8
ఆరోజు సంస్థ రిజిస్ట్రేషన్ కోసం
సిద్ధాంత్ ప్రార్థిత్ ని ఊరి నుండి రప్పించాడు. సిద్ధాంత్ పేరు మీద సంస్థ
రిజిస్టర్ కావటానికి అన్ని హంగులూ పూర్తైనాయి. లాయర్లు ఒకరికిద్దరిని కూర్చోపెట్టి
అన్నీ సరిచూసుకున్నాకే రిజిస్ట్రేషన్ ప్లాన్ చేశారు. ప్రార్థిత్ ఆ రోజు ఉదయమే ఊరి
నుంచి వచ్చాడు. అతను మొదటిసారి వారి ఇంటికి వెళ్ళటం. ప్రాక్తన అతనిని అన్నయ్యా
అని, అతని పిల్లలు మామయ్యా అని చాలా ఆదరించారు. సిద్ధాంత్ వాళ్ళ అమ్మా నాన్నలు
కూడా వచ్చి ఉన్నారు ఆ సమయంలో. కొన్నాళ్ళు సిద్ధాంత్ పాపతో ఆడుకోవాలని వచ్చారట.
వాళ్ళు ప్రార్థిత్ తో గతం ముచ్చట్లన్నీ గుర్తు చేసుకున్నారు. అప్పుట్లో సిద్ధాంత్
ఎట్ల పెళ్ళికి మొరాయించాడో, ప్రార్థిత్ మాటల వల్లే మళ్ళీ ఎట్ల ఒప్పుకున్నాడో అన్నీ
కోడలి ఎదుట చెప్పి మళ్ళీ ప్రార్థిత్ కి ధన్యవాదాలు చెప్పారు. ప్రార్థిత్ కి దాని
వల్లే ప్రైజ్ పోయిన సంగతి వారికి తెలియదు. బాధపడతారని సిద్ధాంత్ చెప్పలేదు. ప్రార్థిత్
అంటే వారికి చాలా ఇష్టం.
ప్రార్థిత్ కి సిద్ధాంత్ కుటుంబం చాలా
నచ్చింది. పాప ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తూ అందరినీ అలరిస్తోంది. ‘అత్త, తాత’
అంటోంది. ప్రార్థిత్ ని చూసి మొదటిసారి మామా అందిట. మామయ్యా అని వదిలిపెట్టకుండా
అంటుకుని తిరిగిన వాళ్ళ పిల్లవాడితో బాగా మైమరచిపోయి ఆడుకున్నాడు. చెల్లాయి అంటూ ప్రాక్తనతో
నవ్వుతూ సిద్ధాంత్ గురించి ఏవో విషయాలు చెప్పి, జోకులు వేశాడు. చాలాకాలం తర్వాత
ఎవరింటికైనా వచ్చి అట్ల మాట్లాడటం. చాలాకాలం తర్వాత, హాయిగా తృప్తిగ
నవ్వుకున్నాడు. స్నేహితుడికి ఇంతకాలం దూరంగ ఉన్న బాధ అతనిలో చాలా కనిపించింది ఆ
సమయంలో.
"ఏమోయ్.. మరి నీతోటివాడు ఇద్దరు
పిల్లల తండ్రైనాడు.. ఇంక నీ పెళ్ళెప్పుడు..?" అడిగారు పెద్దవాళ్ళు చనువుగా.
సిద్ధాంత్ నవ్వి, "ఇదిగో, ఆ పిల్ల
తల్లికి సంబంధాలు చూస్తున్నారట. కుదరంగనే చేసేస్తే ఆమె పిల్లను కంటుంది. కనంగనే వివాహయోగ్యమైన
వయసురావటమేంటి.. ముహుర్తాలు పెట్టుకోవటమేంటి..?" అన్నాడు.
దానికి నవ్వి, "అయితే మా వాళ్ళలో
మంచి పిల్లలున్నారు.. చెప్పమన్నావా..?" ఆసక్తిగా అడిగింది సిద్ధాంత్ తల్లి.
ప్రార్థిత్ నవ్వి, "లేదాంటీ..
నాన్నగారి రిసర్చ్ పని చివరకు వచ్చి ఆగి ఉంది. ఇప్పుడు పెళ్ళి అంటే ఇంక అదెప్పటికీ
పూర్తి కాదని ఇంకొంత ఆగుదామనుకున్నాం. ఇదిగో, ఈ సంస్థ పని ఒకటి మొదలవుతోంది.
