Friday, 11 November 2016

1. ఒక ప్రతీకారం, ఒక ప్రాయశ్చిత్తం-6



6
తర్వాత నాలుగేళ్ళకు-

          సిద్ధాంత్ కళ్ళు దెబ్బ తినవు. సందేహం లేదు. ఆమె తను అనుకుంటున్న వ్యక్తే. కాస్త దూరంలో నిలబడి బస్ కోసం ఎదురుచూస్తోంది. బండి ఏమైందో పాపం..? సిద్ధాంత్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళి మరీ ఆమెను పలకరించేంత కష్టం పడే అవసరం లేదనుకుని, తన కార్ దిగి నేరుగ స్కూల్ లోకి వెళిపోయాడు. అప్పుడే అటు చూసిన ఆమెకు సిద్ధాంత్ ఆ స్కూలులోకి వెళ్ళటం కనిపించి, సిద్ధాంత్ తనను చూడకుండ వెళ్ళాడో, లేక చూసి కూడా పట్టించుకోకుండ వెళ్ళాడో, లేక గుర్తు పట్టలేదో అర్థం కాక గబగబా రోడ్ క్రాస్ చేసేసి అతని కార్ వద్దకు వెళ్ళింది. ఎటువంటి అభిమానాలూ పెట్టుకునే స్థితిలో ఆమె లేదు. నాలుగేళ్ళ గతమంతా గుర్తుకు రాసాగింది. ఒక్కొక్క సంఘటన.. అదంతా ఆమెను కలచివేయసాగింది. కష్టం మీద తనను తాను అదుపు చేసుకుంటూ వేచి చూడసాగింది.
          పది నిముషాలాగి సిద్ధాంత్ తిరిగి వచ్చేసిరికి ఆమె అక్కడే కనిపించింది. నల్ల కళ్ళజోడు తీసి ఆమె వంక ఆశ్చర్యంగ చూశాడు. అంటే అన్నాళ్ళకు చూస్తున్నందుకు కాదు, ఆ విధంగ చూస్తున్నందుకు..! ఆ ముఖంలో దర్పం లేదు, చులకన భావం లేదు, నిర్లక్ష్యం లేదు, అవహేళన లేదు. దాని స్థానే తనతో మాట్లాడాలనే ఆకాంక్ష ఉంది, మనిషి, మాట అంటే విలువ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. దానికి సాక్ష్యం, అదివరకు పలకరించటానికి కూడా ఫోజులు కొట్టిన పిల్ల ఇవాళ రోడ్ క్రాస్ చేసి మరీ మాట్లాడటానికి రావటమే. కట్టు, బొట్టు కూడా చాలా మారింది. ‘ఊఁ, చాలానే మార్పు వచ్చిందే.’ అనుకున్నాడు సిద్ధాంత్.
          "హాయ్.. బాగున్నారా..? గుర్తుపట్టారా..?" అడిగిందామె.
          "న్..నిషితా.." అన్నాడతను కలిగినదానికన్నా ఇంకా ఎక్కువ అపనమ్మకం కనబరుస్తూ.
          "హమ్మయ్య.. గుర్తున్నాను.. బ్రతికించారు.. బాగున్నారా?" అడిగిందామె అతనిని పరికిస్తూ.
          నిషితా, సిద్ధాంత్ ఆమె ఇంటీరియర్ డిజైనర్, తను మాడల్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ గ ఆ కంపెనీలో పని చేశాక తరువాత ఆ కంపెనీ మూత పడి ఎటువారటు వెళిపోయాక పరస్పరం ఎటువంటి కాంటాక్టులో లేరు. ఆ అధికారిణి తర్వాత తన భర్తతో కలిసి వేరే గార్మెంట్ డిజైనింగ్ కంపెనీ పెట్టుకుని పెద్ద పెద్ద కంపెనీల సరసన అగ్రభాగంలో నిలిచింది. కానీ పాతవారెవరికీ అవకాశాలివ్వలేదు. పరస్పరం కలుసుకున్నాక ఇద్దరి మనసులలో ఒకేసారి ఆ గతం అంతా మెదిలింది.
