిషితా కంగారుగ అతని కాబిన్ వద్దకు వచ్చింది, పరుగు
పరుగున. "సిద్ధూ గారూ.. సర్దార్ నగర్ పోవాలి. రూట్ చెప్తారా..?" అని
అడిగింది, రొప్పుతూ.
సిద్ధాంత్ ఆమె వంక చూసి, "రెండు
మూడు సార్లు వెళ్ళినట్టున్నారు ఇదివరకు.." అన్నాడు.
"అప్పుడు నా బండి మీద వెళ్ళాను.
షాట్ కట్ లో. ఇప్పుడేమో అది పంక్చరై చచ్చింది. పొద్దున వచ్చేటప్పుడు బాగనే ఉంది
మరి. ఆ డర్టీ వాచ్ మెన్ అక్కడే చచ్చాడు. అయినా ఏం జరిగిందిరా అంటే "ఏమో
తెల్వదు, చాయ్ కి పోయినా.." అంటున్నాడు. నాకు బస్ రూట్స్ తెలియదు. టాక్సీలో
వెళ్ళాలంటే రూట్ తెలియాలి కదా.." అంది.
"అరే, ఆ రూట్ లో టాక్సీలు ఉండవే..
ఎట్ల పోతారు..?"
"ఓహ్.. ఛ..!! నిజమే కదా. అబ్బా..
ఇప్పుడెట్ల..? నా సెల్ లో కూడా ఆ రూట్ సాఫ్ట్ వేర్ పని చేయటం లేదే.." అంది,
వాచ్ చూసుకుంటూ. ప్రార్థిత్ కంగారుగా ఉన్న ఆమె ముఖం చూస్తుండిపోయాడు.
సిద్ధాంత్ మాత్రం ఆలోచిస్తున్నట్టు ముఖం
పెట్టి, "ఏం చేయమంటారు సిస్టర్..? వచ్చి దింపమంటారా..?" అన్నాడు.
నిషితా ఆనందంగ, "అబ్బ, నిజంగ
దింపుతారా..? చా....లా థాంక్స్.. మీరెంత మంచివారో.." అంది.
"క్..కానీ ఇప్పుడు నాకు
పనుందే.." అని ఆలోచిస్తున్నట్టు ముఖం పెట్టి, ప్రార్థిత్ తో, "ప్రార్థిత్,
నువ్వు ఫ్రీగనే ఉన్నావు గా..! నిషితా గారిని సర్దార్ నగర్ తీసుకుపోతావా..?"
అన్నాడు.
నిషితా అతని వంక ఆశగ చూసింది.
సిద్ధాంత్ తనను కావాలని
ఇరికిస్తున్నాడని అర్థమై, ప్రార్థిత్ తల అడ్డంగ ఊపి, "కుదరదు.. పనుంది.."
అన్నాడు.
"అదేంట్రా, మొన్నెప్పుడో నెలరోజుల
క్రితం నీకు తన వద్ద డిజైనింగ్ నేర్చుకునే అవకాశం పోయిందనుకున్నావుగా.. ఇప్పుడు
దొరుకుతుంది. వెళ్ళు.."
ప్రార్థిత్ కొరకొరా చూస్తూ, "లేదు,
నా బండి రిపేర్ కు ఇచ్చాను.." అన్నాడు.
సిద్ధాంత్ వెంటనే జేబు లోనుంచి తన బండి
కీస్ తీసి ఇస్తూ, "ఓస్.. అంతేనా..? అయితే నా బైక్ తీసుకుపో. నా బులెట్ బాగా
కడీషన్ లోనే ఉంది. ఇదిగో.." అన్నాడు.
"ఆ ఇచ్చేదేదో ఆమెగారికి ఇవ్వు.
షాట్ కట్ లో వెళ్తుంది.." అన్నాడు ప్రార్థిత్ ఎటో చూస్తూ.
"లేదండి.. నాకు బులెట్ నడపటం
రాదు.." అంది నిషితా అయోమయంగ.
