"జమీందారీకీ నీకూ ఏంటి
సంబంధం..?" అన్నాను ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేక కష్టపడుతూ. అతను చాలాసేపు
మౌనంగ ఉన్నాడు. నేను తిరిగ అదే ప్రశ్న మళ్ళీ అడిగితే చెప్పాడు కష్టం మీద-
"మాదీ జమీందారీ వంశమే. కాలం
కలిసిరాక ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం." అని చుట్టూ పరిసరాల ప్రాంతాలు చూపిస్తూ,
"ఈ చుట్టుపక్కల కనిపిస్తున్నంత మేర, మూడు గ్రామాల వరకు ఇదంతా ఒకప్పుడు మాదే. మా తాతగారి అవివేకం వల్ల
చేజారింది. కానివారిని నమ్మి మోసపోయిన నిర్వాకం ఫలితంగ ఆయన ప్రాణాలు పోయాక మాకూ
ప్రాణాలకు భరోసా లేదని తెలిసి, బ్రతికేందుకు వేరే దారి లేక నాన్నా, నేనూ, మా అక్కా
అంతా వదిలి వచ్చి మీ ఇంట్లో తల దాచుకోవలసి వచ్చింది. అనుభవించాల్సిందంతా మీ
అన్నయ్య దయతో బాగనే అనుభవించాము. చట్టపరమైన స్వతంత్ర అస్తిత్వం వచ్చేవరకు వేచి
ఉన్నాను. తర్వాత తిరిగి ఇటే వచ్చాను. జమీ వ్యవహారాలు మాకు ఒకరు నేర్పించనవసరం లేదు
కదా. కొంతకాలం పాటు నా ఆస్తినంతా నేనే పనివాడిలా చూసుకున్నాను."
"----"
"దీన్ని దక్కించుకున్నవాడికి డబ్బు
మాత్రం చాలు. నాకు నా ఆస్తి యథాతథంగ కావాలి. భగవంతుడి దయ వల్ల అంతా ఉన్నది
ఉన్నట్టే వాడు నిర్వహిస్తున్నాడు. వాడికి దీనికి రెండింతలు సంపాదించి ఇస్తే
సంతోషంతో తీసుకుపోయాడు. నా అదృష్టం, శ్రమ ఫలించాయి. ఇల్లు, పొలాలైనా దక్కాయి. ఇప్పుడు
నేను నా వాటినే తిరిగి నా కష్టంతో సొంతం చేసుకున్నాను. వాటి మీద వ్యామోహంతో కాదు- నాన్న
కోరిక కోసం. ఆయన చివరి కోరిక ఇదే. అవన్నీ తరువాతి తరానికి అందించటాన్ని ఆయన నా
బాధ్యతగ అప్పగించారు. అందుకే తప్పలేదు. ఇప్పుడు నేను ఈ క్షణమే ఇదంతా మానేసి
వెళిపోయినా ఎవ్వరూ అడిగేవారు లేరు. కనీసం అనుభవించటానికి నాన్న లేరు. అమ్మ ఎప్పుడూ
లేదు. ఉన్న ఒక్క అక్క దూరమైంది. అక్క జ్ఞాపకంగ వరం ఉన్నాడు. అంతే."
"న్..నాకిదంతా వింటుంటే.. ఏమో..!
నాకేం మాటలు రావటం లేదు."
"తెలుసు. నా పరిస్థితీ అదే.
ఒప్పుకుంటాను. ఒకవైపు మా ఆస్తి తిరిగి రాబట్టుకునే ఈ పోరాటం.. ఇంకోవైపు అక్క కన్నీటి
జ్ఞాపకాలు.. ప్రతీకారవాంఛతో బండబారిపోయాను."
"అందుకే చెప్పా కదా.. వద్దని!
