5
పోటీకి ఎంట్రీ పంపిన నెలరోజులకు ఎంతో
ఎదురు చూసిన ఫలితాలు వచ్చాయి. అప్పటికి ప్రార్థిత్ కాస్త కోలుకున్నాడు. ఆఫీస్ కి
రాలేకపోయినా ఇంట్లో తిరగగలుగుతున్నాడు. సిద్ధాంత్ విహారయాత్ర ముగించుకుని
యథావిధిగా కార్యాలయానికి వెళ్ళి వస్తున్నాడు. ఫలితాల సంగతి తెలిసి సిద్ధాంత్ ఏ మాట
కనుక్కోవటానికి లాల్ ఎండ్ లాల్ కంపెనీకి వెళ్ళాడు.
అయితే ఈస్తెటిక్స్ పోటీలో మొదటి బహుమతే
కాదు, ప్రార్థిత్ కి కనీసం చివరి బహుమతి కూడా రాలేదు. అతనికి రాకపోవటమే కాదు,
నిషితాకు ప్రథమ బహుమతి వచ్చింది. దానితో ప్రార్థిత్ కన్నా సిద్ధాంతే ఎక్కువ
ఆశ్చర్యపోయాడు, బాధపడ్డాడు.
"అదేంటి..? ప్రైజ్ నీకు రాకుండ
ఆమెకు రావటం..? అదీ లాల్ ఎండ్ లాల్ వాళ్ళ నిరీక్షణలో..? తప్పక ఏదో కుతంత్రం
జరిగింది." అన్నాడు.
కానీ ఫలితాలలో తన పేరు లేకపోయినందుకు
కానీ, నిషితా బహుమతి గెలుచుకున్నందుకు కానీ ప్రార్థిత్ బాధపడలేదు. "పోనీలేరా,
ఏ పోటీలో అయినా నేను పాల్గొనాలనుకున్నానే కానీ బహుమతి నాకే కావాలని ఎన్నడూ
అనుకోలేదు. నాకెప్పుడూ పని మీదే దృష్టి ఉంటుంది. నా వంతు ప్రయత్నం నేను చేశాను.
నాకు అదే చాలు.." అన్నాడు ప్రార్థిత్ ఏమాత్రం తొణకకుండా.
"నువ్వు భయపడినట్టు మన మేడమ్ ఏమైనా
హస్తకౌశలం ప్రదర్శించి ఉంటుందా..?"
"ఏమో.. చెప్పలేము. నిషితానే బాగా
చేసి ఉండవచ్చు కదా..!"
"ఏంటి, నువ్వు ఆ మాట అంటున్నావా..?
నేను నమ్మలేకపోతున్నాను."
"ఫలితం మన చేతిలో లేనిది. దాని
గురించి ఏంటి వాపోయేది..? ఈసారి అనుభవం మాత్రం నాకు జీవితాంతం
గుర్తుండిపోతుంది.." అన్నాడు ప్రార్థిత్. సిద్ధాంత్ అతని కళ్ళలో ఏ అసూయా, ఏ
వేదనా, కించిత్తైనా అసంతృప్తి లేకపోవటం చూసి మరింత నివ్వెరపాటుకు లోనైనాడు.
ఈస్తెటిక్స్ వాళ్ళు బహుమతి ప్రదానోత్సవం
చాలా గొప్పగా ఏర్పాటు చేస్తారు ప్రతీసారి. అది చూడటానికి నగరంలో ఎంతో పెద్ద పెద్దవారూ,
డబ్బూ, హోదా, పేరూ పరపతులలో గొప్ప వ్యక్తులంతా వస్తారు. బహుమతి రాకపోయినా ప్రార్థిత్
కి ఏదైనా మంచి ఓపెనింగ్ దొరుకుతుందేమో చూడాలని సిద్దాంత్ ఆశ. ప్రార్థిత్ కేమో బహుమతి
అందుకోవటానికి కాక విడిగా వెళ్ళాలంటే ఎట్లగో అనిపిస్తున్నదన్నాడు. పైగా నడుం
ప్రాక్చరై లేచాడు. అతనికి ఇంకా నలుగురిలో తిరగగలనన్న నమ్మకం బలపడలేదు. సిద్ధాంత్
బలవంతంతో వెళ్ళక తప్పదేమో అనుకుంటుంటే అసలు అతనికి పార్టీకి ఎంట్రీ పాస్ కూడ
రాలేదు. సిద్ధాంత్ కి మాత్రం సభ్యుడిగా పిలుపు వచ్చింది.
సిద్ధాంత్ కి ఇది మరింత విఘాతం
కలిగించింది. "ఇదేంటి..? నీకు పాస్ రాకపోవటం..? పాల్గొన్నవారందరికీ పంపాలే
లెక్క ప్రకారం..?" అన్నాడు. అంతలోకి, ఏదో అనుమానం వచ్చి, "అసలు నీ
ఎంట్రీ ఆక్సెప్ట్ అయినట్టు ఏదైనా అక్నాలెజ్ మెంట్ వచ్చిందా?" అని అడిగాడు.
