డిగ్రీ పూర్తైనాక ఇల్లు చేరినప్పుడు
అన్నయ్య ఆరోగ్య పరిస్థితిలో మార్పు బాగా కనిపించింది. తన వంతుగా అప్పుడు కూడా
అడిగాడు, ఇంకా చదువుతానంటే చదివిస్తానని, తనకేం అభ్యంతరం లేదని. కానీ తనను ఆ
పరిస్థితిలో ఒంటరిగ వదిలిపోవటం తప్పనిపించింది. అందుకే ఇంక చదవనన్నాను. తనను దగ్గర
ఉండి చూసుకుంటానన్నాను.
"వెర్రిదానా..? నువ్వు నన్ను
చూసుకోవటం కాదు, నిన్ను చూసుకునేవాడికోసం నేను చూస్తున్నాను. ఇంక చదువు వద్దంటే
సంతోషంగ పెళ్ళి చేసి పంపుతాను." అన్నాడు.
తను నాకు సంబంధాలు చూస్తున్నాడట. కొన్ని
పక్కకు పెట్టుకున్నాడట. ఇంతకాలమైనా చదువుకోసం ఆగాడట. అందరు ఆడపిల్లలలాగే నేనూ
కొన్ని ఆశయాలు పెట్టుకోవాలనున్నాను.. కానీ వాస్తవం వాటిని నిలవనీయదని తెలుసు.
పెళ్ళి చేసుకుని ఇల్లు చక్కబెట్టుకోకుండ ఉద్యోగాలనీ, కెరీర్లనీ వెళ్ళే సత్తువ లేదు
నాకు. అందుకే సరేనన్నాను. అయితే ఆ సాయింత్రమే పెళ్ళివారిని రమ్మంటానన్నాడు. సరేనని,
సంబంధం మంచిదై, అన్నయ్యకు దూరంగ కాకుండ ఉంటే అదే చాలని దండం పెట్టుకున్నాను. ఎందుకో
ఈ మధ్య మరీ కుంగిపోతున్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన ముఖంలో వాడిపోతున్న ఛాయలు,
శరీరం పట్టుతప్పుతున్న దాఖలాలు ప్రస్ఫుటంగ కనిపిస్తున్నాయి. సరే, తన బాధ్యత తీరటం
కూడా ముఖ్యమే కదా. నాకు ఎదురు చెప్పటం అలవాటు లేదు. అవసరం కూడా లేదు.
ఆ సాయింత్రం మంచి చీర కట్టుకుని, తలలో
పూలు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుని పెళ్ళి వారికోసం చూస్తుండగా ఇంతలోకి
అతను వచ్చాడు..!! ఇతనా పెళ్ళి కొడుకు..?? నేను నిర్ఘాంతపోయాను. ఎనిమిదేళ్ళ తర్వాత
మళ్ళీ ఈ రాక. అన్నయ్య ఇతన్ని నాకోసం సంబంధం చూడగలడని నేను ఊహించలేదు.
"నాకోసమే సిద్ధంగ ఉన్నావా..?
పద.." అన్నాడతను నన్ను ఉద్దేశించి, అన్నయ్యను గుచ్చి చూస్తూ.
"ఏం చెప్పి పంపేశావు..?" అన్నయ్య
అడిగాడతనిని.
నా వైపు వేలు చూపించి, తన వైపు వేలు
చూపించుకుని, తన రెండు చేతుల చూపుడు వేళ్ళూ హుక్ లాగ పెట్టాడు. అన్నయ్య కళ్ళలోకి
సూటిగా చూస్తూ.
నాకు అర్థం కాలేదు. అన్నయ్యకు
అర్థమైంది. తర్వాత తెలిసింది- వారం క్రితమే కనిపించి చెప్పాడట, నాకు ఇటువంటి
ప్రయత్నాలేవీ చేయద్దని..! ఇప్పుడు రాబోతున్న పెళ్ళివారిని పొలిమేర నుంచే తిరిగి
పంపేశాడట, నాతో అతనికి పెళ్ళి ముందే నిశ్చయమైందని చెప్పి. "హవ్వ"
అన్నాను నివ్వెరపాటుతో. ఇదేంటి..?
