Saturday, 12 November 2016

3. బంధంతో వీడే బంధం-4

            మరునాడు ఉదయం తండ్రికి చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళాడతను. తండ్రి ఎందుకు ఏమిటి అంటే ఏమో, తెలియదు అన్నాడు. సమయానికి భానుమూర్తి కూడ వాళ్ళ అబ్బాయి దగ్గరకు కెనడా వెళ్ళాడు, దానితో పాటు నెలరోజుల ఆఫీసు పని పెట్టుకుని. ఆయన ఉన్నా బాగుండేది. సంగతేంటో కనుక్కుని చెప్పి ఉండేవారు. ఎందుకో స్వర్జిత్ మనసు ఉండి ఉండి అలజడి నిండసాగింది. కానీ ఆ ఇంట్లో వెళ్ళిందగ్గరి నుంచీ అతనికి ఎటువంటీ అనుమానకర ఛాయలు కనిపించలేదు. మాధవం, భాస్వతి- ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. బాగనే పలకరించి, లోపలకు పిలిచి, అతిథి సత్కారాలతో ఆదరించారు. తర్వాత అల్పాహారం పెట్టారు. ఆదివారం పూట సూర్యవ్రతం చేస్తున్నానని తనకేమీ వద్దని స్వర్జిత్ అన్నాడు. వాళ్ళు ఏవో మాట్లాడుతుంటే ఇంక వాచ్ చూసుకుని, "నాన్నగారు ఎదురుచూస్తుంటారు. వెళ్ళాలి. పిలిపించిన విషయం చెప్పవలసింద"ని మనవి చేసుకున్నాడు.
            అప్పుడు తెచ్చింది భాస్వతి ఒక కాగితం. తెచ్చి, "నన్ను చదవమంటారా, మీరు చదువుతారా..?" అని అడిగింది.
            అతను "ఎట్లైనా ఫరవాలేదు.." అన్నాడు. "అయితే మీరే చదవండి.." అని ఆమె ఆ కాగితం అతని చేతికి అందించింది. అతను దాన్ని చూస్తూనే ఠక్కున లేచి నిలబడ్డాడు నిర్ఘాంతపోతూ.
            "ఇది..!! ఇది..??" అన్నాడు. అది అతను అర్ణవ్ కి వ్రాసి ఇచ్చిన ప్రేమలేఖ. "ఇది.. మీ దగ్గరకు ఎట్ల వచ్చింది...?"
            "ఆఁ.. కూర్చోండి.. ఫరవాలేదు.. టెంషను పడకండి. అదే నా ప్రశ్న.. సమాధానం మీరు చెప్పాలి."
            స్వర్జిత్ ఇంకా నమ్మలసేనట్టు ఆ కాగితాన్ని భాస్వతిని మార్చి మార్చి చూడసాగాడు.
            "సరే. ఇంక మీరేం చదువుతారు లేండి.. ఇటివ్వండి.. నేనే చదివి వినిపిస్తానం"ది భాస్వతి.
            "ఏంటమ్మా అది..?" అన్నాడు మాధవం స్వర్జిత్ ని కూర్చోమని సైగ చేస్తూ.
            స్వర్జిత్ చెమట పడుతున్న నుదుటిని తుడుచుకుంటూ, కాగితాన్ని మడిచేస్తూ, "వద్దు.. చదవకండి.." అంటూ మెల్లగ నసిగాడు భాస్వతికి వినిపించేటట్టు.
            "ఊఁ..?" అని గాండ్రించింది భాస్వతి. అతను మాన్పడిపోయి బెదురుగ కూర్చున్నాడు. అతనికి గొంతు ఎండుకుపోయింది. కళ్ళు తిరిగాయి.
            "ఏం కాగితమమ్మా అది..?" మాధవం అడిగాడు.
            "చెప్పండి అదేంటో.. మా నాన్న అడుగుతున్నారు." అని ఆగి, అతను నిరుత్తరుడై చూస్తూండిపోతే అతని చేతిలో నుంచి కాగితం లాగేసుకుని, "నేను చదువుతాను. మీరే చెప్పండి దీన్ని ఏమంటారో.." అని చదవటం మొదలు పెట్టింది.

            సఖీ,
            అందమైన జీవితానికి దివ్యభవ్యమైన ప్రాయం యౌవనం.. తనువును వసంతం సంతరించుకున్న వేళ ఈ వయసు ఎదురుచూసేది ప్రియబాంధవి కోసమే..
            ఈ జీవన గ్రీష్మతాపాలు తీర్చటానికి వర్షపు జలబిందువై వచ్చే చెలి తోడు కోసం అనంగ పరితాపాలు చెందేవేళ..
            కనిపించావు చిరుజల్లువై.. తడిపావు నీ మృదుమధుర చిరునవ్వులతో నా మానసాన్ని..
            నిన్ను చూసిన క్షణం నుంచి, నా కన్నులలో అందమైన కలవై నిలిచిపోయావు.. నీ తీయని పలుకులతో నన్ను అమందానంద సందోహంలో ముంచి ఆనందనందనంలో విహరింపచేశావు..
            నీ జ్ఞాపకాలతో నిండినంత సేపు నా కాలమంతా సుధామయమైపోయింది. అమృతధారయై ప్రవహిస్తోంది. వెలుగులతో నిండిపోతోంది.
            కానీ అది కేవలం జ్ఞాపకమని గుర్తువచ్చినవేళ జీవనమంతా చీకటైపోతంది.
            జీవితాంతం నీ చూపులలో నా రూపం చూసుకుంటూ తరించిపోవాలని ఆశ.. నీ పలుకులలో వలపుగుళికలను వెదజల్లుతుంటే విని మైమరచిపోవాలని ఊహ..
            నా ఎదసవ్వడి చేసేది నీ కోసమే.. నా ఎడద కోవెలైంది నీ సుందర సుకుమార కోమలమైన రూపాన్ని ప్రతిష్ఠించుకోవటానికే..;
            జీవనరాగానికి అనురాగానివై రావా? నీ చిరుహాసాలతో నా మానస మధువనాన్ని వసంతాలతో నింపవా..; నీ నునులేత పాదాలతో నా హృదయసామ్రాజ్యంలోకి అడుగిడవా..;
            నాతో కలిసి ఏడడుగులు నడిచే సహచరివి నీవే నీవేనని మనసు ఆరాటపడుతోంది. నా ఇంటి పేరును, నా ఎడమ పక్కన స్థానాన్ని పంచుకునే అర్ధభాగానివి నీవేనని పిలుస్తోంది అంతరాత్మ.
            ఈ గోడు వినవా..? ఈ తాపం తీర్చవా..? నీ తోడునందించి నన్ను స్వస్థుడిని చేయవా..?
            నా జ్ఞాపకాలలో నుంచి వాస్తవానివై రావా..? నా శ్వాసలలో కలిసి, అంతరంగలో ప్రాణసంచారమై రావా?
                                    ఇట్లు నీ ప్రాణనాడియై కొట్టుకోవాలని ఆరాటపడే సఖుడు.

            మాధవం అది విని నోర్లు వెళ్ళబెట్టారు. నెమ్మదిగ స్వర్జిత్ కళ్ళ ముందు చీకటి అలుముకుంది. అర్ణవ్.. ఎంత పని చేశావు..!!
            అంతా చదివి భాస్వతి అతన్ని నిలదీసింది- "చెప్పండి- దీనికి మీ సమాధానం ఏంటి..?" అని.
            స్వర్జిత్ కి సిగ్గూ, అభిమానం, ఒకలాంటి సంకోచం అనిపిస్తుంటే మౌనంగ ఉండలేక, మాట్లాడలేక, గుణిగినట్టు అన్నాడు- "లేదండి.. అది.. నేను వ్రాసింది కాదు.. అంటే ఆ ఉద్దేశంతో.."
            "ఇది మీ చేవ్రాలే కదా..?" అడిగిందామె గద్దిస్తూ. ఆమెను చూస్తుంటే ఇంకా అదురు పుడుతోంది. ఆమె గొంతు ఉండి ఉండీ పెరిగిపోతోంది చెవులలో.
            "నాదే.. కానీ.."
            అంతే- ఒక్కసారి అరిచింది- "చూశారా నాన్నా.. అతనిదే చేవ్రాలు. అతనే వ్రాశాడు. నాకు చేరవలసిన ఫైలులో భద్రంగ పెట్టి, నా ఆఫీసులో కూర్చుని, తన చేతులతోనే నా చేతికి నేరుగ ఇచ్చాడు." అని తన చేతిలో ఉన్న ఒక ఫైలు చూపిస్తూ, "అది కూడ మీటింగ్ జరుగుతుండంగ. ఇది నేను పొరపాట్న మీటింగులో తెరిచి ఉంటే ఏం జరిగేది..? అది ఎంత ముఖ్యమైన మీటింగ్ జరుగుతోందో..! తేడా వస్తే లక్షల కోట్లలో జరిగే పని దెబ్బతినేసేది."
