"ఈ ప్రమోషనుకు మీరు
యోగ్యులు కాబట్టే వచ్చింది. మిమ్మల్ని ఇంటర్వ్యూలో చూసినప్పుడే అనుకున్నాను,
ఈ ఉద్యోగం మీకే
వస్తుందని.." ప్రమోషను తెచ్చుకుని మీరు ఆ మాట నిరూపించారు.
ఆరోజు తన పదోన్నతి
పత్రం తీసుకుందామని వెళ్ళినప్పుడు చూసి తన కాబిన్ కి పిలిచి భానుమూర్తి అన్నాడు ఈ
మాట.
"ఎందుకు అట్ల
అంటున్నారు..?"
స్వర్జిత్ ని
కూర్చోమన్నట్టు సూచించి, "ఏమో అట్ల అనిపించింది. మీ ప్రొఫైల్ ఇప్పుడే మరొకసారి
స్టడీ చేస్తున్నాను. నిజంగ మీరు ఆ నాలుగేళ్ళు ఫామిలీ సమస్యల వల్ల ఏమీ చదవకుండ
ఉద్యోగం చేయకుండ ఉన్నారంటే నేను నమ్మను. మీరు చెప్పుకున్న దానికన్నా ఎక్కువ
క్వాలిఫైడ్ కదా.." అన్నాడాయన.
స్వర్జిత్ జవాబు ఏం
చెప్పాలా అని కొంచెం తటపటాయించాడు.
భానుమూర్తి మొత్తం
హెచ్చార్ విభాగానికి అధిపతి. నీతిమాటలు చెప్పి వాటిని పాటించే మనుషులు అరుదుగా
ఉంటారు. వారిలో ఈయన అగ్రగణ్యుడు. కంపెనీలో నీతినిజాయితీ మొదలైన నియమాలకు
సంబంధించిన విషయాలన్నీ ఈయనే చూసుకుంటాడు. విచిత్రమైన మనిషి. ఆఫీసులో అంత గొప్ప
స్థాయిలో ఉండి కూడ ఇప్పటికీ సాదాబట్టలలోనే ఆఫీసుకు వస్తాడు. అందరూ లెవెల్ కొట్టి
చిరాకు పెడతారు కానీ ఈయన ఉన్న స్థాయికంటే చాలా దిగువగ ప్రవర్తించి ఇబ్బంది
పెడతాడు. వయసులో చాలా పెద్దవాడై ఉండీ ఆఫీసులో ప్యూనుతో సహా అందరినీ మీరు అండీ
అంటాడు. మాధవానికి ఈయన మంచి స్నేహితుడు కూడా కావటంతో భాస్వతిని సొంత కూతురిలా
చూసుకుంటాడు. అర్ణవ్ ద్వారానే స్వర్జిత్ ఈయన గురించి విన్నాడు.
"ఏంలేదు.. ఈరోజు
అమ్మాయికి కాస్త తల నెప్పిగ ఉండి ఆఫీసుకు రాలేదు. అవకాశం దొరికింది కదా అని
ఎప్పటినుంచో అడగాలనుకున్నది అడుగుతున్నాను. ఈ వయసులో కంప్లయంస్ ఇష్యూ చెరిపినందుకు
బాస్ మనలను ఉద్యోగంలో నుంచి తీసేస్తే బాగుండదు కదా.."
స్వర్జిత్ ఆయన మాట
చెప్పిన విధానానికి నవ్వాడు.
"పోనీ, అది ఇష్టం లేకపోతే
పనీ, కాసేపు
వేరే ఏదైనా మాట్లాడుకుందాం." నవ్వాడాయన. సరేనన్నాడు తను. ఏవో విషయాలు
మాట్లాడుకున్నారు. తన జీవితం, కంపెనీలో అనుభవాల గురించి చెప్పాడు.
తర్వాత క్రమంగ ఆయనతో
అతనికి బాగా స్నేహం కలిగింది. ఆయన ఒంటరివాడు. భార్య పోయింది. కొడుకులు విదేశాలలో
ఉంటారు. దానితో స్వర్జిత్ ని చూస్తే వాళ్ళ అబ్బాయిని చూసినట్టు ఉంటుందని ఎప్పుడూ
అనేవాడు. ఒకరోజు మళ్ళీ ఆ ప్రస్తావన తీశాడు.
"ఏం చదివారు..?
చెప్పండి
ఫరవాలేదు. నేను ఎవరికీ చెప్పను."
"ఎంకామ్ టాక్సేషన్..
ఎంబీయే ఫైనాన్స్.. హెచ్ ఆర్ ఎమ్ డిప్లమా.."
భానుమూర్తి
ఆశ్చర్యపోయాడు. "మరి బీకామ్ అని మాత్రమే ఎందుకు వ్రాసుకున్నారు..? ఇంత ఆర్డినరీ పోస్టు
ఎందుకు ఎంచుకుని చేస్తున్నారు..?"
"మా నాన్నగారి కోరిక
మీద."
"అదెందుకు..?"
స్వర్జిత్ తండ్రి
ముఖం కళ్ళముందు కదలాడుతుంటే చెప్పాలా వద్దా అని ఆగాడు. భానుమూర్తి మీద అతనికి
సదభిప్రాయమే ఉంది ఇప్పటివరకు. కానీ ఆయనతో తన గురించిన వివరాలు పంచుకోవటం ఎంత వరకు
సమంజసమో అతనికి అర్థంకాలేదు. భానుమూర్తి మరీ మనిషిని ఇబ్బంది పెట్టేసి నిజాలు
రాబట్టే రకం మనిషి కాదు. అందుకే అన్నాడు-
"సరే- వదిలేయండి. పోనీ
నేను చెబుతాను- మీకే ఈ ఉద్యోగం వస్తుందని ఎందుకు అనిపించిందో. మీతో పాటు క్వాలిఫై
అయిన మిగితావారు ఆ వయోలిన్ బాబు ఫోటో చూసి చెప్పిన సమాధానాలివి." ఆయన ఒక బటన్
నొక్కాడు. ఎడిట్ చేసి ఉన్న ఇంటర్వ్యూ నాటి దృశ్యం టీవీలో వచ్చింది.
"ఏం ఉంది..? వాళ్ళ నాన్న కోపం
చేసి ఉంటాడు. వాణ్ణి ఇంజనీరు అవ్వరా అంటే సంగీతం నేర్చుకుంటానని ఉంటాడు. వాయింపులు
వీపు మీద పడేసరికి ఏడుస్తూ ఉన్నాడు." అని ఒకడు,
"లేదు. వాడు
ఏడుస్తుంటే ఆ వయోలిన్ ఎవరో అక్కడ పెట్టి వెళ్ళారు. అది వాడు ఇంకా చూడలేదు."
