7
సిద్ధాంత్ కాగితం మీద అడ్రస్ తో ఆ ఇంటి
నెంబరు సరిచూసుకుని బెల్ కొట్టాడు. ప్రార్థితే వచ్చి తలుపు తీశాడు. సిద్ధాంత్ ని
చూస్తూనే అతని ముఖంలో ఆశ్చర్యం, ఆనందం, దాని వెనువెంటనే ఒక బాధ కదలాడాయి.
సిద్ధాంత్ అతని వంక తీక్ష్ణంగ చూస్తూ నిలబడ్డాడు. వచ్చింది ఎవరా అని ప్రార్థిత్
వాళ్ళ అమ్మ వచ్చి సిద్దాంత్ ని చూసి, ఆప్యాయంగ పలకరించి లోపలకు పిలిచింది. ఆమె
నవ్వు ఎప్పటిలాగే ఉంది. దానితో అతడు నవ్వి, లోపలకు వెళ్ళాడు.
"అదేంట్రా.. ఇన్నేళ్ళకు పిల్లాడు
మనలను వెతుక్కుంటూ వస్తే కనీసం లోపలికైనా రమ్మనవు..?" అని ప్రార్థిత్ ని
కసిరిందామె.
ప్రార్థిత్ సిద్ధాంత్ ని తేరిపార చూసి,
"వెతుక్కుంటూ వచ్చింది మన కోసమేనా అని నా అనుమానం. మనకోసమే అయితే ఇన్నేళ్ళు
చేసేవాడు కాదు. అదే వాడి ముఖంలో పరికిస్తున్నా." అన్నాడు.
సిద్ధాంత్ కళ్ళలో నీరుబికింది. "నీకోసం
కాకపోతే నాకోసమా..?" అని అతను ప్రార్థిత్ దగ్గరకు వచ్చి అతనిని గట్టిగ
కౌగిలించుకున్నాడు. ప్రార్థిత్ కూడా అంతకన్నా ఆత్మీయంగ అతనిని ఆలింగనం
చేసుకున్నాడు. కొన్ని క్షణాలకు ఇద్దరూ ప్రార్థిత్ వాళ్ళ నాన్న పలకరింపుతో
తేరుకున్నాక, ఆయనను కుశలం అడిగి, సిద్ధాంత్ అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ ప్రార్థిత్ తో-
"ఇన్నేళ్ళకైనా నేను నీకోసం వచ్చానేగానీ నువ్వు నన్ను ఒక్కసారైనా
పట్టించుకున్నావా..?" అని నిష్ఠూరంగ అడిగాడు.
"నీకు తప్పక ఏదైనా అవసరం వచ్చి
ఉంటుంది. అది నాకు వచ్చి ఉంటే నేను నీ ఇంట్లో ఉండేవాడినేమో. రాలేదు కనక లేను.."
అని ఆగి, "ఏమో, ఉన్నా వచ్చేవాడిని కాదేమో.." అన్నాడు.
"అంత అపరాధం నేనేం
చేశానురా..?"
ప్రార్థిత్ తండ్రి వంక తిరిగి, "తెలియనట్టు
చూడండి నాన్నా, ఎట్ల అడుగుతున్నాడో..!! వద్దంటున్నా వినకుండ లాల్ ఎండ్ లాల్
కంపెనీలో తన కాంటాక్టుల ద్వారా నిషితా మీద వెనక నుంచి ఒత్తిడి తెప్పించే ప్రయత్నం
చేసి ఏమీ ఎరగనట్టే మాట్లాడుతున్నాడు..!" అని సిద్ధాంత్ వంక చూసి, "నేను
వద్దన్న తర్వాత కూడా ఆ దారినే పోయి, అట్ల ఆ అమ్మాయి ఉద్యోగం పోవటానికి పరోక్షంగ
కారణమైన నీకు సిగ్గుగా లేదా?" అన్నాడు.
"ఒక ఆడపిల్ల మూలకంగ మన మధ్య ఇంత
ఆఘాతం వచ్చింది. అందుకు సిగ్గుపడుతున్నాను."
"ఎవరి ముందూ అనకు. నిజమనుకుంటారు. వచ్చిన
గొడవ ఆడపిల్ల మూలకంగ కాదు. నీ ప్రతీకారం వాంఛ వల్ల. ఆమె స్థానంలో ఎవరైనా అబ్బాయి
ఉన్నా మన మధ్య గొడవ వచ్చి తీరేది. నీ వల్ల నలుగురిలో నేను చెడ్డవాణ్ణైనాను. అందరూ
నన్ను పగతీర్చుకునేవాడి కింద చూశారు. భగవంతుడి ముందు మొదటిసారి తల వంచుకోవాల్సి
వచ్చింది. నాకెంత అవమానమైందో..!!"