దాన్ని నడపటానికి మంచి ఉద్యోగులను చూసుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. ఎంత..? ఒక
సంవత్సరంలో పూర్తవుతాయి. కాంగనే చెప్తాను.." అన్నాడు మర్యాదగా.
"సరే, ఇంక బయల్దేరదామా..? అన్నాడు
సిద్ధాంత్ టైం చూసుకుని. "రిజిస్టరాఫీసుకు వెళ్ళి సంతకాలు చేయాలా
వద్దా..?"
సరేనని లేచి శెలవు తీసుకుని బయలుదేరారు
ఇద్దరు. తిరిగి భోజనాల వేళకు ఇంటికే రమ్మని మరీ మరీ చెప్పి పంపింది ప్రాక్తన.
సరేనన్నారిద్దరు. అక్కడకు చేరేసరికి రిజిస్టరాఫీసులో అన్ని కాగితాలు సరిగ్గనే
ఉన్నాయని, ప్రూఫ్ లవీ సవ్యంగనే ఉన్నాయని ముందే వెరిఫై చేసేశారట. సిద్ధాంత్ కి
పరిచయం ఉన్న ఆఫీసర్ ఒకతను "ఇంక ఏమీ తక్కువ లేదు." అని నిర్దారించాడు. కానీ
రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి అంటే సాక్షి సంతకం ఒకరిది తక్కువ పడింది. కనక అందరూ
ఉంటేనే సంతకాల పని ఒకేసారి పూర్తవుతుందని వాళ్ళు ససేమిరా అన్నారు.
"అదేంటి, సాక్షికి ఎవ్వరినీ
తీసుకురాలేదా..?" అడిగాడు ప్రార్థిత్ ఆశ్చర్యంగ. "నేను దాని గురించే
మర్చిపోయాను."
సిద్ధాంత్ వాచ్ చూసుకుని, "నేను
మర్చిపోలేదు. చెప్పి ఉంచాను ఒకరికి. ఈపాటికి రావాల్సింది.. లేటై ఉంటుంది...
ట్రాఫిక్ కదా.." అన్నాడు.
అంతలోకి హడావుడిగా బండి పార్క్ చేసి వస్తున్న
నిషితాను చూసి ప్రార్థిత్ ఒక్కసారిగా షాకైనాడు. ఆమె వస్తూనే సిద్ధాంత్ తో, 'నేనేమైనా
లేటైనానా?' అని ఏదో అడగబోయి ప్రార్థిత్ ని అక్కడే నిలబడి ఉండటం చూసి
బిగుసుకుపోయింది. ఆమెను చూసి ప్రార్థిత్ చాలా విస్మితుడైనాడు. ఊహించని చోటు,
ఊహించని వ్యక్తి కనిపించినందుకన్నా ఊహించని రూపంలో కనిపించేసరికి
గుర్తించలేకపోయాడు. నిషితా కూడా అతనిని చూసి ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడాలో, ఎట్ల
పలకరించాలో తెలియలేదు. పరస్పరం ‘బాగున్నారా’, అంటే ‘ఊఁ.. ఆఁ..’ అనుకున్నారు.
తర్వాత దిక్కులు చూశారు.
సిద్ధాంత్ ఇద్దరి పరిస్థితి చూసి, తనే ప్రార్థిత్
ను మాట్లాడించాడు- "నిషితా ఇప్పుడు స్కూల్ టీచర్. స్కూల్ నుంచే గంట పర్మిషన్
అడిగి వచ్చింది.." అని చెప్పాడు.
తర్వాత నిషితాతో, "గుర్తుపట్టావా..?
అడిగావు కదా, మీ ఫ్రెండ్ ఏడి అని..? నీకోసం వెతికి పట్టి తెచ్చాను.. ఇదిగో, సారీ
చెప్తానన్నావుగా.. చెప్పుకో." అన్నాడు.
నిషితా చుట్టూ పరిసరాలు చూసి, బెదురుగా
మళ్ళీ ప్రార్థిత్ ని చూసి తల వంచుకుంది. ప్రార్థిత్ ఆమె అభిప్రాయం అర్థమై,
సిద్ధాంత్ తో, "నీకేమైనా మెంటలా..? ఇది సందర్భమా వాటన్నింటికీ..? అవతల
సంతకాలకు వేళ దాటిపోతోంది. నాన్న ముహుర్తం దాటనివ్వద్దన్నారు.