          ప్రస్తుతం సిద్ధాంత్ ని ఏం చేస్తున్నావని అడిగిందామె. సొంత కాంట్రాక్టులు తీసుకుని పని చేస్తున్నానని చెప్పాడతను. ఫర్నిచర్ షోరూమ్ కూడా ఉందిట. ఈ స్కూల్ వాళ్ళు బెంచీలు, ఇంక వేరే ఆఫీస్ ఫర్నిచర్ ఆర్డర్ ఇస్తే డిజైన్స్ ఫైనల్ చేసుకోవటానికి వచ్చాడట. ఆ స్కూలు ఇంతకు క్రితమే నిషితా క్రాఫ్ట్ టీచింగ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చి వస్తున్నదే. అతను చూపిన అన్ని డిజైన్స్ అప్రూవ్ అయినట్టేనట. అది విని నిషితా ముఖం పాలిపోయింది. సాధారణ పలకరింపులు అయినాక, దిగులుతో మరింత వాడిపోతున్న నిషితా ముఖం చూసి, తను ఏం చేస్తోందో కనుక్కున్నాడు సిద్ధాంత్.
          "మీరు కాబట్టి ధైర్యంగ సొంత వ్యాపారం పెట్టుకున్నారు. నా దగ్గర అంత ధైర్యం లేదు. అందుకే పని కోసం చూస్తున్నాను." అంది నిషితా.
          "ఏఁ.. లాల్ ఎండ్ లాల్ వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్ పోస్ట్ ఏమైంది..?"
          "అది.. అది.. అప్పుడే పోయింది."
          "ఎందుకు..?" చాలా ఆశ్చర్యం నటించాడు సిద్ధాంత్.
          "అంటే, ఇక్కడంటే మేడమ్ ప్రోత్సాహం ఉండేది. అక్కడ అట్ల బాకింగ్ ఇచ్చేవారెవరూ లేరు కదా.."
          అంటే, తేటతెల్లగ ఒప్పుకున్నట్టే కదా, ఆమెలో అక్కడ పని చేయగలిగేటంత ప్రతిభ లేదనేదే నిజమని.., అధికారిణే ఆమెను ఎత్తుకు లేపేదని.., కావాలని ప్రార్థిత్ కి అన్యాయం చేసి ఆమెకు అవకాశాలు ఇచ్చేదని...!!
          "అప్పుడు మీ ఆంటీ కొత్త కంపెనీలో నీకు భాగం ఇస్తోందేమోనని మేమంతా అనుకున్నాం.." అన్నాడు సిద్ధాంత్ ఆమెను పరికిస్తూ.
          "లేదు. ఆంటీ లేదు, ఏమీ లేదు. ఏదో ఎప్పుడో మా అమ్మకు కాలేజిలో కాస్త పరిచయం, అంతే. ఏదో, మా అమ్మ దగ్గర ఎప్పుడో చేబదులు తీసుకుని అప్పు తీర్చలేకపోయిందిట. అది వడ్డీతో సహా తీర్చుకోవటానికి తన ఇంట్లో చోటిచ్చింది. అదీ ఎన్నాళ్ళు? తరువాత కొత్త కెంపెనీ చూడటానికి వెళ్ళి, కలిసి నాకు ఏ ఆఫర్ లూ రావటం లేదని నోరు విప్పి చెప్పినా పది సార్లు తిప్పించుకుందే కానీ కనీసం చిన్న పోస్ట్ కూడా ఇచ్చింది కాదు. నాకు గార్మెంట్ డిజైనింగ్ లో కూడా డిగ్రీ డిప్లమాలున్నాయి అన్నా పట్టించుకోలేదు. అక్కడ వేరెవరో దొరికారామెకు. ఆమెకు ఎప్పుడూ కొత్త వాళ్ళు కావాలి. అది వరకు నాతో చేసినట్టే ఇప్పుడు వారితో.." నిషితా తల వాలిపోయింది.
          సిద్ధాంత్ ఒక వైపు జాలి, మరొక వైపు 'బాగైంది, తిక్క కుదిరింది' అనే భావన కలుగుతుంటే, ఏం మాట్లాడకుండ "అయ్యో.." అని మాత్రం అని ఊరుకున్నాడు.
