ఒకరోజు అకస్మాత్తుగ తనకు తానే, "వాళ్ళ
అన్నయ్యకు బాలేదంట. తీసుకెళ్ళి తీసుకురండి." అని ఇద్దరిని ఎవరినో తోడు ఇచ్చి
జీపులో పంపించాడు. హమ్మయ్య, అనుకుని చాలా ఆశగ పరుగున వెళ్ళాను ఇంటికి, రెండేళ్ళ
తర్వాత. అన్నయ్య నన్ను చూస్తూనే లేచి కూర్చున్నాడు. చాలా ఆనందంగ నన్ను
పలకరించాలనుకున్నాడు. ఇద్దరికీ మాటలు రాలేదు. నేను ఆయనను కళ్ళారా చూసుకున్నాను. చేతులారా
ఆయన తల నిమిరాను. మనసు విప్పి చాలాసేపు మాట్లాడుకున్నాను. నేనక్కడ బాగనే ఉన్నానని
ఆశ్వస్తపరిచాను. మా ఇంటి పనివారు, ఉద్యోగులు, చుట్టుపక్కలవారూ అంతా వచ్చారు నన్ను
చూసేందుకు. వాళ్ళంతా అన్నయ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వేళకు మందులు
ఇప్పిస్తున్నారు. వ్యవహారాలు చూసుకుంటున్నారు. వాళ్ళతో గడిపి అంతా మాట్లాడాక నాకు
చాలా తేలికగ అనిపించింది.
కానీ తీరా తిరిగి వెళ్ళాల్సిన సమయానికి
వాళ్ళంతా నన్ను ఆపేశారు. అన్నయ్య కూడా ఆగిపోకూడదా అన్నట్టు చూశాడు. ఎట్ల
తీసుకుపోతాడో మేమూ చూస్తాం అన్నారంతా గొప్పగా.
"అతని పట్టుదలా, బలం మీకు తెలుసు. ఆ
రోజు మీరంతా ఉండి ఏమీ చేయలేకపోయారు. ఇవాళా అదే జరుగుతుంది. కనీసం నాకు మరొకసారి
అన్నయ్యను చూడటానికి అవకాశం కూడా దొరకదు. ఇంకెప్పుడూ అతను నన్ను నమ్మడు."
అన్నాను.
అందరూ అతన్ని కసిగా తిట్టారు. వాడు
పురుగులు పడి ఛస్తాడు.. అదీ ఇదీ అని.
నేను అసహనంగ, "ఆపండి. అతనిని
ఎందుకు తిడతారు..? అతనేం తప్పు చేశాడని..?" అనడిగాను.
"చేయని తప్పుకు నిన్నెందుకు
శిక్షిస్తున్నాడు..?" అన్నారు వాళ్ళు.
"అన్నయ్య వాళ్ళక్కను
హింసించినదానికి అతనికి బాధేయదా?"
"అప్పుడు నన్ను శిక్షించాలి.. నిన్నెందుకు..?"
అన్నాడన్నయ్య.
"అతనూ అదే చేస్తున్నాడు.. ఇంతకన్నా
వేరే హింస నీకేం ఉంటుంది..?" అన్నాను.
అన్నయ్య తల వంచుకున్నాడు.
"కడుపు మండిన వాడెవరైనా ఇదే
చేసేవాడు. నువ్వేం బాధపడకు. ఎవరు శిక్ష అనుభవిస్తేనేం..? నీ పాపం పరిహారమైతే అదే
చాలు." అనేసి నేను వారందరి ఎదుటా వెళ్ళి జీపు ఎక్కేశాను. అది బుర్రున అతని
ఇంటి వైపుకేసి కదిలింది. నా ఆలోచనలు పట్టు తప్పాయి.
