Friday, 11 November 2016

2. పిల్ల పేరు మల్లెమొగ్గ, నా పేరు జమీందార్-5




          "చివరకు ఇదా నువ్వు ఎంచుకున్న దారి..?"
          హఠాత్తుగ వినిపించింది ఆ ప్రశ్న, నా ఆలోచనలలో నుంచి నన్ను బయటకు చీలుస్తూ. ఆ ప్రశ్న వేసిన గొంతు అతనిదే. వినీ వినీ విసిగిపోయిన గొంతు అది. నేను ముఖం తిప్పేసుకున్నాను. నాకు అతని వంక చూడాలని కూడా లేదు. బహుశ ఉదయాన్నే లేచి నేను కనిపించకపోయేసరికి వెతుకుతూ వచ్చినట్టున్నాడు. ఇంక నాకు అతని ఏ మాటలూ వినాలని కానీ, విన్నా వాటిని అర్థం చేసుకోవాలని కానీ, అర్థమైనా ఆచరించాలని కానీ లేదు.
          "రైలు కోసం ఎదురు చూస్తున్నావా..? ఇది స్టేషన్ కాదు. ఇక్కడ అది ఆగదు."
          "----"
          "రైలు ఇవాళ ఆలస్యంగ వస్తుందిట.. వార్తల్లో చెప్పారు." తనే అన్నాడు మళ్ళీ.
          "ఆ మాట చెప్పటానికి వచ్చావా..? థాంక్స్.." అన్నాను లేచి నిలబడి అతనికి విరుద్ధమైన దిశలో అక్కడి నుంచి కదులుతూ.
          "ఆగు.. ఇంక నా మొహం చూడవా..?"
          "నువ్వేగా ఇంక నీకు నా మొహం చూపించద్దన్నావు..? అందుకే చూపించటం లేదు."
          "నువ్వింక నా దగ్గర పనిమినషివి కావు. నా మాట విననక్కర లేదు.."
          "నీ మాట నేనెప్పుడూ వినలేదు. నా మాటే విన్నాను. నీ మొహం నేనెప్పుడూ చూడాలనుకోలేదు. నేనెవ్వరి దగ్గరా పనిమనిషిని కాను. నేనేనాడైనా జమీందారు రాయ్ బహాదుర్ రాజరాజేశ్వరంగారి కూతురినే. రాయ్ బహాదుర్ ప్రకాశరాజేశ్వరం చెల్లెలినే."
          "సరే, ఆ సర్వశ్రీ ప్రకాశ రాజేశ్వరం గారు తన చెల్లెలికిచ్చిన కానుక ఏంటో నువ్వూ చూడు." అని అతను నా ముఖం ఎదుట ఒక కాగితం ఆడించాడు. అతని వంక చూడకుండనే ఆ కాగితం అందుకుని అంతా చదివాను. చదివి "ఇదేంటి?" అన్నాను ఆశ్చర్యంగ.
          "డిగ్రీ చదివావుగా. ఇంగ్లీషు వచ్చు కదా.." అన్నాడతను.
          "ఇది అన్యాయం. నా దగ్గర ఈ మాట ముందెందుకు దాచావు..? పూర్తి నిజం ఎందుకు చెప్పలేదు నాతో?" అతని వంకకు తిరిగాను.
          "నాకు తెలిసింది నిన్న రాత్రే..! నీ గడువు పూర్తైనాక ఒకసారి కలవమని లాయర్ పిలిస్తే వెళ్ళాను. మీ అన్నయ్య దీనిని నాకు తెలియకుండ రిజిస్టర్ చేయించాడు. కావాలంటే చూడు- నేను చూసినప్పుడు ఆ కాగితంలో ఈ మూడో వాక్యం లేదు. ఇది కావాలని తర్వాత జోడించారు దీనిలో.."
