9
సరిగ్గ ఈ సంఘటన జరిగిన వారం రోజులకు
ఉదయానే సిద్ధాంత్ ప్రాక్తనను పిలిచి, "ఈరోజు మన ఇంటికి అతిథులు భోజనాలకు
వస్తారు. పద, ఏర్పాట్లు చూద్దాం." అన్నాడు.
"సరే, నేను ఏర్పాట్లు చూస్తాను. మీ
అవసరం పడితే పిలుస్తాను." అని లోపలకు వెళ్ళింది ప్రాక్తన.
అంతలోకి సిద్ధాంత్ ఫోన్ మోగింది. ప్రార్థిత్
నెంబర్, ఫోటో డిస్ప్లే లో కనిపించంగనే నవ్వుకున్నాడతను.
"నీకు చచ్చింతర్వాత బొంద ఫలానా స్థలంలోనే
కావాలని కలలేమైనా ఉన్నాయా..?" అడిగాడతను మొదటి ప్రశ్న.
సిద్ధాంత్ నవ్వాడు. "మనం
హిందువులంరా. బొందలు పెట్టుకోము. కాల్చి బూడిద చేసుకుంటాం. స్మశానంలో అట్ల స్థలం
రిజర్వ్ చేసుకునే వ్యవస్థేం మనకు అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ పూర్వ వ్యవస్థా
అవసరం లేకుండ కూడా నిశ్చింతగా చచ్చిపోవచ్చు."
"అయితే సిద్ధంగ ఉండు. మరి నిన్ను
నిలువునా చీల్చి ఎక్కడ చితి పెట్టాలో నువ్వు చెప్తావా.. లేక నేనే ఏదో ఒక స్థలం
నిశ్చయించనా..? అంటే నీకిష్టమైన పుణ్యస్థలాలు, గట్రా ఏమైనా.."
సిద్ధాంత్ మళ్ళీ నవ్వి, "ఆ మాటలు
ఫోనులో అయ్యేవి కావులే కానీ ఇంటికి రారా కన్నా..! హాట్ హాట్ గా మాట్లాడుకుందాం రా.."
అన్నాడు ఫోన్ పెట్టేస్తూ.
అంతలోకి నిషితా ఫోన్ వచ్చింది.
సిద్ధాంత్ మళ్ళీ నవ్వుకుని ఫోన్ ఎత్తాడు.
"క్రితం నెల శ్రావణ మాసం,
పౌర్ణమిరోజు ఏం జరిగిందో మీకు గుర్తుందా..?" అని అడిగింది ఏడుస్తూ.
సిద్ధాంత్ నవ్వి, "ఆ రాఖీని భద్రంగ
నా బీర్వాలో గూట్లో ఎదురుంగ పెట్టుకున్నానమ్మా.. రోజూ చూసుకుంటాను కూడా.."
అన్నాడు.
"మరి ఒక చెల్లెలితో చేయాల్సిన
పనేనా మీరు చేసింది..?" అడిగిందామె తమాయించుకోలేక మరింత ఏడుస్తూ.
సిద్ధాంత్ నవ్వి, "ఒకసారి ఇంటికి రాకూడదా..?
మాట్లాడుకోవచ్చు. ఆఫీస్ కార్ పంపుతున్నాను.. సరిగ్గ పదింటికి.. సరేనా..?"
"మీరు చేసిన చెత్త పనికి రాక
తప్పేటట్టు లేదు..!! ఇంక నా దగ్గర వేరే చోటు కూడా లేదు గడపటానికి." అని రావటానికి
ఒప్పుకున్నాక ఫోన్ పెట్టేశాడతను. తర్వాత తన భార్యకు వంటలో సహాయం చేయటానికి
వెళ్ళాడు. అప్పటికే అతని తల్లి అక్కడ ఉంది. ముగ్గురూ కబుర్లు చెప్పుకుంటూ వంట
ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళ నాన్న కూడా వచ్చాడు- "ఏంటి విశేషం?" అంటూ.
"ఈరోజు మనింట్లో ఒక రిసెప్షన్
పార్టీ ఉంది.." నవ్వాడు సిద్ధాంత్. "నా ఒక్కగానొక్క ప్రాణస్నేహితుడిది."
"ఏంటి..? ప్రార్థిత్ పెళ్ళి
చేసేసుకున్నాడా..? ఆ పిల్ల తల్లి కనటం, ఆ పిల్ల పెళ్ళికెదగటం కూడా అయిపోయిందా..? మాటైనా
చెప్పలేదే..!!" అతని తల్లి అంది ఆశ్చర్యంగ.
"వాడికి తెలిసింది ఇందాకే కదా
పాపం. ఇంకేం చెప్తాడు..?"
"అదేంటి..? ఆ పిల్లాడి పెళ్ళైనట్టు
ఆ పిల్లాడికే తెలియకపోవటం...? అమ్మాయి ఎవరో అదైనా తెలుసటనా..?"
"అదీ ఇందాకే తెలిసింది. తను మీకు తెలిసిన
అమ్మాయే.. నిషితా.." అని ఆగి గతంలో జరిగిందంతా వారికి క్లుప్తంగ చెప్పి, తర్వాత
ప్రస్తుతం తను చేసిందంతా క్రమంగ వివరమంతా చెప్పాడు. వారు అంతా విని ఆశ్చర్యపోయారు.
"ఎట్ల చేశావు ఇదంతా..? వాళ్ళకు
అనుమానం కూడా రాలేదా..?" అడిగారు కుతూహలంగ.
"పాపం, ఆరోజు ఇద్దరూ ఒకరికొకరు
సడన్ గా ఎదురుపడేసరికి పరమ షాకై ఉన్నారు. కాగితాలన్నీ ఒక్కటీ చదవకుండానే సంతకాలు
చేసేశారు. అది జరగాలనే ముందుగా వారితో మాటైనా చెప్పకుండా రప్పించాను. మన
విద్యార్థీ ఉన్నాడు కదా.. అదే అప్పుడు చాలా తక్కువ ధరలో నాణ్యమైన ఫర్నిచర్ అంతా అతను
చెప్పినట్టే డిజైన్ చేయించి ఇచ్చానని ఆశ్చర్యపోయి, సంతోషంతో స్నేహం కలిపాడే.. అతడు
కాగితాల దగ్గర అంతా సహాయం చేశాడు.." అని ఆగి, "అమ్మా, ప్రార్థిత్ నాతో
ఎందుకు కాంటాక్టులో లేడు అని అడిగారే, అప్పుడు ఏం చెప్పాలో తెలియక ఆగాను. ఇది అసలు
కారణం." అని నిట్టూర్చి, "ప్రార్థిత్ కోసం కవర్ ఇవ్వటానికి మన డ్రైవర్
తో కార్ పంపాను. వచ్చేంత సేపట్లో మానసికంగా ప్రిపేర్ అవుతాడు. నిషీకి ఉదయాన్నే
మనిషిని పంపించి కవర్ పంపాను. మనను వచ్చి కలిసేసరికి ప్రిపేర్ అవుతుందని."
అని చెప్పాడు.
పదిగంటలకల్లా అతను పంపిన ఆఫీస్ కార్ లో ముందు
నిషితా వచ్చింది. సిద్ధాంత్ చెప్పినట్టే అతని తల్లి, తండ్రి కలిసి పిల్లలను
తీసుకుని ఆ ఇంటి రెండో అంతస్తుకు వెళిపోయారు. నిషితా వస్తూనే సోఫాలో పడి కూర్చుని
భోరున ఏడిచేసింది. సిద్ధాంత్ తన భార్యను పిలిచి ఆమెకోసం తయారుచేసి ఉంచిన చల్లటి
జూస్ తెచ్చి ఇమ్మన్నాడు. నిషితా జూస్ తాగకుండానే, కసిగా ఎర్రబారిన కళ్ళతో చూస్తూ,
ఏడుస్తూనే, "మీ స్నేహితులిద్దరికీ నేనే దొరికానా ఆటబొమ్మగా..?"
అనడిగింది.
"ఇందులో వాడి ప్రమేయమేం లేదు. నేనే
చేశానిదంతా.."
నిషితా తల పట్టుకుని, బాగులో నుంచి ఏవో
కాగితాలు తీసి చూపిస్తూ, "స్కూల్ మానేశాను. ఇదిగో రెసిగ్నేషన్,
ఎక్స్పీరియెంస్ లెటర్..! హాస్టల్ ఖాళీ చేసేశాను. ఇదిగో బిల్ సెటిల్ మెంట్..! ఇవేమో
ఫ్లైట్ టికెట్లు... ఇవాళ సాయింత్రం ఇంటికి ఫ్లైట్ ఎక్కాల్సినదాన్ని. అటు మా అమ్మ వాళ్ళు,
ఇటు కాబోయే పెళ్ళివాళ్ళేమో వరసగా ఫోన్లు చేస్తున్నారు..! వచ్చేవారం నా పెళ్ళి..! వారికి
ఏం సమాధానం చెప్పమన్నారు నన్ను..?"