అని ఒకామె,
"వాడు ఒకప్పుడు మంచి విద్వాంసుడు.
కానీ ఇప్పుడు ఏదో దిగులులో ఉండి వాయించలేకపోయినందుకు దాన్ని పక్కన పెట్టేసి తీరికగ
బాధపడుతున్నాడు." అని మరొకరు,
"అబ్బ, ఇప్పుడిది వాయించాలా?
భగవంతుడా!
అనుకుని పడుకున్నాడు." అని ఇంకొకరు చెప్పారు.
అదంతా చూపి ఆపేసి,
భానుమూర్తి
అన్నాడు- "మీరు మాత్రం చాలా పాజిటివ్ గ జవాబు చెప్పారు. మీకు టాట్ గురించి,
అదే థిమాటిక్
అప్రిసియేషన్ టెస్ట్ గురించి ముందే తెలుసా..?"
"లేదు. తెలియదు."
తల అడ్డంగ ఊపాడతను.
"అయితే టాట్ లో ఈ ఫోటో
కాదు చూపించేది. ఇది నేను తీయించి పెట్టించాను.. టాట్ ఫోటో వేరు. అందులో వయోలిన్
చూస్తూ దిగాలుగ కూర్చుని ఉంటాడు అబ్బాయి. ముఖం కనిపిస్తుంది." ఆయన
చిన్నపిల్లాడిలా చెప్పాడు నవ్వి.
"ఓహో.."
స్వర్జిత్ కూడా నవ్వాడు.
ఇంకొకరోజు ఇద్దరూ
ఆఫీసు బయట కలిశారు. ఆయన స్వర్జిత్ ని రమ్మని పిలిచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. అది
చాలా సాదాగ ఉండటం చూసి స్వర్జిత్ మరింత ఆశ్చర్యపోయాడు. మనిషే సాదా కాకుండ ఇల్లు
కూడా ఇంత నిరాడంబరంగ ఉండటం విశేషమే..!
"నాకొక్కడికి ఎందుకు
చెప్పండి- పెద్ద పెద్ద ఇళ్ళూ, ఆర్భాటాలూ, అనవసర ఖర్చులు..? అంత ఖర్చు మిగిలిస్తే
కంపెనీకి వేరే ఉద్యోగులకు ఏదైనా శ్రేయస్సు చేసే అవకాశం ఇచ్చినట్టవుతుంది
కదా."
భానుమూర్తి కంపెనీలో
పని చేసే కింది ఉద్యోగులను కూడ తన సొంతవారిలా చూస్తాడని, వాళ్ళ శ్రేయస్సు, అభివృద్ధికి చాలా
కార్యక్రమాలు చేస్తూ, చేయిస్తూంటాడని, వారి పిల్లలకోసం ఓ చిన్న స్కూలు, వాళ్ళ కుటుంబాల కోసం
ఒక స్పెషాలిటీ హాస్పిటల్, అవీ నడిపిస్తుంటాడని ఆఫీసులో చాలా తక్కువమందికి
తెలుసు. అందుకే ఆ మాట విని స్వర్జిత్ ఆశ్చర్యపోయాడు.
"మీరు నిజంగా చాలా
గ్రేట్ సార్.." అన్నాడు సింసియర్ గా.
భానుమూర్తి నవ్వి,
"ఇందుకు
బదులుగా దేవుడికీ నాకూ డీల్ ఉందిలే. మంచి పనులు చేస్తే పుణ్యం వచ్చే వ్యవస్థ ఒకట ఈ
లోకంలో ఉందని విన్నాను. సో, నాకు చాలా పుణ్యం వస్తుంది కదా..! అదే ఆశ. మనుషులు
తిరిగి ఆశించకుండా ఏ పనులూ చేయరోయ్.." అని ఆగి, "అది వదిలేయి. ఇంతకూ
ఎవరెవరుంటారోయ్ మీ ఇంట్లో..?" ఆయన అడిగాడు మొట్టమొదటిసారి చనువుగ ఏకవచనంలో
సంబోధిస్తూ.
"నేను, మా నాన్నగారు. అంతే.
అమ్మ చనిపోయి రెండేళ్ళవుతోంది."
"అరే.. తోబుట్టువులు
లేరా..?"
"ఇద్దరు అక్కలు
ఉన్నారు- కానీ ఇద్దరికీ పెళ్ళి అయిపోయి వేరే ఊళ్ళలో ఉన్నారు.. అప్పుడప్పుడు ఫోను
చేస్తుంటారు."
"అట్లగా..? సరే. అయితే నాన్నగారు
ఏం చేస్తుంటారు..?"
"ఆయన బ్యాంకులో
చేసేవారు. ఇప్పుడు రిటైరైపోయి ఆధ్యాత్మికసాధనలో ఉన్నారు." అని ఆగి, ఆలోచిస్తూ,
"సరే,
అడిగారు కనక
చెబుతున్నాను- నన్ను వ్యాపారంలో లాంచ్ చేయాలని నాన్న ఆలోచన. దానికి ఒక షరతు
పెట్టారు. వ్యాపారంలో రాణించాలంటే కింది ఉద్యోగుల సహాయం కావాలి. అందుకు కింది
ఉద్యోగుల బాధ తెలియాలి. ఒకరి కింద కష్టపడటం అంటే ఏంటో తెలియాలి. కనక ఏదైనా చిన్న
ఉద్యోగం చేసుకోమన్నారు ముందస్తుగ. ఆయన చాలా ఆదర్శాలున్న మనిషి. మంచి అధికారిగ ఏం
చేయాలో ఒకరి కింద పడి ఉన్నప్పుడే తెలుస్తుందని ఆయన ఆలోచన." అని చెప్పాడు.
"ఐసీ..! చాలా
ఆశ్చర్యంగ ఉందే. చాలా విచిత్రమైన షరతు."
"ఔను. కానీ ఈ విషయాలు
ఎవ్వరికీ తెలియదు. నావరకు తప్ప."
"అర్థమైంది. నేనూ
చెప్పనులే. మరి అయితే నువ్వు సరైన చోటే ఉన్నావనిపిస్తోంది. మన మేడమ్ గారి కింద
నీకు ఈ విషయంలో మంచి అనుభవమే దొరుకుతుండవచ్చు. ఒక అధికారి ఎట్ల ఉండకూడదో బాగా
తెలుస్తూండవచ్చు."