అయినా మీ అక్క కన్నీటి విలువే నీకు తెలిస్తే మరొక ఆడపిల్ల కంట కన్నీరు
పెట్టించేవాడివే కాదు. మా అన్నయ్యా, నువ్వూ- మీరంతా ఒకటే మనుషులు..! అసలు మనుషులే
కారు. అంతా నా కంటికి పారాడే పసిపిల్లల కన్నా కనాకష్టంగ కనిపిస్తారు. ఎవ్వరికీ
వస్తుస్థితి అవగాహన ఉండదు. అరే..? జీవితంలో పొరపాట్లు జరగవా..? మా అమ్మకు కాలం
చెల్లిపోయి పోయిందిలే, ఏదో జరిగిపోయింది అని ఆయన వదిలేయలేకపోయాడు. మీ అక్క ఖర్మకు
ఆమేదో అనుభవించింది.. మళ్ళీ ఇంకోసారి ఆ కథ ఎందుకు తిరగదోడాలి అని నువ్వు
ఊరుకోలేకపోయావు.. పగ అట..! ప్రతీకారమట..! ఛి.. అసలిందులో అంతటిలో నా తప్పేంటో
నాకర్థం కాదు.."
"ఔను. నీ తప్పేం లేకుండనే నీ మీద
చాలా జులుం చేశాను. నువ్వన్నట్టు నాకు ప్రతీకార వాంఛ ఎక్కువ. ఇప్పుడిప్పుడే
ప్రయత్నించి తగ్గించుకుంటున్నాను. నా కసితో నువ్వే కాదు, నేనూ రగిలాను. ఇన్నాళ్ళు చేసింది
తప్పు అయినా కాకపోయినా ఇప్పుడు నిన్నిట్లా వదిలేయటం మహాపాపం అని అర్థమైంది. నన్ను
క్షమించి నాకు నా ఆశయంలో సహాయం చేయి." అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ.
నేను చూపులు మరల్చుకుని, "నువ్వు
చేసినదానికి నిన్ను నా క్రోధాగ్నిలో దహించకుండా వదిలివేయటమే నేను పెడుతున్న
క్షమాభిక్ష అనుకో. కనీసం వరానికైనా ఆ బుద్ధులు రాకుండా చూసుకో. చాలు. ఒకరి కోసం
నువ్వు నన్ను చేపట్టాల్సిన పని లేదు.." అన్నాను నిక్కచ్చిగా.
"చూడు, నీకు నేను తప్ప వేరే దారి
కూడా లేదు. నా అవివేకానికి నీ జీవితం పాడుచేసుకోకు. ఉద్యోగం చేసుకుంటే పొట్ట
గడుస్తుంది. అంతే. తోడు లేకుండ ఎడారి జీవితం నువ్వు బ్రతకలేవు."
నాకు ఆ మాటకు ఎంత మండాలో అంత మండింది. "బెదిరిస్తున్నావా..?
లేక వెక్కిరిస్తున్నావా? నేనేమీ శాశ్వతంగ ఒంటరి జీవితం బ్రతకను. తగినవాడు
దొరికితే, వాడికి నా గతంతో అభ్యంతరం ఏం లేకపోతే తప్పక చేసుకుంటాను. ఇప్పుడు నాకు ఏ
ఆటంకం లేదు. నా స్వతంత్రం నాకు ఉంది."
అతను విరక్తిగ నవ్వి, "ఒంటరి
ఆడపిల్ల స్వతంత్రం ఈ సమాజంలో ఒక గగనకుసుమం. ఆడపిల్లకు గౌరవమైన జీవితం, స్వతంత్రత ఈ
రెండూ భిన్నధృవాలు. నీ గతం తెలిసీ ఎవ్వరూ నిన్ను మనస్పూర్తిగ వారి జీవితంలోకి
ఆహ్వానించరు." అన్నాడు.
"నువ్వు మాత్రం ఇప్పుడు
మనస్పూర్తిగ ఆహ్వానిస్తున్నావా..? నాకు వేరే దారి లేక, వగైరాలన్నీ అంటున్నావు..?"
"ఇప్పుడు కాదు, నిన్ను ఎప్పుడో నా
జీవితంలోకి ఆహ్వానించుకున్నాను. ఇవాళ నీతో ఆ మాట పలుకుతున్నాను. అంతే."
అన్నాడు ఎటో చూసి.
"ఆఁ!!!" నేను నిర్ఘాంతపోయాను.
"ఇదేంటి..? ఇన్నేళ్ళూ ఆ కళ్ళలో నిప్పులు చూశాను. నన్నెట్ల నీ మాట
నమ్మమంటావు..?"
"ఆ నిప్పులు మీ అన్నకు చెల్లెలిగా
నీ మీద కురిసినవి..! ఈ ఆహ్వానం మా అక్కకు ఎంతో ఇష్టమైన వ్యక్తిగా నీ కోసం
దాచుకున్నది."