          ఈ కాగితం ప్రకారం అన్నయ్య తదనంతరం ఉత్తరాధికారి కనక వరంకు ఆస్తి మొత్తం దక్కుతోంది అని మొదటి వాక్యం. దానికి ఈ పెద్దమనిషి గార్డియన్ గా ఉంటాడు అనేది రెండవ వాక్యం. ఈ రెండిటితో పాటు నన్ను అతను పెళ్ళి చేసుకున్న పక్షంలోనే ఈ రెండూ సాధ్యమవుతాయని షరతు ఉంది. అన్నయ్య ఆంతర్యం నాకు తెలియక - నాకు చిల్లగవ్వైనా ఆస్తి రాయకపోవటం, గార్డియన్ గా ఉంచకపోవటం వల్ల జాలి కలిగి అతను నన్ను దిక్కులేనిదానిని అన్న జాలితో పెళ్ళి చేసుకుంటాడేమో అనే ఆశ వల్ల - అని భ్రమ పడ్డాను. కానీ ఇంత పటిష్టంగ లీగల్ గా శాసిస్తాడని అనుకోలేదు.
          అప్పుడు వరానికి ఆస్తి దక్కాలని నేను చేసిన ప్రయత్నం ఇప్పుడు అతనిని పెళ్ళి చేసుకుంటేనే ఫలిస్తుంది. లేని పక్షంలో మొత్తం ప్రభుత్వ పేదనిధికి వెళిపోతుంది.
          నాకు హఠాత్తుగ ఎటూ తోచలేదు. నా జీవితం ఏం చేసుకుందామా అని ఆలోచన ఇంకా తెగనే లేదు, మళ్ళీ ఇదొకటి తగిలింది. అతనికి అవసరం లేని, నాకు అవసరం ఉన్నది అయిన ఒక ఆశయం కోసం ఇప్పుడు నన్ను అతనికి కట్టిపడేస్తున్నాడు అన్నయ్య. ఆస్తి ఇస్తే నా జీవితం గడుస్తుంది. కానీ నన్నెవరూ పెళ్ళి చేసుకోరు. ఈ మూడేళ్ళ మరక నన్ను ఆజన్మాంతం వదలదు. నా స్వాభిమానం నన్ను అతని ముందు తల వంచనివ్వదు. అతనికి అన్నయ్యంటే ఉన్న పగ నా వంక ఆ దృష్టితో చూడనివ్వదు. కనక మేమిద్దరం కూడా పరస్పరం అటువంటి ఆలోచనను కలిగి ఉండటం అసంభవం. అందుకే ఈ వ్యవస్థ. అర్థమైంది అన్నయ్య ప్లాను. ఒకరికి నా మీద ప్రేమ కలిగి పెళ్ళి చేసుకుంటే ఒక పద్ధతి కానీ అసహ్యంగ ఈ బిగింపులేంటి..? నాకు చెడ్డచిరాకేసింది. దిక్కులు చూస్తూ నిలబడ్డాను. ఏం మాట్లాడాలో తెలియలేదు.
          "మీ అన్నయ్య కావాలనే నన్ను ఇట్ల ఇరికించాడు. నా మీద పగ తీర్చుకోవటానికే చేశాడు. లేని వాక్యాలు డాక్యుమెంటులో సృష్టింపించాడు. మెచ్చుకోవాలి. మీ అన్నయ్య చాలా తెలివికలవాడు. నా మంచితనాన్ని ఈ విధంగ ఉపయోగించుకున్నాడు. నేను చేసిందంతా ఒక ఎత్తైతే ఆయన వేసిన ఈ ఎత్తుగడ వాటికన్నింటికీ తీసికట్టు." అన్నాడు కచ్చాగ. ఇదే అంటాడని ఊహించాను. అతనికి ఈ శాసనం ఎప్పటికీ అంగీకారం కాదని తెలుసు. నేనూ నా స్థాయి దిగదల్చుకోలేదు. భవిష్యత్తు ఏమైనా సరే.