గుర్తుందిగా..?" అన్నాడు.
సిద్ధాంత్ తల కొట్టుకుని, "ఔనౌను..
నిజమే. పద పద.. నిషీ.. రా.. నీ సంతకం ఒక్కదానివల్ల పనంతా ఆగింది.." అన్నాడు
ఆమెను లోపలకు తీసుకుపోతూ. అందరూ ఆఫీస్ లోపలకు వెళ్ళారు.
నిషితాను చూసిన దగ్గరి నుంచీ ప్రార్థిత్
మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఇంక ఊరుకోకుండా పాత జ్ఞాపకాలు వెంటాడసాగాయి. ప్రస్తుతం
మీద దృష్టి పోయింది. హఠాత్తుగ ఆమెను ఎదురుంగ తెచ్చి పెట్టే ముందు సిద్ధాంత్ తనతో
ఒక్కమాటైనా చెప్పాల్సింది. అసలు నిషితా అతనికెట్ల తెలుసు..? మొన్న తమ ఇంటికి వచ్చి
వెళ్ళిన తర్వాత తెలుసా, లేక అంతకుముందే కలిసి ఉంటుందా..? నిషితా ఏంటి ఇంత
మారిపోయింది..? అప్పటికన్నా హుందాగా, అర్థవంతంగా ఎంత చక్కగా ఉంది..! ఆమెలో ఎంత
మార్పు! చక్కగా ప్లెయిన్ చీర కట్టుకుని, వాలు జడ వేసుకుని, మామూలు రకం హాండ్ బాగ్
తో, ఏ అలంకరణా లేకుండా సామాన్య స్త్రీగా ఉందిప్పుడు. ఆ పొడుగాటి చెవుల లోలకులు
లేవు.. క్లిప్పులు లేవు.. రింగుల జుట్టు లేదు.. పెదాలకు రంగు లేదు.. ముక్కుకు
లేటెస్ట్ ఫ్యాషన్ ముక్కు పుడక లేదు.. అసలు ఆ కట్టు, బొట్టు చూసి ఆమె ఆమేనని గుర్తు
పట్టటానికి ప్రార్థిత్ కి కాస్త సమయం పట్టింది. అప్పట్లో మాటకు ముందు కులుకుతూ
నడిచే ఆ నిషితాకు, తన ఎదురుంగ ఉన్న ఈ అమ్మాయికి అసలు పొంతనే లేదు. ప్రార్థిత్ ఆమె
పై నుంచి చూపులు మరల్చుకోలేకపోతున్నాడు. నమ్మలేకుండా ఉంది ఇది. అతనిలో చాలా భావాలు
కదలాడసాగాయి.
ప్రార్థిత్ కు అంత అన్యమనస్కంగ ఎప్పుడూ
అనిపించలేదు. మొదటిసారి చాలా విచిత్రమైన భావాలు కలగసాగాయి. నిషితాను చూస్తుంటే
మాట్లాడాలో మాట్లాడవద్దో అర్థం కాని పరిస్థితి. మాట్లాడకపోతే బాధపడుతుంది. తను
ఆమెను ఇప్పటికీ క్షమించలేదేమోనని లోలోపల కుచించుకుపోతుంది. కనక ఆ భావన
కలగనివ్వకుండా మాట్లాడాలి. వీలైతే అప్పటి మాటే తీయద్దు. కానీ ఆమె తీస్తే..?
క్షమార్పణ అడిగితే..? మారిన ఆమె రూపం, ఆమె కదలికలు, ముఖకవళికలు చూస్తుంటే తప్పు
చేసిందని బాగా బాధపడుతున్నట్టే ఉంది. ఆమె తనతో ఆట ఆడినందుకు తను మాత్రం ఏమీ
బాధపడలేదు. కానీ అమ్మ మనసును బాధపెట్టిందే.. అదే కోపం వస్తుంది. ఎప్పటికీ
క్షమించద్దు అనిపిస్తుంది. క్రమంగా అతని మనస్సు, ఆమె తన మాడల్ తయారు చేసేవేళలో
దగ్గరగా మసలిన సందర్భాల వైపు వెళ్ళింది. చాలా మోసపోయిన భావన కలిగింది. అయినా
చేసినదానికి ఆమె సిగ్గుపడాలి. తానెందుకు ఇబ్బంది పడేది..? తనేం చేశాడు..?