            స్వర్జిత్ ఆ దృశ్యం గుర్తు తెచ్చుకున్నాడు. ఆరోజు అర్ణవే ఆ ఫైలు తన చేతికి ఇచ్చాడు. అంటే..?? స్వర్జిత్ కి ఒక్కసారిగ చాలా ఛీప్ గ అనిపించింది. అతను నుదుట పట్టిన చెమట తుడుచుకున్నాడు.
            "ఇట్లగేనా ఒక బాధ్యత గల ఉద్యోగి ప్రవర్తించవలసింది..? అసలు ఇతని ముఖం చూస్తే ఇటువంటివాడు అనిపిస్తుందా..? ఏదో బీకాం చదువే అయినా కళ గురించిన అవగాహన అదనంగ ఉంది కదా అని అర్హత, అనుభవం కూడ పట్టించుకోకుండ తీసుకున్నాను ఉద్యోగంలోకి. కళాకారులకు క్రమశిక్షణ ఉన్నా లేకపోయినా సంస్కారం, పద్ధతులు ఉంటాయని నా నమ్మకం. ఇదేనా పద్ధతి..? పై అధికారిణితో ప్రవర్తించే విధానం ఇదేనా..? ఇంకొకరింకొకరైతే టర్మినేషన్ లెటర్ ఇచ్చి పంపేసేదాన్ని. కమిటీని కాదని మరీ నేనే ఉద్యోగం ఇచ్చి నేనే తీసేయటం వారి ముందు మర్యాదగ ఉండదు కదా అని ఆగాను. చెప్పండి..?? ఎందుకు ఇట్ల చేశారు..?"
            "అది.. నేను కావాలని.."
            "..కావాలని చేయలేదా..? మరి ఏం అనుకుని చేశారు..?" అరిచింది భాస్వతి. గార్డెన్ లో కాక గదిలో అయి ఉంటే పై కప్పు ఎగిరిపోయేదే.
            "అబ్బాయిని చెప్పనివ్వమ్మా.." మాధవం అన్నాడు ఆమెను శాంతపరచాలని ప్రయత్నిస్తూ.
            భాస్వతి లేని శాంతం తెచ్చుకుంటూ, "సరే, చెప్పండి.." అంది చేతులు కట్టుకుని.
            "అది.. నేను మీకు వ్రాసింది కాదు.. అంటే.."
            "మరి ఎవరికో వ్రాసింది నా ఫైలులోకి నా చేతికి ఎందుకు వచ్చింది..?"
            "----"
            మళ్ళీ ఆమె కోపం కట్టెలు తెంచుకుంది. "విన్నారుగా నాన్నా అతను చెప్పేది..? రెండు చేవ్రాళ్ళూ అతనివేనట. ఇచ్చిందీ అతనేననట. కానీ వ్రాసింది నాకు కాదట. అసహ్యమైన పనులు చేయటం.. పట్టుబడితే ఇట్ల నీళ్ళు నవలటం..!! ఇది వీళ్ళు మనకిచ్చే గౌరవం!" అంది ఆవేశంగ.
            స్వర్జిత్ తల వాలిపోయింది. భాస్వతి మాత్రం వదలలేదు.
            "మనసుల్లో ఇటువంటివన్నీ పెట్టుకుని మనతోనే తిరుగుతంటారు. మామూలుగ మాట్లాడుతుంటారు. అనుమానమైనా వస్తుందా..? అందుకే అన్నాను- ఇంత తొందరగ ప్రమోషన్లు ఇవ్వకూడదని. కాస్త చనువు తీసుకుని ప్రతిభకు గుర్తింపు ఇచ్చినందుకు వీళ్ళ ఆలోచనలు ఎంతెంత దూరం పోతాయో తెలిసిందా..? చెబుతూనే ఉన్నాను- వద్దు నాన్నా.. అతనికి కొమ్ములు పెరుగుతాయి. మీరు ఉన్నప్పుడు నిర్ణయాలు వేరు.. నేను తీసుకునే నిర్ణయాలు వేరు అని.. విన్నారా..? ఇప్పటికైనా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి అని ఇప్పటికైనా ఒప్పుకుంటారా..? లేక ఇంకా మీ ఫిలాసఫీలే అప్లై చేసి నన్ను ఇట్ల నట్టేట మునగమంటారా..? చెప్పండి.."
            "అది కాదమ్మా.." మాధవం సముదాయించబోయాడు.
            "ఏది కాదు నాన్నా..? అది చదివిందగ్గరి నుంచీ ఎంత సిగ్గుతో చచ్చిపోతున్నానో తెలుసా..? నాకు కాలేజిలోనే ఇటువంటివి జరగలేదు. నన్ను చూస్తే అంతా వణికి చచ్చేవాళ్ళు. అటువంటిది ఓ కంపెనీ ఛైర్ లో ఉన్నాను- ఇంతమందికి ఏకైక అధికారిణిని..! కనీసం బాస్ అన్న భయం కూడ లేకుండ ఇతగాడు నేరుగ నా మొహం మీదే నా చేతికే అంత అఫీషియల్ గ లెటర్ ఇస్తాడా..? ఎంత ధైర్యం..?!!"
            "ఒక్క నిముషం.." స్వర్జిత్ అన్నాడు. భాస్వతి వినలేదు.
            "ఇచ్చింది ఇతగాడే అయినా నాకేమో ఎవడు వ్రాశాడో తెలియదు. ఎవరిని పిలిచి నిలదీయను..? ఏమని నిలదీయను..?? ముందసలు అట్ల అనామకంగ ఇవ్వటానికి అర్థమేంటో తెలియదు. ఏడిపించటానికి మాత్రమే వ్రాశారో అర్థం కాదు. ఒకవేళ పట్టుకున్నా, నేనే వ్రాశానని నీ దగ్గర ప్రూఫ్ ఏంటి అని అడిగితే ఏం చెప్పను..? అది ఫలానావాడే వ్రాశాడని నాకు మాత్రం ఏం తెలుసు..?? ఎవరి ఉద్దేశాలేంటో ఎట్ల తెలుసుకునేది..? మార్గం ఏంటి..? ..నన్ను ఇంత టెంషను పెట్టి వాడు హాయిగ నిద్ర ఎట్ల పోతాడో నేనూ చూస్తాను. అని పట్టుదలకొచ్చాను. సరేనని అందరి చేత వాళ్ళ చేవ్రాలులో తెలుగులో వాక్యాలు వ్రాయించి తెప్పించి ఈ లేఖతో పోల్చి చూశాను. ఆసరికి నా కళ్ళు ఎంత నెప్పులు చేశాయో..."
            స్వర్జిత్ తల పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. తండ్రిని తీసుకురాకపోవటం ఎంత మంచిదైందా అనుకున్నాడు మనసులో. ఇట్ల ఇంటికి పిలిచి ఛెడామడా తిడుతుందని అస్సలు ఊహించలేదు. ఆరోజు కాబిన్ లో తిడుతుందనుకుంటే పదోన్నతిని ఇచ్చింది. ఇవాళ ఆడిటింగ్ లో చేసిన సహాయానికి గుర్తింపు ఇస్తుందేమో అంటే ఇంటికి పిలిచి, మర్యాద చేసి మరీ పెద్దాయన ముందర ఇష్టం వచ్చినట్టు దులుపుతోంది. ఎంత కోపం ఉంటే మాత్రం, ఎంత తన చేవ్రాలే అని నేరనిరూపణ అయితే మాత్రం ఇంత దారుణంగ మాట్లాడుతుందా..??
            "మేడమ్.. ప్లీజ్.. ఇక్కడొక పొరపాటు జరిగింది మేడమ్."
            "మీరు నోరుమూసుకోండి.. చేసిన నిర్వాకం చాలు." అని తండ్రి వంక తిరిగింది.
            స్వర్జిత్ కి అంత అవమానం ఎప్పుడూ వేయలేదు. మాన్పడిపోయాడు.
            "వీళ్ళంతా ఒకటే నాన్నా.. ఆడపిల్ల బాధ, పరిస్థితులతో వీళ్ళకు పనిలేదు. అందుకే నాకు ఆ కంపెనీ గద్దెనెక్కటం ఇష్టం లేకుండే. నేను కెరీర్ వుమన్ ని కాను. నాకు ఇవన్నీ ఆటలాగ తీసుకోవటం రాదు. మా కాలేజిలో ఉండేవాళ్ళు- ఇట్ల లేఖలందితే బాధతో కుంగిపోకపోంగా తమ ఆడతనానికి గుర్తింపుగ తీసుకుని ఆనందపడేవాళ్ళు. నవ్వుకునేవాళ్ళు. నేనట్ల ఉండలేను నాన్నా..! నేనొక కళాకారిణిని. నాకు భావావేశాలు ఉంటాయి. సామాన్యులకన్నా చాలా ఎక్కువ ఉంటాయి. ఒక మాట అంటే పడలేను. అన్నీ ఆటలాగ తీసుకోలేను. ఇంత బాధ మనసులో పట్టుకుని సామాన్యంగ కనిపిస్తూ పని చేయలేను. వీళ్ళకు ఎందుకు అర్థం కాదు నాన్నా ఆ మాట..?" భాస్వతి చాలా భావావేశంలో ఊగిపోయింది.