          "ఎందుకు పోయిన మనిషి గురించి చెడు మాట్లాడటం..? వదిలేయరాదా..? సరే, నీకిష్టం లేకపోతే వదిలేయి. అన్నయ్య తనకు తోచింది చేశాడు. పోయినవాడిని అనుకుని ఏం లాభం?"
          "అంటే?"
          ఆ కాగితం మడిచి అతని చేతికి ఇచ్చి, "అంటే గుడ్ బై.. అని అర్థం.." అని నేను అక్కడి నుంచి కదిలాను మళ్ళీ.
          "అదేంటి..? దాని అర్థం తెలుసా? అంత నిమ్మళంగ ఏమీ కానట్టే వెళిపోతావు..? ఆస్తికోసం నువ్వు పడ్డ ఆదుర్దా అంతా వృథా అవుతుంది. ఆలోచించావా..? అదే చెప్పటానికి వచ్చాను.."
          "చెప్పావు. విన్నాను. అయిపోయింది కదా. చాలు. నా ప్రయత్నం విఫలమైందని సర్ది చెప్పుకుంటాను." అనేసి, నేను గిరుక్కున వెనుదిరిగి శూన్యం వైపు అడుగులు వేశాను. అతను నేనూహించినట్టే ఆశ్చర్యపోయాడు. ముందుకు ఉరికి వచ్చి చేయి అడ్డం పెట్టి నన్ను ఆపాడు.
          "హేయ్.. ఆగు.. అంత లక్షల కోట్ల ఆస్తి..! ఎంత ఖర్చు పెట్టానో తెల్సా..? ఎంత పెద్ద లాయర్లను మాట్లాడానో..! ఆస్తికోసం కన్నా నీ మాట కోసం! అంతా ప్రభుత్వానికి అన్యాయంగ వెళిపోతుంది. వాళ్ళు అక్కడ ఏం చేసినా చేస్తారు. తాతలనాటి సంపదలు.. బంగారం, భూములు, పూలతోటలు, పండ్లతోటలు, ఇళ్ళు, పొలాలు, గుళ్ళు, మాన్యాలు.. వాటిని భద్రంగ కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు లేదా..?"
          "ఉంది.. కానీ ఏం చేస్తాం..? యోగం లేదని ఊరుకుంటాను. నీకైన ఖర్చు నీకున్న దాంట్లో పెద్ద లెక్కలోకి రాదని తెల్సు. ఇంక ఆస్తి అంటావా, కేస్ ఓడిపోయినా చేజారిపోయి ఉండేది. కందకు లేని దురద కత్తిపీటకెందుకు? కర్మ చేశాను. ఫలం దక్కలేదు. ఆశించటం కూడా తప్పే. నీకూ ఆసక్తి లేదన్నావు కదా. నాకూ ఓపిక లేదు. అయినా వెళ్ళేది పేదనిధికే కదా. పేదవారికి ఎంతో కొంత మంచి జరగకపోదు.. నీ సంగతి తెలిసీ అన్నయ్య ఆ షరతు పెట్టటం ఆయన అవివేకానికి సంకేతం. అందుకే ఆ ప్రస్తావన వదిలేసేయి. బ్రతికి ఉన్న మనిషికే విలువ లేని ఈ రోజుల్లో పోయిన మనిషి మాటకేంటి విలువ?"
          అతను ఆశ్చర్యంకన్నా ఎక్కువగ దెబ్బతిన్నట్టు చూశాడు- "నటిస్తున్నావా..? లేక నిజంగ అంటున్నావా..?"
          "నటించటం నాకు రాదు. వచ్చినా ప్రస్తుతం నటించే పరిస్థితిలో నేను లేను."
