Friday, 11 November 2016

1. ఒక ప్రతీకారం, ఒక ప్రాయశ్చిత్తం-2



2

          "సార్, మిమ్మల్ని మేడమ్ పిలుస్తున్నారు." అని వినిపించింది. చూస్తే ప్యూన్ పుల్లయ్య.
          సిద్ధాంత్ పనిలోంచి తేరుకుని, చూశాడు. "వెంటనే రమ్మన్నారు.." చెప్పి వెళ్ళాడు పుల్లయ్య.
          సరేనని ఆలోచిస్తూనే వర్కర్లతో సాగిస్తున్న టేబుల్ డిజైన్ చేసినంత వరకు ఆపి, 'మళ్ళీ ఏం గొడవో..' అనుకుంటూ లేచి డ్రెస్ కాస్త సరి చేసుకుని వెళ్ళాడు, సిద్ధాంత్. ఆమె కాబిన్ తలుపు కొడుతూనే, "రావోయ్..." అని పిలించిందామె. లోపలకు వెళ్ళాడు. అప్పటికే ప్రార్థిత్ అక్కడ ఉన్నాడు. కూర్చోమనే మర్యాద ఆమెకు లేదు కనక చెప్పిందాక కూర్చోలేక నిల్చున్నాడు.
          అధికారిణి, ప్రార్థిత్ వంక చూస్తూ, "ఇప్పుడే ఒక ఆర్డర్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి ఎగేజ్ మెంట్ అంటా. ఈవెంట్ ప్లానర్స్ కావాలన్నారు. ఈ సాయింత్రమే పార్టీ అట. మన దగ్గర కొన్ని గంటలే టైం ఉంది. వాళ్ళు నిన్నే పంపించమని..." అని ఇంకేదో చెప్పబోతోంది. అప్పుడే తలుపు తోసుకుని నేరుగ లోపలకు వచ్చేసి పక్కనే ప్రత్యక్షమైంది నిషితా.. "హాయ్ ఆంటీ.." అంటూ.
          సిద్ధాంత్ కి ఒళ్ళు మండింది. ఒకటేమో తలుపు కొట్టకుండ లోపలకు వచ్చింది. ఇంకొకటేమో ఆఫీస్ లో అధికారిణిని కొలీగ్స్ ఎదుటే ఆంటీ అని పిలుస్తోంది. పైగా లోపల అధికారిణి వారితో మాట్లాడుతోందని చూసి కూడా మధ్యలో జొరబడింది. అదీ గాక మధ్యలో మాట్లాడటం..! దానికి తోడు అధికారిణి కూడా అంతే ఆనందంగ ఆమెను ఆదరించటం..
          "రా నిషా.. నిలబడ్డావేఁ..? కూర్చో.." అని కుర్చీ చూపించటంతో ప్రార్థిత్ ని తన నల్ల కళ్ళద్దాల లోంచి చూస్తూ, దర్జా చూపుకుంటూ కుర్చీలో కూర్చుని, "థాంక్స్ ఆంటీ.." అని తర్వాత ప్రార్థిత్ ని, సిద్ధాంత్ ని అప్పుడే చూస్తున్న దానిలా "హాయ్.." అంది.
          తర్వాత వారితో సంబంధం లేనట్టే ఇద్దరూ అంతకు ముందు ఆమె వెళ్ళి వచ్చిన వెంచర్ గురించి మాట్లాడుకోసాగారు.
          సిద్ధాంత్ కి చాలా అవమానం వేసింది. ప్రార్థిత్ వంక చూశాడు. అతనేమీ చీమ కుట్టినట్టైనా లేకుండ నిలబడ్డాడు. ఒకటేమో అతనూ నిషితా ఒకే కేడర్ వాళ్ళు. పైగా ప్రార్థిత్ తనకన్నా కూడా సీనియర్. అయినా తమను కూర్చోమనకుండా ఇద్దరికీ జూనియర్ అయిన నిషితాని కూర్చోమంది. పోనీ, ఇప్పటికైనా తమను కూర్చోమనటం లేదు. పైగా తమతో సంబంధం లేని ముచ్చట్లన్నీ అక్కడే, అప్పుడే ముఖ్యమైనవైనట్టు పెట్టుకుంటున్నారిద్దరు. ప్రార్థిత్ తన వద్ద ఉన్న నోట్ బుక్ కంప్యూటర్ చేతిలో పట్టుకుని ఏవో డిజైన్స్ వేసుకుంటున్నాడు. సిద్ధాంత్ వాటిని చూస్తూ నిల్చున్నాడు. మధ్య మధ్య నిషితా వంక చూస్తున్నాడు, ఆమె అధికారిణితో మాట్లాడుతుంటే.