"అది అవమానం కాదు.. శత్రు పతన
విజయం. చేసిన దానికి ఆమె అనుభవించి తీరాలి. అయినా నేనేమీ చేయకపోయినా వాళ్ళు ఆమెను
ఉంచేవాళ్ళు కాదు. నిజానికి నేను చేసిందెక్కువేమీ లేదు.. అది నీకూ తెలుసు."
"అది నాకనవసరం. కొంత వ్యవధి ఇస్తే
తెలిసిపోయేది ఏ సంగతీ. ఎందుకు కలగచేసుకున్నావు మరి మధ్యలో..? జరిగేది
జరగనివ్వాల్సింది. కనీసం స్నేహం తెగేది కాదు కదా."
"చెప్పా కదా, నాకు న్యాయాన్యాయాల
విచక్షణ, ఆత్మ గౌరవం రెండూ ఎక్కువని."
"సారీ, నీ మాటే సరైనదని
నీకనిపిస్తే మనం మాట్లాడుకోకపోవటమే మంచిది..! న్యాయం అన్యాయం అని స్నేహానికి
విఘాతం తెచ్చింది నువ్వు. నీకు నా భావానికి ఉన్న విలువకన్నా ఆ పిల్లమీద ప్రతీకారం
తీర్చుకునేందుకే దురద ఎప్పుడు ఎక్కువైందో, అప్పుడే మన మధ్య స్నేహం ముగిసిపోయింది."
"అందుకు నేనే ఎక్కువ బాధ
పడుతున్నాను. ఎందుకంటే నీకు అన్యాయం చేసింది మన అధికారిణి.. నేరుగా నిషా తప్పేం
లేదు. ఆశపడి ఆమె చెప్పింది చేయటం తప్ప.."
"అధికారిణా..???" క్షణం పాటు
నిజమా అన్నట్టు చూశాడు ప్రార్థిత్. అంతే..! ఆ ముందూ తర్వాత ఏమీ ప్రతిక్రియ లేదు.
"ఎట్ల తెలిసింది..?" కాసేపాగి అడిగాడు.
"నా సోర్సెస్ నాకుంటాయి! అన్ని
కంపెనీలలో నా పరిచయాలు ఇప్పుడు పెరిగాయి. అయితే ఇప్పుడు ఆ అధికారిణి మనం ఏం
చేయలేనంత ఎత్తులో ఉంది.. అదే నా బాధ.."
"అంటే, ఏమైనా చేయగలిగితే
చేసేద్దామనే..!! అందుకేరా.. నీ ఈ దిక్కు మాలిన ఆలోచనా పద్ధతి బాగా అర్థమై,
బొత్తిగా నచ్చకే నా అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ నీకు ఇవ్వలేదు. మొన్న సింహా
కలిసి నా గురించి అడుగుతున్నావని తెలియచెప్పినా కావాలనే పలకలేదు. సింహాతో కూడా అడ్రస్
ఇవ్వద్దనే చెప్పాను. కానీ నువ్వు తలుపు కొట్టి ఊడిపడేసరికి అతడు నా మాట
లెక్కచేయలేదని అర్థమైంది. అసలు ఇప్పుడు కూడా అమ్మ లేకపోతే లోపలకు రానిచ్చేవాడినే
కాదు. అతిథివై బ్రతికిపోయావు."
"చూడండి ఆంటీ.. ఎట్ల
మాట్లాడుతున్నాడో.." అన్నాడు సిద్ధాంత్ బాధగా.
అప్పుడు ప్రార్థిత్ తల్లి వారిద్దరి మధ్య
కలగచేసుకుని- "వాడి మాటలేం పట్టించుకోకు సిద్ధూ..! రా, కాళ్లు చేతులు కడుక్కో.
భోజనం వడ్డిస్తున్నాను.." అంది.
సిద్ధాంత్ అంతలోకే నవ్వి, ప్రార్థిత్ కి
కన్ను కొట్టి, "వస్తున్నానాంటీ.." అని లేచి లోపలకు వెళ్ళాడు. ప్రార్థిత్
సర్లే అనుకుని లోపలకు వెళ్ళాడు. ఆమె అందరికీ భోజనం వడ్డించింది.
కాసేపు వాళ్ళ అమ్మా నాన్నలతో మంచీ చెడూ
మాట్లాడుతూ భోజనం ముగించాక, వాళ్ళ అమ్మ అతను ఉండటానికి ఏర్పాటు చేస్తానని
వెళిపోయింది. వాళ్ళ నాన్నగారు యథావిధిగ పని మీదకు వెళిపోయాడు. ప్రార్థిత్ సిద్ధాంత్
మిగిలారక్కడ. ఇద్దరి మధ్యా మౌనం.