నాకు అన్నయ్య పరిస్థితి తలుచుకుని ఏడుపు
వచ్చింది. అంత డబ్బుంది.. హోదా ఉంది.. ఏంలాభం..? మనశ్శాంతే లేదు. మనసును కాదని ఏం
చేయగలడు..? ఎక్కడికి పోగలడు..? చేసిన తప్పులు ఒక వైపు పీడా కలిగిస్తుండగానే,
ఇప్పుడు నేను పడే బాధ మరొక శిక్ష ఆయనకు.
నా ఆలోచనలలో నేనుండి జీప్ ఎటు పోతోందో
చూసుకోలేదు. నా దృష్టి దారి మీదకు పోయేసరికి అదెక్కడో ఏంటో నాకేం అర్థంకాలేదు. ఆ
ఇద్దరూ నా మీద దురుద్దేశంతో ఉన్నారని మాత్రం వారి కదలికలతో అర్థమైంది పూర్తిగా.
భగవంతుణ్ణి నమ్ముకున్నదాన్ని. ఎవరికీ
తెలిసి అన్యాయం చేసి ఎరగను. రక్షింపబడే యోగం ఉంటే వాడే కాపాడతాడు. దుఃఖంతో, ఉన్న
కొద్ది చేవ కూడా నీరైపోయింది. వాళ్ళు జీప్ దింపి నన్ను ఎటో పట్టుకుపోతున్నా నేను
ప్రతిఘటించటం లేదు. జీవితంలో ఇంత బాధలు చూశాక ఎటుపోతే ఏంటి అన్నంత నిర్లిప్తత
వచ్చేసింది. ప్రార్థన మాత్రం చేసుకున్నాను.. "ఆపద్భాంధవా.. తండ్రీ.. కాపాడు
నాయనా.." అని.
అంతలో బలంగ ఏదో తగిలి ఎడం వైపు వాడు
పక్కకు పడ్డాడు. క్షణంలో కుడివైపు వాడూ పడ్డాడు. ఏంటా అని చూస్తే అతనే!!!
ఎదురుగా.. దుడ్డు కర్ర ఒకటి పట్టుకుని క్రోధంతో ఊగిపోతూన్నాడు..!! నన్ను
పట్టుకుపోతున్న ఆ ఇద్దరూ పట్టుబడ్డందుకు బెదురుగ, భయంగ ఏం చేయాలో తోచక
చూస్తున్నారు.
"ఎన్నిసార్లు చెప్పాను, ఇటువంటి
ప్రయత్నాలేం చేయద్దని..! ఇంకొకసారి ఎస్టేట్ వైపొస్తే ప్రాణాలు దక్కవు..
జాగ్రత్త..!!" అని గర్జించాడు. పట్టుకుని నాలుగు ఉతికాడు ఆవేశంగ.
తర్వాత వాళ్ళిద్దరూ ఎటు మాయమైపోయారో
తెలియదు. అతను నా వైపైనా చూడకుండ జీప్ వైపు కదిలాడు. అతనిని అనుసరించాను. అతను
స్టీరింగ్ వద్ద కూర్చుని "ఊఁ" అన్నాడు. నేను పక్క సీట్లో ఎక్కి
కూర్చున్నాను. జీపు గర్జించే సింహంలా ముందుకు ఉరికింది.
పాపం, నా కారణంగ వారికి ఉద్యోగాలు
పోయాయి. ఇంతకు ముందు కూడా ఒకరిద్దరు నా వంక తప్పుడు దృష్టితో చూశారని వాళ్ళను పని
లోంచి తీసిపారేశాడతను. రాజన్న ద్వారా ఎప్పటికప్పుడు నాకు ఆ సంగతులు తెలిసేవి. నేను
సహజంగ తీసుకుని వదిలేసేదాన్ని. ఎందుకంటే అది నా సమస్య కాదు. అతని సమస్య. నేను
అక్కడికి కావాలని వచ్చినదాన్ని కాను. అతను తెచ్చాడు. కాబట్టి నా రక్షణ అతని సమస్య.
మనువు ఆ బాధ్యత ఏనాడూ నాకివ్వలేదు. స్వతంత్రంగ నా రక్షణ నేను చూసుకోవాల్సిన
దౌర్భాగ్యం నాకు లేదు.