            ఈసారి స్వర్జిత్ కి ఆమె పై జాలి వేసింది. "పొరపాటైంది మేడమ్.. ఒక్క క్షణం నన్ను క్షమార్పణైనా చెప్పనివ్వండి.."
            మాధవం అన్నాడు- "అతనేదో పొరపాటు జరిగింది అంటున్నాడు.."
            "పొరపాటు..!! అబ్బ..?? ఆమాట చెప్పి తప్పించుకుందామనా..?? ఎంత సులభం కదా- పొరపాటైందని సారీ చెప్పడం.."
            స్వర్జిత్ ని చూసి కాసేపు ఏం మాట్లాడకుండ ఆగమన్నట్టు సైగ చేశాడు మాధవం.
            "అసలు నా పరిస్థితి మీకేం తెలుసు? ఇప్పటికే శక్తికి మించి చేస్తున్నాను. మా నాన్నకు తెలుసు. అంతే. వాళ్ళందరినీ ఆయన చెప్పినట్టే నా పిల్లలలాగా చూసుకోవటానికి ప్రయత్నిస్తుంటాను. కానీ అటువంటిది.. నన్ను.. అట్ల ఎవరైనా చెడు దృష్టితో చూస్తారని ఊహిస్తానా..? పిల్లలు చెడు దృష్టితో చూస్తే, తల్లి తట్టుగోలదా..? అటువంటి భావాలైనా ఎవరి మనసులోనైనా ఉన్నాయని తెలిస్తే సహించుకోగలనా..? ఎంత అవమానకరంగ నన్ను, నా నమ్మకాన్ని దెబ్బకొడతారా..?" అని ఆగి, "చూడండి నాన్నా..! అందుకే మీ దగ్గరకు తెచ్చి మీ ముందరే నిలదీస్తున్నాను. మీరే న్యాయం చెప్పండి. అది చదివిందగ్గరి నుంచీ నాకెంత ఏడుపొస్తుందో..!"
            అప్పటిదాకా ఆడపులిలా అరుస్తున్న భాస్వతి ఒక్కసారిగ నిలబడింది నిలబడినట్టే కిందకు కూలబడి తండ్రి ఒళ్ళో తలపెట్టుకుని ముఖం దాచుకుని ఏడ్చింది.
            స్వర్జిత్ గుండె ఒక్కసారిగ ఎవరో పిండినట్టైంది. ఎప్పుడూ సింహంలా శత్రువు మీద పంజా విసరటానికి సిద్ధంగ ఉండే ఆమె ఇట్ల బేలగ ఏడవటం చూసి అతనికి తట్టుకోవటం చాలా అసౌకర్యంగ అనిపించింది. వ్యక్తిగతంగ ఆ కాగితం చూపించి కాబిన్ లోనే తేల్చేసుకుంటే తనే అదేం లేదని, జరిగిందంతా చెప్పి సమాధానపరచేవాడు కదా..!! కనీసం ఇట్ల ఇంటికి పిలిచి అయినా, పెద్దాయన లేకపోతే కనక వివరంగ నెమ్మదిగ నిజం చెప్పేవాడు కదా.. ఛ..! తన కారణంగ ఆమె ఎంత బాధపడుతోంది..! కానీ.. తనేం చేశాడు..? ఇదంతా అర్ణవ్ ఆడిన నాటకం కదా..! ఒరే అర్ణవ్.. నిన్ను వదలనురా..!
            "నాకు వద్దు నాన్నా.. ఈ కంపెనీ వద్దు.., ఆ పనీ వద్దు. నన్ను విముక్తురాలిని చేయండి..!! కాలేజ్ దాటానో లేదో నెత్తిన బండ పెట్టారు. నేను కుర్చీలో కూర్చోలేదు. కుర్చీ నా మీద కూర్చుంది. ఈ తలనెప్పి మేళం నాకు వద్దు. నా శిల్పాల ప్రపంచంలో నేను ఆనందంగ ఉంటాను. అవైతే ఇట్ల నా అభిమానంతో ఆడుకోవు. ఉలకవు పలకవు. నేను ఎట్ల మలిస్తే అవి అట్ల వెలుస్తాయి. కనక బాధపెట్టే సవాల్ లేదు. ఇంకా సంతోషమే పెడతాయి. ఈ కంపెనీని ఇంక అమ్మేసేయండి.. ఎవరికైనా దానం చేసేయండి. కానీ నాకు మాత్రం ఇది మోసే ఓపిక లేదు..! నేను ఫెయిల్యూర్ ని. నేను చేతకానిదాన్ని. నేను అస్తిత్వమే లేనిదాన్ని." వెక్కి వెక్కి ఏడ్చింది భాస్వతి.
            "మేడమ్.. నా మాట వినండి.. సర్.. ఒక్క నిముషం.."
            మాధవం భాస్వతిని ఓదారుస్తూ స్వర్జిత్ ని చేతివేలితో ఏం మాట్లాడద్దన్నట్టు "ష్" అన్నాడు.. భాస్వతి ఏడుస్తూ ఆవేశంగ ఏదేదో అంటూనే ఉంది- "మంచి డైరెక్టరు గారు.. ఆయన చేతి కింద వేసుకున్నారు..! వదిలేసి వచ్చాను. మా యూనివర్సిటీ విభాగం డైరెక్టరు ఎంత బాధపడ్డాడో..! ఈపాటికి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసేదాన్నో..! ఎన్ని కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయో..!! ఎన్ని డిజైన్లు మనఃఫలకం మీద నన్ను ఊరించి ఊరించి పోతుంటాయో..!! ఆదివారం కోసం చేతులు ఎంత ఎదురుచూస్తుంటాయో..! కలల్లో కూడ నాకు చెక్కడాలే కనిపిస్తున్నాయి నాన్నా..!!! తట్టుకోలేకపోతున్నాను..! చూడండి.." అని ఆమె ఆ ఫైలులో ఇంకో కాగితం పీకి చూపిస్తూ, "ఆఫీసులో వేళ దొరికితే చాలు చేతులు ఆటోమేటిక్ గ ఎట్ల శిల్పాల డిజైన్లకు పూనుకుంటాయో..!!" అని చూపింది. మాధవం అవి చూసి కూతురిని జాలిగ చూశాడు. ఆమె ఏడ్చి ఏడ్చి మామూలు స్థితికి రావటానికి పది నిముషాలు పట్టింది.
            మాధవం ఆమెను ఓదారుస్తూ అన్నాడు- "నీ ఆరాటం నాకు తెలుసమ్మా.. కానీ ఏమీ చేయలేని స్థితమ్మా.."
            "నాకు తెలుసు నాన్నా.." అని భాస్వతి స్వర్జిత్ వంక చూసి, "ఒక మనిషి ఆఫీసులో బాస్ రూపంలో మీ ఎదురుంగ కూర్చుంది అంటే ఆమెకు కూడ ఒక వ్యక్తిత్వం ఉంటుందండి. అర్థమైందా..? అట్ల బాధ్యతారహితంగ, వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే పనులు చేయకూడదు. ఎటువంటి పరిస్థితులలో వచ్చి అక్కడ కూర్చుంటానో నాకు తెలుసు. ఇప్పటికైనా అర్థమైందా మీరు చేసిన తప్పు ఎంత పెద్దదో.."
            స్వర్జిత్ లోతుగ గాలి పీల్చుకుని వదులుతూ, తల ఊపాడు.
            "చెప్పండి.. ఇవన్నీ తెలిశాక ఆ లేఖ గురించి మీకేం అనిపిస్తుంది..?" అడిగింది కళ్ళు తుడుచుకుని ప్రశాంతమవుతూ.
            "ఆ లేఖ మీ వంటి గొప్ప ప్రతిభ ఉన్న కళాకారిణి దగ్గరకు చేరుతుందని ముందే తెలిస్తే, ఇంకా ఎంతో అందంగ, కవితాత్మకంగ, మీ గౌరవానికి తగినట్టు అభినందనగా లేఖ వ్రాసేవాణ్ణి కదా అనిపిస్తోంది.." అన్నాడు స్వర్జిత్ ఆమె కళ్ళలోకి సూటిగ చూస్తూ.
            భాస్వతి కళ్ళలో నిప్పురవ్వలు చెలరేగాయి మళ్ళీ. "చూశారా ఎంత పొగరో అతనికి..!!" అని ఆమె తండ్రితో ఏదో అనబోతుంటే ఆపి మాధవం అతన్ని చూసి, "అంటే.. నువ్వు ఆ లేఖ అమ్మాయిని ఉద్దేశించి వ్రాయలేదా..?" అన్నాడు.
            స్వర్జిత్ తల అడ్డంగ ఊపి, అర్ణవ్ పేరు చెప్పకుండ అతను చేసిన నిర్వాకం క్లుప్తంగ చెప్పి, "సర్, నా ఉద్దేశాలు అంత చెడ్డవి అయితే, ఒకవేళ నేనే కనక అది వ్రాసి ఉంటే నా రైటింగ్ ప్రూఫ్ తీసుకున్న తర్వాత కూడ మీ ఎదురుంగ వచ్చి కూర్చుని ఇంత ధైర్యంగ మాట్లాడగలనా..? చెప్పండి..?" అన్నాడు.