ప్రార్థిత్ ఇప్పుడు ఇదివరకటికన్నా
శాంతంగ, నిండుగ ఉన్నాడు. నాలుగేళ్ళలో చాలా మార్పు ఉంది అతనిలో. అప్పటిలో ఏదో
వెతుకులాడుతున్నవాడిలా ఉండేవాడు. నిత్యం ఆ కళ్ళలో ఏదో కావాలన్న తపన కనిపించేది.
ఇప్పుడు సంతృప్తిగ, ఏదో కావాల్సింది దొరికినవాడిలా, అన్వేషణ పూర్తయిన భావనతో అతని
కళ్ళు మెరుస్తున్నాయి. వాటిలో ఎప్పటికన్నా ఎక్కువ తళుకు ఉంది. మనిషి ముఖంలో కాంతి
మరింత పెరిగి ఉంది. అతనిని చూస్తుంటేనే ప్రశాంతంగ అనిపిస్తున్నాడు. అప్పటిలా వెంటాడి
వేటాడే తృష్ణ ఉపశమించింది. మాట కూడా అదివరకటికన్నా ఆప్యాయంగ, ఆత్మీయంగ
అనిపిస్తోంది. చూస్తున్నాకొద్దీ అతని వంక చూడాలనిపిస్తుంటే సిద్ధాంత్ కి ఆ భావన
చాలా వింతగ అనిపించింది.
తర్వాత ప్రార్థిత్ ఏమైనా
మాట్లాడతాడేమోనని చూసి, ఏమీ అనకపోయేసరికి సిద్ధాంతే అన్నాడు- "ఎట్ల ఉంది నీకిప్పుడు..?
పని బాగా సాగుతోందా..?"
"ఊఁ.. ఫరవాలేదు. నేను నాన్నగారితో
పాటు ఎక్కువగా కాంసర్ మందు పనులలోనే ఉంటున్నాను. సింహా వేరెక్కడా ఉద్యోగం దొరకక
నన్ను చేరాడు. సరే, మా రిసర్చుతోనే ఉండిపోమన్నాను. మందుకు మంచి పబ్లిసిచీ ఇచ్చి
ఏదో సహాయం చేస్తున్నాడు. బాగా రద్దీ పెరిగారిప్పుడు. నాన్నగారు ఒక్కరే
చేసుకోలేకపోతున్నారు. తెలుసు కదా, ఆయన చాలా తక్కువ ధరతో కాంసర్ కి విరుగుడు ఒక
మందు కనిపెట్టారని.."
"ఊఁ.. మొన్న పొరపాట్న టీవీలో ఛానెల్
తిప్పుతుంటే కనిపించింది. కార్యక్రమంలో చూపిస్తే చూశాను. వివరాలు తెలిశాయి. సింహా
నెంబరైనా ఇచ్చారు కనీసం..! దొరికింది నీ కాంటాక్టు. నీకోసం చాలా ప్రయత్నించాను..
తెలుసా..? మీ ఊరు వెళ్ళి పిచ్చిగ వెతికి వెతికి వచ్చాను. ఈ ఊరు కాని ఊరిలో
ఉన్నారని అనుకోలేదు."
"మా ఊరిలో రిసర్చ్ కి అనుకూలమైన
పరిస్థితులు లేవు. అని అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇటు వచ్చేయమన్నారు. అయినా, నాకోసం
ప్రయత్నించీ లాభం ఉండదని వచ్చేసే ముందే చెప్పే వచ్చా కదా.." ప్రార్థిత్ నిష్ఠూరంగ
అన్నాడు.
"నా సంకల్పం చాలా గట్టిది. ఈపాటికి
నీకు అది అర్థమై ఉండాలి.."
అంతలోకి ప్రార్థిత్ కోసం ఎవరో వచ్చి
సెంటర్ లో పేషెంట్లు వచ్చారని చెప్పి పిలిచి వెళ్ళారు. ప్రార్థిత్ సిద్ధాంత్ ని ‘అమ్మా
నాన్నలతో మాట్లాడుతూండు’ అని చెప్పి సెంటర్ కి వెళిపోయాడు.