ప్రాక్తన కంగారుగా సిద్ధాంత్ వంక చూసింది.
సిద్ధాంత్ కన్నుకొట్టి నవ్వాడు. నిషితా అది చూసి ఇంకా భోరున ఏడ్చింది.
"మీకు ఆటగా ఉందా? అందరికీ నా
పెళ్ళి కుదిరిందని, ఇంటికి వెళిపోతున్నానని చెప్పుకున్నాను. లగేజ్ పెట్టుకోవటానికి
చోటు కూడా లేదిప్పుడు.! తిరిగి వెళ్ళలేకుండా ఉంది పరిస్థితి. పెళ్ళి ఆగిపోయింది. ఉండటానికి
చోటు పోయింది.."
సిద్దాంత్ సోఫాలో ఆనుకుని వెనక్కు వాలి
కూర్చుని, చేతులు కట్టుకుని, కాలి మీద కాలేసుకుని దర్జాగా కూర్చుని, నిషితా
ఆవేశాన్ని పరికిస్తూ ఉండిపోయాడు.
"మావాళ్ళ ఎదుట తప్పుడుదాన్నైనాను.
అప్పటి సమస్యలన్నీ తీరటానికి ఇన్నేళ్ళు పట్టింది. మళ్ళీ ఇది ఎంత దూరం పోతుందో
తలచుకుంటే వణుకు వస్తోంది."
నిషితా అవిరామంగా ఏడుస్తుంటే సిద్ధాంత్ కాసేపు
చూసి, ఆమె ఫ్లైట్ టికెట్ అందుకుని దాని మీద నెంబర్లు చూసి, తన ఆఫీస్ కు ఫోన్ చేసి,
బ్రోకర్ తో అవి కాన్సిల్ చేయించమని వివరాలు చెప్పి పెట్టేశాడు.
ఇంక నిషితాకు ఆవేశం ఉన్మాదస్థితికి
వచ్చింది. ఒక్క ఉదుట్న లేచి అతని కాలర్ పట్టుకుని ఊపేస్తూ అంది- "మీకు అన్నీ
పరిస్థితులు ఎప్పటికప్పుడు వివరంగ చెప్తూనే ఉన్నాను. అయినా మీరీ పని చేశారు.
ఎందుకు..? నేను మీకేం అన్యాయం చేశాను? నా మీద ఏ జన్మ పగ తీర్చుకుంటున్నారు..?"
నిలదీసింది.
అప్పుడు సిద్ధాంత్ ఆమె చేతిలో నుంచి తన
కాలర్ విడిపించుకుని, అన్నాడు- "ఊఁ.. ఇది సరైన ప్రశ్న. దీనికోసమే
చూస్తున్నాను.. నాలుగేళ్ళ క్రితం.. గుర్తు ఉండే ఉండాలి. లాల్ ఎండ్ లాల్ కంపెనీ..
ఈస్తెటిక్స్ పోటీ.. ప్రార్థిత్.. చిట్ పండ్ సక్సేనా.. గెస్ట్ హౌస్.. అటు నుంచి
హాస్పిటల్.. ప్రార్థిత్ కి ఎక్కడలేని పాట్లు.. తర్వాత.."
నిషితా ఖంగుతిన్నదానిలా చూసింది అతన్ని.
"అంటే..? దాని కోసమని, కేవలం అతని ప్రైజ్ పోయిందని నాకు ఇంత విధ్వంసం
సృష్టిస్తారా..?"
"..ఇంకా నా మాట పూర్తి కాలేదు. పోయింది
అతని ప్రైజ్ మాత్రమే కాదు.."
"కానీ అదంతా అధికారిణి మాట మీద
చేశాను.. అప్పుడే చెప్పా కదా.."
"ఏదీ..??? ప్రార్థిత్ తో చేసిన ప్రేమనాటకం..
అతని ఇంటివారితో చేసిన డ్రామా, ఇమోషన్, సెంటిమెంట్, యాక్షన్.. అది కూడా
అధికారిణిగారే నిర్దేశించి చెప్పారా..??!" అని నిషితా ఒక్కసారిగా దెబ్బ తిన్నదానిలా
మాన్పడిపోయి చూసేసరికి, "గుర్తున్నాయా ఆ వేషాలు..?? లేక అన్ని
వివరించమన్నావా..?!!" అన్నాడు. నిషితా మళ్ళీ ఏడ్చింది రెండు చేతులలో ముఖం
దాచుకుని.
"చూడు, నీతో చేయాల్సిందే చేశాను, ఆలోచించి
మరీ ప్లాన్ చేసి చేశాను. అందులో నేను అపరాధభావంతో కుంగిపాటు పడాల్సింది, నీకు
వివరణలివ్వాల్సిందీ ఏమీ లేదు.." అని ఆగి, తన భార్య వంక తిరిగి, "ఏం
కారణం లేకుండా మనుషులతో ఆడుకునే రకం నేను కాదు.. ఆమె..!! కాదని చెప్పమను..
చూస్తాను.." సవాల్ విసిరాడతను.
నిషితా సహజంగనే వాళ్ళ ముందర సిగ్గుతో,
అవమానంతో నోరు ఎత్తలేక ఏడుస్తూ ఉండిపోయింది. నిజమే. ఆ రోజు గెస్ట్ హౌస్ లో పాపం
తనకోసం ఎన్ని దెబ్బలు తిన్నాడు ప్రార్థిత్..!! తను ఏడుస్తుంటే ఎంత ధైర్యం
చెప్పాడు..! తన అవివేకం వల్ల జరిగినదానికి ఒక్క మాటైనా అనకుండా ఎంత సంయమనం
చూపించాడు..!! హాస్పిటల్ లో కోలుకోవటానికి, ఆ పోటీ లో పాల్గొనటానికి ఎంత అవస్థపడ్డాడు..!
అదంతా తలచుకుని ముచ్చెమటలు పోశాయామెకు. గొంతు ఎండిపోయింది. ఆమె పరిస్థితి చూసి ప్రాక్తన
ఆమెకు జూస్ తాగించింది. ఈసారి ఆమె కాదనకుండా తాగేసింది. అంతలో ఆమె ఫోన్ మోగింది.
నిషితా ఎవరా చూస్తే ఆమె తల్లిదండ్రులు. ఆమె అది చూసి ఏం చేయాలో తెలియని అయోమయంలో
ముఖం దాచుకుని పెద్దగ ఏడుస్తూండిపోయింది.
అప్పుడు సిద్ధాంత్ ఆమె ఫోన్ అందుకుని,
తనే ఎత్తాడు. అతనికి వాళ్ళ వాళ్ళు నేరుగా తెలియకపోయినా ఈ మధ్యే నిషితా రాకపోకలతో పరస్పరం
ఆమె ద్వారా మాటల పరిచయం ఏర్పడింది.
"హలో.. అది.. నిషితాకు చిన్న
ప్రమాదం జరిగింది. ప్రాణాలకేం ముప్పు లేదు కానీ కదలలేని పరిస్థితి. పెళ్ళి వాయిదా
వేయమని చెప్పమంది.." అని కప్పుడు వివరాలు చెప్పాడు నిషితా వంకే తీక్ష్ణంగా
చూస్తూ. నిషితా మౌనంగ విని ఊరుకుంది.
ఆమె తల్లిదండ్రులు కాస్త కంగారు పడి
నిషితాతో మాట్లాడించమన్నారు. ఆమెకు ఫోన్ అందించబోయాడతను. ఆమె తల అడ్డంగ ఊపింది.
"లేదండి. మాట్లాడే స్థితిలో లేదు.
కాస్త షాకైంది. కొంచెం కోలుకున్నాక నేనే మాట్లాడిస్తాను.. మీరేం కంగారు పడకండి. మా
ఇంట్లో సురక్షితంగ ఉంది. రావాల్సిన అవసరమే లేదు." అన్నాడు సిద్ధాంత్. "మళ్ళీ
ఫోన్ చేసి పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్తాను. మాటిస్తున్నాను.."