స్వర్జిత్ నవ్వి తల
అడ్డంగ ఊపాడు. "అదేం లేదు. ఆమె మంచివారే కానీ.."
"ఆ "కానీ"
దగ్గరేనోయ్ అంతా ఆగిపోయేది! సరే, అది వదిలేయి. ముందు నాతో రా..! మీ నాన్నగారి ఆశయంలో
నేనూ కాస్త భాగం పంచుకుని పెడతాను." అని ఆయన ఆరోజు అతనిని వర్కర్లు ఉండే
క్వార్టర్ల వైపు తీసుకు వెళ్ళాడు. స్వర్జిత్ మొదటిసారి అటువంటి లొకాలిటీలోకి
వెళ్ళాడు జీవితంలో. తండ్రిది ఉద్యోగరీత్యా మొదటినుంచీ ఉన్నత స్థానం కావటం చేత
పెద్ద స్కూళ్ళు, పెద్ద కాలేజీ, పెద్ద చదువుల మధ్య ఎన్నడూ అటువంటి పరిస్థితులను కళ్ళారా చూసే అవకాశం
దొరకలేదు.
స్వర్జిత్ కి ఆరోజు
ఆయన తనే స్వయంగ దగ్గర ఉండి వారి స్థితిగతులను, వారి అవసరాలను వివరించాడు
భానుమూర్తి. స్వర్జిత్ కి మొదటిసారి వేరే ఏదో ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు
అనిపించింది.
ఆ తర్వాత
భానుమూర్తితో పరిచయంలో అతను ఇటువంటివి చాలా సంగతులు తెలుసుకున్నాడు- మంచి
వ్యాపారస్తుడి దగ్గర నుంచి, మంచి అధికారి లక్షణాలు, కంపెనీ నడపటంలో ఎదురయ్యే
పరిస్థితులు, అవి ఎదుర్కోవటానికి కావాల్సిన మెళుకువల జ్ఞానం, వర్కర్లు, యూనియన్ లకు
సంబంధించి, ఇంకా కంపెనీ-లా ఏం చెప్తుంది, ఆ పద్ధతులు వాస్తవిక ప్రపంచంలో ఎట్ల ఉంటాయి-
ఇంకా చాలా చాలా అరమరికలు లేకుండ చెప్పేవాడు భానుమూర్తి. ఉదాహరణలతో సహా ఆయన
వివరిస్తుంటే ఎంబీయే క్లాసులలో, ఎంకామ్ పుస్తకాలలో దొరకని ఎంతో ప్రాయోగిక జ్ఞానం అక్కడ
లభించింది స్వర్జిత్ కి.
"సంవత్సరంలోపు
ప్రమోషను, భానుమూర్తి
గారి ఇంటికి వెళ్ళేంతగా స్నేహం..! ఏంటి బాస్, ఏం సంగతి..?" అడిగేశాడు అర్ణవ్
ఒకరోజు హఠాత్తుగ. అతని గొంతు చాలా సీరియస్ గ ఉంది. అంతకు క్రితం సాయింత్రం అర్ణవ్
వారిద్దరినీ భానుమూర్తి ఇంటి దగ్గరలో ఉన్న గార్డెన్ లో చూసినట్టు స్వర్జిత్ కి
అర్థమైంది.
అదంతా చూసి అర్ణవ్ కి
కాస్త కడుపుమంట పుట్టటం మొదలైందా అనిపించింది స్వర్జిత్ కి.
"ఆఁ.. ముసలాయన- రోజూ
తల తింటున్నాడు- నేను వాళ్ళ అబ్బాయిలా ఉంటానట..! అంతే. ఇంటికి పిలిచి ఒకటే
సోది." మాటమార్చి చెప్పాడు స్వర్జిత్.
"నిజమా..?"
అర్ణవ్
నమ్మినట్టున్నాడు. కాస్త తేలికపడ్డాడు. గొంతులో గాంభీర్యం తగ్గింది. మామూలుగ ఏవో
మాట్లాడాడు.
కానీ భానుమూర్తి ఒక
పూట బాంక్ పని మీద వెంటతీసుకువెళ్ళి మాటల్లోనే కార్ తిప్పి అతనిని మాధవం దగ్గరకు
తీసుకువెళ్ళేసరికి ఇందులో ఏదో ఉంది అని మొదటిసారి స్వర్జిత్ కి కూడ అనిపించింది.
అప్పటికి అతను కంపెనీలో చేరి ఏడాదిన్నర అయింది.
మాధవం ఇల్లు చాలా
పెద్దది. వాళ్ళ హోదాకి తగినట్టుగ ఉంది. అంత ఇంట్లో తండ్రీ కూతురూ– ఇద్దరే ఉంటారు. ఎక్కడ
పడితే అక్కడ భాస్వతి చేసిన శిల్పాలు అట్ల పెట్టి ఉన్నాయి. ఎంత అందంగ చెక్కిందో..!
వాళ్ళ ఇంటి ద్వారానికి శిలాతోరణంలా ఉన్న స్వాగతఫలకాన్ని స్తంభాలు రెండు
మోస్తుంటాయి. అవి మంచి చేతిపనితో సన్నటి మామిడి తోరణాలతో, మామిడి పిందెలతో అదేదో మైనం
మీద చేసినంత సులువుగా రాతిచేత చెక్కబడ్డాయి.. వాటి పక్కన రాతిఫలకం మీద అక్షరాలు
కూడ ఆమెనే చెక్కిందిట. భానుమూర్తి చూపించాడు. ఆ ఇంటిపేరు "రాధామాధవం"
అని పెట్టుకున్నారు.. బహుశ మాధవం భార్య పేరు రాధ అయి ఉంటుంది అనుకున్నాడు
స్వర్జిత్. స్వాగతతోరణం కాంగనే ముందు గదిలో పుష్పాలు చేతిలో పట్టుకుని మోకాళ్ళ మీద
కూర్చుని, తల
అందంగ వాల్చిన తెలుగింటి ఆడపడుచు శిల్పం..! ఆహా..! ముందు గది దాటి విశాలమైన
హాల్లోకి అడుగు పెడుతూనే ఆ ఇంటి వైభవం కన్నా ముందు మనసు దోచుకుంటున్న శిల్పాలను
నోరు తెరిచి మరీ చూస్తుండిపోయాడు స్వర్జిత్. పూర్ణకుంభం పట్టుకుని ఉన్న తెలుగు
తల్లి, శివుని
జటాజూటంలో నుంచి జాలువారుతున్న గంగమ్మ తల్లి, శివలింగాన్ని అర్చిస్తున్న
పార్వతిదేవి, ఇంక రకరకాల భారతనాట్య భంగిమలలో రకరకాల నృత్యకన్యలు..