అతను ఏనాడూ నాలోని ఆడపిల్లవంక చూడలేదు. వేరెవరినీ
కన్నెత్తైనా చూడనివ్వలేదు. ఇంకా పైగా ఎవరైనా నన్ను ఇబ్బంది పెడుతున్నారని రాజన్న
ద్వారా కబురు అందిందో వాడు మరునాడు పనిలో కనిపించేవాడు కాదు. కనక ఒకవైపు పదునున్న
కత్తితో మాత్రమే హింసించాడు. నేనంటే అన్నయ్యకు ప్రాణం. తనకు కావాల్సింది అంతవరకే.
నా స్థానంలో ఎవరైనా అబ్బాయి ఉన్నా అతను ఇదే చేసేవాడు. కనక మనిషిగా, జీవిగా
బాధపడ్డానే కానీ, ఆడమనిషిగా, కన్నెపిల్లగా కాదు. నా దగ్గర నా మానప్రాణం సురక్షితంగ
ఉంది. స్త్రీగా నన్ను కించపరచలేదతను. అందుకే అతనంటే నాకు గౌరవం.
"కనీసం అరవను కూడా అరవలేదెందుకు..?
నోరు లేదా..?" కరుకుగా అడిగాడు.
అతనిని ఈ సంఘటన బాధ పెట్టిందని
అర్థమైంది.
"అరిచినందువల్ల లాభం జరిగేదుంటే
అరవాలి." అన్నాను నిర్మానుష్యంగ ఉన్న ఆ అడవి ప్రాంతం చూసి. అతను గిరుక్కున
తిరిగి చూసి మళ్ళీ జీప్ నడపసాగాడు.
తర్వాత నేను ఏం మాట్లాడకపోయేసరికి
అడిగాడు- "అన్నయ్యకు ఎట్ల ఉంది?"
"ఫరవాలేదు. నన్ను చూశాడుగా.
కోలుకుంటాడులే." అని ఆగి, అతని వంక చూసి చెప్పాను- "అడగకుండనే చూడటానికి
పంపినందుకు థాంక్స్.."
"నువ్వు అడుగుతావేమోనని
ఎదురుచూశాను. ఎప్పటికీ అడగవని అర్థమైంది..! మొదటి నుంచి నీకు అభిమానం ఎక్కువ కదా. తోబుట్టువు
బాధ నాకూ తెలుసు." అని ఆగి, "నాకు
మీ అన్నయ్య మీద ఏ కోపం లేదు. మా అక్కంటే ప్రాణం.. అంతే." అన్నాడు.
"మా అన్నకు కూడా మా అమ్మంటే
ప్రాణం. మీ అక్క మీద ఏ కోపం లేదు.."
స్టీరింగ్ చేతిలో నలిపాడు అసహనంగ. "నిన్ను
బాధపెట్టటం నా ఉద్దేశం కాదు. నీ ద్వారా పని జరుగుతోంది. అంతే."
"ఇప్పుడు దీనివల్ల ఎవరికి న్యాయం
జరుగుతోంది..?"
"ఏదైనా నేను నిన్ను ఇంకో సంవత్సరం
పాటు వదలను. ఇంకా వివరణలెందుకు..?"
"నేనూ గడువు పూర్తయ్యేవరకు
మెంటల్లీ ప్రిపేర్ అయ్యే ఉన్నాను. నువ్వు నన్ను ఎత్తుకొచ్చి ఇదే చేస్తావని నాకు ముందే
తెలుసు.." అన్నాను.
"ఎట్ల తెలుసు..? ఎవరు
చెప్పారు..?"