            "మరి లేఖ చేరుతుందని తెలిస్తే ఇంకేదో వ్రాసేవాడిని అంటున్నావు..? అదేంటి..?" మాధవం అడిగాడు.
            స్వర్జిత్ తల వంచుకుని, "అది ఖచ్చితంగ అభినందన లేఖ అయి ఉండేది. ఆమె లాంటి కళాకారిణి కింది ఉద్యోగిగా ఉన్నందుకు నా సంతోషం వ్యక్త పరచేవాణ్ణి." అన్నాడు.
            "అంటే.. ఆమెలో కళ నీకెట్ల తెలిసింది..?" మాధవం అడిగాడు.
            "ఆమె కళ ఆమె కళ్ళలో ఉంటుంది. ఆమె చేతుల్లో ఉంటుంది."
            భాస్వతి ఆశ్చర్యపోతూనే నిలదీసింది- "హలో.. పొగడటానికైనా ఒక ఆధారం ఉండాలి. అవి నావేనని మీకెట్ల తెలుసు..?"
            "నిరాశీః కిరణం, ఆనందరశ్మి, వెలుగే ఒక నీడ, నిశ్శబ్ద ప్రభ, నిశీధి ప్రజ్వలితం, మృతోజ్జీవని, నిర్మమ జ్యోతి.. ఇంకా ఎన్ని థీమ్స్ చెప్పమంటారు..?"
            భాస్వతి ఆశ్చర్యమో, విస్తుపాటో తెలియని స్థితిలో అతని వంక చూసింది.
            "సముల్లాస కాంతి, ప్రహర్షితార్చిష్.. ఇట్ల అన్ని ఏదో రకంగ వెలుగు అర్థం వచ్చే పేరున్న ఆ శిల్పాలన్నీ ఈ రెండు చేతులలో నుంచి ప్రాణం పోసుకున్నవి కావంటారా..?""
            భాస్వతి కళ్ళోలో మెరుపు. "అది మీకెట్ల తెలుసు..?"
            "అది కాదు ముఖ్యం. మీ శిల్పాలు నన్ను ఎంత కదిలించాయనేది ముఖ్యం." స్వర్జిత్ కి ఇంక చెప్పక తప్పలేదు- "అది మీ పేరని తెలియనప్పుడు కూడ వాటిని అంతే నచ్చాను నేను. మీ శైలి చాలా విలక్షణమైంది. నేనైతే మీ అమ్మ థీమ్ శిల్పాలను చూస్తూండిపోయానట్ల. మా అమ్మ నాకు దూరమైనాక ఇన్నేళ్ళకు ఆ భారతీయ స్త్రీ ప్రతిమలలో అమ్మరూపం చూసి ఎంత పులకరించిపోయానో..! ముఖ్యంగ చిన్నబాబును ఎత్తుకుని గాలిలో ఆడిస్తూ నవ్వుతున్న అమ్మ ప్రతిమ ప్రదర్శన మధ్యలో పెట్టింది, నాకు అన్నింటికన్నా నచ్చింది. సరిగ్గ మా అమ్మ నా చిన్నప్పుడు నన్ను అట్లగే పట్టుకుని దిగిన ఫోటో ఒకటి నా గదిలో ఉంటుంది. అది మేడమ్ చేసిన మాస్టర్ పీస్ అని వీళ్ళ జూనియర్లు చెప్పారు."
            భాస్వతి తన కళ్ళు తుడుచుకుని, నిశ్చలంగ అతని కళ్ళలోకి చూస్తుండిపోయింది.
            "కళ్ళలో నీరు తిరిగింది ఆ క్షణం అది చూసి. తెల్సా..? మీతో అప్పుడే చెప్పాలనుకున్నాను. కానీ మీకు పొగడ్తలంటే నచ్చదని ఊరుకున్నాను. ఆ తర్వాతే నాకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ మీ ఉద్వగాలన్నీ స్పష్టంగ అర్థమైనాయి కూడ. మా అమ్మను చూశాను, మళ్ళీ మిమ్మల్ని చూశాను.. ఆ కళ్ళలో కళాఛాయలు.." అన్నాడు.
            భాస్వతి నిశ్చేష్టురాలై వింటుంటే మాధవం అడిగారు- "అంటే నీ ఉద్దేశంలో కళాకారిణిగా తప్ప మా అమ్మాయి ఒక కంపెనీ నడిపే అధికారిణిగా ఏమీ గుర్తింపు సాధించనేలేదా..?"
            "అదేంటండీ.. అట్ల అంటారు..? ఎందుకు సాధించలేదు..? ఆమె వచ్చాక కనీసం అంటే పది శాతం లాభాలు పెరిగాయి.. నేను ఆ పాత రిపోర్టులు రికార్డులు మొన్ననే ఒకసారి అవకాశం దొరికితే చూశాను. ఆమె ఒంటి చేతితో కూడా కంపెనీని పడిపోకుండా నిలబెట్టి ఉంచగలిగిందంటే ఇది ఆమె ప్రతిభ కాక మరేంటి..?"
            భాస్వతి నోట మాట పోయినదానిలా విన్నది అదంతా. ఆమె ఏదో అనబోతుంటే ఆపి, మాధవం అడిగాడు- "ఏమో- మరి ఒకటే అరుస్తుంది అర్థం పర్ధం లేకుండ అని అంతా తిట్టుకుంటారని, తనకు కూడా ఆమె అంటే ఆఫీసులో భయంగనే ఉంటుందని మూర్తి చెప్తాడు.."
            "ఔను. అది నిజం..! కానీ నిజానికి ఆలోచిస్తే అధికారిణి అంటే ఎవరికైనా అంతమాత్రం భయం ఉండితీరాలి. ఆమె ఏమైనా మాకు నీతులు చెప్పి తను పాటించకుండ ఉంటారా..? అందరికన్నా ముందు ఉండి తనే సక్రమంగ నీతులు పాటిస్తారు. ఆమె క్రమశిక్షణ పాటించటం వల్లే ఉద్యోగులలో క్రమశిక్షణ పెరిగింది. సీరియస్ గ ఉంటారన్నది నిజమే కానీ, కింది ఉద్యోగుల నుంచి పైవారి వరకూ అందరూ ఆమె ఏకారణంగ అయినా నవ్విన రోజు చాలా సంతోషపడతారు. ఆమె తమను మెచ్చుకోవాలని తాపత్రయపడతారు. చాలా అభిమానిస్తారండి.."
            "ఆఁహాఁ.." అన్నాడు మాధవం. భాస్వతి ఇంకా నిర్ఘాంతపోతూ చూసింది.
            స్వర్జిత్ ఇంకా చెప్పాడు- "ఔను.. నిజంగ మేడమ్ లాంటి మర్యాదస్తురాలిని ఎక్కడా చూడలేదు. ఆమె అక్షరాలా మీ కూతురే సర్. అనవసరంగ ఆమె ఆత్మన్యూనతా భావంతో బాధపడుతున్నారు." అని ఆశ్చర్యంగ వింటున్న భాస్వతితో, "నిజం మేడమ్.. మీది ఫెయిల్యూర్ అయితే కంపెనీ నష్టాలపాలు కావాల్సింది. ఉద్యోగులంతా సమ్మెలకు దిగాల్సింది. ఎందుకట్ల జరగలేదు..? మన దగ్గర ఏమైనా గొడవలున్నాయా, ఉద్యోగులు యాజమాన్యం మధ్య పొరపొచ్చాలున్నాయా..? ఎందుకుంటాయి.., మీరు పిల్లలకన్నా ఎక్కువగ వారిని చూసుకుంటున్నప్పుడు..!? ఉదాహరణకు- నాకు ఆ వాచ్ మెన్ స్వయంగ చెప్పాడు- నన్ను డబ్బు ఇవ్వద్దని చెప్పి, మీరే అతనికి పిలిచి సహాయం చేశారట కదా..! అంతే కాదు- అందరు క్లాస్ ఫోర్ ఉద్యోగుల జీతం పెంచారట కదా..!! చూడండి మరి.. ఇంతగా తన కింద పని చేసేవారి బాగోగులు చూసుకునే అధికరారిణిని ఏ ఉద్యోగి ప్రేమించడు.. చెప్పండి..?"
            "అంటే.. ఇది.. ఆ కోవకు చెందిన ప్రేమలేఖా..?" మాధవం కాగితం చూపించి అడిగాడు.
            "ఛఛ.. అసలు ఆ ప్రేమలేఖకూ మేడమ్ కీ ఏ సంబంధం లేదు..- అని చెబుతున్నాను. నేను ఆమెను ఉద్దేశించి వ్రాసి ఉంటే అభినందనలతో మంచి లేఖ వ్రాసి ప్రశంసలందించేవాడిని. నాది ఇట్లాంటి ఛీప్ ప్రేమలేఖలు వ్రాసి మనసు నొప్పించేంత నీచ స్థాయీ కాదు. పద్ధతీ కాదు. నాకూ ఇద్దరు అక్కలు ఉన్నారు. ఆడపిల్లల మనసంటే ఏంటో నాకూ తెలుసు." అన్నాడు.