అన్నయ్యలో ఇప్పుడు పోట్లాడాలన్న కాంక్ష
లేదు. తప్పు చేశానని ఒప్పుకుని క్షమార్పణం కూడా చెప్పాడు. అదంతా గతం, వదిలేయమన్నాడు.
నేను చేసిన తప్పు నువ్వు చేయకుమన్నాడు. అతను పెళ్ళివారిని తిప్పి పంపేశాడని కూడా
కోపం తెచ్చుకోలేదు. గొడవపడలేదు. కానీ అతను దిగే ఊహలో లేడు. పగ తీర్చుకోవటానికే
వచ్చాడని అర్థమైంది.
"నావంతుగ హెచ్చరించాను. వినలేదు. నీ
కంటి మీది కనుకు ఎగిరిపోయే వేళ వచ్చింది..! కాసుకో!!" అని అతను నా వద్దకు
వచ్చి, "పద!!" అన్నాడు.
నేను పరిస్థితిని ఆకళింపు చేసుకోవటనాకి
ప్రయత్నిస్తూ ఇద్దరి వంకా చూశాను. నేను ఒక్క నిముషం అని నా భగవద్గీత పుస్తకం
తీసుకుని, అమ్మా నాన్నల పటాలకు దండం పెట్టుకుని, సువ్వొదిన ఫోటోకు అభివాదనం చేసుకుంటుంటే
అతనికి సహనం నశించింది. "ఇంక నటన చాలు" అని అన్నయ్య ఎదురుగానే నన్ను తన చేతులతో
నిర్బంధించి తన జీపు వైపు నడిపించి తీసుకుపోయాడు. అన్నయ్య ఆపబోతే అతని బలం ముందు
నిలవలేక ప్రయత్నం ఫలించలేదు. అడ్డు పడితే మర్యాద దక్కదన్నట్టు చూపుడు వేలితో శాసించాడు.
అన్నయ్య ఆగిపోయాడు. జీతగాళ్ళంతా అతని మీద పడ్డారు. ఎంతో ప్రయత్నించి కనీసం అతని
చేతిలో నుంచి నా చేతిని విడిపించలేకపోయారు. వాళ్ళే కాదు, ఆ పని ఎవ్వరూ చేయలేరని
తెలుసు. అతని వద్ద ఉన్నది కార్యదీక్ష.. ప్రతీకారం కోసం పట్టుదల. ఆ శక్తితో వాళ్ళందరినీ
మట్టి కరిపించి అతను నన్ను జీపులో ఎక్కించుకుని ఇంటికి దూరంగ ఏదో ఊరుకు తీసుకువెళిపోయాడు.
నాకు ఆ ఊరు ఏదో ఏంటో, అక్కడ ఏం ఉందో ఏమీ తెలియదు. నోరు మెదపకుండ వచ్చేశాను. కనీసం
కళ్ళు కూడా ఎత్తలేదు. అవి ఎత్తి చూసినా ఏమీ కనిపించని పరిస్థితి. నిరంతరం
వర్షిస్తూనే ఉన్నాయి.
అప్పుడు తెచ్చి పడేశాడు ఈ గదిలో. రాత్రికల్లా
నాకు ఉండటానికి కావాల్సిన అన్ని వస్తువులూ సమకూరాయి అక్కడ. ఓహో, అయితే సువ్వొదినను
అన్నయ్య కష్టపెట్టినదానికి ప్రతీకారంగ ఇప్పుడతను నన్ను అన్నయ్యకు దూరం
చేశాడన్నమాట. ఆ క్షణమే మనసు కుదుట పరుచుకున్నాను. తర్వాత రోజు వచ్చి గది తలుపు
తెరిచి "పద" అన్నాడు. తీసుకువెళ్ళి పనివారి మధ్య పొలంలో పడేశాడు. ఓహో,
అయితే అట్లగే నా చేత చాకిరి చేయిస్తాడన్నమాట. అంతవరకు అర్థమైంది. అయితే సువ్వొదిన
అన్నయ్యకు కట్టుకున్న భార్య మాత్రమే కాదు, ఆయన కొడుకుకు తల్లి కూడా. ఇక్కడ ఇతను
నాకేమీ కాడు. అతను నన్నేమీ చేసుకోలేదు. తన ఇంట్లో తీసుకువెళ్ళి పడేశాడు. అంతే.