ప్రార్థిత్ వచ్చిందన్నట్టు తల ఊపాడు..
మెయిల్ పంపాడు, అందినట్టు రిప్లై కూడా వచ్చిందని చెప్పాడు.
అయినా సిద్ధాంత్ అదంతటితో ఏదో తిరకాసు
ఉందని గ్రహించి, "మెయిల్ నువ్వే పంపావా..?" అని అడిగాడు.
"ఊఁ. హార్డ్ మాడల్ నిషితాతో
పంపుతున్నానని చెప్పి వ్రాశాను కూడా..! జవాబులో వాళ్ళు ఫరవాలేదు.. మీ పరిస్థితికి
ఈ మాత్రం సహాయం చేయలేమా.. అని కూడా ధైర్యం చెప్పారు.. ఏఁ..?"
"ఏం లేదు, ఒకసారి మెయిల్ ఇప్పుడు తెరిచి
చూపించు.." అన్నాడు సిద్ధాంత్. ప్రార్థిత్ తెరిచాడు. పాస్ వర్డ్ కొట్టాడు.
అది తెరుచుకుంది.. చెకచెకా తను పంపిన మెయిల్, జవాబు మెయిలు చూపించాడు. సిద్ధాంత్ మొత్తం
శ్రద్ధగా చదివి, ఆశ్చర్యపోయాడు. "అంతా బాగానే ఉంది కదా.. ! మరి ఎక్కడ పొరపాటై
ఉంటుంది..?" అనడిగాడు సిద్ధాంత్.
"ఏమో..! వాళ్ళ దగ్గర నుంచి ఇంకా
రెండు మెయిల్స్ కూడా వచ్చాయి. ఫలానా రోజు పోటీ, రెజిస్టరు నెంబరు, ఫలానా స్థలం..
అది అని. " అని అవి కూడా చూపించి, "అప్లికేషన్ లో నా ఫోను నెంబరు కూడా ఇచ్చాను
కదా! ఏదైనా ఉన్నా వాళ్ళు దానికే చేస్తాములే అని ఇమ్మన్నారు. ఫోనులో కూడా ఆ వివరాలే
చెప్పి రావటం వీలైతుందా అని కూడా అడిగారు. కాదని చెప్పి నిషితా గురించి చెప్పాను..
వాళ్ళు సరేనన్నారు. అందుకే ధైర్యంగ ఉన్నాను." అన్నాడు.
సిద్ధాంత్ ఆలోచిస్తూ, "అటు మెయిలూ
వచ్చింది.. ఇటు ఫోనూ వచ్చింది.." అని వెంటనే తనకు లాల్ ఎండ్ లాల్ కంపెనీలో
తెలిసిన ఒకతనికి ఫోన్ చేసి, ప్రార్థిత్ ఎంట్రీ విషయం అడిగితే అతని పేరుతో ఎంట్రీ
ఏదీ పోటీకి రానేలేదని చెప్పాడు. లాల్ ఎండ్ లాల్ అంతటి వాళ్ళు స్వయంగ ఆహ్వానం పంపాక
కూడా అతను పాల్గొనకపోవటమే కాక ఎటువంటీ ప్రతిక్రియా చూపలేదని ఇంక అతనిని వదిలేశారు.
పోటీలో పాల్గొనేవారు పోటీ నియమం ప్రకారం సభ్యులు కాదు కనక పాస్ పంపకపోవటం సహజమే
కదా.." అన్నాడతను.
సిద్ధాంత్ ఫోన్ పెట్టేసి,
ఆశ్చర్యపోతూనే, కాసేపు అంతా ఆలోచించాడు.
ప్రార్థిత్ మాత్రం, "పోతే పోనీలేరా..
ఏదో గొడవలో తలకాయ పని చేయక నేనే చూసుకోకుండ వేరేదైనా మెయిల్ ఐడీకి
పంపానేమో.." అన్నాడు.
"అట్లైతే నీకు జవాబెట్ల వచ్చింది?
నీ హార్డ్ మాడల్ కి రెజిస్టరు నెంబరు.. ఫోను.. ఇవన్నీ..?" అని ఆగి, "...సరే,
నేనైతే ముందు పార్టీకి వెళ్ళి వస్తాను. అప్పుడు అక్కడేదైనా తెలుస్తుందేమో..!
ముందైతే నేను నిషితా మాడల్ చూడాలి.." అననుకుంటూ మొదటిసారి పక్కన ప్రార్థిత్ లేకుండా
ఈస్తెటిక్స్ పార్టీకి వెళ్ళాడు.
