Friday, 11 November 2016

2. పిల్ల పేరు మల్లెమొగ్గ, నా పేరు జమీందార్-1




          "రేపటితో మూడేళ్ళు పూర్తవుతాయి. ఇంక నాకు కనిపించాల్సిన అవసరం లేదు." అతను తన వంతుగా చెప్పి వెళిపోయాడు ఇవాళ ఉదయం.
          ఔను, నిజమే. రేపు నేను వెళిపోవచ్చు. అయితే ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రశ్న నాకు లేదు. ఎట్ల ఏంటి ఏమీ ఆలోచనలు లేవు. అంతకు ముందు ఒక రకం జీవితం. మూడేళ్ళు ఇట్ల గడిపే యోగం ఉంది. గడిపాను. తర్వాత ఏ రకం జీవితమో నాకు తెలియదు. అయినా ఆందోళన ఏమీ లేదు. కుతూహలమూ లేదు. నాకు లేదు కదా అని ఇతరులకు ఉండటం మానదుగా..!
          "అయితే వెళిపోతున్నావా..?" సాయింత్రం రాజన్న అడిగినది గుర్తుకు వచ్చింది. ఎప్పటిలాగే మౌనంగ చూశాను. నాకు మొదటి నుంచీ తెలియని విషయాలలో మౌనంగ ఉండటమే అలవాటు.
          "ఎక్కడికి పోతావు..? ఎవరున్నారు నీకు?"
          "ఏమో.. తెలియదు..!"
          అందరికీ ఉండే భగవంతుడే ఉన్నాడు. మనుషులు ఉంటారు.. పోతారు. దేవుడు కేవలం ఉంటాడు. అంతే. ఆయనకు పోవటం తెలియదు. లేదా పోవటానికి ఆయనకు ఏ స్థానమూ లేదు. అంతటా ఉండేది ఆయనే కదా. కనక ఆయన ఎక్కడికి తీసుకుపోతే అక్కడికే పోతాను. నాకు నేను వేయినూరోసారి చెప్పుకున్నాను.
          గదిలో అంతా చీకటి. వరండాలో చిన్న బల్బు రాత్రంతా వెలుగుతూనే ఉంటుంది. ఓరగ వేసి ఉన్న తలుపు లోనుంచి అది దానికి చేతనైన గుడ్డి వెలుగులను ప్రసరిస్తోంది. ఆ వెలుగులో ఎవరిదో నీడ... కదులుతూ..!
          అతనే!! ఇంకా ఒంటిగంటన్నర కానట్టుంది. పడుకోలేదు. రాత్రుళ్ళు ఎప్పుడూ ఆలస్యంగనే పడుకుంటాడతను. మొదటి నుంచీ అదే అలవాటు. నిద్ర అవసరం ఆ శరీరానికి తక్కువ.
          పగలంతా వ్యాపారాలు, వ్యవహారాలు.. క్షణం తీరిక దొరకదు. అందుకే రాత్రుళ్ళు కూర్చుని భగవద్గీతో, ఏదో ధార్మిక గ్రంథమో చదువుకుని పడుకుంటాడు. వాళ్ళ అక్క నేర్పింది చిన్నప్పుడు. నాకూ ఆమే నేర్పింది. మానసిక ప్రశాంతత కోసం. ఈ మూడేళ్ళూ అది బాగా పనికివచ్చింది. ఎంతగా అంటే జీవితమంతా ఇదే పడాల్సి వచ్చినా నేను మానసికంగ సిద్ధంగనే ఉన్నాను. ఇదే నాకు గీత ద్వారా సువ్వొదిన నేర్పిన మంత్రం. ఆమె పనితో అలసి సొలసి గొడ్ల మధ్య పడి ఉన్న వేళ నేను ఆమెకు గీతా మకరందం చదివి వినిపించేదాన్ని. అదే నా నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆమె ఆ సందర్భాలలో తన జీవితంలోని రకరకాల సంఘటనలను చెబుతుంటే నాకు ఆ శ్లోకాలకు వ్యాఖ్య వింటున్నట్టు ఉండేది. అనుభవంలో నుంచి వచ్చిన వాక్యాలు కనక అవి నేరుగ నా అనుభవంలోకి జోడించుకుపోతుండేవి. అందుకే మానసిక ఆలోచన స్థాయి నుంచి ఆచరణ స్థాయికి నాలో ఎక్కువ మైళ్ళ దూరం లేదు. ఆ వేదన భరిత రాత్రుళ్ళు, ఆ ఉదాసీనతా చీకట్లు, ఆ అనుభవాల జ్ఞాపకాలు ఇవాళ, ఇప్పుడు నాకు కావాల్సిన శక్తిని రహస్యంగ, నిత్యనూతనంగ ఇస్తూనే ఉన్నాయి. అందుకే నేను ఇప్పుడు భగవద్గీతను మరింత శ్రద్ధతో ఆచరించటం మొదలుపెట్టాను. బహుశ ఇంక పుస్తకంలాగ చదివే అవసరం తీరిపోయింది కాబోలు. జీవితంగ చదువుతూ అంతా ప్రాయోగికంగ నేర్చుకోవటం అప్పుడే ప్రారంభించాను. కానీ అతను మాత్రం చదువుతూనే ఉన్నాడింకా. సారం ఒంటబట్టిననాడు పుస్తకంగా చదవటం మానేస్తాడేమో. ముందు అతని మనుసులో పగ చల్లారితే కానీ మిగిలిన వాటికి స్థానం ఏర్పడదు. గడువు పూర్తైంది కనక అదీ త్వరలోనే చల్లారిపోతుందేమోలే.