"విన్నావుగా.." అని సిద్ధాంత్
ప్రార్థిత్ ని చూసి, "ఇంక వెళ్ళు.." అన్నాడు.
ప్రార్థిత్ కీస్ చేతిలో నలుపుతూ, "కానీ..
కానీ.." అన్నాడు.
"ప్లీజ్ ప్రార్థిత్..." అని
నిషితా అతని వంక అభ్యర్థనగా చూసి, "ఈ ప్రాజెక్ట్ చేస్తే యాభై వేలు.. ఎటూ
పోవు..! మనీ చాలా అవసరం ఉంది. మన మధ్య పోటీ ఈ వేళలో తీర్చుకోకండి. ఏవో మీ మనసులో
పెట్టుకోని నాకు వచ్చిన అవకాశం పోగొట్టటం మంచిది కాదు కదా..!" అంది.
ప్రార్థిత్ కి ఆ మాట విని కోపం
వచ్చింది. సిద్ధాంత్ అది గమనించి, నిషితా తో, "ప్రార్థిత్ అటువంటివాడు
కాదమ్మా..!" అని ప్రార్థిత్ వంక చూసి, "నాకు పని ఉండబట్టి
రాలేకపోతున్నాను. లేదంటే నా దయా హృదయంతో ఒక మంచి అమ్మాయి బాధపడుతూంటే చూస్తూ
ఊరుకోలేను. వెళ్ళరా ప్రార్థిత్.. ప్లీజ్.." అన్నాడు.
ప్రార్థిత్ వీరావేశం వస్తుంటే నియంత్రించుకుంటూ
ఆ అమ్మాయి రూపాన్ని చూస్తుండిపోయాడు. పింక్ ఫ్రిల్స్ తో మోకాళ్ళ కింద వరకు లాంగ్
స్కర్ట్, దాని లోపల పింక్ స్లాక్స్.. పైన షర్ట్ మాడల్ లో రెడ్ బ్లౌజ్ స్కర్ట్ లోకి
టక్ చేసి.., మెడలో నెట్ చున్నీ, చేతిలో వానిటీ బాగ్, మెరూన్ కళ్ళజోడు, చిన్న
డిజైన్ స్టికర్, ముక్కుకు చిన్న పింక్ రాయితో రింగు ముక్కు పుడక, మూతికి అప్పుడే
మెత్తిన పల్చటి లిప్ స్టిక్, క్లిప్ పెట్టి వదిలేసినందువల్ల ఎగిరిపడుతున్న వదులు
జుట్టు, గోళ్ళకు పర్పుల్ పాలిష్.. చాలా ఆధునికంగ ఉన్న ఆమెతో ఈ రోడ్ల మీద బండి మీద
పోవటం అంటే చాలా అసహ్యంగ ఉంటుంది. పరిచితులు ఎవరైనా ఆకస్మికంగ చూస్తే తన గురించి
ఏమనుకుమటారు..? అసలే ఊళ్ళో ఎక్కడపడితే అక్కడ అంతా తమ చుట్టాలే, బంధువులే నిండి
ఉన్నారు..! నాన్న స్నేహితులు, అమ్మ స్నేహితులు కూడా ఉంటారు.
ప్రార్థిత్ ఈ విధంగ ఆలోచిస్తూ మౌనంగ
ఉండిపోవటాన్ని వేరే విధంగ అర్థం చేసుకుంది నిషితా. బాధా, కోపం తన్నుకు వస్తుంటే,
"అంతేలే. మీరెందుకు వస్తారు..? మీకంటే కెరీర్ లో ఎదిగిపోతున్నాని కుళ్ళు.
నేను బాగుపడటం మీకిష్టం లేదు. అందరు మగవాళ్ళకూ అహం ఉంటుంది. ఆడపిల్ల పైకి వస్తుంటే
చూసి ఓర్వలేరు. చాలా సంతోషంగ ఉంది కదూ, నేనక్కడికి వెళ్ళలేనందుకు? నా ఆర్డర్స్
టార్గెట్స్ ఎన్ని పోతే మీకంత మంచిది. యూ ఆర్ జెలస్ ఆఫ్ మీ.." అని ఏదేదో
అనేసింది.