          నిషితా చాలా ఆధునికంగ ఉంటుంది. ఢిల్లీలోనే పుట్టి పెరిగింది. వారూ తెలుగువారే అంటే నమ్మబుద్ధి కాదు. అక్కడి అమ్మాయిలలాగే హిందీ యాసలో తెలుగు మాట్లాడుతుంది. ఉండటం కూడా ఎర్రగా అచ్చం హిందీ వాళ్ళ అమ్మాయిలాగే ఉంటుంది. మాడలింగ్ చేస్తే బాగా క్లిక్ అయి ఉండేది. బాగా చదువుకుంది. మంచి ఇంగ్లీష్ వచ్చు. ఎప్పుడూ లేటెస్ట్ ఫ్యాషన్ లో ఉన్న ఆర్టిఫిషియల్ జెవెలరీ పెట్టుకుంటుంది. పొడుగు పొడుగు చెవుల రింగులు, లావు లావు గాజులు, పెద్ద పెద్ద క్లిప్పులు.. మంచి పొడగరి. సాధారణంగ అంత ఎత్తు ఉంటే అమ్మాయిలలో బాగుండరు. కానీ ఎప్పుడూ లాంగ్ స్కర్ట్స్ వేసుకుంటుంది కనక ఆమె ఆ పొడుగుతో కూడా ఎందుకో చాలా బాగుంటుంది..! భుజాలదాకా ఉన్న జుట్టు ఎప్పుడూ విరబోసుకుని క్లిప్ పెట్టి వదిలేస్తుంది. గాలిలో తేలిపోతున్నదానిలా నడుస్తుంటే ఆ జుట్టు భలే ఎగురుతూ ఉంటుంది.. చాలా పెద్ద పెద్ద చిలిపితనం నిండిన కళ్ళు. వాటిలో ఎప్పుడూ కదలాడే కుతూహలం, మాట్లాడేటప్పుడు తెలిసో తెలియకో ఇంకా పెద్దవిగా చేసేస్తుంది. ఆమె దర్పం సూచించే నిటారు ముక్కు, చిరునవ్వుతో ఉండే సన్నని పెదవులు, నవ్వినప్పుడల్లా తళుకుమనే అందమైన మంచి పలువరుస.. ఆమెకు అవసరానికన్నా ఎక్కువ ఆకర్షణను కలిగిస్తాయి. ఉత్సాహం నిండిన గుండ్రని ముఖం, ఆశ్చర్యం నిండిన చూపులు, వాటిలో ఏదో కొంటెతనం.. ఏమీ తెలియకపోయినా నాకు అంతా తెలుసుననుకునే స్వాతిశయం, సాక్షాత్తు అధికారిణే నా చేతిలో ఉంటే నాకేంటి అని ఎగిరేసుకు తిరిగే పద్ధతి..! అది పొగరు కాదు, అహంకారం కాదు, అమాయకత్వం అనిపిస్తుంది సిద్ధాంత్ కి. ఎందుకంటే ఆమె కదలికలలో ఎక్కడా అసహ్యం అనిపించే గుణం ఉండదు. ఆ ఆధారంలేని అహంకారం పోతే కానీ ఆమెకు అసలు ఆత్మవిశ్వాసం అంటే ఏంటో తెలిసిరాదు. ఆమెలో అంతర్లీనంగ ఉన్న పసితనాన్ని చూడాలంటే యౌవనపు పొంగు అనే బెలూన్ ని వాస్తవమనే పుల్లతో గుచ్చాలి.. అంతే. ఆమెలో అంతరాంతరాలలో దాగి ఉన్న స్వచ్ఛత్వం ఆ దర్పపు పైపొరలను చీల్చేసి బయటకు రాగలదు. స్వతహాగా మంచిపిల్లే కానీ తెలియని ఒక దర్పం ఆమెను ఆవహించి ఉన్నందువల్ల అట్ల ప్రవర్తిస్తుంది.