వాళ్ళ అక్కను బాధపెట్టిన ప్రతీసారి
అన్నయ్య వంక అతను చూసిన చూపులు చెప్పాయి. అతను వర్చస్ ని భుజాన వేసుకుని
వెళ్ళేటప్పుడు చేసిన ప్రతిజ్ఞలో కరకుదనం చెప్పింది. అతను మళ్ళీ తిరిగి
వచ్చినప్పుడు ఆ చేతిలో పట్టు చెప్పింది. అతనిలో ప్రతీకార జ్వాల ఎక్కువ. చిన్నతనం
నుంచీ ఆ గుణం తెలుసు. ఇది చేయకపోతే అతనిని ఆ జ్వాల జన్మజన్మలూ వేటాడి వెంటాడి
హింసిస్తుంది. "ఒకరు చెప్పాలా..? చాణక్యుడి కాలంలో ఉండి ఉంటే నువ్వే
చంద్రగుప్తుడివయ్యేవాడివి." అన్నాను. కాలికి ముల్లు గుచ్చుకుందని ఆ ముళ్ళతీగను
పూర్తిగ పెకిలించి, కాల్చి బూడిద చేసేదాక నిద్రపోలేదతను. అందుకే యావద్భారతాన్ని తన
గుప్పిట్లోకి తీసుకుని ఏలి రారాజైనాడు.
"పూర్వజన్మలో అతనినేనేమో.. నీకు
తెల్సా..?" అని అతను ఆగి, సీరియస్ గ చూస్తూ, "మీ అన్న చేసింది చిన్న
తప్పు కాదు. మూడేళ్ళు..! నరకం చూశాను. నిప్పు రగులుతున్నా దిగమింగుకున్నాను.
ఇవాళ్టి రోజున మీ అన్నయ్య అదే నిప్పులో దహించుకుపోతున్నాడు.."
"అందుకే అరవలేదు. ఇందాక అడిగావుగా..!
అట్ల నేను కాలిపోవటం చూసి మా అన్న పడే యాతనకైనా నీలోని ఆ నిప్పు
చల్లారిపోతుందేమోనని.."
అతను సడన్ బ్రేక్ తో జీప్ ఆపి, లాగి నా
చెంప మీద ఫెడేల్న కొట్టాడు. నాకు చాలా ఆనందం వేసింది.
"ఛి.. రాక్షసి.." అని మాత్రం
అన్నాడు. తర్వాత ఇల్లు చేరేవరకు ఎవరం మాట్లాడలేదు. మనం వేసే శిక్ష ఎదటివాడు
సంతోషంగ ఆహ్వానిస్తే శిక్షకు దాని అర్థమే పోతుంది. అక్కడా అదే జరిగింది. తర్వాత
తెలిసింది- అతను వారిద్దరి మీద అనుమానంతో ఎందుకైనా మంచిదని దారి కాసి ఉన్నాడని.. వారి
కుదృష్టి సమాచారం రాజన్న అతనితో చెప్పాడని. అక్కడ రాజన్న నాకు గార్డియన్ అన్నమాట.
రాజన్న ద్వారా అతను నన్ను సర్వదా కాపాడుతుంటాడు.
అతని బాధ నాకు తెలుసు. తన మనసంతా
అల్లకల్లోలంగ ఉంది. ప్రతీకార జ్వాల ఎవరి గుండెలో ఉంటుందో వాడినే ముందు
నిద్రపోనివ్వదు. నాకు మాత్రం ఏ అలజడీ లేదు. అతని మీద ఏ షికాయితూ లేదు. అతనెట్లగూ
కాలిపోతున్నాడు. మళ్ళీ నేనందుకు కాలటాలూ, కాల్చటాలూ..? అందుకే అతనికి నేనంటే మరింత
కోపం పెరిగింది. నేను తీసుకోకుండ వదిలేసిన నిప్పు అతనినే రెట్టింపు దహిస్తోంది.
గడువు పూర్తి కావటానికి ఇంకా అప్పటికి సంవత్సరం మిగిలి ఉండింది.
అప్పటికి వరం నాకు బాగా దగ్గరైపోయాడు.