అక్కడ అతను ఊహించినట్టే నిషితా మాడల్ ని
ప్రదర్శనకు పెట్టారు. అందులో ఒక్కొక్క తునకా ప్రార్థిత్ మాడలే..!! స్క్రీన్ మీద
చూపబడుతున్న ఒక్కొక్క స్లైడ్ ప్రార్థిత్ డిజైన్ చేసినదే. అదే టైటిల్..! సరోవరతీర సుకుమార
నందనవనం..! అందరూ ఆంగ్లంలో పెడితే తను మాత్రం వెతికి వెతికి తెలుగులో పెట్టాడు
టైటిల్.
సిద్ధాంత్ కళ్ళలో నీరుబికింది. ఎంతటి నయవంచన!!
అతనికి నిషితా చేసిన కుతంత్రం పూర్తిగ అర్థమైంది. ఆమె తీయని మాటల వలయంలో పడి, ఆమె
మనసులో ఏం ఉందో ఎవ్వరూ పసికట్టలేకపోయారు. ప్రార్థిత్ దుస్థితిని చూసుకుని, అతని
కష్టంతో తనకు సొంత లాభం చేసుకుంది ఆమె. ఎంత క్రూరురాలు..! ప్రార్థిత్ కష్టాన్ని
దోచుకున్నందుకు కాదు.. అతను ఆ పరిస్థితులలో కూడా చేసిన ప్రయత్నానికి ఫలితం లేకుండా
చేసిందేనని బాధ. తన కళ్ళ ఎదురుంగ స్టేజ్ ఎక్కి ఆమె ప్రైజ్ మనీ అందుకోవటం, లాల్
ఎండ్ లాల్ కంపెనీలో ఆర్ట్ ఎక్జిక్యూటివ్ గా ఉద్యోగం సంపాదిస్తూ కాల్ లెటర్ చేత
పట్టుకోవటం చూసి, అదంతా తన ప్రార్థిత్ కి చెందాల్సిన గౌరవం కదా అని లోలోపల వాపోతూ
కూడా ఏమీ చేయలేకపోయాడు. నిషితా స్టేజి కిందకు దిగాక కూడా అతనితో మాట్లాడే ఏ చిన్న
ప్రయత్నమూ చేయలేదు. అప్పట్లో ఆ పోటీకి ఎంట్రీ పంపాక వెంటనే ఆమె ఏదో తెలియని కారణాల
వల్ల నెలరోజుల శెలవు తీసుకుని, ఢిల్లీ వెళిపోయింది. అందుకే కాంటాక్టులో లేదు ఇన్ని
రోజులు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే కూడా క్లుప్తంగ మాట్లాడి పెట్టేసేది. ఇప్పుడు మళ్ళీ
ఇక్కడ చూడటమే ఆమెను. ఆ ప్రవర్తనలన్నింటికీ వెనక కారణం అప్పుడే అర్థమైంది సిద్ధాంత్
కి. ఇంక ఆ కోపం, బాధ, అక్కసులతో అక్కడ నిలవలేక సిద్ధాంత్ నేరుగ ప్రార్థిత్ వద్దకు
వచ్చి విషయం అంతా వివరంగ చెప్పాడు, చాలా బాధపడుతూ.
ప్రార్థిత్ పెద్దగ ఏ ప్రతిక్రియా
చూపలేదు. క్షణం పాటు గుడ్లలో నీరు కక్కుకుని అంతలోకే మామూలైపోయాడు. లోలోపలేమైనా
బాధ పడ్డాడా అంటే అదీ లేదు. తర్వాత మామూలుగ నవ్వేస్తూ, "ఒరే నీ శ్రమ
ఫలించిందిరా. అప్పుడు నువ్వు నీ వ్యక్తిగత జీవితాన్ని పణంగ పెట్టి మరీ మాడల్ కోసం
కష్టపడ్డావు. పోనీలే.. అటు చేసి ఇటు చేసి, ఎవరి పేరుతో వెళితేనేఁ..? మన మాడల్ కే
కదా మొదటి బహుమతి వచ్చింది.." అన్నాడు.
"కానీ నీ పేరు మీద కాదే..!
ఇంటీరియర్ లో ఏబీసీడీలేమీ తెలియని ఆ వేలిముద్ర దానికి వచ్చింది..! రెండున్నర
లక్షలు.. పైనుంచి పర్మనెంట్ ఉద్యోగం..! ఏదేమైనా అది నీకు చెందాల్సింది. నీ సొంత
కష్టం. నీ గంటల గంటల సమయం, శక్తి, శ్రమను, ఆలోచనను వెచ్చించి చేసిన ప్రయత్నం.
దాన్ని నిష్కారణంగ దోచేసుకుంది."
"కావచ్చు. కానీ నాకన్నా ఆమెకు ఆ
డబ్బుతో ఎక్కువ అవసరం ఉండిందేమో..! ఆమె చేసింది తప్పే. పాపం! ఉద్యోగానికి ఆశపడి
ఉంటుంది. దొరికిన అవకాశాన్ని ఇట్ల వాడుకుంది." అని ప్రార్థిత్ నిర్లిప్తంగ అన్నాడు.