సరేనని సమాధానపడి, "కంగారేం
లేకుండా రెస్ట తీసుకోమని చెప్పండి.." అని వాళ్ళు పోన్ పెట్టేశారు. సిద్ధాంత్
ఆమె చేతికి ఫోన్ తిరిగి ఇచ్చి, "నాకు ఏదైనా బాలెంస్ గా ఉండాలి. అప్పట్లో నువ్వు
చేసింది చేశావు. దానికిప్పుడు తగిన ప్రాయశ్చిత్తం నేను చేశాను. అంతే."
అన్నాడు.
"పోనీ, మీరు చేసేది చేశారు. ఇప్పుడు
ఏం చేస్తే ఈ పెళ్ళి కాన్సిల్ అవుతుందో అది చెప్పండి.." నిషితా బాధగ అడిగింది.
"సంవత్సరం ఆగాలి.. తప్పదు. ఈలోపు
ఎవ్వరూ ఏమీ పీకలేరు. గలిగినా నేను పీకనివ్వను కూడా. ఈ పెళ్ళిని కానీ, వాడితో కలిసి
ఉండటానికి కానీ మర్యాదగా ఒప్పుకోవనుకో.., అప్పుడు నేనే వాడిని వీరస్థాయిలో
రెచ్చగొట్టయినా నీ మీద కేస్ పెట్టిస్తాను.. జాగ్రత్త." కఠినంగ అన్నాడతను.
అంతలోకి ఇంటి ముందు కార్ హారన్ శబ్దమైంది.
"ప్రార్థిత్ వచ్చినట్టున్నాడు.." అన్నాడు సిద్ధాంత్. నిషితా వెంటనే లేచి
ఏడుస్తూనే లోపలకు వెళిపోయింది. ప్రాక్తన కూడా లోపలకు వెళిపోయింది. నౌకరు అతని
సైగతో వెంటనే నిషితా లగేజ్ అంతా లోపల పెట్టేశాడు. సిద్ధాంత్ లేచి బయటకు వెళ్ళాడు.
కార్ లోపలకు వచ్చి ఆగింది. దానిలోనుంచి ప్రార్థిత్ దిగాడు. సిద్ధాంత్ అతనిని
సాదరంగా నవ్వుతూ లోపలకు ఆహ్వానించాడు.
ప్రార్థిత్ లోపలకు వస్తూనే, "ఏది..?
ఇంకా అంబులెంస్ పిలిపించుకోలేదా..? నింపాదిగా కూర్చున్నావు..?" అని అతని
కాలర్ పట్టుకుని, సిద్ధాంత్ చెంపమీద చాచి లాగి చెళ్ళున ఒక్కటి కొట్టాడు.
అక్కడే కార్ కీస్ ఇవ్వటానికి వచ్చిన
డ్రైవర్ ఒక్కసారి అదిరిపడ్డాడు తన యజమానిని వేరొకరు కొడుతుంటే చూసి షాకౌతూ. సిద్ధాంత్
మాత్రం పగలబడి నవ్వుతూ, డ్రైవర్ వంక చూసి, వెళిపోమన్నట్టు సైగ చేశాడు. అతను ఏమీ
చేయలేక వెళిపోయాడు.
సిద్ధాంత్ చెంప పట్టుకుని,
"థాంక్స్.. అదిరింది..! కార్ ఉంది కదా.. నువ్వే హాస్పిటల్ కి తీసుకుపోదువు
లెమ్మని అంబులెంసు పిలవలేదు." అన్నాడు. ఆ దెబ్బ ధాటికి అతని కళ్ళలో జివ్వున
నీరుబికింది. ఇంకా అదురుతున్న చెంపను పట్టుకుని కన్నీరు అదుపు చేసుకంటూ,
"ముందు నువ్వు కూర్చో. మంచినీరు తాగు..." అని నౌకరు పెట్టి వెళ్ళిన
మంచినీరు అతనికి అందించాడు సిద్ధాంత్. ప్రార్థిత్ అది అందుకోకుండా అతని వంక
తీక్ష్ణంగ చూస్తూండిపోయాడు. అతనికి కూడా కంట్లో నీరుబికింది. పక్కకు తిరిగి కళ్ళు
దాచుకున్నాడు. తన చేతి వంక చూసుకుని ఛి.. అనుకున్నాడు. "ఎన్నడూ నోరెత్తటానికి
కూడా పదిసార్లు ఆలోచించేవాడిని. అటువంటిది దీని మూలంగ నాకెన్నోసార్లు ఎంతో సహాయం
చేసిన ప్రాణమిత్రుడి మీద ఇవాళ చేయి చేసుకున్నాను." అని చేతిలో ఉన్న మారేజ్
సర్టిఫికెట్ కవర్ తీసి అతని మొహాన కొట్టాడు.
"ఫరవాలేదులేరా..! నా దెబ్బ తాకిడి
ముందు ఇదెంత..?" అన్నాడు సిద్ధాంత్ ఆ కాగితం చూసి, "స్పెలింగ్ లన్నీ
సరిగ్గ వ్రాశాడా?" అని పరికించి చూస్తూ.
ప్రార్థిత్ చీదరగా, అది అతని చేతిలోంచి
లాగేసి, "నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు..?" అన్నాడు
కాగితం చించబోతూ.
సిద్ధాంత్ వెంటనే అది లాగేసి పక్కకు
పెట్టి, ఓదార్పుగా అతని కళ్ళు తుడుస్తూ, సోఫాలోకి తోసి కూర్చోబెట్టబోయాడు.
ప్రార్థిత్ బలవంతాన అతని చేతులు తోసేసి,
సిద్ధాంత్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ అడిగాడు. "అసలు అదంతా వదిలేయి. నా
అప్లికేషన్ లేకుండా ఈ రిజిస్ట్రేషన్ ఎట్ల వీలైంది..?"
సిద్ధాంత్ తన కాలర్ విడిపించుకుని,
పక్కగా షెల్ఫ్ లో ఉన్న ఒక ఫోటోకాపీ కాగితం తెచ్చి చూపించాడు. అది పెళ్ళికోసం
పెట్టిన వ్రాతపూర్వక అప్లికేషన్.. ప్రార్థిత్ సంతకంతో ఉంది.
ప్రార్థిత్ అంతా చదివి, "ఇది..
నేనసలు దీనిని చూడను కూడ చూసిన పాపాన పోలేదే..! నా సంతకం ఫోర్జరీ
చేయించావా..?" అని అడిగాడు.
"లేదు. నిషీ సంతకమే ఫోర్జరీ
చేయాల్సి వచ్చింది. నీది నీ చేతితో నువ్వే చేశావు. సేవాసంస్థ కాగితాలు సంతకం
పెడుతుంటే నీ పెన్ వ్రాయలేదు గుర్తుందా..? అప్పుడు ఆ కాగితాల మధ్యలోంచి చొరబడి పుట్టింది
ఇది."
ప్రార్థిత్ కొంచెం ఆలోచిస్తే గుర్తుకు
వచ్చింది. "ఎంత మోసం..! ఎంత కుళ్ళు బుర్ర..!" అన్నాడు నివ్వెరపాటుతో.
"ఊఁహూఁ.. బుర్ర నాది కాదు. పాత
హిందీ సినిమా ఒకటి చూశాను.. అశోక్ కుమార్ ది. హృషికేశ్ ముఖర్జీ నిర్దేశకత్వంలో..
ఆశీర్వాద్ అని.. అందులో ఉంది ఈ ఐడియా.. చాలా నచ్చింది.. భలే ఎక్సైట్ అయ్యాను అది
చూసి. ప్రయోగించాలనిపించింది- ప్రయోగించేశాను..!" నవ్వి చెప్పాడు సిద్ధాంత్.
"ఎంత నమ్మకద్రోహం..!! ఈ పని
చేయగలిగినవాడివి ఏదైనా చేయగలుగుతావన్నమాటేగా..?"
"ఏదైనా చేయగలిగినవాణ్ణి ఇదే ఎందుకు
చేశానో..?"
ప్రార్థిత్ ఆ మాటకు కాస్త తగ్గి,
ఆలోచిస్తూ, "అంటే అసలు సంస్థ అనేది రిజిస్టర్ కానేలేదా..?" అనడిగాడు.
"ఈ సిద్ధాంత్ కి కూడా
సిద్ధాంతాలున్నాయి. నువ్వు చెప్పిన 'ఏదైనా చేయాలనుకునేవాణ్ణే' అయితే ఈపాటికి మీ
నాన్నగారి రిసర్చంతా నా పేర వ్రాసి హక్కులన్నీ నీ చేతితో నీవే ధారపోసి ఉండేవాడివి.