తిరిగి వచ్చేసరికి సాయింత్రం అయింది. ప్రార్థిత్
సిద్ధాంత్ ఇద్దరూ కలిసి రాత్రి వరకు చాలాసేపు మాట్లాడుకున్నారు. కలిసి వాకింగ్ కు
వెళ్ళారు. ఏవో పాత కబుర్లు చెప్పుకున్నారు. సిద్ధాంత్ కు తన తండ్రి రిసర్చ్ లాబ్
అంతా చూపించాడు ప్రార్థిత్. అక్కడ వచ్చే రోగులకు కాంసర్ ఏ స్థాయిలో ఉందో నిర్ధారణ
చేస్తారు. తర్వాత ఆ స్థితిని బట్టి మందు ఎంత ఇవ్వాలి ఎట్ల వాడాలో చెప్తారు. ఒక
రెండు రోజులు పర్యవేక్షణలో ఉంచి ప్రతిక్రియ ఎట్ల ఉందో చూసుకుని అంతా కుదురుగానే
ఉంటే పంపేస్తారు. ఏదైనా తేడా ఉంటే వాటిని సరిచేసి మళ్ళీ పర్యవేక్షించి పంపుతారు.
దానికి కావాల్సిన వ్యవస్థ వారి ఇంటి పక్కనే అద్దెకు తీసుకున్న నాలుగు గదుల ఇంట్లో
ఉంది. అదే వారి హాస్పిటల్, కమ్ రిసర్చ్ సెంటర్. మందుతో పాటు వారికి తగిన
కౌన్సిలింగ్ కూడా ఇవ్వటం అక్కడ విశేషం. జీవితం విలువ, రోగం తీరు, కష్టాలెందుకు
వస్తాయి, ధైర్యంగ ఎట్ల ఉండాలి, లాంటి చక్కటి విషయాలు వాళ్ళ నాన్నగారే చెప్తారట.
ఆధ్యాత్మికతతో పాటు ఇంకా కాస్త యోగా ధ్యానం కూడా నేర్పి వారిని ముందు మానసికంగ
శక్తిమంతంగ చేస్తారట. వారికి కావాలంటే వ్యక్తిత్వవికాసం పేరుతో ఒక చక్కని విశేష
కార్యక్రమం నిర్వహించే సంస్థకు పంపుతారట. అది కూడా నిశ్శుల్కంగ సేవ చేసే సంస్థేనట.
కొందరు వాలంటీర్లు రిసర్చ్ చేయటానికి కావాల్సిన డేటా కలెక్షన్ లో ఉన్నారు.
కెమోతెరపీ లేకుండా కాంసర్ ను సమూలంగా బాగు చేసే వైద్యవిధానం మన ఆయుర్వేదంలో ఉందిట.
దాన్ని స్టడీ చేసే అవకాశం ప్రభుత్వం కల్పించాలని వారి ఆశయం. సరే, ఆ చుట్టుపక్కల
ఉన్న చిన్న గుడి, కొండవాగు, చిన్న బ్రిడ్జ్ అన్నీ కాంసర్ రోగుల నయంకావడం కోసం
అనువుగానే ఉన్నాయనిపించింది సిద్ధాంత్ కు. వాళ్ళ ఊరు చాలా బాగుంది. ఎంతో ప్రశాంతంగ
నిజంగ రిసర్చ్ కు అనువైన స్థానంగా అనిపించింది. మాటి మాటికీ వాటిని తెగ
పొగుడుతుంటే ప్రార్థిత్ కి ఏదో అనుమానం వచ్చి,
"ఇంతకూ, వచ్చిన పనేంటో ఇంతవరకూ
చెప్పావు కాదు.." అన్నాడు.
"వచ్చింది నీకోసమే..! నిన్ను
చూడాలనిపించి..! చెప్పా కదా.. ఏం తెలియనట్టు కొత్తగ మాట్లాడుతున్నావు..?"
"ఎవరికిరా కుచ్చు టోపీ
పెడుతున్నావు..? నిజం చెప్పు.. నీ సోది అబద్ధాలు నమ్మేరకాలు వేరే వెతుక్కో."
"ఎట్ల తెలుస్తాయిరా
నీకివన్నీ..?"
ప్రార్థిత్ అతడి వంక 'నువ్వింక మారవు'
అన్నట్టు చూసి, "ఆఁ.. నీ మొహం చూసి చెప్పచ్చు. నీతో గడిపిన కాలం, నువ్వు
చేసిన పనుల జాబితా చాలు. ఎవ్వరూ చెప్పనక్కర్లేదు.. ఇన్నేళ్ళలో అవసరం లేకుండా నువ్వు
దేని గురించైనా తెలుసుకోవటం కానీ, దేనినీ పొగడటం నేను వినలేదు." అన్నాడు.
"సరే, ఇప్పుడు ఇక్కడకు రావటానికి
బలమైన కారణం ఉంది.." అని ఆగి, "ఇది దైవసంకల్పంగ భావించి వచ్చాను.."
అన్నాడు సిద్ధాంత్ సాలోచనగా.
"ఏంటో చెప్పు.."