"నేను నమ్మను. నువ్వు అబద్ధం
చెప్తున్నావు."
"మనిషికి ప్రేమ బలం. నేను నిన్ను
ప్రేమిస్తే నీ మీద పగ తీర్చుకోలేను. ఇప్పుడు ఆలోచించు. హిసాబ్ బరాబర్ చేయటానికి
నన్ను నేనెంత క్షోభ పెట్టుకుని ఉంటానో.., ఎంత ప్రయత్నించి ఆ భావాన్ని ఆపి ఉంటానో ఆలోచించు.."
"అయితే నటించావన్నమాట.."
"కాదు. నాలోని మృదు భావన నీకు
చేరితే అది నీకు బలమవుతుంది. వరం తరఫున ఆ బలమే నీకెంత శక్తినిచ్చిందో నాకు తెలుసు.
ఇంక నా తరఫున నీకు ఎటువంటి బలం ఉండటం నాకు ఇష్టం లేదు..! పైగా నీ తరఫున నా పట్ల
ఏమీ భావం ఉండదని ఆగిపోయాను. అందుకే సహజంగ ఆ కోరిక వ్యక్తం కాకుండ ఆగిపోయింది."
"ఇప్పుడు మాత్రం ఎందుకు వ్యక్తమవుతోంది
మరి..?"
"మీ అన్నయ్య ఇచ్చిన అనమతి వల్ల..!
మీ అన్నయ్య నీకు ఆస్తి వ్రాసి ఇచ్చేస్తే నీవంక చూడవద్దనే అనుకున్నాను. నీ
బ్రతుకేదో నువ్వు బ్రతికేదానివి. ఎప్పుడైనా పై ఎత్తు ఏదైనా అవసరమైతే
చూసుకుందామనుకున్నాను. మనస్పూర్తిగ చెప్తున్నాను. మీ అన్న అనుజ్ఞ లేకుండ నిన్ను
చేసుకుంటే అంతా నన్ను ఆస్తి కోసం ఆడపిల్లను చేసుకున్నాడని అనేస్తారని భయం..! తను
విల్లులో ఈ నియమం పెట్టటం మంచిదైంది. ఇప్పుడు నేను నిన్ను చేసుకున్నా ఎవరూ నన్ను
ఆక్షేపించరు. ఆస్తి నీకు కాక వరానికి చెందుతోంది, వాడు నా వాడై ఉన్నాడు కనక."
నేను తల వంచుకున్నాను. "ఎంత
దూరాలోచన!! కానీ సారీ. ఇది కుదిరే వ్యవహారం కాదు. ఇంత జరిగాక నేను నిన్ను అంగీకరించలేను.
ఒకరకంగ నువ్వు నాకు ఆ బలాన్ని చేకూర్చకపోవటమే మంచిదైంది. లేదంటే మరింత నరకం
చూసేదాన్ని. నువ్వు నీ సున్నిత భావాలను వ్యక్తం చేయకుండా నన్ను చాలా పెద్ద అగాధం
నుంచి కాపాడావు. లేదంటే జీవితంలో ఆ ఖాళీని నేనెన్నటికీ పూరించుకోలేకపోయేదాన్ని. ఇప్పుడు
కూడా నాకు చాలా అసహనంగ ఉంది. కనక నువ్వు మరెవరినైనా చూసుకో. నా పాట్లేవో నేను
పడతాను"
"నువ్వు ఏ పాట్లూ పడకూడదనే కదా ఈ
వ్యవస్థ.."
నేను అతని వంక తీవ్రంగ చూశాను-
"పౌరుషం నాకూ ఉంది. అందమైన తోట లాంటి నా జీవితాన్ని ఎడారి చేసి, నన్ను
దిక్కులేనిదాన్ని చేసి, ఇన్ని పాట్లు పెట్టిన నీ నుంచి ఏ వ్యవస్థనూ నేను ఆశించటం
లేదు. అక్కర్లేనివి నాకివ్వాలని చూడకు. ఇన్నేళ్ళు అన్నయ్య పాపం పరిహారం కావడం కోసం
నిన్ను, నీ అమానుషత్వాన్ని మౌనంగ సహించాను. అన్నయ్య కాదన్నా ఆయన చావుకు కారణమైన
వాడివి నువ్వు. నాకు ఆ వ్యథ జీవితాంతం ఉంటుంది. నాకు ఏ వ్యవస్థా వద్దు. నాకన్నా
వయసులో పెద్దవాడివన్న ఒక్క మాట వల్ల చేయి చేసుకోవటం లేదు. లేదంటే ఈపాటికి ఆ
సత్కారం కూడా జరిగి ఉండేది. నాకు నీవంక చూడాలని కూడా లేదు. నువ్వంటేనే నాకసహ్యం.."