అవసరమైతే వాళ్ళ మామను ఎదిరించి నా దగ్గరకు రాగలిగి ఉన్నాడు. అవసరం పడలేదు కనక అతని
పరువు మిగిలి ఉందింకా. అతని ఈసడింపులు, ఎత్తిపొడుపులు, చివాట్లు, తిట్లు యథావిధిగా
సాగుతూనే ఉండేవి. కానీ అవి నా మనసును బాధించటం మానేశాయి. ఎందుకంటే ఇప్పుడు వాటిని
వరం సహించలేకపోతున్నాడు. "ఇదిగో, మామ కనక ఇవి మానకపోతే నేను ఆయనతో మాట్లాడను.."
అనే స్థాయికి వచ్చాడు. నేను వారించేదాన్ని కనక వాడు ఆగుతున్నాడు..! ఇంక నేను
వాడికి నిర్భయంగ, వాడు అన్నయ్యను తప్పు పట్టకుండా గతం గురించి చెప్పగలనని నాకు
నమ్మకం కుదిరింది. అన్నయ్య కాస్తైనా కోలుకుంటే వాడిని నేరుగ తీసుకుపోయి చూపించాలని
తపన పడుతున్నాను. సరైన అవకాశం కోసం వేచి ఉన్నాను. కానీ నాకు ఆ అవకాశం దొరకకుండానే,
అన్నయ్య కోలుకోవటం సంభవించకుండానే క్రమంగ కాలం గడిచింది. నా గడువు ఇంకా ఆరునెలలోకి
వచ్చింది అనంగ జీవితం మరొక పాచిక విసిరింది. నా పట్టు మళ్ళీ సడలింది. అది నాకు
మరొక ఆఘాతం. దిగ్భ్రమ కలిగింది.
అన్నయ్య అనారోగ్యాన్ని అడ్డు పెట్టుకుని
మానేజరు దుర్బుద్ధితో సంతకాలు తారు మారు చేసి ఆస్తి, వ్యాపారాలతో సహా అంతా తన పేర
మార్పించుకున్నాడట. నా కడుపు మండింది. అది వరానికి చెందాల్సిన పిత్రార్జిత
సంపత్తి. దానికి ఎసరు రావటం నేను సహించలేని విషయం. ఆ పూట మొట్టమొదటిసారి నా అంతట
నేను వెళ్ళి అతనిని శెలవడిగాను.
"నువ్వు శెలవ విభాగంలోకి రావని
తెలుసు కదా. ఇవ్వరు." అన్నాడు నిర్లక్ష్యంగ.
"ఈ రెండున్నర ఏళ్ళలో ఎన్నడైనా
అడిగానా..? ఇవాళొక్కరోజే.. కాదనకు." అన్నాను.
"దేనికిట?" అనడిగాడు.
"ఆ మానేజరు నక్క మీద కేస్
వేయాలి.."
"వేసి..?"
"ఆస్తి తిరిగి రాబట్టాలి."
"రాబట్టి..?"
"అదేంటి..? తరతరాల పెద్దల ద్వారా
మన దాకా వచ్చిందది. రాబట్టి దాని హక్కుదారుకు దాన్ని సురక్షితంగ అందించాలి."
"వర్చస్ కి ఆ ఆస్తిలోని చిల్లి
గవ్వ కూడా అక్కరలేదు. వాడికి ఆ గాలి కూడా సోకనివ్వను. నువ్వు కేస్ వేయాల్సిన
అవసరంమేం లేదిక.. శెలవు లేదు.. పో.." అన్నాడు.
అతను ఇంతవరకూ వరానికి సువ్వొదిన గురించి
కానీ, అన్నయ్య గురించి కానీ ఏమీ చెప్పలేదు. ఆ విధంగ అన్నయ్య మీద చెడు అభిప్రాయం
వరానికి కలిగించలేదు. అందుకు కృతజ్ఞురాలినే కానీ, ఇప్పుడు మా తాతలనాటి ఆస్తి
గురించి అతను అంత నిర్లక్షంగ మాట్లాడటం నాకు బాధేసింది.