ఎప్పుడైనా ఆమెతో అట్ల ప్రవర్తించాడా..? అటువంటి చెత్త పనులు తాను కాదుగా
చేసింది..? అయితే అధికారిణి ఆమె చేత ఈ పని చేయించిందని నిషితాయే సిద్ధాంత్ కి
చెప్పిందన్నమాట..!! అతని సోర్స్ ఏంటో ప్రార్థిత్ కి తెలిసింది. అంటే సిద్ధాంత్
కావాలనే నిషితా విషయం తన వద్ద దాచాడన్నమాట.
అటుపక్క నిషితా హఠాత్తుగ ప్రార్థిత్ ఎదురు
పడేసరికి కాస్త కంగారు, చేసిన చెత్త పనికి సిగ్గు, అభిమానం కలుగుతంటే రకరకాల
అలజడులకు లోనైంది. అతనిని చాలా సార్లు ఆమె తలచుకుంది. ప్రథమస్థానం కోసం ఆశ పడి, అధికారిణి
చేయించిన పని వల్ల తను అతని ముందర చెడ్డదైందని బాధపడుతూ చాలా రాత్రులు నిద్ర
లేకుండా గడిపింది. చివరకు అతనికి దక్కాల్సిన డబ్బు అందుకుంటూ, ఉద్యోగం
అందుకుంటూంటే చాలా ఘోరంగ, క్రూరంగ అనిపించినప్పటి స్టేజి మీది భావనే ఇప్పుడూ అనిపిస్తోంది.
అక్కడ ఆ సమయంలో ప్రార్థిత్ ఉండి ఉంటే తను ఆ పని చేయగలిగేది కాదేమో. స్టేజి ఎక్కనే
ఎక్క లేకపోయేదేమో. అతను రాడనే ధైర్యంతోనే ఆ రోజు తను ఆ పార్టీకి వెళ్ళింది. మెయిల్
పని చేయనివ్వకుండా స్పామ్ చేసేసి పడేసింది. ఏమనుకున్నాడో ఏమో. తనను గురించి తప్పక
నీచంగ అనుకుని ఉంటాడు.
నిషితా మనసంతా అల్లకల్లోలం అయింది.
అయినా సిద్దాంత్ ఎందుకు తనతో కనీసం ఒక్కమాటైనా చెప్పలేదు..? నిజానికి సిద్ధాంత్ తో
తనే మాట కదిపింది- ప్రార్థిత్ గురించి అడిగింది. కానీ అతను కాంటాక్టులో లేడని
అన్నాడప్పుడు. మరి ఇప్పుడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో..!! ప్రార్థిత్ వస్తున్నాడని
తెలిస్తే తను ససేమిరా రాననేసేదే..! అసలు ఎవరి రెజిస్ట్రేషనో కూడా తను
తెలుసుకోలేదు. ఎంత తప్పైంది..!! నిన్నటికి నిన్న ఫోన్ చేసి ఇవాళ ఫలానా వేళకు ఫ్రీ
ఉంటే రెజిస్టరాఫీసుకు రావా..? ఒక సహాయం కావాలి అన్నాడు. సరే, సంతకమే కదా- అని
వచ్చింది. పైగా ఏదో సమాజసేవా సంస్థ అన్నాడు కదా అని ఇష్టంగ వచ్చింది. ఇక్కడ ఈ
సన్నివేశానికి ఆమె ఏ రకంగానూ సన్నద్ధంగ లేదు. ఆ ఘట్టం తర్వాత మళ్ళీ అతనిని
ఎదురుపడి మాట్లాడాలంటే చాలా ఎబ్బెట్టుగా, జంకుగా అనిపించిందామెకు. అసలు చెత్త
పనులు చేసేటప్పుడు ఉండాలి. ఇప్పుడు పట్టుబడ్డ తర్వాత ఎదురుపడితే ఎంత అసహ్యంగ
ఉంటుంది!! సారీ చెప్పాలన్న మనసున్నా ఎట్ల చెప్పాలో తెలియటం లేదు. ఆమెకు ప్రార్థిత్
తల్లితండ్రులు, వాళ్ళ ఇల్లు, అప్పుడు మాడల్ చేసే వేళలో తాను వాళ్ళ నమ్మకం
గెలుచుకోవటానికి చేసిన చిల్లర వేషాలు గుర్తుకు వచ్చి ఒళ్ళంతా ముచ్చెమటలు పోశాయి.