భాస్వతి శిల్పాలు
చూస్తుంటే కళ్ళు తిప్పబుద్ధి కాలేదతనికి. ఎంత నాజూకు పనితనమో. వాటి అమరికను బట్టి
శిల్పకళ గురించి ఏమీ తెలియనివాడు కూడ చెప్పవచ్చు, ఆ శిల్పి ఎంత ప్రతిభ కల
వ్యక్తో..! ఇంట్లో, అడుగడుగునా రకరకాల శిల్పాలు.. పూలుతీగలవి, డిజైనులు, వివిధ భంగిమలలో
చక్కని అమ్మాయిలవి.. గోడల నిండా రాతిపూలు, రాతి తీగల పంక్తులు.. కృష్ణుడి బొమ్మలకైతే
లెక్ఖ లేదు. చిన్నవి, పెద్దవి, వెన్నదొంగ రూపం, వేణుమాధవ రూపం, రాసలీల, పారాడే కన్నయ్య..
అద్భుతంగ అనిపించింది అతనికి. ముఖ్యంగ అతన్ని ఆకర్షించింది ఒక అమ్మాయి బొమ్మ..
కిటికీ దగ్గర పెట్టి ఉంది.. నిజంగ అక్కడ బయటకు చూస్తూ కూర్చుని ఉందా అన్నట్టుగ
ఉంది. చిబుకం కింద అరచేతిని పెట్టుకుని, కిటికీ మీద మోచేతిని ఆనించి ఆకాశం వంక చూస్తూ
ఉంది.
"అబ్బ.."
అన్నాడతను అప్రయత్నంగ.
భానుమూర్తి నవ్వి,
"అది
అమ్మాయి ఈ మధ్యే పూర్తి చేసింది.." అన్నాడు.
స్వర్జిత్ ఇంక ఎక్కువ
ప్రతిస్పందనలివ్వటం మర్యాద కాదు కనక, "చాలా బాగుంది.."
అన్నాడు. అప్పుడే మాధవం ఎదురుంగ లాన్ లో కనిపించాడు.
మాధవం ప్రస్తుతం ఒక
మనిషి సహాయంతో నడవగలిగే పరిస్థితిలో ఉన్నాడు.
"ఇంతకాలం కంపెనీ
గురించి చాలా చెప్పాను. ఇప్పుడు దాని వ్యవస్థాపకుడిని స్వయంగ కలిసి ఆనందిస్తావని
ఇక్కడకు తెచ్చాను." అని భానుమూర్తి అన్నాడు అతనితో.
స్వర్జిత్ అట్లగా అని
తల ఊపాడు. మాధవం కాసేపు స్వర్జిత్ తో అదీ ఇదీ మాట్లాడాడు. కొన్ని విషయాలు తనూ,
కొంత
భానుమూర్తి సమాధానాలు చెప్పారు. ఏదో తినటానికి పెట్టారు. కాసేపు గడిపి వచ్చేశారు
ఇద్దరూ.
"మాధవం చాలా డిప్రెషన్
లోకి వెళిపోతున్నాడు. ఇదివరకు ఇంత నెగెటివ్ గ మాట్లాడేవాడు కాదు. యువత అంతా తప్పు
దోవలో ఉంది అంటాడు. కాదని నిరూపించటానికి నిన్ను కలిపించాను. డబ్బు ఉండీ, జీవితంలో బాధ్యత
తెలియటానికి మాత్రమే ఉద్యోగం.. చదువు ఉండీ, హోదాలుండీ గర్వం లేని
అణుకువ..! ఇంక చూడాలి- ఇప్పుడు ఏమంటాడో.." భానుమూర్తి మాట విని స్వర్జిత్ కి
ఏదో అసమంజసం అనిపించింది. భాస్వతి లేని సమయంలో వాళ్ళ ఇంటికి తను వెళ్ళి వచ్చాడని
తెలిస్తే ఆమె ఎట్ల భావిస్తుందో స్వర్జిత్ కి తెలియలేదు. కానీ భానుమూర్తి భాస్వతి
కన్నా మాధవం గురించే ఆలోచిస్తున్నాడు.
"తప్పకుండ వాడి
ఆలోచనలో మార్పు వస్తుంది. ఏంలేదు- కోలుకోవటానికి సహాయపడుతుందేమోనని.. అంతే."
అయితే మంచిదే.
అనుకుని తల ఊపి ఊరుకున్నాడు. ఆరోజు ఇంటికి వెళుతూనే తల్లి వాయించిన వీణ కీర్తనల
వీడియో పెట్టుకుని కూర్చున్నాడు. తండ్రి అడిగాడు- "ఏం జరిగిందిరా..?"
అని.
చాలా క్లుప్తంగ
చెప్పాడు సంగతి. ఆయన ఆలోచిస్తూ, "ఎందుకైనా మంచిది.. కాస్త జాగ్రత్తగ ఉండు.
పెద్దవాళ్ళతో స్నేహాలు కత్తిమీద సాము లాంటివి. దేనికైనా దారి తీయచ్చు."
అన్నాడు.
ఎందుకో స్వర్జిత్ ఇంక
భానుమూర్తితో స్నేహం కూడ తగ్గించుకోవాలి అన్న ఆలోచనలోకి వచ్చాడు. మొదటిసారి
భాస్వతితో టెంషన్ కన్నా పెద్దదేదో చిరాకు భావన అతనికి కలిగింది.
***
"బావగారూ.. కరెంటు
వచ్చేస్తుందిలేండి.. బాధపడకండి.. అక్క సిద్ధంగ ఉంది.. మీకోసం.."
ఇప్పుడు ఇక్కడ ఎవడు
బాధపడుతున్నాడు..? అనబోయి, అతను కాస్త తేరుకుని, "సరే, కానీ నాకు కాసిని మంచినీళ్ళు కావాలి." అన్నాడు.
"ఏఁ.. ఈ మాట చెప్పంగనే
గొంతు ఎండిపోయిందా..?" అంది ఆ అమ్మాయి.