            "అంటే మా అమ్మాయి అభినందన లేఖలకు తప్ప ప్రేమలేఖలు వ్రాయటానికి పనికిరాదనా నీ ఉద్దేశం..?" మాధవం గారు అడిగాడు.
            స్వర్జిత్ తో పాటు భాస్వతి కూడ ఉలికిపడింది. ఏం చెప్పాలో తోచక స్వర్జిత్ భాస్వతినీ, మాధవాన్నీ చూసి పక్కకెటో చూసి అన్నాడు- "లేదు సర్, ప్రేమలేఖలు వ్రాసి అమ్మాయిని నొప్పించటం నా పద్ధతి కాదు అన్నాను. అంతే."
            "అయితే నీ పద్ధతి ఏంటి..? ప్రేమలేఖ వ్రాయవు. మరి అమ్మాయికి నీ భావన ఎట్ల తెలియచేస్తావు..?"
            "దేనికి..?"
            "ప్రేమలేఖలు వ్రాసి భావాలు దేనికి తెలియచేస్తారో.. దానికి."
            "ఛి.. నేనటువంటి పనుల జోలికి వెళ్ళనే వెళ్ళను. అసలు నాకా భావనలే లేవు. అయినా నా బాగోగులన్నీ చూసుకునేవారు మా నాన్నగారు ఉన్నారు కదా.."
            "అయితే ఒకసారి మీ నాన్నగారిని తీసుకురారాదా..? నేను వచ్చే పరిస్థితిలో ఉంటే నేనే వచ్చేవాణ్ణి..!! కానీ ఫోనులో మాట్లాడి పిలుస్తాను. వస్తారా..?"
            "నాన్నా..!!? ఏం మాట్లాడుతున్నారు..??!!" అంది భాస్వతి ముఖమంతా చిట్లించి.
            "ఆగమ్మా..! నిన్ను ఆ విముక్తురాలిని చేయమన్నావు కదా..! బంధం పడితే కానీ దొరకని విముక్తి నీది. ఆ దారి ఆలోచిస్తున్నాను. నువ్వు సమాధానం చెప్పు బాబూ.." అని అతను ఏం మాట్లాడక పోయేసరికి, "పోనీ నెంబరు చెప్పు.. ఇంటికి కారు పంపుదాం..!! ఏమ్మా ఏమంటావు..? ఇవాళ తిథీ అదీ బాగుంది కదా..! మాట్లాడుకుందామా..?" అన్నాడాయన.
            భాస్వతికి ఠక్కున ఆయన ఉద్దేశం అర్థమైంది. ముఖం వెలిగింది. ఆయన ఆలోచించనిది ఏమీ మాట్లాడడు. "మీ అభిప్రాయమే నా అభిప్రాయం."
            "అంతిమ నిర్ణయమేనా..?" మాధవం అడిగాడు.
            స్వర్జిత్ ని ఒకసారి చూసి, ఆమె, "ఊఁ.. అంతిమాంతిమం.." అనేసి ఆమె అక్కడి నుంచి వెళిపోయింది. మాధవం సెల్ ఫోను తీశాడు.
            స్వర్జిత్ తెల్లబోయాడు.. దేనికోసం ఇక్కడకు వచ్చాడు- ఏం జరుగుతోంది..? "సర్.. ఏంటిది..?? ఒక్క నిముషం..?!!"
            "చెప్పవయ్యా.."
            "అది కాదు సర్.. నేను ఆ లేఖ మేడమ్ గారిని ఉద్దేశించి వ్రాసింది కాదని చెబుతున్నాను కదా..! నన్ను క్షమించి వదిలేయండి ప్లీజ్.. ఈ విషయం మా నాన్నగారి దాకా వెళితే ఆయన బాధపడతారు."
            మాధవం పెద్దగ నవ్వి, "ఇప్పుడు నీ మీద కంప్లైంటు చేయటానికి మీ నాన్నగారిని పిలుస్తున్నామనా నీ ఉద్దేశం..? నీ తలకాయ..! ముందు ఫోను చేసి పిలవ్వయ్యా మీ నాన్నగారిని.." అన్నాడు.
            "కానీ మా నాన్న.."
            "ఏం పేరు ఆయనది.. ఏం చేస్తుంటారు..?"
            స్వర్జితే చెప్పాడు వివరాలు. మాధవం ఆయనను గుర్తు పట్టి, "అరే నువ్వు మా గోపాలరావుగారి అబ్బాయివా..? అయితే నా దగ్గరే నెంబరుంది. వెంటనే మాట్లాడేయచ్చన్నమాట.." అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే తన సెల్ తీసి నెంబరు వెతికి కలిపాడాయనే.
            స్వర్జిత్ తల గోక్కోని ఆయన ఇచ్చిన సెల్లులో ఫోను తీసుకుని తండ్రితో మాట్లాడి ఆయనను రప్పించాడు. తర్వాత..
***
            "బాబూ.. నీకోసం ఎవరు వచ్చారో చూడు.." స్వర్జిత్ ఉలికిపడి మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చి పడ్డాడు. అతని మామగారు ఎవరినో గదిలోకి తెచ్చాడు. ఎవరా అని చూస్తే భానుమూర్తి..!!
            "అంకుల్..!!!" అన్నాడు స్వర్జిత్ ఒక్కసారిగ లేచి నిలబడుతూ. అతని గొంతులో బాధ, ఉద్వేగం, ఆనందం, ఆర్తి ఒకేసారి ధ్వనించాయి.
            భానుమూర్తి గదిలోకి వచ్చి తలుపు దగ్గరకు వేశాడు. స్వర్జిత్ ఆయన వద్దకు వెళ్ళి ఆయన చేతులను పట్టుకుని, "అంకుల్.. మీరు నా గురించి ఎట్ల భావిస్తున్నారో తెలియదు. కానీ మీ సాక్షిగ నేనేం చేయలేదు. నిజం చెబుతున్నాను.. నన్ను నమ్మండి.."
            "అరే.. అరే.. ఆగు. ఎందుకంత ఆవేశపడతావు..? నేను ఇప్పుడు ఏమైనా అన్నానా..?" భానుమూర్తి అన్నాడు చిద్విలాసంగ.
            స్వర్జిత్ ఆవేగంతో ఊగిపోతున్నాడు- "మీరేం అనలేదంకుల్, భాస్వతి మేడమ్ నన్ను వేరేగ అనుకున్నారు. ఆ ప్రేమలేఖ నేను వ్రాసిందే కానీ ఆమెను ఉద్దేశించి వ్రాయలేదు. పాపం, నేనామెను ప్రేమిస్తున్నాననుకున్నారో ఏమో.. అదంతా అపోహ సర్.. నేను ఏ పాపం ఎరుగను."
            "నాకు తెలుసు బాబూ.. బాధపడకు.."
            "లేదు సార్.. మీకు అసలు విషయం తెలియదు. ఇదంతా అర్ణవ్ కావాలని చేశాడు. చెప్పేద్దామంటే సమయానికి మీరేమో ఊళ్ళో లేరు. దేశాలు పట్టుకు పోయారు. పెళ్ళి వేళకైనా చేరుకుంటారేమోనని ఎదురు చూశాను. కానీ ఫ్లైటు ఆలస్యమై రాలేకపోయారు. తాపీగ ఇప్పుడు అంతా జరిగిపోయాక వస్తున్నారు. లేదంటే మీతో నేరుగ అంతా చెప్పేసేవాణ్ణి.. ఈ గొడవంతా ఉండేది కాదు."
            భానుమూర్తి పెద్దగ నవ్వి, "నువ్వేం కుర్రాడివయ్యా బాబూ..! ఎక్కడ దొరికావు మాకు..? ఇంకా నీకు అర్థం కాలేదా..? అమ్మాయి అంగీకారంతోనే ఈ పెళ్ళి జరిగింది." అన్నాడు.
            "అదేనండీ.. నేనూ అనేది. నేను ఆ లేఖ ఆమెను ఉద్దేశించి వ్రాసింది కాదండీ..! అయ్యో..? అది నిజమనుకుని మొన్న ఆమెని చేతిలో పెట్టి అగ్నిసాక్షిగ అప్పగించారు. నిన్న వాళ్ళ కులదైవం సాక్షిగ ఇంటి బాధ్యతలు అప్పచెప్పారు. ఇవాళ చంద్రుడి సాక్షిగ ఈ వేడుక చేస్తున్నారు. రేపు సూర్యుడి సాక్షిగ కంపెనీ బాధ్యతలు అప్పగిస్తారట. కానీ నా మనస్సాక్షి బాధ ఎవ్వరికీ ఇక్కడ అర్థం కాదెందుకు..?"
            అంతలో మాధవం వచ్చాడు. భానుమూర్తి, "కాస్త నువ్వైనా చెప్పరా ఈ అబ్బాయికి.. తెగ కంగారు పడిపోతున్నాడు." అన్నాడు.
            "చెప్పీ చెప్పీ విసిగిపోయానురా. అతని కంగారు తగ్గించే మాటే చెబుదామని వచ్చాను." అని స్వర్జిత్ తో, "నీ స్నేహితుడు అర్ణవ్ వచ్చాడు. కాసేపు మాట్లాడుకుంటే నీకూ తేలిక అనిపిస్తుంది కదా. అతను చెబితేనైనా నీకు విషయం అర్థమైతుందేమో..! ముహుర్తానికి ఇంకొక అరగంట వ్యవధి ఉందిటలే. వెళ్ళు." అన్నాడు మాధవం.