"ఇక్కడ మేడమ్.. దీని కింద
పెట్టండి.. నేను వేలు పెట్టిన చోట.." ఆఫీస్ బాయ్ మాటతో తేరుకుంది.
నిషితాకు సంతకాలు పెడుతుంటే ఊపిరి
అందలేదు. "ప్లీజ్.. కాస్త ఫాన్ పెద్దగ పెడతారా..?" అని అడిగింది. ప్యూన్
ఆమెను చూసి నవ్వుతూ ఫాన్ పెంచాడు. పెన్ చేతిలో వణకసాగింది. ఆగి అటూ ఇటూ చూసి,
సిద్ధాంత్ తో కాసిని మంచినీరిప్పించమని సైగ చేసింది. అతను విచిత్రంగ చూస్తే,
"మొదటిసారి కదా, రిజిస్టరాఫీసుకు రావటం.. సంతకాలు పెట్టటం.. కాస్త
కంగారేస్తోంది.." అని చెప్పింది. సిద్ధాంత్ నవ్వి, "ఫరవాలేదులే.. కాస్త
రిలాక్సయ్యాక అయినా చేద్దువుగాని.." అన్నాడు. ఆమె "ఫరవాలేద"ని
చెప్పి కాస్త కుదుటపడి సంతకాలు చేసింది. తర్వాత మిగితా వారు కూడా సంతకాలు చేశారు.
వేలి మద్రలు కూడా వేశారు.
ఈ విధంగ వారిద్దరు తమ తమ భావాలల్లో
మునిగి ఉండంగనే సంస్థ రెజిస్ట్రేషన్ పని పూర్తైంది. అన్నీ పనులు పూర్తైనాయి. ఆఫీస్
బయటకు వచ్చేశారు.
"హమ్మయ్య..
కంగ్రాట్స్ రా.. ఇన్నాళ్ళకు నా కల పూర్తైంది..!" అని సిద్ధాంత్ ప్రార్థిత్ ను
కౌగిలించుకున్నాడు ప్రేమగా. ప్రార్థిత్ అతనిని మర్యాదకు దగ్గరకు తీసుకుని, వదిలేసి
పక్కకు చూశాడు.
సిద్ధాంత్ నిషితాకు చేయి కలిపి,
"కంగ్రాట్ ఓయ్.." అన్నాడు.
నిషితా ఇబ్బందిగా చూసి, "నాకెందుకు
కంగ్రాట్స్..?" అని అడిగింది.
"మొదటి సారి సాక్షి సంతకం పెట్టావు
కదా.." పగలబడి నవ్వాడు సిద్ధాంత్. ప్రార్థిత్ చూస్తే నిషితా కనీసం చిరునవ్వు
కూడా నవ్వలేదు. ఆమె పడే ఇబ్బంది కళ్ళకు కనపడుతూనే ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత
త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుని, "సరేరా, మరి ఉంటాను.. నాన్నగారు
ఫోన్ చేశారు.. పని అయిన వెంటనే రమ్మని.." అన్నాడు, అప్పటి నుంచి ఆలోచిస్తూంటే
తట్టిన వంకను అతనికి వినిపిస్తూ.
"అదేంటి? ఇంట్లో భోజనాల
ఏర్పాటైంది. మీ చెల్లాయి ఎదురుచూస్తోంది. ఉదయం చెప్పే వచ్చాం కదా, మధ్యాహ్నం
భోజనాలకు వస్తున్నామని?" అన్నాడు సిద్ధాంత్ ఆశ్చర్యంతో పాటు కాస్త అనుమానంగ.
"లేదు లేదు.. వెళతాను. నేను
లేకపోతే పని ఆగిపోతుంది." అని వాచ్ చూసుకుని, "ఈ వేళ్టప్పుడు ఊరికి
నేరుగా బస్సు ఉంటుంది. అది పోతే సాయింత్రం దాకా వేరే ఉండదు. ప్లీజ్. ఏమనుకోకుమని
చెల్లాయికి, ఆంటీవాళ్ళకు చెప్పు.. నేను ఫోన్ చేస్తాలే.." అన్నాడు ప్రార్థిత్ కదులుతూనే.