స్వర్జిత్ ఒక్కసారిగ
లేచి నిలబడ్డాడు. "ఇదిగో మీరు ఊరికే నన్ను ఆటపట్టిస్తే.." అని ఇంక
ఏమనాలో తోచక ఆగాడు మాటల కోసం వెతుక్కుంటూ. అతనికి ఎవ్వరినీ తిట్టటం కూడ రాదు.
"ఏంచేస్తారు..?
అక్కకు
చెబుతారా..?? మీ బాస్ కదా..!" మళ్ళీ నవ్వుల జల్లులు.
సరిగ్గ అప్పుడే-
"అరెరే.. అంత కంగారు పెడాతావెందుకు అబ్బాయిని..?" అని ఎవరో పెద్దాయన అన్నాడు ఆ
అమ్మాయి చెవి పట్టుకుని మెలిపెడుతూ.
"ఆగండి. ఆ అమ్మాయిని
ఏమీ అనకండి..! పాపం! చిన్నపిల్ల!" అతను తన స్వభావానికి సహజమైన జాలితో
అన్నాడు. ఆ పెద్దాయన ఆ పిల్లను వదిలి నవ్వుతూ వెళిపోయాడు.
"థాంక్యూ బావగారూ!
మీరెంత మంచి వారో!! మీలాగ అర్థం చేసుకునే భర్త నాకూ దొరకాలని
ఆశీర్వదించండి.." అని వంగి నమస్కరించి, స్వర్జిత్ ఆశ్చర్యపోతుంటే
అల్లరిగ నవ్వుకుంటూ అన్నది ఆ అమ్మాయి. అప్పుడు ఆమె వెనక దాక్కుని ఉన్న అందరు
మరదళ్ళూ కిలకిల నవ్వారు. సరిగ్గ అప్పుడే కరెంటు వచ్చి ఒకసారి క్షణం ఆగి మళ్ళీ
పోయింది.
***
"ఓ ప్రియా,
నిన్ను చూసింది మొదలు
నా మనసు మనసులో లేదు. నేను నేనుగా లేను. నాకేదో అయిందని అంతా అంటున్నారు. అది
ప్రేమేమోనని నాకు అనుమానంగ ఉంది."
"ఛఛఛ.. ఏంటిది..??
ప్రేమలేఖా..?!"
స్వర్జిత్
గొంతుకు అర్ణవ్ ఉలికిపడ్డాడు. వెనక్కు తిరిగి చూస్తే తన కుర్చీ వెనక నిలబడి తాను
కాగితం మీద వ్రాస్తున్నది చదువుతున్నాడు.
అతను వెంటనే అది
దాచేసి, "ఏయ్.. ఏం చేస్తున్నావిక్కడ..?" అన్నాడు కొంచెం తత్తరపడుతూ.
స్వర్జిత్ నవ్వి,
"అరే,
చూపించరా..
దాస్తావెందుకు..? ఎవరికి వ్రాస్తున్నావు..? కాబోయే మీ ఆవిడకా..?" అనడిగాడు.
"ష్.. పెద్దగ వాగకు..
ఇక్కడ వచ్చి కూర్చో." అని భయంగ అటూ ఇటూ చూసి, ఎవరూ లేరని నిర్ధారించుకుని,
అతనికి వేరే
కుర్చీ జరిపి ఇచ్చి, "గట్టిగ అరవకు. ఆ దయ్యం విన్నదంటే కష్టం." అని ఆగి,
ఆ కాగితం
అతనికి ఇచ్చి, "పూర్తి కావచ్చింది. ఇంక కొంచెం చివర ఫెయిర్ చేసి వ్రాయాలి. అయినా చూడులే.
ఫరవాలేదు. చిన్నగ చదువు. నా స్నేహితుడు అడిగాడు- ఒకటి వ్రాసి ఇవ్వమని. తన
ప్రియురాలికి ఇవ్వాలిట.." అని చెప్పాడు మెల్లగ.
స్వర్జిత్ అది కొంత
భాగం చదివి, ఆ కాగితాన్ని మడిచి పక్కన పెట్టాడు అనాసక్తంగ. దాన్ని పూర్తిగ చూడనుకూడ
చూడకుండ స్వర్జిత్ పక్కన పెట్టేసరికి, అర్ణవ్ హతాశుడైనట్టు చూసి, "నేనెంత కష్టపడి
రాత్రంతా కూర్చుని ఎన్ని కాగితాలు చింపి పోగులు పెట్టాక ఈ ఫెయిర్ కాపీ తయారు
చేయగలుగుతున్నానో తెలుసా..? ఎంత శృంగారరసం పిండి ఈ కావ్యాన్ని వ్రాశానో తెలుసా..?"
అన్నాడు.
"ఎన్ని కాగితాలు
చింపితే ఏం లాభం..? ఏ పిల్ల చేతికి ఇచ్చినా ఇదీ చించేసి ఇచ్చినవాడి మొహాన కొడుతుంది. వీలైతే
దీని అద్దు వాడి చెంపమీద దింపచ్చు కూడ..! పైగా శృంగార రసంటా, కావ్యంటా.. హుఁ..
ఆమెలో రూపుదాల్చబోయే రౌద్రరసానికి నాందిగా ఉందిది."
అది విని అర్ణవ్ కి
సహజంగనే కోపం వచ్చింది- "పెద్ద పోటిగాడిలాగ చెబుతున్నావు..? నా ప్రతిభను వంక
పెట్టావు బానే ఉంది. మరి దీనికన్నా గొప్పగ వ్రాయగలవని నిరూపించుకోగలవా..?"
అన్నాడు.
"పోరా, పని చూసుకో. కాలేజ్
లో ఇటువంటి ప్రేమలేఖలు మా స్నేహితులకు ఇన్ని వ్రాసి ఇచ్చాను." అని
తలవెంట్రుకలను చూపించి, "వారిలో ఒక్కరి ప్రేమ కూడ ఫెయిలవ్వలేదు. కావాలంటే పాత
వాటి ఫోటోకాపీలు తెచ్చి చూపిస్తా." అన్నాడు స్వర్జిత్.
ఇంక అర్ణవ్
రెచ్చిపోయాడు. సవాల్ చేసే మూడ్ లోకి వచ్చేశాడు. "సరేరా.. చూద్దాం. అయితే
మావాడిది చాలా జటిలమైన ప్రేమ కేసు. నువ్వే వ్రాయి ఓ లేఖ. అది చదివి అతని సమస్య
తీరాలి. ఆ అమ్మాయి ఇంక అతనితో ఏడడుగులు నడిచి ఏడుజన్మలు తోడు రావాలి.."