          నా అస్తిత్వమే మర్చిపోయాను. అది వెతుక్కుంటూ ఇక్కడ కూర్చున్నాను. ఈ మూడేళ్ళుగా మూడు కోట్ల సార్లు చచ్చి బ్రతుకుతున్నాను...! నేనేంటో జీవితమేంటో అన్నీ ఇతగాడి కింద నలగటంలో మర్చిపోయాను. ఇప్పుడు ఈ అలసటా, అలజడీ తగ్గించుకుని ప్రశాంతంగ ఆలోచిస్తే కానీ నేను నాకు గుర్తు వచ్చేటట్టు లేను. కళ్ళు తడవుతుంటే నిగ్రహించుకున్నాను. కష్టం మీద అన్నాను-
          "ఎంతదాకో ఎందుకు? నువ్వు ఇందాక అన్నదాకా నేను డిగ్రీ చేశానని కానీ, ఇంగ్లీషు చదవగలనని కానీ మర్చిపోయాను." గరగరమంది కంఠం. "సరే, అది నా బాధ. నేను చూసుకోగలను. వరం జాగ్రత్త. ఇంకెప్పుడూ మనం ఒకరికొకరం ఎదురుపడద్దు. ఉంటాను." కదిలానక్కడి నుంచి.
          "ఎక్కడికి పోతున్నావు..?" అడిగాడు.
          హుఁ.. ఇప్పటికి వచ్చిందండీ సందేహం. అతనికి నేనంటే ఏ పరమైన ఆసక్తీ లేదేమో. అందుకే నేను ఎటుపోతాననే ఆలోచన ఇంతవరకు వచ్చి ఉండదు. "ఎక్కడికి పోతే నీకెందుకు..? అది నీ సమస్య కాదు. నీకనవసరం."
          "ఒప్పుకుంటాను. లెక్క ప్రకారం అనవసరమే. కానీ మానవతా దృష్టితో కనుక్కుంటున్నాను.."
          "ఇన్నాళ్ళూ నాతో చేసింది, ఇన్ని అనర్థాలనూ సృష్టించింది ఆ దృష్టితోనేనా..?"
          "మొదలు పెట్టింది నేను కాదు. మీ అన్నయ్య..! నేను పూర్తి చేశానంతే. ఆయనను అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నావు.."
          "అన్నయ్య ఆరళ్ళు పెట్టుకున్నది తన సొంత కట్టుకున్న పెళ్ళాన్ని. అదీ ఆమె అంగీకారంతో. నువ్వు నన్ను ఏ హక్కుతో తెచ్చావిక్కడికి? ఏమౌతానని? నువ్వు పొమ్మన్న తర్వాత నా గతేంటి? ఇది ఆలోచించి ఆ షరతు పెట్టి ఉంటాడు అన్నయ్య. పాపం, పిచ్చివాడు." అని ఆగి, "నా గమ్యం, దారీ, తెన్నూ ప్రస్తుతానికి నాకే తెలియదు. తెలిశాక తప్పక నీకూ తెలియచెప్తాను." అన్నాను.
          అతను నావంక చూసి, "ఏ దారీ లేకపోతే ఈ దారి ఎంచుకుంటావేమోనని భయం." రైలు పట్టాల వంక సైగ చేస్తూ అన్నాడు.
          "లేదు. సువ్వొదిన నాకు నేర్పిన పాఠం అందుకు విరుద్దమైంది..!" అని చేతిలో భగవద్గీత చూపించి, "నేనెన్నటికీ చావు వచ్చే ముందే చావను. ఇంట్లో నా సర్టిఫికెట్లున్నాయి. అవి తీసుకుని పట్నం పోతాను. అక్కడే బ్రతుకుతాను. నేను చదివిన కాలేజిలో ఏదో లాబ్ అసిస్టెంట్ గా అయినా పోస్ట్ ఇవ్వక మానరు. ప్రస్తుతానికి అంతే ఆలోచన ఉంది. ఆ పైన ఈశ్వరేచ్ఛ.." అన్నాను.
          "కానీ నేను నిన్ను ఇట్లగే వెళ్ళనిస్తే మీ అన్నయ్య శాపం తగులుతుంది..! "
          "ఆయన జీవించి ఉండగా చేసినదానికి తగలని శాపం ప్రసక్తి ఇప్పుడెందుకు?"