          "నాకు ఈ పోటీ ప్రపంచంలో ఒంటరిగ నిలవగలిగే సత్తా లేదని ఆలస్యంగ తెలిసింది. వేరే ఏదైనా ఎకాడెమిక్ లైన్ లో వెళిపోయి ఉంటే బాగుండేది.. అని చాలాసార్లు అనుకున్నాను."
          ఆమెను గమనిస్తూన్నా కొద్దీ సిద్ధాంత్ కి చాలా చాలా విచిత్రంగ అనిపించింది. ఆమె నోటితో ఆమే తన లోపాన్ని ఒప్పుకుంటోంది. అసలు తను ఈ లైన్ కే పనికిరానని బాహాటంగ ఒప్పేసుకుంది. సిద్దాంత్ కాసేపు మాటలు రానివాడిలా ఆమెను చూస్తూండిపోయాడు. కాలం, మారిన తీరు రెండూ ఆ దూరానికి దోహదం చేస్తున్నాయి. ఆమె మాటలో జోరు తగ్గింది. చూపుల్లో హుషారు లేదు. దీనంగ, బాధగ, ఏదో పోగొట్టుకున్నదానిలా, దేనికోసమో ఎదురు చూస్తున్నదానిలా, నిరాశగా, నిస్పృహగా.. అబ్బ...!! అతనికి జీర్ణం కాలేదెంతకీ. వాచ్ చూసుకుంటూ ‘అట్లగా’ అన్నట్టు తల ఊపాడు.
          "మీరేదైనా పనిలో బిజీగ ఉన్నారేమో. సారీ.." సిద్ధాంత్ ఏం మాట్లాడకుండ పెద్దగ తనంటే ఆసక్తి చూపకుండ ఎటో చూస్తుండేసరికి నిషితాకి బాధ వేసింది.
          "లేదు, పని అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళటమే." అన్నాడు కార్ లాక్ తెరిచి తలుపు తీస్తూ.
          నిషితాకు కళ్ళలో నీరుబికింది. పక్కకు జరిగింది. "సరే, బై.." అంటూ కదిలింది.
          "ఒక్క నిముషం.." ఆమె అటు తిరిగి వెళిపోతూ కళ్ళు తుడుచుకోవటం గమనించిన సిద్ధాంత్ మనసు కరిగి, "ఎక్కడికి వెళ్తున్నారు.? అంటే ఎక్కడైనా డ్రాప్ చేయాలా..?" అన్నాడు.
          నిషితా ఆగి, వెనక్కు తిరిగి, "ఫరవాలేదు.. వెళిపోతాలే.." అంది బస్ స్టాండ్ వైపు అడుగులు వేస్తూ.
          "నిషా.." పిలిచాడు సిద్ధాంత్. నిషితా ఇంక ఆగలేకపోయింది. భోరుమని ఏడ్చేసింది. సిద్ధాంత్ కంగారుగ ఎవరైనా చూసేస్తే అపార్థాలు జరిగిపోతాయని, ఆమె చేయి పట్టుకుని కార్ లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. కాస్త దూరం పోయాక నిషితా సర్దుకుంది. నెమ్మదిగ ఏం జరిగిందని అడిగితే వివరంగ చెప్పింది.