అన్నాడు.
"పోరా.. నీ మొహానికి
సవాల్ ఒకటి..!! నువ్వు వ్రాసింది చాల్లే. ఇచ్చేసి పని చూసుకోమను. అంతకు పనికాకపోతే
రేపు ఆ ఫోటోకాపీలలోంచి ఒకటి తెచ్చి ఇస్తాను." అని స్వర్జిత్ సీటుకు
వెళ్ళబోయాడు.
"ఇదిగో, ఇంకా లంచ్ పూర్తి
కాలేదు. పనివేళకు వ్యవధి ఉంది. ముందుగ వెళితే ఆవిడగారు అక్కడే భస్మాసురీ
అయిపోతుందివాళ. పనివేళా చావుకు ముహుర్తం పెట్టుకునేవు.. జాగ్రత్త."
స్వర్జిత్ చేతి వాచ్
చూసుకున్నాడు. ఇంకా అరగంట వ్యవధి ఉంది. సరేనని అర్ణవ్ ఇచ్చిన పెన్, పేపర్ పట్టుకుని
స్వర్జిత్ అడిగాడు- "ఆ అమ్మాయి ఎట్ల ఉంటుంది.. ఏం చేస్తుంది?" అని.
అర్ణవ్ తల అడ్డంగ ఊపి,
"ఏమో మరి,
నేను చూడలేదు..
కానీ మంచి కవయిత్రి..ట." అన్నాడు.
సరే, ఫరవాలేదు, ఇంకా మంచిది అని
స్వర్జిత్ గబగబా ఏదో వ్రాసి ఇచ్చాడు.
అర్ణవ్ అది చదివి,
అప్రతిభుడై,
వెలిగిపోతున్న
కళ్ళతో, "అద్భుతంగ ఉంది.." అన్నాడు అప్రయత్నంగ. "ఎట్ల వ్రాశావురా..?
వ్రాయటం
అలవాటైపోయి ఏదైనా అవసరం పడుతుందని ఒకటి నోటికి నేర్చేసుకున్నావనుకుంటాను."
"ఇప్పుడు, ఇక్కడ నీ ఎదురుంగ
కూర్చుని వ్రాశాను. నమ్మితే నమ్ము. లేకపోతే పో."
"కాదు, నువ్వు ఎవరినో కాలేజి
రోజుల్లో ప్రేమించి ఉంటావు. వాళ్ళ కోసం వ్రాసి ఉంటావు. ప్రేమంటే ఏంటో అనుభవం
లేకుండ, ఒక్క
తప్పైనా, కొట్టివేతైనా
లేకుండ, ఇంత
తొందరగ ఇంత అద్భుతమైన లేఖ వ్రాయటం అసంభవం."
"చూడు- అడిగావని
వ్రాసి ఇచ్చాను. బాగుంది అన్నావు. చాలు. మిగిలినవన్నీ అనవసరపు మాటలు. కానీ అభాండం
వేశావు కనక చెప్తున్నాను. మా నాన్నగారి సాక్షిగ ఇంతవరకూ నేను ఏ అమ్మాయినీ ఆ
దృష్టితో చూడలేదు. చాలా..?" సీరియస్ గ అన్నాడు స్వర్జిత్.
"అరే.. ఊరికే
అన్నానురా. ఎందుకంత సీరియస్ అవుతావు..? వదిలేయి రాదా..! ఇంత బాగా వ్రాయగలవని
నేననుకోలేదు. అందుకే డౌట్ వచ్చింది."
"ఇంత బాగ వ్రాయగలిగాను
కాబట్టే నాకే ప్రేమలూ ఎవరి మీదా లేవని నీకు అర్థం కావాల్సింది. ఎందుకంటే మనకోసం
మనం ప్రేమలేఖ వ్రాసుకునేటప్పుడు మన భావాలు అడ్డం వస్తాయి. అందుకే ఏ మాటా కుదరనట్టు
అనిపిస్తుంది. అదే వేరే వాళ్ళ కోసం వ్రాసేటప్పుడు మనకు ఉద్వేగం ఉండదు. మనం ఒక బయటి
వ్యక్తిగ ప్రేమను చూస్తాము. అందుకే మనస్సు భావాల జంజాటన లేకుండ హాయిగ ఉంటుంది.
మాటలు నిరాఘాతంగ సాగిపోతాయి. అది రహస్యం. అర్థమైందా..?"
"ఓహో.. సరే- అయితే
ఇప్పుడే ఇక్కడే వ్రాశావని, నీకు ఏ ప్రేమా లేదనీ ఒప్పుకుంటున్నాను. చాలా..?"
అంటూ అర్ణవ్
దాన్ని మడిచి కవర్ లో పెట్టుకుని బాగ్ లో వేసుకున్నాడు.
"హలో, ఇంక అది ఇటివ్వు.
అసలు నేను మనిషిని చూడనిది లేఖ వ్రాయను తెల్సా..?. వాళ్ళ స్థాయిని బట్టి వ్రాసి
ఇస్తాను. అతన్ని వచ్చి ఒకసారి కలవమను.. ఇంకొకటి వ్రాసి ఇస్తాను."
"అరే, అద్భుతంగ వ్రాశావని
చెప్తున్నా కదా. వాడు నాకు తెలుసుగా. ఇది ఆమెకు కూడ సరిగ్గ సరిపోతుంది. నిజానికి ఏ
అమ్మాయి అయినా పడిపోతుంది ఇది చూసి. వాడి సమస్య తీరుతుంది- కాదనకురా.
ప్లీజ్.."
"కనీసం ఒక ప్రేమలేఖ
వ్రాయటం కూడ చేతకానివాడిని ప్రేమించటం వృథా అని ఆ అమ్మాయికి సలహా
ఇవ్వాలనిపిస్తోంది. సర్లే. ఒక ఫోటోకాపీ తీయించి ఇస్తాను. తే." అని అది
ఇవ్వమన్నాడు.
"ఫోటోకాపీ ఎందుకు..?
వాడి
చేవ్రాలులో దీని కాపీ చేసుకుని ఇమ్మని చెప్పి, నీకు ఇదే తిరిగి
ఇచ్చేస్తా.." అర్ణవ్ చెప్పాడు. సరే, లంచ్ వేళ పూర్తి కావటంతో ఇద్దరు సీట్లకు
వెళ్ళారు. అన్నట్టే ఆ మరునాడు అర్ణవ్ అతనికి తన కాగితం తిరిగి ఇచ్చేశాడు.