          ఇవాళ ఏమీ పని ఇవ్వలేదు. చివరి రోజనేమో. ఊరికే కూర్చున్నాను.. చాలా కాలానికి ఎదురు పడిన విరామం అండ చూసుకుని మనసు గతం లోకి పరుగులు తీసింది.. సువ్వొదిన వైపు..! నా గతమంతా ఆమేగా నిండి ఉన్నది..! ఈ ప్రస్తుతం పరిస్థితి నిండా ఆమెనే ఉంది.
          వాళ్ళక్క పేరు సువర్చల. ఆమెను అంతా సువ్వక్కా అంటారు. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ప్రాణం..! నేనే కాదు.. ఆమెకు అందరి పట్లా ఏదో ఒక ఆదరభావన, గౌరవం ఉంటుంది. అందరినీ తన కడుపున పుట్టిన బిడ్డల్లాగ చూసుకోవటమే ఆమెకు తెలుసు. భారతీయత నిర్వచించిన మాతృస్వరూపిణి. యా దేవీ సర్వ భూతేషు మాతృరూపేణ సంస్థితా..! రెండు చేతులు జోడించి మనసారా నమస్కారం చెప్పుకునే ఆ జగజ్జనని, దివ్యమాతను మనము చూడలేము. ఆ తల్లి మన మట్టి కళ్ళకు కనిపించదు..! ఆ శక్తి వ్యక్తమై, కనిపించే రూపాలలో వస్తే అచ్చం ఆ దేవీ స్వరూపిణిలా ఉంటుంది అక్క రూపం.
          సువ్వక్క వాళ్ళ నాన్నగారు మా ఇంట్లో అన్ని వ్యవహారాలు చూసుకునే మేనేజరు. వారి ఇల్లు పక్క వీధిలో ఉండేది. ఆయన ఏదో కారణంగ హఠాత్తుగ చనిపోయాక సువ్వక్కా, ఆమె తమ్ముడూ అమ్మ ప్రోద్బలంతో మా ఇంట్లోనే వచ్చి ఉండేవారు. వాళ్ళ గతం నాకు పెద్దగా తెలియదు కానీ, వాళ్ళ అమ్మ పాపం అతని చిన్నతనంలోనే స్వర్గానికి వెళిపోయింది. వాళ్ళకు ఇంక నా అనేవారు పెద్దగా ఎవరూ లేరు. సువ్వక్క అంటే ఎందుచేతో మా అమ్మకు చాలా ఇష్టంగ ఉండేది. వాళ్ళు వచ్చి ఉండటం మొదలైనాక రెండేళ్ళ పాటు నిరీక్షణలో ఉంచి తన నిర్ణయం సరైనదేనన్న నమ్మకం కుదిరాక ఆమెను అన్నయ్యకు చేసుకోవాలని దృఢంగ అనుకుంది. అన్నయ్యకు అమ్మ ఎంత చెప్తే అంత. నాన్నగారికి అమ్మ ఇష్టమే తన ఇష్టం. మా ఇంట్లో ఎవ్వరి మధ్యా విభేధాలు కానీ, ఎవరన్నా ఏ భేదభావాలు కానీ ఉండేవి కావు. అందువల్ల ఏ గొడవలూ లేకుండా నిశ్చితార్థం, పెళ్ళీ తలచిన తలంపుగానే జరిగిపోయాయి. సువ్వక్క పెళ్ళికూతురి రూపం నాకింకా కళ్ళలో నుంచి పోలేదు. ఇప్పటికీ ఆ చిరునవ్వు, అన్నయ్య పక్కన సిగ్గుల మొగ్గగా ముడుచుకుపోయిన ఆ శ్రీమతిగా మారుతున్న కన్యారూపం.. నాకింకా కళ్ళలోనే ఉంది. అప్పుటి నుంచి ఆమె నాకు అక్క నుంచి వదిన పదవిని చేపట్టి, సువ్వొదిన అయింది.