          సరిగ్గ లాల్ ఎండ్ లాల్ వాళ్ళ ప్రైజ్ మనీ, ఉద్యోగం అందుకున్న దగ్గరి నుంచి ఆమె చెడు దినాలు మొదలైనాయట. అప్పుడే ఇంట్లో చాలా మార్పులు వచ్చాయట. వాళ్ళ అన్నయ్య ఎవరినో వేరే దేశం అమ్మాయిని వివాహం చేసుకుని వచ్చాక దాన్ని అంగీకరించే విషయంలో గొడవలు జరిగి తల్లిదండ్రులు కోపాలు వచ్చి విడిపోయారట. తండ్రి వ్యాపారంలో భాగస్వామ్యం గొడవలు వచ్చి ఆయన రోడ్ మీదకు వస్తే కొడుకు తనను అంగీరించినందుకుగాను ఆయనను ఆదరిస్తున్నాడట. తల్లి అంగీకరించలేదు. కనక ఆమె వేరే ఉంటూ ఏదో సేవాసంస్థలో వాలంటీర్ గ పని చేస్తూ ఎంతో కొంత సంపాదించుకు తింటోందిట. ఇప్పుడు కూతురి కోసం ఎవ్వరి దగ్గరా సమయం లేదట. దగ్గర పెట్టుకునే అవకాశం లేదు. డిజైనింగ్ కోర్సు చదివే విషయంలో గొడవలు జరిగి ఇదివరకే తను వారికి దూరమైందిట. వాళ్ళు ఏదైనా టెక్నికల్ కోర్సు చదవమంటే కాదని దీనివైపు వచ్చింది అని వాళ్ళకు కోపమట. ఇంక ఆదరణ కాదు కదా, కనీసం పలకరింపు కూడా ఉండే అవకాశం లేదట. ఉద్యోగం పోయిన తరువాత అసలే విలువ లేకుండా అయిందిట.
          "అరెరే.. మరి పెళ్ళి.. అంటే... అది.. ఇంట్లోవాళ్ళ బాద్యత.." సిద్దాంత్ ఎట్ల అడగాలో తెలియక ఆగిపోయాడు.
          "వాళ్ళు ఏమీ చేయరింక. చేతులు దులుపుకున్నట్లే. మా ఇళ్ళలో అంతే. ఎప్పుడూ పెద్దగా ఫామిలీ బాండింగ్స్ లేవు. అమ్మ చాలా ఆధునికమైన మనిషి. వదిలేశారంటే పూర్తిగ వదిలేశారని అర్థం. ఇంక నా పెళ్ళి నేనే చేసుకోవాలి. ప్రయత్నించాను కానీ కనీసం సరైన ఉద్యోగం లేనిదే ఎవ్వరూ ముందుకు రావటం లేదు."
          సిద్దాంత్ ఆలోచిస్తూండిపోయాడు ఆ మాటకు. ఎంతటి దుస్థితి..!! ఆమెది అత్యాధునిక కుటుంబం అని తెలుసు కానీ మరీ ఇంత అని తెలియదు. మరీ కడుపున పుట్టిన కూతురిని కూడా గాలికి వదిలేసే తల్లిదండ్రులు ఉంటారా..? నిషితా పాలిపోయిన ముఖమే అందుకు నిలువెత్తు సాక్ష్యం.
          నిషితాకి మనసులో అడగాలా వద్దా అని పీకుతుంటే ఆపుకోలేక, చివరకు "మీ ఫ్రెండ్ బాగున్నాడా..?" అని అడిగింది.
          సిద్ధాంత్ ఆమె వంక కోపంగ చూసి, తర్వాత ఆమె కళ్ళలోని దైన్యానికి కోపం కరిగిపోతుంటే, అయిష్టంగ, "ఏమో, తెలియదు. కాంటాక్టులో లేడు.." అన్నాడు.
          అదేంటి అన్నట్టు చూసింది నిషితా. సిద్ధాంత్ ఏం చెప్పటానికి ఇష్టపడటం లేదని ఆమెకు అర్థమైంది. తను చేసిందేమీ తక్కువ నిర్వాకమా..? అతనికి చేసిన అన్యాయం ఏం చిన్నదా..?
          "సారీ.. నా వల్ల.. తను.." అని ఏం చెప్పాలో తోచక మాటలకోసం వెతుక్కుంది. "నిజానికి నేను కావాలని చేయలేదు. అధికారిణియే నేను వద్దంటున్నా, మంచి అవకాశం అని చెప్పి... నన్ను ప్రోత్సహించి, నా చేత బలవంతంగ.. చేయించింది.. ప్రార్థిత్ మీద ఆమెకు... ఏదో.."
          సిద్దాంత్ కి అది విని కడుపు మండింది. "..అదంతా వదిలేసేయండి. ఎవరేం చేయిస్తే ఏంటి..? గతం మారదు కదా." అన్నాడు.