"అదేంట్రా..? అంత తేలికగా
అనేశావు..? ఛ.. అసలు నేను వేళకు లేకపోవటంతో అంత దుర్మార్గం చేసిందామె. నేనే నీ
మాడల్ పంపేవరకైనా జాగ్రత్తగ ఉంటే బాగుండేది..!" అని ఏదో అనబోయి, ఆగి, "హార్డ్
మాడల్ అంటే నువ్వే నీ చేతితో ఇచ్చి ఉంటావు. అసలు.. అసలామెకు నీ సాఫ్ట్ కాపీ
ఎక్కడిది? నువ్వు నీ నోట్ బుక్ తెరిచే పాస్ వర్డ్ కూడా ఎవ్వరికీ చెప్పవే..? మెయిల్
ది ఏమైనా ఆమెతో చెప్పావా..?" అని అడిగాడు.
"లేదు..! పైగా నేనే పంపుతానన్నాను.
పంపాను కూడా. తర్వాత జరిగింది... నీకు తెలుసు కదా.." అన్నాడు ప్రార్థిత్.
సిద్ధాంత్ ఏదో ఆలోచిస్తూ, "ఏది..
ఒకసారి మళ్ళీ ఆ మెయిల్ చూపించు.." అన్నాడు. ప్రార్థిత్ అతనికి ఆ మెయిల్ తీసి
చూపించాడు. సిద్ధాంత్ తన జేబులో ఉన్న ఈస్తెటిక్స్ పార్టీ కాగితం తీసి, దాని మీద
ఉన్న మెయిల్ ఐడీతో మెయిల్ బాక్స్ లో ఉన్న సెంట్ మెయిల్ ఐడీని పోల్చి చూసాడు. మొదలు
ఒకటే అనిపించింది. తరవాత పరిశీలిస్తే అక్కడ సరిగ్గ ఒక అక్షరం తేడా ఉంది.
ప్రార్థిత్ కి క్షణంలో అర్థమైంది- ఆ ఐడీ మార్చి ఇచ్చింది నిశితా అని. "తనే ఓ
ఐడీ తయారు చేసి, ఈస్తెటిక్స్ వారి తరఫున
తనే పత్రాచారం నడిపిందన్నమాట..!" అతని ముఖంలో క్షణం పాటు
మార్పు చూసి సిద్ధాంత్ కి బాధతో, కోపంతో, నోట మాట పోయినట్టైంది. కసిగా, ఏదో
అనబోయి, కాసేపాగి,
"సరే, నీ మాడల్ అంటే మెయిల్
పంపావు..! మరి, డిజైన్, స్లైడ్లు అవి..? అవి అంతా నీ నోట్ బుక్ లోనే కదా
ఉంది..? వాళ్ళ మెయిల్ కి నువ్వు అవి కూడా ఏమైనా పంపావా..?" అనడిగాడు. ప్రార్థిత్
తల అడ్డంగా ఊపాడు.
"అయితే ఆమె పాస్ వర్డ్ బ్రేక్
చేసి.. దొంగతనంగా.." సిద్ధాంత్ ఏదో అడుగుతుంటే, అంతలోకి ప్రార్థిత్ తల్లి
అక్కడకు వచ్చింది. వాళ్ళ సంభాషణ విన్న ఆమె, జరిగింది చెప్పింది.
"అప్పట్లో మెట్ల మీది నుంచి ప్రార్థిత్
కింద పడినప్పుడు హాస్పిటల్ లో చేర్చాక, నడుముకు బాగా గాయమై, డాక్టర్ నోట్ బుక్
కంప్యూటర్ దగ్గర పెట్టుకోవటానికి అనుమతించలేదు. నిషితా అది చూసి, నన్ను కంగారు
పెడుతూ, "పోటీకి ఎంట్రీ పంపటానికి ఆఖరి తేదీ అయిపోతోంది.." అని తొందర
పెడితే, దాని సంగతి తెలియక, నేనే వాడి పాస్ వర్డ్ చెప్పాను ఆమెకు. వాడి మెయిల్ కీ,
నోట్ బుక్ తెరవటానికీ పాస్ వర్డ్ గా పెట్టుకున్నది నా పేరే అని వాడు ఒకసారి
అన్నాడు. అదే ఉపయోగించి ఈ విధంగ చేయగలిగందామె." అని చెప్పింది.
"ఎంత మోసం!!" అని సిద్ధాంత్
బాధగా అన్నాడు. "కానీ.. వాడి ఒక్కొక్క స్లైడ్ మీద వాడి పేరు ఉంటుంది.."
అన్నాడు ఆలోచిస్తూ.
ప్రార్థిత్ కూడా అదే ఆలోచిస్తూ,
"బహుశ ఆ స్లైడ్లు అన్నీ కూడా ఎడిట్ చేసేసి, తరువాత తన ఎంట్రీగా వాటిని మలచుకుంది.."
అన్నాడు మామూలుగా.