సిద్ధాంత్ చాలా నివ్వెరపాటుతో అతనిని ఆపాలని
చూశాడు. కానీ ప్రార్థిత్ ఆగలేదు. కార్ లో బస్ స్టేషన్ వద్ద దింపుతానన్నా వినలేదు.
అటు నిషితా ముఖం చూడలేదు. ఆమెతో మాట్లాడలేదు. వెళ్తున్నానని చెప్పనుకూడా లేదు. చకచకా
నడిచి, అక్కడే గేట్ వద్ద ఎదురుపడిన మొదటి ఆటో పిలుచుకుని వెళిపోయాడు.
నిషితా చాలా చిన్నబుచ్చుకుంది. కానీ 'ఒకరకంగ
ఇదే నయం. మాట్లాడితే ఏం మాట్లాడాలో, ఎట్ల మాట్లాడాలో తోచక చచ్చేదాన్ని..' అనుకుని
సరిపెట్టుకుంది. అతను వెళుతున్న వైపు చూస్తున్న సిద్ధాంత్ ను చూసి, "నా మీద
కోపం పోనట్టుంది.." అంది బాధగా.
"అదేం లేదు.. వాడు నిన్ను ఎప్పుడో
క్షమించాడు. అందరూ అనుకున్నట్టు వాడేమీ నీ ఉద్యోగం పోవటానికి కారణం కాడని చెప్పాను
కదా." అన్నాడు సిద్ధాంత్ ఆమెను ఓదారుస్తూ.
"చెప్పారు.. కానీ.. అతని తీరు చూస్తే.."
"వదిలేయిలే.. బహుశ నిన్ను ఇబ్బంది
పెట్టటం ఇష్టంలేక కూడా వెళిపోయి ఉండవచ్చు..! పాతవిషయాల జ్ఞాపకంతో నువ్వు ఏమైనా
ఫీలైతావేమోనని.."
"కావచ్చు.." అని
నిట్టూర్చింది నిషితా. ఏదైనా, అతను కొంచెమైనా ఆగాల్సింది. అనుకుంది మనుసులో. బాగ్
లో నుంచి ని బాటిల్ తీసి గటగట తాగేసింది.
సిద్ధాంత్ అదంతా వదిలేయమని, ఏదో
అనబోతుంటే అకస్మాత్ గ కింద పడి ఉన్న ఫోటో ఒకటి కనిపించింది. నిషితా బాటిల్ తీస్తుంటే
పడింది. అది ఒక అబ్బాయి పోటో. కిందకు వంగి తీశాడతను. ఈలోపు బాటిల్ లోపల
పెట్టుకుంటూ అది చూసి నిషితా వెంటనే అతని చేతిలోనుంచి లాగేసుకుని లోపల
పెట్టేసుకుంది. ఎవరు ఎవరని సిద్ధాంత్ అడిగాడు. నిషితా తల వాలిపోయింది. వెంటనే ఇంక
వెళతానని కదలబోయింది.
“ఆగాగు.. చాలా రోజులైంది మనం కలిసి.
నీతో చాలా మాట్లాడాలి..” అని ఆమెతో రిజిస్టరాఫీస్ బయట బెంచీ మీద కూర్చోని, "పోనీ
ఆ అబ్బాయి సంగతి మానేయి. ఇంక..? విశేషాలేంటి" అని అడిగాడు.
నిషితా స్కూల్ సంగతులు ఏవో చెప్పింది.
తర్వాత హాస్టల్ విశేషాలు చెప్పింది. తర్వాత -"సరే, చెప్పేస్తాను. ఆ ఫోటోకు
సంబంధించిన ఒక విశేషం ఉంది. చాలా సంతోషకరమైంది.." చెప్పింది కాస్త గర్వంగ,
కాస్త సిగ్గుగా. "మా అమ్మా నాన్నా ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారుట. అన్నయ్య తన
తప్పు తెలుసుకుని అమ్మను తిరిగి రమ్మని ప్రాధేయపడ్డాడట. నిన్న నేనే మా నాన్నకు
ఫోన్ చేశాను. అప్పుడు తెలిసింది.." అని చెప్పింది.
"నిజమా..? మంచిది." అన్నాడు
సిద్ధాంత్.