          "అది.. ఈ మాట ప్రార్థిత్ తో చెప్పాలని.. చాలాసార్లు.. ప్రయత్నించాను.. కానీ.." నిషితాకు మాట సులువుగా పెగలలేదు.
          సిద్ధాంత్ అసహనం హెచ్చింది. "ఇప్పుడు ఇక్కడ లేనివాడి గురించి ఎందుకు మాటలు..? వదిలేసేయండి. ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడా..? నన్ను ఎక్కడ దింపమన్నారు..?"
          ఆమె దెబ్బతిన్నట్టు చూసి, చోటు పేరు చెప్పి, "లేడీస్ హాస్టల్ లో ఉన్నాను." అని చెప్పింది. 'అక్కడా ఖాళీ చేసేయమని గొడవ చేస్తున్నారు.' అనే మాటలు నోట్లోనే ఆగిపోయాయి.
          "జీవిక ఎట్ల గడుస్తోంది మరి..?"
          "ప్రస్తుతం ఏం ఆధారం లేదు. చాలా ప్రయత్నిస్తున్నాను. ఎక్కడా క్లిక్ కావట్లేదు. అన్నీ టెంపరరీయే. నాలుగు నెలలు, ఐదు నెలలు. మళ్ళీ వెతుక్కోవటం. అంతే." అని ఆగి, "మీ భార్య బాగుందా..? పిల్లలా?" అని అడిగింది.
          "ఊఁ.. ఇద్దరు పిల్లలు. బాబుకు మూడేళ్ళు. పాప క్రితం ఏడాదే పుట్టింది. రెండు నెలలు తక్కువ సంవత్సరం."
          నిషితా ఓహో అన్నట్టు చూసి ఊరుకుంది. అంతలోకి తను దిగాల్సిన చోటు వచ్చేసింది. నిషితా అక్కడ కార్ ఆపించుకుని దిగిపోయి, థాంక్స్ అని చెప్పి, ఇంకేం మాట్లాడే ఆస్కారం అతను ఇవ్వకుండ వెళిపోయేసరికి, మౌనంగ తన గది వైపు అడుగులు వేసింది.
          సిద్ధాంత్ ఆనాటి మీటింగులన్నీ కాన్సిల్ చేసేసుకుని ఇంటికి చేరాక ఆమె గురించి ఆలోచిస్తూండిపోయాడు. అప్పట్లో జరిగిన సంఘటనలన్నీ గుర్తుకు రాసాగాయి. మనసంతా పట్టు తప్పి చిరాకు, కోపం కలగసాగాయి. త్వరగా తిని ఆలోచిస్తూనే పడుకున్నాడు.
          అప్పట్లో ఆమె ప్రార్థిత్ తో అట్ల చేయటానికి వెనక కారణం తమ అధికారిణి ప్రోత్సాహం అనేమాట అతనికి అరగలేదు. ఎంత నిర్లజ్జత..! ప్రార్థిత్ కంపెనీ పెట్టిన కొత్తలోనే జాయిన్ అయిన మొదటి బాచ్ ఉద్యోగి. అతడితో ఎంత పని తీసుకుందో..! వేరే వేరే వాళ్ళైతే, పని విలువ తెలిసినవారు, ఏ మాత్రం మనసున్నవారైతే అటువంటి వాడికి పార్ట్ నర్ షిప్ ఇచ్చి దగ్గర పెట్టుకుంటారు. ఆమె కాబట్టి అట్ల ప్రవర్తించింది. ఎంత కృతఘ్నత..!! ప్రార్థిత్ కి ఉన్న ప్రతిభకు ఎక్కడైనా రాణించేవాడు. కానీ ఏదో మొదటి రోజు నుంచీ ఈ కంపెనీలోనే ఉన్నా కదా.. అనే మంచితనం వల్ల, ఒక మమకారం వల్ల ఎదగకుండా ఆగిపోయాడు. ఎదుగుదలను అతడెప్పుడూ డబ్బు, హోదాలు, గుర్తింపు రూపంలో చూడలేదు. పని అంటే ప్రాణం పెడతాడు. అది ఉంటే చాలు, ఎదురు డబ్బిచ్చి కూడా చేసుకుపోగల రకం. అది చూసుకుని ఎంత ఆడించాలో అంత ఆడించింది. ఎంత తిప్పలు పెట్టిందో..! 'అక్కడకు పో, ఇక్కడకు పో, వారి పని చూడు, వీరి ప్రాజెక్టేమైంది..? అంత లేటా, ఇంత పొగరా?' అంటూ ప్రతీదానికి ఆమె సాగదీస్తూన్నా, వాళ్ళ నాన్న రిసర్చ్ కోసం కష్టపడే సమయంలో వేరే ఆలోచించే ఓపిక లేక, ‘ఉన్నదేదో ఉందిలే’ అనుకుని, ‘ఎక్కడైనా ఈ బాసులతో ఉండ గోలే కదా’ అనుకుని ఇక్కడే ఉండిపోయాడు. వాడికి మాటన్నా, మనిషన్నా విలువ ఎక్కువ. మనిషి, నమ్మకం, విలువలు అని ఈ భూమి మీద ఈ మొత్తం చరాచర జగత్తులో మాట్లాడే అతికొద్ది మందిలో వాడూ ఒక్కడు.