          సువ్వొదిన నవ్వు ముఖం, పనితనం, ఉత్సాహం, అణుకువ నాకు పరమ ఆదర్శాలు. ఆమెకు రాని పని లేదు. చదువుకోలేదన్న మాటే కానీ మా ఇంటి జమీ వ్యవహారల నుంచీ అన్నీ ఆమెకు నిర్వహించటం తెలుసు. అన్నయ్యకు తగిన భార్య, అమ్మకు తగిన కోడలు, మా నాన్నకు అయితే ఆమె కన్న తల్లే. ఇంటి పని, వంటపని, పనివారి పని.. అన్నీ ఆమె బాధ్యతలే. నేనూ ఆమె బాధ్యతనే. నాకు రోజుకు ఒక తీరుగ జడలేయటం, రంగుబొట్టులు దిద్దటం ఆమెకు మహా సరదా. నా పరికిణీలు, వాటి మీదికి బుట్ట చేతుల జాకెట్లు ఆమెనే స్వయంగ కుట్టేది. ఎంత పనైనా సరే, నా పని పూర్తైనాకే. అంతవరకూ ఎవరు పిలిచినా వెళ్ళేది కాదు. అప్పటికి నాకు ఒక ఎనిమిదేళ్ళు ఉంటాయేమో. ఆమె నాకన్నా పదేళ్ళు పెద్దది. కానీ కనీసం అంతకన్నా పదేళ్ళు ఎక్కువ అనుభవం కలిగిన మనిషి. అన్నయ్య పుట్టిన తర్వాత ఇంట్లో మళ్ళీ కేరుకేరుమని ఏ ధ్వనీ వినిపించలేదట. అప్పుడు ఎన్నో మొక్కులు మొక్కి, పూజలు చేశాక, ఇంక ఆశ వదులుకున్నాక ఓ పదమూడేళ్ళకు తీరిగ్గా నేను పుట్టానట. పాపం, అమ్మకు నన్ను అంత ఆలస్యంగ కనటం, అంతదాకా పెంచటంతోనే ఓపికంతా అయిపోయింది. ఆ పైనంతా నాకు సువ్వక్కే అమ్మ అయింది. తర్వాత సువ్వొదిన. ఇంట్లో అందరికీ నేనంటే గారాబం. ఒక్క సువ్వొదినే నేను ఆ గారాబంలో చెడకుండ చూసేది. అవసరమైతే రెండు తగిలించినా ఆమెకు ఆ స్వతంత్రం ఉండేది. ఎందుకంటే మంచి చెడూ వ్యత్యాసం తెలియకుండ పిల్లలు పెరిగితే వచ్చే అనర్థాలు ఆమెకు బాగా తెలుసు.
          వాళ్ళ పెళ్ళైన రెండేళ్ళ దాకా ఇంట్లో అంతా పండగ వాతావరణం. ఇంట్లో జీతగాళ్ళ దగ్గరి నుంచీ నాన్నగారి దాకా అంతా సంతోషంగ ఉండేవారు. నాకు ఆ ఇల్లు నందనంలా తోచేది. రోజూ సువ్వొదిన మేలుకొలుపుతో ఆ నగుమోమును చూస్తూ నిదురలేవటం, ఆమె పెట్టిన గోరుముద్దలు తిని బడికెళ్ళి రావటం, ఆడుకోవటం, సువ్వొదిన ఒళ్ళో కూర్చుని చదువుకోవటం, ఆమె పెడితే గారాలు పోతూ తినటం, కడుపు నిండా కమ్మని కబుర్లు చెప్పుకోవటం, తర్వాత సువ్వొదిన జోల పాటలు వింటూ హాయిగ నిదురపోవటం. ఇది నా జీవితం అప్పట్లో.