"నా ద్వారా మా అన్నయ్యను బాధించటం
వరకే నీ లక్ష్యం. మా ఆస్తిని కాపాడుకునే బాధ్యత నాకూ ఉంది.. లక్షల కోట్ల సంపద
అది.."
"అబ్బ.. ఎంత ఆశ..!!"
"ఆశ కాదు.. బాధ్యత అని చెప్పా కదా.
వరానికి వద్దొకపోతే పోనీ.. కనీసం అదంతా ఏ అనాథాలయానికో రాసివ్వగలిగినా మా అమ్మా
నాన్నల ఆత్మ శాంతిస్తుంది. ఆ దరిద్రుడికి ఎందుకు ధారపోయాలి..?"
అతనేం మాట్లాడలేదు. ఇంతగా వాదించినా
కానీ నాకు శెలవు మాత్రం ఇవ్వలేదు. అయితే ఏమనుకున్నాడో తెలియదు. తనే వెళ్ళి కేస్ వేశాడు.
ఏం చేశాడో, ఎంత ఖర్చు పెట్టాడో తెలియదు.. కేస్ తొందరగానే తేలింది. ఫోర్జరీ బయటపడి
ఆస్తంతా చిల్లిగవ్వ నష్టం కాకుండానే మాకు తిరిగి దక్కింది. అతనే వెళ్ళి స్వయంగ ఆ
ఆస్తి కాగితాలన్నీ అన్నయ్యకు అందించాడుట. అన్నయ్య కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయట ఆ
రాత్రంతా..! అతను ఈ విధంగ ఆస్తిని కాపాడటాన్ని చూసి అన్నయ్య అతను తనను
క్షమించాడన్న నమ్మకంతో ఎంతో హర్షించాడు.
మరునాడు ఉదయం ఆయన మరణవార్త నన్ను
చేరింది. వరం పేరు మీద అంతా వ్రాసేసి ఇతనినేమో గార్డియన్ గా పెట్టి అన్నయ్య, ఈ
లోకం వదిలి శాశ్వతంగ వెళిపోయాడు. కర్మకాండలన్నీ వరమే చేశాడు.. అప్పుడే వాడికి
తెలియ చేయాల్సి వచ్చింది వాస్తవమంతా. వాడికెంత విఘాతం కలిగిందో తెలియదు. ఎట్ల
తట్టుకున్నాడో కూడా తెలియదు. కానీ వాడు ఆ విషయాన్ని అంగీకరించిన తీరును చూసి వీడు
అక్షరాల అన్నయ్య కొడుకేనన్న సంగతి మాత్రం పూర్తిగ అర్థమైంది. అదే స్థైర్యం..! అదే
నిలకడ..! అదే నిబ్బరం..!! నాన్న పోయినప్పుడు అన్నయ్యను చూశాను కదా.. అదే భావన ఈ
ముఖమండలం మీద.
"ముందు చెప్తే కనీసం ఆయనను నోరారా
నాన్న అని పిలుచుకునేవాడిని" అని మాత్రం అన్నాడు ఏ ఆవేశం లేకుండానే ఆ ఆస్తి
కాగితాలను చూస్తూ.
నేను వాడిని చాలావిధాల పరిస్థిని వివరించి
ఓదార్చాల్సి వచ్చింది. కొన్ని అనుబంధాలంతే. వాడూ ఒప్పుకున్నాడు ఆ మాట.
"ఛి.. చిల్లి గవ్వ
తాకద్దనుకున్నాను. ఏకంగ పామును తెచ్చి నా మెడలోనే వేయించేశావు.." అన్నాడు అతను
నాతో ఆ రాత్రి ఉక్రోషంగ.
"అది వరానికి దక్కకుండా ఆపే హక్కు
నీకు లేదు. రేపు పొద్దున వాడే నిన్ను నిలదీస్తాడు. అప్పుడేం చెప్తావు..?"
అతనేం మాట్లాడలేదు. అక్కడే పడుకుని హాయిగ
నిద్రపోతున్న వరాన్ని గుచ్చి చూసి వెళిపోయాడు మౌనంగ.