"నిజమా..? అయితే నేనంటే నీకిష్టం
లేదా..?"
"ఏదో మాటవరసకన్నాను. నీకు కనీసం నా
అసహ్యానికి పాత్రుడివయ్యే స్థాయి కూడా లేదు.."
"ఆఁహాఁ..! మరైతే ఇదేంటి..?"
"ఏది..?" అడిగాను.
అతను రాజన్న సెల్ ఫోన్ తీసి ఏదో
నొక్కాడు. సరిగ్గ ఈ మాటలు వినిపించాయి- 'మరి ఇదంతా ఎవరికోసం..?' 'అతని కోసం'
ఠక్కున చూశాను- "మోసం..!!"
అన్నాను అప్రయత్నంగ. "నాకు తెలియకుండ నా మాటలెందుకు రికార్డ్ చేశావు..?"
"నేను చేయలేదు. రాజన్న చేశాడు.
నేను చేయమని కూడా అడగలేదు. ఆయనే నాకు ఇది వినిపించి నీ అంతరంగం తెలియచేశాడు. నేనూ
ఆశ్చర్యపోయాను ఇది విని. దీనికి నీ సమాధానం?"
"నీకు సమాధానాలు చెప్పుకోవాల్సిన
ఖర్మ నాకు లేదు.."
"అమ్మో.. ఇదంతా పౌరుషమే!! హుఁ!! మనసులో
భావన వేరొకటి, బయటకు చూపేది మరొకటి..! నటిస్తున్నది ఎవరో ఇక్కడ..?"
నాకు బాధ వేసింది. "ఇది నటనా
కాదు.. ప్రేమా కాదు..!! నేను బ్రతకటానికి నాకు నేను చెప్పుకున్న మాట అది. నువ్వు
వ్యక్తం చేయకుండా దాచుకున్నట్టే నిన్ను, నీ దుశ్చర్యలను క్షమించనిది నాకు గడవదు కాబట్టి
నేను ఆ భావాన్ని పాము అని తెలిసీ పాలుపోసి పెంచుకున్నాను. ఎందుకంటే నేను కనక అది
అంగీకరించకపోతే నాలో మళ్ళీ ద్వేషం రగిలి, మరొక ప్రతీకార వాంఛ పుట్టి నీ జీవితం
సర్వనాశనం చేయటం నా లక్ష్యంగ మారుతుంది. అంత తుచ్ఛమైన లక్ష్యంతో నాకు బ్రతకటం
ఇష్టం లేదు. అందుకే అది జరగకుండా ఉండాలంటే వాస్తవాన్ని నేను కాదనకుండా అంగీకరించాలి.
అట్ల అంగీకరించేవాడే తనకు ఇష్టుడని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఆయన మాట కోసం, దానికి
ఏదో ఇట్ల చెప్పుకుని నన్ను నేను మభ్యపెట్టుకున్నాను. మనసు పిచ్చిది. ఏది చెప్తే
అదే నమ్ముతుంది. నువ్వంటే ప్రేమ అని దానికి నచ్చ చెప్పుకుని నువ్వు పెట్టే హింసను
సహించగలిగాను. నీ తరఫున అప్పట్లో నాకే బలం లేదు కదా. ఏ బలం లేకుండా అంత నరకాన్ని
అనుభవించటం నాకోసం అసంభవమయ్యేది. ఇప్పుడు నామనసును ఆ మభ్యలో ఉంచాల్సిన అవసరం
లేదు."