"మీ కాన్సర్ మెడిసిన్ ను మనం
పాపులర్ చేద్దాం. జనసామాన్యంలోకి తీసుకుపోవటానికి అడ్వర్టైజ్ చేద్దాం. దానికి
బ్రాండ్ పెడదాం. కలిసి భాగస్వామ్యంలో వ్యాపారం చేద్దాం.."
"మా నాన్న విన్నారంటే చెప్పు
తీసుకుని చెంప వాయకొడతారు.. ఉత్తగ కూడా కాదు.."
"తెలుసు. ఇదే అంటావనుకున్నాను.
పోనీ, ప్రాఫిట్ తగ్గించుకుందాం. కానీ జనాలనైతే మందు చేరాలి కదా..!"
"దానికి ఆయన మార్గాలు ఆయనకు
ఉన్నాయి. నోటిమాట ద్వారానే ఇంతమందికి మేలు జరుగుతోంది. ఇంకా దానికి బ్రాండ్ లు,
అడ్వర్టైజింగ్ లు ఎందుకు..? నీకు తెలుసుకదా.. నాన్న ఆ కోవకు చెందిన మనిషి
కాదని.."
"ఏదో నీతో పాటు ఏదో చేస్తున్నానన్న
సంతృప్తి కోసం. పోనీ, కండీషన్లన్నీ నువ్వే పెట్టు. నీ పరిధిలోనే ఏదైనా చేద్దాం. నీ
మాట జవదాటను."
"వద్దురా.. వదిలేయి. దాన్ని
కమర్షియల్ ప్రొడక్ట్ గా ఊహించటానికే నాన్న ఇష్టపడరు. వీలైతే ఉచితంగ అందజేయాలని
ప్లాన్ చేస్తున్నారు.."
సిద్ధాంత్ కాసేపు అతని వంక చూసి, ఏదో
ఆలోచించుకుని, "సరే, పోనీ వదిలేయి. అదంతా మర్చిపో. నిన్ను బాధపెట్టి ఏమీ
చేయలేను. నీకు ఇష్టమైననాడే చేద్దాం. బాగా ఆలోచించుకో." అని ఆగి, "సరే,
నేను ఇంక వెళతాను.." అని లేచాడు.
వెంటనే, "ఇంక కాసేపు
కూర్చోకూడదా..?" అన్నాడు ప్రార్థిత్ అతని చేయి పట్టుకుని.
సిద్ధాంత్ అతని కళ్ళలో భావన లోతుగా
పరికిస్తూ, "నిజానికి ఇవాళ రాత్రికి ఇక్కడే ఉందామని ఏర్పాట్లతో వచ్చాను. నీ
తీరు చూసి వెనకడుగు వేశాను.." అన్నాడు.
ప్రార్థిత్ అతనికి సారీ చెప్పాడు.
"కొన్నింటికి ఆత్మసాక్షి ఒప్పుకోదు. అంతే. అక్కడ బేరాలాడలేను." అన్నాడు.
"సరే, వదిలేస్తున్నానన్నాను
కదా.." అన్నాడు సిద్ధాంత్.
అప్పుడు ప్రార్థిత్ తల వంచుకుని,
"సరే, విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె పేరుతో ఇన్నాళ్ళు నీకు
దూరంగా ఉన్నది, నిజం చెప్పాలంటే, పూర్తిగా నీ మీద కోపంతో కాదు..! ఇంటీరియర్
ప్రపంచం గుర్తులు మనసులో నుంచి తీసేయాలని. నాకు మన అధికారిణి పడే ఈర్ష్య గురించి
స్పష్టంగా తెలుసు. అందుకే అధికారిణి ప్రోద్బలంతో నిషితా ఇదంతా చేసిందన్నా నేను
ఆశ్చర్యపోలేదు. అధికారిణి కేవలం నన్ను వాడుకుంటోందని మొదటి నుంచీ తెలుసు కనక..!
నిషితాను అడ్డం పెట్టుకుని ఆమె నన్ను పని కట్టుకుని చేసిన ప్రతీ అవమానం నన్ను
బాధపెట్టేది..! కానీ తర్వాత ఆలోచించి, నవ్వుకుని వదిలేసేవాడిని. చివరకు ఆమె వేరే
కంపెనీ పెట్టుకుని మన మొహం కూడా చూడపోయేసరికి మనుషులంటే విరక్తి కలిగింది."
"----"
"అధికారిణి గురించి, నిషితా
గురించి ఆలోచించే తీరిక నాకెప్పుడూ ఉండేది కాదు. మొదలు గెస్ట హౌస్ ఫైట్ దెబ్బలు
కోలుకున్నా, ఆ తర్వాత వెంటనే మెట్లు దిగుతుంటే ప్రమాదం జరిగి, లేవలేని పరిస్థితి
అయింది. దారీ తెన్నూ తోచక మనసంతా అల్లకల్లోలమై చెడింది. అది బ్రతుకులోనే చాలా
పెద్ద మలుపు అనే చెప్పాలి. ఎటూ కదలటానికి లేకుండా, ఏ పనీ చేతకాకుండ మంచంలో
వికలాంగుడిలా పడి ఉంటూ బాధపడుతుంటే, నాన్నా అమ్మా ఓదార్పుగా మంచి మాటలు చెప్పేవారు.