            స్వర్జిత్ వెంటనే సరేనని పైన భానుమూర్తిని మాధవానికి వదిలి డాబాగదిలో తనకోసం వేచి ఉన్న అర్ణవ్ దగ్గరకు వెళ్ళాడు. వెళ్తూనే అతని కాలర్ పట్టుకున్నాడు. "నిన్ను నరికి పోగులు పెట్టాలనిపిస్తోందిరా..! ఎందుకు చేశావిదంతా..?" అన్నాడు.
            అర్ణవ్ ఒక్కసారిగ ఏడుపు ముఖం పెట్టి, తన కార్ విడిపించుకుంటూ, "ఆ మాట నిన్ను నేనడగాలిరా.." అన్నాడు.
            "నేనా?? నేనేం చేశాను..?" అడిగాడు స్వర్జిత్ అంత కోపంలోనూ ఆశ్చర్యంగ.
            "ఇంత అదృష్టంతో ఎట్ల పుట్టావురా..? నీ కారెక్టరు పూర్తిగ పాడు చేసే ఇన్ని ఎత్తులు వేసినా ఒక్కటీ ఫలించకపోంగ ఇంకా పై నుంచి కన్యారత్నమునూ, ఆమెతో పాటు కంపెనీనీ కొట్టేశావు కదా.."
            స్వర్జిత్ కళ్ళు చిట్లించాడు- "అంటే.. ఏంటి నీ ఉద్దేశం..?"
            అర్ణవ్ కుళ్ళుతో ఏడుస్తూ, "అదే చెప్పాలని వచ్చాను. పెళ్ళికి రావటానికి మనసొప్పలేదు. అందుకే లేని టూర్లు పెట్టుకుని మరీ పోయాను. కానీ కనీసం అభినందించటం నా ధర్మం కదా అని పెద్ద మనసు చేసుకుని వచ్చాను. ఇంక ఉండబట్టలేకపోయాను. ఎంతైనా స్నేహం చేశాం కదా.." అన్నాడు.
            అసలు పెళ్ళి కుదిరిన దగ్గరి నుంచీ అర్ణవ్ అతనికి ఎదురు పడనేలేదు. అటు నిశ్చితార్థానికి పిలిస్తే రాలేదు. ఇటు పెళ్ళికి రాలేదు. శెలవు పెట్టుకుని పదిరోజులు ఊర్లు పోయాడు అమ్మానాన్నలతో కలిసి. సరిగ్గ అప్పుడే ముహుర్తం ముంచుకు వచ్చేసరికి హడావుడిలో వ్యవధైనా లేకుండ లేఖ గొడవ జరిగి, నిర్ణయం తీసుకున్న ఏడోరోజు అతనామెకు భర్తైపోయాడు. పదోరోజు ఈ ఏసీ గదిలో చెమట కారుస్తూ ఉన్నాడు.
            "అసలేం జరిగింది..? ఎందుకు చేశావింత దారుణం..?" స్వర్జిత్ అడిగాడు.
            "దారుణమా..? ఇంకా నయం..!! ఇదేం దారుణం నువ్వు చేసిన దురాగతం ముందు..!?! తంతే గారెల బుట్టలో పడ్డట్టు.. ఇంత ప్రయత్నించి ఇరికించినా చివరకు నా నెత్తినెక్కి మేకు కొట్టావు."
            "నేనా..? ఇంక ఆపు నీ ప్రేలాపనం..! నువ్వు చేసిన పనికి నాకెంత తలకొట్టేసినట్టైందో తెల్సా..? నేను నీకేం ద్రోహం చేశాను..? ఆమె నీకేం అన్యాయం చేసింది..? ఎందుకు మా ఇద్దరి జీవితాలతో ఆడుకున్నావు..?"
            "నువ్వు మాత్రం ఆడుకోలేదా నా జీవితంతో..? కొన్ని పరిస్థితుల వల్ల బీకాం కాంగనే ఉద్యోగానికి రాకుండ ఆగిపోయాడట..! పరిస్థితులంటే ఎంత ఆర్థిక ఇబ్బందులో, ఎన్ని కష్టాలో అనుకున్నాను. ఎంత అబద్ధాలు చెప్పింది ఎవరు..? ఇంతింత పెద్ద విద్యార్హతలు పెట్టుకుని, ఇంతింత ముందూ-వెనక పరిచయాలు పెట్టుకుని, ఇంత ముందుచూపుతో ఇక్కడ చేరి, నాతోనే ఉంటూ, కలిసి తింటూ మాటైనా చెప్పావా..? ఎవరు దారుణం చేసింది..? నువ్వా నేనా..??!!" అన్నాడు అర్ణవ్ ఏడ్చి, కళ్ళు తుడుచుకుని.
            స్వర్జిత్ కోపంగ చూసి, "ఎంత సినిమా కథల్లుతున్నావురా..!! పరిచయాలా..? ముందుచూపా..? ఇంకా నయం. విద్యార్హతల వరకు ఓకే. కానీ అది నా వ్యక్తిగతం. కాంటాక్టులు నాకు మొదటి నుంచీ ఏమీ లేవు. తర్వాత వచ్చినా నేనేమీ ఆ కాంటాక్టులను నువ్వనుకున్నట్టు దురుపయోగించి ఈ స్థాయికి రాలేదు. భగవంతుడు ఇచ్చిన భిక్ష. కానీ నువ్వేం చేశావు..? నిజంగ నేనే కనక ఒక సామాన్య ఉద్యోగినై, ఇదే ఆధారంగ ఉంటే ఆ ఉత్తరం వల్ల నా జీవనాధారం చేజారిపోయి ఉండేది. ఇంత అన్యాయం చేసి పైగా స్నేహితుడినని చెప్పుకుంటున్నావా..?" అన్నాడు.
            అర్ణవ్ ఓపిక లేనట్టు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని అన్నాడు- "అదే చెప్పాలని వచ్చాను. కూర్చో." అని మొదలుపెట్టాడు.
            స్వర్జిత్ అర్ణవ్ దిగాలు ముఖం చూసి ఏమీ మాట్లాడలేక కూర్చున్నాడు.
            "నిన్ను చూసినప్పుడే అనుకున్నాను. నీలో ఏదో ఉంది అని. మాధవంగారికి బాలేనప్పటి నుంచి ఆఫీసులో మిగిలిన వారి లాగే నేనూ ఆ సీటు మీద కన్ను వేసి ఉంచాను. భాస్వతి ఇక్కడ ఎక్కువకాలం నిలవలేదని, ఉద్యోగులలో నుంచి ఎవరో ఒకరిని పెద్దసీటు కోసం ఎంచుకునే ఉద్దేశంలో ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందింది. అప్పటి నుంచి మంచిపేరు కొట్టేసి అర్హత సంపాదించుకునే ధ్యాసలో నేనూ పడ్డాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరిలోకీ బాగా సీనియర్ ని నేనే. మిగిలిన వారంతా అర్హతో, అనుభవమో తక్కువ ఉన్నవారే. ఇంక రెచ్చిపోయి ప్రైవేటుగ ఎంబీయేకి కట్టాను. మానేజ్ మెంటు డిప్లమాలు చేశాను. భాస్వతి తో జాగ్రత్తగ ఉంటూ వచ్చాను. చాలాసార్లు ఏదో సందర్భంలో నన్ను మెచ్చుకుంది కూడా. నామీద భానుమూర్తిగారికి కూడ దృష్టి ఉండింది అని కూడా నాకు తెలుసు. ఇంక సీటు నాకే ఖాయం అనుకుంటుండంగ నువ్వు ఎంపిక అయ్యావు. మేడమ్ గారి స్పెషల్ రిక్రూట్ వి అని విని సగం చచ్చిపోయాను. భానుమూర్తిగారి కన్ను నీమీద పడినప్పుడు ముప్పాతికా, పడటమేకాక పెద్దతలకాయల ఇళ్ళవరకూ రాకపోకలయ్యేటప్పటికి పూర్తిగ నా కోరిక చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎట్లైనా నిన్ను ఆమె ముందు తప్పుడుగా చూపించాలని, ఎక్కడో అక్కడ ఇరికించాలని నువ్వు చేరింది మొదలు సాయశక్తులా ప్రయత్నించాను. కుదరలేదు. ఛెడామడా తిట్టేది కానీ బయటకు పంపేది కాదు."
            స్వర్జిత్ ఆశ్చర్యంగ, కొంచెం కోపంగ చూశాడు.