అక్కడ నేనెవ్వరికీ ఏమీ కాను. మూడేళ్ళపాటు అక్కడొక బానిసను. ఇట్ల ఉంచాలనే నాకు
పెళ్ళి కాకుండ చూశాడు. నా గురించి నాకు అంతకన్నా ఏమీ అర్థం కాలేదక్కడ.
ఈ ఎనిమిదేళ్ళూ ఎక్కడ ఉన్నాడో ఏం చేశాడో
తెలియలేదు. పెద్ద తోటలున్నాయి.. పొలాలున్నాయి.. ఏవో వ్యాపారాలున్నాయి..
భూములున్నాయి.. అవన్నీ ఇతనే ఒంటిచేతి మీద చూసుకుంటున్నాడు. ఇల్లేమో పెద్ద భవంతి..
అన్ని రకాల ఆధునిక వసతులతో.. చుట్టూ తోట ఉంది. చిన్నపాటి అడవిలా ఉంటుంది ఆ ఇంటి
పరిసరాలంతా. ఇవన్నీ తన సామర్థ్యం మంచితనంతో అతను వాటి యజమాని నుంచి బహుమతిగా
గెలుచుకున్నాడని తర్వాత రాజన్న వల్ల తెలిసింది. రాజన్న అక్కడ వంటమనిషి. నన్ను ‘అమ్మడూ’ అంటాడు. నేనాయనను ‘అన్నా’ అంటాను. అందరూ అన్నా అనే అంటారు. రాజన్న పూర్వపు యజమాని నుండి ఇతనికి
ధారాదత్తం కాబడ్డాడు. ఈ కొత్త యజమాని చరిత్ర అంతా రాజన్నకు తెలుసు. ఎంతో నమ్మకంగ ఆ
వ్యక్తి దగ్గర పని చేసి, లాభాలు గడించటంలో కుడిచేయిగా సహకరించి, స్వయంకృషితో ఆ మామూలు
ఎస్టేట్ ను ఇవాళ కోట్ల టర్నోవర్ బిజినెస్ గా మార్చాడు. ఆ రాబడిని వేరొక
వ్యాపారానికి పెట్టుబడిగా మార్చుకుని దాన్ని చూసుకోటానికి వెళ్తూ పూర్వపు యజమాని
ఇతనికి ఇదంతా ఉన్నది ఉన్నట్టు అప్పచెప్పి వెళిపోయాడు. ఇంత చిన్న వయసులో అంత
ప్రగతి.. అంటే సామాన్యం కాదు. కానీ అతనికి ఇదంతా నెత్తికి ఎక్కలేదని అర్థమైంది.
ఎంత అధికారం, ఎంత అజమాయిషీ అయినా అదంతా పైపైనే. పనయ్యే వరకే. తర్వాత అంతా తనవారే.
అతనెవ్వరినీ నిజంగ పనివారిలా చూడడు.. నన్ను తప్ప.
అయితే నేను పనిదాన్ని కూడా కాదు.
పనివారికి జీతం ఉంటుంది. నాకు జీతం ఉండదు. రెండుపూటలా తిండి మాత్రం పెడతారు.
ఖర్చుకు ఏదైనా కావాలంటే అడిగి తీసుకోవాలి. అన్నయ్యతో ఫోనులు, మాటలు, వ్యవహారాలు
కానీ నడిచినట్టు తెలిసిందో, ఇంతే సంగతులు. అతనికి ఏ పని తోస్తే అది ఇస్తాడు. కిమ్మనకుండా
చేయాలి. నాకు ఎవరూ అజమాయిషీ ఉండరు. అతనే నాకు యజమాని. ఇంకోమాట ఏంటంటే- పని చెబితే
అతను చెప్పాలి. అవమానిస్తే అతను అవమానించాలి. అంతే. వేరెవరూ నన్నేమీ అనరు.
అనకూడదు. అనే స్థాయిలో ఎవరినీ అతను ఉంచలేదు. నేరుగ పైకి చెప్పకపోయినా ఈ మూడేళ్ళూ ఆ
నియమం అమలులో ఉంది. ఎప్పుడో అతను ఊరికి పోతేనో, లేక బయట పనుల మీద పోతేనో నాకు
ఊరటగా ఉండేది. లేదంటే పొద్దున వంచిన నడుం రాత్రికే ఎత్తేది. అలవాటు లేక మొదట్లో
భయంకరమైన వేదన అనుభవించేదాన్ని. శారీరకంగ, మానసికంగ నలిగిపోయాను ఆ పనితో. అంతవరకు
నేను మా ఇంట్లోనే పని చేసి ఎరగను. పనులు రాక కాదు, తెలియక కాదు. సువ్వొదిన పుణ్యమా
అని ఇంటి పని నుంచి పొలం పని దాకా అన్నీ వచ్చు. కానీ అంత పని ఒకేసారి అంటే.. ఎండనకా,
చలి అనకా, పగలనకా, రాత్రనకా చాకిరి చేస్తే ప్రాణం ఒక్కసారిగా ఏంకావాలి..? పై నుంచి
సూటిపోటి మాటలు..! గుర్తు తెచ్చుకోనవసరం లేకుండానే అర్థమైంది- అవన్నీ అన్నయ్య
సువ్వొదిన్ని తిడుతుంటే విన్నవేనని. ఎందుకంటే నేనెంత గారాబంగ పెరిగానో అతనికి బాగా
తెలుసు. తెలిసి కావాలని చేసేవాటివల్ల గాయం ద్విగుణీకృతమవుతుంది. గుడ్లలో నీరు
కక్కుకుని మౌనంగ సహించేదాన్ని.
పనివారు ఒకరిద్దరు నా మీద సానుభూతి
చూపేవారు. వారి యజమానిని సంబోధిస్తూ నేను 'నువ్వు' అనే మాట్లాడుతుండటం వారికి
విచిత్రంగ ఉండేది. నా తీరు చూసి, 'ఎవరో గొప్పింటోరి ఆడబిడ్డ' అని వాళ్ళకు
తెలిసింది. ఏదో పరిస్థితులు బాగోక ఇట్ల పని చేసుకుంటున్నానుకున్నారు. నేనూ అందుకు
భిన్నమైన వాస్తవాన్ని వారికి పరిచయం చేయలేదు. నోరు వెప్పితే నాకే అవమానం. నేనేమీ
చెప్పుకోలేక పడే లోలోపలి వేదన వారికి ఇంకేమీ అడగవద్దన్న సందేశం మాత్రం అందించేది. అడిగినా
ఏం అడుగుతారు గుచ్చి గుచ్చి.? ఆడపిల్ల వ్యవహారం. వారంతా మగవాళ్ళు. అన్నట్టు.. నా
కష్టం అంతులేనిది కావటానికి ప్రధాన కారణం- అక్కడంతా మగవారే పనివారు. ఒక్క ఆడపురుగు
కూడా అతని వర్కర్లలో లేరు. వాళ్ళ ఆడవాళ్ళంతా ఊర్లలోనే ఉండేవారు. వీళ్ళు వారానికొక
శెలవ మీద ఊరుకు పోయేవారు. అందరికీ అదే నియమం. ఎవరూ కుటుంబాలతో అక్కడ ఉండరు.
ఉండలేరు. వ్యవస్థ లేదు. అది ఇష్టమైనవారే అక్కడ ఉండేవారు. నేను ఎంత నరకం
అనుభవించాలో అంతా పిసరు తగ్గకుండా ఏర్పాటైంది. కడుపులో గోడు చెప్పుకునే దిక్కు లేక
ఉక్కిపోయేదాన్ని.
అయితే, నాకొక్కటే కృతజ్ఞత ఏంటంటే, ఇదంతా
కావాలంటే అన్నయ్య ముందు ఉంచి కూడా చేయచ్చు అతను. కానీ అట్ల చేయలేదు. తన అక్కను మా
అన్నయ్య చిత్రవధ పెట్టటం అతను కళ్ళారా చూసి సహించుకోవాల్సి వచ్చేది. ఇక్కడ కనీసం
నేనొక్కదాన్ని భరించుకుంటే చాలు. అన్నయ్య నేరుగ చూడనక్కర్లేదు. తను నన్ను చూసి
బాధపడుతుంటే నేను ఆ బాధ చూసి నలిగిపోయే అవసరం తప్పించాడు. అది చాలు. ఏదో తన
నిర్బంధంలో ఉన్నాననే మాటే కానీ అన్నయ్యకు వేరే ఏ మాటా తెలియదు. కానీ అన్నయ్యంటే
అతనికి చాలా కోపం. ఆ కోపానికి అంతు లేదు. బాగా తిట్టేవాడు. దానికి మాత్రం అంతు
ఉండేది కాదు. అది సహించలేకపోయేదాన్ని. కానీ తప్పదుగా.
ఇంత నరకంలో కూడా నాకు ఆహ్లాదాన్నిచ్చే
ఒకే ఒక్క ఆధారం వర్చస్. వర్చస్.. సువ్వొదిన చిరునవ్వు.. ఆమె గుండెచప్పుడు.. ఆమె
చివరి జ్ఞాపకం..! వాడికి నేనెవరో తెలియదు. అతను చెప్పలేదు. చెప్పదల్చుకోలేదు కూడా.
నన్ను అతనేమీ ఇక్కడికి చుట్టంగా తీసుకురాలేదు. నేనొక బంధీని. బందీలు మాట్లాడే
హక్కు లేనివారు. నాకక్కడ వ్యక్తిత్వం లేదు. అస్తిత్వమూ లేదు. ఏ స్వతంత్రం లేదు.
కనీసం వాడిని పలకరించేందుకు కూడా..! ఆ మాట అక్కడికి తెచ్చిన మొదటి రోజే కచ్చితంగ
చెప్పాడు. వాణ్ణి నాకు దగ్గర చేసుకునే అవకాశం కోసం నేనెప్పుడూ ప్రయత్నించలేదు.
ఫలితం తెలుసు. అతని మరింత కఠినమైన మాటలు..!
ఇప్పుడు వాడు ఆరో క్లాసులో ఉన్నాడు. ఆ
పక్క ఊరిలో ఉన్న కాస్త పెద్ద స్కూలులో చదువుతాడు. రోజూ కారులో స్కూలుకు పోయి
వస్తాడు. ఆడుకుంటాడు.. పాడుకుంటాడు.. సంగీతం అంటాడు.. సాహిత్యం అంటాడు. పుస్తకాలు
వదలడు. అచ్చం సువ్వొదినలాగే చెరగని నవ్వే వాడిది. సువ్వొదిన కళ్ళే. ముక్కు మాత్రం
అన్నయ్యదే. కాస్త ఆ తాతగారి పోలికలు, కాస్త ఈ తాతగారి పోలికలు కూడా
కనిపిస్తుంటాయి. పొడుగు పెరుగుతున్నాడు. బాగా పొడుగయ్యేటట్టే ఉన్నాడు- అచ్చం
మేనమామ లాగే. వాడి చిన్నతనం నేను చూడకుండనే పెద్దవాడైపోతున్నందుకు బాధపడేదాన్ని.
కానీ సువ్వొదిన చిరుజ్ఞాపకాన్ని, అన్నయ్య ప్రతినిధిని, మా ఇంటిపేరు నిలపబోయే
ఉత్తరాధికారిని ఈ విధంగానైనా చూసుకుంటున్నందుకు సంతోషపడేదాన్ని. అతను వాణ్ణి "వరం.."
అని పిలిచినప్పుడల్లా వాడు వస్తున్నాడేమోనని తలెత్తి చుట్టూ చూసేదాన్ని. వాడు
కనిపిస్తే అదొక ఆనందంగ ఉండేది. వాడి నవ్వు నా అలసటనంతా తీసేసేది.. అచ్చం సువ్వొదిన
నవ్వు తీసేసినట్టే.
అందుకే దూరానైనా చూసి తృప్తి పడేదాన్ని.
అయితే అనుకోకుండ వాణ్ణి నాకు దగ్గర చేసింది రాజన్న. అతను నన్ను ఈ ఇంట్లో తెచ్చి
పడేసిన రోజు- రాజన్నకే అప్పచెప్పాడు- నాకేం కావాలో అన్నీ సమకూర్చమని. రాజన్న అచ్చం
ఆడమనిషి మగరూపులో ఉన్నట్టే సున్నితంగ, నిదానంగ ఉంటాడు. మాటా మనసూ రెండూ మెత్తనే.
ఎందుచేతనో పెళ్ళి చేసుకోలేదు. ఒంటరివాడు. అప్పుడప్పుడూ శెలవు మీద వాళ్ళ ఊరికి
వెళ్ళి వస్తాడు. అప్పుడు చాలా వెలితిగా ఉండేది. రాజన్నకు తెలుసు, నేను అక్కడ
అందరిలా పనమ్మాయిని కానని. అందుకే నేనంటే సహానుభూతి. కానీ యజమానంటే భయమే. అందుకే
అప్పుడప్పుడూ తన యజమాని దరిదాపుల్లో లేనప్పుడు మాత్రమే నాతో మాట్లాడతాడు. ఏదైనా
మిఠాయి వండిన రోజు నాకోసం రహస్యంగ తెచ్చి పెడతాడు- యజమానికి ఇష్టం ఉండదు కనక..! "నాకు
వద్దు." అంటే.. "ఇది ఈ అన్న ప్రేమతో ఇస్తున్నది.. కాదనద్దు.." అని
తలనిమిరి ఇచ్చేవాడు. నాకు ఆపాటి సహానుభూతే కొండంత బలాన్ని ఇచ్చేది. ఎప్పుడైనా
ఒంట్లో బాగోకపోతే డాక్టరునడిగి మందు కూడా తెచ్చి ఇస్తాడు. నేను అక్కడ చేరిన
ఏడాదికి, ఒకసారి అట్లగే ఏదో సందర్భంలో వరం రాజన్నను చూసేసి పట్టుకుని నిలదీశాడు-
మామయ్య వద్దంటే ఎందుకు చాటుమాటుగ సహాయం చేస్తున్నావని. అప్పుడు రాజన్న వరానికి
చెప్పాడు- ఆమె ఎవరో కాదు.. మీ అత్త అని.
ఆ మాటకు వరమే కాదు.. నేనూ
ఆశ్చర్యపోయాను. రాజన్నకు ఆ సంగతి ఎట్ల తెలుసు అని. అప్పుడు చెప్పాడాయన- "మీ
అన్నయ్య దగ్గర పనిచేసే లచ్చమ్మది మా ఊరే, ఆమె మా బంధువులమ్మాయే"నని.
విచిత్రమైన బంధాలు. అయితే రాజన్నకు నా కథంతా తెలుసు. ఏమీ చెప్పనక్కర్లేదు. ఎందుకంటే
నన్ను అతను తీసుకువచ్చేటప్పుడు చూస్తూ నిస్సహాయంగ ఏడ్చిన వారిలో లచ్చమ్మ కూడా
ఉంది. అందుకే రాజన్నకు అంత సహానుభూతి నేనంటే. అన్నింటికన్నా ఆ సహానుభూతి వల్ల లాభంగ
నాకు వరం దగ్గరైనాడు. అది నాకెంతో ఆనందంగ అనిపించింది.
అప్పటి నుంచి వరం నాతో మాట్లాడటం, ఏదైనా
తెచ్చివ్వటం చేసేవాడు. కనీసం పనిమినిషిలా చూడనందుకు సంతోషించాను. ఒకసారి కారణం
అడిగాడు నా ఈ పరిస్థితికి. తన గతం గురించి కూడా అడిగాడు. సమయం వచ్చినప్పుడు అంతా చెప్తానన్నాను.
రాజన్నతో కూడా వాడితో ఏం చెప్పద్దని మాట తీసుకున్నాను. వాడు తననెంతో ప్రేమగ
పెంచుకుంటున్న మేనమామను తప్పుగా అర్థం చేసుకుంటాడేమోననే భయం కన్నా తన తల్లితో అంత
దారుణంగ ప్రవర్తించిన తండ్రిని ఎక్కడ అపార్థం చేసుకుంటాడోననే భయమే ఎక్కువగా నా
నోరు కుట్టేసింది. వాడు వాళ్ళ అమ్మ ఛాయ లేకుండ పెరుగుతున్న పిల్లవాడని నాకెంతో
జాలి. కనీసం నాకు దగ్గరైతే సువ్వొదిన నాకిచ్చిన ప్రేమలో వాడికి నేను కొంతైనా తిరిగి
ఇవ్వాలని ప్రయత్నించేదాన్ని. ఎప్పుడో ఒకసారి వాడికి కలిపి అన్నం ముద్దలు
పెడుతుంటే, అంతదానికే వాడు కళ్ళెంబడి నీరు పెట్టుకుని, "నువ్వు అత్తవు కావు,
అమ్మవు.." అన్నాడు. "పిచ్చికన్నా.. నీకు మీ అమ్మంటే ఏంటో ఏం తెలుసురా..?"
అనుకున్నాను మనసులో. పోనీలే, కనీసం తన మేనమామలా వాడిది పాషాణహృదయం కాదు
అనిపించింది.
ఆ అనురాగపు ఛాయలలో నాకు అక్కడి పని
బరువనిపించటం మానేసింది. నెమ్మదిగ చేతులు బొబ్బలెక్కటం మానేసింది. బలం పెరిగింది.
ఎంతటి పనైనా సనాయాసంగ చేసేయటం వచ్చింది. చదువుకున్నవారిలో ఉండే సౌలభ్యం ఇదే కదా. ప్రిపరేషన్.
సిద్ధపడటం. సన్నద్ధం కావటం చదువు నాకు నేర్పిన ప్రథమపాఠం..! అలిసిపోకుండ పనిని
విభాగం చేసుకుని ఒక సులువైన క్రమంలో చేసుకోటం అలవాటైంది. యోగః కర్మసు కౌశలం..
గీతాసత్యం. కర్మలలో యోగమే, అంటే ఏకసూత్రతే కౌశలం. అప్పటికి నాకు వరం, రాజన్న
ఇద్దరూ దగ్గరై కాస్త మానసిక స్థైర్యం కూడా పెరిగింది.
కానీ ఒక్కసారి మళ్ళీ కుంగినట్టైంది-
అన్నయ్యను ఆ ఇంట్లో అడుగుపెట్టటం చూసి. లచ్చమ్మ ద్వారా విషయం తెలిసి, అడ్రసు
కనుక్కుని అన్నయ్య రావటం సంతోషమే వేసినా తనను చూసి పోల్చుకోలేకపోయాను నేను. ఎంత
మారిపోయాడు!! అసలాయన అన్నయ్యేనా..? రాజన్న వచ్చి నాతో మీ అన్నయ్య వచ్చాడని
చెప్పేసరికి పరుగున వెళ్ళి చూసేసరికి అతనితో ఆఫీసుగదిలో కూర్చుని మాట్లాడుతున్నాడు-
కాదు.. అక్షరాలా ప్రాధేయపడుతున్నాడు- కాళ్ళు పట్టుకోవటం ఒక్కటే తక్కువ. కానీ అతను
దిగి రాలేదు.