దాని మీద వచ్చే పేరు, గొప్ప, హోదాలతో, ఆ ఆదాయంతో జీవితాంతం నేను బ్రతకటమే కాక, నా
తర్వాత నాలుగు తరాలకు సరిపడా వెనకేసేవాడిని. దీనికే ఇంత ఏడుస్తున్నావు..! ఆ పని
చేసే ముందు క్షణమైనా ఆలోచించావా..?"
"అది నువ్వు బ్రతుకులో చేయలేవు. ఆ
సంగతి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఈ పని వల్ల ఏం లాభం వచ్చింది నీకు!?! నాకు ఇట్ల
అపకారం తలపెట్టే హక్కెవరిచ్చారు నీకు?"
"హక్కు సంగతి తర్వాత. వచ్చిన లాభం
ఏంటంటే నువ్వంటే నాకు ఉన్న పరమ ఈర్ష్య తీరింది.." అన్నాడు సిద్ధాంత్.
"వ్వాట్ట్..? కమ్ అగైన్..? ఏదీ..
మళ్ళీ ఇంకోసారి చెప్పు..?? నాకర్థం కాలేదు. నీ ఈర్ష్యకు, నా పెళ్ళికి ఏంటి
సంబంధం..?"
"నువ్వు జీవితంలో ఉద్యోగం, పెళ్ళీ,
సామాజిక ఎదుగుదలా వద్దనుకుని నాన్నగారి రిసర్చ్ మీదే దృష్టి పెట్టాలనుకున్నావు..! ఇంక
సంస్థ పెట్టేస్తావు. సేవ చేసేస్తావు. నీకు మంచి పేరు వస్తుంది. బోలెడు పుణ్యం
వస్తుంది. నేనెట్ల చూస్తూ ఊరుకుంటాను..? నాకు జెలసీ చీమ కుట్టదా..? ఆ తపస్సు
చెడపాలనే చేశానిది."
ప్రార్థిత్ ఆరోజు టీవీ ఇంటర్వ్యూలో
చెప్పాడు ఆ మాట. అతనికి వెంటనే గుర్తుకు వచ్చింది. సిద్ధాంత్ నిర్మలమైన కళ్ళలోకి
తొంగిచూస్తూ "ఊఁ.. నాకంతా అర్థమైంది. నీ పగ తీరిందా మరి..?" అన్నాడు.
"ఊఁ..! నువ్వు బ్రతుకులో మొదటిసారి
రెచ్చిపోయి పెట్టి లాగి కొట్టిన ఆ చెంపదెబ్బ చాలురా. నిన్ను కాసేపటికోసమైనా
చెడిపానని సంబరపడటానికి."
ప్రార్థిత్ నవ్వి, "సరే, సంతోషం.
మరి నేను, ఆ అమ్మాయి ఈ పెళ్ళిని నిరసించి, సంవత్సరం ఆగి విడిపోయి ఎవరి దారులు వారు
చూసుకుంటాం. నీకు ఒరిగిందేంటి..?" అన్నాడు.
"ఇప్పుడు కూడా మీ నాన్నగారి కోరిక
తీర్చాననే తృప్తి తప్ప నాకేం ఒరగలేదు..!"
ప్రార్థిత్ ఉలికిపడ్డాడు.
"నాన్నగారి కోరికా..? అదేంటి?"
"ఎవరిచ్చారో హక్కు
చెప్పమన్నావుగా...! మీ అమ్మానాన్నా ఇచ్చారు.."
"వాట్..??? అమ్మా నాన్నానా..?
వాళ్ళెందుకు చేస్తారట్ల..?"
"ఊఁ.. సవిస్తరంగ చెప్తాను విను. నిషితా
చేసిన అద్భుతమైన నటనతో ఆ అమ్మాయి అంటే మీ అమ్మకు అప్పట్లోనే చాలా ఇష్టం ఏర్పడింది.
తను అట్ల మోసం చేసి, వెళిపోయేసరికి, 'నా కొడుకు మనసుతో ఇష్టం వచ్చినట్టు
ఆడుకుంటుందా' అని కచ్చా పుట్టింది. ఈ సంగతంతా ఆమె నాతో స్వయంగా చెప్పింది. నేను మీ
ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్నగారు నీ పరిస్థితి చెప్పి బాధపడ్డారు. నిషితా నాకు మళ్ళీ
కలిసిందని తెలియంగనే, ఈ పనికి ఇద్దరూ కలిసి అనుజ్ఞ ఇచ్చేసరికి నేను రెచ్చిపోయాను. సంస్థ
రిజిస్ట్రేషన్ ఐడియా మీ నాన్నగారే ఇచ్చారు. సంతకం చేయించటం వరకు మాత్రమే నా ప్లాన్."
"ఇదెప్పుడు జరిగింది..?"
ప్రార్థిత్ అంతా విని ముఖం
తిప్పేసుకున్నాడు. చాలాసార్లు వాళ్ళ అమ్మ నాన్నలు పెళ్ళికి బలవంతం పెట్టటం, తను
రిసర్చ్ పేరు చెప్పి కాదనటం అతనికి మనసులో మెదిలింది. టీవీ ఇంటర్వ్యూలో తను అట్ల
చెప్పాడని వాళ్ళ నాన్నకు చాలా కోపం కూడా వచ్చిందప్పుడు. ‘కన్నవారికి ఏ హక్కూ లేదా
నీమీద?’ అని తిట్టేశారు కూడా. రెండురోజులు ఇద్దరూ తనతో మాట్లాడలేదు.
సిద్ధాంత్ సోఫాలో వెనక్కు వాలి
కూర్చుంటూ, అన్నాడు- "లేకపోతే, జీవితాంతం పెళ్ళీపెటాకుల్లేకుండా పడి ఉంటాను
అని కొడుకు అంటే సరేనని తల ఊపి వదిలేయటానికి వాళ్ళేమైనా నీ శత్రువులనుకున్నావా..?
ఆయన నీలో కల్పించిన రిసర్చ్ ఆసక్తిని నువ్వింత సీరియస్ గా తీసుకుని, జీవితాంతపు
ఆనందాన్ని పణంగ పెడతావని ఆయనా ఊహించలేదట. సన్యాసం, వైరాగ్యం వంటి దారులలో పోదామంటే
అది వేరే పద్ధతి.. నీది అట్లా కాదు కదా. పెళ్ళై పిల్లలను కన్నవాణ్ణి.. నీకూ వైవాహిక
జీవన ఆనందం దక్కాలనేది నా స్వార్థం." అన్నాడు.
"ఏ కారణంగానైనా సరే, ఒక అమ్మాయికి
అన్యాయం చేయటం సరైన పని కాదు."
"మరి నిషితా చేసింది తప్పు కాదా..?
నీతో అట్ల ప్రవర్తించటం, ప్రేమ నటించటం.. దానికేంటి అర్థం?"
"ఆమె ఇంకా పరిణతి ఏమాత్రం లేని,
ప్రపంచం జీవితం పట్ల అవగాహన లేని పసిపాప అని అర్థం. తనంటే నాకు పూర్తి సహానుభూతి
ఉంది."
సిద్ధాంత్ ఆశ్చర్యంగ చూశాడతనిని. అతనికి
కొత్తగ అనిపించింది ఆ మాటలు విని. ప్రార్థిత్ గతం గుర్తుచేసుకుంటూ, అన్నాడు-
"ఆమెను చూసి నేనెప్పుడూ ఇదే
అనుకునేవాడిని. ఆమెకు సంపాదన ధ్యాసలో ఒక ఆడపిల్లకు ఫండమెంటల్ గ ఉండాల్సిన కనీస
భద్రత మీద దృష్టి, జాగ్రత్త కూడా లేకుండాపోయింది. పైపై మనుషుల మధ్య పెరిగింది..
అమ్మా నాన్నా కేర్ దొరకలేదు.. అందుకే ఆ ఖాళీని పూరించే ఐడెంటిటీ క్రైసిస్.. తనకు
తాను ఏదో గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలి. దాని బైప్రొడక్టుగా అహంకారం..! అటువంటివారి
మీద ఎవరికైనా కలిగేది జాలే. తను తిరిగిన పరిమితమైన ప్రపంచం, చూసిన చిన్నలోకం తనకు
అంతే నేర్పింది. అది ఆమె తప్పు కాదు కదా. కుటుంబంలో శిక్షణ ఇవ్వక ఇంక ఎక్కడి నుంచి
వస్తుంది..?"
"తన కుటుంబం గురించి నీకేం
తెలుసు..?"