సిద్ధాంత్ ఆవేశంగ, "ఛి.. ఎంతటి
దుర్మార్గం..! తనను రక్షించటానికే నీ ప్రాణాలను అడ్డం వేశావని తెలుసు. తన వల్లే ఆ
సంకట పరిస్థితులలో పడ్డావని తెలుసు. ఏ రకమైన అవస్థలతో ఆ ప్రాజెక్టు చేశావో కళ్ళతో
చూసింది. అయినా కృతజ్ఞతనేది లేకుండా ఇంత విశ్వాసఘాతుకం చేస్తుందా..? అసలామె
మనిషేనా..? ఆమె తింటూ ఉన్నది అన్నమేనా..? అయితే ఆగు, ఇదే విషయం ఇప్పుడే ఫోన్ చేసి
లాల్ ఎండ్ లాల్ సీఈఓ కి చెప్తాను. దాని పని పడతాను.. కోర్టుకు లాగి.. చార్జి దాఖలు
చేస్తాను..." అన్నాడు.
ప్రార్థిత్ అతనిని సీరియస్ గా చూసి,
"అటువంటి ప్రయత్నాలేం చేయద్దు. నా మీద ఒట్టు. ఇది ఇంతటితో వదిలేసేయి."
అన్నాడు.
సిద్ధాంత్ చాలా చాలా నిర్ఘాంతపోయాడు ఆ
ప్రతిక్రియకు. "అదేంట్రా..? వదిలేయటమేంటి..? ఇంత అన్యాయం చేసింది..! అది నీ వ్యక్తిగత అవసరాలను చాలా మటుకు తీర్చేయగలిగిన డబ్బు. మీ నాన్నగారి
రిసర్చు కోసమైనా అక్కరకు వచ్చి ఉండేది."
"దానికి ప్రభుత్వ సహాయాన్నే నాన్న
తీసుకోలేదు. ఇంక ఆ బోడి డబ్బు ఎవరికి కావాలి..? ఉన్నతమైన ఆశయానికి చిన్న చిన్న
చేతుల స్వచ్ఛంద సహాయమే శ్రీరామరక్ష..! అవన్నీ నీకు అర్థం కావులే. వదిలేయమంటున్నాను..
వదిలేయి అంతే." ప్రార్థిత్ ఏమాత్రం మాట్లాడే మూడ్ లో లేడు. "తను ఏం చేస్తే
అది చేసింది.. తన పాపాన తనే పోతుంది. తననేమైనా చేస్తే మనకు వచ్చేదేంటి..? ఆ
ప్రాజెక్టు అసలు నేనే చేశానో, ఆమె చేసిందో ఎట్ల నిరూపిస్తావు..? ఆమె మీద ఏమని
చార్జ్ వేస్తావు..? నేరం ఎట్ల నిరూపిస్తావు..? అందరి మధ్యా నేనే వెర్రివాడిని
కావాల్సి వస్తుంది." అన్నాడు ప్రార్థిత్ అసహనంగ.
"ఏంటి.. వెర్రి అది కాదు.. ఇది..!!
ఇంకా మరి లోకంలో అది నిరూపించటానికి కాకపోతే లాయర్లెందుకు ఉంటారనుకుంటున్నావు..?
నాకు తెలిసిన మంచి క్లాస్ వన్ లాయర్ ఉన్నాడు. ఆయన చేతిలో పడితే ఆ నిషా తాత కూడా
దిగిరావాల్సిందే. ఆ పిల్ల నోటే నేరం ఒప్పిస్తాడు. ఇదేమైనా చీకటిరాజ్యమా..? లేదా
ఆడపిల్ల కనక ఏం చేసినా చెల్లుతుందనుకుంటోందా..?"
"పోనీ లే, తను అనుకున్నా లేకపోయినా
మనం అదే అనుకుందాం. ఎంతైనా తోటి ఉద్యోగిని. ఎవరు ఎవరి మీద దావా వేసినా పోయేది
కంపెనీ పరువేగా. ఈస్తెటిక్స్ ఈ ఏడాదితో ఆపేయట్లేదు కదా..! వచ్చే ఏడాది
ప్రయత్నించుకుందాం..! మనలో సత్తా ఉందని మనకు తేటగా తెలిసినప్పుడు అవతలివాడి
మెప్పుకోసం గుర్తింపు కోసం ఎదురుచూడటం ఎందుకు..?" అన్నాడు సహనంగ.