          అతను కాసేపు ఏమీ మాట్లాడలేదు. తర్వాత అడిగాడు- "అసలు మా అక్కను మీ అన్నయ్య అట్ల అన్యాయం చేయటం, నాకింత తట్టుకోలేని పగ రగలటం, దానిని నీ మీద తీర్చుకోవటం.. నీ దృష్టిలో ఇదంతా ఏంటి..?"
          "నేను అదే తెలుసుకోవాలని అడిగినప్పుడు వివరణలు అనవసరం అన్నావు. ఇప్పుడు నాకు తెలుసుకునే అవసరం లేదు. నీకేది అనిపిస్తే అదే."
          "నీకేది అనిపిస్తుంది అని అడిగాను.."
          "నాకసలు దృష్టే లేదు. చాలా..? ఉన్నా ఈ మూడేళ్ళలో అది గుడ్డిదైపోయింది. ఇంక వదిలేయి."
          నేను అక్కడి నుండి కదిలాను. అతను ఆలస్యం చేయకుండా ఠక్కున నా చేతిని పట్టుకున్నాడు. నేను నివ్వెరపోయి చూశాను అతని వంక. అతను సూటిగ చూస్తున్నాడు. నేను చేతిని విడిపించుకో చూశాను. అతని పట్టు బిగిసింది.
          "వదులు!!!"
          "వదలటానికి కాదు పట్టుకున్నది."
          ఎంత ధైర్యం!!! ఈసారి ఆశ్చర్యపోవటం నా వంతైంది. "ఏంటి దీని అర్థం..?" అనడిగాను. చేతిని విదిలించాను గట్టిగ. కానీ అతని పట్టు ఉడుం పట్టు. వీడలేదు.
          "దీని అర్థం లోకంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటే ఉంటుంది. పాణిగ్రహణం."
          "ఆఁ???!!!"
          "రాత్రంతా ఇదే ఆలోచించాను. ఉదయానే నీతో ఇదే చెప్పాలని వచ్చాను. నువ్వు లేవు. అంత తెల్లారే వెళిపోతావని నేననుకోలేదు. అంత చీకట్లో ఎందుకు వచ్చేశావు?"
          "బ్రతుకులో ఇంక ఏం వెలుగు మిగిలింది కనక? ముందు చేయి వదులు. ఒకవైపు అన్నయ్య మాటను కాదంటూ మరొకవైపు ఇదేంటి..? హాస్యాస్పదంగ ఉంది."
          "ఇది మీ అన్నయ్య కోసం కాదు. వరం కోసం..! అత్త రానిదే అన్నం తిననని మొరాయించి కూర్చున్నాడు."
          "వరమా..? వాడికి నేనంతా వివరంగా చెప్పే వచ్చానే."
          "ఊఁ. చెప్పావు. అందుకే ఇప్పుడు వాడు నిన్ను దిక్కు లేనిదానిలా వెళ్ళగొట్టానని నన్ను విలన్ లా చూస్తున్నాడు. ఉదయం నుంచి ఏడుస్తూ కూర్చున్నాడు. నిన్ను తీసుకువచ్చేదాకా నాతో మాట్లాడనంటున్నాడు. పెద్ద పెద్ద మాటలతో నన్ను ఎదిరించి ప్రశ్నిస్తున్నాడు. వాడికి ఇవన్నీ నేర్పే ముందు ఉండాలి."
          "ఇది నేర్పింది కచ్చితంగ నేను కాదు. నువ్వే..! వాడి ఎదురుంగా నాతో దురుసుగా ప్రవర్తించే ముందు ఉండాలి. అప్పట్లో మా అన్నయ్యను చూసి నువ్వు అనుకరించావు. ఇప్పుడు నిన్ను చూసి వాడు అనుకరిస్తున్నాడు. వాడిలోని ఆ దుడుకుతనం అంతా నీ పోలికే."