          కానీ కాలం ఒక తీరుగ గడవదు. కాని కాలం వచ్చి పడి నాన్నగారు ఏదో భయంకరంగ జబ్బుపడ్డారు. అప్పట్లో నాకు తెలియదు. ఇప్పుడు తెలుసు. దాని పేరు కాన్సరు. అమ్మ తల్లడిల్లింది. పునాదులతో సహా ఇల్లంతా కదిలిపోయింది. ఇక వ్రతాలూ పూజలూ అన్నీ ఏమీ ఫలాన్ని ఇవ్వకుండానే జరిగిపోయినాయి. నాన్నగారు అమ్మ సౌభాగ్యాన్ని, ఇంటి సంతోషాన్ని, అందరి ఆనందాన్ని తీసుకుని శాశ్వతంగ పరలోకయాత్రకని పోవటానికి సన్నద్ధులైనారు.
          అప్పటికి అన్నయ్య చదువు కోసం విదేశం వెళ్ళి ఉన్నాడు. తనకు చెబితే ఎక్కడ చదువు మానిపోతుందోనని నాన్నగారి అనారోగ్యం విషయం తనకు ముందు చెప్పలేదు. ఆయనే చెప్పనివ్వలేదు. తీరా అంతా అయిపోయే వేళకు దీపం రెపరెపమంటూండగా వచ్చాడు.. అదీ ఇంక శ్వాసలు ముగిసిపోయే వేళైందని డాక్టరు తేల్చేసరికి పిలవక తప్పలేదు. ఆ రాత్రి నాకు బాగా గుర్తు. అందరికీ కళ్ళ మీదే గడిచిన పీడారాత్రి. నాన్నగారి ఆఖరి క్షణాలలో కూడా ఏవో లెక్కా పత్రాలు అప్పచెబుతున్నారు అన్నయ్యకు. బాధ్యతలు..!! తర్వాత ఏ గొడవలూ రాకుండ జాగ్రత్తలు..! విల్లు వ్రాయించిన లాయరు గారు, ఇంటి పనులు, జమీ వ్యవహారాలు చూసుకునే పెద్ద మానేజరు కూడా వచ్చారు. నాన్నగారికి చాలా బాధ్యత ఎక్కువ. అది పోయేవేళ కూడా అట్ల నిర్వహించుకున్నారు. అన్నీ చర్చలైనాకే ఆయన నిశ్చింతగ కన్నుమూశారు. అమ్మ బాగా బెంగపడింది. ఆమెను ఓదార్చటం ఎవ్వరి తరం కాలేదు. సరిగ్గ నాన్నగారి కర్మకాండ కూడా పూర్తి కాకుండానే ఆమె కూడా ఆయన దారే వెళిపోయింది. ఆమె అంత బెంగ పెట్టుకుందని ఊహించని మేమంతా శిలలలాగ అయిపోయాం ఆ దుఃఖంతో. అన్నయ్యను పట్టుకోవటం చాలా కష్టమైంది. మనిషి బాగా బాధతో చితికి సగమైపోయాడు. అమ్మ అంటే అన్నయ్యకు ప్రపంచంలో అందరికన్నా ఇష్టం.
          అందరూ ఆమె బెంగతో పోయిందనే అనుకున్నారు. కానీ అక్కడ ఒక ఉత్పాతం జరిగింది. అమ్మకు బీపీ ఉండేది. దానికేదో ఆయుర్వేదం మందు వాడేది. నాన్న కర్మల్లో ఉండంగ ఆమెకు తల తిరిగినట్టై సువ్వొదినను ఆ మందు తెచ్చి ఇవ్వమంటే ఆమె ఆ హడావుడిలో తెచ్చి ఇచ్చిన సీసానే అమ్మ ప్రాణాలు తీసింది. అది పొలంలో వాడే పురుగుల మందు. అయితే సీసా మందుదే కానీ మందు అయిపోయాక ఆ విషం అందులో పోశారట. దాని మీద ఆ పేరు చిన్న కాగితం ముక్క మీద వ్రాశారట కానీ అది చదువురాని సువ్వొదినకు అర్థం కాలేదు. దాంతో అనుకోని ఆ ఘోరం జరిగింది. సువ్వొదిన మంచి రోజులకు తెరపడింది. ఆమె నగుమోముకు గ్రహణం పట్టింది.
          అమ్మా నాన్నగార్ల కర్మకాండ పూర్తయేవరకు, బంధువులంతా ఓదార్చి ఎవరిళ్ళకు వారు వెళిపోయే వరకు ఓర్పుగా వేచి ఉండి అన్నయ్య ఒక భూకంపం సృష్టించాడు వదిన జీవితంలో.