నాన్న బాగా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతారు. ఓపికగా కూర్చుని చేసేదేం పని లేక అవే
చర్చలు చేసుకునేవారం. దానితో ప్రపంచం పద్ధతి ఏంటి, లోకం తీరేంటి, జన్మ ఎందుకు
వస్తుంది, అసలు సృష్టి అంటే ఏంటి, మనిషికి కావాల్సింది ఏంటి వంటి తాత్త్విక విషయాల
వైపు జీవితం దారి తీసింది."
"సాధారణంగ జనాలు ఇటువంటప్పుడు
బాలెంసే కోల్పోతారు."
"లేదురా, ప్రతీదానికి ఏదో కారణం
ఉంటుంది. మా ఇంట్లో మొదటి నుంచీ ఆయుర్వేదం తో పాటు ఇటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలూ
జరుగుతూనే ఉండేవి. కనక నాకేం కొత్త కాదు. అందుకే నేను అంతకాలం పిచ్చి పట్టినట్టు,
వేరే లోకం లేనట్టు తిరిగిన ఆ డబ్బూ, గొప్పలు, డాబు, ప్రదర్శనా, పోటీల ప్రపంచం
నిస్సారంగ తోచింది. తిరిగింది నా అభిరుచి కోసమైనా ఎదురుపడింది అన్నీ అవే కదా. సేవాలోకంలోకి
అడుగుపెట్టి జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే సంకల్పం కలిగాక ఇంక పాత బాట
వదిలేశాను. ఆ జ్ఞాపకానికి కూడా దూరంగా వచ్చేసే ప్రయత్నంలో నిన్నూ దూరం చేసేశాను. అది
కూడా సంతోషంతో ఏమీ చేయలేదు. చాలా..? ఇంకా వివరణలివ్వాలా..?"
"వద్దు. ఒకరకంగ నువ్వు ఏం
చెప్పకపోయినా బహుశ నేను ఇది ఊహించగలను. ఏదైనా- చెప్పి చాలా పెద్ద భారం దించావు నా
మీది నుంచి. లేదంటే కొంత అపరాధభావంతో బాగా కుంగిపోయాను. సరే, మంచిమార్గంలోకి
వచ్చావు.. సంతోషం." అని ఆగి, "నువ్వు కాదననంటే ఒక విన్నపం. నాకు కూడా ఈ
మార్గం చాలా నచ్చిందిరా. వదులుకోలేకపోతున్నాను.." అన్నాడు మళ్ళీ.
"నీ కన్ను పడింది. అంతే. ఇంక ఇది
బతికేదెట్లా..?"
"ఒరే, అట్లనకురా. ఇందాకటి
ఐడియానే.. కానీ పూర్తిగా వేరొక ఉద్దేశంతో. కమర్షియల్ కాక సేవాదృక్పథంతో."
"సరే, చెప్పు.. విందాం అది
కూడా.."
"నేను ఈ మధ్య వ్యాపారంలో కొంత
వెనకేశాను. అది ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే
ఇద్దరి భాగస్వామ్యంలో ఒక సామాజిక సేవా సంస్థ తెరిచి ఇదే ఔషధ సేవను ఇంకా మెరుగ్గా
ప్రజలకు ఉచితంగ అందిద్దాం. కనీసం మందు తయారీ, దాని పాకింగ్ ఆ విషయాలైనా చూసుకోవాలి
కదా. మందు కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికోసం వసతి లాంటివేవైనా అయితే
ఏర్పాటు చేయాలి కదా. నో ప్రాఫిట్ బేసిస్ మీదే ఉండనీ అంతా. నా కెంపెనీ పేరుతో
జోడించి ఒక వైద్యసేవా సంస్థ ఉందంటే నాకు ప్రభుత్వ సహాయం విషయంలో, లోన్ల విషయంలో
చాలా క్రెడిట్ ఉంటుంది. నీ భాగస్వామ్యంలో ఏదైనా చేస్తున్నానన్న సంతృప్తి ఉంటుంది,
నీకు ఏదో లాభం చేశానన్న భావన.. నాకు సేవా సంస్థ వల్ల బిజినెస్ లో టాక్స్
ఎక్సెంప్షన్, సేవారంగంలో కూడా ఉన్నానన్న మంచి పేరు వంటి బెనిఫిట్లు ఉంటాయనుకో.. ఏమంటావు..?"