"ఏం తెలియదు. తెలియనక్కరలేదు. మాట
వరసకు చెప్తున్నాను- వేరేగా తీసుకోకు..!! తనకు ప్రాణాలొడ్డి మరీ సహాయం చేసిన
మనిషిని వెన్నుపోటు పొడవగలిగే పిల్ల ఉన్నతమైన భావాలు, సంస్కృతి, ఆదర్శాలు కల
ఆధ్యాత్మిక కుటుంబం నుంచి అయితే వచ్చి ఉండదు కదా..!??"
సిద్ధాంత్ ఆశ్చర్యంగా అడిగాడు- "అయితే
నీకామె పట్ల ద్వేషం ఉందా...?"
"ఆమెతో నాకు ఏ సంబంధం లేదురా బాబూ
అంటుంటే!! అట్లగే నాతో ఆమెకు కూడా ఏమీ ఉండదు. నా స్థానంలో ఎవరున్నా ఆమె అదే
చేసేది. ఆ దృష్టి అటువంటిది. ఒక కాముకుడి దృష్టికి ఎవరైనా సరే, ఆడపిల్ల అయితే చాలు..!
వావివరసలతో కూడా పని ఉండదు. ఆ పిల్లా అంతే. ప్రైజ్ కోసం ఎవరితోనైనా, ఏమైనా
చేసేస్తుంది. అవకాశం నన్ను చూపించేసరికి నాతో ఆటాడింది. అటువంటి పిల్లతో
నాకేంటి..? అసలు ఏ భావాల పరిధిలోకీ ఆమె రాదు. చాలా..? అందుకే వదిలేయరా అనేవాడిని."
"అరే, నువ్వింత సరళంగా ఎట్ల
ఆలోచించగలుగుతావురా..?"
"చిన్నతనం నుంచి మా నాన్న తక్కువలో
కూడా ఆనందంగ ఉండటం నేర్పారు. మా అమ్మ ఉన్న అవాకాశాన్ని సరిగ్గ ఉపయోగించుకోవటం
నేర్పింది. అందుకే ఎక్కువ పొందాలనే కాంక్ష లేదు. దానికోసం పాకులాడితే పోయే
మనశ్శాంతి విలువ తెలుసు కనక.., అవన్నీ కాదనుకోగలిగాను. ఏదైనా అనుభవమైతే కానీ
తెలిసిరావు ఇవన్నీ."
సిద్ధాంత్ అంతా విని తల ఊపి, కాసేపు
ఆలోచిస్తూ ఊరుకున్నాడు. అప్పుడు ప్రార్థిత్ అన్నాడు బాధగా-
"తను చేసిన పనే తీసుకుందాం. 'అరే,
రేపు ఉదయం ఈ మనిషి నాకెదురు పడితే నేనేం ముఖం పెట్టుకుని వాడిని చూడాలి..? ఎంత
గిల్టీగ అనిపిస్తుంది..? ఇవాళ మోసం చేసి తీసుకున్న ఈ లాభాలు నాకెంత కాలం
నిలుస్తాయి..? వాటిని తలచుకున్నప్పుడల్లా చేసిన తప్పు ముల్లులా పొడిస్తే
నేనెక్కడికి పోవాలి..?' అని ఒక్కసారి తలంపు వచ్చినా ఆ మనిషి ఆ పని చేయగలిగేదా..?
మొన్న రిజిస్టరాఫీసులో ఆమె కళ్ళలో కదిలినవి ఆ భావాలే కావా? అందుకే ఆమెను ఇంకా
బాధపెట్టటం ఇష్టంలేక అక్కడి నుంచి వీలైనంత త్వరగా వెళిపోయాను. ఒరే, ఒక మాట
చెప్పనా..? పొట్టిగా ఉన్నవాడికి గోడవతల ఏం ఉందో కనిపించదు, దానికి ఎత్తు పెరగాలి.
లేదా నిచ్చెనో, బల్లనో సహాయం కావాలి. ఇప్పుడు పొట్టిగా ఉన్నవాడి తప్పంటావా, లేక గోడ
ఎత్తుగా ఉండటం తప్పంటావా..?"
సిద్ధాంత్ తల ఊపి కాసేపు మౌనంగ
ఆలోచిస్తూ కూర్చుని, తర్వాత- "సరే, ఇట్ల అడిగానని ఏమీ అనుకోనంటేనే
అడుగుతాను.." అని ప్రార్థిత్ తల ఊపాక, "ఆమె అప్పట్లో నీతో చనువుగా
ప్రవర్తించినప్పుడు నీకు ఆమె పట్ల ఏ భావాలూ కలగలేదా..?" అడిగాడు.
లోపల గదిలోనుంచి ఆ మాటలు వింటున్న
నిషితాకు గెస్ట్ హౌస్ లో భయంతో తను అతనిని కౌగిలించుకుంటే అతను తల నిమిరి ఓదార్చిన
సంఘటన అప్రయత్నంగ గుర్తుకు వచ్చింది. సహానుభూతి, హుందాతనం నిండిన అతని స్పర్శ తనను
తర్వాత ఎన్ని రాత్రులు పడుకోనివ్వకుండా చేసిందో ఆమెకు, భగవంతుడికే తెలుసు. అక్కడి సక్సేనా
మనుషులు అతన్ని కొట్టి పడేసినప్పుడు, చేయూతనిచ్చి, లేపి, నిలబడటానికి సహాయం చేస్తూన్నప్పుడు
తనకు సాధ్యమైనంత దూరంగా ఉండటానికి అతను చేసిన ప్రయత్నం ఆమెకు తప్ప ఎవరికి తెలిసే అవకాశం
ఉంటుంది..? ఆ బలమైన ఛాతీ వెనక ఉన్న మెత్తని సున్నితమైన మనస్సు, అతని ప్రతీ చూపుతో తనను
ఎన్నెన్ని వేల సార్లు దగ్గరగా పలకరించిందో, గుర్తుకు వస్తుంటే లోలోపలకు కుచించుకు పోయిందామె.
అయితే అతనూ అట్లాగే ఫీలవుతాడా?
ప్రార్థిత్ కాసేపు ఏమీ మాట్లాడకుండా, మళ్ళీ
అదే ప్రశ్న సిద్ధాంత్ అడగటంతో ఎటో చూసి, "కలుగుతాయిరా.. సహజంగానే కలుగుతాయి.
కానీ అవి క్షణికాలే కదా. తర్వాత పర్యవసానం చూసుకుని, ఆ ప్రవర్తన వెనక అంతరార్థం
తెలిశాక అట్ల ప్రవర్తించటం ఆమె చిన్నతనం అని, ఆమె చిన్నపిల్ల అని
సరిపెట్టుకున్నాను. కోపం వల్ల లాభం ఏంటి? ఎవరి కోపం వారినే కాలుస్తుంది. ఎంత కోపం
అక్కడ వచ్చిందో, అంత కోపం శక్తికింద మార్చుకుని పని మీద ధ్యాస మరల్చుకున్నాను."
అన్నాడు.
"అందుకేరా, నువ్వంటే నాకు
ఈర్ష్య." అని సిద్దాంత్ నిట్టూర్చి, "నీకైనా ఆసక్తి ఉంటుందేమో అనుకోవటం
నా తప్పు. అయితే సరే, వదిలేసేయి. తప్పక ఆ రిజిస్ట్రేషన్ కాన్సిల్ చేయిస్తాను.
చాలా?" అని అక్కడి నుంచి లేచాడు.
ప్రార్థిత్ బాధగా, "ముందైతే అదే
కోరి వచ్చాను. కానీ ఆ పని అమ్మావాళ్ళను బాధపెట్టకుండా జరగదని అర్థమైంది. దానికేమైనా
ఉపాయం ఆలోచిస్తున్నాను.." అన్నాడు.
"పోనీ, గతమంతా మర్చిపో. నీ
ప్రకారమే చిన్నపిల్ల అనుకుని వదిలేసేయి. ఇప్పుడు అమ్మా నాన్నల ఇష్టంకోసం ఆమెను
పెళ్ళి చేసుకోవటంలో నీకేంటి అభ్యంతరం..?"
"నిజం చెప్పాలంటే పెళ్ళి మీది
నుంచి ఆనాడే నా మనసు మళ్ళిపోయింది.."
"కారణం..? ఆమె చేసిన గాయం
వల్లేనా...?"
"----"
"ఆ అమ్మాయి ఇప్పుడు ఇదివరకటిలా
లేదురా. చూశావు కదా.. చాలా మారిపోయింది. జరిగినదానికి బాధ పడుతోంది కూడా..
మానసికంగా ఎదిగింది కూడా."
"ఒరే, నీకది చెప్పినా అర్థం
కాదురా..” అన్నాడు ప్రార్థిత్ బాధగా.