          "నా పోలికా?? వాడు నా అక్క కొడుకు ఎంతో అంతే ఎక్కువ నీ అన్న కొడుకు కూడా అని మర్చిపోకు." అని ఆగి, "ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ పోలికలు, ప్రభావాల గురించి నిష్కర్ష చేయమనలేదు. ఇట్ల కాక నిన్ను వేరే విధంగ నా ఇంటికి తీసుకుపోయే అధికారం కానీ, అవకాశం కానీ నాకు లేదు. అందుకే మర్యాదగా నాతో రా.." అన్నాడతను కాస్త కఠినంగ.
          నేను అంతకన్నా కఠినంగ, "మర్యాదా? ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తూ మర్యాద గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ముందు నువ్వు నా చేయి వదులు. పొమ్మంటే పోవటానికి, రమ్మంటే రావటానికి నేను బొమ్మను కాను." అన్నాను.
          "అందుకే నేను వాడికి ఏమీ తెలియకుండా దాచాలనుకున్నాను. వాడి నుంచి నేను దాచాలనుకున్న ఏ నిజం దాగలేదు. వాడిది ఏదో చెప్పి ఏమార్చే వయసు కూడా కాదు. నువ్వు రాక తప్పదు. నీ వల్ల శాశ్వతంగ వాడు నాకు కాకుండా పోతాడు. వాడి కోసం అయినా రా."
          "నేను ఎవ్వరికోసం రాను." నేను చేతిని విడిపించుకో చూస్తూ, "నాకటువంటి ఉద్దేశాలు లేవు. చేయి వదులమన్నానా..?" అన్నాను.
          మామూలుగ అయితే అతనేం అనేవాడో నాకు తెలియదు కానీ, నేను అకస్మాత్తుగ పట్టు తప్పాను. ఒక్కసారిగా ఆపుకోలేనంత ఏడుపు వచ్చింది. అతను చేయి వదిలేస్తే రెండు చేతుల్లో ముఖం దాచుకుని భోరుమని ఏడ్చాను. నన్ను మెల్లగా గట్టు మీద కూర్చోబెట్టి నా ఎదురుంగ నన్నే చూస్తూ కూర్చున్నాడతను. మూడేళ్ళ వేదన.. ఎన్నడూ ఒకరి ముందు కానీ ఒంటరిగా కానీ ఏడ్చి ఉండలేదు. మామూలు స్థితికి రావటానికి అరగంట పట్టింది.
          "ఎందుకు ఏడ్చావు అంతగా..?" అడిగాడు కళ్ళలోకి చూస్తూ.
          "అది ఆడపిల్ల బాధ.. నీకర్థం కాదు.."
          "బాధకు కూడా ఆడా మగా ఉంటాయా..? హుఁ! ఆడపిల్లబాధ నాకు తెలియదా..? మా అక్క కళ్ళలో రక్తం కారటం చూశాను. నాకు తెలిసి ఏ మనసుకైనా బాధ ఒకటే.."
          "మనసు..!! హుఁ!! దాని అర్థం తెలుసా నీకు..? ఒక ఆడపిల్ల గుండెకోతకు కారణమైనవాడి నోట ఈ మాటలు బాలేవు.."
          "గుండెకోతా..!!? నేనూ అనుభవించాను.. కడుపు నిండా..!! బాధ గురించి నాకు చెప్పకు. అది ఈ మనసుకు కొత్త కాదు. ఏడవదల్చుకుంటే నీకన్నా ఎక్కువ బాధలే నా గుండెల్లో రగులుతున్నాయి. అనవసరంగా సహానుభూతికోసం ఏడవకు."