"లేదురా, అన్యాయం అన్యాయమే. నీ
సమయం, శక్తి, అన్నీ వృథా పోయినందుకు నీకు బాధగా లేదేమో. కానీ నా సమయం శక్తి కూడా
వ్యర్థమైనాయి. అదీ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం జరిగే వేళలో. ఎన్నిసార్లు పెళ్ళికి
ముందు నా భార్యో, ఆమె తరఫువారో ఎక్కడికైనా కలిసి వెళదామంటే ఆ కార్యక్రమాలను ఎగగొట్టి,
తప్పించుకుని నీ దగ్గరకు వచ్చేవాడినో..! ఎన్ని ఫామిలీ మూమెంట్స్ ఆ పోటీ మూలంగ
పోగొట్టున్నానో..! నీకు నీ ప్రయత్నం ఏ పాటి విలువా చేయకపోతే పోయింది. నాకు మాత్రం
నా సమయం, ప్రయత్నం మీద చాలా గౌరవం ఉంది. ఆమె చేసినదానితో నా ఆత్మగౌరవం దెబ్బ
తిన్నది. నువ్వు వదిలినా నేనామెను వదలను. ఇంతా చేసింది ఆమె గారి పర్సు నింపటానికి
కాదు.. నా స్నేహితుడి కోసం. నా కష్టాన్ని దోచుకునే అధికారం ఎవ్వరికీ లేదు."
"నిషా నీ సొంత చెల్లెలైతే కూడా ఇదే చేసేవాడివా..?"
సిద్ధాంత్ చాలా కొత్తగ చూశాడతనిని. అతను
తనకు తెలిసిన ప్రార్థతేనా..? ఇప్పటికీ ఆమె గురించి అంత సున్నితంగ ఎట్ల
ఆలోచించగలుగున్నాడు..? "ఏంరా, నిజం చెప్పు. మెదడు ఉండే మాట్లాడుతున్నావా..?"
అతని కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగాడు.
"మెదడు ఉంది కనకనే ఇట్ల
మాట్లాడుతున్నాను.. లేదంటే నీకు సై అంటే సై అనేవాడిని."
"లేదు.. ఏదో తిరకాసుంది.. ఇది సహజంగ
రావాల్సిన ప్రతిక్రియ కాదు.. ఆమె మోసంతో మంచి బహుమతితో పాటు భవితా
పోగొట్టుకున్నావు. నీకేం బాధగా లేదా?"
"ఉంది... జీవితంలో ఏదో కారణంగ ఎంతో
కొంత పోగొట్టుకోవటం సహజమే. అంతా మనకే దక్కాలనుకోవటం అత్యాశ. పూత అంతా కాత కాదు
కదా. అది ప్రకృతి నియమం. ఇంత జరిగాక వాస్తవం తెలిసి వచ్చింది. నశ్వరమైనవాటి కోసం
శాశ్వతమైనవి పోగొట్టుకోలేం. నన్ను ఇట్ల వదిలేసేయి.."
"హలో..!! ఏమనుకుంటున్నావు నీకు
నువ్వు..? మాట్లాడేది అర్థమైతోందా..? నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వెనక కారణం ఏంటో
తెలుసుకోవచ్చా..?"
"నా మనశ్శాంతి నాకు ముఖ్యం..
అంతే."
"అంటే మనసు అశాంతికి సంబంధించింది
ఏదో జరిగింది. నిజం చెప్పు. నీ మనసు భద్రమేనా..? లేక.. ఆమెనేమైనా.. అందులో
తెచ్చి..?" అని అర్ధోక్తిగా ఆగాడు అనుమానంగ చూస్తూ.
"ఛ ఛ.. అదేం లేదు." ముఖం
ఏహ్యంగ పెట్టి తిప్పేసుకున్నాడు ప్రార్థిత్. "తోటి ఉద్యోగినిగా తప్ప ఎటువంటి
భావనా ఆమె పట్ల లేదు. అటువంటి మోసకారి మీద ఏం భావనలుంటాయి?"
దానికి ప్రార్థిత్ వాళ్ళ అమ్మ బాధగ
చూస్తూ, "పిల్ల చక్కగ ఉంది.. వీడికి నచ్చితే ఇంటికి కోడలిగా చేసుకుందామని నేనే
కలలు కన్నాను.. అది ఇట్ల తిరిగింది.. ప్చ్.." అంది.
సిద్ధాంత్ వెంటనే ఆమె వంక, తర్వాత ప్రార్థిత్
వంకా తిరిగాడు. ప్రార్థిత్ మౌనంగ తల వంచుకున్నాడు.