          సిద్ధాంత్ కి తాను అనవసరంగ నిషితాను అపార్థం చేసుకున్నానే అనిపించింది. ఈ చర్య వెనక అధికారిణి చేయి ఉంటుంది అంటే పోటీ నిర్ణయాన్ని మార్చేయటమని, అందులో అవకాశం లేదనే అనుకున్నాడు కానీ, ఇట్ల ప్రార్థిత్ దుర్దశను దుర్వినియోగం చేసుకోమని ప్రోత్సహిస్తుందనుకోలేదు. అసలు అప్పుడే తనకు ఆమె మీద అనుమానం రావాల్సింది. అంత డబ్బు మనిషి ప్రార్థిత్ కి హాస్పిటల్ లో సీరియస్ గ ఉన్నప్పుడు లాంగ్ లీవ్ అడిగినప్పుడే ఉద్యోగంలో నుంచి తీసేయవలసింది. తీసేయలేదంటే ఏదో ప్లాన్ తో ఉందని ఊహించాల్సింది. ఛ..!! ఎదటి మనిషి మనసులో దాగి ఉన్న భావాలు చదవగలిగితే ఎంత బాగుండేదో..! ఈ మాటకు, ప్రార్థిత్ ఉంటే, ‘అప్పుడు అందరి చెత్తా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంటే ఈ లోకంలో ప్రశాంతంగ జీవించటం ఇంకా దుర్భరంగ ఉండేదేమో.’ అనేవాడు.
          ఆ క్షణం ఆ అధికారిణిని తాను వెంటనే ఏమైనా చేయగలిగితే బాగుండు అనిపించింది అతనికి. ఇప్పుడు ఈ భావం ప్రార్థిత్ తో అంటే, ‘ఆమె చేసినదానికి ఇవాళ కాకపోతే రేపు అనుభవిస్తుంది. మనం చేసిన మంచి మనను కాపాడుతుంది. ఆమె చేసిన చెడు ఆమెను ముంచుతుంది.. ప్రకృతి నియమం..’ అని ఉండేవాడు.
          సిద్ధాంత్ కి ప్రార్థిత్ గుర్తుకు వచ్చినా కొద్దీ లోపల ఒకలాంటి బాధ ఎక్కువైంది. ఎక్కడ ఉన్నాడో, ఎట్ల ఉన్నాడో..!! ఏం చేస్తున్నాడో..! మరీ పూర్తిగ వదిలేశాడు. మాట్లాడదామంటే ఫోన్ నెంబరేమో మార్చేసుకున్నాడు. ఇవ్వలేదు. మెయిల్ ఐడీ కూడా పంపలేదు కనీసం. వెళదామంటే ఇల్లేమో తెలియదు. కష్టపడి అతడిని ఎట్లగో మనసు లోనుండి మరుపు తెప్పించుకున్నాడు. ఇవాళ ఆ దెయ్యం కలిసేసరికి మళ్ళీ తిరగదోడినట్లైంది. ఇంక నిద్ర పట్టేటట్టు లేదని మంచం వదిలి లేచాడు. బయట కాసేపు తిరిగాడు. గాలిలో ఏమాత్రం చల్లదనం లేదు. వేడిశెగలు కొడుతోంది. తల్లిదండ్రులు, భార్యా, పిల్లలూ హాయిగ నిద్రలో తేలుతున్నారు. ఇంక ఏమీ తోచక లోపలకు వచ్చి టీవీ పెట్టాడు. చాలాసేపు అటూ ఇటూ ఛానెళ్ళు మారుస్తూ ఒక చోట ఏదో రిసర్చ్ కార్యక్రమం వస్తుంటే ఠక్కున ఆగిపోయాడు. ఆ ఇంటర్వ్యూ ఇస్తున్నది సింహానే కదూ..!!