సరిగ్గ ఆ మరునాడు
ఆఫీసులో ఇంస్పెక్షను, ఆ తర్వాత ఆడిటింగ్ ఉండేసరికి స్వర్జిత్ ఆ పనులలో బిజీ అయిపోయాడు. తర్వాత
కోసం ముందుగానే మూడు రోజులు శెలవు పెట్టాడు. ఆ మరునాడు స్వర్జిత్ తండ్రి ఎప్పటి
నుంచో అడుగుతున్న తిరుపతి యాత్ర కోసమని వెళిపోయాడు.
***
"హమ్మయ్య..." అన్న
అరుపుతో పాటు కరెంటు వచ్చిన తాలూకు లైట్లు వెలిగి ఫాన్లూ తిరిగేసరికి స్వర్జిత్
బలవంతంగ వర్తమానంలోకి ఎవరో తోసినట్టు పడ్డాడు.
"బావగారూ.."
అబ్బా..!! మళ్ళీ
తయారైందే ఈ మరదలు సైతాన్..! తెగ సిగ్గు పడిపోతోంది.
"ఏంటమ్మా..?"
లేని ఓర్పు
తెచ్చుకుని అడిగాడు.
"అక్క ఇంక కొన్ని
క్షణాలలో రాబోతోందంట.. ఆమ్మ చెప్పమంది.." తలుపు దగ్గర గోడ మీద గోళ్ళతో
ముగ్గులేస్తూ అన్నది ఆ అమ్మాయి.
అంతలో- "ఒసేవ్..
కరెంటు పోయినందువల్ల ముహుర్తం మళ్ళీ సరిచూస్తున్నారని చెప్పాం కదా..! ఎందుకు ఆయనకు
తప్పుడు సమాచారం ఇస్తావే..?" అని ఒక పెద్దావిడ వచ్చి ఆ అమ్మాయి చెవులు పిండింది. ఆ
అమ్మాయి నెప్పి నటించి కిలకిల నవ్వింది. మిలిగిన మరదళ్ళు దగ్గరలోనే ఉండిఉంటారు కదా
మరి లెక్క ప్రకారం- వాళ్ళూ నవ్వుల్లో శ్రుతి కలిపారు. "నేను చెప్పలే.. ఇది
పట్టుబడుతుందని..!!" అనుకుని చప్పట్లు చరుచుకున్నారు.
ఈసారి స్వర్జిత్ కూడ వాళ్లతో
పాటు నవ్వాడు. అంతా ఠక్కున నవ్వులు ఆపి విచిత్రంగ చూశారు. తర్వాత బెదురుకున్నట్టు
వెళిపోయారు అక్కడి నుంచి.
***
"నేను నిన్ను
ప్రేమిస్తున్నాను.." ప్యూను అన్నాడు.
"వాట్..?"
స్వర్జిత్
అరిచాడు ఒక్కసారిగ.
"అపార్థం చేసుకోకండి.
ఇది మీరు ఈ కాగితం మీద వ్రాయాల్సిన వాక్యం. అంటే ఏదైనా వ్రాయచ్చు..! తెలుగులో
వ్రాస్తే చాలు.. అది నేను చెప్పిన సొంత వాక్యంలేండి.." సిగ్గు పడ్డాడు
ప్యూను.
"దేనికి..?"
"ఏమో- మేడమ్ గారు
వ్రాయమన్నారు.."
స్వర్జిత్ అర్ణవ్ వంక
చూసి, "ఏంటిది?" అని అడిగాడు. "ఏమో- మొన్న నువ్వు లేనప్పుడు అందరి చేత తెలుగులో ఏదో
ఒకటి వ్రాయించి తెమ్మని పంపారట. అందరి దగ్గరా సాంపిల్ గ వాక్యాలు
వ్రాయించుకున్నారు." చెప్పాడతను. "రైటింగ్ బాగుంటే ఏదైనా తెలుగుమహాసభల
పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు వ్రాయిస్తారేమో మరి..! లేకపోతే అసలు మన ఆఫీసులో
ఎవడికైనా తప్పులు తడికెలు లేకుండ తెలుగు వ్రాయటం వచ్చో రాదోనని పరీక్ష పెట్టి
బహుమతులు ఇవ్వాలనిపించిందేమో మహాతల్లికి."
సరేనని స్వర్జిత్
మేడమ్ చూస్తుంది కదా అని- నేను నిన్ను ప్రేమిస్తున్నాను..- అని వ్రాయటం బాగుండదు
కనక మంచి వాక్యం ఏదైనా వ్రాయాలి కదా అని ఆలోచించాడు. వెంటనే అతనికి స్కల్ప్టర్ పత్రిక
గుర్తకు వచ్చింది.
"ఏనాడు ఏ శిల్పి,
కన్నాడో ఈ
కలలు..! ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళలు..!" అని వ్రాసి ఇచ్చాడు. అర్ణవ్ అది
చూసి, "అబ్బో.. పాటపంక్తులా..? గుడ్ గుడ్..! మంచి టేస్టు.." అన్నాడు.
నువ్వేం వ్రాశావురా
అంటే అర్ణవ్- "ఆఁ.. ఏం ఉంది..? భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు అని
వ్రాశానురా.." అన్నాడు.
స్వర్జిత్ తో పాటు
ప్యూను కూడ నవ్వేసి ఆ కాగితం తీసుకుని వెళిపోయాడు.
"అన్నట్టు, మీ స్నేహితుడి ప్రేమ
ఘట్టం ఏమైందిరా..?" అడిగాడతను.
"ఏమోరా.. ఇంకా ఫలితం
తెలియలేదు. నేను అదే ఎదురు చూస్తున్నాను. ఇవాళ తేలుతుందని చెప్పాడు. ఇక ఏ
క్షణంలోనైనా తెలియచ్చు." అన్నాడు అర్ణవ్.
సరిగ్గ ఐదు
నిముషాల్లో అతనికి పిలుపు వచ్చింది. సరేనని భాస్వతి కాబిన్ కి వెళ్ళాడతను.
అతను అంతకు క్రితం
వ్రాసి పంపిన కాగితం చూపించి, "ఇది మీరు వ్రాసిందేనా..?" అడిగింది నిత్యభద్రకాళి
స్వరూపిణి అయిన ఆ అధికారిణీమతల్లి మొట్టమొదటిసారి శాంతంగ.