అప్పట్లో మాడల్ తయారీ అప్పుడు నిషితా
పని వంకతో ప్రార్థిత్ కి దగ్గరగా కదలటం, తనను కాపాడినందుకు కృతజ్ఞత నటించటం,
అవసరానికన్నా ఎక్కువ నవ్వుతూ చనువుగా మాట్లాడటం, వాళ్ళ ఇంట్లో వ్యక్తిలా
కలిసిపోవటానికి ప్రయత్నించటం, వంటగదిలోకి వెళ్ళి భోజనం వండటంలో అతడి తల్లికి
సహాయపడటం, వాళ్ళ నాన్న రిసర్చు గురించి మాట్లాడుతూ పెద్దవారిలో ఏదో మంచి భావనలను
రేకెత్తించటం, వాళ్ళ సర్వసాధారణ అలవాటు ప్రకారం ఏదో తాత్విక చింతన చేసుకుంటుంటే
కూర్చుని ఎంతో శ్రద్ధ ఉన్నదానిలా వినటం, ఏవో లేనిపోని సందేహాలు అడగటం, చర్చలు
చేసేదానిలాగే నటించటం..., లాంటివి ఎన్నో జరిగాయి. ముందు తనూ నిషితా గురించి
అనుకున్నది తప్పేమోనని అభిప్రాయం మార్చుకున్నాక, మళ్ళీ ఇప్పుడు ఇదంతా తలచుకుని
సిద్దాంత్ కి ఆమె ప్రవర్తన ఎంతో రోత కలిగించింది. అప్పుడే ప్రార్థిత్ పెళ్ళి
విషయమై వాళ్ళ ఇంట్లో కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్కగానొక్క కొడుకు.. మంచి
పద్ధతి గలవాళ్ళు. వాళ్ళు ఏ అమ్మాయిని చూపిస్తే ఆమెనే కళ్ళు మూసుకుని చేసుకుంటానని ప్రార్థిత్
మాట ఇచ్చి ఉన్నాడు. అటువంటి ఏ మంచి మగవాడినీ, అతడి దేవుడిలాంటి తల్లిదండ్రులనూ
ఇటువంటి చోట్ల కావాలని తెలిసి తెలిసీ డిస్టర్బ్ చేయటం మర్యాద అనిపించుకోదు. ఆమె ఆ మర్యాదను
భంగం చేసింది. అది సిద్ధాంత్ కోపం.
"ఆంటీ ఇట్లా అనుకున్న సంగతి నీకు
తెలుసా..?" ప్రార్థిత్ ని అడిగాడతను.
ప్రార్థిత్ ఏమీ మాట్లాడలేదు. ఔను కాదు
అర్థం కాకుండా తల ఊపాడు. తర్వాత చూపులు మళ్ళించాడు. సిద్దాంత్ కు విషయం అర్థమైంది.
"అయితే ఆమెకు బుద్ధి చెప్పటం మన
విధి. నేను ఆమె మీద కేస్ పెడతాను. నువ్వు కూడా నాకు సహకరిస్తున్నావు. అంతే. లేదంటే
నా మీద ఒట్టే." అన్నాడు.
"అధర్మం చేయమని ఎన్ని ఒట్టులేసినా
చెల్లవు. నేను చచ్చినా ఒప్పుకోను. ప్రాణం పోయినా ఫరవాలేదు. ఎవరికీ అన్యాయం
చేయలేను."
"నువ్వేం అన్యాయం చేయటం లేదే..!
నీకు అన్యాయం చేసినవారి మీద ప్రతీకారం తీర్చుకుంటున్నావు. అట్ల చేయటం మానవ
విధ్యుక్త ధర్మమే- అధర్మం, అన్యాయం ఏం కాదు. అది మానవ సహజం కూడా. మనుషులే కాదు,
దేవతలు కూడా తమకు అన్యాయం చేసినవారిని ఊరికే వదలరు..! శిక్ష వేసి తీరతారు. నువ్వు
పూజ చేసే శివుడు, తన భార్య మరణానికి కారణమైన దక్షుడిని ఊరికే చూస్తూ ఊరుకోలేదు. ఆ
దక్షయజ్ఞం విధ్వంసం చేసేదాకా నిద్రపోలేదు."
"లోకాలను కాపాడే రక్షకుడాయన. ఆయన
ఏం చేయాలో, ఎందుకు చేయాలో ఆయన నియమాలు, లెక్కలు వేరే ఉంటాయి. మనకు అవి పూర్తిగ
వర్తించాలంటే మనలో ఆయనకున్న ఇతర గుణాలన్నీ పూర్తిగ ఉండాలి. అన్నింట్లో సమానం
అయినప్పుడే పోలిక చెప్పు..!"
"కానీ, మన స్థాయిలోకంలో కూడా ఒక
నియమం చెల్లుబాటులోనే ఉంటుంది. వినే ఉంటావు.. ముల్లును ముల్లుతోనే తీయాలి.
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి."
"నాకు ముల్లలతో వజ్రాలతో ఏ పనీ
లేదు. ఎవరితో నాకు ఏ సమస్యా లేదు. అది మన తలనెప్పి కాదని చెప్తున్నాను.. విను.
చేసినదానికి చేసినవారే అనుభవిస్తారు.. చాలు. పైన అన్నీ చూస్తున్న దేవుడున్నాడు..
ఆయన నిబంధన ప్రకారం నడిచే ప్రకృతి వ్యవస్థ ఉంది. నాకు ఆ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం
ఉంది. ఆయన నియమాల మధ్య తల దూర్చే అవసరం కానీ, ఇచ్ఛ కానీ నాకు లేవు. ముల్లే
తీసుకుంటాడో, వజ్రాలే కోసుకుంటాడో ఆయన ఇష్టం."