ప్రార్థిత్ ఆలోచించాడు. "బాగానే
ఉంది. నాన్నగారు కూడా ఏదైనా సంస్థ రిజిస్టర్ చేయించాలనే అనుకుంటున్నారు. ఇంతవరకు
రిసర్చ్ తోనే సరిపోయింది. సరైన విధానంలో మందు వినియోగం, పంపిణీ అవీ జరగాలంటే ఒక
రిజిస్టర్ సంస్థ కావాలి. కానీ చూసుకునేవారెవరున్నారు అని ఆగిపోయాం. జనాలు కూడా ‘డొనేషన్
ఎక్కడకు ఇవ్వాలి’ అని అడుగుతుంటే ఏ సరైన దారి లేక ఇంతవరకూ ఎవరినీ అందుకు
ప్రోత్సహించలేకపోయాం. సంస్థ అవసరం ఎంతైనా ఉంది. చేయాల్సిందే. అయితే నిజంగ నో
ప్రాఫిట్ బేస్ లో చేస్తే నీకేంటి లాభం..?"
"ఆత్మసంతృప్తి. లాభాల గురించి నాకు
వేరే వ్యాపారం అక్కరలేదు. నాది నాకు మంచి రిటర్నే ఇస్తోంది. అందులో నాకు ఏ కొరతా
లేదు. భగవంతుడి దయతో నాకు చాలిందానికన్నా చాలా ఎక్కువే సంపాదిస్తున్నాను. ఇంకొంత
నిలదొక్కుకున్నాక మరికొంత అందులోనే విస్తారం చేయాలని అనుకుంటున్నాను."
"మంచిది.."
"కానీ ఆశకు అంతేది..? దీపం ఉండంగనే
ఇల్లు దిద్దుకోవాలనే సిద్ధాంతం ప్రాపంచిక లాభాలకోసం అంతా వాడతారు. కానీ నేనది
పారమార్థిక లాభం కోసం వాడదామని అనుకుంటున్నాను. ఒక సేవకోసం ఇన్వెస్ట్ చేసింది
ధనరూపేణ తిరిగి రాదు. కానీ పుణ్యం రూపేణ ఎప్పుడూ మన ఎకౌంట్స్ లో జమా అవుతుందని మా
నాయనమ్మ చెప్పేది." సిద్ధాంత్ ఆలోచిస్తూ అన్నాడు.
ప్రార్థిత్ అతని వంక ఆదరణపూర్వకంగ
చూశాడు. సిద్ధాంత్ నవ్వి, "అంతకు క్రితం నీకు వ్యాపారంలో భాగస్వామ్యం
ఇస్తానంటే వద్దన్నావు. ఇది వ్యాపారానికి కాదు.. ఏదో మీ పనిలో నేనూ పాలు
పంచుకుంటున్నానని చిన్న గర్వం కోసం. అంతే." అన్నాడు.
ప్రార్థిత్ కాసేపు ఆలోచించి, "సరే,
నాన్నతో మాట్లాడతా"నన్నాడు.
"అయితే సంస్థ మొదలు నా పేరున
ఉండాలి. అప్పుడే లోన్లు వాటికి అనువుగా ఉంటుంది. మళ్ళీ నీ పేరైనా, నాన్నగారి పేరైనా
ఎసెట్స్ చూపించేటప్పుడు కష్టమవుతుంది. నాదైతే బిజినెస్ చూపిస్తాను. నీ ఉద్యోగ
అస్థిరతను బట్టి, ఆయన వయసును బట్టి త్వరగా అన్నీ సాంక్షన్ కాకుండా పోయే ప్రమాదం
ఉంటుంది."
"అంటే.. అది.. నాన్నగారిని
అడగాలి.."
"అబ్బా, పూర్తిగ విను. ఇప్పుడే మనం
తర్వాత భవిష్యత్తు డేట్ వేసి ఆ కంపెనీ నీ పేర ట్రాన్స్ ఫర్ అయ్యే విధంగ కాగితాలు
వ్రాసుకోవచ్చు. అంటే ఫలానా తేదీ తర్వాత ఆ కంపెనీ నీదైపోతుందని. లేదా నాన్నగారి
పేరున మారిపోతుందని. కావాలంటే రెజిస్ట్రీ కూడా చేయించవచ్చు. నేను ఈ ఏర్పాట్ల గురించి
వివరంగా కనుక్కొంటాను. ఇదంతా కేవలం కంపెనీ నడిచేదాకా, మనకొక ఆలంబన దొరికేదాకా.