          ఆ మరునాడు ఉదయమే సిద్ధాంత్ నిషితా ఉన్న హాస్టల్ వైపు కార్ పోనించాడు. రాత్రి అతనికి నిషితా కన్నీరు గుర్తుకు వచ్చి తన ప్రవర్తన మీద తనకే అసహ్యం వేసింది. ఆమె పరిస్థితేంటో పూర్తిగ కనుక్కోవాలి. ఆ మార్పుకు కారణం ఏంటో తెలుసుకోవాలి. ఒక మనిషి మనను సహాయం అర్థించకపోయినా, తెలిసినవారు అవసరంలో ఉన్నారనిపిస్తే తప్పక సహాయం చేయాలని అతని తండ్రి ఎప్పుడూ చెప్తాడు. అదే మాట అనుకుంటూ ఆమె హాస్టల్ చేరాడతను. కానీ అక్కడి దృశ్యం చూసేసరికి అతనికి ఎవరో గుండెలో గుచ్చినట్టైంది. ఆమె డబ్బు కట్టలేకపోతోందని హాస్టల్ వాళ్ళు ఆమెను వెళిపోమంటుంటే దయచేసి ఇంకాస్త సమయం ఇవ్వమని ప్రార్థిస్తోంది. అంతలోకి తనకోసం అతను ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. ఆమె అతనిని చూస్తూనే కళ్ళనీళ్ళ పర్యంతమైంది. సిద్ధాంత్ వెంటనే ఎంత డబ్బు కనుక్కుని, తన పర్సులో నుంచి డబ్బు తీసి ఆమె పేర కట్టాడు.
          నిషితా చాలా బాధగ, సంకోచంగ ‘అదేం వద్ద’ని వారించింది. సిద్ధాంత్ వినలేదు.
          "మీరెవరు..?" అడిగాడు ఆఫీస్ గదిలో ఉద్యోగి.
          "ఆమె అన్నను. దూరం చుట్టరికం.." అని చెప్పాడు సిద్ధాంత్.
          నిషితా నిండి వచ్చిన కళ్ళలోంచి జాలువారిన కన్నీటిని దాచుకొనే వృథాప్రయత్నం చేసింది. సిద్ధాంత్ కూడా ఆమె దుస్థితికి బాధ అనిపిస్తుంటే ఆఫీస్ అతనితో, "చూడండి, ఇంకొక ఆరునెలల ఖర్చు నేను ముందుగానే ఇస్తున్నాను. ఆమెను వెళ్ళమని ఒత్తిడి చేయకండి. అన్యాయంగ పంపేయకండి. ఎక్కడికి పోతుంది..? అదే స్థానంలో మీ తోబుట్టువు ఉంటే ఇట్లగే చేస్తారా చెప్పండి..?" అని మందలించి అదనపు డబ్బ కట్టేశాడు. నిషితా "నాకు ఉద్యోగం రాంగనే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాన"ని మాట ఇచ్చింది. అదేం ఫరవాలేదని చెప్పి, నిషితాను మాట్లాడాలని బయటకు పిలిచాడు. నిషితా రాబోతుంటే, ఆఫీస్ అతను, ఆమెతో, "మేడమ్.. టిఫిన్ తిని వెళ్ళండి.." అన్నాడు.