“అర్థం కానివైనా సరే, ఒక్కసారైనా వినటం
నాకలవాటు.” అన్నాడు సిద్ధాంత్.
ప్రార్థిత్ కాసేపు ఆలోచిస్తూ ఊరుకుని
తర్వాత అన్నాడు-
“మాది చాలా సామాన్యమైన కుటుంబం. నేను మా
అమ్మానాన్నలకు ఒక్కడినే సంతానాన్ని. వాళ్ళు నన్ను ఎన్నో ఇబ్బందులు పడి
పెంచుకున్నారు. నన్ను దేనికీ కాదనలేదు. అడ్డం చెప్పలేదు. వారి ఋణం తీర్చుకోవాల్సిన
బాధ్యత, ఇష్టం రెండూ నాకు ఉన్నాయి. మాది చాలా సంప్రదాయ కుటుంబం. నాకు రాబోయే భార్య
మంచి సంప్రదాయం, సంస్కారం ఉన్న కుటుంబం నుంచి వస్తే తప్ప నన్నూ, నావాళ్ళను
అంగీకరించలేదు. ఆదరించలేదు. ఆధునిక భావాలున్నవారు పెద్దలతో సుఖంగ ఇమడలేరు. నేను
చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చూశాను, ఎవరైనా సరే, కాస్త పొందికగా ఒద్దికగా
ఉండే పిల్ల దొరికితే చేసుకుందామనే ప్రయత్నించాను. కానీ కాలేదు. ఎంతసేపటికి
స్వార్థం, సంకుచితత్వం, ఆశలు, కోరికలు.. తప్ప జీవితంలో తము నిర్వహించాల్సిన
బాధ్యతల గురించి కానీ, ఎదుర్కోవాల్సిన పరిస్థితుల గురించి కానీ అవగాహన ఎవ్వరిలో
కనిపించలేదు. నేను నా అభిరుచులన్నీ వదిలేసి నాన్న ఆశయం కోసం ఆ మార్గం ఎందుకు
అవలంబించానంటావు..? నాకు నా అభిరుచి ఉన్న క్షేత్రంలో ఎదుగుదల లేకనా..? చేతకాకనా..?
కాదు. సేవా విలువ తెలుసు కాబట్టి. అర్థమైందా..? అట్లగే తనకూ తెలుసు అంటే, నా
ఆశయంలో పాలుపంచుకుంటానంటే, ఈక్షణం ఏ అమ్మాయినైనా సరే, రూపం కూడా చూడకుండా పెళ్ళి
చేసుకోవటానికి సిద్ధంగ ఉన్నానురా..! చాలా..?"
సిద్ధాంత్ తల ఊపాడు ప్రార్థిత్ కళ్ళలోకి
ఆరాధనగా చూస్తూ. తర్వాత కాసేపు మౌనంగ ఊరుకుని అడిగాడు- "సరే, ఇంకొక్క చివరి
ప్రశ్న. మరి ఒకవేళ నిషీకి నీమీద ఏదైనా భావన కలిగి ఉంటే..?"
ప్రార్థిత్ నిర్లిప్తంగ చూసి "కేవలం
పైపై భావనలకోసం నా మనసులో ఏ విలువా లేదురా..! కాస్త దగ్గరగ స్త్రీపురుషులు
మెలిగితే చాలు.. ఉత్తగనే కలుగుతాయి భావాలు. అవి సామీప్యం వల్ల, సంస్కారరాహిత్యం
వల్ల, లేదా ఒక పూర్వోహ వల్ల కలిగేవే. తనలో భావనలు కలిగితే అది తన స్వయంకృతాపరాధం.
నేను కల్పించింది ఏమీ లేదు అందులో." అన్నాడు.
"అంత పచ్చిగ ఎట్ల
మాట్లాడతావురా..?"
"నిజం పచ్చిగానే ఉంటుంది. తడి
తగులుతుంది. దానితోనే జీవన వృక్షాన్ని తడపగలుగుతాము. అబద్ధం ఎండిపోయి శుష్కంగ
ఉంటుంది. అది జీవితానికి ఆధారాన్ని ఇవ్వలేదు. విరిచేస్తుంది." అని ఆగి,
"ఎప్పటికైనా ఎవరైనా పెళ్ళి చేసుకోవాల్సింది వ్యక్తిత్వాలు, ఇష్టాఇష్టాలు చూసి
కాదు..! అవి మారుతూనే ఉంటాయి. కలిసి నిర్వహించాల్సిన కర్తవ్యం నిర్వహించగలిగే
సత్తా ఉందా లేదా, ధర్మం ఆచరించి సహనంగ కలిసి జీవిత ధ్యేయం నిర్వహించగలమా లేదా అని
మాత్రమే చూసుకోవాలి.." అన్నాడు నిశ్చితంగ చూస్తూ.
సిద్ధాంత్ తల ఊపి, "అర్థమైంది
బాబూ.. నన్నొదిలేయి. నేను నీ అంత గొప్పవాణ్ణి కాదు." అన్నాడు చేతులు జోడించి.
ప్రార్థిత్ అసహనంగ లేచి అటూ ఇటూ
తిరిగాడు.
సిద్ధాంత్ తర్వాత చాలా సేపు ఆలోచించాక, "నిషీ.."
అని పిలిచాడు కళ్ళు మూసుకుని.
రెండవసారి పిలిచే అవసరం లేకుండ నిషితా
పరదా తొలగించి బయటకు వచ్చింది. ఆ కంట్లో తడి ఉంది. ప్రార్థిత్ ఆమెను చూసి
అవాక్కైనాడు. సిద్ధాంత్ ఆమెతో, అన్నాడు-
"సారీ నిషీ.. అంతా విన్నావు
కదా..!! పరిస్థితి అర్థమై ఉంటుంది. అనవసరంగ నీ పెళ్ళి చెడగొట్టాను. నువ్వు గమ్మున
ఇంటికి వెళ్ళి మీవాళ్ళు చెప్పిన సంబంధం చేసేసుకో. ఇక్కడదంతా నేను క్లియర్
చేసేస్తాను.."
ప్రార్థిత్ అయోమయంగ చూశాడు వారిద్దరి
వంక. నిషితా లోపల ఉందని కానీ, తన మాటలన్నీ విని ఉంటుందని కానీ అతను ఊహించకపోవటంతో
చాలా షాకైనాడు. అతనిని కలత పెట్టింది ఆమె కళ్ళలో తడి. లేచి నిలబడ్డాడు షాక్ తో ఆమెను,
సిద్ధాంత్ ను మార్చి చూస్తూ.
నిషితా ప్రార్థిత్ వంక చూడలేక, వంచిన తలనే
అడ్డంగ ఊపి, విరక్తిగ నవ్వి, "అవసరం లేదు. ఇందాకే మావాళ్ళకు ఫోన్ చేసి అది
వద్దని చెప్పాలనుకున్నాను. అప్పటికే వాళ్ళకు ఏదో గొడవలొచ్చి, ఆ సంబంధం
తప్పిపోయింది. ఇందాక ఫోన్ చేసింది, ఆ విషయం చెప్పి ప్రయాణం మానుకోమని చెప్పాలనేనట.
ఫరవాలేదు..! మీవల్ల నాకేం ఇబ్బంది కాలేదు." అంది. ఇది అట్ల చెడిన మూడవ సంబంధం
అని ఆమె వారితో చెప్పలేకపోయింది.
సిద్ధాంత్ నిషితా వంక చూసి, "మరి
ఉద్యోగం..? హాస్టల్??" అన్నాడు అయోమయంగ.
"ఏముంది..? ఇంకో ఉద్యోగం.. ఇంకో
హాస్టల్..!! వేట ప్రారంభం..!! అలవాటే కదా..! జీవితం సదా నిత్యనూతనం.." అని
నిషితా విషాదంగ నవ్వి, కళ్ళు తుడుచుకుంటూ తల వంచుకుని, "చేసిన తప్పు చిన్నది
కాదు కదా.. ఇట్ల అనుభవిస్తున్నాను అనుకుంటాను.." అంది.
ప్రార్థిత్ నిషితా ముఖంలో దిగులు చూసి
కలతపడుతూ, ఏం జరిగింది అని అడిగితే సిద్ధాంత్ అతనికి ఆమె పరిస్థితి అంతా వివరంగ
చెప్పాడు.
దానికి ప్రార్థిత్ క్షణమే ఆలోచించి, వెంటనే
స్పందిస్తూ, "అరే, అందులో ఏం ఉంది..?? మనం ఎట్లైనా సేవాసంస్థ తెరవాలనుకున్నాం
కదా. దానిని చూసుకునే వారెవరైనా కావాలి కదా. తనకు ఆసక్తి ఉంటే వచ్చేయచ్చు.