          ఆ భూకంపం ఆమె గుండెలను శకలాలుగా చీల్చింది. ముక్కలు ముక్కల కింద ఆమెను పగలగొట్టింది. ఇంక నుంచి అన్నయ్య జీవితంలో కానీ ఆ ఇంట్లో కానీ వదినకు స్థానం లేదు. ఇది ఆయన తేల్చిపేల్చిన మాట. ఆమెకూ మాకూ ఏ రకం సంబంధమూ ఉండబోదు. వారి వైవాహిక అనుబంధానికి చట్టపరంగ తెగతెంపులు లేకపోయినా ఇక నుంచి వారి మధ్య ఆ సంబంధం పేరుకు తప్ప పంచుకోవటానికి కాదట. వదిన నిశ్చేష్టత మా అందరి మనసుల్లో అగాధంలాంటిదేదో సృష్టించింది.
          అందరూ మొత్తుకున్నారు. ఊరి పెద్దలే కలగచేసుకున్నారు. అన్నయ్య కాళ్ళా వేళ్ళా పడ్డారు. అటువంటి నిర్ణయాలు ఎవరికీ శుభకరం కావని నచ్చచెప్పారు. అన్నయ్య వినలేదు. కలకంఠి కంట కన్నీరొలకకూడదన్నారు. ఇల్లంటే ఇల్లాలే. ఆమెను బయటకు పొమ్మనే అధికారం ఎవరికీ లేదని, ఆమె సరేనంటేనే అతనైనా ఆ ఇంట్లో ఉండగలడని అన్నారు. ఆమె ఆ ఇంటి మహారాణి అని, ఆ ఇంటి శ్రేయస్సుకు పునాది ఆమె చిరునవ్వేనని, అది చెరగనివ్వద్దని నీతి చెప్పారు. కానీ అన్నయ్యది కాలి ఉన్న మనసు. అందులో అనురాగం బూడిదైపోయింది. మంచితనం మసైపోయింది. ఇల్లు ఆమెదైతే ఆమెనే ఉండమని, తనే బయటకు పోతానని బయలుదేరాడు. వదిన నిర్ఘాంతపోయింది. ఆమె నోట మాట పడిపోయిందా అన్నంత దైన్యంతో శిలాప్రతిమలా ఉండిపోయింది. అప్పుడు మా ఊరి ఆడపడుచులంతా ఏకమై అన్నయ్యను నిర్బంధించారు. అన్నయ్యా, వదినా ఆ ఇంటి దీపాలన్నారు. వారిద్దరూ అగ్నిసాక్షిగా ఒకటైనాక ప్రకృతిలో ఏ శక్తీ ఆ బంధాన్ని తెంచలేదన్నారు. కోపం పోయేదాక కావాలంటే దూరంగ ఉండండి. కానీ శాశ్వతంగ వేరుకావటానికి సామాజికంగ కానీ, నైతికంగ కానీ, ధర్మపరంగ కానీ వారికి అనుమతి లేదన్నారు. ఎన్నో విధాల నచ్చచెప్పారు.
           అన్నయ్య కోపం ఏమీ విననివ్వకుండా ఆయన బుద్ధికి పొరలు కమ్మేసింది. ఆయనకు తను మాట్లాడే మాటలు, తీసుకున్న నిర్ణయాల ప్రభావం తెలియటం లేదు. అసహనంతో అరుస్తున్నాడు..! పెద్దవారని కూడా చూడకుండ వారిని వారి మాటను కాదంటున్నాడు. ఆయన పరిస్థితి చూసుకుని వదిన మౌనంగ బయటకు నడవబోయింది. అమ్మలక్కలంతా ఆమెను ఆపి ఇది న్యాయం కాదన్నారు. ఇంత పెద్ద పేరున్న ఇంటికి ప్రతినిధిగా ఉన్న అన్నయ్యకు తన ఇచ్ఛ వచ్చినట్టు చేసే అధికారం లేదన్నారు. కావాలంటే ఇంట్లో వద్దు.. కనీసం గొడ్ల చావిట్లో అయినా ఆమెను ఉండనివ్వమన్నారు. చినరకు అన్నయ్య సరేనన్నాడు. గొడ్ల చావిట్లో గొడ్లతో పాటు ఆమెను ఉంచారు. ఇదివరకు ఏ పని ఆమె యజమానురాలి అజమాయిషీతో చేసేదో ఇప్పుడు అదే పని పనివారితో కలిసి చేయాలి. ఆమె అడ్డు చెప్పకుండా ఆ బాధ్యతను స్వీకరించింది.