"----"
"ప్రేమ అనే ఒక్క మాట- మనను మనం
మభ్య పెట్టుకునేదైనా సరే- అంత బాధను దిగమింగుకోగలిగే శక్తిని ఇస్తుందని నాకు
తెలియదు. అప్పుడు నాకు సువ్వొదిన బలమేంటో అర్థమైంది. మా అన్నయ్యకు కూడా అది
అర్థమైతే బాగుండేది." అని ఆగి, "అందుకే నాకు నీమీద ప్రేమా నిజమే,
ద్వేషమూ నిజమే. అది అప్పటి నిజం. ఇది ఇప్పుడు నిజం. చాలా?" అన్నాను.
అతనేం మాట్లాడలేదు. అంతలోకి పెద్ద కూత
పెట్టుకుంటూ రైలు వెళ్ళింది. అతని ఎదుటే అమాంతం వెళ్ళి నేను దాని కింద పడి ఈ
శరీరాన్ని నుగ్గు నుగ్గు చేయాలన్న కోరికను బలంగ ఆపుకుంటూ దాన్ని చూస్తూ నిలబడ్డాను.
బహుశ అతనూ అంతే. ఆ ప్రాంతమంతా ఇంకా నిర్మానుష్యంగనే ఉంది. నెమ్మదిగా తూర్పు
ఎర్రబడుతోంది. నేను అటు చూస్తూ నిలబడ్డాను.
అతను మరొకసారి నా మాటలన్నీ మొత్తం
పూర్తయేదాక వినిపించి, "ఇప్పుడు నేను స్వతంత్రుడిని కాను. నా ఆధిపత్యం మూలాన
కొందరికి సమాధానం చెప్పుకోవాల్సినవాడిని. నా కింద పనివాళ్ళు నన్ను అసహ్యంగ
చూస్తున్నారు. రాజన్న ఇది నా చేతిలో పెడుతూ, "మనిషివైతే అమ్మడుతోనే తిరిగిరా.
లేకపోతే దారిలో ఉన్న పెద్దబావిలో దూకి చావు." అన్నాడు. నాకది తట్టుకోలేకుండ
ఉంది. ప్లీజ్.. ఇది విన్నాకే నిన్న నా మనసు మారింది. ఇది నువ్వు మాట్లాడకపోతే నీకు
ఈ సన్నివేశం ఉండేది కాదు. నువ్వు ఇచ్చిన ఈ చిన్న అవకాశంతోనే నీ మనసులో నా స్థానం
నేను తెలుసుకుని, ఈ మాటను రూఢిపరచున్నాను. నాకు అక్కరలేని గుర్తింపు నువ్వూ నాకు
ఇవ్వాల్సింది కాదు. ఇచ్చి నీ దాసుణ్ణి ఎందుకు చేసుకున్నావు..?" నిలదీశాడు.
"అది నాకు నేను చెప్పుకున్న వంక.
నీతో సంబంధం లేదని చెప్తున్నా కదా."
"మరి ఇప్పుడు నేనిది వినేశాను కదా.
ఇది విన్న మనిషి పరిస్థితి ఏంటో అతడి వైపు నుంచి ఆలోచించావా..?" అనడిగాడు.
"అతడు ఒక మనిషిగా ప్రవర్తిస్తే
ఆలోచించేదాన్నే."
"అంటే నేను పశువునా..? మరి
అటువంటప్పుడు మీ అన్నయ్య ఏంటో..? దేవతా స్వరూపుడా??"
"ఈ ప్రశ్న మన జీవితంలో మళ్ళీ మళ్ళీ
తిరిగి వస్తూనే ఉంటుంది. ఈ కాసేపటి సంభాషణలో అది ఎన్నోసార్లు కదిలింది. అందుకే
దీనిని ఇంతటితో వదిలేయమంటున్నాను. చేసేవారిద్దరు చేశారు. ఇద్దరికీ మెదడు శూన్యం. అనుభవించేవారం
ఇద్దరం అనుభవించాం. ఇద్దరి దగ్గర వేరే దారి లేదు. ఇంక ఇదంతా ఇంతటితో ఆపుదాం."
నేను అతని చేతిని విసురుగా
విడిపించుకుని కదలబోయాను. అతను చేతిని వదలకుండానే మళ్ళీ ఆపాడు- "చూడు, ఇవి
ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు కావు. పోనీ, నీకు ఇష్టం లేకపోతే నా భార్యగా వద్దు.
ఊరికే రా. అక్కడే వరంతో ఉండు. లేదా, ఏదైనా ఉద్యోగం చేసుకో. అది కాకపోయినా నీ
ఇష్టం. ఊరికే ఉండు. సరేనా..?" అన్నాడు బేరం ఆడుతున్నట్టు.