"దొంగతనం, మోసం చేసినవారిని ఊరికే
వదిలిపెడితే మనం దాన్ని పరోక్షంగ సమర్థించినట్టే అవుతుంది. నువ్వే కాదు, ఆంటీ కూడా
చాలా బాధపడింది. అందుకైనా నువ్వు ఈ ప్రతీకారం చేసి తీరాలి.."
"ఔను. అమ్మ బాధ పడింది. చాలా బాధ
పడింది. వాస్తవమే. కానీ అదంతా గతం. జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఇదీ అంతే.
తెలియనితనం అనుకుని వదిలేయాలి.."
"తెలిసి కావాలని చేస్తే..?"
"సరే, తెలిసే చేసింది.. ఏంటంటా..?
పోనీ. తెలిసి చేసిన తప్పు క్షమించకూడదని ఎక్కడైనా వ్రాసి ఉందా..? ఆమె స్థానంలో నీ
సొంత చెల్లెలుంటే క్షమించవా...?"
"చచ్చినా క్షమించను. అప్పుడూ అదే
అన్నాను. ఇప్పుడూ అదే అంటున్నాను. నా చెల్లెలే ఇటువంటి వేషం వేస్తే దాన్ని
పట్టుకుని గట్టిగ బుద్ధి చెప్పేవాణ్ణి. నాకిటువంటి చిల్లర వేషాలంటే పరమ మంట. ఏ
మనిషినీ అటువంటి సున్నిత భావాల విషయంలో బాధ పెట్టే అధికారం ఏ మనిషికీ ఉండదు."
"నీకు నా మాటకన్నా అదే పరమార్థం
అనిపిస్తే నేను చేయగలిగింది నీకు దూరంగ ఉండటమే."
ప్రార్థిత్ మాటలకు సిద్ధాంత్
అవాక్కైనాడు. తర్వాత ఆలోచించి, "సరే, నిన్ను వదులుకునే బదులు ఆ పిల్లనే
వదిలేస్తాలే." అని అప్పటికి ఇంక ఆ విషయం వదిలేశాడు.
ప్రార్థిత్ అతని భుజం తట్టి, "చూడరా,
జీవితంలో అన్నింటికన్నా ముఖ్యమైనది మనశ్శాంతి. దానిని దేనికోసం
పోగొట్టుకోకు.." అన్నాడు.
"సరే, సరే, అదంతా నాకు చెప్పకు. దీనితో
పాటు మరొక దుర్వార్త. ఇప్పుడు ఆ పార్టీలోనే మన అధికారిణి ప్రకటించింది. ఉద్యోగులకు
మూడు నెలల నోటీసుతో కంపెనీ మూసేస్తోందట." అని చెప్పాడు నింపాదిగా.
"నువ్వు ఇదివరకే ఆ టాక్ మోసుకు
తెచ్చావుగా.. అదే నిజమైంది. నేను మానసికంగ సన్నద్ధంగనే ఉన్నానులే. ఇంకా నయం, మూడు
నెలల నోటీసైనా ఇచ్చింది." విరక్తిగ నవ్వాడు ప్రార్థిత్.
సిద్ధాంత్ అతని భుజం తట్టి, "అయితే
ఏం ఆలోచించావు..?" అన్నాడు.
"నాన్నగారు వచ్చేనెల రిటైరవుతారు. పైగా
తన రిసర్చ్ కోసం సహాయం అడిగారు. దానికి అనుకూలంగ ఉండే చోటుకోసం తిరిగి మా ఊరు
వెళిపోదామనుకుంటున్నాము. తాతగారు ఆస్తులు పంపకాలు చేస్తానన్నారు. అందులో మా వంతు
చూసుకుని తర్వాత ఏం చేద్దామనిపిస్తే అది. డిజైనింగ్ ఇంక హాబీ అయిపోతుందేమో. తిరిగే
ఓపిక లేదు. ప్రెవేటుగ చేసుకుంటూ, వేరేదైనా పని చూసుకుంటానులే." అన్నాడు.
ప్రార్థిత్ మనసు విరిగిందని సిద్ధాంత్
కి అర్థమైంది. ఇంక అతను ఎప్పటికీ ఇంటీరియర్ వైపు రాకపోవచ్చు.
ప్రార్థిత్ "మరి నువ్వు..?"
అనడిగాడు ఆలోచిస్తున్న సిద్ధాంత్ ని.
"ఏమో, చూడాలి. మామగారు పెట్టుబడి
పెడతానన్నారు. సొంతంగ ఏదైనా వ్యాపారం చూద్దామనుకుంటున్నాను. వస్తావా పార్ట్ నర్
గా..? ఆలోచన నీది, ఆకృతి నాది."
"లేదురా.. సొంతవ్యాపారం చేయగల
సత్తా మీద నాకు నమ్మకం లేదు. " అని మర్యాదగా వారించి, అతనికి చేయి కలిపాడు.
తర్వాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా నెలరోజులకు
ఎవరి దారులు వారివైపోయాయి.
No comments:
Post a Comment