          అక్కడి నుంచీ ఆ ఇంటి రూపురేఖలే మారిపోయాయి. వదిన, ఆమె తమ్ముడూ గొడ్ల చావిట్లో.. నేనూ, అన్నయ్య ఇంట్లో. ఆమె, ఆ తమ్ముడూ చేసేది చాకిరి. ఆయన చూసుకునేది వ్యవహారం. నేను పడేది సుఖం ముసుగున మథన. వంచిన నడుం ఎత్తకుండ పని చేసేదామె ఆ బాధ మర్చిపోవటానికి..! నెల నాళ్ళలో ఆమె ఆరోగ్యం చెడింది. పని చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టరును పిలిచారెవరో. ఆమె నీరసానికి కారణం కడుపులో పండిన పంట అని తెలిసింది. ఇంటి వంశాంకురం రాబోతోందిట.
          అన్నయ్యలో ఆ వార్త ఏ మార్పూ తీసుకురాలేకపోయింది. సువ్వొదిన కూడా ఏ ఆశలూ పెట్టుకోలేదు. పనివారిలాగే ఉండిపోవటాన్ని ఆమె అంగీకరించింది. నెలలు నిండాక పంట అంది వచ్చింది. వంశోద్ధారకుడు వచ్చాడు. అన్నయ్య వాడి మొహం కూడా చూసేవాడు కాదు. తనను ఏహ్యంగ చూసినా, చిరునవ్వు చెరగనివ్వని ఆ సరళ హృదయురాలు ఈ ప్రవర్తనకు మాత్రం చాలా చాలా కుంగిపోయింది. అన్నయ్యను నిలదీయలేక- కన్నకొడుకును కాదనుకునేవాడు ఏ పాషాణహృదయుడు- అని నన్ను పట్టుకుని రోజూ ఏడ్చేది. నేనేం చేయగలను..? అన్నయ్య లేనప్పుడు చంటివాడికి, ఆ బాలింతకూ కావాల్సిన అవసరాలు చూసేదాన్ని. చంటివాడితో ఆడుకునేదాన్ని. అన్నయ్య నాకు ఏదైనా కొనుక్కోవటానికి ఇచ్చిన డబ్బులు తనకు తెచ్చి ఒట్లు వేసి వేసి ఇచ్చేదాన్ని. లేదంటే తీసుకునేది కాదు. కానీ తీసుకోక తప్పేది కాదు. బాబుకోసం.
          వాళ్ళ అక్కతో పాటు మా ఇంటికోసం అతనూ బండెడు చాకిరీ చేసేవాడు. అక్క కన్నీరు చూశాడు, బావ కాఠిన్యం చూశాడు. ఈ కళ్ళు ఎండవు.. ఆ గుండె కరగదు. కాలం ఆగదు. కష్టం తీరదు. తీరని ఆసహాయత. చెప్పలేనంత గుండెకోత.. అట్లగే అనుభవించాడు.. మౌనంగ. చివరాఖరికి పొలం పని చేస్తూ అక్కడే పాము కాటు వేసి వదిన తన బాధలన్నింటికీ సమాధానంగ మృత్యువు వడిని పొందింది. ఆమె పోవటంతో ప్రపంచంలో ఒంటరైపోయిన ఆ తమ్ముడు చూసేవారి గుండెలు కూడా పగిలి ముక్కలయ్యేదాకా ఏడ్చాడు. ఈ మూడేళ్ళు దాచుకున్న కన్నీటి చెరువంతా అతని కళ్ళ చెలియలికట్ట దాటి పొంగింది. ఆ అక్క చితిమంటల్లో అంతా ఎండిపోయేదాకా ఆగి, ఆ రోజు అన్నయ్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు రాత్రి పది గంటలైంది. ఆ గొంతులో నిశ్చయం నాకింకా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది.
          "ప్రకాశం!!!" అన్నయ్య పేరుపెట్టి పిలిచాడు.
          అన్నయ్యకు బుస్సున పొంగింది కోపం. కానీ ఏమీ అనలేదు. అతనిది ఆవేశం కాదు, ప్రేలాపన కాదు. కేవలం ఒక శపథం, ప్రతిజ్ఞ మాత్రమే కాదు. అది భవిష్యవాణి. అంతే.
          "గుర్తుంచుకో! ఈ మూడేళ్ళ పగ నీ మీద తీర్చుకోవటమే ఇక నా జీవన ధ్యేయం. నేను తిరిగి వచ్చేదాకా నీ కళ్ళ నిండా నిద్రపో- హాయిగా. తర్వాత నీ కంటి మీద కునుకు ఉండదు. జాగ్రత్త."