"అత్తా, నువ్వే జోల పాడి
పడుకోబెట్టవా..?" అని ఆపూట అంతకు ముందే అడిగి, జోల పాడించుకుని, నా గదిలోనే
పడుకుని నిద్రపోతున్న వరం తల నిమురుతూండిపోయాను. తండ్రి పోయిన బాధతో ఉన్నాడు
బిడ్డడు. అతనికీ ఆ బాధలన్నీ తెలిసినవే కదా.
హమ్మయ్య..! ఏదేమైనా అన్నయ్య లేకపోయినా
ఇవాళ వాడి హక్కు వాడికి ఇప్పించగలిగాను. ఇప్పుడు ఆ వ్యవహారాలన్నింటికీ అతనే ఒక
నమ్మకస్తుడైన మనిషిని నియోగించాడు ఇంక అది వాళ్ళ తల నెప్పి. నాది కాదు. అతని
నిజాయితీ మీద నాకు పూర్తి నమ్మకం. అతను ఆ విషయంలో వాళ్ళ నాన్న కొడుకే. నాకు మా
మానేజరు రామంగారు గుర్తుకు వచ్చాడు. అప్పట్లో ఆయన ఆ ఆస్తికి కాపలాదారు. ఇప్పుడు ఈ
తరానికి ఆయన కొడుకు ఆ పనే చేస్తున్నాడు. నాకు నిశ్చింతగ అనిపించింది.
ఇదంతా పూర్తయ్యేసరికి నా గడ్డు దినాలు
గడిచిపోయాయి. గడువు పూర్తైంది.
అందుకే ఇవాళ ఉదయం అతను నన్ను
విముక్తురాలిని చేస్తున్నట్టు ప్రకటించి వెళిపోయాడు. కళ్ళముందు ఇంతసేపూ తిరిగిన
తరగని గతం చట్రం నుండి బయటకు వచ్చి, నేను నిశ్చింతగ ఊపిరి పీల్చుకున్నాను. ఇప్పుడు
నన్ను కట్టిపడేస్తున్నది వర్చస్ ప్రేమ మాత్రమే. ఇంతకాలానికి దగ్గరైన వాడిని
వదిలిపోవాలని లేదు. కానీ తప్పదు. ఇవాళ నాకు ఇక్కడ ఆఖరి రోజు. నా కన్నీటి ద్వారా
అతని కసి తీరిన రోజు. లెక్క సరిపోయింది. బంధం వీడింది.
అయితే నాకు వెళ్ళటానికి చోటేదని రాజన్నకు
కలిగిన సందేహం కూడా అతనికి కలగనందుకు కించిత్తు బాధేసింది. అతను తన వ్యక్తిగత
విషయాల్లో ఎవ్వరినీ జోక్యం చేసుకోనివ్వడు. కనక ఎంత చనువున్నా రాజన్న కానీ వేరే
ఉద్యోగులు, పనివాళ్ళు కానీ నా బాధంతా ఎరిగి ఉండీ అతనితో నా విషయం ఏమీ
మాట్లాడలేకపోయారు. ఒకరు చెప్తే కానీ అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడా..?
నేను రోజంతా అన్నం తినాలనిపించక మెతుకు తినలేదు.
పడుకోలేదు. అట్లగే కూర్చున్నాను.. అంతే. దిగులేం లేదు. గుబులూ లేదు. అట్లా సాగే ఒక
స్తబ్ధత... అంతే. భగవంతుడి పటం వంక చూస్తూండిపోయాను. ఆలోచించగా ఆలోచించగా, నారు
పోసిన వాడే నీరు పోయకపోతాడా..? అనిపించింది. కర్మణ్యేవాధికారస్తే.. కర్మ చేయాలి.
తప్పదు. అదైతే అంతవరకు నా చేతిలో ఉన్న పనే. చేస్తాను.
No comments:
Post a Comment