"ఏంటి..? ఈ మాటకు లోకం ఏం అర్థం
తీస్తుందో తెలుసా..? ఇది అంతకన్నా చెత్త ఆలోచన. వదులు. అయినా ఏ హక్కుతో నన్ను
ఆపుతున్నావు..?"
అతను ఆ ప్రశ్నకు రెచ్చిపోతూ, "హలో,
ఈ ప్రాంతమంతా నా అబ్బ సొమ్ము..!! నా జాగీరు..!! నేనే ఇక్కడి మకుటం లేని మహారాజుని.
నువ్వు నా అనుమతి లేనిదే అడుగు కూడా కదపలేవు. నన్ను విడిచి ఎంత దూరం పోయినా చిటికెలో
వెతికించి రప్పించగలను." అని చిటికె వేసి, "అందుకే ఇక్కడి జమీందారు..
రాయ్ బహాదుర్ ధరణీంద్రనాథ వర్మగా నిన్ను ఆగమని శాసిస్తున్నాను. ఆగిపో."
అన్నాడు.
"ఎంత అహంభావాం..?!!"
అతను ఆ మాటకు బరువుగా నిశ్వసించి నిర్లిప్తంగ నవ్వి, "ఔను. నా దగ్గర చివరగా
మిగిలిన దారి. నాకు అహంభావం. నీకు అభిమానం. నీ మాటను తెలియచెప్పి నా అహంకారానికి
రాజన్న తెరదించాడు. నాతో ముడి పెట్టి నీ అభిమానానికి మీ అన్నయ్య విరామచిహ్నం
పెట్టాడు. మా అక్కకోసం, మీ అన్నకోసం, వరం కోసం, నాకోసం కూడా వద్దు.. కానీ నీకోసం
ఆగు.." అన్నాడు.
"చూడు, గడువు పూర్తైంది. పూర్తైతే
నన్ను వెళ్ళనిస్తానని మాటిచ్చావు. ఇప్పుడది నిలుపుకో. నీ ఈ మాటలతో నన్ను మరింత విరవకు.
ఏ పొలంలోనో ఏ పామో నన్నూ ఎందుకు కరిచిపోలేదా అని నేను బాధపడాల్సిన పరిస్థితి
వస్తుంది."
"మల్లీ...?!!"
అతను పిలిచాడు. నేను ఉలికిపడ్డాను.
మల్లీ.. మల్లీ... అదే చెవులో రింగుమంది. చెవులు మూసుకున్నాను.
ఇంక అంతే..!! ఆ పిలుపు విని
తట్టుకోలేకపోయాను. నిలబడ్డ చోటే కుప్పకూలిపోయి ఎక్కిళ్ళుపెట్టి ఏడ్చేశాను. ఆ
చల్లని పిలుపు చిరుగాలికి నాలోని సిరిమల్లిక రెపరెపలాడింది.
"ఆ పిలుపు విని కరిగి రాలుతున్నది
ఓ ఆడపిల్ల మనసు కాదా? నిజంగ నన్ను అసహ్యించుకోగలనని నువ్వు నమ్ముతున్నావా... మల్లీ?"
చిన్నప్పుడు కలిసి ఆడుకునేటప్పుడు ఎవరూ
లేనప్పుడు అట్ల పిలిచేవాడు. అంతా సిరీ అంటే అతనొక్కడే మల్లీ అనేవాడు. నేను ఆ
అనుభూతిని ఆపటానికి కళ్ళు మూసుకున్నాను. అందరూ సిరిమల్లికలో నన్ను సిరి అని లక్ష్మీదేవిగా
గుర్తిస్తే అతనొక్కడే మల్లి- అంటే మల్లెపూవుగా గుర్తించేవాడు. నాకు ఎంతో ఇష్టమైన
పిలుపది.. అప్పుడప్పుడే యౌవనపు ప్రాయం తలుపుతట్టేవేళ, కదలాడిన అర్థంలేని భావాలవి..
కానీ ఇప్పుడు... "అట్ల పిలవకు.. ప్లీస్.."