ప్రార్థిత్ కోపాన్ని తమాయించుకుని,
"ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాద దక్కదు. అక్కడే ఆగండి.. మీరంటే నాకెందుకు
జెలసీ..?" అన్నాడు.
సిద్ధాంత్ చుట్టుపక్కల వాళ్ళంతా
ఏమైందన్నట్టు పని మాని చూస్తుండేసరికి, ఆ పరిస్థతిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం
చేస్తూ, నవ్వుతూ, ప్రార్థిత్ దగ్గరగా వెళ్ళి. చిన్నగ భుజం తట్టి, "నీకు జెలసీ
లేదని ప్రూవ్ అయ్యేది నువ్వు ఆమెకు మనస్పూర్తిగ సహకరించినప్పుడే. నిజంగ వేరే
భావనేం లేకపోతే ఆమెను తీసుకువెళ్ళు.." అని నిషితా వంక చూసి, "సిస్టర్..
ప్లీజ్.. కళ్ళు తుడుచుకోండి. ఇక్కడి జనాలు అపార్థాలు చేసుకోవటంలో డాక్టరేట్లు
పుచ్చుకున్నవారు." అన్నాడు.
నిషితా పరిసరాల మీద స్పృహ కలిగి కళ్ళు
తుడుచుకుని అక్కడి నుంచి కదిలింది.
సిద్ధాంత్ అతనిని పక్కకు పిలిచి,
చెవిలో, "నీకైతే కరాటే వచ్చు కదా అని నిన్ను పంపుతున్నాను. అక్కడ అవసరం
పడచ్చు. జాగ్రత్తగ ఉపయోగించు." అన్నాడు. ప్రార్థిత్ చేసేదేం లేనట్టు, సరేనని
కీస్ తీసుకుని అయిష్టంగనే కదిలాడు. కిందకు వెళ్ళి బులెట్ బండి స్టార్ట్ చేశాడు.
అది బిగ్గరగా శబ్దం చేస్తూ ప్రాణం పోసుకుంది. ఆ శబ్దం ఆఫీస్ సెలార్ నిండా
మారుమోగింది. రెండు నిముషాలాగి, నిషితాను కూర్చోమన్నట్టు చూస్తే ఆమె అటూ ఇటూ
కాళ్ళు వేసి అబ్బాయిలా కూర్చోబోయింది.
"హలో.. అట్ల వద్దు.. సైడ్ కి
కూర్చోండి.." అన్నాడు ప్రార్థిత్ అది గమనించి. వాచ్ మాన్ ఇద్దరినీ చూసి నవ్వుతుంటే
అతనికి మంట పుట్టింది.
"నాకట్ల కూర్చోవటం రాదండీ. స్కర్ట్
వీల్స్ లో ఇరుక్కునిపోతే కష్టం.. అసలే శారీ గార్డ్ కూడా లేదు.." అంది నిషితా
అయోమయంగ.
"కర్మ.." అనుకుని ప్రార్థిత్,
"సరే, కొత్త బండి కదా, ఇంకా వేయించి ఉండడు. మీకు ఇచ్ఛ వచ్చినట్టు
కూర్చోండి.." అన్నాడు.
ఆమె కూర్చున్నాక, బండి ముందుకు
కదిలించాడు.
"ఇట్ల కూర్చుంటే ఏమైనా
ఇబ్బందా..?" అంది నిషితా.
ప్రార్థిత్ గట్టిగ నిట్టూర్చి,
"ప్లీజ్, ఇది నా బండి కాదు. కొత్త బండి నడిపేటప్పుడు అలవాటయ్యేదాకా నాకు
టెంషన్ గా ఉంటుంది. మాట్లాడిస్తే డ్రైవ్ చేయలేను.." అన్నాడు.
నిషితా సరేనని మౌనంగ కూర్చుంది.
No comments:
Post a Comment