          సిద్ధాంత్ కోపంగ అతని వంక చూసి, "డబ్బు కట్టలేదని ఆమెను కనీసం టిఫిన్ కూడా తిననివ్వటం లేదా..? ఛి.. ఎంత హీనులు..!!" అని నిషితాతో, "ఈ పూటకు మన ఇంటికి రామ్మా.." అని పిలిచి తీసుకుని వెళ్ళాడు.
          నిషితా అతని వెంట వెళ్ళింది. సిద్ధాంత్ ఇల్లు చాలా పెద్దది. రెండంతస్తులు ఉంటుంది. వైభవంగ ఉంది. అతని భార్య చాలా మంచిది. ఆమెను ఎంతో ఆదరించింది. కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టారు. ఆ పూటంతా నిషితా కళ్ళు తడి ఆరనే లేదు. చాలాకాలానికి దొరికింది ఆమెకు ఈ ఆదరణ. సిద్ధాంత్ పిల్లలు ఆమెను ‘అత్తా’ అంటూ సంబోధిస్తే ఆమెకు చాలా ముచ్చటేసింది. ఆ సాయింత్రం వరకు అంతా కలిసే గడిపారు. పని చూసుకునేవాళ్ళు వేరే ఉన్నారని సిద్ధాంత్ ఆ పూట షాప్ కి కూడా వెళ్ళలేదు.
          "మీ మనసులో నాకోసం ఇంత ఆదరణ ఉందని నాకు తెలియదు.." అంది నిషితా చివరకు వచ్చేసేటప్పుడు ఉండబట్టలేక.
          "ఎవరి మనసుల్లో ఏముంటాయో అన్నీ కళ్ళకు కనిపించవు కదా.." అన్నాడు సిద్ధాంత్ నవ్వి.
          తర్వాత అతను తనే ఏదైనా వ్యవస్థ చూస్తానని ఆమెకు ధైర్యం చెప్పాడు. నిషితా రెండు చేతులు జోడించి అతనికి నమస్కరించింది. 'ఇది ఏ జన్మ బంధమో..' అనుకుంది మనసులో.
          ఆ మరునాడే సిద్ధాంత్ ఆమెకు ఒక అవకాశం చూపించాడు- "నువ్వు దరకాస్తు పెట్టిన స్కూలులో ఆర్ట్ టీచర్ గా ఇప్పించమంటావా..?" అని అడిగాడు.
          "అది కుదురుతుందా.. నిజంగానా..?" ఆశగా అడిగింది నిషితా. ఆమెకు ఆ స్కూల్ చాలా నచ్చింది.
          "ఊఁ. నిన్ననే మాట్లాడాను ఆయనతో. సరేనన్నాడు. ఈ మధ్య ఆ బెంచీల డిజైనింగ్ ప్రాజెక్ట్ తో ప్రిన్సిపాల్ కాస్త స్నేహంలో దగ్గరైనాడులే. ప్రయత్నిస్తే పనైంది. నువ్వు ఆ స్కూలుకు వెళ్ళి ప్రిన్సిపాలుకు కనపడు. నేను ఫోన్ చేసి నీ గురించి మళ్ళీ కూడా చెప్తాను. సరేనా..?"
          నిషితా సరేనంది. అనుకున్న ప్రకారమే స్కూలులో మాట్లాడి ఉద్యోగం ఖాయం చేసుకుంది. అంతకు ముందు వెళితే మొహం కూడా సరిగ్గ చూడని ప్రిన్సిపాల్ సిద్ధాంత్ పేరు వింటూనే చాలా ఆదరంగ మాట్లాడటమే కాక, సిద్దాంత్ ఎట్ల తెలుసు, ఎంత తెలుసు అంటూ వివరాలడిగాడు. తనను చెల్లెలిలాగ చూసుకుంటాడని చెప్తే వెంటనే ఉద్యోగం ఖాయం చేసేశాడు. అతనికి మొదటి నుంచీ మాట చాతుర్యం, మంచితనం ఉంది. ఫరవాలేదు, సిద్ధాంత్ నాలుగేళ్ళలో మంచి స్థాయినే సంపాదించాడు, అనుకుంది.

No comments:

Post a Comment