"పిలుస్తాను. నువ్వు ఇబ్బంది
పడాలనే పిలుస్తున్నాను. ఏ మాటలు మాట్లాడితే నువ్వు బాధపడతావో నాకు తెలుసు. కావాలనే
మాట్లాడుతున్నానిట్ల. నేను తప్ప ఎవ్వరూ నీతో ఇట్ల మాట్లాడలేరు. దాచుకోకు. ఆ
కన్నీరు ఏదేనినీ దాచలేదు. ప్రయాస పడకు.. సఫలం కాదు.."
"నన్నొదిలేయ్.." నేను
రెప్పపాటు కాలంలో అక్కడి నుంచి లేచి పరిగెత్తాను.
కానీ ఎక్కువ దూరం పోలేకపోయాను. పది
అడుగులలో అతని చేయి నా మణికట్టుకు బిగుసుకుంది. అది ఇందాకటికన్నా బిగుతుగా ఉంది.
విడిపించుకునే ప్రయత్నం కూడా చేయనివ్వటం లేదు. నేను అసహనంగ కళ్ళు
తిప్పేసుకున్నాను.
"ఆ మనఃఫలకం పై నా పేరెప్పుడో
వ్రాసి ఉంది. దాన్ని ఎత్తి నీకు చూపించే అవసరం నాకు కల్పించకు." అన్నాడు
కళ్ళలోకి గుచ్చి చూస్తూ.
నాకు అది ఎంతో కఠినంగ అనిపించింది.
"ఆ పేరు వ్రాసుకున్నప్పుడు నువ్వు మృగానివి కావు."
"నన్ను మృగాన్ని చేసిన పరిస్థితులు
దాటి ఇప్పుడు మనిషినవుతున్న తరుణంలో మళ్ళీ నీతో తప్పుగా ప్రవర్తించేందుకు వివశుణ్ణి
చేయకు..! ఒకసారి వ్రాసుకున్న పేరు చెరగదు. ఆగు..!"
నేను ఆగాను. కానీ కళ్ళు వర్షిస్తూనే
ఉన్నాయి. "ఔను. అదే నా బాధ.." అన్నాను బాధో, కోపమో, అసహాయతో తెలియని
ఒకానొక భావం ఆవరిస్తుంటే. చాలాసేపు ఆ ధార ఆగలేదు. అతను అంతసేపూ వేచి ఉండి అన్నాడు-
"అయితే ఒక్కమాట. మీ అన్నయ్య
విల్లుతో నిర్బంధపెట్టకపోయినా, వరం నన్ను నిలదీయకపోయినా, రాజన్నా పనివాళ్ళు
అసహ్యంగ చూడకపోయినా కూడా నేను నిన్ను నాదానిగా చేసుకుందామనే అనుకున్నాను..
మిగిలినవన్నీ పైపై సాకులే." అని ఆగి, "ఇదంతా జరగకపోయి ఉంటే నీ పెళ్ళి
తలపెట్టినప్పుడే వచ్చి మీ అన్న దగ్గర నిన్ను గౌరవంగ అడిగి చేసుకునేవాణ్ణి. ఇప్పుడు
నీ నుంచి నిన్ను అడగాల్సి వస్తోంది. అది కూడా దొంగదారిలో దొరికిన ఈ నీ మాటల ఆధారాన్ని
పట్టుకుని. నీ అంతట నువ్వు ఏమైనా సంజ్ఞ చేస్తావేమోనని, ఎదురుచూసి, విఫలమైనాక నా
దగ్గర ఇదే దారి మిగిలింది.." అని అతను నా కళ్ళు తుడుస్తూ నా వంక చూసి, "ఇప్పుడు
నువ్వు కాదని వెళిపోయి తర్వాత నీకేమైనా జరిగితే బ్రతుకంతా నన్ను నేను
క్షమించుకోలేను. నాకు పుట్టగతులుండవు." అన్నాడు.
ఆ మాట అనేటప్పుడు అతని కళ్ళలో కూడా
కన్నీరు ఉంది. నేను కళ్ళు మూసేసుకున్నాను. కన్నీటికన్నా సత్యమైనది ఇంకేం ఉంటుంది?
నా ప్రమేయం లేకుండానే అతని వంక అడుగులు వేశాను- అతని ఇంటి వైపు. పనిమనిషిగా కాదు,
ఆ ఇంటికి సామ్రాజ్ఞిగా.
******************
***********
No comments:
Post a Comment