          అన్నయ్య అతని ఆవేశం చూసి నవ్వాడే కానీ ఏమీ అనలేదు. ఊరుకున్నాడు. జీతగాళ్ళు అతని మీదకు ఉరికి పట్టుకోబోతుంటే, "ఏదో కుర్రకుంకలేరా.. వదిలేయండి.." అని వారిని ఆపాడు. అతను వెళ్తూ వెళ్తూ బాబును కూడా తీసుకువెళ్ళాడు. నేను గది కిటికీ లోనుంచి అతను భుజాన వేసుకుని తీసుకుపోతున్న సువ్వొదిన ప్రతిరూపాన్ని, చివరి జ్ఞాపకాన్ని, నేనే ఎంతో అపురూపకంగ పేరు పెట్టుకున్న వర్చస్ ను చూస్తూ మౌనంగ కన్నీరు తుడుచుకున్నాను- నిస్సహాయంగ. వ్యక్తురాలినై గదిలో బందీనై ఉండిపోవటంతో కనీసం అతనిని మాటతోనైనా ఆపే అవకాశం వినియోగించుకోలేకపోయాను.
          సువ్వొదిన వెళిపోయింది. ఆ చంటివాడిని ఎత్తుకున్నప్పుడు వినిపించే ఆమె గుండె చప్పుడు కూడా వినిపించటం మానేసిన నాలుగు నెలలకు నా ఎనిమిదో తరగతి పూర్తైంది. ఊళ్ళో అంతవరకే చదువు ఉంది.
          "పైన చదువుతావా?" అని అడిగాడు అన్నయ్య. చదువులేకపోతే ఏం పోగొట్టుకుంటామో నేర్పిన సువ్వొదిన జీవితం నాకు ప్రత్యక్షసాక్ష్యంగ ఉండటంతో నేను చదువుకోటానికే మొగ్గు చూపాను. ఆమెనే నాకు చదువు విలువ చెప్పిన తొలి గురువు. "చదువు లేనివాడు పశువు మాత్రమే కాదు.. వాడు కనీసం పశువు విలువ కూడా చేయని దౌర్భాగ్యుడు." అంటుండేది ఎప్పుడూ. ముఖ్యంగ అమ్మ పోయాక! అయితే, "సా విద్యా యా విముక్తయే" అనే రహస్యం ఎరిగీ ఆమె ఈ చదువులకు విలువనిచ్చింది అంటే తనకు వచ్చిన చదువు, విలువ లేనిదని ఆమె ఉద్దేశం కాదు. చదువుకున్నవారందరికన్నా ఎక్కువ సంస్కారం, వివేకం ఆమెకు ఉన్నప్పటికీ జీవితం ఆడిన ఆటలో ఆమె ఓడిపోయింది ఆ పనికిరాని చదువు లేకపోవటం వల్లే కదా. అది ఆమె బాధ. అదే నా బాధ.
          పక్క ఊరిలో కాలేజి ఇంటరు వరకు ఉన్నది. అందులోనే ఆ నాలుగేళ్ళూ ఇంటి నుంచే వస్తూ పోతూ చదువుకున్నాను. అది చదువుకోసం ఉన్న ఆసక్తి కన్నా పని లేనితనం నాకు తెచ్చి పెట్టబోయే భయంకరమైన ఖాళీని చూసి భయపడి, దాని బారిన పడకుండ చేసుకున్న ఏర్పాటు మాత్రమే. సువ్వొదిన, వర్చస్ జ్ఞాపకం వచ్చి చిత్రవధ చేయకుండ మనసును భద్రంగ ఉంచుకోవటానికే ఎంచుకున్న మార్గం. కనక ఇంటరు పూర్తైనాక తిరిగి అదే ప్రశ్న అడిగిన అన్నయ్య ముందు మళ్ళీ తల ఊపాను. సిటీలో ఉంచి డిగ్రీ చెప్పించాడు అన్నయ్య. సైంసు చదివాను. కేవలం అందులో అయితే ఎక్కువ పని ఉంటుంది కనక ఎంచుకున్నాను. రికార్డులు, లాబ్ లు, డిసెక్షన్ లు, ప్రయోగాలు.. అన్నీ శ్రద్ధగ చేశాను. అదొక్కటే నన్ను నన్నుగా మిగులుస్తుంది.
          ఎందుకంటే ప్రతీ స్త్రీ జగజ్జనని ప్రతిరూపం అంటారు. ఆమెలో అంతర్లీనంగ అమ్మవారు ఉంటుందంటారు. అందుకే చిన్నపాప నుంచి పెళ్ళై పిల్లలను కన్న స్త్రీ వరకు.. సువ్వొదిన రూపంగానే కనిపించేవారు. నేను ఆమెను వృద్ధురాలిగ చూడలేదు. అయినా ఒక పండుముసలామె ఎవరైనా కనిపించినా సువ్వొదిన ఉండి ఉంటే ఆ వయసుకు ఇట్లగే ఉండేదేమోననిపించేది. నా స్నేహితురాళ్ళలో, మా టీచర్లలో, చిన్న పసిపిల్లలలో అందరిలో వదినే కనిపించేది.