            "..ఇంక మిగిలింది ఆమె లేడీబాస్ కావటం అనే పాయింటు. అది తట్టిన వెంటనే నాకు యోచన తట్టింది. నువ్వు ఇరికే విధంగ స్నేహితుడి పేరు చెప్పి, అవసరం నటించి, నీచేత ప్రేమలేఖ వ్రాయించి, దాని కలర్ జిరాక్స్ తీయించి, దాన్ని భాస్వతికి చేరాల్సిన ఫైలులో పెట్టి నేరుగ నీచేతే ఆమెకు ఇప్పించే ఏర్పాటు చేశాను. ఇంక నా గెలుపు ఖాయం అనుకున్నాను. కానీ.. కానీ.. వారి పెద్దలే కూర్చుని నిన్ను ఆ నెపంతో సాక్షాత్తుగ ఇంటికి అల్లుణ్ణి చేసుకుంటారని ఊహించలేదు. కంపెనీకి సర్వాధికారిని చేస్తారని అస్సలు ఊహించలేదు. నేను నా చేతితోనే నీ చేతికి లాటరీ టికెట్టు అందించానని అర్థమైంది. ఆ లేఖ ఇవ్వకపోయినా బాగుండేది. నీకెట్లగూ దూకుడు ఎక్కువ. ఎప్పటికో అప్పటికి విరక్తి కలిగేదామెకు. ఎక్కడో ఒక చోట ఇగో సమస్యలు వచ్చి, తీసిపారేసేది. మధ్యలో నేను కల్పించుకోకపోయినా బాగుండేది." అర్ణవ్ అన్నాడు బాధగ.
            "బాగైంది.. నీలాంటివారికి అట్లనే కావాలి."
            "అందుకే.. చివరిసారి ముఖం చూపించి పోదామని వచ్చాను. ఇంక ఈ కంపెనీ వదిలి వెళిపోతున్నాను. భానుమూర్తిసార్ తో అంతా వివరంగ చెప్పాను. ఆయన సరేనన్నారు."
            "అదేంటి..?? మరి ఇక్కడ మానేసి ఏం చేస్తావు..?" స్వర్జిత్ ఆశ్చర్యపోయాడు.
            "మా ఊళ్ళో ఉన్న జూనియర్ కమ్ డిగ్రీ కాలేజిలో ఉద్యోగం చేస్తూ, ఉన్నదేదో తింటూ కాలక్షేపంగ జీవితాన్ని గడపబోతున్నాను. అత్యాశకు పోయాను కానీ నిజానికి మాకు ఆస్తులకేం తక్కువ లేదు. ఈ ఉద్యోగం ఇంకెవరైనా అర్హులకు, అవసరం ఉన్నవారికి ఇవ్వమని కాబోయే సర్వాధికారివైన నీకు చెప్పటానికి వచ్చాను. నా పక్కన సీట్లో కూర్చున్నవాడికి నేను వంగి సలాము కొట్టే పరిస్థితి భరించలేను." అన్నాడు అర్ణవ్.
            స్వర్జిత్ ఆ మాటకు బాధపడ్డాడు- "ఒరే అర్ణవ్.. ఏంటిరా ఇది..? నేను అట్ల ప్రవర్తించేవాడినారా..? నా కళ్ళోలోకి ఒక్కసారి చూసి చెప్పు.?"
            అర్ణవ్ ఏమీ మాట్లాడలేదు.
            "ఎందుకు ఇంత తొందర పడుతున్నావు..? కెరీర్ మార్చటం అంత సులువు కాదు. మరోసారి ఆలోచించుకో."
            "ఇన్నాళ్ళూ చేసింది అదే పని. నేను చదువకున్న కాలేజి. ప్రస్తుతం అప్పటి మాష్టారులంతా రిటైరై ఊళ్ళో కాలేజి పిల్లల పరిస్థితి దారుణంగ ఉంది. సరైన కోచింగ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. మన ఆఫీసులో ఏదైనా అర్థంకానిది అడిగి చెప్పించుకుని నా దగ్గర ఏదైనా విషయం నేర్చుకున్న ప్రతీవాడూ, నీతో సహా, నీలో మంచి ఉపాధ్యాయుడి లక్షణం ఉందయ్యా అని మెచ్చుకున్నవారే. ఆ విశ్వాసంతో నా ప్రవృత్తికి న్యాయం చేయాలని వెళ్తున్నాను. ఇక్కడ ఉంటే ఇందరు ఉద్యోగులలో నేను ఒకణ్ణి. కానీ మా ఇంట్లో, ఊళ్ళో నాకు హీరో ఇమేజ్ ఉంటుంది. బ్రతికి ఉన్నన్నాళ్ళూ అమ్మా నాన్నా దగ్గర, వారి ఛాయలో రాజాలా బ్రతుకుతాను. వారి సేవ చేసుకుంటాను." అని ఆగి, చేతిలో ఉన్న బాగ్ లో నుంచి ఒక శుభలేఖ తీసి ఇచ్చి, "వచ్చే ఆదివారం నా పెళ్ళి. తప్పక రావాలి. ఊళ్ళో మా ఇంటి పక్కనే ఉండే సాగరిక నా మీద మనసు పారేసుకుందట. అది తిరిగి ఇమ్మని గోల పెట్టింది. అది తిరిగి ఇవ్వలేక దాని బదులుగ నా మనసే తనకిచ్చేశాను." అన్నాడు.
            స్వర్జిత్ అతను చెప్పేదంతా బొమ్మలా వింటూ కార్డు అందుకుని తెరిచి చూశాడు.
            "ఇంకొకమాట.. నువ్వు అపార్థం చేసుకునే రకానివి కావు. కానీ నా సంతృప్తి కోసం చెబుతున్నాను. భాస్వతి మీద నాకెప్పుడూ వేరే దృష్టి లేదు. ఆమె నా చెల్లెలితో సమానం. ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తే కంపెనీ ఆధిపత్యం దొరుకుతుందన్న ఆశ తప్ప వేరే ఏ దుర్భావనా నాలో లవలేశమైనా లేదు. చిన్నతనం నుంచీ సాగరిక తండ్రికి, తల్లికి నా మీద ఆశ ఉందని తెలుసు. కనక అవసరాన్ని మించి భాస్వతి గురించి నేను ఆలోచించలేదు. ఆమెకు నీ అంత యోగ్యుడైన భర్త లభించటం నాకూ సంతోషకరమే. అందుకే ఇంత త్వరగా ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు, చెల్లాయి కలిసి వచ్చి మా జంటను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. సార్ వాళ్ళకు కూడ చెప్పాను. అందరూ తప్పక రావాలి." అన్నాడు.
            అర్ణవ్ ని సూటిగ చూసి అడిగాడు స్వర్జిత్- "మా చెల్లెలి గురించి నాతో ఏమీ చెప్పవా..?"
            అర్ణవ్ నవ్వి, కొంచెం సిగ్గుగ, "ఏం చెప్పను..? నాకు ప్రేమపాఠాలు నేర్పిన దేవత. ఎప్పుడూ డబ్బుపరంగ ఎత్తులకు ఎదగాలన్న ధ్యాసే తప్ప హృదయం ఎక్కడ ఉందో కూడా తెలియని పాషాణాన్నైన నాకు ప్రణయస్పందన అంటే ఏంటో విపులంగ తెలియపరచింది. మా ఇంట్లో వాళ్ళందరి ఇష్టాన్ని, అంగీకారాన్ని నాకోసం తనే సాధించింది. బీ.ఏ. చదువుకుంది. ఇంటి పనులు వంటపనులు బాగా తెలిసిన పిల్ల. అందంగ కాకపోయినా అణుకువగ ఉంటుంది. ప్రైమరీ స్కూలులో పిల్లలకు లెక్కలు చెబుతుంది. ఆ సమయంలో నేను వ్రాసిన లేఖ సాగరికను తలచుకునే. ఆమె మంచి కవయిత్రి. తను నా అభిప్రాయం ఏంటో చెప్పమని అడిగితే నువ్వు వ్రాసిన ప్రేమలేఖ కాపీనే ఆమెకు ఇచ్చాను. చెప్పావుగా ప్రేమగారంటీ అని. అదే జరిగింది. చదివి పడిపోయింది.." అన్నాడు.
            స్వర్జిత్ నవ్వి, "ఇదీ బాగైంది.." అన్నాడు.
            అర్ణవ్ అతని కళ్ళలోకి చూసి, "నీ కింద తక్కువ స్థాయి ఉద్యోగిగా పని చేయలేక వెళిపోతున్నానే కానీ నీ స్నేహితుడిగా మాత్రం నా స్థానాన్ని అట్లగే ఉంచుతావని ఆశిస్తున్నాన్రా. మన మధ్య ఏర్పడిన ఈ స్నేహానికి స్థాయీ భేదాల వల్ల అడ్డంకు రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను." అన్నాడు.
            "కానీ ఇక్కడ చేరిన దగ్గరి నుంచీ నువ్వు నాకెంతో సహాయం చేశావు. చేరిన దగ్గరి నుంచీ భాస్వతిని అర్థం చేసుకోవటానికి తోడ్పడ్డావు. కొలీగ్స్ తో సమస్యలు వచ్చినప్పుడు సర్ది చెప్పావు. నీ సహాయం లేకుండ నేను ఈ స్థాయికి చేరుకోగలిగేవాణ్ణి కాదు. నిన్ను కింది ఉద్యోగిగా ఉండనివ్వను. పోనీ ప్రమోషను ఇస్తానూ. స్థాయిని పెంచుతాను. నీ సలహా, సహకారం నాకు కావాలి. ఉండిపోరాదా..?" అన్నాడు.