"వాళ్ళే నాకు ఒక పెళ్ళి సంబంధం
కూడా చూస్తున్నారట. వాళ్ళందరికీ నచ్చాడట అబ్బాయి. నాకూ నచ్చితే పెళ్ళి
చేస్తామంటున్నారు..! రేపే ఆన్ లైన్ రమ్మన్నారు. కలిసి కాన్ఫరెంస్ పెట్టి,
మాట్లాడించాలనుకుంటున్నారు..! అంతా ఓకే అంటే తర్వాత వెంటనే ముహూర్తాలు
పెట్టేసుకోవచ్చన్నారు. చాలా హడావుడిగా ఉన్నారు."
"అబ్బో.. పెళ్ళి గురించేనా ఇంత
సంతోషం..?"
"పెళ్ళి కోసం కాదు కానీ, నా
గురించి కూతురిగా వాళ్ళు ఇంత కాలానికి కాస్తైనా ఆలోచించారని సంతోషంగ ఉంది."
నిషితా తృప్తిగా అంది.
"ఇంకేం..? నీ సమస్యలు తీరినట్టే
కదా.."
"ఊఁ.. అంటే.. చూడాలి..! ఈ పెళ్ళి
కుదిరితే నేనింక మా ఊరికి వెళిపోతాను. వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరేనట. నేను
నావారు అందరితో కలిసి ఉండచ్చు. ఈ ఒంటరితనంతో విసుగు వచ్చింది. ఎవరో ఒక మంచి
అబ్బాయి చాలనుకున్నాను. అతనికి ఎంఎన్సీలో పెద్ద ఉద్యోగం, మంచి సంపాదనా ఉంది. నేను
సొంతగా కూడా ఫర్మ్ పెట్టేసుకోగలిగేంత పెట్టుబడి ఉత్తగనే పెట్టగలడు. అదే ఆశగా ఉంది.
ఇంక.. అన్నింటికన్నా ముఖ్యమైందేంటే, అతనికి నేను ఇదివరకు చేసిన ఇంటీరియర్స్
డిజైన్స్ పంపించాను. నా స్టైల్ చాలా నచ్చిందిట. సో, సంబంధం ఒకే అయితే పెళ్ళికన్నా
ముందే ఫర్మ్ గురించి ఆలోచిద్దామని ఫోనులో అన్నాడు.." నవ్విందామె, చాలా
కాలానికి నిండుగా.
సిద్ధాంత్ ఆమె నవ్వునే చూస్తుండిపోయి తర్వాత
అన్నాడు- "ఇది ఫైనలేనని నీకనిపిస్తోందా..? మళ్ళీ వాళ్ళలో ఏ గొడవలూ రాకుండా..
ఏ నిర్ణయాలు మారకుండా ఉంటాయని నమ్మచ్చా..?"
"ఊఁ.. అనే అనుకుంటున్నాను."
అని నవ్వి, "మా అమ్మా నాన్నా నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తుండి ఇప్పటికి
కనీసం ఓ ముప్ఫైసార్లైనా విడిపోయి కలిసి ఉంటారు. ఇప్పుడీ పెళ్ళి అనేది వేరేవాళ్ళతో
ముడి పడింది కనక పరువుమర్యాదల కోసమైనా నిర్వహిస్తారనే అనిపిస్తోంది.." అంది
నిషితా ఆశగా ఆకాశంలోకి చూస్తూ.
తర్వాత ఆమె ఏదో మాట్లాడి, గంట పర్మిషన్
అయిపోతుందని చెప్పి, శెలవ అడిగి, వచ్చిన దారినే బండి మీద వెళిపోయింది.
సిద్ధాంత్ ఇద్దరూ వెళిపోయిన దిశలుగా చూసి
నవ్వుకున్నాడు. తర్వాత, తన పరిచితుడు అయిన ఉద్యోగి వద్దకు వెళ్ళి ధన్యవాదాలు
చెప్పాడు. "ఎప్పటివరకు వస్తుంది సర్టిఫికెట్?" అడిగాడు.
"ఒక నాలుగు రోజులు.. మీ అడ్రస్ కే
పోస్ట్ చేయిస్తాను.. భయం లేదు.."
"మొత్తానికి ఎవ్వరికీ అనుమానం
రాలేదులే.. బ్రతికిపోయాం.." అన్నాడు సిద్ధాంత్ తేలికపడుతూ.
No comments:
Post a Comment