          నేను పిచ్చిపిచ్చిగ చదివేదాన్ని. అది తప్ప వేరు లోకం లేనట్టు. ఊరి కట్టుబాట్లను లెక్కచేయకుండ అన్నయ్య అంత తేలికగా నా పైచదువుకు ఒప్పుకున్నది కూడా ఆ ఆసక్తి వల్ల మార్కు షీట్లలో పెరిగిన బరువు చూసే. అన్నయ్య వెర్రి పట్టినవాడిలా సంపాదించేవాడు. వ్యాపారం, వ్యవహారం తప్ప లోకం వేరేం పనే లేనట్టు. ఇప్పుడు అంతా మూడు పువ్వులూ ఆరు కాయలుగా ఉంది. ఆయనకూ నాకూ జీవితంలో దేనికీ కొదువ లేదు. ఒంటరితనానికి కూడా. మనసులో అమ్మానాన్నల లోటు, సువ్వొదిన కన్నీరు తొలుస్తుంటే ఎవరికి మాత్రం సుఖంగ ఉంటుంది..? ఎవ్వరిలో సహజంగ ఇమడలేకపోయేదాన్ని. ఎప్పుడైనా నన్ను చూడటానికి కాలేజికి అన్నయ్య వచ్చినా మాట్లాడలేకపోయేదాన్ని. ఎవరిలో కలవలేక నాలో నేను ఉండలేక ఎంత అవస్థ పడేదాన్నో. ఎందుకంటే నా మొట్ట మొదటి తుట్టతుది స్నేహితురాలు సువ్వొదినే.
          బహుశ అన్నయ్యకు కూడా! అందుకే ఎంతో మంది ప్రయత్నించినా అన్నయ్య ఆ స్థానాన్ని ఎవ్వరికీ ఇవ్వటానికి ఇష్టపడలేదు. ఎప్పుడూ ఆమె గురించి కానీ బాబు గురించి కానీ మాట్లాడకపోయినా తన మనసులో కూడా వారి జ్ఞాపకాలు చెరిగిపోలేదని నాకు అనిపించేది. అన్నయ్య చెడ్డవాడు కాదు. కానీ అమ్మ మీద ప్రేమ అట్ల చేయించింది ఆయనతో. అమ్మ ఉండటం అట్ల ఉండేది. అట్ల బహుశ ఏ అమ్మా ఉండదేమో. చిత్రమేంటంటే ఆమె నాకు మాత్రమే అమ్మ. ఆయనకు కాదు. అన్నయ్య వాళ్ళ అమ్మ తను పుట్టిన ఏడాదికే మతి చలించి ఎవరితోనో వెళిపోతే నాన్నగారు ఆ అవమానం తట్టుకోలేక, అన్నయ్యను జమీ వ్యవహారాలను ఒంటి చేత్తో చూసుకోలేక తన కోసమని మా అమ్మను పెళ్ళి చేసుకున్నారు. నాకు ఈ సంగతులేవీ చాలా కాలం పాటు తెలియచేయబడలేదు. అమ్మ చనిపోయినప్పుడు ఎవరో మాట్లాడుకుంటుంటే పొరపాట్న విన్నాను. తర్వాత ఆలోచిస్తే నిజంగ అన్నయ్య ప్రవర్తన సబబైందేనని కూడా అనిపించింది. అమ్మ ప్రేమ సామాన్యమైనది కాదు. అన్నయ్యకు ఆమె సొంతతల్లి కూడా చేయనిది చేసింది. ఒక కాలు అవిటి అయిన అన్నయ్యను ఏహ్యం చేయకుండ కడుపులో పెట్టి చూసుకుంది. అటువంటి అమ్మను సువ్వొదిన వల్ల అర్థం లేని నిర్లక్షం కారణంగ పోగొట్టుకోవాల్సి రావటం విఘాతకరమే. అన్నయ్య కోపం అర్థం లేనిది కాదనిపించింది. తన స్థానంలో ఉంటే ఎవరైనా అట్లగే చేసేవారేమో. కానీ క్షమించగలిగితే బాగుండేది. నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు తనకూ లోలోపల ఇదంతా ఎవరికోసం జరిగింది అన్న పశ్చాత్తాపం బయలుదేరింది.

No comments:

Post a Comment