            "వద్దురా. ఒకచోట ఆశ పెట్టుకుని భంగపడ్డాక మనగలగటం నాకు చేతకాదు. ఎంత స్థాయి పెంచినా నీకింది వాడిగనే ఉండాలి కదా. సలహాలంటావా నువ్వు ఎప్పుడు అడిగినా నా అనుభవంలోనుంచి నాకు తెలిసిందంతా కాచి వడపోసి చెబుతాను. దానికోసం ఎప్పుడైనా నువ్వు నన్ను భరోసాగ గుర్తుపెట్టుకోవచ్చు. నీకు చేసిన ప్రతీ సహాయం వెనక నాలోని నీ స్నేహితుడున్నాడు. నీకు చేసిన ప్రతీ ద్రోహం వెనక నాలోని ప్రత్యర్థీ, ఈర్ష్యాళువు ఉన్నాడు. ఆ ఈర్ష్యాళువును గొంతు నులిమి చంపేశాను. పోటీ లేదు కనక ప్రత్యర్థి ఇంక మనకు అడ్డం రాడు. చెప్పు..! నేను చేసిన అన్యాయాలన్నింటికీ, ద్రోహలకన్నింటికీ నన్ను క్షమిస్తావు కదూ..?"
            "నువ్వు చేసిన సహాయమే వాటిని తుడిచివేసింది. ఇంక క్షమార్పణలెందుకు..?"
            "నేను చేసిన పనులన్నింటికీ క్షమార్పణ అడిగి నీ స్నేహాన్ని జీవితాంతానికీ గెలుచుకుందామని నా అహాన్ని, విరిగిన ఆశల తాలూకు బాధనూ జయించి వచ్చాను. నాకు ఇగో ఎక్కువ. కానీ నువ్వు అట్ల కాదు. అందుకే నాకు చాలా నచ్చిన మనిషివి. స్కూలు జీవితం తర్వాత సన్నిహిత స్నేహాలు ఏర్పడవంటారు. కానీ నువ్వు ఎందుకో చాలా కొద్ది కాలంలోనే నాకు చేరువగ వచ్చావు. చెప్పు- జీవితాంతం స్నేహంగ ఉంటావా..?"
            స్వర్జిత్ వెంటనే అర్ణవ్ ని గట్టిగ హృదయానికి హత్తుకుని, "నీ భావాలు నువ్వు చెప్పావు. నేను చెప్పలేకపోయాను. అంతే తేడా." అన్నాడు.
            అర్ణవ్ నవ్వి, "పక్కవాళ్ళ భావాలైతే చెప్పగలిగేవాడివి.. కదా.." అన్నాడు.
            సరిగ్గ అప్పుడే- "అయ్యో, బావగారికి మరీ తొందరెక్కువైందే..! అక్క ఇక్కడే ఉందని భ్రమపడిపోయాడు..!" అని వినిపించి ఇద్దరూ ఉలికిపడి చూశారు. మెట్ల మీద యథావిధిగ ఇద్దరు మరదలు పిల్లలు ఉన్నారు. "ఎవరిని చూసినా అక్కలాగే కనిపిస్తోందో ఏమో.. పాపం!" ఒకర్తి సాగదీసింది.
            "అయ్యో.. రామరామ. అక్క కింద మీకోసం నిరీక్షిస్తుంటే మీరిక్కడ విరహ వేదనతో ఈ పనులు చేస్తున్నారా..?" అంది ఒక అల్లరి మరదలు.
            "నిన్నూ.. ఆగు.." అని స్వర్జిత్ ఆమెను వెంబడించబోయాడు. ఆ అమ్మాయి "అమ్మో.. బావగారికి కూడ అల్లరికి జవాబు చెప్పటం వచ్చేసింది.. పదవే..!!" అనేసరికి పరుగులంకించుకున్నారు వాళ్ళు.
            అర్ణవ్ తో పాటు స్వర్జిత్ కూడ పెద్దగ నవ్వేశాడు. కాసేపు అతన్ని చూస్తూ ఊరుకుని అర్ణవ్ అతని చేతులు పట్టుకుని అన్నాడు-
            "స్వర్జిత్, నువ్వు నిజంగ నవ్వినా, మాట్లాడుతున్నా, ఉత్తగ ఉన్నా ఎంత బాగుంటావో తెల్సా..? ఇంతకు ముందు నిన్ను చూసి కుళ్ళుకునేవాణ్ణి. ఎన్నోసార్లు చెప్పాలనిపించి కూడ ఈర్ష్య వల్ల చెప్పలేకపోయాను. ఇప్పుడు ఈ క్షణం మాత్రం ఈ మాట నీతో చెప్తూంటే నాకు ఎంత మధురంగ అనిపిస్తోందో చెప్పలేను. క్షమార్పణ అడిగి నేను మంచిపని చేశాను. నువ్వూ నన్ను క్షమించి నీది గొప్ప మనసు అని మరోసారి ఋజువు చేసుకున్నావు." అన్నాడు.
            స్వర్జిత్ నవ్వి "పోరా!!" అన్నాడు.
            "వెళ్ళాల్సింది నువ్వురా. వెళ్ళు- మా చెల్లాయి నీకోసం ఎదురుచూస్తుంటుంది.." అన్నాడు అర్ణవ్ అతనికి చక్కిలిగింతలుపెడుతూ.
            స్వర్జిత్ నవ్వి, "ఆమె నాకు దక్కటం నీ పుణ్యమే కనక నిన్ను వదిలేస్తున్నాను. స్నేహం అంటావా..? దాని దాహం నాకూ ఉంది. చిన్నచిన్నవి వదిలేస్తే పెద్దపెద్దవి దొరకటం గారంటీ కనక, నేను పెద్దవాటికే ఎరవేసే వాణ్ణి కనక- నీ స్నేహాహ్వానాన్ని ఆమోదించటమైంది." అన్నాడు.
            అర్ణవ్ అతనికి చేతులు కలిపి, "థాంక్స్, నా స్నేహాన్ని గొప్పది అని అభివర్ణించినందుకు. నీకు ఇప్పటివరకు దొరికిన వాటన్నింటిలో భాస్వతి ఎంతో గొప్పది. ఎంతైనా తను చాలా తెలివిగలది. యోగ్యుడైనవాణ్ణి పడితే తప్ప తనకు విముక్తి లేదని తెలుసుకుని, చక్కగ చూసి చూసి వల వేసి, చిన్న ఉద్యోగం ఎరకు కంపెనీ-పెద్ద చేపను పట్టింది. అందరికన్నా ఎక్కువగ నిన్ను తిట్టి, నీ ధ్యాస ఆమె పై నుంచి ఎటూ పోకుండ చూసింది. నిన్ను అన్ని కోణాలలో గమనించి, పరీక్షించి తన ఎంపిక తప్పు కాదని ఋజువు చేసుకుంది. నేనూ తెలియకుండనే ఆమెకు బాగా తోడ్పడ్డాను. పక్క ఉద్యోగుల గురించి అడిగినప్పుడు మంచి చెబితే మన మీద అభిప్రాయం మంచిగ ఏర్పడుతుందని ఎవరో ఎంబీఏ క్లాస్ లో అంటే ఆ దిక్కుమాలిన మాటను ఆమె దగ్గర ప్రయోగించేశా. అది ఇట్ల కొట్టింది. ప్లేటు మార్చి, సంయమిని పెళ్ళి ఫంక్షను గురించి నేనే స్వయంగ చాడీలు చెప్పినా ఆమెకు నీమీద కోపం రాలేదన్నప్పుడే నేను ఊహించాల్సింది." అని నవ్వి, "ఏదైనా నీ గీతలో ఉంది. దొరికింది. అనుభవించుకో పో.." అని అతను సెలవు తీసుకుని వెళిపోయాడు.
            స్వర్జిత్ నవ్వుకున్నాడు ఆమాటకు. కాసేపు అర్ణవ్ మాటలు ఆలోచిస్తూండిపోయాడు. అతనిలో అన్ని సందేహాలూ తీరాయి. తేలికైన మనస్సుతో కిందకు తనకోసం ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్ళాడు. ఆ క్షణం అతనికి చాలా హాయిగ అనిపించింది. అప్పుడే ఎదురుంగ మువ్వల సవ్వడి వినిపించి తల ఎత్తాడు. భాస్వతి చుట్టూ ముత్తైదువులతో అడుగులో అడుగు వేసుకుంటూ గది వైపే వస్తోంది. స్వర్జిత్ లేచి నిలబడ్డాడు. కానీ స్వర్జిత్ కి మొదటిసారి ఆమెను చూస్తూ ఉండగా ఉండగా భయం పక్కకు తొలగసాగింది. అప్పటి భాస్వతికి ఇప్పటి భాస్వతికి చాలా తేడా ఉంది. అయితే భాస్వతి అంతా తెలిసి, నిజంగ తనను ఇష్టపడే ఈ పెళ్ళి చేసుకందా..?
            ఒక్కసారిగ అగరొత్తుల సువాసన ముక్కుపుటాలకు తగిలింది. స్వీట్ల వాసన మనసంతా నిండిపోయింది.
********************

1 comment: