Friday, 11 November 2016

1. ఒక ప్రతీకారం, ఒక ప్రాయశ్చిత్తం-4



4

          "ఎట్ల ఉందిరా ఇప్పుడు..?" సిద్ధాంత్ ప్రార్థిత్ ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళాడు.
          ప్రార్థిత్ ఇబ్బందిగ మంచం మీద కదులుతూ, "ఊఁ.. ఫరవాలేదు.. నెప్పులు తెలియకుండ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారుగా దండిగ..! ఏ బాధా తెలియట్లేదు.." అన్నాడు.
          ప్రార్థిత్ తల్లితండ్రులు అక్కడే ఉండి ముఖాలు చూసుకున్నారు. నిషితా ఆ గదిలోనే ఒక మూల కూర్చుని కళ్ళు తుడుచుకుంటోంది. సిద్ధాంత్ ఆమెను పలకరించి, "ఏం కాదు.. ఏడవకండి. మీ తప్పేం ఉంది.. ఇందులో..?" అన్నాడు.
          ప్రార్థిత్ అతనిని యథాలాపంగ చూశాడు. సిద్ధాంత్ అది గమనించి, "అనుకోం కదా, ఇట్ల జరుగుతందని.." అని ఆగి, "సారీ.. నా వల్లే అంతా జరిగింది.." అన్నాడు.
          "ఎవ్వరి వల్లా ఏదీ జరగదు. నోరు మూసుకో. పెద్ద అంతా తెలిసినట్టే మాట్లాడతారు మనుషులు.." అన్నాడు ప్రార్థిత్.
          క్రితం రోజు ప్రార్థిత్, నిషితా ఇద్దరూ సక్సేనా దగ్గరకు వెళ్ళినప్పుడు- అక్కడకు కాదు, వేరే చోటుకు రమ్మన్నారు ఫోనులో. వాళ్ళు రమ్మన్నది వాళ్ళ ఇల్లు కాదు.. ఊరవతల ఏదో గెస్ట్ హౌస్..! సరేనని అటే వెళ్ళినప్పుడు, నిషితా ఒంటరిగా వస్తోందని అనుకున్న వాళ్ళు ప్రార్థిత్ ని చూసి ఆశ్చర్యపోయారు. ఆలోచించుకుని ఏదో పని వంక చెప్పి పంపేసి, నిషితాను మాటల్లో పెట్టి, లోపలి గదిలోకి తీసుకువెళ్ళి నిర్బంధించటానికి ప్రయత్నించారు. ప్రార్థిత్ వెళ్ళినట్టే వెళ్ళి నిషితాను అనుసరించి, ఎక్కడ నిర్బంధించారో చూసుకుని వెళ్ళి ఆమెను విడిపించి, ఆ ప్రక్రియలో అక్కడివారితో ఘర్షణ పడి బాగా దెబ్బలు తగిలించుకున్నాడు. నిషితాయే ఫోన్ చేసి, అబులెంస్ రప్పించి, అతనిని అక్కడకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో చేర్చింది. బాగనే బాండేజీలు పడ్డాయి. ముఖ్యంగ ఎడం మోచేతికి కాస్త ఎముక డిస్ లొకేట్ అయింది. కుడి కాలికి గట్టి దెబ్బ తగిలి కాస్త ఫ్రాక్చరైంది. మనిషి బాగనే గాయపడ్డాడు.
          ‘ఎంత ఆడపిల్లను రక్షించటానికైతే మాత్రం ఇంత తన్నులు తినాలా, ఇంత దెబ్బలు తగిలించుకోవాలా’ అని ప్రార్థిత్ తల్లిదండ్రులిద్దరికీ చాలా బాధ వేసింది. ‘తనకెంత కష్టం వచ్చినా ఆడపిల్ల ఒంటిమీద ఈగ వాలనివ్వలేదు.. ఆ సంతృప్తి చాలదా’ అని ప్రార్థిత్ తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. న్యాయంగ ఫైట్ చేసే అవకాశం ఇస్తే కదా ఫైట్ చేసేది..! వాళ్ళు దొంగదెబ్బ కొట్టారు. అయినా తట్టుకుని ప్రార్థిత్ అవతలివారిని లేవకుండ చితకకొట్టాడు. కానీ పదిమందితో అతని ఒక్కడి బలం చాలలేదు. పరిస్థితి చూసుకుని ఫోన్ ద్వారా ముందే పిలిచి ఉంచినా, పోలీసులు రంగంలోకి దిగే లోపు ఇంతమాత్రం గాయాల తాకిడి జరిగిపోయింది. అందుకే నిషితా కళ్ళు తడి ఆరకుండ ఏడుస్తూనే ఉంది. ఒక లక్షసార్లైనా సారీ చెప్పి ఉంటుంది. లక్షన్నరసార్లు ప్రార్థిత్ ఫరవాలేదని ఉంటాడు. అతనికి జరిగినవేవీ బాధించలేదు. ఎందుకంటే అదే జరుగుతుందని అతనికి వెళ్ళే ముందరే తెలుసు కనక.
          "ఒరేయ్, శరీరంలో ఒక అవయవం కదలాలంటే ఎన్ని కండరాలు సహాయం చేస్తాయనేది ఇప్పుడు అనుభవ పూర్వకంగ తెలుస్తోంది. ఏ ఏ కండరాలు ఎంతెంత కదలికకు దోహద పడతాయో కూడా తెలుస్తోంది. నెప్పి ఉన్న చోటి పుణ్యమా అని లేనిచోటి పనితీరు కూడా తెలుస్తోంది.."
          అక్కడికేదో తనకు వాటిల్లింది కష్టం కాదు, సైంస్ నేర్చుకునే ప్రాక్టికల్ పాఠం లాగా మాట్లాడాడు ప్రార్థిత్. అతనికి మొదటి నుంచి నెప్పిని భరించే అలవాటు ఎక్కువ.
          "సంహితా కార్యసాధికా అని చిన్నతనంలో శరీరం నడిచే పద్ధతి గురించి చదివాను కానీ ఇప్పుడు అర్థమైతోంది. ఏ యుద్ధమైనా ముందు నుంచైతేనే ఎవడైనా చేయగలుగుతాడనే నిజం తెలిసింది."
          సిద్ధాంత్ కళ్ళు తుడుచుకున్నాడు. "ఒరే వాళ్ళు ఇట్ల వెనక దెబ్బ కొడతారని ఊహించలేదురా. పైగా ఇనపరాడ్ లు, కర్రలతో సిద్ధంగ ఉంటారని అస్సలు అనుకోలేదు." అన్నాడు.
          "అవి ఉపయోగించనివ్వలేదులేరా..! అవి తీసే లోపే పోలీసులు వచ్చారు. అన్నీ పై దెబ్బలేనట, డాక్టరు చెప్పారు. లోపలకు డీప్ గా ఏవీ తగలలేదు. కాబట్టి భయమేం లేదు. కొంత టైం ఇస్తే అవే తగ్గిపోతాయన్నారు. ఎక్స్ రేలు కూడా క్లియర్ గానే ఉన్నాయి. ఎముకలకు కానీ, నరాలకుకానీ ఏ డామేజీ కాలేదని ఖచ్చితంగ చెప్పారులే.." అని ఆగి, "కాళ్ళు చేతులు కదిలించి చాలా కాలమయ్యేసరికి పట్టేసినట్టైంది. అంతే." అన్నాడు ప్రార్థిత్, అప్పుడే చేయి కదిలి నెప్పి పుడుతుంటే అబ్బా అంటూ.
          "అబ్బ.. ఎక్కడెక్కడ కదిలి ఎక్కడెక్కడ నెప్పి పుడుతోందో. నీ బాధ చూడటానికే వర్ణనాతీతంగ ఉందిరా.." అతగాడి తండ్రి బాధపడ్డాడు.
          పెయిన్ కిల్లర్ల సేవనం ఆపేయంగనే అతనికి నెప్పులు తెలియటం మొదలుపెట్టాయి. చేతులు కదలవు.. కాళ్ళు కదలవు..! ఏది కదిలిస్తే అక్కడ నెప్పి. పక్కకు ఒత్తిగిలినా భయంకరమైన టకటకమనటాలూ.. నరనరాలలో ఇబ్బంది..! ఆ నెప్పి ఆ తల్లితండ్రుల కళ్ళలో ఎక్కువ కనిపించింది.
          ప్రార్థిత్ నెప్పీ, బాధల్లా శరీరంలో లేదు. మనసులో ఈస్తెటిక్స్ పోటీకి టైం లేకపోవటం రూపంలో తిరుగుతోంది. దానికోసం బాగా మనసు మీదకు తీసుకున్నాడు. ఎట్ల చేయాలో, ఏం చేయాలో, ఏం అర్థం కాలేదు. బాగా దిగులుగా, కంగారుగా అనిపించింది. చూస్తూ చూస్తూ పోటీని పోగొట్టుకోలేడు. అది ఈ బాధకన్నా ఎన్నో రెట్లు పెద్ద బాధ. జీవితాంతం వేధిస్తుంది. పై నుంచి డాక్టర్ నిఘా. అన్నింటికీ ఆంక్షలు.. నిద్ర, తిండీ అన్నీ పద్ధతులు మారిపోయాయి. చాలా చిరాకుగా ఉంది ఈ వాతావరణంలో. ఎంత కష్టపడినా సరిగ్గ కూర్చోలేకపోతున్నాడు. మొదటి రెండు రోజులు ఎటూ నిలవనీయకుండ టెస్టులనీ, బాండేజీలనీ, ఈవిధంగ గడిచాక అతనికింక విసుగు వచ్చింది. ఇట్లైతే లాభం లేదనుకున్నాడు. వీలు చిక్కించుకుని నెమ్మదిగ తన నోట్ బుక్ కంప్యూటరు తెప్పించుకుని తీశాడు.
          అతని నోట్ బుక్ కంప్యూటర్ లో అతని సాఫ్ట్ వేర్ అన్నీ ఉండేసరికి హాస్పిటల్ లోనే అనుకూలంగ ఒక చిన్న బల్ల వేయించుకున్నాడు. ఆ మరునాటి నుంచే పని చేసుకోవటం మొదలుపెట్టాడు. మొదట్లో చాలా కష్టపడి భంగిమ కుదిరింది. తర్వాత బాగా కంఫర్టబుల్ గ ఉన్న పోస్చర్ చూసుకుని సర్దుకున్నాడు. తక్కువ శ్రమతో ఎక్కువ సేపు పని చేసుకోగలిగే స్తోమత వచ్చింది అతనికి. వాళ్ళ అమ్మా, నాన్నా అతని తత్త్వం తెలుసు కనక ఏమీ మాట్లాడలేదు. డాక్టర్ అడ్డం చెప్తే ప్రార్థిత్ చాలా ప్రాథేయపడ్డాడు. "మీరు స్ట్రైన్ తీసుకుంటే త్వరగా కోలుకోలేరు." అన్నాడు డాక్టరు. "ఈ అవకాశం పోగొట్టుకుంటే ఇంకెప్పటికీ కోలుకోలేను.." అన్నాడతను. ఇంక ఎవరూ అతనికి అడ్డం చెప్పలేదు. ఏం చేయగలరు..? చేయి కదలనిచ్చినంత మేర "అబ్బా, అమ్మా" అనుకుంటూనే పగలూ రాత్రీ ఏకం చేసి పని చేసుకుంటూనే ఉన్నాడతను. నిషితా అతని పట్టుదల చూసి చాలా ఆశ్చర్యపోయింది.
          ఐదు రోజులకు అతనిని డిస్చార్జి చేశారు. ఇంకా కట్లు విప్పనే లేదు. సాప్ట్ కాపీ డిజైన్ అంతా ఫైనల్ అయిపోయింది. ఇంక డిజైన్ ని హార్డ్ మాడల్ లోకి మలచాలి. దానికి ఇల్లైతేనే సుగమంగ ఉంటుంది. ఆ చెత్త అంతా గదినిండా చేస్తానంటే హాస్పిటల్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు..? ఇల్లు కాబట్టి సరిపోయింది. విశేషం ఏంటంటే అధికారిణి అతనిని ఈ విషయమై ఏమీ అనకపోవటమే. ఆఫీస్ కి లీవ్ ఇవ్వటానికి ఆమె ఏ జంకూ చూపలేదు. ఆమె అతని ఉద్యోగం తీసేయటం లాంటిది ఏం చేసినా మళ్ళీ ఈ పోటీకి అతను పనికిరాడు. ఏదైనా కంపెనీ తరఫున మాత్రమే అప్లై చేయాల్సి ఉండటం ఆ పోటీ నియమం. ఎందుకో మరి తెలియదు. బహుశ అనుభవం ఉన్నవారికే అవకాశం ఇవ్వాలనేమో..! మొత్తానికి తయారైన సాఫ్ట్ కాపీని హార్డ్ మాడల్ పని కోసం అనుకూలంగ ఏర్పాటు చేసుకోవటం మాత్రం అతనికి కత్తి మీద సామైంది. ఎట్ల చేస్తాడు..? అతనికి దిగులు పుట్టింది. మంచం మీది నుంచి కదలలేని పరిస్థితిలో హార్డ్ మాడల్ అంటే మాటలా..? ఏదో సాఫ్ట్ కాపీ వరకంటే ఫరవాలేదు.. కావాల్సిన సాప్ట్ వేర్లనీ సిద్దంగ ఉన్నాయి.
          సరే, అతని పరిస్థితి తెలుసు కనక అందుకు అడగకుండనే సిద్ధాంత్ తన వంతు సహాయం చేస్తానన్నాడు. ఇంతవరకూ అన్ని పెద్ద సామాన్లే కానీ మీనియేచర్ లో ఏమీ చేసింది లేదు. ప్రార్థిత్ సిద్ధాంత్ స్పెషలైజేషన్ దృష్టిలో పెట్టుకుని, ఈసారి తన పరిస్థితి చూసుకుని క్రితం సారిలా ఆఫీస్ కాకుండ, అంతకు క్రితం సారిలా చిల్డ్రన్స్ స్కూల్ కాకుండ, ఒక లేక్ సైడ్ ఇల్లు డిజైన్ పెట్టుకున్నాడు. చాలా తక్కువ ఖర్చుతో చేయగలిగేది. దాని డిజైన్ కొంతలో కొంత సులువవుతుంది. ఇదివరలో ఖాళీగ ఉన్నప్పుడల్లా ఏదో దృష్టి కుదిరి చేసి ఉంచినవి, ఇంకా చేయాలని ఏర్పాటు చేసుకున్న అన్ని గదుల ఆకృతులన్నీ ఒకచోటికి తెచ్చాడు. నాలుగు బాల్కనీలతో నాలుగు గదులు, హాల్, కిచెన్, రెండు అంతస్తులు, రెండు కారిడార్ లు, మంచి మెట్లు, చుట్టూ ప్రహరీ కూడా మంచి డిజైన్ తో.. మొత్తం స్క్వేర్ ఫీట్ లెక్కన బడ్జెట్ ప్లాన్ అంతా తనే వేశాడు. అంతా ఫర్నిచర్ కి కేన్ వాడాలి. తలుపులు, కిటికీలు అన్నీ మంచి చెక్క వాడి చేయాలి. ముందుగదిలో సోఫాలు, సిటింగ్, లోపల గదులలో బెడ్స్, కిచెన్ ఫర్నిషింగ్, అంతా సిద్ధమైంది. ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో అమర్చాడు. తనకు ఎంతో ఇష్టమైన రెండు చోట్లు- స్టడీ, పూజా గది ప్రత్యేక శ్రద్ధతో చేశాడు. ఒక చిన్న జిమ్, చిన్న పూల్, చిన్న బాడ్ మింటన్ కోర్టు, పెద్ద లాన్, ఫౌంటెన్ లు, ఉయ్యాల బల్లలు, డైనింగ్, షెల్ఫులు, షోకేస్ లతో సహా అన్నీ సిద్ధమైనాయి. ప్రతీ వస్తువు మెటీరియల్ ఏం వాడాలో, ఎంత వాడాలో వేశాడు. సుమారు ఖర్చు అంచనా వేశాడు. రంగులు సరి చూసుకున్నాడు. టైల్స్, గోడల డిజైన్స్, అన్నీ గబగబా పూర్తి చేశాడు. చివరకు గోడలకు పెయింటింగ్స్ తో సహా సిద్ధమైపోయాయి.
          ఇంక అక్కడి నుంచి సిద్ధాంత్ పని మొదలైంది. లెక్క ప్రకారం వస్తువును మాడల్స్ గా మలచటం చాలా కష్టమైన పని. ముందు టైల్స్ డిజైన్లన్నీ ప్రింటవుట్ లు తీశాడు. పెయింటింగ్ లను ఫోటో షాప్ సాఫ్ట్ వేర్, పికాసా సాఫ్ట్ వేర్ వాడి చిన్న ప్రింటవుట్ తీసి పెట్టాడు. మెటీరియల్ అంతా ఒకచోట అమర్చాడు. చెక్క, కుషన్, స్పాంజి, చిన్న అట్ట ముక్కలు, ఇనుము అన్నీ వచ్చి చేరాయి. సిద్ధాంత్ తన కౌశలమంతా అక్కడ ప్రయోగించాడు. అతని వద్ద వాటికి సంబంధించిన పరికరాలన్నీ సిద్ధంగ ఉన్నాయి. అందులో మాడల్స్ ని యథావిధిగా కట్ చేయటానికి సిద్ధాంత్ కి చాలా సహాయం ప్రార్థితే చేశాడు. కొంత సహాయం వాళ్ళ అమ్మా నాన్నా కూడా చేశారు.
          ఆశ్చర్యం, నిషితా కూడా రోజూ వచ్చి కూర్చునేది. అందరితో కలిసిపోయి మాట్లాడేస్తూ ఆ మాడల్ రూపకల్పనలో సహాయపడింది. "అయ్యో, నువ్వూ నీ మాడల్ రెడీ చేసుకోవద్దా?" అంటే, ‘ప్రార్థిత్ కి తన వల్లే కదా ఈ పరిస్థితి ఏర్పడింది, అందుకే తను ఈ విధంగ సహాయం చేసి కొంతైనా ఋణం తీర్చుకుంటా’నంది. సిద్ధాంత్ కి ఆమె మీద ఉన్న చాలా మటుకు దురభిప్రాయం అంతటితో పోయింది. ఏ మనిషినైనా అవసర సమయంలో చూసి అర్థం చేసుకోవాలి. పైపైన చూసి కాదేమో అనిపించింది అతనికి. బయటకు అంత బాధ్యతారహితంగ కనిపించే ఆ అమ్మాయి లోపల ఇంత మంచి మనసుందా అనిపించింది. రూపం కాదేమో, గుణమే ముఖ్యం. అదేమో బాహాటంగ కనిపించదాయె. ఆమెను అపార్థం చేసుకున్నందుకు తనలో తనే బాధపడ్డాడు సిద్ధాంత్. ఈ నెలరోజులలో నిషితా ప్రార్థిత్ కి, సిద్ధాంత్ కి చాలా దగ్గరి స్నేహితురాలైపోయింది. వాళ్ళంతా ఇప్పుడు ఒక జట్టుగ పనిచేస్తున్నారు. అయితే సిద్ధాంత్ అతనికి చివరిదాకా దగ్గర ఉండలేకుండా అయిపోయింది పరిస్థితి.
          సరిగ్గ ప్రార్థిత్ కి ఈ ప్రమాదం జరిగే ముందు రోజు, అంటే సక్సేనా దగ్గరకు వెళ్ళే ఒకరోజు ముందు- సిద్దాంత్ కి పెళ్ళి చూపులు జరిగి అమ్మాయి అబ్బాయి పరస్పరం నచ్చుకోవటం, పెద్దలు వివాహ నిశ్చయం చేసుకోవటం జరిగింది. ఇంతలోకి ప్రార్థిత్ కి ఇట్ల జరిగిందని అతను నిశ్చయం చేసుకున్న పెళ్ళి ఇప్పుడే వద్దంటే ఇంట్లోవారు వినలేదు. దగ్గరలో ఏ మంచి ముహుర్తాలు లేక, ఆ ఏడాది ఎందుకో బాగా మూఢాలు వచ్చి, పెళ్ళి వాయిదా వేయలేకపోయారు. ఆడపిల్ల వాళ్ళ నాయనమ్మ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, సిద్ధాంత్ ఎంత మొత్తుకున్నా అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. పైగా ప్రార్థిత్ దగ్గరకు చూడటానికి వచ్చినప్పుడు సిద్ధాంత్ ని ఒప్పించమని అతనికే బాధ్యత అప్పగించారు. ఒకవైపు పోటీకి మాడల్ తయారీ పని, మరొక వైపు ప్రాణస్నేహితుడికి ఇంతటి దుస్థితి..!! "నేనెట్ల పెళ్ళి చేసుకోవాలి..? అసలు ప్రార్థిత్ రాకుండ నా పెళ్ళేంటి?" అని గొడవ చేశాడు సిద్ధాంత్. "అరే, నేనంతా ఆన్ లైన్ చూస్తాలేరా, నేను లేకుండ ఎట్ల ఉంటాను.. అదీ నీ పెళ్ళిలో." అని ప్రార్థిత్ భరోసా ఇచ్చాడు. అయినా సిద్ధాంత్ దిగిరాలేదు. చివరకు స్నేహం మీద ఒట్టు వేసేసరికి ఇంక అతనికి తప్పలేదు.
          పెళ్ళి ముహూర్తం కుదరక కుదరక సరిగ్గ పోయి పోయి పోటీకి నాలుగు రోజుల ముందే కుదిరింది. ఒకవైపు పెళ్ళి పనులు, ఇంట్లో సున్నాలు, పిలుపులు, లిస్టులు చేసుకోవటం, ఇంట్లో చుట్టాలు, భోజనాల హడావుడి, షాపింగులు, బట్టలు, బంగారాలు.. మరొకవైపు స్నేహితుడు మంచం మీద నుంచి లేవలేని పరిస్థితి, అతని చిరకాల ఆకాంక్షను పూర్తి చేసుకోవాలన్న తపన..!! సిద్ధాంత్ మనసు అల్లకల్లోలంగ ఉండింది. ఎటూ న్యాయం చేయలేక పాపం నానా అవస్థా పడ్డాడు. ఎప్పుడు వేళ చిక్కితే అప్పుడు పగలూ రాత్రీ తేడా లేకుండ వచ్చి ప్రార్థిత్, నిషితాలతో పాటు కూర్చుని పనిలో సహాయం చేశాడు. నిషితా కూడా రాత్రి ఆలస్యమైనా అట్లగే కిమ్మనకుండా కూర్చుని పని చేసేది. చాలాసార్లు అక్కడే వారి ఇంట్లోవారితోపాటే భోజనం చేసేది. ఒక్కొక్కసారి మరీ ఆలస్యమైతే వాళ్ళ ఆంటీకి ఫోన్ చేసి చెప్పి అక్కడే ప్రార్థిత్ ఇంట్లోనే ఉండిపోయేది కూడా.
          ఆ విధంగ అంతా కలిసి ఒక యజ్ఞంలా ఆ పనిని చేశారు. ఇంకేమీ ఆలోచన లేకుండ నిజంగ ఒక ఇల్లు కడుతున్నంత దీక్షతో ఆ మాడల్ ని పూర్తి చేశారు.
          మామూలుగ ప్రార్థిత్ అంత సులువుగా సంతుష్టి పడే వ్యక్తి కాదు. అతను ఎక్కడా, దేనికీ కాంప్రమైస్ అయ్యేవాడు కాదు. ఏదైనా కొలత తప్పు వస్తే ఒప్పుకునేవాడు కాదు. చిన్న కాగితం అతికించటంలో తప్పు దొర్లినా వదిలేవాడు కాదు. అట్లా అని అతను పర్ఫెక్షనిస్ట్ కాదు. ఒక రూపం అతని కళ్ళలో ఉంటుంది. దానికి చేరువగా తను రూపొందిస్తున్న ఆకృతి రావాలని ప్రయత్నిస్తాడు. ఎక్కడో అది సరితూగుతుంది. వెంటనే తన ప్రయత్నాన్ని ఆపేస్తాడు. ఆ పని పూర్తైందని అంటాడు. అది తనలో కలగనంతవరకు నిరంతరంగ ప్రయత్నిస్తూనే ఉంటాడు. అటువంటిది చివరి తేదీకి ఇంకా వారం వ్యవధి ఉంది అనంగనే, "హమ్మయ్య, పర్ ఫెక్ట్.." అన్నాడు ప్రార్థిత్. అతనికి చాలా సంతుష్టి కలిగింది. అంటే ఇంక అందులో చేయటానికి వేరేమీ ప్రత్యేకమైనది మిగలలేదని అర్థం. ఈసారి ఎందుకో కాస్త అటూ ఇటుగా ఉన్నా ఫరవాలేదనేశాడని సిద్ధాంత్ కి అనిపించింది. తను కుదురుగా పెళ్ళి పనులకోసం వెళిపోవటానికి ఇట్ల అంటున్నాడని అతనికి అర్థమైంది. చేసేదేం లేక సిద్ధాంత్ అతనికి అన్నీ భద్రంగ అప్పచెప్పి వెళిపోయాడు. అయినా ఫోను మాత్రం రోజూ చేసేవాడు. ఎంతవరకు వచ్చిందో కనుక్కునేవాడు. ధైర్యం చెప్పేవాడు. అధైర్యపడకుండా ఉత్సాహపరిచేవాడు.
          అంత మంచం మీద ఉండి పని చూస్తూ కూడా ఇంత చేయగలిగినా, సరిగ్గ ఇంక పోటీకి ఎంట్రీ పంపటానికి చివరి రోజు.. ఎవరూ ఊహించని దుర్ఘటన జరిగింది. భయంకరమైన రోజది.
          అప్పటిదాకా అంతా సజావుగా సాగింది. అతనికి కాలి కట్లు విప్పారు. చేతిని క్రేప్ బాండేజ్ మీద ఉంచారు. నెమ్మదిగ సర్దుకుంటుండంగ చివరి నిముషంలో ఒక పొరపాటు జరిగి మెట్టు దిగుతూ జారి కిందపడ్డాడు. దానితో అప్పటికే పనిభారంతో ఒళ్ళంతా సత్తువ లేకుండ ఉండటంతో ఆ దెబ్బ మీద దెబ్బ నడుము ఎముక కదిలింది. అతను ఆ ఆఘాతం మానసికంగ తట్టుకోలేకపోయాడు. బాగా సీరియస్ అయింది. తిరిగి హాస్పిటల్ లో వేయాల్సి వచ్చింది. సిద్ధాంత్ పెళ్ళి కూడా అతను ఆన్ లైన్ లో సరిగ్గ చూడలేకపోయాడు.
          పెళ్ళి కాంగనే అమ్మాయివాళ్ళు విహారయాత్రకు ప్లాన్ చేసేసి టికెట్లు చేతిలో పెట్టారు. ముందేమో వాయిదా వేస్తామన్నవాళ్ళు ఇట్ల చేస్తారేంటి, అని సిద్ధాంత్ ఇప్పుడే అదేం వద్దన్నాడు. కుదరదన్నాడు. చాలా గింజుకున్నాడు. ఇప్పుడు తన అవసరం ప్రార్థిత్ కి చాలా ఉందని ఎంత చెప్పినా ఒకడి కోసం వ్యక్తిగత సంతోషాలు వదులుకోవటం పాటి కాదు అని ఇంట్లోవారు నిర్బంధించారు. కనీసం పోటీకి అతని తరఫున వెళ్ళి ఎంట్రీని ప్రెజెంట్ చేయటానికి కూడా లేకుండ అయింది. ఇంట్లో పరిస్థితులు సహకరించలేదు. అయితే ఆ భారం నిషితా తన మీద వేసుకుంది.
          ఆమెకు మాడల్ మొదటి నుంచి చివర వరకు అంతా తెలుసు. బాగా ఎక్స్ ప్లెయిన్ చేయగలుగుతంది. పైగా ఒకే ఫీల్డ్. ఆమె మాడల్ కూడా పోటీలో ఉంది. ప్రత్యేకించి చేయాల్సింది ఏమీ లేదు. ప్రార్థిత్ అదే మాట సిద్ధాంత్ తో చెప్తే సిద్ధాంత్ ఇంక వేరే దారి లేక, తప్పక ఒప్పుకున్నాడు. తను విహారయాత్రకు వెళిపోయాక నిషితా మొత్తం ప్రార్థిత్ తోనే ఉండి ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుని హార్డ్ మాడల్ తీసుకుపోయి ప్రస్తుతించటానికి తయారైంది. సాఫ్ట్ మాడల్ మాత్రం మళ్ళీ ఒక్కసారి చూసుకుని ప్రార్థిత్ మెయిల్ లో పంపేస్తాన్నాడు. సరేనని ఆమె, ‘ఈస్తెటిక్స్ మెయిల్ ఐడీ ఇదిగో- జాగ్రత్త’ అని ఒక కాగితం మీద వ్రాసి ఇచ్చింది.
          అయితే నిషితా దానిమీద వ్రాసింది తప్పుడు ఐడీ అని అతనికి తెలియదు.

No comments:

Post a Comment