రిజిస్ట్రేషన్ కి కూడా కాగితాలు సిద్ధంగనే ఉన్నాయి. సంతకాలెంతసేపు..? ఏమంటావురా..?"
అని ఆగి, అంతలోనే, "..అంటే బలవంతం ఏం లేదు.." అన్నాడు.
సిద్ధాంత్ నవ్వి, "అందుకేరా,
నువ్వంటే నాకు అంత ప్రాణం.. ఏదీ మనసులో పెట్టుకుని సాధించవు." అని అతని భుజం
మీద చేయేసి, తట్టి, నిషితాను ఏమంటావన్నట్టు చూస్తే, ఆమె, "ఉండటానికి వ్యవస్థ
ఉంటుందా..?" అంది.
సిద్ధాంత్ ఆమెకు సంస్థ గురించి, పనితీరు
గురించి అంతా వివరించాడు. "కానీ అందులో నీ అభిరుచి ఏదీ తీరదు.."
నిషితా వెంటనే నవ్వి, "అభిరుచులు
తీర్చుకోవటమే జీవితం కాదు కదా. అంతకన్నా ఉన్నతమైనవి దొరికినప్పుడు వాటిని
స్వీకరించాలి కదా.. ఇతనినే చూసి నేర్చుకుంటాను నెమ్మదిగా." అని సంతోషంగ
ఒప్పుకుంది. సిద్ధాంత్ హమ్మయ్య అనుకున్నాడు.
తర్వాత వారి భోజనాలకు ఆహ్వానం వచ్చింది.
అంతా కులాసాగా కూర్చుని భజనం చేసేశారు. అప్పుడు సిద్ధాంత్ నిషితాతో, "ఔను.
ఇంతకూ నువ్వు ఆ సంబంధం వద్దని మీవాళ్ళతో ఎందుకు చెప్పాలనుకున్నావు?" అని
అడిగాడు.
నిషితా తల వంచుకుని, ఏం చెప్పాలో
తోచనట్టు ఉండిపోయింది.
మళ్ళీ ప్రార్థిత్ వంక తిరిగి,
"మరి, నువ్వు మీ అమ్మా వాళ్ళ గురించి ఏం ఆలోచించావు..?" అన్నాడు.
"ఇంకా ఎటూ తేలలేదు.." అన్నాడు
ప్రార్థిత్ చూపులు మళ్ళించుకుంటూ. "ఛ.. వాళ్ళను బాధా పెట్టలేను. సరేననీ
అనలేను.." అని ఆగి, "ఈమెకు ఇష్టం లేదని తనే వాళ్ళతో నేరుగా, గట్టిగా
చెప్తే వింటారేమోనని చూస్తున్నాను.." అన్నాడు.
"ఏం నిషీ, ఏమంటావు..?"
"అదే ఆలోచిస్తున్నాను. నేనే
వాళ్ళను ఇప్పటికి చాలా బాధపెట్టాను. ఇది వారి ఇష్టంతో జరిగిందనేసరికి
కాస్త.." అని ఆగింది నిషితా.
సిద్ధాంత్ ప్రార్థిత్ వంక తిరిగి,
"సరే, ఓకే. అయితే మీరు ఆలోచించుకుంటూనే ఉండండి. నా వంతు నేను చేస్తాను. రేపైతే
సంస్థ పునాది పడే అన్నీ ఏర్పాట్లు చేయిస్తాను.. నీ పేరే రిజిస్టర్ చేయిద్దాం.
నేనిప్పుడే విద్యార్థీకి ఫోన్ చేస్తాను. ఆమె ఉద్యోగం వరకైనా ఖాయమైతుంది.."
అని ఫోన్ చేసి రిజిస్టరాఫీసులో తన పరిచయస్తుడికి విషయమంతా వివరించి, ఏర్పాటు
చూడమని చెప్పాడు. అతను పని అయిపోతుందిలే, రేపు వచ్చి ఒకసారి కలవమని, నిశ్చింతగ
ఉండమని ధైర్యం చెప్పాడు.
తర్వాత, "మొన్న ఆ పెళ్ళి ఒకటి
రిజిస్టరైంది కదా, అది కాన్సిల్ చేయించాలి..! ఆ వివరాలు కూడా కనుక్కుని ఉంచు."
అని అతను సరేనన్నాక చెప్పి పెట్టేశాడు.
వెంటనే నిషితా ప్రతిస్పందిస్తూ చటుక్కున
అతని వంక చూసి, "ఎవరినడిగి ఆ చివరి మాట చెప్పారు..?" అనడిగింది.
సిద్ధాంత్ ఆశ్చర్యంగ, ప్రార్థిత్ ఏమో
నివ్వెరపాటుతో ఆమె వంక చూశారు.
"ఎవరినడగాలి..? ఏమనడగాలి..?"
అన్నాడు సిద్ధాంత్ విస్మయంగ చూసి.
"నన్నే అడగాలి..!! ఈ పని చేయనా, వద్దా
అని అడగాలి.." అందామె.
"అదేంటి..? ప్రార్థిత్ అంత
స్పష్టంగ చెప్పాడు కదా, వద్దని.." సిద్ధాంత్ కావాలనే ప్రార్థిత్ మాట తీశాడు.
"ఈ రిజిస్ట్రేషన్ అతని ఒక్కడి
పేరుమీద జరిగిందా? తను కాదంటే సరిపోయిందా? నా సమ్మతి అక్కరలేదా? వెంటనే ఫోన్ చేసి
కాన్సిలేషన్ ఎప్పటికీ అవసరం లేదని చెప్పండి!"
"కానీ.. ప్రార్థిత్.. అది.."
సిద్ధాంత్ కంగారుగా ప్రార్థిత్ వంక చూశాడు.
అప్పుడు ప్రార్థిత్ కల్పించుకుని,
"వద్దు నిషితా, తొందర పడకు..! ఇటువంటి నిర్ణయాలు ఆవేశంలో చేయాల్సినవి కావు.."
అన్నాడు.
"ఇక్కడెవరూ ఆవేశంలో లేరు. ఇంత సేపూ
అదే ఆలోచించాను. చెప్పే ధైర్యం లేక ఆగాను. ఇప్పుడు చెప్తున్నాను. ఇది మీదో నాదో
నిర్ణయం కాదు. మా అత్తామామల నిర్ణయం. నేను నచ్చినందుకే వాళ్ళు నన్ను ఈ విధంగ
ఎంచుకోవాలని చూశారు. నాకిందులో ఏ మోసం కనిపించటం లేదు. పైగా నాకు అది గర్వకారణం
కూడా. నా మీద నమ్మకం ఉండబట్టే వాళ్ళు ఇట్ల చేశారు. నా నటనే వారికి అంత నచ్చితే
నిజంగ నిర్వహిస్తే ఇంకెంత సంతోషపడతారో.."
"కానీ.. మన వ్యక్తిత్వాలు, భావాలు
కలవవు. మనకు సరిపడదు." ప్రార్థిత్ నచ్చచెప్పాలని చూశాడు.
"అయినా భావాలు గట్రాతో మీకు సంబంధం
లేదన్నారుగా..! కలిసి కర్తవ్యం నిర్వహించటానికి ఉద్యోగం ఇచ్చి సమర్థించింది మీరే
కదా. ఏఁ..? ఆ పని సంస్థలో ఉద్యోగి పేరుతో కాక, మీ ఇంటి కోడలి పేరుతో చేస్తే
తప్పొచ్చిందా..?" అందామె నిలదీస్తున్నట్టు.
"నీ పరిస్థితి వల్ల దీనిని అవకాశంగ
వాడుకోవటం లేదని నమ్మకం ఏంటి..?" ప్రార్థిత్ అడిగాడు సూటిగానే.
"అట్లైతే అక్కడ సంబంధం చెడిందని
తెలిశాక నింపాదిగా నిర్ణయం తీసుకునేదాన్ని. అట్ల జరగలేదే. మీ గురించిన నిర్ణయం
తీసుకున్నాకే వారికి ఆ మాట చెప్పాలని ఫోన్ చేస్తే ఆ సంగతి తెలిసింది. చూడండి, ఇది
ఇవాళ నా అవసరమో, లేక పరిస్థితో చూసుకునో స్వార్థం కోసం చేస్తున్న పని కాదు. మీ
మాటలు, భావాలు, అభిప్రాయాలన్నీ విన్నాక నాకు స్వయంగ అనిపించిందే నేను
చేస్తున్నాను."