          అంతలో అధికారిణి, "నిషా, నువ్వు ఇప్పుడు ఫ్రీగ ఉన్నావా..?" అని అడిగింది.
          నిషితా "యస్.. చెప్పడాంటీ.." అంది.
          "ఏం లేదు.." అని అంతకు మందు తమతో చెప్పిన ఈవెంట్ విషయం ఆమెతో చెప్పి, "మనకు చాలా పాత కస్టమర్స్ వాళ్ళు. నువ్వే వెళ్ళి ఎట్లైనా అక్కడ మంచి ఏర్పాట్లు చేసి వారిని మెప్పించి రావాలి. నీతో పాటు ప్లాన్స్ ఎక్జిక్యూట్ చేయటానికి సిద్ధాంత్ వస్తాడు. వెళతావా..?" అంది.
          సిద్ధాంత్ కి పిచ్చి కోపం వచ్చింది. "ఇందాక ప్రార్థూని రమ్మని చెప్పారని తననే పంపుతానన్నారు.." అన్నాడు ఊరుకోలేక. ప్రార్థిత్ ‘ఎందుకురా బాబూ గొడవ?’ అన్నట్టు చూశాడు.
          "లేదు.. అమ్మాయి ఎంగేజ్ మెంట్ కనక నిషానే మంచిది. నాకెవరిని పంపాలో, ఎవరిని పంపద్దో బాగా తెలుసు." అని ఆమె నిషితా వంక చూసి, "ఏంటి, వెళతావా..?" అంది.
          "ఎందుకు వెళ్ళనాంటీ.. మీరు పంపుతుంటే..?" అని సంతోషంగ మూతి తిప్పింది నిషితా. "కానీ పాపం, ప్రార్థిత్ ఏమైనా ఈ వెంచర్ తనకు కావాలనుకున్నాడేమో..!" అంది అతనిని ఓర కంట చూస్తూ.
          ప్రార్థిత్ వెంటనే, "అదేం లేదు.. ప్లీజ్ కారీ ఆన్.. మేడమ్, ఇంక నేను వెళ్ళచ్చా..?" అని అడిగాడు.
          "ఒక్క నిముషం,.." అని అధికారిణి నిషితాతో, "నిషా, నీకేమైనా ప్రార్థిత్ ఎసిస్టెంస్ కావాలా?" అని అడిగింది.   
          సిద్ధాంత్ ఆ ప్రశ్న విని నివ్వెరపోయాడు. నిషితా ఎంత ఆనందించి ఉంటుందో! ఇంతకన్నా అవమానకరమైంది ఇంకేదైనా ఉంటుందా..? ప్రార్థిత్ తన జూనియర్ ని తనే ఎసిస్ట్ చేయాల్సి రావటం..!!
          "లేదు, అంతగా ప్రార్థిత్ కావాలనుకుంటే నా వెంట వచ్చినా నాకేం అభ్యంతరం లేదు. తనకే ఏదైనా మార్గదర్శనం కావాలేమో.."
          సిద్ధాంత్ కసిక్కున చూశాడు ఆ అమ్మాయి వంక. నెత్తి పగలగొట్టేవాడు లేక..! దీని అర్ధఛటాకు గైడెంస్ కావాల్సినంత దీనస్థితిలో ఉన్నాడనా ప్రార్థిత్..? దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు కదా అని కొమ్ములు తిప్పేయటమే!! 'వస్తాడే.. ఒక రోజు నీ కోరలు పీకే మొనగాడు రాకపోడు.. ఎంత ఎగురుతావో ఎగురు..' మనసులో కసితీరా తిట్టుకున్నాడు ఆమెను. ప్రార్థిత్ మాత్రం ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడు.
          అధికారిణి ప్రార్థిత్ వంక చూసింది, వెళతావా అన్నట్టు. ప్రార్థిత్ తల సరేనన్నట్టు ఊపి, "అంత అమూల్యమైన మార్గదర్శనం తప్పక శిరోధార్యం." అన్నాడు.