"మీ అక్కకు అదంటే ప్రాణం. నువ్వు
దాన్ని పెట్టే హింసకు ఆమె సంతోషిస్తుందా..?" అడిగాడన్నయ్య.
"మరి మీ అమ్మకు కూడా సువ్వక్కంటే
ప్రాణమే. నువ్వు చేసిందంతా ఆమెను సంతోషింపచేయటానికా..?" ఎదురడిగాడతను.
అన్నయ్య దగ్గర సమాధానం లేదు.
ఇది మాటలతో కుదిరే వ్యవహారం కాదని,
తర్వాత ఒకసారి రాజన్న చేసిన ఏర్పాటుతో రహస్యంగ నన్ను కలిసి తనతో వచ్చేయమని అడిగాడు
అన్నయ్య- "పనిమనిషిలా వాడి దగ్గర పడుండాల్సిన ఖర్మ నీకేంటి?"
"మరి నేను చేసినదానికి
అనుభవించాల్సిన అవసరం సువ్వొదినకేంటి..?" అన్నాను నేను.
"నువ్వా..? నువ్వేం
చేశావు..?" అన్నయ్యకు అసలు విషయం తెలియదు. సువ్వొదిన చెప్పద్దని ఒట్టు
వేయించుకుంది. కానీ ఇప్పుడు ఆ ఒట్టు గట్టు మీద పెట్టక తప్పటం లేదు.
"అయితే విను. ఆరోజు నువ్వు
అమ్మకోసం మందు తెమ్మన్నప్పుడు హడావుడిలో సువ్వొదిన గూడు వెతుకుతుంటే నేనే ఆ సీసా
తెచ్చి వదినకిచ్చాను. అందులో మందు అయిపోతే ఆ సీసాను పురుగుల మందు కోసం వాడారని
నాకు తెలియదు. దాని మీద వివరం చదవాలన్న బుద్ధి అప్పటికి నాకు లేదు. ప్రతీసారి దాని
మీద ఏం ఉందో చదువుమని అడిగే వదిన ఆ హడావుడిలో అది అడగటం మర్చిపోయింది. ఎన్నోసార్లు
నీతో ఆ మాట చెప్పాలనుకుంటే వదినే వద్దంది. మీ అన్నయ్య కోపం నువ్వు భరించలేవమ్మా
అనేది." అన్నాను.
అన్నయ్య పశ్చాత్తాపానికి మరింత ఆజ్యం
పోసే సమాచారం అది. తను చేయని తప్పుకు మూగగ అంత బాధ అనుభవించిందామె అనే నిజం ఆయన
జీర్ణించుకోలేకపోయాడు. ఆ పూట విరిగిన మనసుతో వెళ్ళినవాడు ఇంక మంచం పట్టి దిగలేదట. అన్నయ్య
రాజన్న సెల్లుకు రహస్యంగ చేసే ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సంగతులు తెలిసేవి. అన్నయ్యను
చూసి రావాలని మనసు కొట్టుకునేది. కానీ అతను వెళ్ళనివ్వడు. అందుకే నేను అడగలేదు.
నాకు ఇంకా స్వాభిమానం చావలేదు. లేదా అన్నయ్యను ఏ దశలో చూడాల్సి వస్తుందోనని భయం. అడిగితే
అసలే వెళ్ళనివ్వడేమో అని భయం. అన్నయ్య నన్ను రహస్యంగ కలిసిన సంగతి, నాకోసం ఫోన్లు
చేస్తున్న మాట అతనికి తెలియకుండా పోయి ఉండదు. అయినా నన్నేమీ అనకపోవటమే నాకు జరిగిన
మంచి అనుకుని కూర్చున్నాను- మూగగ ఏడుస్తూ, అన్నయ్య ఆరోగ్యం కోసం రోజూ కనిపించే
ప్రకృతి దేవుళ్ళకు, కనిపించని దేవతాశక్తులకు మౌనంగ ప్రార్థిస్తూ.
No comments:
Post a Comment