ఔను అన్నట్టు తల
ఊపాడతను.
"రేపు ఉదయం మీరు ఏం
చేస్తున్నారు..?"
అతను చాలా
ఆశ్చర్యపోతూనే, "ప్రత్యేకించి ఏం లేదు. ఆదివారం శెలవు కదా.. ఇంటిదగ్గర అందరికీ తిరుపతి
ప్రసాదం పంచాలి. వేరే ఏం లేదు.." అన్నాడు.
"మరి నాకేది..
తేలేదా..?" అంది సీరియస్ గ.
"అంటే.. అది.. ఆఫీసులో
ఇటువంటివన్నీ.. చెప్పారు కదా.. వద్దని.." అంటూ నసిగాడు.
"పోనీ లేండి.. దర్శనం
బాగ జరిగిందా..?"
"ఊఁ.."
"అయితే.. మీ కులదైవం
వేంకటేశ్వర స్వామి అని చెప్పారు కదా. ఆయనకు బాగా దండం పెట్టుకుని ఒకసారి మా ఇంటికి
రండి."
స్వర్జిత్
అదిరిపడ్డాడు. "మ్..మీ ఇంటికా.. దేనికి..?" అతనికి నోట మాట రాలేదు.
ఇంటికి రావాలా, అదీ దేవుడికి దండం పెట్టుకునా..?
"తెలుస్తుంది. వస్తే
అన్నీ తెలుస్తాయి.."
"అంటే.. ఇల్లు..
అంటే.."
"ఎక్కడో గుర్తుంది
కదా..! లేదంటే భానుమూర్తిగారిని తోడు రమ్మందామా..?"
ఠక్కున తగిలింది
అతనికి ఆమాట. "లేదు.. గుర్తుంది.." అన్నాడు తల వంచుకుని.
"మీరు కాక- మీ ఇంట్లో
ఉండేది.. మీ నాన్నగారు కదా.."
"ఔనండి.. దేనికి..?"
"అయితే రేపు వీలుగ
ఉంటే ఆయనను కూడ తీసుకు రండి."
అంతే. ఆ మాటకు
స్వర్జిత్ ఒక్కసారిగ బిగుసుకుపోయాడు. ఇదేంటి..? ఏమైంది ఈమెకు..??
"నాన్నగారెందుకు..?"
అంత కంగారులో
కూడ ఎంత జాగ్రత్తగ ఉన్నా నోరు జారింది మాట.
"అధికారి మీరా నేనా..?"
అడిగిందామె.
"మీరే అధికారి. కానీ
నాకు మాత్రమే. మా నాన్నగారికి కాదు కదా.." ఠక్కున అన్నాడు.
అపర భద్రకాళిలా
చూసిందామె. నాకే ఎదురు చెబుతావా అన్నట్టు. కోపంలోనే అంది- "మీకు ఇది అధికారిగ
నా ఆదేశం. కానీ మీ నాన్నగారికి మీ అధికారిగ విన్నపం అని చెప్పండి.. కావాలంటే ఫోను
చేసి నన్నే ఆహ్వానించమంటే అదే చేస్తా..."
ఒక్క క్షణం ఆలోచించి,
"అదేం
వద్దు. నేనే తీసుకువస్తా"నన్నాడతను.
ఆమె మళ్ళీ
ఆలోచించుకుని, "సరే, ఫరవాలేదులే. మీరు ఒక్కరే రండి." అని, ఇంక వెళ్ళచ్చు అన్నట్టు
చూసింది. అతను బయటకు రాబోతుంటే, "ఈ విషయం మన మధ్యే ఉంటే మంచిది." అంది.
సరేనని, అసలేమీ అర్థంకాని
అతను బయటకు వచ్చాడు. సీట్ లోకి వెళుతూనే, అర్ణవ్ "ఏం జరిగింది..? ఇది తిట్లు తిన్న
మొహంలా కానీ, ప్రశంసలు మెక్కిన మొహంలా కానీ లేదే.." అని అడిగాడు.
స్వర్జిత్ ఆలోచనను
కట్టిపెట్టి, "ఏం జరగలేదు. ఆ ముంబై ప్రాజెక్ట్ రిపోర్టు ఏమైంది..? అని అడిగింది నేను
చేస్తున్నాననుకుని. అర్ణవ్ చూస్తున్నాడు కదా..! అన్నాను."
"అమ్మో.. అది రేపే
ఇవ్వాలి..!! ఛంపింది.." అని ఠక్కున అర్ణవ్ పనిలో పడ్డాడు. నిన్ను ఎక్కడ
కోయాలో నాకు తెలుసురా అనుకున్నాడు మనసులో.
కానీ అతనే అప్పటికే
తనను కోసి ఉంచాడని స్వర్జిత్ గుర్తించలేకపోయాడు.
***
"ఏ దివిలో విరిసిన
పారిజాతమో.."
స్వర్జిత్ విసుగ్గ ఆ
పాట రింగ్ ట్యూన్ గ ఉన్న తన సెల్ ఫోను మోగుతుంటే దాని వంక ఎవరా చూశాడు. అర్ణవ్..!!
"ఒరే.. నిన్ను.. ఏం
చేస్తానో చూడు.." అనుకుంటూ ఫోను ఎత్తాడు. ఎంతో సహనం పాటించి ఓర్పు పట్టి
మాట్లాడాడు. అర్ణవ్ అతన్ని కలవాలనుకుంటున్నాడట. "ఇప్పుడు రావచ్చా?"
అని అడిగాడు.
అతనితో మాట్లాడాలని
కానీ, అతన్ని
కలవాలని కానీ లేకపోయినా స్నేహం చేశాను కదా..- అనే ఒక్క మాట కోసం అతన్ని
రమ్మన్నాడు. పెళ్ళికి రాలేకపోయాడట. ఇవాళే ఊరి నుంచి వచ్చాడట. వస్తూనే కార్డు
చూసుకుని ఈ ఊరికి బయలుదేరి వచ్చాడట. బస్సు దిగి ఫోను చేశాడు- పెద్ద..! రావద్దంటే
తిరిగి వెళిపోయేవాడిలాగే..! కలవాలట. నేరుగ పెళ్ళి ఇంటికే రమ్మని, మనిషిని పంపుతానని
చెప్పి పెట్టేశాడు. ఆ విషయం మామగారికి కబురు పంపించి, అర్ణవ్ ని ఏం చేస్తే
బాగుంటుందా అని ఆలోచించసాగాడు.
No comments:
Post a Comment