ప్రార్థిత్ నోట మాటరాలేదు. సిద్ధాంత్
ఈసారి తన సంతోషం దాచుకునే ప్రయత్నం చేయలేదు. బయటకే ఆమెను చప్పట్లు కొట్టి
సమర్థించాడు. ప్రార్థిత్ అసహనంగ చూశాడు.
నిషితా దృఢంగ అంది- "మనిషి ఒకసారి
తప్పు చేసినంత మాత్రాన తప్పుడువాడైపోడు. చేసిందానికి నాలుగేళ్ళు పశ్చాత్తాప
పడ్డాను. మీరు కనిపిస్తే క్షమార్పణ అడగాలని పరితపించాను. నాకు ఆ నాలుగేళ్ళలో
ఎదురుపడిన పరిస్థితులు జీవితం అంటే ఏంటో సమగ్రంగ తెలియచెప్పాయి. అటువంటి ప్రతీ
సందర్భంలో మీ ఇంట్లో ఏ జన్మ పుణ్యం వల్లో వినగలిగిన తాత్త్విక చర్చలు గుర్తుకు
వచ్చేవి. ప్రాజెక్ట్ కోసం మీతో గడిపినప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా నాతో మీరు
చెప్పిన మంచిమాటలు ఎన్నో సందర్భాలలో దారిచూపాయి. అన్నయ్య రోడ్ మీద కనిపిస్తే
పరిగెత్తుకుని వచ్చి పలకరించింది మీగురించి కనుక్కుందామనే."
ప్రార్థిత్ ఎటో చూశాడు.
నిషితా సిద్ధాంత్ వంక తిరిగి, "ఇంక
నుంచి సంబోధనలో కూడా మీరు నా అన్నయ్య, మీ తొలి బాధ్యత- ఈరోజే నేను మా
అత్తవారింటికి వెళ్ళే ఏర్పాటు చేయించటం.." అంది. వెంటనే సిద్ధాంత్ తండ్రి పంచాంగం
తీసి మంచి సమయం చూసి, "రేపు సాయింత్రం బాగానే ఉంది.." అని చెప్పాడు. సిద్ధాంత్
తల ఊపి "అయితే రిజిస్ట్రేషన్ పని కాంగనే బయల్దేరవచ్చు. నేనే దిగబెట్టి
అప్పచెప్పి వస్తాను. సొంత చెల్లెలి అప్పగింతలు కూడా ఇంత సంతోషంగ చేసి ఉండను.."
అన్నాడు.
"అరే, అదేంట్రా.. ఏంటిది.?"
అన్నాడు ప్రార్థిత్. "నా మాట విను నిషితా.. ఇది పాడి కాదు నీకు.."
"మీకు మాట్లాడే హక్కు లేదని ముందే
చెప్పాను." అని ఆగి, తన సెల్ అతని ఎదురుంగనే తీసి, వాళ్ళ అమ్మానాన్నలకు ఫోన్
చేసింది నిషితా. ప్రార్థిత్ కళ్ళలోకి నిశితంగా చూస్తూ, అటు ఫోన్ ఎత్తంగనే,
"ఆఁ.. అమ్మా, నేను ఇక్కడ మంచి అబ్బాయిని పెళ్ళి చేసేసుకున్నాను. ఊఁ.. చాలా బాగుంటాడు.
ఊఁ.. మంచి కుటుంబం. మనం వాళ్ళ కాలిగోటికి కూడా సరిపోము. అంత సంస్కారమనే ఆస్తి,
సదాశయమనే అంతస్తు ఉన్నవాళ్ళు... ఊఁ.. .నేను రేపే అత్తవారింటికి వెళిపోతున్నాను... లేదు,
రిజిస్టర్ పెళ్ళి అయిపోయింది... ఆఁ.. అంతే. దానికోసమే ప్రమాదమని అబద్ధం
చెప్పించాను. ఇది ఫైనల్.... ఆఁ.. మీతో ఒక మాట చెప్పాలని ఫోన్ చేశాను. నాకోసం ఇంకే
సంబంధం వెతకకండి. నాన్నతో, అన్నయ్యతో కూడా ఈ మాట చెప్పు.. శాస్త్రరీత్యా పెళ్ళికి
కార్డు పంపుతాను. తప్పక రండి.. మా అత్తగారింటి అడ్రస్, మీ అల్లుడి ఫోటో మెసేజ్ పంపుతాను.."
అని ఫోన్ పెట్టేసింది.
సిద్ధాంత్ నవ్వుతూ, ఉద్విగ్న మనస్కంగ
ఉన్న ప్రార్థిత్ తో, "ఇప్పుడు నాకు మన అధికారిణి మీద ప్రతీకార వాంఛ
పోయింది.." అన్నాడు.
ప్రార్థిత్ మౌనంగ చూసి వదిలేశాడు.
సిద్ధాంత్ అతని భుజం తట్టి, "ఒరే, నిషీ మాటల్లో కూడా నిజం ఉంది. తను దీనిని
ఆంటీ అంకుల్ నిర్ణయంగ తీసుకుని అంగీకరింస్తోందే కానీ ఇష్టాఇష్టాల ఆధారంగ కాదు. అత్తాకోడళ్ళు
సఖ్యంగ ఉన్న ఇల్లు నందనవనంతో సమానం. దానికి నా ఇల్లే ఉదాహరణ. ఏమో, నువ్వు కోరిన
వధువు ఆమే కాగలదేమో. పాజిటివ్ గా ఎందుకు ఆలోచించకూడదు..?" అన్నాడు.
"చూడండి, మంచి కుటుంబం, విలువలు
తెలియచెప్పే తల్లిదండ్రులు అందరికీ దొరకరు. మీవాళ్ళు ఏదో నిగూఢంగ ఆలోచించే సిద్ధూ
అన్నయ్య ద్వారా ఈ పని చేయించి ఉంటారు. కాదనే హక్కు మీకు లేదు..! ఇది మీ ప్రమేయంతో
జరిగింది కాదు. కనక అంగీకరించాలా లేదా అనేది మాట్లాడే హక్కు మీకన్నా ఎక్కువ నాకే
ఉంది."
"అది దమ్మంటే..!! ఔన్రా. నీకు మీ
అమ్మ నాన్నలే హక్కునివ్వలేదు. ఇంక ఆమెందుకు ఇవ్వాలి..?" అని ఆమెను
మెచ్చుకుని, హఠాత్తుగ ప్రార్థిత్ కోపంగ తనవంక చూసేసరికి మాన్పడిపోయాడు సిద్ధాంత్.
"లేదు.. నేను ఒప్పుకోను.. ఈ పెళ్ళి
కాన్సిల్ చేయించాల్సిందే." అన్నాడు ప్రార్థిత్ బింకంగ. "ఏంటి..? అందరికీ
నేనంటే అంత ఆటైపోయింది..? ఎవరి పాటికి వారు నిర్ణయాలు చేసేసి నా మీద
రుద్దుతున్నారు..? మనిషి ఆశయాలంటే అంత చులకనగా ఉందా..?"
"లేదు. అంత గౌరవంగ ఉంది. వాటికోసం
ఏమైనా చేయాలనిపిస్తోంది. మీరు చేయంగ లేనిది నేను చేయలేనా? ఇంక ఈ పెళ్ళి కాన్సిల్
కాదు. నేను చచ్చినా సంతకం చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి.." అనేసింది
నిషితా.
సిద్ధాంత్ ప్రార్థిత్ వంక తిరిగి,
"నీ చెల్లెలై ఉంటే ఏం చేసేవాడివి.. అని అడిగేవాడివిగా..! ఇదిగో, ఇదే
చేసేవాడిని. వెంటనే నీకిచ్చి పెళ్ళి చేసేవాడిని. మా చిన్నికి మేనరికం ఉందని కానీ
లేదంటే నిన్ను వదులుకునేవాణ్ణి కాదు. కనీసం ఈ చెల్లెలినైనా నీకిచ్చుకోనివ్వు. నీ
మంచితనానికి పడే శిక్ష అనుకోనైనా అంగీకరించేసేయి.."
ప్రార్థిత్ సోఫాలో కూర్చుని
తలపట్టుకున్నాడు. సిద్ధాంత్ నిషితా వంక చూసి, చేయి కలిపాడు. అది చూసి కోపంగ
ఉరమబోతే ప్రార్థిత్ ను చూసి కన్నుకొట్టాడు. ప్రార్థిత్ కళ్ళు మూసుకున్నాడు. నిషితా
మనసులో దేవుడికి వేయి దండాలు పెట్టుకుంది.
**************
*********
No comments:
Post a Comment