తర్వాత ఏం చేయాలనేది కూడా మనం ప్రణాళిక వేసేసుకుని దాన్ని చట్టబద్ధం చేసి
ఉంచుకోవచ్చు. అప్పుడు ఏ గొడవలు ఉండవు. అంటే నమ్మకంతో కానీ వేరే విధంగ కానీ.."
"ఛఛ.. అది కాదురా.. నీ మీద నమ్మకం
లేక కాదు.."
"నీకుందిరా.. నాకే లేదు. చాలా..? వెధవ
మొహమాటాలూ నువ్వూ..! జనాలు సొంత రక్తాన్నే నమ్మరు. రేపు పొద్దున సంస్థ బాగా నడవటం మొదలు
పెట్టాక నాకే దుష్టబుద్ధి పుట్టిందనుకో.. అప్పుడు..?"
"సరే, అదేం పెద్ద విషయం కాదు. నీకు
దుష్టబుద్ధి పుట్టినా సంస్థ భద్రంగనే ఉంటుందని నమ్మకం నాకు ఉంది. నాన్నగారు ఇంక
ముందు ముందు నాకే దీనిని అప్పచెప్పి దీని పై స్థాయి రిసర్చ్ మీద ధ్యాస
పెడదామనుకుంటున్నారు. ఆయనకు ఈ వ్యవహారాల్లో పెద్దగా ఆసక్తి ఉండదు. దాని గురించి
మొన్న ఈ మధ్యే సింహాతో మాట్లాడారు కూడా. అందుకే నాకు తెలిసింది. ఫరవాలేదు. సంస్థ ప్రస్తుతానికి
నీ పేరు మీదే ఉన్నా నష్టం ఏం లేదు. తర్వాత నా పేరనే వ్రాసేటట్టు ఏర్పాటు
చేసుకుందాం." సంతోషంగ ఒప్పుకున్నాడు ప్రార్థిత్.
ఆ రాత్రే కూర్చుని ప్రార్థిత్ తండ్రితో
ఈ విషయం మాట్లాడి, ఆయన సమ్మతి తీసుకుని, ఇంటర్నెట్ లో నుంచి సంస్థ రిజిస్ట్రీ డాక్యుమెంట్
అంతా డౌన్ లోడ్ చేసి, క్లాజులు డిస్కస్ చేసుకున్నారు. ప్రస్తుతానికి ప్రార్థిత్ ఉంటున్న
ఇల్లే ఆఫీస్ కింద కూడా వాడేటట్టు నిశ్చయమైంది. దానికి ప్రార్థిత్ డైరెక్టర్, అతని
తండ్రి సెక్రెటరీ. సిద్ధాంత్ ట్రస్టీ గా వ్యవహరిస్తారు. క్రమంగ ఇద్దరిని ఎంప్లాయిస్
ని తీసుకుంటారు. దానితో పాటు డయాగ్నస్టిక్స్ సెంటర్, కౌన్సిలింగ్ సెంటర్, యోగా
సెంటర్ కూడా అభివృద్ది చేస్తారు. ఆ ఊరిలోనే పరిచయం ఉన్న ఒక లాయర్ వద్దకు వెళ్ళి
కూర్చుని ఆ మరునాడే డాక్యుమెంట్ అగ్రీమెంట్ నిశ్చయం చేయించుకున్నారు. అందరూ అంతా
సరిచూసుకున్నాక, సాధక బాధకాలు ఆలోచించుకున్నాక సిద్ధాంత్ కాగితాలన్నీ సిద్ధం చేసి
ఆ రాత్రే మంచి టైం చూసుకుని ప్రార్థిత్ సంతకాలు అడిగాడు. ప్రార్థిత్ ఆ కాగితాలన్నీ
మళ్ళీ ఒకసారి అంతా పైకే చదివాడు.
"అంతా సరిగ్గనే ఉంది కదా.."
అని అడిగాడు సిద్దాంత్.
"అరే, మనమే కదా దగ్గర ఉండి
వ్రాయించింది.." ప్రార్థిత్ నవ్వాడు. వాళ్ళ అమ్మా నాన్నా ఇద్దరూ చాలా
సంతోషించారు. దేవుడికి బాగా దండం పెట్టుకున్నారు. ఈ సంస్థ బాగా పనిచేయాలని..! దీని
ఆశయం విజయవంతం కావాలని.
సరిగ్గ సంతకాలు పెడుతుంటే ప్రార్థిత్ పెన్
వ్రాయలేదు. అతను వేరొక పెన్ తేవటానికి అల్మారా వైపు వెళ్ళాడు. తిరిగి వచ్చి మళ్ళీ
తాపీగా సంతకాలు చేశాడు. అందులో ఇంకొక కాగితం అదనంగ జోడించిన సంగతి అతనికి
తెలియలేదు.
No comments:
Post a Comment