          సిద్ధాంత్ అయోమయంగ చూశాడు ప్రార్థిత్ ని. నిషితా ముఖం ఒక్క వెలుగు వెలిగింది. ముగ్గురినీ వెళ్ళమన్నట్టు చూసింది అధికారిణి.
          బయటకు వచ్చాక నిషితా వాళ్ళతో, "నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను. పది నిముషాల్లో బయల్దేరదాం.." అని చెప్పి తన బాగ్ లో మేకప్ కిట్ తీసుకుని వాష్ రూమ్ వైపు వెళ్ళింది.
          సిద్ధాంత్ ప్రార్థిత్ ని చూసి, "ఇదేంట్రా, ఆమెకు అసిస్టెంట్ గా వెళతానంటున్నావు..? నీకేమైనా పిచ్చా..?" అన్నాడు.
          ప్రార్థిత్ నవ్వి, "అదేం లేదురా.. ఆఫీసులో ఉత్తగ కూర్చోవటం కంటే ఏదో ఒకటి చేయటం మంచిది కదా. తన పని తను చేస్తుంది. నేనేమో, 'నేనైతే ఆ ఏర్పాటు ఎట్ల చేసేవాడినా?' అని స్టడీ చేసుకుంటాను. అందుకైనా వెళ్ళచ్చు కదా. పైగా ఆ పార్టీవాళ్ళు మంచి కాష్ పార్టీ. విరివిదనం బాగా ఉంటుంది." అన్నాడు.
          సిద్ధాంత్ నిట్టూర్చి, నవ్వి ఊరుకున్నాడు. అంతలోకి నిషితా సెల్ ఫోన్ మాట్లాడుతూ వచ్చి, "అయ్యో, కుదరదా..? సరే, ఫరవాలేదు. వాళ్ళు డ్రాప్ అవుతారులే." అని చెప్పి ఫోన్ పెట్టేసి, "సారీ ఫ్రెండ్స్, అక్కడకు నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి ఉంటుందిట. జెంట్స్ నాట్ అలౌడ్ అట..!" అంది నవ్వి.
          సిద్ధాంత్ ప్రార్థిత్ వంక చూశాడు. ప్రార్థిత్ చాలా బాధగ ముఖం పెట్టి నిషితాతో, "అయ్యో, మీ దగ్గర గైడెంస్ పొందే సువర్ణ అవకాశం పోయిందే..! అయినా ఫరవాలేదు. వచ్చేసారి తప్పక మీ వెంట తీసుకువెళ్ళాలి.." అన్నాడు.
          నిషితా చాలా సంతోషంగ నవ్వి, సెల్ బాగ్ లో పడేసుకుని, "రైట్.. ఉంటాను. మళ్ళీ కలుద్దాం.. బై.." అనేసి గబగబా వెళిపోయింది.
          సిద్ధాంత్ కి చాలా కోపం వచ్చింది. "ఏంటిరా ఇది, ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ కి మగవాళ్ళు ఉండరా..? ఇదేమైనా మహిళల ఫంక్షనా..? మనలను బొమ్మలనుకుంటోందా..?" అన్నాడు.
          "వదిలేయరా.. అదొక వంక అని అర్థమైంది కదా. ఇదే జరుగుతుందని నాకు తెలుసు. అందుకే అధికారిణి దగ్గర తొందర పడకుండ, స్పోర్టివ్ స్పిరిట్ లేదనిపించుకోకుండ జాగ్రత్త పడ్డాను.." అన్నాడు.
          "పైకొస్తావ్.." అనుకుంటూ వాచ్ చూసుకుని, "అరగంట టైం వృథాగ పోయింది.. ఛ" అనుకుని వెళ్ళబోయాడు.
          "ఇప్పుడు ఆ అరగంట వృథా అయిందని మరో గంట బాధతో పోగొట్టుకోకు.." అని నవ్వాడు ప్రార్థిత్. సిద్ధాంత్ నవ్వి సరేనని వెళిపోయాడు.

No comments:

Post a Comment