          "సహానుభూతా..? హుఁ!! దానికోసం నీ దగ్గర ఏడవటం నాకేం ఖర్మ? ఏడ్చే దాన్నే అయితే నువ్వు చేసిన నిర్వాకానికి కళ్ళు ఎండేవే కావు. అహం దెబ్బ తీసి అవమానించినవాడు తనలో ఆడపిల్ల వంక చూస్తే ఏ అమ్మాయైనా ఇట్లగే ఏడుస్తుంది.."
          "నా అక్కను కన్నీరు పెట్టించి ఆమె అకాలమరణానికి కారణమైనవాడి చెల్లెలి చేతిని పట్టుకోవలసి రావటం నాకూ కష్టంగనే ఉంది.."
          "మీ అక్క కన్నీటికి కారణమైన ఆయన చావుకు నువ్వు కారణమైన తర్వాత కూడా ఆయన మాటకెందుకు విలువనిస్తున్నావో నాకు తెలియటం లేదు..!!"
          "మీ అన్నయ్య పోయింది తాను చేసిన తప్పులకు కుమిలిపాటుతో. నా వల్ల కాదు. పోయేముందు ఆ మాట తనే అందరి ముందు, నా ఎదుటే మనస్పూర్తిగా ఒప్పుకున్నాడు. ఇంక నేను ఈ నిర్ణయం తీసుకున్నది మాత్రం వరం కోసం. వాణ్ణి ఈ చేతుల్లో పెంచుకున్నాను. వాడి కన్నీరు నేను చూడలేను. మొదటిసారి నోరు తెరిచి వాడు నన్ను అడిగిన కోరిక అత్తను తెచ్చి ఇవ్వమనే. అది తీర్చాల్సిన బాధ్యత నాది."
          ఔను.. వాడితో బంధం ఏర్పరుచుకునే ముందే ఉండాలి నాకు. నేను ఇంత దూరం ఆలోచించకపోవటం నాదే తప్పు. తల్లి లేని పిల్లవాడు.. ఆశపడటంలో తప్పు లేదు కదా.
          అతను ఆలోచిస్తూ అన్నాడు- "ఇంకొక మాట- ఆ ఆస్తి వాడి హక్కు. ఆ హక్కుకు వాడిని నా కారణంగ దూరం చేయలేను. అది కూడా ఇంత ప్రయత్నించాక..! ఆస్తి విలువ నాకు తెలుసు. నావల్ల వరం తనకు చెందింది పోగొట్టుకోవటం నాకిష్టం లేదు."
          "అక్కర్లేదు. అది నీ సమస్య కాదు. నువ్వు మా అన్నయ్య సంతతి గురించి ఆలోచించనక్కర్లేదు. వాడిని గాలికి వదిలేయకుండా కనీసం గౌరవంగ పెంచుతున్నావు. ఆ ఒక్క మాటకు నిన్ను క్షమించగలను. మిగిలింది నేనే పట్టించుకోవటం లేదు. నువ్వెందుకు వినటం..?"
          "మొదటి మాట, వరాన్ని పెంచుకుంటున్నది మా అక్క జ్ఞాపకంగ. మీ అన్న సంతానంగ కాదు. వాణ్ణి పసితనంలోనే దూరం చేసుకున్న ఆ బండరాతి గుండె మనిషి ఉక్కు చేతికి వీడిని వదిలి రాలేక నా వెంటే తెచ్చేసుకున్నాను. రెండవమాట, నేనూ ఏనాడూ ఎవ్వరి మాటా వినలేదు. ఇప్పుడూ నా మాటే నేను చేస్తున్నాను. తాతలకాలంలో పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవటం కోసం నేనెంత కష్టపడ్డానో భగవంతుడికి ఎరుక. నా రక్తంలోనూ ఓ జమీందారున్నాడని తెలుసుకో."
          నేను విస్తుపాటుతో చూశాను. అతను చాలాసేపు మౌనంగ ఉండిపోయాడు. బహుశ లోపల గతం తాలూకు నాడీ ఏదో కొట్టుకోవటం ప్రారంభించినట్టుంది.

No comments:

Post a Comment